పోలీసులు అరెస్టు చేసిన నిందితులు పాలపర్తి ఏసు, శ్రీనివాసులు
ఒంగోలు క్రైమ్: ప్రకాశం జిల్లాలో పొలాల్లోకి, కాలువ గట్లపైకి సరదాగా గడుపుదామని వచ్చే జంటలను, ప్రేమికులను బెదిరించి, లైంగిక దాడులు చేస్తున్న ముఠాను ఒంగోలు సబ్ డివిజన్, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. జిల్లాలో చీమకుర్తిలోని శిద్ధానగర్‌కి చెందిన పాలపర్తి ఏసు (28) తన తల్లిదండ్రులతో కలిసి పరిసర ప్రాంతాల్లో రైతుల పొలాల్లో ఎలుకలు పట్టుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో సాగర్ కాలువ వెంట పొలాలకు వెళ్లే సమయంలో ద్విచక్రవాహనాలపై, ఆటోల్లో జంటలు, ప్రేమికులు వస్తుండటం గమనించేవాడు. ఏకాంతంగా గడపడానికి వచ్చే వీరిని ఏంచేసినా ఎవరికీ చెప్పుకోలేరని అనుకున్నాడు. చీమకుర్తికే చెందిన నల్లబోతుల శ్రీనివాసులు, మరో వ్యక్తి సాగర్ కాలువలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగించేవారు. వీరిద్దరితోపాటు మరో ఐదుగురు, ఒక బాల నేరస్తుడ్ని కలిపి ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా ఏకాంత ప్రదేశాలకు వచ్చే జంటలను, ప్రేమికులను అత్యంత దారుణంగా హింసించి, పురుషులను కట్టేసి మహిళలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడేవారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న బంగారు నగలను, నగదును, ద్విచక్రవాహనాలను సైతం దోచుకునేవారు.
ఏకాంతం కోసం వచ్చే జంటలే లక్ష్యం
సాగర్ కాలువపై ఎప్పుడూ ఏసు ముఠాలోని ఇద్దరు సభ్యులు రెండు వాహనాలపై పహారా కాస్తూ ఉండేవారు. ఏకాంతంగా వచ్చిన జంటలను గుర్తించి ఆ సమాచారాన్ని వెంటనే ఏసుకు చేరవేసేవారు. ఆ తర్వాత ఈ ముఠా.. జంట, ప్రేమికులు ఉన్న ప్రదేశానికి వెళ్లి బెదిరించి పురుషులపై దాడి చేసి కొట్టి చెట్లకు కట్టేసేవారు. తర్వాత ఒకరి తర్వా ఒకరు మహిళ/యువతిపై లైంగికదాడి చేసేవారు. వారి వద్ద దోచుకున్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి సొమ్ము చేసుకునేవారు. ఈ ముఠా గత రెండేళ్లలో ఒంగోలుతోపాటు సాగర్ కాలువ, మల్లవరం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 17 మందిపై ఈ రాక్షస కాండ సాగించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇంకా వెలుగుచూడని అరాచకాలు మరో 13 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. బాధితులు పరువు పోతుందని బయటకు చెప్పుకోలేకపోయేవారు.
ఇదే అవకాశంగా తీసుకున్న కిరాతకులు రెండేళ్లపాటు ఈ రాక్షసత్వాన్ని కొనసాగించారు. 15 ఏళ్ల క్రితం ఒంగోలు పట్టణ శివారు ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు జరిగేవి. ఆ తర్వాత చీరాల ప్రాంతంలోని దండుబాటలో ఇలాంటి కిరాతకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మళ్లీ ఏసు ముఠా ఈ దారుణాలకు ఒడిగట్టింది. దొంగతనం కేసులో ఒక చిన్న దొంగను పట్టుకొని విచారిస్తుంటే ఈ ముఠా చేసిన అకృత్యాలు వెలుగుచూశాయి. దీంతో ఒంగోలు సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావుల ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందాలు కిరాతక ముఠా గుట్టును రట్టుచేసి పాలపర్తి ఏసుతోపాటు చీమకుర్తికి చెందిన నల్లబోతుల శ్రీనివాసులు, కొమరగిరి కొండయ్య, బొజ్జా దుర్గాప్రసాద్, మన్నెం అంకమరావు, మన్నెం నరసింహారావు, మన్నెం గంగయ్య, తుపాకుల అంజయ్యలను అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మంది కాకుండా ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment