bycycle
-
ఆనంద్ మహీంద్రా ఫిదా, అరె!.. ఇ-బైక్ భలే ఉందే!
నిత్యం వ్యాపార వ్యవహారాల్లో తలమునకలయ్యే మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సరదాగా ఈ-బైక్‌ని నడిపారు. వెంటనే సదరు బైక్ వివరాల్ని ‘ఎక్స్’(ట్విటర్)వేదికగా వెల్లడించారు. సైకిల్ తొక్కటమంటే ఎవరికి ఇష్టముండదు? అన్నివయసుల వారికీ ఆసక్తే. చాలామంది సంప్రదాయ సైకిళ్లను ఇష్టపడుతుంటారు గానీ నేటి తరానికి ఎలక్ట్రిక్ బైకులంటే మక్కువ. రెండింటి ఉద్దేశం ఒకటే అయినప్పటికీ ఇ-బైకుల్లోని వివిధ భద్రత ఫీచర్లు బాగా ఆకట్టుకుంటుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ కేంద్రంగా ఐఐటీ- బాంబే పూర్వ విద్యార్ధులు నిషిత్ పరిక్, రాజ్ కుమార్ కెవాత్లు దేశంలోనే తొలిసారి ‘హార్న్‌బ్యాక్’(hornbakc) పేరుతో ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ బైక్‌ను మ్యాని ఫ్యాక్చరింగ్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆ సంస్థ తయారు చేసిన ఈ-బైక్‌ను ఆనంద్ మహీంద్రా డ్రైవ్ చేశారు. A bunch of IIT Bombay guys have made us proud again. They’ve created the first foldable diamond frame e-bike with full-size wheels in the world. That makes the bike not only 35% more efficient than other foldable bikes but it makes the bike stable at higher than medium speed. And… pic.twitter.com/U1HHGD6rfL — anand mahindra (@anandmahindra) October 21, 2023 అనంతరం, 'ఐఐటీ బాంబే కుర్రాళ్లు మళ్లీ గర్వపడేలా చేశారు. ప్రపంచంలోనే పూర్తి స్థాయి చక్రాలతో మొట్టమొదటి ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఇ-బైక్ ను రూపొందించారు. ఇది ఇతర ఫోల్డబుల్ బైక్‌ల కంటే వీళ్లు తయారు చేసిన ఇ-బైక్ 35శాతం కంటే ఎక్కువ సమర్థవంతంగా పని చేయడమే కాకుండా, మీడియం స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో బైక్‌ను డ్రైవ్ చేయొచ్చు’ అంటూ మహీంద్రా ఈ ఇ-బైక్ నడుపుతున్న చిత్రాలను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘మడతపెట్టిన తర్వాత లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేని ఏకైక బైక్ ఇది. ఆఫీసు కాంపౌండ్ చుట్టూ తిరగడానికి నా సొంత హార్న్ బ్యాక్ ఎక్స్1 ను తీసుకున్నాను! నేను వారి స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాను అని ఆయన చెప్పారు. ఈ ఫోల్డబుల్ ఇ-బైక్ గురించి మరిన్ని విశేషాలు ►హార్న్‌బ్యాక్ ఎక్స్1 గ్రే-ఆరెంజ్, బ్లూ-ఆరెంజ్ కలర్ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.44,999. రూ.14,999 మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ►ఇందులో 36వీ, 7.65ఏహెచ్ బ్యాటరీని అమర్చారు. సింపుల్‌గా 2 పిన్ప్లగ్ పాయింట్‌తో బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ►కంపెనీ ప్రకారం, హార్న్‌బ్యాక్ ఇ-బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సగటున 45 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. స్టోరేజ్, ప్రయాణ సమయాల్లో వాహనదారులకు వీలుగా ఫోల్డబుల్‌గా తయారు చేసింది. ►కంపెనీ ఫిజికల్ స్టోర్ల నుంచి తన ఇ-బైక్‌ను విక్రయించడం లేదని పేర్కొంది. తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఎలక్ట్రిక్ సైకిళ్ల యొక్క అన్ని భాగాలపై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుందని ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
ఔటర్ చుట్టూ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌లు
సాక్షి, హైదరాబాద్: మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ విస్తరిస్తున్న పట్టణాలు, జనాభా అవసరాలకు అనుగుణంగా సదుపాయాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగా సోలార్ రూఫ్‌టాప్‌తో కూడిన సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. మొదటి దశలో 4.5 మీటర్ల వెడల్పుతో చేపడుతున్న 23 కి.మీ ట్రాక్ సోలార్ రూఫ్‌తో ఏర్పాటవుతోందని కేటీఆర్ వివరించారు. దీనివల్ల 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని చెప్పారు. నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) వరకు 8.5 కి.మీ., నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కి.మీ మేర నిర్మించతలపెట్టిన సైకిల్ ట్రాక్‌కు మంగళవారం కోకాపేట్ వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మరిన్ని సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ అనంతరం ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిందని, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకొనేందుకు సైకిల్ ట్రాక్‌లు దోహదం చేస్తాయన్నారు. సైకిళ్ల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో.. దక్షిణ కొరియా, దుబాయ్‌లలో ఉన్న సైకిల్ ట్రాక్‌లను అధ్యయనం చేసి దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంలో సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు కూడా ఈ ట్రాక్‌లు అనుకూలంగా ఉంటాయన్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాక్ మార్గంలో భద్రత కోసం బ్యారియర్స్ ఉంటాయని, ఆహ్లాదాన్ని పంచే గ్రీన్ స్పేస్ ఉంటుందని మంత్రి వివరించారు. అలాగే ఫుడ్ కియోస్క్‌లు, పార్కింగ్ స్థలాలు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, రెంటల్ సైకిల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే మార్చి నాటికి తొలిదశ ట్రాక్ అందుబాటులోకి వస్తుందన్నారు. రెండో దశలో గండిపేట చుట్టూ 46 కి.మీ. మార్గంలో పీపీపీ మోడల్లో సైకిల్ ట్రాక్‌లు, రిసార్ట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. అనంతగిరిలో వెల్నెస్ సెంటర్లు.. వికారాబాద్, అనంతగిరి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా అనంతగిరిలో 275 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెల్నెస్ సెంటర్లను, వెల్బీయింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. నగరవాసులు ఒకట్రెండు రోజులపాటు అనంతగిరిలో విశ్రాంతి తీసుకొనేలా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా! -
హైబ్రీడ్ సైకిల్.. కేవలం ఆరు రూపాయలతో!
అనంతపురం: మేథో శక్తి ఒకరి సొత్తు కాదని నిరూపించాడు అనంతపురానికి చెందిన యువకుడు. సాధించాలనే తపన.. నూతన ఆవిష్కరణల పట్ల ఉన్న జిజ్ఞాస అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. పర్యావరణానికి హాని కలగని ఉత్పత్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతనే.. అనంతపురం నగర శివారులోని చంద్రబాబు కొట్టాలకు చెందిన బాబా ఫకృద్దీన్. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేక 9వ తరగతితో చదువు మానేసి.. వాహనాల మరమ్మతుతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన బాబా ఫకృద్దీన్.. తాను చేస్తున్న ప్రతి పనీ వినూత్నంగా ఉండాలని భావించేవారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు తొలిసారిగా రివర్స్ గేర్‌తో నడిచే త్రిచక్ర వాహనాన్ని రూపొందించి అందరి ప్రశంసలూ అందుకున్నారు. అంతటితో ఆగకుండా యువతను ఉర్రూతలూగించేలా హైబ్రీడ్ సైకిల్‌కు రూపకల్పన చేశారు. హల్క్ బైసైకిల్.. రూ.56 వేల ఖర్చుతో బాబా ఫకృద్దీన్ రూపొందించిన హైబ్రీడ్ సైకిల్ నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సైకిల్‌కు ఏర్పాటు చేసిన 72 ఓల్టుల బ్యాటరీని రెండు నుంచి మూడు గంటల పాటు చార్జింగ్ పెట్టడం ద్వారా 3 నుంచి 4 యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుంది. ఈ లెక్కన రూ.6తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రూ.18,600తో కొనుగోలు చేసిన సైకిల్‌కు రూ.29 వేలు విలువైన 72 ఓల్టుల బ్యాటరీని అమర్చారు. ఎల్ఈడీ సెన్సార్, సౌండ్ హారన్, చార్జింగ్ రీడింగ్, బ్యాటరీ బ్యాక్‌ఆప్ డిస్ప్లేతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 40 కిలోల బరువున్న ఈ సైకిల్‌పై 120 కిలోల బరువున్న వ్యక్తి సైతం 50 కిలోమీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళ్లవచ్చు. సైకిల్‌కున్న భారీ టైర్ల (26X4) వల్ల కొండ గుట్టలను సునాయాసంగా ఎక్కి దిగవచ్చు. మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుంది నా ప్రతి ఆవిష్కరణ వెనుక ఒకరి వ్యధభరితమైన జీవితం ఉంది. వారి కోసం ఏదో చేయాలనే తపనే నూతన ఆవిష్కరణలకు కారణమవుతోంది. త్రిచక్ర వాహనాన్ని పార్కింగ్ ప్లేస్‌లో వెనక్కు తీసుకునేందుకు దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు గమనించి రివర్స్ గేర్ సదుపాయం ఉన్న వాహనాన్ని రూపొందించాను. ప్రస్తుతం నేను తయారు చేసిన సైకిల్‌ను చూసిన చాలా మంది ముచ్చటపడి హల్క్ బైక్ అని పేరు పెట్టారు. తగిన ప్రోత్సాహమిస్తే మరిన్ని ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఉంది. – బాబా ఫకృద్దీన్, అనంతపురం -
సైకిల్‌వాలా జిందాబాద్.. సైకిల్ తలరాత మార్చిన ‘కరోనా’
నగరాల్లోను, పట్టణాల్లోను ఒకప్పుడు సైకిళ్ల జోరు విరివిగా కనిపించేది. మోటారు వాహనాలు పెరగడంతో నగరాల్లో సైకిళ్లు చాలా అరుదైపోయాయి. పెట్రో ఇంధనాలతో నడిచే మోటారు వాహనాల నుంచి వెలువడే కాలుష్యం తెచ్చిపెట్టే దుష్ప్రభావాలు అర్థం కావడంతో ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సైకిళ్లకు అనుకూలంగా చర్యలు చేపట్టేందుకు ఉపక్రమిస్తున్నాయి. నగరాల్లో సైకిళ్లు నడపడానికి వీలుగా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలతో సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని సంకల్పిస్తున్నాయి. సైకిళ్ల వినియోగం ఎంతగా పెరిగితే మోటారు వాహనాల వినియోగం అంతగా తగ్గి, కాలుష్యం తగ్గుముఖం పట్టడమే కాదు, ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నగరాల్లో సైకిళ్లను ప్రోత్సహించాలని సంకల్పించింది. ఈ సందర్భంగా సైకిల్ గురించి కొన్ని విశేషాలు... ఒకప్పుడు సైకిలెక్కడమంటే కుర్రకారుకి గుర్రమెక్కినంత సంబరంగా ఉండేది. సైకిలెక్కి వీథుల్లో చక్కర్లు కొట్టడం పిల్లలకు ఒక ఆటవిడుపు. నిక్కర్ల వయసులో పడుతూ లేస్తూ మోకాళ్లు డోక్కుపోయినా సరే, సైకిల్ సీటుపైకెక్కి బ్యాలెన్స్ చేస్తూ నడపగలిగితే చాలు, ఒక గొప్పవిద్య ఏదో పట్టుబడినంత ఆనందం. ఒకప్పుడు సైకిల్ ఒక స్టేటస్ సింబల్. పెళ్లి సమయంలో వరుడికి తప్పనిసరిగా చదివించుకోవలసిన లాంఛనం. సైకిల్ కోసం అలకపాన్పులెక్కే పెళ్లికొడుకులు ఉండేవారంటే ఇప్పటితరం కుర్రాళ్లు నవ్విపోతారు గాని, అప్పట్లో సైకిల్ ప్రాభవం అలా ఉండేది మరి! మోపెడ్లు, స్కూటర్లు, మోటారుబైకులు రోడ్ల మీదకు యంత్రాశ్వాల్లా దూసుకురావడం మొదలయ్యాక మన దేశంలో సైకిళ్ల ప్రాభవం మసకబారింది. మోటారు వాహనాలతో కిక్కిరిసి కనిపించే నగరాల్లో రోడ్ల మీదకు సైకిల్ తీసుకురావాలంటేనే భయపడే పరిస్థితులు సైకిళ్లను మరింతగా వెనక్కు నెట్టేశాయి. మోటారు వాహనాలు తెచ్చిపెట్టే కాలుష్య తీవ్రత అర్థమయ్యాక సైకిళ్ల మీద మళ్లీ దృష్టిసారిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇదొక మంచి పరిణామం. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలను సైకిళ్లకు అనుకూలంగా మలచేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవతీసుకుంటోంది. దేశంలోని అన్ని నగరాలనూ సైకిళ్లకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చర్యలు చేపడితే సైకిళ్లకు మళ్లీ మంచిరోజులు త్వరలోనే రాకపోవు. అప్పుడిక ‘సైకిల్‌వాలా జిందాబాద్’ అనే కేరింతలు వినిపించకపోవు. ప్రపంచంలో సైకిల్ నగరాలు అంతర్జాతీయంగా చూసుకుంటే ప్రస్తుతం మన దేశంలో సైక్లింగ్‌కు సానుకూలమైన నగరాలు తక్కువనే చెప్పాలి. ప్రపంచంలోనే సైక్లింగ్‌కు అత్యంత సానుకూల నగరం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్. ఎన్ని అధునాతనమైన మోటారు వాహనాలు అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ ఈ నగరంలో సైకిల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. కోపెన్‌హాగెన్‌లో తొంభైశాతం జనాభా సైక్లిస్టులే! ఐదు కిలోమీటర్ల దూరం పరిధిలో రాకపోకలకు వారు తప్పనిసరిగా సైకిల్‌నే ఉపయోగిస్తారు. సైకిళ్లు నడపడానికి ప్రత్యేకమైన రహదారులు, రాజధాని నుంచి చుట్టుపక్కల పాతిక పట్టణాలను కలుపుతూ సాగే సైకిల్ సూపర్ హైవేలు డెన్మార్క్ ప్రత్యేకత. సైక్లింగ్‌కు సానుకూల నగరాల్లో కోపెన్‌హాగెన్ తర్వాతి స్థానాల్లో పోర్ట్లాండ్ (అమెరికా), మ్యూనిక్ (జర్మనీ), మాంట్రియల్ (కెనడా), పెర్త్ (ఆస్ట్రేలియా), ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్), సీటెల్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్), మిన్నీపోలిస్ (అమెరికా), బొగోటా (కొలంబియా) నిలుస్తాయి. ప్రపంచంలో సైక్లింగ్‌కు అనుకూలమైన తొలి పది నగరాల్లో మన దేశానికి చెందిన నగరమేదీ లేదు. అధిక జనాభా, ఇరుకిరుకు రోడ్లు, నగరాల్లోని ప్రధాన రహదారుల్లో మోటారు వాహనాల జోరు వల్ల మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా సైకిళ్ల వినియోగం చాలావరకు తగ్గింది. మన నగరాల్లో సైకిల్ పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో సైక్లింగ్‌కు సానుకూల పరిస్థితులు ఉన్న మొదటి పది నగరాలను తీసుకుంటే, కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం బెంగళూరు మొదటి స్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, చండీగఢ్, నాగపూర్, సూరత్, వదోదరా, రాజ్‌కోట్, కోహిమా, న్యూటౌన్ కోల్‌కతా, వరంగల్ నగరాలు నిలుస్తున్నాయి. సైకిళ్లు నడపడానికి ఈ నగరాల్లో చాలావరకు సురక్షితమైన పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. వీటిని మరింతగా మెరుగుపరచడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ పాలసీ (ఐటీడీపీ) కింద చేపట్టిన ‘స్మార్ట్ సిటీస్ మిషన్’లో భాగంగా దేశంలోని నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు ‘సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద దేశంలోని 107 నగరాలు తమను తాము నమోదు చేసుకున్నాయి. ఈ నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు, సైక్లింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు చేపడుతోంది. ‘సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్’ కింద ప్రభుత్వాలు నగరాల్లో సైకిళ్లు నడపడానికి ప్రత్యేక రహదారులు, సురక్షితమైన ట్రాఫిక్ పరిస్థితులు కల్పించడం వంటి చర్యలను చేపట్టినట్లయితే సైకిళ్లకు మళ్లీ మంచిరోజులొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సైకిల్‌తో ఆర్థిక లాభాలు సైకిల్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య లాభాలు. సైకిల్‌కి ఎలాంటి ఇంధనం అక్కర్లేదు. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఇం‘ధన’ వ్యయం ఉండదు. సైకిల్ తొక్కడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఫలితంగా తరచు ఆస్పత్రుల చుట్టూ తిరిగి, అక్కడిచ్చే బిల్లులు చూసి కళ్లుతిరిగే పరిస్థితులు ఎంతమాత్రమూ తలెత్తవు. కొద్ది దశాబ్దాలుగా మోటారు ద్విచక్రవాహనాల జోరు బాగా పెరిగినా, జనాలు కూడా ఇప్పుడిప్పుడే సైకిల్ ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోలు ధర ‘సెంచరీ’ కొట్టిన తర్వాత జనాలకు సైకిళ్ల మీద శ్రద్ధ మొదలైంది. ఇటు జనాల్లోనూ, అటు ప్రభుత్వ వర్గాల్లోనూ దాదాపు ఏకకాలంలోనే సైకిళ్ల వినియోగం పెంచాలనే విషయమై ఆలోచన మొదలవడం ఎంతైనా ఒక శుభపరిణామం. సైకిల్ గొప్పదనం గురించి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి ఒక అవధానంలో ఈ పద్యం చెప్పారు: ‘‘నీరుం గోరదు గడ్డినడ్గ దొక కొన్నే నుల్వలన్ వేడ దే వారే నెక్కిన గ్రింద దోయ దొకడుం బజ్జన్ భటుండుంట చే కూరంగా వల దౌర! బైస్కిలునకున్ గోప మ్మొకింతేని లే దౌరా! వాజికి దుల్యమైన యిది విశ్వామిత్ర సృష్టంబొకో?’’ జట్కాబళ్లు, ఎడ్లబళ్లు మాత్రమే ప్రధాన రవాణా సాధనాలుగా ఉన్న రోజుల్లో మన దేశంలోని వీథుల్లోకి ప్రవేశించిన సైకిల్ అప్పటి మనుషులకు చాలా అబ్బురంగా ఉండేది. అందుకే చెళ్లపిళ్లవారు సైకిల్ ప్రయోజనాలను చెబుతూనే, గుర్రానికి సాటివచ్చే సైకిల్ విశ్వామిత్ర సృష్టి కాబోలని చమత్కరించారు. అప్పటి కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా మోటారు వాహనాలతో పోల్చుకుంటే సైకిలే ఎంతో మెరుగైనది. మోటారు వాహనాలకు నిరంతర ఇంధన వ్యయంతో పాటు, నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే. సైకిల్‌కు నిర్వహణ వ్యయం నామమాత్రం. అప్పుడప్పుడు టైర్లలో గాలి కొడుతుంటే చాలు. ఎప్పుడో అరుదుగా చైన్ జారిపోవడం, పెడల్ ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. సైకిల్ మరీ పాతబడితే తలెత్తే ఈ సమస్యల పరిష్కారం కోసం మరమ్మతు ఖర్చులు కూడా చాలా తక్కువే. మోటారు వాహనాల ధరలతో పోల్చుకుంటే సైకిల్ ధరలు కూడా తక్కువే. ఆర్థిక కోణంలో చూసుకుంటే సైకిల్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. సైకిల్ తొక్కిన ప్రముఖులు ఇప్పుడంటే ప్రముఖులెవరూ సైకిళ్లపై వీథుల్లోకి రావడం లేదు గాని, ఒకప్పుడు సైకిళ్లు తొక్కే ప్రముఖులు విరివిగానే ఉండేవారు. మన దేశానికి సంబంధించి మహాత్మాగాంధీ మొదలుకొని ఎందరో నాయకులకు అభిమాన వాహనం సైకిల్. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నకాలంలోనే సైకిల్ నేర్చుకున్నారు. భారత్ వచ్చేశాక ఆయన సైకిల్‌ను వదిలేయలేదు. సబర్మతి ఆశ్రమం నుంచి అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠం వరకు ఆయన రోజూ సైకిల్‌పైనే రాకపోకలు సాగించేవారు. స్వాతంత్య్రం వచ్చాక మన తెలుగువాడైన కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటుకు సైకిల్‌పైనే వెళ్లేవారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ అసెంబ్లీకి సైకిల్‌పై వెళ్లేవారు. అంతేకాదు, తీరికవేళల్లో ఆయన భువనేశ్వర్ వీథుల్లో సైకిల్‌పై షికారుగా తిరిగేవారు. విదేశీ ప్రముఖుల్లో చెప్పుకోవాలంటే, బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ తన చిన్నప్పుడు సోదరి మార్గరెట్‌తో కలసి సైకిల్‌పై తరచు షికారు చేసేవారు. ప్రముఖ రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ సైకిల్‌పైనే రాకపోకలు సాగించేవారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్ తన ఆటవిడుపు సమయాల్లో సైకిల్ తొక్కేందుకు ఇష్టపడేవారు. ఇలా సైకిల్‌ను ఇష్టపడే ప్రముఖులు చాలామందే ఉన్నారు. సైకిల్ పరిణామం సైకిల్ వంటి వాహనం తయారీ కోసం పదహారో శతాబ్ది నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయని కొన్ని స్కెచ్‌ల ఆధారంగా పరిశోధకులు చెబుతున్నారు. జర్మన్ ఉన్నతాధికారి కార్ల్ వాన్ డ్రాయిస్ 1817లో తొలిసారిగా కొయ్యతో రెండు చక్రాల వాహనానికి రూపకల్పన చేశాడు. దీనికి ఆయన ‘లౌఫ్మెషిన్’ (పరుగెత్తే యంత్రం) అని పేరు పెట్టాడు. అయితే, డ్రాయిస్ పేరిట ఇది ‘డ్రాయిసిన్’గానే పేరుపొందింది. దీనికి చైన్, పెడల్స్ వంటివేమీ లేకపోవడంతో సీటుపై కూర్చున్న వ్యక్తి కాళ్లతో నెడుతూ దీనిని ముందుకు నడపాల్సి వచ్చేది. మొత్తానికి దీనిని నడపడం ఒక విన్యాసంలా ఉండేది. దీంతో అప్పటి జనాలు ఈ విచిత్రవాహనాన్ని ‘డ్యాండీ హార్స్’ (కొయ్యగుర్రం) అంటూ వెటకరించేవారు. తర్వాత కొద్ది దశాబ్దాల పాటు ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలు జరిగినా, అవేవీ పెద్దగా విజయవంతం కాలేదు. ఆధునిక సైకిల్‌కు తొలి రూపమైన పెడల్స్‌తో కూడిన సైకిల్‌ను ఔత్సాహిక జర్మన్ ఆవిష్కర్త ఫిలిప్ మోరిట్జ్ ఫిషర్ 1853లో రూపొందించాడు. చిన్నప్పుడు ‘డ్రాయిసిన్’పై ఇంటి నుంచి బడికి రాకపోకలు జరిపిన ఫిషర్, మరింత మెరుగైన వాహనాన్ని తయారు చేయాలనే సంకల్పంతో పెడల్స్‌తో కూడిన తొలి సైకిల్ నమూనాకు రూపకల్పన చేశాడు. ఫిషర్ రూపొందించిన ఈ సైకిల్ జర్మనీలోని ష్వీన్ఫర్ట్ మునిసిపల్ మ్యూజియంలో భద్రంగా ఉంది. పెడల్స్ ఏర్పాటు చేసినా, దీనికి చైన్, ఫ్రీవీల్ వంటివి లేకపోవడంతో దీనిని తొక్కడం చాలా శ్రమగా ఉండేది. తర్వాత 1870లలో హైవీల్ బైసైకిల్ వచ్చింది. పెద్దచక్రానికి సీటు, హ్యాండిల్, వెనుక వైపు బాగా చిన్నచక్రం ఉండే ఈ సైకిల్ నడపడమంటే దాదాపు సర్కస్ విన్యాసం చేయడమే! ఇది కూడా పెద్దగా జనాల్లోకి వెళ్లలేకపోయింది. ఆ తర్వాత 1880–90 కాలంలో ‘సేఫ్టీ బైసైకిల్స్’ రూపుదిద్దుకున్నాయి. వెనుక చక్రానికి అనుసంధానమైన చెయిన్, ఫ్రీవీల్, హ్యాండిల్, బ్రేకులు వంటి సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ‘సేఫ్టీ బైసైకిల్స్’ అనతికాలంలోనే జనబాహుళ్యానికి చేరువయ్యాయి. ముఖ్యంగా యూరోప్, అమెరికా ప్రాంతాల్లో సామాన్యులకు సైకిళ్లే ప్రధాన రవాణా సాధనాలుగా మారాయి. వలస పాలకుల కారణంగా సైకిళ్లు ఆసియా, ఆఫ్రికా దేశాలకూ పాకాయి. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలోనే భారత్‌లో కూడా సైకిళ్ల వినియోగం మొదలైంది. దాదాపు రెండు శతాబ్దాల ‘సైకిల్’ ప్రస్థానంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. నడిపే వారికి మరింత సౌకర్యవంతమైన మోడల్స్ తయారయ్యాయి. చదునైన రోడ్లపైనే కాకుండా ఎగుడు దిగుడు కొండ దారుల్లో ప్రయాణాలకు అనువైన ‘మౌంటెన్ బైక్స్’ అందుబాటులోకి వచ్చాయి. తొక్కేవారికి శ్రమ తగ్గించేరీతిలో గేర్లతో కూడిన సైకిళ్లు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో తాజాగా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ‘ఈ–సైకిళ్ల’కు దేశదేశాల్లో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. సైకిల్ తలరాత మార్చిన ‘కరోనా’ ప్రపంచాన్ని ఇప్పటికీ అల్లాడిస్తున్న ‘కరోనా’ మహమ్మారి మన దేశంలో సైకిల్ తలరాతను మార్చేసింది. ‘కరోనా’ తొలివిడత లాక్డౌన్ కాలంలో నగరాల నుంచి లక్షలాది మంది వలస కార్మికులు వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. వారిలో పలువురు కాలినడకన సాగిపోతే, చాలామంది తమవద్దనున్న సైకిళ్లతో స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. గత ఏడాది లాక్డౌన్ కాలంలో ఇలా సైకిళ్లపై స్వస్థలాలకు చేరుకున్న వారిలో బిహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన జ్యోతికుమారి అనే పదిహేనేళ్ల బాలిక ఉదంతం అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. ఢిల్లీలో ఈ–రిక్షా డ్రైవర్ అయిన ఆమె తండ్రి అనారోగ్యం పాలవడంతో, అతణ్ణి సైకిల్ వెనుక కూర్చోబెట్టి ఆమె స్వస్థలానికి ప్రయాణమైంది. దాదాపు 1200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం సాగించి, స్వగ్రామానికి చేరుకుంది. ఈ సాహసం ఆమెకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఆమె ‘బయోపిక్’ తీసేందుకు బాలీవుడ్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే, ఆమె తండ్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడం ఒక విషాదం. తొలివిడత ‘లాక్డౌన్’ కాలంలో స్వస్థలాలకు ప్రయాణమైన వలస కార్మికులు కొందరి జీవితాల్లో ఇలాంటి చాలా విషాదాలే చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, ‘లాక్డౌన్’ అనుభవంతో చాలామంది సైకిళ్లవైపు మొగ్గు చూపడం మొదలైంది. ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో జనసామాన్యం ఇళ్లల్లో మూలపడి ఉన్న సైకిళ్లను బయటకు తీశారు. సైకిళ్లు లేనివారు లాక్డౌన్ సడలింపులు మొదలవగానే, రోజులెప్పుడెలా ఉంటాయోననే భయంతో సైకిళ్ల కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రజా రవాణాకు అవరోధం కలిగితే, సైకిల్ గొప్ప భరోసా ఇస్తుందని ప్రజలు బాగానే గ్రహించారు. గత ఏడాది తొలి లాక్డౌన్ సడలింపుల కాలం నుంచి ఇప్పటి వరకు– అంటే గడచిన ఏడాది కాలంలో దేశంలోని సైకిళ్ల అమ్మకాల్లో ఏకంగా 20 శాతం పెరుగుదల నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. గడచిన దశాబ్దిలో సైకిళ్ల అమ్మకాల్లో ఈ పెరుగుదలే అత్యధికం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని నగరాల్లో సైకిళ్ల వినియోగం పెంచేందుకు చర్యలు చేపడుతుండటంతో రానున్నకాలంలో సైకిళ్ల అమ్మకాల్లో నిలకడగా పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. సైకిల్‌తో ఆరోగ్య లాభాలు ఇక ఆరోగ్య లాభాలను చూసుకుంటే, సైకిల్‌కు ఇంధనం అక్కర్లేదు కాబట్టి, దీని నుంచి పొగ వెలువడటం, తద్వారా కాలుష్యం పెరిగి ప్రజారోగ్య సమస్యలు తలెత్తడం వంటి విపత్తులేవీ ఉండవు. ప్రజారోగ్య సమస్యలు తగ్గితే, ప్రభుత్వ ఖజానాపై కూడా భారం తగ్గుతుంది. మోటారు వాహనాలతో పోల్చుకుంటే, నడిపేటప్పుడు సైకిల్‌ను అదుపు చేయడం చాలా తేలిక. అందువల్ల మోటారు వాహనాలను నడిపేవారితో పోల్చుకుంటే, సైకిల్ నడిపేవారికి ఎదురయ్యే ప్రమాదాలు తక్కువే. ఒకవేళ అనుకోని ప్రమాదాలు ఎదురైనా, వాటిలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు దాదాపు ఉండవు. ఇక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం సైక్లింగ్ వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం. ► కాళ్లతో పెడల్ తొక్కుతూ సైకిల్ నడపడం వల్ల ప్రయాణానికి ప్రయాణం, వ్యాయామానికి వ్యాయామం ఏకకాలంలో జరగడమే కాదు, కాళ్లు, నడుము దృఢంగా తయారవుతాయి. చేతులకు పట్టు పెరుగుతుంది. ► సైకిల్ తొక్కడం వల్ల ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, సైక్లింగ్ వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి, బరువు అదుపులో ఉంటుంది. శరీరాకృతి చక్కని తీరులోకి మారుతుంది. ► అధిక బరువు వల్ల తలెత్తే గుండెజబ్బులు, బీపీ, సుగర్ వంటి సమస్యలు దరిచేరవు. ఒకవేళ బీపీ, సుగర్ వంటివి అనువంశిక కారణాల వల్ల వచ్చినా, సైక్లింగ్‌తో అవి అదుపులో ఉంటాయి. సైక్లింగ్ వల్ల గుండెజబ్బులే కాదు, కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ► రోజూ సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారిలో నిద్రలేమి సమస్య దాదాపుగా ఉండదు. సైక్లింగ్ వల్ల శరీరానికి తగిన వ్యాయామం, అలసట లభించి చక్కగా నిద్రపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ► సైక్లింగ్ వల్ల కేవలం శరీరానికి మాత్రమే కాదు, మెదడుకూ లాభం ఉందంటున్నారు ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైక్లింగ్ వల్ల మెదడుకు రక్తప్రసరణ గణనీయంగా మెరుగుపడుతుందని, దీనివల్ల మెదడు చురుకుదేరి, వయసుమళ్లిన దశకు చేరుకున్నా అల్జీమర్స్, డెమెన్షియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. సైకిల్ విచిత్రాలూ విశేషాలూ ► ఒకటికి మించిన సీట్లు, సీట్లకు సరిసమానమైన సంఖ్యలో చైన్లు, పెడల్స్ జతలు ఉండే పొడవాటి సైకిళ్లను ‘టాండెమ్ బైసైకిల్స్’ అంటారు. ఇలాంటి వాటిలో 35 సీట్లు కలిగిన టాండెమ్ బైసైకిల్ ఏకకాలంలోనే అత్యధిక సంఖ్యలో సైక్లిస్టులు తొక్కగలిగే సైకిల్‌గా రికార్డులకెక్కింది. దీని పొడవు 67 అడుగులు. అయితే, ఇరవై సీట్లు కలిగిన టాండెమ్ సైకిల్ అత్యంత పొడవైనదిగా రికార్డులకెక్కింది. దీని పొడవు ఏకంగా 137 అడుగులు. ► సైకిల్ ప్రధానంగా సామాన్యుల వాహనం. సైకిల్ ధరలు దాదాపుగా అందుబాటులోనే ఉంటాయి. మన దేశంలో సుమారు మూడువేల రూపాయల నుంచి సైకిల్ ధరలు మొదలవుతాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సైకిల్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా ఐదులక్షల డాలర్లు– అంటే, సుమారు రూ.3.71 కోట్లు. బ్రిటిష్ ఆర్టిస్ట్ డామీన్ హిర్ట్స్ ‘బటర్‌ఫ్లై బైక్’ పేరిట రూపొందించిన ఈ సైకిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది. ► ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైకిళ్లు వాడుకలో ఉన్న దేశం చైనా. దాదాపు యాభై కోట్ల సైకిళ్లు చైనాలో ఉన్నాయి. ► ప్రపంచంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న సైకిళ్ల కారణంగా ఏడాదికి దాదాపు 90 కోట్ల లీటర్ల వరకు ఇంధనం ఆదా అవుతోందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఆ మేరకు కాలుష్యం కూడా తగ్గుతున్నట్లే కదా: ► విమానాన్ని రూపొందించిన రైట్ బ్రదర్స్ సైకిళ్ల వ్యాపారం చేసేవారు. ఓహాయో రాష్ట్రంలోని ఐదు చోట్ల వారికి సైకిల్ దుకాణాలు ఉండేవి. సైకిల్ తయారీ, మరమ్మతుల్లో నైపుణ్యం సాధించిన ఆ సోదరులిద్దరూ, సైకిల్ తయారీ కర్మాగారం లోనే విమానం తయారీ ప్రయత్నాలు ప్రారంభించారు. ► ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన సైకిల్ రేసులకు ఫ్రాన్స్ వేదికగా నిలుస్తోంది. అక్కడ ‘టూర్ డి ఫ్రాన్స్’ పేరిట 1903 నుంచి ఏడాదికోసారి మూడువారాల పాటు జరిగే సైకిల్ రేసుల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన సైక్లిస్టులు పాల్గొంటారు. -
సీఎం స్టాలిన్ సైక్లింగ్: ఈసీఆర్‌లో 20 కి.మీ ప్రయాణం
సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైకిల్‌పై దూసుకెళ్లారు. ముట్టుకాడు నుంచి మహాబలిపురం వరకు 20 కి.మీ దూరం సైకిల్ తొక్కుతూ, మార్గ మధ్యలో ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. సీఎం స్టాలిన్ వ్యాయామం, సైక్లింగ్, వాకింగ్ చేస్తుంటారు. ప్రతి ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేసేవారు. సీఎం అయినా ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో మార్పు లేదని చాటుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చిన ఓ ఆదివారం సైకిల్‌పై స్టాలిన్ దూసుకెళ్లారు. ఆ తర్వాత అధికారంలోకి రావడం, కరోనా కట్టడికి విస్తృతంగా సేవల్ని అందించడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కరోనా కట్టడికి వచ్చిన నేపథ్యంలో మళ్లీ సైకిల్ పయనంపై దృష్టి పెట్టారు. మార్గ మధ్యలో సెల్ఫీలు ఇది వరకు ఎలాంటి భద్రత లేకుండా ఒకరిద్దరితో కలిసి సైకిల్‌పై స్టాలిన్ వెళ్లేవారు. సీఎం కావడంతో భద్రతా పరంగా చర్యలు తప్పలేదు. ఎక్కడా ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేశారు. ఉదయాన్నే 15 మందితో కలిసి స్టాలిన్ ముట్టకాడు చేరుకున్నారు. అక్కడ రోడ్డుపక్కన ఉన్న ఓ దుకాణంలో తేనీరు సేవించి సైకిల్‌పై మహాబలిపురం వైపుగా 20 కి.మీ దూరం ప్రయాణించారు. సైకిళ్లు ముందుకు సాగుతుంటే, వెనుక ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు కదిలాయి. మార్గ మధ్యలో అక్కడక్కడ ప్రజలను స్టాలిన్ పలకరించారు. సెల్ఫీలు దిగారు. మహాబలిపురం వద్దకు చేరుకుని అక్కడి ఓ హోటల్లో తేనీరు సేవించి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. -
ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్
మన దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకి భగ్గుమంటున్నాయి. దేశంలోనే చాలా రాష్ట్రాలలో ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ కూడా కొట్టేశాయి. దీంతో చమురు కంపెనీలకు చెక్ పెట్టేందుకు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ని గుర్తించిన అనేక విదేశీ కంపెనీలు ఇప్పటికే సరికొత్త వాహనాలను ఇండియాలోకి తీసుకొస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన గో జీరో అనే కంపెనీ ఇండియాలో ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది. వీటినీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. తక్కువ దూరం ప్రయాణించేవారికి, పట్టణ వినియోగదారుల కోసం వీటినీ తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సైకిళ్లను ఛార్జ్ చెయ్యడం కూడా చాలా తేలిక ఛార్జింగ్ చేసేందుకు పట్టే సమయం కూడా చాలా తక్కువ అని కంపెనీ తెలిపింది. ఈ సైకిళ్లలో మూడు రకాలను కంపెనీ లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.20వేల( స్కెల్లింగ్) నుంచి ఉంది. వాటిలో ప్రీమియం సైకిల్(స్కెల్లింగ్ ప్రో) ధర రూ.35వేల వరకు ఉంది. స్కెల్లింగ్ ప్రో ఎనర్డ్రైవ్ 400Wh లిథియం బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది 7-స్పీడ్ గేర్ సిస్టమ్, ముందు, వెనుక గోజెరో ప్రైవ్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. డాష్ గోజెరో డ్రైవ్ కంట్రోల్ వెర్షన్ 4.0 ఎల్సిడి డిస్ప్లే హైలైట్ చేశారు. స్కెల్లింగ్ ప్రో గంటకు 25 కి.మీ వేగంతో సింగిల్ ఛార్జీతో 70 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 0 నుంచి 90 శాతం వరకు ఛార్జింగ్ కి పట్టే సమయం సుమారు 3 గంటలు. చదవండి: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వెబ్సైట్లు షట్ డౌన్ -
సైకిల్‌పై భార్యతో కలిసి 230 కి.మీ ప్రయాణం
హమీర్పూర్ : కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసరాలు తప్పిస్తే వివాహ, ఇతరత్రా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అయితే కొందరు తమ వివాహాలను వాయిదా వేసుకోవడం ఇష్టం లేక ఎంతదూరమైనా వెళుతున్నారు. కొందరు తమ కుటుంబసభ్యులు సమక్షంలో జరుపుకుంటుంటుండగా, మరికొందరు ఆన్లైన్లో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన కల్కు ప్రజాపతి పెళ్లి కోసమని మొదట 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేశాడు. పెళ్లి చేసుకొని తిరిగి అదే సైకిల్‌పై తన భార్యను ఎక్కించుకొని మరో 130 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మొత్తం 230 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఎట్టకేలకు తన సొంతూరుకు చేరుకున్నాడు. (ఆరోగ్యం బాలేదని అంబులెన్స్‌కు కాల్ చేసి..) వివరాలు.. హమీర్‌పూర్‌కు చెందిన కల్కు ప్రజాపతి పదో తరగతి వరకు చదువుకున్నాడు. మహోబా జిల్లా పునియా గ్రామానికి చెందిన వధువు రింకుతో పెళ్లి ఏప్రిల్ 25వ తేదీన జరగాల్సి ఉంది. తన పెళ్లికి సంబంధించి అనుమతి కోసం లోకల్ పోలీసులను ఆశ్రయించగా వారు నిరాకరించారు. దీంతో చేసేదేంలేక ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన ప్రజాపతి సైకిల్‌పై వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న సమయానికి పెళ్లి జరగడంతో ప్రస్తుతం ప్రజాపతి సంతోషంగా ఉన్నాడు. అయితే తన ప్రయాణంలో పడిన కష్టాలను స్వయంగా చెప్పుకొచ్చాడు. ' నా వివాహం నాలుగు నెలల క్రితమే రింకూ అనే వధువుతో నిశ్చయించారు. అయితే వధువు కుటుంబం 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహోబా జిల్లా పునియా గ్రామంలో ఉంటున్నారు. అప్పటికే వధువు రింకూ కుటుంబం పెండ్లి పత్రికలు కూడా ముద్రించి అందరికి పంపిణీ చేశారు. ఇంతలో కరోనా వల్ల లాక్డౌన్ విధించారు. పెళ్లి కోసం నెలరోజులకు పైగా పొలం పనులు విడిచిపెట్టి అనుమతి కోసం పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగాను. కాని నాకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. ఇంతలో పెండ్లి తేదీ దగ్గరకు వస్తుందనే ఆందోళన ఎక్కువైంది. దీనికి తోడు నాకోసం వధువు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో సైకిల్‌పై బయలుదేరాను. వాస్తవానికి నాకు ద్విచక్రవాహనం నడపడం వచ్చు కాని లైసెన్స్ లేదు. సైకిల్‌పై వెళితే లైసెన్స్ అవసరం ఉండదని భావించి ప్రయాణం ప్రారంభించాను. చివరకు ఎన్నో కష్టాలు పడి వధువు ఇంటికి చేరుకున్నాను. (పెళ్లి కోసం 800 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి) మా వివాహానికి అందరిని ఆహ్వానించాం. లాక్డౌన్ కారణంగా బంధువుల ఎవరూ మా పెళ్లికి రాలేకపోయారు. వధువు కుటుంబ సభ్యుల మధ్య గుడిలో వివాహ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. నేను వెళ్లేటప్పుడు ఒంటరిగానే వెళ్లాను. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం రింకూ కూడా ఉండటంతో సైకిల్ తొక్కడం ఇబ్బందిగా మారింది. దాదాపు 230 కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కాళ్లు నొప్పులు పుట్టి నిద్రకూడా సరిగా పట్టలేదు.. నొప్పులు తగ్గడానికి మందులు వాడాల్సి వచ్చింది. బంధువులు వివాహానికి హాజరుకాలేక పోయినా అందరూ ఫోన్లు చేసి ఆశీర్వదించారు. పెండ్లి వాయిదా వేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. కాని తన తల్లి ఆనారోగ్యంతో ఉండటం,ఇంట్లో వంట చేయడానికి ఎవరూ లేకపోవడం వల్ల తప్పని సరిగా ఇప్పడే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అంతేగాక లాక్డౌన్ ఎత్తివేయడానికి ఎంతసమయం పడుతుందో తెలియదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు' ప్రజాపతి చెప్పుకొచ్చాడు. -
మార్నింగ్ రైడ్‌కు వెళ్తే ఐఫోన్, సైకిల్ చోరీ..
న్యూఢిల్లీ : ఉదయాన్నే వ్యాయామం కోసం సైకిల్‌పై వచ్చిన యువకుడి నుంచి ఖరీదైన సైకిల్‌తో పాటు ఐఫోన్‌ను దుండగులు గుంజుకున్న ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ద్వారకా సెక్టార్ 19కు చెందిన నిషాంత్ సింగ్ శుక్రవారం తెల్లవారుజామున సైకిల్‌పై వస్తుండగా కన్నాట్‌ప్లేస్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడి వద్ద నుంచి సైకిల్, ఐఫోన్‌ను తీసుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు బైక్‌పై, మరొకరు తన సైకిల్‌పై పారిపోయారని నిందితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సైకిల్ బాస్కెట్లో ఐఫోన్-ఎక్స్ఎస్ మ్యాక్స్ ఉందని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
ఒక్క సెల్ఫీ భాయ్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ముంబై రోడ్లపై సైకిల్ తొక్కారు. పెద్ద పెద్ద కార్లలో ప్రయాణించే సల్మాన్ సడన్‌గా ఇలా సైకిల్‌తో రోడ్డు ఎక్కడానికి కారణం ఉంది. ముంబైలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రీకరణ ముంబైలోనే జరుగుతోంది. వర్షాల వల్ల కారులో వెళితే ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయని సల్మాన్ ఊహించి ఉంటారు. అందుకే సైకిల్‌పై ‘దబాంగ్ 3’ సెట్స్‌కు వెళ్లారు. సల్మాన్ వంటి సూపర్‌స్టార్ రోడ్డుపై కనిపిస్తే అభిమానులు ఊరుకోరు కదా.. వెంటనే ఒక్క సెల్ఫీ భాయ్ అని అడిగారు. స్మైల్‌తో సల్మాన్ పోజిచ్చారు. ఇలా చాలా మంది సెల్ఫీస్‌లో బందీ అయిపోయారు సల్మాన్. ఇక ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్ 3’ సినిమాలో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆత్మవిశ్వాసమే ఆమె ఆయుధం
భర్త అనారోగ్యం ఆమెపై మోయలేని భారాన్ని మోపింది. ఉన్నదంతా భర్త వైద్యానికే ఖర్చు చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. పూట గడవటం కష్టంగా మారింది. అటువంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకున్న ఆ ఇల్లాలు కష్టాలకు ఎదురొడ్డి నిలిచి సైకిల్ రిపేరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లికి చెందిన చింతల శారద. కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవించే చింతల సుభాష్ 2002లో ఒళ్లంతా తిమ్మిర్లు వస్తూ అనారోగ్యం బారిన పడ్డాడు. తమకున్న భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు అక్కడిక్కడ సుమారు రూ. రెండులక్షల వరకు అప్పు చేసి భర్తకు వైద్యం చేయించింది శారద. అయినా సుభాష్‌కు వ్యాధి నయం కాకపోవడంతో ఏ పనీ చేయలేని పరిస్థితుల్లో ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి పూట గడవటం కష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారం తనపై వేసుకుని సైకిల్ మరమ్మతులు చేయడం ప్రారంభించింది శారద. సైకిల్ పంక్చర్లు వెయ్యడం నుంచి మెల్లిగా స్కూటర్లు, ట్రాక్టర్ టైర్ల పంక్చర్లు అతకడం నేర్చుకుని ప్రస్తుతం సైకిల్ రిపేరింగ్‌తో పాటు అన్ని వాహనాల పంక్చర్లు వేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ తమ ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. తల్లి పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన వీరి కుమారుడు రాజు పదో తరగతి తర్వాత చదువు మానేసి గొర్ల కాపరిగా జీతం ఉంటూ కుటుంబ పోషణలో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సొంతిల్లు అమ్ముకుని అద్దె ఇంట్లో.. సుభాష్ వైద్య ఖర్చుల కోసం మొదట తమకు ఉన్న 20 గుంటల భూమిని అమ్మేసింది శారద. వైద్య ఖర్చులకు ఆ డబ్బు చాలకపోవడంతో మరో రూ.2 లక్షల వరకు అప్పు చేసింది. సైకిల్ రిపేరింగ్‌తో వచ్చే డబ్బు కుటుంబ పోషణకే చాలడం లేదంటే సుభాష్‌కు నెలనెలా మందుల కోసం సుమారు రూ. రెండు వేల వరకు ఖర్చవుతోంది. ఈ క్రమంలోనే ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు. అప్పటినుంచి అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీçస్తూ... దాతల ఆసరా, ప్రభుత్వ సాయం కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.– గాజుల సతీష్‌కుమార్,సాక్షి కమలాపూర్ (వరంగల్ అర్బన్ జిల్లా) ప్రభుత్వమే ఆదుకోవాలి నా భర్త అనారోగ్యం బారిన పడి పదిహేడేళ్లు అయితాంది. ఉన్న ఆస్తి అంతా పోయి ఇంకా రూ.3 లక్షల దాక అప్పు ఉన్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. సైకిల్ రిపేరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొత్తాన. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీ రుణం ఇప్పించి ఆదుకోవడంతో పాటు ఇళ్లు లేని మాకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిచ్చి ఇయ్యాలె.– చింతల శారద ఏ పని చేయలేక పోతాన నాకొచ్చిన వ్యాధి నయం కాక ఒళ్లంతా తిమ్మిర్లు వత్తానయి. ఏ పనీ చేయలేక పోతాన. నా వైద్యం కోసం, బిడ్డ పెళ్లి కోసం ఉన్నదంతా అమ్ముకున్నం. నా భార్య శారద ఇంటికి పెద్ద దిక్కుగా మారి నన్ను, నా కుటుంబాన్ని సాకుతాంది. ఆమె పడే కష్టం చూడటం తప్ప మరేమీ చేయలేక పోతాన. ప్రభుత్వమే మా కుటుంబాన్ని ఆదుకోవాలె.– చింతల సుభాష్ -
ఇదిగో బహుమతి..
పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థుల్లో ఉత్తీర్ణతశాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే విద్యార్థులను ప్రతీ రోజు పాఠశాలకు వచ్చేలా విద్యాశాఖ అధికారులు చొరవ చూపుతున్నారు. ఈ మేరకు జిల్లాలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందశాతం ఉత్తీర్ణత ఉన్న విద్యార్థినులకు సైకిళ్లను బహూకరించనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఆగస్టు నెలను హాజరు మాసంగా ప్రకటించారు. దీని ద్వారా వందశాతం హాజరు ఉన్న విద్యార్థినులను ప్రోత్సహించడంతోపాటు ఎక్కువ మంది విద్యార్థినులను పాఠశాలకు వచ్చేలా ఉపయోగపడనుంది. సాక్షి, పాపన్నపేట: ఈనెల 2న వనపర్తి ఉన్నత పాఠశాల విద్యార్థిని నందినికి ఊహించని బహుమతి లభించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఆ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థినిని గుర్తించారు. వెంటనే ఆమెకు అక్కడికక్కడే ఒక సైకిల్ బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇది హాజరు మాసోత్సవంలో భాగంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు తీసుకున్న చర్య అని తెలిపారు.’ ప్రస్తుతం మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అదేబాటకు శ్రీకారం చుడుతున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థినుల సమాచారాన్ని సేకరిస్తున్నారు.వీరిలో కొందరికి సైకిళ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాఠశాలపై ఆసక్తి కలిగించేలా.. శతశాతం హాజరు సాధించే విద్యార్థి తరగతికి తగిన సామర్థ్యాలు సాధిస్తారన్నది కాదన లేని నిజం. పాఠశాల అంటే విద్యార్థికి ఆసక్తి కలిగించే దిశగా విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి వినూత్న ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. హాజరు శాతం పెంచేందుకు ఆగస్టు నెలను ‘హాజరు మాసంగా’ ప్రకటించారు.ఈ క్రమంలో పాఠశాలలను తనిఖీ చేసిన ఆయన ఒక విద్యార్థినికి సైకిల్ బహుమతి ఇచ్చిన వార్త వైరల్ అయ్యింది. ఈ ప్రోత్సాహకం సత్ఫలితాన్ని ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు పర్చేందుకు అవకాశాలు వెతుకుతున్నారు. ట్రావెల్ అలవెన్స్ ఇచ్చే అవకాశం! గతంలో 1998లో అప్పటి ప్రభుత్వం చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పాఠశాలలకు వస్తున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఇది బాలికా విద్య పెరగడానికి కొంత వరకు దోహద పడింది. ప్రస్తుతం 3 నుంచి 5 కి.మీ దూరం నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.300 ట్రావెలింగ్ అలవెన్స్‌గా ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. దాతల సహకారంతో.. హాజరు శాతం పెంచేందుకు సైకిళ్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందుకు గాను కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ముందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులను సంప్రదిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతీ రోజు ఒక్కో కంపెనీతో అధికారులు మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు.. 100 శాతం హాజరు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి సైకిళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బడుల్లో నెలకొని ఉన్న మౌలిక సమస్యలు తీర్చేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఒక ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది.ఈ పోర్టల్ ద్వార సహాయం చేసే దాతలకు ఐటీ వెసులు బాటు ఉంటుందని అధకారులు స్పష్టం చేశారు. దీం తో ఇప్పటికే ఎల్ఐసీ, ఐకియా, సంప్రదింపులు జరిపి ఫలితాలు సాధించినట్లు సమాచారం. మెదక్ జిల్లాలో సైతం.. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఈ విషయమై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చే విద్యార్థినుల వివరాలు సేకరించాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు సూచించనున్నట్లు తెలుస్తుంది. ఈనెల 15న గాని అంతకు ముందు గాని శతశాతం హాజరు గల విద్యార్థినులకు సైకిళ్ళు అందజేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.మెదక్ జిల్లాలో మొత్తం 141 ఉన్నత,133 ప్రాథమికోన్నత,623 ప్రాథమిక పాఠశాలలు,15 కేజిబివిలు,7 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 80 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.అందులో సుమారు 40వేల మంది విద్యార్థినులున్నారు. -
గతమెంతో ఘనం..నేడు కనుమరుగు
సాక్షి, జగిత్యాల : ఒకప్పుడు సైకిల్ అంటే సామాజిక హోదా, సైకిల్ ఉంటే సమాజంలో గౌరవం ఉండేది. ఏదైనా పని ఉందంటే చాలు సైకిల్ వేసుకుని రివ్వున వెళ్లి పని ముగించుకుని వచ్చేవారు. పాఠశాల, కాలేజీ, ఆఫీస్, వ్యవసాయం, వ్యాపారం ఏ పనికి వెళ్లాలన్నా సైకిల్‌పైనే ఆధారపడేవారు. సైకిల్ నిర్వహణకు పెద్దగా ఖర్చు కూడా ఉండేది కాదు. అంతెందుకు పెళ్లి కుదిరిందంటే పెళ్లి కూతురు తల్లిదండ్రులు వరుడికి వరకట్నం కింద సైకిల్, గడియారం పెట్టడం ఆనవాయితీగా ఉండేది. సైకిళ్లు అద్దెకిచ్చేందుకు వాడవాడలా సైకిల్ టాక్సీలు ఉండేవి. ఉదయం 8 గంటలు కాకముందే సైకిల్ టాక్సీని కొత్తపెల్లి కూతురులా ముస్తాబు చేసి అందులోని సైకిళ్లను శుభ్రంగా తుడిచి వరుసలో అమర్చి అద్దెకిచ్చేందుకు సిద్ధంగా ఉంచేవారు. ఒక ఊరు నుంచి మరో ఊరికి గాని పట్టణానికి బస్సుల్లో వెళ్లేవారు తమ స్థానిక అవసరాల కోసం సైకిల్ టాక్సీల్లో సైకిళ్లను అద్దెకు తీసుకుని తమ అవసరాల మేరకు వినియోగించుకుని తిరిగి ఇచ్చేటప్పుడు అద్దె చెల్లించేవారు. ఈ అద్దె గంటలు, రోజులు, నెలల లెక్కన ఉండేది. సొంత సైకిళ్లు లేనివారు సైకిల్ నేర్చుకునేందుకు అద్దె సైకిళ్లు కిరాయికి తీసుకునేవారు. ఒకప్పుడు సైకిల్ నడపడం రాదంటే నామోషీగా భావించేవారు. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను ప్రజలకు వివరించేందుకు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా సైకిల్ యాత్రలు నిర్వహించేవారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సైకిల్, మోటార్ సైకిళ్ల స్పీడుకు కనుమరుగవుతోంది. ప్రస్తుతం మోటార్సైకిల్లే కిరాయికి లభిస్తుండటంతో పెద్ద సైకిళ్లు అద్దెకిచ్చే టాక్సీలు మూతపడ్డాయి. దీంతో సైకిల్ టాక్సీలు నిర్వహించేవారు ప్రస్తుతం ఫ్యాన్సీ సైకిళ్లు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏదిఏమైనా మనిషితో మమేకమై వారితో విడదీయరాని బంధాన్ని కలిగిన సైకిల్ ప్రస్తుతం ఓ గతించిన జ్ఞాపకంగా మిగిలిందని అంటున్నారు సైకిల్ ప్రియులు. ఆదరణ కరువైంది.. గత 30 ఏళ్లుగా సైకిల్ టాక్సీ నడుపుతూ జీవనం సాగించాం. ప్రస్తుతం మోటార్ సైకిళ్ల వాడకం పెరగడంతో పెద్ద సైకిళ్లకు ఆదరణ కరువై వాటిని ఎవరూ వాడకపోవడంతో సైకిల్ టాక్సీ ఎత్తేసి ఫ్యాన్సీ సైకిళ్ల విడిభాగాలు అమ్ముతున్న. రిపేరు చేస్తూ ఎలాగోలా సర్దుకుంటున్నాం. – కరుణాకర్, సైకిల్ టాక్సీ నిర్వాహకుడు -
ఆకాశంలో సైకిల్ సవారీ
సాక్షి ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లోని హరితవనంను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సైకిల్ జిప్‌లైన్‌ను ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీ, నాగ్‌పూర్ నుంచి టెక్నికల్ ఇంజనీర్లను పిలిపించి దీన్ని తయారు చేయించారు. మంగళవారం నిర్వహించిన ట్రయల్ రన్లో రోషన్, కృష్ణ అనే మెకానిక్ దీన్ని నడిపించారు. -
‘సైకిల్ అంటే నాకు ఫ్యాషన్ కాదు.. పాషన్’
గాంధీనగర్ : గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం పలువురు నేతలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే వారి పేర్లను ఇప్పటికే ప్రకటించారు. వీరిలో గుజరాత్‌కు చెందిన మన్సుక్ లాల్ మాండవ్య కూడా ఉన్నారు. మోదీ కాబినేట్‌లో మన్సుక్ మరోసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మన్సుక్ మాట్లాడుతూ.. ‘నరంద్రే మోదీ, అమిత్ షా నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మరోసారి వారి ప్రభుత్వంలో నన్ను భాగం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిద్దరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు. గత ఐదేళ్లలో మన్సుక్ సైకిల్ మీదనే పార్లమెంట్‌కు వెళ్లారు. దాంతో విలేకరులు ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా సైకిల్ మీదనే వెళ్తారా అని ప్రశ్నించారు. అందుకు ఆయన బుదులిస్తూ.. ‘సైకిల్ మీద ప్రయాణించడాన్ని నేను పాషన్‌గా భావిస్తాను. సైకిల్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. సైకిల్ వాడకం వల్ల కాలుష్యం తగ్గడమే కాక ఇంధనం కూడా ఆదా అవుతుంది. పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఐదేళ్ల నుంచి పార్లమెంట్‌కు సైకిల్ మీదనే వెళ్లాను. ఇప్పుడు కూడా అలానే చేస్తాను’ అని చెప్పుకొచ్చారు. -
సైసై సవారీ.... మోనో సైకిల్ భళారే
సవారీ అంటే మనకు గుర్తుకు వచ్చేది రేసు గుర్రమే కదా! ఇప్పుడు సవారీ చేయడానికి సరికొత్త పరికరాలు, వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. సర్కస్‌లో సింగిల్ వీల్ సైకిల్‌పై ఫీట్స్ చేసేవారిని చూసి ఆశ్చర్యపోతాం. ఇప్పుడు నడి రోడ్డుపైనే సైకిల్‌తో ఫీట్లు వేస్తున్నారు. మోనోవీలర్పై ఇప్పుడు 63 ఏళ్ల వ్యక్తి సవారీ చేస్తున్నాడు. విశాఖపట్నం ,మురళీనగర్(విశాఖ ఉత్తర): కాలం మారిన కొద్దీ నూతన వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఒకప్పుడు సైకిల్ నుంచి మోటారు సైకిల్, ఆ తర్వాత కారు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పుడు కాలుష్యం ముప్పు పెరగడంతో పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ పరిశోధనల ఫలితంగా బ్యాటరీ వాహనాలు వచ్చాయి. తాజాగా బ్యాటరీతో నడిచే మోనోవీలర్ కూడా మార్కెట్లో దర్శనమిస్తోంది. మన దేశంలో అతి అరుదుగా వాడుతున్నప్పటికీ విశాఖ వీధుల్లోకి ఇప్పుడిప్పుడే దర్శనమిస్తోంది. 63 ఏళ్ల యువకుడు 63 ఏళ్ల యువకుడు ఇప్పుడు నగరంలో సైకిల్ ఫీట్లతో సందడి చేస్తున్నారు. కె. కోటపాడు మండలం రొంగలినాయుడు పాలెం గ్రామానికి చెందిన కొల్లి కాశీవిశ్వనాథ్ సుజాతనగర్లో నివశిస్తున్నారు. ఆయన వయసు 63ఏళ్లు. ఈ వయసులో చాలా జాగ్రత్తగా అవయవాలను కాపాడుకోవాల్సి ఉంటుంది. బయటికి వెళ్లాలంటే ఏ కారుమీదో, అదీ లేకపోతే ద్విచక్ర వాహనం మీదో ప్రయాణిస్తారు. కానీ ఆయన అందుకు భిన్నంగా మోనో వీలర్ పై రయ్ .మంటూ రోడ్లపై దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యన వాహనంపై వెళ్తూ ఉంటే ఇతర వాహనాలపై వెళ్తున్న వారందూ ఆగి మరీ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మన నగరంలో ఈ మోనో వీలర్ బ్యాటరీ వాహనాన్ని వాడుతున్న ఒకే ఒక వ్యక్తిగా చెప్పవచ్చు. ఇదోఫ్యాషన్ కాశీవిశ్వనాథ్ సింగపూర్ ఉన్నప్పుడు బ్యాటరీతో నడిచే వివిధ రకాల సైకిళ్ల వాడకాన్ని చూసి మోనో వీలర్ ను వాడాలనే ఆసక్తి పెంచుకున్నారు. ఈ వాహనాన్ని ఆయన సెప్టెంబరు 2018 నుంచి వాడుతున్నారు. మొదట్లో దీన్ని బ్యాలెన్స్ చేసి నడపడం కష్టమనిపించినా ఇప్పుడు చాలా హాయిగా ఉందని ఆయన చెబుతున్నారు. హ్యాండిల్‌కు బెల్ట్ పెట్టి నేర్చుకున్నారు. వాస్తవానికి 20 కిలోమీటర్ల స్పీడుతో దీనిపై ప్రయాణించవచ్చునని .. తాను మాత్రం సైకిల్ స్పీడుతో నడుపుతానని అంటున్నారు. పుట్టిన స్థలం రొంగలినాయుడు పాలెం వెళ్లినప్పుడు కారులో తీసుకుపోయి అక్కడ ఎక్కడికి వెళ్లినా దీనిపైనే ప్రయాణిస్తారు. నగరంలో మార్కెట్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు మోనోవీలర్పై సవారీ చేస్తున్నారు. మోనో వీలర్‌తో ఎన్నో ప్రయోజనాలు ఈ హనం బరువు పది కేజీలకు మించదు. దీనికి లిథియం బ్యాటరీ వినియోగిస్తారు. 45 మిషాల్లో పూర్తి చార్జి చేయవచ్చు.ఒకసారి చార్జి చేస్తే 15 లోమీటర్లు ప్రయాణించవచ్చు. ఎక్కడైనా చార్జింగు చేసుకునే వీలుంది. కాలుష్య రహిత వాహనం. ఎంతటి ట్రాఫిక్ చైనా సులువుగా తప్పించుకుని ప్రయాణించవచ్చు. శారీరక వ్యాయామం ఉంటుంది. పర్యావరణ హితం మారుతున్న కాలంలో ఇలాంటి వాహనాలు చాలా అవసరం. పర్యావరణహిత వాహనంగా ఇది పయోగపడుతుంది. దీనిపై ప్రయాణం వల్ల వ్యాయామం కలుగుతుంది. దీన్ని వెనక్కి కూడా ఒడుపుగా ప్రయాణించవచ్చు. ఒకసారి అలవాటైతే ఎక్కడికి వెళ్లాలన్నా దీన్నే వాడాలనిపిస్తుంది. స్కేటింగు నేర్చుకున్నవారు దీనిని నడపడం చాలా సులువు.– కాశీవిశ్వనాథ్, మోనోవీలర్ రైడర్ -
ఎలక్షన్ ‘సైకిల్’
ఒంగోలు టౌన్: ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల గుర్తును విస్తృతంగా ప్రచారం చేయించాలని నిర్ణయించింది. అందుకు పాఠశాలల బాలికలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు హడావుడిగా ఏర్పాట్లు చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన సైకిళ్లను చివర్లో ఇవ్వనుంది. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఈ సమయంలో బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయడం ద్వారా రెండు విధాలా ప్రయోజనం పొందవచ్చన్న ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఒకవైపు బాలికలు సైకిళ్లు తొక్కుకుంటూ పాఠశాలలకు వెళ్తుంటే, ఆ సైకిళ్లను అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పించిందని ప్రచారం చేయించడం, ఆ ప్రచారం ఎన్నికల్లో తమకు అనుకూల ఓటింగ్‌కు ఎంతగానో దోహదపడుతుందన్న అంచనాల్లో అధికారపార్టీ నాయకులు ఉండటం విశేషం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న 24948 మంది బాలికలకు సైకిళ్లను అందజేసేందుకు ప్రభుత్వం పరుగులు పెడుతోంది. ఎన్నికల కోడ్ వస్తే సైకిళ్ల పంపిణీకి ఎక్కడ బ్రేక్‌లు పడతాయోనన్న ఉద్దేశంతో హడావుడిగా బాలికల గణాంకాలను సేకరిస్తోంది. నవ్విపోదురుగాక నాకేంటి! బాలికల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించేందుకు సైకిళ్లను గత కొన్నేళ్ల నుంచి పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలను లక్ష్యంగా చేసుకొని వారికి సైకిళ్లు అందిస్తున్నారు. ఆ బాలికలు తమ ఇళ్ల నుంచి పాఠశా>లలకు సకాలంలో చేరుకోవడం ద్వారా బాలికల్లో డ్రాప్ అవుట్స్ తగ్గుతాయనేది సైకిళ్ల పంపిణీ ముఖ్య ఉద్దేశం. పాఠశాలల వారీగా ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలు ఎంత మంది ఉన్నారో పాఠశాల విద్యాశాఖలో స్పష్టంగా గణాంకాలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా జిల్లాల వారీగా సైకిళ్లను అందజేస్తే సరిపోతోంది. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రభుత్వం హడావుడిగా బాలికల సైకిళ్లను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమైంది. పాఠశాలలు ప్రారంభించిన ఒకటి రెండు నెలల్లో సైకిళ్ల పంపిణీ ప్రక్రియను పూర్తిచేస్తే సరిపోతోంది. అయితే పాఠశాలలు మూసే సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేసేందుకు జిల్లాల వారీగా ఇండెంట్లు తీసుకొని దానికి అనుగుణంగా వాటిని అందజేస్తామంటూ హడావుడిగా ప్రకటన చేయడంపై అటు బాలికలతోపాటు ఇటు ఉపాధ్యాయ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా సంవత్సరం చివర్లో ఏ ఒక్క బాలిక డ్రాప్ అవుట్ కాదు. ఒకవేళ పాఠశాల మానివేయాలనుకున్నా ఈ రెండు నెలలు చదువుకొని మానివేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం డ్రాప్ అవుట్స్‌ను తెరపైకి తీసుకువచ్చి సైకిళ్లను పంపిణీ చేయాలని చూడటంపై ఉపాధ్యాయ వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి. డ్రాప్ అవుట్స్ బాలికలపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యా సంవత్సరం ప్రారంభంలో సైకిళ్లను పంపిణీ చేసి ఉండేదని, విద్యా సంవత్సరం చివర్లో డ్రాప్ అవుట్స్ అంశాన్ని తీసుకువచ్చి హడావుడిగా సైకిళ్ల పంపిణీకి కసరత్తు చేస్తుండటంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంపిణీ ప్రచారాస్త్రం ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు ప్రతి ఏటా టెండర్లు పిలుస్తారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి టెండర్ల ప్రక్రియను మొదట్లోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ‘ఎన్నికల’ దృష్టితో ఆలోచించి కాలయాపన చేసుకుంటూ వచ్చింది. మరో రెండు నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుండటం, అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడనుండటంతో చంద్రబాబు ప్రభుత్వం ‘డబుల్ ధమాకా’గా సైకిళ్లను తెరపైకి తీసుకువచ్చింది. ఒక సైకిల్‌తో రెండు రకాల ప్రయోజనాలంటూ వాటిని బాలికలకు పంపిణీ చేసేందుకు టెండర్లను ఖరారుచేసి హడావుడిగా అందించేందుకు కంకణం కట్టుకొంది. బాలికలకు సైకిళ్లను పంపిణీ చేయకముందే ప్రభుత్వ నిర్ణయం నవ్వులపాలైంది. -
బడికొస్తా..బంక్ కొట్టింది
‘బాలికలపై తల్లిదండ్రులు వివక్ష చూపొద్దు.. బాలికా విద్యను ప్రోత్సహించాలి.. ఒక్క బాలిక కూడా మధ్యలో చదువు మానడానికి వీల్లేదు.. బాలికల విద్యాభివృద్ధికి ఎంత ఖర్చయినా భరిస్తాం’.. ఇది మన ప్రభుత్వం నుంచి తరచూ వచ్చే ప్రకటన. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం శూన్యం. బాలికల డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి ప్రవేశపెట్టిన బాలికలకు సైకిళ్లు అందించే ‘బడికొస్తా’ పథకం రెండేళ్లుగా పత్తాలేకుండాపోవడమే ఇందుకు నిదర్శనం. చిత్తూరు, మదనపల్లె టౌన్ : రాష్ట్రం ప్రభుత్వం 2016–17లో 9వ తరగతి బాలికలకు ‘బడికొస్తా’ పథకం కింద సైకిళ్లను పంపిణీ చేసింది. ఆ తరువాత పథకం గురించి పట్టించుకోకపోవడంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థినులకు బడికి రాకపోకలు కష్టంగా మారాయి. ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేస్తుందని ఆశించిన విద్యార్థినులకు నిరాశే మిగిలింది. జిల్లాలో 506 ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో 1.20 లక్షల మందికి పైగా 9, 10 తరగతుల విద్యార్థినులు ఉన్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం బడికొస్తా పథకాన్ని ప్రవేశపెట్టగా, 17 విద్యాసంవత్సరం ముగిసే సమయంలో కొంతమందికి మాత్రమే సైకిళ్లను అందజేసి చేతులు దులుపుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంతవరకు పంపిణీ చేయలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తయినా సైకిళ్లను పంపిణీ చేయకపోవడంతో.. విద్యార్థినుల్లో ఆశలు సన్నగిల్లాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన డ్రాపౌట్స్.. గ్రామీణ విద్యార్థినులకు ఉన్నత పాఠశాలలు దగ్గరలో లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు నడచి వెళ్లలేక డ్రాపౌట్స్‌గా మిగులుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 19 వేల మందికి పైగా బడిమానేసిన వివిధ తరగతుల బాలికలు ఉన్నట్లు సమాచారం. విద్యార్థినులకు తప్పని కష్టాలు.. పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వచ్చిపోయే విద్యార్థినులు రోజూ 3 నుంచి 10 కిల్లోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. మండలంలోని మాలేపాడు పంచాయతీలోని ఆవులపల్లె నుంచి చెంబకూరుకు రావాలంటే 7 కిల్లోమీటర్లు కాలినడకన అడవిలో ప్రయాణం సాగించాల్సి ఉంది. వన్యమృగాలు తారసపడడం, వాటి అరపులతో భయభ్రాంతులకు గురై కొందరు స్కూలుకు వెళ్లడం మానేస్తున్నారు. సరిౖయెన సమయానికి స్కూలుకు పోలేని విద్యార్థినులు అనేకమార్లు గైర్హాజరై పరీక్షల సమయంలో హాజరు తక్కువతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి జిల్లా అంతటా ఉంది. సైకిళ్ల పంపిణీకి ఉత్తర్వులివ్వలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి సైకిళ్ల పంపిణీ ఎంతగానో దోహదపడుతుంది. బడికొస్తా పథకం అమలుకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. – పాండురంగస్వామి, డీఈఓ, చిత్తూరు -
నడిచే బడికొస్తా
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడికొస్తా’ పథకం ఏడాది ముచ్చటగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు నడిచి వచ్చే బాలికలు.. దూరం కారణంగా బడిమానివేయకూడదనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం 9వ తరగతి చదివే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాలని భావించింది. ఏటా సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ 2016–17 విద్యాసంవత్సరానికి మాత్రమే పంపిణీ చేసి...ఆ తర్వాత పట్టించుకోలేదు. 15,388 సైకిళ్లు పంపిణీ ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లలకు ‘‘బడికొస్తా’’ సైకిళ్లు పంపిణీ చేస్తామనే ప్రభుత్వ ప్రకటనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంబరపడ్డారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు డ్రాపౌట్స్‌గా తగ్గించవచ్చనుకున్నారు. అయితే ప్రభుత్వం ఒక్క ఏడాది మాత్రమే పంపిణీ చేసి తర్వాత పట్టించుకోలేదు. జిల్లాకు 2016–17లో 15,581 సైకిళ్లు మంజూరయ్యాయి. వీటిలో 15,388 మంది బాలికలను సైకిళ్లు పంపిణీ చేశారు. వివిధ కారణాల వల్ల బడికి రాని కారణంగా 193 సైకిళ్లు అధికారుల వద్దే మిగిలిపోయాయి. ఆ తర్వాత 2017–18 సంవత్సరంలో పంపిణీ చేయలేదు. 17,388 సైకిళ్లు అవసరం అని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బాలికలు, వారి తల్లిదండ్రులు సైకిళ్లు కోసం ఎదురుచూశారు. జిల్లా అధికారులు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తుంది... అదిగో... ఇదిగో ఉంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క సైకిలూ పంపలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2018–19) దాదాపు సగం గడిచిపోతున్నా ఇప్పటిదాకా స్పష్టత లేదు. 8వ తరగతి విద్యార్థినులకూ... గత రెండేళ్లలో ఒకసారి మాత్రమే సైకిళ్లు పంపిణీ చేసిన ప్రభుత్వం... ఈ ఏడాది 9వ తరగతి విద్యార్థులతో పాటు 8వ తరగతి విద్యార్థినులకూ సైకిళ్లు పంపిణీ చేస్తామని గొప్పగా ప్రకటించింది. స్వయంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పలు సమావేశాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుల నుంచి 8, 9 తరగతుల విద్యార్థినుల వివరాలు సేకరించారు. జిల్లాలో సుమారు 30 వేల పైచిలుకు బాలికలు ఉన్నారు. తరచూ మీడియాలో వస్తున్న ప్రకటనలతో వారంతా సైకిళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థ సైకిళ్లు సరఫరా చేసే టెండరును రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థ దక్కించుకుంది. స్కూల్ పాయింట్‌కు చేర్చాల్సిన బాధ్యత వారిదే. అయితే రాష్ట్రం నుంచి జిల్లా కేంద్రానికి ఇక్కడి నుంచి మండలం, అక్కడి నుంచి స్కూల్ పాయింట్‌కు చేర్చడంలో మరింత జాప్యం జరిగింది. దీనికితోడు సైకిళ్లు నాణ్యత కూడా అంతంతమాత్రంగా ఉన్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రచార ఆర్భాటం ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ అంతా ప్రచార ఆర్భాటం. అందుకే అమలు గురించి పట్టించుకోవడం లేదు. మూడేళ్లలో ఒక్కసారి ఇచ్చేసి చేతులెత్తేశారు. ఈ ఒక్కటే కాదు.. విద్యాభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా ప్రభుత్వ విద్య కుంటు పడుతోంది. – కె.ఓబుళపతి, వైఎస్సార్టీఎఫ్రాష్ట్ర ప్రధానకార్యదర్శి నాకు తెలీదు బడికొస్తా పథకం ద్వారా ఈ సారి 8, 9 తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లాకు సుమారు 30 వేలుకు పైగా సైకిళ్లు అవసరం. ప్రతిపాదనలు పంపాం. ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయం. ఇంతకు మించి నాకు తెలీదు.– జనార్దనాచార్యులు, జిల్లా విద్యాధికారి -
మహిళా శక్తి
సాక్షి, అమరావతిబ్యూరో: ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలు, మహిళలు గడప దాటాలంటేనే భయం.. యువతులు కాలేజీకి వెళితే ఈవ్‌టీజింగ్.. సినిమాకు వెళితే ఆకతాయిల వేధింపులు.. మహిళలు ఆఫీసుకు వెళితే బాసుల అసభ్య ప్రవర్తన.. ఇలా ఎటుచూసినా ఏదొక రూపంలో మహిళలు మగవారితో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి బెడద ఇకపై బెజవాడ మహిళలకు ఉండబోదు. పోలీసు శాఖ అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ‘శక్తి మొబైల్ కాప్స్’ పేరిట మహిళా పోలీసు బృందాలను రంగంలోకి దింపనుంది. వీరి రాకతో భవిష్యత్‌లో బెజవాడమహిళలు నిశ్చింతగా ఉండొచ్చని పోలీసులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే ఉద్దేశంలో భాగంగా డీజీపీ ఠాకూర్ ‘శక్తి మొబైల్ కాప్స్’కు రూపకల్పన చేశారు. అందులో భాగంగా తొలుత బెజవాడను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం ‘శక్తి మొబైల్ కాప్స్’ టీమ్‌లు రాజధాని రహదారులపైకి రానున్నాయి. పోలీసు శాఖ నేతృత్వంలో బెజవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో తొలిసారి పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ‘శక్తి’ టీమ్‌లను నియమించనున్నారు. మహిళల రక్షణ బాధ్యతలు చూసే ఈ టీమ్ సభ్యులకు పోలీసు శాఖ ప్రత్యేక శిక్షణను ఇస్తోంది. శిక్షణ కార్యక్రమం పూర్తయిన వెంటనే వీరు రంగంలోకి దిగనున్నారు. ఐదు టీమ్‌ల ఏర్పాటు.. నగర కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ఐదు బృందాలను నియమించనున్నారు. ఒక్కో బృందంలో ఐదుగురు మహిళా పోలీసులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధులు అప్పగిస్తారు. శిక్షణలో తైక్వాండో, స్విమ్మింగ్, డ్రైవింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో పనిచేసే ‘శక్తి మొబైల్ కాప్స్’ టీమ్ సభ్యులు నగరంలో నిరంతరం ఈ–బైస్కిళ్లపై గస్తీ నిర్వహిస్తూ ఆకతాయిలపై నిఘా పెడతారు. మహిళల భద్రతే లక్ష్యం.. మహిళల భద్రత, రక్షణే లక్ష్యంగా ఈ బృందాలు పనిచేస్తాయి. పోలీసు డ్రెస్‌లో ఉండే శక్తి టీమ్స్ సభ్యులు నగరంలో నిత్యం గస్తీ నిర్వహిస్తూ మహిళలకు రక్షణ కవచంలా ఉంటారు. మహిళలను ఎవరైనా వేధించినా.. వెకిలి చేష్టలకు పాల్పడినా తక్షణమే వారిని అదుపులోకి తీసుకుంటారు. ముఖ్యంగా విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్ట ప్రకాశం శిక్షించడం వీరి విధి. ఈవ్టీజర్ల తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలి పించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేయడం ‘శక్తి కాప్స్’ ముఖ్య నిర్వహణ. -
రాజమాత కారు కాదని.. సైకిల్‌పైనే?
గ్వాలియర్ : అప్పటికే వాజ్‌పేయి ప్రముఖ రాజకీయ నాయకుడు. ఎన్నోఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నారు. అయినా సరే ఎంతో సాదాసీదాగా ఉండడమే ఆయనకు ఇష్టం. తాను పుట్టి పెరిగిన గ్వాలియర్‌లో సైకిల్‌పై తిరుగుతూ చిన్ననాటి స్నేహితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడం అంటే వాజ్‌పేయికి ఎంతో సరదా. ఈ విషయాల్ని వాజ్‌పేయి మేనకోడలు క్రాంతి మిశ్రా పంచుకున్నారు. ‘గతంలో అటల్జీ గ్వాలియర్ వచ్చినప్పుడు నా కుమారుడి సైకిల్ తీసుకుని చిన్ననాటి స్నేహితుడు దీపక్‌తో పాటు ఇతర స్నేహితుల ఇళ్లకు వెళ్లేవారు’ అని మిశ్రా పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఒకసారి ఈ విషయం తెలిసి అప్పటి బీజేపీ నాయకురాలు, రాజమాత విజయ రాజే సింధియా.. గ్వాలియర్‌కు వచ్చినప్పుడు తనకు చెపితే ప్రత్యేకంగా కారును ఏర్పాటు చేస్తానని చెప్పినా నిరాడంబరంగా ఉండేందుకు వాజ్‌పేయి ఇష్టపడేవారు. -
సైకిల్‌కు బ్రేకులు
ప్రభుత్వ బడుల్లో ప్రతి విద్యార్థినికి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తాం... నడిచి సూళ్లకు వెళ్లే అవస్థలు తప్పిస్తామని టీడీపీ సర్కారు చెప్పింది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అవుతున్నా ఒక్కసారి మాత్రమే సైకిళ్లు అందజేసి చేతులు దులుపుకుంది. జిల్లాలో చాలా గ్రామాలకు బస్సుల సౌకర్యం సరిగ్గా లేదు. బస్సు వెళ్లని గ్రామాలూ ఉన్నాయి. కాలినడకన హైస్కూళ్లకు చేరుకోవడం విద్యార్థులకు దూరాభారమవుతోంది. ప్రాథమిక స్థాయి వరకు చదివించి, దూరప్రాంతాలకు పంపే దారి లేక ఆడపిల్లలను మధ్యలోనే తల్లిదండ్రులు చదువును నిలిపేస్తున్నారు. చిత్తూరు ఎడ్యుకేషన్: బడికొస్తా పథకం కింద జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు టీడీపీప్రభుత్వం అధికారంలోకి వచ్పినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే సైకిళ్లను పంపిణీ చేసింది. 2016–17లో 9వ తరగతి బాలికలకు సైకిళ్లను అందజేసింది. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో నడుస్తున్న పాఠశాలల్లో అప్పట్లో చదువుతున్న 16,722 మంది బాలికల కోసం సైకిళ్లను పంపారు. ఆ సైకిళ్లను మండల కేంద్రాల్లో ఎంఈఓలకు అప్పజెప్పి సంబంధిత హైస్కూల్ విద్యార్థి నులకు అందజేశారు. అప్పట్లో సైకిళ్లు పూర్తి స్థా యిలో అర్హులైన విద్యార్థినులకు అందలేదన్న వి మర్శలున్నాయి. ఆధార్‌కార్డు, వెబ్సైట్లో ఫోటో ల అప్లోడ్ తదితర నిబంధనలు పెట్టడంతో చా లా మంది పేద విద్యార్థినులు సైకిళ్లను పొందలేకపోయారు. సరఫరా చేసిన సైకిళ్లను క్షేత్రస్థాయిలో అర్హులైన విద్యార్థినులకు అందజేశారా... లేదా అన్న అంశంపై విద్యాశాఖ పట్టించుకోలేదు. దీం తో పలు సైకిళ్లు పక్కదారిపట్టాయన్న ఆరోపణలు న్నాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు సైకిళ్ల ఊసే లేదు. పర్సంటేజీల కోసమేనా బాబు.. 2016–17లో జిల్లాలో సరఫరా చేసిన సైకిళ్లు విద్యార్థుల కోసం అనుకుంటే పప్పులోకాలేసినట్లే... ఇక్కడే ఉంది అసలైన తిరకాసు.. సం బంధించి కొన్ని ప్రయివేట్ సంస్థలకు సైకిళ్లసరఫరా బాధ్యత అప్పజెప్పారు. అప్పట్లో చిత్తూరు జిల్లాకు హీరో కంపెనీకి సంబంధించిన సైకిళ్లను అందజేశారు. రాష్ట్రస్థాయిలో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా నాణ్యత లేని సైకిళ్లను అందజేశారు. ఆ∙సైకిళ్లు సంవత్సరం కూడా తిరక్కముందే పాడైపోయాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2016–17లో చిత్తూరు డివిజన్లో 5,534 , పుత్తూరు డివిజన్లో 3,981, మదనపల్లె డివిజన్లో 4,258, తిరుపతి డివిజన్లో 2,949 మంది బాలికలకు సైకిళ్లను ఇచ్చారు. ఇందులో దాదాపు 40 శాతం సైకిళ్లు పక్కదారి పట్టాయని ఆరోపణలున్నాయి. కొన్ని సైకిళ్లను మూలపడేశారు. ఏ విద్యార్థినికి సైకిల్ ఇచ్చారో కూడా జిల్లా విద్యాశాఖ వివరాలు లేకపోవడం గమనార్హం. టీడీపీ సర్కారు బాధ్యతలు చేపట్టి ఐదో సంవత్సరం నడుస్తోంది. ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే నాణ్యత లేని సైకిళ్లను ఇచ్చి మిన్నకుండటం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు. కొత్త సైకిళ్లు వస్తాయని చాలామంది విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. -
ముషారఫ్.. హ్యాట్సాఫ్
సాక్షి, సిటీబ్యూరో: ఆయనో యువ ఐఏఎస్ అధికారి.. హైదరాబాద్‌కు చెందినవాడు.. పేరు ముషారఫ్ ఫారూఖీ.. పక్కా లోకల్. ఆర్నెల్ల క్రితం బదిలీపై జీహెచ్ఎంసీకి వచ్చారు. గ్రేటర్ ఐటీ విభాగం అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. ఆ విభాగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ‘మైజీహెచ్ఎంసీ యాప్’ ఆధునికీకరణ, వివిధ మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులన్నీ ఒకే చోటకు చేర్చడం.. సంబంధిత అధికారులకు వెంటనే వెళ్లడం వంటి మార్పులు తీసుకు వచ్చారు. ట్విట్టర్ ద్వారా అందే ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపడంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులంతా ట్విట్టర్‌ను ఫాలో అయ్యేలా ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారు. ఇప్పుడాయన పర్యావరణంపై దృష్టి పెట్టారు. జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో పర్యావరణ పరిరక్షణకు ఏదైనా చేయాలని తలంచారు. ఇతరులకు చెప్పే ముందు తాను ఆచరించాలని.. కార్యాలయానికి కారు బదులు సైకిల్ సవారీని ఎంచుకున్నారు. వారంలో ఒకరోజు సైకిల్‌పైనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వస్తూ.. తిరిగి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. నెలరోజులుగా దీన్ని ఆచరిస్తున్న ఫారూఖి ఇంటికి, కార్యాలయానికి మధ్య 8 కి.మీ. దూరం సైకిల్‌పై 25 నిమిషాల్లో రాగలగుతున్నానన్నారు. జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో బస్/రైల్వే స్టేషన్ల వరకు రెండు కిలోమీటర్ల మేర నడుస్తారని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యానికీ మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లోనూ అలాంటి పరిస్థితి వస్తే మంచిదన్నారు. తనలాగే జీహెచ్ఎంసీ ఉద్యోగులంతా సైకిల్‌ను వినియోగించాలని కోరుతున్నారు. ఇందుకు త్వరలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సైకిల్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సైక్లింగ్ క్లబ్ సహకారంతో.. ముషారఫ్ ఆసక్తిని చూసిన హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సైకిల్‌స్టేషన్ ఏర్పాటుకు ఉత్సాహం చూపింది. తొలుత డెకథ్లాన్ కంపెనీకి చెందిన పది సైకిళ్లతో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సైకిల్ ఖరీదు రూ.14వేలు. జీహెచ్ఎంసీ ఉద్యోగులెవరైనా సరే.. ఐటీ విభాగంలో పేరు నమోదు చేయించుకుంటే, సైకిల్‌తో పాటు హెల్మెట్ ఉచితంగా అందిస్తారు. వినియోగాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం రోజుల వరకు కూడా ఇస్తామని ముషారఫ్ తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఈ సైకిల్‌స్టేషన్ అందుబాటులోకి రానుంది. సైకిల్ వాడకం అలవాటైతే క్రమేపీ కొనుక్కునేందుకు కూడా వెనుకాడరని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో చాలా మంది సైకిళ్లు వాడుతున్నారని, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సైక్లింగ్‌క్లబ్ బ్రాండింగ్‌తో అందుబాటులోకి తేనున్న వీటికి తగిన ప్రచారం కల్పిస్తే ఎక్కువ మంది వాడతారని అభిప్రాయపడ్డారు. ఎప్పటినుంచో కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ఈయన్ను.. జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి జీహెచ్ఎంసీలో ఇటీవల ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ సెల్ అధికారిగానూ నియమించారు. -
బాలికా విద్యకు కరువైన ప్రోత్సాహం
పశ్చిమగోదావరి, నిడమర్రు: బాలికా విద్యకు ప్రోత్సాహం కరవవుతోంది. ప్రభుత్వానికి పథకాల ప్రకటనలపై ఉన్న ప్రచారపు హోరు.. వాటి అమలులో లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం బాలికా విద్యను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో ప్రారంభించిన అనేక పథకాలు నీరుగారుతున్నాయి. ఏటా విద్యార్థినులకు ప్రభుత్వం అందించే న్యాప్కిన్ల పంపిణీ పథకం టీడీపీ అధికారంలోకి వచ్చాక అటకెక్కింది. 9వ తరగతి విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు అందించే పథకం ప్రారంభించినా అది వాయిదాల పర్వంగా సాగుతోంది. నైన్త్‌లో బాలికలకు అందించాల్సిన ఉచిత సైకిళ్లు అదే విద్యాసంవత్సరంలో పంపిణీ చేయకపోవడంతో బడికొస్తా పథకం లక్ష్యం నీరుగారుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నీరు గారుతున్న లక్ష్యం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 2016లో ‘బడికొస్తా’ పథకం ప్రకటించింది. ప్రాథమికోన్నత విద్యతోనే బాలికలు బడి మానేయకుండా ఉన్నత విద్యను కూడా కొనసాగించాలనేది ఈ పథకం లక్ష్యం. అందులో భాగంగా పాఠశాల దూరమంటూ చదువుకు స్వస్తి చెప్పకుండా, బాలికలను ప్రోత్సహించి వారు హైస్కూల్లో చేరేందుకు 9వ తరగతిలో చేరే ప్రతి బాలికకు ఉచితంగా ప్రభుత్వమే సైకిల్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. దీంతో 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లాలో 9వ తరగతిలో నమోదైన 16,841 మంది బాలికలకు సైకిళ్ల పంపిణీ చేయ్యాల్సి ఉంది. కానీ ఆ విద్యా సంవత్సరంలో సైకిళ్ల పంపిణీ ప్రారంభించ లేదు. 2017–18 సంవత్సరంలో వారంతా 10వ తరగతిలోకి చేరాక ఆ సైకిళ్లను అందించారు. దీంతో 9వ తరగతిలో అందించాలనే లక్ష్యం నీరుగారింది. గతేడాది ‘బడికొస్తా’కు మంగళం 2017–18 విద్యా సంవత్సరంలో 2016–17కు సంబంధించిన సైకిళ్లను ఏడాది తర్వాత అందించారు. దీంతో గత ఏడాది 9వ తరగతి చదివిన బాలికలకు నేటి వరకూ ఉచిత సైకిళ్లు అందించలేదు. కనీసం వారి వివరాలు కూడా నేటి వరకూ ఉన్నత అధికారులు సేకరించలేదు. దీంతో గత ఏడాది ‘బడికొస్తా’ పథకంలోని ఉచిత సైకిళ్లకు ప్రభుత్వం మంగళం పాడిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తొమ్మిదితో పాటు 8వ తరగతి బాలికలకు కూడా ఉచితంగా సైకిళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రటించిన నేపథ్యంలో గత ఏడాది నైన్త్ విద్యార్థినుల పరిస్థితి ఏమిటని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకంలో ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక,, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సామాజకవర్గాల బాలికలకు సైకిళ్లు అందనున్నాయి. 35,200 మందికి లబ్ధి గతంలో జిల్లాలో 16,841 మందికి సైకిళ్లు మంజూరయ్యాయి. వీటి పంపిణీని ఆధార్‌తో అనుసంధానం చేసి బయోమెట్రిక్ హాజరు ద్వారా అందించాలని నిర్ణయించడంలో వివిధ కారణాలతో జిల్లాలో 2,122 సైకిళ్లు మిగిలిపోయాయి. ఇవి పాఠశాలల్లోనూ, ఎమ్మార్సీ భవనాల్లోనూ మూలకు చేరాయి. ప్రస్తుతం 8, 9 తరగతుల విద్యార్థినులు 35,200 మంది ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క సైకిల్ ధర రూ.3,680 గా టెండర్ ప్రక్రియ పూర్తయినట్టు మే నెలలో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో సైకిళ్ల పంపిణీకి రూ.12.95 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు. గతేడాది అందని సైకిళ్లు గత విద్యా సంత్సరంలో 9వ తరగతి విద్యార్థినిలకు ఉచిత సైకిళ్లు అందలేదు. 2016–17 విద్యాసంవత్సరంలో 9వతరగతి చదివిన వారికి టెన్త్‌లోకి వచ్చాక సైకిళ్లు అందాయి. మా పాఠశాలకు రవాణా సౌకర్యం లేని మందలపర్రు, గుణపర్రు తదితర గ్రామాల నుంచి విద్యార్ధినిలు పాఠశాలకు వస్తారు. వీరికి సైకిల్స్ ఇవ్వడం వల్ల బాలికల హాజరుశాతం మెరుగవుతుంది.– యర్రంశెట్టి శేషగిరి, హెచ్ఎం, నిడమర్రు -
చోరీకి వచ్చి.. కెమెరా కంటికి చిక్కి..
బొమ్మనహళ్లి: అత్యంత ఖరీదైన సైకిల్‌ను చోరీ చేసేందుకు వచ్చిన దొంగను స్థానికులు సీసీ కెమెరా ద్వారా పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్య నగరలో ఈనెల 3న చోటు చేసుకుంది. సుబ్రహ్మన్య నగర పోలీసుల కథనం మేరకు.. ఓ దొంగ ఈ నెల 3న సుబ్రహ్మణ్య నగరలో చోరీ కోసం రెక్కీ నిర్వహించాడు. వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఖరీదైన సైకిల్ అతని కంటపడింది. సాయంత్రం 5.55 గంటల సమయంలో కట్టర్ సహాయంతో తాళం తొలగించి సైకిల్‌ను చోరీ చేస్తుండగా యజమానులు సీసీ కెమెరాద్వారా గుర్తించి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. భయాందోళనకు గురైన దుండగులు అక్కడే కారు కింద దాక్కున్నాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు తన పేరు కల్లెష్ అని ఒక సారి, మల్లెష్ అని మరోసారి చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సైకిల్ కోసం వచ్చి.. కెమెరాకు చిక్కి..!
సాక్షి, బొమ్మనహళ్లి: అత్యంత ఖరీదైన సైకిల్‌ను చోరీ చేసేందుకు వచ్చిన దొంగను స్థానికులు సీసీ కెమెరా ద్వారా పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బెంగళూరులోని సుబ్రమణ్య నగర్లో ఈ నెల 3న చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఓ దొంగ సుబ్రమణ్య నగర్లో చోరీ కోసం రెక్కీ నిర్వహించాడు. వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఖరీదైన సైకిల్‌పై అతని కన్ను పడింది. ఆ రోజు సాయంత్రం కట్టర్ సహాయంతో తాళం తొలగించి సైకిల్‌ను చోరీ చేస్తుండగా యజమాని సీసీ కెమెరా ద్వారా గుర్తించి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. భయందోళనకు గురైన ఆ దుండగుడు అక్కడే ఉన్న కారు కింద దాక్కున్నాడు. అది గమనించిన స్థానికులు ఆ వ్యక్తి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందుతుడు తన పేరు కల్లెష్ అని ఒక్కసారి మల్లేష్అని మరోసారి చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.