Ayodhya dispute
-
నటి స్వర భాస్కర్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు, అయోధ్య భూ వివాద కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై కించపర్చే వ్యాఖ్యల చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ఊరట లభించింది. ఆమెపై కోర్టు ధిక్కార చర్యకు సమ్మతి తెలిపేందుకు అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ ఆదివారం తిరస్కరించారు. ఈ ప్రకటన నేరపూరిత ధిక్కారం కాదు అని ఆయన పేర్కొన్నారు. స్వర భాస్కర్ వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టుపై ఎటువంటి అభ్యంతరకర వాఖ్య లేదని, సుప్రీం అధికారాన్ని తగ్గించే ప్రయత్నం జరగలేదని ఏజీ వెల్లడించారు. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ‘ముంబై కలెక్టివ్’ నిర్వహించిన ప్యానెల్ చర్చలో స్వర భాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది సంస్థపైదాడిగా పేర్కొంటూ ఆమెపై క్రిమినల్ ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ న్యాయవాదులు మహేక్ మహేశ్వరి, అనుజ్ సక్సేనా, ప్రకాష్ శర్మలతో కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏజీ ప్రతికూలంగా స్పందించారు. కాగా ఒక వ్యక్తిపైన అయినా కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించాలంటే కోర్టు ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్ 15 ప్రకారం అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అనుమతి అవసరం. -
సమాధులపై రామాలయం నిర్మిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ముస్లిం ప్రతినిధులు ఆలయ ట్రస్ట్ చైర్మన్ పరశరన్‌కు ఓ లేఖ రాశారు. బాబ్రీ మసీదు నిర్మాణ ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, వాటిపై రామ మందిరాన్ని నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ నగర ముస్లిం ప్రజలు ట్రస్టు అధిపతి పరశరన్‌కు ఫిబ్రవరి 15న లేఖ రాశారు. రామాలయ నిర్మాణం సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉందని ఆ లేఖలో ముస్లింలు ఆరోపించారు. ధ్వంసం చేయబడ్డ బాబ్రీ మసీదు ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, ఆ సమాధులపై రామాలయాన్ని నిర్మించడం హిందూ సనాతన ధర్మానికి విరుద్ధమని ముస్లిం తరఫు న్యాయవాది ఎంఆర్ శంషాద్ పేర్కొన్నారు. 1885లో జరిగిన అల్లర్లలో సుమారు 75 ముస్లింలు చనిపోయారని, వారి సమాధులు అక్కడే ఉన్నాయని ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లారు. బాబ్రీ మసీదు నిర్మించిన ప్రాంతాన్ని శ్మశానవాటికగా వాడారని, అలాంటి చోట రామాలయాన్ని ఎలా నిర్మిస్తారని ఆ లేఖలో ప్రశ్నించారు. ముస్లింల సమాధులపై రాముడి జన్మస్థాన ఆలయాన్ని నిర్మిస్తారా, ఇది హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుందా? దీనిపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. మొత్తం 67 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణం కోసం వాడుకోవడాన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు న్యాయవాది లేఖలో తెలిపారు. -
అయోధ్య తీర్పు: వారికి 5 ఎకరాలు ఎలా ఇస్తారు?
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సోమవారం హిందూ మహాసభ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ 7 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టులో ముస్లింలు ఇప్పటివరకూ 6 రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. హిందువుల నుంచి తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హిందూ మహాసభ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా డిసెంబర్ 2న తొలి రివ్యూ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని జామియత్ ఉలామా-ఏ-హింద్‌కు అధ్యక్షుడైన సయ్యద్ అష్షద్ రషీదీ దాఖలు చేశారు. రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిరం నిర్మాణం జరగాలని, ప్రతిగా ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని నవంబర్ 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
అయోధ్య తీర్పుపై 6 రివ్యూ పిటిషన్లు
న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర్ ఎంఆర్ శంషాద్ ద్వారా శుక్రవారం ఈ ఆరు పిటిషన్లు వేశారు. కాగా, అయోధ్యలో శుక్రవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేశాయి. మసీదుల్లో ప్రార్థనలు, ఆలయాల్లో పూజలు ప్రశాంతంగా జరిగాయి. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పురస్కరించుకుని ముస్లిం సంస్థలు ఏటా డిసెంబర్ 6వ తేదీని బ్లాక్ డేగా వ్యవహరిస్తూండగా, హిందువులు శౌర్యదినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. -
‘సుప్రీం’తీర్పులో వెలుగునీడలు
అయోధ్య రామాలయం, బాబ్రీ మసీదుల పేరిట దేశవ్యాప్తంగా జరిగిన మారణకాండ, హత్యలూ, మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ఎంతో బరువుతో తాజా తీర్పును వెలువరించవలసి వచ్చింది. సుప్రీం తీర్పు కన్నా ముందే రామాలయ నిర్మాణం అయోధ్యలో 2020 జనవరిలో మకర సంక్రాంతికి ప్రారంభమయి, 2024లో పూర్తవుతుందని విశ్వ హిందూ పరిషత్తు చెప్పడం బహుశా ‘దివ్యజ్ఞాన స్వరూపుల’కే సాధ్యమవుతుందేమో మనకు తెలియదు. బౌద్ధాన్ని నిర్మూలించడానికి బౌద్ధ ఆలయాలను కూల్చడమో, మార్చడమో చేసింది. జైన మతాన్ని నాశనం చేయడానికి శైవ కాకతీయులు రక్తపాతం సాగించారు. రాజరాజ నరేంద్రుడు జైనులు రచించిన ఆంధ్రభారతాన్ని తగలబెట్టించాడు. ఇవన్నీ రాజకీయ రాక్షసాలే! ‘‘ఒక నిర్మాణం శిథిలాలను బట్టి ఆ నిర్మాణాన్ని ఎవరో కూల్చిన దాని ఆనవాలు అనలేం. మొగలాయీ పాలకుల చర్యలపై జరిగే వాదోపవాదాలను బట్టి ఆ చర్యలపై అంచనాకు రాజాలం. అ లాంటి వాదాలకు సమాధానం న్యాయ చట్టమూ కాదు. అంతే గాదు, ఒక కట్టడం కింద మరొక కట్టడ నిర్మాణ శిథిలాలున్నట్టుగా చెప్పే భావన ఆ అట్టడుగు కట్టడం పునాదులను కూల్చివేసిన తర్వాతనే కొత్త కట్టడం (మసీదు) వెలిసిందేనని చెప్పడానికి నిదర్శనం కాదు’’ – అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన 1045 పేజీల తీర్పులో భాగం (9–11–2019) ‘‘సుప్రీంకోర్టు తీర్పుకు ప్రాధాన్యముంది. ఇక ముందు భవిష్యత్తులో ఎవరూ, గతించిన శతాబ్దాలలో ఎవరెవరో పాలకులు హిందూ దేవాలయాలను కూల్చేసి ఇతర, మత సంస్థల కట్టడాలను నిర్మించారని ఉత్తరోత్తరా వాదించకుండా నిరోధించేందుకు సుప్రీం చేసిన తాజా నిర్ణయానికి ప్రాధాన్యముంది’’ – ‘ది హిందూ’ లీగల్ కరస్పాండెంట్ (11–11–2019) స్వాతంత్య్రానంతరం గడచిన ఏడు దశాబ్దాలలో కాంగ్రెస్, బీజేపీ (ఆర్ఎస్ఎస్) పాలక వర్గాలు ఏదో రూపంలో ప్రత్యక్ష, పరోక్ష మార్గాల ద్వారా మత ప్రాతిపదికపై అనుసరిస్తూ వచ్చిన పాలనా విధానాల ఫలితంగా క్రమంగా దేశానికి వాటిల్లిన ప్రమాదకర పరిణామాలను తనకున్న పరిధిలో దేశ అత్యున్నత న్యాయస్థానం అనుసరించిన పరిష్కార మార్గం అతి సునిశితమైనదిగా, నిక్కచ్చి అయినదిగా కనిపించకపోయినా రాజకీయ పాలకులు స్వార్థ ప్రయోజనాల కొద్దీ దేశంపై రుద్దిన విషమ పరిణామానికి ఉన్నంతలో ఒక విరుగుడుగా భావించాలి. పాలకులు రాను రాను ఏ పరిస్థితికి దేశాన్ని, ప్రజలను నెడుతూ వచ్చారంటే – బహుళ మత విశ్వాసాలు, విభిన్న భాషా, సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలతో కూడిన దేశాన్ని, లౌకిక రాజ్యాంగ(సెక్యులర్) వ్యవస్థను పరమ సంకుచిత స్థాయికి దిగజా ర్చారు. తనకు వీలైనంతలో ఒక ఉన్నత స్థాయి నైతిక సూత్రాన్ని, మతాతీతమైన గుణపాఠాన్ని అందించే బాధ్యతను అత్యున్నత ధర్మా సనం (సుప్రీంకోర్టు) తన భుజస్కంధాలపై మోపుకొనవలసి వచ్చింది. అయోధ్య పేరిట రామాలయం, బాబ్రీ మసీదుల పేరిట దేశవ్యాప్తంగా జరిగిన మారణకాండ, హత్యలూ, మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ఎంతో బరువుతో తాజా తీర్పును వెలువరించవలసి వచ్చింది. ఈ క్రమంలో అది దేశం ముందుగతిని, భవిష్యత్తు ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ తీర్పునకు సాహసించింది. అయితే ఏ రకమయిన అన్యాయాన్నైనా చరిత్ర క్షమించదు, లిఖిస్తూనే ఉంటుంది. అందుకే ఘటనల లోతుపాతులకు వెళ్లి గాయాలను తుడిచే ప్రయత్నంలో వర్తమాన, భవిష్యత్తు భారత ప్రజా బాహుళ్యం విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొన్నందువల్లనే, రక్తచరిత్రకు ముగింపు పలికే విశాల దృష్టితో తాజా తీర్పు చెప్పవలసి వచ్చిందని మరవరాదు. ఈ సందర్భంగా ‘‘గాలిపటాలు’’ సినిమాలో మాధవపెద్ది పాడిన పాట గుర్తుకొస్తోంది. ‘‘తెలుపు నలుపుల చదరంగంలో/మానవులంతా పావులురా/తెలిసి చేసినా తెలియక చేసినా/తప్పు ఒప్పుగా మారదురా!’’ దేశ పాలకులైన వారు కొంటెవాళ్లుగా వ్యవహరించకూడదు. దేశం ప్రశాంతంగా ఉండాలని మనసారా ఆశించిన ఏ ధర్మాసనమైనా నేటి తరంతో పాటు ముందు తరాలను కూడా దృష్టిలో పెట్టుకునే సామాజిక శాంతి కోసం తీర్పు చెబుతుందిగానీ, జరిగిన జరుగుతోన్న పాలక వర్గాల ప్రజావ్యతిరేక చర్యలకు ‘‘తాతాచార్ల ముద్రలు’’ వేయదు సుమా! అలాగే, బాబ్రీ మసీదు కూల్చివేతను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 9 నాటి సుప్రీం తీర్పును రెండో ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ పతనంతో పోల్చిన నాయకులున్న దేశం మనది! సుప్రీం తీర్పు కన్నా మూడురోజుల ముందే (నవంబర్ 6న) రామాలయ నిర్మాణం అయోధ్యలో 2020జనవరిలో సంక్రాంతికి ప్రారంభమయి, 2024లో అదే రోజున పూర్తవుతుందని విశ్వ హిందూ పరిషత్తు కరాఖండీగా చెప్పడం బహుశా ‘దివ్యజ్ఞాన స్వరూపుల’కే సాధ్యమవుతుందేమో మనకు తెలియదు. ఏతా వాతా దేవాలయ నిర్మాణం పూర్తయ్యే సంవత్సరాన్ని 2024గా ‘అంజనం’ వేసినట్టు ప్రకటించడంలో ఔచిత్యమంతా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే నేత’ అన్న సూత్రంలో ఉండి ఉండాలి! పైగా బాబ్రీ మసీదు కట్టడం కింద ఏదో కట్టడముందని తోస్తోందని జాతీయ పురావస్తుశాఖ ఒక నివేదికలో జోస్యం చెప్పింది, కానీ ఇలా ఉబుసుపోని నిర్ణయాలకు రావడం సరైంది కాదని సుప్రీం చెప్పింది! ఏతా వాతా భారతదేశ సుదీర్ఘ చారిత్రక నేపథ్యాన్ని, సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ విలువనూ బాబ్రీ విధ్వంసం తరువాత పక్కనే మిగిలిన కేవలం 2.77 ఎకరాల కొండ్రకు, దాని సంకుచిత వైశాల్యానికీ కుదించిన దుర్దశకు చేరుకున్నాం! దేశం పరువు ప్రతిష్ఠలు శిలా ప్రతిమలతో ముగిసిపోవు, వీటి వైభవ ప్రాభవాలకు వాటిని ఆదరించే మనుషులు, వారి విభిన్న అభిరుచులే శాశ్వత చిహ్నాలు! అందుకే సుప్రీం తన తీర్పులో ‘‘1992 డిసెంబర్ 6న 16వ శతాబ్దినాటి మసీదును కూల్చేయటం పరమ మూఢత్వంతో కూడిన చర్యే కాదు, ప్రజల ప్రార్థనా స్థలాన్ని పనిగట్టుకుని మరీ నాశనంచేసిన దుర్మార్గమ’’ని అభిశంసించవలసి వచ్చింది. అందుకే రాజ్యాంగం పౌరులందరినీ సమ దృష్టితో చూస్తుంది. అన్నిరకాల వ్యక్తిగత విశ్వాసాలు, ప్రార్థనలు, పూజలు, పురస్కారాలు అన్ని మతాలకూ సమాన ధర్మాలేనని కోర్టు తీర్పులో స్పష్టం చేయవలసి వచ్చింది! అంతే గాదు 16వ శతాబ్ది చరిత్రను పరిశీలిస్తే బాబర్ కాలంలో నిర్మించిన మసీదును తరువాతి కాలంలో సందర్శించిన ప్రసిద్ధ చైనా తీర్థయాత్రికుడు హుయాన్‌త్సాంగ్ గాని, అదే కాలం నాటి ‘‘రామచరిత మానస’’ సృష్టికర్త తులసీదాస్ గాని తమ రచనలలో మాటమాత్రంగానైనా రామాలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారన్న ప్రస్తావన చేసి ఉండేవారు. కాని అలాంటి దాఖలాలు లేకపోగా తులసీదాస్ తన రామాయణ కావ్యాన్ని నాటి స్థానిక భాష ‘‘అవధి’’లో రచించినందుకు ఛాందస సంస్కృత పండితులు ఆ గ్రంథాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించారు. వారినుంచి తప్పించుకునేందుకు వారణాసి, సాకేతల మధ్య అజ్ఞాతంగా తిరుగుతూ ఒక ముస్లిం స్నేహితుడి ఇంట్లో తన రచనను భద్రంగా దాచుకున్నాడు తులసీదాస్! అంతకుముందు బాబ్రీ కింది భాగంలో బలమైన స్తంభాలతో కూడిన శిథిల ‘‘కట్టడం ఏదో ఉన్నట్టు ఉంది’’ అని 2003 లో అనుమానం వ్యక్తం చేసిందే గాని రుజువు చూపలేకపోయింది! దీన్ని ఇతర పురావస్తు పరిశోధకులు ‘‘రుజువుకు అందని, పరస్పర విరుద్ధమైన’’ భావంతో కూడిన నివేదిక అని ఖండించారు. కాగా ప్రసిద్ధ భారత చరిత్రకారులలో ఒకరైన డాక్టర్ డి.ఎన్. ఝా ‘‘అయోధ్య వివాదం విశ్వాసానికి హేతు వాదానికి మధ్య సాగుతూ వచ్చిన యుద్ధం’’ అని వర్ణించారు. బాబ్రీ మసీదు కింద దేవాలయ నిర్మాణమే లేదన్నారు! అంతేకాదు, మరో ఇద్దరు ప్రసిద్ధ పురావస్తు శాస్త్రజ్ఞులు సుప్రియావర్మ, జయమీనన్ అసలు పురావస్తుశాఖ అనుసరిస్తున్న పద్ధతులు... దేశీయ పరిశోధకులపై విధిస్తున్న ముందస్తు షరతులను దుయ్యబడుతూ... ‘‘ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ’’ (2010)లో తాము పురావస్తుశాఖ పరిశోధనా పద్ధతుల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో వెల్లడించాల్సి వచ్చింది. అందుకే ఈ సందర్భంగా, సుప్రసిద్ధ సాహితీవేత్త సారస్వత హరి విల్లు, నాలుగు వేదాలను ఒక్క చేతిమీదుగా వాచకంలో అందించిన రుషి డాక్టర్ దాశరధి రంగాచార్య రామాయణం గురించి రాసిన వాక్యాలను ఒకసారి పాఠకుల వివేచనార్థం యిక్కడ నివేదిస్తున్నాను: ‘‘రామాయణం నేల చెక్కమాత్రం కాదు, అది ఒక ఆదర్శం, ఒక శీలం, ఒక సభ్యత, ఒక నాగరికత, ఒక సంస్కృతి, రాజకీయానికి అధికారకాంక్ష తప్ప అన్యం తెలియదు, వేదంలో, ఉపనిషత్తులో, రామాయణ, భారతాల్లో ఆలయం లేదు. విగ్రహం లేదు, అర్చనలు లేవు, అలా అని దైవం లేదని కాదు, ఆ స్వామి సర్వత్రా ఉన్నాడు. అందుకే చీమను పూజించినా, స్వామిని పూజించినా ఒకటే అన్నారు. అసలు వాస్తవం – భారత భూమిలో ఆలయ సంప్రదాయం జైనులు, బౌద్ధుల గురించి మొదలైంది. అయోధ్యలోని ప్రస్తుతం రామజన్మభూమి స్థలంలో తొలుత జైన మందిరం ఉండేదట! భారత తాత్వికత ఏకశిల కాదు. ఇది ఆలోచనల, సిద్ధాంతాల నిరంతర ప్రధాన వాహిక. సమన్వయం భారత విధానం. అయినా సిద్ధాంతాల కలహాలు, హింసా రాజకీయం తప్పలేదు! సనాతన ధోరణి బౌద్ధాన్ని నిర్మూలించడానికి బౌద్ధ ఆలయాలను కూల్చడమో, మార్చడమో చేసింది. జైన మతాన్ని నాశనం చేయడానికి శైవ కాకతీయులు రక్తపాతం సాగించారు. రాజరాజ నరేంద్రుడు జైనులు రచించిన ఆంధ్రభారతాన్ని తగలబెట్టించాడు. ఇవన్నీ రాజకీయ రాక్షసాలే! ఏ సిద్ధాంతము, ఏ మతమూ ద్వేషాన్ని, హింసను బోధించదు, ప్రోత్సహించదు. అందువల్ల అయోధ్యను రాజకీయం చేయడం కేవలం కళేబర పూజ– వానర ఆచారం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆర్థికాంశాలు, ఫలితాలే దిక్సూచి..!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఈవారంలో వెల్లడికానున్న పలు కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లో సానుకూలతను నింపేందుకు ఆస్కారం ఉందనేది మార్కెట్ వర్గాల మాట. దీపావళి నుంచి ఇప్పటివరకు 4%, సెప్టెంబర్ 20 నుంచి 13 శాతం ర్యాలీ చేసిన ప్రధాన సూచీలు.. ఇదే జోరును కొనసాగించవచ్చని విశ్లేషిస్తున్నాయి. ‘లార్జ్, బ్లూ–చిప్ షేర్ల వాల్యుయేషన్స్ మళ్లీ ప్రీమియం స్థాయికి చేరుకున్నాయి. ఇది మార్కెట్ ట్రెండ్‌పై ప్రభావం చూపొచ్చు. అయితే, దీర్ఘకాలిక లాభాల కోసం మార్కెట్ అవుట్‌లుక్ మెరుగుపడింది. సంస్కరణలు, ఉద్దీపనలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల, వర్షాలు ఆశాజనకంగా ఉండటం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి సానుకూల అంశాల ప్రభావాన్ని ప్రస్తుత కంపెనీల ఫలితాల వెల్లడి సీజన్ అద్ధం పడుతోంది. ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో ఎర్నింగ్స్ వృద్ధి బాగుండవచ్చనే సంకేతాలు ఇస్తుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఈ వారంలో వెల్లడికానున్న ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రెండ్ ఉంటుందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. స్థూల ఆర్థికాంశాలు.. సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, తయారీ రంగ ఉత్పత్తి డేటా నవంబర్ 11న (సోమవారం) వెల్లడికానున్నాయి. ఇక మంగళవారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, గురువారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రానున్నాయి. 2,700 కంపెనీల ఫలితాలు.. ఈ వారంలో 2,700 కంపెనీలు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి లార్జ్‌క్యాప్స్‌లో కోల్ ఇండియా, హిందాల్కో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, భారతి ఎయిర్టెల్, ఓఎన్జీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మదర్సన్ సుమి సిస్టమ్స్, ఆయిల్ ఇండియా వంటివి ఉన్నాయి. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. గురునానక్ 550వ జయంతి సందర్భంగా మంగళవారం (12న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితమైంది. బుధవారం (13న) మార్కెట్ యథావిధిగా ప్రారంభంకానుంది. అయోధ్యపై సుప్రీం తీర్పు ప్రభావం... అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు శనివారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. రామజన్మభూమి న్యాస్‌కే ఈ వివాదాస్పద భూమి చెందుతుందని, రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని సూచించింది. రెండున్నర దశాబ్దాల వివాదాస్పదానికి తెరపడిన నేపథ్యంలో ఈ అంశంపై మార్కెట్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కేఆర్ చోక్సి ఇన్వెస్ట్మెంట్ ఎండీ దేవాన్ చోక్సి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని, వివాదం ముగియడంతో ఈ రాష్ట్ర వాటా మెరుగుపడొచ్చని ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా విశ్లేషించారు. అయితే, తీర్పు ప్రభావం మార్కెట్‌పై పెద్దగా ఉండకపోవచ్చని ట్రేడింగ్ బెల్స్ సీనియర్ విశ్లేషకులు సంతోష్ మీనా అన్నారు. నవంబర్‌లో ఎఫ్‌పీఐ నిధులు రూ. 12,000 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో రూ. 12,000 కోట్లను కుమ్మరించారు. నవంబర్ 1–9 కాలంలో వీరు స్టాక్ మార్కెట్లో రూ. 6,434 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 5,673 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా పేర్కొంది. -
అయోధ్య ప్రశాంతం
లక్నో/అయోధ్య/న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి మందిరం–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హిందూ ముస్లిం నేతలతో సమావేశమై తీర్పు అనంతర పరిస్థితులపై చర్చించారు. కీలక తీర్పు వెలువరించిన ధర్మాసనంలోని జడ్జీల భద్రత కోసం అధికారులు ముందుజాగ్రత్తగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, కోర్టు తీర్పు ప్రకారం మసీదు కోసం ఐదెకరాల భూమిపై చర్చించేందుకు ఈ నెల 26న సున్నీ వక్ఫ్‌బోర్డు సమావేశం కానుంది. ఆలయ పట్టణం అయోధ్యలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసు బలగాల గస్తీ, తనిఖీలు కొనసాగుతున్నా పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి తిరిగి మొదలయింది. తీర్పు సందర్భంగా శనివారం నాటి ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులకు బదులుగా ఉత్సాహ పూరిత వాతావరణం కనిపించింది. హనుమాన్ గర్హి, నయాఘాట్ల వద్ద జరిగే శ్రీరామ, హనుమాన్ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రికాబ్‌గంజ్ తదితర ప్రాంతాల ప్రజలు వార్తా పత్రికలు చదివేందుకు ఆసక్తి చూపారు. ‘మాకిది చాలా అరుదైన, కొత్త శుభోదయం, ప్రత్యేకమైన ఆదివారం. అయోధ్య వివాదం శాశ్వతంగా పరిష్కారం కావడం ఎంతో ఊరట కలిగించింది’ అని అయోధ్యలోని ఓ హోటల్ మేనేజర్ సందీప్ సింగ్ అన్నారు. ‘రామ్‌లల్లాకు అనుకూలంగా తీర్పు రావడంతో పూలు, పూలదండలకు బాగా డిమాండ్ పెరుగుతుందని వారణాసి తదితర నగరాల నుంచి అదనంగా తెప్పిస్తున్నాం’ అని పూల దుకాణం యజమాని అనూప్ తెలిపారు. శనివారం హోం మంత్రి బిజీబిజీ తీర్పు వెలువడిన శనివారం హోం మంత్రి అమిత్ షా మిగతా కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకున్నారు. తీర్పు అనంతర పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎంలు, సీనియర్ పోలీసులు, నిఘా విభాగాల అధికారులతో ఆయన రోజంతా మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ ప్రముఖ హిందు, ముస్లిం నేతలతో సమావేశమయ్యారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మత పెద్దలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూపీలో 77 మంది అరెస్ట్ ఉత్తరప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన 77 మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 34 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా సామాజిక మాధ్యమాల్లోని 8,275 పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోగా, అందులో 4,563 పోస్టులు ఆదివారం పోస్టు చేసినవిగా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనూ అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 26న సున్నీ వక్ఫ్ బోర్డు భేటీ మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఈనెల 26వ తేదీన సమావేశం కానుంది. ఆ ఐదెకరాల భూమిని తీసుకోవాలా వద్దా అనే విషయమై ఆ సమావేశంలో నిర్ణయిస్తామని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జఫర్ ఫరూఖీ తెలిపారు. ‘కోర్టు తీర్పును సవాల్ చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే, మసీదు కోసం ఆ స్థలాన్ని తీసుకోరాదని కొందరు.. ఆ స్థలంలో విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పక్కనే మసీదు నిర్మిస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. దీనిపై వివరంగా చర్చిస్తాం’అని ఫరూఖీ వెల్లడించారు. జడ్జీలకు భద్రత పెంపు అయోధ్య కేసు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జీలకు భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. ‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, కాబోయే సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించాం. వీరి నివాసాలకు దారితీసే రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఈ జడ్జీల వాహనాల వెంట సాయుధ బలగాలతో ఎస్కార్ట్ వాహనం ఉంటుంది’అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 7 భాషలు, 533 డాక్యుమెంట్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య భూవివాదానికి సంబంధించిన తీర్పు కోసం సుప్రీంకోర్టు భారీ కసరత్తే చేసింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, టర్కిష్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లోని చరిత్ర, సంస్కృతి, పురావస్తు, మత పుస్తకాలను తిరగేసింది. ఇవేకాక మత సంబంధిత కావ్యాలు, యాత్రా వర్ణనలు, పురావస్తు నివేదికలు, బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందరి చిత్రాలు, గెజిటీర్లు, స్థూపాలపై గల శాసనాల అనువాదాలు, ఇలా 533 డాక్యుమెంట్లను పరిశీలించింది. -
ఒకేరోజు.. రెండు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పోలీసు యంత్రాం గం విషమ పరీక్షలను ఎదుర్కొంది. అయోధ్య తీర్పు ఒకవైపు, ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్‌బండ్ మరోవైపు పోలీసు యంత్రాంగాన్ని కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయోధ్య తీర్పుపై స్ప ష్టత రావడంతో శుక్రవారం రాత్రి 9గంటల నుంచి రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయా యి. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుక్షణం పహారాలో ఉండి అవాంఛనీయ ఘటనలు లేకుండా జాగ్రత్తపడింది. చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే హౌస్ అరెస్టులు చేశారు. అదే విధంగా గ్రామాల వారీగా జల్లెడ పట్టి ఆర్టీసీ కారి్మకులను సైతం అరెస్టు చేసి చలో ట్యాంక్‌బండ్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. శనివారం నాడు ట్యాంక్‌బండ్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు మినహా... రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు ఎక్క డా చోటుచేసుకోకపోవడంతో పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది. అయోధ్యతో ఉత్కంఠ... ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై తీ ర్పును శనివారం ఉదయం వెల్లడించనున్నట్లు శుక్ర వారం రాత్రి 9గంటలకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టింది. దీంతో దేశమంతా ఒక్కసారిగా అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశాయి. వెనువెంటనే డీజీపీ కార్యాలయం రాష్ట్రంలో హై అలర్ట్‌ను ప్రకటించింది. ఆ తర్వాత అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసుల కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ న్విహించారు. అన్ని జిల్లాల కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. అదే సమయంలో చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌తో పాటు సైబరాబా ద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో డీజీపీ ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితులు అదుపు తప్పకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అనుక్షణం తనతో టచ్‌లో ఉండాలని సూచించారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో గత రెండు వారాలుగా రాష్ట్ర వ్యాప్తం గా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో మత పెద్దలు, పీస్ కమిటీలతో పోలీసు కమిషనర్లు, ఎస్పీలు సమావేశాలు నిర్వహించారు. సోషల్ మీడియాపైగా పోలీసు యంత్రాంగం నిఘా పెట్టింది. అనుమానితులు, నేరచరిత ఉన్నవారిని ముందస్తుగా అరెస్టులు చేయగా... ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహించారు. ఉద్రిక్తంగా చలో ట్యాంక్‌బండ్ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ ఉద్రిక్తలకు దారితీసింది. సీటీ పోలీస్ కమిషనర్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీసులకు శుక్రవారం నుంచే కంటిమీద కునుకు లేదు. శుక్రవారం సాయంత్రం నుంచే ఆర్ఏఎఫ్, సివిల్, ఏఆర్, ఆక్టోపస్ బలగాలు 20వేల మంది నగరంలో పహారా కాశారు. చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి నిరాకరించినప్పటికీ ఆందోళనకారులు వేల సంఖ్యలో వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇంతలో ఆందోళనకారులు పోలీసులపైకి రాల్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో 400 మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు. -
న్యాయ పీఠంపై... ఆ ఐదుగురూ!!
అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు ఐదుగురు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి సారథ్యం వహించగా... జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ ఈ తీర్పును వెలువరించారు. వ్యవహారాన్ని ఒక స్థల వివాదంలా చూసిన ధర్మాసనం... స్థలం ఎవరికి చెందుతుందనే తీర్పునిచ్చింది. తీర్పుపై ఐదుగురూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేయగా... ఒక జడ్జి మాత్రం... ఆ స్థలం శ్రీరాముడి జన్మస్థానమనే హిందువుల విశ్వాసానికి, నమ్మకానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొనటం గమనార్హం. ఈ ఐదుగురి వివరాలూ చూస్తే... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్... 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. 1978లో గౌహతి బార్ కౌన్సిల్లో చేరి గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2011లో పంజాబ్–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే రాజ్యాంగ ధర్మాసనంలో రెండో న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే. 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరిన ఈయన... బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో పని చేశారు. బోంబే హైకోర్టులోనే దాదాపు 21 ఏళ్లపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీనియర్ న్యాయవాది అయ్యారు. 2000లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఈ నెల 18వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపడతారు. 2021 ఏప్రిల్ వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ చంద్రచూడ్ బోంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1998 నుంచి దాదాపు రెండేళ్లపాటు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు. 2000లో బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా... 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టుకు వచ్చారు. ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉపన్యాసాలిచ్చారు. జస్టిస్ అశోక్ భూషణ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అశోక్ భూషణ్ జాన్‌పూర్‌లో జన్మించారు. అలహాబాద్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన అశోక్ భూషణ్... 1979లో యూ పీ బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. అలహాబాద్ హైకోర్టులో వివిధ పోస్టులలో పనిచేసిన అశోక్ భూషణ్ 2001లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తిగా, 2015లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు జస్టిస్ అబ్దుల్ నజీర్ అయోధ్య కేసు ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్. కర్ణాటకలోని కోస్తా ప్రాంతం బెళువాయికి చెందిన ఈయన 1983లో కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించకుండానే నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారిలో ఈయన మూడో వ్యక్తి కావడం గమనార్హం. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హంగా ప్రకటించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ నజీర్ అప్పట్లో ఆ తీర్పును వ్యతిరేకించారు. -
ఏపీ, తెలంగాణలో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్/అమరావతి: అయోధ్య అంశంపై శనివారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పీస్ కమిటీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. తీర్పు ఎలా వచ్చినా.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. అనుమానితులు, నేరచరిత గల వారిపై నిఘా ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో పికెటింగ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదనే ఉత్తర్వులు వెలువడ్డాయి. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైన, అనుమానిత ప్రాంతాలకు వాటర్ కెనన్లు, వజ్ర వాహనాలను తరలించనున్నారు. మరీ ముఖ్యంగా నిజామబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. సోషల్ మీడియాపై నిఘా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఏ వర్గాన్నీ కించపరిచేలా కామెంట్లు, పోస్టులు, వీడియోలు పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. ఏపీ అంతటా అప్రమత్తం అయోధ్య కేసులో తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కడికక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. డీజీపీ గౌతం సవాంగ్ ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. -
‘డిసెంబర్ 6లోపే రామ మందిర నిర్మాణం’
ఉన్నావ్(యూపీ): అయోధ్యలోని రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా డిసెంబర్ 6లోపే రామ మందిర నిర్మాణం ప్రారంభం కానున్నట్లు శనివారం వివాదస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టులో రామ మందిర నిర్మాణంపై జరుగుతున్న విచారణ పూర్తికావచ్చిందని తీర్పు వెల్లడించడమే మిగిలి ఉందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు రామ మందిరానికి అనుకూలంగానే వస్తుందని నొక్కిచెప్పారు. నిరవధికంగా నలభై రోజులపాటు ఇరుపక్షాల వాదనలు విని, విచారించిన సుప్రీంకోర్టు జడ్జీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో పురావస్తు శాఖ వాస్తవాలను వెలికితీసి సుప్రీంకోర్టుకు సమర్పించిందని, ఇప్పటికే రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్ బోర్డు అంగీకారం తెలిపిందన్నారు. ఒకవేళ అయోధ్య కేసులో సుప్రీం కోర్టు రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అని ప్రశ్నించగా.. ‘నేను సాక్షిని. సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందనే అంశంపై నాకు స్పష్టత ఉంది. డిసెంబర్ 6లోపే రామ మందిర నిర్మాణం ప్రారంభమవుతుంద’ని వక్కాణించారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే, ఆ భూమిని తాము ఎవరికీ ఇవ్వబోమని ఇటీవల లక్నోలో జరిగిన సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు తీర్మానించింది. -
‘హోరాహోరీ’ వాదనలకు తెర
అయోధ్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానంలో దాదాపు 40 రోజులపాటు ఏకబిగిన కొనసాగిన వాదప్రతివాదాలు బుధవారం ముగిశాయి. వచ్చే మూడు రోజుల్లో లిఖితపూర్వక నివేదనలు దాఖలు చేయాలని అన్ని పక్షాలనూ అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వచ్చే నెల 17న పదవీ విరమణ చేస్తున్నందువల్ల ఆలోగా తీర్పు వెలువడుతుంది. సహజంగానే ఆ తీర్పు కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తు న్నారు. 2.77 ఎకరాల నిడివి ఉన్న స్థలంపై ఈ వివాదమంతా కేంద్రీకృతమై ఉంది. రామజన్మభూమి అనేది ఈ దేశ పౌరుల విశ్వాసానికి సంబంధించిన అంశమని, దాన్ని న్యాయస్థానాలు ఇష్టానుసారం నిర్ణయిస్తామంటే కుదరదని హిందూత్వ సంస్థలు వాదించగా... అది బాబ్రీ మసీదు స్థలమనీ, దాన్ని తమకు అప్పగించాలని ముస్లిం వక్ఫ్ బోర్డు వగైరాలు వాదించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. న్యాయస్థానం ఏ తీర్పునిచ్చినా దానికి కట్టుబడి ఉంటామని దాదాపు అన్ని పక్షాలూ చెబుతున్నాయి. అయితే కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలని ఒకరు, తమ అధీనంలో ఉండిన ప్రాంతం గనుక మళ్లీ తమకే అప్పగించాలని మరొకరు కోరుకుంటున్నారు. ఇది సహజమే. దేశ చరిత్రలో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించి తీర్పు వెలువడిన కేశవా నంద భారతి కేసు విచారణ తర్వాత ఇంత సుదీర్ఘకాలం విచారణ కొనసాగిన కేసు ఇదే. అయోధ్య అనగానే కోట్లాదిమంది హిందువులకు రాముడు గుర్తుకొస్తాడు. భక్తకోటి హృద యాల్లో రాముడు, అయోధ్య అంతగా పెనవేసుకుపోయాయి. కానీ ఇరవైయ్యేడేళ్లుగా అయోధ్య అన గానే పెను వివాదం కూడా గుర్తుకురావడం మొదలైంది. కొందరిలో ఆవేశకావేశాలు కట్టుదాటి, ఉద్వే గాలు ఒక్కసారిగా పెల్లుబికి ఆ పట్టణంలోని బాబ్రీ మసీదును కూల్చటం ఇందుకు కారణం. వాస్తవా నికి ఆ వివాదం అంతకు నాలుగు దశాబ్దాల క్రితానిదే అయినా, ఆ కూల్చివేత ఉదంతం వివాదాన్ని కీలక మలుపు తిప్పింది. అనంతరం దేశవ్యాప్తంగా పలుమార్లు జరిగిన విషాద ఘటనల పరంపర ఈ దేశ పౌరుల శ్రేయస్సును కోరేవారందరినీ కలవరపెట్టింది. పలువురిలో ఒక రకమైన నిర్లిప్తత, నిర్వే దం అలుముకున్నాయి. సామరస్యం మళ్లీ చివురిస్తుందా అన్న సందేహం ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే రాజకీయ నాయకులు ఈ పరిస్థితినుంచి లబ్ధి పొందుదామని చూశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించారు. కానీ ‘కాలం మారుతుంది... చేసిన గాయాలు మాన్పు తుంది’ అని ఒక కవి అన్నట్టు అనంతరకాలంలో క్రమేపీ పరిస్థితి మారింది. సంయ మనం వెల్లివిరి యడం ప్రారంభమైంది. అయినప్పటికీ ఆ చేదు జ్ఞాపకాల నేపథ్యంలో అయోధ్యపై వివిధ కోర్టుల్లో తీర్పులు వెలువడిన ప్రతి సందర్భంలోనూ... ఇంకా చెప్పాలంటే ఆ తీర్పులు ఫలానా తేదీన వెలువడ తాయని ప్రకటించిననాటినుంచీ ప్రభుత్వాలు అప్రమత్తం కావడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వడం రివాజుగా మారింది. అయితే అదృష్టవశాత్తూ ప్రజలెప్పుడూ సంయమనం తోనే ఉంటున్నారు. దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నానుతూ మొదట్లో స్థానికంగా, అనంతరకాలంలో దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఈ వివాదానికి న్యాయబద్ధమైన పరిష్కారం అన్వేషించా లని, దీనికొక ముగింపు పలకాలని సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించడం మెచ్చుకోదగింది. అది ఎల్లకాలమూ వివాదంగానే మిగిలిపోవాలని ఆశిస్తున్న శక్తులకు ఈ ధోరణి నచ్చలేదు. దానికి తగినట్టే విచారణక్రమంలో సమస్యలూ ఎదురయ్యాయి. ఇలా ఎన్నో అవాంతరాలను, అభ్యంతరాలను అధిగ మించి విచారణ పూర్తయింది. ఈ విచారణ సమయంలో భిన్న పక్షాల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు సైతం ఎలా సంయమనం కోల్పోయారో, కోపతాపాలు ప్రదర్శించారో అందరూ చూశారు. ఆఖరికి విచారణ తుది ఘట్టానికి వచ్చిందనుకున్న దశలో కోర్టు హాల్లో ఉద్వేగాలు చోటు చేసుకోవడంతో ఆగ్రహించిన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఇలాగైతే తాము నిష్క్ర మించాల్సివస్తుందని హెచ్చరించవలసి వచ్చింది. వివాదం అత్యంత సంక్లిష్టమైనది, జటిల మైనది అయినప్పుడు ఇవన్నీ సహజమే. వివాదంలో హిందువులంతా ఒకపక్కా, ముస్లింలంతా ఒకపక్కా ఉన్నారనుకోవడం పొరపాటు. రెండుచోట్లా వైరిపక్షాలున్నాయి. ఈ వివాదం తమదంటే, తమదని చెప్పుకునేవారున్నారు. ఈ వివాదంలో శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఖలీఫుల్లా వంటివారి ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం కూడా నడిచింది. వారిచ్చిన నివేదికపై ధర్మాసనం పరిశీలిం చాల్సి ఉంది. మొత్తానికి 1994లో పీవీ నరసింహారావు హయాంలో ఈ వివాదాన్ని రాష్ట్రపతి ద్వారా నివేదిం చినప్పుడు దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం అనంతరకాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వివాదాన్ని స్వీకరించక తప్పలేదు. 2010లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేసి ముగ్గురికి పంచాలన్న వెలువరించిన తీర్పు ఏ ఒక్కరినీ సంతృప్తిపరచలేకపోయింది. కక్షిదారులెవరూ కోరని కొత్త కోణంలో ఈ తీర్పునిచ్చారంటూ సుప్రీంకోర్టు ఆక్షేపించి దాన్ని నిలిపేయడం అనంతర చరిత్ర. ఆ తర్వాత వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఇరుపక్షాలూ పెద్ద మనసు చేసుకుని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించి ఉంటే ఈ వివాదం ఎప్పుడో ముగిసేది. కానీ లక్నో బెంచ్ న్యాయమూర్తి ఒకరు ఇచ్చిన తీర్పులో చెప్పినట్టు ‘ఇక్కడ దేవతలు సైతం నడయాడటానికి భయపడే స్థాయిలో చిన్న స్థలంలో భారీగా మందు పాతరలు న్నాయి’. తాము తీర్పు ఇవ్వడానికి చాలా ముందే అన్ని పక్షాలూ సామరస్యంతో వ్యవ హరించి సమస్యను పరిష్కరించుకుంటాయని బలంగా ఆకాంక్షిస్తున్నట్టు అప్పట్లో సుప్రీంకోర్టు తెలి పింది. కానీ అది జరగలేదు. కాకపోతే ఉన్నంతలో ఉద్వేగాలు ఉపశమించాయి. ఇప్పుడు తీర్పు వెలువడ్డాక కూడా అదే సంయమనం అందరూ పాటించి, ఆ తీర్పును శిరసావహించగలవని దేశ ప్రజలంతా కోరు కుంటున్నారు. -
‘అయోధ్య’పై ఎన్నో పార్టీలు ఎన్నో గొడవలు
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ–రామ మందిరం వివాదం కేసుపై ఐదుగురు సుప్రీం కోర్టు జడ్జీల బెంచీ ముందు తుది విచారణ జరగుతున్న విషయం తెల్సిందే. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమై 38 రోజులకుపైగా కొనసాగిన విచారణ ఈ రోజుతో ముగుస్తుంది. ఇది కేవలం ముస్లిం, హిందువులకు మధ్య కొనసాగుతున్న వివాదంగా సామాన్య ప్రజలకు కనిపిస్తోంది. కానీ ఎన్నో పార్టీల ప్రమేయం ఎన్నో గొడవలు ఉన్నాయి. అటు ముస్లిం పార్టీల్లో, ఇటు హిందూ పార్టీల్లో పరస్పర విరుద్ధ వైఖరులు కూడా ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి 16వ శతాబ్దంలో బాబర్ మసీదు నిర్మించారని, ఆ స్థలంలో తిరిగి రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతించాలని ‘నిర్మోహి అఖారా’ సంస్థ ఆది నుంచి డిమాండ్ చేస్తోంది. ఆది నుంచి రాముడిని పూజించే సన్యాసులతో కూడిన బృందం. వివాదాస్పద స్థలాన్ని తమకు అప్పగించాలని అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తామని ‘రామ్ లల్లా’, ‘రామ్ జన్మస్థాన్’ సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రామ్ లల్లాలో ఎక్కువ మంది విశ్వహిందూ పరిషద్ సభ్యులు ఉండగా, రామ్ జన్మస్థాన్‌లో ఎక్కువగా ఆరెస్సెస్ సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి న్యాస్’తో హిందూ మహాసభ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. తరతరాలుగా రాముడిని పూజించే హక్కు తమకే ఉందని, తామే నిజమైన ఆరాధకులమని, తమకే రామ జన్మభూమి స్థలం దక్కాలని ‘నిర్మోహి అఖారా’ వాదిస్తోంది. ఇందులో తమకు ఉందని వాదిస్తోన్న రామ్ లల్లా, రామ్ జన్మస్థాన్ సంఘాలతో అది తీవ్రంగా విభేదిస్తోంది. మరో పక్క ముస్లిం సంస్థల్లో కూడా పరస్పర విభేదాలు ఉన్నాయి. షియా, సున్నీ బోర్డులు వివాదాస్పద బాబ్రీ మసీదు తమదంటే తమదని వాదిస్తూ వస్తున్నాయి. షియా ముస్లిం వర్గానికి ‘అఖిల భారత షియా కాన్ఫరెన్స్’, ‘షియా వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిథ్యం వహిస్తున్నండగా, సున్నీ ముస్లింలకు ‘సున్నీ వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయోధ్య వివాదంలో మొదటి నుంచి ఉన్న ప్రధాన పార్టీ సున్నీ వక్ష్ బోర్డే. బాబ్రీ మసీదు స్థలాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆది నుంచి డిమాండ్ చేస్తున్న ఆ మేరకు 1961లో కోర్టులు పిటీషన్ దాఖలు చేసింది. అది షియా మసీదని, తమకే చెందాలని షియా వక్ఫ్ బోర్డు విభేదించింది. ఆ తర్వాత షియా వక్ఫ్ బోర్డు తన వైఖరిని మార్చుకుంది. దేశ సామరస్య, సమగ్రతలను పరిరక్షించడం కోసం హిందూ పార్టీలకు స్థలాన్ని అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ మేరకు 2018లో సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. మొదటి నుంచి ఉమ్మడిగా మసీదును నిర్మిద్దామని చెబుతున్న ‘అఖిల భారత్ షియా కాన్ఫరెన్స్’ ఆశ్చర్యంగా ‘సున్నీ వక్ఫ్ బోర్డు’కే ఇప్పటికీ అండగా నిలిచింది. 1992లో బాబ్రీ మసీదును కూల్చేసిన ప్రాంతంలోని 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేసి నిర్మోహి అఖారా, హిందూ సంస్థలు, సున్నీ వక్ష్ బోర్డుకు పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని అన్ని పార్టీలు సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తెల్సిందే. క్లిష్టంగా తయారైన ఈ వివాదంపై ఈ రోజు విచారణ ముగించే సుప్రీం కోర్టు తీర్పును ఎప్పుడు, ఎలా వెలువరిస్తుందో ఎదురు చూడాల్సిందే. -
అయోధ్య కేసుపై నేటితో ముగియనున్న వాదనలు
-
నేటితో ‘అయోధ్య’ వాదనలు పూర్తి!
న్యూఢిల్లీ:వివాదాస్పద రామజన్మభూమి– అయోధ్య కేసు వాదనలను బుధవారంతో ముగించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. అక్టోబర్ 18తో అయోధ్య కేసు వాదనలను ముగించాలని తొలుత నిర్ణయించినా..16వ తేదీతోనే ముగించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన వాదనలన్నీ నేటితో ముగించాలని మంగళవారం హిందూ, ముస్లిం పార్టీలకు సూచించింది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు వాదనలు వింటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. మంగళవారం కూడా సాయంత్రం 5 గంటల వరకు వాదనలు విన్నది. సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ కేసును 39 రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. సీజేఐ పదవీకాలం నవంబర్ 17తో ముగియనుంది. అప్పటికల్లా తీర్పు వెలువడకపోతే కేసు విచారణను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆలోపే తీర్పు వెలువరించాలని ధర్మాసనం భావిస్తోంది. గతంలో ఓ సందర్భంలో సీజేఐ మాట్లాడుతూ.. ‘అయోధ్య కేసులో తీర్పు వెలువరించేందుకు నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఇంత స్వల్ప∙సమయంలో తీర్పు చెప్పడం ఓ అద్భుతం లాంటిదే’అని పేర్కొన్నారు. బాబర్ తప్పును సరిదిద్దాల్సి ఉంది.. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించి బాబర్ చక్రవర్తి చారిత్రక తప్పిదం చేశారని.. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని హిందూ పార్టీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయోధ్య కేసుకు సంబంధించి సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. హిందూ పార్టీ తరఫున సీనియర్ అడ్వొకేట్ కె.పరాశరన్ వాదనలు వినిపించారు. న్యాయ వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం భూసేకరణ చట్టంపై విచారణ నుంచి తప్పుకోవాలంటూ తనపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఫలానా జడ్జి అంటూ ఆ కథనాల్లో వేలెత్తి చూపకున్నా న్యాయ వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టే భూసేకరణలో నిబంధనలపై గతంలో రెండు ధర్మాసనాలు వేర్వేరుగా తీర్పులు వెలువరించాయి. ఆ ధర్మాసనాల్లో ఒకదానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. పరస్పర విరుద్ధ తీర్పులు వివాదాస్పదం కావడంతో ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు గతంలో సుప్రీంకోర్టు ప్రకటించింది. అయిదుగురు సభ్యులతో కూడిన ఈ ధర్మాసనంలో జస్టిస్ మిశ్రా కూడా ఉన్నారు. దీనిపై కొన్ని పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని, ఆ ధర్మాసనం నుంచి జస్టిస్ మిశ్రా వైదొలగా లంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలు వడ్డాయి. మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ మిశ్రా వీటిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. -
మేము రాముడి వంశస్థులమే: మహేంద్ర సింగ్
జైపూర్ : అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మేవార్ ఉదయ్‌పూర్ రాజకుటుంబీకుడైన మహేంద్ర సింగ్ స్పందించారు. తాము రాముడి వంశస్థులమని, ఒకవేళ ఏవైనా వివరాలు కావాలనుకుంటే కోర్టు తమను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైన సాక్ష్యాలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి చట్టబద్ధమైన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా అయోధ్య భూ వివాదం కేసులో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది పరాశరన్ వాదించారు. ఇందుకు స్పందనగా సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం...‘ ‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో తాము రాముడి కుమారుడు కుశుడి వంశానికి చెందినవారమని జైపూర్ రాజకుమారి, బీజేపీ ఎంపీ దియా కుమారి పేర్కొన్న విషయం విదితమే. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ‘రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అంతెందుకు మా కుటుంబం కుశుడి అంశ నుంచి ఉద్భవించింది. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం, ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. మా వంశవృక్షంలో 62వ రాజుగా దశరథుడు, 63వ రాజుగా రాముడు, 64వ రాజుగా కుశుడి పేరు ఉన్నాయి. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను కూడా. దాదాపు ప్రతీ ఒక్కరు రాముడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అయోధ్య కేసులో త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా వారందరి తరఫున విన్నపం చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. -
మేము కుశుడి వంశస్థులం: రాజకుమారి
జైపూర్ : తాము రాముడి కుమారుడు కుశుడి వంశానికి చెందిన వారమని బీజేపీ ఎంపీ, జైపూర్ రాజకుమారి దియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడి వంశస్థులు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నారని.. అయోధ్య వివాదం తొందరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం దియా కుమారి మాట్లాడుతూ... ‘రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అంతెందుకు మా కుటుంబం కుశుడి అంశ నుంచి ఉద్భవించింది. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను కూడా. దాదాపు ప్రతీ ఒక్కరు రాముడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అయోధ్య కేసులో త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా వారందరి తరఫున విన్నపం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది పరాశరన్ వాదించారు. ఇందుకు స్పందనగా సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం...‘ ‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్నవ్యక్తిగా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించడంతో..‘ కేదర్నాథ్ ఆలయాన్నే తీసుకుంటే, అక్కడ ఎలాంటి విగ్రహం లేకపోయినా ప్రజలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కేసులో జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు’ అని పరాశరన్ తెలిపారు. -
రామజన్మభూమి కేసు విచారణకై ప్రత్యేక ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసు విచారణ కొత్త ధర్మాసనానికి కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణకు అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఏర్పాటయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఉదయ్ లలిత్, జస్టిస్ చందర్ చూడ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆయోధ్య కేసును ఈ నెల 10న విచారణ చేపట్టనుంది. అయోధ్య–బాబ్రీ వివాదమేంటి? భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు. రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేస్తున్న విషయం తెలిసిందే. -
ఏదేమైనా బీజేపీకి మద్దతివ్వం: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి బీజేపీ ఆర్డినెన్స్ తీసుకొస్తే మద్దతిచ్చేది లేదని బీజేపీ మిత్రపక్షం, బిహార్ అధికార పార్టీ జనతాదళ్(యూ) స్పష్టం చేసింది. మందిర నిర్మాణానికి తెచ్చే ఎటువంటి ఆర్డినెన్స్‌నైనా సమర్థించేది లేదని జేడీయూ సంస్థాగత జనరల్ సెక్రటరీ ఆర్సీపీ సింగ్, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి తీరుతామని బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జేడీయూ భిన్న వైఖరి చర్చనీయాంశమైంది. సామాజిక సంబంధాలు, మత సామరస్యానికే తమ పార్టీ కట్టుబడి ఉందని ఆర్సీపీ సింగ్ తెలిపారు. కాగా, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై జేడీయూ నాయకత్వం మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. ప్రశాంత్ కిషోర్ మాట్లాతుతూ.. ‘అయోధ్య అంశం లేవనెత్తకుండానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగలదు. 2014 ఎన్నికల సమయంలో ఉన్న పాపులారిటీ బీజేపీకి ఇప్పుడు లేదు. అయినా వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుంద’ని ఆశాభావం వ్యక్తం చేశారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉందని అన్నారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో అశేష ప్రజాదరణతో అధికారంలోకొచ్చిన కాషాయ పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. -
అయోధ్య కేసు విచారణకు తొలగిన అడ్డంకులు
-
1994 తీర్పుపై పునఃసమీక్షకు నో
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం కేసు విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసును విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 2:1 మెజారిటీతో గురువారం ఈ తీర్పు చెప్పింది. ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదు అని 1994 నాటి తీర్పుపై పునఃవిచారణ జరగదని స్పష్టం చేసింది. ధర్మాసనంలోని సీజేఐ, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఇందుకు మద్దతుగా తీర్పునివ్వగా మరో న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ విభేదించారు. పునఃసమీక్ష జరగాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో.. అత్యంత సున్నితమైన అయోధ్య కేసు విచారణ వేగవంతం అవడానికి మార్గం సుగమమైంది. అక్టోబర్ 29 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ జరగనుంది. తీర్పుతో బీజేపీ, ఆరెస్సెస్ హర్షం వ్యక్తం చేశాయి. అయోధ్య కేసులోనూ త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. కోర్టు తీర్పును ఆమోదించాల్సిందేనని పేర్కొంది. ఇది భూసేకరణ వివాదమే 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఎం సిద్దిఖీ సుప్రీంను ఆశ్రయించారు. భూ వివాదంలో హైకోర్టు తీర్పును సుప్రీం నిర్ణయం ప్రభావితం చేసిందన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ప్రార్థనల కోసం మసీదు ముఖ్యమైన ప్రదేశమేమీ కాదనడంపై పునఃసమీక్ష చేయాలని కోరారు. అయోధ్య కేసులోని ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన సిద్దిఖీ చనిపోయినా ఆయన వారసులు ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించారు. దీన్ని 2:1తో ధర్మాసనం తిరస్కరించింది. ‘ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో లెవనెత్తిన అంశాలన్నీ భూ సేకరణకు సంబంధించినవేనని పునరుద్ఘాటిస్తున్నాం. అయోధ్య కేసులో విచారణకు సంబంధించి ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రభావమేమీ ఉండదు’ అని జస్టిస్ అశోక్ భూషణ్ తమ (సీజేఐతో కలుపుకుని) నిర్ణయాన్ని వెలువరించారు. అయోధ్యలో నెలకొన్న సివిల్ భూ వివాదాన్ని కొత్తగా ఏర్పాటుచేయబోయే ముగ్గురు సభ్యుల బెంచ్ అక్టోబర్ 29 నుంచి విచారిస్తుందన్నారు. అక్టోబర్ 2న ప్రస్తుత సీజేఐ మిశ్రా రిటైర్‌కానున్నారు. 2010లో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు స్థలాన్ని మూడు భాగాలుగా విడగొడుతూ తీర్పు నివ్వడాన్ని సవాల్ చేయడంపైనా కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్ లల్లాలకు పంచాలని ఆదేశించింది. ప్రభుత్వం అన్ని మతాలను సమదృష్టితో చూడాలని సూచించింది. కాగా దేశానికి మేలు చేసేందుకు అయోధ్య విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. స్వాగతించిన ఆరెస్సెస్ విస్తృత ధర్మాసనానికి అయోధ్య కేసును బదిలీ చేయబోమంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. ఈ వివాదంతో వీలైనంత త్వరగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘అక్టోబర్ 29 నుంచి ముగ్గురు సభ్యుల ధర్మాసనం శ్రీరామజన్మభూమి కేసును విచారిస్తామని గురువారం సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసం వచ్చింది’ అని ఓ ప్రకటనలో ఆరెస్సెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని మరింతకాలం కొనసాగించాలని చూస్తోందని.. అందుకే త్వరగా నిర్ణయం వెలువడకుండా (2019 ఎన్నికల తర్వాత ఈ వివాదంపై తీర్పు వెలువరించాలన్న కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ) కుట్ర పన్నిందని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆరోపించారు. పాకిస్తాన్ ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇకపై వీరి ప్రయత్నాలేవీ సఫలం కాబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పుకు కట్టుబడే: కాంగ్రెస్ గురువారం నాటి కోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో అయోధ్య అసలు వివాదంపై విచారణను వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైందని పేర్కొంది. ఇన్నాళ్లూ రామమందిరం పేరుతో బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని.. కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది విమర్శించారు. రామమందిర వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ పాత్ర లేశమాత్రమైనా లేదన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ చెబుతోందని.. ఆచరణలోనూ కట్టుబడి ఉంటామని ఆమె పేర్కొన్నారు. అసలు విచారణ ఇకపైనే.. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని.. అది తమకు అనుకూలంగానే ఉందని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న ముస్లింలు పేర్కొన్నారు. ‘ఇస్లాంలో మసీదు అంతర్గత భాగం కాదనే విషయాన్ని 1994లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు కేసు పూర్తిగా రామజన్మభూమి–బాబ్రీ మసీదు మధ్య స్థల వివాదంపైనే ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఇది సంతోషదాయకం’ అని మౌలానా మహ్ఫుజూర్ రహమాన్ తరపున నామినీగా ఉన్న ఖాలిక్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ‘ఇకపై అయోధ్య–బాబ్రీ కేసు విచారణ మత విశ్వాసాలపై కాకుండా భూ యాజమాన్య హక్కుదారు, యోగ్యత ఆధారంగానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షదాయకం. రెవెన్యూ రికార్డుల ఆధారంగా బాబ్రీ స్థల వివాదంలో మా వాదనలు వినిపిస్తాం. ఏ మందిరాన్నీ ధ్వంసం చేయకుండానే బాబ్రీ మసీదును నిర్మించారనేది మా విశ్వాసం’ అని సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ తెలిపారు. మిగిలిన కక్షిదారులు కూడా కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య–బాబ్రీ వివాదమేంటి? భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు. రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై అక్టోబర్ 29 నుంచి సుప్రీంకోర్టు రోజూవారి విచారణ చేపట్టనుంది. ‘మసీదు’పై పునఃసమీక్ష: జస్టిస్ నజీర్ ‘అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఆయా వర్గాలకు చాలా ముఖ్యమైనవి’ అని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మసీదు అంత ముఖ్యమైన ప్రదేశం కాదని, ముస్లింలు ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చన్న 1994నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసుపై పునఃసమీక్ష జరగాలని తన 42 పేజీల తీర్పులో ఆయన చెప్పారు. సమగ్రమైన విచారణ జరపకుండా నాడు తీర్పుచెప్పారన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ‘మసీదు’ వ్యాఖ్యలపై విస్తృత ధర్మాసనంతో పునఃసమీక్ష జరపాలన్నారు. తన తీర్పులో 4 ప్రశ్నలు సంధించారు. ‘1954 షిరూర్ మఠ్ కేసులో మత విశ్వాసాలను పరీక్షించకుండానే తీర్పు వెలువరించారా? ఆవశ్యకమైన మత విశ్వాసాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు జరగాలా? ఆర్టికల్ 25కింద ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలనే కాపాడాలా? అన్ని మతాలకూ వర్తిస్తుందా? ఆర్టికల్ 15, 25, 26 ప్రకారం అన్ని విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందా?’ అని ప్రశ్నించారు. బహుభార్యత్వం, నిఖాహలాలా, మహిళా జననాంగాల విచ్ఛిత్తి కేసుల్లో తీర్పులను గుర్తుచేశారు. అయోధ్య స్థల వివాద క్రమమిదీ.. ► 1528: బాబర్ సైన్యాధ్యక్షుడు మిర్ బాకీ బాబ్రీ మసీదును నిర్మించాడు. ► 1885: ఈ స్థలంలో రాముడికి చిన్న పైకప్పు కట్టుకునేందుకు అనుమతివ్వాలని మహంత్ రఘువీర్ దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని తిరస్కరించింది. ► 1949: వివాదాస్పద స్థలంలో రామ్ లల్లా విగ్రహాల స్థాపన ► 1959: విగ్రహాలకు పూజ చేసేందుకు అనుమతించాలంటూ నిర్మోహి అఖాడా పిటిషన్ ► 1981: ఈ స్థలాన్ని తమకు అప్పగించాలంటూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ► 1986, ఫిబ్రవరి 1: హిందూ భక్తులకు ప్రవేశాన్ని అనుమతిస్తూ స్థానిక కోర్టు తీర్పు ► 1992, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు నిర్మాణం పాక్షికంగా ధ్వంసం ► 1994, అక్టోబర్ 24: ఇస్మాయిల్ ఫారుఖీ కేసు విచారణ సందర్భంగా ఇస్లాంలో మసీదు అంతర్భాగం కాదన్న సుప్రీంకోర్టు ► 2003, మార్చి 13: వివాదాస్పద స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరపొద్దని సుప్రీం ఆదేశం, అలహాబాద్ హైకోర్టుకు కేసు బదిలీ. ► 2010, సెప్టెంబర్ 30: నిర్మోహీ అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు వివాదాస్పద భూమిని పంచుతూ హైకోర్టు ఆదేశం. ► 2016, ఫిబ్రవరి 26: రామమందిర నిర్మాణానికి అనుమతించాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ ► 2017, మార్చి 21: కక్షిదారులంతా కోర్టు బయట చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నాటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహార్ సూచన ► నవంబర్ 20: అయోధ్యలో మందిరం, లక్నోలో భారీ మసీదు నిర్మాణానికి అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించిన షియా వక్ఫ్ బోర్డు. ► 2018, సెప్టెంబర్ 27: ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు విముఖత. అక్టోబర్ 29 నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో ప్రధాన కక్షిదారులు ఇక్బాల్ అన్సారీ, నిర్మోహి అఖాడా మహంత్ ధరమ్ దాస్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ -
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
అయోధ్యపై సుప్రీం కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మసీదులు ఇస్లాంలో అంతర్భాగం కాదని 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించబోమని పేర్కొంది. అయోధ్య భూ యాజమాన్య హక్కులపై ఉన్న కేసును అక్టోబర్ 29 నుంచి త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని వెల్లడించింది. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హిందూ, ముస్లిం సంస్థల పిటిషన్లపై గురువారం విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2010లో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద స్థలం రామ్‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్‌బోర్డుకు చెందుతుందని తీర్పు నిచ్చింది. సుప్రీంకోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ కేసులో గతంలో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలు... = బాబ్రీమసీదు, దాని చుట్టుపక్కల ఉన్న భూమి సేకరణకు సంబంధించి 1994లో సుప్రీంకోర్టు ఓ రూలింగ్ ఇచ్చింది. ఇస్లాం మతాచారాన్ని పాటించడంలో మసీదుకు ముఖ్య భూమికేమి లేదు. నమాజ్‌ను బహిరంగప్రదేశాలతో సహా ఎక్కడైనా నమాజ్‌ను ఆచరించొచ్చునన్నదే ఆ రూలింగ్. = రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూయాజమాన్యంకేసులో అయోధ్య భూమిని మూడుభాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు 2010లో రూలింగ్ ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా అన్ని పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. = 2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లపై గురువారం ప్రధానన్యాయమూర్తి దీపక్ మిశ్రా బెంచ్ విచారణ సందర్భంగా 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రస్తావనకు వచ్చింది. ఈ రూలింగ్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ దీనిని ఐదుగురు జడ్జీల ధర్మాసనం విచారించాల్సిందిగా ముస్లింవర్గాల తరఫువారు వాదించారు. ఈ రూలింగ్ విస్తృత ధర్మాసనానికి నివేదించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ తిరస్కరించింది. అయోధ్య–బాబ్రీ భూ యాజమాన్య కేసును ఈ రూలింగ్ ప్రభావితం చేయదని స్పష్టంచేసింది. = వివాదస్పదంగా మారిన భూయాజమాన్య కేసు విచారణలో జాప్యానికి 1994లో ఇచ్చిన రూలింగే కారణమనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇప్పుడీ కేసు విచారణ వచ్చేనెల 29న మొదలుకానున్న విషయం తెలిసిందే. 1994 రూలింగ్‌పై ప్రస్తుత సు్రంకోర్టు ఆదేశాలతో అయోధ్య భూవివాద కేసు త్వరితగతిన సాగేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఎవరికి ఉపయోగపడని విధంగా ఈ కేసును సార్వత్రిక ఎన్నికల అనంతరం చేపట్టాల్సిందిగా గత డిసెంబర్లోనే కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్‌సిబాల్ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. -
కీలక తీర్పులకు సుప్రీం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి సెలవుల అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం నేడు తిరిగి ప్రారంభంకానుంది. 44 రోజుల విరామం తరువాత సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తించేందుకు సిద్ధమైంది. వేసవి సెలవుల నేపథ్యంలో కోర్టు విధులకు దూరంగా ఉండటంతో పలు కీలక కేసులు పెండింగులో ఉన్నాయి. నేడు తిరిగి ప్రారంభవ్వడంతో పలు కీలక అంశాలపై తీర్పును వెలువరించనుంది. పౌరుల వ్యక్తిగత గోపత్యకు సంబందించిన ఆధార్ కేసు సుప్రీం ధర్మాసనం ముందు ఉంది. ఆయోధ్య వివాదం, ముస్లింల బహుభార్యత్వంపై తీర్పును వెలువరించాల్సి ఉంది. ఇటీవల వివాదంగా మారిన ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో కాలుష్యం, అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, వైష్ణో దేవి పునరావాసం, మణిపూర్‌లో ఇటీవల జరిగిన్ ఎన్కౌంటర్ వంటి అంశాలపై విచారణ చేపటాల్సిఉంది. నేటి నుంచి గుర్తింపు పొందని (నాన్ ఎక్రిడేట్) పాత్రికేయులు కూడా కోర్టు అవరణలోకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లెందుకు సుప్రీం ధర్మాసనం అనుమతినిచ్చింది. -
రామ్ మందిర్‌ను కూల్చింది వాళ్లు కాదు
- పాల్గర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ముంబాయి: అయోధ్యలోని రామ్ మందిర్‌ను ధ్వంసం చేసింది భారత దేశంలో ఉన్న ముస్లింలు కాదని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదం కేసు మళ్లీ కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో భగవత్ ఈ విధంగా అయోమయ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉన్న ముస్లింలు ఈ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేయరని అన్నారు. భారతీయులను విడగొట్టేందుకే ఈ విధమైన దాడులకు విదేశీయులు పాల్పడ్డారని చెప్పారు. పాల్గర్ జిల్లాకు పక్కనే ఉన్న దహానులో జరిగిన విరాట్ హిందూ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామమందిర్‌ను నిర్మించడం భారత జాతి కర్తవ్యమని పేర్కొన్నారు. అలాగే అయోధ్యలో ధ్వంసమైన రామమందిర్‌ను తిరిగి అదే స్థానంలో పునర్మించే బాధ్యత మనపై ఉందని అన్నారు. దాని కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమన్నారు. రామ మందిరాన్ని పునర్మించకపోతే, మన సంస్కృతి సంప్రదాయాల మూలాలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. రామ మందిర్‌ను యథాస్థానంలో పునర్మిస్తామని ఘంటాపథంగా చెప్పారు. ఈ రోజు మనం స్వతంత్రులమని, ధ్వంసమైన రామ మందిరాన్ని పునర్మించుకునే హక్కు మనకు ఉందని అన్నారు. ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదని, మన ఐడెంటిటీకి గుర్తులని చెప్పారు. దశాబ్దాలకు పైగా నడుస్తున్న రామ జన్మభూమి-బాబ్రి మసీదు వివాదం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వేసిన 13 అప్పీళ్లు ప్రస్తుతం సుప్రీంలో విచారణకు వచ్చాయి. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కుల ప్రాతిపదిక హింసకు ప్రతిపక్షాలను బాధ్యులను చేస్తూ విమర్శలు సంధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఖాళీగా కూర్చున్నవారే ఈవిధమైన కుల హింసకు, కుల ఘర్షణలకు ప్రేరేపిస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు.