సాక్షి, తిరుపతి: రాష్ట్రాన్ని విభజించడం వల్ల సీమాంధ్రకు శాశ్వత నీటి సమస్య ఏర్పడుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం తిరుపతి లోని తెలుగు తల్లి విగ్రహం నుంచి, గాంధీ విగ్రహం వరకు భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ వైఖరి వల్లే రాష్ర్టం ముక్కలవుతోందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల భద్రత గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రానికి నిజమైన సీమాంధ్ర ద్రోహులు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలేనని అభిప్రాయపడ్డారు.
సీమాంధ్రలో జగన్ ప్రభావం తగ్గించే ప్రయత్నంలో రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ విధానాన్ని ప్రజలు క్షమించరని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రె స్ నాయకులు పైశాచికానందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రాజీ నామాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ నాయకులకు రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. నగర కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్సీ విభాగం కన్వీనర్ రాజేంద్ర, నాయకులు ఎస్‌కే.బాబు, ముద్రనారాయణ, దుద్దేలబాబు, తాళ్లూరి ప్రసాద్, బొమ్మగుంట రవి, చెంచయ్య యాదవ్, తొండమనాటి వెంకటేష్, పునీత, పుష్పా చౌదరి, గీత, రమణమ్మ, యువ నాయకుడు ఇమామ్ పాల్గొన్నారు.