child marriage
-
ముస్లిం వివాహాలు, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: అసెంబ్లీలో బిల్లు
ముస్లిం వివాహాలు, విడాకుల విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ముస్లిం వివాహాలు, విడాకులను రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ రూపొందించిన కొత్త బిల్లును అస్సాం కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.‘అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్యేజ్ అండ్ డివర్స్ బిల్లు-2024’ను ప్రభుత్వం అసెంబ్లీ ప్రవేశపెట్టగా.. మెజార్టీ సభ్యుల అంగీకరంతో ఆమోదం పొందింది. దీని ద్వారా బ్యాల వివాహాలను నిషేధించడం వీలవుతుందని సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఖాజీలు లేదా మతపెద్దలు ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేసేవారని, ఇకపై అలా కుదరదని తెలిపారు. కొత్త బిల్లు ప్రకారం ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా జరుగుతుందన్నారు.కాగా, వధువు 18 ఏళ్లు నిండకపోయినా.. వరుడికి 21 ఏళ్లు రాక ముందే.. ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలను ముస్లిం వివాహాల చట్టంలో కలిగి ఉంది. అయితే కొత్త చట్టం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ముస్లిం మైనర్ బాలికలు తమ వివాహాన్ని నమోదు చేసుకోలేరని సీఎం తెలిపారు.ఇంతకముందు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేసింది. అయితే ఖాజీ వ్యవస్థను పునరుద్ధరించాలని అస్సాంలోని పలు ముస్లిం సంస్థలు ముఖ్యమంత్రిని అభ్యర్థించాయి. -
బాల్య వివాహాల్లో కర్ణాటక ఫస్ట్
సాక్షి, అమరావతి: దేశంలో కర్ణాటక, అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. 2022లో దేశంలో 1002 బాల్య వివాహాలు జరిగినట్లు ఆమె తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని నిరోధించేందుకు చట్ట ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఏపీలో 2022లో కేవలం 26 బాల్య వివాహాలు నమోదయ్యాయని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా బాల్య వివాహాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంది. రక్తహీనత సమస్యను అధిగమిస్తే బాల్యవివాహాలను నివారించడం సాధ్యమనే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాల్యవివాహాలు చేసే అవకాశం ఉన్న వారికి ముందుగానే గుర్తించి, నివారించడంతో పాటు కేసులు కూడా నమోదు చేసింది. -
కర్నూలు: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్‌గా
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్.నిర్మల. బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్ఎస్సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం. నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. Congratulations to Ms. G. Nirmala from Kasturba Gandhi Balika Vidyalaya (KGBV), Kurnool, a residential girls’ school run by the Ministry of Education for the disadvantaged sections in India, for securing the top spot in the 1st Year Intermediate exam of Andhra Pradesh… pic.twitter.com/OVqEX0frQL — Ministry of Education (@EduMinOfIndia) April 13, 2024 -
బాల్య వివాహాలకు ముగింపు
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఏడాది ఒక్కో నెలలో వందకు పైగా బాల్య వివాహాలపై ఫిర్యాదుల రాగా.. ఈ ఏడాది జనవరి నెలలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి నెలలో 60 బాల్య వివాహాలపై ఫిర్యాదులు రాగా.. అందులో 57 బాల్య వివాహాలను ప్రభుత్వం నివారించింది. ఏలూరు జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు బాల్య వివాహాలు మాత్రమే జరగ్గా.. అందులో రెండు వివాహాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 26 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో మాత్రమే జనవరి నెలలో ఫిర్యాదులు వచ్చాయి. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. బాల్య వివాహాలపై 1098 హెల్ప్‌లైన్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా ఫిర్యాదులు రాగానే సంబంధిత శాఖల సిబ్బంది అప్రమత్తమై రంగంలోకి దిగుతున్నారు. గ్రామస్థాయి నుంచే పటిష్ట చర్యలు బాల్య వివాహాల నివారణకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో బాల్య వివాహాల నిషేధ, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. బాల్య వివాహాల నివారణకు సంబంధించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. యుక్త వయసులో ఉన్న బాలికల తల్లిదండ్రులకు బాల్య వివాహాలు వల్ల ఉత్పన్నమయ్యే చెడు ప్రభావాలపై అవగాహన సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాల నివారణలో భాగంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాకు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన విధించారు. బాల్య వివాహాల నిరోధించడంపై రోజువారీ, నెలవారీ చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి. గత నెలలో ఫిర్యాదులు గణనీయంగా తగ్గడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. బాల్య వివాహాల నివారణకు నెలవారీ క్యాలండర్ ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ (ఆడపిల్లను రక్షించండి. ఆడపిల్లలకు చదువు చెప్పండి) పథకం కింద జిల్లాల వారీగా రూ.5.56 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులతో బాలికల విద్యతో పాటు బాల్య వివాహాల నివారణకు అవసరమైన కార్యకలాపాలను నెలవారీ క్యాలెండర్‌గా నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద ఆడ పిల్లలకు విద్యనందించడం, లింగ వివక్షను నివారించడం, ఆడ పిల్లల రక్షణ, సంరక్షణ, బాల్య వివాహాల నివారణ కార్యకలాపాలను జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు బాల్య వివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ప్రతినెలా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. -
ఈ నెలలో ఇప్పటి వరకు 85 బాల్య వివాహాలకు చెక్
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక దృష్టి సారించడం ఫలితాలనిస్తోంది. గత నెలలో 159 బాల్య వివాహాలను నివారించిన ప్రభుత్వ యంత్రాంగం.. ఈ నెలలో ఇప్పటి వరకు 85 బాల్య వివాహాలను నివారించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాల వారీగా బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే హాట్స్పాట్లను గుర్తించి అక్కడ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, అక్షయ తృతీయ, శ్రావణ, మాఘ మాసాలు మొదలైన శుభ సందర్భాల్లో బాల్య వివాహాలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాల నివారణకు జారీచేసిన మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి, అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 15–18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలను, 15–21 సంవత్సరాల వయస్సు గల బాలురను గుర్తించి వారిని ఓపెన్ స్కూల్స్, ఇంటర్, ఇతర దూరవిద్య కార్యక్రమాల్లో చేర్పించాలని సీఎస్ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల బయట ఉన్న కౌమార బాలికలను గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇప్పించాలని చెప్పారు. బాల్య వివాహాల నిషేధ అధికారులు ప్రతి మూడు నెలలకోసారి సమీక్షలు నిర్వహించాలని, బాల్య వివాహాల నివారణతో పాటు బాలల హక్కులు, బాలల రక్షణ సమస్యలపై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. -
బాల్య వివాహం నుంచి బాలికకు విముక్తి
ఏలూరు(మెట్రో): ఫేస్బుక్ ద్వారా కలెక్టర్‌కి వచ్చిన సమాచారం మేరకు బాల్య వివాహం నుంచి ఓ బాలికకు విముక్తి కలిగింది. స్థానిక చెంచుల కాలనీలో బాల్యవివాహానికి పెద్దలు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు వెంటనే స్పందించిన కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ చర్యలు చేపట్టారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణి చైల్డ్ హెల్ప్‌లైన్ బృందం సమన్వయంతో అంగన్వాడీ వర్కర్ సహకారంతో బాలిక ఇంటికి చేరుకొని విచారణ చేశారు. బాలిక తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోగా, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటినుంచి బాలిక తన అక్క, అన్నతో కలిసి నానమ్మ ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. కూలీ పని చేసుకొనే నానమ్మ, తాతయ్య ఆమెకు వివాహం చేయాలని భావించి ఓ అబ్బాయితో నిశ్చితార్థం చేయించారు. మరో నాలుగు రోజుల్లో వివాహ తేదీని నిర్ణయిస్తారని తెలిసిన బాలిక తనకు తెలిసిన వారి ద్వారా విషయాన్ని ఫేస్బుక్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. బాలిక నానమ్మ, తాతయ్యలకు కౌన్సెలింగ్ నిర్వహించి, బాల్యవివాహా ప్రక్రియను రద్దు చేయాలని డీపీపీఓను ఆదేశించారు. అలాగే బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లి ఆమెకు అడ్మిషన్ ఇప్పించడంతో పాటు చదువుకు కావాల్సిన అవసరాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సొంత ఖర్చులతో ఆ బాలికకు సైకిల్, బ్యాగ్, పుస్తకాలు, యూనిఫాం మొదలైనవి కలెక్టర్ సమకూర్చారు. బాలికకు ధైర్యం చెప్పి జీవితంలో ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. డీసీపీవో సీహెచ్ సూర్యచక్రవేణి, సిబ్బంది రాజేష్, శ్రీకాంత్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది రాజు, ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
చిన్న వయసులోనే గర్భం..తల్లీ, బిడ్డకు ప్రాణపాయం
ఓ వైపు బాగా చదువుకున్న అమ్మాయిలు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. దీనికారణంగా 40 దాటే వరకూ పిల్లలు కలగక ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు పదహారేళ్లు నిండకముందే కొందరు అమ్మాయిలు తల్లులవుతున్నారు. పరస్పర ఈ వైరుధ్యం పలువురు వైద్యులు, నిపుణులను విస్మయపరుస్తున్న అంశం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు వస్తున్న గర్భిణుల్లో 3 శాతానికి పైగా మైనర్ అమ్మాయిలు వస్తున్నట్టు తేలింది. బాల్యవివాహాల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 458 మంది మైనర్ అమ్మాయిలు గర్భం దాల్చారు. ఇందులో 16 ఏళ్లలోపు అమ్మాయిలు 107 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.శ్రీసత్యసాయి జిల్లాలోనూ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. మొత్తం ప్రసవాల్లో 3.23 శాతం మైనర్లవే కావడం గమనార్హం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో మైనార్టీ తీరని అమ్మాయిలు ప్రేమ– పెళ్లి బాట పడుతున్నారు. ప్రతిబంధకంగా బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయి అంటేనే భారంగా భావిస్తున్నారు. అందుకే 15 ఏళ్లకే పెళ్లి చేస్తున్నారు. రాయదుర్గం, మడకశిర, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పదో తరగతి చదువుతూండగానే పెళ్లి చేస్తున్నారు. బాగా చదువుకుని కెరీర్లో స్థిరపడాల్సిన సమయంలో వారికి పెళ్లి తీవ్ర ప్రతిబంధకంగా మారుతోంది. నిఘా పెట్టినా ఆగడం లేదు స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలను అడ్డుకుంటున్నా మరోవైపు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. బాల్యవివాహాలు కుదిర్చిన పెద్దలు, ఇరువురు తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడే అవకాశమున్నా కొన్ని ప్రాంతాల్లో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చైల్డ్‌లైన్ 1098, హెల్ప్‌లైన్ 181, డయల్ 100కు ఫోన్ చేస్తే పెళ్లిళ్లు ఆపేస్తారు. దీన్ని వినియోగించుకోవాలని ఐసీడీఎస్ అధికారులు కోరుతున్నారు. = ‘అనంత’ జిల్లాలో 4 మాసాల్లో 458 ‘మైనర్’ ప్రెగ్నెన్సీలు = ఇందులో పదహారేళ్లలోపు అమ్మాయిలు 107 మంది = శ్రీసత్యసాయి జిల్లాలో మరింత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు = చిన్న వయసులోనే గర్భం దాలుస్తున్న యువతులు 3.23 శాతం = అమ్మాయిలను వెంటాడుతున్న సామాజిక మాధ్యమాల దు్రష్పభావం బాల్యవివాహాలతో భారీ నష్టం = చదువు ఆగిపోయి కెరీర్ అర్ధంతరంగా ముగుస్తుంది = చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల బరువు తక్కువ పిల్లలు పుట్టే అవకాశం = చిన్న వయసులో తల్లి కావడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది = ప్రీ మెచ్యూర్ అంటే 9 నెలలకు ముందే పిల్లలు పుట్టే అవకాశం = దీనివల్ల కాన్పు సమయంలో తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ ప్రాణాపాయం కౌన్సెలింగ్ ఇస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో 15 ఏళ్లు దాటగానే అమ్మాయిలను తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ముందస్తుగా పెళ్లి చేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. మరికొన్ని చోట్ల సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై యువతీ యువకులు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్‌ల ప్రభావం ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. –శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
45 ఏళ్ల వరుడు..13 ఏళ్ల వధువు.. బాలికను తీసుకుని పరార్
సాక్షి, నవీపేట (నిజామాబాద్ జిల్లా): జిల్లాలోని నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అబ్బాపూర్ (బి) తండాలో ఓ తండ్రి రూ.60 వేలకు ఆశపడి 13 ఏళ్ల తన కూతురుకు బాల్య వివాహం జరిపించేశాడు. గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బాలిక తండ్రిని నిలదీయడంతో అప్పటికే పెళ్లికొడుకు బాలికతో కలిసి పరారయ్యాడు. ఫకీరాబాద్ గ్రామానికి చెందిన మలావాత్ సాయెబ్‌రావ్ (45)కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాపూర్ (బి) తండాకు చెందిన ఓ వ్యక్తి తన కూతుర్ని సాయెబ్రావ్కు ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను సాయెబ్‌రావ్ వద్ద నుంచి రూ.60 వేలను బాలిక తండ్రి తీసుకున్నాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఇరువురు బంధువుల సమక్షంలో బాలికకు పెళ్లి జరిపించేశారు. అయితే బాల్యవివాహం గురించి తెలుసుకున్న గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వెళ్లి బాలిక తండ్రిని, పెళ్లిపెద్దలను నిలదీయగా వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆ యువకులు హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు, ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చారు. ఈలోగా సాయెబ్‌రావ్ బాలికను తీసుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న డీసీపీవో చైతన్యకుమార్, చైల్డ్‌హెల్ప్‌లైన్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ జ్యోత్స్నదేవి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి గ్రామానికి వెళ్లి విచారించారు. బాలిక తండ్రి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయెబ్రావ్తో పాటు పెళ్లికి సహకరించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై జీపీ కార్యదర్శి షేక్ అహ్మద్ పాషా ఫిర్యాదు చేశారు. -
ఆరో తరగతిలోనే పెళ్లి.. చదువు వద్దన్న తండ్రి.. తగ్గేదేలేదన్న భార్య
'పట్టు పట్టరాదు పట్టి విడువరాదు.. పట్టెనేని బిగియ పట్టవలయు..' అనే వేమన పద్యం అందరికీ తెలిసే ఉంటుంది. రాజస్థాన్‌కు చెందిన ఓ యువకునికి వేమన చెప్పిన మాటలు సరిగ్గా సరిపోలుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయత్నాన్ని విడువకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఈ కుర్రాడు. ఇంతకీ ఇతను ఏం సాధించాడు. విజయ సాధనలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటో తెలుసుకుందాం పదండి.. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల ఫలితాలు గత వారం విడుదలయ్యాయి. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవడానికి చాలా మంది అభ్యర్థులు పోటీ పడి విజయం సాధించారు. ఇందులో రాజస్థాన్‌కు చెందిన యువకుడు రామ్‌లాల్ కూడా ఉన్నాడు. ఏకంగా 490 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే.. నీట్లో పాస్ అయినవాళ్లందరి ప్రయత్నం ఓ వైపు.. రామ్‌లాల్ కృషి మరో వైపు.. 11 ఏళ్లకే బాల్య వివాహం.. రామ్‌లాల్ చిత్తోర్‌గఢ్‌లోని ఘోసుండా ప్రాంతంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ యువకునికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా గొప్పగా సాధించాలనే కలలు కనేవాడు. చదువుల్లో మంచిగా రాణిస్తున్న ఇతనికి 11 ఏళ్లకే బలవంతంగా బాల్య వివాహం చేశారు కుటుంబ సభ్యులు. అప్పుడు అతను కేవలం 6వ తరగతి చదువుతున్నాడు. 11 ఏళ్లకు పెళ్లిపీటలెక్కిన రామ్‌లాల్ భార్య సహకారంతో.. తన కల నీరుగారిపోయిందనుకున్న రామ్‌లాల్‌కు భార్య సహకారం తోడయింది. ఆయన భార్య పదో తరగతి వరకు చదువుకుంది. పుస్తకం విలువ తెలిసిన ఆమె భర్తకు అండగా నిలబడింది. రామ్‌లాల్ తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. తన భర్త చదువుకోవడానికి పూర్తి తోడ్పాటును అందించింది. దీంతో రామ్‌లాల్ 10వ తరగతిలో 74 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం తనకు ఇష్టమైన సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అలుపెరుగని ప్రయత్నం.. 2019లో మొదటి సారి నీట్ పరీక్షను రామ్‌లాల్ రాశాడు. 720 మార్కులకు గాను 350 వచ్చాయి. మెరుగైన ఫలితాలు రాలేదు. కానీ ఏ మాత్రం క్రుంగిపోకుండా ప్రయత్నాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. కోటా నగరానికి చేరుకుని కోచింగ్ సెంటర్లో చేరి మెలుకువలు నేర్చుకున్నాడు. ఈ సారి 632 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్నాడు. 350 మార్కుల నుంచి ఐదో సారికి 632కి చేరుకున్నానని రామ్‌లాల్ చెబుతున్నాడు. కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించవచ్చని అంటున్నాడు. తన భార్య ఇచ్చిన సహకారాన్ని కొనియాడుతున్నాడు. ఇక నీట్ 2023 పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలోనే రామ్‌లాల్ దంపతులకు పాప పుట్టడం మరో విశేషం. ఇదీ చదవండి: 5 తరాలు, 85 మంది కుటుంబ సభ్యులు.. 102 ఏళ్ల బామ్మకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు -
నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా.. దిశా యాప్ ద్వారా బాలిక ఫిర్యాదు
సాక్షి,ఏలూరు టౌన్: తనకు చదువుకోవాలని ఉన్నా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ ఓ బాలిక దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకుని.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన బాలికకు ఈనెల 8వ తేదీన వివాహం జరిపించేందుకు ఆమె తల్లిదండ్రులు ముహూర్తం నిర్ణయించారు. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పినా పెద్దలు వినకపోవడంతో.. ఆమె ఆదివారం ఉదయం 9.37 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన దిశ సిబ్బంది సమీపంలోని తడికలపూడి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకన్న, సిబ్బందితో కలిసి 10 నిమిషాల్లోనే బాలిక ఇంటికి చేరుకొని.. ఆమెను విచారించారు. ‘ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలని ఉంది. నా చదువు పూర్తయ్యాక మా అమ్మ, నాన్న చెప్పినట్లే చేస్తా’ అని ఆ బాలిక పోలీసులతో పాటు తన తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులు కూడా ఆ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. ఆమె చదువును మధ్యలోనే అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. బాలికకు పెళ్లి చేయడం నేరమని వివరించారు. మంచి మార్కులు తెచ్చుకుంటున్న ఆమెను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బాలిక సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు, దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: Odisha Train Accident: ఒక్కరు తప్ప అందరూ సేఫ్ -
బాల్య వివాహాలు చేసేవారిపై కేసులు పెట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసేవారిపై కేసులు పెట్టాలని జిల్లా ఎస్పీలను ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని బాల్య వివాహాలు రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఇటీవల కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న బాలలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడంతో వారి ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు దేశాభివృద్ధికి దోహదం చేసే యువశక్తి నిర్వీర్యమైపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్య వివాహాల వల్ల బాలల భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడుతుందని, మాతా, శిశు మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. -
అర్థరాత్రి రెండు గంటలకు దాడులు..భయాందోళనలో చిన్నారి పెళ్లికూతుళ్లు..
అస్సాంలో బాల్య వివాహాలను అణిచివేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర కేబినేట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దాడులు నిర్వహించారు. ఆఖరికీ అర్థరాత్రి రెండు గంటలకు తలుపు కొట్టడంతో ప్రారంభమైన దాడులు ఆ చిన్నారును తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఈ ఘటనలో చిన్నారులను పెళ్లి చేసుకున్న పలువురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియని ఆ చిన్నారి పెళ్లి కూతుళ్లు భయందోళనలతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ నెల రోజుల్లోనే పోలీసులు సుమారు 4 వేలకు పైగా కేసులు నమోదు చేశారు. ఈ దాడుల కారణంగా కొత్తగా మాతృత్వంలో అడుగు పెడుతున్న నిమి అనే బాల వధువు కన్నీళ్లతో చెక్కిళ్లు తడిచిపోయాయి. అప్పటి వరకు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న రెజీనా ఖాతున్ అనే మరో చిన్నారి నిస్సత్తువుగా చూస్తోంది. అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ దాడుల్లో భర్తల అరెస్టుతో బాల వధువులు ఆవేదనతో అక్కడి వాతావరణం అంతా విషాదంగా మారిపోయింది. ఒక్క శనివారమే పోలీసులు సుమారు రెండు వేల మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆ వివాహాలు జరిపించిన పూజారులను, ముస్లీం మత పెద్దలు కూడా ఉండటం గమనార్హం. వారిలో కొంతమంది పారిపోయి పెళ్లి చేసుకున్న మైనర్లు కూడా ఉన్నారు. అయితే ఆ బాల వధువలంతా ఇప్పుడూ మా పరిస్థితి ఏంటి మా పిల్లలను ఎవరూ పోషిస్తారు, ఎక్కడ తలదాచుకోవాలంటూ ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అలాగే వారిలో కొంతమంది పెళ్లి సమయానికి మైనర్లు కాదు, ఆధార్‌కార్డులో తప్పుగా నమోదు చేయడం జరిగిందని కొందరూ వాపోతున్నారు. ఆరోగ్య కార్యకర్తల నుంచి సేకరించిన ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా సాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో అనాధలుగా మారిన బాల వధువుల్లో కొందరికి తల్లిదండ్రుల మద్దతు లభించగా మరికొందరు అధికారుల సంరక్షణలో ఉన్నారు. బాల్యవివాహాలకు చెక్‌పెట్టడం కోసం జరిపిన దాడుల కారణంగా కొందరూ చిన్నారులు గర్భవతులుగా మరికొందరూ తమ పిల్లలతో అనాధలుగా రోడ్డున పడాల్సి వచ్చింది. ప్రస్తుతం వారంతా ప్రభత్వ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. అంతేగాదు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖలో జెండర్ స్పెషలిస్ట్ అయిన పరిమితా డేకా మాట్లాడుతూ..ఆ మహిళల పట్ల మాకు బాధ్యత ఉంది. ఇది సున్నితమైన వ్యవహారం అని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి శాంతించేలా చేయాలి. ఆ తర్వాత వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..) -
పుత్తడి బొమ్మకు పుస్తెల బంధనం
బడిలో బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన పుత్తడిబొమ్మలకు మూడుముళ్ల బంధనాలు వేసి వారి భవితను చిదిమేస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, అవగాహన లోపం, నిరక్షరాస్యత బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను వారికి వివరించి పుస్తెల భారం వేయకుండా పుస్తకాలతో చెలిమి చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 17 నుంచి 25వ తేదీలోపు అధికారులు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామసభలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్లినా..ఇంకా కొందరి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. నిరక్షరాస్యత, తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్నారేమో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లీడు రాకముందే వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లకు వయస్సు రాగానే తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని చూస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2012 నుంచి 2022 వరకు 589 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఉన్నత చదువులు చదివి తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని అనుకుంటున్న బాలికలకు కొంతమంది తల్లిదండ్రులు మూడుముళ్లతో బంధనాలు వేసి సంసార సాగరంలోకి తోసేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుస్తెలు వద్దు..పుస్తకాలే ముద్దు అంటూ ఒక వైపు ఊరూరా ప్రచారం చేస్తూ, మరో వైపు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను తల్లిదండ్రులకు సవివరంగా తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ బాల్య వివాహాలు ఎక్కువగా 13 సంవత్సరాల నుంచి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారికి జరుగుతున్నాయి. బాల్య వివాహాల జరుగుతున్న ప్రదేశాలకు అధికారులు వెళ్లి పెళ్లి అడ్డుకొని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వీటిపై అన్ని మండల కేంద్రాల్లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలపై ఈ నెల 17 వ తేదీ నుంచి 25 లోపు గ్రామ కమిటీల ఏర్పాటు, ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చైల్డ్‌లైన్ 1098, ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. 2012లోనే జీవో జారీ... బాల్య వివాహ నిరోధక చట్టం 2006కు సంబంధించిన జీవో నంబరు 13ను 2012 మార్చి 19న ప్రభుత్వం జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధానికి జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటును సూచించింది. జిల్లా స్థాయిలో కమిటీకి కలెక్టరు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్లుగా ఐసీడీఎస్ పీడీ, ఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వ్యవహరిస్తారు. డివిజన్ స్థాయిలో చైర్మన్‌గా ఆర్డీఓ, సీడీపీఓ, డీఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీకి చైర్మన్‌గా తహశీల్దారు, మెంబరు కన్వీనర్లుగా ఐసీడీసీ సూపర్వైజర్, ఎస్ఐ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఉంటారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ చైర్మన్‌గా, కన్వీనర్‌గా అంగన్వాడీ కార్యకర్త, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, గ్రామానికి చెందిన ఉపాధ్యాయడు, మహిళ వార్డు మెంబరు, ఏఎన్ఎం, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, యువజన సంఘం ప్రతినిధి, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు. బాల్య వివాహం నేరానికి శిక్ష.. బాల్యవివాహాన్ని ప్రోత్సహించే వారికి, చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. బాల్య వివాహాన్ని దాచేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ఆ వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. న్యాయమూర్తి ఉత్తర్వుల ఉల్లంఘన కింద నమోదయ్యే కేసుల్లో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాలను ఆపొచ్చు. ఈ చట్టం కింద నేరస్తులకు బెయిల్ లేని శిక్ష విధించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు...పిల్లల ప్రవర్తన కారణంగా.. చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడినవారు ఆర్థికంగా బలంగా ఉన్నవారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే.. అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. మరి కొందరైతే రకరకాల కారణాల ప్రభావంతో పిల్లలు పెడదారి పడుతున్నారని ఆలోచించి చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. అడ్డుకుంటున్నా ..ఆగడం లేదు బాల్య వివాహాలను మాతాశిశు సంరక్షణ అధికారులు అడ్డుకుంటున్నా వివాహాలు ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంత వరకు బాల్య వివాహాలు తగ్గినట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. -
పుట్టినరోజే వివాహ బంధనం నుంచి రేఖకు విముక్తి
ఆ అమ్మాయి వయసు 21 ఏళ్లు. బాగా చదువుతుంది. నర్సు కావాలన్నది ఆమె కల. కానీ, ఊహ తెలియని వయసులో పెద్దలు చేసిన పనికి.. నరకంలో పడింది. మానసికంగా కుమిలిపోయింది. చివరికి.. ఓ ఉద్యమకారిణి సహకారం, కోర్టు తీర్పుతో మొత్తానికి ఆటంకాలు తొలగి ఆమెకు ఇష్టంలేని వివాహ బంధనం నుంచి విముక్తి లభించింది. రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన రేఖ(21).. విచిత్రమైన పరిస్థితుల నడుమ జోధ్‌పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 2002లో అంటే.. ఏడాది వయసున్నప్పుడు రేఖను అదే ఊరికి చెందిన ఓ పిలగాడికి ఇచ్చి వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇంటి పెద్ద అనారోగ్యంతో.. బంధువుల ఒత్తిడి మేరకు ఈ చర్యకు ఉపక్రమించారు. అయితే.. ఆ తర్వాత ఆ పసికందు జీవితం సాఫీగానే సాగింది. ఈమధ్య.. కొన్నాళ్ల కిందట అత్తింటి వాళ్లమంటూ కొందరు రేఖ ఇంటికి రావడంతో.. ఆమె షాక్ తింది. ఇన్నాళ్లూ విషయం తెలియకుండానే పెంచారు ఆమెను. దీంతో తల్లిదండ్రులు, చుట్టాల ఒత్తిడి మేరకు ఆమె బలవంతంగానే మెడలో తాళిబొట్టు వేసుకుని.. ఆ ఇంట కోడలిగా అడుగుపెట్టింది. అయితే.. అక్కడికి వెళ్లాక చదువుకోనీయకుండా భర్త, అతని తల్లిదండ్రులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో మానసికంగా కుమిలిపోయింది. మరోవైపు ఇన్నాళ్లపాటు వివాహం అయ్యిందనే విషయం దాచినందుకు.. తమ దగ్గరికి పంపనందుకు కుల పరిహారం పేరిట రేఖ తల్లిదండ్రుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేయసాగారు. ఈ పరిస్థితుల్లో.. రేఖకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృతి భారతి గురించి తెలిసింది. కృతి భారతి.. ప్రముఖ ఉద్యమకారణి. అంతేకాదు.. బీబీసీ అత్యంత స్ఫూర్తిదాయకమైన 100 మహిళల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్న వ్యక్తి కూడా. ఆమె సాయంతో జోధ్‌పూర్ ఫ్యామిలీకోర్టులో వివాహ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది రేఖ. ఆ కుటుంబం నుంచి విముక్తి కలిగిస్తూ.. చదువుకోవాలనే తన ఆశయానికి సాయపడాలంటూ కోర్టును వేడుకుంది. దీంతో.. బాల్యవివాహంగా పరిగణిస్తూ.. నేరంగా పేర్కొంటూ న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఆమె పుట్టినరోజు నాడే తీర్పు రావడం. దీంతో ఇష్టం లేకుండా.. అదీ తనకు ఊహతెలియని వయసులో జరిగిన వివాహ రద్దు తీర్పు కాపీలను ఆమె కానుకగా కృతి నుంచి అందుకుంది. ఇదీ చదవండి: ఇది కథ కాదు.. 75 ఏళ్లకు కలిసిన రక్తసంబంధం -
కొడుక్కి బాల్య వివాహం.. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై కేసు నమోదు
సాక్షి, చిత్తూరు: కుమారుడికి బాల్య వివాహం చేసిన ఘటనలో తిరుపతి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాల్య వివాహ చట్టం కింద రిజిస్ట్రార్‌పై రాధే శ్యామ్, శ్రీదేవి దంపతులపై పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. శాంతి నగర్లో నివాసముంటున్న రిజిస్ట్రార్.. తిరుపతి రాఘవేంద్ర మట్టంలో మైనర్ అయిన తన కుమారుడికి మైనర్ బాలికతో వివాహం జరిపించారు. రిజిస్ట్రార్ రాధేశ్యామ్ పూర్వ సంప్రదాయ పద్దతిలో అయిదు రోజుల పెళ్లి జరిపించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించి. అటు అమ్మాయి తల్లిదండ్రులు వెంకటేవ్వర్లు శ్రావణ కుమారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత -
ఆమె వస్తే... పెళ్లి ఆగాల్సిందే
20 ఏళ్లు కూడా లేని కోయెల్ని ఆ ఊళ్లో అంతా విలన్‌గా చూస్తారు. చంపుతాం అన్నారు. అత్యాచారం చేస్తాం అని బెదిరించారు. కాని కోయల్ వినదు. భయపడదు. కోవిడ్ కాలంలో అనేక కారణాల వల్ల బాల్య వివాహాలు పెరిగిపోయాయి. ఆడపిల్లలు విలపిస్తున్నారు. సిలిగురి ప్రాంతంలో కోయెల్ తనలాంటి అమ్మాయిలతో కలిసి గస్తీ కాస్తోంది. బాల్యవివాహం జరిగే మంటపంలో ప్రత్యక్షమై ‘ఆపరా’ అని అంటోంది.ఆమె వస్తే పెళ్లి ఆగాల్సిందే. ‘తల్లిదండ్రుల ఆలోచన, నిస్సహాయత ఏదైనా కావచ్చు. కాని అది ఆడపిల్ల భవిష్యత్తును దెబ్బ తీసే విధంగా ఉండకూడదు’ అంటుంది 19 ఏళ్ల కోయెల్ సర్కార్. ఈ అమ్మాయి సిలిగురి (పశ్చిమ బెంగాల్) సమీపంలో ఉండే ఒక గ్రామంలో ‘వరల్డ్ విజన్ ఇండియా’ అనే ఎన్.జి.ఓతో కలిసి పని చేస్తుంది. ఆమె చేసే ప్రధానమైన పని బాల్య వివాహాలను నిరోధించడం. ఇందుకు ఆమెతో పాటు పని చేసే, ఆమె వయసు ఉండే మరో 25 మంది అమ్మాయిల దళం ఉంది. అందరూ రహస్య పోలీసుల కంటే సమర్థంగా తమ ఊళ్లో చుట్టుపక్కల పల్లెల్లో బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతాయా అని చూస్తూ ఉంటారు. ‘ఈ రెండేళ్లలో నేను 8 బాల్య వివాహాలను ఆపించాను’ అంటుంది కోయెల్. కాని పెద్దవాళ్లు ఊరికే ఉంటారా? పెద్దవాళ్లు అంటే ఎవరు? వధువు తల్లిదండ్రులు... వరుడి తల్లిదండ్రులు. మాకు లేని నొప్పి నీకెందుకు అని కోయెల్‌తో తగాదాకు వస్తారు. ‘ఇప్పటికి రెండుసార్లు మా ఇంటి మీదకు జనం దాడికి వచ్చారు. నన్ను, మా చెల్లెల్ని చంపుతాం అన్నారు. నన్ను రేప్ చేస్తాం అన్నారు. ట్యూషన్ నుంచి వస్తుంటే ఒకసారి నా మీద రాళ్ల దాడి జరిగితే సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లడమే మానేశాను. కాని బాల్య వివాహాలను ఆపడం మాత్రం మానలేదు’ అంటుంది కోయెల్. ఆమెకు ఈ పని ఇంత గట్టిగా చేయాలని ఎందుకు అనిపించింది? స్వీయ జీవితం నుంచే. ‘మా అమ్మకు 17 ఏళ్ల వయసులో 35 ఏళ్ల మా నాన్నతో పెళ్లి జరిపించారు. నేను పుట్టిన మూడేళ్లకు నన్ను. అమ్మను, చెల్లిని వదిలి మా నాన్న వెళ్లిపోయాడు. మా అమ్మకు ఎన్నో ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలు ఉండేవి. అన్నీ నాశనం అయ్యాయి. మేము చాలా కష్టాలు పడ్డాం. అలా ఎవరూ పడకూడదనే నా తపన’ అంటుంది కోయెల్. వెస్ట్ బెంగాల్లో బహుశా దేశంలో చాలా చోట్ల ఈ రెండేళ్లలో పరిస్థితి చాలా మారింది. మధ్యతరగతి, పేద వర్గాల ఆదాయం గండి పడింది. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా పిల్లను సాగనంపితే చాలు అనుకుంటున్నారు. కోవిడ్ కాలంలో పెళ్లిళ్లు జనం ఊసు లేకుండా జరిపించే వీలు ఉండటంతో అదీ ఒకందుకు మంచిదే అనుకుంటున్నారు. స్కూళ్లు మూతబడి, చదువు మానేసి, ఫ్రెండ్స్‌కు దూరమయ్యి ఇరవై నాలుగ్గంటలు ఇంట్లో ఉంటున్న ఆడపిల్లలు తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తున్నారు. అందుకని కూడా పెళ్లిళ్లకు తొందరపడుతున్నారు. ‘పెళ్లి తొందరలో అమ్మాయి తల్లిదండ్రులు ఎవరికో ఒకరికి కట్టబెడుతున్నారు. ఆ వెళ్లినచోట ఆ ఆడపిల్లలు ఏ మాత్రం సురక్షితంగా ఉండటం లేదు. సుఖంగా కూడా’ అంటుంది కోయెల్. ‘ఆడపిల్లను క్షేమంగా ఉంచలేమని, ప్రేమలో పడి ఎవరితోనైనా వెళ్లిపోతారని కూడా ఈ పని చేస్తున్నారు’ అంటుంది కోయెల్. అయితే తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నా ఆడపిల్లలు నిజంగా చదువుకోవాలని కోరుకుంటున్నారు. జీవితంలో ఏదో ఒక మేరకు స్థిరపడాలనుకుంటున్నారు. అందుకే పెళ్లి సంబంధం చూడగానే కోయెల్‌కు ఉప్పందిస్తున్నారు. కోయెల్ తన దళంతో వెళ్లి పెళ్లి ఆపు చేస్తోంది. ‘పెళ్లి ఆపించి ఊరుకోవడం లేదు. అలాంటి ఆడపిల్లల స్వయం ఉపాధికి లేదా తల్లిదండ్రుల ఉపాధికి ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నాం.’ అంటుంది కోయెల్. బాల్య వివాహాలు ఆపడమే కాదు నేపాల్ సరిహద్దుకు దగ్గర కాబట్టి చైల్డ్ ట్రాఫికింగ్ జరక్కుండా కూడా అడ్డుకునే పని కోయెల్ దళం చేస్తోంది. ‘అమ్మాయిలను ఏమార్చేవారు పెళ్లి కొడుకుల వేషంలో వస్తుంటారు’ అంటుందామె. ఆడపిల్లల గురించి ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహక చర్యలు చేపట్టినా తల్లిదండ్రుల అండ లేకపోతే వాళ్లు ముందుకు పోరు. తల్లిదండ్రులు విఫలమైన చోట కోయెల్ వంటి సామాజిక కార్యకర్తలు కావాలి. తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు కలిసి పని చేస్తే ఏ ఆడపిల్లకు కూడా పరిణిత వయసుకు ముందే అనవసర పెళ్లిళ్లు జరగవు. అక్కర్లేని సమస్యలు రావు. -
వివాదాస్పద చట్టంపై రాజస్థాన్ సర్కార్ యూటర్న్
జైపూర్: వివాదాస్పదమైన బాల్య వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని చేసిన చట్టంపై రాజస్థాన్ ప్రభుత్వం వెనక్కుతగ్గింది. తప్పనిసరి రిజిస్ట్రేషన్ల వివాహ(సవరణ)బిల్లు-2021ను రాజస్థాన్‌లో గత నెల అసెంబ్లీలో ఆమోదించిన విషయం తెలిసిందే. మైనర్ల వివాహాలు సహా అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సవరణ చట్టం తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం ద్వారా బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. దీంతో గవర్నర్ వద్ద ఉన్న ఈ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు సీఎం అశోక్ గెహ్లోత్ పేర్కొన్నారు. చట్టాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ బాల్య వివాహాలను తమ ప్రభుత్వం అరికడుతుందని సీఎం తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే సవరణ చట్టాన్ని తీసుకువచ్చామని కానీ, నిరసన వ్యక్తమవటం వల్ల వెనక్కు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన చట్టం ప్రకారం 18 ఏళ్లకు తక్కువగా ఉన్న యువతలు, 21 ఏళ్లకు తక్కువ ఉన్న యువకులకు సంబంధించిన వివాహాలను రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. బల్యవివాహాలను తగ్గించాలనే ఉద్దేశంలో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇక రాజస్థాన్‌లో బాల్యవివాహాల సంఖ్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే. -
Jharkhand Radha Pandey: హ్యాపీ న్యూస్.. రాధ పెళ్లి ఆగింది
ఇప్పటి వరకు బాల్యవివాహాలను అడ్డుకున్న ఎంతో మంది సామాజిక కార్యకర్తలను చూశాం. ఇప్పుడు తన వివాహాన్ని తానే అడ్డుకున్న ఓ బాలికను చూస్తున్నాం. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక తన పెళ్లిని తనే స్వయంగా ఆపి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్న ఆ బాలిక పేరు రాధాపాండే. రాధను అభినందిస్తున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్ ఘోలప్ కొడెర్మా జిల్లా మధుబన్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల రాధాపాండేకు.. ఆమె తల్లిదండ్రులు పక్క ఊరి వరుడితో వివాహం నిశ్చయించారు. ఈ పెళ్లి జూన్ 23 జరగాల్సింది. అయితే మే నెలలో ఆ విషయం తెలుసుకున్న రాధ ‘ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, పెళ్లి ఆపేయమని తల్లిదండ్రులు, బంధువులను కోరింది’. కానీ పెద్దలు ఎవరూ తనకు సహకరించకపోగా పెళ్లికి సిద్ధపడు అని బెదిరించారు. తన తల్లిదండ్రులను ఒప్పించలేక, వరుడి తండ్రి దగ్గరకు వెళ్లి ‘తనకు చదువుకోవాలని ఉందని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, పెళ్లిచేసుకుంటే తన కలలన్నీ చెదిరిపోతాయని’ చెప్పి... ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది. కానీ ఆయన మనసు కూడా రాధ వేడుకోలుకు కరగలేదు. కేఎస్‌సీఎఫ్.. ఇదే సమయంలో మధుబన్ పంచాయితీలో బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ వివిధ కార్యక్రమాలతో యాక్టివ్‌గా ఉండే కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (కేఎస్‌సీఎఫ్) గురించి రాధ తెలుసుకుంది. వెంటనే వాళ్లను కలిసి తన బాధ వెళ్లబోసుకుని, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపించమని అభ్యరి్థంచింది. దీంతో కేఎస్‌సీఎఫ్ బృందం రాధ తల్లిదండ్రులను కలిసి వారు తలపెట్టిన బాల్యవివాహాన్ని ఆపాలని చెప్పారు. మొదట్లో రాధ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పద్దెనిమిదేళ్లు రాకుండా పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పడంతో, పోలీసులకు భయపడి ఎట్టకేలకు ఒప్పుకున్నారు. వరుడి కుటుంబంతో చర్చించి పెళ్లి రద్దు చేశారు. అంతేగాక రాధకు మైనారిటీ తీరేంత వరకు పెళ్లి చేయబోమని కూడా మాట ఇచ్చారు. దీంతో రాధ పెళ్లి ఆగిపోయింది. జిల్లాకు అంబాసిడర్... రాధ పెళ్లి విషయం, ఆమెకు బాలల హక్కులు, బాల్యవివాహాలపై ఉన్న అవగాహనతో ధైర్యంగా ఎదుర్కొన్న తీరు తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్ఘోలప్ ఎంతో సంతోషించారు. ఆయన రాధను అభినందించి, ఆమెను జిల్లాలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడే అంబాసిడర్‌గా నియమించారు. ‘ముఖ్యమంత్రి సుకన్య’ ప్రభుత్వ పథకం కింద నెలకు రెండు వేల రూపాయలను కూడా జారీ చేయించారు. అంతేగాక రాధ కుటుంబానికి రేషన్ కార్డు, ఉచిత వైద్య సదుపాయం, పెన్షన్ వంటి సదుపాయాలను కలి్పంచారు. ప్రభుత్వ ప్రోత్సాహం, కేఎస్‌సీఎఫ్ ఆధ్వర్యంలో రాధ ఇప్పుడు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ తనలాంటి ఎంతో మంది అమ్మాయిలను కాపాడుతోంది. బాగా చదువుకుని భవిష్యత్‌లో మంచి టీచర్‌ను అవుతానని రాధ చెప్పడం విశేషం. ప్రతి బాలికలోనూ రాధలాంటి తెగువ, అవగాహన ఉంటే బాల్యవివాహాలు కనుమరుగు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. చదవండి: "Kidnap And Wed": ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే! -
బాల్య వివాహం.. కౌన్సెలింగ్ ఇస్తుండగా జంట పరార్..
సాక్షి, తొర్రూరు(వరంగల్ రూరల్) : బాల్య వివాహం జరగగా, జంటకు కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో పారిపోయిన ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంట తండాలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన మైనార్టీ తీరని బాలికతో అదే తండాకు చెందిన బాలుడికి వివాహం జరిగింది. ఈ మేరకు చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసులు వెళ్లి బాల్య వివాహం వల్ల భవిష్యత్‌లో వచ్చే నష్టాలపై వివరిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇప్పటికే తప్పు జరిగినందున, సరైన వయస్సు వచ్చిన తర్వాతనే వారిద్దరు కలిసి ఉండేలా చూడాలని సూచించారు. ఇలా కౌన్సెలింగ్ ఇస్తుండగానే వారిద్దరు ఇంటి నుంచి పరారయ్యారు. చదవండి: మోదీ ‘మన్ కీ బాత్’కి వరంగల్ చాయ్‌వాలా -
నేను చిన్నపిల్లను; నాకు పెళ్లొద్దు.. చదువుకుంటా!
సాక్షి,గీసుకొండ: ‘సార్.. నేనింకా చిన్నపిల్లను. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉంది. ఎంత చెప్పినా పెద్దలు వినడం లేదు. పైగా 30 ఏళ్ల వ్యక్తికి, అదీ మొదటి భార్యతో విడాకులైన వ్యక్తికి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. అందరికీ తెలిస్తే అడ్డుకుంటారని దొంగచాటుగా పెళ్లి చేయాలని ప్రయతి్నస్తున్నారు..నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా ఆపండి.. ఇదీ పద్నాలుగేళ్ల బాలిక తనకు వివాహం చేయాలని పెద్దలు యత్నించిన క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు... వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట శివారు గార్లగడ్డ తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికతో వరంగల్ అర్బన్ జిల్లా వాసి, ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 30 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి పెద్దమనుషులు నిర్ణయించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.., చదువుకుంటానని ఆ బాలిక మొరపెట్టుకున్నా పెద్దమనుషులు వినకుండా నిశి్చతార్థం చేశారు. దీంతో దిక్కుతోచని ఆ బాలిక తన స్నేహితురాలితో చైల్డ్‌లైన్‌కు సంబంధించి 1098 ఫోన్ చేయమని చెప్పింది. ఇంతలోనే స్థానిక ఎంపీటీసీ వీరన్న కూడా ఈ విషయాన్ని బాలల సంరక్షణ అధికారులకు తెలియజేశారు. ఇది తెలుసుకున్న పెద్దమనుషులు బుధవారం బాలిక అమ్మమ్మ గ్రామమైన గీసుకొండ మండలంలోని నందనాయక్ తండాలో గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించడానికి సిద్ధమవుతుండగా బాలల పరిరక్షణ విభాగం అధికారులు పెళ్లి తంతును అడ్డుకున్నారు. చదవండి: 20 మీటర్లు.. 12 అడుగులు..! -
Warangal: నా పెళ్లి ఆపండి సార్..!
డోర్నకల్(వరంగల్) : ‘మైనార్టీ తీరకుండానే నాకు వివాహం చేయాలని చూస్తున్నారు.. నాకు చదువుకోవాలని ఉంది. ఈ వివాహాన్ని ఎలాగైనా అడ్డుకోండి సార్’ అంటూ ఓ బాలిక స్వయంగా చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా, బాలికను సన్మానించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన బాలిక (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసేందుకు సిద్ధం కావడంతో ఆ బాలిక.. చైల్డ్‌లైన్ నంబర్ 1098కు సమాచార మిచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు మంగళవారం గ్రామానికి చేరుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనార్టీ తీరాకే వివాహం చేస్తామని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. అనంతరం బాలికను సన్మానించారు. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది లక్ష్యమని బాలిక తెలిపింది. కాగా, గ్రామంలో మరో బాల్య వివాహాన్ని కూడా అధికారులు అడ్డుకున్నారు. చదవండి: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ -
బాల్య వివాహమైన 12 ఏళ్ల తర్వాత కోర్టుకు..
జైపూర్ : బాల్య వివాహం అయిన 12 ఏళ్ల తర్వాత తన వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిందో యువతి. ఈ సంఘటన రాజస్తాన్‌లోని బిల్వారా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బిల్వారా జిల్లా పలాడి గ్రామానికి చెందిన మన్షి అనే యువతికి 7 ఏళ్ల వయసున్నపుడు 2009లో బాల్య వివాహమైంది. ఆ తర్వాతినుంచి ఇంటి వద్దే ఉంటూ చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఈ నేపథ్యంలో అత్తంటి వారు కాపురానికి రావాలంటూ యువతిపై ఒత్తిడి తేసాగారు. సదరు యువతి ఇందుకు ఒప్పుకోలేదు. తనకు జరిగిన బాల్య వివాహం చెల్లదని తేల్చి చెప్పింది. కాపురానికి రాకపోతే పంచాయితీలో పెట్టి కుటుంబాన్ని సామాజికంగా వెలివేయిస్తామని బెదిరింపులకు దిగారు అత్తింటివారు. వారి వేధింపులు ఎక్కువవటంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత సారథి ట్రస్ట్ సహకారంతో మన్షి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు జడ్జి ముకేశ్ భార్గవ.. మన్షి భర్తకు సమన్లు జారీ చేశారు. బాల్య వివాహాల విషయంలో కఠినమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. చదవండి : దుస్తులు విప్పేస్తే డబ్బుల వర్షం కురుస్తుంది -
వధువు జంప్..చెల్లిని పెళ్లాడిన వరుడు..ఇక్కడే ట్విస్ట్
భువనేశ్వర్ : మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, వధువు ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో ముహూర్తం సమయానికి పెళ్లి జరగాల్సిందేనని, వధువు చెల్లెలిని అయినా తనకు కట్టబెట్టాలని వరుడు కోరగా వేరే గత్యంతరం లేక అమ్మాయి కుటుంబసభ్యులు కూడా ఇందుకు ఒప్పుకుంటారు. అనుకున్న సమయానికి పెళ్లికొడుకు..వధువు చెల్లిలో మెడలో తాళి కట్టి అత్తారింటికి తీసుకెళ్లాడు. అయితే ఇక్కడే అతనికి అసలు సిసలు ట్విస్ట్ ఎదురైంది. ఈ పెళ్లి చెల్లదని అధికారులు తేల్చి చెప్పడంతో వరుడు బిత్తెరపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మాల్పాడా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. మరికొద్ది సేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉండగా..వధువు తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. దీంతో తమ పరువు పోతుందని, వధువు చెల్లితో అయినా సరే పెళ్లి జరిపించాలని వరుడు తరుపు వాళ్లు పట్టుబట్టారు. దీంతో వేరే దారి లేక అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. అయితే తంతు ముగిసి అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్లాకా అధికారులు అక్కడికి చేరుకున్నారు. అమ్మాయి వయస్సు 15 ఏళ్లే కావడంతో ఇది బాల్య వివాహం కిందకు వస్తుందని,చట్టారీత్యా ఇది నేరమని పేర్కొన్నారు. 18 ఏళ్లు వచ్చేదాకా అమ్మాయిని అత్తారింటికి పంపొద్దని చెప్పడంతో వారు కూడా అంగీకరించారని జిల్లా పిల్లల రక్షణ అధికారి సుకాంతి బెహెరా తెలిపారు. మైనర్ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చదవండి : (వైరల్: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్) (నగ్నంగా ఏనుగెక్కిన మోడల్!) -
బాల్యవివాహాలు పిల్లల హక్కుల ఉల్లంఘనే!
భారత ప్రభుత్వం చట్టబద్ధ మైన వివాహ వయస్సును పెంచాలని భావిస్తోంది. అయితే వివాహాలకు చట్టబద్ధమైన వయస్సును పెంచడం ఒక్కటే సరిపోదు. ప్రధానంగా బాల్య వివాహం పిల్లల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది వారి శారీరక వృద్ది, మానసిక, భావోద్వేగాల పెరుగుదల, విద్యావకాశాలపై కూడా వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఉత్తరాంధ్రలో కౌమారదశలోనే పెళ్లయి తల్లులైన వారితో బృంద చర్చలో, చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల తమ బాల్యాన్ని, ఆడుకునే, నేర్చుకునే స్వేచ్ఛను పోగొట్టుకున్నామని చెప్పారు. పెళ్లి కాగానే మానసికంగా సంసిద్ధం కాకుండానే ఆమె కుటుంబ పాత్రలు పోషిం చాల్సి వస్తోంది. భార్యగా, తల్లిగా, కోడలిగా బరువైన బాధ్యతలు స్వీకరించాల్సి రావడం మైనర్ బాలికకు కష్టమవుతుంది. దీంతో వారు ఒంటరితనానికి, కుంగుబాటుకు గురికావడానికి దారి తీస్తుంది. ప్రపంచంలోనే బాలికా వధువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మహిళలకు వివాహ వయస్సును 18 ఏళ్లుగా, పురుషులకు 21 ఏళ్లుగా స్థిరపర్చడం, బాల్యవివాహ నిషేధ చట్టాన్ని అమలుపర్చడం ఉనికిలో ఉన్నప్పటికీ దేశంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో బాల్య వివాహాలు 2005లో 47 శాతం ఉండగా ఇది 2015 నాటికి 27 శాతానికి పడిపోవడం మంచిదే కానీ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో బాల్యవివాహాలు అధికంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 20 నుంచి 24 ఏళ్ల వయసున్న మహిళల్లో 33 శాతం మందికి 18 ఏళ్ల లోపే పెళ్లవుతున్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్–4 డేటా 2015–16 నివేదిక తెలిపింది. ఇక పురుషుల విషయానికి వస్తే 25 నుంచి 29 ఏళ్ల వయసున్న యువకుల్లో 21 ఏళ్లకు ముందే పెళ్లాడుతున్న వారు 11.8 శాతంగా ఉన్నారు. అదే తెలంగాణలో 20–24 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 25.7 శాతం మంది వివాహం చేసుకుంటూండగా, 15–19 ఏళ్ల ప్రాయంలోని బాలికల్లో 14 శాతం మంది తల్లులవుతున్నారు. అయితే యంగ్ లైవ్స్ లాంగిట్యూడినల్ స్టడీ 2002 నుంచి తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న అధ్యయనం మరింత స్పష్టమైన చిత్రాన్ని ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 19 ఏళ్లలోపు వయసున్న బాలికల్లో 25 శాతం మంది చట్టబద్ధమైన వయసుకు ముందే పెళ్లాడుతున్నారని, 2020 నాటికి ఇది 14 శాతానికి పడిపోయిందని ఈ నివేదిక తెలిపింది. తెలంగాణలో కూడా 2013 నాటికి 19 ఏళ్ల లోపు వయసున్న బాలికల్లో 28 శాతం మంది చట్టబద్ద వయసుకు ముందే పెళ్లాడుతుండగా వీరి సంఖ్య 2020 నాటికి 17 శాతానికి పడిపోయింది. జిల్లాల వారీగా చూస్తే కడప, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 18 ఏళ్లకు ముందే వివాహ మాడుతున్న బాలికల సంఖ్య వరుసగా 20 శాతం, 24 శాతం, 27 శాతంగా నమోదైంది. ఈ జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఇది 36 శాతం మేరకు అధికంగా నమోదైంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 9 జిల్లాల్లోనూ, ఏపీలో 5 జిల్లాల్లో సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు, విశ్వాసాలు, దారిద్య్రం వంటివి బాల్య వివాహాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. పెద్దగా చదువుకోకపోవడం, విద్యావకాశాల లేమి కూడా వీటికి తోడవుతున్నాయి. రజస్వల అయితే చాలు పెళ్లీడు వచ్చేసినట్లే అని తల్లిదండ్రులు భావించడం, వారిలో అవిద్య, వలసలు, ఎక్కువమంది అమ్మాయిలు ఉండ టం వంటివి కూడా బాల్యవివాహాలను ప్రేరేపిస్తున్నాయి. చట్టం మాత్రమే ఈ దురాచారాన్ని అడ్డుకోలేదని, మార్పు అనేది కుటుంబం, కమ్యూనిటీ స్థాయి నుంచే ప్రారంభం కావాలని న్యాయనిపుణుల మాట. సెకండరీ విద్యను బాలికలకు అనుకూలంగా మలుస్తూ వారి రక్షణకోసం పెట్టుబడి పెట్టాలి. పేదలు బాలికలను బడికి పంపేలా చేయడానికి షరతులతో కూడిన నగదు బదిలీ చేయడం, 18 ఏళ్లదాకా నిర్బంధ విద్యను అందించడం మంచి ఫలితాలను తెస్తుంది. ముఖ్యంగా విద్య, బాల్యవివాహాలపై డేటా బ్యాంకును గ్రామీణ సంస్థలు ఏర్పర్చుకుంటే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుంది.' వ్యాసకర్త ఆర్థికవేత్త, సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ పి. పృథ్వీకర్ రెడ్డి మొబైల్ : 94408 90508 -
ప్రతి ఏటా 4.6 లక్షల మరణాలు
న్యూఢిల్లీ: సృష్టికి మూలం స్త్రీ అంటారు. ఆడది లేకపోతే మానవజాతి మనుగడే కష్టం అంటారు. అమ్మవారిగా పూజిస్తారు.. అదే ఆడపిల్లగా పుడితే మాత్రం చీదరించుకుంటారు. తల్లి గర్భం నుంచి భూమాత ఓడి చేరేంత వరకు ఆడవారు ఎన్ని కష్టాలు దాటాలో. అసలు అమ్మ కడుపు నుంచి బయటకు రాకుండానే రాలిపోతున్న ప్రాణాలు ఎన్నో. భూమ్మిద పడ్డాక కనిపించకుండా పోతున్న స్త్రీల సంఖ్య లక్షల్లో ఉందంటేనే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాశ్చాత్య దేశాల సంగతి పక్కన పెడితే.. స్త్రీని ఆదిపరాశక్తిగా కొలిచే మన దేశంలో శతాబ్దాలుగా ఆడవారి పట్ల చిన్న చూపు.. చులకన భావం. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత అభివృద్ది సాధించిన ఈ తారతమ్యాలు మాత్రం తొలగడం లేదు. యూనైటెడ్ పాపులేషన్ ఫండ్ నివేదిక చూస్తే ఈ మాటలు వాస్తవం అని మరోసారి రుజువు అవుతుంది. యూఎన్ఎఫ్పీఏ 2020 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 46 లక్షల మంది మహిళలు తప్పిపోతున్నారని తెలిపింది. అందులో 4.6 లక్షల మంది బాలికలు లింగవివక్షత కారణంగా తల్లి గర్భంలోనే లేక పురిట్లోనే కన్ను మూస్తున్నారని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం భారత్ ఇప్పటికి కూడా మహిళలకు అత్యంత అసురక్షిత దేశాల్లో ఒకటిగా పేర్కొనడం శోచనియం. పుట్టుకలోనే తప్పిపోవడం బాలికల నిష్పత్తిని పెంచడం కోసం గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావో.. భేటీ పడావో వంటి పథకాలేన్నో తీసుకొచ్చాయి. కానీ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్(ఎస్‌డబ్ల్యూఓపీ-స్వాప్) యూఎన్ఎఫ్పీఏ 2020 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జెండర్ బేస్డ్ సెక్స్ సెలక్షన్(జీబీఎస్ఎస్-లింగ ఆధారిత ఎంపిక) వల్ల 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా వీరిలో 46 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కల్గించే అంశం. మరి దారుణం ఏంటంటే దాదాపు 4.6 లక్షల మంది బాలికలు తల్లి గర్భంలోనే లేక పుట్టిన వెంటనే కనిపించకుండా(అంటే చంపడం, వదిలించుకోవడం) పోతున్నారని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పురిట్లోనే కనిపించకుండా పోతున్న ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరు భారతదేశానికి చెందిన వారే కావడం ఆందోళన కల్గిస్తుంది. ప్రతి ఏట ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ఎస్ వల్ల 12 లక్షల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతుండగా.. వీరిలో 40 శాతం మందితో భారత్ రెండో స్థానంలో ఉండగా.. 50 శాతంతో చైనా ప్రథమ స్థానంలో ఉంది. లింగవివక్షతకు వ్యతిరేంకగా ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేదని ఈ నివేదిక వెల్లడిస్తుంది. స్వాప్ నివేదిక ప్రకారం 2016-2018 సంవత్సరానికి గాను ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 899 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నది. హర్యానాతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో(ఉత్తరాఖండ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్) బాలికల సంఖ్య 900 కన్నా తక్కువ ఉందని నివేదిక తెలిపింది. బాల్య వివాహం, ఇతర వివక్షలు జీబీఎస్ఎస్ మాత్రమే కాక భారతదేశంలో బాలికలు బాల్య వివాహం, కట్నం, గృహ హింసతో పాటు లైంగిక వేధింపులు వంటి ఇతర లింగ ఆధారిత దురాగతాలకు గురవుతున్నారని నివేదిక తెలుపుతోంది. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ 2015-16 సర్వే గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి 18 ఏళ్ళలోపే వివాహం జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక 20-24 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలలో 26.8 శాతం మంది 18 సంవత్సరాల వయస్సులోపు వివాహం చేసుకున్నారని నివేదిక తెలిపింది. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు 8,000 మంది మహిళలపై ఎన్హెచ్ఏఎఫ్ నిర్వహించిన ఈ సర్వేలో 18 ఏళ్ళకు ముందే వివాహం చేసుకున్న బాలికలలో 32 శాతం మంది వారి భర్త చేతిలో శారీరక హింసకు గురయినట్లు వెల్లడించింది. అంతేకాక 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు వివాహితల్లో ఒకరు తన భర్త నుంచి లైంగిక హింసను అనుభవించినట్లు సర్వే వెల్లడించింది. బాల్యవివాహాల డాటా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ఉదాహరణకు బిహార్,పశ్చిమ బెంగాల్లో ప్రతి ముగ్గురు బాలికలలో ఇద్దరికి 18 ఏళ్ల లోపే వివాహం కాగా.. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ముగ్గురిలో ఒకరికి బాల్య వివాహం జరిగినట్లు సర్వే వెల్లడించింది. అబ్బాయే ముద్దు.. ఆడపిల్ల వద్దు భారతదేశంలో కొడుకు అంటే వల్లమాలిన అభిమానం. ఆడపిల్ల పుడితే పెంచి, పెద్ద చేసి కట్నం ఇచ్చి ఒకరింటికి పంపాలి. అదే కొడుకయితే.. ఖర్చు పెట్టినప్పటికి కట్నం వస్తుందనే ఉద్దేశంతో భారతీయులు కొడుకు పట్ల వల్లమాలిన అభిమానం ప్రదర్శిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి వల్లే ఇండియాలో ఆడపిల్లల సంఖ్య బాలుర కంటే తక్కువగా ఉంటుంది. బాల్య వివాహాలకు ఇది కూడా ఓ కారణం అవుతుందని సర్వే తెలిపింది. ప్రస్తుతం చిన్న కుటుంబాలు ఏర్పడటం.. ఆదాయం పెరగటంతో పట్టణాల్లో లింగనిర్థారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే.. వెంటనే హతమారుస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాదని ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్దతి కొనసాగుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా.. వీరిలో భారత్‌కు చెదిన వారే 46 మిలియన్ల మంది ఉండటం శోచనీయం. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు వస్తేనే ఆడపిల్లల మనుగడ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని.. ఉన్నత విద్యనభ్యసించే బాలికల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు కుంటుపడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.