heatwave
-
పాక్‌లో మండుతున్న ఎండలు.. 4 రోజ్లులో 450 మంది మృతి
కరాచీ: పొరుగు దేశం పాకిస్తాన్లో వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద నగరంగా పేరొందిన కరాచీలో వడగాడ్పులకు 450 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అధికంగా ఉండటంతో మృతదేహాలను భద్రపరిచేందుకు మార్చురీల్లో స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.పాక్‌లోని పలు స్వచ్ఛంద సంస్థలు దేశంలో విలయతాండవం చేస్తున్న ఎండల గురించి, వడగాడ్పుల కారణంగా మృతి చెందినవారి గురించి చెబుతున్నప్పటికీ పాక్ ప్రభుత్వం ఇంకా దీనిపై స్పందించలేదు. పాక్‌లోని ఓడరేవు నగరమైన కరాచీలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. తాజాగా ఈధి ఫౌండేషన్ కరాచీలో నాలుగు రోజుల్లో 427 మృతదేహాలు లభ్యమయ్యాయని, సింధ్ ప్రభుత్వం మంగళవారం 23 మృతదేహాలను మూడు ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిందని తెలియజేసింది.ఫౌండేషన్ చీఫ్ ఫైసల్ ఈధి మాట్లాడుతూ కరాచీలో నాలుగు మార్చురీలు ఉన్నాయని, మృతదేహాలను ఉంచేందుకు ఈ మార్చురీలలో స్థలం సరిపోవడం లేదని అన్నారు. వీధులలో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయని ఈధి తెలిపారు. వడగాడ్పుల కారణంగానే వీరంతా మరణించి ఉంటారన్నారు. మంగళవారం135 మృతదేహాలు, సోమవారం 128 మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని అన్నారు. ఈధి ట్రస్ట్ పాకిస్తాన్లో పేదలు, నిరాశ్రయులు, అనాథ వీధి పిల్లలు, బాధిత మహిళలకు సేవలను అందిస్తుంటుంది. -
హజ్ యాత్రలో 98 భారతీయుల మృతి: కేంద్రం
న్యూఢిల్లీ: తీవ్ర ఎండ, వేడిగాలులతో ఈ ఏడాది హజ్ యాత్రికులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. దాదాపు 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 98 0 మంది భారతీయులు మరణించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మరణాలన్నీ సహజ కారణాల వల్లే నమోదైనట్లు తెలిపింది.కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీని సందర్శించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అక్కడ భారతీయుల కోసం తాము చేయగలిగినదంతా చేస్తున్నట్లు పేర్కొంది.ప్రతి సంవత్సరం కనీసం సగం మిలియన్ల మంది (5లక్షలు) హజ్లో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే వాస్తవ సంఖ్య 30 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించింది.కాగా ఏడాది సౌదీలో హాజ్ యాత్రకు హాజరైన వారిలో 10 దేశాలకు చెందిన దాదాపు 1,081 మంది మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ధ్రువీకరించారు. అత్యధికంగా ఈజిప్టుకు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ వారం సౌదీలో ఉష్ణోగ్రత 51.8 డిగ్రీల సెల్సియస్ చేరుకుంది. ఇక ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షల మంది ఉండగా, సౌదీ పౌరులు రెండు లక్షల మందికి పైగా ఉంటారని సౌదీ హజ్ అధికార యంత్రాంగం తెలిపింది. -
అగ్నిగుండంలా ఢిల్లీ.. వారం రోజుల్లో 192 నిరాశ్రయుల మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. 50కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. దీనికి తోడు వడగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలకు తోడు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక హస్తీనా వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగరంలోని ఆసుపత్రులన్నీ హీట్ స్ట్రోక్ బాధితులతో నిండిపోతున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో రోగులు అడ్మిట్ అవుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది. 72 గంటల్లోనే ఢిల్లీ, నోయిడాలో 15 మంది వడదెబ్బతో ప్రాణాలు వదిలారు. ఢిల్లీలో అయిదుగురు, నోయిడాలో 10 మంది మృత్యువాత పడ్డారుఅయితే తీవ్ర ఉక్కపోత, వడదెబ్బ కారణంగా ఢిల్లీలో జూన్ 11 నుంచి 19 మధ్య 196 మంది నిరాశ్రయులు (ఇళ్లు లేని వారు) మరణించినట్లు ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ నివేదిక పేర్కొంది. ఈ కాలంలో నమోదైన అత్యధిక మరణాల సంఖ్య ఇదేనని వెల్లడించింది.NGO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ అలెడియా మాట్లాడుతూ.. జూన్ 11 నుండి 19 వరకు తీవ్ర వేడి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో 192 మంది నిరాశ్రయుల మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. అంతేగాక మరణించిన వారిలో 80 శాతం మంది మృతదేహాలు ఎవరివో కూడా తెలియవని అన్నారు. ఈ ఆందోళనకరమైన మరణాల సంఖ్య.. సమాజాన్ని రక్షించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయని తెలిపారు.వాయు కాలుష్యం, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అటవీ నిర్మూలన వంటి కారణాల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, నిరాశ్రయులైన వారి పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన పేర్కొన్నారు. నివాసాలు లేని వారికి అవసరమైన తాగునీరు అందించడం ముఖ్యమైన సవాలుగా మారిందన్నారు. దీని వల్ల డీహైడ్రేషన్, సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందన్నారు.దీన్ దయాళ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (NULM-SUH) ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిరాశ్రయులు ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అయితే వారికి ప్రాథమికంగా గుర్తింపు పత్రాలు లేకపోవడం, శాశ్వత చిరునామా లేకపోవడం సమస్యగా మారిందన్నారు.అదే విధంగా శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, తగిన షెల్టర్ సామర్థ్యాన్ని నిర్ధారించడం, నీటిని పంపిణీ చేయడం. సహాయక గృహాలు, సేవల ఏర్పాటు ద్వారా నిరాశ్రయులైన సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పారు. -
దేశ రాజధానిలో హీట్‌వేవ్.. ఢిల్లీ, నోయిడాలో 15 మంది మృత్యువాత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లడిపోతున్నారు. ఓవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు నీటి సంక్షోభం ఢిల్లీ ప్రజలను పీడిస్తున్నాయి.ఎండ వేడిమి, వడగాలుల ధాటికి జనం పిట్టల్లా రాలుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గడచిన 72 గంటల్లో వడ దెబ్బతో 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మరణించారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హస్పిటల్లో 12 మంది వెంటిలేటర్ సపోర్టతో చికిత్స పొందుతున్నారు. మరో 36 మంది వడదెబ్బతో చికిత్స పొందుతున్నారు.హీట్‌స్ట్రోక్ కేసుల్లో మరణాల రేటు దాదాపు 60-70 శాతం ఎక్కువāగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. రోగులలో చాలా మంది వలస కూలీలే ఉన్నట్లు తెలిపారు. అధికంగా 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు. హీట్‌స్ట్రోక్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారుకాగా ఢిల్లీ వాసులు దాదాపు నెల రోజులుగా తీవ్ర ఎండ, వేడిగాలులతో అల్లాడిపోతున్నారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును దాటాయి. హీట్‌వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పంజాబ్‌లో వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్‌లోనూ ఎండలు దంచికొడ్తున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు వుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే 24 గంటలపాటు వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
స్పైస్‌జెట్ విమానంలో పనిచేయని ఏసీ.. ప్రయాణికుల అవస్థలు
న్యూఢిల్లీ: విమానంలో సాంకేతిక లోపాలు, అనుచిత ఘటనలు, బెదిరింపు కాల్స్.. వంటివి తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక ఉక్కపోతతో కొందరు అవస్థలు పడ్డారు. ఈ ఘటన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది.న్యూ ఢిల్లీ నుంచి దర్బంగా వెళుతున్న SG 476 విమానంలో సుమారు గంటకు పైగా ఏసీ పని చేయలేదు దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. వెంటిలేషన్ లేకపోవడం వల్ల గాలి కోసం తమ చేతిలో ఉన్న వస్తువులతో విసురుకుంటూ కనిపించారు. వృద్ధులు చిన్నపిల్లలతో సహా అనేక మంది ప్రయాణీకులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విమానంలోని పరిస్థితిని తోటి వారు డియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది."నేను ఢిల్లీ నుంచి దర్భంగాకు స్పైస్ జెట్‌లో ప్రయాణిస్తున్నాను. ఢిల్లీ విమానాశ్రయంలో చెక్ ఇన్ తర్వాత గంట వరకు ఏసీ ఆన్ చేయలేదు. విమానం లోపల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంది. విమానం టేకాఫ్ కాగానే ఏసీ ఆన్ చేశారు’’ అని ప్రయాణీకుడు రోహన్‌కుమార్ తెలిపారు.#WATCH | SpiceJet passengers travelling from Delhi to Darbhanga (SG 476) had to wait inside an aircraft without air conditioning (AC) for over an hour amid the ongoing heatwave, with several feeling unwell. pic.twitter.com/cIj2Uu1SQT— ANI (@ANI) June 19, 2024 వీడియోపై స్పందించిన విమానయాన సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్యతో ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చింది. -
ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
దేశ రాజధాని ఢిల్లీలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికిముందు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు ఎండ తీవ్రత మరింత పెరిగిన నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికితోడు మరో రెండు రోజుల వరకు ఢిల్లీలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదని వాతావరణశాఖ పేర్కొంది.ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సగటు కంటే 5.7 డిగ్రీలు ఎక్కువ. నగరంలో వరుసగా ఎనిమిదో రోజు వడగాడ్పులు వీచాయి. వరుసగా 35వ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే అధికంగా నమోదైంది. మధ్యాహ్నం సమయంలో ఎండలో బయటకు వెళితే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉంటూ నీరు తాగుతూ ఉండాలని సూచించింది.జూన్ 11 నుంచి రుతుపవనాలు ముందుకు సాగడం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా, దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాలలో వేడివాతావరణం కొనసాగుతున్నదని పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 27-30 మధ్య ఢిల్లీకి చేరుకుంటాయి. ఈసారి కూడా రుతుపవనాలు అదే సమయానికి ఢిల్లీకి తరలివచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. -
నార్త్‌లో ఎండలు.. సౌత్‌లో వర్షాలు
సాక్షి,ఢిల్లీ: దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాదిన భానుడు భగభగలాడుతుండగా దక్షిణాదిన వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా మారింది. ఉత్తరాదిలో ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో హీట్‌వేవ్ జూన్ 14వరకు కొనసాగుతుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది.గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటవచ్చని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండల ధాటికి ఢిల్లీలో జనం బయటికి రావాలంటేనే జడుస్తున్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఢిల్లీలో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రానున్న రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. నజాఫ్‌గఢ్‌లో ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలకు చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరుసగా రెండవ రోజు కూడా వేడిగాలులు వీస్తున్నాయి.రానున్న రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, పగటిపూట ఢిల్లీ-ఎన్సీఆర్లో గంటకు 25 నుండి 35 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాల ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. -
రికార్డులు బద్ధలు కొడుతున్న ఉష్ణోగ్రతలు
-
ఆ టైమ్‌లో ఫుడ్ ఆర్డర్ చేయకండి.. జొమాటో రిక్వెస్ట్
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జోమాటో తన కస్టమర్లు మధ్యాహ్న సమయాల్లో ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఉండమని కోరింది. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. హీట్‌వేవ్ పరిస్థితుల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జొమాటో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ.. దయచేసి మధ్యాహ్న సమయాల్లో తప్పనిసరిగా అవసరమైతే తప్పా.. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవద్దని విన్నవించింది.ఇప్పుడు దేశంలో అక్కడక్కడా చిరుజల్లులు పడుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని రోజులు వేడి తీవ్రత భారీగా ఉంటుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు తమ బైక్‌లపై తిరుగుతూ తీవ్రమైన ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు, ఈ కారణంగానే జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.జొమాటో విన్నపానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. లంచ్ సమయంలో కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఉండలేరని కొందరు పేర్కొన్నారు. మరి కొందరు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు మీ వ్యాపారాన్ని క్లోజ్ చేయండి అని సలహా ఇచ్చారు. మరికొందరు లంచ్‌టైమ్ ఆర్డర్లను డిన్నర్ సమయానికి వాయిదా వేయలేమని అన్నారు.pls avoid ordering during peak afternoon unless absolutely necessary 🙏— zomato (@zomato) June 2, 2024 -
సూర్యుడి భగభగ.. ఎండ వేడి తట్టుకోలేక 54 మంది మృత్యువాత
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీతో సహా తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే ముచ్చెమటలు పడుతున్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా, నెత్తి మీద రుమాలు లేకుండా బయట అడుగు పెడితేా.. అంతే సంగతులు. కాళ్లకు బొబ్బలు కట్టడం ఖాయం, మాడు పగలడం ఖరార్. పైగా, వేడి గాలుల బీభత్సం. తెల్లారింది మొదలు రాత్రి 10 గంటల దాకా భానుడి భగభగలే.ఎంత వేడిని తట్టుకోలేక దేశ వ్యాప్తంగా 54 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 32 మంది వడదెబ్బతో మరణించారు. ఔరంగాబాద్‌లో 17 మంది, అర్రాలో ఆరుగురు, గయాలో ముగ్గురు, రోహతాస్‌లో ముగ్గురు, బక్సర్‌లో ఇద్దరు, పాట్నాలో ఒకరు మరణించారు.. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్‌లోని పాలము, రాజస్థాన్‌లలో ఐదుగురు చొప్పున మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు మరణించారు.ఇక ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు 45.6 డిగ్రీలను దాటేసింది. సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో మే 31 నుంచి జూన్ 1 మధ్య.. హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో మే 31న దుమ్ము తుఫాను రానున్నట్లు భారత వాతావరణశాఖ అంచనా వేసింది. మే 31, జూన్ 1న వాయువ్య భారత్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షతం నమోదుకానున్నట్లు పేర్కొంది. రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. రుతుపవనాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు మాడు అదిరిపోయేలా ఎండలు అదరగొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోయారు. ఒక ఢిల్లీలోనే కాదు..ఉత్తర భారత దేశంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విల విలాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. బుధవారం తొలిసారిగా రికార్డు స్థాయిలో మంగేష్ పూర్లో ఏకంగా 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏడారి ప్రాంతమైన రాజస్థాన్ కన్నా ఎక్కువగా రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఢిల్లీలోని నజాఫ్ గడ్, పిఠంపుర సహా మరికొన్ని ప్రాంతాల్లో నేడు 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ భారతదేశంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పలకరిస్తుంటే.. ఉత్తర భారతం భానుడి భగభగలతో ఠారెత్తిపోతోంది.ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎండతీవ్రతకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. జనాలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఏసీలు, కూలర్లు వాడకం ఎక్కువ అయ్యింది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో 8వేల302 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడింది. నీటిని వృధా చేసిన వారికి రెండు వేల జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి. వేసవి విడిదికోసం ఉత్తర భారతం వెళ్లిన పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో ఇంతటి మార్పులు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు జనం.రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా అనేక ప్రాంతాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ మాదిరిగానే వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోని ఫలొదిలో 51 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
ఉత్తరాదిని బెంబేలెత్తిస్తున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
-
మండుతున్న ఎండలు.. తట్టుకోలేక సొమ్మసిల్లిన విద్యార్థులు
పాట్నా: ఉత్తర భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూ లేనంతంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను దాటేసింది. తీవ్ర ఎండ, వాడగాలులతో జనం అల్లాడుతున్నారు. అయితే మండే ఎండల్లోనూ కొన్ని చోట్ల స్కూళ్లు తెరుచుకున్నాయి. తాజాగా బిహార్‌లో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు.బిహార్‌లో వేసవిసెలవులు ముగియడంతో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రస్తుతం బిహార్‌లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు ఉంది. ఇంత ఎండలోనూ విద్యార్ధులు స్కూళ్లకు వచ్చారు. అయితే ఎండ వేడిని తట్టుకోలేక.. పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. షేక్‌పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేశారు. సమయానికి ఆంబులెన్స్‌లు రాకపోవడంతో.. ఆటోలు, బైక్‌లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలందరూ డీ హైడ్రేట్ అయ్యారని.. ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.ఇదొక పాఠశాలలోనే కాదు బెగుసరాయ్, జాముయి జిల్లాల్లో పదుల సంఖ్యలో విద్యార్ధులు స్పృహతప్పి పడిపోయారు. వారిని అసుపత్రికి తరలించారు.కాగా, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ బీహార్‌లో స్కూళ్లను తెరువడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు స్కూళ్లకు వెళ్లి టీచర్లతో ఘర్షణపడ్డారు. అలాగే రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ స్కూళ్లను తెరువడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.మరోవైపు బీహార్‌లో ప్రభుత్వం, ప్రజాస్వామ్యం లేదని, బ్యూరోక్రసీ మాత్రమే ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా ఉన్నాయని, అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఐదు రోజుల్లో కేరళకు రుతుపవనాలు
తిరువనంతపురం: వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు మరో 5 రోజుల్లో కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయని తెలిపింది. కేరళను తాాకిన తర్వాత రుతుపవనాలు సకాలంలో తర్వాత దేశమంతా విస్తరించేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈసారి దేశంలో సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఈశాన్యంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని వెల్లడించింది. రానున్న ఐదురోజుల్లో పశ్చిమ తీరంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో హీట్‌వేవ్ పరిస్థితులు ఈ నెలాఖరువరకు కొనసాగుతాయని తెలిపింది. -
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
సిడ్నీ: ప్రపంచంలో హీట్‌వేవ్ వల్ల సంభవించే మరణాల్లో అయిదో వంతు భారత్‌లోనేని ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా హీట్‌వేవ్ కారణంగా 1.53లక్షల మందికిపైగా మరణిస్తుండగా ఇందులో ఐదో వంతు మంది భారత్‌లో చనిపోతుండడం కలవరం కలిగిస్తోంది. హీట్‌వేవ్ మరణాల్లో భారత్ తర్వాత వరుసగా చైనా, రష్యా దేశాలున్నాయి. మొత్తం హీట్‌వేవ్ మరణాల్లో సగం ఆసియా నుంచే కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. 1990 నుంచి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా హీట్‌వేవ్‌తో సంభవిస్తున్న మరణాలను యూనివర్సిటీ అధ్యయనం చేసింది. మొత్తం మరణాల్లో 30 శాతం యూరప్‌లో సంభవిస్తున్నాయని తేలింది. ప్రభుత్వాలు హీట్‌వేవ్‌ల పట్ల సమగ్ర దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేసినప్పుడే మరణాలను అరికట్టవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.క్లైమేట్ చేంజ్ మైగ్రేషన్ పాలసీ, హీట్ యాక్షన్ ప్రణాళికలు, అర్బన్ ప్లానింగ్ అండ్ గ్రీన్ స్ట్రక్చర్స్, సామాజిక మద్దతు కార్యాచరణ, పబ్లిక్ హెల్త్‌కేర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అవేర్నెస్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ వంటి చర్యలు హీట్‌వేవ్ మరణాలు నివారించడానికి తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. -
హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
ఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. ప్రజలు భానుడి వేడి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ తీవ్రమైన వేడిగాలులు త్వరలో తగ్గుముఖం పట్టబోతున్నాయని ఓ శుభవార్త చెప్పింది.తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వేడిగాలులు తగ్గుముఖం పట్టబోతున్నాయి. తూర్పు ప్రాంతానికి ఈ రోజులో ఉపశమనం లభించవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు కూడా త్వరకలోనే వేడి తీవ్రతలు తగ్గుతాయని ఐఎండీ పేర్కొంది. మే 10 వరకు ఈ ప్రాంతాలలో ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.గత నెల నుంచి భారతదేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వ్యాపించడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ అవుతున్నాయి. ఏప్రిల్ చివరి రోజున కోల్‌కతాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, కోల్‌కతాలో దశాబ్దాలుగా ఇంతటి ఉష్ణోగ్రత నమోదు కాలేదు.రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లను ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేఘాలయలోని ఖాసీ-జైంతియా హిల్స్ ప్రాంతంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. 400 మందికి పైగా ప్రజలు నష్టపోయినట్లు.. మరో 48 గంటల పాటు ఈ వర్షం కొనసాగుతుందని వాతావరణ సఖ పేర్కొంది. -
రెండోదశలో తగ్గనున్న ఓటింగ్ శాతం? కారణం ఇదే?
రెండో దశ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు ఓటింగ్ జరగనుంది. అయితే ఆ రోజుల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఎన్నికల కమిషన్‌ను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 26, రెండవ దశ ఓటింగ్ రోజున తూర్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేడి గాలులు వీయనున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. పశ్చిమ బెంగాల్లో విపరీతమైన వేడి గాలులుల వీయనున్నాయనే అంచానాలున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటనున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల తర్వాత వేడిగాలు వీచే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదు రోజుల పాటు హిట్ వేవ్ ఉండనుంది. ఏప్రిల్ 26న ఈ రాష్ట్రాలన్నింటిలో రెండో దశ పోలింగ్ జరగనుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం వేసవి సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలోని ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయనున్నారు. ఓటర్లు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారాన్ని ప్రారంభించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. -
Delhi-NCR Rain: హీట్‌వేవ్ నుంచి ఊరట.. ఢిల్లీలో భారీ వర్షం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులకు మండు వేసవి నుంచి ఉపశమనం లభించింది. మంగళవారం(ఏప్రిల్23) సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి. హీట్‌వేవ్‌తో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా వర్షం పడటంతో చల్లబడింది. వర్షం పడుతున్న దృశ్యాలను ఢిల్లీ వాసులు ఆనందంతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం దేశంలో హీట్‌వేవ్ కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. -
వణికిస్తున్న వడగాల్పులు.. పిట్టల్లా రాలుతున్న జనం.. కేంద్రం అలర్ట్..!
ఢిల్లీ: ఉత్తర భారతంలో వడగాల్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వడగాల్పులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాలకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. వడగాల్పుల తీవ్రత నుంచి బయటపడటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇప్పటికే తగు సూచనలు చేసినట్లు చెప్పారు. ప్రజలను రక్షించడానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వడదెబ్బతో ఎవరూ మరణించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో విపరీతంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా దేశంలో వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. చాలా రాష్ట్రాల్లో మోతాదుకు మించి ఎండలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల్లోనే ఒకే జిల్లాలో 54 మంది మృతి చెందారు. 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశాల్లో ఎండల దృష్ట్యా వేసవి సెలవులను కూడా ప్రభుత్వం పొడిగించింది. ఇదీ చదవండి: రాజకీయ వివాదాల నడుమ.. ‘అందరికీ ఉచితంగా గుర్బానీ’ బిల్లు ఆమోదం -
దెబ్బకొట్టిన బిపర్జోయ్.. ఏపీకి మండుటెండల అలర్ట్
సాక్షి, ఢిల్లీ: జూన్ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈలోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. అయితే.. రాయలసీమలో మాత్రం రేపటి(17-06) నుంచి వేడి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే ఎల్లుండి నుంచి సీమలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తొలకరిని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది దోబూచులాడుతున్నాయి. జూన్ 8నే కేరళను తాకి మెల్లిగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నట్లు కనిపించాయి. ఆలస్యంగా అయినా వచ్చేశాయంటూ సంబురపడే లోపే.. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దానిని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంది. అంతా సవ్యంగా ఉంటే.. ఎల్లుండి(జూన్ 19) నుంచి నైరుతి రుతుపవనాలు ఏపీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. -
ఏపీలో తీవ్ర వడగాల్పులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
సాక్షి, అమరావతి: నేడు రాష్ట్రంలో 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ తెలిపింది. బుధవారం 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(127) : ⇒ అల్లూరి జిల్లా -2 ⇒ అనకాపల్లి -8 ⇒ బాపట్ల -9 ⇒ తూర్పుగోదావరి -17 ⇒ ఏలూరు -3 ⇒ గుంటూరు -13 ⇒ కాకినాడ -18 ⇒ కోనసీమ -15 ⇒ కృష్ణా -18 ⇒ ఎన్టీఆర్ -8 ⇒ పల్నాడు -2 ⇒ మన్యం -1 ⇒ విశాఖ -3 ⇒ పశ్చిమగోదావరి జిల్లాలోని 13 మండలాల్లో తీవ్రవడగాల్పులు, మరో 173 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ⇒ నేడు విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ⇒ కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాలు, మిగిలిన చోట్ల మొత్తం 34 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8°C, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో 44.7°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి. -డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ. చదవండి: బంగ్లా తీరాన్ని తాకిన మోకా -
ఏప్రిల్–జూన్‌లో వేడి సెగలు!
న్యూఢిల్లీ: వాయవ్య ప్రాంతం మినహా దాదాపు భారతదేశమంతటా ఈ ఏప్రిల్ నుంచి జూన్ నెలదాకా సాధారణం కంటే కాస్త ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సంబంధిత వివరాలను శనివారం ప్రకటించింది. ‘ 2023 ఎండాకాలంలో మధ్య, తూర్పు, వాయవ్య భారతంలో సాధారణం కంటే ఎక్కువగా హీట్‌వేవ్ రోజులు కొనసాగవచ్చు. దేశవ్యాప్తంగా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికం కావచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో, ఇంకొన్ని వాయవ్య ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా, సాధారణం కంటే తక్కువగా నమోదుకావచ్చు’ అని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను, తీరప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ను, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌ను దాటినా, ఆ సీజన్లో ఆ ప్రాంతంలో సాధారణంగా నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే దానిని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. భారత్‌లో 1901 నుంచి ఉష్ణోగ్రతల నమోదును గణిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి.. అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకెక్కడం గమనార్హం. అయినాసరే సాధారణం కంటే ఎక్కువగా(29.9 మిల్లీమీటర్లకు బదులు 37.6 మిల్లీమీటర్లు) వర్షపాతం నమోదవడం, ఏడుసార్లు పశ్చిమ అసమతుల్యతల కారణంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మామూలు స్థాయిలోనే కొనసాగిన విషయం విదితమే. గత ఏడాది మార్చి నెల మాత్రం గత 121 సంవత్సరాల్లో మూడో అతి పొడిబారిన మార్చి నెలగా రికార్డును తిరగరాసింది. భారత్‌లో రుతుపవనాల స్థితిని ప్రభావితం చేసే దక్షిణఅమెరికా దగ్గర్లోని పసిఫిక్ మహాసముద్ర జలాలు చల్లబడే(లా నినో) పరిస్థితి బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. లా నినో పరిస్థితి లేదు అంటే ఎల్ నినో ఉండబోతోందని అర్థం. ఎల్ నినో అనేది అక్కడి సముద్ర జలాలు వేడెక్కడాన్ని సూచిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చే గాలుల కారణంగా భారత్‌లో రుతుపవనాల సీజన్లో తక్కువ వర్షాలు కురుస్తాయి. అయితే మే నెలకల్లా పరిస్థితులు మారే అవకాశముందని భిన్న మోడల్స్ అంచనాల్లో తేలిందని వాతావరణ శాఖ తెలిపింది. -
నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం... తిట్టిపోస్తున్న జనాలు
భారత్‌లో భారీ వర్షాలతో జలాశయాలన్ని పూర్ణ కుంభంలా ఉంటే యూఎస్, యూకేలో భానుడు భగ భగ మంటున్నాడు. దీంతో అక్కడ పలు చోట్ల రైలు పట్టాలు వేడికి వంకర్లు తిరగడం, అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం వంటి ఘటనలు చోటు చూసుకున్నాయి కూడా. అక్కడ వేడి గాలులకు జంతువులు సైతం తాళ్లేక నీటి కోసం ఆర్రులు చాచుతున్నాయి. తాజాగా న్యూయార్క్ ఒక గుర్రపు బండికి ఉన్న గుర్రం వేడిగాలుకు సొమ్మసిల్లి పడిపోయింది. అసలేం జరిగిందటే... అమెరికాలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఆ ఎండల ధాటికి ఒక గుర్రం సోమ్మసిల్లి పడిపోయింది. ఆ గుర్రం ప్రసిద్ధిగాంచిన గుర్రపు జాతుల్లో ఒకటి. గుర్రపు బండికి ఉన్న గుర్రం రోడ్డు పై వెళ్తు వెళ్తూ... మాన్హాటన్ హెల్స్ కిచెన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఆ గుర్రానికి నెత్రిపై సుర్ర మంటున్న ఎండ మరోవైపు వేడిగా ఉన్న తారు రోడ్డు, ఈ రెండిటి ధాటికి బండిని లాగలేక పడిపోయింది. దీంతో రహదారిపై ఉన్న జనాలు ఆ గుర్రపు బండిని తోలే వ్యక్తి పై మండిపడ్డారు. పైగా ఆ వ్యక్తి గుర్రం పడిపోవడానికి ముందు బండిని లాగేలా...కొరడాతో గట్టిగా కొట్టాడాని ఆరోపణలు చేశారు. ఒక్క పక్క వేడుగాలులు, దీనికి తోడు అతను కొట్టడంతో ఆ గుర్రం నడవలేక పోయిందంటూ సదరు వ్యక్తిని తిట్టడం మొదలు పెట్టారు. ఈ ఘటనతో న్యూయార్క్ అధికారులు ఆ గుర్రాన్ని నీటితో తడుపుతూ సపర్యలు చేశారు. గుర్రాన్ని సంరక్షించే వ్యక్తి కూడా దాన్ని తిరిగి లేచి నిలబడేందుకు సాయం అందిస్తున్నాడు. కానీ ఆ గుర్రం లేచి నిలబడే స్థితిలో లేదు. జంతు ప్రేమికులు ఈ గుర్రాన్ని రైడ్ చేయడానికి వినయోగించొద్దని అధికారులను కోరారు. వాస్తవానికి ఆ గుర్రానికి నరాల వ్యాధి ఉందని ఇలా పడిపోతుంటుందని న్యూయార్క్ గుర్రాల ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ చెబుతుండటం విశేషం. ప్రస్తుతం గుర్రం పశువైద్య సంరక్షణలో ఉందని, చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. BREAKING: This horse COLLAPSED while pulling a carriage in NYC, likely from heat exhaustion, and has been down for over an hour. Horses don’t belong in big cities where they’re put in constant danger because of cars, humans, weather, and more. pic.twitter.com/vXBVRJRjPB — PETA (@peta) August 10, 2022 (చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!) -
చేద్దామా? చద్దామా?
సెకనుకు సుమారు 13.3 హిరోషిమా అణ్వాయుధాలు లేదా రోజుకు 11,50,000 అణ్వాయుధాలు పడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం భూగోళం ఎదుర్కొంటున్న సమస్య ఇంత తీవ్రంగా ఉంది. ఈ మంటలు పుట్టించే వేడికి ఏ దేశమూ మినహాయింపు కాదు. చల్లటి ప్రాంతాలుగా పేరొందిన యూరోపియన్ దేశాలు సైతం ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకోవైపు కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అదుపు తప్పిందన్నది నిజం. ఎప్పటికో అనుకున్నది ఇప్పటికే వచ్చేసింది. కొందరు నమ్ముతున్నట్టు ఏ కొత్త టెక్నాలజీనో వచ్చి అమాంతం సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వాల స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో చర్యలు మొదలుకావాలి. లేదంటే, ‘వాతావరణ ఆత్మహత్యలే’ శరణ్యం. విపరీత వాతావరణం పుణ్యమా అని గత వారంలో స్పెయిన్, పోర్చుగల్‌లలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లోనైతే రికార్డులు బద్దలు కొడుతూ 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ ఈ వడగాడ్పులను సామూహిక ఆత్మహత్యలకు ఏమాత్రం తీసిపోని పరిణామమని హెచ్చరించారు. వాతావరణ మార్పుల మీద జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలకు చెందిన మంత్రులతో మాట్లాడుతూ... ‘‘మానవాళిలో సగం ఇప్పటికే వరదలు, కరవులు, తుపాన్లు, కార్చిర్చుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు. అయినా మనం శిలాజ ఇంధనాల వ్యసనాన్ని కొనసాగి స్తున్నాం. ఇప్పుడు మన ముందు ఒక అవకాశం ఉంది. కలిసికట్టుగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేద్దామా? లేక అందరమూ కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుందామా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల ప్రకోపం పతాక స్థాయికి చేరిన ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి హెచ్చరిక అనూహ్యమేమీ కాదు. ఎవరో అన్నట్లు... ఇవి వాతావరణ మార్పులు కాదు, ‘వాతావరణ ఆత్మహత్యలు’. యూరప్, ఉత్తర అమెరికాల్లో చాలా భాగాల్లో కార్చిచ్చులు కలవరపెడుతున్నాయి. ఇంకోవైపు భారత్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లో ఏటికేడాదీ కుంచించుకుపోతున్న మంచు! అదే సమ యంలో ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు! ఇవన్నీ చూస్తే ప్రపంచ వాతావరణం అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. వాతా వరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ... ఎప్పుడో వస్తున్నాయనుకున్నవి ఇప్పుడే వచ్చేస్తూండటం, జరుగు తున్న నష్టం తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఒహాయో యూనివర్సిటీ మాజీ గణిత శాస్త్రవేత్త ఇలియట్ జాకబ్సన్‘వాచింగ్ ద వరల్డ్ గో బై’ పేరుతో ఓ లెక్క చెప్పారు. ‘‘ఈ గ్రహంపై సెకనుకు 13.3 హిరోషిమా అణు బాంబులు పేలితే పుట్టేంత వేడి పుడుతోంది. అంటే రోజుకు 11,50,000 అణు బాంబులంత వేడన్నమాట’’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా సెకనుకు 12 హిరోషిమా అణుబాంబుల స్థాయిలో పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. తలుచుకుంటేనే భయం పుట్టే స్థాయి. అయినా సరే, మనం కలిసికట్టుగా పనిచేసేం దుకు సిద్ధంగా లేము. అందుకేనేమో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా ప్రభుత్వాలు చెప్పేదొకటీ, చేసేది ఇంకోటీ అని నిష్టూరమాడారు. పచ్చిగా మాట్లాడాల్సి వస్తే దేశాలన్నీ అబద్ధాలు చెబుతున్నాయన్నారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ తాజా నివేదిక విడుదలైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ శతాబ్దాంతానికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకూడదనుకుంటే... 2022 నాటికి కర్బన ఉద్గారాలు పతాకస్థాయికి చేరాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇంకోలా చెప్పాలంటే, 2023 నుంచి ఉద్గారాలు గణనీయంగా తగ్గాలే తప్ప మరి పెరగకూడదన్నమాట. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కానీ సమయమేమో మించిపోతోంది. హెచ్చరికలు బేఖాతరు... వాతావరణం మనకిప్పటికే అన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నా అన్నీ బేఖాతరవుతున్నాయి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఆర్థిక వేత్తలు, శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు కూడా నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగల వీరు ఇస్తున్న సందేశమేమిటి? ఏం ఫర్వాలేదు; కొత్త కొత్త టెక్నాలజీ లొస్తున్నాయి; వాతావరణ సమస్యలకు ఇవి సమాధానం చెబుతాయి; అందోళన అనవసరం అని! ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ప్రకృతి వైపరీ త్యాలకూ వాతావరణ మార్పుల ప్రభావానికీ సంబంధం లేదని కూడా కథనాలు వెలువడుతున్నాయి! అంతేకాకుండా... ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసాన్ని కూడా కొందరు సమర్థించుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శిలాజ ఇంధనాలను త్యజించాలన్న డిమాండ్ పెరుగుతోంది కూడా. ప్రధాన స్రవంతిలోని ఆర్థికవేత్తలకు భిన్నంగా ఆలోచిస్తున్న బ్రిటిష్ మంత్రి జాక్ గోల్డ్ స్మిత్ ఒక ట్వీట్ చేస్తూ... ‘‘యూరప్ మొత్తమ్మీద కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవు తున్నాయి. అడవులు, పర్యావరణ వ్యవస్థలు కూడా రికార్డు వేగంతో నశించిపోతున్నాయి. అయినా పర్యావరణ పరిరక్షణకు డబ్బులు ఖర్చు చేయడం ఏమంత లాభదాయకం కాదనే రాజకీయ నేతలు మళ్లీ పదవులకు ఎన్నికవుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ –కీ మూన్ గతంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, వాతావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఆర్థిక విధానాలను చక్కదిద్దే నాయకత్వపు అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పడం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఇదేననీ, రాజకీయ నేతలు ఈ గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారనీ నా నమ్మకం కూడా. అభివృద్ధికి సూచిక స్థూల జాతీయోత్పత్తి అన్న వ్యామోహం నుంచి బయటపడనంత వరకూ వాతావరణ సమస్య లకు పరిష్కారం లభించనట్లే. మనకిష్టమైనా, కాకపోయినా సరే... ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం సమాజంలో అంతరాలను పెంచిం దన్నది మాత్రం నిజం. అంతేకాకుండా... పర్యావరణ సమస్యలను తెచ్చిపెట్టిందీ, ప్రపంచం అంతరించిపోయే స్థితికి చేర్చింది కూడా ఇవే. కాబట్టి ఆర్థిక వ్యవస్థ సమూల ప్రక్షాళన తక్షణావసరం. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవహారం ఇకపై ఎంతో కాలం కొనసాగే అవకాశాలు లేవు. బహుశా ప్రస్తుతం వీస్తున్న వడగాడ్పులు ఓ షాక్ థెరపీనేమో. మానవాళి మేల్కొనేందుకు అవసరమైనదే కావచ్చు. నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందర్భమూ ఇదే. ఎందుకంటే, ఇది పోతే ఇంకోటి ఉందిలే అని భూమి గురించి అనుకోలేము కదా! కర్బన ఉద్గారాలకు, వాతావరణ సమస్యలకు, సంపద సృష్టికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందన్నది నిర్వివాదాంశం. ఆర్థికాభివృద్ధి ఎంత ఎక్కువైతే, అంతేస్థాయిలో కర్బన ఉద్గారాలూ పెరుగుతాయి. స్థూలజాతీయోత్పత్తిని పెంచు కోవాలన్న తపనలో భూమి వేడి కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యం లోనే మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన డాక్టర్ హెర్మన్ డాలీ ‘స్టెడీ స్టేట్ ఎకానమీ’కి మద్దతిచ్చారు. ‘‘ప్రతి రాజకీయ నాయ కుడూ వృద్ధికి అనుకూలంగా ఉన్నాడు. అర్థం చేసుకోదగ్గ విషయమే. కానీ అసలు ప్రశ్నకు సమాధానం మాత్రం దాటవేస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వృద్ధి మనల్ని నిజంగానే ధనవంతులను చేస్తోందా? లేక లాభాలకంటే ఖర్చుల్ని ఎక్కువ చేస్తోందా? అన్నది కూడా ఆలోచించాలి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను సమర్థిస్తున్న వారు సమాధానమివ్వాల్సిన ప్రశ్న కూడా ఇదే. ఆర్థికవేత్తల ఆలోచనలు ఎలా ఉన్నా, సామాన్యుల వ్యవహారశైలిలోనూ కొన్ని మార్పులు అని వార్యం. వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చు. వాతావరణ సమస్య మనం సృష్టించింది కాకపోయినా, ఇప్పటివరకూ కొనసాగడంలో మాత్రం మనవంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Europe Heatwave: మండిపోతున్న యూరప్.. చరిత్రలో తొలిసారి
లండన్: యూరప్‌ను ఎండలు అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం లింకన్షైర్లోని కోనింగ్స్‌బైలో ఏకంగా 40.3 డిగ్రీలు, హీత్రూలో 40.2 డిగ్రీలు నమోదైంది! దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా అసాధారణ స్థాయిలో ఎండలు మండిపోయాయని వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం రాత్రి నమోదైన 26 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఒక రికార్డేనని తెలిపింది. లండన్‌తోపాటు ఇంగ్లండ్‌లోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ విభాగం ప్రమాద హెచ్చరికలు చేసింది. సోమవారం జారీ చేసిన రెడ్ వార్నింగ్‌ను అధికారులు మంగళవారం కూడా కొనసాగించారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో తూర్పు లండన్‌లోని వెన్నింగ్టన్ గ్రామంలో గడ్డికి అంటుకున్న మంటలు ఇళ్లకు వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూరప్‌లో పలు దేశాలు ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం ఫ్రాన్సు, స్పెయిన్, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఎక్కువగా ఉంది. ఫ్రాన్సు, స్పెయిన్, పోర్చుగల్, గ్రీసుల్లో అడవులను వారం రోజులుగా మంటలు దహించి వేస్తున్నాయి. ఇంగ్లండ్‌లో లండన్‌లోని కేంబ్రిడ్జిలో 2019లో నమోదైన 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటిదాకా రికార్డు. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు జనం జలాశయాలను ఆశ్రయిస్తున్నారు. రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కువ సేపు ఎండ ప్రభావానికి గురైతే అనారోగ్యం తప్పదంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వేసవి తీవ్రత నేపథ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో రహదారులను మూసివేశారు. కొన్ని రైళ్లను ఆలస్యంగా నడిపారు. కొన్నిటిని రద్దు చేశారు. 40 డిగ్రీల ఎండలుంటే రైలు పట్టాలపై ఉష్ణోగ్రతలు 50, 60, 70 డిగ్రీల వరకు వెళ్తుంది. అలాంటి సమయాల్లో పట్టాలు అతుక్కుపోయి, రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదముందని రైల్వే శాఖ తెలిపింది. ఎండలతో తలెత్తే డిమాండ్ కారణంగా ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నీటి సరఫరా సంస్థలు తెలిపాయి.