crop loans
-
రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ కలిసి రాలేదు. వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్‌లో రైతులు దెబ్బ తిన్నారు. అతి కష్టం మీద లక్ష్యానికంటే తక్కువగా 69.70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా, పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ముందస్తుగా రబీ సాగుకు సన్నద్ధమయ్యారు. ఆ మేరకు రబీ 2024–25 ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీ సాధారణ విస్తీర్ణం 56.58 లక్షల ఎకరాలు. ఈ ఏడాది సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.44 లక్షల ఎకరాల్లో మినుము, 5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.74 లక్షల ఎకరాల్లో జొన్న, 2.51 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.46లక్షల ఎకరాల్లో పెసలు, 1.77లక్షల ఎకరాల్లో పొగాకు పంటలు సాగు చేయనున్నారు. కాగా ఈ ఏడాది 94.69 లక్షల టన్నుల దిగుబడులు లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్దేశించింది. రబీకి 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం రబీ కోసం 8.88 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీజన్లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 26 వేల క్వింటాళ్లను సిద్ధం చేశారు. వరి, ఇతర విత్తనాలను ఈ నెల 25వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 50,076 క్వింటాళ్ల వరి, 45,647 క్వింటాళ్ల వేరుశనగ, 16,249 క్వింటాళ్ల మినుము విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఎరువుల సరఫరాలో ఆర్బీకేలకు కోత ఈ ఏడాది 20.05లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 6.95 లక్షల టన్నుల ఎరువులు ఉండగా, కేంద్రం నుంచి ఈ నెలలో 1.47 లక్షల టన్నులు వచ్చాయి. ప్రస్తుతం 8.42 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా సబ్సిడీ విత్తనం, ఎరువుల పంపిణీలో రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) అధిక ప్రాధాన్యతనిచ్చారు. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆర్బీకేలకు ప్రాధాన్యత లేకుండా చేసింది. గడిచిన ఖరీఫ్‌లో అతికష్టమ్మీద 1.50 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. రబీలో కూడా ఆర్బీకేలకు సరఫరాలో భారీగా కోత పెడుతున్నారు. రబీలో రూ.68వేల కోట్లు పంట రుణాలు ప్రస్తుత రబీలో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దాంట్లో రూ.68,060 కోట్లు పంట రుణాలు, 32,390 కోట్లు టర్మ్ రుణాలు ఇవ్వనున్నారు. గతేడాది 3.60 లక్షల మంది కౌలుదారులకు రూ.4,100 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం 5 లక్షల మందికి రూ.5 వేల కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించారు. -
తప్పుడు వివరాలిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: పంటరుణాలకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల వారీగా క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పిస్తున్నామని, ఒక సొసైటీ పరిధిలో ఒకే రోజు ఐదువందల మందికి రుణాలు ఇచ్చినట్లు సమాచారం వచి్చందని, ఇదే తరహాలో 7 బ్యాంకులు సమాచారం ఇచ్చాయన్నారు.వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో రుణ మంజూరుకు కారణాలను పరిశీలించి నిర్ధారించుకుంటామన్నారు. తప్పుడు సమాచా రం ఇచ్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి తుమ్మల మీడియాతో మాట్లాడారు.రుణమాఫీకి 25 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తా యని ప్రాథమికంగా భావించామని, అయితే, రాష్ట్రవ్యాప్తంగా 32 బ్యాంకుల ద్వారా రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు ఉందన్నారు. కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని, ఈ కా ర్డు లేని వారిని పాస్‌బుక్ ఆధారంగా గుర్తిస్తామన్నారు.రుణమాఫీ చేయకుంటే ఉరితీయండి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పంటరుణ మాఫీ చారిత్రక నిర్ణయమని తుమ్మల చెప్పారు. అన్నదాతకు లబ్ధి చేకూరే ఈ పథకంపై రాజకీయ నేతలు తప్పుగా మాట్లాడొద్దని, అర్హత ఉన్న ప్రతి రైతుకూ పంటరుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏవైనా అనుమానాలు ఉంటే రైతు వేదికల వద్ద వ్యవసాయాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఇంకా నాలుగున్నరేళ్లపాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని, రుణమాఫీ చేయకుంటే తమను ఉరితీయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రూ.లక్షలోపు రుణమాఫీ చేశామని, త్వరలో రూ.1.5 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని, ఆ తర్వాత రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ.1.50 లక్షలు, రూ.2 లక్షల రుణమాఫీ లబి్ధదారులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చెప్పలేమని, నిధులు విడుదల సమయంలో వెల్లడిస్తామని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.మొత్తంగా రూ.31 వేల కోట్ల మేర రుణమాఫీ జరుగుతుందని, ఇప్పటివరకు చేసిన రూ.లక్ష లోపు మాఫీ ద్వారా 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. రుణమాఫీ పొందని రైతులు సంబంధిత కలెక్టరేట్లో లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి కారణాలు తెలుసుకోవచ్చన్నారు. -
'రేషన్' ఉంటేనే మాఫీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ రేషన్‌కార్డు ఉన్నవారికే అమలుకానుంది. ఆహార భద్రత కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులను తేల్చడానికి.. బ్యాంకుల్లో రైతుల రుణఖాతాలోని ఆధార్‌ను.. పట్టాదారు పాస్‌బుక్ డేటాబేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్ (రేషన్) డేటాబేస్‌లోని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొంది. అర్హులుగా తేల్చిన ఒక్కో రైతు కుటుంబానికి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య ఉన్న పంట రుణాల బకాయిల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం ‘పంట రుణ మాఫీ పథకం–2024’ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయడం విశేషం. పథకం అమలు ప్రక్రియ, ఏర్పాట్లు చేసేదిలా.. ⇒ వ్యవసాయ శాఖ డైరెక్టర్ పంటల రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా ఉంటుంది. ⇒ వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తాయి. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ ఐటీ పోర్టల్‌లోనే.. ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్‌కు బిల్లులు సమర్పించడానికి, రుణమాఫీ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి. ⇒ ఈ పథకం అమలుకోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బీఎస్ఐ) నియమించాలి. ఆ నోడల్ అధికారులు తమ బ్యాంక్ పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి. ⇒ ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) నుంచి.. రిఫరెన్స్–1 మెమో, ప్రొఫార్మా– 1లో డిజిటల్ సంతకం చేసిన టేబుల్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్‌లో లేవు కాబట్టి.. ప్యాక్స్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్, రిఫరెన్స్–2వ మెమో, ప్రొఫార్మా–2లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి సమర్పించాలి. ⇒ ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడమే.. అవసరమైతే వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఎన్ఐసీ డేటా వ్యాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి. ⇒ అర్హతగల రుణమాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో (డీబీటీ పద్ధతిలో) జమ చేస్తారు. ప్యాక్స్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ, బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని ప్యాక్స్‌లో ఉన్న రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ⇒ ప్రతి రైతు కుటుంబానికి రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ⇒ కటాఫ్ తేదీ నాటికి ఉన్న మొత్తం రుణం, లేదా రూ.2 లక్షలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ⇒ ఏదైనా రైతు కుటుంబానికి రూ.2 లక్షలకుపైగా రుణం ఉంటే.. రైతులు అదనంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాతే రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు బదిలీచేస్తారు. ⇒ రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న పరిస్థితులలో.. కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలోని పురుషుల పేరిట ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. వీరికి రుణమాఫీ వర్తించదు ⇒ పంట రుణమాఫీ పథకం ఎస్‌హెచ్‌జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్‌ఈసీఎస్‌లు తీసుకున్న రుణాలకు వర్తించదు. ⇒ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. ⇒ కంపెనీలు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు వర్తించదు. అయితే ప్యాక్స్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ⇒ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మినహాయింపుల నిబంధనలను.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఆచరణాత్మకంగా అమలు చేయడం కోసం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు, రైతుల బాధ్యతలివీ.. ⇒ ప్రతి బ్యాంకు ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి. ⇒ పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బీఎన్‌వో డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో గుర్తిస్తే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు ఉంటాయి. ⇒ ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినా, లేదా మోసపూరితంగా పంటరుణం పొందినట్టుగానీ, అసలు పంట రుణమాఫీకి అర్హులుకారని తేలినా.. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు అధికారం ఉంటుంది. ⇒ రైతుల రుణఖాతాల్లోని డేటా యదార్థతను నిర్ధారించేందుకు... సహకార శాఖ డైరెక్టర్, సహకార సంఘాల రిజి్రస్టార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ముందస్తు శాంపిల్ ప్రీఆడిట్‌ను చేపట్టాలి. అమలు అధికారికి ఆ వివరాలను అందజేయాలి. ⇒ రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఇబ్బందులపై ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో నెలకొల్పే సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు పరిష్కరించి, దరఖాస్తుదారుకు వివరాలు తెలపాలి. -
రుణమాఫీపై బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీపై తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.కాగా, రైతుల రుణమాఫీపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రతీ యూనిట్లో మొదట మహిళల పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యత ప్రకారం రుణాలను మాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే, రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, చిన్న మొత్తంలో రుణమాఫీలను చేసిన తర్వాతే పెద్ద అమౌంట్‌ను మాఫీ చేయనున్నారు. స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేయనున్నారు. అలాగే.. రెండు లక్షల పైబడి ఉన్నా రుణాలకు రైతులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసిన రుణాలకు ఈ పథకం వర్తించదు. పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని వాణిజ్య బ్యాంక్‌లు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుంది. ఇక, 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ చేయనున్నారు. ఇక, ఒకవేళ తప్పుగా ఎవరైనా రుణమాఫీ తీసుకుని ఉంటే వారికి డబ్బులు చెల్లించినట్టు అయితే, మళ్లీ డబ్బులను వారి వద్ద నుంచి ప్రభుత్వం తీసుకోనుంది. -
కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్: కుటుంబం యూనిట్‌గా పంటల రుణమాఫీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక కుటుంబంలోని వారి పేరిట బ్యాంకుల్లో పంట రుణాలు ఎంత ఉన్నా.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు పూర్తయిందని.. నేడో, రేపో మార్గదర్శకాలు విడుదల కావొచ్చని తెలిపాయి. ఒక కుటుంబాన్ని ఎలా లెక్కలోకి తీసుకోవాలన్న దానిపై అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. రేషన్‌కార్డుగానీ, గ్రామ పంచాయతీ రికార్డుగానీ, వ్యవసాయశాఖ వద్ద ఇప్పటికే ఉన్న డేటాను ఆధారం చేసుకొనిగానీ కుటుంబాలను అంచనా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అనంతరం ఒక రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంకు ఖాతాలు, వాటిలో ఎన్ని పంట రుణాలు ఉన్నప్పటికీ.. మొత్తం రూ.2 లక్షల వరకే మాఫీ చేయనున్నారు. రుణాలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం ఈ మాఫీ సొమ్మును విభజిస్తారు. ఒక కుటుంబం అంటే.. భర్త, భార్య, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలు విడుదలైన వెంటనే గ్రామాల వారీగా రైతుల జాబితా తయారు చేస్తారు. బ్యాంకుల అధికారులతో కలసి రుణాలున్న వారి జాబితా తయారు చేస్తారు. చివరగా గ్రామసభలో చర్చించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. పీఎం కిసాన్ నిబంధనల అమలు యోచన! వచ్చే నెల 15వ తేదీ నాటికి పంట రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్ర రైతులు తీసుకున్న రూ.2 లక్షల మేరకు పంట రుణాలను మాఫీ చేయనున్నారు. దాదాపు 47 లక్షల మంది రైతులకు దీనితో లబ్ధి జరుగుతుందని అంచనా. అయితే రుణమాఫీ కోసం పీఎం కిసాన్ పథకంలోని మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పీఎం కిసాన్ పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. అదే తరహాలో ఇప్పుడు రుణమాఫీని మినహాయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆదాయ పన్ను చెల్లించే అందరినీ కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిని మాత్రమే మినహాయించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరినీ మినహాయించకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. మిగిలే మొత్తం ఎక్కువగా ఉంటేనే పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయాలని, లేకుంటే ఉదారంగానే రుణమాఫీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పంటలు పండించే ప్రతి రైతుకు ప్రయోజనం కలిగించేలా పథకం అమలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. బంగారం పెట్టి తీసుకున్న రుణాలు కూడా..! బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్‌బుక్‌ను జతచేసి, పంటల కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలను మాఫీ నుంచి మినహాయించాలనే యోచన ఉన్నట్టు సమాచారం. గతంలోనూ ఇదే తరహా నిబంధనలు అమలు చేశారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, కో–ఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు సహా), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
రుణమాఫీ ‘లెక్క’ తీయండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాలు మాఫీ చేయడానికి అవసరమైన లెక్క అంతా సిద్ధం చేయాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని సూచించారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. పంట రుణాల మాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో రేవంత్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయిలో రైతుల వివరాలను సేకరించి, అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్పష్టమైన ప్రణాళికతో రండి.. బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాల మాఫీకి సంబంధించిన డేటా, అవసరమైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసి తీరాలని తేలి్చచెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒకేసారి మాఫీతో ఇబ్బంది అంటూ..! రుణమాఫీకి నిధుల జమ విషయంలో ఇబ్బందులను కొందరు అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచి్చనట్టు తెలిసింది. సుమారు రూ.35 వేల కోట్ల వరకు నిధులను జమ చేయడం అంత సులువైన విషయం కాదని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, అందుకు మార్గాలను అన్వేషించాలని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. రుణాలున్న ప్రతీ రైతుకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు తయారు చేయాలని కూడా సూచించినట్టు సమాచారం. ఇప్పటివరకు కొన్ని బ్యాంకుల నుంచి రైతు రుణాల సమాచారం వచి్చందని, మిగతావాటి నుంచి కూడా డేటా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అయితే రుణమాఫీకి అర్హులైన రైతులు ఎంతమంది ఉంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు అంటున్నారు. -
రైతుల ‘వేలం’వర్రీ!
సాక్షి, హైదరాబాద్: పాడి గేదెల పెంపకం కోసమో, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, ఇతరత్రా అవసరాల కోసమో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సహకార బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల వారు తాకట్టు పెట్టిన భూముల్ని వేలం వేసి మరీ బకాయిలను రాబట్టుకుంటున్నాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, పంట రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్న వివిధ జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు).. నిస్సహాయ పరిస్థితుల్లో రుణాలు చెల్లించని వారి భూములు, ఇతర ఆస్తులను వేలం వేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలానా రోజు ఫలానా రైతు భూమిని వేలం వేస్తున్నామంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తుండటంతో పరువు పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించాల్సిన రుణం తక్కువగా ఉన్నా మొత్తం భూమిని డీసీసీబీలు వేలం వేస్తుండటంతో తమకు భూమి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల విషయంలోనే కఠిన వైఖరి? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. దాని పరిధిలో జిల్లా స్థాయిలో డీసీసీబీలు ఉంటాయి. వాటి కింద ప్యాక్స్ పని చేస్తుంటాయి. ఇవి ప్రధానంగా రైతుల కోసమే పనిచేయాల్సి ఉంటుంది. వీటి చైర్మన్లను, డైరెక్టర్లను రైతులే ఎన్నుకుంటారు. డీసీసీబీల చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ బ్యాంకులు రైతులకు అవసరమైన పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే డీసీసీబీలు ప్రతి ఏటా వేలాది కోట్లు రైతులకు రుణాలు అందిస్తుంటాయి. రైతులతోపాటు ఇతరులకు కూడా గృహ, విద్య రుణాలు కూడా ఇస్తుంటాయి. రైతులకైతే ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనేందుకు, భూములను చదును చేసుకునేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, గొర్రెల పెంపకం తదితరాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంటారు. అయితే పలుకుబడి కలిగి కోట్ల రూపాయలు తీసుకునే వారిపై, రాజకీయ నాయకుల విషయంలో మెతక వైఖరి అవలంభించే డీసీసీబీలు రైతుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల విషయంలో కోట్లు రికవరీ చేయలేక నష్టాలను చవిచూస్తున్న అనేక సహకార సంఘాలు, రైతులను మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎలాగోలా చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నా కనికరించడం లేదు. భూములను వేలం వేస్తున్నాయి. వేలం పాటలో ఆయా గ్రామాల ఇతర రైతులు ఎవరూ పాల్గొనకపోతే డీసీసీబీలే స్వాదీనం చేసుకుంటున్నాయి. మరోవైపు చెల్లించాల్సిన రుణం కంటే ఎక్కువ విలువున్న భూములను వేలం వేయడంపై రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా వచ్చే డబ్బును రైతులకే ఇస్తున్నామని అధికారులు అంటున్నా, కొద్దిపాటి భూమిని కూడా తమకు ఉంచడం లేదని రైతులు అంటున్నారు. అప్పుకు మించి భూమిని అమ్మే హక్కు సహకార బ్యాంకులకు ఎక్కడ ఉందని నిలదీస్తున్నారు. మరీ విచిత్రంగా కేవలం రూ.50 వేల రుణం ఉన్న రైతుల ఆస్తులను కూడా వేలం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 202 మందికి నోటీసులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో 78 ప్యాక్స్ ఉన్నాయి. వీటి పరిధిలో 22 డీసీసీబీ బ్రాంచీలు ఉన్నాయి. గత ఏడాది (2023–24) పంట రుణాల కింద 62 వేల మంది రైతులకు రూ. 672 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద 1,100 మందికి రూ.70 కోట్లు, గృహ రుణాల కింద 200 మందికి రూ.18 కోట్లు, విద్యా రుణాల కింద 180 మందికి రూ.14 కోట్లు అందజేశాయి. ఇందులో దీర్ఘకాలిక రుణాలు పెండింగ్‌లో ఉన్న 202 మందికి బ్యాంక్ అధికారులు లీగల్ నోటీసులు జారీ చేసి రూ.8 కోట్లు రికవరీ చేశారు. ఈ క్రమంలో కొందరు రైతుల భూములు, ఆస్తులను కూడా వేలం వేయడం గమనార్హం. నిజామాబాద్‌లో 71 మందికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీలో ఇళ్లు, వ్యవసాయ భూములు, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెట్టి కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 71 మందికి డీసీసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా అప్పులు చెల్లించని రైతుల ఆస్తులను వేలం వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో డీసీసీబీలు పంట రుణాలు ఇస్తాయి. గడిచిన వానాకాలంలో రూ.469.82 కోట్లు, యాసంగి సీజన్లో రూ.126.68 కోట్లు పంట రుణాలుగా ఇచ్చాయి. అలాగే రూ. 236.38 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. రైతులు రుణాలు చెల్లించకుంటే ఆస్తులను వేలం వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. డీసీసీబీలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయి రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు, పేరుకు పోయిన ఇతరత్రా రుణాలను రికవరీ చేయాల్సిన బాధ్యత డీసీసీబీలపై ఉంటుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం అవి పనిచేయాలి. రైతులు తమ భూములు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులను తనఖా పెట్టి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. అయితే ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసే క్రమంలో రైతులకు నోటీసులు ఇస్తున్నారు. పలు జిల్లాల్లో భూములు, ఇతర ఆస్తులు వేలం వేస్తున్నారు. నిబంధనల ప్రకారమే డీసీసీబీలు వ్యవహరిస్తున్నాయి. – నేతి మురళీధర్‌రావు, ఎండీ, టెస్కాబ్ – నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గాను గేదెలను కొనుగోలు చేయాలని భావించి 2017 డిసెంబర్లో తనకున్న 2.30 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రూ.7.20 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. మూడు కిస్తీలు కట్టాడు. ఆ తర్వాత గేదెలు చనిపోవడంతో నష్టం వాటిల్లింది. కిస్తీలు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9.68 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉండగా.. రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంకు అధికారులు వేలం వేసి నగదు జమ చేసుకున్నారు. – జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) పరిధిలోని పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి తండ్రి సంజీవరెడ్డి కొన్నేళ్ల క్రితం ట్రాక్టర్ కోసం మూడెకరాలు తాకట్టు పెట్టి రూ.1,66,000 రుణం తీసుకున్నాడు. మూడేళ్ల అనంతరం లోన్ సరిగా చెల్లించడంలేదని ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. దీంతో చంద్రకాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా కేసు నడుస్తోంది. ఇలావుండగా పొలం వేస్తున్నామంటూ ఇటీవల ప్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో చంద్రకాంత్ తమ ట్రాక్టర్ సీజ్ చేశారని, పొలం ఎలా వేలం వేస్తారని నిలదీసినా ఫలితం లేకపోయింది. ఎకరం రూ.12.10 లక్షల చొప్పున మరో రైతుకు విక్రయించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్లో ఉన్న మొత్తం 4.12 ఎకరాలు రెడ్‌మార్క్‌లో పెట్టడంతో రైతు లబోదిబోమంటున్నారు. -
మళ్లీ రెడీ.. మోసం గ్యారంటీ
రైతాంగానికి చంద్రబాబు చేసిన దగా అంతా ఇంతా కాదు. అసలు వ్యవసాయమే దండగ అని చెప్పిన ఘనుడు. నేల తల్లిని నమ్ముకున్న రైతుల్ని నిట్టనిలువునా ముంచేశారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. చివరికి అధికారంలోకి రావడానికి వక్రమార్గాలన్నీ ఎంచుకుని అబద్ధాలతో ఐదేళ్లపాటు రైతుల జీవితాలతో ఆడుకున్నారు. ఆయన జీవితమంతా అబద్ధాలతోనే గడిచిపోయింది. ‘పులి–బంగారు కడియం’ కథలో మాదిరిగా బాబు గద్దెనెక్కడానికి చేయని వాగ్దానం లేదు. కుర్చీ ఎక్కగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా రూ.87,612 కోట్ల రుణాలను రూ.25 వేల కోట్లకు కుదించి, చివరికి రూ.15 వేల కోట్ల లోపే మాఫీ చేసిన జిత్తులమారి ‘నారా’ కపట నాటకానికి రైతులు ఆత్మార్పణం చేసుకోవలసి వచి్చంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. అలాంటాయన ఇప్పుడు మళ్లీ మన ముందుకు సరికొత్త కపట హామీలతో వస్తున్నారు. సాక్షి, అమరావతి: వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ 2014 ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని తాను చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్న చంద్రబాబు తీరా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఫైలుపై సంతకం చేయకపోగా, రుణ మాఫీలో ఎలా కోతలు పెట్టాలనే అలోచనతో కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. అదీ పంట రుణాల మాఫీకి మా త్రమే లబ్ధిని పరిమితం చేశారు. కోటయ్య కమిటీ లో చంద్రబాబు తనకు అత్యంత ఇషు్టడైన కుటుంబరావును చేర్చారు. అప్పటి నుంచి వ్యవసాయ రు ణాల మాఫీని ఎలా కుదించాలనే దానిపై కసరత్తు చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ కొత్త విధానా న్ని తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు. షరతులతో కత్తెరలు రైతులకు బ్యాంకులు నిర్ధారించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ పంట రుణాలిస్తే ఆ రుణాలు మాఫీ పరిధిలోకి రావంటూ కత్తెర పెట్టారు. ఆ తరువాత వ్యవసాయ అవసరాలకు రైతులు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలపై ఆంక్షలు విధించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఎంత రుణం తీసుకున్నా ఆ కుటుంబం మొత్తానికి రూ.1.50 లక్షల వరకే మాఫీ అని షరతు విధించారు. బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకునే సమయంలో పంట రుణాలని రాయకపోతే వాటిని రుణ మాఫీ నుంచి తొలగించేశారు. రైతులు ఆధార్, రేషన్ కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించారు. తొలుత 2014 మార్చి వరకు ఉన్న రుణాలు, వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి తరువాత 2013 డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న రుణాలు, వడ్డీ మా త్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒకే సారి రుణ మాఫీ సాధ్యం కాదని, దశల వారీగా చేస్తామ ని ఎక్కువ మంది రైతుల ఖాతాలను తప్పించేశారు. మాట మార్చి.. రైతులను ఏమార్చి 2014 జూన్ 29న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కో ట్లు, డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉన్నాయ ని బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. ఒకే సారి రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తే అభ్యంతరం లేదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభుత్వానికి తెలిపారు. అయితే రుణాల మాఫీ తరువాత చూద్దమని ముందుగా గత ఖరీఫ్‌లో కరువు, తుఫాను ప్రభావం గల 575 మండలాల్లో రైతుల రుణాలను రీ షెడ్యూల్‌పై ఆర్బీఐతో మాట్లాడాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్బీఐ మొత్తం మండలాల్లో రైతు ల రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. వడపోతలు, ఏరివేతలు తరువాత మొత్తం రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల్లో కేవలం 25 వేల కోట్లకు రుణ మాఫీని కుదించేసి నాలుగు దశల్లో చెల్లిస్తామని షరతులు విధించింది. తొలుత రూ.50 వేలలోపు చెల్లిస్తామని, రూ.50 వేలు దాటిన రుణాలకు రైతు ధ్రువీకరణ పత్రాలను చెల్లిస్తామని మోసం చేశారు. నమ్మక ద్రోహానికి ఫలితంగా ఆత్మహత్యలు 2019 ఎన్నికల ముందు నాటికి కేవలం రూ.15 వేల కోట్ల లోపు మాత్రమే రుణ మాఫీకి చంద్రబాబు సర్కారు హామీ ఇచ్చింది. అరకొర రుణ మాఫీతో రైతులు మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోయారు. వడ్డీ భారం అమాంతం పెరిగిపోయింది. మరో పక్క 2015 ఏడాది నుంచి 2016 వరకు వ్యవసాయ రుణాల కోసం బంగారం బ్యాంకుల్లో కుదువ పెట్టి 35,24,549 మంది రైతులు రూ.26,055.18 కోట్లు పంట రుణాలు తీసుకుంటే అందులో సవాలక్ష షరతులు విధించి కేవలం రూ.3,366.80 కోట్లకు మాఫీని కుదించారు. దీంతో బంగారంపై రుణాల తీసుకున్న రైతుల పేర్లతో బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడమే కాకుండా వాటిపై పత్రికల్లో ప్రకటనలు వేశాయి. దీంతో చాలా మంది రైతుల ఆత్మాభిమానం కోల్పోయి అవమాన భారాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. -
కౌలు రైతులకు భరోసానిస్తున్నా బాధేనా రామోజీ?
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వారికి మేలు జరుగుతుంటే విషపురాతలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019 తీసుకురావడమే కాదు.. సీసీఆర్సీల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం అందిస్తున్నారు. అంతేకాదు కౌలురైతులకు ఈక్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమా వంటి పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారు. చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు మేలు చేసే ఊసేలేదు. వాస్తవాలకు ముసుగేసి తప్పుడు కథనాలతో రామోజీరావు నిత్యం బురదజల్లడమే పనిగాపెట్టుకున్నారు. వ్యవసాయాన్ని పండుగలామార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ‘కౌలురైతు నోట్లో మట్టి’ అంటూ ఈనాడు పత్రికలో రోతరాతలు రాశారు. ఆరోపణ: కౌలు రైతులను ఆదుకోవడంలో 100 శాతం విఫలం వాస్తవం: భూయజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారి హక్కుల రక్షణకల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాల(సీసీఆర్సీ)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఇందుకోసం ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రెవెన్యూ శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 25.82 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు చేశారు. ఆరోపణ: కౌలురైతులకు పంట రుణాలేవి వాస్తవం: వాస్తవ సాగు దారులందరికి పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ లేని కౌలు రైతులతో జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటు చేసి ఈ గ్రూపుల ద్వారా వారికి రుణాలు అందేలా చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 13.49 లక్షల మంది కౌలుదారులకు రూ. 7,959.49 కోట్ల రుణాలు అందించారు. ఆరోపణ: రైతు భరోసాకు మొండిచేయి వాస్తవం: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకు కూడా రూ. 13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది. కౌలుదారుల్లో 6 శాతం మందికి మాత్రమే రైతు భరోసా అందుతుందనడంలో వాస్తవంలేదు. మెజార్టీ కౌలు దారులు సొంత భూమి కూడా కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ 50 నెలల్లోనే దాదాపు 5.38 లక్షల మంది కౌలు రైతులకు రూ. 697.32 కోట్లు, 3.99 లక్షల అటవీ భూములు (ఆర్వోఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ. 522.36 కోట్లు కలిపి మొత్తం 9.38 లక్షల మందికి రూ. 1,219.68 కోట్లు పెట్టుబడి సహాయంగా అందించారు. ఆరోపణ: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూయజమానులకు వర్తింçప చేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకు కూడా వర్తింప చేస్తున్నారు. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా కూడా అందిస్తున్నారు. ఈ క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంటరుణాలు పొందిన కౌలుదారులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందేలా చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. అలాగే 3.55లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.41లక్షల మందికి 253.56 కోట్ల పంట నష్ట పరిహారం బాబు హయాంలో కౌలురైతులను ఆదుకున్నదేది? చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు కనీసంగా అంటే కనీసంగా కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. ఏటా అరకొరగా తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఎల్ఈసీ కార్డులు జారీ చేయడం తప్ప ప్రభుత్వ పరంగా ఏ ఒక్క సంక్షేమ ఫలాలు అందించిన జాడే లేదు. కౌలుదారుల్లో 80 శాతం మందికి పైగా భూయజమానులతో ఎలాంటి లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా భూమిని కౌలుకు తీసుకుంటారు. అధీకృత ఒప్పందాల్లేక పోవడం వలన ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహాకాలు, రాయితీలే కాదు కనీసం పంట రుణాలు కూడా దక్కేవి కావు. టీడీపీ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ దీన్లో రూ.1.5 లక్షల్ని అప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచడమే కాదు. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్పడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది. కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో చనిపోతే దేశంలో రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నది ఒక్క మన రాష్ట్రంలోనే. కౌలుదారుల కుటుంబాలకునేరుగా పరిహారం వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న కౌలుదారులకు సీసీఆర్సీ కార్డు ఉంటే రూ. 7 లక్షలు, లేకుంటే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం నేరుగా బాధిత కౌలురైతు కుటుంబ సభ్యుల ఖాతాకు జమ చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 1,270 కేసులకు సంబంధించి రూ.88.90 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో 485 మంది కౌలురైతులుండగా, ఆ కుటుంబాలకు రూ. 33.95 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ. 23.70 కోట్ల పరిహారం చెల్లించగా, వీరిలో కూడా 212 మంది కౌలురైతులున్నారు. వీరికి రూ. 10.60 కోట్ల పరిహారం చెల్లించారు. -
రైతు పంట రుణాలపై ఆర్థిక సాయం
-
బంగారు రుణాలపై గురి
సాక్షి, అమరావతి: రైతుల వ్యవసాయ, కుటుంబ అవసరాలను తీర్చడంలో సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. పంట రుణాలకే పరిమితం కాకుండా ఇతర రుణాల మంజూరులోనూ ముందుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో బంగారంపై రికార్డు స్థాయిలో రూ.15,076 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాది కనీసం రూ.10 వేల కోట్ల విలువైన గోల్డ్ లోన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే విషయంలో వాణిజ్య బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ ఫైనాన్స్ వ్యాపార సంస్థలు ముందుంటున్నాయి. మెజార్టీ జాతీయ బ్యాంకులు తమకు నిర్ధేశించిన పంట రుణ లక్ష్యాలను అధిగమించేందుకు పెద్దఎత్తున బంగారంపై రుణాలు ఇస్తూ వాటిని పంట రుణాలుగా చూపిస్తున్నాయి. కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలు రెండు నిమిషాల్లోనే బంగారు రుణాలంటూ భారీ వ్యాపారం చేస్తున్నాయి. ఇవి డిమాండ్‌ను బట్టి ఏకంగా 15 నుంచి నుంచి 36 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. నెల రోజులకు ఒకలా.. రెండు నెలలకు మరోలా.. ఆరు నెలలు, ఏడాది కాల పరిమితితో ఒక్కో రీతిలో వడ్డీ వసూలు చేస్తున్నాయి. నాలుగేళ్లలో రూ.15,076 కోట్ల రుణాలు నాలుగేళ్ల క్రితం ఏటా రూ.500 కోట్లకు మించి బంగారు రుణాలిచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం ఏటా రూ.3,769 కోట్లకుపైగా రుణాలు ఇస్తున్నారు. 2018–19 వరకు ఏటా వెయ్యి కోట్లకు మించి బంగారు రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బంగారు రుణాలపై వసూలు చేసే వడ్డీ శాతాన్ని తగ్గించడంతో పాటు పీఏసీఎస్ స్థాయి వరకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో పాటు నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో బంగారు రుణాలకు ప్రాధాన్యత సహకార బ్యాంకులు బలోపేతం అయ్యేందుకు బంగారు ఆభరణాలపై రుణాల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులు పంట రుణాలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్స్‌ను సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం మూడేళ్ల క్రితం వడ్డీ రేట్లను సవరించడం కలిసొచ్చింది. గతంలో 2 లక్షలకు పైబడిన గోల్డ్ లోన్లపై 10.6 శాతం ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి.. రూ.2 లక్షల లోపు రుణాలపై 10.1 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించాయి. ఆరు నెలలకే తిరగరాసేలా మార్పు చేశారు. ఫలితంగా బంగారు రుణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రత్యేక దృష్టి పెట్టాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేలా పంట రుణాలతో పాటు వ్యవసాయ, కుటుంబ అవసరాల కోసం మంజూరు చేసే బంగారు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రైతుల అవసరాలకు తగినట్టుగా తక్కువ వడ్డీకే బంగారు రుణాలు మంజూరు చేస్తున్నాం. ఏటా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్నాం. – మల్లెల ఝాన్సీ, చైర్పర్సన్, ఆప్కాబ్ -
రూ. 2 లక్షల పంట రుణాలు తీసుకోండి.. మాఫీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతులు బ్యాంకుల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆ విధంగా తీసుకున్న రుణాలను తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. చేవేళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడే ఇందిరమ్మ రాజ్యంలో నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని పునరుద్ఘాటించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కారి్మకులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా, డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామన్నారు. ఒక్క హామీ నెరవేర్చని కేసీఆర్ తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని విస్మరించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతు వ్యతిరేకి అయిన కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 88 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను తన కుటుంబసభ్యులకు దోచి పెడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే పోలీసులను పంపి కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తామని, ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి రూ.5 లక్షల సాయం చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
కౌలు రైతులకూ భరోసా
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం సంకలి్పంచింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది కౌలు కార్డులు (పంట హక్కు సాగు పత్రాలు–సీసీఆర్సీ) జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. గతంలో కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందేవి కాదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల పేరిట బ్యాంకులు మొండిచేయి చూపడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3, రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసేవారు. కౌలు, వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచి్చన పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో కౌలు కార్డులు జారీ చేస్తున్నారు. సీసీఆర్సీల ద్వారా సంక్షేమ ఫలాలు సీసీఆర్సీల ద్వారా నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 సీజన్లో 2,72,720 మందికి, 2020–21లో 4,14,770 మందికి, 2021–22 సీజన్లో 5,24,203 మందికి, 2022–23లో 5,49,513 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు మంజూరు చేసింది. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలుదారులకు రూ.246.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీతో పాటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించింది. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు జారీ 2023–24లో కనీసం 8.81 లక్షల మందికి సీసీఆర్సీల జారీ చేయాలనే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉండగా.. ఇతర వర్గాలకు చెందిన 3,25,872 మంది ఉన్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా సాయం అందించేందుకు సీసీఆర్సీలు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో వీరికి వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నా. ఈ ఏడాది మినుము, వరి వేశా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు. గతేడాది రైతు భరోసా కింద రూ.13,500 జమయ్యాయి. ఈ ఏడాది కూడా కౌలుకార్డు తీసుకున్నా. రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేశామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. – కంపమళ్ల రమీజ, రుద్రవరం, కర్నూలు జిల్లా కౌలు కార్డు ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా నేను రెండెకరాలు కౌలుకు చేస్తున్నా. ఈ ఏడాది వరి, మొక్కజొన్న వేశాను. కౌలు కార్డు కోసందరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సులు లేకుండా సీసీఆర్సీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు ద్వారా రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. రైతు భరోసా సాయం కోసం అప్లోడ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. – వీరంకి గోపీకృష్ణ, మోరంపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
అన్నదాత.. అప్పు గోస!
► వికారాబాద్ జిల్లా ‘దోమ’కు చెందిన రైతు బాయిని వెంకటయ్య ఆరు నెలల క్రితం పంట రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఇతర బ్యాంకుల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తేవాలన్నారు. వెంకటయ్య ఇతర బ్యాంకుల చుట్టూ తిరిగి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకువచ్చి దరఖాస్తు చేసుకున్నారు. యాసంగి సాగు మొదలైనా ఇంకా రుణం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ► సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన సావిత్రమ్మ.. యాసంగిలో పంట రుణం కోసం బ్యాంకును ఆశ్రయించారు. కానీ బ్యాంకు అధికారులు కొర్రీలు పెట్టారు. ఇతర బ్యాంకుల్లో పంట రుణం తీసుకోనట్టు/ఎలాంటి బాకీ లేనట్టుగా ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలని.. లేకుంటే రుణం ఇచ్చే మాటే లేదని చెప్పారు. దీనితో ఆమె ఆ మండలంలోని ప్రధాన బ్యాంకుల చుట్టూ తిరిగి నో డ్యూస్ సర్టిఫికెట్‌పై సంతకాలు చేయించుకొచ్చారు. ఆ తర్వాతే పంట రుణం అందింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంట రుణాల కోసం రైతులు గోసపడుతున్నారు. బ్యాంకర్లు ఏదో ఓ కొర్రీ పెడుతూ రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సదరు మండలంలోని ఇతర బ్యాంకులకు వెళ్లి నోడ్యూస్ సర్టిఫికెట్లు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇప్పటికే ఉన్న పంట రుణాలు మాఫీ కాకపోవడంతో కొత్తగా రుణాలు ఇవ్వబోమని తేల్చి చెప్తున్నారు. దీనితో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థ పడుతున్నారు. చివరికి పంట పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. లక్ష్యం ఘనం.. ఇచ్చేది కొంచెం.. పంటరుణాల మంజూరుకు బ్యాంకులు, ప్రభుత్వం ఘనంగానే లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు మాత్రం పంట రుణాల కోసం వస్తున్న రైతులకు చుక్కలు చూపుతున్నారు. ఏదో ఒక కొర్రీ పెడుతూ తిప్పుకొంటున్నారు. ఈ విషయంలో రైతులకు బాసటగా నిలవాల్సిన వ్యవసాయ శాఖ ఏమీపట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. యాసంగి మొదలై రెండు నెలలైనా రైతులకు ఇప్పటివరకు అరకొరగానే రుణాలు అందుతున్నాయి. 2022–23 వానాకాలం సీజన్లో పంటరుణాల మంజూరు లక్ష్యం రూ.40,718 కోట్లుకాగా.. సీజన్ పూర్తయ్యే నాటికి బ్యాంకులు రూ. 21,272 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అంటే లక్ష్యంలో 52 శాతమే రుణాలు అందించాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌కు లక్ష్యం రూ.27,146 కోట్లుకాగా.. ఇప్పటివరకు ఇచ్చింది రూ.5వేల కోట్లలోపేనని వ్యవసాయ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ధరణితో సాంకేతిక సమస్యలంటూ.. గతంలో రైతుల పట్టాదారు పాస్‌బుక్కులు తనఖాగా పెట్టుకుని బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త విధానం తీసుకువచ్చారు. ప్రతి జాతీయ బ్యాంకుకు ధరణి పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. బ్యాంకర్లు ధరణి పోర్టల్‌లోకి లాగిన్ అయి సర్వే నంబర్లు, ఇతర వివరాలు సరిచూసుకుని పంట రుణాలు ఇస్తున్నారు. కానీ ధరణిలో సాంకేతిక సమస్యలతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటీవల నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖతో జరిగిన సమావేశాల్లో బ్యాంకర్లు ధరణి సమస్యల వల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పినట్టు తెలిసింది. ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యల వల్ల రైతుల సర్వే నంబర్లు నమోదు కావడం లేదు. పాస్‌బుక్‌లు ఉన్నా బ్యాంకర్ల లాగిన్‌లో కనిపించడం లేదు. కొన్నింట్లో బ్యాంకర్లు ఎంట్రీ చేయడానికి ప్రయత్నించినా నమోదు కావడం లేదు. పలు గ్రామాలు ఇంకా ధరణిలో నమోదుగాకపోవడం, కొన్ని గ్రామాల్లో సర్వే నంబర్లలో ఉన్న భూమికి, ధరణిలో నమోదైన భూమికి తేడాలు ఉండటం వంటి సమస్యలు నెలకొన్నాయి. ఇలాంటి ఇబ్బందులున్న రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీనితో లక్షల మంది రైతులకు పంట రుణం అందకుండా పోతోంది. రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగక.. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతోనూ రైతులకు రుణాలు అందని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.37 వేల వరకు బకాయిలున్న రైతులకే రుణమాఫీ చేసింది. ఆపై రుణాలున్న వారికి మాఫీ కావాల్సి ఉంది. రైతులు బ్యాంకు రుణాలను రెన్యువల్ చేసుకోవాలని, ప్రభుత్వం తర్వాత చెల్లిస్తుందని మంత్రులు ప్రకటించినా.. కొందరే అలా రెన్యువల్ చేసుకున్నారు. చాలా మంది రైతులు ప్రభుత్వం నుంచి రుణమాఫీ సొమ్ము వచ్చిన తర్వాతే రెన్యువల్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. వారికి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. మరోవైపు 2018నాటికి ఉన్న బకాయిలపై వడ్డీ, చక్రవడ్డీ కలిసి తడిసి మోపెడవుతోంది. కొన్నిచోట్ల బ్యాంకు అధికారులు రైతుబంధు సొమ్మును బకాయిల కింద జమ చేసుకుంటున్నారని.. అలా చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా బ్యాంకర్ల తీరు మారడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోడ్యూస్ సర్టిఫికెట్ తెస్తేనే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రాజు పంటరుణం కోసం ఏపీజీవీబీని సంప్రదించారు. కానీ బ్యాంకు అధికారులు ఆయనను దొమ్మాట, చేగుంట, నార్లాపూర్లలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి ‘నోడ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఆయన పది రోజులు తిరిగి అన్ని బ్యాంకుల్లో సంతకాలు తీసుకొచ్చిన తర్వాతే రుణం మంజూరు చేశారు. -
సాగుకు భరోసా.. విరివిగా పంట రుణాలు
వ్యవసాయరంగానికి జగన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల ద్వారా రైతులకు విరివిగా రుణాలు ఇస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో అంచనాకు మించి పంట రుణాలు మంజూరు చేసింది. రూ.11,957 కోట్ల వార్షిక రుణప్రణాళిక లక్ష్యంలో రెండో త్రైమాసికం ముగిసేలోపు అంటే సెప్టెంబర్ నెలాఖరుకే రూ.9,077 కోట్లతో 76 శాతం సాధించిన బ్యాంకర్లు గడువులోగా వంద శాతం సాధించే దిశగా అడుగులేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు తోడుగా ఉంటోంది. పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో ఇప్పించి వ్యవసాయం సాఫీగా సాగేలా చూస్తోంది. ఖరీఫ్‌లో సాగుకు వీలుగా ఏటా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.3,204.24 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా 127 శాతంతో రూ.4,068.62 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం రూ.2,226.68 కోట్లు లక్ష్యంగా రబీ రైతులకు పంట రుణాల మంజూరు కొనసాగుతోంది. వ్యవసాయ టర్మ్ లోన్ల లక్ష్యం రూ.1,545.32 కోట్లు కాగా.. 121 శాతంతో రూ.1,869.81 కోట్లు మంజూరు చేశారు. ఇక అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.16.61 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల కింద రూ.92.18 కోట్లు ఇచ్చారు. ఇలా... మొత్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాల కింద రైతులు, ఇతర లబ్ధిదారులకు రూ.6,047.22 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఇతరత్రా రంగాలకూ విరివిగా రుణాలు వ్యవసాయంతో పాటు ఇతర రంగాలకూ విరివిగా రుణాలు అందించారు. అందులో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం కింద రూ.795.15 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాల కింద రూ.97.61 కోట్లు, నాన్ ప్రయారిటీ సెక్టార్ కింద రూ.1,780.72 కోట్లకు గానూ 116 శాతంతో ఏకంగా రూ.2,081.90 కోట్లు మంజూరు చేశారు. ఇలా రూ.11,957.94 కోట్ల వార్షిక రుణప్రణాళిక (లోన్ క్రెడిట్‌ప్లాన్–2022–23) అమలులో భాగంగా రెండో త్రైమాసికం ముగిసేనాటికే 76 శాతంతో రూ.9,077.42 కోట్లు పూర్తయింది. 2023 మార్చి 31 వరకు గడువు ఉన్నందున ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెరిగిన బ్యాంకింగ్ నెట్వర్క్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ నెట్వర్క్ బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు సహకార, గ్రామీణ బ్యాంకులు దాదాపు 43 ప్రిన్సిపల్ బ్యాంకులు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాల మంజూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రూ.1,567 కోట్లు, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1,429 కోట్లతో పోటీపడుతూ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత యూనియన్ బ్యాంకు, కెనరాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), బ్యాంకు ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, కరూర్ వైశ్యాబ్యాంకు, ఐడీబీఐ తదితర ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మొత్తమ్మీద చూస్తే... ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రూ.4,453 కోట్లు, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల ద్వారా రూ.4,201 కోట్లు ఇవ్వగా తర్వాత గ్రామీణ, సహకార బ్యాంకుల ద్వారా రైతులు, అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాయి. రుణాల మంజూరుకు పోటీ రైతులతో పాటు అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల పురోభివృద్ధికి ఇటీవల కాలంలో బ్యాంకర్లు పోటీ పడి రుణాలు మంజూరు చేస్తుండటం మంచి పరిణామం. దీంతో వార్షిక లక్ష్యంలో గణనీయమైన పురోగతి సాధించి గడువులోగా వంద శాతం చేరుకునే దిశగా రుణాల మంజూరు కొనసాగుతోంది. రైతులతో పాటు మహిళా సంఘాలు, విద్యా, వాహన, గృహ, పరిశ్రమలు, వ్యక్తిగత రుణాలు... ఇలా అన్నింటికీ అవసరమైన రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు మొగ్గుచూపుతున్నారు. – బి.నాగరాజారెడ్డి, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్డీఎం) రూ.85 వేల పంట రుణం నాకు 2.75 ఎకరాల పొలం ఉంది. బొమ్మగానిపల్లి కెనరా బ్యాంకులో రూ.85 వేల పంట రుణం ఇచ్చారు. దీని వల్ల సకాలంలో పంట పెట్టుబడికి ఉపయోగపడింది. 2021లో తీసుకున్న పంట రుణాలకు వైఎస్సార్ పంట రుణాల సున్నావడ్డీ కింద ఇటీవల రూ.3 వేల వడ్డీ రాయితీ కూడా జమ కావడం సంతోషంగా ఉంది. – విరుపాక్షి, రైతు, ముప్పాలకుంట, బ్రహ్మసముద్రం మండలం -
ఏది నిజం ?: ‘సున్నా వడ్డీ’లోనూ వక్రమార్కుడు.. రామోజీ విషపు రాతలు
బురదజల్లుడు, అబద్ధాలు అచ్చేయడం, అర్థంపర్థంలేని వార్తలు వండి వార్చడంలో తన రికార్డులను తానే బద్దలుకొట్టుకుంటున్న ఎల్లో జర్నలిస్ట్ రామోజీరావు ఎప్పటిలాగే టీడీపీ వైపు తన చేతివాటాన్ని మరోసారి ప్రదర్శించారు. ఈసారి ఆయన రూటు సాగువైపు మళ్లింది. ‘వడ్డీ రాయితీ పెద్ద సున్నా’ అంటూ ఆయన తాజాగా అచ్చోసిన అసత్యాల కథనం నిజంగానే నిజాల్ని దాచి వండిన వంటకం. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ఈనాడు పత్రిక కూడా ఆ పాఠకులకు అంతే హానికరం. ఎందుకంటే.. రాష్ట్రంలో చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి’ 2019లో శ్రీకారం చుట్టింది. రూ.లక్షలోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్ రాకముందే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తూ వారికి అండగా నిలుస్తోంది. కానీ, టీడీపీ ఐదేళ్లలో 40.61 లక్షల మందికి కేవలం రూ.685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 3.5 ఏళ్లలో 73.88 లక్షల మంది వాస్తవ సాగుదారులకు ప్రస్తుత వైఎస్ జగన్ సర్కారు రూ.1,838.61 కోట్లు చెల్లించింది. వీటిలో రూ.1,180.66 కోట్లు టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలే. ఇలా బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఏటా క్రమం తప్పకుండా అర్హతగల ప్రతీ రైతుకు అణా పైసలతో సహా వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంటే చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఈనాడు రామోజీరావు కళ్లున్న కబోదిలా ప్రవర్తిస్తూ ఆ పత్రికల పాఠకులపై చిమ్ముతున్న విషానికి అంతులేకుండా పోతోంది. నిజానికి.. గతంలో ఇంతపెద్ద ఎత్తున, ఇంత పారదర్శకంగా డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా వడ్డీ రాయితీ పథకాన్ని అమలుచేసిన దాఖలాల్లేవు. అయినా ఇవేమీ ఎల్లో జర్నల్ అయిన ఈనాడుకు కన్పించవు. అర్హుల జాబితా ప్రదర్శించినా అక్కసే.. మరోవైపు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి మరింత మెరుగులద్ది పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేసేలా ఏర్పాటుచేశారు. ఈ డేటా ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు.. మొబైల్ ద్వారా ఎస్వీపీఆర్ (సున్నా వడ్డీ పంట రుణాల) పోర్టల్ https://karshak. ap. gov. in/ ysrsvpr/లోకి వెళ్లి హోంపేజీలో ‘know your status‘ అనే విండో ఓపెన్ చేసి తమ ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఒకవేళ ఏడాదిలోగా రూ.లక్షలోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాల్లో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా జమచేస్తున్నా ఈనాడు తట్టుకోలేకపోతోంది. అంతేకదా.. రామోజీ. ఎక్కువమంది లబ్ధి పొందేలా విస్తృత ప్రచారం ఇక రూ.లక్ష లోపు రుణం సకాలంలో చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వడ్డీ భారం నుంచి రైతులు విముక్తి పొందేందుకు వీలుగా రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కరపత్రాలు, వాల్ పోస్టర్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత నెల 28న రబీ 2020–21, ఖరీఫ్ 2021 సీజన్లలో అర్హత పొందిన 8.22 లక్షల మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల పొదుపు ఖాతాలకు జమచేశారు. ఇలా గడిచిన మూడున్నరేళ్లలో పాత బకాయిలు కలిపి 73.88 లక్షల మందికి రూ.1,838.61 కోట్లు చెల్లించారు. పాత బకాయిలకు సంబంధించే కాదు గడిచిన మూడేళ్లకు సంబంధించి కూడా ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేకుండా అర్హుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ రాయితీ జమచేశారు. అయినా ఇవన్నీ విస్మరించి ఎందుకు రామోజీ ఈ వయస్సులో అబద్ధాల సాగుకు అంత ఆయాసం..? రూ.1,180.66 కోట్ల బకాయిలు ఈనాడుకు కన్పించవు కానీ, ఈ పరిస్థితులకు వైఎస్ జగన్ సర్కార్ చెక్ పెట్టింది. వడ్డీ రాయితీని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ (డీబీటీ) చేసేలా మార్పుచేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. టీడీపీ హయాంలోని బకాయిల చెల్లింపునకూ ముందుకొచ్చి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని ఆయన చాటుకున్నారు. ఇలా 2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 39.08 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్ల బకాయిలను చెల్లించారు. బాబు ఎగ్గొట్టిన ఈ బకాయిలపై ‘ఘనత వహించిన’ ఈనాడు ఏనాడు దీనిపై వార్త రాసిన పాపానపోలేదు. అలాగే, ఐదేళ్లలో కేవలం 40.61 లక్షల మందికి రూ.685.46 కోట్లే చెల్లిస్తే ఎందుకింత తక్కువ చెల్లించారని కూడా ప్రశ్నించడానికి రామోజీకి పెన్ను పెగలలేదు. రామోజీ.. అప్పట్లో అప్పులకు జమచేసుకోలేదా? వాస్తవానికి ప్రతీ సీజన్లో వ్యవసాయ అవసరాల కోసం రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారు. రూ.లక్షలోపు రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలుచేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తుంది. మిగిలిన 4 శాతం రైతులు భరించేవారు. గతంలో ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో వీలునుబట్టి బ్యాంకులకు అరకొరగా జమచేసేవారు. ఈ మొత్తం జమకాగానే బ్యాంకులు వెంటనే రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసేసేవారు. అలాగే, గతంలో క్లెయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచీలకు మాత్రమే వీలుండేది. దీంతో ఎంతమంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు శాఖలకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. -
రైతులకు మరింత ధీమా
కడప సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌సబ్సిడీ రాయితీ పథకాలు అన్నదాతలకు మరింత ధీమాను ఇస్తున్నాయని కలెక్టర్ విజయరామరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణిలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2020–21 సంవత్సరానికి రబీ సీజన్‌కు సంబంధించి, 2021 ఖరీఫ్ కాలానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాలు, 2022 ఖరీఫ్‌లో ఇన్పుట్ సబ్సిడీ కింద లబ్ధి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ విజయరామరాజుతోపాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నగర మేయర్ సురేష్‌బాబు, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లేల ఝాన్సీరాణి, జేసీ సాయకాంత్‌వర్మ, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పులివెందుల మార్కెట్‌యార్డు చైర్మన్ చిన్నప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అన్నదాతలకు కొండంత అండ : కలెక్టర్ విజయరామరాజు ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన 12,112 మంది జిల్లా రైతులకు మంజూరైన రూ. 2.69 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 24,920 మంది రైతులకు రూ. 6.05 కోట్లు, అలాగే 2020 ఖరీఫ్ సీజన్‌కుగాను సున్నా వడ్డీ కింద 30233 మంది వివిధ కారణాలతో జమకాని రైతులకుగాను రూ. 7.30 కోట్లు జమ అయిందన్నారు. మొత్తంగా జిల్లాలో 67,265 మంది రైతులకు రూ. 16.04 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2022 ఖరీఫ్ కాలానికి ఇన్పుట్ సబ్సిడీ కింద జిల్లాలో 3855 మంది రైతులకు రూ. 4.33 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. మెగా చెక్కు అందజేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీసీ అనంతరం సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మెగా చెక్కులను కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ►ఈ కార్యక్రమంలో వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ శారద, డీసీఓ సుభాషిణి, వ్యవసాయ ఏడీలు నరసింహారెడ్డి, సుబ్బారావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం: ఎస్.రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతు తలెత్తుకుని జీవించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. రైతు దేశానికి వెన్నముక అని, రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. అన్నదాతల కోసం అమూల్య పథకాలు : సురేష్‌బాబు, నగర మేయర్ అన్నదాతల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్యమైన పథకాలను అమలు చేస్తున్నారని నగర మేయర్ సురేష్‌బాబు తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం సజావుగా సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదేనన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మల్లెల ఝాన్సీరాణి, ఆప్కాబ్ చైర్ పర్సన్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పతరువులు : సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా కల్పతరువుగా మారాయని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పేర్కొ న్నారు. ప్రభుత్వం విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందుతున్నాయన్నారు. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన నాయకుడు జగనన్న. ప్రభుత్వ మద్దతు ధరతో పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోగలిగాను. – భాస్కర్, రైతు, యల్లారెడ్డిపల్లె, కమలాపురం జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి అనేక మార్పులు తెచ్చి ఆపన్నహస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటున్నాను. – పి.వీరారెడ్డి, చౌటపల్లె, కడప రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష. – ఎం.సుబ్బిరెడ్డి, చౌటపల్లె, కడప -
రుణాలు బడా వ్యాపారులకేనా.. రైతులకు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలను నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) కింద రద్దు చేసే పాలకులు, ఆరుగాలం కష్టపడే రైతుకు రుణమాఫీ చేయమంటే మాత్రం వెనకాడుతారెందుకని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అంబానీ, అదానీ, ఇతర సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గురువారం ఇక్కడి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రైతు ప్రభుత్వమా? లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? అని నిలదీశారు. తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైతు రుణమాఫీ గురించి చొరవ చూపితే బాగుండేదని హితవు పలికారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇప్పించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, కేంద్రమంత్రి పర్యటన ఉపన్యాసాలకే పరిమితం కావడం విచారకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఎక్కువ వడ్డీకి ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక ప్రైవేటు అప్పులు తీర్చలేని పరిస్థితిల్లో రైతులు ఉన్నారని, ఈ దుస్థితి వారి ఆత్మహత్యలకు దారితీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని భట్టి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై ఫైర్ -
అన్నదాతకు ఆలంబన
సాక్షి, అమరావతి: సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని మరింత మంది అన్నదాతలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020–21 రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే నెలలో వడ్డీ రాయితీని జమ చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7.20 లక్షల మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వడ్డీతో సహా రుణాలు చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువున్నందున మరింత మందికి పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 31 లోగా రుణాలు చెల్లించేందుకు ఆర్బీకేల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తీసుకున్న పంట రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో 3 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 4 శాతం వడ్డీని అర్హులైన రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం కింద 2019 ఖరీఫ్‌లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, 2019–20 రబీలో 5.61లక్షల మందికి రూ.92.39 కోట్లు, 2020 ఖరీఫ్‌లో 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా 2014–15 నుంచి 2018–19 మధ్య 42.32 లక్షల మంది రైతులకు గత ప్రభుత్వం చెల్లించని రూ.1180.66 కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమ చేసింది. 2020–21 రబీలో రికార్డు స్థాయిలో 38.76 లక్షల మంది రైతులకు రూ.72,724 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చారు. వీటిలో 12.70 లక్షల మందికి రూ.19 వేల కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు. వీరిలో లక్ష లోపు రుణాలు తీసుకుని ఇప్పటికే తిరిగి చెల్లించిన వారు 7.20 లక్షల మంది. మిగతా వారు కూడా రుణాలు చెల్లించి, ఈ పథకానికి అర్హత పొందేలా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఈ పథకం కింద రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. అర్హత పొందాలంటే.. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటే సాగు చెయ్యాలి. పంట వివరాలను తప్పనిసరిగా ఈ క్రా‹ప్లో నమోదు చేయించాలి. రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా (మార్చి 31వ తేదీ) చెల్లించాలి. దీనిపై ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ ఒక ఆధార్ నంబరుపై ఒక అకౌంట్ నంబర్‌ను మాత్రమే మ్యాప్ అయ్యేలా డేటాను అప్డేట్ చేస్తున్నారు. గడువులోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తారు. అర్హులైన రైతుల వివరాలను బ్యాంకుల ద్వారా వైఎస్సార్ ఎస్వీపీఆర్ పోర్టల్‌లో ఏప్రిల్ 7వ తేదీలోగా అప్లోడ్ చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ పథకం కింద రైతులకు 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది, రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని, మార్చి 31 లోపు వడ్డీతో సహా రుణం మొత్తాన్ని చెల్లించిన వారు బ్యాంక్‌ను సంప్రదించి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ -
అసలైన సాగుదారులకు దన్నుగా..
సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్‌లో నమోదుకు చర్యలు చేపట్టారు. నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. సాగుదారుల గుర్తింపు ఇలా.. ► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి. ► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు. ► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు. ► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. సీసీఆర్సీ అంటే.. సీసీఆర్సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు. ఈ–క్రాప్‌తో ప్రయోజనాలు.. ► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు. ► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. ► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు. ► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. భూ యజమానులకు పూర్తి రక్షణ ఈ–క్రాప్‌లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది. -
TS: మొండిచెయ్యి.. సగం రుణాలూ ఇవ్వలేదు..
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్ లక్ష్యంలో సగం రుణాలు కూడా ఇవ్వకపోడం విచారకరం. ఈ సీజన్లో రూ.35,665 కోట్లు ఇవ్వా లనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ. 15,500 వేల కోట్ల మేరకే రుణాలు మంజూరు అయ్యాయి. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందుగానే రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి. ఆ ప్రకారం జూన్‌లో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు మే నెల నుంచే రుణాలు ఇవ్వాలి. కానీ రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. బ్యాంకుల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన వ్యవసాయశాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ఐదు రోజుల క్రితం ముగిసింది. పంటల సాగు 111 శాతం ఉండగా రుణాల మంజూరు మాత్రం మరీ నిరాశాజనకంగా ఉంది. 1.19 కోట్ల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రెండు మూడేళ్లుగా వ్యవసాయ పంటల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులున్నారు. వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, 1.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 61.94 లక్షల ఎకరాల్లో సాగైంది. సాధారణం కంటే వరి ఏకంగా 182 శాతం సాగైంది. వాస్తవంగా వరి రైతులే ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. అయితే వరి సాగైనంత స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఇక పత్తి 46.42 లక్షల ఎకరాల్లో, కంది 7.64 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ పంటలకు కూడా రుణాలు ఆ స్థాయిలో అందలేదు. (2021–22కు సంబంధించిన మొత్తాలు వానాకాలం సీజన్వే) రూ. 5 వేల కోట్ల ప్రైవేట్ అప్పులు! 2021–22 రెండు సీజన్లలో రూ. 59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో ఈ సీజన్‌కు రూ. 35,665 కోట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు అందులో 43.45% మేరకే రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. బ్యాంకుల తీరు కారణంగానే రైతులు రుణాలు పొందలేక పోయారనే విమర్శలున్నాయి. కొద్దిపాటి రుణాలు తీసుకోవడానికి రైతులు ఎలాం టి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పా సు పుస్తకాలు తీసుకొని పంట రుణాలు ఇచ్చా యి. నిస్సహాయ పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల వద్ద అప్పులు చేశారు. ఒక అంచనా ప్రకారం రూ.5 వేల కోట్ల ప్రైవేట్ అప్పులు చేసినట్లు అంచనా. మరి ముఖ్యంగా రైతుబంధుకు కాని, బ్యాంకు రుణాలకు కాని నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వీరికి ప్రైవేట్ రుణాలు తప్ప మరో ఆధారం లేదని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదికేడాదికీ తగ్గుతున్న రుణాలు 2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో బ్యాంకులు తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి 115 శాతం పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది రూ.10,233 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, రూ. 11,787 కోట్లు ఇచ్చాయి. ఇక 2012–13లో ఏకంగా 121 శాతం, 2013–14లో 103 శాతం ఇచ్చాయి. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక 2014–15లో పంట రుణాల లక్ష్యంలో 93 శాతమే ఇచ్చాయి. అలా క్రమంగా రుణాల మంజూరు తగ్గిస్తూ వస్తున్నాయి. -
వ్యవసాయం.. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, అమరావతి: వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) పెద్దపీట వేస్తోందని బ్యాంక్ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్‌కుమార్ జన్నావర్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ రంగంలో పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు కూడా సహకార బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అతి తక్కువ వడ్డీ రేటుతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి రుణాలు తీసుకుని పంట కోతల అనంతర పనులకు, గిడ్డంగుల నిర్మాణాలకు వినియోగించుకోవచ్చని రైతులకు సూచించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు రుణాలు వివిధ కారణాల వల్ల వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. ఈ రంగంలో మౌలిక వసతులు ఏర్పడాలంటే దీర్ఘకాలిక రుణాలు అవసరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో అదే విషయం చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు నాబార్డ్ ఏం చేయగలుగుతుందనే దానిపై చర్చిస్తున్నాం. నాబార్డ్ ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఏఐఎఫ్) ఏర్పాటైంది. దీని నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిధిని పంట కోతల అనంతర కార్యకలాపాలు అంటే ధాన్యం నిల్వ కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్‌లు, అదనపు విలువ జోడింపు గదులు వంటి వాటి కోసమే ఇస్తారు. 324 ఎఫ్‌పీవోలకు ప్రోత్సాహం... రాష్ట్రంలో ప్రస్తుతం 324 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీవోలు) ప్రోత్సహిస్తోంది. వీటిలో 259 సంఘాలు రిజిస్టర్ అయ్యాయి. ఇవి చాలా పురోగతిని సాధిస్తున్నాయి. ఆ సంఘాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే దశకు వచ్చాయి. వీటికి పరపతి సౌకర్యం కూడా బాగుంది. భవిష్యత్ అంతా ఎఫ్‌పీవోల పైనే ఆధారపడే పరిస్థితి రావొచ్చు. వర్షాధారిత ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలకు నాబార్డ్ అండగా నిలుస్తుంది. 200 వాటర్ షెడ్ పథకాలను ప్రోత్సహిస్తున్నాం. -
మాఫీ.. వారంతా హ్యాపీ
సాక్షి, చేవెళ్ల( రంగారెడ్డి): రుణమాఫీ రెండో విడతకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి రూ.50వేల రుణాలు ఉన్నవారికి మాఫీ వర్తింపచేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రల కేబినెట్ సమాశంలో రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో అర్హత సాధించిన రైతుల్లో 30–40 శాతానికిపైగా రెండో విడతలో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఊరిస్తున్న రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ► ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు కుటుంబానికి రూ.లక్ష వడ్డీతో కలుపుకొని నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. ► దీని ప్రకారం గత ఏడాది తొలివిడత రూ.25వేల లోపు రుణం ఉన్న రైతులకు వర్తింపచేశారు. ► ఇది జిల్లాలోని 10 శాతం మంది రైతులకు మాత్రమే వర్తించింది. కొంతమంది అర్హులైన వారికి పలు కారణాలతో వర్తించ లేదు. ► రుణాలు పొందిన రైతులు మాఫీ వస్తుందని బ్యాంకులకు బాకీలు కట్టడం మానేశారు. ► ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడిస్తోందో తెలియక బ్యాంకర్లు బాకీలు కట్టాలని రైతులపై ఒత్తిడి చేయడం పరిపాటిగా మారింది. ► రెండో విడత రుణమాఫీపై ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ► ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుండటంతో వెంటనే రెండో విడత రుణమాఫీ విడుదలపై నిర్ణయం తీసుకుంది. ► ఈ నెల 16నుంచి రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీ డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత.. ► జిల్లాలో మొత్తం 1,46,417 మంది రైతులు రుణమాఫీ పొందేందుకు అర్హులని అధికారులు గుర్తించారు. ► ఇందులో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న పది శాతం మందికి మాత్రమే వర్తించింది. ► ఇప్పుడు రెండో విడతలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులకు మాఫీ చేసేందుకు నిర్ణయించడంతో 30 నుంచి 40 శాతం మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ► రూ.50 వేల లోపు ఉన్న రైతులకు సంబంధించి రెండో విడతలో అమలు చేసేందుకు బ్యాంకర్ల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ► ఒకటి, రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా పక్కా సమాచారం అందుతుందని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. ► జిల్లాలో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న వారిని 17,943 మందిగా గుర్తించగా ఇందులో 10,928 మందికిగాను రూ.16.73కోట్లు విడుదల చేసింది. ► మిగతావారికి వివిధ కారణాలతో రుణమాఫీ వర్తించలేదు. వారికి ఇప్పుడు రెండో విడతలో వడ్డీతో కలుపుకొని రూ.50వేలలోపు రుణమాఫీ కానుందని అధికారులు చెబుతున్నారు. -
నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’
సాక్షి, అమరావతి: రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు. రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది కూడా.. అంటే 2019–20 రబీ సీజన్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు. సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ–క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపుల కోసం సోమవారం ఆర్థికశాఖ నిధులు విడుదల చేయగా వ్యవసాయశాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. గత ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ మేరకు ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్‌కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమచేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు రూ.61,400 కోట్ల సాయం చేసింది. (చదవండి: ప్రతి ‘పార్లమెంట్’ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) -
అర్జీ ఇవ్వండి.. రుణం తీసుకెళ్లండి
యాచారం: రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఇవ్వడానికి యాచారం పీఏసీఎస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉండి ఏ బ్యాంకులో రుణం పొందని రైతులకు రుణాలు ఇచ్చేందుకు పీఏసీఎస్ పాలకవర్గం కృషిచేస్తుంది. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా రైతులకు పీఏసీఎస్ సేవలు అందేలా చూస్తున్నారు. యాచారం పీఏసీఎస్‌లో దాదాపు 7 వేలకు పైగా సభ్యులు ఉన్నారు. ఇందులో 4,985 మంది రైతులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక, వ్యవసాయ తదితర పద్దుల కింద రూ.40 కోట్లకు పైగా రుణాలు పొందారు. ప్రస్తుతం దీర్ఘకాలిక రుణాల కోసం 200 మందికి పైగా అర్జీలు పెట్టుకున్నారు. గ్రామాల్లో ముమ్మర ప్రచారం.. ఈ ఏడాది యాచారం పీఏసీఎస్‌లో రూ.2 కోట్లకు పైగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు సంఘం నిర్ణయించింది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి రైతును పీఏసీఎస్‌లో భాగాస్వామ్యం(రుణాలు కల్పించి సభ్యత్వం ఇవ్వడం) చేసే విధంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయా గ్రామాల్లో పీఏసీఎస్ డైరెక్టర్ల ద్వారా రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అప్పు పరిమితి పట్టిక(క్రెడిట్ లిమిట్) తయారు చేసి డీసీసీబీకి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఇప్పటికే డీసీసీబీ నుంచి యాచారం పీఏసీఎస్‌కు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. మరో రూ.1.50 కోట్ల నిధుల మంజూరుకు పీఏసీఎస్ అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. వ్యవసాయ పంట రుణాలు ఇలా..(ఎకరాకు) వరి, పత్తి తదితర మెట్ట పంటలకు రూ.30 వేలు కూరగాయల పంటలకు రూ.38 వేలు ప్రతి రైతుకు రుణం ఇస్తాం మండలంలోని 24 గ్రామాల్లో వ్యవసాయ భూమి కలిగి ఉండి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న ప్రతి రైతుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు అర్జీలు స్వీకరిస్తున్నాం. ప్రతి రైతుకు సభ్యత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. – తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, యాచారం