Caretaker Chief Minister
-
సొంత జాగా ఉంటే ‘డబుల్’మంజూరు...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, జనగామ : రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నుతున్నాయని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దుయ్యబట్టారు. అభివృద్ధికి సహకరించని కాంగ్రెస్‌కు.. ఇప్పుడు టీడీపీ తోడైందని, తెలంగాణలో నీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారంటూ విరుచుకుపడ్డారు. ముందస్తు ఎన్నికల మలివిడత ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం పట్టణం లోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో, జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఆయన తూర్పారబట్టారు. ఎన్నికల్లో గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రదర్శించడానికి కాంగ్రెస్, టీడీపీల కూటమి సిద్ధమవుతోందని, దాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న, చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించిన కేసీఆర్... ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఏర్పడగానే ఏడాదికి రూ. 5 వేల చొప్పున రైతు బంధు పథకం కింద అందిస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ. 3,016 భృతి, వికలాంగుల పెన్షన్ రూ. 1,500 నుంచి రూ. 3,016కు, ఆసరా పెన్షన్‌ను రూ. 1,000 నుంచి రూ. 2,016కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఖమ్మం సభకు తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షత వహించగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గనుల కార్పొరేషన్ చైర్మన్ సుభాష్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాలకుర్తి సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ గాంధీ నాయక్, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, పార్టీ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు పాల్గొన్నారు. రెండు సభల్లో కేసీఆర్ చేసిన ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఖమ్మం సభలో... ‘సీతారామ’ను అడ్డుకునేందుకు బాబు 30 లేఖలు... ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి 30 లేఖలు రాశారు. ఆయన జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలి. ఓట్ల కోసం జిల్లాకు వచ్చే చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. తలాపునే గోదావరి ఉన్నా.. సాగునీటి కోసం ఖమ్మం జిల్లా ప్రజలు తండ్లాడాల్సిన దుస్థితికి గత పాలకులు కారణం కాదా? గోదావరి జలాలను వినియోగించుకునే హక్కు ఈ జిల్లా ప్రజలకు లేదా? సీతారామ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలవనరుల సంఘానికి 30 లేఖలు (లేఖ ప్రతులను సభావేదిక నుంచి ప్రజలకు పలుమార్లు చూపించారు) రాశారు. మన వేలితో.. మన కన్ను మనం పొడుచుకునేలా చేసే వ్యూహంలో.. మన తాడుతో మనమే ఉరి వేసుకునేలా చేసే విద్యలో చంద్రబాబు దిట్ట. ఈ ప్రమాదాన్ని జిల్లా ప్రజలు పసికట్టాలి. కాంగ్రెస్, టీడీపీ నేతలు హిమాలయాలకు వెళ్లి ఆకుపసరు తిన్నారా? ప్రభుత్వంలోకి రాగానే అద్భుతాలు సృష్టించడానికి. ప్రజలకు ఏం కావాలో తెలియని వారు.. వారి కోసం ఏం చేస్తారో చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చే కూటమి గెలిస్తే జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే టీఆర్ఎస్ వైపు ఉంటారో.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే టీడీపీకి ఓటు వేస్తారో ఖమ్మం జిల్లా ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ‘నామా’ను గెలిపిస్తే ప్రజలకు నామాలే... ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్రావును గెలిపిస్తే ప్రజలకు నామాలు పెట్టడం ఖాయం. అలాగే సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు గెలిస్తే జిల్లాలో సాగునీరు వద్దన్న చంద్రబాబుకే మద్దతు పలుకుతారు తప్ప.. తెలంగాణ ప్రజలపక్షాన నిలవరు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాని మమ్మల్ని విమర్శిస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఆ వర్గాల కోసం ఏం ఒరగబెట్టాయో చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో ఇసుక సీనరేజీల ద్వారా కేవలం రూ.9.50 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. కానీ మా ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో రూ. 2,057 కోట్ల ఆదాయం వచ్చింది. భారీ మెజారిటీతో గెలిపించండి... గత ఎన్నికల వరకు పార్టీపరంగా ఖమ్మం మైనస్‌లో ఉండేది. ఇప్పుడు ప్లస్ ఖమ్మంగా పార్టీ బలపడింది. జిల్లాలో పది స్థానాలను గెలిచి తీరుతాం. రాష్ట్రంలో రైతుబంధు పథకానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించింది. ఆ పథకం అమలవుతున్న తీరును ఐరాస ప్రశంసించి ప్రపంచ దేశాలకు ఈ విధానాన్ని వివరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మా ప్రభుత్వానిదే. వాటిని నమ్మితే.. వాటి ఫలాలను పొందితే మీరు (ప్రజలు) మాకు ఓట్లు వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించడమే కాక.. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా చేయాలి. ప్రగల్భాలు పలకను... నేను ఢిల్లీలో చక్రం తిప్పుతానని, తోక తిప్పుతానని ప్రగల్భాలు పలకడం నాకు చేత కాదు. అయితే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని తయారు చేయడం మాత్రం ఖాయం. త్వరలో ఈ పని మరింత వేగవంతం అవుతుంది. ప్రధాని మోదీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించలేకపోతున్నారు. పాలకుర్తి సభలో... సాగుకు నిరంతర విద్యుత్ తెలంగాణలోనే... 35 ఏళ్లు పాలించి ఏడిపించిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ ఆలోచించలేదు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కరెంటు పోతది. తెచ్చుకున్న రాష్ట్రంలో ఆదాయం ఎట్ల వస్తదో చూసి మేం సంపద పెంచినం. పెరిగిన సంపదను సంక్షేమం పేరుతో ప్రజలకు పంచినాం. ఎన్నికల్లో చెప్పని ఎన్నో హామీలను అమలు చేశాం. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అంగన్వాడీ వర్కర్లకు జీతాల పెంపు, ఆశావర్కర్లకు గౌరవ వేతనాల పెంపు, హోంగార్డులకు జీతాలు పెంచడం, ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్సులు 30 శాతం ఇచ్చిన ఒకే రాష్ట్రం మనదే. ఇప్పుడు తెలంగాణ దేశంలోనే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. సొంత జాగా ఉంటే ‘డబుల్’మంజూరు... ప్రాణం పోయినా అబద్ధాలు చెప్పను. టీఆర్ఎస్ ప్రస్తుతం ఇస్తున్న ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏడు ఇళ్లతో సమానం. గతంలో నిర్మించిన పాత ఇళ్లకు సంబంధించి రూ. 4 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం. ప్రస్తుతం వందకు వంద శాతం సబ్సిడీతో ఇళ్లు నిర్మిస్తున్నాం. పాలకుర్తి సోమేశ్వరుడి సాక్షిగా చెబుతున్నాం. గతంలో ఉన్న నిబంధనను సడలించి సొంత జాగా ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తాం. ఇళ్ల నిర్మాణాల్లో గతంలో రూ. 5 వేల కోట్ల అవినీతి జరిగింది. అప్పటి గృహనిర్మాణశాఖ మంత్రి, ప్రస్తుత పీసీసీ చీఫ్ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు... రాష్ట్రంలో 43 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలివితో పాలన సాగించడంతో ఎన్నో విషయాల్లో ముందున్నాం. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని నిజాయితీగా చేయడం వల్లే ఇది సాధ్యమైంది. మహిళా సంఘాలు, సెర్ప్ ఉద్యోగులు మంచిగా పని చేస్తున్నారు. ఐకేపీ మహిళలకు తర్ఫీదు ఇచ్చి అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో అవకాశం కల్పిస్తాం. అవసరాన్ని బట్టి వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తాం. వరంగల్‌కు 100 టీఎంసీల నీరిస్తాం... అడ్డం, పొడుగు చెప్పడం... ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్, టీడీపీల నైజం. ఎవరూ అడగకున్నా, ధర్నాలు చేయకున్నా కల్యాణ లక్ష్మి పథకం అందించాం. గజ్వేల్‌లో పుట్టిన ‘కంటి వెలుగు’ఆలోచనతో 80 లక్షల మందికి ప్రయోజనం కలిగింది. కరెంటు తెచ్చినం.. ఇక పోనివ్వం. కాళేశ్వరం, పాలమూరు, దేవాదులతో వరంగల్‌కు 100 టీఎంసీల నీటిని ఇస్తాం. పాలకుర్తి నుంచి దయాకర్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలి. -
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ యాగం ఆదివారం ప్రారంభమైంది. సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది. అదే రోజు ఏకరాత్రి దీక్షలు ఉంటాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, తెలంగాణ అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యాలు పరమేశ్వరుడి ఆశ్వీరాదంతో దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం తలపెట్టారు. రాజశ్యామల యాగంలో భాగంగా సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, అన్ని విగ్రహాలకు హోమాలు, చండీయాగం నిర్వహించారు. విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
గులాబీ బాస్ గెలుపు మంత్రం!
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం జోరు పెంచుతోంది. ప్రచార సరళి ఎలా ఉండాలి.. ప్రజలకు ఏం వివరించాలనే అంశంపై టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక వ్యూహం రూపొందించారు. ప్రచార ప్రణాళికను అభ్యర్థులకు వివరించేందుకు ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు 105 మంది అభ్యర్థులతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రచారంలో అభ్యర్థులు చెప్పాల్సిన విషయాలు.. రాష్ట్ర నేతలు ఏం మాట్లాడాలి.. స్వయంగా తానేం చెప్పాలనే విషయాలపై అభ్యర్థులకు స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రచార సరళిని తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గాల వారీగా ఇక నుంచి అమలు చేసే ప్రచార వ్యూహాన్ని అభ్యర్థులకు వివరిస్తారు. 100 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా కేసీఆర్ ప్రచార ప్రణాళికను రూపొందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని.. స్థానికంగా చేసిన అభివృద్ధిని, ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారి వివరాలను ప్రచారంలో తప్పకుండా ప్రస్తావించాలని అభ్యర్థులకు సూచిస్తారు. బలం మేనిఫెస్టో.. గత ఎన్నికల తరహాలోనే ఈసారీ మేనిఫెస్టోపైనే టీఆర్ఎస్ ఎక్కువ దృష్టి పెట్టింది. బంగారు తెలంగాణ నినాదంతో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు అభివృద్ధి కొనసాగింపు నినాదంతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుత మేనిఫెస్టోలోనూ రూ.లక్ష రుణమాఫీ, రైతు బంధు సాయం పెంపు, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక అభివృద్ధి పథకాలను ప్రజలలో బాగా తీసుకెళ్లాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ శనివారం సైతం పలువురు అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడారు. ప్రచార సరళిపై పలు సూచనలు చేశారు. తాను పాల్గొనబోయే సభల్లో ఎలాంటి అంశాలను బలంగా చెప్పాలో సూచించాలని అడిగారు. పూర్తిస్థాయి మేనిఫెస్టోలో మరెన్నో ప్రజాకర్షక హామీలు ఉంటాయని, ప్రజలు ఆదరించేలా ప్రచారం సాగాలని సూచించారు. సెప్టెంబర్ 6న 105 మంది అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించిన అనంతరం అందరూ ప్రచారం ప్రారంభించారు. అయితే ఎవరికివారుగా ప్రచారం చేసుకుంటున్నారు. పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీరితో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరినీ పిలిచి ఒకేసారి సూచనలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఒకరి అనుభవాలు మరొకరికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక ఊపు.. ముందస్తు ఎన్నికల వ్యూహాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే ముందున్న టీఆర్ఎస్ ఇదే పంథా కొనసాగిస్తోంది. అభ్యర్థులన ప్రకటించడంతో పాటు అసమ్మతికి బుజ్జగింపుల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఒకట్రెండు సెగ్మెంట్లలో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కఠినంగా వ్యహరిస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 7న హుస్నాబాద్‌లో నియోజకవర్గ స్థాయి ఎన్నికల సభలు నిర్వహించారు. అనంతరం నిజామాబాద్, నల్లగొండ, వనపర్తిలో ఉమ్మడి జిల్లాల స్థాయి బహిరంగ సభలు జరిగాయి. వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల సభల తేదీలను ప్రకటించి వాయిదా వేశారు. మరోవైపు ప్రచారంలో భాగంగా యాభై రోజులలో వంద బహిరంగసభలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇప్పడు ఈ ప్రక్రియ మొదలుకానుంది. సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌పైనా ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికల ప్రచార వ్యూహాల అమలు, అభ్యర్థులతో సమన్వయ బాధ్యతలను పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, నాయిని నర్సింహారెడ్డిలకు కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. ఆ అభ్యర్థులపై తేల్చుతారా.. టీఆర్ఎస్ ఇంకా 14 అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో ఎవరిని బరిలో దింపాలనే విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. అయితే మహాకూటమి సీట్ల పంపకం తేలిన తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రచారంలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు పలువురికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. అధికారిక ప్రకటనతో సంబంధం లేకుండా ప్రచారం చేసుకోవాలని సూచించారు. వీరిని సైతం అభ్యర్థుల భేటీకి ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే ఎక్కువ నియోజకవర్గాల్లో ఇద్దరి కంటే ఎక్కువ నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించనట్లు తెలిసింది. దీంతో అభ్యర్థులు ఎవరనే విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. ఆదివారం నాటి సమావేశంలో పెండింగ్ అభ్యర్థులపై స్పష్టత ఇస్తారని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. -
మరో దశ ప్రచారానికి వ్యూహాలు
-
మరింత సమయం...మనకే నయం
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల షెడ్యూల్‌పై అంచనాలు తప్పడంతో టీఆర్ఎస్ కాస్త ఆందోళన చెందినా.. ఈ పెరిగిన గడువును సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. కేసీఆర్ ఊహించినదానికంటే నెలరోజులు ఆలస్యంగా ఎన్నికలు జరుగుతుండటంతో.. అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లనుంది. ఇందులో భాగంగానే.. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సరళిపై సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల ప్రచార తీరుపై వివరాలను టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే పలువురు అభ్యర్థులకు ఫోన్లో సూచనలు చేశారు. ఈ రెండు నెలల కాలాన్ని ఎక్కడా ప్రణాళికాలోపం లేకుండా సక్రమంగా వినియోగించుకోవాలని.. మరోదశ ప్రచారం చేసుకునేందుకు వీలుగా షెడ్యూల్ రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామస్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతోపాటు.. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. త్వరలోనే వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. అన్నీ పరిశీలించి తేదీలు ఖరారు చేస్తామని అభ్యర్థులకు సీఎం తెలిపారు. అక్టోబరు 9 తర్వాత పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని.. ఈ నియోజకవర్గాల్లోనూ ప్రచారాన్ని పెంచాలని ఆయా సెగ్మెంట్లలోని ఆశావాహులకు సూచించారు. మేనిఫెస్టోపై ఆచితూచి.. నిరంతరం అభ్యర్థుల ప్రచారాన్ని సమీక్షిస్తున్న కేసీఆర్.. మెనిఫెస్టో విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై ఏర్పాటుచేసిన కమిటీ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ప్రజల్లో ఆదరణ ఉంటుందని భావిస్తున్న పథకాలను.. కేసీఆర్‌తో చర్చించి మరీ మేనిఫెస్టోలో చేరుస్తోంది. అయితే.. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా మేనిఫెస్టో ఉండాలని సీఎం భావిస్తున్నారు. వారి కంటే రెండడుగులు ముందుండాలనే వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇందుకోసం.. ఆయా పార్టీలన్నీ తమ ఎన్నికల హామీలను ప్రకటించిన తర్వాతే టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలను ఆకట్టుకునే ఎన్నికల హామీల విషయంలో ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నారు. అమరవీరుల విషయంలోనూ మరింత పకడ్బందీగా వ్యూహరచన చేయనున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు ప్రజాదరణ పొందాయి. ‘బంగారు తెలంగాణ’నినాదం పార్టీకి మంచి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఇలాంటి వ్యూహంతోనే ముందుకెళ్లాలని మేనిఫెస్టో కమిటీ భావిస్తోంది. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు ఆధ్వర్యంలో 16 మంది ముఖ్యనేతలతో ఏర్పాటైన ఈ కమిటీ.. సెప్టెంబరు 15న తొలిసారి సమావేశమైంది. మరో నాలుగుసార్లు భేటీ అయిన తర్వాత మేనిఫెస్టో తుది ముసాయిదా సిద్ధం చేస్తామని.. పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి అధినేతకు అందజేస్తామని పేర్కొంది. అయితే.. గడువు దాటినా మేనిఫెస్టో కమిటీ సమావేశం కాలేదు. ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలోని అంశాలను పరిశీలించిన తర్వాతే టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయాలనే ఉద్దేశమే.. ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ప్రతి అంశాన్ని కూలంకషంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కొత్త విధానాన్ని ప్రకటించే విషయంపైనా కమిటీ దృష్టి సారించింది. నిరుద్యోగులకు భృతి విషయాన్ని ప్రకటించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ‘ఆసరా పింఛన్ల’మొత్తాన్ని పెంచేలా మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం. సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు.. ఈ వర్గాలన్నింటికీ అన్ని పథకాలు వర్తింపజేసే విధానాన్ని పరిశీలిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘డబుల్ బెడ్ రూం’పథకం అమలుకు కొత్త విధానం అమలు చేయనున్నట్లు మేనిఫెస్టోలో వెల్లడించే అవకాశాలున్నాయి. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా సబ్సిడీ రూపంలో సాయం అందించేలా ఈ విధానంలో మార్పులు చేస్తోంది. రుణమాఫీ అంశాన్ని ఈసారి కూడా మేనిఫెస్టోలో చేర్చాలని భావిస్తున్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరిన్ని కొత్త పథకాలను చేర్చే విషయాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించే అవకాశం ఉంది. సారూ.. మా డిమాండ్లను చేర్చరూ..! టీఆర్ఎస్కు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న కొన్ని వర్గాలు.. తమకు కావాల్సిన అంశాలపై వినతిపత్రాలిస్తున్నాయి. కేటీఆర్, హరీశ్ రావు, కవిత సహా పలువురు ముఖ్యనేతలను కలుస్తున్న రోజుకో వర్గం నేతలు మద్దతు తెలపడంతోపాటు.. తమకు న్యాయం చేసేలా మేనిఫెస్టోలో ప్రకటించాలని కోరుతున్నారు. అసెంబ్లీ రద్దుచేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించినప్పటినుంచీ.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావును రోజూ ఏదో ఒక సంఘం ప్రతినిధులు కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం సాధారణమైపోయింది. కమిటీ మొదటి సమావేశం నాటికే 170 వినతులు రాగా.. ఆ తర్వాత మరో 50 వరకు వచ్చినట్లు తెలిసింది. వీటిని పరిశీలించేందుకు కమిటీ త్వరలోనే మరోసారి భేటీ కానుంది. -
సాగునీటిపై చర్చిద్దామంటే పారిపోయారు
-
బుడ్డర్‌ఖాన్లలాగా కత్తులు తిప్పిన్రు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘‘నల్లగొండ, పాలమూరు సభల వద్ద పల్లీలు, బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చిన జనం అంత లేరు అలంపూర్‌లో నిన్న కాంగ్రెస్ మీటింగ్ వద్ద. కానీ వాళ్లు ఏం మాట్లాడారు? కేసీఆర్ బట్టేబాజ్, ధోఖేబాజ్ అంటూ ఒక పీసీసీ అధ్యక్షుడు .. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడాడు. ఇది సంస్కారమా? బుడ్డర్‌ఖాన్‌లు కత్తి తిప్పినట్లు గద్వాల స్టేజ్ మీద జానారెడ్డి, మిగిలిన వాళ్లు కత్తులు తిప్పినరు. కత్తులు తిప్పవలసిన కాడ తిప్ప లే. తిప్పకూడని కాడ తిప్పిండ్రు. మున్ముందు చెప్త వాళ్ల సంగతి’’అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేం ద్రానికి సమీపంలోని నాగవరంలో జరిగిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె. దామోదర్‌రెడ్డి, పి. నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి, ఎస్. రాజేందర్‌రెడ్డి, అంజయ్య యాద వ్, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజ్, జైపాల్ యాదవ్, అబ్రహం, ఎడ్మ కిష్టారెడ్డి, మందా జగన్నాథం, పి. రాములు, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే... సమస్యలన్నీ పరిష్కరించుకున్నాం... పది జిల్లాల ప్రజలు ప్రభంజనమై ఉద్యమిస్తే భారతదేశ రాజకీయ వ్యవస్థ తెలంగాణ అవసరాన్ని గుర్తించి రాష్ట్రం ఇచ్చింది. ఆనాడున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొని ఒంటరిగా బరిలోకి దిగినం. ప్రజలు అధికారం ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సంక్షేమం, సాగునీటి రంగం కావొచ్చు.. మంచినీటి రంగం కావొచ్చు.. కరెంట్ రంగం కావొచ్చు.. దయచేసి ఆలోచన చేయాలని మనవి చేస్తున్న. ఎన్నికల సభలు జరుగుతయి.. చాలా మంది వచ్చి చాలా మాట్లాడుతరు. కానీ ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ చెప్పిన మాట విని ఉట్టిగనే పోవొద్దు. తప్పక చర్చ పెట్టాలి. ఏది నిజం అని ప్రత్యేకించి పాలమూరుపై చేయాలి. తెలంగాణ వచ్చిన నాడు భయంకరమైన సమస్యల వలయం. కొత్త రాష్ట్రం, అరకొర అధికారులు, డబ్బు, బడ్జెట్ ఏంటో తెలియదు. శిథిలమైపోయిన చెరువులు, పెం డింగ్ ప్రాజెక్టుల, కరువు కాటకాలు, మంచినీళ్ల గోసలు, ఆకలిచావులు–ఆత్మహత్యలు... ఇదీ 2014 లో సమైక్య పాలకులు మనకు అప్పగించిన తెలంగా ణ. అతి ముఖ్యమైన అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన కరెంట్ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. ఒకటి ఒకటి చొప్పున సమస్యలన్నీ పరిష్కరించుకున్నాం. ఈ రోజు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వి ద్యార్థులకు సన్నబియ్యం, కేసీఆర్ కిట్లు, కంటివెలుగు కావొచ్చు రకరకాల సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేసుకుంటున్నాము. కాంగ్రెస్ గొర్రెలకు తెలువలే... మత్స్యకారులు, గొల్లకుర్మలకు చేప పిల్లలు, గొర్రె పిల్లలు ఇస్తమంటే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో అవహేళన చేశారు. యాదవులు, గంగపుత్రులు ప్రతిపక్షాల నేతల కంటికి కనిపించలె. వారిని ఆగం పట్టించిండ్రు. గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియలే. మన రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నగరంలో రోజుకు 12 వేల గొర్రెలు ఖర్చయితయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రోజూ 650 గొర్రెల లారీలు రాజస్తాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్నయి. ఏం.. మన రాష్ట్రంలో ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయారు? రూ. 4 వేల కోట్లతో 65 లక్షల గొర్రెలను యాదవ సోదరులకు పంపిణీ చేశాము. ఈ రోజు మరో 35 లక్షల గొర్రెలు పుట్టినయి. ఈరో జు యాదవ సోదరులు రూ. 1,500 కోట్ల సంపద సంపాదించారు. రాబోయే కొద్ది రోజుల్లో బలమైన, ధనవంతులైన గొల్లకుర్మలు ఎక్కడన్న ఉన్నారా అంటే భారతదేశం మొత్తంలో తెలంగాణలోనే ఉంట రు. చేపలు పట్టే బెస్త, గంగపుత్రులు, ముదిరాజ్‌లు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నరు. చాలా సందర్భాల్లో శ్రీశైలం వంటి ప్రాజెక్టుల్లో చేపలు పట్టడానికి వెళ్తే ఆంధ్రోళ్లు తరిమికొట్టారు. ఆ దుస్థితి పోవాలని చేపల పెంపకం కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి చేపల పెంపకాన్ని ప్రొత్సహించినము. అద్భుతమైన ఫలితాలు వస్తున్నయి. రూ. వందల కోట్లలో పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. చేనేత కార్మికుల ఆత్మ హత్యలు ఆగిపోయాయి. నాయీబ్రాహ్మణుల షాపులకు సబ్బిడీ ధరలకే కరెంటు సరఫరా చేస్తున్నాం. రజక సోదరుల కోసం నూతన విధానాలను అవలంభిస్తున్నాము. వ్యవసాయం సంక్షోభంలో ఉంటే రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేసుకున్నాం. పిక్చర్ వేసి చెబుతా అంటే పారిపోయారు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు పూడ్చలేని మోసం జరిగింది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందాలె. ఇందుకోసం దాదాపు 40 మంది పదవీవిరమణ పొందిన చీఫ్ ఇంజనీర్లను నాలుగు హెలికాప్టర్లు పెట్టి కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులతోపాటు మిగతా ఉపనదుల మీద 14 రోజులు తిప్పిన. వాళ్లు తిరిగి నాకు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత.. వ్యాప్కోప్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇచ్చి మొత్తం డిజైన్లు తయారు చేసిన. ఆ విషయాన్ని ప్రజానీకానికి తెలియడం కోసం శాసనసభలో పిక్చర్ వేసి చెబుతా అంటే కాంగ్రెస్ నేతలు వెన్నుచూపి పారిపోయారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎందుకు పారిపోయింది. ముఖం లేకనా.. తెలివిలేకనా... అవగాహన లేకనా. బండారం బయటపడుతుందనా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పి మాట్లాడాలె. శాసనసభలో తోకముడుచుకొని పోయారు. కాంగ్రెస్ నేతలకు నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఆంధ్ర పాలకులకు సంచులు మోసి బతికినారు తప్పితే వీళ్లకు సొంత తెలివి లేదు. శాసనసభ సమావేశాలు పెట్టిన ప్రతిసారీ పారిపోయారు. ఏదో ఒకసారి దొరికినారు. చర్చపై మాట్లాడమంటే లేదు లేదు ప్రిపేర్ కాలేదంటడు! పీకనికి వచ్చినారా ప్రిపేర్ కాకపోతే. అడ్డగోలు మాటలు తప్పితే ఏది ఎక్కడుందో తెలియదు. వ్యాసాలు, హారతులు పడతరా? పాలమూరును వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు 64 వేల క్యూసెక్కులు తీసుకెళ్తుంటే ఇదే జిల్లాకు చెందిన చిన్నారెడ్డి పత్రికల్లో వ్యాసాలు రాసిండు సిగ్గు లేకుండ. చిల్లర మంత్రి పదవి కోసం నష్టం లేదంటూ వ్యాసాలు రాసిన చిన్నారెడ్డి సిగ్గు లేకుండా వ్యవహరించిండు. అలాగే కృష్ణా బేసిన్లో లేకపోయినా మరో జిల్లా అనంతపురానికి సుజల స్రవంతి ద్వారా నీళ్లు తీసుకెళ్తుంటే జిల్లాకు చెందిన డీకే అరుణ గద్వాలలో కత్తి తిప్పినామే.. అనంతపురంలో రఘువీరారెడ్డి ముందు మంగళహారతి తిప్పింది. వాటన్నింటినీ ప్రతి ఇంటికీ చూపిస్తాం. డీకే అరుణ.. కాస్కొండి అంటూ మాట్లాడుతోంది. డీకే అరుణా.. నీవు కాసుకో.. మీ బతుకంతా అందరికీ తెలియజేస్తాం. పోతిరెడ్డిపాడుకు పొక్కపెడితే ఇదే సమస్య మీద టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి బయటకొచ్చినం. టీఆర్ఎస్ మంత్రులు పదవులను విసిరేస్తే.. ఇదే జిల్లాకు చెందిన దరిద్రులు నోరు మూసినారు. ఉమ్మడి పాలమూరు ప్రజలు నిర్ణయం చేయాలి. పాలమూరులో కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు కడతామని చెప్పినము. ఈ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను నీళ్ల మంత్రి హరీశ్‌రావుతోపాటు జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి, ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల వద్ద నిద్రలు చేసి పనులను పరుగెత్తించిండ్రు. అందుకే ఈరోజు 800 నుంచి వెయ్యి చెరువులు నింపుకుంటున్నము. 60 ఏళ్ల, కాంగ్రెస్–టీడీపీ పాలన పాలమూరుకు చేసిన ప్రయోజనమేంది? పాలమూరు అనగానే వలసలు, కరువులు, పెండింగ్ ప్రాజెక్టులు... ఇదీ వీళ్ల బతుకు. వీళ్లు ఇచ్చిన బహుమానం. జబర్దస్తీగా ఆంధ్రాలో కలిపారు... తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఎవరు నెహ్రూ కాదా? హైదరాబాద్ సిటీ కాలేజీలో జరిగిన ఫైరింగ్‌లో ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. ఇడ్లీ, సాంబర్ గోబ్యాక్ అంటూ నినదించారు. ఇంత చేసినా జబర్దస్తీగా ఆంధ్రాలో కలిపారు. 1969లో మా తెలంగాణ మాకు కావాలంటే ఇందిరాగాంధీ ఏం చేసిందో తెలియదా? 2004లో సోనియా గాంధీ కూడా మర్యాదగా తెలంగాణ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండకపోయేది. వందల మందిని బలిదానం చేసుకునే పరిస్థితి కల్పించినది ఎవరు? టీఆర్ఎస్ కనుక 14 ఏళ్లు ఉద్యమాన్ని నిలబెట్టకపోయుంటే తెలంగాణ వచ్చేదా? ఛీఛీ... నీతో పొత్తా బాబు? చంద్రబాబు మాట్లాడుతడు... కేసీఆర్, నరేంద్ర మోదీ ఒక్కటైనరంటడు. మాకేం పనిరా బై? అర్థం కాక అడుగుతా. చంద్రబాబు అంటడు నన్ను వేధిస్తున్నరంటడు. నిన్ను ఎందుకు వేధిస్తరు బై.. నీవు సక్కనోడివి అయితే. ఓటుకు కోట్లు దొంగతనం చేసింది నీవు కాదా? నీవు పంపిన బుడ్డరఖాన్ పైసలు పంచుతూ పట్టుబడలేదా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డు లేదా? ఉన్నదా.. లేదా? తెలుగువాళ్లం ఒకటిగా ఉందామని చంద్రబాబు అంటడు. ఇలాంటి మాటలు చెప్పే కదా 60 ఏళ్లు దోచుకున్నది. ఇది నిజం కాదా? చంద్రబాబూ... నీతో పొత్తా. ఛీఛీ.. నీవు అడుగు పెడితే పచ్చని చెట్లు కూడా మాడిపోతయి. అంత దరిద్రం. ఐరన్ లెగ్ నీది. నీ సోపతి మాకెందుకు? మా సంసారం మేం చేసుకుంటము. మా బతుకు మేము బతుకుతున్నం. మహాకూటమా.. గూటమా దా. తేల్చుకుందాం. ఎన్నికల గోదాలో దిగాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. అంగన్వాడీ, హోంగార్డుల వంటి చిన్న ఉద్యోగులను ఆదరించాం. మిగతా ఉద్యోగులను కూడా ప్రభుత్వం రాగానే పిలిచి మీ గాయాలు సెటిల్ చేస్తాం. అంతేకాదు తెలంగాణను దాచిదాచి దయ్యాల పాలు చేయవద్దు. దుర్మార్గులకు అప్పగించి తెలంగాణ నాశనం చేయవద్దు అని మనవిచేస్తున్నా. చాలా బాధగా ఉండేది: సురేశ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర శాసనసభాపతిగా ఉన్న సందర్భంగా సభలో పాలమూరు కరువు గురించి చర్చకు వచ్చినప్పుడు చాలా బాధగా ఉండేదని మాజీ స్పీకర్ కె. ఆర్. సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాంతం పేదరికంలో ఆరో స్థానంలో, నీటి ఎద్దడిలో మూడో స్థానంలో, వలసల్లో నాలుగో స్థానంలో ఉన్నట్లు నివేదికలు వచ్చినప్పుడు ఎంతగానో ఆవేదన చెందినట్లు తెలిపారు. కానీ ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు. ఈరోజు సంక్షేమం, అభివృద్ధి రెండు అంశాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధిని చూసి విపక్షాలు ఓర్వలేక మహాకూటమి పేరుతో మహాకుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ సమాజం ప్రస్తుతం కీలక స్థానంలో ఉందని.. ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తప్పుంటే డిపాజిట్లు పోగొట్టండి.. మేము చెప్పే విషయంలో తప్పు ఉంటే పాలమూరులోని 14 సీట్లలో డిపాజిట్లు రాకుండా ఓడగొట్టండి. నిజమైతే 14 సీట్లలో గులాబీ జెండా ఎగురవేయండి. నేను మస్తు కొట్లాడిన. ఇక ముందు కొట్లాడుత. చైతన్యవంతమైన ప్రజలు ప్రతి ఒక్కరూ కేసీఆర్ కావాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కావాలె. జూరాల, ఆర్డీఎస్, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోలేదు. ఈరోజు 7 లక్షల ఎకరాలకు నీరు పారుతున్నయి. ఈరోజు రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినము. ర్యాలంపాడు, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసుకున్నం. ఆర్డీఎస్లో 87 వేల పాత ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. కల్వకుర్తిలో 40 రిజర్వాయర్లు నిర్మించాల్సినవి ఉన్నాయి. త్వరలో మన ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలు చేపట్టుకుందాం. తెలంగాణ తేకపోతే 2001లో రాళ్లతో కొట్టి చంపమని చెప్పాము. పాలమూరులో మరో 12 లక్షల ఎకరాలకే కాకుండా నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్ ప్రాంతాలకు సాగునీరు అందించి తీరుతం. ఒక్క పాలమూరులో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పచ్చబడేలా చేస్తం. మిషన్ భగీరథను కూడా పూర్తి చేసి తీరుతాం. పాలమూరు 5.5 లక్షల కనెక్షన్లు పూర్తి చేశాం. త్వరలో మిగిలిపోయిన మరో 1.5 లక్షల కనెక్షన్లను పూర్తి చేస్తాం. వనపర్తి సభలో శపథం చేస్తున్నా. 14 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి తీరాలి. నిరంతర ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రైతాంగానికి 24 గంటలపాటు ఉచితంగా కరెంట్ సరఫరా చేసే రాష్ట్రం దేశంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఎరువులు దొరకకపోయేవి. విత్తనాల షాపుల వద్ద చెప్పులు ఉండేవి. పోలీసుల లాఠీచార్జీలు అయ్యేవి. ఈరోజు అలాంటి సమస్యలేవీ లేవు. నకిలీ విత్తన కంపెనీలను పట్టి జైళ్లలో వేస్తున్నం. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా ఎకరానికి రూ. 8 వేలు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చింది కూడా తెలంగాణ రాష్ట్రమే. అంతేకాదు 5 గుంటల భూమి ఉన్న రైతుకు కూడా రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడదామా? ఆంధ్ర బాబు.. చంద్రబాబు.. పాలమూరును గతంలో 9 ఏళ్లు దత్తత తీసుకొని గుండెల మీద గుద్దిండు. శిలాఫలకాలు, పునాది రాళ్లు తప్ప చేసిందేమీ లేదు. వాళ్లు వేసిన పునాది రాళ్లను తీసుకుపోయి కృష్ణా నదిలో పడేస్తే ఒక డ్యామ్ తయారైతది. శిలాఫలకాలు తప్ప పనులు చేయలేదు. అలాంటి దుర్మార్గుడు. కాంగ్రెస్ నీచాతి నీచంగా దిగజారిపోయి చంద్రబాబు కాళ్ల దగ్గర పడుతోంది. మళ్లీ ఆంధ్రోళ్లకు ఇస్తమా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి విజయవాడలో తాకట్టు పెడదామా? నిర్ణయాలు హైదరాబాద్‌లో జరగాలనా లేక అమరావతి, ఢిల్లీలో జరగాలనా? ఈ పట్టు వీడితే గోసి ఊడిపోతది. ఆగమైపోతం. -
విపక్షాలపై విరుచుకుపడ్డ కేసీఆర్
-
‘సాగర్’ నుంచే మనకు అన్యాయం
నల్లగొండ, సాక్షి ప్రతినిధి : ‘పోరాటాల పురిటిగడ్డ.. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమైనా, తెలంగాణ ఉద్యమమైనా పిడికిలి బిగించి చైతన్యాన్ని కలిగించిన నల్లగొండ ప్రజానీకం ఈ ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని కోరు తున్నా. నల్లగొండతో నాకు ఉద్వేగపూరిత సంబం ధం ఉంది. అనేక ఉద్యమాల్లో భాగంగా కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర కావచ్చు... ఫ్లోరైడ్ సమస్య మీద 8 రోజులు ఇదే జిల్లాలో మకాం వేసి అనేక సభల్లో ఇక్కడ మాట్లాడా’ అని సీఎం కేసీఆర్ గురువారం నల్లగొండ ఆశీర్వాద సభలో ఉద్యమ స్మృతులను గుర్తుచేసుకున్నారు. అలాగే తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. అవి ఆయన మాటల్లోనే... కాంగ్రెస్‌ది చారిత్రక ద్రోహం... కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రానికి పెద్ద శాపం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం నుంచే మనకు అన్యాయం జరిగింది. వాస్తవానికి సాగర్‌ను ఇప్పుడున్న చోటు నుంచి 19 కిలోమీటర్ల పైన ఏలేశ్వర వద్ద కట్టాలి. అది డిజైన్ చేసినప్పుడు 180 టీఎంసీలు తెలంగాణకు, 60 టీఎంసీలు ఏపీకి చేసిండ్రు. కానీ నెహ్రూను, ఢిల్లీ కాంగ్రెస్‌ను చూడగానే మన తెలంగాణ కాంగ్రెస్‌కు 1952 నుంచి నేటి వరకు లాగులు తడుస్తాయి. 180 టీఎంసీలు మనకు ఉంటే దాన్ని 130 టీఎంసీలు అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మూతి ముడుచుకున్నడు. నెహ్రూ శంకుస్థాపన చేస్తే గుడ్డిగా ఆమోదించిండు. తెలంగాణ కాంగ్రెస్ చారిత్రకంగా తెలంగాణకు చేసిన ద్రోహం ఇది. గులాబీ జెండాతోనే తెలంగాణ.. 2001లో ఎగిరిన గులాబీ జెండాతో నేడు తెలంగాణ సాధ్యమైంది. మడమ తిప్పను.. ఎత్తిన జెండా దిం చను. ఒకవేళ మడమ తిప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపమన్న. మీరందరూ నా మీద విశ్వాసం ఉంచి 14 ఏళ్లు నిరంతరం పోరాడి.. విమర్శలు, అవమా నాలు దిగమింగారు. పటిష్ట పోరాటంతో తెలంగాణ వచ్చింది. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్కు స్థానమే లేదు అని చెప్పిన చోట 12 స్థానాలకుగాను టీఆర్ ఎస్‌ను 6 స్థానాల్లో గెలిపించారు. అధికారంలో కొచ్చా క రాష్ట్రంలో కరెంట్ సమస్య పరిష్కారానికి ప్రాధాన్య తనిచ్చాం. ఈ రోజు ఇండియాలో రెప్ప పాటు కరెంట్ పోకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఉచిత కరెంట్ దేశంలో ఇస్తుంది తెలంగాణ ఒక్కటే. మంచినీళ్ల కోసం పెట్టిన మిషన్ భగీరథ పథకం జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, నదులు, వాగులు, రోడ్లు, కాలువలు దాటు కుంటా రావాలి. 90% పనులు పూర్తయ్యాయి. ఇం టింటికీ నల్లానీరు ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగు తోంది. రాబోయే రెండు నెలల్లో ఈ కార్యక్రమం సఫలం కాబోతోంది. ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, హోంగార్డులు, వీఏఓలు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సగం కడుపుతో పనిచేసుకుంటూ వచ్చా రు. వారందరికీ గౌరవప్రద వేతనాలు పెంచాం. రూ. 200 పింఛన్లను రూ. వెయ్యి చేశాం. ఇంకా పెంచా లనుకుంటున్నాం. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్ ఇచ్చాం. సన్నబియ్యంతో పిల్లలకు అన్నం పెట్టుకున్నాం. ఇవన్నీ మీ కళ్ల ముందు ఉన్నా యి. రైతులకు రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశాం. భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లు ఇచ్చాం. రైతులకు నీటి తీరువా పన్ను రద్దు చేశాం. గోదాముల సామర్థ్యాన్ని 4 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 23 లక్షల టన్నులకు తీసుకొచ్చాం. పంటలకు గిట్టుబాటు ధర అందిం చేలా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో పండించిన పంట ఎక్కడ అమ్ము కోవాలనే బాధ లేకుండా ప్రతి తాలూకాకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. ఎస్ఎల్బీసీని ఆగం చేసిండ్రు.. ఎస్ఎల్బీసీ సోరంగాన్ని ఆగం పట్టించిండ్రు. 2002 చంద్రబాబు హయాంలో కుడి కాలువ మీద ఉన్న ఎత్తిపోతలకు ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లించింది. కానీ ఎడమ కాలువ మీద ఉన్న ఎత్తిపోతలకు చెల్లించలేదు. దీన్ని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తే అప్పుడు ఎడమ కావుల మీద ఉన్న ఎత్తిపోతలకు కూడా బిల్లులు చెల్లించిండ్రు. ఎన్నో అరాచకాలు జరిగినా కాంగ్రెస్, టీడీపీ నోరు తెరవలేదు. వీళ్లేమో ఢిల్లీ గులాములు.. వాళ్లేమో చంద్రబాబు గులాములు. ఈ గులాముల వల్ల తెలంగాణ ప్రజల బతుకులు ఆగమయ్యాయి. పవర్ పాయింట్ ప్రజంటేషన్ అంటే కాంగ్రేసోళ్లు పారిపోయిండ్రు.. కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చే విధంగా ఖమ్మంలో సీతారామ, మహబూబ్‌నగర్‌లో పాలమూరు, డిండి పథకం, కాళేశ్వరం, దేవాదుల పూర్తి చేసేం దుకు ప్రాజెక్టులు రీ డిజైన్ చేశాం. దీనిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తానన్నా. వివరిస్తానంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులు మీ జిల్లాలో ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేష న్ను కాంగ్రెస్ బాయ్‌కాట్ చేసింది. మీ జిల్లాలోని టీ.పీసీసీ అధ్యక్షుడికి ఏమీ తెలియదు. అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ వస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేను ప్రిపేర్ కాలేదని తోకమూడుచుకొని పోయిండు. ఉత్తమ్, జానా, వెంకట్‌రెడ్డిలు నల్లగొండలో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టమని అడగకున్నా దక్షిణ తెలంగాణలో కృష్ణా నది సమీపాన దామరచర్ల వద్ద 29,965 కోట్ల పెట్టుబడితో 4 వేల మెగావాట్ల అల్ట్రామెగా పవర్ ప్లాంట్‌ను మా ప్రభుత్వం నిర్మిస్తోంది. రెండేళ్లలో ఇక్కడ విద్యుత్ అందు బాటులోకి వస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రూ.1100 కోట్లు కేటాయించాం. ఈ కాలువలకు మరమ్మతులు చేయించాం. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేటలో ఇప్పుడు ఈ కాలువల్లో వస్తున్న నీళ్లతో చెరువు నింపమన్నాం. ఇక్కడ ఫ్లోరైడ్‌తో 1.50 లక్షల మంది నాశనం అయ్యారు.. దీనికి ఎవరు కారణం. రాష్ట్రాన్ని గతంలో పాలించిన పాలకులు కాదా..? మిషన్ భగీరథ పెడితే దాని మీద కోర్టుకు వెళతారు. 1956 నుంచి కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తూనే ఉంది. కాంగ్రెసోళ్లు గొర్రెల్లా మాట్లాడారు.. తెలంగాణలో హైదరాబాద్‌తో సహా నిత్యం 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. గొల్లకుర్మలు రాష్ట్రంలో 35 లక్షల మంది ఉన్నారు. దాన్ని గమనించి 65 లక్షల గొర్రెలు ఇచ్చాం. వాటికి 35 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయి. గొర్రెలేనా.. బర్రెలేనా అని కాంగ్రె సోళ్లు మాట్లాడారు. మీరు గొర్రెల్లా ఉండబట్టే 35 లక్షల మంది యాదవులు ఉన్న రాష్ట్రంలో 650 లారీల గొర్రెలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. గొల్లకుర్మ సోదరులే వాళ్లకు బుద్ధి చెప్పాలి. మత్స్యకారులను దెబ్బతీశారు. పోచంపల్లి, గద్వాల, దుబ్బాక, సిరిసిల్ల, భవన గిరి ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి 50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు ఇచ్చాం. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు కల్లు దుకాణాలు మూసివేశారు. మేము వచ్చిన తర్వాత వాటిని తెరిపించాం. వాళ్లు చెల్లించే చెట్ల పన్ను శాశ్వతంగా ఎత్తి వేశాం. ఎంబీసీల కోసం రూ.వెయ్యి కోట్లు ఇచ్చాం. కోటి ఎకరాలకు నీళ్లు రావాలని కార్యక్రమాలు చేపడితే.. అడ్డుపడుతున్నారు. -
మహాకూటమా.. కాల కూట విషమా?
‘‘నీకు డబ్బా కొట్టే ఒకటి, రెండు వార్తాసంస్థలను అడ్డం పెట్టుకొని ఏదైనా చేస్తా అనే చంద్రబాబు నాయుడూ మాతోని గెలుకున్నవ్ జాగ్రత్త. తెలంగాణ దెబ్బేందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డవ్.’’ ‘‘మా బతుకు మేము బతుకుతున్నం. మేము నీ తెరువు రాలే. ఇవ్వాల ఈడ దుకాణం పెడతానంటున్నావ్. బిడ్డా.. నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. ’’ నల్లగొండ, సాక్షి ప్రతినిధి : ‘‘ఏమన్న చేయాలె.. టీఆర్ఎస్ను ఓడగొట్టాలె. ఎన్ని అబద్ధాలైనా చెప్పాలని కుట్రలు పన్నుతున్నరు. కుట్రల్లో కొత్త కుట్ర.. సిగ్గు, శరం, పౌరుషం లేకుండా హీనాతి హీనంగా చంద్రబాబును తోలుకొస్తుండ్రు. ఆమోదిస్తదా తెలంగాణ? చిల్లర రాజకీయం కోసం నీచాతినీచంగా దిగజారి చంద్రబాబును తొలుకొచ్చి ఆయనకున్న హాఫ్ పర్సెంటో, జీరో పర్సెంటో ఓట్లుంటే దాంతోని గండం గట్టెక్కాలని కాంగ్రెస్ నేతలు చూస్తుండ్రు. సిగ్గు కూడా లేదు. చంద్రబాబు నిన్న విజయవాడలో ఒక మాట మాట్లాడిండు. అదో తమాషా. తెలుగోళ్లం ఒక్కటి అని కేసీఆర్‌కు చెప్పిన.. ఇద్దరం ఒక్కటైతే ఢిల్లీలో ఫలితం ఉంటదని చెప్పిన.. నా వెంట కేసీఆర్ రాలేదు. అందుకే మహాకూటమి వెంట వచ్చినన్నడు. అది మహాకూటమా? కాలకూట విషమా? మహాకూటమా? మన తెలంగాణను నాశనం చేసే గూటమా? మహాకూటమా? నీ బొంద కూటమా?’’అని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కె. చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన ఆశీర్వాద సభలో మహాకూటమి, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, వేముల వీరేశం, రవీంద్ర నాయక్, భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, నేతలు చాడ కిషన్‌రెడ్డి, ఉమామాధవరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే... నాలుగేళ్లు మోదీ సంక నాకింది నువ్వు కాదా? ‘‘నరేంద్ర మోదీ, కేసీఆర్ ఒక్కటై పోయిండ్రని చంద్రబాబు అన్నడు. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడినందుకు. నాలుగేళ్లు మంచిగా మోదీ సంక నాకితివి కదా? మోదీ కాళ్లు మొక్కి నా ఏడు మండలాలు గుంజుకున్నవు. మోదీని అడ్డం పెట్టుకొని నా సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నవు. మోదీని అడ్డం పెట్టుకొని నా హైకోర్టు విభవజన కానివ్వలే. ఇవి వాస్తవాలు, నిజాలు కావా? నీ నంగనాచి మాటలు.. నీకు డబ్బా కొట్టే ఒకటి, రెండు వార్తాసంస్థలను అడ్డం పెట్టుకొని ఏదైనా చేస్తా అనే చంద్రబాబు నాయుడు మాతోని గెలుక్కున్నవ్ జాగ్రత్త. తెలంగాణ దెబ్బేందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డవ్. నిన్ను చూసి బర్లు పలుపు తెంచుకుంటయ్.. మా బతుకు మేము బతుకుతున్నం. మేము నీ తెరువు రాలే. మాకు 119 ఉంటే నీకు 175 నియోజక వర్గాలున్నాయి. ఆడ సక్కగా లేదు నీ కథ. ఆగ మాగంగా ఉంది. ఇవ్వాల ఈడ దుకాణం పెడతానంటున్నావ్. బిడ్డా.. నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. తెలుగువాళ్లం ఒక్కటిగా ఉందామంటున్నావ్.. తెలుగు పేరు చెప్పి మా కొంప ఆర్పావ్. చంద్రబాబు పేరు చెబితే తెలంగాణలో దొడ్ల కట్టేసిన బర్లు కూడా పలుపు తెంచుకొని పారిపోతయ్. అంత దుర్మార్గమైన కాలు నీది. ఇక్కడ దరఖాస్తు పెట్టుకుంటే అమరావతికి పోవాలా? నువ్వు తెలంగాణకు కావాలా? నువ్వు పెట్టిన బాధలు.. బూటకపు ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన వేలాది మంది పిల్లల ఆత్మలు ఘోషిస్తున్నాయి. అలాంటి తెలుగుదేశం పార్టీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటున్నరు. తెలంగాణ కోసం నేను ఎవ్వనికీ రాజీ పడలే. ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనక్కు పోలే. నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు నువ్వు కోమాలోకి పోతవ్.. చచ్చిపోతవ్ కేసీఆర్, మా మాట విను కేసీఆర్ అన్నరు. నేను వినలే. చావు నోట్లో తలకాయ పెట్టి సాధించిన తెలంగాణను మల్ల తీసుకుపోయి విజయవాడకు అప్పజెప్పుతరా? చైతన్యవంతమైన నల్లగొండ జిల్లా తీర్పు చెప్పాలి. రేపు దరఖాస్తు పట్టుకొని మనం అమరావతికి పోవాలా? హైదరాబాద్‌కు పోవాలా? దీన్ని తిప్పికొట్టాలి. 58 ఏళ్ల పీడ ఎన్నో పోరాటాలు చేసి వదిలించుకుంటే మళ్లీ దుర్మార్గులు పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నరు. మనం అమరావతి గులాంగా ఉండాలా? అధికారంలోకి వచ్చి చంద్రబాబు 15 ఎమ్మెల్యేలను గెలిస్తే మన డిండి ప్రాజెక్టు ముందల పడనిస్తడా? మన సాగర్ నీళ్లు రానిస్తడా.. మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనిస్తడా? మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా? ఇంతకన్నా ఇంకోటి ఉందా? దయచేసి తెలంగాణ ప్రజానీకం ఆలోచించాలి. అభివృద్ధిపై కాంగ్రెస్‌కు కళ్ల మంట.. యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం కాలువ ద్వారా గంధమల్ల, బస్వాపూర్ ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరు రావాలి. డిండితో దేవరకొండ, మునుగోడు సస్యశ్యామలం కావాలి. ఎస్సారెస్పీతో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట మొత్తం పచ్చబడాలే. కృష్ణాలో మన వాటా తీసుకొని నాగార్జున సాగర్ ఆయకట్టులో గుంట పోకుండా కాపాడు కోవాలి. రైతులు బాగు పడేలా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రైతు బంధు పథకం కొనసాగిస్తాం. ఎకరానికి రూ. 8 వేలు ఇస్తున్నం. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. రైతులకు రైతు బీమా చేశాం. అభివృద్ధిని చూసి కళ్లమంట పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు... కేవలం మళ్లీ అధికారంలో రావడానికి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. నల్లగొండ ప్రజలు అన్ని రకాలుగా చైతన్యవంతులు. ఆడపిల్లలు బతుకమ్మ వస్తే పండుగ చేసుకుంటారు. గౌరవించి 90 లక్షల చీరలు పంచేందుకు తయారు చేయించాం. భువనగిరికి చెందిన గూడూరు నారాయణరెడ్డి చీరలు పంచవద్దని కోర్టుకు పోయాడు. ఆడపిల్లల నోటి కాడ కూడు గుంజేసి చీరలు పంచొద్దని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉండి చీరలు పంచకపోయినా ఎన్నికల కోడ్ ఎత్తిన తెల్లారే మీ కాళ్ల దగరికే చీరలు తెచ్చి మీ ఊళ్లో మీ చెతుల పెడతాం. రైతు బంధు చెక్కులు పంపిణీ చేస్తాం.. రైతు బంధు చెక్కులు ఇవ్వవద్దని మర్రి శశిధర్‌రెడ్డి కోర్టుకు పోతే.. కోర్టు రెండు చెంపలు వాయించింది. హైకోర్టు ఆర్డర్‌తో రేపటి నుంచి గ్రామాల్లో చెక్కుల పంపిణీ చేయిస్తున్నాం. తెలంగాణ మల్ల ఆగం కావద్దు. తెలంగాణ ప్రగతి రథచక్రం ఆగవద్దు. ఉరికెటోని కాళ్లల్ల కట్టె పెట్టే ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి. రాజకీయ సుస్థిరత దెబ్బ తినొద్దు. దాసిదాసి దయ్యాల పాలు చేయవద్దు. ఆశాంతి రావద్దు. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కావద్దు. మోసపోతే గోస పడతాం. చైతన్యం ఉన్న జిల్లా నల్లగొండ ముందుకు పోవాలి. 12 నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా ఎగురుతుంది. పన్నెండుకు పన్నెండు గెలుస్తామని సర్వేలు తెలియజేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ వాళ్ల గోసీలు ఊడిపోయే పరిస్థితి ఉంది. ఫలితాలు మీరు చూడబోతారు. నిన్ననే ఒక కొత్త సర్వే రిపోర్టు వచ్చింది. రాష్ట్రంలో 7 సీట్లు మజ్లిస్‌కు పోతే 112 నియోజకవర్గాల్లో 110 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని సర్వే రిపోర్టు వచ్చింది. దీంట్లో నల్లగొండలో 12కు 12 గెలుస్తమని వచ్చింది. నల్లగొండ ప్రజలు మిగతా తెలంగాణకు మార్గదర్శకం కావాలి. సాగు నీళ్లు రావాలన్నా.. అన్ని రకాలుగా మనం బాగుపడాలన్నా ఈ ప్రగతి రథచక్రం ఆగొద్దన్నా.. ముందుకు తీసుకుపోవాలి. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాగానే కుట్ర మొదలు పెట్టిండు. అస్థిర పరచాలి. గడబిడ చేయాలని కుట్రలు పూనిండు. ఓటుకు నోటుతో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిండు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నాకు ఫోన్ చేసి ప్రభుత్వం పడగొట్టేందుకు కుట్ర చేస్తుండ్రు అని చెప్పాడు. కుట్రలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిండు. బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్ప, వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ముగ్గురు మనతో కలిశారు. దాంతో మన సంఖ్య 75 అయింది. ఆ తర్వాత కుట్రలు బంద్ అయ్యాయి. అలాంటి కుట్రదారుడిని తీసుకొచ్చి వీళ్లు (కాంగ్రెస్) ఊరేగుదామనుకుంటున్నారు. నల్లగొండ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని సభ. నేను అనుకున్న దానికన్నా గొప్పగా సభను విజయవంతం చేశారు.’’ బొడ్ల కత్తి పెట్టుకొని చంద్రబాబు తిరుగుతుండు.. చంద్రబాబు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలను ఒక్కటి చేస్తానంటడు. ఇంకో డేమో రెండు జర్మనీలు ఒక్కటైనట్లు బెర్లిన్ గోడ కూలగొట్టినట్లు మళ్లీ ఒక్కటి చేస్తం అని మాట్లాడతడు. చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు... నయవంచకుడు, ద్రోహి. బొడ్ల కత్తి పెట్టుకొని తిరుగుతుండు. మౌఖా దొరికితే మనను పొడిచి పారేస్తడు. మల్ల తెలంగాణ వాళ్లు బానిసలు అవుతరు. తెలంగాణ మేధావులు అందరూ ఆలోచన చేసి ఈ కుట్రను తిప్పి కొట్టాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. 19 ఏళ్ల నుంచి నేను తండ్లాడుతున్నా. 1999 నుంచి ఈ రోజు వరకు 19 సంవత్సరాలు. ఆ నాడు ఉద్యమమైనా అట్లనే తీసుకున్నా. చాలా సందర్భాల్లో చెప్పిన. రాజకీయం అంటే ఇతరుల పాలిటిక్స్‌లో గేమ్.. మాకు గేమ్ కాదు. మాకు ఒక టాస్క్. మాకు ఒక మిషన్. అనుకున్న తెలంగాణ కావాలి. కోటి ఎకరాలు పచ్చని తెలంగాణ చేయాలి అనుకున్నాం. -
పింఛన్లు పెంచుతాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దేశంలో ముందున్నామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. రూ. 40 వేల కోట్లతో 472 పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం లబ్ధిదారులకు ఇచ్చే వివిధ రకాల పింఛను మొత్తాన్ని పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎంత మొత్తంలో పెంచాలనే దానిపై తమ పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయిస్తుందని ప్రకటించారు. బుధవారం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలపై వరాలు జల్లు కురిపించారు. వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న పెద్దల దీవెనలు వృథా పోవన్నారు. పింఛన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అర్రాస్ (వేలం) పాట పాడినట్లు హామీలిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్న కేసీఆర్... భవిష్యత్తులో మరింత మంచి పెంపుదల ఉంటుందని ప్రకటించారు. చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్న అంగన్వాడీలు, ఆశవర్కర్లు, హోంగార్డులు, సెకండ్ ఏఎన్ఎంల వేతనాలను ఇప్పటికే పెంచామని, రానున్న రోజుల్లో మరింత పెంచే పని చేస్తామన్నారు. ప్రతి తాలూకా కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందన్నారు. రైతు సమన్వయ సమితి పాలక వర్గాలకు పారితోషికం అందిస్తామన్నారు. ప్రజలందరి హెల్త్ ఫ్రొఫైల్.. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని కేసీఆర్ వివరించారు. ఇదే తరహాలో రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ చెవి, ముక్కు, గొంతు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈఎన్టీ వైద్య బృందాలు గ్రామాల్లో పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ఫ్రొఫైళ్లను కంప్యూటరీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. మైనారిటీలు ఆశీర్వదించాలి... మైనారిటీల సంక్షేమం కోసం రూ. 2 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. మైనారిటీల ఆశీస్సులుంటే మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. భగవంతుడి కృప ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని కేసీఆర్ ఉర్దూలో కవిత్వాలు చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిషన్ భగీరథ పరుగులు.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులను కేసీఆర్ వివరించారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని గతంలో ప్రకటించిన మేరకు రాష్ట్రంలో మిషన్ భగీరథ పనులు పరుగులు పెడుతున్నాయని కేసీఆర్ చెప్పారు. 1.50 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని, 1,690 గ్రామాలకు ఇప్పటికే నీళ్లు చేరాయని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, నిర్వీర్యమైన వ్యవసాయశాఖలో 2,630 మంది ఏఈఓ పోస్టులను భర్తీ చేశామన్నారు. నిజాం కాలం నాటి భూ రికార్డులను సరిచేసి రైతుల ఇళ్లకే పాసుపుస్తకాలు పంపామని గుర్తుచేశారు. కరువు కాటకాల నుంచి.. ఆర్థిక శక్తిగా ఎదిగాం.. తెలంగాణకు ముందు కరువు కటకాలు, కరెంట్ సంక్షోభాల నుంచి రాష్ట్రం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. 19.19 శాతం వృద్ధి సాధించి అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలిచామన్నారు. నిరుపేదలకు ఇచ్చే పింఛను విషయంలో కాంగ్రెస్ పార్టీ అర్రాస్ (వేలం) పాట పాడినట్లు మేం రూ. వెయ్యి ఇస్తామంటే వారు రూ. 2 వేలు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. పింఛను పెంచాలని కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలిగినందుకు సంతోషిస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు సన్నబియ్యం, బీడీ కార్మికులకు పింఛను వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్, పాలీహౌస్, విత్తనాలు సరఫరా చేసి అన్నదాతలను ఆదుకుంటున్నామని చెప్పారు. వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లపై పన్నులు లేని రాష్ట్రం తెలంగాణనేనన్నారు. మార్కెట్ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. గొల్లకుర్మలు, మత్స్యకారులు, గీత కార్మికులు, పాల ఉత్పత్తిదారులకు చేయూతనందించేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా మార్చామన్నారు. -
కేసీఆర్‌కు కూటమి భయం: మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజామాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సచివాలయానికి రాకుండా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టుకున్న కేసీఆరా కాంగ్రెస్‌ను విమర్శించేదని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం ఏర్పడుతున్న మహాకూటమి కేసీఆర్‌కు రాజకీయంగా బొందపెట్టడం ఖాయమని, కూటమి అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ‘కేటీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కలసి తిరుగుతుంది నిజం కాదా? అమరావతిలో కేసీఆర్ బాబుకు వంగి సలామ్‌లు కొట్టింది నిజం కాదా? చంద్రబాబు తో కలసి రొయ్యల పులుసు తిన్నప్పుడు దోస్తానా గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు కాటే సే నక్కలా మారారని ధ్వజమెత్తారు. తాను తెలంగా ణ కోసం పనిచేసినప్పుడు కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారన్నారు. నా ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో మర్చిపోయావా కేసీఆర్ అని ప్రశ్నించారు. సంస్కారంతో మాట్లాడాలని లేదంటే తాము కూడా అదే రీతిలో సమాధానం చెప్తామన్నారు. -
మీ బతుకు చెడ.. చంద్రబాబుతో పొత్తా!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘‘చంద్రబాబుతో పొత్తా.. థూ మీ బతుకులు చెడా.. అడుక్కుంటే మేమే నాలుగు సీట్లు పడేస్తుంటిమి కదా. మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం ఇస్తరా? విజయవాడ, అమరావతికి గులాంగిరి చేస్తరా? ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా? సిగ్గు పోతది. వందల మంది చచ్చిపోయి తెలంగాణ సాధించిన గడ్డ ఇది. మూడు హెలికాప్టర్లు, రూ. 500 కోట్లిస్తే కాళ్లు మొక్కి దండం పెట్టి మళ్లా మా నెత్తిమీద తెచ్చి పెడతరట. తెలంగాణ కోసం ఇంత మంది చచ్చిపోయింది ఇందుకేనా?’’అని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో బుధవారం టీఆర్ఎస్ భారీ ఎన్నికల ప్రచార బహిరంగ సభను నిర్వహించింది. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ కవిత, తాజా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ప్రసంగించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటి ల్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి తుల ఉమ, తాజా మాజీ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారమా? ‘‘తెలంగాణలోని ఏడు మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. సీలేరు పవర్ ప్రాజెక్టు తీసుకొని తెలంగాణకు కరెంట్ రాకుండా అడ్డుపడి రాక్షసానందం పొందిన రాక్షసుడు. గోదావరి, కృష్ణా నదులపై కడుతున్న ప్రాజెక్టులు ఆపాలని 36 లేఖలు రాశాడు. అలాంటి దుర్మార్గుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా? తెలంగాణను గుండు కొట్టి నాశనం చేసిన వాడితోనా.. ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ ఉద్యమకారుల ప్రాణాలు తీసిన తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తా? రాష్ట్రంలో రాజకీయాలను అస్థిరపరిచేందుకు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి. తెలంగాణ పెద్దలు, మేధావులకు మనవి చేస్తున్నా. సిగ్గు పోతది.. మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తరా.. నవ్వేటోడి ముందు జారిపడతరా.. విజయవాడ, అమరావతికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతరా? తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి. కాంగ్రెసోళ్ల నిర్ణయం ఇక్కడ ఏమైనా ఉంటుందా? అంతా ఢిల్లీలోనే. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దని చెబుతున్నా. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి. మళ్లీ 9 స్థానాలను టీఆర్ఎస్కే కట్టబెట్టాలి. టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలి’’అని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో ఆరు గ్రూపులు... కాంగ్రెస్ తీరును కూడా కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకునే శక్తి ఢిల్లీకే (పార్టీ అధిష్టానం) ఉందన్న కేసీఆర్.. ఉచ్చ పోవాలన్నా ఢిల్లీకే పోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్‌లో ఆరు గ్రూపులుంటాయి. ఢిల్లీలో గాడ్‌ఫాదర్ ఉంటరు. ఆనాడు అనేక పోరాటాలు చేసి ఢిల్లీ పెద్దలను నిలదీసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి గులాములు కావద్దు. గులాములకు బుద్ధి చెప్పండి’’అని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘1956లో తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో కలిపింది కూడా కాంగ్రెస్ నేతలే. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసింది కూడా కాంగ్రెస్సే. రైతు ఆత్మహత్యలకు, కరెంట్, వ్యవసాయ సంక్షోభానికి కారణం కూడా ఆ పార్టీయే. అలాంటి కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్ర ప్రజలను ఓట్లు అడుగుతుంది’’అని కేసీఆర్ నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రగతి ఆగకూడదని ప్రజల తీర్పు కోరదామని ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ నాయకులకు చీకట్లు కమ్మాయని, ఎన్నికలంటే గిలగిలా కొట్టుకుంటూ హైదరాబాద్‌లో గోడలు గిల్లుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్కు పదవులు ఎడమ కాలి చెప్పుతో సమానమని, రాష్ట్రాభివృద్ధి కోసమే 9 నెలల అధికారాన్ని వదులుకొని ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డామని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఉత్తమ్.. నువ్వు మగాడివైతే.. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత జైపాల్రెడ్డిలపైనా కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టును 1974లోనే కాంగ్రెస్ నిర్మించాలని అనుకున్నట్లుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారం చేసుకున్నారు. అయ్యకు.. అవ్వకు పుడితే.. మగాడివైతే.. ఆ ఒప్పందం పత్రాలతో రావాలని సవాల్ చేసిన. ఆయన రాలేదు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తే టీఆర్ఎస్ కండువా కప్పుకుని ప్రచారం చేస్తానన్న జానారెడ్డి మాట మార్చిండు. ఏనాడూ పదవిని వదలని జైపాల్‌రెడ్డి కూడా టీఆర్ఎస్ను విమర్శిస్తడు’’అంటూ మండిపడ్డారు. ‘‘నన్ను బట్టేబాజ్ అంటూ తిడుతున్నరు.. నా ప్రసంగంలో ఊపు తగ్గిందని అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని బట్టేబాజ్ అని తిట్టొచ్చా? ఉద్యమంలో మాట్లాడింది వేరు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బాధ్యతతో మాట్లాడుతున్నది వేరు. తిక్క రేగి నేను నోరు తెరిస్తే తెల్లారే వరకు తిట్టగలుగుతా. కానీ చిల్లరగాళ్లతో పంచాయితీ లేదు’’అని గులాబీ బాస్ పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో నీ అయ్య పాత్ర ఉందా...? కాంగ్రెస్‌లో రెండు రకాల గులాంలు ఉన్నారన్న కేసీఆర్... ఆ పార్టీ జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ పాత్ర లేదని గులాం నబీ ఆజాద్ అంటున్నడు. కేసీఆర్ పాత్ర లేకపోతే నీ అయ్య పాత్ర ఉందా? కాంగ్రెస్‌లో హామీలు ఇచ్చేది ఎవరో.. గెలిస్తే సీఎం సీటు మీద ఎక్కేవారెవరో తెలియదు. కనీసం అభ్యర్థులకు టికెట్ ఇచ్చే ముఖం కూడా రాష్ట్ర నాయకులకు లేదు. ఉచ్చ పోయడానికి కూడా ఢిల్లీకి పోవాలె. ఈ కాంగ్రెస్ నేతలవన్నీ సొల్లు పురాణాలు, అసత్య ప్రచారాలే’’అని కేసీఆర్ విమర్శించారు. మీ ఇంటి కిరాయే ప్రజలు కడతరు... బీజేపీపైనా టీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఎక్కడ ఉందో తెలియదని ఎద్దేవా చేశారు. ‘‘ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటి కిరాయి కడతామని అంటున్నరు. నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హామీనిచ్చారు. ఆ రూ. 15 లక్షలు జమ చేస్తే బీజేపీ నేతల ఇండ్లకు ప్రజలే కిరాయి కడతరు’’అంటూ చురకలంటించారు. ప్రతిపక్షాల హామీలు హాస్యాస్పదం.. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న హామీలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేసీఆర్ విమర్శించారు. ‘‘అర్రస్ పాట పాడినట్లే టీఆర్ఎస్ పింఛను రూ. వెయ్యి ఇస్తామంటే కాంగ్రెస్ వాళ్లు రూ. 2 వేలు ఇస్తామంటున్నరు. స్నానం చేస్తే వీపు అందకపోతే గోకుతామంటున్నరు. గీసినోడిదే గుండు, దున్నినోడిదే భూమి.. ఇలా చెప్పే వాడికి లేకపోతే వినే వాడికైనా ఇజ్జత్ ఉండాలి’’అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఊ అంటే కేసు.. ఉచ్చబోస్తే కేసు.. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రంలో జరుగు తున్న ప్రగతిని అడ్డుకుంటున్నారన్న కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేశారని మండిç ³డ్డారు. ఊ.. అంటే కేసు.. ఉచ్చబోస్తే కూడా కేసు పెట్టారని నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతుంటే నాడు అధి కారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఏం చేశారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ నేతలు 60 ఏళ్లు చేతులు ముడుచుకొని కూర్చున్నారని, గులాబీ జెండా ఎగిరిన తరువాతే తెలంగాణ ఉద్య మం ఉధృతమైందన్నారు. ఉమ్మడి ఏపీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అంటే కాంగ్రెస్ సన్నాసులు మంత్రి పదవుల్లో ఉండి ఒక్కరూ నోరు తెరవలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ది ప్రజల నోట్లో మట్టికొట్టే ఎజెండా అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, తాము అధికారంలోకి వచ్చాకే కాళేశ్వరం నిర్మాణం కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నామన్నారు. తొలి విడత రైతు బంధు చెక్కులను రైతులకు పంపిణీ చేశామని, రెండో విడత చెక్కులను పంపిణీ చేస్తా మంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలని, అలాంటి దుర్మార్గుల కు ఏ శిక్ష వేయాలో ప్రజలే ఆలోచించాలన్నారు. -
జాతిపితకు గవర్నర్, సీఎం నివాళులు
సాక్షి,హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాçపూఘాట్ ప్రార్థనా మందిరంలోని గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తొలుత మంగళవారం ఉదయమే సీఎం కేసీఆర్ బాపూ ఘాట్‌కు చేరుకుని అక్కడికి వచ్చిన గవర్నర్ నరసింహన్‌కు స్వాగతం పలికారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీఎస్ ఎస్.కె.జోషి, ఇంటెలిజెన్స్ ఐజీ ఎం.కె.సింగ్‌పాల్గొన్నారు. అసెంబ్లీలో శ్రీలంక పార్లమెంట్ బృందం స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, స్వామిగౌడ్, నేతి విద్యాసాగర్‌లతో పాటుగా నగర పర్యటనకు వచ్చిన శ్రీలంక పార్లమెంట్ అధికారుల బృందం సభ్యులు అసెంబ్లీలోని మహాత్ముని విగ్రహానికి నివాళులర్పించారు. -
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తానన్న థర్డ్ ఫ్రంట్ ఏమైందని రాష్ట్రీయ లోక్‌దళ్ పార్జీ (ఆర్ఎల్డీ) జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్ ప్రశ్నించారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఏర్పాటు చేస్తామని, 2 నెలల పాటు దేశం లోని పలు రాష్ట్రాలు తిరిగి నేతలను కలసి చివరకు దాని ఊసేలేకుండా పోయిందని ఎద్దేశా చేశారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించి తర్వాత ఫ్రంట్ ప్రస్తావనే లేకుండా పోయిందని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) నిర్వహించిన ‘పాలమూరు ప్రజాగర్జన’సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ కోసం 1,200 మంది యువత బలిదానం చేసుకున్నారని, ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్ష కోసమే పార్లమెంటులో బిల్లు సందర్భంగా మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ లాంటి ఉద్యమం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుకాలేదని, తెలంగాణ బిడ్డలు దోపిడీకి గురయ్యార న్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండో దశ పోరాటం కోదండరాం నేతృత్వంలో పాలమూరు నుంచే ప్రారంభం కావాలన్నారు. ‘పాలమూరును దగా చేశారు’ పాలమూరు ప్రాంతాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దగా చేశారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లాడని ఇక్కడి ప్రజలు కేసీఆర్‌కు పూర్తి మద్దతిచ్చి ఎంపీగా గెలిపించారని, తర్వాత సీఎంగా అవకాశం కల్పిస్తే వారిని దగా చేశారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌లో మార్పుల వల్ల రూ.5 వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నారు. ఇక్కడి ప్రజలకు నీళ్లు రాలేదని, ఉపాధి లేక ముంబైకి వలస వెళ్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం పాజెక్టు నిర్వాసితులకు ఏపీలో ఉద్యోగాలిచ్చారని, జీవో నం.68, 90 ప్రకారం ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిం చారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ప్రశ్నిస్తే నిర్బంధాలు కొనసాగిస్తున్నారని, ధర్నాచౌక్‌లు బంద్ చేశార న్నారు. ఈ ఎన్నికల్లో పాలమూరు ప్రజల పూర్తి మద్దతు టీజేఎస్‌కు ఇవ్వాలని సామాజిక తెలంగా ణ రూపకల్పనకు కృషిచేస్తామని హామీనిచ్చారు. మహబూబ్‌నగర్ టీజేఎస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్‌లు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు తీరిక లేదా?
కొండగట్టు (చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాద స్థలాన్ని, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తీరిక లేకపోవడం బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మానవత్వంలేని ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యమని పేర్కొన్నారు. గురువారం తాజా మాజీ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ తదితరులతో కలసి ఆయన ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ఓదార్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద బస్సు ప్రమాద ఘటన జరిగితే కేసీఆర్‌లో చలనం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం డొక్కు బస్సులను తిప్పుతూ ప్రజల ప్రాణాలు హరిస్తోందని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, తక్షణ సహాయం కింద రూ.25 వేలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రూ.15 లక్షల పరిహారం ఇప్పించేందుకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా స్పందించారని గుర్తుచేశారు. బాధితులకు ప్రభుత్వం తరఫున వైద్యం అందిస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు అమలు కావడంలేదని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. -
వ్రతం చెడినా ఫలం దక్కేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించడం, గవర్నర్ కేంద్రానికి పంపించడం చకచకా జరిగిపోయాయి. రాజకీయ నిర్ణయాలు తీసు కోవడంలో కేసీఆర్ ప్రదర్శించే వేగం, తేజం తాజా నిర్ణయాలలో సైతం కళ్ళకు కట్టాయి. అన్ని మతాలకూ, కులాలకూ, వర్గాలకూ చెందినవారికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ధైర్యంతో గడువుకు ఎనిమిది మాసాల 26 రోజులు ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. ఒకే విడత 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం రంగంలో దిగి సమరసన్నాహాలు చేస్తున్నది. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ అధిష్ఠానవర్గానికి ప్రతిపాదిం చిన మూడు అంశాల సూత్రం ఇది: 1) ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలి 2)టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి 3) ఎంఐఎంతో సఖ్యత కోసం అసదుద్దీన్‌తో సమాలోచనలు జరపాలి. మొదటి సూత్రం అమలు చేస్తే అసలుకే ముప్పు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఆ పదవిని ఆశిస్తున్న అరడజనుకు తగ్గని ఇతర ముఖ్యనేతలు ఎన్నికలలో పార్టీ విజయం కోసం పని చేయకపోగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఈ సంగతి కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి తెలుసు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌తో మాట్లాడి ప్రయోజనం లేదు. కేసీఆర్‌తో అసద్ అనుబంధం బలమైనది. ముస్లిం బాలబాలికలకోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పడం, వారి ఉన్నత విద్యను ప్రోత్సహించడం, రిజర్వేషన్ల తీర్మానం అసెంబ్లీ చేత ఆమోదింపజేసి కేంద్రానికి పంపించడం వంటి కార్యక్రమాలు కేసీఆర్ చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ కాబోతున్నారని అసద్ శనివారంనాడు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. మూడు సూత్రాలలో మిగిలింది టీడీపీతో పొత్తు. అంతకంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడితో వ్యవహారం. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారు. శనివారం చంద్రబాబు హైదరాబాద్‌కి రానే వచ్చారు. టీఆర్ఎస్లోకీ, కాంగ్రెస్‌లోకి గెంతినవారు పోగా మిగిలిన కొద్ది మంది నాయకులతో సుదీర్ఘ సమాలోచన జరిపి గంభీరోపన్యాసం ఇచ్చారు. కొరివితో తలగోక్కోవాలని కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉబలాట పడుతున్నారు? వారికి చంద్రబాబు పొత్తుల పురాణం తెలియదా? ఆయన నైజం అర్థం కాలేదా? ఆయనతో లోగడ పొత్తులు పెట్టుకొని భంగపడినవారికంటే తాము తెలివిగలవారమని అనుకుంటున్నారా? రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీనీ, సోనియాగాంధీని చంద్రబాబు తిట్టిన తిట్లన్నీ మరచి పోయారా? అన్నీ తెలిసే కపటనాటక సూత్రధారితో కరచాలనం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారా? హైదరాబాద్‌లో టీటీడీపీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నోట వెలువడిన తాజా అసత్యవాచకం అవధరించండి ‘నేను రాష్ట్రాన్ని విభజించమని కానీ వద్దని కానీ చెప్పలేదు.’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సమ్మతి ప్రకటిస్తూ ప్రణబ్కుమార్ముఖర్జీ కమిటీకి రెండు విడతల ఉత్తరాలు రాసింది ఎవరు? ‘విభజన బిల్లు శాసనసభలో మీరు ప్రవేశపెడతారా మమ్మల్ని ప్రవేశపెట్టమంటారా’ అంటూ కాంగ్రెస్‌ని దబాయించింది ఎవరు? చంద్రబాబు కాదా? ఏదో ఒక విధంగా టీఆర్ఎస్ని ఓడించి అధికారంలోకి రావా లని తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తపన. ఏమైనా సరే జాతీయ స్థాయిలో మోదీని వదిలించుకోవడానికి కూటమి ఏర్పాటు చేయాలనీ, అందులో టీడీపీ భాగస్వామి కావాలనీ కాంగ్రెస్ అధిష్ఠానం తాపత్రయం. ఇది సకారాత్మకమైన రాజకీయం కాదు. ఆరోగ్యపరమైనదీ కాదు. పవిత్రమైనది అసలే కాదు. ప్రజలకు మేలు చేసిది అంతకన్నా కాదు. ఇక్కడ మార్గం ముఖ్యం కాదు, లక్ష్యం ప్రధానం. అస్థిరతకు బాటలు దేశ చరిత్రలో కేంద్రంలో అస్థిర ప్రభుత్వాలు ఏర్పడిన గడ్డుకాలంలో చక్రం తిప్పింది టీడీపీ అధినేతలనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఎన్టీఆర్ ‘తెలుగు దేశం పార్టీ’ని స్థాపించిన తొమ్మిది మాసాలలోనే ప్రభంజనం సృష్టించి కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకిలించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు. కాంగ్రెస్‌వారిని కుక్కమూతి పిందెలని అవహేళన చేసేవారు. దాన్ని భూస్థాపితం చేయడం టీడీపీ ఏకైక లక్ష్యమంటూ ప్రకటించేవారు. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు విజయవాడలో ప్రతిపక్ష సదస్సు నిర్వహించారు. అది 1988లో నేషనల్‌ఫ్రంట్ ఆవిర్భావానికి దారితీసింది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి ‘జన్‌మోర్చా’ను నెలకొల్పారు. దాన్ని జనతాదళ్‌లో విలీనం చేశారు. రాజీవ్‌గాంధీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన 1989 ఎన్నికలలో రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలతో–బీజేపీతోనూ, వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకున్నారు. నేషనల్‌ఫ్రంట్ అధ్యక్షుడుగా ఎన్టీఆర్ భాగస్వామ్యపక్ష నేతలతో సమాలోచనలు జరిపి విపి సింగ్‌ను ప్రధాని చేయాలని నిర్ణయించారు. ప్రధా నిగా ప్రమాణం చేసినప్పటి నుంచి విపి సింగ్ కుర్చీ కాపాడుకునేందుకే సర్వ శక్తులూ వినియోగించవలసి వచ్చింది. బీజేపీ అనుసరించిన హిందూత్వ విధానాలకు విరుగుడుగా మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని విపి సింగ్ నిర్ణయించారు. ఇందుకు ప్రతిగా బీజేపీ నేత అడ్వాణీ సోమనాథ్ మందిరం నుంచి అయోధ్యకు రథయాత్ర ఆరంభించారు. రథం బిహార్‌లోని సమస్తిపూర్ చేరగానే అడ్వాణీని లాలూప్రసాద్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా విపి సింగ్ ప్రభు త్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. జనతాదళ్ నుంచి దేవీలాల్, చంద్రశేఖర్ 64 మంది ఎంపీలతో నిష్క్రమించి సమాజవాదీ జనతాదళ్ (రాష్ట్రీయ)ను నెలకొల్పారు. లోక్‌సభలో విశ్వాసతీర్మానం వీడిపోవడంతో విపి సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆరు మాసాలు తిరగకుండానే చంద్రశేఖర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్నది. ఆపద్ధర్మ ప్రధానిగా చంద్రశేఖర్ 1991లో ఎన్నికలు జరిగి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేవరకూ కొనసాగారు. విపి సింగ్, చంద్రశేఖర్‌ల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. లండన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టిన అప ఖ్యాతి చంద్రశేఖర్‌కు దక్కింది. విపి సింగ్ హయాంలో కశ్మీర్ లోయనుంచి 90 వేలమంది పండిట్లు ప్రాణాలు చేతపట్టుకొని వలస వెళ్ళి స్వదేశంలోనే శర ణార్థులుగా శిబిరాలలో తలదాచుకున్నారు. మామగారిని గద్దె దింపి అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో యునైటెడ్ఫ్రంట్కు కన్వీనర్‌గా వ్యవహరించి రెండు అల్పాయుష్షు ప్రభుత్వాలకు పురుడు పోశారు. 1996 నాటి ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం చెందింది. అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆధిక్యం సంపాదించినప్పటికీ ఎన్నికల తీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చిందనే ఉద్దేశంతో పీవీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించలేదు. రెండవ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి ఏర్పాటు చేసిన ప్రభుత్వం 13 రోజులలో కుదేలయింది. అప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది. యునైటెడ్‌ఫ్రంట్ కన్వీ నర్గా దేవెగౌడనూ, ఐకె గుజ్రాల్నూ ప్రధానమంత్రులుగా చేయడంతో ఆయన పాత్ర లేకపోలేదు. కానీ ఆయనది నిర్ణాయక పాత్ర కాదు. సీపీఎం నేత హరి కిషన్‌సింగ్ సూర్జీత్ సంకీర్ణ ప్రభుత్వాల సృష్టికర్త. yì ఎంకె అధినేత కరుణానిధి సంధానకర్త. చంద్రబాబు యువకుడు కనుక సీనియర్ నాయకుల మధ్య సమన్వ యకర్తగా పని చేశారు. ఇద్దరు ప్రధానులూ కలసి రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపించలేకపోయారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి రెండు ప్రభుత్వాలకూ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించి అనిశ్చితికీ, అస్థిరతకూ దారి తీశారు. గుజ్రాల్ ప్రభుత్వం పతనమైన సమయంలోనే ప్రణబ్‌ముఖర్జీ, గులాంనబీ ఆజాద్, తదితరులు కేసరి చేతి నుంచి కాంగ్రెస్ పగ్గాలను లాగివేసి సోనియాగాంధీ చేతిలో పెట్టారు. నకారాత్మక రాజకీయం, అపవిత్ర పొత్తుల కారణంగానే దేశానికి అరిష్టం దాపురించింది. హానికరమైన ఈ ధోరణికి ప్రతీక చంద్రబాబు. పొత్తుల వీరుడు దుస్తులు మార్చినట్టు భాగస్వాములను మార్చివేయడం చంద్రబాబుకు బాగా తెలిసిన విద్య. 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోక్‌సభ (1996) ఎన్నికలలో టీడీపీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నది. ఎన్నికలు జరిగిన తర్వాత కమ్యూనిజం కంటే టూరిజం ముఖ్యమంటూ కమ్యూనిస్టు నాయకులను ఎద్దేవా చేయడం ఆరంభించారు. 1998లోనూ వామపక్షాలతో ప్రయాణం కొనసాగించారు. కానీ ఎన్నికలు కాగానే వామపక్షాలకు గుడ్‌బై చెప్పి యునైటెడ్‌ఫ్రంట్ నుంచి నిష్క్రమించి వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కార్గిల్ విజయం ఫలితంగా పెరిగిన వాజపేయి ప్రతిష్ఠ సహకారంలో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది అధికారంలో కొనసాగారు. 2002లో గుజరాత్లో మారణకాండ జరిగినప్పుడు నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ తాను చేసిన సిఫార్సును వాజపేయి అమలు చేయనప్పటికీ మద్దతు ఉపసంహరించుకోలేదు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తన పట్ల ప్రజలలో సానుభూతి వెల్లువెత్తిందని భావించి ముందస్తు ఎన్నికలకు సిద్ధమై లోక్‌సభకు కూడా గడువుకంటే ముందు ఎన్నికలు జరిపించేందుకు వాజపేయిని ఒప్పించారు. 2004 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ కూటమి ఓడిపోయిన వెంటనే బీజేపీతో పొత్తు పెట్టు కోవడం తప్పిదమని చెబుతూ జీవితంలో మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టు కోనంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. 1998లో తిరస్కరించిన వామపక్షాలను 2009లో చేరదీశారు. టీఆర్ఎస్ని కూడా మహాకూటమిలో చేర్చుకున్నారు. ఫలితాలు వెల్లడైన వెనువెంటనే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే అనర్థం జరిగిందని అన్నారు. 2014లో తిరిగి బీజేపీతో కలసి ఎన్నికలలో పోరాడటమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులను చేర్పించి, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇద్దరు బీజేపీ మంత్రులను చేర్చుకున్నారు. నాలుగున్నరేళ్ళు అంటకాగిన తర్వాత ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. నిరుడు విశాఖపట్టణంలో మహానాడు జరిగి నప్పుడు చంద్రబాబు చైనా నాయకుడు డెంగ్‌ను ఉటంకిస్తూ పిల్లి నల్లదా, తెల్లదా అన్నది ముఖ్యం కాదనీ, ఎలుకలు పట్టేది అయితే చాలుననీ చెప్పారు. రాజ కీయాలలో విలువలకు కాలం చెల్లిందనీ, విధానాలతో నిమిత్తం లేకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ పోవాలని ఉద్ఘాటించారు. ఓట్లు బదిలీ అయ్యేనా? మహాకూటమిలో టీడీపీని చేర్చుకుంటే టీఆర్ఎస్ని ఓడించవచ్చుననే కాంగ్రెస్ అంచనా తప్పు. టీడీపీకి 12 లేదా 15, టీజెఎస్కు 5 లేదా 6, సీపీఐకి నాలుగు సీట్లు విడిచిపెట్టాలని కాంగ్రెస్ తలపోస్తున్నట్టు భోగట్టా. హైదరాబాద్ పాత బస్తీలో సుమారు పది స్థానాలవైపు కాంగ్రెస్ తేరిపార చూసే పరిస్థితి లేదు. మిగిలిన 84 స్థానాలలో కనీసం 50 స్థానాలు గెలుచుకుంటేనే మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అంటే, పోటీ చేసే స్థానాలలో సుమారు 70 శాతం స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాలి. అటువంటి అవకాశం ఉన్నదా? ఉంటే అన్ని స్థానాలకూ కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టవచ్చు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తున్న కాంగ్రెస్ ఓటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయరు. అదే విధంగా కాంగ్రెస్‌ని మట్టికరిపించడమే ధ్యేయంగా ఓటు చేస్తున్న టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదం చేయరు. టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ వ్రతం చెడినా ఫలం దక్కదు. తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ కూటమి విఫలమైతే ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు కాంగ్రెస్‌ని దగ్గరికి రానీయరని చెప్పడానికి గొప్ప తెలివి తేటలు అక్కర లేదు. అవకాశవాద, నకారాత్మక రాజకీయాల కంటే కాంగ్రెస్ ఒంటరిగా టీఆర్ఎస్తో తలబడితే అమీతుమీ తేల్చుకోవచ్చు. గెలిచినా, ఓడినా గౌరవప్రదంగా ఉంటుంది. త్రికాలమ్ కె. రామచంద్రమూర్తి -
ఆశీర్వదించండి.. మళ్లీ వస్తున్నా
సాక్షి, సిద్దిపేట : రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తానన్నారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరిట శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టీఆర్ఎస్ తొలి ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... కాంగ్రెస్‌వి ఆచరణ సాధ్యంకాని హామీలు... స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని పాలించింది. వారి పాలనలో తెలంగాణ రాష్ట్రమే కాదు.. దేశమంతా కరువు కాటకాలు, పేదరికంతో అలమటించింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారు. మాయమాటలు చెబుతున్నారు. వారి మాటలు విని మోసపోతే ఐదు సంవత్సరాలు గోస పడుతాం. పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేశాం. లాఠీ దెబ్బలు తిన్నం.. జైళ్లకు వెళ్లాం.. చావు నోట్లోకి వెళ్లి వచ్చిన నేను పసిగుడ్డుగా ఉన్న తెలంగాణను నాలుగేళ్లలోనే అభివృద్ధి పథంలో నడిపించా. వారు పట్టించుకుంటే తెలంగాణ వచ్చేదే కాదు.. ఢిల్లీ నాయకుల చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అవాకులుచవాకులు మాట్లాడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో సీఎంలతో మాట్లాడాలంటేనే వారికి లాగులు తడిసేవి. వారు మన ప్రాంతం గురించి ఆలోచించి ఉంటే.. ఇక్కడ ప్రజల అవసరాలను పట్టించుకొని ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చేదే కాదు. ఇటువంటి ఢిల్లీకి వెళ్లి బిచ్చమెత్తుకునే కాంగ్రెస్ పాలకులు కావాలో.. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకునేలా టీఆర్ఎస్ పాలన కావాలో మీరే తేల్చుకోండి. అసలే అధికార వాంఛతో ఆకలితో ఉన్న కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రాని అప్పగిస్తే పంటికి అందకుండా మింగేస్తారు. చైనా, సింగపూర్‌లతో పోలిస్తే వెనుకబడ్డాం... మన సరిహద్దు దేశమైన చైనాలో 2.23 లక్షల కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ రైలు మార్గం ఉంటే మన దేశంలో కేవలం 19 వేల కిలోమీటర్లు మాత్రమే రైలు మార్గం ఉండటం శోచనీయం. అంతర్జాతీయ స్థాయిలో సరుకులు రవాణా చేసే లారీల సగటు వేగం 80 కిలోమీటర్లు ఉండగా.. ఇండియాలో అది 24 కిలోమీటర్లే. అదేవిధంగా గూడ్స్ రైలు వేగం 86 కిలోమీటర్లు ఉంటే ఇండియాలో 36 కిలోమీటర్లు. దీనంతటికీ కాంగ్రెస్ అవినీతి పాలనే కారణం. కేవలం 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ ఏటా 5.70 కోట్ల కంటెయినర్లను డీల్ చేస్తోంది. కానీ 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న మన దేశం మాత్రం 47 లక్షల కంటెయినర్లనే డీల్ చేస్తోంది. ఇది సిగ్గుచేటు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? భగవంతుడు, ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులు 70 వేల టీఎంసీలు ఉండగా.. వాటిని సద్వినియోగం చేసుకుంటే కరువు అన్న మాటే ఉండదు. అభివృద్ధిలో వెనుకబడొద్దనే ముందస్తుకు... తమ పాలనలో తెలంగాణ గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే నోటికొచ్చినట్లు పేలుతున్నారు. నాలుగేళ్లలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి 17.17 శాతం ఉంది. ఈ ఏడాది అది 21.96 శాతానికి పెరిగిన విషయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. దీన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి అడ్డు పడుతున్నారన్నారు. తరచూ విమర్శలు చేసే పార్టీలతో.. ప్రజల మధ్యకు వెళ్లి ఎవరేం చేశారో తేల్చుకుందామని అన్నప్పుడు సరే అన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇప్పుడు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. దిక్కు తోచక ఆగమాగం అవుతున్నారు. మరో ఏడు నెలల పదవీ కాలం ఉన్నా.. రాష్ట్రంలో జరగనున్న అభివృద్ది ముందుకు పోవాలని, ఆర్థిక ప్రగతి 21.96 శాతానికి మించి ఎదగాలని భావించే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాం. అభివృద్ధి ఆగొద్దనే ఆలోచనతో పదవీకాలం త్యాగం చేశాం. మీరు ఆశీర్వదించి ప్రభుత్వాన్ని రెన్యూవల్ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తాం. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తా. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టాం.. పరాయి పాలనలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను నాలుగేళ్లలో చక్కబెట్టాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా గొల్లకురుమలు, చేనేత కార్మికులను ఆదుకున్నాం. అంగన్వాడీ, ఆశ వర్కర్లకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాం. ఎవరూ అడగకుండానే కల్యాణలక్ష్మి అమలు చేశాం. కాంగ్రెస్ నాయకులు కనీసం మహిళల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించలేదు. వాళ్ల హయాంలో ఆపరేషన్ లేకుండా ప్రసవాలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు తల్లీబిడ్డల క్షేమానికి పథకాలు ప్రవేశపెట్టాం. ఎన్కౌంటర్లు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. రాష్ట్ర సంపదను హైదరాబాద్‌లో ఖర్చు పెట్టలేదు. కొత్త సంసారాన్ని ఎలా చక్కబెట్టుకుంటారో.. నోరు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి పల్లెల సంక్షేమానికి వెచ్చించాం. గులాబీ కండువా కప్పుకుంటావా జానారెడ్డీ? రైతులకు ఉచితంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటిస్తే ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శలు చేశారు. మీరు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే గులాబీ కండువా కప్పుకుంటామని సవాల్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది నీకు కన్పిస్తలేదా.. జానారెడ్డి. కళ్లు కనిపించకపోతే రాష్ట్రమంతటా అమలవుతున్న కంటి వెలుగు పథకం కింద కంటి పరీక్షలు చేయించుకో. విద్యుత్‌ను ఎలా తీసుకురావాలో.. ఉత్పత్తి ఎలా పెంచాలో కాంగ్రెస్ నాయకులకు తెలియదు. తిరిగి వారికి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంట్ ఇబ్బందులు మళ్లీ వస్తాయి. తిరిగి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్‌ను గెలిపించి దీవించాలి. సభలో ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రసంగించారు. ఈ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, బి. వెంకటేశ్వర్లు, ఫారూఖ్ హుస్సేన్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌రావు, పుట్ట మధు, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, బొడిగ శోభ, బస్వరాజు సారయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, విద్యాసాగర్‌రావు, టూరిజం శాఖ చైర్మన్ భూపతిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈదె శంకర్‌రెడ్డి, కర్ర శ్రీహరి, పేర్యాల రవీందర్రావు, రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ నేనే సీఎం
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, అందులో ఎలాంటి సందేహం లేదని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. తాను ఏం చేసినా తెలంగాణ శ్రేయస్సు కోసమే చేస్తానని, చెడు కోరి ఏదీ చేయనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరి పీడ విరగడ కావాల్నో తేలుస్తారని, కాంగ్రెస్సే రాష్ట్రానికి పట్టిన పెద్ద పీడ అని దుయ్యబట్టారు. అసెంబ్లీ రద్దు, గవర్నర్‌తో భేటీ అనంతరం గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘ఎన్నికల నిర్వహణలో కూడా ఊహాగానాలు వద్దు. నాకు ఎలాంటి సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు అక్టోబర్ మొదటివారంలో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్లోనే ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ మొదటివారంలో ఫలితాలు వస్తాయి. ఇది నాకున్న పరిజ్ఞానం. కచ్చితంగా నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు వస్తాయి. అన్ని చోట్లా ఒకే దశలో జరుగుతాయి. మీకు కూడా నేను ఏమీ తెలియనీయలేదు. (జర్నలిస్టులనుద్దేశించి). మీరేమీ అనుకోవద్దు. నేనే స్వయంగా కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడినా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ కూడా మాట్లాడారు. ఈ విషయంలో ఊహాగానాలు బంద్ చేయండి. 14 స్థానాల్లో అభ్యర్థులను వారం పది రోజు ల్లో ప్రకటించాల్సి ఉంది. మేనిఫెస్టోలో పెట్టినవి 99.9 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోలో చెప్పని 76 కార్యక్రమాలు చేశాం. కల్యాణలక్ష్మి పెట్టమని మమ్మల్నెవరూ అడగలేదు. ఎవరూ ధర్నాలు చేయలేదు. పిటిషన్లు ఇవ్వలేదు. బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వమని ఎవరూ అడగలేదు. పరిస్థితులను బట్టి అన్నీ చేసినం. కల్యాణలక్ష్మి విషయంలో ఆర్థిక పరిస్థితిని బట్టి తొలుత రూ.51 వేలు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీలకే అన్నాం. తర్వాత బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకూ ఇచ్చాం. మేం ఏది చేసినా రైతు కేంద్రీకృతంగా చేశాం. రైతుబంధు, రైతు బీమా, భూ రికార్డుల ప్రక్షాళన, బీసీ కులాలకు ఆత్మగౌరవం కోసం హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాళ్లు ఇచ్చాం. నిధులు మంజూరు చేశాం. ఇప్పుడు తెలంగాణలో పేకాట క్లబ్‌లు లేవు. గుడుంబా అడ్డాలు లేవు. ఎరువుల కోసం ఎదురుచూపుల్లేవు. లాఠీచార్జీల్లేవు. 4 సంవత్సరాల 5 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మతఘర్షణలు లేవు. గతంలో ఊ అంటే కర్ఫ్యూ విధించేవారు. వలసలు ఆగిపోయాయి. అక్కడి ప్రజలంతా హైదరాబాద్‌లో ఉన్న రేషన్ కార్డులను వాపస్ చేస్తున్నరు. ఇవన్నీ విస్మరించి అడ్డగోలు కథలు చేస్తున్నరు. వాళ్ల చరిత్ర అందరికీ తెలుసు ఏ పార్టీ మా మీద ఆరోపణలు చేస్తుందో వాళ్ల చరిత్ర అందరికీ తెలుసు. కేసీఆర్ పీడ విరగడ అవుతుందని దుర్మార్గంగా మాట్లాడుతున్నరు. విరగడయ్యేది కేసీఆర్ పీడనా.. కాంగ్రెస్ పీడనా రేపు చెప్తం. నేను ఎప్పుడో చెప్పిన. తెలంగాణ కోసం పని చేస్తామంటే హైదరాబాద్‌లో ఇల్లు కిరాయికి ఇవ్వద్దని భయపెట్టిండ్రు. తెలంగాణకు కాంగ్రెస్సే పెద్ద శత్రువు. పెద్ద పీడ.. పెద్ద విలన్. నాడు స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణను లేకుండా చేసింది జవహర్‌లాల్‌నెహ్రూ. నాడు 11 మంది ఎంపీలు గెలిచి రాష్ట్రం ఇవ్వమన్నా ఇవ్వకుండా ప్రజాతీర్పును కాలరాసింది ఇందిరాగాంధీ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మనకు భిక్ష పెట్టలే. మేమే కాంగ్రెస్‌కు 2004లో భిక్ష పెట్టినం. పదేండ్ల యూపీఏ పాలన మా భిక్షే. చివరకు సచ్చిపోతం.. దేశంలో ఆగమైపోతమనే స్థితిలో తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తయని ఆగమాగం మీద, ఆగమేఘాల మీద, వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ఇచ్చిండ్రు. నేను మళ్లీ చెపుతున్న. నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు పీడ కాంగ్రెస్సే. మా దగ్గర్లోనే ఎవరూ లేరు: ప్రతిపక్షాలు మా దగ్గర్లో లేవు. 82 స్థానాల్లో 60శాతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని సర్వేలు చెపుతున్నాయి. 17–18 సార్లు సర్వే చేపించినం. 100 స్థానాల్లో 50 శాతంపైన ఉన్నం. మేం 100 గెలుస్తం. మిగిలిన వాటిలో 7 ఎవరికి పోతయో అందరికీ తెలుసు. అన్ని పార్టీలు కలిసి వచ్చినా 50 శాతం కంటే ఎక్కువ రావు వాళ్లకు. మాకేం కాదు కదా. మేం 100సీట్లు గెలిచి తీరుతాం. ఓవైసీ స్వచ్ఛందంగా మద్దతిచ్చారు ఎంఐఎం మాకు స్నేహపూర్వక పార్టీ. మేం కలిసి పనిచేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఉండొచ్చు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అస్థిరపాలు చేయాలని చూస్తుంటే ఆ సమాచారం తెలిసిన అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇలా ఎందుకు చేస్తున్నారు.. మేం స్వచ్ఛందంగా మీకు మద్దతిస్తామని చెప్పారు. అప్పటినుంచి మేం కలిసే పనిచేస్తున్నాం. అందులో తప్పేముంది. మేనిఫెస్టో కమిటీ భవిష్యత్తులో ప్రజలకు ఏం చేస్తామనేది రానున్న ఎన్నికల్లో చెప్పడం కోసం 15 మందితో కేకే అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ వేస్తున్నాం. నేను అసెంబ్లీ రద్దు లాంటి నిర్ణయాలు ప్రకటించకూడదు. అది పూర్తిగా కేబినెట్కున్న హక్కు. వరాలు ప్రకటించకూడదు. సీఎం హోదాలో ప్రకటిస్తే వాటికి జీవోలిచ్చి అమలు చేయాలె. ఇప్పటివరకు ఇచ్చిన హామీలకు కేబినెట్ నిర్ణయాలు అయిపోయాయి. జీవోలు కూడా వచ్చాయి. కొద్దిరోజుల్లో మా మేనిఫెస్టో కూడా వస్తుంది. రాబోయే ఐదేళ్లపై మాకు పూర్తి అవగాహన ఉంది. రాష్ట్ర ఆదాయం, రాబడుల మీద అవగాహన ఉంది. మాది ఒంటరి పోరే. మజ్లిస్ ఫ్రెండ్లీ పార్టీనే. భవిష్యత్తులో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలన్నీ చెప్తం. ఏదైనా ఒకటే.. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలైనా, బ్యాలెట్లైనా ఒకటే. యూపీఏ–2 రాగానే మోదీ వాళ్లు ఆరోపణలు చేసిండ్రు.. మోదీ రాగానే కాంగ్రెస్ వాళ్లు చేస్తున్నరు. ఈవీఎంలలో లంగతనం చేసే పని ఏదైనా ఉంటే పవర్లో ఉన్నోడు పోనే పోడు కదా.. మరి మోదీ ఎట్ల గెలిచిండు. వీవీప్యాట్లు వచ్చిన తర్వాత ఈవీఎంలపై సందేహం అవసరం లేదు. అయినా బ్యాలెట్ పెట్టినా నష్టం లేదు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనేది నిర్ణయం కాలేదు కాబట్టి నేను నా దారిలో పోతున్నా. నిర్ణయం అయి ఉంటే అదే చేసే వాడినేమో. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం నేనే అయితా... సందేహం ఏమైనా ఉందా? ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కూడా నేను ఒక మాట చెపుతున్నా. మాది చక్రాలు తిప్పే ఫ్రంట్ కాదు. ప్రజల కోసం పెట్టే ఫ్రంట్. నేను ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంటేనే నిలబడుతుంది. మీరే చూస్తరు. మేమెట్ట కలుస్తం బీజేపీతో మేమెట్ట కలుస్తం.. మా గోత్రాలే కలవవు. సిద్ధాంత పరంగా టీఆర్ఎస్ 100 శాతం సెక్యులర్. అట్టనే ఉంటది. లక్ష్మణ్.. గరీబుగాడు అట్లనే మాట్లాడతడు. వాళ్ల కథేంటో మీకు తెలియదా? నాకు కూడా పీఎం కావాలని ఉంది. అయితనా.. కలలు మస్తుంటయ్.. వాళ్లు ఉన్న సీట్లు నిలబెట్టుకుంటే గొప్పే. పాలన సౌలభ్యం కోసం రాష్ట్రాల చేతిలో ఉండాల్సిన ఎన్నో రకాల అంశాలు, అధికారులు కేంద్రం గుప్పిట్లో ఉన్నాయి. నవ్వుకుంటరనే సోయి లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు చూస్తుంటే కేసీఆర్ 100 యూనిట్లంటే వాళ్లు 200 యూనిట్లంటున్నరు. పింఛన్ నేను వెయ్యి అంటే వాళ్లు రెండు వేలు అంటున్నరు. ఎంత సిల్లీగా, బాధ్యతారాహిత్యంగా హామీలు ఇస్తున్నరంటే ప్రజలు నవ్వుతరనే సోయ లేకుండా ఇస్తున్నరు. రూ.వెయ్యి పింఛన్ ఇవ్వాలని, రైతులకు పెట్టుబడి ఇచ్చి బీమా కల్పించాలని మీ జీవితంలో అనుకోలే. కేసీఆర్ చెపితేగానీ సోయ రాలే. ఇప్పుడైనా బుద్ధి వచ్చి రూ.2 వేలు ఇస్తమని కాంగ్రెస్ దెయ్యాల నోటి నుంచి వచ్చింది. వాళ్లు అలా ప్రకటించే స్థితికి తెచ్చింది కేసీఆరే. అది టీఆర్ఎస్ విజయమే. నేను రూ.2200 పింఛన్ ఇస్తనంటే ఓట్లేస్తరా? చిన్నప్పుడు చాక్లెట్ల పంచాయతీలాగా చెప్తున్నరు. ఇది ఆరోగ్యకర పోటీనా. మేం సంపద పెరుగుతున్న కొద్దీ కార్యక్రమాలు పెంచుకుంటూ పోతున్నం. మా లక్ష్యం ఎన్నికల తాయిలాలు కాదు. సంపద పెంచడం... పేద ప్రజలకు పంచడమే. పాలమూరులోనే 9 లక్షల ఎకరాలకు నీరు నెట్టెంపాడు మేమే పూర్తి చేసినం. కల్వకుర్తి, బీమా మేమే చేసినం. ఒక్క పాలమూరులోనే 9 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినం. కరెంటు కోతలు నివారించినం. అప్రకటిత కోతల్లేవు. నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణే. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఫలితం సిరిసిల్ల గోడల మీద రైతుల ఆత్మహత్యలు వద్దనే రాతలు మాత్రమే. 2014కు ముందు పరిశ్రమలు మూసివేశారు. భయంకరంగా కలప స్మగ్లింగ్ జరిగేది. పూటకో ఎన్కౌంటర్.. మతకల్లోలాలు, మారణహోమం జరిగేది. ఈ దరిద్రానికి నెలవు, రిజర్వ్‌బ్యాంక్ కాంగ్రెస్ పార్టీనే. వాళ్ల పీడ పోవాలె. చెరపట్టిన తెలంగాణను విడిపించిన భూమిపుత్రుడు కేసీఆర్. రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎవరి పీడ పోగొట్టాల్నో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉంటే ఉంటడు.. పోతే పోతడు డీఎస్ విషయంలో పార్టీ పరంగా చాలా గౌరవం ఇచ్చినం. వస్తూనే సలహాదారు పదవి ఇచ్చినం. ఆ తర్వాత రాజ్యసభ ఖాళీ అయితే పెద్దమనిషి అడిగిండు కదా అని గౌరవించినం. కొడుకు వేరే పార్టీలోకి పోయి డిస్ట్రబ్ చేస్తుండని ఫిర్యాదు చేసిండ్రు. అయినా మేమేమీ నిర్ణయం తీసుకోలేదు. ఉంటే ఉంటడు.. పోతే పోతడు.. మేమైనా ఇంకా ఏదీ నిర్ణయించలేదు. త్యాగాలు చేసింది మేమే ప్రజలకు న్యాయం తెలుసు. టీఆర్ఎస్ ఎన్నో త్యాగాలు చేసింది. ఇప్పుడు కూడా నాలుగైదు నెలల అధికారాన్ని తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేశాం. అభివృద్ధి పథం ఆగిపోవద్దన్నదే మా ఉద్దేశం. చిల్లర మాటలు మాట్లాడొద్దు. నోరు ఫినాయిల్‌తో కడుక్కునే ఆరోపణలు బంద్ కావాలే. నేను ఇప్పుడు అంటున్నా.. కమాన్.. బిగ్ బ్యాటిల్‌కి వెల్కమ్. ఐయామ్ రెడీ.. తెలంగాణ ప్రజాక్షేత్రంలోకి పోదాం. అక్కడ తేల్చుకుందాం. రేపటి నుంచే మా ఎన్నికల కార్యాచరణ ప్రారంభమవుతుంది. ముందుగా అనుకున్నట్టు 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తం. నేనే పోయి ప్రజలకు చెపుతా. డిపాజిట్లు రావు ఇంకా టీడీపీ ఉందా.. పొత్తు పెట్టుకోవడానికి. మా సర్వేల్లో ఎక్కడా 0.1, 0.2 శాతం మించి రాలేదు. వాళ్లిద్దరూ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే చంద్రబాబు పొద్దున లేస్తే తెలంగాణ మీద అభాండాలు వేస్తడు. కృష్ణానది నీళ్లపై ఉత్తరాలు రాస్తడు. గోదావరి నది మీద కట్టే ప్రాజెక్టులపై కేసులేస్తడు. మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు గులాం కావాల్నా.. ఆంధ్ర పార్టీలను తెచ్చి పెట్టుకుంటరా? ఇదే గులాంగిరీ అంటే... అలా కావొద్దు. లేచినోడో.. లేవనోడో ఇక్కడి వ్యక్తే శాసనకర్త కావాలె. ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్టీఆరే గెలవలేదని, ఈయన గెలుస్తడా.. అంటున్నరు. కేసీఆర్ సాధిస్తడు. చెన్నారెడ్డి కంటే మగోడని నిరూపించుకోలేదా? వాటీజ్ దిస్ నాన్సెన్స్ మాపై ప్రతిపక్షాలు చేసిన ఒక్క ఆరోపణ అయినా నిరూపిస్తారా..? వాటీజ్ దిస్ నాన్సెన్స్? దిసీజ్ అన్లిమిటెడ్ ఇడీయసీ. ప్రగతి నివేదన అట్టర్‌ప్లాఫ్ అన్నరు. సభ కాదు.. మీ మైండ్ అట్టర్‌ప్లాఫ్. యూ ఆర్ బ్యాంక్రప్ట్.. అందుకే ప్రజల దగ్గరకు వెళ్తున్నం. మేమెవరికీ భయపడడం లేదు. కాంగ్రెస్ భయపడుతుందేమో? రాహుల్ గాంధీ ఓ ఫ్యాక్టరే కాదు. ఈ దేశంలోనే ఆయన పెద్ద బఫూన్.. మన దగ్గరే ఎక్కువ జీతాలు దేశంలో బాగా జీతాలు అందుకుంటున్న ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు. గత ప్రభుత్వాలు చిన్న తరహా ఉద్యోగులతో బానిస చాకిరి చేయించుకున్నాయి. ఆశ వర్కర్లు, హోంగార్డులు, అంగన్వాడీలు అనేక మంది చిన్న తరహా ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచాం. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం రిస్క్ అలవెన్స్‌ను అదనంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే. చిన్నతరహా ఉద్యోగుల వేతనాలు ఇంకా పెంచాలని ఉంది. -
రాజ్యాంగంలో లేని ‘ఆపద్ధర్మం’!
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న లోక్‌సభ లేదా శాసనసభ కాల పరిమితి ముగియక ముందే రద్దు అయితే తిరిగి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు అప్పటిదాకా ఉన్న ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి ఆపద్ధర్మంగా కొనసాగుతారు. పాలనాపరంగా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సభ లు రద్దయ్యే సమయానికి ప్రధాని లేదా సీఎంగా కొనసాగిన వ్యక్తిని అదే పదవిలో కొనసాగాలని రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరుతారు. ఇలా వారి కోరిక మేరకు సీఎం పదవిలో కొనసాగిన వ్యక్తి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవుతారు. అప్పటివరకు పని చేసిన మంత్రు లు కూడా అవే బాధ్యతలను నిర్వర్తిస్తారు. అలాగే శాసనసభ లేని సమయంలో ప్రధాని లేదా ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. అయితే ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విధులు, అధికారాలపై న్యాయనిపుణులను ప్రశ్నించినప్పుడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం అన్నది రాజ్యాంగంలో లేకపోయినా మన దేశంలో ఓ సంప్రదాయంగా వస్తోందని వారు వివరించారు. విధాన నిర్ణయాలకు తావు లేదు అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణంగా కీలక విధానపరమైన నిర్ణయాలేవీ కూడా ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. ఎన్ని కలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదు. రోజువారీ వ్యవహారాలు, కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ తయారీ, ఆర్డినెన్స్‌ల జారీ, పన్ను ల పెంపు, తగ్గింపు, భారీ ప్రాజెక్టుల ప్రకటన, నామినేటెడ్ పదవుల భర్తీ, కీలక పోస్టుల్లోని ఉన్నతాధికారుల బదిలీలు వంటి విషయాల్లో నిర్ణయాలు తీసు కోవడానికి వీల్లేదు. వీటికి సంబంధించిన నిర్ణయాల ను ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వ మే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆపద్ధర్మ ప్రభు త్వం ఏదైనా కీలక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే.. ఆ నిర్ణయం సబబా? కాదా? అన్న విషయంపై న్యాయ సమీక్ష చేసేందుకు అవకాశం ఉంది. ఆపద్ధర్మ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1975లో దేశంలో తొలిసారి.. మన దేశం విషయానికొస్తే డాక్టర్ జయప్రకాశ్ నారాయణ 1974లో ఎన్నికల సంస్కరణలపై జస్టిస్ వీఎం తర్కుండే నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1975లో ఇచ్చిన తన నివేదికలో తొలిసారి ఆపద్ధర్మ ప్రభుత్వం గుర్తించి ప్రస్తావించింది. ఎన్నిక ల సమయంలో ఉండే ప్రభుత్వం కేవలం ఆపద్ధర్మ ప్రభుత్వంగానే బాధ్యతలు నిర్వర్తించేలా చూడాల్సిన అవసరం ఉందని ఆ కమిటీ సిఫారసు చేసింది. తర్వాత 1989లో అప్పటి న్యాయశాఖ మంత్రి దినేశ్ గోస్వామి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. ఆపద్ధర్మ ప్రభుత్వం విషయంలో 1975లో జస్టిస్ తుర్కుండే కమిటీ చేసిన సిఫారసును వ్యతిరేకించింది. నీలం సంజీవరెడ్డి తొలి అధికారిక ప్రకటన 1979లో లోక్‌సభ రద్దయినప్పుడు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆపద్ధర్మ ప్రభుత్వం విషయంలో తొలిసారి అధికారిక ప్రకటన చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వం కొత్త విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అప్పటి ప్రధాని చరణ్‌సింగ్ దీన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, ఈ విషయంలో రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక సాయం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1991లో నాటి ప్రధాని చంద్రశేఖర్ కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారు. న్యాయవ్యవస్థలో పలు బదిలీలను చేపట్టారు. కొందరు అధికారులను కూడా బదిలీ చేశారు. వీటిపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. అయితే పార్లమెంట్ రద్దు చివరి రోజు ఎంపీలకు పెన్షన్ జారీ విషయంలో తీసుకొచ్చిన బిల్లు వివాదాస్పదమైంది. నాటి రాష్ట్రపతి వెంకటరామన్ ఆ బిల్లులకు ఆమోదం తెలపలేదు. 1997లో ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంది. ఏకంగా గవర్నర్ల నియామకాలు చేపట్టింది. పంజాబ్ రాష్ట్రంలో రూ.కోట్ల రుణాలను మాఫీ చేసింది. తర్వాత వాజ్‌పేయి నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది. రాష్ట్రపతి అభిప్రాయాలతో విభేదించేందుకు సైతం వాజ్‌పేయి ప్రభుత్వం వెనుకాడలేదు. ఆశ్రిత పక్షపాతానికి, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విధానపరమైన నిర్ణయాలను ఉపయోగించరాదన్న ఉద్దేశంతోనే ఆపద్ధర్మ ప్రభుత్వానికి కీలక నిర్ణయాల విషయంలో ఆంక్షలు విధించారు. ఆపద్ధర్మ సీఎంగా 450 ఎకరాలు కట్టబెట్టిన బాబు.. 2004లో అప్పటి ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత మనిషి బిల్లీరావుకు చెందిన ఐఎంజీ భరత అకాడమీస్‌కు అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలోని 450 ఎకరాలను ఎకరా రూ.50 వేలకే కట్టబెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోరాదని తెలిసినా, మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని తెలుసుకున్న చంద్రబాబు ఆగమేఘాలపై వేల కోట్ల విలువైన 450 ఎకరాల భూమిని కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీకి కేటాయించి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. ఐఎంజీ భరత కార్యాలయానికి జూబ్లీహిల్స్‌లో ఐదు ఎకరాలను ఎకరా రూ.50 వేలకే కేటాయించారు. ఈ కేటాయింపులను అప్పట్లో భారీ కుంభకోణంగా అభివర్ణించారు. ఈ భూములకు సంబంధించిన వివా దం ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన భారీ కుంభకోణాల్లో ఐఎంజీకి చేసిన భూముల కేటాయింపు వ్యవహారం మొదటిస్థానంలో ఉంటుంది. విన్స్టన్ చర్చిల్తో ప్రారంభం రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఇంగ్లండ్ ప్రధాన మంత్రిగా విన్స్టన్ చర్చిల్ కొనసాగుతున్నప్పుడు ‘ఆపద్ధర్మ ప్రభుత్వం’అన్న పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన చర్చిల్ తన పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలన్న ఉద్దేశంతో ఇంగ్లండ్ రాజుకు తన రాజీనామాను సమర్పించారు. తర్వాత ఇంగ్లండ్ రాజు చర్చిల్‌ను పిలిచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కార్యనిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని చెప్పి దానికి ‘కేర్‌టేకర్ గవర్నమెంట్ (ఆపద్ధర్మ ప్రభుత్వం)’గా నామకరణం చేశారు. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోరాదని నిర్ణయించారు. నాడు పోట్స్డామ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న చర్చిల్ తనతోపాటు ప్రతిపక్ష పార్టీ నేతను కూడా తీసుకెళ్లి.. ఆపద్ధర్మ ప్రభుత్వం నడవాల్సిన తీరు ఇదేనంటూ ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పుట్లో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. -
ఎందుకీ ముందస్తు..?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో ఎందుకీ ముందస్తు ఎన్నికలు? గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రతి ఒక్కరినీ తొలుస్తున్న ప్రశ్న. గురువారం అసెంబ్లీ రద్దు ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఎక్కడ, ఏ నలుగురు కలిసినా దీనిపైనే చర్చోపచర్చలు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారికి సానుకూల ఫలితాలు రాలేదని తెలిసినా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ రద్దువైపే మొగ్గు చూపారంటే దాని వెనుక బలమైన కారణాలు ఉండి ఉండొచ్చంటూ విశ్లేషణలు. టీఆర్ఎస్ను కలసికట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ప్రతిపక్షాలు అందుకు సిద్ధమ య్యేలోగా దెబ్బకొట్టేందుకే సీఎం ‘ముందస్తు’బరిలోకి దూకారని కొందరు భావిస్తుండగా వివిధ పథకాలపై వ్యక్తమవుతున్న ప్రజా సంతృప్తిని వెంటనే ఓట్లుగా మలుచుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత లోక్‌సభ ఎన్ని కల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో పుంజుకుంటున్నట్లు వార్తలు వెలువడటం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక రాహుల్ గాంధీపట్ల ప్రజాదరణ పెరగడం వంటి పరిణామాలు కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఓ కారణమై ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారాస్త్రాలుగా పథకాలు ... ఉద్యమ పార్టీగా తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్... ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీల అమల్లోనూ విజయవంతమైందనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. కొన్ని హామీలు అమలు కాలేదనే విమర్శలున్నా 24 గంటల నిరంతర విద్యుత్ టీఆర్ఎస్కు ఉన్న సానుకూల అంశాల్లో అత్యంత ఎక్కువ ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అలాగే రైతు బంధు పథకం ద్వారా 34 లక్షల మంది రైతాంగానికి ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి రాయితీ ప్రకటించి అమలు చేయడం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా సదుపాయం కల్పించడం వంటి అంశాలు పెద్ద ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడుతాయని టీఆర్ఎస్ భావిస్తోంది. డబుల్ బెడ్రూం, మిషన్ భగీరథ వంటి పథకాలు ఇంకా పూర్తి కాకున్నా మళ్లీ అధికారంలోకొస్తే వాటిని త్వరగా పూర్తి చేస్తామని ప్రజలను ఒప్పించగలమన్న ధీమాతో కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకూడదనే... ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని భావించిన టీఆర్ఎస్... ఆయా పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు సమయం ఇవ్వకూడదనే ముందస్తుకు మొగ్గుచూపిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో అనుకూల ఫలితాలు వచ్చినా ఆయా సర్వేల్లో పార్టీ గెలిచే సీట్ల సంఖ్య కాస్త తగ్గుతూ రావడం సీఎంకు ఆందోళన కలిగించిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సర్వే సంస్థ నిర్వాహకుడు చెప్పారు. మరిన్ని సీట్లు తగ్గేదాకా ఆగడంకంటే ప్రజాదరణ ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరమని కేసీఆర్ భావించి ఉంటారని ఆ నిర్వాహకుడు అభిప్రాయపడ్డారు. కోదండరాం సహా కొందరు తెలంగాణ ఉద్యమకారుల విమర్శలూ సీఎం ‘ముందస్తు’కు కారణమని తెలుస్తోంది. అలాగే ముందస్తు ఎన్నికల్లో విజయం సాధిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారని ఓ నేత పేర్కొన్నారు. -
ప్రతిపక్షానికి సవాల్!
1994లో అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎన్.టి.రామారావు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రయోగాత్మకంగా 33 శాతం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇప్పుడు టీఆర్ఎస్ 91 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి దేశ రాజకీయాల్లో అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందో తెలియకుండానే ఒకేసారి 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. 1994లో అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎన్.టి.రామారావు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రయోగాత్మకంగా 33 శాతం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇప్పుడు టీఆర్ఎస్ 91 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. గురువారం ప్రకటించిన జాబితాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన అందరికీ టిఆర్ఎస్ టికెట్లు కేటాయించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ప్రాతి నిధ్యం వహిస్తున్న హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ఎంపిక చేయలేదు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ 2014లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేఎల్పీనేత కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గానికీ అభ్యర్థిని ప్రకటించలేదు. సాహసోపేత నిర్ణయమే... ప్రస్తుత శాసనసభ్యుల్లో (ఇప్పటివరకు ప్రకటించిన జాబితాను అనుసరించి) ఇద్దరికి మినహా అందరికీ టికెట్లు కేటాయించి టీఆర్ఎస్ నాయకత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై కొంత వ్యతిరేకత, మరికొందరిపై తీవ్ర వ్యతిరేకత ఉంటుందని, వాటిని అధిగమించడానికి టీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొంత ప్రతికూలతకు దారి తీసే అవకాశం లేకపోలేదని వారంటున్నారు. వివాదాస్పదులుగా ముద్రపడిన కొందరు ఎమ్మెల్యేలకూ టికెట్లు కేటాయించడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. మహిళా కలెక్టర్పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, భూవివాదాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గత నాలుగేళ్లలో నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వెళ్లి వస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నాయకత్వం టికెట్లు ఖరారు చేసింది. కాగా, జాబితాలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ పెద్దపీట... గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన 25 మంది ఎమ్మెల్యేలకూ కేసీఆర్ టికెట్లు కేటాయించారు. అదే సమయంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారెవరికీ ఈసారి టికెట్లు ఇవ్వలేదు. అయితే ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారారన్న అపవాదు మూటగట్టుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని, దాన్ని కూడా టీఆర్ఎస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించే అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు నిరాకరిస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ అధిష్టానం ఈ పని చేసి ఉంటుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు,. ఏదేమైనా టీఆర్ఎస్ నాయకత్వం టికెట్లు ఖరారు చేయడంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం కనబరిచిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. బాల్క సుమన్‌కే అవకాశం... రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావించిన అర డజను మంది ఎంపీలకు నిరాశే ఎదురైంది. కేవలం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు మాత్రమే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లభించింది. సుమన్ చెన్నూరు నుంచి పోటీ చేయనున్నారు. కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశపడ్డ రాష్ట్ర రైతు సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కూడా అవకాశం దక్కలేదు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లేదా మునుగోడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు దక్కాయి. చోటు దక్కని దానం... టీఆర్ఎస్లో ఇటీవలే అట్టహాసంగా చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. అయితే ఆయన టికెట్ ఆశిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని మాత్రం కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. అక్కడ నుంచి పోటీ చేయాలని ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ మంత్రి పి. జనార్దన్‌రెడ్డి కుమార్తె విజయ సైతం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ నాగేందర్‌కు టికెట్ ప్రకటిస్తే విజయ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం ఆమెకు టికెట్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వారిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోకపోవడం వల్లే సీటును కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. సామాజిక వర్గాల వారీగా టికెట్లు ఇలా... 34 - రెడ్డి 21 - బీసీ 16 - ఎస్సీ 12 - ఎస్టీ 11 - వెలమ 06 - కమ్మ 02 - ముస్లిం 01 - బ్రాహ్మణ 01 - వైశ్య 01- సిక్కు లక్కీ 6 సీఎం కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు అని అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే అసెంబ్లీ రద్దుకు ఆయన 6వ తేదీనే ఎంచుకోగా సీఎం ప్రకటించిన 105 మంది ఎన్నికల అభ్యర్థుల జాబితాలోని సంఖ్యలను కూడితే వచ్చేదీ ఆరే కావడం విశేషం. ఈ ఎనిమిదింటా.. సస్పెన్స్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించని ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ (ముషీరాబాద్), బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి (అంబర్‌పేట), రాంచంద్రారెడ్డి (ఖైరతాబాద్), రాజాసింగ్ (గోషామహల్) స్థానాలతోపాటు ఎంఐఎం కీలకంగా భావించే చార్మినార్, మలక్‌పేట స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. ఇది రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ జాబితాలో ఎనిమిది స్థానాలు పెండింగ్ మరోవైపు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ మినహా మరెక్కడా అభ్యర్థులను తేల్చకపోవడంతో బీజేపీ–టీఆర్ఎస్ల మధ్య సఖ్యత ఉందంటూ గుసగుసలు మొదల య్యాయి. టీఆర్ఎస్ తొలి జాబితాలోనే అంబర్‌పేట నుంచి సుధాకర్‌రెడ్డి, కృష్ణ యాదవ్, కాలేరు వెంకటేష్‌లలో ఒకరు, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ లేదా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డిలలో ఒకరు, ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డిలలో ఒకరు, గోషామహల్లో దానం నాగేందర్ పేర్లను ప్రకటిస్తారని భావించారు. ఎంఐఎం సిట్టింగ్ స్థానమైన చార్మినార్‌లో గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైన ఇనాయత్ అలీని అక్కడి నుంచి బహదూర్‌పురాకు మార్చారు. చార్మినార్, మలక్పేటలకూ అభ్యర్థులను ప్రకటించకపోవడం వ్యూహంలోనే భాగంగానే భావిస్తున్నారు. మల్కాజిగిరి.. మళ్లీ మొదటికి..: మల్కాజిగిరి స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతిని ఎంపిక చేస్తూ బుధవారమే ఆమెకు సమాచారం ఇచ్చారు. గురువారం ఉదయం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఎంపీ మల్లారెడ్డి ఆమెను కాబోయే ఎమ్మెల్యేగానే పరిచయం చేశారు. అయితే ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు తన వర్గానికి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో రాజీనామా అస్త్రాన్ని సంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని నిలుపుదల చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఉదయం నుంచి ఉత్కంఠే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ రద్దవుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే మీడియా ప్రతినిధులు, కొందరు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, పోలీసులతో రాజ్‌భవన్ పరిసరాల్లో సందడి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచే అక్కడ మీడియా హడావుడి మొదలైంది. అప్పటి నుంచే ప్రత్యేక ప్రసారాలతో రాజ్‌భవన్ ప్రాంగణం హోరెత్తింది. కేబినెట్ తీర్మానం అనంతరం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వస్తారని తెలియడంతోనే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ తతంగం బయటి నుంచి చూడటానికి ఆసక్తిగా తరలివచ్చారు. మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం మంత్రులందరితో కలసి బస్సుల్లో రాజ్‌భవన్ చేరుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి ఒక్కరే తన కాన్వాయ్‌లో సరిగ్గా 1.28 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్నారు. తిరిగి 2.02 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్‌కు వెనుదిరిగి వెళ్లారు. మినిట్ టు మినిట్... ఉదయం... 9.00 గంటలు: రాజ్‌భవన్ చేరుకున్న మీడియా ప్రతినిధులు 10.00 గంటలు: రాజ్‌భవన్ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు 11.00 గంటలు: సీఎం వచ్చే విషయంపై టీవీ జర్నలిస్టుల విశ్లేషణలు మధ్యాహ్నం.. 12.00 గంటలు: సీఎం వస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది 12.20 గంటలు: గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది ఎలాంటి వాహనాలనూ లోనికి వెళ్లనివ్వలేదు. 12.31 గంటలు: పూర్తిగా గేట్లకు తాళాలు వేసిన సెక్యూరిటీ సిబ్బంది 1.19 గంటలు: రాజ్‌భవన్ రోడ్డుపై పోలీసుల అప్రమత్తం, ట్రాఫిక్ నిలిపివేత 1.20 గంటలు: సీఎం కోసం ఎదురుచూస్తుండగా బొప్పాని ఈశ్వర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అతనిని నిలువరించారు. 1.22 గంటలు: అమరులకు గుర్తింపు దక్కలేదని అందుకే తాను ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించానని ఈశ్వర్ మీడియాతో మాట్లాడాడు. 1.26 గంటలు: యువకుడిని ఆటోలో స్టేషన్‌కు తరలించిన పోలీసులు 1.28 గంటలు: రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ 2.02 గంటలు: రాజ్‌భవన్ నుంచి ప్రగతి భవన్‌కు వెనుదిరిగిన సీఎం కేసీఆర్. -
ఇద్దరికే సారీ!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు తాజా మాజీలకు మాత్రమే టికెట్లను నిరాకరించారు. చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు టికెట్ కేటాయించారు. ఆందోల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీనటుడు బాబూమోహన్‌కు టికెట్ ఇవ్వకుండా, అక్కడ జర్నలిస్టు సీహెచ్ క్రాంతికిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నల్లాల ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలను వెల్లడించలేదు. 2009 నుంచి ఇప్పటిదాకా రెండుసార్లు సాధారణ ఎన్నికల్లోనూ, ఒక ఉప ఎన్నికలోనూ ఆయన గెలిచారు. అయితే స్థానికంగా ఉన్న వ్యతిరేకత వల్లనే టికెట్ నిరాకరించినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. -
టికెట్లతోనే అయిపోదు.. గెలిచి రావాలి
సాక్షి, హైదరాబాద్: పార్టీ టికెట్లను ఇవ్వగానే పని పూర్తయినట్టు కాదని, ఎన్నికల్లో గెలిచి రావాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శాసనసభకు 105 మంది అభ్యర్థులను ప్రకటించిన అనంతరం గురువారం సాయంత్రం ఆయన అభ్యర్థులతో సమావేశమై పలు సూచనలు చేశారు. టికెట్లపై గందరగోళం, చివరి క్షణంలో అయోమయం ఉండకూడదనే అభ్యర్థులను ముందుగానే ప్రకటించామన్నారు. అభ్యర్థిత్వంపై అయోమయం అవసరంలేదని, గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులతో సమావేశమై, సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. పూర్తిగా నియోజకవర్గాల్లోనే ఉంటూ, ప్రజలతో కలిసి గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు. పార్టీ అభ్యర్థుల పనితీరు, వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తానని, లోపాలు ఉంటే సరిచేసుకోవాలన్నారు. అహంకారం, గర్వం లేకుండా పనిచేసుకోవాలని, ఈ నెల 15లోగా మరోసారి సమావేశం ఉంటుందని చెప్పారు.