alerts
-
యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!
యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న వారికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హైరిస్క్ అలర్ట్‌లు పంపుతోంది. అవుట్‌డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న ఐఫోన్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లు వంటి ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. దాంతో ఆయా వినియోగదారులకు హైరిస్క్ అలర్టులు పంపుతున్నట్లు స్పష్టం చేసింది.పాత సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న యాపిల్ డివైజ్‌ల్లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అడ్వైజరీని విడుదల చేసింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు, సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడేవారు వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. డేటా మానిప్యులేషన్‌కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. తాజా సెక్యూరిటీ అప్డేట్లో ఆపిల్ ఈ లోపాలను పరిష్కరించింది. సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి, భద్రతా ఉల్లంఘనల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు తమ డివైజ్‌ల్లో తాజా సాఫ్ట్వేర్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని CERT-In సిఫార్సు చేసింది.ఇదీ చదవండి: తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!ఐఓఎస్ 18.1 లేదా 17.7.1 కంటే ముందున్న సాఫ్ట్వేర్ వెర్షన్లను వినియోగిస్తున్న యాపిల్ కస్టమర్లు వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. వాచ్ఓఎస్, టీవీఓఎస్, విజన్ ఓఎస్, సఫారి బ్రౌజర్ వంటి పాత వెర్షన్లపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. కాబట్టి ఆయా వినియోగదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. -
మరో 25 విమానాలకు బాంబు బెదిరింపు
ముంబై/న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశీయ విమానయాన సంస్థలకు చెందిన 25 సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు అందాయి. దీంతో, ఈ వారంలో ఇప్పటి వరకు విమానాలకు అందిన బాంబు బెదిరింపుల సంఖ్య 90 దాటింది. అయితే ఇవన్నీ వట్టివేనని తేలిందని అధికారులు వివరించారు. ఆదివారం హెచ్చరికలు అందిన వాటిలో ఇండిగో, విస్తార, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా విమానాలున్నాయి. తమ జెడ్డా–ముంబై, కోజికోడ్–దమ్మమ్, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, పుణె–జోధ్‌పూర్ సర్వీసులకు ఆన్లైన్లో బెదిరింపులొచ్చాయని ఇండిగో తెలిపింది. ఢిల్లీ–ఫ్రాంక్ఫర్ట్, సింగపూర్–ముంబై, బాలి–ఢిల్లీ, సింగపూర్–ఢిల్లీ, సింగపూర్–పుణె విమానాలకు బెదిరింపులందాయని విస్తార వెల్లడించింది. అహ్మదాబాద్–ముంబై, ఢిల్లీ–గోవా, ముంబై–బగ్డోగ్రా, ఢిల్లీ–హైదరాబాద్, కొచ్చి–ముంబై, లక్నో–ముంబై విమాన సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆన్లైన్లో వచ్చాయని ఆకాశ ఎయిర్ వివరించింది. అదేవిధంగా, ఎయిరిండియాకు చెందిన ఏడు విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిపై ఆ సంస్థ స్పందించలేదు. -
అలర్ట్‌లకు అర్థం తెలుసా?
రోజూ చూస్తూనే ఉన్నాం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని.. ఇంతకీ వాటి అర్థం ఏంటో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. గ్రీన్ అలర్ట్ఏదైనా ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 6.4 సెం.మీ. కన్నా తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతావరణ అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణ పరిస్థితుల్లో రాబోయే మార్పుల గురించి గ్రీన్ అలర్ట్ తెలియజేస్తుంది. అయితే ఈ అలర్ట్ కింద ప్రజలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉండదు.ఎల్లో అలర్ట్ఒక నిరీ్ణత ప్రదేశంలో 6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. మధ్య వర్షం కురిసే అవకాశం ఉందన్న అంచనాతో దీన్ని జారీ చేస్తారు. ఈ అలర్ట్ జారీ చేశారంటే ప్రస్తుత వాతావరణం కాస్త ప్రతికూలంగా మారుతుందని అర్థం. 30–40 కి.మీ. వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్ ఇస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని అధికార యంత్రాంగానికి సూచిస్తారు.ఆరెంజ్ అలర్ట్24 గంటల వ్యవధిలో 11.56 సెం.మీ. నుంచి 20.44 సెం.మీ. మధ్య వర్షం కురవొచ్చన్న అంచనాతో ఆరెంజ్అలర్ట్ను ఐఎండీ జారీ చేస్తుంది. 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్‌ను విడుదల చేస్తుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిందంటే రవాణా సరీ్వసులపై ప్రతికూల వాతావరణం ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అర్థం.రెడ్ అలర్ట్24 గంటల వ్యవధిలో ఒక ప్రాంతంలో 20.45 సెం.మీ.కుపైగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను రెడ్ అలర్ట్ సూచిస్తుంది. రవాణా, విద్యుత్ సేవలకు అవాంతరాలు ఎదురవడంతోపాటు ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. గరిష్టంగా ఐదు రోజులపాటు ఆయా అలర్ట్‌లకు సంబంధించిన హెచ్చరికలు అమల్లో ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రేపటి నుంచి ఈ బ్యాంక్ అలర్ట్స్ బంద్.. కానీ ఇలా చేస్తే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ పేమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ 25 నుంచి రూ .100 లోపు విలువైన యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడం నిలిపివేయనుంది.జూన్ 25 నుంచి రూ.100 లకు పైబడిన చెల్లింపులు, రూ.500 లకు మించి అందుకున్న లావాదేవీలకు మాత్రమే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు ఉంటాయని బ్యాంక్ గతంలోనే ఖాతాదారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. అయితే, మొత్తంతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్స్ అందుకునే అవకాశం ఉంది.ఈమెయిల్ ఇన్‌స్టా అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా..నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే టాప్ బ్యానర్ పై ఉన్న ఇన్ స్టాఅలర్ట్స్ పై క్లిక్ చేసి సూచనలను పాటించండి.మొబైల్ యాప్ ద్వారా అయితే మెనూకు వెళ్లి మీ ప్రొఫైల్ ఎంచుకోండి. మేనేజ్ అలర్ట్స్ పై క్లిక్ చేయండిఇన్స్టా అలర్ట్స్ డీయాక్టివేట్ చేయాలంటే..» మీ కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌తో నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అవ్వండి» పేజీలో కుడివైపు పైభాగంలో ఉన్న ఇన్‌స్టా అలర్ట్స్‌పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ డీ రిజిస్టర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్ ఎంచుకోండి.» అలర్ట్స్ రకాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ సెలెక్ట్ అయ్యాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. -
‘స్టేట్ స్పాన్సర్డ్ అటాక్’ వివాదం.. యాపిల్ స్పందన ఇదే..
పలువురు లోక్‌సభలోని ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్లు వారి ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు అలర్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పటికే త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ ప్రియాంక చతుర్వేదికు అలర్ట్‌లు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన మెసేజ్‌లను తమ ఎక్స్ ఖాతాద్వారా ప్రముఖులు పంచుకున్నారు. ఈ అలర్ట్‌లను ఉద్దేశించి యాపిల్ స్పందించింది. స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ నోటిఫికేషన్లు కొన్నిసార్లు తప్పుడు అలారాలు కావచ్చని యాపిల్ చెప్పింది. అలా అటాక్ చేసేవారి వద్ద అధునాతన టెక్నాలజీ ఉంటుందని పేర్కొంది. దాంతో వారు ఎలాంటి దాడికైనా పాల్పడే అవకాశం ఉందని చెప్పింది. అయితే అలా వస్తున్న అలర్ట్‌ల్లో కొన్ని తప్పుడు నోటిఫికేషన్లు ఉండవచ్చని యాపిల్ వివరించింది. ఈ నోటిఫికేషన్ల జారీకి గల కారణాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ నిరాకరించింది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడిస్తే భవిష్యత్తులో దాడిచేసే వారిని గుర్తించకుండా తప్పించుకోవడానికి సహాయపడినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది. -
ఆండ్రాయిడ్ ఫోన్లలో భూకంప హెచ్చరికలు!
న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు వారు ఉంటున్న ప్రాంతంలో సంభవించబోయే భూకంపానికి సంబంధించిన తక్షణ సమాచారాన్ని అలర్ట్‌ల రూపంలో గూగుల్ అందించనుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో ‘ఎర్త్‌క్వేక్ అలర్ట్’ సందేశ సేవలను ప్రారంభించనుంది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ), జాతీయ భూకంప కేంద్రాల సమన్వయంతో కొత్తగా ‘ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్’ను భారత్‌లో మొదలుపెట్టనుంది. ‘యూజర్లు ఉంటున్న ప్రాంతంలో ఒకచోట భూకంపం వస్తే దానికి పసిగట్టి వెంటనే ఆ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అలర్ట్‌లు మెరుపువేగంతో వెళతాయి’ అని గూగుల్ బుధవారం ఒక బ్లాగ్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్ 5, ఆపై అప్డేటెడ్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఇన్స్టాల్ అయిన ఫోన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వారి కోసం పేటీఎం ‘సౌండ్ బ్యాక్స్’ లాంచ్, ధర ఎంతంటే?
చెల్లింపు సేవా సంస్థ పేటీఎం తన వినియోగదారులకు తీపి కబురు అందించింది. ముఖ్యంగా తన ప్లాట్‌ఫాంలో చిన్న వ్యాపారుల డిజిటల్ చెల్లింపుల కోసం సౌండ్ బాక్స్ ను లాంచ్ చేసింది. డిఫాల్ట్ గా వచ్చే'ట్యాప్ అండ్ పే' ఫీచర్‌తో ఐకానిక్ సౌండ్‌బాక్స్ ద్వారా అన్ని వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, రూపే నెట్‌వర్క్‌లలో మొబైల్, కార్డ్ చెల్లింపులను చేయవచ్చు. ఈ తరహా సౌకర్యాన్ని అందించే తొలి సంస్థ తామేనని పేటీఎం ప్రకటించింది. 999 రూపాయల (12.08డాలర్లు) 'కార్డ్ సౌండ్‌బాక్స్' ను లాంచ్ చేసింది. దీని ద్వారా వ్యాపారులు రూ.5,000 వరకు కార్డ్ చెల్లింపులను ఆమోదించగలరు. మేడ్ ఇన్ ఇండియా డివైస్ 4G నెట్వర్క్ కనెక్టివిటీతో వేగవంతమైన పేమెంట్స్ అలర్ట్స్ అందిస్తుంది. తమ సౌండ్‌బాక్స్ లేదా మొబైల్ చెల్లింపులతో కాంటాక్ట్‌లెస్ డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కలపడం ద్వారా వ్యాపారులకు చెల్లింపుల సౌలభ్యాన్ని విస్తరించడం ద్వారా డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతం లభిస్తుందని తెలిపింది. పేటీఎం క్యూఆర్ కోడ్‌తో మొబైల్ చెల్లింపుల మాదిరిగానే వ్యాపారులు, వినియోగదారులకు కార్డ్ ఆమోదం అవసరమని, పేటీఎం సరికొత్త సౌండ్‌బాక్స్ ద్వారా కస్టమర్‌కు LCD డిస్ప్లే ద్వారా ఆడియో, దృశ్య చెల్లింపు నిర్ధారణ రెండింటినీ అందిస్తుంది. విభిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ డివైస్ 11 భాషల్లో హెచ్చరికలను అందిస్తుందని, వీటిని వ్యాపారి Paytm ఫర్ బిజినెస్ యాప్ ద్వారా మార్చుకోవచ్చని పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. చెల్లింపు సేవలు, ఆర్థిక సేవల సమస్యల్ని పరిష్కరించడంలో Paytm కార్డ్ సౌండ్‌బాక్స్ మరో ముందడుగు అని చెప్పారు. ట్యాప్ ఫీచర్‌ని ఉపయోగించి వారి ఫోన్ల ద్వారా కూడా చెల్లింపులు చేసుకో వచ్చన్నారు. India’s first Soundbox with Card Payments is here! 🚀 With contactless payments and long lasting 5 day battery, we are proud to be back with yet another pioneering device to drive in-store payments!#Paytm #PaytmKaro #PaytmSeUPI pic.twitter.com/taP5JmXCd2 — Paytm (@Paytm) September 4, 2023 Paytm కార్డ్ సౌండ్‌బాక్స్ చిన్న వ్యాపారులు కాంటాక్ట్‌లెస్ కార్డ్ చెల్లింపులను సులభంగా ఆమోదించడం ద్వారా వారి కస్టమర్లకు అంతరాయం లేని డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని అందించడానికి వీలు కల్పించే మరో ఆవిష్కరణ అన్నారు మాస్టర్‌కార్డ్, దక్షిణాసియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్. ప్రతి లావాదేవీని ప్రత్యేకంగా ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా చెల్లింపులు నష్టం లేదా నకిలీ , డబుల్ బిల్లింగ్ లాంటివి తగ్గుతాయన్నారు. Paytm కార్డ్ సౌండ్‌బాక్స్ తరహాలోనే ఇప్పటికే పైన్ ల్యాబ్స్ PhonePe వంటి కంపెనీలు సౌండ్‌బాక్స్ లాంటివాటిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
మేలో నియామకాల్లో క్షీణత
ముంబై: ఉద్యోగ నియామకాల పట్ల కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో మే నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చినప్పుడు 7 శాతం తగ్గాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఫౌండిట్ (మాన్స్టర్ ఏపీఏసీ అండ్ ఎంఈ) ‘ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్’ పేరుతో నెలవారీ నియామకాల ధోరణులపై నివేదికను విడుదల చేసింది. అహ్మదాబాద్, జైపూర్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం నియామకాల పరంగా సానుకూల ధోరణులు కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లో నియామకాల క్షీణత కనిపిస్తోందని, నెలవారీగా చూస్తే మేలో 4 శాతం తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఆర్థిక వృద్ధి నిదానించడంతో వ్యయాలు తగ్గించుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడం నియామకాలు తగ్గడానికి కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. నైపుణ్యాల అంతరం ఉండడంతో, అర్హత కలిగిన ఉద్యోగులను గుర్తించడం కంపెనీలకు సవాలుగా మారినట్టు పేర్కొంది. విప్లవాత్మక టెక్నాలజీల పాత్రను కూడా ప్రస్తావించింది. ఇవి పరిశ్రమలు, ఉద్యోగ స్వరూపాలను మార్చివేస్తున్నట్టు తెలిపింది. ఆటోమేషన్ తదితర టెక్నాలజీల ప్రభావం ఉద్యోగ నియామకాలపై పడుతున్నట్టు వివరించింది. కొత్త నైపుణ్యాలతోనే రాణింపు..: ‘‘ప్రస్తుత నియామక ధోరణలు భారత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లకు నిదర్శనం. ఈ సవాళ్ల మధ్య ఉద్యోగార్థులకు అవకాశాలను అందించే వృద్ధి విభాగాలు కూడా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో షిప్పింగ్/మెరైన్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు, రిటైల్, రవాణా, పర్యాటక విభాగాల్లో నియామకాలు పెరిగాయి. సమీప కాలానికి సవాళ్లతో కనిపిస్తున్నా, ఆర్థిక వృద్ధి బలపడితే అన్ని రంగాల్లోనూ నియామకాలు తిరిగి పుంజుకుంటాయి. నేడు డిమాండ్ ఉన్న నైపుణ్యాలు, భవిష్యత్తులోనూ రాణిస్తాయని చెప్పలేం. కనుక ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, నూతన నైపుణ్యాలను అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీశ తెలిపారు. ఆన్లైన్లో వివిధ ని యామక పోర్టళ్లలోని వివరాల ఆధారంగా నెలవారీగా ఈ నివేదికను ఫౌండిట్ విడుదల చేస్తుంటుంది. హైదరాబాద్‌లోనూ డౌన్ హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ/ఎన్సీఆర్ పట్టణాల్లో మే నెలలో నియామకాలు, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 –16 శాతం తక్కువగా నమోదైనట్టు ఫౌండిట్ తెలిపింది. అహ్మదాబాద్‌లో 8 శాతం పెరగ్గా, బెంగళూరులో 24 శాతం తగ్గాయి. -
నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత
-
యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గత కొన్నేళ్లుగా యూజర్ల ప్రాణాల్ని కాపాడేలా క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌తో ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ ఆల్ట్రాలలో ఈ లేటెస్ట్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆ ఫీచరే ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అదెలా అంటారా? రెడ్డిట్ పోస్ట్ ప్రకారం..ఐఫోన్ 14 క్రాష్ డిటెక్షన్ ఫీచర్ భార్య రోడ్డు ప్రమాదానికి గురైందంటూ భర్తను అప్రమత్తం చేసింది. అంతేకాదు యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అడ్రస్ చెప్పి భర్తను అలెర్ట్ చేయడంతో అంబులెన్స్ కంటే ముందే వెళ్లి ఘటన స్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న భార్యను ఆస్పత్రికి తరలించి ప్రాణం కాపాడుకున్నాడు. ఈ సందర్భంగా భర్త తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. నేను ఆఫీస్ పని మీద క్లయింట్‌ను కలిసిందేకు వెళ్తున్నాను. అదే సమయంలో దుకాణం నుంచి ఇంటికి వెళ్తున్న నా భార్య ఫోన్ చేస్తే..ఆమెతో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతుండగానే నా భార్య గట్టిగా కేకలు వేసింది. సెకన్ల వ్యవధిలో ఆమె ఫోన్ పని చేయడం ఆగిపోయింది. ఏమైందోనని కంగారుగా బయలు దేరుతుండగా అప్పుడే ఓ మెసేజ్ వచ్చింది. మీ భార్యకు యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం ఈ ప్రాంతంలో జరిగిందంటూ అడ్రస్ సైతం ఆ మెసేజ్‌లో ఉంది. అంబులెన్స్ కంటే ముందు ఆ ప్రదేశానికి వెళ్లాను. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి నా భార్యను కాపాడుకోగలిగాను అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. -
ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఈ సేవలు బంద్!
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ YES Bank (యస్ బ్యాంక్) కీలక ప్రకటన చేసింది. ఇకపై సబ్స్క్రిప్షన్ ఆధారిత ఎస్ఎంఎస్ (SMS) బ్యాలెన్స్ అలర్ట్ సేవలను నిలిపివస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ నుంచి తప్పనిసరి అలర్ట్స్ (Mandatory Alerts)మాత్రం యథావిధిగా వస్తాయని తెలిపింది. కాగా బ్యాంక్ ఈ తప్పనిసరి అలర్ట్‌తో పాటు, సబ్స్క్రిప్షన్ ఆధారిత ఎస్ఎంఎస్ అలర్ట్ సదుపాయాన్ని గతంలో అందించేది. బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘డిసెంబరు 01, 2022 నుంచి SMS ద్వారా బ్యాలెన్స్ అలర్ట్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నాం. ఒకవేళ కస్టమర్లు ఎస్ఎంస్ అలర్ట్ ప్యాకేజీకి సబ్‌స్క్రైబ్ చేసుకుని, కస్టమర్లుకు కూడా ఈ సేవలను ఇకపై పని చేయవు. అయితే ఇదివరకు మాదిరిగానే తప్పనిసరి అలర్ట్స్ మాత్రం మాత్రం వస్తాయని’ స్పష్టం చేసింది. అయితే కస్టమర్లు తమ బ్యాలెన్స్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకోవచ్చని తెలుపుతూ.. అందుకోసం యస్ మొబైల్, యస్ ఆన్లైన్, యస్ రోబోట్ వంటి ఆన్లైన్ సౌకర్యాలను ఉపయోగించుకునే సదుపాయం ఉందని వెల్లడించింది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
థర్డ్ వేవ్ ముప్పు.. పండగలొస్తున్నాయ్ జాగ్రత్త
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థర్డ్ వేవ్ ముప్పు ఇంక ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త హెచ్చరికలు చేసింది. అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకమని, ఆ రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్‌్కఫోర్స్ చీఫ్ వి.కె.పాల్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది పండగల సీజన్ కావడంతో ప్రజలు గుంపులుగా తిరగడం పెరుగుతుందని తద్వారా కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, స్థానిక యంత్రాంగం ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్ అన్న మాట వాడకుండానే పాల్ కరోనా కేసులపై మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటిస్తూ, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు పలికారు. ‘అయితే దేశంలో పెద్దవాళ్లలో దాదాపుగా 62% మంది సింగిల్ డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరోనా మొదటి, రెండు వేవ్‌ల స్థాయిలో తీవ్రంగా మూడో వేవ్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా సోకితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ అయ్యే అంశంలో ప్రజలకు తగినంత అవగాహన రావడంతో మళ్లీ కరోనా కేసులు విజృంభించినా అంత ప్రమాదమేమీ ఉండడు’ అని వీకే పాల్ ధైర్యం చెప్పారు. చదవండి: ఆరోగ్యానికి కేరాఫ్ పనస ప్రస్తుతానికి బూస్టర్ డోసు ఆలోచన లేదు కోవిడ్ బూస్టర్ డోసు ఇవ్వాలన్న ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని, ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. కరోనా రెండు డోసులు ఇవ్వడాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని, దానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని అన్నారు. బూస్టర్ డోసు గురించి కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య వ్యవస్థలో ఎలాంటి చర్చ జరగడం లేదని ఆయన స్పష్టంచేశారు. -
21 వరకు అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ చేపడుతున్న సహాయక చర్యలపై ఆయన అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు, ముందస్తు వ్యూహాలు సిద్ధం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నదులు, చెరువులు, రిజర్వాయర్లు తదితర జలవనరుల వద్ద అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. -
ఖాతాదారులూ! కాస్త జాగ్రత్త!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు బ్యాంకులు, నియంత్రణ సంస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతాదారులు కూడా తమ వంతుగా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జి.పద్మనాభన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి అసలైన పోర్టల్స్, యాప్స్ అప్డేటెడ్ వెర్షన్లను ఉపయోగించడంతో పాటు పిన్ నంబర్లు లాంటివి ఎవరికీ వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే, సైబర్ సెక్యూరిటీ అనేది ఏ ఒక్క సంస్థ బాధ్యతో కాదని.. ఈ విషయంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, వివిధ ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. బుధవారమిక్కడ ఐడీఆర్బీటీలో.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీపై 15వ అంతర్జాతీయ సదస్సు (ఐసీఐఎస్‌ఎస్) ప్రారంభించిన సందర్భంగా పద్మనాభన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సు 20 దాకా జరగనుంది. అత్యధికంగా సైబర్ దాడులకు గురయ్యే దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని పద్మనాభన్ చెప్పారు. ‘‘కానీ సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండే విషయంలో మాత్రం 47వ స్థానంలో ఉన్నాం. ఆర్థిక సేవలను సులభంగా అందించేందుకు, లావాదేవీల ఖర్చు భారీగా తగ్గించేందుకు సైబర్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. సాధారణంగా నెట్‌వర్క్‌లోకి చొరబడిన వైరస్ తీవ్రత 220 రోజులకు గానీ బయటపడటం లేదు. దీన్ని మరింత ముందుగా గుర్తించగలిగితే సైబర్ దాడులను కొంతైనా నియంత్రించవచ్చు’’ అని ఆయన వివరించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(ఐడీఆర్‌బీటీ) దీనికి తగు టెక్నాలజీని రూపొందించడంపై దృష్టి పెట్టా లన్నారు. బ్యాంకింగ్ టెక్నాలజీకి సంబంధిం చి ఫిన్‌టెక్ ఎక్సే్చంజీ, 5జీ యూజ్ కేస్ ల్యాబ్ మొదలైనవి ఏర్పాటు వంటి అంశాలను ఐడీఆర్‌బీటీ డైరెక్టర్ ఏఎస్ రామశాస్త్రి వివరించారు. -
500 మంది భారతీయులకు గూగుల్ హెచ్చరికలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 12 వేల హెచ్చరికలను పంపింది. అందులో 500 మంది భారతీయులూ ఉన్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించింది. వాట్సాప్ వీడియో కాలింగ్‌లోని లోపం ద్వారా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌సాయంతో పలు దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారం హ్యాక్ చేస్తున్నారన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రభుత్వ మద్దతుదారులైన హ్యాకర్లు 270 మందిని టార్గెట్ చేసినట్లు గూగుల్ తెలిపింది. -
పిడుగుపడే సమాచారం ఇక మనచేతుల్లోనే
సాక్షి, వల్లూరు: ప్రస్తుతం వర్షా కాలం. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుని భారీ శబ్దాలతో ఉరుములు, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మెరుపులు కనిపిస్తున్నాయంటే.. దగ్గర్లో ఎక్కడో ఓ చోట పిడుగు పడే అవకాశం ఉందని భావిస్తాం. పిడుగు పడటం ప్రస్తుత కాలంలో సర్వ సాధారణంగా మారింది. ఎన్నో మూగజీవాలతోపాటు ఎందరో మనుషులు బలై ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పొలాలు, చెట్ల కింద వున్న ఉన్న వారే ఎక్కువగా గురవుతున్నట్లు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెలుస్తోంది. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ పిడుగు పాటుకు గురైతే వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రథమ చికిత్స ఎలా అందించాలి, సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం మొదలైన అంశాలపై నిపుణుల సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి. వీటిని పాటించి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించుకోవడానికి ప్రయత్నిద్దాం. పిడుగు పడే సమయంలో వచ్చే మెరుపులో ఎంతో తీవ్రమైన శక్తి దాగి ఉంటుంది. అది తాకిన మరుక్షణం జీవి ఏదైనా ప్రాణాన్ని కోల్పోవడం జరుగుతుంది. పిడుగు దాదాపుగా ఎత్తైన చెట్లు, భవనాలు, ప్రదేశాలు, వస్తువులపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎత్తు తక్కువ ఉన్న చోట కాస్త సురక్షితం. పచ్చని చెట్లను తాకే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి ఆ సమయంలో చెట్ల కింద ఉండరాదు. ఆరుబయట ఉంటే.. ఆరుబయట ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు సురక్షిత భవనాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించాలి. పొలంలో పూర్తి ఆరుబయట ఉంటే మొక్కల కన్నా మనిషి ఎక్కువ ఎత్తు ఉంటాడు.. కాబట్టి పిడుగు అతనిపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు పడేటపుడు అర చేతులతో చెవులను మూసుకుని తల వంచుకుని నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. ఇంట్లో ఉంటే.. మొబైల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యుత్‌కు అనుసంధానం చేయరాదు. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకుండా ఉండటం మంచిది. పిడుగుపాటుకు గురైతే .. పిడుగుపాటుకు గురైతే అంబులెన్స్, వైద్యులకు సమాచారం అందించాలి. బాధితుడికి ప్రథమ చికిత్స అందించాలి. పిడుగు తాకిన ప్రదేశం తడిగా ఉంటే.. దుప్పటి లాంటి వస్త్రంపై పడుకోబెట్టాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. యాప్ డౌన్ లోడ్ .. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘వీఏజేఆర్‌ఏపీఏఏటీ ’ అని టైప్ చేసి అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జియో ట్యాగింగ్ కోసం మొబైల్‌ఫోన్ నంబర్‌ను అడుగుతుంది. నంబర్‌ను ఎంటర్ చేసి భాష ఎంచుకోవాలి. యాప్ ముఖ చిత్రం కనిపిస్తుంది. లొకేషన్ సెట్ చేసుకుంటే.. మీరు ఉండే ప్రదేశంలో పిడుగు పడే అవకాశాలపై తగిన సమాచారం, సూచనలు అందిస్తుంది. యాప్ రెండు రకాల సమాచారాన్ని ఇస్తుంది. ఎడమ చేతి వైపు పిడుగు గుర్తుతో వున్న చోట క్లిక్ చేస్తే మీరున్న ప్రాంతం మ్యాప్ వస్తుంది. మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో వలయాలు కనిపిస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం పిడుగు పడే అవకాశాలను చూపిస్తుంది. పిడుగు ఎంత దూరంలో పడుతుందో.. పిన్ గుర్తు ద్వారా స్పష్టత ఇస్తుంది. యాప్ కుడి భాగంలో పిడుగు పాటు హెచ్చరికలు తెలిపే బటన్ ఉంటుంది. యాప్ ఆన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. వజ్రపాత్తో ముందస్తు సమాచారం పిడుగుపాటు వల్ల ఎదురయ్యే విపత్తును నివారించడానికి విపత్తుల నివారణ సంస్థ ఆధనిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పిడుగు పాటుకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తిస్తుంది. 30 నిమిషాల ముందుగా అధికారుల ద్వారా ఆ ప్రాంత సెల్ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లను అందిస్తుంది. దీనికి తోడు ఇటీవల ఇస్రో సహకారంతో పిడుగు పాటు గురించి ముందస్తు సమాచారం తెలుసుకోడానికి.. వజ్రపాత్ అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌తో పిడుగు ఎక్కడ పడుతుందో ముందే తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఉంటే చాలు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని.. పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని ఇట్లే తెలుసుకోవచ్చు. రంగులను బట్టి.. తీవ్రత ► మెరుపు చిహ్నం, శీర్షిక నీలం రంగులో వుంటే మీరు పిడుగు పడే స్థలానికి దూరంగా వున్నట్లు అర్థం. ► మెరుపు చిహ్నం, శీర్షిక పసుపు రంగులో వుంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 15 నుంచి 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్నట్లు లెక్క. ► మెరుపు చిహ్నం, శీర్షిక నారింజ రంగులో వుంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 8 నుంచి 15 కిలోమీటర్ల సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ► మెరుపు చిహ్నం, శీర్షిక ఎరుపు రంగులో ఉంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 0 నుంచి 8 కిలోమీటర్ల సమీపంలో వున్నట్లు.. అంటే అత్యంత ప్రమాదరకరమైన స్థలమని అర్థం. -
దేశంలోని విమానాశ్రయాలకు సెక్యూరిటీ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో దేశంలోని అన్నివిమానాశ్రయాలకు కేంద్రప్రభుత్వం శనివారం మరోసారి అలర్ట్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులతోపాటు, అన్ని విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ హెచ్చరిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతోపాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అధికారులకు భద్రతాపరమైన కఠిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా హెచ్చరించింది. పుల్వామా దాడుల తరహా దాడులు జరగవచ్చన్న ఇంటిలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టాలని ఆదేశించింది. 20రకాల ప్రత్యేకమైన భద్రతా చర్యలను తీసుకోమని కోరింది. సిబ్బంది సహా ప్రయాణీకుల బ్యాగేజీ మెరుగైన స్క్రీనింగ్, ప్రయాణికుల 100శాతం తనిఖీ, ఎయిర్‌పోర్టుల ముందు ఎలాంటి వాహనాల పార్కింగ్కుఅవకాశం లేకుండా చూడటం లాంటి భద్రతా చర్యలను మెరుగుపరచటం చాలా అత్యవసరమని పేర్కొంది. టెర్రరిస్టు వ్యతిరేక, విధ్వంసక వ్యతిరేక చర్యలు నిరోధించాలని ఆదేశించింది. అలాగే మైక్రోలైట్ విమానం, ఏరో మోడల్స్, పారా గ్లైడర్స్ మానవరహిత వైమానిక వ్యవస్థలు, డ్రోన్స్, పవర్ హ్యాంగ్ గ్లైడర్స్ , హాట్ ఎయిర్ బెలూన్స్ లాంటి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని హెచ్చరించింది. -
తమిళనాడు..‘గజ’ గజ!
సాక్షి, చెన్నై/విశాఖపట్నం: తీవ్ర తుపానుగా మారిన ‘గజ’ సైక్లోను తమిళనాడు వైపు దూసుకొస్తోంది. శుక్రవారం వేకువజామున ఆ రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది. ఆ సమయంలో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తోంది. నాగపట్నానికి 140 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన గజ తుపాను.. కడలూరు, పాంబన్ మీదుగా ముందుకు కదులుతోంది. ఆ తీరం వెంబడి ఉన్న కడలూరు, నాగపట్నం, పుదుకొట్టై, తిరువారూర్, తంజావూరు, రామనాథపురం జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజల్ని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. పొరుగున ఉన్న పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. గురు, శుక్రవారం ఆ ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. గురువారం సాయంత్రానికే దుకాణాలు, కార్యాలయాలు మూతపడడంతో ఆ జిల్లాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రోడ్డు మీదుగా కడలూరు–చెన్నైని కలిపే రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. అలాగే, చెన్నై నుంచి మైలాడుదురై మీదుగా వెళ్లే రైళ్లు కొన్ని రద్దు కాగా, మరికొన్ని విరుదాచలం వైపు మళ్లించారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ, అగ్ని మాపక సిబ్బందిని సన్నద్ధం చేశారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తీర ప్రాంత భద్రతా దళం హెచ్చరించింది. కోస్తాకు తప్పిన ‘గజ’ ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు గజ తుపాను ముప్పు తప్పింది. తుపాను ప్రభావం ఈ రెండు ప్రాంతాలపై తప్పకుండా ఉంటుందంటూ కొద్దిరోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత నెల్లూరు–చెన్నైల మధ్య అది తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే క్రమేపీ తుపాను తన దిశ మార్చుకుంటూ తమిళనాడు వైపు పయనిస్తోంది. దీంతో కోస్తా, రాయలసీమకు గజ ముప్పు తొలగిపోయినట్లయింది. -
అరుణాచల్, అస్సాంలలో వరదలు
ఇటానగర్: చైనాలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరగడంతో అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ దీవిలో చిక్కుకున్న 19 మందిని శుక్రవారం వాయుసేన సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అస్సాంలోని ధేమ్‌జీ జిల్లాలో జాతీయ విపత్తు ప్రతిస్పందనా బృందం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా బృందాలు 200 మందిని కాపాడాయి. అస్సాంకు చెందిన పశువులకాపరులు అరుణాచల్‌లోని తూర్పు సియాంగ్ జిల్లా వరదల్లో చిక్కుకోగా, జిల్లా అధికారుల విజ్ఞప్తి మేరకు వైమానిక దళ సిబ్బంది వారిని కాపాడింది. అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మేఘాలయలోని మూడు జిల్లాలకూ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. చైనాలో సాంగ్పోగా పిలిచే నది దిగువ వైపునకు ప్రవహించి లోహిత్, దిబాంగ్ నదులతో కలసి అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది. -
అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మంత్రులంతా తమ జిల్లాలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. అధికారులు స్థానికంగానే ఉండి, అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. మంత్రులు జిల్లాల్లో అందుబాటులో ఉండాల్సి ఉన్నందున సోమవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. -
కోస్తాంధ్రకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం : కోస్తాంధ్రకు భారత వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనితో పాటు ఉత్తర ఛత్తీస్‌ఘఢ్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు పేర్కొంది. దీంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని.. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు పడతాయిని తెలిపింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరంలోని సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. -
వాతావరణ హెచ్చరికలకు ఐఎండీ–బీఎస్ఎన్ఎల్ జట్టు
న్యూఢిల్లీ: దేశంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజల్ని హెచ్చరించేందుకు వీలుగా భారత వాతావరణశాఖ(ఐఎండీ) సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా ప్రజలకు ముందస్తు అలర్ట్స్ పంపేందుకు బీఎస్ఎన్ఎల్తో ఐఎండీ జట్టుకట్టినట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వాతావరణ శాఖ తమకు కచ్చితమైన అలర్ట్స్ పంపడం లేదని ఇటీవల పలు రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శించిన నేపథ్యంలో ఐఎండీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలకు వాతావరణానికి సంబంధించిన అలర్ట్స్ పంపేందుకు ఐఎండీ, బీఎస్ఎన్ఎల్ కలసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ ఓ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఐఎండీ ఓ అలర్ట్‌ను పంపిస్తే.. దాన్ని బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులందరికీ పంపిస్తుంది. ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉంది’ అని చెప్పారు. -
భారతీయులూ... బహుపరాక్
మోసగాళ్ల వలలో పడొద్దని ఇండియన్ ఎంబసీ హెచ్చరిక దుబాయ్: మోసగాళ్ల వలలో పడొద్దని ఇక్కడి భారతీయులను కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. తాము భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులమని చెప్పుకుంటూ కాల్స్ చేసేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇమిగ్రేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై స్థానిక అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారంటూ బెదిరించి బాధితుల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారని తెలిపింది. భారతీయ రాయబార కార్యాలయం నియమించిన న్యాయవాది లేదా కన్సల్టెంట్ ఖాతాలోకి డబ్బులు బదిలీ చేయాలని బాధితులకు సూచిస్తారని, అదే సమయంలో ఈ మొత్తాన్ని భారతీయ రాయబార కార్యాలయం రీయింబర్స్ చేస్తుందని చెబుతారని ఓ ప్రకటనలో తెలిపింది. తాము టార్గెట్‌గా ఎంచుకున్నవారి వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు ఈ నయవంచకులు హ్యాకింగ్ స్కిల్స్‌ను వినియోస్తారని, రాయబార కార్యాలయం నుంచే ఫోన్ చేస్తున్నట్టు చెబుతారని తెలిపింది. -
ప్రజలను అప్రమత్తం చేయండి
♦ మోసపూరిత ఆఫర్ల విషయమై ♦ బ్యాంక్‌లకు ఆర్బీఐ సూచన ముంబై: ఈ మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) బ్యాంకులకు సూచించింది. ఆర్థికాంశాల పట్ల తగిన అవగాహన లేకపోవడం, జాగరూకత లేకపోవడం వల్ల అమాయకులైన ప్రజలు ఇలాంటి మోసపూరిత ఆఫర్లకు బలై నష్టపోతున్నారని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి స్కీమ్‌లు/ఆఫర్ల పట్ల ప్రజలే కాకుండా బ్యాంక్‌లు కూడా నష్టపోతున్నాయని వివరించింది. లాటరీ తగిలిందనో లేక ప్రైజ్‌లు వచ్చాయనో ఫోన్‌కాల్స్, ఈమెయిల్స్ వస్తాయని, కొంత మొత్తం డబ్బులు డిపాజిట్ చేస్తే ఈ లాటరీ/ప్రైజ్‌లు మీకు వస్తాయని మోసగాళ్లు ప్రలోభపెడతారని పేర్కొంది. వాళ్లు చెప్పినట్లుగా డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ తర్వాత ఎలాంటి స్పందన ఉండదని వివరించింది. బ్యాంకులు తమ ఖాతాదారుల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ తరహా మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేలా పోస్టర్లు, పాంప్లెట్లు, నోటీసులు, ఇంకా ఇతర మార్గాల ద్వారా బ్రాంచ్‌లు, ఏటీఎంల్లో విస్తృతమైన ప్రచారం చేయాలని ఆర్బీఐ సూచించింది. మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలు ఆకర్షితులు కాకుండా చూడడంలో బ్యాంక్ సిబ్బంది తగిన తోడ్పాటునందించాలని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ. లక్షకు మించిన మోసపూరిత కేసులు 861 నమోదయ్యాయని, వీటి విలువ రూ.4,920 కోట్లని వివరించింది. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,651 కేసులు నమోదయ్యాయని, వీటి విలువ రూ.11,083 కోట్లని పేర్కొంది. -
ట్రాఫిక్ సమస్యకు గూగుల్ చెక్!
గూగుల్ అందిస్తున్న కొత్త సదుపాయంతో ఇకపై ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిన పని ఉండదట. ఇప్పిటికే తాము చేరాల్సిన అడ్రస్ కనుక్కోవడం, దూరాన్ని తెలుసుకోవడం, రూట్లు వెతుక్కోవడంలో యూజర్లకు సహకరిస్తున్న గూగుల్ మ్యాప్స్... ఇప్పుడు కొత్తగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మ్యాప్స్ మీకు కొత్త కొత్త మార్గాల్లో ప్రయాణించే అదృష్టాన్ని కల్పిస్తోందని గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ సంకేత్ గుప్తా గూగుల్ మ్యాప్స్ బ్లాగ్ స్పాట్ లో వెల్లడించారు. ఈ కొత్త అవకాశంతో.. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోకుండా వేరే మార్గాల్లో సులభంగా గమ్యాన్ని చేరుకోవచ్చని, వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయితే మ్యాప్స్‌లో అలర్ట్ వస్తుందని చెప్పారు. ఇందుకోసం యాప్ లో మనం ఎక్కడికెళ్లాలో టైప్ చేస్తే చాలు.. దారిలో ఉండే ట్రాఫిక్ ను బట్టి ఎప్పటికప్పుడు అలర్ట్స్ వస్తుంటాయని, దాన్నిబట్టి త్వరగా వెళ్లగలిగే రూటును ఎంచుకునే అవకాశం ఉంటుందని సంకేత్ తెలిపారు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినపుడు మీరు ఇంకెంత సమయం వేచి చూడాల్సి వస్తుందో తెలుపుతుందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. యూజర్లు తమ యాండ్రాయిడ్ లేదా ఐవోఎస్ పరికరాలను నేవిగేషన్ మోడ్‌లో పెట్టుకుని ఉంటే చాలని, తమకు కావాల్సిన అన్ని అప్ డేట్లను గూగుల్ మ్యాప్స్ అందిస్తుందని అంటున్నారు. ఇప్పటికే 'శ్రీలంక స్ట్రీట్ వ్యూ ఇమేజరీ' ని మ్యాప్స్ లో అందుబాటులోకి తెచ్చినట్లు ఇటీవలే గూగుల్ వెల్లడించింది. దీనిద్వారా శ్రీలంక వాసులేకాక, ప్రపంచంలోని ప్రజలంతా శ్రీలంకను తమ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లలో వీక్షించే అవకాశం ఉంది.