GMR Infrastructure
-
ఖో–ఖో లీగ్‌లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు
సాక్షి, హైదరాబాద్: మరో గ్రామీణ క్రీడకు కార్పొరేట్ సంస్థలు వెన్నుదన్నుగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ప్రొ కబడ్డీ అద్భుతమైన ఆదరణ చూరగొనగా... ఖో ఖో కూడా అల్టిమేట్ ఖో ఖో (యూకేకే) పేరుతో ఫ్రాంచైజీ టోర్నీగా మనల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. దీంట్లో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ జీఎంఆర్ గ్రూప్, గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్‌లు భాగమయ్యాయి. తమ సొంత రాష్ట్రాలకు చెందిన జట్లను ఈ రెండు కార్పొరేట్ సంస్థలు దక్కించుకున్నాయి. జీఎంఆర్‌కు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ, ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధ జట్టు ఉన్నాయి. జీఎంఆర్ స్పోర్ట్స్ తెలంగాణ ఫ్రాంచైజీని... అదానీ స్పోర్ట్స్‌లైన్ గుజరాత్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయని యూకేకే ప్రమోటర్, డాబర్ గ్రూప్ చైర్మన్ అమిత్ బర్మన్ వెల్లడించారు. క్రీడల్లోనూ భారత్ అగ్రగామిగా అవతరించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నామని, గ్రామీణ క్రీడలైన కబడ్డీ, రెజ్లింగ్, ఖో ఖోలకు మరింత ఆదరణ పెరిగేందుకు దోహదం చేస్తామని జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. అల్టిమేట్ ఖో ఖో (యూకేకే) బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల్ని సోనీ సంస్థ దక్కించుకుంది. సోనీ టీవీ చానెళ్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సోనీ లివ్’లో యూకేకే పోటీలు స్ట్రీమింగ్ కానున్నాయి. చదవండి:SL vs AUS: శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్‌వెల్ మాయ చేస్తాడా..? -
తగ్గిన జీఎంఆర్ నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జూన్ త్రైమాసి కం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.318 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.834 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ రూ.1,224 కోట్ల నుంచి రూ.1,897 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి రూ.2,331 కోట్లకు ఎగబాకాయి. ఎయిర్‌పోర్టుల ఆదాయం రూ.494 కోట్ల నుంచి రూ.898 కోట్లుగా ఉంది. విద్యుత్ విభాగం ఆదాయం రూ.300 కోట్ల నుంచి రూ.446 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర శుక్రవారం 0.89 శాతం తగ్గి రూ.27.90 వద్ద స్థిరపడింది. -
జీఎంఆర్‌కు స్టాక్ ఎక్స్ఛేంజీల అనుమతి
ముంబై, సాక్షి: మౌలిక రంగ హైదరాబాద్ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలకు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కోసం చేసిన ప్రతిపాదనలకు ఎక్స్ఛేంజీలు ఆమోదించినట్లు జీఎంఆర్ తాజాగా వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానాశ్రయేతర బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలపట్ల ఎలాంటి అభ్యంతరాలూ లేవని ఎక్స్ఛేంజీలు పేర్కొన్నట్లు జీఎంఆర్ తెలియజేసింది. దీంతో ఈ ప్రతిపాదనలపై ఆరు నెలల్లోగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతిపాదనల్లో భాగంగా కంపెనీ జీఎంఆర్ పవర్ ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా తదితరాకు సంబంధించి విలీనం, సర్దుబాట్లు తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో కంపెనీ వ్యూహాత్మక రీస్ట్రక్చరింగ్ ప్రణాళికలకు తెరతీసిన విషయం విదితమే. కాగా.. కార్పొరేట్ హోల్డింగ్ స్ట్రక్చర్‌ను సులభతరం చేసేందుకు వీలుగా ఎయిర్పోర్ట్యేతర బిజినెస్‌ను విడదీయనున్నట్లు ఇప్పటికే కంపెనీ తెలియజేసింది. (మార్కెట్ల పతనం- ఫార్మా షేర్ల జోరు) -
అరబిందో రియల్టీ చేతికి జీఎంఆర్ కాకినాడ సెజ్
ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరిలో గల కాకినాడ సెజ్ లిమిటెడ్(కేఎస్ఈజెడ్)ను అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు విక్రయిస్తున్నట్లు మౌలిక రంగ హైదరాబాద్ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా వెల్లడించింది. అనుబంధ సంస్థ జీఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్ హోల్డింగ్ ద్వారా కేఎస్‌ఈజెడ్‌లో తమకుగల 51 శాతం వాటాను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువ రూ. 2,610 కోట్లుకాగా.. తొలి దశలో రూ. 1,600 కోట్లను అందుకోనున్నట్లు తెలియజేసింది. తదుపరి రెండు, మూడేళ్లలో రూ. 1,010 కోట్లు లభించనున్నట్లు వివరించింది. డీల్‌లో భాగంగా కేఎస్‌ఈజెడ్‌లో వాటాతోపాటు.. కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌లో కేఎస్ఈజెడ్కు గల 100 శాతం వాటాను సైతం అరబిందో రియల్టీకి బదిలీ చేయనున్నట్లు వివరించింది. షేరు జూమ్ కేఎస్ఈజెడ్ విక్రయానికి అరబిందో రియల్టీతో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో జీఎంఆర్ ఇన్ఫ్రా కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 23.25 వద్ద ఫ్రీజయ్యింది. పోర్ట్ ఆధారిత మల్టీ ప్రొడక్ట్ ప్రత్యేక ఆర్థిక మండలిగా కేఎస్ఈజెడ్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
జీఎంఆర్‌కు రూ.1,127 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.1,127 కోట్ల నష్టం చవిచూసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.2,353 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.1,994 కోట్ల నుంచి రూ.2,349 కోట్లకు చేరింది. ఎబిటా రూ.655 కోట్లుగా ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,198 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.3,466 కోట్ల నష్టం పొందింది. టర్నోవరు రూ.7,576 కోట్ల నుంచి రూ.8,556 కోట్లకు చేరింది. ఎయిర్‌పోర్టుల ఆదాయం నాల్గవ త్రైమాసికంలో రూ.1,582 కోట్లు, ఆర్థిక సంవత్సరంలో రూ.6,191 కోట్లు నమోదైంది. -
జీఎంఆర్ చేజారిన నాగ్‌పూర్ విమానాశ్రయ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మరో ఎదురుదెబ్బ. కంపెనీ గతేడాది దక్కించుకున్న నాగ్‌పూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టు కాంట్రాక్టును మిహాన్ ఇండియా రద్దు చేసింది. జీఎంఆర్ కాంట్రాక్టును రద్దు చేశామని మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ ఎండీ అనిల్ పాటిల్ తెలిపారు. తిరిగి టెండర్ల ప్రక్రియను త్వరలో మొదలుపెడతామని చెప్పారు. కాగా, కరోనా ఎఫెక్ట్‌తో జీఎంఆర్ కమలాంగ ఎనర్జీ డీల్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. జీఎంఆర్ కమలాంగ ఎనర్జీని రూ.5,321 కోట్లకు దక్కించుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేర్ పర్చేజ్ ఒప్పందం జీఎంఆర్‌తో చేసుకున్న సంగతి తెలిసిందే. -
జీఎంఆర్‌లో ఫ్రాన్స్ సంస్థకు వాటాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ ఏడీపీ తమ ఎయిర్పోర్ట్ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 10,780 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) విలువ సుమారు రూ. 22,000 కోట్లుగా ఉండనుంది. నిర్దిష్ట మైలురాళ్లను సాధించిన పక్షంలో మరో రూ. 4,475 కోట్లు లభించగలవని, దీంతో మొత్తం వేల్యుయేషన్ రూ. 26,475 కోట్ల స్థాయిలో ఉండగలదని జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. డీల్ ప్రకారం జీఎంఆర్ గ్రూప్ నుంచి రూ. 9,780 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయనున్న గ్రూప్ ఏడీపీ.. మరో రూ. 1,000 కోట్లు ఈక్విటీ కింద జీఏఎల్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. ‘తొలి విడతలో రూ. 5,248 కోట్లు తక్షణమే జీఎంఆర్ గ్రూప్‌కు లభిస్తాయి. రుణభారాన్ని మరింత తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నాం‘ అని జీఎంఆర్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగంపై జీఎంఆర్‌కు నియంత్రణ కొనసాగుతుంది. ఏడీపీకి జీఏఎల్,కీలక అనుబంధ సం స్థల బోర్డుల్లో ప్రాతినిధ్యం, ఇతర హక్కులు లభిస్తాయి. మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశించేందుకు గ్రూప్ ఏడీపీతో భాగస్వామ్యం దోహదపడగలదని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు. మరోవైపు, తమ వ్యూహంలో భాగంగానే జీఏఎల్‌లో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్రూప్ ఏడీపీ చైర్మన్ అగస్టిన్ డి రొమానెట్ పేర్కొన్నారు. 33.6 కోట్ల ప్రయాణికులు.. జీఏఎల్, గ్రూప్ ఏడీపీ కలిసి 2019లో దాదాపు 33.65 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసినట్లు జీఎంఆర్ పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని వివరించింది. గ్రూప్ ఏడీపీ సంస్థ.. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. ప్యారిస్‌లోని చార్లెస్ డి గాల్, ఒర్లి మొదలైనవి వీటిలో ఉన్నాయి. రూ.1,075 కోట్లు సమీకరించిన జీఎంఆర్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అనుబంధ కంపెనీ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. సీనియర్ సెక్యూర్డ్ నోట్స్ జారీ ద్వారా రూ.1,075 కోట్లు సమీకరించినట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. -
తగ్గిన జీఎంఆర్ నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.279 కోట్లకు తగ్గాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నష్టాలు రూ.542 కోట్లు. మరోవైపు స్థూల ఆదాయాలు రూ.1,958 కోట్ల నుంచి రూ. 2,196 కోట్లకు పెరిగాయి. కీలకమైన ఎయిర్‌పోర్ట్స్ విభాగం ఆదాయాలు రూ. 1,358 కోట్ల నుంచి రూ. 1,615 కోట్లకు, విద్యుత్ విభాగం ఆదాయాలు రూ.146 కోట్ల నుంచి రూ.207 కోట్లకు పెరిగినట్లు జీఎంఆర్ వెల్లడించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సామర్థ్యాన్ని 1.2 కోట్ల నుంచి (వార్షికంగా) 3.4 కోట్లకు పెంచే దిశగా విస్తరణ పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని పేర్కొంది. క్యూ3లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ట్రాఫిక్ 55 లక్షల నుంచి 9 శాతం వృద్ధితో 59 లక్షలకు చేరగా, ఢిల్లీ విమానాశ్రయంలో 6 శాతం పెరిగి 1.87 కోట్లకు చేరినట్లు తెలిపింది. -
గ్రీస్ విమానాశ్రయం ప్రాజెక్ట్ జీఎంఆర్ చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) గ్రీస్ క్రీట్లోని హెరాక్లియోన్ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్, ఆపరేషన్, నిర్వహణ బిడ్‌ను దక్కించుకుంది. దీంతో యూరోపియన్ ఎయిర్పోర్ట్ నిర్వహణ బిడ్ గెలిచిన తొలి భారతీయ ఎయిర్పోర్ట్ ఆపరేటర్‌గా జీఎంఆర్ నిలిచింది. జీఏఎల్, దాని గ్రీస్ భాగస్వామి జీఈకే టెర్నా కన్సార్టియం గతేడాది ఫిబ్రవరిలో కన్సెషన్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయ అభివృద్ధికి ఈ కన్సార్టియం 500 మిలియన్ యూరోలకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ ఎనర్జీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాలా మాట్లాడుతూ.. హెరాక్లియోన్ విమానాశ్రయ బిడ్‌తో జీఎంఆర్ గ్రూప్ ఈయూ రీజియన్‌కు ఎంట్రీ ఇచ్చినట్లయిందన్నారు. ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తామని చెప్పారు. ప్రాజెక్ట్ కన్సేషన్ పీరియడ్ 35 ఏళ్లు. ఈ ప్రాజెక్ట్‌కు స్థానిక గ్రీస్ ప్రభుత్వం ఈక్విటీ, ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్ట్స్ నుంచి నిధులను సమకూరుస్తుంది. హెరాక్లియోన్ గ్రీస్‌లోని రెండో అతిపెద్ద విమానాశ్రయం. గత మూడేళ్లుగా 10 శాతం ట్రాఫిక్ వృద్ధిని నమోదు చేస్తుంది. ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో గ్రీస్ ఒకటి. ఏటా 33 మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. క్రిట్ అత్యధిక పర్యాటకులను ఆకర్షించే ద్వీపం. -
జీఎంఆర్‌కు పెరిగిన నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు మరింత పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం సెపె్టంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.457 కోట్ల నికర నష్టం ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.334 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవరు రూ.1,904 కోట్ల నుంచి రూ.2,018 కోట్లకు చేరింది. ఎయిర్‌పోర్టుల విభాగం ఆదాయం రూ.1,315 కోట్ల నుంచి రూ.1,494 కోట్లకు పెరిగింది. విద్యుత్ విభాగం టర్నోవరు రూ.178 కోట్ల నుంచి రూ.167 కోట్లకు చేరింది. సెపె్టంబరు క్వార్టరులో ఢిల్లీ విమానాశ్రయంలో ప్యాసింజర్ ట్రాఫిక్ 1.73 కోట్లు నమోదు చేసింది. జూన్ త్రైమాసికంతో పోలిస్తే 10% వృద్ధి చెందింది. 2019–20 జూలై–సెపె్టంబరు కాలంలో ఈ విమానాశ్రయం రూ.135 కోట్ల లాభం ఆర్జించింది. 2018–19 క్యూ2లో ఇది రూ.88 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంతో పోలిస్తే ఈ సెప్టెంబరు క్వార్టరులో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 3 శాతం వృద్ధితో 54 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ ఎయిర్పోర్ట్ రూ.217 కోట్ల లాభం ఆర్జించింది. -
జీఎంఆర్‌కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: విద్యుత్, మౌలికరంగం, విమానయానం వంటి వివిధ రంగాల్లో ఉన్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 2018–19 4వ త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఏకంగా రూ.2,341 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కొన్ని విద్యుత్ ఆస్తుల విలువ క్షీణించడం వల్ల ఈ స్థాయి నష్టాలను ఎదుర్కొన్నట్టు కంపెనీ తెలియజేసింది. జీఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ (జీసీఈఎల్), దీని సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లలో కంపెనీ పెట్టుబడుల విలువ క్షీణించడం వల్ల రూ.1,242 కోట్ల మేర నష్టాలు వచ్చినట్టు వెల్లడించింది. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ లిమిటెడ్‌కు సంబంధించి రూ.969 కోట్ల నష్టం కూడా తోడైంది. దీంతో మొత్తం పెట్టుబడుల విలువ క్షీణత రూపంలో రూ.2,212 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.5 కోట్ల లాభం రావడం గమనార్హం. ఇక మార్చి క్వార్టర్‌కు మొత్తం ఆదాయం రూ.2,293 కోట్లుగా నమోదయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,234 కోట్లుగా ఉంది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్ విభాగం మాత్రం రూ.1,357 కోట్ల ఆదాయంపై రూ.271 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికుల ట్రాఫిక్ 2018–19లో 5 శాతం పెరిగి 69.2 మిలియన్లుగా ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల ట్రాఫిక్ 16 శాతం పెరిగి 21.4 మిలియన్లుగా నమోదైంది. ఇంధన విభాగంలో తాజా పెట్టుబడుల్లేవు ‘‘ఇంధన విభాగంలో మా వాటాదారుల పెట్టుబడి విలువ గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతమున్న ఇంధన ఆస్తుల సమర్థతను పెంచేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రారంభ పెట్టుబడిని మాఫీ చేశాం. నియంత్రణ పరిస్థితులు మరింత స్పష్టంగా మారి, మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకూ ఈ దశలో ఇంధన విభాగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోవడం లేదు. సరైన సమయంలో పెట్టుబడులపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది’’అని జీఎంఆర్ ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ చావ్లా తెలిపారు. ఇటీవల టాటా గ్రూపు, జీఐసీ సింగపూర్, ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్తో రూ.8,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి చేసుకున్న ఒప్పందంతో జీఎంఆర్ ఇన్ఫ్రా రుణభారం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ఎయిర్పోర్ట్ వ్యాపారం డీమెర్జింగ్‌కు మార్గం సుగమం అవుతుందని జీఎంఆర్ గ్రూపు సీఎఫ్‌వో సురేష్ బాగ్రోడియా చెప్పారు. రుణభారం ప్రస్తుత రూ.24,000 కోట్ల నుంచి ఆరోగ్యకరమైన స్థితికి తగ్గిపోతుందన్నారు. విమానాశ్రయాల్లో సామర్థ్యం పరంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. -
విమానాశ్రయాల వ్యాపారంలోకి టాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత విమానాశ్రయాల వ్యాపారంలోకి టాటా గ్రూప్ ప్రవేశించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో 20 శాతం వాటా కొనుగోలు చేయడం ద్వారా ఈ ఎంట్రీ ఇచ్చింది. టాటా గ్రూప్‌తోపాటు సింగపూర్ వెల్త్ ఫండ్ జీఐసీ 15 శాతం, ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్ 10 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో దక్కించుకున్నాయి. వాటా కొనుగోలు కోసం ఈ మూడు కంపెనీలు రూ.8,000 కోట్లకుపైగా వెచ్చించనున్నాయి. ఇందులో రూ.3,560 కోట్లు టాటా గ్రూప్ చెల్లిస్తోంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇప్పటి వరకు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 92 శాతం, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్‌కు 8 శాతం వాటాలు ఉండేవి. డీల్ పూర్తి అయ్యాక జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటా 53 శాతానికి, ఎంప్లాయీస్ వెల్ఫేర్ ట్రస్ట్ వాటా 2 శాతానికి వచ్చి చేరుతుంది. భారీ పీఈ డీల్ ఇదే.. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లు అయిన మెక్వరీ–ఎస్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాండర్డ్ చార్టర్డ్ ప్రైవేట్ ఈక్విటీ–3 (మారిషస్), జేఎం ఫైనాన్షియల్ ఓల్డ్ లేన్ ఇండియా కార్పొరేట్ అపార్చునీటీస్ ఫండ్‌కు 5.86 శాతం వాటా ఉంది. ఈ వాటా కోసం జీఐసీ రూ.2,670 కోట్లు, ఎస్ఎస్జీ రూ.1,780 కోట్లు చొప్పున వెచ్చిస్తున్నాయి. విమానాశ్రయాల రంగంలో దేశంలో ఇదే అతి పెద్ద పీఈ డీల్ కావడం గమనార్హం. ఇక పెట్టుబడుల్లో రూ.1,000 కోట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈక్విటీ రూపంలో ఉంటుంది. మిగిలిన రూ.7,000 కోట్లతో జీఎంఆర్ ఇన్ఫ్రా, దాని అనుబంధ కంపెనీల నుంచి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు చెందిన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ విలువ రూ.18,000 కోట్లుగా లెక్కించారు. వచ్చే అయిదేళ్లలో రాబడులు రూ.4,475 కోట్లతో కలిపి పెట్టుబడుల తదనంతరం మొత్తం విలువ (పోస్ట్ మనీ వాల్యుయేషన్) రూ.22,475 కోట్లుగా గణించారు. మంగళవారం జీఎంఆర్ ఇన్ఫ్రా మార్కెట్ క్యాప్ రూ.11,709 కోట్లుగా ఉంది. డీల్ తర్వాత జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో మేనేజ్మెంట్ కంట్రోల్ జీఎంఆర్ ఇన్ఫ్రా చేతుల్లోనే ఉంటుంది. బోర్డులోకి కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేరతారు. తగ్గనున్న జీఎంఆర్ రుణ భారం.. విమానాశ్రయాల వ్యాపారాన్ని లిస్టెడ్ కంపెనీ అయిన జీఎంఆర్ ఇన్ఫ్రా నుంచి విడదీయాలన్నది గ్రూప్ ప్రణాళిక. ప్రస్తుతం విమానాశ్రయాల వ్యాపారం నుంచి జీఎంఆర్ ఇన్ఫ్రాకు 60% ఆదాయం సమకూరుతోంది. తాజా డీల్‌తో జీఎంఆర్ ఇన్ఫ్రా రుణ భారం భారీగా తగ్గుతుందని కంపెనీ ఎండీ గ్రంథి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ‘విమానాశ్రయాల వ్యాపారాన్ని విడగొట్టడం ద్వారా కంపెనీ పునర్ వ్యవస్థీకరణ జరుగనుంది. బ్యాలెన్స్ షీట్ మరింత పటిష్టం అవుతుంది’ అని వివరించారు. జీఎంఆర్ ఇన్ఫ్రాకు సుమారు రూ.20,000 కోట్ల నికర అప్పులు ఉన్నాయి. ఇందులో రూ.6,800 కోట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు సంబంధించినవి. కాగా, బుధవారం జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర ఒకానొక దశలో రూ.21.25 దాకా వెళ్లింది. క్రితం ముగింపుతో పోలిస్తే 0.26 శాతం తగ్గి 19.40 వద్ద స్థిరపడింది. చేతిలో కొత్త ప్రాజెక్టులు.. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ గోవా ఎయిర్‌పోర్టును రూ.1,880 కోట్లతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈక్విటీ కింద రూ.550 కోట్లు, రుణాల ద్వారా రూ.1,330 కోట్లు వెచ్చిస్తోంది. ప్రాజెక్టు జీవిత కాలం 40 ఏళ్లు. ఇక నాగ్‌పూర్ విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టును సైతం కంపెనీ చేపట్టనుంది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహణలో ఉన్నాయి. ఎయిర్‌పోర్టుల వ్యాపారాన్ని డీమెర్జ్ చేసిన తర్వాత ఎనర్జీ, హైవేస్, అర్బన్ ఇన్ఫ్రా అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ బిజినెస్‌లను సైతం విడగొట్టాలని భావిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. -
జీఎంఆర్ ప్లాంటుపై అదానీ కన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చెందిన విద్యుత్ ప్లాంటు టేకోవర్ ప్రయత్నాలను అదానీ పవర్ ముమ్మరం చేసింది. జీఎంఆర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీ (జీఎంఆర్సీఈ) కొనుగోలుకు సంబంధించిన డీల్ దాదాపు తుదిదశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీల్ కింద జీఎంఆర్సీఈకి చెందిన రూ. 5,800 కోట్ల రుణభారంలో దాదాపు రూ. 3,800 కోట్లు, అలాగే రూ. 1,400 కోట్ల నిధులయేతర భారం అదానీ పవర్‌కు బదలాయింపు అవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణదాతలు లాంఛనంగా ఆమోదముద్ర వేసిన తర్వాత మరికొన్ని వారాల్లో డీల్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వివరించాయి. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ కింద రెండు 685 మెగావాట్ బొగ్గు ఆధారిత పవర్ యూనిట్లు ఉన్నాయి. గతేడాది వీటిలో వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక కింద జీఎంఆర్ చత్తీస్‌గఢ్ నియంత్రణాధికారాలను బ్యాంకులు గతేడాది జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంక్ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం రూ. 3,000 కోట్ల రుణాలను సంస్థలో 52% వాటాల కింద మార్చుకున్నాయి. దీన్ని కొనుగోలు చేసేందుకు అదానీ పవర్‌తో పాటు వేదాంత, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ప్రభుత్వ రంగ ఎన్ఎల్సీ ఇండియా తదితర సం స్థలు నాన్–బైండింగ్ బిడ్లు దాఖలు చేసినట్లు కంపెనీకి రుణాలిచ్చిన పీఎఫ్సీ గతంలో వెల్లడించింది. కృష్ణగిరిలో జీఎంఆర్ ఎస్ఐఆర్కు శంకుస్థాపన.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తలపెట్టిన జీఎంఆర్ కృష్ణగిరి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (జీకేఎస్ఐఆర్)కు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ టిడ్కోతో కలిసి జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని ఏర్పాటు చేస్తోంది. కృష్ణగిరి జిల్లాలోని హోసూర్‌లో సుమారు 2,100 ఎకరాల్లో ఈ రీజియన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఆటోమొబైల్, ఆటో పరికరాలు, డిఫెన్స్ .. ఏరోస్పేస్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి హైటెక్ పరిశ్రమలపై జీకేఎస్ఐఆర్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. ఇందులో దేశ, విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వివరించింది. ‘రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు, ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చే సంస్థలకు జీఎంఆర్ దీర్ఘకాలిక ప్రాతిపదికన స్థలాన్ని లీజుకి ఇస్తుంది. ఆయా సంస్థలు కావాలనుకుంటే పూర్తిగా కొనుక్కోవచ్చు’ అని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ విభాగం) బీవీఎన్ రావు తెలిపారు. -
మరింత పెరిగిన జీఎంఆర్ నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు మరింత పెరిగాయి. క్యూ1లో రూ. 235 కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నష్టాలు రూ. 137 కోట్లు. ఆదాయం రూ. 2,573 కోట్ల నుంచి రూ. 1,648 కోట్లకు క్షీణించింది. ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం ఆదాయం రూ. 1,893 కోట్ల నుంచి రూ. 1,247 కోట్లకు, విద్యుత్ వ్యాపార విభాగం రూ. 375 కోట్ల నుంచి రూ. 73 కోట్లకు తగ్గింది. అటు ఈపీసీ విభాగం ఆదాయం రూ. 223 కోట్ల నుంచి రూ. 230 కోట్లకు, రహదారుల వ్యాపార విభాగం ఆదాయం రూ. 142 కోట్ల నుంచి రూ. 145 కోట్లకు పెరిగింది. షేర్ల జారీ లేదా ఈక్విటీ ఆధారిత సాధనాలు, ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ. 2,950 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. -
తగ్గిన జీఎంఆర్ ఇన్ఫ్రా నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు తగ్గాయి. గత ఆర్ధిక సంవత్సరం క్యూ2లో రూ.893.37 కోట్ల నష్టాలను చవిచూస్తే.. ఇప్పుడవి 54 శాతం తగ్గుదలతో రూ.404.46 కోట్లకు తగ్గాయి. జీఎంఆర్ ఇన్ఫ్రా మొత్తం ఆదాయం గతేడాది క్యూ2లో రూ. 2,264 కోట్ల నుంచి 13 శాతం తగ్గుదలతో రూ.1,974 కోట్లకు చేరింది. విమానాశ్రయ విభాగం మాత్రం క్యూ2లో రూ.282 కోట్ల లాభాన్ని ఆర్జించింది. విద్యుత్ విభాగం మాత్రం రూ.219 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
భారీగా పెరిగిన జీఎంఆర్ ఇన్ఫ్రా నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2017 మార్చి త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికర నష్టం క్రితంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.2,479 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.395 కోట్ల నుంచి రూ.272 కోట్లకు పడిపోయింది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం రెండింతలకుపైగా పెరిగి రూ.3,684 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.1,256 కోట్ల నుంచి రూ.1,182 కోట్లుగా ఉంది. కాగా, ఆర్థిక సంవత్సరంలో రూ.37,480 కోట్లున్న స్థూల రుణ భారం రూ.19,856 కోట్లకు తగ్గించుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 13.71% ఎగసి రూ.17 వద్ద క్లోజ య్యింది. ఎయిర్పోర్ట్ విభాగం లాభాలు పెరిగా యని, తొలిసారిగా ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులు డివిడెండు ప్రకటించినట్టు కంపెనీ వెల్లడించింది. జీఎంఆర్ వరోరా ఎనర్జీ మొదటిసారిగా లాభాలను ఆర్జించి రూ.143 కోట్లను నమోదు చేసింది. కాకినాడ, కృష్ణగిరిల్లో మిగులు భూముల విక్రయం రుణభారాన్ని మరింత తగ్గించుకునే క్రమంలో తమకు రోడ్లు, విద్యుత్ రంగాల్లో వున్న కొన్ని ఆస్తుల్ని విక్రయిస్తామని జీఎంఆర్ గ్రూప్ సీఎఫ్ఓ మధు తెర్దాల్ చెప్పారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాకినాడ, కృష్ణగిరిల్లో వున్న మిగులు భూముల్ని విక్రయించడంపై దృష్టిపెట్టామని, ఈ విక్రయం ద్వారా రూ. 1000–1200 కోట్లు సమకూరుతాయని అంచనావేస్తున్నామన్నారు. ఇటీవలే ఇండోనేషియాలో బొగ్గు గనిని అమ్మడం ద్వారా రూ. 400 కోట్ల నగదు లభించిందని, రోడ్డు ప్రాజెక్టుల్ని విక్రయించడం ద్వారా మరో రూ. 500–600 కోట్లు పొందవచ్చని భావిస్తున్నామని ఆయన వివరించారు. జీఎంఆర్ ఎనర్జీ ద్వారా ఐపీఓ జారీచేసే ప్రణాళిక కూడా వుందని, ఈ అంశాలన్నీ తమ రుణభారం తగ్గడానికి దోహదపడతాయన్నారు. హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులపై రూ. 7,400 కోట్ల పెట్టుబడి... తమ హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులపై తాజాగా రూ. 7,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మధు వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టును రూ. 4,500–5,000 కోట్ల పెట్టుబడితో విస్తరించాలని యోచిస్తున్నామని, ఈ ఎయిర్‌పోర్టు వద్ద రూ. 2,700 కోట్ల నగదు నిల్వలున్నాయన్నారు. అలాగే హైదరాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణను రూ. 2,400 కోట్ల పెట్టుబడితో చేపడుతున్నామని, ఈ ఎయిర్‌పోర్టు రూ. 1,000 కోట్ల నగదు నిల్వను కలిగివున్నదన్నారు. తమ స్థూల ఆదాయం రూ. 8,236 కోట్లని, అందులో రూ. 2,989 కోట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి, రూ. 1,057 కోట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సమకూరిందన్నారు. -
జీఎంఆర్ ఇన్ఫ్రా...నష్టాలు రూ. 123 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టం ప్రకటించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 123 కోట్ల నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో నష్టం రూ. 1.33 కోట్లే. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 269 కోట్ల నుంచి రూ. 361 కోట్లకు పెరిగినప్పటికీ.. వ్యయాలు సైతం రూ. 37 కోట్ల నుంచి రూ. 81 కోట్లకు ఎగిశాయి. దేశ, విదేశాల్లో విమానాశ్రయాలు, రవాణా, విద్యుత్ తదితర రంగాల్లో జీఎంఆర్ గ్రూప్ కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి గ్రూప్ రుణ భారం దాదాపు రూ. 45,000 కోట్ల మేర ఉంది. రుణభారం తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ గత కొన్నాళ్లుగా వివిధ ప్రాజెక్టుల్లో వాటాలు విక్రయిస్తోంది. తాజాగా జీఎంఆర్ కన్సార్షియంకు చెందిన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (జీహెచ్ఐఏఎల్) వాటాల కొనుగోలుకు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సంస్థ రేసులో ఉన్నట్లు సమాచారం. దాదాపు 30 శాతం వాటాల కొనుగోలు కోసం అపోలో గ్లోబల్ సుమారు రూ. 2,000 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్, ఐడీఎఫ్సీ ఆల్టర్నేటివ్స్ మొదలైన సంస్థలు కూడా ఇందుకు పోటీపడ్డాయి. అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ దాదాపు రూ. 1,400 కోట్లకు బిడ్ చేసింది. అయితే ప్రాజెక్టుకు దాదాపు రూ. 6,800 కోట్ల విలువ కడుతూ మిగతా సంస్థల కన్నా అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన అపోలో గ్లోబల్‌ను జీఎంఆర్ షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జీఎంఆర్‌కు 63 శాతం, మలేసియా ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బెర్హాద్‌కు 11 శాతం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. తెలంగాణ ప్రభుత్వానికి 26 శాతం వాటాలు ఉన్నాయి. మరోవైపు జీఎంఆర్ గ్రూప్ ఇటీవలే గోవాలో కొత్తగా మరో విమానాశ్రయం ప్రాజెక్టు దక్కించుకుంది. దీని విలువ సుమారు రూ. 3,100 కోట్లు. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డిబెంచర్లు మొదలైన వాటి జారీ ద్వారా దాదాపు రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. గురువారం బీఎస్ఈలో జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు దాదాపు 2 శాతం నష్టపోయి రూ. 14.30 వద్ద ముగిసింది. -
ఎయిర్ పోర్టులో వాటాలు అమ్మడం లేదు: జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో యాజమాన్య వాటాలేమీ విక్రయించడం లేదని జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పష్టం చేసింది. అయితే, నిధుల సమీకరణకు సంబంధించి వివిధ అవకాశాలు మాత్రమే పరిశీలిస్తున్నామని తెలిపింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ యాజమాన్య వాటాలను విక్రయించే దిశగా కొనుగోలుదారులతో తుది చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కంపెనీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. -
ఊహాగానాలకు చెక్ పెట్టిన జీఎమ్ఆర్
న్యూఢిల్లీ : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కంట్రోలింగ్ వాటా అమ్మక వార్తలపై జీఎమ్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఖండించింది. కంట్రోలింగ్ వాటాను అమ్మడం లేదని వెల్లడించింది. కానీ ఫండ్స్ ను సేకరించడానికి అవకాశాలను అన్వేషిస్తున్నామని జీఎమ్ఆర్ ప్రకటించింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వాటాను జీఎమ్ఆర్ అమ్మేస్తుందని, సంప్రదింపులు అడ్వాన్స్ డ్ దశలో ఉన్నాయని ఊహాగానాలు జోరందుకోవడంతో జీఎమ్ఆర్ ఇన్ ఫ్రా స్పందించింది. 'హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కంట్రోలింగ్ వాటాను అమ్మే విషయాన్ని మేము పూర్తిగా కొట్టివేస్తున్నాం.. అయితే జీఎమ్ఆర్ గ్రూపుకు అవసరమైన ఫండ్స్ కోసం మాత్రం అవకాశాలను అన్వేషిస్తున్నాం..' అని జీఎమ్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, బీఎస్ఈకి నివేదించింది. 2016 మార్చి 31 త్రైమాసిక ముగింపుకు కంపెనీ రూ.953.5 కోట్ల ఏకీకృత నికర నష్టాలను నమోదుచేసింది. అంతకముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ నష్టం రూ.891.9 కోట్లగా ఉంది. నిర్వహణ పరంగా వచ్చిన మొత్తం ఆదాయాలు 29.12శాతం పెరిగి, రూ.3,708.37గా నమోదయ్యాయి. గతేడాది ఈ ఆదాయాలు రూ.2,872.01 కోట్లగా ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వాటాను అమ్మడం లేదని కంపెనీ బీఎస్ఈకి నివేదించిన తర్వాత ఉదయం ట్రేడింగ్ లో జీఎమ్ఆర్ ఇన్ ఫ్రా షేర్లు 1.49శాతం పెరిగాయి. -
జీఎంఆర్ నష్టం రూ. 953 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 953 కోట్లకు (కన్సాలిడేటెడ్) పెరిగాయి.. అంతక్రితం క్యూ4లో నష్టం రూ. 892 కోట్లు. ఆదాయం 28% వృద్ధితో రూ. 2,913 కోట్ల నుంచి రూ. 3,737 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఏడాదికి ఆదాయం రూ. 11,088 కోట్ల నుంచి రూ. 13,358 కోట్లకు పెరగ్గా.. నష్టం రూ. 2,733 కోట్ల నుంచి రూ. 2,161 కోట్లకు తగ్గింది. మెరుగైన విద్యుత్, ఎయిర్‌పోర్టు విభాగాలు నియంత్రణపరమైన సమస్యలు తొలగడం, నిర్వహణ మార్జిన్ల పెరుగుదలతో విద్యుత్ వ్యాపార విభాగం, ట్రాఫిక్ జోరు కారణంగా విమానాశ్రయాల విభాగం మెరుగుపడటంతో పూర్తి ఏడాదికి నష్టాలు తగ్గించుకోగలిగినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. ఎయిర్‌పోర్ట్స్ విభాగం ఆదాయాలు రూ. 1,438 కోట్ల నుంచి రూ. 1,831 కోట్లకు, విద్యుత్ వ్యాపారం రూ. 1,174 కోట్ల నుంచి రూ. 1,508 కోట్లకు, ఈపీసీ వ్యాపారం రూ.46 కోట్ల నుంచి రూ.316 కోట్లకు పెరిగాయి. అయితే చత్తీస్‌గఢ్, రాజమండ్రి విద్యుత్ ప్లాంట్లలో కార్యకలాపాలతో వడ్డీ వ్యయాలు రూ. 485 కోట్లు పెరిగి గతేడాదికి మొత్తం వడ్డీ రూ. 4,058 కోట్లకు చేరినట్లు సంస్థ పేర్కొంది. -
జీఎంఆర్ విద్యుత్ ప్లాంటు టారిఫ్ పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్ఫ్రాకు చెందిన ఒడిసాలోని కమళంగా ఎనర్జీ ప్లాంటు విద్యుత్ టారీఫ్‌లను పెంచుతూ సెంట్రల్ ఎలక్ట్రిసీటీ రెగ్యులేటర్ కమిషన్ (సీఈఆర్సీ) ఉత్తర్వులు జారీచేసింది. ఆర్థిక ఏడాది 2013-14లో యూనిట్‌కు రూ. 3.97, ఆ తర్వాత నుంచి రూ. 3.40 వసూలు చేసుకోవడానికి సీఈఆర్సీ అనుమతించింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ టారిఫ్ సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లయ్యింది. సీఈఆర్సీ నిర్ణయంతో రావాల్సిన బకాయిల్ని జీఎంఆర్ గ్రిడ్కో నుంచి వసూలు చేసుకోగలుగుతుంది. ఈ ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నంత కాలం యూనిట్‌కు రూ. 2.75 మాత్రమే లభించేది. తాజా వార్తల నేపథ్యంలో జీఎంఆర్ షేరు 7 శాతం లాభంతో రూ. 14.25 వద్ద ముగిసింది. -
ఫిలిప్ఫైన్స్ ఎయిర్‌పోర్టులపై జీఎంఆర్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిలిప్ఫైన్స్ ఎయిర్‌పోర్టులపై జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఫిలిప్ఫైన్స్లో అభివృద్ధి చేయదల్చిన ఐదు ఎయిర్‌పోర్టుల కాంట్రాక్టులను భాగస్వామ్య కంపెనీతో కలిసి చేజిక్కించుకోవడానికి జీఎంఆర్ గ్రూపు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. సుమారు రూ. 15,000 కోట్లతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలనుకున్న ఐదు ఎయిర్‌పోర్టుల కాంట్రాక్టులను చేజిక్కించుకోవడానికి ఆరు కంపెనీలు పోటీ పడుతున్నట్లు ఫిలిప్ఫైన్స్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో జీఎంఆర్-మెగావైడ్ కంపెనీ కూడా ఉంది. ఈ భాగస్వామ్య కంపెనీ ఇప్పటికే వుక్టన్ సెబూ ఇంటర్నేషనల్ ఎరుుర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు 4 శాతం పెరిగి రూ. 14.70 వద్ద ముగిసింది. -
సెబు విమానాశ్రయంలో నిర్మాణ పనులు: జీఎంఆర్
సెబు(ఫిలిప్పైన్స్): మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ల కన్సార్షియం ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను నవంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. ఆరు నెలల్లో ఈ పనులను పూర్తి చేస్తారు. 2015 మార్చి నుంచి విమానాశ్రయంలో నూతన భవనాన్ని నిర్మిస్తారు. 36 నెలల్లో నిర్మాణం పూర్తి అవుతుందని జీఎంఆర్-మెగావైడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ ఆండ్రూ హారిసన్ వెల్లడించారు. విస్తరణ పూర్తి అయితే అధిక సీట్లు, ఏరోబ్రిడ్జ్‌లు, హోటళ్లు, క్యాసినో, కార్యాలయాలు, స్పా, దుకాణ సముదాయాలతోపాటు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయని చెప్పారు. ప్రస్తుతం విమానాశ్రయానికి ఏటా 45 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉంది. విస్తరణ పూర్తి అయితే ఈ సంఖ్య 1.25 కోట్లకు చేరుకుంటుంది. జీఎంఆర్-మెగావైడ్ కన్సార్షియం సుమారు రూ.1,920 కోట్లకు ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. కన్సార్షియంలో జీఎంఆర్‌కు 40 శాతం వాటా ఉంది. -
జపాన్ బ్యాంక్‌తో జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్‌తో(జేబీఐసీ) మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే జపాన్ కంపెనీలకు జేబీఐసీ తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణ సహాయం చేస్తుంది. పారిశ్రామిక పార్కులు, విద్యుత్, శక్తివనరులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వేల వంటి ప్రాజెక్టుల్లో జపాన్ కంపెనీలు పాలుపంచుకునేందుకు అవకాశాలను కల్పించాలన్నది జేబీఐసీ ఉద్దేశం. భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో భాగంగా మంగళవారం టోక్యోలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు జీఎం ఆర్ తెలిపింది. జపాన్ పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే 12 నెలల్లో ఇరు సంస్థలు కలిసి వివిధ ప్రాజెక్టులను గుర్తిస్తాయి. ప్రైవేటు రంగ కంపెనీతో ఇటువంటి అంతర్జాతీయ ఒప్పందం జరగడం ఇదే తొలిసారి అని జీఎంఆర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు ఈ సందర్భంగా తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో భారత మౌలిక రంగంలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని అంచనా. ప్రైవేటు కంపెనీల పెట్టుబడులు ఈ రంగంలో కీలక పాత్ర పోషించనున్నాయి. -
మాల్దీవుల ఎయిర్పోర్ట్ రద్దు కేసులో జీఎంఆర్ విజయం
ఏకపక్ష రద్దును తప్పుపట్టిన ట్రిబ్యునల్ నష్టపరిహారంతో పాటు, కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూపు దక్కించుకున్న మాల్దీవుల్లోని మాలే ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ కాంట్రాక్టును ఏకపక్షంగా రద్దు చేయడంపై మాల్దీవుల ప్రభుత్వాన్ని, మాల్దీవుల ఎయిర్పోర్ట్ కంపెనీ(ఎంఏసీఎల్)లను ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. అర్ధంతరంగా కాంట్రాక్టును రద్దు చేసినందుకుగాను జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడమే కాకుండా కోర్టు ఖర్చుల కింద 4 మిలియన్ డాలర్లు (రూ.24 కోట్లు) చెల్లించాలని లార్డ్ హాఫ్మన్ నేతృత్వంలోని అంతర్జాతీయ వాణిజ్య వివాద పరిష్కార ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ ఖర్చుల్ని 42 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. మాలేలోని ఇబ్రహిం నసిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసి నిర్వహించే కాంట్రాక్టును 500 మిలియన్ డాలర్లకు మాల్దీవుల ప్రభుత్వం, ఎంఏసీఎల్ నుంచి జీఎంఆర్ గ్రూపు 2010లో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కాంట్రాక్టు కేటాయింపులో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ రద్దు చేసింది. ఇలా ఏకపక్షంగా కాంట్రాక్టును రద్దు చేయడంపై జీఎంఆర్ 1.4 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కోరుతూ కోర్టుకు ఎక్కింది. ఈ ఒప్పందం చెల్లదంటూ మాల్దీ వుల ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ ముందుకు వెళ్లింది. సింగపూర్‌లోని హాఫ్మన్ ట్రిబ్యునల్ ఆర్బిట్రేషన్ విచారణ నవంబర్ 29, 2012లో మొదలు కాగా 18 నెలల తర్వాత జీఎంఆర్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రస్తుత విచారణలో కాంట్రాక్టు రద్దు చేయడం తప్పని తేలిందని, ఇక జరిగిన నష్టంపై ఎంత చెల్లించాలన్నదానిపై తదుపరి విచారణ జరగాల్సి ఉం దని జీఎంఆర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. జీఎంఆర్ కోరుతున్న రూ.8,000 కోట్ల పరిహారం లభించకపోవ చ్చని, ఇది రూ.2,000-3,000 కోట్ల మధ్య ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ వార్తలతో గురువారం జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో రూ.32,85 వద్ద స్థిరంగా ముగిసింది.