defending champion
-
ఇండియన్ రైల్వేస్‌దే మురుగప్ప గోల్డ్‌కప్
చెన్నై: భారత్‌లో అతి పురాతన హాకీ టోర్నమెంట్లలో ఒకటైన ఎంసీసీ–మురుగప్ప గోల్డ్ కప్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ రైల్వేస్ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. 1901లో తొలిసారి మొదలైన ఈ టోర్నీ ఇప్పటి వరకు 95 సార్లు జరిగింది. ఫైనల్లో రైల్వేస్ జట్టు 5–3 గోల్స్ తేడాతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జట్టుపై ఘనవిజయం సాధించింది. రైల్వేస్ తరఫున యువరాజ్ వాలీ్మకి (18వ, 58వ ని.లో) రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా గుర్సాహిబ్జిత్ సింగ్ 7వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు శుభారంభమిచ్చారు. రెండు నిమిషాల వ్యవధిలోనే సిమ్రన్‌జ్యోత్ సింగ్ (9వ ని.లో) ఫీల్డ్‌గోల్ చేసి రైల్వేస్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. తర్వాత కాసేపటికి యువరాజ్ చేసిన గోల్‌తో 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎట్టకేలకు ఐఓసీ ఆటగాడు తలీ్వందర్ సింగ్ (23వ ని.లో) చేసిన గోల్‌తో జట్టు ఖాతా తెరిచింది. ఆరు నిమిషాల వ్యవధిలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుజిందర్ సింగ్ (ఐఓసీ) గోల్‌గా మలచడంతో రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఐఓసీ 2–3తో రైల్వేస్ ఆధిక్యానికి గండికొట్టింది. కానీ మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే ముకుల్ శర్మ (35వ ని.లో), చివరి క్వార్టర్లో యువరాజ్ చేసిన గోల్స్‌తో రైల్వేస్‌కు విజయం ఖాయమైంది. ఐఓసీ తరఫున రాజ్బిర్ సింగ్ (58వ ని.లో) గోల్ చేసినా లాభం లేకపోయింది. -
Paris Olympics 2024: నీరజ్ వస్తున్నాడు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం క్వాలిఫయింగ్ బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఓలింపిక్స్లో నీరజ్ పసిడి పతకం సాధించి దేశ అథ్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ‘పారిస్’లోనూ టోక్యో ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. టోక్యో విశ్వ క్రీడల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగించిన 26 ఏళ్ల నీరజ్ గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి విశ్వవిజేతగా నిలిచాడు. ‘పారిస్’ నుంచి కూడా పతకంతో తిరిగి వస్తాడని యావత్ భారతావని ఆశలు పెట్టుకోగా... వాటిని అందుకోవడమే లక్ష్యంగా నేడు నీరజ్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఆచితూచి టోరీ్నల్లో పాల్గొన్న 26 ఏళ్ల నీరజ్.. ఈ ఏడాది బరిలోకి దిగిన మూడు టోరీ్నల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ విభాగంలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు.. కిశోర్ కుమార్ జేనా కూడా పోటీ పడుతున్నాడు. రెండు గ్రూప్‌ల్లో కలిపి మొత్తం 32 మంది త్రోయర్లు బరిలోకి దిగుతున్నారు. గ్రూప్ ‘బి’లో నీరజ్... కిశోర్ గ్రూప్ ‘ఎ’లో ఉన్నారు. ఫైనల్ చేరడానికి అర్హత ప్రమాణంగా 84 మీటర్లు నిర్ణయించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. ఒకవేళ 12 మంది కంటే ఎక్కువ మంది 84 మీటర్లను దాటి జావెలిన్‌ను విసిరితే ఇందులో నుంచి టాప్–12 మందికి ఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. ఫైనల్ గురువారం జరుగుతుంది. పాకిస్తాన్ త్రోయర్ నదీమ్ అర్షద్, జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వెబర్ (జర్మనీ), ఒలీవర్ (ఫిన్లాండ్) నుంచి నీరజ్‌కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. -
సబలెంకా... మళ్లీ చాంపియన్
మెల్బోర్న్: బెలారస్ టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. వరుసగా రెండో ఏడాదీ మహిళల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్ సబలెంకా 76 నిమిషాల్లో 6–3, 6–2తో చైనాకు చెందిన 12వ సీడ్ జెంగ్ కిన్వెన్పై గెలిచింది. విజేత సబలెంకాకు 31,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు), రన్నరప్ జెంగ్ కిన్‌వెన్‌కు 17,25,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసెట్లో రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకకు ఈ సెట్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో సెట్లోనూ రెండు బ్రేక్ పాయింట్లను సాధించిన 25 ఏళ్ల బెలారస్ స్టార్ ఈ మ్యాచ్‌లో 3 ఏస్‌లను సంధించి, 14 విన్నర్లు కొట్టింది. 14 అనవసర తప్పిదాలు చేసింది. ఒక్కసారి కూడా డబుల్‌ఫాల్ట్ చేయకుండా జాగ్రత్తగా ఆడింది. జెంగ్ 6 ఏస్‌లతో రాణించినప్పటికీ 6 డబుల్ ఫాల్ట్‌లు, 16 అనసవర తప్పిదాలతో టైటిల్‌కు దూరమైంది. గత 13 నెలల్లో ప్రతీ టోర్నీలోనూ మెరుగవుతున్న సబలెంకా జోరు ముందు ఏమాత్రం నిలువలేకపోయింది. గత సీజన్లో ఆరంభ గ్రాండ్‌స్లామ్ గెలిచిన బెలారస్ అమ్మాయి ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. మధ్యలో ఫ్రెంచ్, వింబుల్డన్ ఓపెన్లలోనూ సెమీఫైనల్ వరకు పోరాడింది. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో సబలెంకా చేతిలోనే ఓడి ఇంటిదారి పట్టిన 21 ఏళ్ల జెంగ్ కిన్వెన్ ఇప్పుడు ఆమె జోరుకు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. తద్వారా మళ్లీ ఈ ఏడాదీ కొత్త సీజన్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అజరెంకా (2012, 2013) తర్వాత వరుస టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా ఘనతకెక్కింది. 2000 తర్వాత సెట్ కోల్పోకుండా ఇక్కడ విజేతగా నిలిచిన ఐదో క్రీడాకారిణిగా సబలెంకా నిలిచింది. -
భారత్ టైటిల్ నిలబెట్టుకునేనా?
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో నేడు జరిగే ఫైనల్లో పటిష్టమైన కువైట్‌తో ఆడనుంది. ఈ టోర్నమెంట్లో భారత్, కువైట్‌లు తలపడటం ఇది రెండోసారి. లీగ్ దశలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. లెబనాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ చక్కని ప్రదర్శనతో పెనాల్టీ షూటౌట్లో గెలిచింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మరో సెమీస్‌లో కువైట్ 1–0తో విజయం సాధించింది. కువైట్, లెబనాన్ పశ్చిమ ఆసియా దేశాలైనప్పటికీ పోటీతత్వం ఉండాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ రెండు దేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించాయి. కంఠీరవ స్టేడియంలో ప్రేక్షకుల మద్దతుతో భారత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సొంతగడ్డపై జరుగుతుండటం భారత్‌కు అనుకూలాంశమైతే... హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ఈ ఫైనల్‌కు కూడా జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మైదానంలోకి వెళ్లి ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడంతో ‘రెడ్ కార్డ్’తో ఓ మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో లెబనాన్ తో కీలకమైన సెమీస్ మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే టోర్నీ క్రమశిక్షణ కమిటీ అతనికి రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ విధించడంతో.... కువైట్‌తో అమీతుమీకి కూడా గైర్హాజరు కానున్నారు. 1: ఇప్పటి వరకు భారత్, కువైట్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. భారత్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. .ట్రోఫీతో భారత జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్, కువైట్ జట్టు గోల్‌కీపర్ బదర్ బిన్ సానూన్ -
IPL 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 తుదిపోరులో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్,ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఐపీఎల్ పదహారవ సీజన్ విజేత ఎవరనే ఉత్కంఠకు తోడు భారీ వర్షం మరింత టెన్షన్ రేపింది..చివరికి టైటిల్‌ను సీఎస్కే ఎగురేసుకపోయింది. ఇది ఇలా ఉంటే ఐపీఎల్లో 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓనరు ఎవరు, ఆదాయం ఎంత అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. (ఐపీఎల్ ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్, వైరల్ ట్వీట్) ఐపీఎల్ 2022 లక్నో ,అహ్మదాబాద్ టీమ్‌లు ఎంట్రీ ఇచ్చాయి. 25 అక్టోబర్ 2021 ఏర్పాటైన అహ్మదాబాద్ ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ (జీటీ)ని యూరప్‌కు చెందిన ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్స్ రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. దీని చైర్మన్ స్టీవ్ కోల్ట్స్. స్టీవ్స్ స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకర్. ఈ కంపెనీ క్రీడలతో పాటు పెట్టుబడి బ్యాంకింగ్ , బ్రోకరేజ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. (3 వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ పెద్ద అమెరికన్-ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ, 133 బిలియన్ యూరోల విలువైన ఆస్తులున్నాయి. దీని భారత కరెన్సీలో రూ. 11.98 లక్షల కోట్లకు పైగా ఉంది, ఇది క్రికెట్ లీగ్‌లోని మెజారిటీ ఐపీఎల్ జట్టు యజమానుల నికర విలువ కంటే చాలా పెద్దది. ఐపీఎల్ బిడ్ గెలిచిన తర్వాత, ముంబై ఇండియన్స్ మాజీ స్టార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. అలాగే స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) కాగా ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే గెలిచి అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో టై చేసింది.. 2022 అరంగేట్రంలో అదరగొట్టి అన్ని అంచనాలను అధిగమించి మరీ టైటిల్ దక్కించుంది జీటీ. -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్‌సీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. జంషెడ్పూర్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. జంషెడ్పూర్ తరఫున రిత్విక్ దాస్ (22వ ని.లో), జే ఇమ్మాన్యుయెల్ థామస్ (27వ ని.లో), డానియల్ చుక్వు (29వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (12వ, 79వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
ఒసాకా అలవోకగా...
మానసిక ఆందోళనతో గత ఏడాది ఇబ్బంది పడి కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా కొత్త సంవత్సరంలో మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా తొలి రౌండ్ అడ్డంకిని అలవోకగా దాటింది. అనవసర తప్పిదాలు చేసినా నిరాశకు లోనుకాకుండా నవ్వుతూ ఆడిన ఈ 14వ ర్యాంకర్ కెరీర్లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. మెల్బోర్న్: తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించిన నయోమి ఒసాకా (జపాన్), యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్, 13వ సీడ్ ఒసాకా 6–3, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై, టాప్ సీడ్ బార్టీ 6–0, 6–1తో క్వాలిఫయర్ లెసియా సురెంకో (ఉక్రెయిన్)పై గెలిచారు. ఒసోరియాతో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 68 నిమిషాల్లో గెలిచింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఒసాకా తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 15సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచిన ఒసాకా 28 అనవసర తప్పిదాలు చేసింది. సురెంకోతో జరిగిన మ్యాచ్‌లో బార్టీ కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయింది. నాదల్ బోణీ... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, ఆరో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన నాదల్ తొలి రౌండ్లో 6–1, 6–4, 6–2తో మార్కోస్ గిరోన్ (అమెరికా)పై నెగ్గగా... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న జ్వెరెవ్ 7–6 (7/3), 6–1, 7–6 (7/1)తో అల్టామెర్ (జర్మనీ)పై గెలిచాడు. గిరోన్తో మ్యాచ్‌లో నాదల్ ఏడు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. 34 విన్నర్స్ కొట్టిన నాదల్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు 12వ సీడ్ కామెరాన్ నోరి (బ్రిటన్) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతోన్న సెబాస్టియన్ కోర్డా (అమెరికా) 6–3, 6–0, 6–4తో నోరిపై గెలిచాడు. ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 4–6, 6–2, 7–6 (7/5), 6–3తో నకషిమా (అమెరికా)పై, పదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 6–2, 7–6 (7/3), 6–7 (5/7), 6–3తో జెరాసిమోవ్ (బెలారస్)పై నెగ్గారు. కెనిన్‌కు షాక్... మహిళల సింగిల్స్‌లో తొలి రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. 2020 చాంపియన్, 11వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), 18వ సీడ్ కోకో గాఫ్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/2), 7–5తో కెనిన్‌ను ఓడించగా... ప్రపంచ 112వ ర్యాంకర్ కియాంగ్ వాంగ్ (చైనా) 6–4, 6–2తో కోకో గాఫ్‌పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6–4, 7–6 (7/2)తో తాత్యానా మరియా (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–4, 6–0తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. -
కరోనా బారిన పడిన యూఎస్ ఓపెన్ ఛాంపియన్
Emma Raducanu Tests Positive For Covid: యూఎస్ ఓపెన్ మహిళల డిఫెండింగ్ ఛాంపియన్, బ్రిటన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అతి పిన్న వయసులోనే యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఎగురేసుకుపోయి చరిత్ర సృష్టించిన ఎమ్మా.. ఈ వారం అబుదాబిలో ప్రారంభమయ్యే ముబాదల ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, కరోనా సోకడంతో ఆమె ఆ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మా పేర్కొంది. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్ ప్లేయర్ దూరం -
భారత్ హ్యాట్రిక్
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0తో జపాన్ను ఓడించి వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై 11–0తో... రెండో మ్యాచ్‌లో పాక్‌పై 4–1తో నెగ్గిన మన్‌ప్రీత్ సింగ్ బృందం మూడో మ్యాచ్‌లోనూ తమ జోరును ప్రదర్శించింది. ప్రతి క్వార్టర్లో గోల్ చేసి జపాన్ను హడలెత్తించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (4, 49, 57వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ నమోదు చేయగా... హర్మన్‌ప్రీత్ సింగ్ (17, 21వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. గుర్జంత్ సింగ్ (8వ నిమిషంలో), ఆకాశ్‌దీప్ సింగ్ (36వ నిమిషంలో), సుమీత్ (42వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (45వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో భారత్ తరఫున హ్యాట్రిక్ చేసిన రెండో ప్లేయర్‌గా మన్దీప్ సింగ్ నిలిచాడు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దిల్‌ప్రీత్ సింగ్ ఈ ఘనత సాధించాడు. తాజా విజయంతో భారత్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌తో ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడిన భారత్ 18 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని... ఒక మ్యాచ్‌లో ఓడింది. మంగళవారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. ఇటీవలే జకార్తా ఆసియా క్రీడల సెమీఫైనల్లో మలేసియా చేతిలో అనూహ్యంగా ఎదురైన ఓటమికి భారత్ భారీ విజయంతో ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి. -
‘శాఫ్’ కప్ ఫైనల్లో భారత్‌కు షాక్
ఢాకా: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు భంగపాటు ఎదురైంది. అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైన భారత జట్టు ఫైనల్లో 1–2తో మాల్దీవులు చేతిలో ఓడింది. గ్రూప్ దశలో 2–0తో మాల్దీవులను ఓడించిన భారత్ శనివారం జరిగిన తుదిపోరులో మాత్రం తడబడింది. ఆద్యంతం భారత్ ఆధిపత్యమే కొనసాగినా విజయం మాత్రం ప్రత్యర్థిని వరించింది. వచ్చిన కొద్దిపాటి అవకాశాలను చక్కగా వినియోగించుకున్న మాల్దీవులు రెండో సారి శాఫ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. భారత్ తరఫున సుమీత్ పస్సీ (92వ ని.లో) ఏకైక గోల్ చేయగా... మాల్దీవులు తరఫున ఇబ్రహీం (19వ ని.లో), అలీ ఫసీర్ (66వ ని.లో) చెరో గోల్ చేశారు. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన భారత్ తుదిపోరులో సమన్వయ లోపంతో చతికిలపడింది. ఆట ఆరంభమైన ఐదో నిమిషంలోనే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంది. నిఖిల్ అందించిన పాస్‌ను రంజన్ సింగ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచే ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు. 30వ నిమిషంలో ఫరూఖ్ గోల్‌పోస్ట్‌కు అతిసమీపంలో బంతిని దొరకబుచ్చుకున్నా నియంత్రణ కోల్పోయి దాన్ని వృథా చేశాడు. ఆ తర్వాత కూడా భారత్ దాడులను కొనసాగించినా మాల్దీవులు రక్షణ పంక్తి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. ఇంజ్యూరీ టైంలో సుమీత్ గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైంది. -
నేటి నుంచి దులీప్ ట్రోఫీ సమరం
దిండిగుల్ (తమిళనాడు): భారత దేశవాళీ క్రికెట్ సీజన్ (2018–19)కు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే దులీప్ ట్రోఫీతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇండియా ‘గ్రీన్’తో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ‘రెడ్’ తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పింక్ బంతితో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ మ్యాచ్‌లన్నీ నాలుగు రోజులు... సెప్టెంబర్ 4నుంచి ఫైనల్ ఐదు రోజులు జరుగుతుంది. ఇండియా ‘రెడ్’కు అభినవ్ ముకుంద్ సారథి కాగా... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్, ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో అభినవ్ ముకుంద్, పార్థివ్ పటేల్‌లు తాము ఆ స్థానాలకు అర్హులమే అని నిరూపించుకునేందుకు ఇది సరైన అవకాశం. భారత రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా ఆటకు దూరమవ డంతో... అతని స్థానంలో ఎంపికైన దినేశ్ కార్తీక్ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పార్థివ్ పటేల్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటే అతను సత్తా చాటక తప్పదు. వీళ్లతో పాటు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఫైజ్ ఫజల్, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, బాసిల్ థంపి, గుర్బాని, గణేశ్ సతీశ్, బి. సందీప్, ఎ. మిథున్, అంకిత్ రాజ్‌పుత్, జైదేవ్ ఉనాద్కట్‌లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఆంధ్ర క్రికెటర్లు శ్రీకర్ భరత్, అయ్యప్ప ఇండియా ‘బ్లూ’ జట్టుకు, పృథ్వీరాజ్ ‘రెడ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా... సాక్షి, విజయవాడ: ఆస్ట్రేలియా ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’లతో పాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు పాల్గొంటున్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ కూడా నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో నేడు, రేపు జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూలపాడులో జరిగే ఈ టోర్నీ ఫైనల్ ఈ నెల 29న నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు జోండో కెప్టెన్ కాగా... ఆస్ట్రేలియాకు ట్రవిస్ హెడ్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ ‘ఎ’ జట్టుకు శ్రేయస్ అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫెడరర్ జోరు కొనసాగేనా?
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ బరిలోకి దిగనున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)తో నేడు జరిగే తొలి రౌండ్లో ఆడనున్న ఫెడరర్‌కు సెమీఫైనల్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం కనిపించడం లేదు. గాయం కారణంగా మాజీ చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వైదొలగడం... ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో పార్శ్వంలో ఉండటం ఫెడరర్‌కు కలిసొచ్చే అంశం. పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున యూకీ బాంబ్రీ... డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, విష్ణువర్ధన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెదున్‌చెజియాన్, పురవ్ రాజా బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా)తోపాటు డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్), వొజ్నియాకి (డెన్మార్క్), టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ రేసులో ఉన్నారు. సా.గం. 4.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ఎవరిదో నాకౌట్ ‘కిక్’!
ఇదికాకుంటే... మరోటి అనుకునేందుకు లేదు. వెనుకబడితే... వెన్నులో వణుకు పుట్టినట్లే. గెలిస్తే ముందుకు... లేదంటే ఇంటికే. ‘కిక్’ ఎవరిదో... వారే నాకౌట్ విజేత! నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్ సమరం...! మాస్కో: అభిమానులను ఉర్రూతలూగిస్తూ... ఫుట్‌బాల్ ప్రపంచకప్ రెండో అంకానికి చేరింది. 32 జట్లు సగమై 16 మిగిలాయి. ఈ సగంలో మరింత ముందుకెళ్లే సగమేవో తేల్చేందుకు శనివారం నుంచే పోరు. కజన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచే దిగ్గజాలైన అర్జెంటీనా–ఫ్రాన్స్ మధ్య. ప్రిక్వార్టర్స్ దశలోనే తలపడుతున్న మాజీ విజేతలు ఈ రెండే కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో పోర్చుగల్‌ను ఉరుగ్వే ‘ఢీ’ కొట్టనుంది. చిత్రమేమంటే ఇప్పటివరకు కప్ గెలుచుకున్న 8 దేశాల్లో ఇటలీ ఈసారి అర్హత సాధించలేదు. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. నేటి ఫ్రాన్స్, అర్జెంటీనా మ్యాచ్‌తో ఓ మాజీ విజేత ఇంటిముఖం పట్టడం ఖాయం. మిగతా ఐదు మాజీ చాంపియన్లలో ఎన్నింటికి షాక్ తగులుతుందో చూడాలి. దృష్టంతా వారిపైనే... జట్లుగా తలపడుతున్నా అందరి కళ్లూ అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ, ఫ్రాన్స్ మెరిక ఆంటోన్ గ్రీజ్మన్ పైనే. వీరిద్దరూ టోర్నీలో చెరో గోలే చేసినా... ఆటతీరులో మొత్తం జట్టుపై వారి ప్రభావం తీసిపారేయలేనిది. బలాబలాల్లోకి వస్తే అర్జెంటీనాపై ఫ్రాన్స్‌కే కొంత మొగ్గు కనిపిస్తోంది. ఆ జట్టులోని పోగ్బా, ఎంబాపె ఫామ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో అర్జెంటీనాకు మెస్సీనే అన్నీ అవుతున్నాడు. లీగ్ దశలో ప్రత్యర్థులు అతడినే లక్ష్యం చేసుకోవడంతో జట్టుకు కష్టాలు ఎదురయ్యాయి. చివరి మ్యాచ్‌లో మార్కస్ రొజొ మెరిసినా... స్వతహాగా అతడు డిఫెండర్. మెస్సీకి హిగుయెన్, అగ్యురో తోడైతేనే ప్రత్యర్థిపై అర్జెంటీనా పైచేయి సాధించగలదు. ఫ్రాన్స్ లీగ్ దశలో ఓటమి లేకుండా ప్రిక్వార్టర్స్ చేరగా, అర్జెంటీనా మిశ్రమ ఫలితాలతో గట్టెక్కింది. ప్రపంచ కప్ చరిత్రలో ఫ్రాన్స్‌పై రెండుసార్లూ అర్జెంటీనాదే విజయం. 1930లో 1–0తో, 1978లో 2–1తో గెలుపొందింది. రొనాల్డో వర్సెస్ సురెజ్ సోచిలో శనివారం అర్ధరాత్రి 11.30కు జరుగనున్న మరో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో పోర్చుగల్ తో ఉరుగ్వే తలపడనుంది. 1972 తర్వాత ఈ రెండు జట్లు మరోసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఉరుగ్వేతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకసారి నెగ్గిన పోర్చుగల్, మరోసారి ‘డ్రా’తో సరిపెట్టుకుంది. పోర్చుగల్ ఆశలన్నీ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోపైనే. ఈ టోర్నీలో అతను ఇప్పటికి నాలుగు గోల్స్ చేశాడు. మరోవైపు ఉరుగ్వే స్టార్ ఆటగాడు సురెజ్ ఆటతీరుపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ జూన్ 30 అర్జెంటీనా x ఫ్రాన్స్ రాత్రి గం. 7.30 నుంచి పోర్చుగల్ x ఉరుగ్వే రాత్రి గం. 11.30 నుంచి జూలై 1 స్పెయిన్ x రష్యా రాత్రి గం. 7.30 నుంచి క్రొయేషియా x డెన్మార్క్ రాత్రి గం. 11.30 నుంచి జూలై 2 బ్రెజిల్ x మెక్సికో రాత్రి గం. 7.30 నుంచి బెల్జియం x జపాన్ రాత్రి గం. 11.30 నుంచి జూలై 3 స్వీడన్ x స్విట్జర్లాండ్ రాత్రి గం. 7.30 నుంచి కొలంబియా x ఇంగ్లండ్ రాత్రి గం. 11.30 నుంచి సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం -
మెస్సీకి సహకారం అందించాలి
ప్రపంచ కప్‌లో తొలి దశ డ్రామా ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ నిష్క్రమించగా, 16 అత్యుత్తమ జట్లు నాకౌట్ బరిలో నిలిచాయి. ఇప్పుడు అసలైన ఫుట్‌బాల్‌కు రంగం సిద్ధమైంది. అత్యుత్తమంగా ఆడినవారే ఇక్కడ నిలుస్తారు. ఈ దశలో కేవలం మంచి ఆట, వ్యూహాలు మాత్రమే సరిపోవు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా చాలా ముఖ్యం. దీనిని తట్టుకోలేనివారు అందరికంటే ముందే బయటకు వెళ్లిపోతారు. సాధారణంగా నాకౌట్ దశలో చూపు తిప్పుకోలేని విధంగా ఆట సాగుతుంది. ఈసారి కూడా అందులో లోటేమీ లేదు. టోర్నీ చివరి దశలో కాకుండా ముందే పెద్ద జట్ల మధ్య పోరు జరగనుంది. ఫ్రాన్స్‌తో అర్జెంటీనా, ఉరుగ్వేతో పోర్చుగల్ తలపడటం అంటే భారీ వినోదానికి అవకాశం ఉంది. ఈ టోర్నీ ఆరంభంలో అర్జెంటీనా చాలా ఇబ్బంది పడింది. డిఫెన్స్ బలహీనత, మెస్సీపై అతిగా ఆధారపడటం, తుది జట్లు ఎంపికపై వివాదంలాంటి చాలా సమస్యలు వచ్చాయి. అయితే ఆఖరి మ్యాచ్‌లో సాహసోపేత ఆటతో పాటు అదృష్టం కూడా వారికి కలిసొచ్చింది. ఇప్పటికే నాకౌట్ మ్యాచ్ తరహా పరిస్థితిని ఎదుర్కోవడం ఒక రకంగా వారికి మంచిదే. అర్జెంటీనా ఒక జట్టుగా ఆడటం ఎంతో ముఖ్యం. మెస్సీ తన పరిధిలో ఎంత చేయగలడో అంతా చేస్తాడు కానీ ఇతర ఆటగాళ్లు కూడా తమ బాధ్యత నెరవేరిస్తేనే అర్జెంటీనాకు మంచి ఫలితం లభిస్తుంది. -
డిఫెండింగ్ కాదు.. ‘డీలా’ చాంపియన్స్
ఏ మెగా టోర్నీలోనైనా డిఫెండింగ్ చాంపియన్ అనేది హాట్ ఫేవరేట్‌గా ఉండటం సహజం. అభిమానుల అంచనాలు కూడా ఆ జట్టుపైనే ఎక్కువగా ఉంటాయి. ‘ఏదో అన్నీ కలిసొచ్చి టైటిల్ నెగ్గారు.. దమ్ముంటే ఈసారి కప్ గెలవండి’ అనే విమర్శకుల నోళ్లు మూయించడానికైనా ఆయా జట్లు విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే ఫిఫా ప్రపంచ కప్‌లలో మాత్రం డిఫెండింగ్ చాంపియన్స్ ఆశ్చర్యకర రీతిలో లీగ్‌దశ నుంచే నిష్క్రమిస్తున్నాయి. ఆ చరిత్ర ఓసారి పరిశీలిస్తే... ‘2002లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన సాకర్ సమరంలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇటలీ కూడా లీగ్ స్టేజీని దాటలేకపోయింది. 2014లో బ్రెజిల్లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ను మరోసారి ముద్దాడాలనుకున్న స్పెయిన్ లీగ్ దశలోనే పోరాటం ముగించింది. ఇప్పుడు తాజాగా రష్యాలో జరుగుతున్న సాకర్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ కూడా నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించింది. ఈ ప్రపంచ కప్‌లో బలమైన జట్టుగా పేరున్న జర్మనీ.. కలలో కూడా ఊహించని పరిణామం ఎదుర్కొంది. పసికూన దక్షిణ కొరియా చేతిలో ఘోర పరాభావం చవిచూసింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగే ఏ జట్టైనా లీగ్ దశలోనే నిష్క్రమిస్తుందని ఓ అపనమ్మకం అభిమానుల్లో ఏర్పడింది. మరి 2022లో ఖతార్‌లో జరిగే ప్రపంచ కప్‌లో నైనా ఈ సాంప్రదాయానికి తెరపడుతుందో చూడాలి. -
జర్మనీ కూలింది
జర్మనీ... నాలుగుసార్లు చాంపియన్... మరో నాలుగుసార్లు రన్నరప్...! ప్రపంచ కప్‌లో కాలుపెట్టిందంటే కనీసం క్వార్టర్స్ ఖాయమనే బలీయ నేపథ్యం దానిది. ఫుట్‌బాల్ ప్రపంచంలో జగజ్జేతకు నిర్వచనం అనదగ్గ జట్టు! మరీ ముఖ్యంగా గత నాలుగు కప్‌లలో ఓసారి రన్నరప్, రెండు సార్లు మూడో స్థానం, క్రితంసారి విజేత..! ఏ ఒక్కరిపైనో ఆధారపడని స్థితిలో, అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తూ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందనే అంచనాలతో అమేయ శక్తిగా ఈ కప్‌లో అడుగిడింది. ...కానీ బరిలో దిగాక అనుకున్నదంతా తలకిందులైంది! తొలి మ్యాచ్‌లో మెక్సి‘కోరల్లో’ చిక్కి విలవిల్లాడి ఓడింది. రెండో మ్యాచ్‌లో స్వీడన్‌పై చచ్చీ చెడి నెగ్గింది. చివరి మ్యాచ్‌లో కొరియా చేతిలో ఏకంగా చావుదెబ్బ తిన్నది. గెలుపు మాత్రమే నాకౌట్ మెట్టెక్కించే స్థితిలో బోర్లాపడింది. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. తమ జట్టు చరిత్రలోనే దారుణ పరాభవం మూటగట్టుకుంది. పోరాడితే పోయేదేమీ లేని స్థితిలో... కొరియా పోతూపోతూ డిఫెండింగ్ చాంపియన్నూ తనతో పట్టుకుపోయింది. కజన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సంచలనం. ఆ మాటకొస్తే ఫుట్‌బాల్ ప్రపంచంలోనే పెను సంచలనం. చిన్న జట్లు మాజీ చాంపియన్లను నిలువరిస్తున్న ప్రస్తుత కప్‌లో దక్షిణ కొరియా ఏకంగా జర్మనీకి జీవితాంతం మర్చిపోలేని షాక్ ఇచ్చింది. ఆటలో, చరిత్రలో, ర్యాంకులో తమకంటే ఎంతో మెరుగైన డిఫెండింగ్ చాంపియన్‌ను 2–0 తేడాతో ఓడించి టోర్నీ నుంచి తమతో పాటే ఇంటికి తీసుకెళ్లింది. కప్‌కు ముందు ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండి, మొత్తం జట్టుకు జట్టే ప్రబలంగా కనిపించిన జర్మనీ... జట్టుగానే విఫలమై తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. 1938 తర్వాత గ్రూప్ దశలోనే నిష్క్రమించడం జర్మనీకిదే తొలిసారి. గెలిస్తేనే నాకౌట్ చేరే పరిస్థితుల్లో బరిలో దిగి... చావోరేవో తేల్చుకోవాల్సిన వేళ జర్మనీ చతికిలపడింది. మ్యాచ్ రెండు భాగాల్లోనూ గోల్ చేయలేకపోయిన ఆ జట్టు... కొరియాకు (90+3వ నిమిషంలో వైజి కిమ్), (90+6వ నిమిషంలో హెచ్ఎం సన్) ఇంజ్యూరీ సమయంలో రెండు గోల్స్ సమర్పించుకుంది. ఇందులో రెండో గోల్ నమోదైన తీరు జర్మనీ ఆటగాళ్ల దారుణ సమష్టి వైఫల్యానికి అద్దంపట్టింది. ఆఖరి నిమిషాలు కావడంతో కీపర్ మాన్యుయెల్ న్యూర్ సహా జర్మనీ ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఏరియాలోకి రాగా, బంతిని కొరియా ఆటగాడు బలంగా అవతలి ఏరియాలోకి కొట్టాడు. సన్... వాయువేగంతో పరిగెడుతూ దానిని అందుకుని గోల్ పోస్ట్‌లోనికి పంపించాడు. ఆ సమయంలో కీపర్ న్యూర్ ఎక్కడో దూరంగా ఉన్నాడు. 2014 కప్‌లో అత్యుత్తమ కీపర్‌గా ‘గోల్డెన్ గ్లౌవ్’ అందుకున్న న్యూర్... దీన్నంతటినీ చూస్తూ ఉండిపోయాడు. ఇదే సమయంలో గోల్స్‌ను నిరోధించడంలో ప్రతిభ చూపిన కొరియా కీపర్ జేవో హియాన్వూకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కడం విశేషం. ఊదేస్తుందనుకుంటే... ఆఖరి క్షణాల్లోన్నైనా ఫలితాన్ని తనవైపు తిప్పుకొనే జర్మనీ బలాబలాల ముందు కొరియా ఏమాత్రం సరితూగనిది. దానికి తగ్గట్లే గోర్టెజ్కా, ఓజిల్, రూయిస్, క్రూస్, ఖెదిరాల సమన్వయంతో ఆ జట్టు ఆధిపత్యంతోనే మ్యాచ్ ప్రారంభమైంది. రక్షణాత్మక శైలితో ఆడిన కొరియాకు వీరిని కాచుకోవడంతోనే సరిపోయింది. అయితే, ఫ్రీ కిక్ రూపంలో మొదటి అవకాశం దానికే దక్కింది. జంగ్ వూయంగ్ షాట్‌ను కీపర్ న్యూర్ కొంత క్లిష్టంగానే తప్పించాడు. తర్వాత కూడా జర్మనీ ఒత్తిడి పెంచింది. 40వ నిమిషంలో బాక్స్ లోపల హమ్మెల్స్కు గోల్ చాన్స్ దక్కినా... హియెన్వూ తలతో పక్కకు నెట్టాడు. ప్రత్యర్థి ఆధిపత్యాన్ని ఛేదించేందుకు కొరియా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకుండా, గోల్సేమీ లేకుండానే మొదటి భాగం ముగిసింది. ఎన్నో అవకాశాలు వచ్చినా... రెండో భాగంలో ఎక్కువగా డిఫెండింగ్ చాంపియన్‌కే అవకాశాలు వచ్చాయి. మూడో నిమిషంలో గోర్టెజ్కా కొట్టిన హెడర్‌ను కీపర్ హియాన్వూ డైవ్ చేస్తూ నిరోధించాడు. గోమెజ్ దాదాపు గోల్ కొట్టినంత పనిచేశాడు. అటువైపు కొరియా కూర్పు మారుస్తూ ప్రయోగంతో పట్టు కోసం ప్రయత్నించింది. ఇరు జట్లలో ఇవేవీ ఫలించలేదు. ఇంజ్యూరీలో కుదేలు... ఇంజ్యూరీ రెండు నిమిషాలు కూడా గణాంకాలేమీ నమోదు కాకుండానే సాగింది. 90+3వ నిమిషంలో మాత్రం అద్భుతం జరిగింది. కార్నర్ నుంచి అందిన బంతిని యంగ్వాన్ షాట్ కొట్టగా నేరుగా జర్మనీ గోల్‌పోస్ట్‌లోకి చేరిపోయింది. ఇది ఆఫ్‌సైడ్ అంటూ అభ్యంతరాలు వచ్చినా వీఏఆర్‌లో కాదని తేలింది. 90+6 నిమిషంలో ఇంకో అద్భుతం చోటుచేసుకుంది. న్యూర్ సహా జట్టంతా కొరియా మిడ్ ఫీల్డ్ వద్ద ఉండగా... ఇటువైపు పడిన బంతిని ఛేదించిన సన్... గోల్ అందించడంతో వారి శిబిరం భావోద్వేగంలో మునిగిపోయింది. -
మెక్సికోరల్లో జర్మనీ...
జర్మనీ... ప్రపంచకప్ ఫేవరెట్లలోకెల్లా హాట్ ఫేవరెట్. 1982 నుంచి, అందునా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన మూడుసార్లు టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. మెక్సికో... సాధారణ జట్టే కానీ ఈసారి తనదైన రోజున ఏ జట్టునైనా పరాజయం పాల్జేసేంత ప్రమాదకారిగా కనిపిస్తోంది....ఆ రోజు ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోనే వచ్చింది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య తీవ్ర స్థాయి ప్రతిఘటనలతో సాగిన మ్యాచ్‌లో మెక్సి‘కోరల్లో’ చిక్కిన జర్మనీ బయటపడ లేకపోయింది. కనీసం ‘డ్రా’ అయినా చేసుకోలేక అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాను శనివారం అనామక ఐస్లాండ్ నిలువరించి కప్‌పై ఆసక్తి పెంచగా, ప్రపంచ చాంపియన్‌ను ఓడించిన మెక్సికో ఒక్కసారిగా వేడి పుట్టించింది. మాస్కో: ప్రపంచ కప్‌లో రసవత్తర మ్యాచ్.డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి షాక్. ఆదివారం 78 వేల ప్రేక్షక సందోహం మధ్య ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్‌లో మెక్సికో 1–0తో జర్మనీని బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. విపరీతమైన దాడులను ఎదుర్కొన్నా ఈ దక్షిణ అమెరికా జట్టు నిబ్బరం చూపింది. 35వ నిమిషంలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హిర్విన్ లొజానో చేసిన ముచ్చటైన గోల్‌తో ఆధిక్యంలో నిలిచిన మెక్సికో దానిని చివరి వరకు నిలబెట్టుకుంది. ఎంత ప్రయత్నించినా ప్రత్యర్థిని అందుకోలేకపోయిన జర్మనీ... ఇక గెలుపు ఊహకే దూరంగా ఉండిపోయింది. దాడులతో మొదలు... మ్యాచ్ తొలి మూడు నిమిషాల్లోనే రెండు జట్లకు చెరోసారి గోల్ అవకాశం వచ్చిందంటేనే ఆట ఏ స్థాయిలో ప్రారంభమైందో అర్థం చేసుకోవచ్చు. జర్మనీ ఎప్పటిలానే ఆధిపత్యం కోసం ప్రయత్నించింది. మెక్సికో మాత్రం బంతిని అదుపులో ఉంచుకునే తమ సహజ సిద్ధమైన ఆటను ఎంచుకోలేదు. అయినా ఆ జట్టుపై ఇదేమంత ప్రభావం చూపలేదు. డిఫెన్స్ లోపాలున్నా జర్మనీనే కొంత మెరుగ్గా కనిపించింది. అయినా ప్రత్యర్థి తేలిగ్గా లొంగలేదు. క్రమంగా మెక్సికో ప్రతి దాడులకు దిగడంతో మ్యాచ్ ఆసక్తిగా మారింది. 35వ నిమిషంలో హెర్నాండెజ్ నుంచి వచ్చిన పాస్‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన లొజానో... కీపర్ న్యూర్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌గా మలిచాడు. తర్వాత కూడా ఇదే తీవ్రతతో ఆడిన మెక్సికో... జర్మనీని ఇబ్బందికి గురి చేసింది. పాస్‌లు సరిగా అందిపుచ్చుకోకపోవడం ఆ జట్టును దెబ్బతీసింది. వందశాతం ఆటను చూపలేకపోవడంతో ప్రత్యర్థి పని సులువైంది. బంతి జర్మనీ ఆధీనంలోనే ఉన్నా, వారిని అనుసరించే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిన మెక్సికో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రయత్నించినా చిక్కలే... చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో భాగంలో జర్మనీ ఆటలో తీవ్రతను పెంచింది. కానీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. ఇదే సమయంలో మెక్సికో ఆటగాళ్లు అలసిపోయినట్లు కనిపించారు. ఈ అవకాశాన్నీ ప్రపంచ చాంపియన్ వినియోగించుకోలేదు. లాభం లేదని సీనియర్ గోమె జ్ను బరిలో దింపింది. అయినా ఆ జట్టు కొట్టిన షాట్లు గోల్పోస్ట్పైగా వెళ్లాయి. చివరి నిమిషాల్లోకి వచ్చేసరికి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అవకాశాలు సృష్టించుకోలేని పరిస్థితుల్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్ మొత్తంలో 60 శాతం పైగా సమయం బంతి తమ ఆధీనంలోనే ఉన్నా, 25 సార్లు దాడులు చేసినా జర్మనీకి చేదు ఫలితమే మిగిలింది. మొదటి భాగంలో ప్రతిదాడి, రెండో భాగంలో రక్షణాత్మక ఆటను నమ్ముకున్న మెక్సికోనే విజయం వరించింది. తదుపరి ఈనెల 23న కొరియాతో మెక్సికో; స్వీడన్‌తో జర్మనీ తలపడతాయి. గోల్ చేశాక లొజానో ఆనందహేళ... మ్యాచ్ ముగిశాక నిరాశలో జర్మనీ ఆటగాళ్లు ముల్లర్, హామెల్స్. 36 ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం 36 ఏళ్ల తర్వాత జర్మనీకిదే తొలిసారి. చివరిసారి పశ్చిమ జర్మనీ 1982 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో 1–2తో అల్జీరియా చేతిలో పరాజయం పాలైంది. 5 గత ఆరు ప్రపంచకప్‌లలో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెక్సికో గెలుపొందడం ఇది ఐదో సారి. మరో మ్యాచ్‌ను ఆ జట్టు ‘డ్రా’ చేసుకుంది. 6 ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం ఇది ఆరోసారి. 1950లో ఇటలీ 2–3తో స్వీడన్ చేతిలో... 1982లో అర్జెంటీనా 0–1తో బెల్జియం చేతిలో... 1990లో అర్జెంటీనా 0–1తో కామెరూన్ చేతిలో... 2002లో ఫ్రాన్స్ 0–1తో సెనెగల్ చేతిలో... 2014లో స్పెయిన్ 1–5తో నెదర్లాండ్స్ చేతిలో... 2018లో జర్మనీ 0–1తో మెక్సికో చేతిలో ఓడిపోయాయి. 2 జర్మనీ జట్టును మెక్సికో ఓడించడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఏకైకసారి మెక్సికో 1985 జూన్‌లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో జర్మనీపై గెలిచింది. 3ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మెక్సికో ప్లేయర్ రాఫెల్ మార్కెజ్ (2002, 06, 2010, 14, 18) అత్యధికంగా ఐదు ప్రపంచకప్‌లలో ఆడిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో ఆంటోనియో కర్బజాల్ (మెక్సికో–1950, 54, 58, 62, 66), లోథర్ మథియాస్ (జర్మనీ–1982, 86, 90, 94, 98) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
ఈసారి రన్నరప్‌తో సరి
డాంఘయీ సిటీ (దక్షిణ కొరియా): లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు అసలు సమరంలో మాత్రం తడబడింది. ఫలితంగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సునీత లాక్రా బృందం ఆదివారం జరిగిన ఫైనల్లో 0–1తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్ చేరిన మన అమ్మాయిలు కొరియా డిఫెన్స్ ఛేదించడంలో విఫలమయ్యారు. మ్యాచ్ తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా ఖాతా తెరవలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభం నుంచే ఒత్తిడి పెంచిన ఆతిథ్య కొరియా జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై పదే పదే దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో యంగ్సిల్ లీ (24వ నిమిషంలో) తొలి గోల్ నమోదు చేసి కొరియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. భారత స్ట్రయికర్ వందన కటారియాకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’, లాల్రేమ్సియామికి ‘అప్‌కమింగ్ ప్లేయర్’ పురస్కారాలు దక్కాయి -
సైనా, సింధు శుభారంభం
♦ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ♦ శ్రీకాంత్, సాయిప్రణీత్ కూడా ♦ పోరాడి ఓడిన కశ్యప్, రుత్విక ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్, ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 15వ ర్యాంకర్ సైనా 21–10, 21–16తో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై... ఐదో సీడ్ సింధు 21–17, 14–21, 21–18తో గతవారం ఇండోనేసియా ఓపెన్ టైటిల్ నెగ్గిన సయాకా సాటో (జపాన్)పై గెలుపొందారు. క్వాలిఫయర్, మరో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని 17–21, 21–12, 12–21తో చెన్ జియోజిన్ (చైనా) చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సోనియా చెహ (మలేసియా)తో సైనా; చెన్ జియోజిన్‌తో సింధు తలపడతారు. ప్రణయ్, జయరామ్‌లకు నిరాశ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్ 21–14, 10–21, 9–21తో ఏడో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... ప్రణయ్ 19–21, 13–21తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో... కశ్యప్ 18–21, 21–14, 15–21తో ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో... సిరిల్ వర్మ 16–21, 8–21తో విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. మరోవైపు ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ శ్రీకాంత్, యువతార సాయిప్రణీత్ తమ ప్రత్యర్థులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–13, 21–16తో కాన్ చావో యు (చైనీస్ తైపీ)పై, సాయిప్రణీత్ 10–21, 21–12, 21–10తో సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో సన్ వాన్ హోతో శ్రీకాంత్; హువాంగ్ (చైనా)తో సాయిప్రణీత్ ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 20–22, 21–19, 21–11తో లా చెయుక్ హిమ్–లీ చున్ (హాంకాంగ్) జంటపై గెలుపొందగా... మనూ అత్రి–సుమీత్ రెడ్డి జంట 20–22, 6–21తో తకెషి కముర–కిగో సొనాడా (జపాన్) జోడీ చేతిలో; కోనా తరుణ్–ఫ్రాన్సిస్ ఆల్విన్ ద్వయం17–21, 15–21తో సెతియావాన్ (ఇండోనేసియా)–బూన్ తాన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–11, 21–13తో వెండీ చెన్–జెన్నిఫర్ టామ్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని ద్వయం 13–21, 17–21తో లీ చున్–చౌ హో వా (హాంకాంగ్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
తొలి రోజే 14 వికెట్లు
తమిళనాడు 134, కర్ణాటక 45/4 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ముంబై: భారత దేశవాళీ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తుది పోరు సంచలనంతో ప్రారంభమైంది. బౌలింగ్‌కు అనుకూలించిన వాంఖడే పిచ్‌పై ముందుగా డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక ప్రత్యర్థి తమిళనాడును కుప్పకూల్చగా...ఆ తర్వాత తమిళనాడు కూడా అదే రీతిలో జవాబివ్వడంతో మ్యాచ్ మొదటి రోజే 14 వికెట్లు నేలకూలాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 62.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ అభినవ్ ముకుంద్ (35) టాప్‌స్కోరర్ కాగా... ఇంద్రజిత్ (27), అశ్విన్ క్రైస్ట్ (21) ఓ మాదిరిగా ఆడారు. కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ 34 పరుగులకే 5 వికెట్లు తీయడం విశేషం. మిథున్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం కర్ణాటక కూడా తడబడింది. ఎల్. బాలాజీ (3/10) చెలరేగడంతో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సరికి తమ మొదటి ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కరుణ్ నాయర్ (9 బ్యాటింగ్), మిథున్ (14 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న కర్ణాటక ప్రస్తుతం మరో 89 పరుగులు వెనుకబడి ఉంది. -
సోమ్దేవ్కే టైటిల్
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సోమ్‌దేవ్ 3-6, 6-4, 6-0తో భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీని ఓడించాడు. గతేడాది ఢిల్లీ ఓపెన్‌ను గెల్చుకున్నాక సోమ్‌దేవ్ ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఏడాది తర్వాత ఢిల్లీ ఓపెన్లోనే అతను చాంపియన్‌గా నిలువడం విశేషం. -
సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగుతేజాలు
తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ మరో సింగిల్స్ టైటిల్‌కు అడుగు దూరంలో ఉన్నారు. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సైనా, శ్రీకాంత్ ఫైనల్‌కి చేరారు. శనివారం జరిగిన మహిళల సెమీస్ లో భారత స్టార్ షట్లర్ సైనా 21-10, 21-16 తేడాతో థాయ్‌లాండ్‌కి చెందిన నిచోన్ జిండాపాన్పై నెగ్గింది. మరో తెలుగుతేజం పి.వి.సింధు, స్పెయిన్‌కు చెందిన కరోలినా మరిన్కు మధ్య జరిగే మరో సెమీస్ మ్యాచ్‌లో గెలిచిన వారితో సైనా ఫైనల్లో తలపడనుంది. పురుషుల సింగిల్స్ సెమీస్ లో భారత క్రీడాకారుడు కె.శ్రీకాంత్ 12-21, 21-12, 21-14 తేడాతో హెచ్.ఎస్.ప్రన్నోయ్పై విజయం సాధించాడు. -
సైనా టైటిల్ నిలబెట్టుకునేనా..?
నేటి నుంచి సయ్యద్ మోదీ అంతర్జాతీయ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ లక్నో: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది సీజన్‌ను ఘనంగా ఆరంభించాలనే ఆలోచనలో ఉంది. నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ మోదీ అంతర్జాతీయ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తను డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగ బోతోంది. లక్షా 20 వేల డాలర్ల విలువైన ప్రైజ్‌మనీ కలిగిన ఈ టోర్నీని ఉత్తరప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం నిర్వహిస్తోంది. 24 ఏళ్ల సైనా ఈ టోర్నీని 2009, 10లో నెగ్గింది. తిరిగి గతేడాది విజేతగా నిలిచిన తనకు మహిళల సింగిల్స్‌లో ఈసారి మూడో సీడ్ పీవీ సింధు, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ‘టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. గతేడాది సీజన్ అద్భుతంగా ముగిసింది. ఈ ఏడాది ఘనంగా ఆరంభించేందుకు సయ్యద్ మోదీ టోర్నీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరోసారి విజేతగా నిలిచి సీజన్‌ను ప్రారంభించాలనుకుంటున్నాను. సింధు, కరోలినా రూపంలో గట్టి ప్రత్యర్థులే ఉన్నారు’ అని సైనా తెలిపింది. బుధవారం సైనా తొలి రౌండ్లో యిన్ ఫన్ లిమ్ (మలేసియా)ను ఎదుర్కోనుంది. ఇక సింధు క్వాలిఫయర్‌తో టోర్నీ ఆరంభిస్తున్నా మూడో రౌండ్లో ఆరో సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రసేర్ట్సక్తో అసలు పోటీ ఎదురుకానుంది. పురుషుల విభాగంలో గతేడాది రన్నరప్ కె.శ్రీకాంత్, పి.కశ్యప్, సాయి ప్రణీత్, అజయ్ జయరాం, ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు తొలి రౌండ్లో బై లభించింది. -
ఎదురులేని జొకోవిచ్, ముర్రే
- నాలుగో సీడ్ ఫెరర్‌కు షాక్ - క్వార్టర్స్‌లో సానియా మిక్స్డ్ జోడి - యూఎస్ ఓపెన్ న్యూయార్క్: మాజీ చాంపియన్లు నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే యూఎస్ ఓపెన్‌లో జోరును కొనసాగిస్తున్నారు. మరోవైపు నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-3, 3-6, 6-1, 6-3తో ఫెరర్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్, ఆరో సీడ్ యుగెనీ బౌచర్డ్ (కెనడా) నాలుగో రౌండ్లో ప్రవేశించారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 6-2 తేడాతో అమెరికాకు చెందిన సామ్ క్వెర్రీని చిత్తుగా ఓడించాడు. 2011లో యూఎస్ ఓపెన్ గెలుచుకున్న జొకోవిచ్.. క్వెర్రీపై గెలవడం ఇది ఎనిమిదోసారి. అలాగే జకోవిచ్ వరుసగా 22 సార్లు ఈ టోర్నీ నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. 85 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శక్తివంతమైన సర్వ్‌లకు పెట్టింది పేరైన సామ్‌ను జొకోవిచ్ సులువుగానే ఎదుర్కొన్నాడు. తొలి సెట్లో వరుసగా పాయింట్లు సాధిస్తూ 5-0 ఆధిక్యం సాధించాడు. ప్రత్యర్థిని కుదురుగా ఉండనీయకుండా కోర్టు చుట్టూ తిరిగేలా వ్యూహం ప్రకారం ఆడి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఇక 2012 చాంపియన్, బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే 6-1, 7-5, 4-6, 6-2 స్కోరుతో రష్యా ఆటగాడు ఆండ్రీ కుజ్నెత్సోవ్ను ఓడించి ఏడోసారి నాలుగో రౌండ్‌కు చేరాడు. ప్రపంచ 96వ ర్యాంకర్ కుజ్నెత్సోవ్ మూడో సెట్లో ముర్రేకు దీటుగా బదులిచ్చాడు. అయితే నాలుగో సెట్లో మాత్రం 27 ఏళ్ల ముర్రే త్వరగానే కోలుకుని సుదీర్ఘ ర్యాలీలతో సత్తా చూపాడు. ఓవరాల్‌గా 47 విన్నర్ షాట్లతో ఈ ఎనిమిదో సీడ్ మ్యాచ్‌ను కైవసం చేసుకుని కీ నిషికొరి (జపాన్)తో పోరుకు సిద్ధమయ్యాడు. అలాగే ఐదో సీడ్ మిలోస్ రవోనిక్ 7-6 (7/5), 7-6 (7/5), 7-6 (7/3) తేడాతో తొలిసారిగా యూఎస్ ఓపెప్లో బరిలోకి దిగిన 34 ఏళ్ల విక్టర్ ఎస్ట్రేల్లా బుర్గోస్పై నెగ్గేందుకు చెమటోడ్చాడు. తొమ్మిదో సీడ్ జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 6-4, 6-4తో కారెనో బుస్టా (స్పెయిన్)పై నెగ్గాడు. సెరెనా జోరు ఆరోసారి టైటిల్ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆశించినట్టుగానే దూసుకెళుతోంది. మూడో రౌండ్లో ఈ నంబర్‌వన్ సీడ్... 6-3, 6-3 తేడాతో వర్వారా లెప్చెంకో (అమెరికా)పై సునాయాసంగా నెగ్గింది. నాలుగో రౌండ్లో అన్‌సీడెడ్ కియా కనేపీ (ఎస్తోనియా)తో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే యూఎస్ ఓపెన్‌లో సెరెనాకు 75వ మ్యాచ్ నెగ్గినట్టవుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఈ ఏడాది వింబుల్డన్ ఫైనలిస్ట్, ఏడో సీడ్ యుగెనీ బౌచర్డ్ (కెనడా) 6-2, 6-7 (2/7), 6-4 తేడాతో జహ్లవోవా స్ట్రికోవాను, విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-1, 6-1తో వెస్నీనా (రష్యా)పై నెగ్గింది. మరోవైపు ఆదివారం జరిగిన నాలుగో రౌండ్లో 13వ సీడ్ సారా ఎర్రానీ 6-3, 2-6, 6-0తో లూసిక్ బరోని (క్రొయేషియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్డ్ క్వార్టర్స్‌లో సానియా జోడి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బరిలోకి దిగిన రెండు విభాగాల్లో మంచి ఆటతీరును కనబరిచింది. డబుల్స్‌లో ఇప్పటికే మూడో రౌండ్‌కు చేరగా మిక్స్డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో రౌండ్లో టాప్ సీడ్ సానియా-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంట 6-2, 7-6 (10/8)తో డెలాక్వా (అమెరికా)-జేమీ ముర్రే (గ్రేట్ బ్రిటన్)ను ఓడించింది. లియాండర్ పేస్ (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జంట 6-1, 4-6, 10-4తో ఐజమ్ అల్ ఖురేషి (పాక్)-కుద్య్రత్సేవ (రష్యా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది. -
ముర్రే, జొకోవిచ్ ముందంజ
వింబుల్డన్ టెన్నిస్ లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే, టాప్ సీడ్ జొకోవిచ్‌లు వింబుల్డన్ తొలి రౌండ్‌ను అలవోకగా అధిగమించారు. సోమవారం తొలి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో ముర్రే 6-1, 6-4, 7-5 తేడాతో బెల్జియంకు చెందిన డేవిడ్ గాఫిన్‌పై గెలుపొందగా, జొకోవిచ్ 6-0, 6-1, 6-4తో ఆండ్రీ గులుబెవ్ (కజకిస్థాన్)పై సునాయాస విజయం సాధించాడు. గాఫిన్‌పై తొలి రెండు సెట్లలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన మూడో సీడ్ ముర్రేకు మూడో సెట్లో ప్రతిఘటన ఎదురైంది. మొత్తంగా రెండు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో ముర్రే ఎనిమిది ఏస్‌లు, 28 విన్నర్లు సంధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 2010 రన్నరప్, ఆరోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-7 (5-7), 6-1, 6-4, 6-3 తేడాతో రుమేనియాకు చెందిన విక్టర్ హనెస్కుపై గెలిచాడు. ఏడోసీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-0, 6-7 (3-7), 6-1, 6-1తో తన దేశానికే చెందిన కారెనో బుస్టాపై విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. నా లీ, క్విటోవా సునాయాసంగా.. మహిళల సింగిల్స్‌లో గతేడాది సెమీఫైనలిస్టు, రెండో సీడ్ చైనా క్రీడాకారిణి నా లీ, మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా, మాజీ ప్రపంచ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకాలు రెండో రౌండ్‌కు చేరారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నా లీ తొలి రౌండ్లో 7-5, 6-2తో పోలెండ్‌కు చెందిన పౌలా కనియాపై గెలుపొందగా, ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-0తో తన దేశానికే చెందిన లవకోవాపై నెగ్గింది. 8వ సీడ్ అజరెంకా 6-3, 7-5తో బారోని (క్రొయేషియా)పై నెగ్గింది. ఐదుసార్లు చాంపియన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లో 6-4, 4-6, 6-2తో మరియా టోరో ఫ్లొర్ (స్పెయిన్)పై గెలుపొందింది. కిరిలెంకో (రష్యా) 6-2, 7-6 (8-6)తో స్టీఫెన్స్ (అమెరికా)పై నెగ్గగా, స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3-6, 4-6 తేడాతో విక్‌మేయర్ (బెల్జియం) చేతిలో ఓటమిపాలైంది.