air quality
-
సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుంది
ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి.. ఇతరత్రా వంటి వాటికోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు సంస్థ తాజాగా ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి 'ఎయిర్ వ్యూ ప్లస్' (Air View+) అనే తీసుకువచ్చింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 491 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. సంస్థ గాలిలోని ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవడం ముఖ్యమని భావించింది. ఈ కారణంగానే ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ తీసుకువచ్చింది. ఇది ఏఐ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణంలోని గాలి నాణ్యతను గురించి తెలుసుకోవచ్చు.గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ఇండియాలోని వంద నగరాల్లోని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా.. గాలిలోని ఎయిర్ క్వాలిటీని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు గూగుల్ పరిచయం చేసిన కొత్త ఫీచర్ సాయంతో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ కోసం.. క్లైమేట్ టెక్ సంస్థలు, ఆరస్సూర్, రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ వంటివి కీలక పాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎస్‌టీఈపీ వంటివి టెస్ట్ చేసి ధ్రువీకరించినట్లు సమాచారం.'ఎయిర్ వ్యూ ప్లస్'లో ఎయిర్ క్వాలిటీ కనుక్కోవడం ఎలా?•మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి.•సెర్చ్ బార్లో ఏదైనా లొకేషన్‌పై ట్యాప్ చేయాలి.•ఆలా చేసిన తరువాత లొకేషన్ పక్కనే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (NAQI) కనిపిస్తుంది.•దానిపైన క్లిక్ చేసిన తరువాత టెంపరేషన్ కనిపిస్తుంది, దాని కిందనే ఎయిర్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. -
కాలుష్య కోరల్లో దేశ రాజధాని..
-
ఉత్తరాదిపై పొగమంచు దుప్పటి.. గ్యాస్ ఛాంబర్‌గా రాజధాని!
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతున్న కారణంగా ఢిల్లీతో పాటు, పలు ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు దట్టంగా కమ్మేసింది. గాలి విషపూరితంగా మారింది. వాయు నాణ్యత కనిష్టానికి చేరింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలలోని జనం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాతావరణశాఖ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఉత్తర భారతదేశం అంతటా దట్టమైన తెల్లటి పొగమంచు కమ్మేసినట్లు కనిపిస్తోంది. మహారాష్టలోనూ ఇదే స్థితి కనిపిస్తోంది. మొన్నటి దీపావళికి స్వల్పంగా కనిపించిన ఈ పొగమంచు దుప్పటి డిసెంబర్ చివరి నాటికి తీవ్రంగా మారుతుందని, ఇది జనవరి వరకూ కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలించినప్పుడు ఇదే స్పష్టమవుతోంది. కొరియన్ జియో కాంప్శాట్ 2ఎ ఉపగ్రహం పంపిన రెండు చిత్రాలను పోల్చి చూసినప్పుడు ఇది తేలింది. తాజా చిత్రాలను చూస్తే ఢిల్లీపై పొగమంచు దట్టంగా అలముకున్నట్లు కనిపిస్తోంది. గాలి నాణ్యత ‘తీవ్రమైన’ వర్గానికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును దాటింది. Today, Delhi’s daily average AQI clocked 418 as per the 4 PM AQI Bulletin by CPCB. The CAQM Sub-Committee on GRAP accordingly took stock of the air quality scenario and the AQI forecast, including for the meteorological conditions as made by IMD/ IITM.Cont. (1/5)— Commission for Air Quality Management (@CAQM_Official) November 13, 2024గ్యాస్ ఛాంబర్‌గా రాజధానిదేశరాజధాని ఢిల్లీలోని ప్రజలు ఇప్పుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కాలుష్యపూరిత గాలి ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో తీవ్ర స్థాయి వాయు కాలుష్యం కేటగిరీగా ప్రకటించింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(కేంద్ర కాలుష్య నియంత్ర మండలి). పంట వ్యర్ధాల దహనం, వాహన కాలుష్యం, గాలి వేగం మందగించడంతో కాలుష్యం పెరగడానికి కారణంగా గుర్తించారు.సీపీసీబీ తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ)432కి చేరుకుంది. అంటే ఢిల్లీలో గాలి ‘వెరీ సీరియస్ కేటగిరీ’లో ఉంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల వాయు నాణ్యత సూచికను సీపీసీబీ విడుదల చేసింది. దీని ప్రకారం నజఫ్గఢ్లోని గాలి అత్యంత కలుషితంగా మారింది. ఏక్యూఐ 482గా నమోదయ్యింది. ఇదేవిధంగా ఏక్యూఐ 480తో నెహ్రూ నగర్ రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ఆనంద్ విహార్ ఉంది. ఈ నేపథ్యంలో గ్రాప్ - 3 నియంత్రణల అమలుపై నేడు నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.ఇది కూడా చదవండి: రిజర్వేషన్ల రద్దుకు ‘యువరాజు’ కుట్రలు: మోదీ -
తగ్గిన కాలుష్యం.. పెరిగిన ఆయుర్దాయం!
న్యూఢిల్లీ: భారత్‌లో 2022 ఏడాదిలో గాలిలో సూక్ష్మ ధూళికణాల గాఢత 19.3 శాతం తగ్గడంతో వాయునాణ్యత స్వల్పంగా మెరుగుపడిందని అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపీఐసీ) ప్రకటించింది. ఈ మేరకు రూపొందించిన ‘వాయు నాణ్యతా జీవన సూచీ–2024’నివేదికను ఈపీఐసీ తాజాగా వెల్లడించింది. అయితే ఇప్పటికీ భారత్‌లో వాయుకాలుష్యం అధికంగా ఉందని, తగ్గించుకోకపోతే ప్రజల ఆయుర్దాయం తగ్గక తప్పదని హెచ్చరించింది. గాలిలో ఘనపు మీటర్‌కు 5 మైక్రోగ్రాముల మేరకే 2.5స్థాయి సూక్ష్మధూళి కణాలుండాలి. అంతకుమించి ఉండి, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాలను అందుకోలేకపోతే భారత్‌లో ప్రజల ఆయుర్దాయం 3.6 ఏళ్లు తగ్గే ప్రమాదముందని నివేదిక హెచ్చరించింది. 2022లో 2.5స్థాయి సూక్ష్మధూళి కణాలు తగ్గడానికి అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉష్ణ పరిస్థితులు కారణమని నివేదిక విశ్లేషించింది. పశి్చమబెంగాల్, జార్ఖండ్‌లలో ఈ వాయు కాలుష్య తగ్గుదల కనిపించింది. ‘‘భారత్ అంతటా వాయుకాలుష్యం తగ్గితే ఢిల్లీలో ప్రజల ఆయుర్దాయం 7.8 ఏళ్లు పెరగొచ్చు. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోలేకపోతే మాత్రం ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం 11.9 ఏళ్లు తగ్గవచ్చు. కాలుష్యం ఇలాగే కొనసాగినా, భారత్ నిర్దేశించుకున్న 2.5 స్థాయి వాయు నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయినా 8.5 ఏళ్లు క్షీణిస్తుంది’’ అని నివేదిక పేర్కొనడం విశేషం. పశి్చమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో వాయునాణ్యత పెరిగితే అక్కడి వారి ఆయుర్దాయం 3.6 ఏళ్లు ఎక్కువ అవుతుందని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో వాయకాలుష్యం అధికంగా ఉంటే 2.9 ఏళ్ల ఆయుర్దాయం తగ్గనుంది. నగరాల సమీప జిల్లాలతో పోలిస్తే దూరంగా ఉన్న జిల్లాల్లో 2017తో పోలిస్తే 2022లో కాలుష్యం 18.8 శాతం తగ్గింది. దీంతో 44.67 కోట్ల మంది ఆయుర్దాయం 10.8 నెలలు పెరిగింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్ వినూత్న విధానాలను అవలంబిస్తోందని నివేదిక పేర్కొంది. 2019లో గుజరాత్ తొలిసారిగా వీటిని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సూరత్‌లో కాలుష్యం 20–30 శాతం తగ్గింది. నివాసప్రాంతాల్లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు, వంటచెరకు వాడకం తగ్గించడానికి కేంద్రం ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలుచేస్తుండటాన్ని నివేదిక ప్రస్తావించింది. -
ఢిల్లీ పొల్యూషన్.. వరల్డ్‌లోనే టాప్ ర్యాంక్ !
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్విస్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో వెల్లడించింది. ఈ సర్వేలో 2018 నుంచి వరుసగా నాలుగుసార్లు ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా టాప్‌లో ఉంటూ వస్తోంది. 2022లో ఢిల్లీ పీఎం 2.5 లెవెల్స్ క్యూబిక్ మీటర్‌కు 89.1 మైక్రో గ్రాములు ఉండగా 2023లో ఇది 92.7 గ్రాములకు చేరింది. ఇక బీహార్‌లోని బెగుసరాయ్ పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణమని ఐక్యూ ఎయిర్ తెలిపింది. క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాముల పీఎం 2.5 కాన్సంట్రేషన్తో ప్రపంచంలోనే మూడవ అత్యంత కాలుష్య దేశంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత భారత్ ఉందని వెల్లడించింది. ఐక్యూ ఎయిర్ కాలుష్య దేశాల ర్యాంకుల్లో 2022లో భారత్ ర్యాంకు 8గా ఉండగా 2023లో 3వ ర్యాంకుకు ఎగబాకింది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి.. వందేళ్ల కక్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్ -
నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం. వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గాల్లోని నలుసు పదార్థాల (పీఎం) సాంద్రత 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రో గ్రాములు మించకూడదు. ఇది ఢిల్లీ లాంటి నగరంలో 102. ఈ గాలిని పీల్చడం ప్రాణాంతకం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తెచ్చిన ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం’ కొంతమేరకు ఫలితమిస్తున్నా అది సరిపోదు. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో మనం వ్యవహ రిస్తున్నాం. ప్రజారోగ్య దృక్కోణం నుండి చూస్తే ఎంత ప్రగతి అయినా తక్కువే. నిరంతర రాజకీయ నిబద్ధత మాత్రమే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. శీతకాలపు నెలల్లో భారీ పొగమంచుతో కప్పబడి ఉండే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నీలి ఆకాశం, ప్రకాశవంతమైన సూర్యబింబం అరుదుగా గోచరిస్తుంటాయి. అయితే పేలవమైన గాలి నాణ్యత అనేది ఇప్పుడు జాతీయ సమస్య అయింది. కాకపోతే గత ఐదేళ్లలో, వాయు కాలుష్యం ఒక విధానపరమైన సమస్యగా కూడా గుర్తింపు పొందింది. అయిన ప్పటికీ ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమ’ (ఎన్సీఏపీ) అయిదేళ్ల అంచనాను పరిశీలిస్తే, అర్థవంతమైన, శాశ్వతమైన ప్రయోజనాలను అందించడానికి గట్టి ప్రయత్నాలు అవసరమని తెలుస్తుంది. అపఖ్యాతి పాలైన భారతదేశ గాలి నాణ్యతను పరిష్కరించడానికి తెచ్చిన మొదటి విధానం – 2019లో ప్రారంభించిన ఎన్సీఏపీ. కాలుష్య స్థాయులను, గాలిలోని నలుసు పదార్థాల గాఢతలను ప్రధాన నగరాల్లో 30 నుంచి 20 శాతం తగ్గించాలనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి కేంద్రం నుండి రూ. 443 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుండి రూ. 4,400 కోట్ల ప్రారంభ కేటాయింపులు జరిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి చెందిన నిరంతర పరిసర వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల విశ్లేషణ (భారత దేశ వాయు నాణ్యతా మానిటర్ల నెట్వర్క్) పురోగతి స్థిరంగా ఉన్నప్ప టికీ, ఎన్‌సీఏపీని అమలు చేయడంలో వ్యూహాత్మకమైన, సైన్స్ ఆధారిత మార్పుల అవసరం ఉంది. ఉదాహరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాల్లోని నలుసు పదార్థాల (పర్టిక్యులేట్ మ్యాటర్) సాంద్రతకు పరిమితులు నిర్దేశించింది. 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు, 10 పీఎం అయితే ఒక క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాములు మించకూడదు. ఎన్సీఏపీ అమలయ్యాక, ప్రత్యేకించి 2.5 పీఎం వారణాసిలో 96 నుంచి 26.9 మైక్రోగ్రాములకు తగ్గింది. ఆగ్రాలో 73 నుంచి 33కు, జో«ద్‌పూర్‌లో 81.8 నుంచి 40.6కు మెరుగ్గా తగ్గింది. కానీ ఢిల్లీలో మాత్రం 108 నుంచి 102కు మాత్రమే తగ్గింది. పీఎం 2.5 స్థాయుల డేటా 2019–2023 మధ్య 46 నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం 27 నగరాల్లో మాత్రమే తగ్గుదల మెరుగ్గా ఉంది. 10 పీఎం విషయంలో ఐదేళ్ల డేటా కేవలం 46 నగరాలకు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 24 నగరాల్లో మాత్రమే మెరుగుదల కనబడింది. 50 శాతం నగరాలు గణనీయమైన అభివృద్ధిని చూపుతున్నా యనీ, ఇది ఎన్సీఏపీ విజయవంతమైన ప్రగతిని సూచిస్తోందనీ ఎవరైనా వాదించవచ్చు. కానీ మనం మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో వ్యవహరిస్తున్నాము. పైగా రక్తపోటు, మధుమేహం వంటివాటిని ఇవి మరింత తీవ్రతరం చేయవచ్చు. 2.5 పీఎం రక్త–మెదడు అవరోధాన్ని కూడా దాటవచ్చు. దీర్ఘకాలం అలాంటి గాలిలో మసలితే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి, ప్రజారోగ్య దృక్పథం నుండి చూస్తే మరింత కఠినమైన ప్రగతి అత్యవశ్యం. మరో సమస్య ఏమిటంటే, ఎన్సీఏపీలో సమన్వయం కొరవడింది. ఢిల్లీ లాంటి నగరంలో సరి–బేసి ట్రాఫిక్‌ను అమలు చేయడం, ‘జాతీయ రాజధాని ప్రాంతం’ నుండి నిబంధనలు పాటించని వాహనాలను తొలగించడం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించడం, దుమ్మును తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం వంటి చర్యలు అన్నీ అమలవుతున్నాయి. అయినప్పటికీ, కాలుష్యానికి సంబంధించిన ఇవే కారణాలు ఉన్న మిగిలిన ప్రాంతాలకు విస్తరించకుంటే ఈ చర్యలు సరిపోవు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల దట్టమైన పొగమంచుతో చలి కాలం ప్రారంభం కావడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఢిల్లీ నగరంలో నమోదైన సుమారు 80 లక్షల వాహనాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉష్ణోగ్రతలో తగ్గుదల గాలిలో నిలిచివుండే అణువుల స్థాయులను ప్రమాదకరంగా పెంచుతుంది. ఈ కాక్టెయిల్ను ఢిల్లీ నివాసులు ప్రతి సంవత్సరం కొన్ని వారాల పాటు పీల్చుకుంటున్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) ప్రతి శీతాకాలంలో ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలో ఊహించిన ప్రతిస్పందనగా అమలులోకి వస్తుంటుంది. అయితే దాని ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సజావుగా సమన్వయం లేకపోతే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. జాతీయ రాజధాని వెలుపల, సీపీసీబీ పర్యవేక్షణ నెట్వర్క్ అసమానంగా ఉందని మా విశ్లేషణ చూపుతోంది. ఇది మూల్యాంకనానికి వ్యత్యాసాల పొరను జోడిస్తుంది. ముజఫర్‌పూర్, బిహార్ లాంటి రద్దీ ప్రదేశాలలో కేవలం మూడు మానిటర్లు ఉన్నాయి. అదే ఢిల్లీ అంతటా 37 స్టేషన్లు,ముంబై అంతటా 22, హైదరాబాద్‌లో 14 స్టేషన్లు ఉన్నప్పుడు మనం తప్పుడు నిర్ధారణలకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రామాణిక పర్యవేక్షణ విధానంలో, పోల్చదగిన జనాభా ఉన్న నగరాలు ఒకే విధమైన లేదా కనీసం సారూప్య సంఖ్యలో గాలి నాణ్యత మానిటర్లను కలిగి ఉంటాయి. స్థానిక కాలుష్య మూలాల శాస్త్రీయ అవగాహన ఆధారంగా ఆ స్థానాలు ఉంటాయి. నగరాల కాలుష్య సాంద్రతలు ఒకే పారామి తుల సెట్లో ట్రాక్ చేయబడతాయి. ఇది వాటి గాలి నాణ్యత ధోర ణులపై ‘గ్రాన్యులర్’(కణికీయ) అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. వాయు కాలుష్య ప్రయత్నాలకు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో కూడా సమస్యలున్నాయి. తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే అందాయి. అందులో అది 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గాలి నాణ్యత చర్యల కోసం వర్తించే నిధులను క్రమబద్ధీకరించడంలో ఇదొక ప్రశ్నగానే ఉండిపోతుంది. గ్రేటర్ ముంబైకి రూ.938 కోట్లు అందగా, దానిలో రూ.660 కోట్లు వినియోగించుకుంది. అయినప్పటికీ, జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్సీఏపీ)లో సానుకూల అంశాలున్నాయి. వీటిలో మొదటిది 2026 నాటికి 10 పీఎం గాలి సాంద్రతలను 40 శాతానికి తగ్గించడం. ఇది ప్రతిష్ఠా త్మకమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అందుకే దీన్ని ఎన్సీఏపీ అమలు కాని నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రేటర్ నోయిడా (ఉత్తర ప్రదేశ్), భివాడీ (రాజస్థాన్) వంటివి తీవ్ర కాలుష్య స్థాయులను నివేదించాయి. ఇంకా, రంగాల వారీగా వివరణాత్మక చర్యలు ఉండాలి. ఇటుక బట్టీలు, నిర్మాణాలు, కూల్చివేత ప్రాజెక్టుల వంటి అత్యంత కాలుష్య కారకాలకూ... సిమెంట్, ఉక్కు కర్మాగారాలకూ భిన్నమైన విధానం అవసరం. అదేవిధంగా, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మాత్రమే నిర్దిష్ట వయస్సు దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించింది. కానీ దేశవ్యాప్తంగా కఠినమైన, కాలుష్య నియంత్రణ వ్యవస్థ లేక పోతే... ప్రమాణాలను అందుకోని వాహనాలను ఇతర నగరాలకు తరలించే ప్రమాదం ఉంది. అప్పుడు కాలుష్య భారం మారదు. మరీ ముఖ్యంగా, ఎన్సీఏపీ ప్రధాన అంశంగా ప్రజారోగ్యం ఉండాలి. ప్రతి కొలమానాన్ని తప్పనిసరిగా ప్రతిపాదించాలి, చర్చించాలి. అంతే గాకుండా వాయు కాలుష్య కారకాలను తగ్గించడం పట్ల నిర్మాణా త్మకంగా ఉండాలి. మనం ఎన్సీఏపీ రెండవ దశలోకి ప్రవేశించినప్పుడు చాలా ఆశించవచ్చు. ప్రభుత్వం అత్యున్నత స్థాయిలలో సమస్యను అంగీకరించడం అనేది మాత్రం ఇప్పటికి సానుకూలాంశం. కానీ నిరంతర రాజ కీయ నిబద్ధత మాత్రమే బలమైన ఫలితాలను ఇస్తుంది. ఆరతీ ఖోస్లా వ్యాసకర్త న్యూఢిల్లీలోని క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కాలుష్య కోరల్లో ఢిల్లీ.. నియంత్రణకు అధికారుల ఆంక్షలు
ఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగింది. పొగమంచుకు గాలి కాలుష్యం తోడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను దాటింది. గాలి నాణ్యతా ప్రమాణాలు తీవ్రమైన ప్రమాదానికి చేరాయి. దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరగడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) నియంత్రణ చర్యలకు పూనుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో అనవసరమైన నిర్మాణ పనులను నిలిపివేశారు. BS-III, BS-IV డీజిల్ వాహనాల వాడకాన్ని నిషేధించింది. కాలుష్యం నేపథ్యంలో 5వ తరగతి వరకు తరగతులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కమిషన్ సూచించింది. "శనివారం సాయంత్రం నుండి దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ కార్యాచరణ కమిటీ ఈ రోజు ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాలుష్య నియంత్రణకు ప్రణాళికను అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఢిల్లీ పరిసర ప్రాంతంలో తక్షణమే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.” అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రోడ్లు, కాలుష్యం తీవ్రంగా ఉండే ప్రదేశాల్లో నీటిని చిలకరించేలా చూడండి ప్రజా రావాణా సేవలను ఎక్కువగా ఉపయోగించుకోండి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి అత్యవసరమైన ప్రాజెక్టులు మినహా.. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను తగ్గించండి. స్టోన్ క్రషర్స్ ఆపరేషన్‌ను మూసివేయండి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని నిలిపివేయండి BS-III పెట్రోల్, BS-IV డీజిల్ LMVలపై కఠినమైన పరిమితులను విధించండి. నాల్గవ తరగతి వరకు పిల్లలకు భౌతిక తరగతులను నిర్వహించకండి. ఆన్లైన్లో బోధించండి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
విషమంగా ఢిల్లీ గాలి కాలుష్యం!
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కప్పేసింది. గాలి నాణ్యతా సూచీ(AQI) శుక్రవారం ఉదయం అత్యధికంగా 404గా నమోదైంది. నెమ్మదిగా వీస్తున్న గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు కాలుష్య కారకాలు పేరుకుపోయే వాతావరణాన్ని సృష్టించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని వెల్లడించింది. ఢిల్లీలో గురువారం గాలి నాణ్యతా సూచీ 419గా నమోదైంది. బుధవారం 401గా ఉన్న నాణ్యతా ప్రమాణాలు.. మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220గా ఉన్నాయి. రోజురోజుకీ గాలి నాణ్యత మరింత దిగజారుతోందని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. వాహనాల ఉద్గారాలతో పాటు దీపావళి వేడుకలు పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేశాయి. Delhi's air quality remains in 'severe' category Read @ANI Story | https://t.co/vJd7cKWoNZ#Delhi #AQI #DelhiAirPollution pic.twitter.com/FzrD2O2eqt — ANI Digital (@ani_digital) November 17, 2023 ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం గురువారం స్పెషల్ టాక్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అటు.. గాలి నాణ్యతను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు స్మోగ్ టవర్లు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. అంతేకాకుండా వాటి నిర్వహణకు ఖర్చు అధికంగా అవుతుందని పేర్కొంది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని స్థానికులు వాపోయారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని అంటున్నారు. రోడ్డుపైకి వెళ్తే పొగతో దారి కనిపించే పరిస్థితులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్తత -
ఈ నగరానికి ఏమైంది?
ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం వింత కాకపోవచ్చు. కానీ, పర్యావరణ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిందారోపణలు సాగడం విచిత్రమే. దేశ రాజధానిలోని వాయు కాలుష్యం వ్యవహారంలో ఇప్పుడు కేంద్రానికీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికీ నడుమ చోటుచేసుకుంటున్నది అదే. ఢిల్లీ – ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో మంగళవారం సైతం వాయునాణ్యత ‘తీవ్ర ఆందోళన దశ’లో ఉన్న వేళ... చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం జోక్యం చేసుకుంది. వాయు కాలుష్యాన్ని ఓ రాజకీయ పోరుగా మార్చరాదనీ, గాలి నాణ్యత ప్రజారోగ్యాన్ని హత్య చేస్తోందనీ న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది. పొరుగున పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాలను తగలబెట్టడమే ఏటా చలికాలంలో ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని కోర్ట్ అభిప్రాయపడింది. రాష్ట్రాలన్నీ ఈ కొయ్యకాళ్ళ దహనాన్ని ఆపాలని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించడానికి సరి – బేసి వాహనాల ట్రాఫిక్ నియంత్రణ విధానాన్ని మళ్ళీ తేవాలన్న ఢిల్లీ ఆప్ సర్కార్ నిర్ణయం కంటితుడుపేనని కోర్ట్ కుండబద్దలు కొట్టడం పరాకాష్ఠ. ఢిల్లీ పరిసరాల్లో వాయునాణ్యత తృప్తికరమైన దాని కన్నా నాలుగు రెట్లు క్షీణించి, మంగళవారం సైతం వాయు నాణ్యత సూచి దాదాపు 400 మార్కుకు దగ్గరగా నిలిచిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ మాట. ఏడేళ్ళ తర్వాత కాలుష్యం దెబ్బతో స్కూళ్ళు మూతబడ్డాయి. ఇప్పటికే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. దట్టమైన పొగ నిండిన రోడ్లతో, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ, ముక్కులకు మాస్కులు తగిలించుకొని సాహసించి జనం బయటకు రావాల్సిన పరిస్థితి. ఈ కాలుష్య బాధ నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు తరలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో తిరిగాయి. మనుషులే కాదు మూగజీవాలైన పక్షులూ పెద్దయెత్తున అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. ఉన్నంతలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలని ఈ నెల 13 నుంచి సరి – బేసి విధానం పాటిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. 2019 తర్వాత ఢిల్లీలో మళ్ళీ ఈ పద్ధతిని తేవడం ఇదే తొలిసారి. పరిస్థితి తీవ్రతకు ఇది ప్రతీక. ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడం, పరిసర రాష్ట్రాల్లో కొయ్యకాళ్ళను కాల్చడం లాంటివి కనీసం పదేళ్ళుగా చూస్తున్నాం. కొన్నేళ్ళుగా ఇది రాజకీయ అంశమూ అయింది. పంట వ్యర్థాలను తగలబెడుతున్నవారిపై చర్యలు తీసుకోవడంలో పొరుగున ప్రత్యర్థి పార్టీలు అధికా రంలో ఉన్న పంజాబ్, హర్యానాలు విఫలమవుతున్నాయని ఢిల్లీ ఆప్ సర్కార్ గతంలో ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు పంజాబ్‌లో సొంత సర్కారే ఉన్నా, పరిస్థితిలో మార్పు లేదు. విడ్డూరమేంటంటే, పర్యావరణ అంశాలకు వచ్చేసరికి సుప్రీమ్ కోర్టే ప్రతిసారీ జోక్యం చేసుకోవాల్సి రావడం! ‘పర్యావ రణ పరిరక్షణ కోర్టు బాధ్యత అనుకోవడం తప్పు. వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిదీ’ అని సుప్రీమ్ మరో కేసులోనూ హితవు పలకాల్సొ చ్చింది. టపాసుల్లో నిర్ణీత రసాయనాల వాడకంపై నిషేధం ఢిల్లీకే కాక, అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని కుండబద్దలు కొట్టాల్సి వచ్చింది. రాజధానిలో ఇంత రచ్చ జరుగుతున్నా, పంజాబ్ లాంటి చోట్ల ఇప్పటికీ యథేచ్ఛగా మోళ్ళ కాల్చివేత కొనసాగుతూనే ఉంది. ఇటీవల పంజాబ్‌లో ఈ దహనాలు 740 శాతం మేర హెచ్చాయి. ఒకే రోజు వెయ్యి నుంచి 3 వేల పైగా అలాంటి ఘటనలు రికార్డవుతున్నాయి. ఫలితంగా ఏటా నవంబర్, జనవరి మధ్యన ఢిల్లీ వాయునాణ్యత దారుణంగా పడిపోవడం రివాజైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తప్పును పక్కవారి మీదకు నెట్టివేస్తే లాభం లేదు. ఢిల్లీలోని ఈ వాయు కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలి. స్థానిక అవసరాలు, దీర్ఘకాలిక సంప్రదాయా లను దృష్టిలో పెట్టుకొంటూనే మోళ్ళను కాల్చడాన్ని నిషేధిస్తూ, కేంద్ర స్థాయిలో చట్టం తీసుకు రావచ్చు. దశాబ్దాల క్రితమే అమెరికా లాంటి చోట్ల తెచ్చిన కఠినమైన చట్టాలు ఫలితాన్నిచ్చాయి. అయితే, పంజాబ్ లాంటి చోట్ల మోళ్ళ కాల్చివేతను నిషేధిస్తూ, చట్టమున్నా అమలు శూన్యం. అందుకే, వట్టి చట్టం చేయడం కన్నా అందరూ పాటించే ఆచరణాత్మక మార్గం చూడడం ఉత్తమం. నిజానికి, ఖరీఫ్‌లోని పంట కోత తర్వాత, రబీ సీజన్‌కు 10 నుంచి 14 రోజుల్లో రైతులు త్వరితగతిన పొలాల్ని సిద్ధం చేయాలి. అందుకు వరి మోళ్ళను తగులబెట్టడమే మార్గమని వారి భావన. ఈ పరిస్థితుల్లో హానికారక కాలుష్యంపై చైతన్యం పెంచాలి. పంట వ్యర్థాలను వదిలించుకొనేందుకు ఆధునిక ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. దాదాపు 3.3 కోట్ల జనాభాకు నివాసమైన దేశ రాజధాని ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరం. ఈ గాలి పీల్చడం వల్ల ఢిల్లీ వాసులకు శ్వాసకోశ వ్యాధులు రావడమే కాదు, సగటు ఆయుర్దాయం దాదాపు 11.9 ఏళ్ళు తగ్గుతోందని చికాగో విశ్వవిద్యాలయ అధ్యయనం. గతంలో బీజింగ్, లండన్ లాంటివీ ఈ సమస్యను ఎదుర్కొని బయటపడ్డవే. వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్వాలి. ఢిల్లీలో స్మోక్ టవర్ల ఏర్పాటును పెంచాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేలా సబ్సిడీలతో ప్రోత్సహించాలి. కేంద్రం సైతం వాయుకాలుష్య పరిష్కారం తన బాధ్యత కాదని చేతులు దులుపు కోలేదు. ముందుకొచ్చి, నిర్ణీత బడ్జెట్ కేటాయింపుతో సమస్య తీవ్రత ఉన్న ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు అండగా నిలవాలి. ఢిల్లీ లాంటి చోట్ల బయో డీకంపోజర్లను తెస్తామంటూ భారీ వాగ్దానాలు, ప్రచారం చేసి ఇప్పుడా ఊసే ఎత్తని పాలకపక్షాలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణకు దిగితేనే సత్ఫలితాలు వస్తాయి. లేదంటే, ప్రతి ఏటా ఇదే వాయు కాలుష్యం మాట వినాల్సి వస్తుంది. -
తగ్గిన గాలి నాణ్యత.. కాలుష్యంలో దేశ రాజధానిని దాటేసిన ముంబై
ముంబై: మళ్లీ ముంబై, ఢిల్లీ పోటీ పడ్డాయి. కానీ ఈసారి పోటీ పడింది వాయు కాలుష్యంలో. ఎప్పుడైనా వాయు కాలుష్యంలో ఢిల్లీ ముందుంటుంది. కానీ.. ఈసారి ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత 300 కంటే ఎక్కువగా నమోదు అయ్యింది. దేశ రాజధానిని ముంబై ఓడించినట్లు కనిపిస్తోంది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం, బుధవారం ఉదయం 9 గంటలకు ముంబైలోని గాలి నాణ్యత 113 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)తో ‘మోడరేట్’ కేటగిరీలో నమోదు అయింది. అందుకు భిన్నంగా ఈ రోజు దేశ రాజధానిలో గాలి నాణ్యత మొత్తం 83తో ‘సంతృప్తికరమైన’ కేటగిరీలో ఉంది. ప్రమాదకర ప్రాంతాలు.. ముంబై గాలి నాణ్యత ఇండెక్స్ సఫర్ ప్రకారం, బాంద్రా కుర్లా ప్రాంతంలోని కాలానగర్‌లో గాలి నాణ్యత 178కి చేరుకుంది. వర్లీ, భాండూప్, బోరివలి వంటి ప్రాంతాల్లో వరుసగా 139, 131, 135 వద్ద నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటా ప్రకారం, డియోనార్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇండెక్స్ 216, చెంబూర్ 213 నమోదైంది. ముంబైలో మొత్తం గాలి నాణ్యత ‘మధ్యస్థంగా’ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా నమోదైంది. అంధేరీ–346, నవీ ముంబై –311, మజ్గావ్–307 నమోదయ్యాయి. విలే పార్లే వెస్ట్ 331, అంధేరి ఈస్ట్ 343 నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. గాలి నాణ్యత తక్కువగా ఉండటంతో ప్రజలు ఎక్కువగా బయట తిరగవద్దని, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయాలని కోరింది. కాగా, పశ్చిమ కనుమల నుండి వీస్తున్న చల్లని గాలులు తీరం వెంబడి వెచ్చని గాలిని తాకడం వల్ల ఈ పొల్యూషన్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గాలి నాణ్యత ప్రమాణాలు గాలి నాణ్యత ఇండెక్స్ 0 నుంచి 50 వరకు నమోదైతే సంతృప్తికరంగా ఉన్నట్టు. వాయు కాలుష్యం తక్కువగా ఉండి, ఎటువంటి ప్రమాదం ఉండదు. 51 నుంచి 100 కూడా కొంతమేరకు ఆమోదయోగ్యమైనది. 101 నుంచి 150 నమోదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదం. 151 నుంచి 200 నమోదైతే ఆరోగ్య సమస్యలున్నవారితోపాటు సాధారణ ప్రజానీకం కూడా కొందరు ప్రభావితమవుతారు. 201 నుంచి 300 నమోదైతే మాత్రం ప్రమాదకర పరిస్థతి ఉన్నట్టు. ఇది సాధారణ ప్రజల మీద ఆరోగ్యం మీదా ప్రభావం చూపుతుంది. 301, ఆపైన నమోదైతే అత్యవసర పరిస్థితులు ఉన్నట్టు. గాలి కాలుష్యం ఈ మేరకు ఉంటే ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. చదవండి: ‘గాజాలోని భారతీయుల తరలింపు.. ప్రస్తుతం కష్టమే’ -
గాలిలోనూ గరళమేనా?
సంవత్సరాలు మారుతున్నా దేశంలో కాలుష్య పరిస్థితులు మాత్రం మెరుగుపడుతున్నట్టు లేదు. ప్రభుత్వాలు చర్యలు చేపట్టామంటున్నా, వాయు కాలుష్య స్థాయి ఆందోళనకరంగానే కొనసాగుతోంది. భారతదేశ వాయు నాణ్యతా సూచి ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రపంచంలోని వివిధ రాజధానుల్లోకెల్లా రెండో అత్యంత కలుషిత రాజధానిగా, మొత్తం నగరాల లెక్కలో నాలుగో స్థానంలో నిలిచి ఢిల్లీ అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ప్రపంచంలోని 50 అగ్రశ్రేణి కాలుష్య నగరాల్లో 39 భారత్‌లోవే. స్విట్జర్లాండ్‌కు చెందిన వాయు నాణ్యతా టెక్నాలజీ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మార్చి 14న విడుదల చేసిన అయిదో వార్షిక ‘ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక–2022’లోని సంగతులివి. ఇవన్నీ మనల్ని అప్రమత్తం చేస్తున్నాయి. పౌరులు స్వచ్ఛమైన గాలి పీల్చి, ఆరోగ్యంగా జీవించాలంటే కాలుష్య నివారణకు తక్షణ చర్యలే శరణ్యమని పాలకులకు గుర్తు చేస్తున్నాయి. ప్రపంచంలోని 131 దేశాల్లో 7,327 ప్రాంతాల్లో 30 వేలకు పైగా వాయునాణ్యతా పరిశీలక కేంద్రాలు పెట్టి, డేటా సేకరించి, ఈ నివేదికను సిద్ధం చేశారు. దీన్నిబట్టి గడచిన 2022లో అత్యధిక కాలుష్య దేశాల్లో అగ్రభాగాన నిలిచినవి... ఉత్తర – మధ్య ఆఫ్రికాలోని ఛాడ్, ఇరాక్, బహ్రెయిన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. భారత్ 8వ స్థానంలో నిలిచింది. వాయుకాలుష్యం దారుణంగా ఉన్న ప్రపంచంలోని 10 నగరాల్లో ఏకంగా 8 మధ్య, దక్షిణాసియా ప్రాంతాల్లోవే! మన దేశంలో దాదాపు 60 శాతం నగరాల్లో ఈ సర్వే సాగింది. మనం పీల్చే గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా ఏడు రెట్లు అధమంగా ఉందని ఇందులో తేలింది. పైకి చూస్తే, నిరుటి సర్వేలో కాలుష్యంలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న మనం ఈసారి 8వ స్థానానికి రావడం శుభవార్తే. కానీ, నిరుడు ప్రపంచంలోని 100 కాలుష్యనగరాల్లో 61 మనవైతే, ఈసారి ఆ సంఖ్య 65కు పెరగడం గమనార్హం. చిత్రం ఏమిటంటే, ప్రపంచ నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నా, మన దేశంలో అత్యంత కలుషిత నగరం మాత్రం ఢిల్లీ శివార్లలో రాజస్థాన్ పరిధిలోకి వచ్చే భివాడీ! ఆ తరువాతే ఢిల్లీ. వాయుకాలుష్యం ఎక్కువైన దేశ రాజధానిలో సహజమైన నేలను సైతం కాంక్రీట్ కాలిబాటలతో మార్చేసరికి, చెట్ల నరికివేత పెరిగి, జీవం పోతోంది. సహజమైన స్థానిక మొక్కలను కాక, వేరెక్క డివో నాటడం లాంటి సమస్యలూ ఉన్నాయి. అలాగే, వాహన ఉద్గారాలు కాలుష్యానికి మరో ప్రధాన కారణం. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు అధిక స్థాయిలో ఉద్గారాలను వెలువరిస్తూ, మరింత వాయు కాలుష్యానికి దారి తీస్తున్నాయి. ఇవన్నీ ఆరుబయట పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, వీధి వర్తకులు సహా పలువురిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శరవేగపు పట్టణీకరణతో, 2020 నుంచి 2030 మధ్య మన పట్టణ ప్రాంత జనాభా 48.3 కోట్ల నుంచి 67.5 కోట్లకు, అంటే 40 శాతం పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని స్థాయుల్లో గట్టి చర్యలు చేపట్టక తప్పదు. అనూహ్యంగా ఇటీవల గ్రామీణ భారతావనిలోనూ వాయు నాణ్యతలో తేడాలొస్తున్నాయి. గ్రామాల్లో నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్ఓ2) స్థాయులు, దరిమిలా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం గత నెలలో వెల్లడించింది. భారత్‌లో మొత్తం ఎన్ఓ2 కాలుష్యంలో 41 శాతం గ్రామీణ ప్రాంతాల్లో అదీ అధికంగా రవాణా తదితర రంగాల ద్వారా జరుగుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ, శివార్లకు పరిశ్రమలు మారడం, జనాభా పెరుగుదల లాంటి అనేక కారణాల వల్ల ప్రబలుతున్న ఈ ధోరణి ఆందోళనకరం. నిజానికి, గాలిలో పార్టిక్యు లేట్ మేటర్ 2.5 (పీఎం 2.5) సాంద్రతల్ని వచ్చే 2026 కల్లా 40 శాతం మేర తగ్గించడం లక్ష్యమని భారత్ 2022లో ప్రకటించింది. అందుకు తగ్గట్టు 2019లో పర్యావరణ శాఖ ఆరంభించిన ‘జాతీయ స్వచ్ఛ వాయు పథకా’న్ని (ఎన్సీఏపీ) పునర్నిర్వచిస్తామనీ హామీ ఇచ్చింది. కానీ, లక్ష్యసాధనలో వెనుకడుగు వేసింది. బొగ్గు గనులకు పర్యావరణ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం, గాలిలో ధూళి కణాలకు కారణమయ్యే ఉత్పత్తుల పెంపునకు అనుమతులివ్వడం లాంటి అనేక ప్రభుత్వ నిర్ణయాలు సమస్యను పెంచిపోషించాయి. భారత లక్ష్యానికి అవన్నీ ప్రతిబంధకాలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్య నివారణకు సత్వర కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలి. పరిశ్ర మలు, వాహనాలపై కఠిన నిబంధనలు విధించాలి. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గేలా అసలు సిసలు ప్రజా రవాణా వ్యవస్థలపై దృష్టి పెట్టాలి. పునరుత్పాదక శక్తిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే, పర్యావరణ, కాలుష్య సంక్షోభాల నుంచి బయటపడాలంటే, ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్ని మెరుగుపరుచుకొనే కృషి చేయాలి. కేవలం వ్యక్తిగత కృషి సరిపోదు. వ్యక్తివాదం నుంచి సమష్టి వాదం వైపు మళ్ళాలి. అందరూ కలసికట్టుగా సుస్థిర విధానాలను అనుసరించడం కీలకమని గుర్తించాలి. సాముదాయక కృషి సత్ఫలితాలిస్తుంది. కోవిడ్ కాలంలో దేశంలో కాలుష్యం కట్టడి అయినట్టు కనిపించినా, తిరిగి మళ్ళీ కోవిడ్ ముందు స్థాయికి చేరిపోయిందని గత ఏడాది ఇదే ‘ఐక్యూ ఎయిర్’ నివేదిక తేల్చింది. అనారోగ్యానికి రెండో అతి పెద్ద కారణంగా దేశ ప్రజానీకంపై పెను ప్రభావం చూపుతున్న గాలి కాలుష్యంతో ఏటా 15 వేల కోట్ల డాలర్ల పైగా ఆర్థికంగా నష్టపోతున్నట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాయుకాలుష్య ప్రాంతంలో నివసిస్తున్న వేళ భావితరాల బాగు కోసమైనా దేశాలు నిద్ర లేవాలి. పీల్చే గాలిలోనూ ధనిక, పేద దేశాల మధ్య తేడాలు దుర్భరం. -
సుందర దేశంలో విషపుగాలి! బయటకు రావాలంటే జంకుతున్న జనం!
ప్రకృతి రమణీయత ఉట్టిపడే అందమైన దేశం, ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్‌లాండ్‌ను వాయు కాలుష్యం ముంచెత్తుతోంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోతుండడంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలియజేసే యాప్‌లను జనం ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. యాప్ ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు. ఎర్ర మార్క్ కనిపిస్తే ఇంట్లో ఉండిపోవాల్సిందే. ఉదయం పూట వ్యాయామం చేయాలన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కాలుష్యం బెడద మరింత తీవ్రంగా ఉండడం కలవరం సృష్టిస్తోంది ఎయిర్ పొల్యూషన్ దెబ్బకు టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రధాన పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఎందుకీ తీవ్ర కాలుష్యం? థాయ్‌లాండ్‌లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ప్రభుత్వం తరచుగా కాలుష్య హెచ్చరికలు జారీ చేయడం సాధారణమే. అయితే, ఈసారి మాత్రం కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర థాయ్‌లాండ్‌లో రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. మూడు నెలల పాటు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ సమయంలో తీవ్ర కాలుష్యం ఉత్పన్నమవుతుంది. ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి రేణువులు వెలువడుతాయి. విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులు శ్వాస సంబంధిత వ్యాధుల బారినపడుతున్నట్లు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని థాయ్‌లాండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ పరిశోధకుడు కనికా థాంపానిష్వోంగ్ చెప్పారు. దేశంలో 2021లో వాయు కాలుష్యం వల్ల 29,000 మంది మరణించారని అంచనా. ఇక రాజధాని బ్యాంకాక్‌లో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. చలికాలం కావడంతో పరిస్థితి భీతావహంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచించిన దానికంటే థాయ్‌లాండ్ ప్రజలు సగటున నాలుగు రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలను(పీఎం 2.5) పీలుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాలుష్యం వల్ల దేశంలో ప్రజల జీవిత కాలం సగటున రెండేళ్లు తగ్గినట్లు థాయ్‌లాండ్ ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’అంచనా వేసింది. వేధిస్తున్న నిధుల కొరత మరోవైపు కాలుష్యాన్ని తగ్గించడంపై థాయ్‌లాండ్ సర్కారు దృష్టిపెట్టింది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, పరిశోధనా కేంద్రాలతో కలిపి పనిచేస్తోంది. కాలుష్య నియంత్రణ కోసం కొత్త కొత్త విధానాలు రూపొందిస్తున్నప్పటికీ నిధుల కొరత వల్ల అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ పాలసీల అమలుకు బడ్జెట్లో ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం పెద్ద అవాంతరంగా మారింది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం ప్రజల హక్కు, ఆ హక్కును కాపాడడంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ గ్రీన్‌పీస్ థాయ్‌లాండ్, ఎన్విరాన్మెంటల్ లా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు గత ఏడాది మార్చి నెలలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ‘క్లీన్ ఎయిర్ బిల్లు’ను ఆమోదించాలంటూ థాయ్‌లాండ్ క్లీన్ ఎయిర్ నెట్వర్క్ అనే మరో సంస్థ పోరాడుతోంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. కాలుష్యానికి కారణమయ్యే వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించవచ్చు. మరోవైపు పంట వ్యర్థాలను దహనం చేయకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. 14.49 లక్షల మంది బాధితులు థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కాలుష్యం వల్ల దేశంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా 14,49,716 మంది అస్వస్థతకు గురయ్యారు. రాజధాని బ్యాంకాక్‌లో 31,695 మంది అనారోగ్యం బారినపడ్డారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. బాధితుల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, నిమోనియా, బ్రాంకైటీస్, ఆస్తమా, ఇన్‌ఫ్లూయెంజా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి లక్షణాలు కనిపించాయి. బ్యాంకాక్‌లో తాజాగా 50కిపైగా ప్రాంతాల్లో పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్‌కు 51 నుంచి 78 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలిందని కాలుష్య నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ పిన్సాక్ సురాస్వాడీ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని థాయ్ ఎయిర్ క్వాలిటీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రఫాన్ సూచించారు. కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టకపోతే ఇళ్ల నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచిస్తామని థాయ్‌లాండ్ మంత్రి అనుపోంగ్ పావోజిండా చెప్పారు. బ్యాంకాక్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యశాలలు ► కాలుష్యం, తద్వారా అనారోగ్య సమస్యలు పెరిగిపోతుండడంతో థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేసింది ► కాలుష్యం బారినపడిన వారిలో శ్వాస ఆడకపోవడం, చర్మంపై దద్దుర్లు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తున్నాయి. ► బాధితులకు చికిత్స అందించడానికి దేశవ్యాప్తంగా 66 ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. ► వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న వ్యాధులు, నివారణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయా లని బ్యాంకాక్‌లోని 22 ప్రధాన ఆసుపత్రులకు వ్యాధుల నియంత్రణ విభాగం సూచించింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలుష్య కాసారంగా బెంగళూరు.. ఢిల్లీ తరహా పరిస్థితులు!
నానాటికీ పెరిగిపోతున్న మితిమీరిన వాహనాల సంఖ్య.. తద్వారా వెలువడుతున్న ట్రాఫిక్ ఉద్గారాల కారణంగా సిలికాన్ సిటీ బెంగళూరు నగరం కాలుష్య కాసారంగా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో బెంగళూరులోనూ వాయు కాలుష్య పరిమాణం గణనీయంగా పెరుగుతున్నది. దీంతో రానురాను ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉపయోగించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు రావాల్సిన పరిస్థితుల్లో మాస్కులు ధరించాలని చెబుతున్నారు. కాగా, గతేడాదితో పోలిస్తే నగరంలో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) సమారు 40 శాతం పెరిగింది. దీంతో గతేడాది నవంబర్‌లో 66 ఏక్యూఐ ఉండగా ఈ ఏడాది అదే సమయానికి 93కు చేరుకుంది. కాగా, శీతాకాల సహజ వాతావరణ పరిస్థితులకు తోడు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఉద్గారాల కారణంగా కూడా ఏక్యూఐ పెరుగుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే నగరంలో వాయు కాలుష్య ప్రమాణాన్ని కొలిచేందుకు ఏడు వేర్వేరు చోట్ల కేంద్రాలను ప్రారంభించారు. ఢిల్లీ తరహా పరిస్థితులు బెంగళూరులో క్రమక్రమంగా ఏర్పడుతున్నాయి. ఏక్యూఐ వెబ్సైట్లో క్రమంగా బెంగళూరులో గాలి నాణ్యత సూచీ పెరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. బుధవారం ఏక్యూఐ 150కి చేరుకుంటుందని ఆ వెబ్సైట్ అంచనా వేసింది. -
Delhi Pollution: క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. గాలి నాణ్యత రోజురోజుకు తక్కువ స్థాయికి పడిపోతుంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. గాలి నాణ్యత 450 పాయింట్ల తీవ్ర స్థాయికి చేరడంతో పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. 50% ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పని చేసేలా(వర్క్ ఫ్రం హోమ్) ఆదేశాలు జారీ చేసింది. ప్రేవేటు కార్యాలయాలు కూడా ఈ పద్దతినే అనుసరించాలని పేర్కొంది. పాఠశాలలు బంద్ ఢిల్లీలో శనివారం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 5వ తరగతి పై విద్యార్థులు బహిరంగ ఆటలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సరి బేసి విధానం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొంది. చదవండి: ఎంత క్రూరం! కాలితో తన్నాడు.. జనం ఊరుకోలేదు! ఆ వాహనాలపై నిషేదం కేవలం అత్యవసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలు, సీఎన్జీతో నడిచే వాహనాల్ని, ఎలక్ట్రిక్ బండ్లను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద వాహనాలు, బిఎస్-4 డీజిల్ ఇంజిన్ వాహనాలు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించింది. కమర్షియల్ డీజిల్ ట్రక్స్ వాహనాలు కూడా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది.అంతేగాక రోడ్లు వేయడం, వంతెనలు నిర్మించడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్సిమిషన్ యూనిట్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల్నినిలిపివేయనున్నారు. అలాగే గతేడాది అవలంబించినటే సరి, భేసి విధానంలో వాహనాల్ని అనుమతించాలి యోచిస్తోంది ఢిల్లీ సర్కార్. అప్రమత్తమైన ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అప్రమత్తమైంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ రష్ట్రాల సీఎస్‌లను నవంబర్ 10లోపు ఎన్హెచ్ఆర్సీ ముందు హాజరు కావాలని కోరింది. పంజాబ్‌లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తుండటం వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వాయు కాలుష్యం అనేది ఉత్తర భారతదేశ సమస్య అని, ఢిల్లీ ప్రభుత్వం లేదా పంజాబ్ ప్రభుత్వం మాత్రమే దీనికి బాధ్యత వహించవని అన్నారు. దీనికి ఒకరిపై ఒకరు నిందలు వేయడానికి సమయం కాదని అన్నారు. రైతులను తప్పు పట్టలేం ఒకవేళ పంజాబ్‌లో పంటల వ్యర్ధాలను కాల్చివేస్తున్నారంటే దానికి తామే బాధ్యులమని కేజ్రీవాల్ తెలిపారు. వరి పంట వ్యర్ధాల్ని కాల్చివేయాలని రైతులు కూడా కోరుకోవడం లేదని, కానీ రెండు పంటల మధ్య తక్కువ సమయం ఉన్నందున వాళ్లకు మరో అవకాశం లేదని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పడిపోతున్న గాలి నాణ్యత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గురువారం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. గాలి నాణ్యత సూచికలో ప్రస్తుతం యూపీలోని నోయిడా 562తో తీవ్ర స్థాయిలో ఉంది. ఆ తరువాత గురుగ్రామ్ 539(హర్యానా). ఢిల్లీ యూనివర్సీటీ సమీపంలో 563 ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుత గాలి నాణ్యత 472గా ఉంది. ఘజియాబాద్-391, నోయిడా-388, గ్రేటర్ నోయిడా-390, గురుగ్రామ్-391, ఫరీదాబాద్-347గా నమోదైంది. -
రాజధాని నిండా రాకాసి గాలి
రాజకీయాలు కలుషితమయ్యాయనే ఆవేదన వింటుంటాం. కానీ, కాలుష్యం మీదా రాజకీయాలు సాగుతున్న పరిస్థితి దేశ రాజధానిలో చూస్తున్నాం. ఢిల్లీలోని వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితికి వచ్చింది. రాగల మూడు రోజులు దారుణంగా ఉంటాయని వార్త. అదే సమ యంలో ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ, ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య రాజకీయ మాటల యుద్ధం ఏవగింపు కలిగిస్తోంది. పాలన గాలికొదిలేసి, పీల్చేగాలి కూడా సవ్యంగా లేకుండా చేస్తున్న ప్రబుద్ధులు ఆరోపణల పర్వంలో మాత్రం పైచేయి కోసం ప్రయత్నించడం విచారకరం. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో కాలుష్యానికి వాహనాలు, పంట వ్యర్థాల దహనం, దీపావళి టపాసులు, పరిశ్రమలు, గాలి వేగం లాంటి భౌగోళిక పరిస్థితులు – ఇలా ఎన్నో కారణాలు. ప్రతి ఏటా శీతకాలం మొదలయ్యేసరికి హాయిగా శ్వాస పీల్చుకోలేని పరిస్థితి ఏళ్ళ తరబడిగా వేధిస్తున్నా తగు చర్యలు తీసుకోకపోవడం స్థానిక, కేంద్ర ప్రభుత్వాల సమష్టి వైఫల్యం. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ ఒకటి. కళ్ళెదుట ఉన్నది కనిపించనివ్వని దట్టమైన పొగమంచు, దుమ్మూధూళి, పొగ, మసి. ప్రతి శీతకాలంలో లానే ఈసారీ నగరం ఓ విషవాయు గృహంగా మారింది. ఉత్తరాదిలో రోజూ వేలల్లో సాగుతున్న పంట వ్యర్థాల దహనం, ఇతర కాలుష్యాలు మహానగర వాయునాణ్యతను గురువారం సైతం ‘అత్యంత ప్రమాదకర స్థాయి’లో నిలిపాయి. ఒంట్లోని రక్తంలోకీ ప్రవేశించేటంత సూక్ష్మమైన, ప్రమాదభరిత ధూళికణాలు పిఎం2.5 సగటున ప్రతి ఘనపు మీటర్లో 588 ఉన్నాయని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన దానికన్నా ఇది 40 రెట్లు ఎక్కువ. ఢిల్లీలోనే కాదు, దేశంలో అనేక నగరాల్లో పీల్చేగాలి విషతుల్యమైందన్న కాలుష్య నివారణ మండలి మాట దిగ్భ్రాంతికరం. పొరుగున పంజాబ్‌లోని పొలాల్లో వరి పంట వగైరా కోయగా మిగిలిన దుబ్బులను తగలబెట్టడంతో ఢిల్లీ విషవాయు నగరిగా మారుతోందంటూ, ఢిల్లీ, పంజాబ్‌లను రెంటినీ పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కేంద్ర పర్యావరణ మంత్రి దుమ్మెత్తిపోశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు కాలుష్య నియంత్రణకు స్మోక్ టవర్ల ఏర్పాటు, చెట్ల పెంపకం, నీటి జల్లులు సహా చేయగలిగినదంతా చేస్తున్నామంటున్నారు. రాజకీయాలు అటుంచితే, ఢిల్లీలో ఏటా ఈ సమస్య తలెత్తుతుండడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఎవరు కాదన్నా మహానగరిలోని ఈ కాలుష్యానికి వరి మోళ్ళ దహనం దోహదం చేస్తోంది. పంజాబ్‌లో అధికారంలోకి రాక ముందు అంతా అక్కడి రైతుల పాపమే అన్న ఆప్ ఇప్పుడక్కడ అధికారంలో ఉండీ, నివారించలేకపోతోంది. పంజాబ్ తదితర రాష్ట్రాల్లోని రైతులు ఇతర మార్గాలను అనుసరించేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గత నెల రోజుల్లో ఈ దుబ్బులు కాల్చడం ఎక్కువైంది. దీనికి కారణాలు చాలానే. నీటి అవసరం ఎక్కువైన వరిసాగు వల్ల భూగర్భ జలాలు క్షీణిస్తా యంటూ పంజాబ్ లాంటి చోట్ల మేలో పంట వేయడంపై నిషేధం పెట్టారు. వర్షాలొచ్చాక జూన్ మధ్యలో ఆలస్యంగా నాట్లు వేయడంతో, అక్టోబర్ ఆఖరులో కానీ పంట చేతికి రాదు. ఆ వెంటనే రబీ సీజన్‌కు వారమే వ్యవధి. దాంతో, త్వరితగతిన పొలాల్ని సిద్ధం చేసేందుకు మోళ్ళను కాల్చడమే రైతుకు మార్గమవుతోంది. అప్పుడే ఉత్తరాదిలో చలికాలం. ఉష్ణోగ్రతలు పడిపోతాయి. వాయువేగం తగ్గుతుంది. వెరసి, కాలుష్యం పెరుగుతోంది. అదే గనక మేలోనే పంట వేయనిస్తే, సెప్టెంబర్‌కే చేతికొస్తుంది. అప్పటికి ఉష్ణోగ్రతలు, గాలి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సమస్య తీవ్రంగా ఉండక పోవచ్చు. అలాగే, పంజాబ్‌లో అధిక శాతం రైతులు నిరుపేదలు కావడంతో కాల్చడానికి బదులు కొయ్యకాళ్ళను తొలగించే యంత్రాలను వాడే స్థోమత లేదు. పైపెచ్చు, ఇతర ప్రత్యామ్నాయాలన్నీ శ్రమతో కూడినవి. అందుకే వ్యర్థాలను కాల్చడాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇది గ్రహించి, ఈ పద్ధతిని మార్చడంపై అత్యవసరంగా పాలకులు, వ్యవసాయ నిపుణులు దృష్టి పెట్టాలి. ఒక్క శీతకాలంలోనే కాదు... ఏడాది పొడుగూతా ఎన్సీఆర్లో సగటున పిఎం2.5 గరిష్ఠ పరిమితి కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటోంది. ఇది ఆందోళనకరం. ఇటీవల ఢిల్లీలో వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) 400 మార్కును దాటేయడంతో ఆరోగ్యవంతులకూ ప్రమాద ఘంటిక. 2021 నుంచి ఎన్సీఆర్లో కొన్ని చర్యలు చేపట్టకపోలేదు. వాయునాణ్యత నిర్వహణకు కమిషన్ పెట్టారు. రోజూ ఏక్యూఐ నమోదు, ఎప్పటికప్పుడు వచ్చే కాలుష్యప్రమాదంపై గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్‌ప్లాన్ (గ్రాప్) లాంటివి చేపట్టారు. వీటిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ, సంస్థలు సమన్వయంతో సాగితేనే ఫలితం. అలాగే, గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిని పెంచుతున్న వాహన కాలుష్యానికి పరిష్కారం – వీలైనంతగా ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయించడమే. ప్రభుత్వాలు స్థానికంగా బస్ సర్వీసులు పెంచాలి. మెట్రో స్టేషన్లు సహా ఇతర రవాణా వసతులకు బస్ సర్వీసులను అనుసంధానించాలి. నడక– సైకిల్ వినియోగానికి ప్రాథమిక వసతులను పెంచాలి. పౌరులు సైతం ఢిల్లీ సర్కార్ అభ్యర్థిం చినట్టు పదుగురు కలసి ఒకే కారులో (కార్ పూలింగ్)లో పనికి వెళ్ళడం, వాహన రద్దీని నివారించేలా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఆశ్రయించడం, అనధికారిక నిర్మాణాలు – వ్యర్థాల దహనాన్ని నిరోధించడం లాంటివి అనుసరించాలి. స్థానిక సర్కార్లపైనే నెట్టేయడం కాక కేంద్ర ప్రభుత్వమూ తన బాధ్యత నిర్వర్తించాలి. సమష్టిగా చర్యలు చేపడితేనే ఫలితం. ఆ దిశగా ప్రతి అడుగూ అమూల్యమైనదే! -
ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరం ఏదంటే..?
న్యూఢిల్లీ: ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రపంచ నగరాల్లో వాయునాణ్యతను పరిశీలించి స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ తయారు చేసే జాబితాలో అత్యంత అధమ వాయు నాణ్యత ఉన్న టాప్ 100లో 63 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నగరాలు ఉత్తరాదిన ఢిల్లీ పరిసరాల్లోనే ఉండటం గమనార్హం. అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉండటం వరుసగా ఇది నాలుగోసారి. భారత్‌లో ఒక్క నగరంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారిత వాయు నాణ్యత ప్రమాణాలు( క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు) లేవని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్– 2021 తెలిపింది. జాబితా తయారీకి 117 దేశాల్లోని 6,475 నగరాల్లో వాయు నాణ్యత (పీఎం 2.5– పర్టిక్యులేట్ మాటర్ 2.5 స్థాయి)ను సంస్థ పరిశీలించింది. కలుషిత రాజధానుల్లో ఢిల్లీ తర్వాత ఢాకా (బంగ్లాదేశ్), జమేనా (చాడ్ రిపబ్లిక్), దుషంబె (తజికిస్తాన్), మస్కట్ (ఒమన్) నిలిచాయి. ఢిల్లీ పీఎం 2.5 స్థాయి క్రితంతో పోలిస్తే 14.6 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఢిల్లీ గాలిలో కాలుష్య స్థాయి క్యూబిక్ మీటర్‌కు 96.4 మైక్రోగ్రాములుగా నమోదైంది. భారత్ సరాసరి వార్షిక పీఎం 2.5 స్థాయి 2021లో క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రో గ్రాములకు చేరిందని నివేదిక తెలిపింది. కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో దేశ వాయునాణ్యత మెరుగైందని, కానీ 2021కల్లా వాయు నాణ్యత తిరిగి 2019 స్థాయికి పడిపోయిందని పేర్కొంది. దేశంలో 48 శాతం నగరాల్లో వాయు నాణ్యత క్యూబిక్ మీటర్‌కు 50 మైక్రో గ్రాములను దాటిందని తెలిపింది. చదవండి: (రసాయన దాడి ఖాయం: బైడెన్) పది మనవే.. ప్రపంచ టాప్ 15 కలుషిత నగరాల్లో పది నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా రాజస్తాన్‌లోని భివాడీ నగరం నిలిచింది. ఈ నగరంలో పీఎం 2.5 స్థాయి 106.2 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. తర్వాత స్థానాల్లో యూపీకి చెందిన ఘజియాబాద్, చైనాకు చెందిన హోటాన్, ఢిల్లీ, జాన్పూర్, పాక్‌లోని ఫైసలాబాద్ నిలిచాయి. దేశాల వారీగా చూస్తే అత్యంత కాలుష్య దేశంగా పీఎం 2.5 స్థాయి 76.9 మైక్రోగ్రామ్/క్యూబిక్‌మీటర్‌తో బంగ్లాదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో చాడ్, పాక్, తజికిస్తాన్, ఇండియా ఉన్నాయి. వాయుకాలుష్యం శ్వాసకోశ ఇబ్బందులు, అలెర్జీల నుంచి క్యాన్సర్ తదితరాలకు దారితీస్తుంది. చదవండి: (మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!) నాలుగో స్థానంలో హైదరాబాద్ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక 2021 ప్రకారం భారత్‌లో అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. నగరంలో పీఎం 2.5 స్థాయిలు 2020లో క్యూబిక్ మీటర్‌కు 34.7 మైక్రోగ్రామ్ ఉండగా, 2021కి 39.4కు పెరిగినట్లు నివేదిక తెలిపింది. నగరంలో వాయు కాలుష్యం పెరుగుదలకు ప్రత్యేక కారణాలను నివేదిక పేర్కొనలేదు. కానీ పెరుగుతున్న వాహన విక్రయాలు కాలుష్య పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో అధికారిక లెక్కల ప్రకారం 60 లక్షల వాహనాలున్నాయి. ఈ నివేదిక ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని గ్రీన్ పీస్ ఇండియా సంస్థ మేనేజర్ అవినాశ్ వ్యాఖ్యానించారు. దేశీయ వాహన విక్రయాలు పెరుగుతూ పోతున్న తరుణంలో దేశ వాయు నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేవలం 3 శాతం నగరాలు మాత్రమే డబ్లు్యహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా వాయునాణ్యతతో ఉన్నాయని నివేదిక తెలిపింది. దేశాల వారీగా చూస్తే ఏ ఒక్క దేశంలో కూడా వాయు నాణ్యత నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. -
ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే పిటిషన్ల అవసరం ఉండదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్), ఢిల్లీలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో ‘ఎన్సీఆర్, పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. రాజధానిలో గాలి నాణ్యతను పెంచేలా ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయస్థానం వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా విచారణ జరిపింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించినందుకు ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు తమను(న్యాయమూర్తులు) విలన్‌గా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం కేసును మూసివేయబోమని స్పష్టం చేసింది. కాలుష్యం కట్టడికి ప్రభుత్వాలు చేపట్టే చర్యలను పర్యవేక్షిస్తూనే ఉంటామని తేల్చిచెప్పింది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను ఆసుపత్రులను సిద్ధం చేయడానికి వీలుగా నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఐదుగురు సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. తాము సూచించిన చర్యల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. -
కాలుష్యంపై ఏం చేస్తారో చెప్పండి?: సుప్రీం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)–ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియాపరత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని అరికట్టడానికి ఏం చేస్తారో చెప్పాలని పేర్కొంది. 24 గంటల్లోగా పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమైతే తామే అసాధారణ చర్యలకు పూనుకుంటామని తేల్చిచెప్పింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో గాలి నాణ్యతను పెంచాలని, పరిసర రాష్ట్రాల రైతులకు పంట వ్యర్థాలను నిర్మూలించే యంత్రాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పర్యావరణవేత్త ఆదిత్య దూబే, న్యాయ విద్యార్థి అమన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కాలుష్యం స్థాయిలు పడిపోయేలా కఠిన చర్యలు చేపడతారని తాము ఆశిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమం ‘రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్’పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలు ష్యంపై ప్రచారం పేరిట బ్యానర్లు చేతికి ఇచ్చి చిన్నపిల్లలను రోడ్లపై నిలబెడుతున్నారని, వారి ఆరో గ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. ఢిల్లీలో నేటినుంచి స్కూళ్లు మూసివేత దేశ రాజధానిలో అన్ని పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని వెల్లడించింది. ఢిల్లీ పాఠశాలల్లో భౌతికంగా తరగతులు నిర్వహిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ప్రతిస్పందించింది. -
కుంటి సాకులు చెప్పొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడంలో అత్యవసర చర్యలు తీసుకోనందుకు, మున్సిపల్ కార్పొరేషన్లపై నెపం వేసేందుకు యత్నించినందుకు ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంటి సాకులు చెబితే ఆదాయం, పాపులారిటీ స్లోగన్ల ఖర్చులపై ఆడిట్‌కు ఆదేశిస్తామని ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం రైతులు పంట వ్యర్థాలు దహనం చేయడం వల్ల కాదని నిర్ధారణకు వచ్చింది. ప్రతివాదుల అఫిడవిట్ల పరిశీలన తర్వాత వాయుకాలుష్యానికి నిర్మాణ కార్యకలాపాలు, పరిశ్రమలు, రవాణా, వాహనాల రాకపోకలతోపాటు అక్కడక్కడ పంట వ్యర్థాలు కాల్చడమనే నిర్ధారణకు వచ్చామని పేర్కొంది. ఎయిర్‌క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నియంత్రణ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కారకాల నియంత్రణకు ఏయే చర్యలు తీసుకోబోతున్నారో కచ్చితంగా సూచించలేదని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో కొంతకాలం వర్క్‌ఫ్రమ్ హోం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పంజాబ్, యూపీ, హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మంగళవారం సమావేశం కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఢిల్లీకి చెందిన విద్యార్థి ఆదిత్య దూబే దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం సోమవారం అత్యవసర విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పంట వ్యర్థాలు కాల్చడానికి సంబంధించి పంజాబ్‌లో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరిపైనా కేసులు పెట్టడం లేదని పేర్కొన్నారు. భవన నిర్మాణాలను నిలుపుదల చేయలేదని తెలిపారు. సొలిసిటర్ జనరల్ అందజేసిన నివేదిక కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పార్కింగ్ రుసుము 4 రెట్లు పెంచాలని, బహిరంగంగా వ్యర్థాలు తగులబెట్టకుండా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేశారు. పంట వ్యర్థాల వల్ల వచ్చే కాలుష్యం ప్రధాన సమస్య కాదని అంగీకరిస్తున్నారా... ఢిల్లీకి రాకపోకలు మొత్తంగా నిషేధిస్తారా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. పరిశ్రమలు, రవాణా, దుమ్ము కారణంగానే 75 శాతం వాయు కాలుష్యం వస్తోందని అఫిడవిట్లో పేర్కొన్నారని ఆ దిశగా నియంత్రణ ఆలోచించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. బుధవారానికల్లా ఏయే చర్యలు తీసుకున్నారో తెలపాలని సూచించారు. -
Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు!
ఏ వింత వ్యాధినైనా ముందుగా చైనా నాంది పలుకుతోంది. అది అపోహకాదని ఇటీవల వెలుగుచూసిన కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత కాలుష్యం చైనాలో ఉందట. ఈ కింది ఫొటోలు చూస్తే మీకేతెలుస్తుంది. విపరీతమైన కాలుష్యకోరల్లో చిక్కుకున్న ఓ నదిలో తేలియాడుతున్న బారీ చేప కళేబరంఇది. కేవలం చేపలేకాదు సమస్త జీవాలన్నీ ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న చేపలన్నీ కేవలం కాలుష్యం మూలంగానే మరణించాయి. ఈ రైతు ముఖంలో వేదన ఈ ఫొటోలో క్లియర్‌గా చూడొచ్చు. మూడింట రెండు వంతుల చైనాలోని నగరాలు వాయు ఉద్గార ప్రమాణాలను పాటించడం లేదు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలు అక్రమంగా జియాన్హే నదిలో విడుదల చేయడం వల్ల పూర్తిగా కాలుష్యమై నీరు ఎర్రగా మారిపోయిన చిత్రమిది. ఝుగావో సిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న నది ఇది. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త వేయడానికి చోటు ఎక్కడా లేకపోవడంతో ఆచెత్తంతా నదిలో కలుస్తుంది. చైనాలోని 560 మిలియన్ పట్టణ వాసుల్లో కేవలం 1% మంది మాత్రమే యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. చాలా సార్లు విపరీతమైన వాయు కాలుష్యంమూలంగా స్కూళ్లు, ఆఫీసులకు సెలవు కూడా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! ఫుయువాన్ నదిలోని కాలుష్య నీటిని తాగుతున్న చిన్నారి. చైనాలో అందుబాటులో ఉన్న నీటి వనరులన్నింటినీ 2030నాటికల్లా అక్కడి ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తిగా నాశనం చేయనున్నాయి. సముద్రంలోకి విడుదలౌతున్న ఉద్ఘారాలను అక్కడి ప్రజలు నిత్యం చూస్తూనే ఉన్నారు. గత జనవరి 12న అక్కడి వాయు నాణ్యతను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా కొలవలేకపోయింది. ప్రతి ఏటా 7 లక్షల 50 వేల మంది కేవలం వాయుకాలుష్యం మూలంగానే మరణిస్తున్నారు. 2010 లో ఒక చమురు నిల్వ కేంద్రంలో సంభవించిన పేలుడు వల్ల దాదాపు 400 మిలియన్ గ్యాలన్ల చమురు లీక్ అయ్యింది. అది మెక్సికోలో సంభవించిన బీజీ ఆయిల్ స్పిల్ కంటే 4 రెట్లు ఎక్కువ. కాలుష్యం వల్ల 2012లో 2,589 మంది బీజింగ్ ప్రజలు మరణించారు. ఇప్పటికే 90% చైనా భూగర్భజలాలు కలుషితమైపోయాయి. ప్రపంచంలోనే 30 అత్యంత కలుషిత నగరాల్లో 20 నగరాలు చైనాకు చెందినవే. ప్రపంచంలోని సగం బొగ్గును చైనానే వినియోగిస్తోంది. 2030 నాటికల్లా చైనా విడుదల చేసే కార్భన్డైఆక్సైడ్ ప్రపంచం మొత్తం కాలుష్యంతో సమానమౌతుందని ఒక అంచనా. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
సిటీ పొల్యూషన్‌కి మంచి సొల్యూషన్ ‘లివింగ్ ల్యాబ్’
సాక్షి, రాయదుర్గం(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరమైంది. అభివృద్ధి మంచిదే. కానీ అభివృద్ధితోపాటు వృద్ధి చెం దుతున్న కాలుష్యం నగర జీవితాలను ఆందోళనలోకి నెట్టేస్తుంది. నగరాల్లోని గాలి నాణ్యత అక్కడి ప్రజల జీవన నాణ్యతను తెలియజేస్తుందంటారు. ఢిల్లీ లాంటి మహా నగరాలలాగా కాదు.. హైదరాబాద్ గాలిలో విషపూరిత వాయువులు అధికమయ్యాయి. వీటి నంచి బయటపడేందుకు గాలితోపాటు నీరు, విద్యుత్‌ను కాపాడుకోవడాకి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఓ వినూత్న ఆలోచన చేసింది. అదే క్యాంపస్ లో స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు. 2019 నుంచి ఈ లివింగ్ ల్యాబ్ పర్యవేక్షణలో ఉన్నది ట్రిపుల్ ఐటీ క్యాంపస్. యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ), ఆమ్స్టర్డామ్ ఇన్నోవేషన్ ఎరీనా (ఏఐఏ), అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, తెలం గాణ ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలిస్తున్నవి. లివింగ్ ల్యాబ్ ఎలా పనిచేస్తుందంటే.. ► గాలి నాణ్యత మాత్రమే కాదు... నీటి నిర్వహణ, విద్యుత్ వినియోగం ఎలా ఉంది? వాతావరణ పరిస్థితులు ఎలా మారుతున్నాయనే అన్ని అంశాలను ఈ లివింగ్ ల్యాబ్ పర్యవేక్షిస్తున్నది. ప్రతి 15 సెకన్లకు గాలి నాణ్యత అంచనా... ► ప్రతి పదిహేను సెకన్లకు ఓసారి గాలి నాణ్యతను లెక్కించి సర్వర్కి పంపిస్తుంది ట్రిపుల్ ఐటీలోని ల్యాబ్. వాయి వేగాన్ని, దిశను, గాలిలోని ఉష్ణోగ్రతలు, తేమను సైతం తెలుపుతుంది. నీరు వృథా కాకుండా... ► ప్రతి 4 గంటలకోసారి నీటిలోని లవణాలు, గాఢత స్థాయిలను లెక్కిస్తుంది. నీటి వృథాని నివారించడం కోసం, దుర్వినియోగం చేయకుం డా ఉండటం కోసం ఏర్పాటు చేసిన నియత్రణ పరికరాలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. వాతావరణంలో వస్తున్న మార్పులను, వర్షపా తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. విద్యుత్ వినియోగంపైనా ఓ కన్ను... ► మానవ జీవితంలో మరో నిత్యావసరం విద్యుత్. ఎంత కాపాడుకుంటే అంత మంచిది. బల్బులు, ఫ్యానులు, ఇతర పరికరాల విద్యుత్ వినియోగాన్ని, సోలార్ విద్యుత్ వినియోగ డాటాని ల్యాబ్‌లోని నోడ్స్ ప్రతి పదిహేను నిమిషాలకోసారి అందిస్తుంది. దీని ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడానికి వీలవుతుంది. ఉల్లంఘనలను పసిగడుతుంది... ► సహజవనరులను కాపాడుకోవడమే కాదు... మహమ్మారుల నుంచి రక్షించడానికీ కొన్ని పద్ధతులున్నాయి. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో మాస్కు లేకుండా తిరిగినా, ఎక్కువమంది గుమిగూడినా, భౌతికదూరం పాటించకపోయినా.. ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయో సెక్యూరిటీ కెమెరాల ద్వారా ఈ లివింగ్ ల్యాబ్ కనిపెట్టేస్తోంది. ఇలా అన్ని విభాగాల నుంచి సమాచారం ఒకే దగ్గరకు రావడంతో... అన్ని సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ చెక్ పెడుతున్నది. హైదరాబాద్‌ను రక్షించడానికి, నగర మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శక్తి వినియోగంపై నిరంతర పర్యవేక్షణ అవసరం: లీడ్ ఆర్కిటెక్ట్ అనురాధ ఈ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు వల్ల గాలి, నీరు నాణ్యత, విద్యుత్ వినియోగం మాత్రమే కాదు... కోవిడ్ నిబంధలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా క్యాంపస్‌లో కోవిడ్–19 వ్యాప్తిని అదుపులో ఉంచగలిగాం. లివింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో అంతర్జాతీయ విలువలు కలిగిన ఓఎం2ఎం ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నాం. ఐయూడీఎక్స్తో కలిసి బలమైన ప్లాట్‌ఫామ్ ఏర్పాటు: పరిశోధక విద్యార్థులు ఇది జాతీయ, ప్రపంచవ్యాప్త వినియోగంలో ఉన్న ప్లాట్పామ్. ఒక్క క్యాంపస్‌లోనే కాదు.. నగరపాలన, పౌరుల రోజువారీ సమస్యలకు ఓ చక్కని పరిష్కారం ఇది. -
లాక్డౌన్లతో పెరిగిన వాయు నాణ్యత
కరోనాతో మానవాళికి పెనుముప్పు దాపురించింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు కరోనా నివారణకు తీసుకున్న కొన్ని చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణానికి మేలు చేశాయి. ఇదే విషయాన్ని తాజాగా ఐరాస వాతావరణ ఏజెన్సీ ధృవీకరించింది. ప్రపంచంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా నివారణకు విధించిన లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు పర్యావరణపరంగా సత్ఫలితాలిచి్చనట్లు తెలిపింది. 2020 లాక్డౌన్ కాలంలో గాలిలోకి వాయుకాలుష్యకాల విడుదల భారీగా తగ్గిందని తెలిపింది. ప్రపంచ వాతావరణ సమాఖ్య(డబ్ల్యఎంఓ) తొలి ఎయిర్ క్వాలిటీ అండ్ క్లైమెట్ బులిటన్‌ను శుక్రవారం విడుదల చేసింది. గతేడాది కాలుష్యంలో తరుగుదల అంతంతమాత్రమేనని, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ నిరి్ధష్ట ప్రమాణాల కన్నా అధికంగా వాయు కాలుష్యం నమోదవుతోందని హెచ్చరించింది. కొన్ని రకాల కాలుష్యకాలు గతంలో కన్నా ఎక్కువగానే విడుదలవుతున్నాయని తెలిపింది. కరోనా లాక్‌డౌన్‌తో అనుకోని విధంగా వాయునాణ్యతా ప్రయోగం జరిగినట్లయిందని, దీనివల్ల స్థానికంగా తాత్కాలికంగా మంచి మెరుగుదల కనిపించిందని సంస్థ ప్రతినిధ/æ పెట్టెరి తాలస్ చెప్పారు. కనిపించని ప్రభావం గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, ఓజోన్‌లాంటి ప్రధాన కాలుష్యకారకాల స్థాయిలను సంస్థ తన నివేదికలో మదింపు చేసింది. సమావేశాలపై నిషేధం, బడుల మూసివేత, లాక్డౌన్ విధింపు తదితర చర్యలు చాలా ప్రభుత్వాలు చేపట్టడంతో ప్రధాన కాలుష్యకాలు అనూహ్యంగా గతేడాది తగ్గాయని విశ్లేíÙంచింది. అయితే ఈ చర్యల వల్ల ఒనగూరిన ప్రయోజనాలు తాత్కాలికమని, తిరిగి జన జీవనం మామూలు స్థాయికి రాగానే కాలుష్యకాలు తిరిగి పెరిగాయని తాలస్ తెలిపారు. పైగా లాక్డౌన్ చర్యలు కీలకమైన గ్రీన్హౌస్ వాయువుల స్థాయిలు తగ్గించలేకపోయాయని, ఇందుకు సంవత్సరాలు పడుతుందని వివరించారు. ఆ్రస్టేలియాలాంటి దేశాల్లో కార్చిచ్చు, సైబిరియాలో బయోమాస్ దగ్ధం, సహారాలో గాడ్జిల్లా ఎఫెక్ట్ వంటివి గతేడాది వాయునాణ్యతపై ప్రభావం చూపాయన్నారు. పర్యావరణంలో అనూహ్య మార్పులకు ప్రధాన కారణాల నివారణకు లాక్డౌన్ విధింపు సమాధానం కాదన్నారు. దేశాల ధోరణిలో మార్పుతోనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. -
చక్కనైన ఓ చిరుగాలి
సాక్షి, అమరావతి: కోవిడ్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక, రవాణా కాలుష్యం తగ్గడంతో గాలిలో నాణ్యత పెరిగింది. మే నెలలో అయితే చాలాచోట్ల గతం కంటే సగానికి పైగా గాలి నాణ్యత పెరగడం విశేషం. కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 చోట్ల గాలి నాణ్యతను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి. వీటినుంచి సేకరించిన తాజా గణాంకాలు గాలిలో నాణ్యత పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒక ప్రాంతంలో పీఎం 10 (పర్టిక్యులర్ మ్యాటర్), పీఎం 2.5, ఎస్వో2 (సల్ఫర్ డయాక్సైడ్), ఎన్వో2 (నైట్రోజన్ డయాక్సైడ్), 03 (ఓజోన్) వంటి పలు కాలుష్య కారకాలు గాలిలో ఎంతమేరకు ఉన్నాయనే దానిని బట్టి గాలి నాణ్యతను నిర్ధారిస్తారు. గాలి నాణ్యత సూచిక (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్–ఏక్యూఐ) 50 పాయింట్ల లోపు ఉంటే ఆ ప్రాంతంలో గాలి నాణ్యత బాగున్నట్టుగా గుర్తిస్తారు. 51 నుంచి 100 ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్టు పరిగణిస్తారు. 101 నుంచి 200 వరకూ ఉంటే ఒక మోస్తరుగా నాణ్యత ఉన్నట్టు.. 201–300 మధ్య ఉంటే నాణ్యత తక్కువ ఉన్నట్టు, 301–400 మధ్య ఉంటే బాగా తక్కువ నాణ్యత ఉన్నట్టు, 401–500 మధ్య ఉంటే గాలి నాణ్యత అసాధారణ స్థాయికి తగ్గినట్టు పరిగణిస్తారు. సాధారణంగా 200 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే ఆ ప్రాంతంలోని ప్రజలకు శ్వాసకోస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 75 నుంచి 50 పాయింట్లకు తగ్గిన ‘ఇండెక్స్’ రాష్ట్రంలో జనవరిలో సగటు గాలి నాణ్యత 75 పాయింట్లు ఉండగా.. ఫిబ్రవరిలో 72, మార్చిలో 70, ఏప్రిల్‌లో 68 పాయింట్లుగా నమోదైంది. మే నెలలో ఏకంగా 50 పాయింట్లకు తగ్గింది. విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, అమరావతి ప్రాంతాల్లో సాధారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. అమరావతిలో వాహన కాలుష్యం, మిగిలిన ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యం వల్ల గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. లాక్డౌన్ వల్ల పరిశ్రమలు మూతపడటం, వాణిజ్య కార్యకలాపాలు చాలావరకూ స్తంభించిపోవడం, రవాణా వాహనాలు రాకపోకలు తగ్గడంతో వాతావరణ కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత పెరిగింది. ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం కూడా దాదాపు తగ్గడంతో గాలి నాణ్యత పెరిగిందని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నంలో జనవరిలో 113 పాయింట్లు ఉన్న ఏక్యూఐ.. మే నెలలో 68కి చేరుకుంది. రాజమండ్రిలో జనవరిలో 120 ఉన్న ఏక్యూఐ మే నెలలో రెండు రెట్లు తగ్గి 36కి చేరింది. కాకినాడలో జనవరిలో 103 ఉన్న ఏక్యూఐ మే నెలలో 36కి.. అమరావతిలో జనవరిలో 98 ఉన్న ఏక్యూఐ మే నెలలో 36కి చేరింది. తిరుపతిలో మాత్రం స్వల్పంగా గాలి నాణ్యత తగ్గడం గమనార్హం. -
దేశ రాజధానిలో టపాసులపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దీపావళికి టపాసులు కాల్చడంతోపాటు అమ్మకాలను కూడా నిషేధిస్తున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ‘‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకొనే హక్కు ఉంది’’ అని పేర్కొన్న ఎన్జీటీ దేశ రాజధానితోపాటు గాలి నాణ్యత చాలా తక్కువగా ఉన్న నగరాల్లోనూ నిషేధాజ్ఞలు ఉంటాయని పేర్కొంది. ఈ నిబంధనలు సోమవారం అర్ధరాత్రి నుంచి నవంబర్ 30 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని తెలిపింది. గాలి నాణ్యత మోడరేట్ నుంచి కింది స్థాయి ఉన్న నగరాల్లో హరిత క్రాకర్స్‌కు అనుమతిచ్చింది. టపాసులు కాల్చడం ద్వారా దేశ రాజధాని ప్రాంతంలో వచ్చే కాలుష్యంపై నివారణ చర్యలు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఆదేశాల్లో ముఖ్యాంశాలు ► దేశరాజధాని పరిధిలో ఈనెల 9 అర్ధరాత్రి నుంచి 30 అర్ధరాత్రి వరకు అన్ని రకాల క్రాకర్స్ అమ్మకం, కాల్చడంపై నిషేధం విధించడం. ► గతేడాది నవంబర్‌లో గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా గాలి నాణ్యత పూర్ ఆపై స్థాయి ఉన్న అన్ని నగరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ► గాలి నాణ్యత మోడరేట్ అంతకన్నా తక్కువస్థాయి ఉన్న నగరాల్లో దీపావళి, ఛట్, క్రిస్మస్, న్యూఈయర్ సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ నిబంధనల ప్రకారం కేవలం 2 గంటలపాటు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు. టపాసులు నో.. చిచ్చుబుడ్లు ఓకే టపాసుల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు శివసేన నాయకత్వంలోని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. తక్కువ కాలుష్యం విడుదల చేసే టపాకాయలను, చిచ్చుబుడ్లను ఇళ్ళవద్ద కాల్చవచ్చునని బీఎంసీ తెలిపింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బీఎంసీ తెలిపింది. -
లాక్డౌన్: ఊపిరొచ్చింది!
పరిశ్రమలు, వాహనాల కాలుష్యంతో పల్లెల నుంచి పట్టణాల వరకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణం. ప్రాణాంతకంగా పరిణవిుంచిన కాలుష్యానికి కరోనా నుంచి ఉపశమనం లభించింది. లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు మూతపడ్డాయి. వాహనాల్లో 80 శాతం నడవని పరిస్థితి. దీంతో నెల్లూరు నగర పరిధిలో వాయు కాలుష్యం సగానికి సగం తగ్గినట్లు కాలుష్య నియంత్రణ శాఖ నిర్వహించిన పరీక్షల్లో తేలింది. స్వేచ్ఛమైన వాయువులతో ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగు కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాక్షి, నెల్లూరు: స్వచ్ఛమైన గాలితో నెల్లూరు ఊపిరి పీల్చుకుంటోంది. నెల్లూరుకు చుట్టు పక్కల రైస్‌మిల్లులు, థర్మల్ ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర కాలుష్యకారక పరిశ్రమలు, లక్షల సంఖ్యలో వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యేవారు. గత నెల 22వ తేదీ నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ఈ పరిస్థితి మారింది. పరిశ్రమలన్నీ మూతపడడం, చాలా పరిమిత సంఖ్యలో తిరిగే వాహనాల కారణంగా కాలుష్యం అదుపులోకి వచ్చింది. ఫలితంగా నగర వాసులకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో వాహనాలు వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. వాహనాలు ఎక్కువయ్యే కొద్దీ వాటి నుంచి ఉద్గారాలు అధిక పరిమాణంలో విడుదల అవుతాయి. దీని వల్ల దుమ్ము ధూళి, రసాయన అవశేషాలు ఊపిరి తిత్తుల్లోకి వెళ్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమయ్యేది. నెల్లూరు నగరంలో ఇలా.. నెల్లూరు జనాభా 2004లో చూస్తే 4,04,775 మంది ఉండగా 2009 ఏడాదికి 5,58,547 లక్షల మందికి చేరుకున్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతూనే వస్తోంది. నాలుగేళ్ల వ్యవధిలోనే రవాణా వాహనాల సంఖ్య దాదాపు లక్షకు పైగా చేరుకొంది. అందులో ద్విచక్ర వాహనాలు 92,941 వరకు సంఖ్య చేరుకుంది. కార్లు వినియోగం 15,987 వరకు చేరుకున్నాయి ఇక ఆటోల సంఖ్య 25,413 వరకు చేరుకున్నాయి. దీంతో నగర జనాభాలో సగం వాహనాలు అయ్యాయి. కొన్నేళ్లలో జనాభా సంఖ్యను దాటనుందని ఇటీవల జరిపిన పలు సర్వేల్లో తేలింది. పెరిగిన కాలుష్యం పెరుగుతున్న వాహన వినియోగంతో గాలిలో దూళి కణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధాన కూడళ్లలో 10 మైక్రో గ్రాములు ఉండాల్సిన సూక్ష్మ ధూళి కణాలు 60, 2.5 మైక్రో గ్రాముల్లో ఉండాల్సిన అతి సూక్ష్మ ధూళి కణాలు 40 చేరింది. గాలిలో సన్నటి ధూళిని ఈ ప్రమాణం సూచిస్తుంది. వాహనాల రద్దీ ఎక్కువయ్యే కొద్దీ ఈ గణాంకాలు పరిమితిని దాటి నమోదవుతున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి కూడా కాలుష్యం వెలువడుతోంది. గత నెల 22 నుంచి అంతటా లాక్డౌన్ అమలవుతోంది. సడలించిన సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో జనసంచారంపై నిషేధం ఉంది. పరిశ్రమలు కూడా మూత పడ్డాయి. దీంతో కాలుష్యం బాగా తగ్గింది. పరిమితి దాటితే చేటు పాత వాహనాల నుంచి విడుదల అయ్యే పొగలో నల్లటి ధూళి కణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ శ్వాస కోశ వ్యాధులు వస్తున్నాయని బయటకు వస్తే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు కంటికి కనిపించనంతగా ఉంటాయి. మనిషి వెంట్రుక కన్నా సూక్ష్మంగా ఉంటాయి. లాక్డౌన్ వల్ల వాహనాల రాకపోకలు ఆగాయి. దీని వల్ల రోడ్ల పక్కన ఉండే దుమ్ము, ధూళి లేచి గాలిలో కలవడం లేదు.