Adivasi
-
ఆదివాసీల కల్పవృక్షం.. ఇప్ప చెట్టు
కొత్తగూడ: ఇప్ప చెట్టు ఆదివాసీల కల్పవృక్షంగా పేరుగాంచింది. వారికి పలు రకాల ఆదాయాన్ని సమకూరుస్తూ ఆర్థిక భరోసానిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంత అడవుల్లో విరివిగా కనిపించే ఇప్పచెట్లకు ఆదివాసీ తెగలో కొందరు పూజలు చేస్తారు. ఇప్ప నుంచి వచ్చే పూలు, గింజలతో ఆదివాసీ తెగలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్ప పువ్వులో ఎన్నో బలవర్థకమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా కుడుములు చేసుకుని తినడం ఆదివాసీల ఆహారపు అలవాటు. గతంలో ఆదివాసీలు ఇప్పపువ్వుతో సారాయి తయారు చేసుకుని తాగేవారు. ప్రస్తుతం జీసీసీ (గిరిజన సహకార సంస్థ) ద్వారా పలు ఆయుర్వేద కంపెనీలు ఇప్ప పువ్వును సేకరించి శవన్ప్రా , బిస్కెట్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. దైవారాధనకు ఇప్ప నూనె ఇప్ప గింజలతో నూనె తీస్తారు. ప్రాచీన కాలంలో ఆదివాసీ కుటుంబాలు వంటల తయారీలో ఈ నూనె వాడుకునేవారు. ప్రస్తుతం దైవారాధనలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆదివాసీలు గింజలను పట్టించి కిలో ఇప్ప నూనెకు బదులు కిలో వంట నూనె (సన్‌ఫ్లవర్, గ్రౌండ్నట్ ఆయిల్, రైస్‌రిచ్ తదితర) తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో సేకరించిన వారు జీసీసీకి విక్రయిస్తున్నారు. జీసీసీ ఇప్పపువ్వును కిలో రూ.30, ఇప్ప పలుకు రూ.29తో కొనుగోలు చేస్తోంది. దీంతో స్థానికులు ఇప్ప పువ్వు, గింజల సేకరణకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆదివాసీలకు ఇప్పచెట్టుతో అవినాభావ సంబంధం ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీ తెగలకు ఇప్ప చెట్టుతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఏటా జూన్ ప్రారంభంలో ఇప్ప చెట్టుకు పూజలు చేస్తారు. ఎలాంటి పురుగు మందులు, ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా లభించే ఇప్ప ఉత్పత్తులను తక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్నారు. ఇప్ప పువ్వుకు రూ.100, పలుకులకు రూ.50 చెల్లించాలి. – వాసం వీరస్వామి, ఉపాధ్యాయుడువిక్రయానికి ఇబ్బందులు లేకుండా చూడాలి ఇప్ప పువ్వు సేకరించి శుద్ధి చేసి విక్రయించుకునేందుకు వెళ్తే కొనుగోలు చేసే వారు ఆలస్యం చేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిందే తరలించలేదు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సేకరణ సమయంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. – దాట్ల సుదర్శన్, కొత్తపల్లి గ్రామస్తులు -
కొండకోనల్లో నృత్య సౌందర్యం
మాటలు లేని కాలంలో ఆదివాసీలు లయబద్ధంగా వేసిన గెంతులే నేడు ప్రపంచదేశాల్లో గొప్ప నృత్యంగా వెలుగొందుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటైన గిరిజనుల కొమ్ముకోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది. కోయ జాతి గిరిజనులు మాత్రమే చేసే ఈ నృత్యం దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఈ నృత్యం పేరు చెబితే చింతూరు మండలంలోని కోయజాతికి చెందిన కళాకారులు గుర్తుకువస్తారు.చింతూరు: సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొమ్ముకోయ నృత్యంతో తమ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటుతున్నారు కోయజాతికి చెందిన గిరిజన కళాకారులు. ఈ నృత్యం పేరు చెబితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులు ముందుగా గుర్తుకొస్తారు. సొంత శుభకార్యాలతో ప్రారంభమైన ఈ నృత్యం రాష్ట్రంలో వివిధ పండుగల సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ భాగమైంది. అనంతర కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఐపీఎల్ ప్రారంభం, ముగింపు సంబరాల్లో సైతం ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. 20 బృందాలు... తుమ్మలతోపాటు బుర్కనకోట, సరివెల, వేకవారిగూడెం, సుద్దగూడెం తదితర గ్రామాలకు చెందిన గిరిజన కళాకారులు సైతం ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 20 బృందాల వరకు ఉన్నాయి. ఈవెంట్‌ను బట్టి ఒక్కో బృందంలో 20 నుంచి 40 మంది మహిళలు, పురుషులు ఉంటారు. ⇒ గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా దుస్తులు ధరించి పురుషులు అడవి బర్రె కొమ్ములను పోలిన ఆకృతులు, నెమలి ఈకలతో కూడిన తలపాగా చుట్టుకుని, పెద్ద డోలు పట్టుకుని దానిని వాయిస్తూ ఉంటారు. మహిళలు తలకు రిబ్బన్ చుట్టుకుని అందులో ఈకలను పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పురుషుల డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటారు. ముందు నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ పుంజుకుంటుంది. ⇒ నృత్యం ముగింపులో పొట్టేళ్ల మాదిరిగా పురుషులు తమ కొమ్ములతో ఒకరినొకరు గుద్దుకోవడం ప్రత్యేక ఆకర్షణ. దుస్తుల అలంకరణ వైవిధ్యంగా ఉంటుంది. పురుషులు ఎర్ర దుస్తులు ధరిస్తే మహిళలు పచ్చ దుస్తులు ధరిస్తారు. సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో.. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు. ⇒ మన్యంలో చిత్రీకరించే కొన్ని సినిమాల్లో సైతం కొమ్ముకోయ నృత్య ప్రదర్శనకు చోటు దక్కింది. పుష్ప–2, గేమ్‌చేంజర్, దేవదాసు–2, ఊరిపేరు భైరవకోన, దొంగలబండి, అమ్మాయినవ్వితే.. శ్లోకం వంటి చిత్రాల్లో తమ ప్రదర్శనకు అవకాశం వచ్చినట్టు నృత్య కళాకారులు తెలిపారు.⇒ రోజుకు రూ.వెయ్యి: ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రవాణా ఖర్చులు, వసతి కల్పించడంతో పాటు ఒక్కొక్కరికీ రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తారని వారు పేర్కొన్నారు. ఒకొక్క కళాకారుడు ఏడాదికి సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందుతుంటారు. ⇒ ఎంతో ఖ్యాతి పొందినా కళాకారులు మాత్రం వ్యవసాయం, కూలిపనులపై కూడా ఆధారపడుతుంటారు.ప్రస్థానమిలా..చింతూరు మండలం తుమ్మ లకు చెందిన పట్రా ముత్యం తమ గ్రామానికి చెందిన కొంత మంది కళాకారులతో కలసి ఓ బృందాన్ని ఏర్పాటుచేసి వివిధ పాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కొమ్ముకోయ నృత్య ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన మృతి అనంతరం అతని కుమారుడు రమేష్ సంప్రదాయ వృత్తిగా ఈ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఐటీడీఏ సహకరించాలి కొమ్ముకోయ నృత్యం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుతున్న తమకు సహకారం అందించాలి. ఐటీడీఏ ద్వారా తమకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే తాము ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. – పట్రా రమేష్, కొమ్ముకోయ కళాకారుడు, తుమ్మల ఎంతో ఆదరణ ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ప్రకృతి ఒడిలో తాము నేర్చుకున్న ఈ నృత్యానికి ఇతర ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనల ద్వారా అక్కడి సంస్కృతిని తాము తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వం నుంచి మాలాంటి కళాకారులకు పూర్తిస్థాయిలో సహకారంఅందించాలి. – వుయికా సీత, కొమ్ముకోయ నృత్య కళాకారిణి -
‘ఆసిఫాబాద్ ఆదివాసీ మహిళ ఘటన’.. బండి సంజయ్ సీరియస్
సాక్షి, జైనూరు: తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒంటరిగా తన ఊరికి వెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీకి ఫోన్ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవుగూడ గ్రామం ఉంది. దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ.. తన సోదరులను కలిసేందుకు నెల 31న సిర్పూర్(యు) మండలంలోని కోహినూర్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. జైనూర్‌లో ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం.. ఆమెను నమ్మించి తాను కోహినూరు వెళ్తున్నట్టు చెప్పి ఆటో ఎక్కించాడు. ఈక్రమంలో షేక్ ముగ్దూం రాఘాపూర్ దాటగానే ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికదాడికి యత్నించాడు.దీంతో, భయపడిన ఆమె కేకలు వేసింది. అనంతరం, షేక్ మగ్దూం.. ఆమెను బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో ఆమె ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో ఆమెను అక్కడే వదిలేసి ఆటో డ్రైవర్ పారిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఆమెను గుర్తించి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.అయితే, ఆమె స్పృహాలో లేకపోవడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు తాజాగా స్పృహలోకి రావడంతో అసలు విషయం బయట పడింది. తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి చేయడానికి యత్నించాడని, తాను ఎదురు తిరిగితే.. తన ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడని వివరించింది. దీంతో, పోలీసులు.. నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. -
పాలకుల రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలి..
ఏలూరు (టూటౌన్): కేంద్రంలో, రాష్ట్రంలో వరుసగా అధికారంలోకి వస్తున్న పాలకులంతా రైతాంగ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎంకేఎస్ కన్వీనర్ సుబోధ్విుత్రా పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర మహాసభలు శనివారం ఏలూరులో ప్రారంభమయ్యాయి. సుబోధ్ మిత్రా ప్రారంభోపన్యాసం చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో ముందుగా రైతు కూలీ సంఘం పతాకాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆవిష్కరించారు.అనంతరం సుబోధ్ మిత్రా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడువేల గ్రామాలు భూస్వాముల పీడన నుంచి విముక్తి చేసి, పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసుకున్నారని గుర్తు చేశారు. దున్నేవాడిదే భూమి హక్కు కేంద్ర విధానంగా దేశంలో బలమైన రైతాంగ ఉద్యమం సాగాలన్నారు. అటవీ సంరక్షణ చట్టానికి సవరణల పేరుతో అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను తరిమేసి గనుల తవ్వకానికి, సహజ సంపదల దోపిడీకి కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలను పాలకులు వేగిరం చేస్తున్నారని, వీటిపై అవిశ్రాంత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ 1937 జూలైలో ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకూ సాగించిన రైతు రక్షణ యాత్రకు నాయకత్వం వహించిన జిల్లా రైతులు కొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి దంతులూరి వర్మ.. గత మహాసభల నుంచి ఇప్పటి వరకు సాగిన రైతాంగ ఉద్యమంలో అమరులైన 750 మందికి జోహార్లు అర్పిస్తూ తీర్మానం చేశారు.ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ రైతుల హక్కుల సాధనకు ప్రాణాలైనా అర్పించి పోరాడాలని పిలుపునిచ్చారు. పాలస్తీనాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న హత్యాకాండలో మరణిస్తున్న వారికి మహాసభ సంతాపం తెలియజేసింది. ఏఐఎఫ్టీయూ(న్యూ) జాతీయ అధ్యక్షుడు గుర్రం విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్‌బాబు, ఏఐకేఎంకేఎస్ ఒడిశా నేత శ్రీకాంత్ మొహంతి, తెలంగాణ నేత ప్రసాదన్న, కర్ణాటక నేత చాగనూరు మల్లికార్జునరెడ్డి, ఆహ్వాన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
పిట్టపడా ఎన్‌కౌంటర్‌కు సీఎందే బాధ్యత
సాక్షి, హైదరాబాద్/చర్ల: విప్లవ పోరాటాలపై తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసా గిస్తున్న హత్యాకాండను ప్రజలంతా ఖండించా లని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ములు గు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడా వద్ద గ్రేహౌండ్స్ పోలీసు లు చేసిన ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మావో యిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి కూలీ పనుల కోసం వస్తున్న ఆదివాసీలను ఎస్ఐబీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మావో యిస్టుల సమాచారం చెప్పాలని వేధిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే గ్రేహౌండ్స్ బలగాలు ఏప్రిల్ 6న మధ్య రీజనల్ కంపెనీ–2కి చెందిన కమాండర్ అన్నె సంతోష్ శ్రీధర్, సాగర్, అదే కంపెనీకి చెందిన ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు ఆస్మా మణిరామ్, సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారని పేర్కొన్నారు. నిరాయుధులైన వారిని శారీరకంగా ఎంతో హింసించి చంపి మృగాల మాదిరిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 15న బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు. -
చిన్న పార్టీనే.. కానీ చుక్కలు చూపించింది!
జైపూర్: రాజస్థాన్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు వేరువేరుగా తమ సొంత అభ్యర్థులను ప్రకటించుకున్న తర్వాత కాంగ్రెస్, భారతీయ ఆదివాసీ పార్టీ (BAP) చివరకు సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుని పొత్తు కుదుర్చుకున్నాయి. సోషల్ మీడియాలో ప్రకటన చేస్తూ, కాంగ్రెస్ నాయకుడు సుఖ్జీందర్ సింగ్ రంధావా "రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కాంగ్రెస్ ప్రాథమిక లక్ష్యం" అని అన్నారు. బన్స్వారా లోక్‌సభ స్థానంలో మద్దతు కోసం బీఏపీ అభ్యర్థి రాజ్‌కుమార్ రావత్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసిన గంటలోపే ఏప్రిల్ 4న నామినేషన్‌ను దాఖలు చేసిన కాంగ్రెస్‌కు చెందిన అరవింద్ దామోర్ ఇప్పుడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తో సీట్ల పంపకంలో భాగంగా భారతీయ ఆదివాసీ పార్టీ బన్స్వారా, బగిదోర లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్నికల ఫలితాల్లో గిరిజనులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న చిత్తోర్‌గఢ్, జలోర్ నుండి తమ అభ్యర్థులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. గిరిజనుల్లో గట్టి పట్టు గుజరాత్లో 2017లో ఛోటుభాయ్ వాసవా భారతీయ గిరిజన పార్టీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే రావత్, రాంప్రసాద్ దిండోర్ రాజస్థాన్‌లోని చోరాసి, సగ్వాడ నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గెలిచిన తర్వాత వారు పార్టీని వీడారు. ఆ తర్వాత వీరిద్దరూ 2023 సెప్టెంబరులో మళ్లీ బీఏపీలోకి వచ్చారు. ఆ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది. దాని అభ్యర్థులు మరో నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచి కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, గిరిజనులు రాజస్థాన్ రాష్ట్ర జనాభాలో దాదాపు 14 శాతం ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్, బన్స్వారా దుంగార్పూర్, ఉదయపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కూడిన వాగడ్ ప్రాంతంలో కనీసం 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ గిరిజన పార్టీకి గణనీయమైన ఓటర్లు ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర , జార్ఖండ్, దాద్రా నగర్ హవేలీలలో భారతీయ గిరిజన పార్టీ మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. -
తండాల స్థాయి నుంచి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం గిరిజన నేతలు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ కోరారు. తండాల స్థాయి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గాందీభవన్‌లో శనివారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్‌సభ అభ్యర్థులతో గిరిజన విభాగం సమ న్వయం చేసుకోవాలని, ప్రతి అసెంబ్లీ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, పార్ల మెంట్ నియోజక వర్గాల వారీగా భారీ సభలను గిరిజనులతో ఏర్పాటు చేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడంలో గిరిజనులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్ల య్యనాయక్ మాట్లాడుతూ...అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే రాష్ట్రంలో 13–14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వైస్ చైర్మన్ రఘు నాయక్, కోఆర్డినేటర్లు గణేశ్ నాయక్ పాల్గొన్నారు. -
మావల కమాన్ వద్ద ఆందోళనకు దిగిన ఆదివాసీలు
-
ఓ ఆదివాసి వీరనారి పోరాటం!
మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసీ వీరనారి రాణి దుర్గావతి. మధ్యప్రదేశ్‌లోని గోండు తెగకు చెందిన బుందేల్ ఖండ్ సంస్థానాధీశుడు చందవేల్‌కు 1524 అక్టోబర్ 5న దుర్గావతి జన్మించింది. దుర్గావతి భర్త దళపత్ షా గోండు రాజ్యాన్ని పాలిస్తూ మరణించాడు. కుమారుడు వీరనారాయణ్ మైనర్ కావడంతో దుర్గావతి గోండ్వానా రాజ్య పాలన చేపట్టింది. రాణి దుర్గావతి పైనా, ఆమె పాలిస్తున్న గోండ్వానా రాజ్య సంపద పైనా మనసు పారేసుకున్న అక్బర్ సేనాని ఖ్వాజా అబ్దుల్ మజీద్ అసఫ్ ఖాన్... అక్బర్ అనుమతిని తీసుకొని గోండ్వానాపై దండెత్తాడు. సుశిక్షితులైన వేలాది మొఘల్ సైనికులు ఒకవైపు, అసంఘ టితమైన ఆదివాసీ సైన్యం ఒకవైపు యుద్ధ రంగంలో తలపడ్డారు. మొఘల్ సైన్యానికి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ సైనికులకు సంప్రదాయ ఆయుధాలే దిక్కయ్యాయి. మొఘల్ సైన్యం రాకను తెలుసుకున్న దుర్గావతి రక్షణాత్మకంగా ఉంటుందని భావించి ‘నరాయ్’ అనే ప్రాంతానికి చేరుకొంది. ఇక్కడ ఒకపక్క పర్వత శ్రేణులు ఉండగా మరోపక్క గౌర్, నర్మద నదులు ఉన్నాయి. ఈ లోయలోకి ప్రవేశించిన మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులకు దిగింది దుర్గావతి. ఇరువైపులా సైనికులు మరణించారు. దుర్గావతి ఫౌజ్దార్ అర్జున్ దాస్ వీరమరణం పొందాడు. ఆమె గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తే సైనికాధికారులు రాత్రి గుడ్డి వెలుతురులో ప్రత్యక్ష యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. మరుసటిరోజు ఉదయానికి పెద్ద తుపాకులను వాడమని మొఘల్ సైన్యాధికారి అసఫ్ ఖాన్ సైనికులను ఆదేశించాడు. రాణి ఏనుగునెక్కి మొఘల్ సైనికులపై విరుచుకుపడింది. యువరాజు వీర్ నారాయణ్ కూడా యుద్ధరంగంలోకి దూకి మొఘల్ సైనికులను మూడుసార్లు వైనక్కి తరిమాడు. కానీ అతడు తీవ్రంగా గాయపడడంతో సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోయాడు. రాణి దుర్గావతికి కూడా చెవి దగ్గర బాణం తగిలి గాయపడింది. ఆ తర్వాత ఒక బాణం ఆమె గొంతును చీల్చివేసింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏనుగును తోలే మావటి యుద్ధ రంగం నుంచి సురక్షిత ప్రదేశానికి తప్పించుకు వెళదామని సలహా ఇచ్చాడు. ఆమెకు అపజయం ఖాయం అని అర్థమయ్యింది. శత్రువుకు భయపడి పారిపోవడం లేదా అతడికి చిక్కి మరణించడం అవమానకరం అని భావించి తన సురకత్తిని తీసుకుని పొడుచుకొని ప్రాణాలు వదిలింది రాణి. దీంతో ఒక మహోజ్వల ఆదివాసీ తార నేలకొరిగినట్లయ్యింది. – గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
గోండి లిపిని గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ గుంజాల గోండి లిపిని భారత ప్రభుత్వం గుర్తించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆద్య కళా మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిసి తాము సేకరించిన ఆదివాసీ కళాఖండాలను సంరక్షించడంతోపాటు సాహిత్య రంగాల్లో రాణిస్తున్న ఆదివాసులకు తగు గౌరవం కల్పించేలా చొరవ తీసుకోవాలని జయదీర్ రాష్ట్రపతికి కోరారు. -
కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల్లో ఆదివాసీ గిరిజనుల ఓట్లే కీలకమని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లోనూ తెలంగాణ గిరిజన ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ప్రాధాన్యతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులను మోసం చేస్తున్నాడని, మాయమాటలు చెప్పి వారి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరీలో బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ భరత్ చౌహాన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో పాటు కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, అన్ని జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సహపంక్తి భోజనం.. రాత్రి బస
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆదివాసీలను ఆకట్టుకునే దిశలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం తండాలు, గూడేల్లో బస చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని రెండు లేదా మూడు తండాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ‘గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం’పేరుతో చేపట్టనున్న ఈ కార్య క్రమం ద్వారా రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే మేలు, చేపట్టబోయే ఇతర కార్యక్రమాల గురించి నేతలు వివరించనున్నారు. నివాళి.. నృత్య ప్రదర్శనలు.. నిద్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కొమురం భీం, సేవాలాల్ మహరాజ్, ఇందిరాగాంధీ చిత్రపటాలకు నేతలు పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తారు. తర్వాత గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు, కళాకారులతో నృత్యాలు, పాటలు పాడించడం లాంటివి నిర్వహించనున్నారు. తండాలు, గూడేల్లోని స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడంతో పాటు అక్కడి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. భోజనాల అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా తండా నాయకుడి ఇంట్లో నిద్రించనున్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీల వెన్నంటే ఉంటుందని చెప్పడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, తండాలు, గూడేలను అక్కున చేర్చుకోవడం ద్వారా అక్కడి గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. 13న గాంధీభవన్‌లో సభ: మల్లురవి యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) వల్ల ఆదివాసీ గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని, ఆదివాసీలను నిర్మూలించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి చెప్పారు. ఈ నెల 13న ఆదివాసీలు, గిరిజనులతో వారి సమస్యలపై గాందీభవన్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు టి.బెల్లయ్య నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని అన్నారు. -
ఆ 23 గ్రామాలు ఆదివాసీలవే
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు ఆదివాసీలకే చెందుతాయని పేర్కొంటూ హైకోర్టు ధర్మాసనం బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఆ గ్రామాలన్నీ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని తేల్చిచెప్పింది. 2014 ఏప్రిల్ 17న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని చెప్పింది. ఆ గ్రామాలు 5వ షెడ్యూల్ పరిధిలోకి రావన్న ఆదివాసీయేతరుల వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తప్పుబట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ 2014 మేలో దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను కొట్టివేసింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేశారని స్పష్టం చేసింది. 75 ఏళ్ల క్రితం నుంచీ వివాదం.. దాదాపు 75 ఏళ్ల క్రితం నుంచి ఈ గ్రామాలకు సంబంధించి ఆదివాసీ, ఆదివాసీయేతరుల మధ్య వివాదం ఉంది. ఇరువర్గాలు ఈ వివాదంపై పలుమార్లు కోర్టులను కూడా ఆశ్రయించాయి. మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు 2005 వరకు జనరల్ రొటేషన్ (జనాభా దామాషా) పద్ధతిన జరిగాయి. అయితే 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను ‘షెడ్యూల్డ్ ఏరియా’గా పేర్కొంటూ, ఎస్టీలకు 100 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ సంబంధిత చట్టాల మేరకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ఆదివాసీయేతరులు కొందరు కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేయడంతో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇదే అంశంపై వివాదం కొనసాగుతుండటం, గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. ఇదే క్రమంలో 2014లో వరంగల్ జిల్లాకు చెందిన మర్రి వెంకటరాజం, మరికొందరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 21లను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం రాష్ట్రపతి ఈ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించకున్నా.. ప్రభుత్వం మాత్రం వీటి పరిధిలో ఎన్నికలను ఆ చట్టాల మేరకే నిర్వహిస్తోందని తెలిపారు. ఈ గ్రామాల పరిధిలోని అన్ని పదవులను ఆదివాసీలకే రిజర్వు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు భూరియా కమిషన్ నివేదికను, దాదాపు 70కి పైగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు కాపీలను పరిశీలించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయమూర్తి.. సరిగా పరిశీలన చేయని కారణంగానే రాజ్యాంగం ప్రకారం ఈ గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతాల జాబితాలోకి చేరలేదని చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ, ఆ గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతం కిందికే వస్తాయని తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ వెంకటరాజం అప్పీల్ దాఖలు చేయగా, సుదీర్ఘ విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. తాజాగా తీర్పును వెలువరించింది. తప్పుడు కేసులతో ఎన్నో కోల్పోయాం తప్పుడు లిటిగేషన్ కేసులతో ఎన్నో ఏళ్లుగా విద్య, ఉద్యోగాలు, ఉపాధి, నీరు, నిధులు కోల్పోయాం. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను పొందేందుకు 2005 నుంచి తుడుందెబ్బ, ఆదివాసీ సేన, వివిధ గిరిజన ప్రజా సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సహకారంతో పోరాటం ప్రారంభించాం. 2006లో కేసు గెలిచాం. కానీ గిరిజనేతరులు మళ్లీ మా హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించారు. అయితే హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో పూర్తిస్థాయిలో విజయం సాధించాం. – గొప్ప వీరయ్య, మన్యసీమ పరిరక్షణ సమితి, డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈ తీర్పుతో ఆదివాసీలకు సకల హక్కులు హైకోర్టు తీర్పుతో ఆ 23 గ్రామాల్లో ఆదివాసీ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం తొలగిపోనుంది. ఈ ఎన్నికల్లో ఆదివాసీయేతరులు పోటీ చేయడానికి అనర్హులు. ఆదివాసీలు మాత్రమే పోటీ చేయాలి. అటవీ హక్కుల చట్టం ఈ గ్రామాలకు కూడా వర్తిస్తుంది. ఆదివాసీల నుంచి ఇతరులకు భూ బదలాయింపు నిషేధ చట్టం అమల్లోకి వస్తుంది. ఇకపై ఇతర ఆదివాసీలు పొందిన 5వ షెడ్యూల్లోని హక్కులన్నీ వీరూ పొందుతారు. – న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ -
అడవితల్లికి ‘తొలి’ పూజ
కెరమెరి(ఆసిఫాబాద్):సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. ఆషాఢమాసంలో ముందుగా వచ్చే పండుగ అకాడి. నెలవంక కనిపించడంతో అకాడి వేడుకలు ప్రారంభించి వారం రోజులపాటు నిర్వహిస్తారు. మంగళవారం పెద్దసాకడ గ్రామంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో అకాడి పండుగ ప్రారంభించారు. పౌర్ణమి వరకు వేడుకలు నిర్వహించనున్నారు. వనంలో పూజలు.. అకాడి వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దసాకడ గ్రామ పొలిమేరలో ఉన్న బాబ్రిచెట్టు వద్దకు వెళ్లారు. చెట్టుకింద ఉన్న రాజుల్పేన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మణరేఖ లాంటి ఒక గీత గీశారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు గీతపై నుంచి అడవిలోకి పరిగెత్తాయి. అడవిలోని చెట్లు, ఆకులకు అకాడిపేన్ పూజ చేశాక ఆ ఆకులను ఇళ్లకు తీసుకెళ్లారు. కోడితో జాతకం.. ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో భాగంగా గ్రామ పటేల్ ఇంటినుంచి తెచ్చిన కోడిని దేవుడి ముందు ఉంచుతారు. దాని ముందు గింజలు పోసి జాతకం చెప్పించుకుంటారు. అనంతరం ఇంటినుంచి తెచ్చిన కోడిని బలిస్తారు. అక్కడే ఒకచోట వంటలు తయారు చేశారు. అన్నం ముద్దలుగా చేసి ఒక్కొక్కరూ ఒక్కో ముద్ద ఆరగించారు. అనంతరం మేకను బలిచ్చారు. తుర్ర వాయింపు.. ఈ అకాడి పండుగల్లో మరో కొత్త కోణం ఉంది. అడవిలోకి వెళ్లిన పశువులు ఇళ్లకు చేరాలంటే తుర్ర వాయించాలని ఆచారం. పశువుల కాపరుల వద్ద ఈ తుర్ర ఉంటుంది. పశువులు ఎక్కడికి వెల్లినా ఈ తుర్ర వాయిస్తే తిరిగి వస్తాయని వారి నమ్మకం. నెల రోజుల పాటు తుర్ర వాయిస్తూనే ఉంటారని పలువురు కటోడాలు చెబుతున్నారు. ఏత్మాసార్ పేన్కు పూజలు! అకాడి అనంతరం గ్రామంలోకి చేరుకున్న ఆదివాసీలు ఏత్మాసార్ పేన్కు పూజలు చేశారు. నాలుగు మాసాలపాటు ఈ పూజలు కొనసాగనున్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలతో పాటు పశువులు క్షేమంగా ఉండాలని, పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. అకాడి అనంతరం నాగుల పంచమి, జామురావూస్, శివబోడి, పొలాల అమావాస్య, బడిగా, దసరా, దీపావళి పండుగలు చేస్తారు. -
హనుమంతుడి వారసులం అని గర్వపడండి!: కాంగ్రెస్ ఎమ్మెల్యే
ధార్ జిల్లాలోని గంద్వానీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ మాజీ అటవీ మంత్రి ఉమంగ్ సింఘర్ హనుమంతుడు ఆదివాసీయే అని వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇతిహాసం అయిన రామాయాణ మహా కావ్యంలో కోతులుగా వర్ణించబడినవారు హనుమంతుని వలే గిరిజనులేనని అన్నారు. ఈ మేరకు ఆయన ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హనుమంతుని గురించి ఈ విధంగా ప్రసంగించారు. రాముడిని లంకకు తీసుకువెళ్లింది ఆదివాసీలు(వానర సేన) అని రామయణ కథలో రాశారు. దీనిని బట్టి ఆదివాసీలు అరణ్యాల్లో నివశించారని ఆ కథ ద్వారా మనకు తెలుస్తోంది కావున హనుమంతుడు కూడా ఆదివాసీయే. అందువల్ల మనం అతని వారసులం అని గర్వపడండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సింఘర్ అన్నారు. దీంతో మధ్యప్రదేశ్ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్ మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. వారు హనుమాన్ జీని దేవుడిగా భావించరు. హనుమంతుడుని హిందువులు పూజించే దేవుడిగా అస్సలు గుర్తించరు అని ఫైర్ అయ్యారు. హనుమంతుడిని అవమానించారంటూ ఆరోపణలు చేశారు. హనుమంతుడి విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ క్యాథలిక్ మత గురువులు భాష మాట్లాడుతున్నట్లుంది అని వెటకరించారు. ఇక మత మార్పిడిలు చేసేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాలను ట్యాగ్ చేశారు బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్. (చదవండి: పాతికేళ్ల ఎన్సీపీ.. పవార్ కీలక నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆ ఇద్దరూ) -
గుస్సాడి గుండెచప్పుడు పద్మశ్రీ కనకరాజు
నెమలీకల టోపీ ధరించి కోలాహలంగా ఆడతారు. రేలా... రే... రేలా అంటూ గొంతు కలిపి పా డతారు. ప్రకృతి గురువు నేర్పిన పా ఠాలకు ఆనవాళ్లు వారు. మొన్నటి వరకు అడవి తల్లి ఒడిలో దాగిన కళారూపా లివన్నీ. నేడవి అడవి గోడలు దాటి నగరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశం ఎల్లలు కూడా దాటే వరకు గుస్సాడి ఆడాలంటున్నారు... పద్మశ్రీ కనకరాజు. కనకరాజు పేరులో ఇంటి పేరు కనక, ఆయన పేరు రాజు. ఇన్ని వివరాలు మాకక్కర్లేదు, గుస్సాడి నృత్యం చేస్తాడు, మా అందరి చేత అడుగు వేయిస్తాడు కాబట్టి ఆయన మాకు ‘గుస్సాడి రాజు’ అంటారు స్థానికులు. ఆయన పద్మశ్రీ అందుకున్నప్పటి నుంచి నాగరక ప్రపంచం ఆయన మీద దృష్టి కేంద్రీకరించింది. కనకరాజు అని ఇంటిపేరుతో కలిసి వ్యవహారంలోకి వచ్చారు. అయినప్పటికీ వారి గూడేలకు వెళ్లి కనకరాజు అని అడిగితే వెంటనే గుర్తుపట్టరు. గుస్సాడి కనకరాజు అంటే టక్కున చెప్పేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మర్హలి ఆయన ఊరు. ప్రస్తుతం కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అంతేకాదు, కుమ్రుం భీమ్ వారసులు కూడా. ఆదిలాబాద్‌లో విస్తరించిన గోంద్ తెగకు చెందిన వాళ్లందరూ భీమ్ వారసులుగా గర్వంగా భావిస్తారు. ఎనభై ఏళ్ల కనకరాజు... తండ్రి చెప్పిన మాట కోసం గుస్సాడి నృత్యం పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేశారు. గుస్సాడితో మమేకమైన తన జీవితానుభవాలను సాక్షితో పంచుకున్నారాయన. ఆట... పా ట... జీవితం! ‘‘మా ఆదివాసీల జీవనంలో ప్రకృతి, నృత్యం, గానం కలగలిసి పోయి ఉంటాయి. బిడ్డ పుడితే పా ట, పెళ్లి వేడుకకీ పా ట, అంతేకాదు... మనిషి పోయినా పా ట రూపంలో ఆ వ్యక్తితో మా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాం. దండారీ ఉత్సవాలంటే మాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. మగపిల్లలకు నృత్యం, ఆడపిల్లలకు రేలా పా ట చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. గుస్సాడి నృత్యంలో అడుగులు వేయడం ఎప్పుడు మొదలైందో నాకు గుర్తు లేదు. కానీ మా నాన్న ఒక మాట చెప్పేవారు. ‘ఈ నృత్యమే మనకు దైవం. ‘ఈ నృత్యాన్ని మరువద్దు. తరతరాలుగా మోసుకొస్తున్నాం. దీన్ని కాపా డుకుంటేనే దేవుడు మనల్ని కాపా డుతాడు’ అని చెప్పేవాడు. ఆ మాట నాలో నాటుకుపోయింది. నాకు వయసొచ్చినప్పటి నుంచి నృత్యంలో తొలి ఆటగాడిగా అడుగులు వేస్తుండేవాణ్ని. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసించే రెండువేల గూడేలకూ నేను తెలిసిపోయాను. గణతంత్ర వేడుక గణతంత్ర వేడుకల్లో మా ప్రాచీన వారసత్వ కళ అయిన గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం నాకు 1982లో వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి మా గుస్సాడి టోపీ పెట్టించి, గజ్జెలు కట్టించాం. ఆమె మాతో అడుగులు వేసింది. ఆ తర్వాత ఓసారి అబ్దుల్ కలామ్ కూడా మాతో అడుగులు వేశారు. హైదరాబాద్‌లో ఎన్ని ప్రదర్శనలిచ్చామో లెక్కేలేదు. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కూడా మా గుస్సాడిని ప్రదర్శించాం. మరో పది దఫాలు యువతతో చేయించాం. నాయన మాట మీద గుస్సాడి కోసం బతికినందుకే మా దేవుడు మెచ్చి గొప్ప వాళ్లకిచ్చే పద్మశ్రీని ఇప్పించాడనుకుంటున్నా. నెమలీకల టోపీ మా నృత్యం సాధన చేయడమే కాదు, టోపీ, దుస్తులు, గజ్జెలు అన్నీ ప్రత్యేకమే. వాటిని తయారు చేయడానికి చాలా నైపుణ్యం ఉండాలి. పెద్ద టోపీకి రెండు వేల పింఛాలుంటాయి. మా ఇళ్లలో వాటిని భద్రపరుచుకోవడం పెద్ద పని. మా ముత్తాతలు ధరించిన టోపీ ఇంకా నేను ధరిస్తూనే ఉన్నాను. కొత్తవాళ్ల కోసం టోపీలు తయారు చేస్తున్నాం. పెద్ద టోపీ, దుస్తులతోపా టు మొత్తం వేషానికి ఇరవై వేల రూపా యలవుతాయి. మా ఆదివాసీ వ్యక్తి తుకారామ్ సాబ్ కలెక్టర్ అయిన తరవాత ఈ నృత్యానికి ఇంకా కొన్ని చేర్పులు చేసి బాగా మంచిగా చేశారు. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఐటీడీఏ ఆఫీసర్లు గుస్సాడి నృత్యం నేర్పించడానికి వందకు పైగా బడులు పెట్టారు. ఒక్కో బడిలో రెండు– మూడు వందల మంది నేర్చుకుంటున్నారు. నేను పెద్ద మాస్టర్ (చీఫ్ డాన్స్ మాస్టర్)ని. గుస్సాడి, రేలా పా ట నేర్పించడానికి 30 మందిని ప్రత్యేకంగా తయారు చేశాను. మరో రెండు వందల మందికి సంపూర్ణంగా శిక్షణనిచ్చాను. ఇంక మామూలుగా నేర్చుకుని ఆడే వాళ్లు ఎన్ని వేల మంది ఉన్నారో నేను ఎప్పుడూ లెక్క చెప్పుకోలేదు. అడవి తల్లికి అందరూ ఒక్కటే! మా ఆదివాసీల్లో మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువనే ఆలోచనే ఉండదు. బిడ్డలంతా సమమే. పెళ్లిలో కట్నకానుకలు ఉండవు. ఆడబిడ్డ పుట్టిందని చింతపడడం మాకు తెలియదు. నాకు ఎనిమిది మంది కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. బతకడానికి ఆశ్రమ పా ఠశాలలో రోజు కూలీగా పని చేస్తూ కూడా అందరికీ చదువు చెప్పించాను. తొమ్మిది– పది తరగతుల వరకు అందరూ చదువుకున్నారు. రెండో కొడుకు వెంకటేశ్ మాత్రం డిగ్రీ చదివి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. తరతరాలుగా అడవులకే పరిమితమైపోయిన గుస్సాడి నృత్యాన్ని నేను దేశానికి తెలియ చెప్పా ను. మీరు మన ఆట, పా టలను ఇతర దేశాలకు తీసుకెళ్లాలని నా పిల్లలు, శిష్యులకు చెబుతున్నాను’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు గుస్సాడి కనకరాజు. – వాకా మంజులారెడ్డి -
మా పాట అడవి దాటింది.. ఆదివాసీ గాయని లక్ష్మీబాయ్
ధ్వని పుట్టింది... రాగం ఆవిర్భవించింది. మాట పుట్టింది... పాట రూపుదిద్దుకుంది. ఆది సంస్కృతి... ఆదిరాగాన్ని ఆవిష్కరించింది. ఆ రాగాల పరిరక్షణకు అంకితమైన గాయని లక్ష్మీబాయ్. హైదరాబాద్‌లో గవర్నర్ బంగళా. ఈ ఏడాది మార్చిలో మహిళాదినోత్సం వేడుకలకు సిద్ధమైంది. తమ తమ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలు పురస్కారాలందుకుంటున్నారు. వారిలో ఓ మహిళ పెందూరు లక్ష్మీబాయ్. ఆదిలాబాద్ నుంచి వచ్చిన ఆదివాసీ గాయని ఆమె. గవర్నర్ చేతుల మీదుగా సన్మానం చేయించుకున్న సంతోషం ఆమె ముఖంలో ప్రతిఫలిస్తోంది. ఈ గౌరవాన్ని అందుకున్న లక్ష్మీబాయ్ తన జీవితాన్ని ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకే అంకితం చేసింది. ఆమె సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘మాది ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలం, తోషం గ్రామం. మా తెగ పేరు తోటీ. సిటీల వాళ్లు టాటూ అని ఇప్పుడు ఫ్యాషన్‌గా వేసుకుంటున్నారు చూశారా... అదే... పచ్చబొట్టు. ఆ పచ్చబొట్టు వేయడం మా వృత్తి. అడవుల్లో మూలికలు, వేళ్లను సేకరించి పసరు తయారు చేసుకుంటాం. మా సంస్కృతి, జీవనం గోంద్ రాజులతోపాటుగా ఉండేది. గోంద్ రాజుల దగ్గర కళాకారులం. కిక్రీ అనే వాయిద్యంతో పాటల రూపంలో మహాభారతం, రామాయణం, రాజుల కథలను చెబుతాం. రేలా పాటలైతే వందల్లో ఉంటాయి. అవన్నీ మాకు నోటికి వస్తాయి. పుస్తకం చూడాల్సిన అవసరం లేదు. మా పేర్లు కూడా రామాయణ, మహాభారతాలు, గొప్ప రాజుల చరిత్ర కథల్లో ఉండే పేర్లే ఉంటాయి. పాటని వదలం అన్నం దొరకకున్నా సరే పాటను మాత్రం వదలం. మా పుట్టిల్లు మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పుట్టిగూడ. మా చిన్నప్పుడు తినడానికి కూడా ఇప్పుడున్నంత వెసులుబాటు ఉండేది కాదు. గోంద్ రాజుల ఇంట్లో పండగ, శుభం... అశుభం... ఏదో ఒక సందర్భంలో వాళ్లు జొన్నలు పెడితే అదే సంతోషం. మిగిలిన రోజుల్లో అడవి తల్లే ఆధారం. అలాంటి గడ్డు రోజుల్లో కూడా మేము మా సంస్కృతిని వదల్లేదు. కిక్రీ వాయిద్యాలను మూలన పెట్టలేదు. సంస్కృతిని, కళను అంతరించి పోనివ్వకూడదని మాకు మేము ఒట్టు పెట్టుకుంటాం. మా వంశాల్లో తరతరాల సంపద మా నోటిపాట, మాట. చిన్నప్పటి నుంచి ఎన్నో ఏళ్లపాటు నేర్చుకుంటూ, మర్చిపోకుండా సాధన చేస్తూనే ఉంటాం. అప్పట్లో మా పాట అడవిలోనే ఉండేది. ఇప్పుడు సర్కారు శ్రద్ధ పెట్టడంతో మా కళ అందరికీ తెలుస్తోంది. ఆకాశవాణిలోనూ మా పాటలు వచ్చాయి. పురస్కారం మా కళకే! నా భర్త తుకారామ్ కిక్రీ వాద్యకారుడు. నేను రేల పాటలు పాడుతాను. ఆయన, నేను పాటలు పాడుతూ ఊళ్లు తిరిగాం. ఢిల్లీలో 2006లో రిపబ్లిక్ దినోత్సవాలకు వెళ్లి మా కళలను ప్రదర్శించాం. రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారి చేతుల మీదుగా సన్మానం అందుకున్నాం. ఈ ఏడు హైదరాబాద్‌లో గవర్నర్ చేతుల మీద సన్మానం, మధ్యలో ఆదిలాబాద్ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో మా పాటలు, దండలు, శాలువాలతో గౌరవించారు. అంతపెద్ద వాళ్లు మాకు దణ్ణం పెడుతుంటారు. ఆ దణ్ణం మాక్కాదు, మా ఆకలి తీరుస్తూ, మమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడే మా అడవి తల్లికి. అక్షరం రాని మా నాలుక మీద పెద్ద పెద్ద గ్రంథాలను పలికిస్తున్న మా కులదైవానికే. మేము ఏటా జనవరిలో ఒకసారి, ఈ నెలలో (మే నెల) ఒకసారి మా ఉత్సవాలు చేసుకుంటాం. మా పాటలన్నీ మా నాలుకల మీద నాట్యం చేస్తున్నాయి. నగరానికి చేరిన ‘ఆది’ పాట ఐఏఎస్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ఈ కళను మా దగ్గరే ఆగిపోనివ్వకుండా అందరికీ తెలియచేయాలని సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న ఆడపిల్లలకు నేర్పించమన్నారు. ఆమె మాట మీద రెండు నెలలు అక్కడే ఉండి నేర్పించాను. నాకు రాయడం రాదు, వందల పాటలు పాడతాను. మా చిన్నప్పుడు బడుల్లేవు. ఇప్పుడు మా ఆదివాసీలు పిల్లలందరినీ చదివించారు. మేము మా నలుగురు పిల్లలనూ చదివించాం. రాయడం వచ్చినోళ్లు ఈ పాటలను రాస్తే ఎప్పటికీ ఉంటాయి. ఇప్పటోళ్లు మేము పాడుతుంటే పాటలు రికార్డ్ చేసి యూ ట్యూబులో పెడుతున్నారు. మా పాట నగరాలకు చేరుతోంది. నగరాల వాళ్లు ఈ పాటలను టీవీల్లో పాడుతున్నారు. వాటిని చూసినప్పుడు మాకు ఖుషీగా ఉంటుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం పాట ఆపను. నా భర్తతో కలిసి ఎన్నెన్ని పాటలు పాడానో... ఇప్పుడు నాతో ఉన్నది ఆయనతో పాడిన పాటలే’’ అని తాను ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అంకితమైన వైనాన్ని వివరించారు పెందూరు లక్ష్మీబాయ్. – వాకా మంజులారెడ్డి -
ఆదిలాబాద్: ఉట్నూరులోని ఆదివాసీల జీవనం దయనీయం
-
జట్టీ కట్టి.. 5 కి.మీ. మోసుకొచ్చి..
చర్ల: ఆదివాసీ పల్లెల్లో కనీస సౌకర్యాల లేమికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. గ్రామం ఏర్పడి 30 ఏళ్లు కావస్తున్నా నేటికీ సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో మంగళవారం ఓ నిండు గర్భిణిని గ్రామస్తులు ఐదు కిలోమీటర్ల దూరం జట్టీ ద్వారా మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన నూపా సిద్దు భార్య లిల్లీ నిండు గర్భిణి. మంగళవారం లిల్లీ ప్రసవ వేదన పడుతుండగా కొందరు యువకులు హుటాహుటిన మొబైల్ సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి 108కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి వాహనం వచ్చేందుకు దారి లేదని, తిప్పాపురం వరకు వస్తే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలిస్తామని 108 సిబ్బంది తెలిపారు. దీంతో చేసేదేమీ లేక సిద్దు బంధువులు జట్టీ కట్టి ఆమెను అటవీ మార్గం గుండా తిప్పాపురం సమీపంలోని ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో కొయ్యూరు వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో లిల్లీ ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
ఛత్తీస్‌ఘడ్: నారాయణ్‌పూర్‌లో హైటెన్షన్
రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ బస్తర్ జిల్లా నారాయణ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివాసీలు ఆగ్రహంతో సోమవారం పోలీసులపై దాడికి దిగారు. అంతకు ముందు ఓ సున్నితమైన అంశానికి సంబంధించి దాడి చేసేందుకు ప్రయత్నించారు వాళ్లు. ఈ క్రమంలో.. పోలీసులు వాళ్లను అడ్డుకుని వాళ్లతో మాట్లాడేందుకు తయ్నించారు. అయితే ఉన్నట్లుండి ఆదివాసీలు పోలీసులపై దాడికి దిగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆదివాసీలు చేసిన రాళ్ల దాడిలో జిల్లా ఎస్పీ సదానంద కుమార్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఆయన తల పగలి రక్తస్రావం అయ్యింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఘటనపై చత్తీస్‌గఢ్ హోం మంత్రి తమ్రాజ్వాద్ సాహూ స్పందించారు. పోలీసులు శాంతియుతంగా సమస్యను పరిష్కరించేందుకు యత్నించినా.. ఆదివాసీలు దాడికి దిగారని తెలిపారు. ఈ క్రమంలో ఎస్పీపై వెనుక నుంచి దాడి చేశారని వెల్లడించారు. గత కొన్నాళ్లుగా ఆదివాసీల మధ్య చిచ్చు రగులుతోంది అక్కడ. రెండు వర్గాలుగా చీలిపోయిన ఆదివాసీలు.. గత రెండు నెలల్లో దాదాపు 20సార్లు ఘర్షణలకు దిగారు. పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. -
అధికారంలో ఔన్నత్యం చాటుకోవాలి
షెడ్యూల్డ్ ఏరియాల్లో జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అంద జేయాల్సి ఉంటుంది. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆదివాసీలను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. అందుకే ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక నాయకురాలిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. అలా జరిగితే ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. ‘ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని అన్నింటి కన్నా ముఖ్యమైనది. అణగారిన వర్గాలకు సంబంధించి మనం కేవలం రిజర్వేషన్ల వరకే పరిమితమయ్యాం. కానీ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్క రించడానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇస్తుంది. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్రపతికి శక్తి మంతమైన అధికారాలిచ్చే విధంగా ఈ ఆర్టికల్‌ను పొందుపరచాలి’’ అంటూ రాజ్యాంగ సభ సభ్యుడు పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ చేసిన వ్యాఖ్యలివి. భారత రాజ్యాంగ సభలో జూన్ 16, 1949న బాబాసాహెబ్ అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా పండిట్ భార్గవ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజ్యాంగ ముసాయిదాలో 301 నంబర్‌తో ఉన్న ఆర్టికల్ రాజ్యాంగ సభ ఆమోదం పొందిన రాజ్యాంగంలో 340గా పొందు పరి చారు. ‘‘భారత దేశంలో ఉన్న వెనుకబడిన తరగతులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక విద్యా విషయాలను పరిశోధించడానికి, పరిశీ లించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చును.’’ ఇది ఆర్టికల్ 340 సారం. అయితే ఇప్పటి వరకూ రాష్ట్రపతి పదవిని పొందిన చాలామంది ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. పదవ రాష్ట్రపతిగా పనిచేసిన డా.కె.ఆర్.నారాయణన్ మినహాయింపు. 2000 జూలై 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన గవర్నర్ల సదస్సులో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రత్యేకించి బడ్జెట్ కేటాయింపులు, విని యోగం, దారిమళ్ళింపు సమస్యలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టం అమలును గురించి అధ్యయనం చేయడానికి ఏడుగురు గవర్నర్లతో ఒక కమిటీని నియమించారు. అప్పటి మహా రాష్ట్ర గవర్నర్ పి.సి. అలెగ్జాండర్ అధ్యక్షతన, మేఘాలయ గవర్నర్ ఎం.ఎం. జాకబ్, కేరళ గవర్నర్ ఎస్.ఎస్. కాంగ్, కర్ణాటక గవర్నర్ వీఎస్ రమాదేవి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సూరజ్ భాను, ఒడిషా గవర్నర్ ఎం.ఎం. రాజేంద్రన్, హరియాణా గవర్నర్ బాబు పరమా నంద్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2000 ఆగస్టు 8న ఏర్పడిన కమిటీ, 2001 ఏప్రిల్ 28న తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికలో భూ పంపిణీ, విద్య, గృహ వసతి, ప్రజారోగ్యం, వృత్తి, వ్యాపార అభివృద్ధి పథ కాలు, వీటన్నింటితో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రగతిపైనా ఎన్నో సిఫారసులు చేసింది. నిజానికి స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అత్యున్నతమైన స్థానంలో ఉన్న గవర్నర్లు అన్ని రాష్ట్రాలు తిరిగి, సంబంధిత మంత్రులు, అధికారులు, సామాజిక వర్గాల సంస్థలు, సంఘాలతో సమావేశం కావడం విశేషం. అయితే అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోలేదు. కానీ ఈ కమిటీ ప్రయత్నం ఊరికేపోలేదు. ఎస్సీ, ఎస్టీల సమస్య పరిష్కారం కోసం పనిచేసే సంస్థలకు ఒక ఆయుధమై నిలిచింది. ఎన్నో రాష్ట్ర ప్రభు త్వాలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఈ విషయాలను ప్రస్తావించడానికి ఇప్పుడొక సందర్భం వచ్చింది. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావస్తోంది. దక్షిణ భారతదేశ విడిది హైదరాబాద్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి మొదటిసారి ఉంటున్నారు. రాష్ట్రపతికి ప్రభుత్వా లను కాదని, మార్పులు చేయగలిగే అధికారం లేకపోయి ఉండవచ్చు. కానీ 339, 340 ఆర్టికల్స్ ప్రకారం, అదేవిధంగా 5వ షెడ్యూల్లో షెడ్యూల్ తెగల కమిటీల రక్షణ విషయంలో రాష్ట్రపతి అధికారాలను, చొరవను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రాజ్యాంగ పరిధిలో, అది అందించిన అధికారాలను ఉపయోగించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది. దేశంలోని ఒక ప్రధాన ఆదివాసీ తెగౖయెన సంథాల్ సమూహానికి చెందిన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయంలో నారాయణన్ చూపిన చొరవను చూపాలనే ఆకాంక్షతోనే వీటన్నింటినీ ప్రస్తావిం చాల్సి వస్తోంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 339 ప్రకారం, క్లాజు ఒకటి చెపుతున్న ఒక చట్టబద్ధమైన కమిషన్ ఇప్పటికే అమలులో ఉంది. ఆర్టికల్ 339 క్లాజు–2 కూడా రాష్ట్రపతికి ఎస్టీల సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన, సమీక్ష విషయాలలో అధికారాలను ఇచ్చింది. ‘‘రాష్ట్రాల్లో ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్న తీరును పరిశీలించి, వారికి తగు నిర్దేశకత్వం ఇవ్వవచ్చు’’ అనే క్లాజు ఒక ముఖ్యమైన అంశం. అదేవిధంగా 5వ షెడ్యూల్ కేవలం ఆదివాసీల రక్షణకు ఉద్దే శించిన హక్కుల పత్రం. ఐదవ షెడ్యూల్లో పేర్కొన్న హక్కుల రక్షణలో రాష్ట్రపతి పర్యవేక్షణ ప్రధానమైనది. ఐదవ షెడ్యూల్ పార్ట్ (ఎ)లో పేర్కొన్న మూడవ అంశం గురించి ప్రస్తావించుకుందాం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించాలి. అక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి ప్రతి సంవత్సరం లేదా రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, దేన్ని గురించి అడిగినా ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అందజేయాలని నిర్దేశించారు. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. తగు సూచ నలు, సలహాలు చేయవచ్చు. అదేవిధంగా పార్ట్(బి)లో 4వ అంశం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(టీఏసీ)కు విస్తృతమైన అధికారాలున్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా లన్నా, ఆదివాసీలకు సంబంధించి ఎటువంటి చట్టాలు చేయాలన్నా, ఆ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలన్నా, ట్రైబల్ అడ్వై జరీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పా టుకు సంబంధించి కూడా నిర్దిష్టమైన విధానాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. టీఏసీలో 20 మంది సభ్యులకు మించి ఉండ కూడదనీ, వీరిలో 3/4వ వంతు ఆ రాష్ట్ర ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండాలనీ నిబంధన కూడా ఉంది. ఆదివాసుల హక్కుల కోసం అన్ని రకాల చట్టాల అమలును పర్యవేక్షించడం, రాజ్యాంగ హక్కులను కాపాడడం టీఏసీ బాధ్యత. అయితే ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అస్తిత్వం నామమాత్రంగానే మిగిలిపోవడవం బాధాకరం. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ సలహా మండలిని పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఆదివాసీ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల తీరుచూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సలహా మండళ్లను సంప్రదిస్తున్న దాఖలాలే లేవు. ఇటువంటి సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత్ర కీలకమౌతోంది. ఒక మహిళగా, ఆదివాసీ బిడ్డగా, అడవిబిడ్డల పేగు తెంచుకొని పుట్టిన ఒక నాయకురాలిగా రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగ అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమా నతలు, సామాజిక వ్యత్యాసాలు ఆదివాసీలను మరింత వెనుకబాటు తనానికి గురిచేస్తున్నాయి. ఆదివాసీల స్థితి గతులపై ఒక అధ్యయనం జరిపి, వారి సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే, ద్రౌపది ముర్ములాంటి ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. అణచి వేతకు గురౌతున్న ఆయా వర్గాల ప్రాతినిధ్యం అక్షరాలా సరైనదని రుజువవుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
కళ్లముందున్న వివక్ష కనబడదా?
ఉద్యోగార్థుల కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని గతంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ (ఐఐడీఎస్) బయటపెట్టింది. ఇలాంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీలు, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ వివక్ష దేశంలో ఇంకా అలాగే ఉందని తాజాగా ఆక్స్‌ఫామ్ నివేదిక కూడా వెల్లడించింది. కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవసరమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వారికి ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. కుల వ్యవస్థ ప్రజల జీవితాలను ఇంకా నియంత్రిస్తూనే ఉంది. రమేష్ మెష్రం అనే విద్యార్థి ఉద్యోగం కోసం ఒక కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి కావాల్సిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పంపాడు. కానీ పిలుపు రాలేదు. తన పేరును కొంచెం మార్చి, అంటే ఇంటిపేరును సంక్షిప్తీకరించి పంపిస్తే పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అభ్యర్థుల కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆధిపత్య కులాలైతే సంక్షిప్తంగా మాట్లా డడం, దళితులు, వెనుకబడిన కులాలైతే, వారి కుల వివరాలు తెలి యకపోతే, మీ తండ్రి ఏం చేస్తారు? గ్రామమా? పట్టణమా? ఎటు వంటి జీవనోపాధి ఉండేది?... అట్లా కులం తెలిసేదాకా లాగడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని పదిహేనేళ్ళ క్రితమే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్(ఐఐడీఎస్) బయటపెట్టింది. ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాథమిక విద్య, వ్యాపారం, ఆరోగ్య అవకాశాలు, ఇట్లా కొన్ని అంశాలపై ఒక సంవత్సరానికిపైగా సర్వే చేసింది ఆ సంస్థ. ఆ సర్వే ఆ రోజుల్లో సంచలనం రేపింది. దానిని 2010 సంవత్సరంలో ‘బ్లాకెడ్ బై కాస్ట్’ పేరుతో పుస్తకంగా కూడా ముద్రించారు. దానికి ఐఐడీఎస్ ఛైర్పర్సన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ నేతృత్వం వహించారు. ఇటువంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీ, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ కులాల్లో అత్యధిక నైపుణ్యం కలిగినవాళ్ళకు కొన్ని ఇబ్బందుల తర్వాతనైనా అవకాశాలు వచ్చి ఉంటాయి. ఆధిపత్య కులాల్లోని మంచివాళ్ళు, లేదా విదేశీ నిపుణులు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకనే ప్రశ్న చాలామందికి వచ్చే అవకాశం ఉంది. ‘ఆక్స్‌ఫామ్’ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఇటీవల ‘ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్టు–2020’ పేరుతో ఒక నివే దికను విడుదల చేసింది. ఇందులో కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతోందనీ, ఉద్యోగాలు పొందడంలో, వైద్య సౌకర్యాలు అందుకోవడంలో వివక్ష ఎదురవుతోందనీ ఆ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను నేషనల్ సర్వే ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేల ఆధా రంగా రూపొందించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకూ, మిగతా సమాజానికీ మధ్య నెలవారీ సంపాదనలో తేడా ఉందని గుర్తించారు. ఎస్సీ, ఎస్టీలు నెలకు 10,533 రూపాయలు సంపాదిస్తే, సమాజంలోని మిగతా వ్యక్తులు నెలకు సరాసరిగా 15,878 రూపాయలు పొందు తున్నారని వెల్లడించారు. పురుషులు, మహిళల మధ్య కూడా వేత నాలు, కూలీ విషయంలో వ్యత్యాసం ఉందని తేల్చారు. మగవారు నెలకు 19,779 రూపాయలు సంపాదిస్తే, మహిళలు 15,578 రూపా యలు మాత్రమే పొందుతున్నారు. పట్టణాల్లో ముస్లింలు నెలకు 13,672 రూపాయలు సంపాదిస్తే, ఇత రులు 20,345 రూపాయలు సంపాదిస్తున్నారు. స్వయం ఉపాధిలో మగవారు సరాసరి 15,996 రూపాయల ఆదాయం పొందితే, మహిళలు కేవలం 6,620 రూపా యలు మాత్రమే సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిలో ఎస్సీ, ఎస్టీలు 7,337 రూపాయలు పొందితే, ఇతరులు 9,174 రూపాయలు సంపాదిస్తున్నారు. కోవిడ్ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు రెండు న్నర రెట్లు అధికమైందని ఈ సర్వే తెలుపుతున్నది. 10 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత పడింది. జీత భత్యాల్లో కూడా కోతపడింది. లాక్డౌన్ సమయంలో, ఆ తర్వాత చాలాకాలం సగం జీతాలే లభించాయి. మహిళల్లో కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో మగవారిలో 9 శాతం మంది దెబ్బతింటే, మహిళలు 70 శాతం మంది నష్టపోయారు. ఆర్థిక వృద్ధిలోనూ, ఆదాయం పెరగడానికి ప్రారంభించే వ్యాపా రాల్లోనూ అప్పు అనేది ముఖ్యం. ఎవరైతే అవసరానికి తగ్గ ఆర్థిక సాయం పొందుతారో వారు ఆర్థిక వనరులను పెంచుకోగలుగు తారు. వేలకోట్లు ఆస్తులు కలిగిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు కూడా బ్యాంకుల నుంచి రుణాలు లభించడం వల్లనే తమ కార్యకలాపాలను కొనసాగించగలుగుతున్నారు. ఈ విషయంపై కూడా ఆక్స్‌ఫామ్ తన అధ్యయనాన్ని కొనసాగించింది. ఒక వ్యక్తి లేదా ఇద్దరు ముగ్గురు ఉమ్మడిగా లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పొందితే, 120 కోట్ల మంది కేవలం కొన్ని కోట్ల రూపాయలను మాత్రమే అప్పుగా పొంద గలిగారు. ఇందులో వివిధ వర్గాల మధ్యన మరింత వ్యత్యాసం ఉంది. ఎస్సీలు తాము తీసుకున్న రుణాల్లో 34 శాతం వాణిజ్య బ్యాంకులు, 9 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపు తున్నాయి. ఎస్టీలు 31 శాతం వాణిజ్య బ్యాంకులు, 29 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఎస్సీలు అతి తక్కువ బ్యాంకు రుణాలు పొందడానికి ప్రధాన కారణం, దాదాపు 90 శాతం మందికి పైగా దళితులకు నికరమైన వ్యవసాయ భూమి లేదు. ఒకవేళ ఉన్నా అది అరెకరం, ఎకరానికి మించదు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గింది. 96 శాతం ఉద్యోగాలు కేవలం ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. నాలుగుశాతం ఉద్యోగాలు ప్రభుత్వ అధీనంలోని సంస్థల్లో ఉన్నాయి. 2018–19లో నిరుద్యోగుల శాతం ఎస్సీ, ఎస్టీల్లో 9.9 శాతంగా ఉంటే, అది ఇతరుల్లో 7.9 శాతంగా ఉంది. నిజానికి ఉద్యోగాల మీద ఆధారపడేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలే. వారి చేతిలో భూమి లేదు. వ్యాపారాల్లేవు. ఆర్థిక వనరులు లేవు. కానీ ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆ వర్గాలు వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవస రమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వాళ్ళకు ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, దేశంలో ఉన్న అసమానతలు. వీటికి పునాది కుల వ్యవస్థలో ఉంది. ఆధిపత్య కులాల్లోని ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ప్రవేశించడానికి ఏ అడ్డంకులూ లేవు. వారిలో కొద్ది శాతం మంది పేదలు ఉండొచ్చు. ఇది ఎట్లా అంటే దళితుల్లో ధనికులు ఉన్నట్టే. ఒక గ్రామానికి సంబంధించిన వివరాలను నేను రెండు రోజుల క్రితం సేకరించాను. ఆ గ్రామంలో ఉన్న ఆధిపత్య కులాలు భూమిని కలిగి ఉన్నాయి. అదే ఆధారంతో ఉద్యోగార్హమైన చదువులు చదివారు. ఈ రోజు వాళ్ళు విదేశాల్లో తమ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో స్థిరపరిచారు. వెనుకబడిన కులాలకు ఆదాయాన్ని పొందే కుల వృత్తులున్నాయి. వాటి ద్వారా బతుకుదెరువుకు ఇబ్బంది లేని జీవితా లను గడుపుతున్నారు. కానీ 25 శాతానికి పైగా ఉన్న ఎస్సీలు మాత్రం రోజు రోజుకీ తమ బతుకు వెళ్ళదీయడానికి పరుగులు పెడుతున్నారు. వారు భద్రత కలిగిన ఉద్యోగాల్లో లేరు. తరతరాలుగా కుల వ్యవస్థ అవలంబించిన వివక్ష ప్రజల జీవితాలను నియంత్రిస్తున్నది. పరిస్థితి ఇట్లా ఉంటే, ఇటీవల కొంతమంది తప్పుడు భావాలను ప్రచారం చేస్తున్నారు. దళితులు కొందరి పట్ల విద్వేషాన్ని రెచ్చగొడు తున్నారని మాట్లాడుతున్నారు. పైన పేర్కొన్న వాస్తవాలు దళితులను రోజురోజుకీ ఇంకా పేదరికంలోకి, అభద్రతలోనికి నెడుతున్నాయి. వేలాది మంది దళితులు ఆధిపత్య కులాల చేతుల్లో హత్యలకు, అత్యా చారాలకు గురయ్యారు. ఎక్కడా కూడా దళితులు తిరిగి అణచివేతకు పూనుకోలేదు. దళితుల మీద నిందలు వేసేవాళ్లు అధ్యయనం చేయడం మంచిది. అంతిమంగా ఈ వివక్షను, హింసను ఎట్లా నివా రించాలో, నిర్మూలించాలో ఆలోచిస్తే మంచిది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
ఎస్టీ హోదా కోసం దేశవ్యాప్తంగా కుర్మీల ఆందోళన!
కోల్‌కతా/బరిపడ/రాంచీ: తమకు షెడ్యూల్ తెగ(ఎస్టీ) హోదా కల్పించాలని, కుర్మాలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ మంగళవారం కుర్మీలు చేపట్టిన ఆందోళనలతో బెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు రైలు పట్టాలపై బైఠాయించడంతో ఆగ్నేయ రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను వేరే మార్గాల్లోకి మళ్లించి, 11 రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఆందోళన కారులు పురులియా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొరుగునే ఉన్న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో కూడా కుర్మీలు రైల్ రోకోలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం -
గిరిజన అభివృద్ధిలో కొత్త శకం
సాక్షి, పాడేరు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో గిరిజనాభివృద్ధిలో నవ శకం మొదలైందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనుల పక్షపాతిగా వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పాడేరులోని తలారిసింగి ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్ గిరిజన సంప్రదాయ తుడుమును మోగించి, విల్లంబులు ఎక్కుపెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలించక ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ రాలేకపోయారని, కొద్దిరోజుల్లో ఈ ప్రాంతంలో సీఎం పర్యటిస్తారన్నారు. రాష్ట్రంలో గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద రాష్ట్రంలో రూ.14 వేల కోట్లను ఖర్చు పెట్టిందన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రహదారులు నిర్మిస్తున్నామన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.5 లక్షల కుటుంబాలకు 2 లక్షల 50 వేల ఎకరాల అటవీ భూములను పంపిణీ చేసి, సీఎం జగన్ సర్వ హక్కులు కల్పించారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత వరకు రూ.8 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ప్రభుత్వం గిరిజనులకు అందించిందన్నారు. బాక్సైట్ జీవోలన్నింటిని రద్దు చేయడం చరిత్రాత్మకమన్నారు. అంతకు ముందు పలు అభివృద్ధి పనుల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంబా రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో ఉత్సవాలు పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో వేర్వేరుగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధ్యక్షతన సీతంపేటలో నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్, సీతంపేట ఐటీడీఏ పీవో నవ్య, ఆర్డీవో హేమలత తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో ఐటీడీఏ పీవో ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ.. సంక్షేమాభివృద్ధి సీఎం జగన్ సాక్షి, అమరావతి: కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న గిరి పుత్రులకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేశామని ఆయన ట్వీట్ చేశారు. -
అడవుల్లో ఉండిపోయింది
‘ఒక సమయం వస్తుంది. ఈ నగరాలకు దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. కాకుంటే నేను ఆ పిలుపు ముందు విన్నాను’ అంటుంది 35 కావ్య. నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల రంగంలో పని చేసిన కావ్య గత పదేళ్లుగా సెలవుల్లో భారతీయ పల్లెలను తిరిగి చూస్తూ తన భవిష్యత్తు పల్లెల్లోనే అని గ్రహించింది. ‘ఒరిస్సా అడవులకు మారిపోయాను. ఈ ఆదివాసీల కోసం పని చేస్తాను’ అంటోంది కావ్య. ఆమెలా బతకడం ఎందరికి సాధ్యం. చుట్టూ దట్టమైన అడవులు. అమాయకంగా నవ్వే ఆదివాసీలు. స్విగ్గి, జొమాటో, అమెజాన్‌ల గోల లేకుండా దొరికేది తిని సింపుల్‌గా జీవించే జీవనం, స్వచ్ఛమైన గాలి, స్పర్శకు అందే రుతువులు... ఇంతకు మించి ఏం కావాలి. నగరం మనిషి సమయాన్ని గాయబ్ చేస్తోంది. మరో మనిషిని కలిసే సమయం లేకుండా చేస్తుంది. కాని పల్లెల్లో? సమయమే సమయం. మనుషుల సాంగత్యమే సాంగత్యం. ‘ఆ సాంగత్యం అలవాటైన వారు అడవిని వదల్లేరు’ అంటుంది కావ్య సక్సెనా. 35 ఏళ్ల కావ్య ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దులో ఉండే కోరాపుట్ ప్రాంతంలో సెటిల్ అయ్యింది. ఒక్కత్తే. అక్కడి పల్లెల్లో ఆమె నివాసం. ఆ ఊరివాళ్లే ఆమె మనుషులు. అక్కడి ఆహారమే ఆమె ఆహారం. కాని ఆ జీవితం ఎంతో బాగుంటుంది అంటోంది కావ్య. నోయిడా నుంచి జైపూర్‌లో జన్మించిన కావ్య చదువు కోసం అనేక ప్రాంతాలు తిరిగింది. కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పని చేసింది. ఆ తర్వాత నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల కార్పొరెట్ సంస్థకు మారింది. అయితే ఎక్కడ పని చేస్తున్నా పల్లెలను తిరిగి చూడటం ఆమెకు అలవాటు. ‘అందరూ అందమైన బీచ్‌లను, టూరిస్ట్ ప్లేస్‌లను చూడటానికి వెళతారు. నేను కేవలం పల్లెటూళ్లు చూడటానికి వెళ్లేదాన్ని. పల్లెల్లో భిన్నమైన జీవితం ఉంటుంది. అది నాకు ఇష్టం’ అంటుంది కావ్య. అయితే 2020లో వచ్చిన లాక్డౌన్ ఆమె కాళ్లకు బేడీలు వేసింది. అక్టోబర్‌లో ఆంక్షలు సడలింపు మొదలయ్యాక ‘మహీంద్రా’ వారితో కలిసి ‘కావ్యాఆన్క్వెస్ట్’ అనే సోలో ట్రిప్‌కు బయలుదేరింది. దీని ఉద్దేశ్యం పల్లెల్లో ఉండే హస్తకళలను డాక్యుమెంట్ చేయడమే. ఆ దారిలో ఆమె అనేక పల్లెల్లో గ్రామీణులు, ఆదివాసీలు చేసే హస్తకళలను గమనించింది. ‘కాని వాటిని మార్కెట్ చేసే ఒక విధానం మన దగ్గర లేదు. పల్లెల్లోని ఉత్పత్తులకు పట్నాల్లోని మార్కెట్‌కు చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలి అనిపించింది’ అంది కావ్యా. ఇక ఆమెకు జీవిత గమ్యం అర్థమైంది. ‘నగరానికి తిరిగి వచ్చాక నాకు ఊపిరి ఆడలేదు. జూలై 2021లో ఇక నేను శాశ్వతంగా నగరానికి వీడ్కోలు చెప్పేశాను. ఒరిస్సాల్లోని ఈ అడవులకు వచ్చి ఉండిపోయాను’ అంటుంది కావ్య. క్రాఫ్ట్ టూరిజం ఇది కొత్తమాటగా అనిపించవచ్చు. కాని హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా ప్రోత్సహించడమే క్రాఫ్ట్ టూరిజం. కావ్య ఇప్పుడు కోరాపుట్ ప్రాంతంలోని నియమగిరి కొండల దగ్గర నివశిస్తోంది. ఆ ప్రాంతంలో డోంగ్రియా తెగ ఆదివాసీలు ఎక్కువ. ‘వారు గడ్డితో చాలా అందమైన వస్తువులు చేస్తారు. అవి బాగుంటాయి. అంతేకాదు వారు 47 రకాల బియ్యాన్ని పండిస్తారు. వారి వంటలు మధురం. అవన్నీ నగరాల్లో ఎక్కడ తెలుస్తాయి. ఈ తెగవారు ‘కపడగంధ’ అనే శాలువాను అల్లుతారు. అది చాలా బాగుంటుంది. చెల్లెలు శాలువా అల్లి అన్నకు ఇస్తే అన్న తాను వివాహం చేసుకోదలిచిన అమ్మాయికి దానిని బహుమతిగా ఇస్తాడు. ఆ శాలువాలకు మంచి గిరాకీ ఉంది’ అంటుంది కావ్య. అయితే గ్రామీణ హస్తకళల ఉత్పత్తుల పేరుతో మార్కెట్లో డూప్లికేట్లు ఉండటం గురించి ఆమెకు బెంగ ఉంది. ‘ఒరిజినల్ ఉత్పత్తులను కస్టమర్లకు అందించడానికి ‘క్రాఫ్ట్ పోట్లీ’ అనే సంస్థ స్థాపించి పని చేస్తున్నాను. ఒక గ్రామాన్ని నా వంతుగా దత్తత చేసుకున్నాను. ఆ గ్రామంలో ఉండే 50 మంది మహిళలకు హస్తకళల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాను’ అంది కావ్య. ఈమె చేస్తున్న పని చూసి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ హస్తకళల ప్రమోషన్‌కు ఆహ్వానించింది. అక్కడి ఆదివాసీలను తరచూ కలిసి వస్తోంది కావ్య. త్వరలో ఆమె దేశంలోని అందరు ఆదివాసీలను ఒక ప్లాట్‌ఫామ్ మీదకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందరో మహానుభావులు అని మగవాళ్లను అంటారు. కాని ఎందరో మహా మహిళలు. కావ్య కూడా ఒక మహా మహిళ.