andriya
-
అలా నటించడానికి అస్సలు వెనుకాడను
సినిమా : అలా చేస్తే వ్యక్తిగత విమర్శల దాడి చేస్తారని తెలుసు. అయినా ఐ డోంట్‌కేర్ అంటోంది నటి ఆండ్రియా. సంచలనాలకుకేంద్రబిందువు ఆండ్రియా అంటారు. ఆమె చర్యలు కూడా అలానే ఉంటాయి. అయితే మల్టీ టాలెంటెడ్ నటి ఈ బ్యూటీ. ఈమెలో నటి మాత్రమే కాకుండా మంచి గాయనీ, గీత రచయిత ఉన్నారు. అదే విధంగా బహుభాషా నటి కూడా. తనకు పాత్ర నచ్చితే అది ఏ తరహాదైనా నటించడానికి వెనుకాడదు. ఇటీవల వడచెన్నైలో ఏ హీరోయిన్ చేయడానికి సాహసించని పాత్రను చేసి మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు మారిన ఈ అమ్మడితో చిన్న చిట్‌చాట్. ప్ర: బిడ్డకు అమ్మగా, మద్యం అలవాటు, దమ్ము కొట్టే అమ్మాయి, బూతులు మాట్లాడే మగువ లాంటి పాత్రలో నటిస్తున్నారు. విమర్శల వలయంలో చిక్కుకుంటారని భయం లేదా? జ: నాకు కథా పాత్ర నచ్చితే ఇక దేని గురించి ఆలోచించను. నటించడానికి అస్సలు వెనుకాడను. నెగటీవ్ టచ్ ఉన్న పాత్రల్లో నటిస్తే నాపై వ్యక్తిగత విమర్శల దాడి చేస్తారని తెలుసు. అయినా అలాంటి వాటి గురించి భయపడను. ఒక్కసారి నటించాలని కమిట్ అయితే ఏ తరహా పాత్రనైనా చేయాలన్నది నా అభిప్రాయం. ఇమేజ్ గురించి ఆలోచిస్తే, ఆ చట్రంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ప్ర:కమలహాసన్‌తో వరుసగా చిత్రాలు చేశారు. అంత పెద్ద నటుడితో నటించేటప్పుడు కంగారు, భయం లాంటివి ఎదుర్కొనేవారా? జ: కమలహాసన్ నటుడిగానూ, రాజకీయనాయకుడిగానూ కొనసాగుతున్నారు. ఆయనంటే నాకెంతో గౌరవం. కమల్ ఉత్తమ నటుడు. అయితే సాధారణంగా నేను ఎక్కవ చిత్రాలు చూడను. నా పాత్రల్లో ఎలా నటించాలన్న దాని గురించే అలోచిస్తాను. అంతే కానీ సహ నటుల నటన గురించి ఎప్పుడూ భయపడింది లేదు. ఇక కమలహాసన్‌తో నటిస్తున్నప్పుడు, జంకు గానీ, భయం కానీ కలగదు. అదే విధంగా నేను కమల్ చిత్రాలు చూస్తూ ఎదిగిన నటిని కాదు. అందుకని ఆయనంటే భయం లేదు. ప్ర: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మీటూ కలకలం సృష్టించడంపై మీ స్పందన? జ:నిజం చెప్పాలంటే మీటూ గురించిన వార్తలను నేను సరిగా చదవలేదు. అయితే అన్ని కాలాల్లోనూ ఈ సమస్య ఉంది. ఇప్పుడే మహిళలకు తమకు జరిగిన అక్రమాల గురించి బహిరంగంగా చెప్పే ధైర్యం, బలం వస్తున్నాయి. భయం కారణంగానే ఇంతకాలం చాలా మంది మహిళలు నోరు మెదపకుండా ఉన్నారు. ఈ తరం వారు ఆ భయాన్ని దాటి మాట్లాడటానికి ధైర్యం చూపుతున్నారు. ఇది మంచి విషయమే. అయితే పది మంది కథలు చెబుతుంటారు. ఇద్దరు ముగ్గురే నిజం చెబుతుంటారు. అలాంటి వారిని మనం గౌరవించాలి. ప్ర: నేత్రదాన అవగాహన కృషి చేస్తున్నారట? జ: అవును. అందరూ నేత్ర దానం చేసేందుకు ముందుకు రావాలి. నేత్రదానం చేయడం మన బాధ్యత. మన జీవితం తరువాత అవి ఇతరులకు జీవితాన్నిస్తాయి. నేనిప్పటికే నేత్రదానం చేశాను. -
దేనికైనా టైమ్ రావాలి
బ్యాడ్ టైమ్‌లో బాధపడి లాభం లేదు. ఓపిక పట్టాలి. దేనికైనా టైమ్ రావాలి అంటున్నారు కథానాయిక ఆండ్రియా జెర్మియా. ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఏ విషయం గురించైనా ధైర్యంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇలా సడన్‌గా ఫిలసాఫికల్ టర్న్ ఎందుకు తీసుకున్నారు? అని ఆండ్రియాని అడిగితే... ‘‘బేసిగ్గా నాకు కాస్త ఓపిక తక్కువ. అన్నీ వెంట వెంటనే జరిగిపోవాలని ఆరాట పడతాను. ‘‘తారామణి’ సినిమాకు మంచి అప్రిషియేషన్ దక్కిన తర్వాత నాకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించుకున్నాను. కానీ అలా జరగలేదు. కాస్త దిగులు పడ్డాను. ‘ఇప్పుడు ఆఫర్స్ రావడం లేదని బాధపడకు. అందరూ ఇప్పుడే నీ కోసం పాత్రలు రాస్తూ ఉండొచ్చు. రానున్న రోజుల్లో పుల్ బిజీగా ఉంటావ్’ అని దాదాపు ఎనిమిది నెలల క్రితం దర్శకుడు వెట్రిమారన్ ధైర్యం చెప్పారు. ఎగ్జాట్లీ ఆయన చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అప్పుడు అర్థం అయ్యింది.. దేనికైనా టైమ్ రావాలని. ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రం కంగారు పడటం లేదు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఓర్పుతో నేర్పుగా ముందడుగు వేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
అన్బు అక్టోబర్‌లో వస్తున్నాడు
దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘వడ చెన్నై’. ‘పొల్లాదవన్’, ‘ఆడుకలమ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘వడ చెన్నై’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం ధనుష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి ఫుల్స్టాప్ పెడుతూ ‘‘అన్బు (ధనుష్ పాత్ర పేరు) మీ అందరి దగ్గరకు అక్టోబర్ 17న వస్తున్నాడు’’ అని సినిమా టీమ్ పేర్కొంది. వాస్తవానికి ‘వడ చెన్నై’ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అక్టోబర్‌లో వస్తుంది. సెకండ్ పార్ట్ రిలీజ్‌ను ప్రకటించలేదు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ధనుష్ క్యారమ్‌బోర్డ్ ప్లేయర్‌గా కనిపిస్తారట. ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
వాస్తవ ప్రేమకథ!
ఆండ్రియా, అంజలి, వసంత్ రవి ముఖ్య తారలుగా రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వచ్చే నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ‘‘ఓ వాస్తవ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించాడు. యువన్ శంకర్‌రాజా సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందన్న నమ్మకం ఉంది. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమా తెలుగులో అంతకంటే పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఆండ్రియా, అంజలి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు వెంకటేశ్. -
శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు..
తమిళసినిమా: మహిళలకు ధైర్యం అవసరం అంటోంది నటి ఆండ్రియా. తనకు నచ్చిన విధంగా జీవించే అతి కొద్ది మంది నటీమణుల్లో ఈ జాణ ఒకరని చెప్పకతప్పదు. విమర్శలను, వివాదాలను అసలు పట్టించుకోని నటి ఆండ్రియా. తొలుత గాయనిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత నటిగా తెరపైకి వచ్చింది. అలా పచ్చైక్కిళి ముత్తుచ్చారం, ఆయిరత్తిల్ ఒరువన్, విశ్వరూపం, తరమణి చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించి తనకంటూ సొంత ఇమేజ్ను సంపాదించుకున్న ఆండ్రియా తాజాగా కమలహాసన్‌తో నటించిన విశ్వరూపం–2 చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు చూద్దాం. విశ్వరూపం చిత్రానికి కొనసాగింపుగానే విశ్వరూపం–2 ఉంటుంది. ఇందులో అశ్విత పాత్రలో నటించాను. తొలి భాగంలో కంటే రెండో భాగంలోనే అశ్విత ఎవరన్నది ప్రేక్షకులకు అర్థం అవుతుంది. చిత్రంలో ఫైట్స్ కూడా చేశాను. ఇంతకు ముందు కాలక్షేపం కోసమే చిత్రాల్లో నటించాను. అయితే విశ్వరూపం చిత్రంలో నటించిన తరువాత సామాజిక బాధ్యత ఎక్కువైంది. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరికి బాధ్యత అవసరం. ఎవరి పని వారు చేయడం కాదు. అదే విధంగా పాఠ్యాంశాల్లో విద్యను అభ్యసించడంతదో సరిపోదు. దేశపోకడలను తెలుసుకోవాలి. నటన విషయంలో నిబంధనలు విధిస్తున్నారా అని అడుగుతున్నారు. చిత్రాల్లో నటించడానికి ఎలాంటి నిబంధనలు విధించను. అయితే కథ నాకు నచ్చాలి. అదే ముఖ్యం. విశ్వరూపం–2 చిత్రం తరువాత వడచెన్నై చిత్రంలో నటించాను. ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆరు నెలలు ఖాళీగానే ఉన్నాను. ప్రస్తుతం వడచెన్నై డబ్బింగ్ జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కథా చిత్రాల్లో నటిస్తున్నారే అని అడుగుతున్నారు. అలా నటించడం వల్ల నా స్థాయి తగ్గుతుందని భావించడం లేదు. నా కథా పాత్ర ఏమిటి? దర్శకుడు ఎవరు? అన్న అంశాలపైనే దృష్టి పెడతాను. నేను నటనతో పాటు గాయనీగానూ కొనసాగుతున్నాను. నా దృష్టిలో ఈ రెండూ ఒకటే. ఎందులో అవకాశం వస్తే అది చేస్తాను. ఇటీవల సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు. ఆమె చెప్పేది నిజం అయితే వాటిని బహిరంగ పరచానికి చాలా ధైర్యం కావాలి. నాకైతే అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా బయట పెట్టడం కరెక్ట్. అందుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇకపోతే ప్యూచర్ ప్లాన్ ఏమిటీ అని అడుగుతున్నారు. నేను మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తానో తెలియదు. అలాంటిది ఫ్యూచర్ ప్లాన్ గురించి అడుతున్నారు. -
ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు
‘‘విశ్వరూపం’ సినిమా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ సినిమాలకు వచ్చిన గ్యాప్ మా వల్ల కాదు. అది రాజకీయం. ఇప్పుడు అవన్నీ పక్కకు తప్పుకోవడంతో ఈ సినిమా ఆడియన్స్ దగ్గరకు వస్తోంది. ఇంతకు ముందు సినిమాను మర్చిపోతారేమో అనే భయం ఉండేది. డిజిటల్ యుగం వల్ల ఫస్ట్ పార్ట్ పోయిన సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలానే గుర్తుపెట్టుకొని సీక్వెల్‌ను స్వాగతిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అని కమల్‌హాసన్ అన్నారు. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘విశ్వరూపం 2’. 2013లో రిలీజ్ అయిన ‘విశ్వరూపం’ చిత్రానికి సెకండ్ పార్ట్. ఆండ్రియా, పూజా కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. జిబ్రాన్ సంగీత దర్శకుడు. ఈ నెల 10న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా కమల్‌హాసన్ చెప్పిన విశేషాలు. సినిమాను ముందుగానే రెండు పార్ట్స్‌గా డిజైన్ చేశాం. ఈ సినిమా షూటింగ్ నాలుగేళ్ల క్రితం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యాయి. కొత్తగా ఏమీ షూటింగ్ చేయలేదు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేశాం. సెకండ్ పార్ట్ ఇండియాలో జరుగుతుంది. ఈ ఇండికేషన్ ఫస్ట్ పార్ట్ లాస్ట్‌లో చూపించాం. ఫస్ట్ పార్ట్ అంతా అమెరికాలో జరిగింది. సినిమాలో హీరోకి వసీమ్ అహ్మద్ కశ్మీరీ అనే పేరు ఎందుకు పెట్టాం? అనేది కూడా ఇందులో వివరిస్తాం. సెకండ్ పార్ట్ చూసేటప్పుడు సినిమాలోని అన్ని లేయర్స్ అర్థం అవుతాయి. ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు క్రియేటీవ్ ఫ్రీడమ్ అనేది మన దగ్గర చాలా తక్కువ అని ఫీల్ అవుతాను. వాక్ స్వాతంత్య్రం కూడా తక్కువే. సినిమా అనేది నాకు దొరికిన ఒక ప్లాట్‌ఫామ్. వివాదాలు చేసేవాళ్లు ఆ పనిని ఆపేశారు. ఇప్పుడు నేను కూడా రాజకీయ నాయకుడినే. ఇప్పుడు ఎవరూ ఎవరి ఉద్దేశాలు వినేలా లేరు. నేషనలిజానికి అర్థం మారుతూ ఉంటుంది. పెషావర్ మనది. కానీ ఇప్పుడు కాదే. నిజాం అని పిలిచే వాళ్లం. కానీ ఇప్పుడు? ఎవరి ఒపీనియన్ వాళ్లది. నేషనలిజానికి నా అర్థం ఏంటో నేను తెలుసుకున్నాను. ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు. మా స్టైల్లో మేం పాటిస్తూనే ఉన్నాం. ఎవరి అర్థం వారు డిఫైన్ చేసుకోవచ్చు. ప్రపంచ స్థాయి సినిమాలు తీస్తున్నాం ‘విశ్వరూపం 2’ యాక్షన్ సీన్స్ ఫస్ట్ పార్ట్స్‌ని మించి ఉంటాయి అనుకుంటున్నాను. నాతోటి హీరోలు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాను. పది సంవత్సరాల క్రితం చేసిన యాక్షన్స్ సినిమాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు సినిమా స్టాండర్డ్స్ ఇంకా పెరిగాయి. వరల్డ్ సినిమా స్టాండర్డ్స్‌లో మనం సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమా కూడా ఆ స్థాయికి తక్కువ ఏం ఉండదనుకుంటున్నాను. జిబ్రాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్‌కి పని చేసిన శంకర్ ఎహసన్ లాయ్‌ని రిపీట్ చేయడం కుదర్లేదు. సినిమాలు వేరు.. పాలిటిక్స్ వేరు సినిమాలు వేరు. పాలిటిక్స్ వేరు. సినిమాల్లానే నా పొలిటికల్ ఐడియాలజీలు కూడా సోఫిస్టికేటెడ్‌గా ఉంటాయా అంటే.. అందరూ ప్రజాస్వామ్యానికి అలవాటు పడాలి, అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. మనకు స్వాతంత్య్రం వచ్చి 71 సంవత్సరాలు అయింది. కానీ నేను మాత్రం 1948లోనే ఉన్నాం అని భావిస్తాను. స్వాతంత్య్రం వచ్చి ఒక్క ఏడాదే అయిందని భావించి, అభివృద్ధికి అందరూ తమ వంతు సహకారం అందించాలి. కమల్ పేరు వినిపించదు! చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇంత మంది జనాభా ఉన్నాం. మంచి నటులు వస్తారు, రావాలి. నేను చాలా స్వార్థపరుణ్ణి. మంచి మంచి పాత్రలన్నీ నేనే ఎంచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి. అయితే రాజకీయాల్లోకి వెళ్లాను కాబట్టి వేరే వాళ్లు చెబుతారు. కమల్‌హాసన్ అనే పేరు వినిపించదు. అంతే కానీ అదే టాలెంట్‌తో, ఇంకా ఎక్కువ టాలెంట్‌తో వస్తూనే ఉంటారు. ‘సాగర సంగమం’లో ‘ఆర్ట్ నెవర్ ఎండ్స్’ అని వేశాం. సినిమాలపై పొలిటికల్ ప్రెజర్ సినిమాలపై వచ్చే పొలిటికల్ ప్రెజర్ అసలు పొలిటికల్ ప్రెజరే కాదు. జస్ట్ ప్రెజర్ మాత్రమే. పొలిటికల్ అని అంటున్నాం. నిరంకుశత్వ ధోరణి ఉన్నవాళ్లే ఎక్కువ భయపడతారని నేను భావిస్తాను. ఫిల్మ్ జర్నలిస్ట్ అయినా, వేరే ఏ జర్నలిస్ట్ అయినా టైమ్ వచ్చినప్పుడు పొలిటీషియన్స్‌ను ప్రశ్నలు అడగాలి. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ బాధ్యత ఉంది జర్నలిస్ట్‌లకు. వాళ్లు సమాధానాలను దాటేయవచ్చు కానీ జర్నలిస్ట్‌లు క్వశ్చన్స్ వేయకుండా ఉండకూడదు. ఇలా జర్నలిస్ట్‌లు క్వశ్చన్స్ అడిగినప్పుడు పొలిటీషియన్‌గా నా పని ఈజీ అవుతుంది. బాలచందర్‌గారు స్టార్స్‌ని తయారు చేశారు యాక్టర్స్‌ని సెలెక్ట్ చేయడం రెండు విధాలు. ఒకటి స్టార్ దగ్గరకు వెళ్లడం, స్టార్స్‌ని తయారు చేయడం. బాలచందర్ గారు స్టార్స్‌ని తయారు చేయడం చూశాను. మట్టి బొమ్మలకు దేవత రూపాలు ఇచ్చారు. మేల్ స్టార్స్, ఫీమేల్ స్టార్స్‌ని తయారు చేశారు. ఆ పద్ధతి నాకు ఇష్టం. ఆర్ట్‌ని ప్రేమిస్తే తప్ప అలా చేయలేం. స్టార్స్ అంటే సెపరేట్ వ్యాన్, టచప్ చేయడం ఇవన్నీ కాదు. ఎప్పుడు రిహార్సల్స్‌కి పిలిచినా వచ్చేవారు. పట్టుదలతో చేసేవారే స్టార్స్. మా టీమ్ అందరం కలిసి స్క్రిప్ట్ చదువుతాం. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్లు నన్ను అడుగుతారు. ఈ సినిమా కెమెరామెన్ ఒక డైరెక్టర్, ఎడిటర్ ఒక డైరెక్టర్.. ఇలా ఎంతో మంది ఇంటెలిజెన్స్ పర్సన్స్ వేసే ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్, వచ్చే డిస్కషన్స్ సినిమాకు ప్లస్ అవ్వడంతో పాటు నా క్యారెక్టర్ మరింత మెరుగు అవ్వడానికి దోహదపడుతుంది. మా టీమ్‌లో ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నారు. ఒక సినిమాను తీయడంలో ఉన్న కష్టం ఏంటో వారందరికీ తెలుసు. వాళ్ల రుణం తీర్చుకోవాలి ఫిల్మ్ మేకింగ్‌లో ప్రతీ పనిని ఎంజాయ్ చేస్తాను. నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్‌తో కలిసి చూడటమే నా రెమ్యునరేషన్, ఫస్ట్ అడ్వాన్స్లా భావిస్తాను. నా ఫేమ్, మనీ, నా స్టేటస్ అన్నీ ఆడియన్స్ ఇచ్చినవే. వాళ్ల రుణం తీర్చుకోవాలి కదా. వాళ్లకు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను (రాజ కీయాల్లోకి అడుగుపెట్టడాన్ని ఉద్దేశించి). -
టాలీవుడ్‌కు ఆండ్రియా
టీ.నగర్: తెలుగు చిత్రం ‘ఆయుష్మాన్‌భవ’లో నటించేందుకు ఆండ్రియా ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఏడాది విడుదలైన ‘అవళ్’ చిత్రం తర్వాత ఆండ్రియా మరే చిత్రం విడుదల కాలేదు. అయితే తమిళంలో ఆమె నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ చిత్రంలో కమల్‌కు జంటగా నటించిన పూజాకుమార్‌కు సమానంగా ఆండ్రియాకు బలమైన కథా పాత్ర లభించింది. ఈ ఏడాది విడుదలకానున్న విశ్వరూపం–2 చిత్రంలో మొదటి భాగం కంటే అధిక సన్నివేశాలలో నటించారు. ఆ చిత్రంలో డాన్స్ చేసిన ఆండ్రియా ఈ చిత్రంలో సైనిక దుస్తుల్లో సంచరిస్తుంటారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన వడచెన్నై చిత్రంలోను ముఖ్యపాత్రలో నటిం చారు. తెలుగులో చరణ్‌తేజ్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆయుష్మాన్‌భవ’. స్నేహా ఉల్లాల్ కథానాయకిగా నటిస్తున్నా రు. ఇందులో జెనిఫర్ అనే పాప్ గాయనిగా నటించేందుకు ఆండ్రియా ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న షూటింగ్లో ఆం డ్రియా పాల్గొననున్నారు. ఇంతేకాకుండా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘సొల్లాదే యారుం కేట్టాల్’ అనే థ్రిల్లర్ చిత్రంలోను ఆం డ్రియా నటిస్తున్నారు. -
బర్త్‌డే స్పెషల్
‘పొల్లాదవన్, ఆడుకుళం’ వంటి బ్లాక్బాస్టర్ హిట్స్ తర్వాత దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ మూడోసారి ‘వడ చెన్నై’ సినిమా కోసం కలిశారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. రెండు పార్ట్స్‌గా రిలీజ్ కానున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్ బ్యానర్‌పై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇవ్వనున్నారు ధనుష్. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ట్రైలర్‌ని బర్త్‌డే స్పెషల్‌గా జూలై 28న రిలీజ్ చేసి, సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. -
నేటి ట్రెండ్‌కు తగ్గ సినిమా
అంజలి, ఆండ్రియా, వసంత్, రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమాను అదే పేరుతో జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ తెలుగులోకి అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మారుతి మాట్లాడుతూ– ‘‘సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా ఉంది. యువన్ శంకర్ ఆడియో బాగుంది. మా గుడ్ సినిమా గ్రూప్‌లో విడుదల కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చూశాను. బాగా నచ్చింది. తెలుగులో అనువదించి, విడుదల చేద్దామని జ్ఞానవేల్ రాజాను సంప్రదించాను. అప్పటికే డి. వెంకటేశ్ హక్కులు దక్కించుకున్నారని తెలిసింది’’ అన్నారు యస్కేయన్. ‘‘తెలుగులో కూడా ‘తారామణి’ ఆడియో పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా కూడా అక్కడిలానే విజయం సాధిస్తుందనుకుంటు న్నాను’’ అన్నారు డి. వెంకటేశ్. శ్రీకాంత్, శ్రేయాస్ శ్రీనివాస్, రాజేశ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. నటుడు విశాల్ హీరో కాకముందు ఓ ప్రముఖ హీరో దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఎవరా హీరో? ఎ) విక్రమ్ బి) అర్జున్ సి) భాగ్యరాజా డి) విజయ్ కాంత్ 2. నాని నటించిన ‘మజ్ను’ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) అనూ ఇమ్మాన్యుయేల్ బి) అనుపమా పరమేశ్వరన్ సి) రుక్షార్ థిల్లన్ డి) నివేథా థామస్ 3. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఆ బ్రేక్ ఇచ్చిన దర్శకుడెవరు? ఎ) గౌతమ్ పట్నాయక్ బి) సురేందర్ రెడ్డి సి) మేర్లపాక గాంధీ డి) సుబ్బారెడ్డి 4. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని పోలీసులకు దొరికిన బాలీవుడ్ నటుడెవరో కనుక్కోండి? ఎ) ఆమిర్ ఖాన్ బి) సల్మాన్ ఖాన్ సి) సొహైల్ ఖాన్ డి) అర్భాజ్ ఖాన్ 5. ‘నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు’... అనే పాట ‘చందమామ’ సినిమాలోనిది. ఈ పాట రచయితెవరో తెలుసా? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) అనంత శ్రీరామ్ సి) చంద్రబోస్ డి) వనమాలి 6. ఎన్టీఆర్, అంజలీదేవి, జమున నటించిన ‘సతీ అనసూయ’ చిత్రానికి సంగీతదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) ఎస్.రాజేశ్వరరావు బి) కె.వి. మహదేవన్ సి) ఘంటసాల డి) పెండ్యాల 7. 2012వ సంవత్సరానికి ఫోర్బ్ ్స ఇండియా సెలబ్రిటీ టాప్ 100 లిస్టు్టలో 66వ స్థానాన్ని సంపాదించిన టాలీవుడ్ హీరో ఎవరై ఉంటారో ఓ లుక్కేయండి? ఎ) ప్రభాస్ బి) జూనియర్ ఎన్టీఆర్ సి) అల్లు అర్జున్ డి) రామ్ చరణ్ 8. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం ‘బర్ఫీ’ ద్వారా తెలుగు నుండి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన హీరోయిన్ ఎవరో కనిపెట్టండి? ఎ) ఇలియానా బి) తమన్నా సి) రకుల్ ప్రీత్‌సింగ్ డి) పూజా హెగ్డే 9. ఓ నాటకంలో నటించటానికి సావిత్రి దుగ్గిరాల వెళ్లినప్పుడు ఓ ఇంట్లో బస చేశారు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఆమె సినిమా ఇండస్ట్రీకి రమ్మన్నారు. ఆమె చెన్నై వెళ్లి, చాలా పెద్ద హీరోయిన్ అయ్యారు. ఎవరా హీరోయిన్? ఎ) విజయనిర్మల బి) అంజలీదేవి సి) దేవిక డి) జమున 10. జూన్ 10న హీరో బాలకృష్ణ పుట్టినరోజు. అదే రోజున మరో అగ్ర దర్శకుని పుట్టినరోజు కూడా. ఎవరా దర్శకుడు? ఎ) బి.గోపాల్ బి) శ్రీను వైట్ల సి) ఈవీవీ సత్యనారాయణ డి) జంధ్యాల 11. వెంకటేశ్ నటించిన ‘బొబ్బిలి రాజా’ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఇళయ రాజా బి) చక్రవర్తి సి) యం.యం. కీరవాణి డి) కోటి 12. ‘మదరాస పట్టణం’ సినిమా ద్వారా స్క్రీన్‌కి పరిచయమయ్యారీ భామ. ‘ఎవడు’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. ఎవరా హీరోయిన్? ఎ) అమీ జాక్సన్ బి) అమలాపాల్ సి) ఆండ్రియా డి) అంజలి 13. యోగా గురువు భరత్ ఠాగూర్ దగ్గర కొంత కాలం శిష్యరికం చేశారు ఈ హీరోయిన్. ఎవరామె? ఎ) భూమిక బి) అనుష్క సి) చార్మీ డి) ప్రియమణి 14. 1985లో విడుదలైన వందేమాతరం’ సినిమాలో కథానాయకుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) భానుచందర్ బి) సుమన్ సి) రాజశేఖర్ డి) వినోద్‌కుమార్ 15. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తన మొదటి సినిమా నుండి ఈ రోజు వరకు అలాంటి చిత్రాల్లోనే నటించారు. ఆయన మొదటి సినిమా ఏదో చెప్పుకోండి? ఎ) దండోరా బి) అర్ధరాత్రి స్వతంత్రం సి) అడవి దివిటీలు డి) ఎర్ర సైన్యం 16. ఆ హీరో ఇప్పటివరకూ 15 సినిమాలు చేశారు. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న ఆ హీరో ఎవరు? ఎ) రామ్ బి) నాని సి) తరుణ్ డి) మనోజ్ 17. ‘కబాలి, కాలా’ చిత్రాల దర్శకుడు పా.రంజిత్ గతంలో ‘మద్రాస్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అందులో నటించిన హీరో? ఎ) కార్తీ బి) సూర్య సి) సిద్ధార్ధ్ డి) విశాల్ 18. బిగ్ బాస్ సీజన్ వన్ 70 రోజుల పాటు సాగింది. ఇప్పుడు మొదలయ్యే సీజన్ 2 షో ఎన్ని రోజుల పాటు ఉంటుందో తెలుసా? ఎ) 74 రోజులు బి) 85 రోజులు సి) 93 రోజులు డి) 106 రోజులు 19. ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టండి? ఎ) కంగనా రనౌత్ బి) కత్రినాకైఫ్ సి) స్నేహా ఉల్లాల్ డి) సోనమ్ కపూర్ 20 . ఈ ఫొటోలో ఉన్నది ప్రముఖ దర్శక–నిర్మాత. ఆయనెవరో గుర్తుపట్టండి? (ఆయనో ప్రముఖ హీరో తండ్రి ) ఎ) అక్కినేని బి) వీబీ రాజేంద్రప్రసాద్ సి) ఎన్టీఆర్ డి) డి. రామానాయుడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) డి 5) బి 6) సి 7) బి 8) ఎ 9) డి 10) సి 11) ఎ 12) ఎ 13) బి 14) సి 15) బి 16) ఎ 17) ఎ 18) డి 19) బి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
టైమ్ దగ్గరపడింది
తమిళ సినిమా: వడచెన్నై ఈ పేరు చాలా కాలంగా వార్తల్లో నానుతోందనే చెప్పాలి. నటుడు ధనుష్, దర్శకుడు వెట్ట్రమారన్ల సక్సెస్‌పుల్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం వడచెన్నై. చిత్ర నిర్మాణం మొదలై చాలా కాలం అయ్యింది. ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నటి ఆండ్రియ, ఐశ్వర్యరాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం తొలి భాగం చిత్రీకరణ ఎట్టకేలకు ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు ముందుగానే వెల్లడించాయి. ఇందులో ధనుష్ క్యారమ్ ఆటగాడిగా నటిస్తున్నారు. ఆయన ప్రేయసిగా నటి ఐశ్వర్యరాజేశ్ నటిస్తోంది. ఆండ్రియా విభిన్న పాత్రలో కనిపించనుందట. గత మార్చిలో చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చిత్ర తొలి భాగాన్ని జూన్‌లో విడుదల చేయాలని మొదట భావించారు. అనివార్య కారణాల వల్ల రజనీకాంత్ కథానాయకుడిగా ధనుష్ నిర్మించిన కాలా చిత్రం విడుదల వాయిదా పడి ఆ చిత్రం జూన్ 7వ తేదీన విడుదల కావడంతో వడచెన్నై చిత్ర విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొందని సమాచారం. ఇక వడచెన్నైకి టైమ్ దగ్గర పడ్డట్టు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం తరువాత ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం మారి–2 తెరపైకి రానుంది. అయితే మధ్యలో ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ధనుష్ చిత్రం తెరపైకి వచ్చి ఏడాది దాటి పోయింది. వేల్లై ఇల్లా పట్టాదారి–2 చిత్రం తరువాత ఆయన చిత్రాలేవీ విడుదల కాలేదు. దీంతో ధనుష్ తాజా చిత్రం వడచెన్నై కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ధనుష్, వెట్ట్రిమారన్ల కాంబినేషన్లో చిత్రం అంటే అంచనాలు భారీ స్థాయిలోనే ఉంటాయి. మొత్తం మీద చిన్న గ్యాప్ తరువాత ఆయన చిత్రాలు వరుసగా తెరపైకి రానున్నాయన్నమాట. -
వేసవిలో విశ్వరూపం
అవును...... మే లో విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారట కమల్‌హాసన్. నాలుగు సంవత్సరాలుగా పలు వివాదాలతో లేటవుతున్న‘విశ్వరూపం2’ ఈ సమ్మర్‌కు కచ్చితంగా థియేటర్స్‌లో సందడి చేయనుందట. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వరూపం’ సినిమాకు ఇది సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్‌హాసన్ నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయనీ, ఎలాగైనా సమ్మర్లో తీసుకురావాలని ‘విశ్వరూపం 2’ చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ టాక్. విశేషం ఏంటంటే.. ‘విశ్వరూపం 2’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ‘కాలా’ కంటే ముందే కంప్లీట్ అయిపోయాయట. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని టాక్. ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ రెడీ అయిందని, తమిళనాడులో జరిగిన థియేటర్స్ బంద్ వల్ల రిలీజ్ చేయలేదని టాక్. ఆండ్రియా, పూజాకుమార్, శేఖర్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించారు. -
కేవలం స్కిన్ షో అంటే నో
‘‘మా కోసం స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ రాయండి. కేవలం మీ సినిమాలో డ్యాన్స్ నంబర్స్ వరకు వచ్చి గ్లామర్ కోసం స్కిన్ షో చేయడం మాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ ‘షో’ మాకు ఆనందాన్నివ్వదు’’ అని సంచలన కామెంట్స్ చేశారు నటి, ప్లేబ్యాక్ సింగర్ ఆండ్రియా. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆండ్రియా కథానాయికలకు వస్తున్న అవకాశాల గురించి స్పందిస్తూ– ‘‘ఏ హీరోయిన్‌కి అయినా ఐడెంటిటీ వచ్చేది తను ఎవరి సరసన అయితే యాక్ట్ చేస్తుందో ఆ హీరో వల్లే. మనది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. పెద్ద పెద్ద స్టార్స్ పక్కన కనిపిస్తేనే ఆ హీరోయిన్‌కు పేరొస్తుంది. మొదటి నుంచి స్ట్రాంగ్ రోల్స్ చేయాలని హీరోయిన్ అనుకుంటే అలా ఒప్పుకోలేరు. ఇప్పుడున్న లేడీ సూపర్ స్టార్స్ దీపికా, నయనతారలు కూడా పెద్ద పెద్ద హీరోలతో డ్యాన్స్‌లు, గ్లామరస్ రోల్స్ చేసినవాళ్లే. కానీ వాళ్లు, నాలాంటి ఇతర కథానాయికలు ముందు నుంచీ అలాంటి పాత్రలు చేయాలి అనుకుంటున్నాం. నేను ఇదివరకు సినిమాల్లో డ్యాన్స్‌లు చేశాను, గ్లామర్ పాత్రల్లో కనిపించాను. కానీ ఒక స్టార్ హీరోతో డ్యాన్స్‌లు చేసిన తర్వాత వచ్చే అవకాశాలు.. ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేసిన తర్వాత ఉండకపోవచ్చు. మేం గ్లామర్‌గా కనిపించగలం. అయితే జస్ట్ అలా వచ్చి డ్యాన్స్‌లు, స్కిన్ షోలు చేయమంటే ఒకానొక దశలో ‘నో’ అనేస్తాం. మాకోసం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి, మంచి పాత్రలు రాయండి’’ అన్నారు. -
టాప్ హీరోలతో నటిస్తేనే అది సాధ్యమా?
తమిళసినిమా: సినీరంగంలో పురుషాధిక్యమే రాజ్యమేలుతోందన్నది వాస్తవం. స్టార్ హీరోల కనుసన్నల్లోనే సినిమా రూపొందుతోంది. నయనతార లాంటి నటీమణులే హీరోలకు ధీటుగా హీరోయిన్ పాధాన్యత చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. అసలు విషయం ఏమిటంటే ఎలాంటి పాత్ర అయినా నటనకు అవకాశం ఉంటే నటించేందుకు వెనుకాడని నటి ఆండ్రియా పేర్కొన్నారు. ఇటీవల తరమణి చిత్రంలో ఎవరూ నటించడానికి సాహసించని పాత్రలో నటించి మెప్పించారు.అయినప్పటికీ ఈ ఉత్తరాది బ్యూటీ చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. ఈ విషయంపై సినీ వర్గాలకు ఇటీవల ఘాటుగానే చురకలంటించారు. ఆండ్రియా ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ నటుడు విజయ్‌కి జంటగా ఒక చిత్రంలో నటిస్తూ ఏమీ చేయకుండానే మూడు పాటల్లో ఆయనతో ఆడితే ఆ చిత్రం విడుదలై విజయం సాధిస్తే ఆ నటికి వరుసగా నాలుగైదు చిత్రాల అవకాశాలు వరించేస్తున్నాయి అని అన్నారు. అయితే తరమణి లాంటి చిత్రంలో ఉత్తమ నటనను ప్రదర్శించిన తనకు ప్రశంసలు అభించాయే గానీ ఆ తరువాత కొత్తగా ఒక్క అవకాశం రాలేదని అన్నారు. అయితే నటి నయనతార కూడా ఆదిలోనే రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ హీరోల జంటగా నటించిన తరువాతే ఆమెకు స్టార్ హీరోయిన్ అంతస్తు లభించిందని అన్నారు. అలా జరగకుంటే నయనతార గురించి ఇంతగా బయట ఎవరికీ తెలిసేది కాదని అన్నారు. తానేమంటానంటే ఒక నటి ప్రతిభను ఆమె ఎవరితో నటించారన్నదాన్ని బట్టి నిర్ణయించరాదన్నారు. -
నార్త్ చెన్నై కుర్రాడి కథ
‘ఆడుకలమ్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘వడ చెన్నై’. మూడు పార్ట్స్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నేషనల్ లెవల్ క్యారమ్ ప్లేయర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు ధనుష్. నార్త్ చెన్నైలో 35 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, ఆండ్రియా హీరోయిన్లుగా కనిపించనున్నారు. సంతోశ్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, ధనుష్, వెట్రిమారన్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బెస్ట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే, హీరో’ విభాగాల్లో నేషనల్ అవార్డ్ సాధించిన ‘ఆడుకలమ్’ సినిమా తర్వాత ఆ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా పెట్టుకున్నారు ధనుష్ అభిమానులు. -
స్క్రీన్ టెస్ట్
► భూమిక చావ్లాతో నటించిన మొదటి తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) యన్టీఆర్ బి) మహేశ్ బాబు సి) సుమంత్ డి) వెంకటేశ్ ► ‘మిస్టర్’ సినిమా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒక హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ ఎవరు? ఎ) హెబ్బా పటేల్ బి) ప్రణీత సి) అమలాపాల్ డి) ఆండ్రియా ► నాగార్జున నటించిన ‘శివ’ సినిమాకు మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) యం.వీ.యస్.హరనాథరావు బి) శివనాగేశ్వరరావు సి) తనికెళ్ల భరణి డి) సుద్దాల అశోక్‌తేజ ► బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కి ఈ సౌత్ హీరోయిన్ దగ్గరి బంధువు. ఎవరామె? ఎ) ప్రియమణి బి) లక్ష్మీరాయ్ సి) అంజలి డి) గౌతమి ► వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) త్రివిక్రమ్ శ్రీనివాస్ బి) కె. విజయభాస్కర్ సి) పి.వాసు డి) సురేశ్‌కృష్ణ ► నటి చార్మి ప్రస్తుతం హీరోయిన్గా కాకుండా ఓ ప్రముఖ దర్శకునితో కలిసి సినిమా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరేంటి? ఎ) పూరిచార్మి క్రియేటివ్స్ బి) పూరి కనెక్ట్స్ సి) పీసీ కనెక్ట్స్ డి) పీసీ క్రియేట్స్ ► ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమా 2015 డిసెంబర్లో రిలీజైంది. మోహన్‌బాబు 23 సంవత్సరాల క్రితం నటించిన ఓ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఏ చిత్రానికి ఈ సినిమా సీక్వెలో చెప్పగలరా ? ఎ) అల్లుడుగారు బి) అసెంబ్లీ రౌడి సి) అల్లరి మొగుడు డి) రౌడీగారి పెళ్లాం ► ప్రముఖ యాంకర్ సుమ గతంలో ఓ ప్రముఖ దర్శకుని చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఎవరా దర్శకుడు? ఎ) కె.రాఘవేంద్రరావు బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) ఎ. కోదండరామిరెడ్డి ► శ్రీదేవి, కమల్‌హాసన్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 15 బి) 19 సి) 23 డి) 27 ► ప్రభాస్–అనుష్కల కాంబినేషన్లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? ఎ) 7 బి) 3 సి) 5 డి) 4 ► హృదయం ఎక్కడున్నది.. హృదయం ఎక్కడున్నది నీ చుట్టునే తిరుగుతున్నది... అనే పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవా బి) హారిస్ జయరాజ్ సి) యువన్ శంకర్ రాజా డి) విశాల్ శేఖర్ ► హీరోలు రానా, శర్వానంద్‌లకు ఈ ప్రముఖ హీరో స్కూల్‌మేట్. ఎవరా హీరో? కనుక్కోండి చూద్దాం? ఎ) యన్టీఆర్ బి) రామ్‌చరణ్ సి) విజయ్ దేవరకొండ డి) అల్లరి నరేశ్ ► అంతకుముందు చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేసినప్పటికీ రామ్‌గోపాల్ వర్మ ‘ఐస్‌క్రీమ్’ సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న నటి ఎవరు? ఎ) అవికా గోర్ బి) తేజస్విని మడివాడ సి) శ్రీముఖి డి) ఈషా రెబ్బా ► అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దసరాబుల్లోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిందెవరు? ఎ) వి.మధుసూదనరావు బి) కె.వి.రెడ్డి సి) వి.బి.రాజేంద్రప్రసాద్ డి) కె.విశ్వనాథ్ ► నాగార్జున ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి ? ఎ) ఐయామ్ నాగార్జున బి) నాగార్జున సి) దిస్ ఈజ్ నాగార్జున డి) ఐయామ్ నాగ్ ► ఈ నటి అసలు పేరు సుజాత. అప్పటికే ఆ పేరుతో ఓ నటి ఉండటం వల్ల ఆమె స్క్రీన్ నేమ్ మారిపోయింది . ఆ నటి ఎవరో తెలుసా? ఎ) జయసుధ బి) జయప్రద సి) దివ్యవాణి డి) రంభ ► తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ‘నంది’ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నుంyì ప్రారంభించిందో తెలుసా? ఎ) 1975 బి) 1964 సి) 1979 డి) 1993 ► చిరంజీవి నటించిన ‘పసివాడిప్రాణం’ చిత్రంలో ‘పదహారేళ్ల వయసు పడిపడిలేచె మనసు’ అనే పాట ఉంటుంది. ఇప్పుడు ‘పడిపడి లేచె మనసు’ అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా హీరో ఎవరు? ఎ) నాని బి) నిఖిల్ సి) నాగచైతన్య డి) శర్వానంద్ ► ఈ ఫోటోలోని ఇప్పటి హీరో ఎవరో కనుక్కోండి? ఎ) శర్వానంద్ బి) కల్యాణ్‌రామ్ సి) అజిత్ డి) మాధవన్ ► అక్కినేని, సావిత్రి నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) మనుషులు మమతలు బి) మిస్సమ్మ సి) గుండమ్మకథ డి) డాక్టర్ చక్రవర్తి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) ఎ 5) బి 6) సి 7) సి 8) బి 9) డి 10) డి 11) బి 12) బి 13) బి 14) సి 15) ఎ 16) ఎ) 17) బి 18) డి) 19) ఎ 20) ఎ నిర్వహణ శివ మల్లాల -
నీకై ఎదురు చూస్తుంటాలే!
అంజలి, ఆండ్రియా, వసంత్ ముఖ్య తారలుగా రామ్ దర్శకత్వంలో రూపొంది, తమిళ్లో విజయవంతమైన చిత్రం ‘తారామణి’. జె.ఎస్.కె ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చేతులు చాచి.. యుగములు వేచి, నీకై ఎదురు చూస్తుంటాలే..’ అనే పాటను సంగీతదర్శకురాలు, గాయని ఎం.ఎం. శ్రీలేఖ విడుదల చేశారు. శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఈ సినిమాను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ రామ్ చాలా బాగా తీశారు. వెంకటేశ్‌గారు స్ట్రైట్ మూవీస్ తీసి, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘లేడీ ఆడియన్స్‌కు బాగా రీచ్ అవుతుందనే శ్రీలేఖగారితో ఈ పాటను రిలీజ్ చేయించాం. తమిళ్లో మంచి కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ సినిమా తెలుగులో అంతకంటే పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు డి. వెంకటేశ్. -
తారామణి...
ఆండ్రియా, అంజలి, వసంతకుమార్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘తారామణి’. తమిళంలో చిన్న సినిమాగా రిలీజై, పెద్ద విజయం సాధించిన సినిమా. రామ్ దర్శకత్వం వహించారు. డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి.వెంకటేశ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ చిత్రంలో చాలా బోల్డ్ క్యారెక్టర్లో నటించింది ఆండ్రియా. యువత మెచ్చే కథాంశంతో, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత వెంకటేశ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా. -
విశ్వరూపం–2 సూపర్!
తమిళసినిమా: విశ్వరూపం–2 చిత్రం సూపర్బ్‌గా వచ్చిందని ఆ చిత్ర సృష్టికర్త కమలహాసన్ పేర్కొన్నారు. ఈయన విశ్వరూపం చిత్ర షూటింగ్ సమయంలోనే పార్టు–2ను కూడా చాలా వరకు పూర్తి చేశారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ సంస్థ విడుదల హక్కులను పొంది చాలా కాలం పూర్తి చేయలేకపోయింది. దీంతో కొన్నేళ్లుగా మూలన పడ్డ విశ్వరూపం చిత్రానికి విముక్తి కలిగించే బాధ్యతను చివరికి కమలహాసనే తీసుకున్నారు. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి నిర్మిస్తున్న విశ్వరూపం–2 చిత్రంలో నటి పూజాకుమార్, ఆండ్రియ కథానాయికలుగా నటించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర తుది షెడ్యూల్ షూటింగ్‌ను కమల్ ఇటీవలే చెన్నైలో పూర్తి చేశారు. చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను అమెరికాలో నిర్వహించే పనిలో ఆయన ముమ్మరంగా ఉన్నారు. విశ్వరూపం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను అమెరికాలోనే పూర్తి చేశారన్నది గమనార్హం. ఇప్పుడు విశ్వరూపం-2 చిత్రానికి సౌండ్ ఎఫెక్ట్ కార్యక్రమాలను కమల్ అమెరికాలో రోజుకు 15 గంటల చొప్పున పని చేస్తూ పూర్తి చేశారు. ఈ విషయం గురించి ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ చిత్ర సౌండ్ ఎఫెక్ట్, సన్నివేశాలు సూపర్బ్‌గా వచ్చాయి. ఇందుకు కృషి చేసిన యూనిట్ అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని కమల్ జనవరి చివరి వారంలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. శభాష్ నాయుడు చిత్రాన్ని పూర్తి చేసి ఆపై రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు తాజా సమాచారం. -
ఆన్ ట్రాక్
పక్కోడు చెప్పాడనో, ఎదుటోడు పాటించాడనో లేకపోతే స్వాతంత్య్రం రోజునో, గణతంత్ర దినోత్సవం రోజునో గుర్తొచ్చేది కాదు దేశభక్తి అనేది. కన్నతల్లికి, కన్నభూమికి రుణపడి ఉండాలన్న బాధ్యత మనసులో ఉండాలి.. చేతల్లో కనిపించాలి. సరిగ్గా ఇలాంటి ఆలోచనలే ఉన్న కొందరు పౌరులు దేశ రక్షణకు ఎలా పాటుపడ్డారు? ఎటువంటి త్యాగాలు చేశారు? వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్న అంశాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వరూపం–2’. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ, నటిస్తున్న చిత్రమిది. 2013లో ఆయన స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన ‘విశ్వరూపం’ చిత్రానికి సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ ఆకాడమీ ట్రైనింగ్ (ఓటీఏ)లో జరుగుతోంది. ‘‘విశ్వరూపం–2’ షూటింగ్ జరుపుతున్నాం. ఎగై్జటింగ్‌గా ఉంది. ఓటీఏ చెన్నై నాతో పాటు దేశాన్ని గర్వపడేలా చేస్తుంది. ఇండియాలో లేడీ ఆఫీసర్స్‌ను ట్రైన్ చేసే ఏకైక ఆకాడమీ ఇదే. లేడీ ఆఫీసర్స్ అందరికీ సెల్యూట్. భరతమాతకు వందనం’’ అని పేర్కొన్నారు కమల్‌హాసన్. ‘‘చాలా కాలం తర్వాత ‘విశ్వరూపం–2’ ట్రాక్‌లోకి వచ్చింది. కమల్‌గారితో నటిస్తున్నందుకు ఆనందగా ఉంది. సినిమాలో నా లుక్ నచ్చింది. ఈ సినిమాలోని పాత్రలో భాగంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాను. 2018లో థియేటర్స్‌లో కలుసుకుందాం’’ అన్నారు ఆండ్రియా. -
అప్పుడు సెన్సార్ సర్టిఫికెట్.. రోలింగ్ టైటిల్సే మిగులుతాయి!
‘‘మిస్కిన్ (దర్శకుడు) విచిత్రమైన మనిషి. నేనూ, ఆయన సినిమా చేస్తున్నామనగానే ‘ఇద్దరు సైకోలు కలసి సినిమా చేస్తున్నారు’ అని ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. మిస్కిన్ దర్శకత్వంలో నటిస్తే... నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుందని గట్టి నమ్మకం. ఆయన డిఫరెంట్ సినిమాలు తీస్తారు. ఎనిమిదేళ్లుగా ఇద్దరం సినిమా చేయాలనుకుంటుంటే... ఈ ఏడాది కుదిరింది. హాలీవుడ్ ‘షెర్లాక్ హోమ్స్’ తరహా చిత్రమిది. అక్టోబర్‌లో తమిళ్లో ‘తుప్పరివాలన్’గా విడుదలై సూపర్ హిటై్టంది. తెలుగులోనూ హిట్టవుతుందనే నమ్మకముంది. నా కెరీర్లో వన్నాఫ్ ద బెస్ట్ ఫిల్మ్’’ అన్నారు విశాల్. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా జి. హరి నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్’. ఈ నెల 10న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ– ‘‘ఇందులో అద్వైత భూషణ్‌గా నటించా. ఒక్క పాట కూడా లేకుండా నేను సినిమా చేయడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆల్రెడీ ప్లాన్ చేశాం’’ అన్నారు. తెలుగులో మీ సిన్మాలు ఎందుకు లేటుగా విడుదలవుతున్నాయి? అనడిగితే.. ‘‘సెన్సార్ సమస్యలే కారణం. తమిళ్ సెన్సార్‌ను ముంబైకి షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి సర్టిఫికెట్ వచ్చేసరికి ఎంబీబీఎస్ డిగ్రీ చేతికొచ్చినట్టు ఉంటోంది. ఒక్కోసారి తెలుగులో పెద్ద హీరోల సినిమాలు ఉంటే వెనక్కి వెళ్లక తప్పడం లేదు. (నవ్వుతూ...) 10వ తేదీన సినిమా విడుదల కాకుంటే హరిని చంపేస్తా. తెలుగులో నా బలం హరి’’ అన్నారు విశాల్. ‘విజయ్ ‘మెర్సల్’కి మద్దతిచ్చారు. చెన్నైలో వరదలొస్తే హెల్ప్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా?’ అనడిగితే... ‘‘సీబీఎఫ్సీ (సెన్సార్) సర్టిఫికెట్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల జోక్యం ఏంటి? వాళ్లందరూ డైలాగులు కట్ చేస్తే... చివరికి సిన్మాలో సెన్సార్ సర్టిఫికెట్, రోలింగ్ టైటిల్స్ మాత్రమే మిగులుతాయి. ఇక, రాజకీయాలు అంటారా? పవర్ ఉంటేనే ప్రజలకు మేలు చేయగలుగుతానని ఫీలైన రోజున రాజకీయాల్లోకి వస్తా. మన రాజకీయ నాయకులు మంచి రాజకీయం చేయాలని నా ఆశ.అప్పుడు నాలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఉండదు’’ అని విశాల్ తెలిపారు. మన దేశంలోని సినీ ప్రముఖులందరూ కలసి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీపై ఓ ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కార్యక్రమంలో చిత్రనిర్మాత హరి, నటి ఆండ్రియా, మాటల రచయిత రాజేశ్ ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎవరితో.... అనేదిఅమ్మాయి ఇష్టమే! క్యాస్టింగ్ కౌచ్... (హీరోయిన్లపై లైంగిక వేధింపులు/పడకగదికి వస్తే సిన్మాలో ఛాన్స్ ఇస్తామని చెప్పడం)... ఇప్పుడీ అంశం ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ వినిపిస్తోంది! కొందరు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి గళం విప్పుతున్నారు. సోషల్ మీడియాలో సామాన్యులు ‘మీ టూ’ పేరుతో ఓ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ‘‘క్యాస్టింగ్ కౌచ్, మీటూ’లపై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఆండ్రియాను అడిగితే... ‘‘ఇండస్ట్రీలో నాకెలాంటి లైంగిక ఇబ్బందులూ ఎదురుకాలేదు. ఒకవేళ ఎదురైతే సినిమాలు వదులుకోవడానికి నేను సిద్ధమే. అయినా... ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగతం. మగవాళ్లు డిసైడ్ చేయాల్సిన విషయం కాదిది. మరొకరు బలవంతం చేయకూడదు’’ అన్నారు. ప్రేమ పెళ్లే... జనవరిలో! ఇంట్లో కోప్పడుతున్నారు... ‘పెళ్లెప్పుడు?’ అని! డిసెంబర్లో ‘నడిగర్ సంఘం’ ఓన్ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ నెక్ట్స్ మంత్... జనవరిలో పెళ్లి చేసుకుంటా. ‘పెద్దలు కుదిర్చిన వివాహమా? ప్రేమ వివాహమా?’ అని ‘సాక్షి’ అడగ్గా... ‘‘లవ్ మ్యారేజే (ప్రేమ పెళ్లే)! నాకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదండీ’’ అని నవ్వేశారు విశాల్. -
స్క్రీన్ టెస్ట్
► ఈ నటుని అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. కె. బాలచందర్ తొలి కోడి కూసింది’ సినిమా కోసం ఆయన పేరు మార్చారు? ఆ నటుడెవరు? ఎ) రఘువరన్ బి) ప్రకాశ్‌రాజ్ సి) జీవా డి) రమేశ్ అరవింద్ ► రియల్ లైఫ్ కపుల్ అయిన కృష్ణ, విజయనిర్మల రీల్‌పై అన్నా చెల్లెళ్లుగా నటించిన సినిమా పేరేంటి? ఎ) బొమ్మలు చెప్పిన కథ బి) అల్లూరి సీతారామరాజు సి) పండంటి కాపురం డి) సాక్షి ► బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌తో కలిసి ‘మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్’ (మర్ద్) అని ఒక క్యాంపైన్ నిర్వహించారు? ఈ క్యాంపైన్‌కి తన వాయిస్ వినిపించిన తెలుగు టాప్ హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) నాని సి) మహేశ్‌బాబు డి) రామ్‌చరణ్ ► గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘మాభూమి’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ సహాయనటి తర్వాత కాలంలో చాలా పేరు తెచ్చుకున్నారు? ఆమె ఎవరై ఉంటారు? ఎ) సుద బి) తెలంగాణ శకుంతల సి) అల్లరి సుభాషిణి డి) ప్రగతి ► ‘వినవే బాల నా ప్రేమ గోల..’ అంటూ ఈ నటుడు పాడిన పాటను ఇప్పటికీ ప్రేమికులు పాడుకుంటూనే ఉంటారు? ఈ పాట పడిన నటుడెవరు? ఎ) రమణారెడ్డి బి) రేలంగి సి) పద్మనాభం డి) రాజనాల ► ‘అబ్బాయిగారు’లో వెంకటేశ్ సవతి తల్లిగా నటించిన జయచిత్ర కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమా? ఎ) భారతంలో ఒక అమ్మాయి బి) యవ్వనం కాటేసింది సి) చిల్లరకొట్టు చిట్టెమ్మ డి) సోగ్గాడు ► తెలుగు ‘ప్రేమఖైదీ’లో హరీష్ హీరో. అదే సినిమా హిందీ రీమేక్‌లో కూడా అతనే హీరో. హిందీ సినిమాలో అతనితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బాలీవుడ్ నటితర్వాత చాలా పెద్ద స్టార్ అయ్యారు? ఆమె ఎవరు? ఎ) మాధురీ దీక్షిత్ బి) కరీనా కపూర్ సి) కరిష్మా కపూర్ డి) టబు ► ‘కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఏదీ ఉండదు’ అని రజనీకాంత్ ఏ సినిమాలో చెప్తాడు? ఎ) భాష బి) అరుణాచలం సి) నరసింహా డి) శివాజి ► దర్శక మేధావి ‘జెంటిల్మెన్ శంకర్’ ఏం చదువుకున్నారో తెలుసా? ఎ) మెకానికల్ ఇంజనీర్ బి) లా సి) లెదర్ టెక్నాలజీ డి) టక్స్‌టైల్ డిజైనింగ్ ► శ్రుతీహాసన్ ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) @యువర్స్ ట్రూలీ శ్రుతి బి) @ శ్రుతీహాసన్ సి) @ మీ శ్రుతీహాసన్ డి) @ శ్రుతీ సేస్ ► 2009లో ‘మిస్ టీన్ వరల్డ్’ టైటిల్ నెగ్గిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) ఐశ్వర్యా రాయ్ బి) సుస్మితా సేన్ సి) అమీ జాక్సన్ డి) ఆండ్రియా ► అంతస్తులు చిత్రంలో ‘దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా’అంటూ హుషారెత్తించిన కథానాయిక ఎవరో గుర్తున్నారా? ఎ) జమున బి) బి. సరోజా దేవి సి) భానుమతి డి) కృష్ణకుమారి ► ‘ఇంతేనయా తెలుసుకోవయా, ఈ లోకం ఇంతేనయా’ అనే పాట రాసిన రచయిత ఎవరు? ఎ) దాశరథి బి) వేటూరి సుందర రామ్మూర్తి సి) సముద్రాల డి) ఘంటసాల ► మహా శక్తిమాన్’ అనే హిందీ త్రీడి ఫిలిమ్‌కి దర్శకత్వం వహించింది ఓ ప్రముఖ తెలుగు కెమేరామేన్? ఆయనెవరు? ఎ) వి.యస్.ఆర్. స్వామి బి) ఎస్. గోపాల్‌రెడ్డి సి) జయనన్ విన్సెంట్ డి) జయరామ్ ► దర్శక–నిర్మాతగుణశేఖర్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏంటో తెలుసా? ఎ) సొగసు చూడతరమా బి) రామాయణం సి) లాఠీ డి) చూడాలని ఉంది ► పరుచూరి బ్రదర్స్ రచయితలుగా ఏ హీరోతో ఎక్కువ సినిమాలకు పనిచేశారు? ఎ) కృష్ణ బి) బాలకృష్ణ సి) చిరంజీవి డి) నాగార్జున ► యం.యం. కీరవాణి ఏ సంగీత దర్శకుని దగ్గర శిష్యరికం చేశారో చెప్పుకోండి చూద్దాం? ఎ) కేవీ మహదేవన్ బి) ఇళయరాజా సి) యం.ఎస్. విశ్వనాథన్ డి) చక్రవర్తి ► ఎన్టీఆర్, ఛాయాదేవి ఉన్న ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) కన్యాశుల్కం బి) శకుంతల సి) విజయం మనదే డి) మంగళసూత్రం ► నటుడు మంచు విష్ణు ఏ క్రీడలో యూనివర్సిటీ కెప్టెన్‌గా వ్యవహరించారు? ఎ) వాలీబాల్ బి) బాస్కెట్‌బాల్ సి) క్రికెట్ డి) హాకి ► ఈ క్రింది ఫోటోలోని బాలుణ్ణి గుర్తుపట్టారా? ఎవరతను? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) అక్కినేని నాగార్జున సి) కాంతారావు డి) హరనాథ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) బి 5) బి 6) డి 7) సి 8) సి 9) ఎ 10) బి 11) సి 12) సి 13) ఎ 14 ) ఎ 15) సి 16) ఎ 17) డి 18) ఎ 19) బి 20) ఎ -
నవంబర్‌లో స్పెషల్ డిటెక్టివ్!
‘మీ ఫీజెంత?’ అడుగుతాడు డిటెక్టివ్‌ని ఓ వ్యక్తి. కేసు తెలిస్తే కానీ ఫీజుకు కమిట్ అవ్వనంటాడు. అతను స్పెషల్ డిటెక్ట్వ్. కేసులో క్లూస్ వాటంతట అవే దొరకాలని చూడడు. దొరికేవరకు వెతుకుతాడు. వన్స్ కమిట్ అయితే ఆ కేసుని సక్సెస్‌ఫుల్‌గా ముగించాల్సిందే. పోలీసులు కూడా అప్పుడప్పుడు అతని హెల్ప్ తీసుకుంటుంటారు. అయితే ఇలాంటి స్పెషల్ డిటెక్టివ్‌కు ఓ మర్డర్ మిస్టరీ సవాల్‌లా నిలిచింది. ఆ మిస్టరీని ఆ ఎలా చేధించాడు? ఈ క్రమంలో అతనిపై ఎవరైనా ఎటాక్ చేశారా? వంటి ఆసక్తికర అంశాలతో తమిళంలో రూపొందిన చిత్రం ‘తుప్పరివాలన్’. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా జి.హరి నిర్మించారు. అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా కథానాయికలు. ఈ సినిమాను తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో వచ్చే నెల 10న విడుదల చేయనున్నారు. ‘‘తమిళంలో విశాల్ కెరీర్లో ఫస్ట్ వీక్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిది. తెలుగులోనూ సూపర్‌హిట్ అవుతుంది’’ అన్నారు నిర్మాత హరి. ప్రసన్న, కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్ విజయ్, అభిషేక్ శంకర్, జయప్రకాశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి స్వరకర్త. -
నన్ను ఫస్ట్ హీరోగా చూసింది తెలుగు ఇండస్ట్రీనే! – సిద్ధార్థ్
‘‘గృహం’ తమిళ్ ట్రైలర్ చుశా. హాలీవుడ్ రేంజ్లో ఉందనిపించింది. తెలుగు ట్రైలర్‌ను 20 సెకన్లకు మించి చూడలేకపోయా. నా చుట్టూ అందరూ ఉన్నప్పుడు ఫుల్ ట్రైలర్‌ను చుద్దామనుకున్నా. అంతలా నన్ను భయపెట్టింది. సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు నాని. సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా మిలింద్‌రావ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గృహం’. ఎటాకి ఎంటరై్టన్మెంట్ ప్రొడక్షన్లో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సిద్ధార్థ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాని మాట్లాడుతూ– ‘‘జెన్యూన్ హర్రర్‌ను హర్రర్‌గా చూపించే సినిమా ‘గృహం’. హర్రర్ సినిమా చేస్తున్నప్పుడే, లొకేషన్లోనే సినిమా ఏంటో తెలిసిపోతుంది. థియేటర్లో ఎంజాయ్ చేయలేం. అందుకే నేను లైఫ్‌లో హర్రర్ సినిమా చేయను’’ అన్నారు. సిద్దార్థ్ మాట్లాడుతూ – ‘‘మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా నేను, మిలింద్ ఒకేసారి జాయిన్ అయ్యాం. మాకు తెలిసిన వారికి జరిగిన వాస్తవ సంఘటనకు కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ జోడించి, ఈ సినిమాను రూపొందించాం. గిరీష్, రెహమాన్ మంచి పాటలు అందించారు. సినిమా హిట్ అవుతుంది. తెలుగులో నా టైప్ ఆఫ్ సినిమాలు ఎవరు చేస్తున్నారా? అని చూస్తే.. నాని అని తెలిసింది. నానీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తెలుగులో సిద్ధార్థ్ కమ్‌బ్యాక్ అంటున్నారు. ఆ మాట నాకు నచ్చదు. చిన్న గ్యాప్ వచ్చింది. మళ్లీ నేను వస్తే ‘సిద్ధార్థ్ మావాడు’ అని చెప్పడానికి ఎక్కువ టైమ్ పట్టదు. నన్ను ఫస్ట్ హీరోగా చూసింది తెలుగు ఇండస్ట్రీనే’’ అన్నారు. ‘‘సిద్దార్థ్‌ది నాది 16 సంవత్సరాల ఫ్రెండ్షిప్. ఇండియన్ హర్రర్ మూవీస్‌లో ‘గృహం’ మంచి సినిమాగా నిలుస్తుంది’’ అన్నారు మిలింద్. -
భయపెట్టడానికి రెడీ
తమిళసినిమా: ప్రేక్షకులను భయపెట్టడానికి అన్ని హంగులతో రెడీ అవుతోంది అవళ్ చిత్రం. చిన్న విరామం తరువాత నటుడు సిద్దార్థ్ నటించిన చిత్రం అవళ్. ఆ గ్యాప్‌ను పూర్తి చేయడానికన్నట్లు ఆయన అవళ్ చిత్రంతో తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో ఏక కాలంలో వస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాణంలోనూ సిద్దార్థ్ భాగస్వామి అయ్యారు. వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ, ఎటకీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా విలింద్రావ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి ఆండ్రియా నాయకిగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు అతుల్‌కులకర్ణి ముఖ్య పాత్రను పోషించారు. గిరీష్ సంగీతం, శియాస్ కృష్ణ చాయాగ్రహణను అందించిన ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేత రవిచంద్రన్ పొందారు. ఈయన ఇంతకు ముందు మంచి విజయాన్ని సాధించిన విక్రమ్ వేదా చిత్రాన్ని విడుదల చేశారన్నది గమనార్హం. ఈయన అవళ్ చిత్రాన్ని నవంబరు 3వ తేదీన విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్కంఠను కలిగించే హర్రర్ చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. అవళ్ చిత్రం ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేస్తుందన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని విజయాలు సాధించే నటుడు సిద్దార్ధ్ అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఆయన నటించిన అవళ్ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్ర కాన్సెప్ట్, సాంకేతిక పరిజ్ఞానం హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉంటాయని ఆయన తెలిపారు.