Cyber crimes
-
TG: పెరుగుతున్న సైబర్ నేరాలు.. 1866 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 18 శాతం పెరిగాయన్నారు సీఐడీ డీజీ షికా గోయల్. దేశవ్యాప్తంగా లక్ష, తెలంగాణలో 19వేల కేసులు నమోదైనట్టు చెప్పారు. రాష్ట్రంలో సైబర్ నేరాల ద్వారా రూ.1866 కోట్లు దోచుకున్నట్టు వెల్లడించారు.తెలంగాణలో ఈ ఏడాది సైబర్ నేరాలకు సంబంధించి రిపోర్టును సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. ఈ సందర్బంగా షికా గోయల్ మాట్లాడుతూ..‘గత ఏడాదితో పోలిస్తే 18% సైబర్ నేరాలు పెరిగాయి. ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 1.14 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది సైబర్ క్రైమ్ ద్వారా 1866కోట్లను సైబర్ నేరస్థులు దోచుకున్నారు. సైబర్ నేరస్థుల నుంచి రూ.176కోట్లు రీ ఫండ్ చేశాము. పలు కేసులకు సంబంధించి 1057 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశాం. దేశ వ్యాప్తంగా లక్షకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 19వేల కేసులు ఫైల్ అయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితులు ఈ జిల్లాల నుంచే ఎక్కువగా ఉన్నారు’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైబర్ నేరగాళ్ల భారతం పడుతోంది TGCSB. మ్యూల్ ఖాతాలపై ఉక్కుపాదం మోపింది. బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో 21 మంది సైబర్ కేటుగాళ్లను పట్టుకున్నారు. అలాగే, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఏజెంట్స్‌ను అరెస్ట్ చేశారు. వీరంతా తెలంగాణ, రాజస్థాన్‌లో భారీ ఆపరేషన్లు జరుపుతున్నట్టు గుర్తించారు. అరెస్ట్ సందర్భంగా వీరి వద్ద నుంచి 20 మొబైల్స్, నాలుగు బ్యాంక్ పాస్ బుక్స్, ఐదు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక, వీరికి దేశవ్యాప్తంగా వీరికి 714 మంది క్రిమినల్స్‌తో లింక్ ఉన్నట్టు గుర్తించారు. -
పెచ్చరిల్లుతున్న డిజిటల్, సైబర్ నేరాలు
భువనేశ్వర్: డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలతోపాటు కృత్రిమ మేధతో సామాజిక, కుటుంబ సంబంధాలకు భంగం కలిగే డీప్‌ఫేక్ కేసులు పెరుగుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను గరిష్ట స్థాయిలో వాడుకుంటూ పోలీస్ కానిస్టేబుళ్లపై పనిభారం తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించారు. పోలీసు సిబ్బంది, వనరుల కేటాయింపులో పోలీస్స్టేషన్లు కేంద్ర స్థానాలుగా మారాలన్నారు. ఆదివారం ప్రధాని మోదీ 59వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సులో మాట్లాడారు. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనే విషయమై సదస్సులో అన్ని కోణాల్లోనూ విస్తృత స్థాయి చర్చలు జరిగినందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కృత్రిమ మేధను వాడుకుంటూ సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని కోరారు. అర్బన్ పోలీసింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 100 నగరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. -
పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: డబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి ప్రజల నుంచి పాత, వినియోగంలో లేని మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి సైబర్ నేరాలకు వాడుతున్న కేటుగాళ్ల ముఠాను రామగుండం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుంచి ఏకంగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను బిహార్‌లోని కొందరికి ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. సేకరించిన పాత మొబైల్ ఫోన్లను రిపేర్ చేసి వాటిని జామ్‌తార, దియోగఢ్‌లోని సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. వారిని బిహార్‌కు చెందిన మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలామ్, మహ్మద్ ఇఫ్తికర్గా గుర్తించారు. నిందితులపై రామగుండం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట్ 66 డీ, బీఎన్ఎస్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు టీజీ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా చిక్కారు..బిహార్‌కు చెందిన కొందరు వ్యక్తులు పట్టణంలో తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు రామగుండం సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. వారు గోదావరిఖనిలో తనిఖీ చేయగా ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు పట్టుబడ్డాయి. గత నెల రోజులుగా రామగుండంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పాత మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి బిహార్‌లోని తమ ముఠాలకు చేరవేసినట్టు నిందితులు అంగీకరించారు. కాగా అపరిచిత వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లను విక్రయించవద్దని శిఖాగోయల్ సూచించారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు మొబైల్ ఫోన్ పాత యజమాని డివైస్ ఐడెంటీనే పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తుందని, దీనివల్ల చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. -
కళ్ళు మూసి తెరిచేలోగా మీకు తెలియకుండానే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ..!
-
తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ లింకుల్ని క్లిక్ చేయొద్దు
హైదరాబాద్, సాక్షి: రుణమాఫీ సొమ్ము జమ అవుతున్న వేళ.. తెలంగాణ రైతుల్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. అనవసరమైన లింకుల్ని క్లిక్ చేయొద్దని రైతుల్ని హెచ్చరిస్తోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కీలక సూచన చేసింది. గత కొంతకాలంగా వాట్సాప్‌లో ఏపీకే(APK) లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. ఆర్టీవో అధికారులు, బ్యాంకుల పేరిట ఆ లింకులు వస్తున్నాయి. అవి క్లిక్ చేసి చాలామంది మోసపోతున్నారు. ఈ క్రమంలో అలాంటి లింకులు వస్తే క్లిక్ చేయొద్దని తెలంగాణ రైతుల్ని సీఎస్బీ అప్రమత్తం చేస్తోంది. ఒకవేళ పొరపాటున లింకులు క్లిక్ చేసి ఎవరైనా డబ్బులు పొగ్గొటుకుంటే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతోంది.మరోవైపు.. రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు, మెసేజ్ లు వస్తాయని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని తెలంగాణ పోలీసులు రైతులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిని క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, అలాగే.. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, వివరాలు చెపొద్దని రైతులకు అలర్ట్ జారీ చేసింది. -
మహిళల భద్రతకు ‘పచ్చ’ముప్పు
సాక్షి, అమరావతి : చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన మునుపెన్నడూలేని రీతిలో బరితెగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు పన్నాగం పన్నుతూ యావత్ మహిళల భద్రతకు పెనుముప్పుగా మారారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ రూపొందించిన ‘వుయ్ యాప్’ రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రమాదంగా పరిణమించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాలను ఉల్లంఘించి రూపొందించిన ఈ యాప్ మహిళల భద్రత పాలిట పెనుగండంగా మారింది. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న టీడీపీ ‘వుయ్ యాప్’ బాగోతం కథాకమామిషు ఏమిటంటే.. వ్యక్తిగత సమాచారం అంతా ‘పచ్చ’ముఠా గుప్పెట్లోరాష్ట్రంలో ఓటర్ల వివరాలన్నింటినీ చంద్రబాబు ముఠా అక్రమంగా సేకరించింది. గతంలో అధికారంలో ఉండగా నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌కు అనుసంధించారు. ప్రస్తుతం కూడా టీడీపీ అదే రీతిలో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించింది. ఓటర్ల పేర్లు, చిరునామాలు, వయసు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఫొటోలు.. ఇలా పూర్తి వివరాలను వుయ్ యాప్‌లో పొందుపరిచారు. వాటిలో రాష్ట్రంలోని 2.10 కోట్ల మహిళా ఓటర్ల వివరాలు వారి ఫొటోలతో సహా ఉండటం గమనార్హం. అంటే.. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యవతులు, మహిళల పూర్తి వ్యక్తిగత సమాచారం అంతా టీడీపీ గుప్పెట్లోకి వచి్చందన్న మాట. ఈ సమచారాన్ని వుయ్ యాప్ ద్వారా టీడీపీ బూత్‌కమిటీలకు చేర్చింది. దీంతో ఆకతాయిలు, వీధి రౌడీలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు, ఇతర నేరచరితులకు ఈ వివరాలన్నీ అందుబాటులోకి వచ్చినట్లే. వేధింపులకు అవకాశం.. భద్రతకు ముప్పుటీడీపీ పాల్పడుతున్న ఈ అక్రమాలు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెనుముప్పుగా పరిణమించాయి. ఎందుకంటే ఆకతాయిలు మహిళల ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వేధించొచ్చు.. ఫొటోలను ఎవరైనా మార్ఫింగ్ చేసి సైబర్ నేరాలకు పాల్పడొచ్చు.. వారి బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్ చేసి ఆరి్థక నేరాలకు పాల్పడొచ్చు.. ఇలా.. ఎటువంటి నేరాలకైనా పాల్పడేందుకు ఆ యాప్ అవకాశం కలి్పస్తోంది.టీడీపీ కుట్ర కచి్చతంగా రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు భంగకరం. వ్యక్తిగత గోప్యత హక్కుకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో.. వుయ్ యాప్ పేరుతో టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంతోపాటు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెను ప్రమాదాన్ని తీసుకొచి్చందని మేధావులు, రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ)తోపాటు పోలీసు యంత్రాంగం తక్షణం స్పందించి ఈ యాప్‌ను తొలగించాలని కోరుతున్నారు. చంద్రబాబుతోపాటు వుయ్ యాప్ రూపొందించిన వారిపై కుట్ర కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విధ్వంసాలకు బాబు స్కెచ్మరోవైపు.. ఓటమి భయంతో అసలే బెంబేలెత్తుతున్న చంద్రబాబు మహిళా ఓటర్లు పేరెత్తితే రగిలిపోతున్నారు. వారంతా ముక్తకంఠంతో సీఎం జగన్‌కే మద్దతు ప్రకటిస్తుండడంతో బాబుకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో ఆయన విధ్వంసకర కుట్రకు తెరతీశారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు స్కెచ్ వేశారు. మహిళల ఓట్లు ఎలాగూ సాధించలేం కాబట్టి వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించేందుకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా రాబోయే 24 గంటల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు పన్నాగం పన్నారు. రెచ్చగొట్టి దాడులకు తెగబడాలి.. పోలింగ్ బూత్‌లకు వెళ్లే మహిళలను ఆకతాయిలతో రెచ్చగొట్టి.. అసభ్య పదాలతో దూషించి.. వారు దానిపై ప్రశి్నంచగానే టీడీపీ గూండాలు ఘర్షణలకు దిగి.. దాడులకు తెగబడేలా చేయాలన్నది చంద్రబాబు బ్లూప్రింట్. ఈ కుట్రను పక్కాగా అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు, నేతలు తమ మందీమార్బలాన్ని, గూండాలను సమీకరించుకుని.. వారికి కర్రలు, కత్తులతోపాటు ఇతర ఆయుధాలను కూడా అందించి పోలింగ్‌ను భగ్నం చేసేందుకు తద్వారా మహిళల ఓటింగ్‌ను తగ్గించేందుకు సన్నద్ధమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహిళలే లక్ష్యంగా బాబు కుట్ర..ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్రంలోని ఎన్నికల ముఖచిత్రం ఏమిటన్నది చంద్రబాబుకు స్పష్టమైంది. ప్రజలంతా వైఎస్సార్‌సీపీపట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారన్నది తేలిపోవడం.. మహిళా ఓటర్లు సీఎం జగన్‌కు నీరాజనాలు పడుతున్నారని అన్ని జాతీయ సర్వేలతో సహా స్పష్టంచేస్తుండటంతో ఆయన రగిలిపోతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లుండగా.. వారిలో మహిళా ఓటర్లే 2.10 కోట్ల మంది ఉన్నారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా మొత్తం రూ.2.83 లక్షల కోట్ల మేర లబ్ధి వారికి చేకూర్చి దేశంలోనే కొత్త చరిత్రను సృష్టించడంతో సీఎం జగన్‌కు మహిళలు జేజేలు పలుకుతున్నారు. దీంతో మహిళల ఓట్లపై చంద్రబాబు దాదాపుగా ఆశలు వదిలేసుకోవడం.. టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోవడంతో మహిళా ఓటర్లే లక్ష్యంగా బాబు విధ్వంసానికి కుట్ర పన్నారు.అడ్డుకట్ట వేయాల్సింది ఈసీ, పోలీసులేఈ నేపథ్యంలో.. పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ), పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ కోసం వెబ్‌కాస్టింగ్, వీడియో రికార్డింగ్ తదితర చర్యలు తీసుకుంటున్నా.. అవి పోలింగ్ బూత్‌ల వద్ద పరిస్థితిని మాత్రమే పర్యవేక్షణకు ఉద్దేశించినవి.⇒కానీ, సామాన్య మహిళా ఓటర్లు తమ ఇళ్ల నుంచి పోలింగ్ బూత్‌లకు వచ్చే మార్గాల్లోనూ.. ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు తెగబడేందుకు కుట్ర పన్నుతున్న టీడీపీ గూండాలను కట్టడి చేయాలంటే ఆ చర్యలు సరిపోవు. కాబట్టి ఈసీ, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి.. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా.. మహిళలు అత్యధికంగా ఓటింగులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి ఓటింగ్ శాతం తగ్గించడమే లక్ష్యం సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారు. పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా సాగితే మహిళల ఓటింగ్ శాతం అమాంతంగా పెరుగుతుంది. అందుకే మహిళల ఓటింగ్ శాతాన్ని తగ్గించడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జాన్యాలకు పాల్పడమని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు.అందుకోసం స్థానికంగా ఉండే టీడీపీ రౌడీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలు, రౌడీ మూకలను రప్పించినట్లు సమాచారం. ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగించాలని.. తద్వారా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలన్నది చంద్రబాబు పన్నాగం. పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం.. వీలైతే పోలీసు కాల్పుల వరకూ పరిస్థితి తీసుకొచ్చి శాంతిభద్రతలు అదుపుతప్పేలా చేయాలని ఆయన టీడీపీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇందులో భాగమే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు. అవి.. ⇒ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపైనే టీడీపీ గూండాల దాడి. ⇒ మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరిలపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి తన అనుచరులతో దాడిచేయించడం.. ⇒ ఇక కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి భార్య, తనయుడిపై టీడీపీ గూండాలు దాడి. -
‘చక్షు’కు చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: ‘‘హలో.. మీకు లక్కీ లాటరీలో రూ.50 లక్షలు వచ్చాయి.. ఈ మొత్తాన్ని పొందాలంటే మేం చెప్పే బ్యాంకు అకౌంట్ నంబర్‌కు రూ.లక్ష పంపండి.. మిగిలిన మొత్తం మీ సొంతం అవుతుంది..’’ ‘మీ వాట్సప్ నంబర్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.. సర్ఫ్రైజ్ గిఫ్ట్ పొందండి..’’ ‘‘హలో.. బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నాను.. మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. లేదంటే మీ క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు బ్లాక్ అయిపోతాయి. మేం అడిగే వివరాలు చెప్పండి..’’ రోజుకో కొత్త తరహా సైబర్ మోసం...సైబర్ నేరగాళ్ల ఎత్తు ఏదైనా.. మూలం మాత్రం మన ఫోన్‌కు వచ్చే కాల్స్.. లేదంటే ఎస్ఎంఎస్లు. సైబర్ నేరగాళ్లు వివిధ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడటం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇలా ఫోన్ నంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘చక్షు’అ్రస్తాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఫోన్ నంబర్ల వివరాలు ఈ వెబ్ పోర్టల్‌లో నమోదు చేస్తే.. మోసగాళ్ల పనిపడతాయి దర్యాప్తు సంస్థలు. బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్ నంబర్లు పంపుతారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు సదరు నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతోపాటు మరొకరు మోసానికి గురికాకుండా కాపాడతారు. సాధారణ పౌరులు సైతం సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని, మోసపూరిత ఫోన్ నంబర్ల సమాచారాన్ని చక్షు పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. ఏమిటీ చక్షు పోర్టల్? చక్షు అంటే కన్ను అని అర్థం.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అందిస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు పేరిట ‘రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్’కొత్త సేవా పోర్టల్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్, ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే ప్రారంభించారు. అనుమానిత మోసపూరిత కాల్లు, సందేశాలు వివరాలు ఇందులో నమోదు చేయవచ్చు. చక్షు పోర్టల్ ఎలా వినియోగించాలి.. ♦ https://sancharsaathi.gov.in లింక్ ద్వారా సంచార్ సాథి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ♦ సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ మోసపూరిత కమ్యూనికేషన్‌కు సంబంధించిన వివరాలు, ఆ కాల్ లేదా మెసేజ్ వచ్చిన సమయం, ఇతర వివరాలు నమోదు చేయాలి. ♦ ఫిర్యాదు నమోదైన తర్వాత వెరిఫికేషన్ కోసం ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదైన ఫిర్యాదు దర్యాప్తు సంస్థలకు వెళుతుంది. ఏయే అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు ♦అనధికారిక కనెక్షన్లు, మనకు వచ్చిన మోసపూరిత నంబర్లు సదరు వ్యక్తులపై ఉన్నాయా లేదా తనిఖీ చేయించవచ్చు. ♦ మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం చేయవచ్చు. ♦ అనుమానాస్పద విదేశీ నంబర్లపై ఫిర్యాదు చేయవచ్చు. -
టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, అమరావతి: ఆమె చేసిన తప్పల్లా... తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లలో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధికుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతీజాతీ లేని ఈ ఆన్లైన్ మారీచులు.... తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదికమీదా ఆమెను నానా దుర్భాషలాడారు. అక్కచెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ, అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యమనుకుంది. రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి వెంటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి (30) భర్త చంద్రశేఖర్ తెనాలిలోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పని చేస్తుంటారు. వాళ్లకిద్దరు పిల్లలు. గీతాంజలి కొద్దిరోజుల కిందట ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటిపట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మ ఒడి వస్తోందని, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక అందుతున్నాయని చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తామంటూ.. ఆమె ఎదురు ప్రశి్నంచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన కిరాయి మూకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశాయి. వాస్తవానికి గీతాంజలికి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేసింది. ఈ నెల 4న కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఈ ఇంటర్వ్యూ వ్యవహారం చోటుచేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితోపాటు ఎమ్మెల్యే శివకుమార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ చానల్‌తో పంచుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్నను గెలిపించుకోవటం తమ బాధ్యతని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్.. అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడంతో తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న టీడీపీ, జనసేన ‘సోషల్ మాఫియా’ బాధితురాలిని దారుణంగా ట్రోల్ చేసింది. ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ, రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల తాను, తన కుటుంబం లబ్ధి పొందినట్లు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురిగొల్పేలా దారుణ వ్యాఖ్యలతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. గీతాంజలిని బూతులు తిడుతూ టీడీపీ, జనసేన అభిమానులు పెట్టిన పోస్టులు, కామెంట్లు.. గీతాంజలి మృతదేహం వద్ద రోదిస్తున్న ఇద్దరు కుమార్తెలు పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం ఇద్దరు చిన్నారులతో ఎంతో చలాకీగా అందరితో కలిసి మెలసి ఉండే గీతాంజలిని సోషల్ మాఫియా పొట్టన పెట్టుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద కన్నీరు మున్నీరయ్యారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లల గతి ఏం కావాలంటూ విలపించారు. సోషల్ మీడియా ఆమెను పొట్టనపెట్టుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చ సోషల్ మీడియా కళ్లు ఎప్పుడు పచ్చగానే ఉంటాయని, పేదింటి మహిళకు ఇంత సంతోషం దక్కడం వారికి ఇష్టం లేదంటూ మండిపడ్డారు. గీతాంజలికి తల్లితండ్రి దూరంగా ఉండటంతో అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కలిసి వివాహం చేశారని, గీతాంజలి సంతోషం పచ్చ సోషల్ మీడియాకు కంటగింపుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి అంతిమ సంస్కారాలు సోమవారం రాత్రి జరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష అనంతరం చినరావూరుతోటలోని హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను భర్త బాలచంద్ర నిర్వహించారు. తల్లి భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత, రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అక్కడకు చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం ఆదేశానుసారం మంగళవారం వారి ఇంటికి వచ్చి బిడ్డల భవిష్యత్ కోసం ఏం చేయాలనే అంశంపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన అరాచకత్వానికి బీసీ మహిళ బలి: పద్మ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన బీసీ మహిళ గీతాంజలి సంతోషాన్ని చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విచక్షణ మరచిన పచ్చ మూకలు అరాచకంగా ట్రోల్ చేయడంతో తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆప్యాయంగా పలకరించేది.. మా ఇంటికి ఎదురుగా నివసించే గీతాంజలి ఎప్పుడూ సంతోషంగా, చలాకీగా ఉంటుంది. ఎక్కడ కనిపించినా మామ్మగారూ... అంటూ చాలా ఆప్యాయంగా పలకరించేది. రెండు రోజులుగా కనిపించకపోతే శివరాత్రి కావడంతో ఎటైనా వెళ్లిందేమో అనుకున్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధనిపిస్తోంది. – అవ్వారు పద్మావతి, ఇస్లాంపేట, తెనాలి జీవితంలో మర్చిపోలేనంటూ.. మేం ఇస్లాంపేటలో సోడాలు విక్రయిస్తాం. గీతాంజలితో కొద్ది రోజుల పరిచయమే అయినా చాలా కలివిడిగా మాట్లాడేది. ఇటీవలే చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రం తీసుకున్నానని ఎంతో సంతోషంగా చెప్పింది. నా పేరు మీద ఇచ్చారు... జీవితంలో మర్చిపోలేనని చెప్పి మురిసిపోయింది. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని చెబుతుండేది. ఆమె చనిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నా. – షేక్ రేష్మా, ఇస్లాంపేట, తెనాలి -
WhatsApp Scam: వాట్సాప్ లింక్ ద్వారా రూ.1.60 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!
కర్నూలు: ట్రేడ్స్ ఎక్స్ కంపెనీ పేరుతో సైబర్ నేరగాళ్లు తన వాట్సాప్‌కు లింక్ పంపి ఫోన్లో ఉన్న డేటా సేకరించి బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.60 లక్షలు తీసుకుని మోసగించారని, చర్యలు తీసుకోవాలని ఎస్పీ కృష్ణకాంత్‌కు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన రిజ్వాన్ బాషా ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ కృష్ణకాంత్ సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు తదితరులు స్పందనలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● కన్సల్టెన్సీ పేరుతో కొంతమంది వ్యక్తులు ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశారని , విచారణ జరిపి డబ్బులు వాపసు ఇప్పించాల్సిందిగా కర్నూలుకు చెందిన విష్ణు కోరారు. ● ఆస్తి కోసం కుమారుడు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాల్సిందిగా హొళగుంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప వినతి పత్రం అందించారు. ● భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి సర్వేయర్‌ను కొలతలు వేయనివ్వకుండా శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ అనే వ్యక్తులు అడ్డుపడుతున్నారని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి ఫిర్యాదు చేశారు. ● పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తి నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి మోసం చేశాడని, తన పొలానికి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఆరు ఎకరాల జొన్న పంటను దున్ని నాశనం చేసిన నగరూరు గ్రామానికి చెందిన రంగన్న, ప్రభాకర్‌లపై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన హుసేనప్ప ఫిర్యాదు చేశారు. ● సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వైఎస్సార్ జిల్లాకు చెందిన మంజునాథ్ రెడ్డి డబ్బులు తీసుకుని నకిలీ నియామక పత్రాలు పంపి మోసం చేశాడని నాగలాపురం గ్రామానికి చెందిన ఉపేంద్ర, కర్నూలుకు చెందిన విష్ణుచరణ్లు ఫిర్యాదు చేశారు. -
సైబర్ కేసుల్లో తెలంగాణ @ 3
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ, హరియాణా ఉన్నాయి. 2023లో రాష్ట్రంలో సైబర్ నేరాలను పరిశీలిస్తే ప్రతి లక్ష మందికి 261 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది మనం చెబుతున్న మాట కాదు ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్) సీఈఓ రాజేశ్‌కుమార్ ఇటీవల వెల్లడించిన 2023 వార్షిక నివేదికలో పొందుపరిచారు. ఇంకా అనేక ఆసక్తికర అంశాలూ ఆ నివేదికలో ఉన్నాయి. సైబర్ నేరాలపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతోంది. ఈ నేరాలపై 1930 టోల్‌ఫ్రీ నంబరుకు రోజుకు సరాసరిన 50వేల ఫోన్‌కాల్స్ వచ్చినట్టు ఐ4సీ నివేదిక తెలిపింది. 2023 సంవత్సరంలో ఎన్సీఆర్పీ( నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్)కి 15,56,176 ఫిర్యాదులు అందాయి. ఎన్‌సీఆర్‌పీకి సైబర్ నేరాలపై దేశవ్యాప్తంగా రోజుకు సరాసరిన 5వేల ఫిర్యాదులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2023లో అత్యధికంగా నమోదైన సైబర్ నేరాలు ♦ కేవైసీ అప్డేషన్ మోసాలు, కస్టమర్ కేర్ నంబర్ల పేరిట మోసాలు 35% ♦ సెక్స్టార్షన్ స్కామ్‌లు 24% ♦ ఆన్లైన్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ మోసాలు 22% ♦ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) మోసాలు 11% ♦ ఆండ్రాయిడ్ మొబైల్ మాల్వేర్ మోసాలు 8% సైబర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం దేశప్రజలకు సైబర్ భ ద్రత కల్పించడం మా ప్రధాన లక్ష్యం. దీని కో సమే కేంద్రం ఐ4సీ ఏ ర్పాటు చేసింది. సైబర్ నేరాల గుర్తింపు, దర్యా ప్తు, సైబర్ నేరాల కట్టడి చేయడం కేంద్ర హోంశాఖ మాకు ఇచ్చిన ప్రధాన బాధ్యతలు. ఇందుకోసం మేం ప్రత్యేక వేదికగా పనిచేస్తున్నాం. సైబర్ భద్రత అనేది ఇప్పుడు జాతీయ భద్ర తగా మారిన నేపథ్యంలో ఐ4సీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాల ప్రకారం బలోపేతం చేస్తూ వెళుతున్నాం. సైబర్‌నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. – వార్షిక నివేదిక సందర్భంగా ఐ4సీ సీఈఓ రాజేశ్‌కుమార్ సైబర్‌క్రైం పోర్టల్ బ్లాక్ చేసినవి ♦ 2,95,461 ఫేక్ సిమ్ కార్డులు ♦ 46,000 ఐఈఎంఐ డివైజ్‌లు ♦ 595 మొబైల్ అప్లికేషన్స్ ♦ 2,810 ఫిషింగ్ వెబ్‌సైట్స్, యూఆర్ఎల్లు -
Cyber Crimes: రూ.1100 కోట్లు చేజారకుండా ఆపిన పోలీసులు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సైబర్‌నేరగాళ్ల ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ నేరాలను అడ్డుకుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేయడానికి ప్రయత్నించిన రూ.1100 కోట్లను వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చివరి నిమిషంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆపగలిగారు. ఒక లక్ష జనాభాకుగాను గతేడాది అత్యధికంగా హర్యానాలో 381 సైబర్ క్రైమ్ నేరాలు రిపోర్ట్ అయ్యాయి. తెలంగాణలో 261, ఉత్తరాఖండ్ 243, గుజరాత్ 226, గోవాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఢిల్లీలో లక్ష జనాభాకు 755 కేసులు, చండీగఢ్‌లో 432 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా సైబర్ నేరగాళ్లకు చెందిన 2,95,461 సిమ్ కార్డులను, 2810 వెబ్సైట్లు, 585 మొబైల్ యాప్‌లు,46,229 ఐఎంఈఐలను కేంద్ర హోం శాఖ బ్లాక్ చేసింది. ఇదీచదవండి.. అశోక్ గహ్లోత్ కుమారుని ఇంటిపై ఈడీ సోదాలు -
డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాల రవాణా, విక్ర య ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు. మత్తుపదార్థాలు అమ్మినా, కొన్నా, వాడినా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎంతటివారున్నా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల కట్టడి, సైబర్ నేరాల అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రానున్న ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదు 8.97 శాతం పెరిగినట్టు వెల్లడించారు. సైబర్ నేరాల నమోదు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ స్టేట్ పోలీస్ వార్షిక నివేదిక 2023ను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్, రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఐజీలు రమేశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో పోలీస్‌శాఖ భవిష్యత్ కార్యాచరణ అంశాలను డీజీపీ వివరించారు. డీజీపీ పేర్కొన్న కీలక అంశాలు: ♦ మత్తుపదార్థాల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉంటాం. ఒక్క డ్రగ్స్ కేసు నమోదైనా పీడీయాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ♦ పబ్బులు, క్లబ్బులు, ఫాంహౌస్‌లు, బార్లలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా అత్యంత కఠినచర్యలు తప్పవు. ♦ తల్లిదండ్రులు, విద్యా సంస్థలు సైతం మత్తుపదార్థాల కట్టడిలో పోలీస్‌శాఖతో కలిసి రావాలి. విద్యా సంస్థల్లోనూ యాంటీ డ్రగ్స్వాడకంపై దృష్టి పెట్టాలి. ♦ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్ నేరాలపై ఇప్పటివరకు 90 వేల ఫిర్యాదులు అందాయి. ♦ సైబర్‌నేరాలపై 14,271 ఎఫ్ఐఆర్ల నమోదుతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. ♦ రోడ్డు ప్రమాదాలు తగ్గిడంలో ఈ ఏడాది సఫలం అయ్యాం. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఎంతో మెరుగైంది. రాష్ట్రంలో ఇప్పుడు సరాసరి రెస్పాన్స్ టైం 7 నిమిషాలు. ♦ అతి త్వరలోనే 15,750 మంది వివిధ శాఖల్లోని కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రారంభిస్తాం. -
యూపీఐ పేమెంట్లే మోసగాళ్ల టార్గెట్
సాక్షి, అమరావతి: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల్లో యూపీఐ మోసాలే అత్యధికంగా ఉంటున్నాయి. డిజిటలీకరణ పెరుగుతున్న కొద్దీ అధికమవుతున్న ఆర్థిక నేరాల్లో యూపీఐ మోసాలదే అగ్రస్థానం. ‘అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్–2023’ పేరిట కాన్పూర్ ఐఐటీ, డిజిటల్ బ్యూరో కన్సల్టెన్సీ ప్రక్సీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక యూపీఐ మోసాల తీవ్రతను వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 23 వేల డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతుండటాన్ని సైబర్ ముఠాలు అవకాశంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని ఆ నివేదిక చెప్పింది. ప్రస్తుతం దేశంలో 90.50 కోట్ల మందిగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2027నాటికి 100.14 కోట్లకు చేరతారని అంచనా వేసింది. 2019లో దేశంలో డిజిటల్ చెల్లింపులు 36 శాతం ఉండగా 2023 ఏప్రిల్ నాటికి 57 శాతానికి పెరిగాయి. 2027నాటికి డిజిటల్ చెల్లింపులు 74 శాతానికి చేరుతాయని అంచనా. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు ప్రధానంగా యూపీఐ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన అవగాహన కల్పించాలని పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అప్రమత్తతే రక్షా కవచం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతే రక్షా కవచం. వినియోగదారులు తగిన అవగాహన కలిగి ఉండాలని సీఐడీ ఎస్పీ (సైబర్ క్రైమ్ విభాగం) హర్షవర్ధన్ రాజు చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఆయన చేసిన సూచనలు ఇవీ... ► డిజిటల్ చెల్లింపులు చేసే డివైజ్‌ల ‘పిన్’ నంబర్ల గోప్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిన్ నంబర్లుగానీ ఓటీపీ నంబర్లుగానీ ఎవరికి తెలియజేయకూడదు. దీర్ఘకాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను కొనసాగించకూడదు. పాస్‌వర్డ్‌ను నియమిత కాలంలో మారుస్తూ ఉండాలి. ► ఫేక్ యూపీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే అన్ని యూపీఐ హ్యాండిల్స్ విశ్వసనీయమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ వినియోగదారుల యూపీఐ వివరాలను తెలపాలని ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరవు. ఏదైనా ఆర్థిక సంస్థగానీ యాప్‌గానీ యూపీఐ వివరాలను కోరితే ఆ సంస్థ కచి్చతంగా మోసపూరితమైనదని గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి. ► పబ్లిక్ వైఫై, సురక్షితం కాని నెట్‌వర్క్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయకూడదు. ► మొబైల్ ఫోన్లలో ట్రాన్సాక్షన్ అలెర్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ బ్యాంకు చెల్లింపులకు సంబంధించిన సమాచారం వెంటనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిసే సౌలభ్యం ఉండాలి. మీ అనుమతిలేకుండా ఏదైనా చెల్లింపు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకును సంప్రదించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ►సైబర్/యూపీఐ మోసానికి గురయ్యామని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించాలి. ఫిర్యాదు చేయాలి. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ (నంబర్ 1930)కు గానీ ఏపీ సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100 )కుగానీ ఫిర్యాదు చేయాలి. భద్రతపై బ్యాంకుల దృష్టి సైబర్ మోసాలు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైబర్ భద్రతపై దృష్టిసారించాయి. సైబర్ భద్రత మౌలిక వసతులను పెంచుకునేందుకు నిధులు వెచి్చస్తున్నాయి. దేశంలో 43 ఆర్థిక సంస్థలు సైబర్ భద్రత కోసం నిధుల వెచ్చింపును భారీగా పెంచగా.. 17 శాతం ఆర్థిక సంస్థలు స్వల్పంగా పెంచాయి. కాగా 35 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. 2 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించగా 3 శాతం సంస్థలు బడ్జెట్‌ను భారీగా తగ్గించాయి. -
ఈ–కామర్స్, ఉద్యోగాల పేరిట అత్యధిక సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ఈ–కామర్స్‌లో విక్రయాలు, ఉద్యోగాలు.. దేశంలో సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలు. సైబర్ నేరాల్లో ఈ రెండే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్ అభిరుచి, ఉద్యోగాల కోసం యువత ప్రయత్నాలను ఆసరా చేసుకుని సైబర్ ముఠాలు భారీగా మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా నగర, పట్టణవాసులను లక్ష్యంగా చేసుకునే ఈ ముఠాలు చెలరేగుతున్నాయని ప్రముఖ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘యు గవ్’ సర్వేలో వెల్లడైంది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది నవంబరులో దేశంలో 180 నగరాలు, పట్టణాల్లో ఆ సంస్థ సర్వే చేసింది. సర్వేలోని ప్రధానాంశాలు.. ♦ దేశంలో సైబర్ ఆర్థి క నేరాలు భారీగా పెరుగుతున్నాయి. 2022లో మోసాలకంటే ఈ ఏడాది (2023లో) ఇప్పటికే ఈ మోసాలు రెట్టింపయ్యాయి. కేంద్ర హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం 2023 నవంబర్‌నాటికే దేశంలో రూ.5,574 కోట్లు కొల్లగొట్టారు. 2022లో రూ.2,296కోట్లు కొల్లగొట్టారు. ♦ దేశంలో జరిగిన సైబర్ నేరాల్లో ఈ–కామర్స్ పేరిట జరిగినవి 35 శాతం, ఉద్యోగావకాశాల పేరిట జరిగినవి 28శాతం. ♦ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ రూపంలో సైబర్ ముఠాలు వారానికి ఓసారి అయినా ప్రయత్నిస్తున్నాయని 54 శాతం మంది చెప్పారు. రోజూ అటువంటి మోసపూరిత ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ వస్తున్నట్లు 30 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ నేరాల బారిన పడి మోసపోయామని 20 శాతం మంది చెప్పారు. స్నేహితులు, పరిచయస్తులు ఆన్లైన్ మోసాలతో నష్టపోయారని 47 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ మోసగాళ్ల బాధితుల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది పురుషుల్లో 35 శాతం, అలాగే ప్రతి వంద మంది మహిళల్లో 24 శాతం వారు ఆన్లైన్ మోసానికి గురైనట్లు వెల్లడించారు. ♦ దేశంలో సైబర్ నేరాల బాధితుల్లో అత్యధికంగా 23 శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాల ప్రజలు ఉన్నారు. ♦ సైబర్ మోసాల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మాత్రం సుముఖత చూపడం లేదు. 59 శాతం మంది వారు మోసపోయినప్పటికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో 48 శాతం మంది వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందారు. ♦ సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటున్న వారిలో 69 శాతం మంది వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించడంలేదు. 59 శాతం మంది అనుమానాస్పద ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్ బ్లాక్ చేస్తున్నారు. 57 శాతం మంది అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడంలేదు. 47 శాతం మంది తెలియని వారికి వస్తువుల కొనుగోలు ఇతరత్రా వ్యవహారాల పేరిట ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చేయడంలేదు. ఈ జాగ్రత్తలతో వారు సైబర్ నేరగాళ్ల వల నుంచి తప్పించుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. -
24% పెరిగిన సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరాల నమోదు ఏటా పెరుగుతోంది. 2021తో పోలిస్తే దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నమోదు 2022లో 24.4 శాతం పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ)–2022 నివేదిక వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. 2021తో పోలిస్తే 2022లో సైబర్ నేరాల నమోదు తెలంగాణలో 40 శాతం పెరిగిందని వివరించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాల నమోదు 4.5 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఎన్సీఆర్బీ–2022 వార్షిక నివేదికను కేంద్ర హోంశాఖ సోమవారం విడుదల చేసింది. ఏటా జూలై లేదా ఆగస్టు వరకు ఈ నివేదిక విడుదల చేస్తుండగా ఈసారి ఎన్సీఆర్బీ నివేదిక విడుదలలో దాదాపు 5 నెలలపాటు జాప్యమైంది. 58.24 లక్షల కేసులు... ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం ఐపీసీ, స్పెషల్ లోకల్ లా (ఎస్ఎల్ఎల్) సెక్షన్ల కింద కలిపి 2021లో మొత్తం 60,96,310 కేసులు నమోదవగా 2022లో అన్ని రకాల నేరాలు కలిపి 4.5 శాతం తగ్గుదలతో 58,24,946 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మందికి నేరాల నమోదు పరిశీలిస్తే 2021లో 445.9 నేరాలు నమోదుకాగా 2022లో ఆ సంఖ్య 422.2కు తగ్గింది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాల్లో 4 శాతం, చిన్నారులపై నేరాల్లో 8.7 శాతం, వృద్ధులపై నేరాల్లో 9.3 శాతం, ఎస్సీలపై నేరాల్లో 13.1 శాతం, ఎస్టీలపై నేరాల్లో 14.3 శాతం, ఆర్థిక నేరాల్లో 11.1 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో తెలంగాణలో ఐపీసీ, ఎస్ఎల్ఎల్ చట్టాల కింద నమోదైన అన్ని రకాల కేసుల నమోదు చూస్తే కేసుల నమోదు సంఖ్య పెరిగింది. 2021లో 1,58,809 కేసులు నమోదవగా 2022లో రాష్ట్రవ్యాప్తంగా 1,65,830 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2022లో నమోదైన కేసుల్లో 79.7 శాతం కేసులలో చార్జిషిట్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో సైబర్ క్రైం పైపైకి... తెలంగాణలో 2022లో మొత్తం 15,272 సైబర్ నేరాలు నమోదవగా 2021లో మొత్తం 10,303 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2021తో పోలిస్తే తెలంగాణలో 2022లో 40 శాతం మేర సైబర్ కేసులు నమోదు పెరిగినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 65,893 సైబర్ నేరాలు నమోదుకాగా, 2021లో 52,974 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2021తో పోలిస్తే 2022లో సైబర్ నేరాలపై కేసుల నమోదు 24.4% పెరుగుదల ఉంది. 2022లో నమోదైన సైబర్ నేరాలను పరిశీలిస్తే 64.8 శాతం (42,710 కేసులు) సైబర్ నేరాలకు కారణం మోసం చేసే ఉద్దేశమని నివేదిక తేల్చింది. ఆ తర్వాతి స్థానంలో 5.5 శాతం (3,648 కేసులు) బెదిరింపులకు సంబంధించినవి, లైంగిక దోపిడీ కారణమైన సైబర్‌నేరాలు 5.2 శాతం (3,434 కేసులు) ఉన్నట్లు వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో తెలంగాణ తర్వాత స్థానంలో కర్ణాటక (18.6 శాతం), మహారాష్ట్ర (6.6 శాతం) ఉన్నాయి. ఇతర నేరాలు ఇలా... రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది. 2021లో 20,865 కేసులు నమోదవగా 2022లో అవి 22,066కు పెరిగాయి. మానవ అక్రమ రవాణా కేసులు 2022లో దేశవ్యాప్తంగా 2,250 కేసులు నమోదవగా 391 కేసుల నమోదుతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర (295), బిహార్ (260) నిలిచాయి. హత్య కేసుల సంఖ్య 2022లో తెలంగాణలో తగ్గింది. 2021లో 1,026 హత్య కేసులు నమోదవగా 2022లో ఆ సంఖ్య 337కు తగ్గింది. వాటిలో వివాహేతర సంబంధాల కారణంగా 116 హత్యలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
డీప్ ఫేక్ బారిన రష్మిక, కత్రినా..రక్షణ కోసం ఏం చేయాలంటే..!
టాలీవుడ్ నటి రష్మిక మందన్న, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఢీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సాంకేతికతో వస్తున్న విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకుని కొందరూ ఈ దురాగతాలకు పాల్పడుతున్నారు. ప్రముఖుల, సెలబ్రెటీలనే గాక సాధారణ మహిళలు సైతం బాధితులుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో 37% ఈ ఫోటో లేదా వీడియో మార్ఫింగ్ ఫేక్ కేసులే అధికంగా వస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. బాధితుల పరువు ప్రతిష్ట దిగజార్చి వారిని నానారకాలుగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న ఉదంతాలెన్నో తెర మీదకు వస్తున్నాయి. తెలిసో తెలియక ఇలా మీ ఫోటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ బారిన పడినట్లయితే వెంటనే ఏం చేయాలి? ఈ సమస్యను నుంచి సునాయాసంగా ఎలా బయటపడాలి తదితరాల గురించే ఈ కథనం!. మార్ఫింగ్ అంటే.. మీ వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు కొందరూ మార్ఫింగ్ టెక్నాలజీని ఉపయోగించి అశ్లీలంగా లేదా అభ్యంతరకరంగా మార్చి సోషల్ మీడియాలో వదులుతుంటారు. దీంతో ఒక్కసారిగా మీ వ్యక్తిగత పరువు, గౌరవం కోల్పోయినవాళ్లుగా మిగిలిపోతాం. ఇలాంటప్పుడూ తెలియకుండానే మన మానసిక స్థితి బలహీనమవుతుంది. దీన్నే ఆసరాగా తీసుకుని మీ నుంచి లబ్ధి పొందే కుట్రకు తెగబడుతుంటారు ఆన్లైన్ నేరగాళ్లు. నిజానికి ఏ వ్యక్తి అయినా ఈ స్థితిలో మానసికంగా నిలువునా కూలబడిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని బాగున్నప్పుడే ధైర్యంగా ఉండటం వేరు. పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడూ తట్టుకుని నిలబడేవాడు నిజమైన ధైర్యవంతుడు అని గుర్తించుకోండి. ఇక్కడ మీకు కావల్సింది మానసిక స్థితిని స్ట్రాంగ్ ఉండేలా చేసుకోవడమే మీ మొట్టమొదటి తక్షణ కర్తవ్యం. ఆ తర్వాత మీ బాధని, ఆవేదనని అర్థం చేసుకునేవాళ్లు లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసి, సాయం చేస్తారనుకునేవాళ్లకు అసలు విషయాన్ని చెప్పాలి. కనీసం మీకు అలా సాయం చేసేవాళ్లు లేకపోతే సైబర్‌క్రైం, షీ టీం వంటి విమెన్ సంరక్షణ కోసం వస్తున్న పోలీసు విభాగాలను ఆశ్రయించి ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. డీప్ ఫేక్ వీడియోలు ఎలా గుర్తించొచ్చంటే.. డీప్ ఫేక్ వీడియోలను గుర్తించొచ్చు. ఎందుకంటే మన వాళ్లు లేక మనమో దీనికి గురైతే పరిస్థితిని వివరించడానికి ఇది ఉపకరిస్తుంది. ఎప్పుడైనా ఇలా ఏఐ సాంకేతతో డీప్ ఫేక్ వీడియోలు చేసినట్లయితే..ఆ వీడియోలను నిశితంగా గమనిస్తే వాటి ఆడియో సీన్లో వ్యక్తి ముఖకవళికలను గమనించాలి. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్‌ని గమనించినా అర్థమైపోతుంది అది ఫేక్ అని. అలాగే విజువల్స్ కూడా క్లారిటీగా ఉండవు. ఇలా ఫోటోలు, వీడియోలు మార్చే సాంకేతిక తోపాటు అలాంటి వాటిని గుర్తించే టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. అలాంటి డీప్ ఫేక్ వీడియోలు లేదా ఫోటోలు గుర్తించే టూల్స్ ఏంటంటే.. సెంటినెల్ ఇంటెల్ రియల్-టైమ్ డీప్‌ఫేక్ డిటెక్టర్ WeVerify (వీ వెరీఫై) మైక్రోసాఫ్ట్ వీడియో ప్రమాణీకరణ సాధనం Phoneme-Viseme టూల్ తక్షణమే చేయాల్సిన మరోపని ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని సాయం చేసేలా కొన్ని హెల్ప్లైన్ల అందుబాటులో పెట్టారు. అలాగే ముఖ్యంగా 18 ఏళ్ల నిండని చిన్నారుల సైతం బాధితులవ్వకూడదననే ఉద్దేశ్యంతో కొన్ని ఆన్లైన్ చారిటీ సంస్థలు సాంకేతికతో కూడిన ప్రముఖ టూల్స్‌ని కూడా తీసుకొచ్చాయి. నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కంప్లైయింట్ ఇవ్వడానికి భయపడే బాధితుల కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ముందుగా హెల్ప్‌లైన్ నెంబర్ 1902కి కాల్ చేసి మీ ఫోటో లేదా వీడియోలు మార్ఫింగ్ అయినా వాటి గురించి పూర్తి వివరాలను తెలియజేయాలి. ఆ తర్వాత వెబసైట్ లింక్‌లో https://stopncii.org/ మీ ఒరిజన్‌ల ఫోటో తోపాటు మార్ఫింగ్‌కి గురైన ఫోటోను అప్లోడ్ చేయాలి. అంతే మీ ఫోటో ఇంటర్నెట్లో ఎక్కడ ఉన్నా వెంటనే డిలీట్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ మీ గోప్యతను కాపాడుతుంది. బాధితులకు మద్దతుగా ఉండేందుకు రూపొందించిన వెబ్సైట్ ఇది. ఇది 2000లో ప్రారంభమైంది. ఆన్లైన్లో బాధితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య వాటాదారులతో కలిసి పనిచేస్తుంది. వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడూ.. సోషల్ మీడియా ఖాతాలలో మీ డేటాను గోప్యంగా ఉంచండి మీ వ్యక్తిగత చిత్రాలను ఆన్లైన్లో పబ్లిక్‌గా ఎప్పుడూ షేర్ చేయవద్దు చిత్రాలను పంచుకునేటప్పుడు వాటర్‌మార్క్ ఉపయోగించండి మీ సోషల్ మీడియా ఖాతాల స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లతో రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. అనుకోని సంఘటన ఎదురైతే తెలియజేసేలా అందుకు సంబంధించిన సాక్ష్యం, స్క్రీన్ షాట్లను సేవ్ చేయండి. బాధితులు తీసుకోవాల్సిన చర్యలు సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదున నమోదు చేయండి cybercrime.gov.inలో మీ వివరాలు చెప్పకుండా కూడా ఆన్లైన్ ఫిర్యాదును నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే సోషల్ మీడియా ఖాతా సహాయ కేంద్రానికి నివేదించండి ఈ నేరానికి సంబంధించిన చట్టాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66,37 వంటి కేసులు పెట్టోచ్చు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసినందుకు, చీటింగ్ చేసినందుకు సెక్షన్ 354(డీ), 465, 463 వంటి కేసులు పెట్టొచ్చు బాధితులు చిన్న పిల్లలైతే చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన సెక్షన్ 14, 15 వంటి బలమైన కేసులు పెట్టొచ్చు. వీటికి జైలు శిక్ష, భారీ మొత్తంలో జరిమాన విధించడం జరుగుతుంది. (చదవండి: ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!) -
సైబర్ నిపుణులు కావాలి!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ నిపుణులను రంగంలోకి దించనుంది. ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు సైబర్ సాంకేతిక నిపుణులు కావాలంటూ కేంద్ర హోంశాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు అంశాలకు సంబంధించి నిపుణులకు వారి అనుభవం ఆధారంగా నెలకు రూ.65 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు వేతనం ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నా రు. ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థులు https://tcil.net.in/ current &opening.php పై క్లిక్ చేసి అందు లోని వివరాలు చూడవచ్చని తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసే వీరికి కేంద్ర హోంశాఖకు ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. అర్హతలు, అనుభవం, వేతనం... సీనియర్ టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్: ఉండాల్సిన స్కిల్స్..సైబర్ సెక్యూరిటీలో పనిచేసిన అనుభవం, సెక్యూరిటీ స్ట్రాటజీ, పాలసీ ఫార్ములేషన్, ప్లానింగ్. నెలకు వేతనం..రూ. 2,50,000 థ్రెట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్: ఉండాల్సిన స్కిల్స్..సెక్యూరింగ్ క్రిటికల్, సెన్సిటివ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెలకు వేతనం..రూ.1,60,000 డాటా ఎనలైటిక్స్ ప్రొఫెషనల్: నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్..యూపీఐ, ఐఎంపీఎస్, ఏఈపీఎస్ వంటి పేమెంట్స్ టెక్నాలజీపై అవగాహన, ఆర్బీఐ, ఇతర నిబంధనలపై అవగాహన..నెలకు వేతనం..రూ. 1,60,000. మాల్వేర్ రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్.. ఫిషింగ్ ఎటాక్స్, మాల్వేర్ ఎటాక్స్లపై పూర్తి అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్–టెలీకాం అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఉండాల్సిన స్కిల్స్..4జీ, 5జీ వంటి టెలికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై, సిమ్‌బాక్స్, వీఓఐపీ వంటి అంశాల్లో అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 టెక్నికల్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. ఎంఎస్ ఎక్సెల్, ఫైనాన్స్ అంశాలపై అవగాహన ఉండాలి.. నెలకు వేతనం.. రూ.65,000 సైబర్ థ్రెట్ అనలిస్ట్: ఉండాల్సిన స్కిల్స్.. సోషల్ మీడియా అనాలసిస్, రిపోర్ట్ క్రియేషన్, క్రైం రీసెర్చ్‌లో అవగాహన..నెలకు వేతనం.. రూ.65,000 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. మోరాకో ప్రోగ్రామింగ్ ఎక్సెల్ ఆటోమైజేషన్లో అవగాహన.. నెలకు వేతనం..రూ.65,000 -
ఆ 10 జిల్లాల్లో సైబర్ దొంగలు
సాక్షి, హైదరాబాద్: అవి నాలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలు.. అమాయకులకు గాలం వేస్తూ దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు అడ్డాలు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 80శాతానికిపైగా ఆ పది జిల్లాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు చేస్తున్నవే. ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ జిల్లాలు ఉన్నాయి. కేటుగాళ్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి త్వరగా వెళ్లేపోయే వీలున్న జిల్లాల్లో అడ్డా వేసి, సైబర్ క్రైం పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు. అడపాదడపా తెలంగాణ పోలీసులు మినహా మిగతా రాష్ట్రాల పోలీసులు ఈ సైబర్ దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఎక్కువగా సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో ఉంటున్నారన్న అంశంపై ‘ఫ్యూచర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్)’ఇటీవల విడుదల చేసిన తమ అధ్యయన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లకు కొత్త అడ్డాలుగా మారుతున్న ప్రాంతాల వివరాలనూ పేర్కొంది. ఆ పది జిల్లాలే ఎందుకు? సైబర్ నేరగాళ్లు ఆ పది జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారన్న దాని వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఈ పది జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని కీలక పట్టణాలకు సమీపంలో ఉండటం, సైబర్ సెక్యూరిటీ పరంగా అంతగా అభివృద్ధి చెందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎక్కువగా ఉండటం వంటివి సైబర్ మోసగాళ్ల ముఠాలకు కలసి వస్తున్నాయని నివేదిక తేల్చింది. ఆయా జిల్లాల్లో సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థానికుల సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను వాడుకుంటూ ఈ ఉచ్చులోకి సులభంగా దింపుతున్నాయని పేర్కొంది. ఈ పది జిల్లాల్లో చాలా వరకు దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనివే. స్థానికంగా పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను గుర్తించలేకపోవడం, అవసరమైతే అప్పటికప్పుడు రాష్ట్రాలు మార్చేయడంతో పట్టుబడటం కష్టంగా మారుతోంది. కొత్తగా సైబర్ క్రైం హాట్స్పాట్లుగా మారుతున్న ప్రాంతాలివీ.. అస్సాం (బార్పేట, ధుబ్రి, గోల్పర, మోరిగాన్, నగాన్), ఏపీ (చిత్తూర్), బిహార్ (బన్క, బెగుసరాయ్, జముయి, నలంద, పాటా్న, ససరామ్), ఢిల్లీ (అశోక్‌నగర్, ఉత్తమ్‌నగర్ వెస్ట్, న్యూఅశోక్‌నగర్, హర్కేష్ నగర్ ఓక్లా, ఆర్కే పురం, ఆజాద్పురా), గుజరాత్ (అహ్మదాబాద్, సూరత్), హరియాణా (బివాని, మనోత, హసన్‌పుర్, పల్వల్), జార్ఖండ్ (లటేహర్, ధన్‌బాద్, సంత్పాల్ పరగణా, హజారీబాగ్, కుంతి, నారాయణపూర్, రాంచీ), కర్ణాటక (బెంగళూరు), మధ్యప్రదేశ్ (గుణా), మహారాష్ట్ర (ఔరంగాబాద్, ముంబై), ఒడిశా (బాలాసోర్, ధేన్‌కనల్, జజ్‌పుర్, మయూర్భంజ్), పంజాబ్ (ఫజికా, మొహలి), రాజస్థాన్ (బిదర్కా, బర్మార్, జైపూర్), తమిళనాడు (చెన్నై, కోయంబత్తూర్), తెలంగాణ (హైదరాబాద్, మహబూబ్‌నగర్), త్రిపుర (ధలాయ్), ఉత్తరప్రదేశ్ (బులందర్‌షహర్, ఘాజియాబాద్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, సీతాపూర్, గౌతమబుద్ధ నగర్), పశ్చిమ బెంగాల్ (పుర్బ బర్దామన్, దుల్చండ్రియ, భద్రల్, దక్షిణ్ దినాజ్‌పుర్, బిర్భూమ్, బరున్పురా, కోల్‌కతా, మల్దా, బరంపూర్). ఏ రాష్ట్ర నేరగాళ్లు ఏ తరహా సైబర్ నేరాలు చేస్తున్నారు? రాజస్తాన్: సెక్స్టార్షన్ (సోషల్ ఇంజనీరింగ్ వ్యూ హాలతో ఫొటోలు, వీడియోలు, వాయిస్ మార్ఫింగ్ చేసి మోసగించడం), ఓఎల్ఎక్స్లో ఆన్లైన్ మార్కెటింగ్ పేరిట మోసాలు, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్. జార్ఖండ్: ఓటీపీ స్కామ్‌లు (మోసపూరిత పద్ధతుల్లో ఓటీపీలు సేకరించి మోసాలు), కేవైసీ అప్డేషన్, విద్యుత్ బిల్లుల పేరిట, కౌన్ బనేగా కరోడ్‌పతి పేరిట మోసాలు. ఢిల్లీ: ఆన్లైన్ లోన్‌యాప్‌ల పేరిట వేధింపులు, ఆన్లైన్ గిఫ్ట్ పేరిట మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, విద్యుత్ బిల్లులు, జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలు. ఉత్తరప్రదేశ్: ఫేక్ లింకులు (ఫిషింగ్), ఓటీపీ మోసాలు, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లు, డెబిట్, క్రెడిట్ కార్డుల పేరిట మోసాలు. -
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ ఎస్పీ (సైబర్ నేరాలు) హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారు, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, నకిలీ వార్తలు, కించపరిచే వీడియోలు, వ్యాఖ్యలకు బాధ్యులు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లోనూ ఎక్కడ ఉన్నా వారి ఆటకట్టిస్తామని చెప్పారు. ఈ నేరగాళ్లను పట్టుకొనేందుకు సీఐడీ విభాగం పరస్పర న్యాయ సహాయ ఒప్పందం ద్వారా ఇంటర్ పోల్, ఇతర దేశాలతో కలసి పనిచేస్తోందని చెప్పారు. ఆయన శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు సైబర్ భద్రత కల్పించేందుకు సీఐడీ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధమైందన్నారు. ఆన్లైన్ ద్వారా వేధింపులు, ఆర్థిక మోసాలు, జూదం/బెట్టింగులు, సైబర్ బెదిరింపులు, ఉద్యోగ మోసాలు, వైవాహిక మోసాలు, రాన్సమ్వేర్, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ రుణ మోసాలు మొదలైన అన్ని సైబర్ నేరాలను నిరోధించేందుకు సీఐడీ పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా ఫేక్ పోస్టులు, వార్తలు, ట్రోలింగ్లు, మార్ఫింగ్ వీడియోలు వంటివి పోస్టు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నిరోధించేందుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీపీపీఎస్) ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేకంగా 60 మంది సైబర్ వలంటీర్లను కూడా నియోగించామన్నారు. నకిలీ వార్తలు, దుష్ప్రచార పోస్టులను తొలగించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సైబర్ నేరాలు, దుష్ప్రచారాలపై రెండేళ్లలో ఏకంగా 23 వేల కేసులు నమోదు చేశామని, రూ.30 లక్షల వరకు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామని, 3 వేల మందిని మ్యాపింగ్ చేశామని తెలిపారు. ఇటువంటి నేరాలను అరికట్టడంపై గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసు విభాగం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు విశాఖపట్నంలో అక్టోబరు 7, 8 తేదీల్లో సైబర్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు హర్షవర్థన్ రాజు చెప్పారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు ♦ ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్: 1930 ♦ సైబర్ మోసాలను ఆన్లైన్లో నివేదించడానికి: cybercrime.gov.in ♦ సైబర్ నేరాలపై ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదుకు: cybercrimes& cid@ap.gov.in ♦ ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదుల కోసం సీఐడీ వెబ్సైట్: cid.appolice.gov.in ♦ ఫేస్బుక్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు: itcore&cid@ap.gov.in ♦ ట్విట్టర్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు:@apcidcyber ♦ యూట్యూబ్ చానెల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు: APCID4S4U -
స్నాప్‌చాట్ వాడుతున్నారా?తస్మాత్ జాగ్రత్తా! లేదంటే..
స్నాప్‌చాట్ అనేది ఈ రోజుల్లో టీనేజర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న మోడర్న్ మెసేజింగ్ యాప్. ఇందులో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలను స్నాప్లుగా వర్చుకుంటారు. మన ఫ్రెండ్స్ జాబితాలోని వారు వాటిని చూసిన తర్వాత అవి అదృశ్యమవుతాయి. స్నేహితులతో కనెక్ట్ అవడం, గేమ్స్, న్యూస్, వినోదం, క్విజ్లు, వినూత్న ఫొటో, వీడియో ఎడిటింగ్ టూల్స్ వంటి వివిధ ఫీచర్లను ఇది అందిస్తుంది. ఈ ఫీచర్లు, దాని ఇంటరాక్టివ్ నేచర్, సృజనాత్మకత కారణంగా స్నాప్‌చాట్ వినియోగదారులను... ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. స్నాప్‌చాట్ అకౌంట్.. హ్యాకింగ్, సెక్సార్షన్, సైబర్ బెదిరింపు, మోసం వంటి వివిధ సైబర్ నేరాలకు అవకాశం ఇచ్చేలా ఉంది. ఇవి యూజర్ల వ్యక్తిగత సమాచారానికి తీవ్రమైన నష్టాలను కలిగిస్తాయి. స్నాప్‌చాట్ సురక్షితంగా ఉండటానికి, వినియోగదారులు పటిష్టమైన భద్రతా పద్ధతులను అమలుచేయోలి. గోప్యతా సెట్టింగ్‌ల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే, కంటెంట్‌ను షేర్ చేసేటప్పుడు, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే స్నాప్‌చాట్ సంబంధిత అధికారులకు నివేదించాలి. తరచూ జరిగే నేరాలు ఇది వర్చువల్ దండయాత్రగా చెప్పుకోవచ్చు. స్నాప్‌చాట్ అకౌంట్ హ్యాకింగ్ అనేది ప్రధానంగా ఉన్న సైబర్‌నేరం. దీనివల్ల బాధితులు వివిధ రకాల దోపిడీకి గురవుతారు. హ్యాకర్లు యూజర్ ఖాతాలకు అనధికారక యాక్సెస్‌ను పొందడానికి ఫిషింగ్, కీ లాగింగ్ లేదా బ్రూట్ ఫోర్స్ దాడులు వంటి అనేక రకాల టెక్నాలజీలను ఉయోగిస్తారు. ఒకసారి రాజీ పడితే హ్యాకర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. హానికరమైన సందేశాలను పంపవచ్చు. లేదా తదుపరి నేరాలకు పాల్పడేందుకు యూజర్లా నటించవచ్చు. సెక్స్టార్షన్ అనేది ఇందులో మరింత ఆందోళన కలిగించే అంశం. సైబర్ నేరగాళ్లు అభ్యంతరకరమైన కంటెంట్‌ను పంపేలా బలవంతం చేయడం ద్వారా బాధితుల నమ్మకాన్ని దోపిడీ చేస్తారు. ఇక్కడ నుంచి తరచుగా ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చకపోతే విషయాన్ని బహిరంగంగా విడుదల చేస్తామని లేదా బాధితుడి పరిచయాలకు షేర్ చేస్తామని బెదిరిస్తారు. దీంతో బాధితులు తీవ్ర ఒత్తిడితో కూడిన పరిణామాలను ఎదుర్కొంటారు. స్నాప్‌చాట్ మెసేజ్‌ల ద్వారా సైబర్ బెదిరింపుల నుంచి విముక్తి లభించదు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వేధించే, బెదిరించే లేదా ద్వేషపూరిత కంటెంట్‌ను వ్యాప్తి చేసే హానికరమైన వినియోగదారులకు ఈ ప్లాట్‌ఫారమ్ బ్రీడింగ్ గ్రౌండ్‌గా పనిచేస్తుంది. స్నాప్‌చాట్ సైబర్ బెదిరింపు తీవ్రమైన వనసిక క్షోభకు దారి తీస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వ్యక్తుల నకిలీ ప్రొఫైల్స్ సృష్టించడానికి స్నాప్‌చాట్ సులువుగా అనుమతిస్తుంది. దీనిని సాధారణంగా క్యాట్‌ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ మోసగాళ్లు యూజర్లను తప్పుడు సంబంధాలు లేదా స్నేహాలలోకి ఆకర్షిస్తారు. కల్పిత కథలు, దొంగిలించిన చిత్రాలతో మోసగిస్తారు. ఈ విధానాల వల్ల తీవ్ర ఒత్తిడితో అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ∙స్నాప్‌చాట్ మెసేజ్‌లు వెంటనే అదృశ్యమై, అభద్రతా భావాన్ని సృష్టించగలదు. ఈ విషయంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. స్క్రీన్షాట్లు, అనధికారిక అప్లికేషన్లు, వ్యక్తిగత కంటెంట్‌ను క్యాప్చర్ చేయగలవు. ఒకసారి లీక్ అయితే, ఆ వ్యక్తి ప్రతిష్టకు తన వ్యక్తిగత జీవితానికి కోలుకోలేని నష్టం కలిగిస్తుంది. కొన్ని భద్రతా చిట్కాలు ∙మీ కంఫర్ట్ లెవల్‌కు అనుగుణంగా ఉండే సెట్టింగ్‌లను ఎంచుకోండి. నమ్మదగిన స్నేహితులకు మాత్రమే యాక్సెస్‌ని పరిమితం చేయండి. నిజజీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులను మాత్రమే అనుమతించండి. హాని కలిగించే అపరిచితుల రిక్వెస్ట్‌ను యాడ్ చేయడం మానుకోండి. లైంగికపరమైన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని నివారించండి. ∙మీ సమాచారాన్ని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున మీ పూర్తి పేరు, చిరునావ, ఫోన్ నంబర్ లేదా ఆర్థిక వివరాలను స్నాప్‌చాట్‌లో షేర్ చేయవద్దు. స్నాప్‌చాట్ నుండి ఎవరినైనా కలవాలని నిర్ణయించుకుంటే పబ్లిక్ లొకేషన్‌ను మాత్రమే ఎంచుకోండి. ∙తెలియని షార్ట్ లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుచిత మెసేజ్‌లకు ప్రతిస్పందిస్త వ్యక్తిగత సవచారాన్ని అందించడం మానుకోండి. స్నాప్ చాట్ లేదా చట్టబద్ధమైన కంపెనీలు... యాప్ ద్వారా మీ లాగిన్ ఆధారాలను లేదా వ్యక్తిగత వివరాలను ఎన్నటికీ అడగవు. స్నాప్‌చాట్ రీసెంట్ అప్డేట్స్ను ఇన్స్టాల్ చేయండి. దీని ద్వారా దోపిడీ ప్రమాదాన్ని నివారించవచ్చు. స్నాప్ మ్యాప్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది మీరున్న ప్లేస్‌ను అకౌంట్లోని స్నేహితులకు చపుతుంది. అందుకుని మ్యాప్ ఫీచర్‌ను స్టాప్ చేయండి. స్పాప్‌చాట్ ద్వారా సైబర్‌నేరానికి గురైతే వెంటనే.. https://help.snapchat.com/hc/en-us/articles/7012399221652-How-to-Report-Abuse-on-Snapchat పోర్ట్ చేయాలి. అదేవిధంగా, సమస్య పరిష్కారానికిhttps://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌఫౌండేషన్ (చదవండి: ఓ నది హఠాత్తుగా నీలం, నారింజ రంగులో మారిపోయింది! ఎక్కడంటే) -
నయా సైబర్ క్రైం.. డీప్ ఫేక్!
సోషల్ మీడియాలో ఫొటోలు, ఆడియో, వీడియోలు విరివిగా పోస్ట్ చేస్తుంటారా.. అయితే జరభద్రం.. సైబర్ నేరాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన డీప్ ఫేక్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. వీడియోలో మీ ముఖమే కనిపిస్తూ ఉంటుంది... కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తూ ఉంటాయి... కానీ మాట్లాడేదీ మీరు కాదు. మీరు చేయని అభ్యంతరకరమైన పనులు కూడా మీరే చేసినట్లు మారుస్తారు.. ఎలాగంటే.. మీ వాయిస్, వీడియో, ఫొటోలను వినియోగించి అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి మీరే వీడియో కాల్ చేసినట్లు సృష్టిస్తారు. లేదంటే కిడ్నాప్ అయ్యాననో, అత్యవసరమనో మీ ఫేక్ వీడియోలు సృష్టించి వాటిలో చెప్పిస్తారు. ఆ వీడియోలను కుటుంబీకులకు చూపించి అందినకాడికి దండుకుంటారు. ఈ నేరాలు ఘోరాలు చేసేందుకు అవసరమైన ఫోన్ నంబర్లు, వివరాలన్నీ తెలుసుకునేందుకు నేరగాళ్లు పెద్ద కష్టపడక్కర లేదు.. కేవలం మన సోషల్ మీడియా ఖాతాల నుంచే సంగ్రహిస్తున్నారు.. సాక్షి, హైదరాబాద్: ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్ నేరమే డీప్ ఫేక్. ఈ నయా తరహా సైబర్ నేరాలు పాల్పడేందుకు నేరగాళ్ళకు అవసరమైన డేటా డార్క్ వెబ్‌తో పాటు సోషల్ మీడియాలో తేలిగ్గా లభిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు, ఆడియో, వీడియోలను సంగ్రహిస్తున్న ఈ–కేటుగాళ్ళు వాటిని సేకరిస్తున్నారు. డార్క్ వెబ్ సహా ఇంటర్నెట్ నుంచి ఖరీదు చేసిన టూల్స్ వినియోగించి సింథసిస్ ప్రక్రియ చేయడుతున్నారు. ఇది కేవలం నేరగాళ్ళు మాత్రమే కాదు... సాంకేతికతపై పట్టున్న వాళ్లు కూడా చేస్తున్న వ్యవహారం కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ నయా సైబర్ క్రైం డీప్ ఫేక్‌తో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు... కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళుతోంది. యువతీ యువకులతో పాటు మధ్య వయస్సుల్లో జరుగుతున్న ‘కారణం తెలియని’ సూసైడ్స్‌కి ఈ సింథసిస్ ప్రక్రియ కూడా ఓ కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్లాంక్ వీడియో కాల్స్‌తో... సెక్సార్షన్ నుంచి ఎక్సార్షన్ వరకు వినియోగం... ఇటీవల కాలంలో అనేకమందికి వర్చువల్ నంబర్ల నుంచి బ్లాంక్ వీడియో కాల్స్ వస్తున్నాయి. వీటిని స్పందించి ఫోన్ ఎత్తితే.. అవతలి వారు కనిపించరు, మాట్లాడరు. ఎవరు కాల్ చేశారో తెలుసుకోవడానికి కొద్దిసేపు ఫోన్లో ప్రశ్నిస్తుంటాం. ఆ సమయంలో సైబర్ నేరగాళ్ళు రిసీవర్ వీడియో రికార్డు చేస్తారు. దీన్ని అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి వాళ్ళే ఆ వీడియోలో ఉన్నట్లు రూపొందిస్తారు. ఈ వీడియోను చూపించి బాధితుడిని భయపెట్టి వీలున్నంత దండుకుంటారు. ప్రధానంగా యువకులు, మధ్య వయసు్కలే ఈ నేరంలో టార్గెట్‌గా మారుతున్నారు. నేరగాళ్ళే కాదు అవసరార్థులూ వాడేస్తున్నారు.. ఈ సింథసిస్ ప్రక్రియను సైబర్ నేరగాళ్ళతో పాటు మరికొందరూ వాడేస్తున్నారు. ఆన్లైన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువత కూడా సింథసిస్ టెక్నిక్ వాడి అడ్డదారిలో గట్టెక్కుతోంది. బ్యాంకులు, ఇతర సంస్థలకు వీడియో అథెంటికేషన్ చేయాల్సిన వచ్చినప్పుడూ ఈ ప్రక్రియ వాడుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ఇంటర్వ్యూలను రికార్డు చేస్తూ, అభ్యర్థిని హెచ్ఆర్కు పిలిచి పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్ని మోసం చేయడానికి వీడియో సింథసిస్ వినియోగిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. భర్త గొంతును రికార్డు చేసి.. వేధిస్తున్నట్టు మార్చి... మనస్పర్ధల నేపథ్యంలో తన భర్తపై ఫిర్యాదు చేయాలని భావించిన ఓ భార్య వాయిస్ సింథసిస్ టెక్నిక్ వాడారు. తన భర్త గొంతును రికార్డు చేసి తనను దూషిస్తున్నట్లు, వేధిస్తున్నట్లు మార్చేశారు. ఆ రికార్డునే ఆధారంగా చూపించి భర్తపై ఆరోపణలు చేశారు. అయ్యో తాను అసలు అట్లా మాట్లాడలేదంటూ భర్త గోడువెళ్లబోసుకోవడంతో కౌన్సెలింగ్ చేసిన పెద్దల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ వీడియోలు చూడగానేతొందరపడొద్దు.. ఈ సింథసిస్ ప్రక్రియను ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లోనూ పూర్తి స్థాయిలో నిర్థారించడం సాధ్యం కావట్లేదు. కొన్ని అభ్యంతరకర అంశాలకు సంబంధించి తమ వారికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను చూసిన కుటుంబీకులు తొందర పడకూడదు. అవి ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యాయేమోనని అనుమానించాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ను వర్తింపజేయాలి. బాధితులుగా మారిన వారికి దన్నుగా ఉంటే ఒంటరితనం, కుంగిపోవడం జరగక ఆత్మహత్యలు వంటి వాటికి ఆస్కారం ఉండదు. – పెండ్యాల కృష్ణశాస్త్రి, సైబర్ నిపుణుడు -
నకిలీ వెబ్సైట్లు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలకు ప్రధాన వేదిక నకిలీ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లే (యాప్స్). దీంతో వాటిని కూకటివేళ్లతో సహా తొలగించి తద్వారా సైబర్ నేరాలను పెకిలించేందుకు సైబరాబాద్ పోలీసులు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సైబరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) ద్వారా నకిలీ వెబ్సైట్లు, యాప్‌లను గుర్తించి, ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. ఇప్పటివరకు సీఓఈ ద్వారా వందకు పైగా ఫేక్ సైట్లను తొలగించారు. విదేశాల నుంచి కూడా.. విదేశాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, ఉత్తరాఖండ్, కర్నాటక, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్లు, కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నేరస్తులు నకిలీ యాప్‌లను అభివృద్ధి చేసి, ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంచుతున్నారు. అవి నకిలీవని తెలియక చాలా మంది కస్టమర్లు వాటిని డౌన్లోడ్ చేసుకొని మోసపోతున్నారు. అందుకే పక్కా ఆధారాలతో నకిలీ సైట్లు, యాప్‌లను తయారు చేసే వారిని గుర్తించి, శిక్షలు పడేలా చేస్తున్నారు. ప్రతీ స్టేషన్లో సైబర్ వారియర్లు.. ప్రస్తుతం సైబర్ పోలీసు స్టేషన్‌తో పాటు ప్రతి శాంతి భద్రతల ఠాణాలోనూ ఇద్దరు సైబర్ వారియర్లు ఉన్నారు. వీరికి ఎస్ఐ నేతృత్వం వహిస్తారు. వీరికి సైబర్ నేరాల నియంత్రణపై శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో పెట్టడం కూడా సైబర్ నేరస్తులకు అవకాశంగా మారుతోంది. అవగాహనే సైబర్ నేరాలకు నియంత్రణకు ప్రధాన అస్త్రం. అందుకే కమిషనరేట్ పరిధిలో నివాసిత సంఘాలు, కంపెనీలు, పరిశ్రమలు, విద్యా సంస్థలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలోనూ సైబర్ నేరాలపై షార్ట్ వీడియో, పోస్ట్‌లు చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు. -
సింపుల్‌గా కోట్లు కొట్టేస్తున్నారు.. టాప్‌లో మహారాష్ట్ర
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ నేరాలు భారత దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. చిరు ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ సైబర్ నేరగాళ్లు వదలడంలేదు. కంప్యూటర్, ఫోన్లతోనే సింపుల్‌గా పని కానిచ్చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సైబర్ మోసగాళ్లు రూ.731.27 కోట్లు దోచేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడేళ్లలో 2.13 లక్షల సైబర్ మోసాలు జరిగినట్లు తెలిపింది. ఏటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్, బ్యాంక్ సర్వర్ నుంచి కస్టమర్ల సమాచారాన్ని హ్యాకింగ్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తోందని, డిజిటల్ చెల్లింపు భద్రతా నిబంధనలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు, సైబర్ మోసాల నిరోధం, కంప్యూటర్ భద్రతపై జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివిధ చర్యలను చేపట్టినట్లు తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికం గత మూడేళ్లలో మహారాష్ట్రలో అత్యధికంగా 83,974 సైబర్ మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రూ.240 కోట్లు కొట్టేసినట్లు చెప్పింది. ఆ తరువాత తమిళనాడులో 18,981 సైబర్ మోసాల్లో రూ.69.84 కోట్లు దోచుకున్నారు. హరియాణలో 18,573 కేసుల్లో రూ.66.98 కోట్లు, కర్ణాటకలో 11,916 మోపాల్‌లో రూ.60.75 కోట్లు కాజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాల సంఖ్య తక్కువగానే ఉంది. తెలంగాణలో 6,900 మోసాల్లో రూ.21.76 కోట్లు కాజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,885 సైబర్ మోసాల్లో రూ.5.69 కోట్లు కాజేసినట్లు పేర్కొంది. సైబర్ మోసాల కట్టడికి తీసుకున్న చర్యలు ♦ అన్ని రకాల సైబర్ నేరాలపై ఫిర్యాదులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభం ♦ బాధితులకు సహాయం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ♦ వినియోగదారుల డేటాను గోప్యంగా ఉంచాలని బ్యాంకులకు సూచన ♦ డిజిటల్ సేవల ప్రక్రియను సురక్షితంగా ఉంచడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని బ్యాంకులకు ఆదేశం ♦ సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో పోస్టర్లు ♦ అన్ని లావాదేవీలకు ఆన్లైన్ హెచ్చరికలను తప్పనిసరి ♦ లావాదేవీల మొత్తంపై రోజువారీ పరిమితులు -
అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వాతావరణం సమీపిస్తున్నందున శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పోలీస్ ఉన్నతాధికారి వారి పరిధిలోని గ్రామాల సందర్శన కొనసాగించాలని సూచించారు. నగరంలో ఏర్పా టు చేసిన డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా హాట్స్పాట్ల గుర్తింపు, పోలీసుల ప్రవర్తన తదితర అంశాలపై డీజీపీ చర్చించారు. శాంతిభద్రతల అడిషల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు సూచనలు చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి పదిమంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అంబేడ్కర్ చిత్రపటానికి డీజీపీ నివాళులర్పిం చారు. -
సైబర్ నేరగాళ్ల హైటెక్ దోపిడీ
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డులేకుండా పోతోంది. కొత్త దారుల్లో బ్యాంక్ అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. బడా కంపెనీల ఈ–మెయిళ్ల, వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసి సమాచారాన్ని కొట్టేస్తున్నారు. మరోవైపు ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత విషయాల కూపీ లాగుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోని ఫోన్ నంబర్ల సేకరించి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్, అడ్రస్ డేటా చౌరంతో స్విమ్ స్వాప్ చేసి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సిమ్ పని చేయకపోవడంతో వేరే నంబర్ నుంచి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే అతడి పేరిట అదే నంబర్‌తో వేరే వ్యక్తులు కొత్త సిమ్ తీసుకున్నట్టు తేలడంతో షాకయ్యాడు. అదే సమయంలో అతని అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయమయ్యాయి. బ్యాంకు అకౌంట్ చూసుకుంటే గానీ అతనికి అసలు విషయం తెలియలేదు. సిమ్ పనిచేయకపోవడంతో ఎస్ఎంఎస్ కూడా రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజమండ్రికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్లో సిగ్నల్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫోన్ ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి.. ఆన్ చేసినా సిగ్నల్స్ రాలేదు. సమీపంలోని కస్టమర్ సెంటర్‌కు వెళ్లి విషయం చెప్పాడు. సిమ్‌కార్డు పాడైందని.. కొత్తది తీసుకోవాలన్నారు. అడ్రస్ ప్రూఫ్ తీసుకుని ఆన్లైన్లో చెక్ చేసిన సిబ్బంది అంతకు ముందే అదే నంబర్‌తో కొత్త సిమ్ యాక్టివేట్ అయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ అకౌంట్లో రూ.20 వేలు డ్రా అయ్యాయి. ఈ రెండు ఘటనల్లో జరిగింది సిమ్ స్వాప్. సైబర్ నేరగాళ్లు నకిలీ సిమ్ తీసుకుని.. బ్యాంకు అకౌంట్లను గుల్ల చేసే కొత్త ఎత్తుగడ ఇది. ఇటీవల కాలంలో పల్లెలు, పట్టణాల్లోనూ సిమ్ స్వాప్ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు ♦ సిమ్ స్వాప్ నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి ఫోన్ నంబర్‌తో అతనికి తెలియకుండానే మరో సిమ్‌కార్డు తీసుకుంటున్నారు. ♦ నేరగాళ్లు ముందుగానే బాధిత వ్యక్తి అడ్రస్, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి వివరాలను సంపాదిస్తున్నారు. ♦ వాటి ఆధారంగా సిమ్‌కార్డు పోయిందంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుంటారు. ♦ఆ విషయం అసలు వ్యక్తికి తెలిసేలోపే ఆ ఫోన్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును అదే ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. ♦ ఇందుకోసం ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత వివరాలను కూపీ లాగుతున్నారు. ♦ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. వీటిని తరచూ గమనించాలి ♦ మీ సిమ్ కార్డ్ లేదా ఫోన్ నంబర్ వేరేచోట యాక్టివేట్ అయిందంటే అది సిమ్ స్వాప్గా గుర్తించాలి. ♦ ఏ కారణం లేకుండా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు ఉన్నట్టుండి నిలిచిపోతే దోపిడీకి ఆస్కారం ఏర్పడినట్టు గ్రహించాలి. ♦ తరచూ భద్రతా నోటిఫికేషన్లు, పాస్వర్డ్లు, భద్రతా ప్రశ్నలు వంటివి, మీ ప్రొఫైల్ డేటా మార్పుల గురించి హెచ్చరికలు వస్తే.. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లోకి లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని అర్థం. ♦ సైబర్ నేరస్తులు మీ సిమ్‌ను నకిలీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మీరు సందర్శించే వెబ్సైట్ల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ♦ భద్రత ప్రమాణాలు కలిగిన వెబ్సైట్ యూఆర్ఎల్లో https:// అని ఉంటుంది. యూఆర్ఎల్లో ‘ S ’ లేకుంటే అది కచ్చితంగా నకిలీ వెబ్సైట్ అని భావించాలి. వ్యక్తిగత డేటా విషయంలో జాగ్రత్త సిమ్ స్వాపింగ్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన వ్యక్తిగత డేటా ఎప్పుడూ బహిరంగ పరచకూడదు. భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్సైట్లనే వినియోగించాలి. సామాజిక మాధ్యమాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు వంటి వాటిని పిన్లుగా పెట్టకపోవడం మంచిది. తరచూ మీ సిమ్ మీ పేరుపైనే ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మెసేజ్‌లు ఆగిపోవడం, సిగ్నల్ నిలిచిపోవడం, మీ అకౌంట్‌కు అవాంఛనీయ మెయిల్స్ రావడం సిమ్ స్వాప్‌కు సూచనలు. రెండంచెల ధ్రువీకరణ కోరే యాప్స్‌ను మాత్రమే వాడటం మంచింది. సిమ్ స్వామ్ జరిగినట్టు తెలిసివెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 112, 181, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 11100, నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. – అమిత్ బర్దర్, ఎస్పీ, సైబర్ క్రైమ్