fluoride problem
-
‘మెకానిక్’తో ఆ సమస్య అర్థమవుతుంది: మంత్రి కోమటిరెడ్డి
‘‘నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ సినిమాని ప్రజలందరూ ఆదరించాలి. ఈ మూవీ ద్వారా ఫ్లోరైడ్ సమస్య, బాధితుల బాధలు సమాజానికి అర్థమవుతాయి. ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. ఎం. నాగమునెయ్య (మున్నా) నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేశారు. ‘‘మా చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి. మంచి సందేశాత్మక చిత్రం ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
నల్లగొండ ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి మృతి.. కేటీఆర్ సంతాపం..
నల్లగొండ: ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాటంలో స్వామి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. స్వామి తన గుండెళ్లో చిరస్థాయిగా గుర్తుంటారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గతంలో అంశలస్వామి ఇంట్లో కేటీఆర్ భోజనం చేశారు. ఆయనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కూడా మంజూరు చేయించారు. My Heartfelt condolences to the family of Sri Amshala Swamy Garu who passed away today He was a fighter who championed the cause of Fluorosis victims & an inspiration to many. He will always remain close to my heart May his soul rest in peace 🙏 pic.twitter.com/wCv5DHWeGg — KTR (@KTRBRS) January 28, 2023 అంశల స్వామి బైక్ ప్రమాదానికి గురై తలకు గాాయాలు కావడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన చాలా సంవత్సరాలుగా అనేక అంశాలపై గళమెత్తి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. చదవండి: 2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ -
AP: రాష్ట్రంలో ఫ్లోరైడ్ తగ్గుముఖం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లలో ఫ్లోరైడ్ బాగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలశాఖ అధికారులు 2018 మే, నవంబర్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 660 మండలాలకుగాను 133 మండలాల్లో బోర్లు, బావుల్లో ఫ్లోరైడ్ ఉన్నట్టు గుర్తించారు. అయితే అక్కడి నీరు ప్రజలు తాగునీటికి ఉపయోగించడానికి వీలుగానే ఉందని తేల్చారు. కాగా, ఈ ఏడాది నిర్వహించిన నీటి పరీక్షల్లో కేవలం 98 మండలాల్లోనే ఫ్లోరైడ్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు నిర్ధారించారు. 35 మండలాల్లో ఫ్లోరైడ్ భయాలు పూర్తిగా తొలగిపోయాయి. భూగర్భ జల శాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో 1,259 బోర్లు, బావులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని.. ఏటా ఆ నీటిలో వచ్చే మార్పులను గుర్తించేందుకు నీటి పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రతి మండలంలో ఖచ్చితంగా ఒక బోరు లేదంటే బావిని నీటి నాణ్యత పరీక్షల కోసం ఎంపిక చేసుకుంటోంది. కొన్ని మండలాల్లో అక్కడి నైసర్గిక స్వరూపం, స్థానిక పరిస్థితుల ఆధారంగా రెండు, మూడింటిలో కూడా పరీక్షలు చేసింది. ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు, ముగిశాక నవంబర్‌లో ఆ 1,259 బోర్లు, బావుల నీటిని సేకరించి, నాణ్యతను విశ్లేషిస్తోంది. ఫ్లోరైడ్ ఎంత ఉండాలంటే.. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారుల లెక్కల ప్రకారం.. ఒక లీటరు నీటిలో ఒక మిల్లీగ్రాము, అంతకంటే తక్కువగా ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉంటే ఆ నీటిని తాగునీటికి ఉపయోగించవచ్చు. దీన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక లీటరు నీటిలో 1.5 మిల్లీగ్రాముల పరిమాణంలో ఫ్లోరైడ్ ఉన్నా తాగునీటికి ఉపయోగించుకోవచ్చని సవరించింది. 1.5 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్ ఉన్న నీరు తాగునీటికి పనికిరాదు. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ అధికారుల వివరాల ప్రకారం.. 2018లో ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరులోని బోర్లు, బావుల్లో 1.58 మిల్లీగ్రాముల పరిమాణంలో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉన్నాయి. తాజాగా ఆ గ్రామంలో నిర్వహించిన పరీక్షల్లో ఫ్లోరైడ్ ఒక మిల్లీగ్రాము లోపునకే పరిమితమైనట్టు గుర్తించారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల కేంద్రంలోని బోరుబావుల నీటిలో మూడేళ్ల కిత్రం 2.55 మిల్లీగ్రాముల పరిమాణంలో ఫ్లోరైడ్ ఉన్నట్టు గుర్తించగా.. తాజా పరీక్షల్లో ఆ గ్రామంలో ఫ్లోరైడ్ 1.90 మిల్లీ గ్రాములకు పరిమితమైనట్టు తేల్చారు. విజయనగరం జిల్లా మినహా.. భూగర్భ జల శాఖ అధికారుల తాజా గణాంకాల ప్రకారం.. విజయనగరం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేదు. రాష్ట్రంలో మిగిలిన 12 జిల్లాల పరిధిలో అక్కడక్కడా భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ప్రమాదకర పరిమాణంలో ఉంది. 12 జిల్లాల్లోని 98 మండలాల పరిధిలో అత్యధికంగా అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు తేలింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 21, ప్రకాశం జిల్లాలో 17, వైఎస్సార్ జిల్లాలో 15 మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు స్పష్టమైంది. మరోవైపు.. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేవలం ఒక్కో మండలంలో, తూర్పుగోదావరి జిల్లాలో మూడు, విశాఖపట్నం జిల్లాలో నాలుగు మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు తేలింది. సీమలో తగ్గి కోస్తా జిల్లాల్లో పెరుగుదల.. గత మూడేళ్ల కాలంలో రాయలసీమలో ఏకంగా 52 మండలాలు ఫ్లోరైడ్ నుంచి బయటపడినట్టు భూగర్భ జల శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో కోస్తా జిల్లాల్లోని 17 మండలాల్లో నిర్ణీత పరిమాణం కంటే పాక్షికంగా ఫ్లోరైడ్ ప్రభావం పెరిగింది. భూగర్భ జలమట్టంలో హెచ్చుతగ్గుల కారణంగా ఫ్లోరైడ్ పరిమాణంలో మార్పులు కనిపిస్తుంటాయని అధికారులు తెలిపారు. భూమి లోతుకు వెళ్లేకొద్దీ ఫ్లోరైడ్ నీటితో కలిసి బయటకు వస్తుందన్నారు. వర్షాలు ఎక్కువగా కురిసిన సమయాల్లో తక్కువ లోతులోనే నీరు అందుబాటులో ఉండటం వల్ల ఆ నీటిలో ఫ్లోరైడ్ శాతం తక్కువగా ఉంటుందని వివరించారు. -
‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యం.. అంతుపట్టని అనారోగ్యం.. మరుగుజ్జుతనం.. బుద్ధిమాంద్యం.. వయసు తగ్గట్టుగా ఎదగని శరీరం.. ఇవి ఫ్లోరైడ్ బారిన పడిన వారి ఆనవాళ్లు. ఫ్లోరైడ్ రక్కసి కాటుకు బలైన కుటుం బాలెన్నో.. జీవచ్ఛవాలుగా బతుకులీడ్చినవారెందరో.. ఇది ఒకప్పుడు. మరిప్పుడో? దాని పీడ విరగడైంది. ఇప్పుడు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారింది. దాని కోసం ‘భగీరథ’ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లేవని పార్లమెంటు సాక్షిగా కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ రక్కసి బారిన పడి అల్లాడుతున్న 967 ఆవాసాలకు ఊరట కలిగింది. ‘మిషన్ భగీరథ’పథకం ప్రవేశపెట్టడానికి ముందు.. అంటే 2015 ఏప్రిల్ ఒకటి నాటికీ రాష్ట్రంలో 976 ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలుండగా.. గత నెల ఒకటో తేదీ నాటికీ ఈ సంఖ్య సున్నాకు చేరుకుంది. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద రక్షిత తాగునీరు అందించడంతో అది జాడ లేకుండా పోయింది. తొలిసారి దర్శిలో గుర్తింపు భూగర్భజలాల్లో తొలిసారి ఫ్లోరైడ్ ఆనవాళ్లు 1937లో ప్రకాశం జిల్లా దర్శిలో, 1945లో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం బట్లపల్లి(పాత)లో కనిపించాయి. ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకునేందుకు ఉపరితల నీటివనరుల సేవనమే మార్గమని శాస్త్రవేత్త డాక్టర్ ఎంకే దాహూర్ అప్పటి నిజాం ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు నిజాం నవాబు చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగడిపల్లి, మునుగోడు చెరువులను తవ్వించినా వర్షాభావ పరిస్థితులు, కరువుతో అవి రానురాను అడుగంటిపోయాయి. దీంతో ఫ్లోరోసిస్ భూతం ఉగ్రరూపం దాల్చింది. 1985లో బట్లపల్లిలో ప్రపంచం లోనే అత్యధిక పరిమాణం(28 పీపీఎం)లో ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన మర్రిగూడ, నాంపల్లి, చండూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల ప్రజలు అనివార్యంగా బోరుబావుల నీటినే సేవించాల్సి వచ్చింది. 2003లో పోరుయాత్రలో భాగంగా మర్రిగూడకు వచ్చిన ప్రస్తుత సీఎం కేసీఆర్.. ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే చౌటుప్పల్‌లో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి 2017 చివరి నుంచి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించారు. మిషన్ భగీరథ ఫలితంగానే.. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారేం దుకు మిషన్ భగీరథ పథకమే కారణమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలం గాణ ఆవిర్భావానికి ముందు కేవలం 5,767 గ్రామాలకు మాత్రమే తాగునీటి సదుపాయం ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో 23,968 ఆవాసాలకు, 120 పట్టణాలకు మిషన్ భగీరథ రక్షిత మంచినీరందుతోందని చెప్పారు. భగీరథ నీటితో ఫ్లోరైడ్ విముక్తి మిషన్ భగీరథ నీరు రాకమునుపు ఊరంతా ఫ్లోరైడ్ నీరే శరణ్యం. ఫ్లోరైడ్ నీరు తాగి, ఒంటి నొప్పులు ఇతర సమస్యలతో బాధపడేవారు. ఇప్పుడు అలాం టి పరిస్థితి లేదు. గతేడాది నుంచి రక్షిత నీరు ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం. –కొట్టం మాధవిరమేష్ యాదవ్, సర్పంచ్ తమ్మడపల్లి, మర్రిగూడ మండలం, నల్లగొండ జిల్లా ఆరోగ్యం కుదుటపడింది ఫ్లోరైడ్ వల్ల చాలామంది మా మండలంలో వికలాంగులుగా మారారు. ఈ నీరు తాగినప్పుడు కాళ్లు, చేతులకు నొప్పులు ఉండేవి. ఏ పనీ చేయలేని పరిస్థితి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నారు. అనారోగ్య సమస్యలు పోయాయి. –అల్వాల అంజయ్య, తిరుగుండ్లపల్లి, మరిగూడ మండలం -
ఫ్లోరైడ్ విముక్త ప్రాంతమదిగో...
సూడుసూడు నల్లగొండ... గుండెమీద ఫ్లోరైడ్ బండ... బొక్కలు వొంకరబోయిన బతుకుల నల్లగొండ జిల్లా... దు:ఖం వెళ్లదీసేది ఎన్నాళ్లు నల్లగొండ జిల్లా..? – కేసీఆర్ (2005లో 25 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎంపీల బృందంతో మర్రిగూడ, నాంపల్లి మండలాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి గుక్కెడు నీళ్లు కరువైన జీవితాలపై దుఃఖంతో కేసీఆర్ రాసిన పాట) ప్రతి మనిషికి మంచినీళ్లు ప్రాథమికహక్కు. గంగా, గోదావరి, కృష్ణా లాంటి జీవనదులు ప్రవహించే చోట నేటికీ మంచినీళ్లకోసం అల్లాడుతున్న ప్రజల జీవన ముఖచిత్రం నా దేశ చిత్రపటంగా కనిపిస్తుంది. ఈ దుస్థితికి గతకాలాన్నే నేరస్తునిగా నిలబెట్టాలా? ప్రజలకోసం పనిచేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణంచేసిన గతకాలపు పాలకులదే ఆ నేరం అందామా? ప్రజలకు మాత్రం దోసిళ్లలోకి శుద్ధ మంచినీళ్లు రావాలన్నదే కోరిక. మంచినీళ్లు పొందటం కోసం అల్లాడిన జనాన్ని గతకాలం చూసింది. మంచినీళ్లకోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి బిందెలతో మోసుకొచ్చిన మన తల్లుల బొప్పికట్టిన మాడలు చెబుతాయి. కన్నీళ్ల గోసను, మంచినీటి కోసం పడ్డ వెతలను చెబుతాయి. చెప్పుల్లేని కాళ్లతో కోసులకొద్ది దూరం నడిచిన ఆ తల్లుల పాదాలు కాయలు కాసిన కాళ్లు చారిత్రక సత్యాలను చెబుతాయి. ఈ దుస్థితికి నిలువెత్తు నిదర్శనం మా ఉమ్మడి నల్లగొండ జిల్లా. మంచినీళ్లు దొరకని కరుడుకట్టిన ఫ్లోరైడ్ జిల్లాగా దేశంలోనే పేరుపడ్డది. ఫ్లోరైడ్ అత్యధికంగావున్న జిల్లాల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాతోపాటు మా నల్లగొండ జిల్లాకూడా ఉంది. నీళ్లందని భూములు, గొంతుతడవని నాలుకలు మొత్తంగా మంచినీళ్లకోసం అల్లాడిన గోసకు సజీవ తార్కాణం నా నల్లగొండ పోరునేల. ఈ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేని గతకాలపు నాయకులంతా ప్రపంచ మానవహక్కుల కోర్టుల్లో నిలబడాల్సిందే. ఈ దుస్థితి మారాలని కన్నీళ్లను నీళ్లుగా తాగే ప్రజలు మంచినీళ్ల సాక్షిగా ఎన్ని ఉద్యమాలు చేసినా, దుశ్చర్ల సత్యనారాయణ లాంటి సంఘజీవులు ఎంతెంత దుఃఖించి ఉద్యమించినా, సాక్షాత్తు ఆనాటి ప్రధాని వాజ్‌పేయి ఫ్లోరోసిస్ బాధితుల్ని కళ్లారా చూసి కరిగిపోయిన నల్లగొండ జిల్లా నీటివెతలు తీరలేదు. ఒక్క నల్లగొండ జిల్లానే కాదు ఆనాటి తెలుగు సమాజంలో నీళ్లందని వూళ్లెన్నెన్నో ఉన్నాయి. ఇది తీరని గోసగా ఉంది. ఇది గుండెల్ని పిండిచేసిన దృశ్యాలు తెలంగాణలోని ఎన్నెన్నో మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. పేర్లెందుకు, కాలపట్టికలెందుకు గానీ నల్లగొండ జిల్లాలో కొన్ని ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల పిల్లలకు పెళ్లి సంబంధాలు పెట్టుకోవాలంటే కూడా జంకిన స్థితి ఆనాటి కాలదుస్థితి. చెలిమల నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్న తరాన్ని నా తెలంగాణ చూసింది. నా తెలంగాణ నీళ్లందని దప్పిక తీరని కోట్లమంది కన్నీళ్లవానగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం ఏ దినపత్రిక చూసిన ఎక్కడో ఒకచోట కోసులకొద్ది నీళ్లకోసం నడిచిన తల్లుల పాదముద్రలే కనిపిస్తాయి. నల్లగొండ జిల్లాలో ఉద్యమకాలంలో కేసీఆర్ పల్లెయాత్రలు చేసుకుంటూ వూరూరా తిరుగుతున్నప్పుడు నీళ్లకోసం మునుగోడు, సంస్థాన్ నారాయణపూర్, ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకుని కవితలల్లి పాటలురాసి పాడారు. అవును, నీళ్లందని వూళ్లు, మంచినీళ్లకోసం అరిచిఅరిచి ఉద్యమించి ఈ నేలపై నీళ్లధారల్ని ప్రవహింపజేసి ఇక్కడ గంగమ్మను పారించే భగీరథుని కోసం తెలంగాణ ఎదురుచూసింది నిజం. ఈ నేలపై నీళ్లను పారించే ఉద్యమ ఋష్యశృంగుని రాకకోసం నా తెలంగాణ కలవరించింది సత్యం. దీన్ని ఏ చరిత్రా కాదనలేనిది. కేసీఆర్ అటు ఉద్యమంలో గెలిచాడు. తెలం గాణ రాష్ట్రం వచ్చింది. ప్రజలు కేసీఆర్‌నే గెలిపిం చారు. ఫ్లోరోసిస్ రక్కసి నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఇపుడు తమ ఇంటిలోకి వచ్చిన స్వచ్ఛ జలాలను తమ దోసిళ్లలోకి తీసుకుని చూసుకున్నప్పుడు ఆ గంగమ్మలో కేసీఆర్ ముఖచిత్రం కనిపిస్తుంది. నీడనిచ్చిన చెట్టును, నీళ్లనిచ్చిన మనిషిని ఈ నేల మరువదు. ఇది ఒక కవి వర్ణనకాదు. ఇది ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల ప్రజల వర్ణించలేని పరమానంద పరవశమే. ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల్లో మంచి నీటి ఆశల జల పుట్టింది. ‘‘తెలంగాణ రాకముందు 967 గ్రామాల్లో ఫ్లోరోసిస్ విస్తరించి ఉంది. మిషన్ భగీర«థతో ఆ గ్రామాల్లో ఫ్లోరోసిస్ లేకుండా పోయిందని పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది. మిషన్ భగీరథ టీమ్‌కు అభినందనలు’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సందేశం చదివాక అమితానందం అనిపిం చింది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం. నల్లగొండ జిల్లాలో గత ఆరేండ్లుగా ఒక్క ఫ్లోరోసిస్ కేసు నమోదు కాకపోవటం తెలంగాణ ప్రభుత్వం కృషికి నిదర్శనం. కార్యసాధకుడైన కేసీఆర్ 2015 మార్చి 17న శాసనసభలో మాట్లాడుతూ ‘‘వాటర్ గ్రిడ్‌ను నాలుగు సంవత్సరాలలో పూర్తిచేస్తాము. ప్రతి గుడిసెకు, ఇంటికి ట్యాప్ ఇస్తాము. నాలుగున్నర సంవత్సరాల గడువు తరువాత తెలంగాణలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బజారులో కనిపించకూడదని మా ధ్యేయం. నాలుగున్నర సంవత్సరాల నాటికి ప్రతి ఇంటికి నీరు ఇవ్వకుంటే, రాబోయే ఎన్నికలలో మా పార్టీ ఓట్లు అడగదు’’ అని ధైర్యంగా ప్రకటించడం జరిగింది అన్నట్లుగానే మిషన్ భగీరథను పూర్తిచేశారు. ఫ్లోరోసిస్ భూతం ఈ నేలను వదిలివెళ్లటంతో పాలబుగ్గల పసినవ్వుల పళ్లవరుసలు పారే తెల్లటి జలపాతంలాగా మెరిసిపోతున్నాయి. మనిషి శరీరానికి పట్టిన ఫ్లోరోసిస్ తొలగించగలిగారు. ఇంటిం టికీ వచ్చిన మంచినీళ్లు ఇపుడు వొంకర్లు కొంకర్లు తిరిగిన గ్రామాలకు ఆయురారోగ్యాలనిస్తున్నాయి. ఇది ఆరోగ్యవంతమైన సమాజానికి మంచి పునాది. ఈ నేలమీద ఎగిసిన ఫ్లోరోసిస్ వ్యతిరేక ఉద్యమాలన్నింటికి ఇంటింటికీ వచ్చిన నల్లా నీళ్లతో విముక్తి లభించినట్లయ్యింది. ఇపుడు మా నల్లగొండ దేశ పీఠం మీద ఆరోగ్యకొండగా నిలుస్తుంది. తెలం గాణ పునర్నిర్మాణంలో ఇది ఒక భగీర«థమైన అడుగు. ఇదొక మంచిముందడుగు. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
మనం తాగేనీరు మంచిదేనా?
లీటరు నీటిలో మెగ్నీషియం 100 మిల్లీ గ్రాముల వరకు ఉండాలి. ఆళ్లగడ్డ మండలం కందుకూరులో 126, గోస్పాడు మండలం జిల్లెల్లలో 160, చిప్పగిరి మండలం ఎర్నూరులో 184, ఆలూరులో 204, హొళగుందలో 165, ఆస్పరి మండలం హలిగేరలో 277, కల్లూరు మండలం చిన్న టేకూరులో 214, మంత్రాలయం మండలం బసాపురంలో 287, వెలుగోడు మండలం పంగిడిగూడెంలో 160, కోడుమూరు మండలం పులకుర్తిలో 151, గూడూరు మండలం నాగులాపురంలో 190, పాణ్యం మండలం గగ్గటూరులో 140 ప్రకారం మెగ్నీషియం ఉన్నట్లు స్పష్టమవుతోంది.నీటిలో కాల్షియం లీటరు నీటికి 200లోపు మిల్లీ గ్రాములు ఉండాలి. ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురంలో 232, మంత్రాలయం మండలం బసాపురం గ్రామంలో 432, హొళగుందలో 256, ఆస్పరి మండలం హళిగెరలో 456, అవుకులో 296, చిప్పగిరి మండలం రామదుర్గంలో 232, నంద్యాల మండలం పోలూరులో 256, వెంకటేశ్వరాపురంలో 280, పాణ్యం మండలం గోనవరంలో 360 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కర్నూలు(అగ్రికల్చర్): వేసవి వస్తోంది... భూగర్భ జలాలు అడుగుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి నాణ్యతా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. సాధారణంగా నీటి నాణ్యతలో పీహెచ్, కరిగిన ఘనపదార్థాలు (టీడీఎస్), ఫ్లోరైడ్, మొత్తం కాఠిన్యం, నైట్రేటు, కాల్షియం, మెగ్నిషియం, క్లోరైడ్, సల్ఫేటు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇవి మోతాదు వరకు ఉంటే ఎటువంటి ప్రమాదం లేదు. అంతకు మించితేనే సమస్య. భూగర్భ జలాలు జనవరిలో 9.5 మీటర్లు ఉండగా..ప్రస్తుతం 10.25 మీటర్లకు పడిపోయాయి. జలాలు అడుగుకు వెళ్లే కొద్దీ లవణాల మోతాదు పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లోని నీటిలో ఫ్లోరైడ్, నైట్రేటు, క్లోరైడ్, సల్ఫేటు తదితరవన్నీ మోతాదుకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య 14 గ్రామాలను వేధిస్తోంది. దీనిని తగ్గించుకోవడానికి నీటిని ఫిల్టర్ చేసుకోవడంతోపాటు మిక్స్డ్ వాటర్ మేనేజ్మెంటును పాటించాల్సి ఉందని భూగర్భ జలవనరులశాఖ అధికారులు çసూచిస్తున్నారు. నీటిలో ఏవేవి ఎంత మోతాదులో ఉండాలి.. ♦ నీటిలో పీహెచ్ లీటరు నీటికి మిల్లీ గ్రామలు 6.5 నుంచి 8.5 వరకు ఉండాలి. ఈ మోతాదు దాటితే పైపులకు నష్టం చేకూరుతుంది. పరిమితి దాటితే జీర్ణాశయంలోని జిగురు పొర దెబ్బతింటుంది. చర్మ వ్యాధులు కనిపిస్తాయి. ♦ లీటరు నీటికి 1 నుంచి 1.5 మిల్లీ గ్రాముల వరకు ఫ్లోరైడ్ ఉండవచ్చు. ఈ మోతాదును దాటితే దంతాలకు గారపట్టడం, ఎముకల సమస్యలు ఏర్పడటం, రోగనిరోధక శక్తి తగ్గడం, అంగవైకల్యంతో పాటు కీళ్లనొప్పులు, చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ♦ మొత్తం కాఠిన్యం 200 నుంచి 600 వరకు ఉండవచ్చు. ఈ మోతాదును దాటితే నీటి సరఫరా వ్యవస్థలో/ నిర్మాణాల్లో పొరలు, పొలుసులు ఏర్పడతాయి. సబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ నీటిని తాగితే శరీరం బలహీనపడుతుంది. ♦ నీటిలో నైట్రేటు 45లోపు వరకు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే నీటి కాలుష్యం ఏర్పడినట్లు సూచన. మితయోగ్లోబిమియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ♦ కాల్షియం 200 లోపు ఉంటే ఎటువంటి ప్రమాదం లేదు. ఇంతకంటే ఎక్కువగా ఉంటే నీటి నిర్మాణాల్లో పొరలు, పొలుసులు ఏర్పడుతాయి. గృహ అవసరాలపై అననుకూల ప్రభావం చూపుతాయి. ♦ మెగ్నీషియం 100లోపు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే నిర్మాణాల్లో పొరలు, పొలుసులు ఏర్పడుతాయి. గృహ అవసరాలపై అననుకూల ప్రభావం చూపుతాయి. ♦ నీటిలో క్లోరైడ్ 1000లోపు వరకు ఉండవచ్చు. ఇంతకంటే ఎక్కువ మోతాదులో ఉంటే నీరు రుచి కోల్పోతుంది. జీర్ణక్రియ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉంది. గుండె, మూత్రపిండాల రుగ్మతలు ఉన్న వారిలో ఈ నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ♦ నీటిలో సల్ఫేటు 400 వరకు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే జీర్ణకోశంలో అసౌకర్యం కలిగిస్తుంది. 19 గ్రామాల్లో మోతాదుకు మించి కరిగిన ఘన పదార్థాలు.... వివిధ గ్రామాల్లోని నీటిలో కరిగిన ఘనపదార్ధాలు మొతాదు కంటే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. తాగు నీటిలో ఇవి 500 నుంచి 2000 వరకు, సాగు నీటిలో 2500 వరకు ఉండాలి. ఆదోని మండలంలోని పెద్దహరివణంలో 5050, కల్లుబావిలో 3334, విరుపాపురంలో 4147, మంత్రాలయం మండలం సూగూరులో 3891, సాపురంలో 4467, ఉయ్యలవాడ మండలం కాకరవాడలో 7219, ఒంటెద్దుపల్లిలో 3898, కోవెలకుంట్ల మండలం వల్లంపాడులో 9645, పొటిపాడులో 10170, సంజామల మండలం యగ్గోనిలో 4755, కమలాపురిలో 8666, ఆలూరు మండలం మొలగవెల్లికొట్టాలలో 8915, గూడూరులో 2778, హాలహర్వి మండలం చింతకుంటలో 4352, నందికొట్కూరులో 4186, బనగానపల్లె మండలం అప్పలాపురంలో 4915, నంద్యాల మండలం వెంకటేశ్వరాపురంలో 5786, సి.బెళగల్ మండలం పోలకల్‌లో 5901, దైవందిన్నెలో 12461 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 14 గ్రామాల్లో ఫ్లో‘రైడ్’ నీటిలో ఫ్లోరైడ్ లీటరు నీటికి 1 నుంచి 1.5 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. కల్లూరు మండలం పెద్దపాడులో 3.46, పర్లలో 3.36, మంత్రాలయం మండలం చిన్నకొప్పెర్లలో 3.7, గుంటుపల్లిలో 4.0, గొల్లపల్లిలో 3.3, కోవెలకుంట్ల మండలం వెలగటూరులో 5.5, రేవనూరులో 2.25, ఆదోని మండలం పెద్దహరివాణంలో 3.90, సి. బెళగల్ మండలం పోలకల్‌లో 5.0, కోసిగి మండలం కందుకూరులో 2.30, కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 2.57, పెద్దకడుబూరు మండలం జాలవాడిలో 2.91, నందవరం మండలం కనకవీడులో 2.82, మిడుతూరు మండలం ఖాజీపేటలో 2.0 మిల్లీ గ్రాముల ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నైట్రేట్ ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాలు 13... నీటిలో నైట్రేటు లీటరు నీటికి 45 మిల్లీ గ్రామాలు లోపు వరకే ఉండాలి. గోస్పాడు మండలం జిల్లెల్లలో 69, ఎం.కృష్ణాపురంలో 86, సి.బెళగల్ మండలం కొండాపురంలో 80, కౌతాళం మండలం బదినేహాల్‌లో 97, పాణ్యం మండలం మద్దూరులో 86, మంత్రాలయం మండలం మాలపల్లిలో 85, హాలహర్వి మండలం చింతకుంటలో 93, ఉయ్యాలవాడ మండలం రూపనగుడిలో 91, అవుకు మండలం చనుగొండ్లలో 105, ఉప్పలపాడులో 96, దొర్పిపాడులో మండలం గోవిందిన్నెలో 75, ఎమ్మిగనూరు మండలం సిరాళదొడ్డి గ్రామంలో 52, ఆస్పరి మండలం హొలగొందలో 65 వరకు ఉన్న పరీక్షల్లో స్పష్టమవుతోంది. క్లోరైడ్ ప్రభావం ఇలా ఉంది... నీటిలో క్లోరైడ్ లీటరు నీటికి 1000 మిల్లీ గ్రాములు ఉండాలి. కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తిలో 1250, పెద్దకొప్పుర్లలో 1070, ఆస్పరి మండలం హళిగేరలో 1020, హలహర్విలో 1050, చిప్పగిరి మండలం రామదుర్గంలో 1030, గోస్పాడు మండలం జిల్లెల్లలో 1010, కౌతాళం మండలం రౌడూరులో 1050, కోవెలకుంట్ల మండలం పొటిపాడులో 1060, ఆదోని మండలం కల్లుబావిలో 1070, గూడూరు మండలం నాగలాపురంలో 1110 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం కాఠిన్యత ఎక్కువగా ఉన్నప్రాంతాలు ఇవే(హర్డ్నెస్) నీటిలో మొత్తం కాఠిన్యత లీటరు నీటికి 200 నుంచి 600 మిల్లీగ్రాములు వరకు ఉండాలి. పాణ్యం మండలం వద్దుగండ్లలో 1019, ఆస్పరి మండలం హలిగేరలో 2280, ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరులో 1658, కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తిలో 1398, గూడూరులో 1001, మంత్రాలయం మండలం బసాపురంలో 2261, గోస్పాడు మండలం జిల్లెల్లలో 1040, హొళగొందలో 1320, పాణ్యం మండలం గోనవరంలో 1380 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 15 గ్రామాల్లోని నీటిలో మోతాదుకు మించి పీహెచ్ .. నీటిలో పీహెచ్ 6.5 నుంచి 8.5 వరకు ఉండవచ్చు. అయితే పలు ప్రాంతాల్లో 9 కంటే ఎక్కువగా ఉండటం గమానార్హం. జిల్లాలో గరిష్టంగా లీటరు నీటికి 10 మిల్లీ గ్రాములు ఉండటం గమానార్హం. ఇటువంటి నీరు తాగడానికి, సాగుకు పనికిరాదు. చాగలమర్రి మండలం ముత్యాలపాడులో 9.1, గోస్పాడులో 9.2, కోవెలకుంట్లలో 9.1, పెద్దకొప్పుర్లలో 9.1, వెలగటూరులో 8.9, రుద్రవరంలో 9.7, రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నెలో 9.9, అవుకు మండలం ఉప్పలపాడులో 10, మిడుతూరులో 10, తుగ్గలి మండలం పగిడిరాయిలో 8.9, ఉయ్యలవాడ మండలం కాకరవాడలో 9.2, సంజామల మండలం నొస్సంలో 9.7, హాలహర్విలో 9, ఎమ్మిగనూరు మండలం దైవందిన్నెలో 9, వెలుగోడు మండలం పంగిడిగూడెంలో 8.9 ప్రకారం పీహెచ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు నీటిలో లవణాలు ఇతర అన్ని రకాల గుణాలు.. మోతాదు వరకు ఉంటే మంచిది. అటువంటి నీరు తాగడానికి, సాగుకు అనువుగా ఉంటుంది. నీటిలో ప్రధానంగా 9 రకాల గుణాలు ఉంటాయి. ఇవి మోతాదుకు మించితే నష్టమే. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మోతాదుకు మించినపుడు మిక్స్డ్ వాటర్ మేనేజ్మెంటు విధానం పాటించాలి. అంటే భూగర్భ జలాలకు ఉపరితల జలాలను కలిపి వినియోగించుకుంటే వీటి తీవ్రతను కొంత వరకు తగ్గించుకోవచ్చు. వివిధ గ్రామాల్లో ప్లోరైడ్ ప్రభావం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనిని తగ్గించుకోవడానికి ఫిల్టర్ చేసుకోవాలి. భూగర్భజలశాఖ నీటి నాణ్యత ప్రమాణాలపై పరీక్షలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులకు పంపుతున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపైనే ఉంది.– రఘురామ్, డీడీ, భూగర్భ జల శాఖ, కర్నూలు -
జాడలేని ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం
సాక్షి, నల్లగొండ: దక్షిణ భారతదేశంలోని ఫ్లోరోసిస్ బాధితుల ఆరోగ్యం కోసం 2008–09లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ పరిశోధన కేంద్రం కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 8 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. కానీ, ఈ ఏడాది జూన్ 26వ తేదీన ‘ఫ్లోరోసిస్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం మా పరిధిలోకి రాదు అందుకే నిధులు కేటాయించలేదు..’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చేసింది. మరి ఇప్పటి దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, రాష్ట్ర ప్రభుత్వం 2014లో చౌటుప్పల్‌లో కేటాయించిన 8 ఎకరాల స్థలం దేనికోసం, ఎవరికోసమన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూపుతోందన్న విమర్శలకు బలం చేకూరుతోంది. దక్షిణభారత రాష్ట్రాలకు ఉద్దేశించిన ప్రాంతీయ ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. అయినా ఇప్పటి వరకు రీసెర్చ్ సెంటర్ శంకుస్థాపనకు నోచుకోలేదు. నిరాశేనా ! తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు గతంలోనే కేంద్రం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పాండిచ్చేరి, గోవా, అస్సాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల కోసం నల్లగొండలో రూ.100 కోట్లతో ‘రీజనల్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ (ఆర్.ఎఫ్.ఎం.ఆర్.సి) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. సరికదా తాజాగా, అసలు ఆ కేంద్రం తమ పరిధిలోకి రాదని, అందుకే బడ్జెట్ ఇవ్వలేమని కేంద్ర ఆరోగ్య శాఖ బాంబు పేల్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును 100 నుంచి 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రంలో భాగంగా తొలుత 20 పడకలతో ఆసుపత్రి నిర్మిచాల్సి ఉంది. కాగా, ఇప్పటికీ చౌటుప్పల్‌లో ఈ కేంద్రం ఏర్పాటు అతీగతీ లేదు. జిల్లాలో రమారమి 2 లక్షల మంది దాకా ఉన్న ఫ్లోరోసిస్ బాధితులకు ఈ కేంద్రం వల్ల ప్రయోజనం చేకూరుతుందేమోనని ఆశపడినా.. వారికి నిరాశే మిగిలింది. మంజూరైతే చేసింది కానీ, కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచి ఈ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఫ్లోరైడ్ సమస్య దూరమవుతుందన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పరిశోధన కేంద్రంపై దృష్టిపెట్టలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు పక్కన పెట్టండి గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యమంత్రి హో దాలో జె.పి.నడ్డా ఇస్తామన్న ఫ్లోరోసిస్ భాదితుల ప్రత్యేక దవాఖాన, తెస్తామన్న ఫ్లోరోసిస్ రిసేర్చ్ సెంటర్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్టీఐ కింద వివరాలు అడిగితే ‘మా పరిధి లోని అంశం కాదు అందుకే నిధులు కేటాయించట్లేదు‘ అని తెలిపింది. తెలంగాణలో అత్యంత ముఖ్యమైన ఫ్లోరోసిస్ బాధితుల సంక్షేమం మీద రాజకీయాలు పక్కకు పెట్టి కేంద్రం ఆలోచించాలి. హాస్పిటల్, రిసెర్చ్ సెంటర్ వెంటనే ఏర్పా టు చేయాలి. – సుధీర్, అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ -
పల్లెల పాలిట మరణశాసం ఫ్లోరోసిస్
జన ప్రాణాధారమైన జలమే మరణశాసనాన్ని లిఖిస్తోంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన అధికారులు, పాలకుల నిర్లక్ష్యం పల్లెల పాలిట శాపంగా మారుతోంది. మానవుల స్వార్థ పూరిత చర్యలకు ప్రకృతి సిద్ధంగా లభించే గాలి, నీరు కలుషితంగా మారుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో నానాటికి పెరుగుతున్న భూతాపం నేపథ్యంలో భూమి అంతర్గత పొరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. భూమి పొరల స్వరూపాలు కోల్పోయి సహజ మినరల్స్ శాతం అతిగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో ఫ్లోరైడ్ శాతం పెరగడంతో ప్రాణాంతకమవుతోంది. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి పరిస్థితుల్లో ఫ్లోరోసిస్ మానవాళి ఆయష్షుకు ప్రతిబంధకం అవుతోంది. వింజమూరు మండలంలోని శంఖవరంలో ఏడాదికి కనీసం పది మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో కాలం చేస్తున్నారు. వందల సంఖ్యలో జనం కీళ్లు, కిడ్నీ వ్యాధులతో దుర్భర జీవనం సాగిస్తున్నారు. నెల్లూరు, వింజమూరు: మండలంలో ఫ్లోరైడ్ పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాగేనీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా పెరగడంతో ఆ నీటిని తాగుతున్న జనం కీళ్ల, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని శంఖవరం, వెంకటాద్రిపాళెం, ఎ.కిస్తీపురం, నందిగుంట ఎస్సీ కాలనీ, తక్కెళ్లపాడు, రావిపాడు, గోళ్లవారిపల్లి, చౌవటపల్లిలో తాగునీటిలో 1.5 శాతం కంటే ఎక్కువగా ఫ్లోరిన్ ఉందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులే గుర్తించారు. అయితే ఆయా గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు అధికారులు, పాలకులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. నీటి పథకాలు సరే..ఫ్లోరైడ్ నియంత్రణ శూన్యం మండలంలోని పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్లు గుర్తించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి పథకాలు ఏర్పాటు చేశారు. శంఖవరంలో ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ క్వాలిటీ ఫండ్ కింద అధునాతన వాటర్ ప్లాంట్ మంజూరైంది. మిగతా 7 గ్రామాల్లో రూ.6.4 లక్షల నిధులతో ఒక్కో వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు. అయితే ఇవి అందుబాటులోకి వచ్చినా నీటిలో ఫ్లోరైడ్ నియంత్రణ జరగకపోవడంతో ఫ్లోరోసిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎముకలు, కీళ్లు బలహీనపడి తక్కువ వయస్సులో నడుము వంగి వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయి. కొంత మంది పూర్తిగా నడవలేక కర్ర సాయంతోనూ, జోగాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ కిడ్నీవ్యాధిగ్రస్తుల సంఖ్య పదుల్లో ఉంది. వీరంతా నెల్లూరుకు ప్రతి మూడు రోజులకు ఒకసారి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. గత పదేళ్ల కాలంలో ఒక్క శంఖవరం ఎస్సీ కాలనీలోనే కిడ్నీ వ్యాధితో 38 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా గతంలో చేతి పంపుల్లోని ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మండలంలో ఫ్లోరైడ్ ఉన్న 8 గ్రామాల్లో ఏడాదికి కనీసం పది మంది మరణిస్తున్నారు. ఫ్లోరైడ్ పీడత గ్రామాలు పెరిగే అవకాశం మండలంలో ఇప్పటికే 8 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు. కొన్ని దశాబ్దాల కాలంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో వర్షపాతం శాతం గణనీయంగా పడిపోయాయని, భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో పాటు భూమి పొరల్లో సంభవించిన మార్పుల నేపథ్యంలో సహజ సిద్ధంగా లభిస్తున్న తాగునీటిలో మినరల్స్ శాతాలు పెరుగుతున్నాయిన చెబుతున్నారు. ఇంకా చాలా గ్రామాల్లో నీటి పరీక్షలు జరిపితే ఫ్లోరైడ్ పీడిత గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. 42 ఏళ్ల వయస్సులో జోగాడుతూ.. ఈమె పేరు బక్కా హజరత్తమ్మ. వయస్సు 42 ఏళ్లు ఫ్లోరైడ్‌తో రెండు కాళ్లూ నాలుగేళ్ల క్రితం నుంచి పని చేయలేదు. అప్పటి నుంచి జోగాడుతుంది. వికలాంగురాలై పింఛనుతో బతుకుతోంది. ఈ కుటుంబంలో ముగ్గురు కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఇల్లు విడిచి బయటకు రాలేని పరిస్థితి. తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి. 10 ఏళ్ల క్రితం వరకు ఈమె రోజూ కూలి పనులకు వెళ్లేది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇలా మారింది. ఊతకర్ర సాయంతో.. ఈతని పేరు మాతంగి పెంచలయ్య. వయస్సు 47 సంవత్సరాలు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఇప్పుడు అతను ఊత కర్ర సాయం లేనిదే నడవలేని పరిస్థితి. తాగునీటి వల్లేనని డాక్టర్లు చెప్పారు. ముగ్గురు బిడ్డలు. వారిని ఇంకా చదివించాలి. కాని పని చేయలేక వారిని కూడా ఏదో ఒక కంపెనీలోకి పంపించాలను కుంటున్నాడు. కుటుంబాన్ని పోషించాల్సిన తాను తన కుటుంబానికి భారమైనట్లు కన్నీటి పర్యంతమవుతున్నాడు. కాళ్లు వాపులొచ్చాయి నాకు 40 ఏళ్ల వయస్సు. నేను సంవత్సరం నుంచి కాళ్లు వాచి నడువలేక బాధపడుతున్నాను. ఆస్పత్రుల చుట్టూ తిరిగాను. సుమారు రూ.30 వేలు ఖర్చు పెట్టాను. నా భర్త కూలికి వెళ్లి తెచ్చిన డబ్బులు నాకు వైద్యానికి సరిపోతున్నాయి.– విజయమ్మ, శంఖవరం ఎస్సీ కాలనీ -
మోదీపై ‘ప్రకాశం’ వాసుల పోటీ
సాక్షి, పామూరు: ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను, ఫ్లోరైడ్ సమస్యను జాతీయస్థాయిలో వినిపించేందుకు ఆ జిల్లాకు చెందిన ఇద్దరు సోమవారం వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ సాధన సమితి అధ్యక్షుడు వడ్డె శ్రీనివాసులు మధ్యాహ్నం 2.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సమితి సభ్యుడు, బ్రాహ్మణ అర్చక పురోహిత విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి వెంకట రవికిరణ్‌శర్మ సాయంత్రం 5.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. (చదవండి: వారణాసిలో పసుపు రైతుల నామినేషన్లు) అనంతరం శ్రీనివాసులు, రవికిరణ్ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రకాశం జిల్లా నేతలు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని చిన్న చూపు చూసిందని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 29 మండలాల్లో 15 లక్షల మందికిపైగా తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీటి ఇబ్బందులు తీరతాయన్నారు. ఫ్లోరైడ్ బాధితుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవడంతోపాటు సమస్యల పరిష్కారం కోసం తాము మోదీపై వారణాసిలో నామినేషన్ వేసినట్లు తెలిపారు. -
నిప్పు రాజేసిన నీళ్లు
ఏదైనా సమస్యను ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే.. ఆ సమస్య పరిష్కారం కోసం సాగిస్తున్న ఉద్యమం.. ఉద్యమ ఎత్తుగడలు ఎంతో ముఖ్యం. సరిగ్గా ఈ సూత్రం ఆధారంగానే ప్రపంచ వ్యాప్తంగా ఫ్లోరైడ్ పీడకు చిరునామాగా.. పర్యాయపదంగా నిలిచిన నల్లగొండ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను ఉలిక్కిపడేలా చేసింది. సాగునీటి కోసం అల్లాడిన రైతులు.. తాగునీరు లేక ఎండిన గొంతులు.. ఫ్లోరైడ్ విషపు నీరుతాగి జీవాన్ని కోల్పోయిన బాధితులు.. వెరసి అతి సామాన్యులు అసామాన్యంగా పోరాడి తెగువ చూపారు. నల్లగొండ జిల్లాకు జరిగిన జల వివక్షపై ఎనభయ్యో దశకంలో జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన జల పోరాటం పార్లమెంటు ఎన్నికలను వేదికగా మార్చుకుంది. సాగునీటి విషయంలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూనే.. తాగు, సాగు నీటి కోసం, ఫ్లోరైడ్ శాప విముక్తి కోసం సామాన్యులే సైనికులుగా సాగిన ‘జల సాధన సమితి’ ఉద్యమం చేపట్టిన కార్యక్రమాలు, ఆచరించిన వ్యూహాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. పోస్టు కార్డుల ఉద్యమాలు, మనీయార్డర్లు, పాదయాత్రలు వంటి రూపాలతోపాటు ‘మాస్ నామినేషన్లు’ సంచలనం సృష్టించాయి.-ఎన్.క్రాంతీపద్మ /నల్లగొండ ఏం జరిగిందంటే.. జల వివక్షను వివరించడం, న్యాయమైన పరిష్కారాన్ని కనుగొనడం ధ్యేయంగా జలసాధన సమితి ఉద్యమిస్తున్న రోజులవి. సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో వాస్తవానికి 1994లోనే మాస్ నామినేషన్లు వేస్తామని ప్రకటించినా.. అప్పటికి తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. 1996 ఎన్నికలు మాత్రం ఇందుకు వేదికయ్యాయి. దానికి ముందు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి జల సాధన సమితి నేతృత్వంలో స్వతంత్ర అభ్యర్థులుగా భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నామని నాటి జిల్లా కలెక్టర్ నీలం సహానికి ముందుగానే నోటీసిచ్చారు. అప్పటి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ టి.ఎన్.శేషన్‌కు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి.. ఇలా ప్రతీ ఒక్కరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. రూ.వెయ్యిలోపే నామినేషన్ డిపాజిట్ మొత్తం ఉండడం కూడా ఉద్యమకారులకు కలిసి వచ్చింది. ఆ ఎన్నికల్లో 582 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉద్యమకారులు, రైతులు, ఫ్లోరైడ్ బాధితులు, మహిళలు, వృద్ధులు ఇలా.. అన్ని వర్గాల వారూ నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 480 మంది బరిలో మిగిలారు. పెద్దసంఖ్యలో పోటీ నెలకొనడంతో నల్లగొండ లోక్‌సభ స్థానానికి జరగాల్సిన ఎన్నిక నెల పాటు వాయిదా పడింది. ఇంతమంది అభ్యర్థులతో తయారైన బ్యాలెట్ పేపర్ ఏకంగా పుస్తకమే అయ్యింది. చివరికి ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షం ఎంపీగా గెలిచారు. ప్రభావం చూపిన వ్యూహం నాటి వ్యూహాన్నే ఈ ఎన్నికల్లో ఆర్మూరు పసుపు రైతులు అనుసరిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి దాదాపు 175 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాటి మాస్ నామినేషన్లతో దేశంలో పలువురు నాయకులు స్పందించారు. వారిలో బాల్‌థాకరే ఒకరు. ఏ సమస్యపై సామాన్యులు ఇంతగా తెగించి నామినేషన్లు వేశారో పూర్వాపరాలు తెలియని ఆయన.. ‘పుట్టగొడుగులెక్కన పార్టీలు పుడుతున్నాయి. అందుకే ఇన్ని నామినేషన్లు..’ అని వ్యాఖ్యానించారని చెబుతారు. మాస్ నామినేషన్ల వ్యూహకర్త, జలసాధన సమితి స్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణ ‘ఈ ఎన్నికలు నాకు తృప్తినివ్వలేదు. పదివేల నామినేషన్లు వేయించాలనుకున్నాం. కనీసం వెయ్యి నామినేషన్లు వేసి బరిలో నిలవగలిగినా ఎన్నికలు జరిగే అవకాశమే ఉండేది కాదు..’ అని తన ఆత్మకథలాంటి ‘జల సాధన సమరం’లో పేర్కొన్నారు. -
మన్నూరు..బోరు!
ఓ వైపు వాయు కాలుష్యం.. మరో వైపు కలుషిత జలం ఆ పల్లె ప్రాణాలను తీస్తోంది. శ్వాస పీల్చుకోవాలంటే క్వారీల కాలుష్యం.. దాహం తీర్చుకుందామంటే ఫ్లోరైడ్ జలమే దిక్కు. పదేళ్లగా కలుషిత నీరు వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అధికారులకు ఎన్నో దఫాలుగా మొర పెట్టుకున్నా వారి ఆవేదన అధికారుల చెవికెక్కడం లేదు. వెంకటగిరి : జిల్లాలోని బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో దినగండం నూరేళ్ల ఆయుషుగా జీవిస్తున్నారు. ఆ గ్రామంలో దాహర్తి కోసం 10 బోర్లు ఏర్పాటు చేశారు. మరో వైపు ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉంది. అయితే గ్రామంలో భూగర్భ జలం పూర్తిగా అడుగంటి పోవడం వల్ల బోర్లలో నుంచి మంచి నీరు కాకుండా కలుషిత నీరు వస్తుంది. ఇవి తాగిన జనం రోగాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తాగునీరు కలుషితం కారణమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లితే ఏళ్ల తరబడి పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకే నెలలో కిడ్నీ సమస్యలతో 12 మంది మృతి గ్రామంలో పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ ఏడాది జనవరిలో 12 మంది కిడ్నీ సమస్యతో మత్యువాత పడ్డారు. ఆ కుటుంబాలన్నీ కన్నీటిసంద్రంలో మునిగిపోయాయి. నెల వ్యవధిలోనే తక్కువ వయస్సు నుంచి నడి వయస్సు వరకు ఒకే వ్యాధితో చనిపోవడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ గ్రామానికి ఇంత పెద్ద సమస్య వచ్చిందనే ఆవేదనతో ఆ గ్రామస్తులు మదనపడుతున్నారు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి అధికారులే కారణమని గ్రామస్తులు ముక్తకంఠంతో మండిపడుతోంది. గ్రామంలో ఎన్నీ బోర్లు వేసినా బోర్లలో నుంచి సురక్షిత నీరు రావడం లేదని చెబుతున్నారు. కిడ్నీ సమస్యతో గ్రామస్తులు చనిపోతుండడం వల్ల తాము కూడా చనిపోతామన్న ఆందోళనతో బతుకుతున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధితో గ్రామానికి చెందిన జడపల్లి రఘురామయ్య, బద్వేలు కృష్ణారెడ్డి, అనపల్లి శ్రీమరిరెడ్డి, జడపల్లి సురేంద్ర, బండి పోలయ్య, ఆవుల నరసయ్య, వానా బాలకృష్ణయ్య, అనబాక శంకరరెడ్డి, ఉప్పు జయరామయ్య, ఉప్పు రఘురామయ్య, ఉప్పు చెంగమ్మ, వెంకటరమణలు మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన పలువురు డయాలసిస్ కోసం నెల్లూరు, తిరుపతి పట్టణాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సుజల స్రవంతి పథకం ఏదీ మా గ్రామంలో కలుషిత నీటి వల్ల చాలా మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. సుజల స్రవంతి ద్వారా గతంలో హామీలు ఇచ్చిన పాలకులు నేడు ఆ పథకం ద్వారా తమకు సురక్షిత నీటిని అందించలేకపోతున్నారు. ఇప్పటికైనా తమ గ్రామంలో సురక్షిత నీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – జడపల్లి అపర్ణ గుక్కెడు తాగునీరు ఇవ్వాలి తమ గ్రామంలో మంచినీరు దొరకకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గుక్కెడు మంచినీటి కోసం ఎన్ని బోర్లు వేసిన ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఎన్నోసార్లు మంచినీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా వారు పట్టించుకోవడంలేదు. – పచ్చూరి కవిత రెండు మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు మన్నూరుతో పాటు నాయుడు కండిగ్ర చెరువు గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉండడంతో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కోరాను. ఆయన స్పందించారు. త్వరలో ఆ గ్రామాల్లో వాటర్ప్లాంట్లు ప్రారంభిస్తాం. పదేళ్లుగా సమస్య ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎంపీని ఆశ్రయించాం. – శింగంశెట్టి భాస్కర్‌రావు, ఎంపీపీ, బాలాయపల్లి -
కోళ్ల పరిశ్రమపై ఫ్లోరైడ్ దెబ్బ
ప్రకాశం, మార్కాపురం టౌన్: రైతులు వ్యవసాయం తరువాత ఎక్కువగా పాడి పరిశ్రమ, కోళ్ల ఫారాల నిర్వహణపై ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం జిల్లాలో కోళ్లఫారాల నిర్వహణ చేయలేక చేతులేత్తేస్తున్నారు. మార్కాపురం డివిజన్లో నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండటంతో కోళ్ల ఫారాల నిర్వహణ కష్టంగా ఉందని, ఈ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి నీరు వస్తే రైతులకు, వ్యాపారులకు కొంత మేర వ్యాపారం లాభసాటిగా మారవచ్చని పేర్కొంటున్నారు. వీటి నిర్వహణ కష్టతరంగా మారటం, ప్రకృతి నుంచి అవసరమైన సహకారం లేకపోవటం, నీటిలో ఫ్లోరిన్ శాతం ఉండటంతో కోళ్లకు రాడికల్ డిసీజెస్‌లో భాగంగా కొక్కెర వ్యాధులు వచ్చి భారీగా నష్టం వాటిల్లడం, కూలీల వేతనాల భారం, షెడ్లు, దాణా ఖర్చులు అధికం కావటంతో వీటి నిర్వహణపై ఆసక్తి కోల్పోతున్నారని పలువురు రైతులు పేర్కొంటున్నారు. డివిజన్లో బాయిలర్, లేయర్లు, నాటుకోళ్ల పెంపకం సుమారు 25 నుంచి 30 వరకు ఫారాలు ఉంటాయని పేర్కొంటున్నారు. దీనితో చికెన్ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి లైవ్ చికెన్ పేపర్ ధరను బట్టి కొనుగోలు చేసి విక్రయించుకుంటున్నారు. ఒక్క మార్కాపురం పట్టణంలోనే రోజుకు 600 నుంచి 1000వరకు, ఆదివారం వీటి సంఖ్య 5వేల వరకు కోళ్లను దిగుమతి చేసుకుని విక్రయాలు చేసుకుంటుంటారు. మరికొందరు చిన్నపాటి షెడ్లలో కోళ్లను నిల్వ ఉంచుకుని విక్రయానికి వినియోగించుకుంటుంటారు. కోళ్లఫారాల నిర్వహణ ఇలా... కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా షెడ్‌ను తయారు చేసుకోవాలి. లేకుంటే షెడ్‌ను సదరు యజమానులు కేజి కోడికి రూ.2 ప్రకారం ఎన్ని కోళ్లు పెంచుకుంటే అంత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కోళ్ల ఫారంలో కూలీలు జతకు నెలకు సుమారు 10వేల రూపాయల వరకు జీతంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విద్యుత్, నీటి సౌకర్యంకు వాడకాన్ని బట్టి చెల్లిస్తుంటారు. బాయిలర్ కోళ్లలో పిల్ల విక్రయం నుంచి కేజికి వచ్చే నాటికి దాణా, ఖర్చుల రూపంలో 80రూ వరకు వస్తుంది. దీని ప్రకారం 2కేజీల కోడి తయారయ్యేందుకు రైతుకు 160రూ ఖర్చు అవుతుంది. లేయర్లకు అయితే పిల్ల 30రూ ధర పలుకుతుండగా, గుడ్లకు వచ్చే వరకు 4నెలల 15రోజుల సమయం పడుతుంది. అప్పటి నుంచి ఏడాది కాలం వరకు పడుతుంది. గుడ్లు పెట్టే వరకు ఒక్కొక్క కోడిపై రూ.600 ఖర్చు వస్తుందని పేర్కొంటున్నారు. దీనితో మార్కెట్ ధరను బట్టి కోడి గుడ్ల ధర హెచ్చుతగ్గులు ఉండటంతో ఒక్కొక్కసారి లాభం, నష్టాలు రావచ్చని పేర్కొంటున్నారు. లేయర్ల పెంపకం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో 3 నుంచి 4సాగులో ఉన్నట్లు సమాచారం. గుడ్లకు వచ్చే దశలో ధర తగ్గితే రైతు ఆర్ధికంగా ఇబ్బందులు పడక తప్పదని పలువురు నిర్వాహకులు పేర్కొంటున్నారు. కోళ్లకు వచ్చే వ్యాధులతో తీవ్ర నష్టం.. కోళ్ల పెంపకంలో రైతు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండకపోతే వ్యాధులు సోకినప్పుడు భారీగా కోళ్లు చనిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోళ్లకు బ్యాక్టీరియా, వైరల్, ఫంగస్, విటమిన్, మినరల్స్ లోపించినా వ్యాధులు సోకే అవకాశం ఉంది. కోళ్లు తీసుకునే నీటిలో ఫ్లోరిన్ ఉంటే వాటర్ శానిటేషన్ వాడకుంటే క్రమణే కొక్కెరవ్యాధి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో అప్రమత్తం కాకపోతే కొక్కెరవ్యాధి వ్యాప్తి చెంది వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందే అవకాశం ఉంటుంది. కోడి పెంపకం నుంచి విక్రయించే వరకు రెండు సార్లు వ్యాక్సిన్లను వేయాల్సి ఉంటుంది. కోళ్ల నిర్వహణలో రైతుకు, వ్యాపారికి అనుభవం ఉంటే వీటి నిర్వహణ చేయాలంటే కష్టతరంగా ఉంటుంది. ఇలా కోళ్ల పెంపకాన్ని చేపట్టిన అనేక మంది రైతులు, వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయి కోళ్ల ఫోరాలు ఎత్తేసిన సంఘటనలు కూడ ఎక్కువగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి ఇలా... మార్కాపురంతో పాటు పరిసర ప్రాంతాల్లోని కోళ్ల వ్యాపారులు కోళ్లను ఆరోజు మార్కెట్ ధరను బట్టి కొనుగోలు చేస్తుంటారు. మార్కాపురం పరిసరాల్లో లభించే కోళ్లతో పాటు ఇతర ప్రాంతాలైన చిత్తూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. మరికొందరు అధిక మొత్తంలో కోళ్లను కొనుగోలు చేసి తాత్కాలికంగా షెడ్లలో నిల్వ ఉంచుకుంటుంటారు. -
పల్లెల్లో ఫ్లోరైడ్ భూతం
బజార్హత్నూర్(బోథ్): ఫ్లోరైడ్ మహామ్మరి గిరి గ్రామాలను వణికిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ వ్యాధి ప్రబలుతూ భయాందోళకు గురి చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి హెచ్చరించినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్లు పనిచేయకుండా పోతున్నాయి. దీంతో సమస్య పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు. ఫ్లోరైడ్‌తో పళ్లు రంగు మారుతున్నాయి. నల్లబారి వ్యాధి తీవ్రతను చూపుతున్నాయి. కొందరి పళ్లు గారలు పట్టడం, అరిగిపోవడం జరుగుతుంది. పుట్టిన పిల్లలకు ఎముకలు పెరగడం లేదు. కీళ్ల నొప్పులు, చిన్న దెబ్బకే ఎముకలు విరగడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్య ఏళ్ల తరబడి వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫ్లోరైడ్ ప్రభావానికి గురైన ఆ ఎనిమిది గ్రామాలు బజార్హత్నూర్ మండలంలోని చందునాయక్ తండా, మోర్కండి, ఏసాపూర్, గులాబ్‌తాండ, టెంబి, హర్కాయి, బోస్రా, భూతాయి(బి). వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో పైన పేర్కొన్న ఎనిమిది గ్రామాల్లో ఫ్లోరైడ్ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆయా గ్రా మాల్లో బోర్లను సీజ్ చేశారు. సరైన పద్ధతిలో నీటి వసతిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. పడకేసిన శుద్ధజల పథకం.. చందునాయక్ తండాను ఫ్లోరైడ్ బాధిత గ్రామంగా 2009లో గుర్తించారు. దీంతో గ్రామీణ నీటి పారుదల శాఖ(ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో రూ.10లక్షలతో హడావిడిగా శుద్ధజల ప్లాంటును ఏర్పాటు చేశారు. కాని నిర్వహణ లోపంతో అది కాస్త పని చేయకుండా పోయింది. గ్రామానికి సమీపంలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంలో గల కడెం వాగు ఒడ్డున వేసిన బోరు నిరుపయోగంగా మారింది. బోరు నుంచి శుద్ధజల ప్లాంట్ వరకూ పైపులైన్ వేయలేదు. దీంతో బోరును ఇతరులు సాగు నీటికి వినియోగిస్తున్నారు. తండాలో మొత్తం 2800 మంది జనాభాకు 60 శాతం మంది ఫ్లోరైడ్ బారిన పడిన వారే కావడం ఆందోళనకరం. ఇక్కడ మూడేళ్ల పాప నుంచి ముసలి వరకూ పళ్ళు నల్లబారి పోయి ఉంటాయి. శుద్ధజల పథకం గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గులాబ్ తండాలో స్వచ్ఛందంగా ప్లాంటు.. వంద శాతం గిరిజనులు గల గులాబ్ తండా గ్రామంలో ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన నిజామబాద్ జిల్లా డిచ్‌పెల్లి డీఎస్పీ రాథోడ్ దేవిదాస్ స్వంతంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షెడ్డు నిర్మాణం జరిగింది. త్వరలో మిషనరీలు ఏర్పాటు చేయనున్నారు. అందని ‘భగీరథ’ నీరు.. మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సైతం మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. ఈ నీరు అందితే కొంత మేర ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కలిగే అవకాశముంది. కాని ఇంకా అంతర్గత పైపులైన్ పనులు కూడా ప్రా రంభించలేదు. ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అంద డం వచ్చే ఏడాది కూడా అనుమానంగానే ఉంది. ఫ్లోరైడ్ బారి నుంచి కాపాడే మార్గం.. ప్రభుత్వ వైద్యుడు డా. హరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉన్న గ్రామాల పరిధిలో బోరు బావుల నీటిని వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఫ్లోరైడ్ రహిత గ్రామాల నుంచి తాగు నీటిని సరఫరా చేయాలి. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో నాగ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులు నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూషన్(ఎన్ఈఈఆర్ఐ) నీరీ పద్ధతి ద్వారా ఫ్లోరైడ్ బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఆ విధానం ఇక్కడ అమలు చేస్తే తప్పా ఫ్లోరైడ్ సమస్య తీరేలా లేదు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆ దిశగా ఆలోచించి ఈ ఎనిమిది గ్రామాల ప్రజలను ఫ్లోరైడ్ బాధ నుంచి తప్పించాల్సిన అవసరముంది. తాగునీటికి దూరభారమవుతుంది.. గులాబ్ తండాలో తాగు, సాగు నీటిలో ఫ్లోరైడ్ ఆనవాళ్ళు ఉన్నాయి. గతంలోనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మూడు బోర్లను సీజ్ చేశారు. కాని వాటికి ప్రత్యామ్నయం చూపించలేదు. దీంతో ఇతర అవసరాలకు ఈ నీటినే వాడుతున్నాం. తాగడానికి గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలోని ఇంద్రనగర్ నుంచి కాలి నడకన ప్రతిరోజు తెచ్చుకుంటున్నాం. దీంతో దూరభారం తప్పడం లేదు. – రాథోడ్ అశోక్, గులాబ్‌తండా నీరీ పద్ధతి అమలు చేయాలి బజార్హత్నూర్ మండలంలో చందునాయక్ తండా, మోర్కండి, ఏసాపూర్, గులాబ్‌తాండ, టెంబి, హర్కాయి, బోస్రా, భూతాయి(బి) ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుగా గుర్తించాం. ఈ గ్రామాల్లో చిన్న పిల్లలకు పాల పళ్ళ నుంచే ఫ్లోరైడ్ వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. నాగపూర్ ఎన్‌ఈఈఆర్‌ఐకు చెందిన విద్యార్థులు నీరీ పద్ధతి ద్వారా ఫ్లోరైడ్‌ను అరికట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. ఈ పద్ధతిలో ఫ్లోరైడ్ రహిత గ్రామల నుంచి నీటిని సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించాం. – డా.హరీష్, పీహెచ్సీ వైద్యుడు, బజార్హత్నూర్ -
పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి
-
డిండి..కదలదండి!
వంగిపోయిన నడుము.. వంకర కాళ్లు.. ఎటూ కదల్లేని దైన్యం.. వైద్యం చేయించుకోలని దుర్భర జీవితం.. ఎన్నాళ్లు బతుకుతామో కూడా తెలియని కష్టం.. ఇదీ పూర్వ నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితుల దుర్భర పరిస్థితి. ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపేలా కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వాటికి శంకుస్థాపనలు కూడా చేసింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టులు ఇంకా ప్రాథమిక దశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ అలైన్మెంట్ కూడా తేలలేదు పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల పరిధిలో ఫ్లోరైడ్ బాధిత మండలాలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకానికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ రెండున్నరేళ్లయినా ప్రాథమిక దశ కూడా దాటలేదు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతింటుందని మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రాజెక్టుపై సర్వే చేస్తున్న వ్యాప్కోస్ నిర్ణీ త గడువులో నివేదిక ఇవ్వకపోవడంతో అలైన్మెంట్ కూడా తేలలేదు. అయితే డిండికి దిగువన చేపట్టిన పనులు మాత్రం ఇప్పటికే మొదలై కొనసాగుతున్నాయి. మార్పులు, చేర్పులు.. వీడని చిక్కులు వాస్తవానికి డిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అంశమై అనేక మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. శ్రీశైలం వరద నీటిపై ఆధారపడుతూ చేపట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీటిని డిండికి తరలించేలా ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. నక్కలగండి వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 11 టీఎంసీలను మిడ్ డిండికి, డిండికి తరలించేలా డిజైన్ చేశారు. కానీ అధిక ఖర్చు దృష్ట్యా శ్రీశైలం నుంచే నేరుగా తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం శ్రీశైలం నుంచి ఓపెన్ చానల్, టన్నెళ్ల ద్వారా నీటిని ఎత్తిపోసి డిండికి తరలించేలా డిజైన్ చేశారు. ఇదే సమయంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా శ్రీశైలం నుంచే నీటిని తీసుకోవాలని నిర్ణయించడంతో.. డిండికి పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని యోచిస్తున్నారు. తర్వాత హైదరాబాద్ తాగునీటి అవసరాలు, రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు 30 టీఎంసీలు అవసరమని లెక్కించి.. మొత్తంగా 60 టీఎంసీలను డిండి ద్వారానే తరలించేందుకు కొత్త ప్రణాళిక తెరపైకి తెచ్చారు. తర్వాత ఏదుల కన్నా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుంటే నయమంటూ మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒడిదొడుకుల ఎస్ఎల్బీసీ ఇక శ్రీశైలం నుంచి 30 టీఎంసీలను తీసుకునేలా చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2004లో రూ.1,925 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా.. భూసేకరణ సమస్యలు, వరదలతో పనులు జాప్యమయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. అందులో శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సిన 43.89 కిలోమీటర్ల టన్నెల్లో.. ఇప్పటివరకు 30.46 కిలోమీటర్లు పూర్తయింది. మరో 13.46 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. దీనికి మరో మూడేళ్లు పట్టే అవకాశముందని అంచనా. ఈ దృష్ట్యా నక్కలగండి రిజర్వాయర్‌ను త్వరగా పూర్తిచేస్తే అప్పర్ డిండి నుంచి వచ్చే మిగులు జలాలను నిల్వ చేసుకునే అవకాశముందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపారు. -
రెండు దశల్లో మిషన్ భగీరథ
-
రెండు దశల్లో మిషన్ భగీరథ
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులను రెండు దశలుగా విభజించి తొలి దశను వచ్చే డిసెంబర్ చివరిలోగా.. రెండో దశను తర్వాత మరో ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా నీటి సరఫరా ప్రారంభించిన తర్వాత కొద్దినెలల పాటు పైపులైన్లు లీక్ కావడం, నీటి ఒత్తిడి తట్టుకోలేక పగలడం, వాల్వుల వద్ద సమస్యలు తలెత్తడం వంటి సహజమైన బాలారిష్టాలు ఎదురవుతాయని.. వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ పోవాలని సూచించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని 25 వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసి ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకునే పనిగా మిగిలిపోతుందని, ఇదో ఇంజనీరింగ్ అద్భుతమని పేర్కొన్నారు. 25 వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించే గొప్ప పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయనుండడం అందరికీ గర్వకారణమని చెప్పారు. నీతి ఆయోగ్‌తో పాటు అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని మెచ్చుకున్నాయని, తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి అధ్యయనం చేశాయని తెలిపారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి తొలుత తాగునీరు అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వీటిలో అక్టోబర్ చివరి నాటికే పైప్‌లైన్ పూర్తి చేసి.. అంతర్గత పనులను కూడా చేపట్టాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని గిరిజన తండాలు, దళితవాడలు, గోండు గూడేలన్నింటికీ మంచినీరు అందించాలని స్పష్టం చేశారు. ‘పాలేరు’కు ప్రత్యేక బృందం పాలేరు నియోజకవర్గం పరిధిలోని పాత వరంగల్ జిల్లా మండలాల్లో భగీరథ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని íసీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలేరు ద్వారా పాత వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 1,706 ఆవాస ప్రాంతాలకు నీరు అందించాలని ఆదేశించారు. వచ్చే రెండు నెలల్లో ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో ఓ ప్రత్యేక బృందం పాలేరు సెగ్మెంట్‌ను సందర్శించి పనులను సమీక్షించాలని సూచించారు. పరిశ్రమలకు కూడా తాగునీరు.. మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు కూడా శుద్ధి చేసిన నీటిని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తాగునీరు అవసరమున్న పరిశ్రమల నుంచి దరఖాస్తులు అహ్వానించాలని, వారికి ప్రత్యేకంగా పైపులైన్లు వేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు. మిషన్ భగీరథకు కేటాయించిన దాదాపు 80 టీఎంసీల నీటిలో పది శాతం (8 టీఎంసీలు) పరిశ్రమలకు అందించే వెసులుబాటు ఉందన్నారు. హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసం 10 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నందున.. అక్కడి నుంచి పరిశ్రమలకు నీరందించడం సాధ్యమవుతుందని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా మిషన్ భగీరథ ద్వారానే సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖకు అభినందన భగీరథ పనుల్లో విద్యుత్ శాఖ లక్ష్యానికి రెండు నెలల ముందే పనులు పూర్తి చేస్తోందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. దీనిపై జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 2 నాటికే పనులన్నీ పూర్తవుతాయని.. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తిచేసినట్లు సీఎంకు ప్రభాకర్‌రావు వివరించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలొస్తాయి.. భయపడొద్దు నీటి ప్రవాహ ఒత్తిడి వల్ల ప్రారంభంలో పైపులు లీకేజీ కావడం, వాల్వుల వద్ద లీకేజీల వంటి సమస్యలు తలెత్తుతాయని.. దాంతో భయపడిపోవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పథకం ప్రారంభమైన గజ్వేల్‌లో కూడా రెండు నెలల వరకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను సీఎం గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ సమస్య వస్తోందని అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా, సెగ్మెంట్ల వారీగా ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓహెచ్‌బీఆర్‌లు, పైపులైన్ల నిర్మాణం, ఎలక్ట్రో మోటార్ పనుల పురోగతిని సమీక్షించారు. మొత్తం 24,225 ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 3,431 గ్రామాలకు అందిస్తున్నామని.. అక్టోబర్ చివరి నాటికి మరో 5,443 గ్రామాలకు, నవంబర్ చివరి నాటికి ఇంకో 6,006 గ్రామాలకు, డిసెంబర్ చివరి నాటికి మిగతా 9,345 గ్రామాలకు అందిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పైపులైన్ల నిర్మాణంతో పాటు మోటార్లు బిగించే పనులు కూడా వేగంగా చేస్తున్నట్లు వివరించారు. -
రేణుక... గోల్డ్‌మెడలిస్ట్!
∙ వెన్నాడిన ఫ్లోరైడ్ భూతం ∙చదువుకు వెళ్లిన చోటల్లా అవమానాలు ∙కష్టాలను అధిగమించి పీజీ, బీఎడ్ చదివింది ∙యూనివర్సిటీ టాపర్‌గా బంగారు పతకం సాధించింది ∙వెక్కిరించిన నోళ్లే ఇప్పుడు వెరీగుడ్ అంటున్నాయ్.... ∙సర్కారు కరుణించాలంటున్న చదువుల తల్లి రేణుక... పసి ప్రాయంలోనే ఫ్లోరోసిస్ భూతం బారిన పడింది. వయస్సుకు తగ్గట్టుగా ఎదగలేకపోయింది. కనీసం నడవడానికి కూడా కాళ్లు సహకరించవు. కన్నవారికి భారమైనా కడుపుతీపి ఆమెను కాపాడింది. బిడ్డను కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులు ఆమె సంకల్పానికి ఊపిరినిచ్చారు. ఆమె చదువు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలెన్నింటినో ఎదుర్కొంటూనే బిడ్డ ఆశయానికి అండగా నిలిచారు. తల్లిదండ్రులు అందించిన ధైర్యంతో, వెక్కిరించిన విధిని, అవమానించిన సమాజాన్ని చాలెంజ్ చేసింది. తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది. ఎంఏ, బీఈడీ చదివిన రేణుక యూనివర్సిటీ టాపర్‌గా గోల్డ్‌మెడల్ అందుకుంది. ఉన్నత చదువులతో వెక్కిరించిన నోళ్లను మూయించింది. వారితోనే వెరీగుడ్ అనిపించుకుంది. కాని సర్కారు కొలువు దొరికితేనే తన సంకల్పం నెరవేరినట్టవుతుందని ఉద్యోగం కోసం తపిస్తోంది. సర్కారు కరుణ కోసం ఆరాటపడుతోంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరెపల్లి పంచాయతీ పరిధిలో గల ‘ఆరేడు’ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి–గంగ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు. వ్యవసాయంపైనే ఆధారపడ్డ ఆ కుటుంబం సాగునీటి వేటలో అనేక కష్టాలను ఎదుర్కొంది. అయితే లక్ష్మారెడ్డి కూతురు రేణుక చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడి ఇబ్బందులపాలైంది. కూతురికి వైద్యం చేయించడం కోసం తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోయింది. అయితే కూతురికి చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు కష్టాలెన్నింటినో ఎదుర్కొంటూ ఆమెకు ఉన్నత చదువులు చెప్పించారు. సొంత ఊరైన ఆరేడులో నాలుగో తరగతి వరకే ఉండడంతో అక్కడ నాలుగో తరగతి దాకా చదివింది. తరువాత ఐదు, ఆరు తరగతులు పక్క గ్రామమైన అచ్చంపేటలో చదువుకుంది. ఏడోతరగతి నుంచి పదోతరగతి వరకు నిజామాబాద్ పట్టణంలోని వివేకానంద హైస్కూల్లో చదివించారు. పదో తరగతిలో 400 మార్కులు సాధించింది. తరువాత ఇంటర్మీడియల్ మెదక్ పట్టణంలో చదివింది. 658 మార్కులు సంపాదించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధమైన ఆంధ్రమహిళా సభ కళాశాలలో డిగ్రీ చదివి కాలేజ్ టాపర్‌గా నిలిచింది. బీఈడీ కూడా అదే కళాశాలలో అభ్యసించింది. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన రేణుకకు గోల్డ్‌మెడల్ అందించారు. పీజీ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కూడా క్వాలిఫై అయ్యింది. కూతురి చదువు కోసం తల్లి ఆమె వెంటే ఉండేది. కూతురు ఎక్కడ ఉంటే అక్కడ తల్లి ఉండి ఆమెను చదువుకోసం తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగేది. తండ్రి అటు వ్యవసాయం చూసుకుంటూ పిల్లల చదువుల కోసం ఆరాటపడేవారు. తల్లిదండ్రులు తన కోసం పడుతున్న శ్రమను చూసిన రేణుక పట్టుదలతో ధైర్యాన్ని కూడగట్టుకుని మరీ ఉన్నత చదువులు పూర్తి చేసింది. చదువుల్లో ఏనాడూ వెనుకబడకుండా అందరికన్నా తనే ఎక్కువ మార్కులు సాధించే ప్రయత్నం చేసింది. ఆంధ్రమహిళా సభ కళాశాలలో బీఈడీ చదివిన రేణుక గోల్డ్‌మెడల్ కూడా సాధించిందంటే ఆమె పట్టుదలకు ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు. సర్కారు కరుణ కోసం.... ఎంఏ; బీఈడీ పూర్తి చేసిన రేణుక ఉద్యోగం కోసం ఎదురు చూస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్లు పడకపోవడంతో ఆమె ఆశయం నెరవేరడం లేదు. కనీసం ప్రభుత్వం తన పరిస్థితిని గుర్తించి ఏదైనా ఉద్యోగం ఇస్తే కుటుంబానికి ఆసరా అవుతానంటూ ఇటీవలే కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించింది. ఫ్లోరోసిస్ బారిన పడిన తను నిత్యం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. తల్లిదండ్రులు ఆమెకు అన్ని రకాల సేవలు చేస్తూ ధైర్యాన్నివ్వడం వల్లే ఆమె ఇంతదాక నెట్టుకువచ్చింది. అయితే ప్రభుత్వం తనకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది. సాధారణంగా వికలాంగులు ఏదో ఒక పనిచేసుకుని బతకగలుగుతారని, తాను పూర్తిస్థాయిలో ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నందున ఏ పనీ చేసుకునే పరిస్థితి లేదని, తనకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెంట ఉంటేనే బయటకు వెళ్లే పరిస్థితి ఉందని తెలిపింది. తనను ఆదుకోవాలని వేడుకుంటోంది రేణుక. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ఇంటిప్స్
గిన్నెలు తళతళ మెరవాలంటే తోమడానికి వాడే పొడికి గానీ, సబ్బుకి గానీ ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపాలి. వెనిగర్ గిన్నెలపై ఉండే జిడ్డుని వదలగొట్టి మెరిసేలా చేస్తుంది. ఫ్లోరైడ్ వాటర్ వల్ల షింక్‌లు, బకెట్ల అడుగు భాగంలో తెల్లగా గారపడుతుంటాయి. రెండు కప్పుల వెనిగర్‌ని ఒక గిన్నెలో పోసి సన్న మంట మీద పదినిముషాలు వేడిచేసి దానితో శుభ్రం చేస్తే ఎంత మొండి మరకలైనా ఇట్టే మాయమవుతాయి. -
వెలిగొండకు వెన్నుపోటు
► ప్రాజెక్టు పూర్తికి కావల్సింది రూ.2,800 కోట్లు ► తాజా బడ్జెట్లో రూ.200 కోట్ల మొక్కుబడి నిధులు విదిల్చిన సర్కారు మొదటి ఫేజ్ కే రూ.వెయ్యి కోట్లు అవసరం ► ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దశాబ్ద కాలం పట్టే పరిస్థితి ► 2018కే నీళ్లంటూ బాబు మాటల గారడీ వెలిగొండ ప్రాజెక్టుతోనే ప్రకాశం ప్రగతి ► నిధులివ్వకపోయినా పట్టించుకోని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వరుస కరువులకు.. మితిమీరిన ఫ్లోరైడ్‌తో కిడ్నీ వ్యాధి మరణాలకు.. వెలిగొండ ప్రాజెక్టుతో పెద్ద లింకే ఉంది. ఇక్కడి కరువు నుంచి జనం గట్టెక్కాలన్నా... కిడ్నీ వ్యాధి మరణాలు తగ్గాలన్నా... పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా... వెలిగొండ ప్రాజెక్టే ఏకైక దిక్కు. వ్యవసాయరంగానికి కావాలి్సన సాగునీరు, జనం దప్పిక తీర్చే తాగునీరు ఈ ప్రాజెక్టు వల్లే సాధ్యం. మోడువారిన పశ్చిమ ప్రకాశం కళకళలాడాలన్నా వెలిగొండతోనే సాధ్యం. మొత్తంగా ప్రకాశం జిల్లా మనుగడ వెలిగొండపైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పాలకులు చేస్తున్న హామీలు ఆచరణలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మిగిలి ఉన్న పనులను నిధులిచ్చి పూర్తి చేసిన పాపానపోలేదు. దీంతో వెలిగొండ నీరు జిల్లా వాసులకు అందనంత దూరంలోనే ఉండిపోతోంది. ప్రకటనల ప్రగల్బాలే.. వెలిగొండ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు వెచ్చించి తన హయాంలోని నీటిని పారిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది అవిగో నీళ్లు.. ఇదిగో ప్రాజెక్టు అంటూ మాటలతో సరిపెట్టడం తప్ప నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేటాయించలేదు. తాజాగా వెలిగొండను పూర్తి చేసి 2018 జూ¯ŒS నాటికి నీటిని విడుదల చేస్తామంటూ మరోమారు బాబు గొప్పలు చెప్పారు. వెలిగొండ మన హయాంలో పూర్తి చేస్తామని ఈ విషయాన్ని జిల్లావ్యాప్తంగా ప్రచారం చేసుకోండంటూ విజయవాడలో జరిగిన టీడీపీ జిల్లా సమీక్షా సమావేశంలోనూ ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పారు. ఇది జరిగి పట్టుమని 10 రోజులు కాకుండానే తాజా బడ్జెట్లో వెలిగొండకు కేవలం రూ.200 కోట్లు కేటాయించి మరోమారు ఈ ప్రాజెక్టుపై బాబు వివక్ష చూపారు. ప్రాజెక్టు పూర్తి కావటానికి తాజా అంచనాల ప్రకారం మరో రూ.2,800 కోట్లు అవసరం. చంద్రబాబు చెప్పినట్లు ఫేజ్–1 పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేయటానికి కూడా వెయ్యి కోట్ల రూపాయల వరకు అవసరం. కానీ బడ్జెట్లో బాబు సర్కారు కేటాయించింది మాత్రం రూ.200 కోట్లే. ఈ లెక్కన మరో 15 ఏళ్లకు కూడా ప్రాజెక్టు పూర్తి కాదని బాబు చెప్పకనే చెప్పారు. వెలిగొండకు సర్కారు నిధులు కేటాయించకపోయినా... జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం గమనార్హం. జిల్లా అభివృద్ధికి వెలిగొండే ఆధారం జిల్లాలోని వ్యవసాయ రంగమే కాదు.. పారిశ్రామిక రంగం సైతం వెలిగొండ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని సాక్షాత్తు పారిశ్రామికవేత్తలే చెబుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే దొనకొండ పారిశ్రామికవాడ, కనిగిరి నిమ్జ్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. వెలిగొండ నీరు లేకపోతే ఏ ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. అంటే జిల్లాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేనట్లే! చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొక్కుబడి నిధులను మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకు రూ.700 కోట్లు ఇచ్చినట్లు సర్కారు లెక్కలు చెబుతున్నా కనీసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నిర్మాణ పనులకు రూ.25 కోట్లకుపైనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సకాలంలో నిధులివ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సైతం ఆపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టన్నెల్–1, 2 పనులను ఇరువైపుల చేపడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభిస్తున్నామన్నారు. తీరా బడ్జెట్లో చూస్తే సర్కారు రూ.200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు వెలిగొండ పనులను వేగవంతం చేసే పరిస్థితి కనిపించటం లేదు. ఫ్లోరైడ్ పీడకు వెలిగొండే విరుగుడు.. జిల్లాలో ఫ్లోరైడ్ శాతం తీవ్ర స్థాయికి చేరింది. 15 శాతం ఫ్లోరైడ్ ఉన్న గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 2,200 హాబిటేషన్లు ఉండగా 1200 హాబిటేషన్లలో ఫ్లోరైడ్ అధికంగా ఉంది. దీంతో ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్ర స్థాయికి చేరింది. తద్వారా కిడ్నీ వ్యా«ధితో జనం మృత్యువాత పడుతున్నారు. గత రెండేళ్లలోనే 427 మంది మరణించారు. వందలాది మంది మరణానికి దగ్గరగా ఉన్నారు. వేలాది మంది వ్యాధికి గురయ్యారు. రక్షిత మంచినీరు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. వెలిగొండ పూర్తయి కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్ తగ్గుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ తీవ్రత, కిడ్నీ వ్యాధి మరణాలు వివరాలను ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ బారి నుంచి జిల్లా వాసులను రక్షించాలని ఆయన కోరుతున్నారు. వ్యాధి తీవ్రతకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి నడ్డాకు వివరించారు. అయినా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందరీ ఆశలు వెలిగొండపైనే ఉన్నాయి. కానీ నిధుల కేటాయింపులు చూస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించటం లేదు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయకపోతే ఇప్పటికే ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్పందించి, వెలిగొండ ప్రాజెక్టుకు అధికంగా నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి్సన అవసరం ఉంది. 2018 నాటికైనా ప్రాజెక్టును పూర్తి చేయించి నీటిని విడుదల చేయించేందుకు కృషి చేసి, కరువు జిల్లాను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి. -
‘ఫ్లోరైడ్ సమస్య’పై ఏం చేస్తున్నారో చెప్పండి
సర్కార్‌ను ఆదేశించిన హైకోర్టు.. నోటీసులు జారీ సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, నల్లగొండ జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరడంతోపాటు, ప్రజలకు రక్షిత నీరు అందేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నల్లగొండకు చెందిన కె.ఎస్.ఎస్.యశస్వి, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్‌గా యశస్వి వాదనలు వినిపిస్తూ, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి వివరించారు. ఈ సమస్య నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇది ఇప్పటి సమస్య కాదని, ఎప్పటి నుంచో ఉందని చెప్పింది. ప్రతివాదులుగా ఉన్న పలుశాఖల ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఊగిసలాటలో ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం
ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలో ఫ్లోరైడ్‌ను తరిమికొట్టేందుకు గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 2012 నవంబర్‌లో రూ. 10 కోట్లను మంజూరు చేసింది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటు చేస్తున్న పరిశోధనా కేంద్రానికి ఇప్పటికే స్థలం కేటాయించారు. నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు. ఈ కేంద్రం ఏర్పాటైతే తొమ్మిది రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతోపాటు మంజూరైన గుజరాత్ రాష్ట్రంలోని పరిశోధన కేంద్రంలో పనులు ప్రారంభమయ్యాయి. దండుమల్కాపురం కేంద్రంలో పనులు ప్రారంభంకాకపోవడంతో అసలు ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటు అవుతుందా అనే అనుమానం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. ► చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటుకు నిర్ణయం ► రూ. 100-–250 కోట్లతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ► తాత్కాలికంగా రూ.10 కోట్లు కేటాయింపు ► పూర్తి స్థాయి నిధుల రాక ప్రారంభం కాని పనులు చౌటుప్పల్ : ఫ్లోరోసిస్ వ్యాధి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది నల్లగొండ జిల్లా. అందులో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం. ఇక్కడి ఫ్లోరైడ్ శాతం ప్రపంచంలోకెల్లా అత్యధికమని ఎన్నో సంవత్సరాలు చేసిన పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. ఫ్లోరైడ్ వ్యాధి, వ్యాధిగ్రస్తులకు చేపట్టాల్సిన చర్యలపై సంవత్సరాల పాటు పరిశోధనలు జరిగాయి. ఫ్లోరైడ్పై పాలకుల తీరును నిరసిస్తూ భాధితులు, స్వచ్ఛంద సంఘాల అధ్వర్యంలో జాతీ య స్థాయి ఉద్యమాలు సైతం జరిగాయి. దశాబ్దాల పోరా టం ఫలితంగా 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వ్యాధి నివారణకు, వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్సలను అందించాలని భావించింది. అందులో భాగం గా ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రం నీటి, శానిటేషన్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే రెండు ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు 2012 నవంబర్ నెలలో అధికారిక మంజూరు ఇచ్చింది. వీటిలో ఒకటి గుజ రాత్ రాష్ట్రంలో, రెండోది తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఏర్పాటుకు నిర్ణయించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక అవసరాల నిమిత్తం ఒక్కొ కేంద్రానికి రూ. 10కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఇది జరిగి నాలుగేళ్లు గడిచినా ఎలాంటి పురోగతి లేదు. ఈ ప్రాజెక్ట్ ఇక్కడే ఉంటుందో లేక వేరే రాష్ట్రానికి తరలిపోతుందో తెలియక ప్రస్తుతం ఊగిసలాట నెలకొంది. రూ.100–250 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదన హైదరాబాద్‌కు సమీపంలో, విజయవాడ జాతీయ రహదారి కలిగి ఉండడం మూలంగా ఈ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం దండుమల్కాపురం గ్రామంలో ఏర్పాటుకు దోహదపడింది. ఇందుకోసం 65వ నంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న 486 సర్వే నంబరులో 7 ఎకరాలను ప్రభుత్వం కేటాయించి ఇప్పటికే ఆసంస్థకు అందజేసింది. స్థల కేటాయింపులో మొదట్లో కొంత వివాదం నెలకొన్నా స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో సద్దుమణిగింది. రూ.100-–250 కోట్ల వ్యయంతో ఈ కేం ద్రాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని భావించా రు. భూమి కేటాయించి రెండేళ్లు కావొస్తున్నా కేంద్రం నిధు లు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. దేశవ్యాప్త ప్రయోజనాలకు రూపకల్పన తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఈ పరిశోధనా కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. తెలంగాణలోని కేంద్రం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు సేవలు అందనున్నాయి. గుజరాత్ కేంద్రం ద్వారా మిగిలిన రాష్ట్రాలకు సేవలు అందనున్నాయి. తెలంగాణ పనులను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(జాతీయ పోషకాహార సంస్థ)కు, గుజరాత్ బాధ్యతలను గుజరాత్ జల్సేవా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు అప్పగించారు. వ్యాధిగ్రస్తులకు సూపర్‌స్పెషాలిటీ వైద్యం ఈ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాలకు అనుసంధానంగా అదే ప్రాంగణంలో అన్ని హంగులతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. ఫ్లోరోసిస్‌పై పరిశోధనలతోపాటు వ్యాధిగ్రస్తులకు అన్నిరకాల వైద్య సేవలు అందించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 965 గ్రామాల్లో, 3327 ఆవాసాల్లో ఫ్లోరైడ్ శాతం 7.0శాతం ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ గుర్తించింది. ఆ ప్రకారంగా ఆయా గ్రామాలకు చెందిన వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం ఇక్కడికి వచ్చేవారు. కాళ్లు, చేతులు వంకర్లుపోయి కదల్లేక , మెదల్లేక ఇబ్బందులకు గురయ్యే భాదితులకు కొత్త జీవితం లభించేది. నిధుల విడుదలకు తెలియని కారణాలు ఒక్కో కేంద్రం ఏర్పాటుకు ముందుగా రూ.100కోట్ల చొప్పు న కేటాయించాల్సి ఉంది. పనులు కొనసాగుతుంటే అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేయాలని నిర్ణయిం చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టే విషయంలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామనే ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పట్ల కేంద్రం ఎందుకు స్పందించడం లేదో తెలియక స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో మాత్రం పనులు ప్రారంభం కావడం గమనార్హం. ఎక్కడికీ పోనివ్వం ఈ కేంద్రాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికీ పోనివ్వం. ఇక్కడ ఏర్పాటు చాలా అవసరం. కేంద్రం నిధులు విడుదల చేస్తే సరిపోతుంది. నిధులు లేకనే పనులు ప్రారంభం కావడం లేదు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సైతం తీసుకెళ్లాం. – కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం ఈ విషయాన్ని ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. త్వర గా నిధులు విడుదల చేయాలని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం సైతం సమస్యను కేం ద్రానికి వివరించింది. త్వరలో నిధులు విడుదల అవుతాయని ఆశిస్తున్నాం. – బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎంపీ -
ఫ్లోరైడ్ బాధిత గ్రామాలను ఆదుకోండి
– ప్రస్తుత బడ్జెట్లోనే నిధులు కేటాయించండి – ఆర్థికమంత్రి అరుణ్ జెట్లీని కోరిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఫోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీటి వసతి కల్పించాలని ఎంపీ బుట్టా రేణుక బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీని కోరారు. కోడుమూరుకు రూ. 56.70 కోట్లు, మంత్రాలయానికి రూ. 30 కోట్లు, ఆస్పరి, దేవనకొండ, ఆలూరులకు రూ. 90 కోట్లు, ఎమ్మిగనూరు (గోనెగండ్ల)కు రూ. 140 కోట్లు, పత్తికొండ, మద్దికెర, తుగ్గలిలకు రూ. 105 కోట్లు, ఆదోని, కౌతాళంలకు రూ. 105 కోట్ల మేరకు నిధులు అవసరమవుతాయని ప్రతిపాదించారు. ఆయా గ్రామాలకు ప్రస్తుత బడ్జెట్లో ప్రకటించిన విధంగా వివిధ ప్రపంచ బ్యాంకు పథకాల ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు అందజేయాలని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు కూడా ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. -
తోమర్ జీ ధన్యవాదాలు: వైవీ సుబ్బారెడ్డి
కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ(లోక్‌సభ) వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఓ లేఖను రాశారు. దేశంలోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని అందుకు తగిన నిధులను ఈ బడ్డెట్లో కేటాయించేలా చూడాలని తాను తోమర్‌ను కోరినట్లు చెప్పారు. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకం కింద ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటి సరఫరాను చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లాలో గల 56 మండలాల్లో 48 మండలాలు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలేనని లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రితో ఈ విషయంపై చర్చించినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను కూడా ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారని తెలిపారు. తప్పకుండా ఫ్లోరైడ్ ప్రాంతాల ప్రజలకు తాగునీటి సదుపాయం కల్సిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన 48 మండలాలను బడ్జెట్లో ప్రకటించిన 28 వేల ప్రాంతాల్లో పరిగణించాలని కోరారు. -
వదలని పీడ!
ఫ్లోరైడ్ బారి నుంచి కనిగిరి వాసులకు విముక్తి ఎప్పుడో.. ♦ వాడుకకూ పనికిరాని భూగర్భ జలాలు ♦ 124 గ్రామాలకు అందని సాగర్ జలాలు ♦ ముందుకు సాగని కుడికాల్వ రెండో దశ పనులు ♦ రక్షిత మంచినీటి పథకానికి గ్రహణం ♦ రెండేళ్లుగా నిలిచిన రూ.88 కోట్ల నిధులు ♦ అమలు కాని సీఎం చంద్రబాబు హామీలు ♦ నిధుల సాధనలో నాయకుల వైఫల్యం ‘ఇక్కడి భూమిలో నీరు 40 అడుగుల లోతు దాటితే తాగేందుకు పనికిరాదు. ఫ్లోరైడ్ తీవ్రంగా ఉందని నివేదికలున్నాయి. భూగర్భ జలం తాగొద్దు.. మీకు వెలిగొండ, సాగర్ జలాలు అందిస్తా.. ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తా’.. - గతేడాది శీలంవారిపల్లి సభలో కనిగిరి వాసులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ కనిగిరి ప్రాంతంలోని భూగర్భ జలాలు తాగేందుకు కాదు కదా.. కనీసం వాడుకునేందుకు కూడా పనికిరావు. ఇక్కడ పండించిన కూరగాయలు, పండ్లు సైతం వాడరాదు. వాటిలో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉంది. టూత్ పేస్ట్ సైతం ప్రత్యేకమైనది ఉండాల్సిందే.. పారుదల నీటితోనే ఫ్లోరైడ్ నుంచి విముక్తి. - జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్ చెప్పిన మాటలు కనిగిరి: కనిగిరి ప్రాంతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఫ్లోరైడ్. ఎటు చూసిన ఫ్లోరోసిస్ బాధితులే కనిపిస్తారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడా శాశ్వత నీటి వనరులు లేవు. ఆరు మండలాల్లోని 135 పంచాయతీల పరిధిలో ఉన్న 467 గ్రామాలకూ వర్షపు నీరు, భూగర్భజలాలే దిక్కు. ఈ ప్రాంతం నుంచి కాలువ నీరు పారాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి. అప్పుడే కనీసం నాలుగు మండలాలకు తాగు, సాగు నీరు లభిస్తుంది. సాగర్ కుడి కాలువ రెండో దశ పనులు చేపడితే నియోజకవర్గానికి తాగు, సాగు నీటి సమస్య తీరుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కాలువ కురిచేడు వరకు వచ్చింది. 59 కిలో మీటర్లు కాలువను పొడిగిస్తే కనిగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో తాగు నీటితో పాటు 6 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడి భూ గర్భ జలాలు తాగేందుకు కాదు కదా కనీసం వాడుకకు కూడా పనికిరావని వైద్యాధికారులు ధ్రువీకరిస్తున్నా ప్రజలకు రక్షితనీరు అందించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే సొంత మండలంలోనూ అదే తీరు.. ఫ్లోరోసిస్ బాధ నుంచి కనిగిరి ప్రజలకు విముక్తి కల్గించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రూ.175 కోట్లతో కనిగిరి రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. మొదటి విడత రూ.91 కోట్ల నిధులు విడుదల చేశారు. తిరిగి రెండోవిడత నిధులు కూడా రూ.61 కోట్లు మంజూరై పనులు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో పథకానికి గ్రహణం పట్టింది. దీంతో రెండేళ్ల నుంచి మూడో విడత నిధులు రూ.88 కోట్లు రాలేదు. ప్రస్తుతం దాని వ్యయం రూ.100 కోట్లకు పెరిగినట్లు తెలిసింది. నిధుల సాధనకు ప్రభుత్వంపై వత్తిడి తేవడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యూరనే విమర్శలున్నాయి. ఫలితంగా నియోజకవర్గంలోని 124 గ్రామాల్లో రామతీర్థం ప్రాజెక్టు నీటి సరఫరా లేదు. ఎమ్మెల్యే సొంత మండలంలో ఒక్క గ్రామానికి కూడా సాగర్ జలాలు ఇవ్వలేని దుస్థితి. ఫ్లోరైడ్ శాతం 5 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) నుంచి 7పీపీఎం వరకు ఉందని గత ఏడాది శీలంవారి పల్లెలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సెలవిచ్చారు. వెలిగొండ, సాగర్ జలాలు అందించడం ద్వారా ఇక్కడి ప్రజలను ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తానని వాగ్దానాలు చేశారు. కనీసం రక్షిత పథకానికి మూడో విడత అందించాల్సిన రూ.88 కోట్లు కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం.