Electric Vehicle Division
-
అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!
అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా సోదరుడు ముఖేష్ అంబానీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్‌ను నిర్మించడానికి అయ్యే ఖర్చు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఏటా 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తోంది. 10 గిగావాట్ హవర్స్ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్ హవర్స్‌కి విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక అని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.దీనిపై కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ వార్తలు ఇప్పటికే ప్రభావం చూపాయి. రాయిటర్స్ కథనం తర్వాత, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమై ముందుకు సాగితే, ఇప్పటికే ఈవీ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ప్రత్యక్ష పోటీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు. -
ఎలక్ట్రిక్ టూవీలర్స్ పోటీ!
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా జూలై నెలలో సేల్స్ దాదాపు రెట్టింపు కావడం దీనికి నిదర్శనం. మరోపక్క, ఈ విభాగంలో పోటీ ఫాస్ట్ చార్జింగ్ అవుతోంది. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు షాకిస్తున్నాయి. ధరల యుద్ధానికి తెరతీసి, ఓలా మార్కెట్ వాటాకు గండికొడుతున్నాయి. ఐపీఓ సక్సెస్‌తో దండిగా నిధుల జోష్‌లో ఉన్న ఓలా.. ఈ పోటీని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది! ఈ ఏడాది జూలై నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1,07,016 ఈ–టూవీలర్లు రోడ్డెక్కాయి. గతేడాది అమ్ముడైన 54,616 వాహనాలతో పోలిస్తే 96 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో అమ్మకాలు 79,868 మాత్రమే. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సేల్స్ మళ్లీ ఎలక్ట్రిక్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పెట్రోలు టూవీలర్లలో రారాజులుగా ఉన్న సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటో సైతం ఎలక్ట్రిక్ బరిలో తగ్గేదేలే అంటూ కాలుదువ్వడమే దీనికి ప్రధాన కారణం. జూలైలో బజాజ్ ఆటో ఏకంగా 17,642 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం విశేషం. జూన్‌తో పోలిస్తే 80 శాతం సేల్స్ పెరిగాయి. మార్కెట్ వాటా సైతం 11.6 శాతం నుంచి 16.9 శాతానికి జంప్ చేసింది. ఇక టీవీఎస్ అమ్మకాలు 30 శాతం పైగా ఎగబాకి 19,471 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రెండింటితో పోలిస్తే వెనుకబడ్డ హీరో మోటో 5,044 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి సత్తా చాటింది. మొత్తంమీద చూస్తే, ఈ మూడు దిగ్గజాల ‘ఎలక్ట్రిక్’ వాటా 40 శాతానికి పైగా ఛార్జింగ్ అయింది. ఇందులో టీవీఎస్, బజాజ్ వాటాయే దాదాపు 35 శాతం గమనార్హం. ఓలాకు షాక్... రెండు నెలల క్రితం, మే నెలలో దాదాపు 50 శాతం మార్కెట్ వాటాతో తిరుగులేని స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు పోటీ సెగ బాగానే తగులుతోంది. జూన్‌లో కంపెనీ 36,781 వాహనాలు విక్రయించగా.. జూలైలో ఈ సంఖ్య కాస్త మెరుగుపడి 41,597కు చేరింది. అయితే, మార్కెట్ వాటా మాత్రం జూన్‌లో 47.5 శాతానికి, ఆపై జూలైలో ఏకంగా 40 శాతానికి పడిపోయింది. ఓలాకు తగ్గుతున్న మార్కెట్ వాటాను సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ వేగంతో కొట్టేస్తున్నాయి. మరోపక్క, పూర్తిగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న ఏథర్ ఎనర్జీ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. జూన్‌లో 6,189 (8% మార్కెట్ వాటా), జూలైలో 10,080 (10% వాటా) వాహనాలను అమ్మింది. అయితే, దీని స్కూటర్ల ధరలు రూ. లక్ష పైనే ఉన్నాయి. సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు రూ. లక్ష లోపు ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుండటంతో.. ఓలా, ఏథర్ వంటి పూర్తి ఈవీ కంపెనీలు కూడా ధరల యుద్ధంలోకి దూకాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాటా పతనంతో ఓలా ఇక పూర్తిగా ఈ–టూవీలర్లపైనే దృష్టిసారించాలని నిర్ణయించుకుంది.భారీ నెట్వర్క్, సర్వీస్ ప్లస్..తొలిసారిగా రూ. లక్ష లోపు స్కూటర్లను ప్రవేశపెట్టడం కూడా బజాజ్, టీవీఎస్, హీరో అమ్మకాలు పుంజుకున్నాయి. ‘ఈ 3 సాంప్రదాయ టూవీలర్ కంపెనీలకు విస్తృత డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్, బ్రాండ్ విలువ, సర్వీస్ సదుపాయాలు దన్నుగా నిలుస్తున్నాయి.మార్కెట్ వాటాను కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని రీసెర్చ్ సంస్థ నోమురా ఆటోమోటివ్ రిటైల్ విభాగం హెడ్ హర్షవర్ధన్ శర్మ పేర్కొన్నారు. ధరల పోరు, బ్యాటరీ టెక్నాలజీలో మెరుగుదల వంటివి ఈ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. తాజా పరిణామాలతో ఛార్జింగ్ స్టేషన్ల భారీ పెరుగుదలతో పాటు ఇతరత్రా మౌలిక సదుపాయాలు జోరందుకుంటాయని, వినియోగదారులకు కూడా ఇది మేలు చేకూరుస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశీయంగా ఈవీ బ్యాటరీల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని చేపట్టే దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌తో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, కియా జట్టు కట్టాయి. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఇందుకు సంబంధించి ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. దీని ప్రకారం లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. స్థానికంగా తయారీ వల్ల బ్యాటరీ వ్యయాలు కొంత మేర తగ్గగలవని, తద్వారా ఇతర సంస్థలతో మరింత మెరుగ్గా పోటీపడగలమని హ్యుందాయ్ మోటర్ .. కియా ఆర్అండ్డీ విభాగం హెడ్ హుయి వాన్ యాంగ్ తెలిపారు. భారత మార్కెట్లో తమ బ్యాటరీల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా తదితర కార్యకలాపాల విస్తరణకు ఎక్సైడ్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. హ్యుందాయ్ ప్రస్తుతం భారత్‌లో అయోనిక్ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలను, కియా ఇండియా ఈవీ6 మోడల్‌ను విక్రయిస్తున్నాయి. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్‌కి అనుగుణంగా కొత్త మోడల్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్‌ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్‌లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్‌లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
కొత్త ఈవీ పాలసీ
న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు.. ► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్‌లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి. ► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది. ► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది. ► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
ఈవీలపై ఎంత దూరమైనా ప్రయాణించేలా..
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. క్రమంగా వాటి అమ్మకాలు హెచ్చవుతున్నాయి. కానీ విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టి చాలాకాలం అయినా ఇప్పటికీ వాటికి బ్యాటరీ సమస్యగానే ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఛార్జింగ్రాక ఇబ్బందులు పడుతున్నారు. మార్గ మధ్యలో వాటిని ఛార్జ్ చేసుకోవాలన్నా చాలా సమయం పడుతుంది. అందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యను అధిగమించేలా క్వాంటమ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ, బ్యాటరీ స్మార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇదీ చదవండి: రూ.100 కోట్ల కంపెనీ స్థాపించిన యంగ్ లేడీ.. ఎలాగంటే.. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల బ్యాటరీను మార్చుకోవచ్చు. ఈ ఒప్పందం దేశంలోని అతిపెద్ద బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సహకారం ద్వారా 25 నగరాల్లోని 900కి పైగా స్వాప్ స్టేషన్ల్లో ‘బ్యాటరీ స్మార్ట్’ కంపెనీకు చెందిన బ్యాటరీలను క్వాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం మార్చుకోవచ్చు. దాంతో క్వాంటమ్ వినియోగదారులు దూరప్రయాణాలు వెళ్తున్నపుడు పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీని రెండు నిమిషాల్లో పొందే వీలుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్‌కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
టాటా ప్యాసింజర్ ఈవీ రైడ్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగమైన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వచ్చే ఏడాదిన్నరలో అయిదుకుపైగా ఈవీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పూర్తి స్థాయి ఆధునిక ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థ అయిన యాక్టి.ఈవీ ప్లాట్‌ఫామ్‌పై విభిన్న బాడీ, సైజుల్లో ఇవి రూపుదిద్దుకుంటాయని కంపెనీ శుక్రవారం వెల్లడించింది. యాక్టి.ఈవీ ఆధారంగా తొలుత పంచ్ ఈవీ వస్తోందని ప్రకటించింది. ఈ ఈవీ మోడళ్లలో 300 నుండి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే యాక్టి.ఈవీ బ్యాటరీ ప్యాక్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్ ఎన్సీఏపీ, భారత్ ఎన్సీఏపీ భద్రతా ప్రమాణాలను అనుసరించి మోడళ్ల తయారీ చేపడతామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ ప్రొడక్ట్స్ ఆఫీసర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. కాగా, పంచ్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.21,000 చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. -
2030 నాటికి 40 శాతానికి ఈవీలు
ముంబై: దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్ దిశ మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని ఒక నివేదిక వెల్లడించింది. బ్లూమ్ వెంచర్స్ సహకారంతో బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ రిపోర్ట్ 2023 ప్రకారం.. ఈవీ పరిశ్రమ గణనీయ వృద్ధికి సిద్ధంగా ఉంది. ఈవీ వాటా ప్రస్తుతం 5 శాతం నుండి 2030 నాటికి 40 శాతానికి పైగా చొచ్చుకుపోయే అవకాశం ఉంది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు రెండింటిలోనూ 45 శాతంపైగా బలమైన స్వీకరణ ద్వారా ఈవీ రంగం వృద్ధి చెందుతుంది. కార్ల విస్తృతి 20 శాతానికి పైగా పెరుగుతుంది. ఈ అంచనాలను చేరుకోవడానికి కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, పంపిణీ, కస్టమర్ల సెగ్మెంట్ ప్రాధాన్యత, సాఫ్ట్వేర్ అభివృద్ధి, ఛార్జింగ్ మౌలిక వసతుల అంశాల్లో అనేక నిర్మాణాత్మక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది’ అని వివరించింది. 100 బిలియన్ డాలర్లు.. ‘ప్రస్తుతం ఉన్న 5 శాతం నుండి 2030 నాటికి 45 శాతానికి పైగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ మార్కెట్ చొచ్చుకుపోవచ్చు. ఈవీ తయారీ కంపెనీలు మధ్యస్థాయి మోడళ్లను అభివృద్ధి చేయడం ద్వారా స్కూటర్ల విభాగంలో 50 శాతానికి పైగా వాటా కైవసం చేసుకోవచ్చు. అలాగే అద్భుతమైన ఎంట్రీ–లెవల్ ఈ–మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టాలి. త్రిచక్ర వాహన మార్కెట్ ఈవీల వైపు స్థిరంగా మారుతున్న ఈ సమయంలో మోడళ్లు సీఎన్జీ వాహనాలతో సరితూగాల్సి ఉంటుంది. ఈవీల రంగంలో 100 బిలియన్ డాలర్ల అవకాశాలను అందుకోవాలంటే కస్టమర్ల సూచనల ఆధారంగా ఉత్పత్తుల అభివృద్ధి,, మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలకు మించి అభివృద్ధి చెందడానికి పంపిణీ నమూనాలను పునర్నిర్మించడం, బీ2బీ/ఫ్లీట్ కస్టమర్ విభాగాలకు ప్రాధాన్యత, భిన్నత్వం కోసం సాఫ్ట్వేర్ వినియోగం, చార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడం వంటివి కీలకం’ అని నివేదిక వెల్లడించింది. -
ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ రంగాల్లోకి రేమండ్
మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌లో 59.25% వాటాను రూ.682 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు రేమండ్ గ్రూప్ ప్రకటించింది. దాంతో రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ విడిభాగాలు తయారీ రంగంలోని ప్రవేశించనుంది. ఏరోస్పేస్, విద్యుత్ వాహనాలు, రక్షణ విభాగాల్లో మైనీ ప్రెసిషన్ ప్రోడక్ట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇదీ చదవండి: ‘రహస్య అల్గారిథమ్’తో రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్ జేకే ఫైల్స్ అండ్ ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ రింగ్ ప్లస్ అక్వా ద్వారా ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కొనుగోలు అనంతరం జేకే ఫైల్స్, రింగ్ ప్లస్ అక్వా, మైనీ ప్రెసిషన్లను కలిపి కొత్త అనుబంధ సంస్థ న్యూకోను ఏర్పాటు చేయనుంది. దాంతో న్యూకోలో రేమండ్కు 66.3 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రేమండ్ లిమిటెడ్ షేర్లు 3% పెరిగాయి . బీఎస్ఈలో రేమండ్ స్టాక్ 2.86% పెరిగి రూ.1866కి చేరుకుంది. -
భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా
దేశీయ ఐఐటీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలను లీడ్ చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణకు నాంది పలుకు తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు మెకానికల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ రంగాల్లో సత్తా చాటుతున్నారు. కొత్త మహీంద్రా థార్‌ను డిజైన్ చేసిన మహిళ, BITS పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ రామ్‌కృపా అనంతన్ విశేషంగా నిలుస్తున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమలో రామ్‌కృపా అనంతన్ పేరు తెలియని వారు లేరు అతిశయోక్తి కాదు.ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌లో డిజైన్ హెడ్‌గా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అంతేకాదు సొంత డిజైన్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్న రామ్ కృపా అనంతన్ గురించి, ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్ర అండ్ లేటెస్ట్ వాహనాల్లో థార్ SUVకున్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అంతటి ప్రజాదరణ ఉన్న థార్ 2వ తరం థార్ ఆవిష్కారం వెనుక చీఫ్ డిజైనర్ రామ్ కృపా. పాపులర్ బొలెరో, మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదే. థార్, XUV700, స్కార్పియోలాంటి మహీంద్రా ఉత్పత్తులకు చీఫ్ డిజైనర్ గా తన సత్తా చాటుకున్నారు. ఎవరీ రామ్ కృపా అనంతన్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ , ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు. 2005లో డిజైన్ హెడ్‌గా మహీంద్రా XUV 500 SUVని డిజైన్ చేసిన క్రెడిట్ దక్కించుకున్నారు.అలాగే XUV 700, స్కార్పియో ఐకానిక్ డిజైన్లను రూపకల్పన చేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, రామ్‌కృపా అనంతన్ చీఫ్ డిజైనర్ పాత్రకు పదోన్నతి పొందారు. క్రక్స్ స్టూడియో, మైక్రో ఈవీ కాన్సెప్ట్ రెండేళ్ల తరువాత ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX డిజైన్ స్టూడియో స్థాపించారు. 20 శాతం అప్‌సైకిల్ భాగాలను ఉపయోగించి Two 2 అనే మైక్రో-మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. చిన్న బ్యాటరీతో కూడా ఎక్కువ పరిధినిస్తుంది. 'ఓలా ఎలక్ట్రిక్'లో కృపా అనంతన్ దేశీయ ఈవీ మేకర్ బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ‘ఓలా ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 నుండి రూ. 25 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. గత ఏడాది ఆగస్టులో రామకృపా అనంతన్ ఓలా ఎలక్ట్రిక్స్‌లో డిజైన్ హెడ్‌గా చేరారు. ద్విచక్ర వాహనం , రాబోయే నాలుగు-చక్రాల విభాగాలకు ఆమె లీడ్‌గా ఉన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పరిశీలిస్తున్నాం...
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) దేశీయంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు (బీఈవీ) గల డిమాండ్‌ను పరిశీలిస్తోంది. తదనుగుణంగా మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టడానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోనుంది. జేఎల్ఆర్ ప్రస్తుతం జాగ్వార్ భారత్‌లో ఐ–పేస్ అనే ఏకైక ఎలక్ట్రిక్ మోడల్‌ను విక్రయిస్తోంది. జేఎల్ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా లగ్జరీ వాహనాల సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లో విక్రయాల వృద్ధి అత్యంత మెరుగ్గా ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1,048 యూనిట్ల విక్రయాలతో అత్యుత్తమ పనితీరు కనపర్చినట్లు పేర్కొన్నారు. అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా తమ సేల్స్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించే పనిలో ఉన్నట్లు రాజన్ వివరించారు. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 సేల్స్ అవుట్‌లెట్స్, 27 సరీ్వస్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. జేఎల్ఆర్ ఇటీవలే కొత్త రేంజ్ రోవర్ వేలార్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 94.3 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే వేలార్‌కు 750 బుకింగ్స్ వచ్చాయని, ఏటా 1,500 యూనిట్ల మేర అమ్మకాలకు అవకాశాలు ఉన్నాయని రాజన్ చెప్పారు. -
ఈ–టూవీలర్ కంపెనీలకు చెక్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 స్కీమ్ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చట్టపరమైన చర్యలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, పథకం కింద పొందిన రూ. 469 కోట్ల పైచిలుకు సబ్సిడీ ప్రోత్సా హకాలను తిరిగి చెల్లించాలంటూ ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటో ఈ జాబితాలో ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో రివోల్ట్ మోటార్స్ మాత్రమే ప్రోత్సాహకాలను తిరిగి చెల్లించేందుకు ముందుకు వచి్చనట్లు వివరించారు. మిగతా సంస్థలు ఇంకా స్పందించలేదని పేర్కొన్నారు. రీఫండ్‌కు డెడ్‌లైన్ దాదాపు ముగిసిపోతోందని చెప్పారు. ‘వచ్చే వారం కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చట్టపరమైన చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం’ అని అధికారి వివరించారు. ఉల్లంఘనలు ఇలా.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేలా రూ. 10,000 కోట్ల ప్రోత్సాహకాలతో కేంద్రం 2019లో ఫేమ్–2 పథకాన్ని ఆవిష్కరించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రకటించిన తొలి ఫేమ్ వెర్షన్‌కు కొనసాగింపు. ఫేమ్–2 పథకం నిబంధనల ప్రకారం .. దేశీయంగా తయారైన పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అయితే, పలు కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ స్కీముతో ప్రయోజనం పొందిన కంపెనీలపై భారీ పరిశ్రమల శాఖ విచారణ జరిపింది. వీటిలో ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్న పరికరాలను ఉపయోగించినట్లుగా వెల్లడైంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం సబ్సిడీలను విడుదల చేయడంలో కేంద్రం ఆలస్యం చేసింది. ఫలితంగా అటు సబ్సిడీ బకాయిలు చిక్కుబడిపోయి, ఇటు మార్కెట్ వాటా కోల్పోయి ఎలక్ట్రిక్ వాహన సంస్థలు దాదాపు రూ. 9,000 కోట్లు నష్టపోయినట్లు విద్యుత్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య ఎస్ఎంఈవీ అంచనా వేసింది. కొనుగోళ్లపై పొందిన రిబేట్లను తిరిగి చెల్లించేలా కస్టమర్లకు సూచించే అవకాశాలను పరిశీలించాలంటూ సబ్సిడీలపరమైన మద్దతు కోల్పోయిన ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. -
భారత మార్కెట్లోకి జపాన్ ముసాషి: త్వరలోనే ఈ-యాక్సిల్
ముంబై: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ ముసాషి తాజాగా భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లోకి ప్రవేశించింది. భారత్ న్యూ ఎనర్జీ కంపెనీ (బీఎన్సీ) మోటార్స్‌తో జట్టు కట్టింది. మోటార్, పీసీయూ, గేర్ బాక్స్‌తో కూడిన కొత్త ఈవీ యూనిట్లను ఉత్పత్తి చేయనున్నట్లు ముసాషి ఇండియా తెలిపింది. బెంగళూరు ప్లాంటులో అక్టోబర్ నుంచి ఈ-యాక్సిల్‌ను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన అసెంబ్లీ లైన్ కోసం తొలి దశలో రూ. 70 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించింది. ముసాషి సైమిత్సు ఇండస్ట్రీస్‌కి ముసాషి ఇండియా అనుబంధ సంస్థగా ఉంది. తమ అనుభవం, అధునాతన సాంకేతికతను భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లోకి తేనున్నట్లు ముసాషి సైమిత్సు సీఈవో (భారత విభాగం) తోషిహిసా ఒత్సుకా తెలిపారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) భారత్‌లో తయారు చేసిన ఈ-యాక్సిల్‌ను ఇతర దేశాలకు కూడా సరఫరా చేయాలని ముసాషి భావిస్తోంది. ఇందుకోసం థాయ్‌లాండ్‌కి చెందిన స్ట్రోమ్, వియత్నాం సంస్థ ఈవీ గో, కెన్యాకు చెందిన ఆర్క్ రైడ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?) మరిన్ని ఇంట్రస్టింగ్వార్తలు, బిజినెస్అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
హ్యుందాయ్ రూ.20,000 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్‌లో రూ.20,000 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. తమిళనాడులో వచ్చే 10 ఏళ్లలో ఈ మొత్తాన్ని దశలవారీగా వెచ్చించనున్నట్టు తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ అభివృద్ధి, వాహనాల ప్లాట్‌ఫామ్స్ ఆధునీకరణకు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తమిళనాడు ప్లాంటును ఈవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. 1,78,000 యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. అయిదేళ్ల వ్యవధిలో ప్రధాన రహదార్లలోని కీలక ప్రదేశాలలో 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. హ్యుందాయ్ వార్షిక తయారీ సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది. -
ఈవీలకు సిడ్బీ ఫైనాన్సింగ్!
ముంబై: ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఉత్తమ ఫైనాన్సింగ్‌కు వీలుగా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బీ) పైలట్ పథకానికి తెరతీసింది. తద్వారా మొత్తం ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) పరిశ్రమ పటిష్టతకు మద్దతివ్వనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు ఫోర్ వీలర్ల కొనుగోళ్లకు రుణ సౌకర్యాలు కల్పించనుంది. వెరసి ఎలక్ట్రిక్ వాహన కొనుగోళ్లకు ఎంఎస్ఎంఈలు, ఈవీ లీజింగ్ కంపెనీలకు ప్రత్యక్షంగా ఆర్థిక తోడ్పాడును అందించనుంది. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్సహా చార్జింగ్ సదుపాయాల కల్పనకు సైతం అండగా నిలవనుంది. ఈవీ ఎకోసిస్టమ్‌లో రుణాలందించేందుకు వీలుగా చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు పోటీ రేట్లకు ఫైనాన్సింగ్‌ను ఏర్పాటు చేయనుంది. -
ఎలక్ట్రిక్ విభాగంలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు!
ఎలక్టాన్రిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్’ సంస్థ సౌత్ తైవాన్‌లో ఎలక్ట్రిక్ విభాగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఫాక్స్‌కాన్ తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ కోసం రాబోయే మూడేళ్లలో తైవాన్‌లో 820 మిలియన్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే సౌత్ తైవాన్ Kaohsiung Cityలో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ బ్యాటరీలు తయారు చేసే ప్లాంట్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో ఫాక్స్‌కాన్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధులు తెలిపారు. కాగా, ఫాక్స్ కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్లను తయారు చేసే ప్రధాన ఉత్పత్తి దారుల్లో ఒకటిగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఇదే సంస్థ ఐఫోన్ల తయారీ యూనిట్లును నెలకొల్పేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. -
ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !
బెంగళూరు: ఎలక్ట్రిక్ వాహన తయారీదారు వోలా ఎలక్ట్రిక్ నిధుల సమీకరణ బాట పట్టింది. విస్తరణ ప్రణాళికలు, ఇతర కార్పొరేట్ అవసరాల రీత్యా 30 కోట్ల డాలర్లు (రూ. 2,475 కోట్లు) సమకూర్చుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే నష్టాల నుంచి బయటపడి, లాభాలు ఆర్జించగలదన్న అంచనాల నడుమ కంపెనీ తాజా నిధుల సమీకరణకు తెరతీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. (ఇదీ చదవండి: ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం) 2023, 2024లో మాస్-మార్కెట్ స్కూటర్, మాస్-మార్కెట్ మోటార్‌సైకిల్, మల్టిపుల్ ప్రీమియం బైక్స్ లాంటి మరిన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ గతంలో చెప్పారు. అలాగే 2025 చివరి నాటికి భారతదేశంలో విక్రయించబడే మొత్తం టూవీలర్స్, 2030 నాటికి దేశంలో విక్రయించేకార్లన్నీఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలనేది కంపెనీ మిషన్ ఎలక్ట్రిక్ లక్క్ష్యమని ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే) దీనికి తోడు ఇటీవలే తమిళనాడు క్రిష్ణగిరిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భూమి సేకరణకు అక్కడి ప్రభుత్వంతో MOU సంతకం కుదుర్చుకుంది ఓలా. ఇందులోసెల్ ఫ్యాక్టరీ, ఫోర్-వీలర్ ఫ్యాక్టరీ, సప్లయర్ ఎకోసిస్టమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ద్విచక్ర వాహనాల ఫ్యాక్టరీని కూడా విస్తరించాలని కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది. -
హీరో ఎలక్ట్రిక్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ నూతన ప్లాంటును రాజస్థాన్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఇది రానుంది. లుధియానా వద్ద నెలకొల్పుతున్న ప్లాంటు నిర్మాణ దశలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని పీతాంపుర వద్ద ఉన్న మహీంద్రా గ్రూప్ ప్లాంటును వినియోగించుకునేందుకు ఆ సంస్థతో ఇప్పటికే భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. 2022–23లో ఒక లక్ష యూనిట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల యూనిట్ల విక్రయాలను కంపెనీ ఆశిస్తోంది. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భాగస్వాములతో కలిసి పనిచేస్తునట్టు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజాల్ తెలిపారు. రెండు మూడేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకం స్థాయికి చేరతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 ఏళ్లలో కంపెనీ ఇప్పటి వరకు 6 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. మూడు కొత్త మోడళ్లు.. హీరో ఎలక్ట్రిక్ తాజాగా కొత్త ఆప్టిమా సీఎక్స్5.0 (డ్యూయల్ బ్యాటరీ), ఆప్టిమా సీఎక్స్2.0 (సింగిల్ బ్యాటరీ), ఎన్వైఎక్స్ (డ్యూయల్ బ్యాటరీ) మోడళ్లను ప్రవేశపెట్టింది. ధర రూ.85 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంది. జపనీస్ మోటార్ టెక్నాలజీ, జర్మన్ ఈడీయూ సాంకేతికతతో ఇవి తయారయ్యాయి. బ్యాటరీ సేఫ్టీ అలారమ్, డ్రైవ్ మోడ్ లాక్, రివర్స్ రోల్ ప్రొటెక్షన్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి హంగులు ఉన్నాయి. 3 కిలోవాట్ అవర్ సీ5 లిథియం అయాన్ బ్యాటరీతో ఆప్టిమా సీఎక్స్5.0 తయారైంది. ఒకసారి చార్జింగ్‌తో 113 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో ఎన్వైఎక్స్ 113 కిలోమీటర్లు, సీఎక్స్2.0 మోడల్ 89 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ రెండు మోడళ్లూ గంటకు 48 కిలోమీటర్ల వేగంతో పరుగెడతాయి. -
ఈ ఏడాదీ వాహనాల జోరు
గ్రేటర్ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 43,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు. తయారీ సామర్థ్యం పెంపు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గర్గ్ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్ పండుగ సీజన్ డిమాండ్ ఊతంతో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి. పూర్తి ఏడాదికి.. 2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్ ఇయర్) గణాంకాలు చూస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్‌యూవీ400... 20,000 యూనిట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. -
ఈవీలపై దేశీ కార్పొరేట్ల దృష్టి
ముంబై: దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు ఇటీవల కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లవైపు దృష్టి సారిస్తున్నాయి. తమ ప్లాంట్లు కార్యాలయాల్లో ఉద్యోగుల రవాణాకు ఇవి అనుకూలమని భావిస్తున్నాయి. దీంతో మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కోతోపాటు ఐటీ బ్లూచిప్ కంపెనీలు క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థలు బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్, అలియంజ్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ వాహన పాలసీలకు తెరతీస్తున్నాయి. తద్వారా ఉద్యోగులను ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీల అమ్మకాలు ఊపందుకున్న నేపథ్యంలో పలు కార్పొరేట్ల తాజా ప్రణాళికలు పరిశ్రమకు జోష్‌నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని సంస్థలు రెడీ బ్యాటరీ ఆధారంగా నడిచే ఈవీలు కొంతకాలంగా భారీగా విక్రయమవుతున్నాయి. మారియట్, నోవాటెల్ తదితర ఆతిథ్య రంగ కంపెనీలు సైతం ఈవీలను కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ సంస్థల బాటలో హోటల్ చైన్ కంపెనీలు ఈవీలను మాత్రమే వినియోగించవలసిందిగా విక్రేతలు(వెండార్ల)కు సూచిస్తున్నాయి. ఇక మరోపక్క ఎన్ఎంసీలు తమ కార్యకలాపాలలో ఈవీల వినియోగ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈవీల వినియోగానికి మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశాయి. పర్యావరణ పరిరక్షణ బాటలో ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. డిసెంబర్లో డీలా రూ. 1,100 కోట్ల సబ్సిడీ పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో గత నెల(డిసెంబర్)లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు క్షీణించాయి. 2022 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 20 శాతం నీరసించాయి. రోడ్, రవాణా, జాతీయ రహదారుల శాఖ వాహన పోర్టల్ గణాంకాల ప్రకారం స్థానిక మార్కెట్లో నవంబర్‌లో 76,162 వాహనాలు అమ్ముడుపోగా.. డిసెంబర్లో ఇవి 59,554 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈవీలను ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన ఫేమ్–2 విధానాలలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. అయితే 2022 ఏప్రిల్ నుంచి సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక విలువ జోడింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. హీరో ఎలక్ట్రిక్, ఓకినావా ఆటోటెక్, రివోల్ట్, యాంపియర్ తదితర 6 కంపెనీలకు సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ అంశాలపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టగా.. మరోపక్క సబ్సిడీలు ఆగిపోవడంతో క్యాష్ ఫ్లోలపై ఒత్తిడి పడుతున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలియజేశారు. సమస్య త్వరగా పరిష్కారంకాకుంటే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోత్సాహకాలు ఇలా ప్రభుత్వం ద్విచక్ర ఈవీలకు కిలోవాట్‌కు రూ. 15,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే మొత్తం వాహన వ్యయంలో 40 శాతం మించకుండా పరిమితి విధించింది. ఇందుకు స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ విలువ జోడింపును చేపట్టవలసి ఉంటుంది. ఈ విషయంలో వాహన విక్రయం తదుపరి కంపెనీలు సంబంధిత ఆధారాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఆపై 45–90 రోజుల్లోగా వాహనం రిటైల్ ధరపై ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేస్తుంది. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం అవాంతరాలు సృష్టించబోదని, దేశీయంగా పరిశ్రమలో సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తుందని అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. 2023లో రెట్టింపునకు ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎలక్ట్రిక్ వాహన రిటైల్ విక్రయాలు రెట్టింపునకు జంప్‌చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి 2.2 మిలియన్ యూనిట్లకు తాకనున్నట్లు అంచనా. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల సొసైటీ(ఎస్ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022లో ఈవీ రిటైల్ అమ్మకాలు మిలియన్ యూనిట్లకు చేరాయి. కాగా.. గత నెలలోనే వేదాంతా గ్రూప్ ఉద్యోగులకు ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. నెట్ జీరో కర్బన విధానాలకు అనుగుణంగా తాజా పాలసీకి తెరతీసింది. -
విద్యుత్ వాహనాల్లోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం దీనిపై గ్రూప్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లోకి కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను వివరిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ శేషగిరి రావు ఈ విషయాలు తెలిపారు. నాలుగు చక్రాల వాహనాల తయా రీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్లాంటును ఎప్ప ట్లోగా ప్రారంభించే అవకాశం ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం ప్రణాళికలు తుది దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు తమిళనాడులోని సేలంలో మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి సా మర్థ్యంతో ఉక్కు ప్లాంటు ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సహా ఆటోమొబైల్ కంపెనీలకు అవసరమయ్యే హై– వేల్యూ ఉక్కును ఈ ప్లాంటులో తయారు చేస్తున్నారు. అలాగే ఇన్ఫ్రా, సిమెంటు, పెయింట్స్ మొదలైన వివిధ రంగాల్లోనూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ విస్తరించింది. -
ఎలక్ట్రిక్ వాహనాల్లోకి సోనీ
టోక్యో: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వినోద రంగంలో ఉన్న జపాన్ సంస్థ సోనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన తయారీ దిగ్గజం హోండాతో చేతులు కలిపింది. సోనీ హోండా మొబిలిటీ పేరుతో ఏర్పాటైన కంపెనీ 2025 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనుంది. డెలివరీలు 2026 నుంచి మొదలు కానున్నాయి. తొలుత యూఎస్ మార్కెట్లో ఇవి రంగ ప్రవేశం చేయనున్నాయి. ఆ తర్వాత జపాన్, యూరప్‌లో అడుగుపెడతాయని సోనీ హోండా మొబిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యసుహిదె మిజూనో వెల్లడించారు. పూర్తిగా కొత్తదనం ఉట్టిపడేలా రూపొందిస్తామన్నారు. యూఎస్‌లోని హోండా ప్లాంటులో ఈవీలను తయారు చేస్తారు. అయితే ఇది ఒక ప్రత్యేక మోడల్ అని, భారీ విక్రయాల కోసం ఉద్దేశించి తయారు చేయడం లేదని కంపెనీ అధికారులు తెలిపారు. చెరి 50 శాతం వాటాతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ స్థాపించాలని 2022 మార్చిలో సోనీ గ్రూప్ కార్పొరేషన్, హోండా అంగీకరించాయి. ఇమేజింగ్, నెట్వర్క్, సెన్సార్, వినోద నైపుణ్యంతో సోనీ.. వాహనాలు, మొబిలిటీ టెక్నాలజీ, అమ్మకాలలో హోండాకు ఉన్న నైపుణ్యాన్ని ఒకచోట చేర్చే ఆలోచనతో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రెండేళ్ల క్రితం లాస్ వెగాస్‌లో జరిగిన సీఈఎస్ గ్యాడ్జెట్ షోలో సోనీ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. -
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట లభించింది. బ్యాటరీలకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. నూతన బ్యాటరీ భద్రతా ప్రమాణాలను రెండంచెల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెండో దశ నిబంధనలు 2023 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రమాదాలకు కారణం బ్యాటరీలేనని తేలింది. దీంతో నిపుణుల సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ అదనపు భద్రతా ప్రమాణాలను రూపొందించి, ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. బ్యాటరీ సెల్స్, ఆన్ బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, వేడిని తట్టుకోగలగడం తదితర అంశాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది.