high court bifurcation
-
ఏపీ హైకోర్టు
-
కర్నూలులో హైకోర్టు డిమాండ్ చేసింది బీజేపీనే
సాక్షి, కర్నూలు : కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని దీక్ష చేస్తున్న న్యాయవాదులకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంఘీభావం తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటగా డిమాండ్ చేసింది బీజేపీనేని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేస్తారని కోరుతున్నామన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన తప్పు ప్రస్తుత సీఎం జగన్ చేయరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2 నుంచి పదిహేను రోజులపాటు ప్రజా సమస్యలపై, రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. జల సంరక్షణ పథకం ద్వారా దేశంలోని ప్రతి కుటుంబానికి మంచినీటి సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జీవీఎల్ తెలిపారు. -
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు నూతన న్యాయమూర్తుల నియామకంపై సుప్రీం కోర్టు కొలీజియం కసరత్తు ముమ్మరం చేసింది. ఏపీ హైకోర్టుకు బిఎస్ భానుమతి, సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, ఎం వెంకటరమణ, ఏ. హరిహరనాథ శర్మలను నియమించాలని సిఫార్సు చేసింది. ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా శ్రీసుధ, సుమలత, ఎన్ తుకారాంజీల పేర్లను సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. కాగా, ఏపీ నూతన హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి విక్రమ్ నాధ్‌ను కొలీజియం ఇటీవల ఖరారు చేసిన సంగతి తెలిసిందే. -
ఇప్పుడు జోక్యం చేసుకోలేం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈవిషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయ స్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టులో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనందున ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియను వా యిదా వేయాలంటూ ఏపీ న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు సీతారాం, సభ్యుడు కాసాని జగన్మోహన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ బుధవారం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రవీణ్ చతుర్వేది వాదిస్తూ.. ఏపీ హైకోర్టు భవనాలు, మౌలిక వసతుల కల్పన డిసెంబర్ 15 నాటికి పూర్తి చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని చెప్పారు. ఈ క్రమంలో న్యాయమూర్తులు జోక్యం చేసుకొని.. ఉమ్మడి హైకోర్టు విభజన అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, ఇప్పటికే రెండు రాష్ట్రాల హైకోర్టుల కార్యకలాపాలు ప్రారంభమైనందున తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఆరంభంలో చిన్నచిన్న సమస్యలు సాధారణంగానే ఉంటాయని వ్యాఖ్యానించి కేసును విచారించేందుకు తిరస్కరించారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్లు కోరగా కోర్టు అనుమతించింది. -
హైకోర్టు విభజనపై సుప్రీం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల హైకోర్టులు కార్యకలాపాలు ప్రారంభించినందున తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఆరంభంలో చిన్నచిన్న సమస్యలు మామూలేనని వ్యాఖ్యానించింది. పిటిషన్ ఉపసంహరించుకునేందుకు ఏపీ న్యాయవాదుల సంఘానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవన నిర్మాణం ఇంకా పూర్తికానందున రాష్ట్రపతి జారీ చేసిన హైకోర్టు విభజన నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని ఏపీ న్యాయవాదుల సంఘం, ఆ సంఘం ఉపాధ్యక్షుడు కె. సీతారాం, సభ్యుడు కాసాని జగన్మోహన్రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, విజయవాడలో తాత్కాలిక భవన సముదాయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సహా న్యాయమూర్తులు అందరూ విధులకు హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో 13 మంది న్యాయమూర్తులతో నిన్న గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. -
హైకోర్టు ఉద్యోగుల కేటాయింపులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల విభజన కూడా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇచ్చిన వారందరినీ ఆ రాష్ట్రానికే కేటాయించారు. వీరంతా నాలుగో తేదీలోపు అమరావతి వెళ్లి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) వద్ద రిపోర్ట్ చేయాలని రిజిస్ట్రార్ (అడ్మిన్) డి.నాగార్జున సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన వారిలో చాలా మందిని వారి వారి కేడర్‌లో పోస్టులు ఖాళీ లేకపోవడంతో డిప్యుటేషన్‌పై ఏపీ హైకోర్టుకు వెళ్లాలని పేర్కొన్నారు. మరికొంత మందిని తెలంగాణలోనే కింది కోర్టుల్లో డిప్యుటేషన్‌పై చేరాలని స్పష్టం చేశారు. జాయింట్ రిజిస్ట్రార్ పి.శ్రీధర్‌రావు తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇవ్వగా ఆయనను ఏపీ హైకోర్టుకు డిప్యూట్ చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో 12 మందిని, సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో 51 మందిని, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో 13 మందిని, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో 36 మందిని, ఎగ్జామినర్ల కేడర్‌లో 7 మందిని ఏపీ హైకోర్టుకు డిప్యుటేషన్‌పై వెళ్లాలని ఆదేశించారు. అసిస్టెంట్ కేడర్‌లో 67 మందిని, ఆఫీస్ సబార్డినేట్ కేడర్‌లో 151 మందిని తెలంగాణలోని కింది కోర్టులో పనిచేయాలని స్పష్టం చేశారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చి కేడర్ పోస్టులు ఖాళీగా లేనందున ఏపీ హైకోర్టుకు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులతో ఆయా కేడర్‌లో భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను సీనియారిటీ ఆధారంగా భర్తీ చేశారు. తెలంగాణ హైకోర్టులో ఆయా కేడర్‌లో ఖాళీ అయ్యే పోస్టుల్లోకి వీరు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో తెలంగాణ హైకోర్టులో ఒక పోస్టు ఖాళీ అయిందనుకుంటే, ఆ పోస్టును ఏపీ హైకోర్టు డిప్యుటేషన్‌పై పంపిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లలో సీనియర్ అయిన అధికారి చేత భర్తీ చేస్తారు. ఇదే రీతిలో మిగిలిన కేడర్ పోస్టులను సైతం భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి గతంలోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త బెంచీల ఏర్పాటు.. ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన జనవరి 1 నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇరు హైకోర్టులకు వేర్వేరు వెబ్సైట్లను రూపొందించారు. హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో కొత్త న్యాయమూర్తులతో కొత్త బెంచీలు ఏర్పాటు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారు. కేసుల విచారణలో పాత కేసులకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. సీజే సహా మొదటి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో బెంచీలు ఏర్పాటయ్యాయి. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ బెంచ్‌లుగా కేసులను విచారిస్తారు. మొదటి బెంచీలో సీజే జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, రెండో బెంచీలో జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, మూడో బెంచీలో జస్టిస్ ఆర్.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావు ఉంటారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, రిట్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్‌లు, పర్యావరణ, వినియోగదారుల వివాదాలు తదితర కేసులను సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. క్రిమినల్ అప్పీళ్లు, ఉరిశిక్ష ఖరారు తదితర కేసులపై జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఇన్‌కంట్యాక్స్ ట్రిబ్యునల్ అప్పీళ్లు, వివిధ చట్టాలను, చట్ట నిబంధనలను, ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులను, మనీలాండరింగ్ కేసులను జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలతో పాటు పలు ఇతర శాఖల కేసులను జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, సివిల్ రివిజన్ పిటిషన్లు, ఒరిజినల్ పిటిషన్లను జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, హోం (ఎఫ్ఐఆర్ల కొట్టివేత కేసులు మినహా), కేంద్ర ప్రభుత్వ శాఖలు, వైద్య, ఆరోగ్య శాఖ, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు పలు ఇతర శాఖల కేసులను జస్టిస్ పి.నవీన్‌రావు, పురపాలకశాఖ, భూ సేకరణ, గనులు, రవాణా, దేవాదాయం, ఎక్సైజ్, అటవీ తదితర శాఖల కేసులను జస్టిస్ చల్లా కోదండరాం, క్రిమినల్ రివిజన్లు, క్రిమినల్ పిటిషన్లను జస్టిస్ బి.శివశంకర్‌రావు, బెయిళ్లు, క్రిమినల్ అప్పీళ్లను జస్టిస్ షమీమ్ అక్తర్, పరిపాలన ట్రిబ్యునల్ నుంచి వచ్చిన కేసులను జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారిస్తారు. -
కొలువుదీరిన కొత్త హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరాదిన తెలంగాణ కొత్త హైకోర్టు కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టు చేరుకున్న జస్టిస్ రాధాకృష్ణన్ తన సహచర న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ బి.శివశంకర్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్లతో ప్రమాణం చేయించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు మొదటి కోర్టు హాలు వేదిక కాగా, ఈసారి హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వేదిక నుంచి ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం సీజే, ఇతర న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావు, బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్‌రావు, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావుతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ 1959 ఏప్రిల్ 29న కేరళలో జన్మించారు. తల్లిదండ్రులు ఎన్.భాస్కరన్ నాయర్, కె.పారుకుట్టి అమ్మ.. ఇద్దరూ న్యాయవాదులే. కొల్లాంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన జస్టిస్ రాధాకృష్ణన్, కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ, బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1988లో ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. అనతికాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2004లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా, అక్కడి నుంచి బదిలీపై ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. ఉమ్మడి హైకోర్టు విభజన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ రాజస్తాన్‌కు చెందిన జస్టిస్ చౌహాన్, 1959 డిసెంబర్ 24న జన్మించారు.1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ డిగ్రీ సాధించారు. అదే ఏడాది రాజస్తాన్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1996 నుంచి 2005 వరకు రాజస్తాన్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, రాజ్యాంగపర, సర్వీసు కేసుల్లో పట్టు సాధించారు. 2005 జూన్ 13న రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బదిలీపై 2015 మార్చి 10న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది నవంబర్ 23న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ వి.రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టీఆర్మణిల వద్ద న్యాయ మెళకువలు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మంచివక్తగా పేరున్న జస్టిస్ రామసుబ్రమణియన్ 2016 ఏప్రిల్ 27న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ 1963 ఆగస్టు 14న పులిగోరు రామచంద్రారెడ్డి, పి.పద్మావతమ్మ దంపతులకు జన్మించారు. రామచంద్రారెడ్డి 1969 నుంచి 1982 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. సంజయ్‌కుమార్ నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1988లో ఢిల్లీ యూని వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యి, తన తండ్రి వద్దే వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. న్యాయవాద వృత్తి నుంచి తండ్రి తప్పుకొన్న తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2000–03 సంవత్సరాల మధ్య ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2008 ఆగస్టు 8న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు 1966 ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి జస్టిస్ ఎం.జగన్నాథరావు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. తాత జస్టిస్ రామచంద్రరావు 1960–61 సంవత్సరా ల్లో హైకోర్టు జడ్జిగా పనిచేశారు. చిన్న తాత జస్టిస్ ఎం.కృష్ణారావు కూడా హైకోర్టు జడ్జిగా వ్యవహరించారు. జస్టిస్ రామచంద్రరావు ఎస్సెస్సీ సెయింట్ పాల్ హైస్కూల్, ఇంటర్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ, బీఎస్సీ మ్యాథ్స్ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో చదివారు. మ్యాథ్స్‌లో ఆయన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. 1989లో ఓయూ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్బీ చివరి ఏడాదిలో అత్యధిక మార్కు లు సాధించినందుకు సీవీఎస్ఎస్ చార్యులు బంగారు పతకాన్ని సాధించారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రఖ్యాత క్రేంబిడ్జి యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. ఈ సమయంలో ఆయనకు క్రేంబిడ్జి కామన్వెల్త్ స్కాలర్షిప్, బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కామర్స్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ లభించింది. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2012లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి నల్లగొండ జిల్లా, సిరిసినగండ్ల గ్రామంలో ఎ.రామానుజరెడ్డి, జయప్రద దంపతులకు 1960 మే 4న జన్మించారు. మిర్యాలగూడలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. హైదరాబాద్ ఏజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి బంగారు పతకంతో బీఎల్ డిగ్రీ సాధించారు. 1985లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది మహమూద్ అలీ వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నుంచి 2009 వరకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు. 2013న న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.నవీన్‌రావు కరీంనగర్ జిల్లా, నంది మైడారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి విమల, తండ్రి మురళీధర్‌రావు. 1986లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏ డాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2013న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి 1963 అక్టోబర్ 8న సుబ్బారావు, యశోద దంపతులకు జన్మించారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యా రు. న్యాయవాది డి.లింగారావు వద్ద జూనియర్‌గా చేరారు. తర్వాత విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్రావు వద్ద చేరి, ఉద్యోగుల సర్వీసు వివాదాల కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2017న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ చల్లా కోదండరామ్ అనంతపురం జిల్లా, చల్లావారిపల్లె గ్రామంలో 1959లో జన్మించారు. 1983లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1979 నుంచి 1988 వరకు పారిశ్రామిక రంగంలో పనిచేశారు. కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరించారు. 1988 జూన్ 24న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్న్యాయవాది ఎ.వెంకటరమణ, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.పర్వతరావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ట్యాక్స్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. సుప్రీంకోర్టు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు హైకోర్టుల్లో కూడా కేసులు వాదించారు. ఆయన వాదించిన కేసులు వివిధ జర్నల్స్‌లో 250 వరకు ప్రచురితమయ్యాయి. 2013న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ శివశంకర్‌రావు జస్టిస్ శివశంకర్‌రావు 1959 మార్చి 29న తూర్పు గోదావరి జిల్లా, సకుర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి గవర్రాజు సర్పంచ్‌గా వ్యవహరించారు. తల్లి సూర్యకాంతం గృహిణి. వీరిది వ్యవసాయ కుటుంబం. నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పీహెచ్డీ పూర్తి చేశారు. 1984 మార్చిలో న్యాయ వాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయ వాదులు పాలగుమ్మి సూర్యారావు, దువ్వూరి మార్కండేయులు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1996లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఏపీ, తెలంగాణలో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ షమీమ్ అక్తర్ 1961 జనవరి 1న నల్లగొండలో రెహీమున్సీసా బేగం, జాన్ మహ్మద్ దంపతులకు జన్మించారు. నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. పీజీ లా కాలేజీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. 1986 నుంచి 2002 వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2002లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.కేశవరావు 1961 మార్చి 29న ప్రకాశరావు, జయప్రద దంపతులకు జన్మించారు. కాకతీయ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వరంగల్ జిల్లాలో పి.సాంబశివరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1991లో హైదరాబాద్‌కు ప్రాక్టీస్ మార్చి, ఎంవీ రమణారెడ్డి ఆఫీసులో చేశారు. 1996లో స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులు, ఎన్నికల కేసుల్లో పట్టు సాధించారు. ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2010లో సీబీఐ స్పెషల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. అనేక సంచలన కేసుల్లో వాదనలు వినిపించారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అమర్నాథ్ గౌడ్ 1965 మార్చి 1న కృష్ణ, సావిత్రి దంపతులకు జన్మించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. మహారాష్ట్రలోని శివాజీ కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య వద్ద జూనియర్‌గా చేరారు. అనతికాలంలోనే సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. పలు బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. అమర్నాథ్ గౌడ్ తాత టి.అంజయ్య సంఘ సంస్కర్త. ప్యారడైజ్ థియేటర్ య జమాని. సొంత భూమిని కవాడిగూడ శ్మశానం కోసం ఇచ్చారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
ఏపీ సీజేగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రమాణస్వీకారం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. (కొత్త అధ్యాయం) జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఫిబ్రవరి 26, 1961లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. పద్మనాభరెడ్డి ఎంతో మంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించారు. 10వ తరగతి వరకు ప్రవీణ్‌కుమార్ విద్యాభ్యాసం హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో సాగింది. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్ చేసి నిజాం కాలేజీ నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే వృత్తి జీవితాన్ని ఆరంభించారు. అతి తక్కువ కాలంలో తండ్రి లాగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు మొదలవుతాయి. ఇందుకోసం విజయవాడలోని సివిల్ కోర్టుల పక్కనున్న సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టులను ఏర్పాటు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం ముగిసిపోయింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హైకోర్టు కార్యాలయం కోసం ఎం.జి.రోడ్డులోని ఏ.పి.ఏ.టి. భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ఫర్నిచర్ ఏర్పాటు చేయమని సీఆర్డీఏను, హైకోర్టు కార్యకలాపాల అవసరాలకు కంప్యూటర్లను సమకూర్చాలని ఐటీ శాఖను ఆదేశించారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మిగతా న్యాయమూర్తులు.. 1. జస్టిస్ వెంకట నారాయణ భట్టి 2. జస్టిస్ వెంకట శేష సాయి 3. జస్టిస్ సీతారామ మూర్తి 4. జస్టిస్ దుర్గా ప్రసాద రావు 5. జస్టిస్ సునీల్ చౌదరి. 6. జస్టిస్ సత్యనారాయణ మూర్తి 7. జస్టిస్ శ్యాం ప్రసాద్ 8. జస్టిస్ ఉమ దేవి 9. జస్టిస్ బాలయోగి 10. జస్టిస్ రజని 11. జస్టిస్ వెంకట సుబ్రమణ్య సోమయాజులు 12. జస్టిస్ విజయ లక్ష్మి 13. జస్టిస్ గంగా రావు -
కొత్త అధ్యాయం
విజయవాడ లీగల్/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/ గరికపాడు (జగ్గయ్యపేట)/సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం ముగిసిపోయింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నూతన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జనవరి 2వ తేదీ నుంచి హైకోర్టు కార్యకలాపాలు మొదలవుతాయి. ఇందుకోసం విజయవాడలోని సివిల్ కోర్టుల పక్కనున్న సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టులను ఏర్పాటు చేశారు. ఇక హైకోర్టు కార్యాలయం కోసం ఎం.జి.రోడ్డులోని ఏ.పి.ఏ.టి. భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ఫర్నిచర్ ఏర్పాటు చేయమని సీఆర్డీఏను, హైకోర్టు కార్యకలాపాల అవసరాలకు కంప్యూటర్లను సమకూర్చాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. న్యాయమూర్తులు, అధికారుల వసతికోసం ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను హైకోర్టు రిజిస్టార్ జనరల్(విజిలెన్స్) సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వై.లక్ష్మణరావు, హరిహరనాథ్ శర్మలు దగ్గరుండి చూశారు. హైకోర్టు న్యాయమూర్తులకు, రిజిస్ట్రార్లకు నగరంలోని హోటల్ నోవాటెల్‌లో వసతి సదుపాయం ఏర్పాటు చేశారు. ఇతర న్యాయశాఖ అధికారులకు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస కల్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని హైకోర్టు నుంచి విజయవాడకు తరలివెళ్తున్న ఏపీ న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయమూర్తులకు ఘన స్వాగతం.. రాష్ట్ర హైకోర్టు కార్యకలాపాలు అమరావతిలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టుకు కేటాయించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఇతర న్యాయమూర్తులందరూ సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన విజయవాడకు చేరుకున్నారు. వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, ప్రోటోకాల్ సెక్రటరీ ఎన్.శ్రీకాంత్, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, సబ్ కలెక్టర్ మిషాసింగ్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నుంచి తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా నియమితులైన జస్టిస్ ప్రవీణ్‌కుమార్ గౌరవ వందనం అందుకున్నారు. ప్రధాన న్యాయమూర్తులతోపాటు వారి కుటుంబసభ్యులు ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ వచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కలసిన బీబీఏ ప్రతినిధులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.నారాయణ బట్టి, జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యామ్‌ప్రసాద్, జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ టి.రజనీ, జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ ఎం.గంగారావులను బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) అధ్యక్షుడు కొండపల్లి సత్యనారాయణరావు, ఉపాధ్యక్షుడు కనిశెట్టి వెంకటరంగారావు, ప్రధాన కార్యదర్శి దొడ్ల లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులు మువ్వల జయప్రకాష్, ఎం.హనుమంత్, సి.హెచ్.రాధాకుమారి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్, బీబీఏ మాజీ అధ్యక్షులు చేకూరి శ్రీపతిరావు, గోగుశెట్టి వెంకటేశ్వరరావు, మట్టా జయకర్, సోము కృష్ణమూర్తి, చోడిశెట్టి మన్మథరావు తదితరులు హోటల్ నోవాటెల్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. నేడు నగరానికి రానున్న జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. కాగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ మంగవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, పాలక మండలి చైర్మన్ గౌరంగబాబు, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్ హైకోర్టు ఆవరణలో ఉద్వేగభరిత వాతావరణం హైకోర్టు విభజన నేపథ్యంలో ఏపీకి చెందిన సిబ్బంది, న్యాయవాదులు సోమవారం విజయవాడకు పయనమైనప్పుడు హైదరాబాద్‌లోని హైకోర్టు ఆవరణలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి హైకోర్టులో కలసిమెలసి పనిచేసిన న్యాయవాదులు, సిబ్బంది విడిపోతుండడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధాతప్త హృదయంతోనే పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏపీ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగులు, న్యాయవాదులు వీడ్కోలు చెప్పారు. అనంతరం హైకోర్టు నుంచి ఐదు ప్రత్యేక బస్సులు బయల్దేరి సోమవారం రాత్రికి విజయవాడకు చేరాయి. కోర్టు రికార్డులను కూడా తీసుకొచ్చారు. ఆ ఫైళ్లను ఆయా కోర్టుల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఇది తగునా బాబూ...!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వేర్వేరు రాష్ట్రాలుగా మనుగడ ప్రారంభించిన నాలుగున్నరేళ్ల తర్వాత ఏపీకి విడిగా హైకోర్టు ఏర్పడింది. అది నేటినుంచి పనిచేయడం ప్రారంభించ బోతోంది. న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ కావాలని ఆశించేవారంతా దీన్ని హృద యపూర్వకంగా స్వాగతిస్తారు. ఇంత సువిశాల దేశంలో నిజానికి ఇప్పుడున్న న్యాయ స్థానాలు సరిపోవు. వాటి సంఖ్య పెంచాలని కోరడంతోపాటు సుప్రీంకోర్టు బెంచ్‌లు వేర్వేరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని, కొన్ని హైకోర్టులకు ఆయా రాష్ట్రాల పరిధిలో వేరే చోట్ల బెంచ్‌లు ఏర్పాటు చేయాలని అనేకులు కోరుతున్నారు. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో సుప్రీంకోర్టు బెం చ్‌లు ఏర్పాటు చేస్తే దేశ పౌరులకు వ్యయప్రయాసలు తగ్గుతాయని, సత్వర న్యాయానికి వీలవుతుందని చాన్నాళ్లక్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వేర్వేరు లా కమిషన్లు, పార్లమెంటరీ స్థాయీ సంఘాలు సైతం భిన్న సందర్భాల్లో కేంద్రానికి సిఫార్సు చేశాయి. కానీ స్పందించాల్సిన కేంద్ర పాలకులు మాత్రం ఎప్పుడూ వాటి గురించి తమ వైఖరి వెల్లడించలేదు. కానీ మూడేళ్లక్రితం సుప్రీంకోర్టులో దాఖలైన ఒక వ్యాజ్యంపై విచారణ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త బెంచ్‌ల ఏర్పాటు కుదరదని తేల్చిచెప్పింది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం హైకోర్టు బెంచ్ కావాలంటూ న్యాయవాదులు ఆందోళన చేశారు. 1994 నుంచి అడపా దడపా సాగుతున్న ఈ ఆందోళనలకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతునిస్తూ వచ్చాయి. ఇప్పుడూ ఎటూ కొత్త రాష్ట్రం ఏర్పడింది కనుక రాజ్యాంగంలోని 214వ అధికరణానికి అనుగుణంగా హైకోర్టు కల సాకారమైంది. దీన్ని అమరావతిలో కాక కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు, విశాఖలో ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్రవాసులు గత కొన్నేళ్లుగా డిమాండు చేస్తూ వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకున్నట్టు చివరకు అమరావతిలోనే హైకోర్టు వచ్చింది. కొత్త హైకోర్టు ఏర్పాటుపై మొన్న బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రక్రియంతా ఎవరిలోనూ అసంతృప్తి లేకుండా పూర్తయి ఉంటే ఈ శుభసందర్భానికి అతికినట్టు ఉండేది. ఎందుకంటే హైకోర్టును ఎప్పుడు విభజిస్తారంటూ తెలంగాణ న్యాయవాదులు అడిగినట్టే, తమకు కొత్త హైకోర్టు ఎప్పుడు ఏర్పాటవుతుందంటూ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు డిమాండు చేస్తూ వచ్చారు. కానీ నోటిఫికేషన్ విడుదలయ్యాక కొన్ని అసంతృప్తి స్వరాలు వినబడ్డాయి. అవి సహేతుకమైనవేనని చెప్పకతప్పదు. అక్కడ అవసరమైన భవనాలు ఇంకా సిద్ధం కాకుండా ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని కోరడం ఎంత వరకూ న్యాయమన్నది అందులో ప్రధానమైనది. న్యాయమూర్తులు, న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులు తరలి వెళ్లడమంటే మాటలు కాదు. వారందరూ తలదా చుకోవ డానికి గూడు దొరకాలి. వారందరూ పనిచేయడానికి కావలసిన సమస్త సౌకర్యాలతో భవనం ఉండాలి. వీటన్నిటా బాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కొత్త హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా, దాని ప్రమేయం లేకుండా అది ఏర్పడే ప్రశ్నే ఉత్పన్నం కాదు. హైకోర్టు విభజన విషయంలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేసి నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడమే తరవాయి అని కేంద్రం ఒకటి రెండుసార్లు వివరణనిచ్చింది. తాత్కాలిక హైకోర్టు భవనం 2018 డిసెంబర్ 15కల్లా సిద్ధమవుతుందని ప్రమాణపూర్వకంగా సుప్రీంకోర్టు ముందు బాబు సర్కారు రెండు నెలల క్రితమే అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆ అడ్డంకి కూడా తొలగింది. భవంతుల నిర్మాణానికి రూ. 500 కోట్లు కేంద్రం విడుదల చేసింది. అనంతరం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు స్వయంగా వచ్చి నిర్మాణం పనుల్ని పరిశీలించారు. వారి వెంట మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్లు వెళ్లారు. గడువు తేదీలోగా అన్నీ పూర్తవుతాయని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు సైతం ఆ మాటే చెప్పారు. తీరా చూస్తే భవంతులు పూర్తికాకపోవడమే కాదు...కనీసం వాటిని చేరేందుకు సరైన రహదారే లేదు. చినుకు పడిందంటే ఆ ప్రాంతం మోకాల్లోతు బురదతో నిండి నడిచి వెళ్లడానికే అసాధ్యంగా మారుతుంది. ఇక వాహనాలు వెళ్లడం గురించి ఆలోచించనవసరమే లేదు. హైకోర్టుకు అవసరమైన భవనం సమకూర్చాలని నాలుగున్నరేళ్లక్రితమే తెలిసినప్పుడు, కేంద్రం అందుకు అవసరమైన నిధులు అందజేసినప్పుడు చంద్రబాబుకు ఉన్న అడ్డంకులేమిటి? మొన్న మార్చి వరకూ నిర్మాణపనులు మొదలుకాకపోవడానికి, ఆ తర్వాతైనా అవి నత్తనడకన సాగటానికి కారణమేమిటి? రెణ్ణెల్లక్రితం సుప్రీంకోర్టు ముందు తప్పుడు అఫి డవిట్ ఎందుకు దాఖలు చేశారు? కనీసం డిసెంబర్ మొదట్లోనైనా వాస్తవాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి ఎందు కు తీసుకెళ్లలేకపోయారు? ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు వచ్చినప్పుడైనా నిజం ఎందుకు చెప్పలేకపోయారు? పైగా నోటిఫికేషన్ విడుదలైనరోజున దాన్ని కీర్తిస్తూ, అది తమ ఘనతేనంటూ చెప్పినవారు 24 గంటలు తిరగకుండా స్వరం ఎందుకు మార్చారు? వీటన్నిటికీ సంజాయిషీ చెప్పవలసిన బాబు...యధాప్రకారం తనకలవాటైన రీతిలో ఎదుటివారిపై బురదజల్లి తప్పించు కోవాలను కుంటున్నారు. నదురూ బెదురూ లేకుండా సుప్రీంకోర్టు మొదలుకొని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకూ అందరిపైనా నిందలేస్తూ తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఒక చారిత్రక సందర్భాన్ని తన వక్రీకరణలతో, వంచనతో మలినం చేసినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు... సర్వోన్నత న్యాయస్థానంతో సహా అందరికీ క్షమాపణ చెప్పాలి. -
తీరిన కోరిక తెలంగాణ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకి రెండు హైకోర్టులు ఉండాలి. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడాలి. తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారు. గత 62 సంవత్సరాలుగా న్యాయవ్యవస్థతో తెలంగాణ నలిగిపోయింది. ఈ అసమానతలు తొలగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలేం. దాని కోసం మరో పోరాటం అవసరమేమో. ఏమైనా, 1 జనవరి 2019 తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది. 2 జూన్ 2014వ తేదీ మాదిరిగా, 1 జనవరి 2019వ తేదీ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఐదు సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ ప్రజలు సంపూర్ణ తెలంగాణ ఏర్పడినట్టు భావించలేదు. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఈ జనవరితో ఆ కోరిక తీరింది. 1947 నుంచి 1956 వరకు ఉన్న చరిత్ర ఎవరికీ తెలియకుండా చరిత్ర పుస్తకాలు వచ్చేశాయి. అందుకని హైదరాబాద్ రాష్ట్రానికి ప్రత్యే కంగా హైకోర్టు ఉండేదని, దానికి ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ఉండేవారని ఎవరికీ తెలియదు. ఆంధ్రా హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టులను 1 నవంబర్ 1956న విలీనం చేశారు. కానీ, హైదరాబాద్ హైకోర్టు ఆంధ్రా హైకోర్టులో విలీనం అయినట్టు భ్రమింపజేసి హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించి వాళ్లను తమకన్నా జూనియర్లు అయిన ఆంధ్రా న్యాయమూర్తులకన్నా జూనియర్లుగా మార్చి తెలంగాణ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారు. హైదరాబాద్ హైకోర్టు పద్ధ్దతులను మంటగలిపి ఆంధ్రా పద్ధతులను హైకోర్టులో నెలకొల్పారు. అది చాలా సులువుగా అమలు జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆం్ర«ధా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆంధ్రా రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి చాలా భేదం ఉంది. అది బ్రిటీష్ వారి ఆధిపత్యంలో నుంచి ఏర్పడిన రాష్ట్రం. భారతదేశానికి చెందిన ముస్లిం రాజు ఆధిపత్యం నుంచి బయటపడి ఏర్పడిన రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం. ఆంధ్రా శాసనాలు అన్నీ బ్రిటీష్ పార్లమెంట్ తయారు చేసినవి. హైదరాబాద్ రాష్ట్రంలోని శాసనాలు అన్నీ హైదరాబాద్ స్వంత శాసనాలు. ఇక భాష విషయానికి వస్తే వాళ్లది ఆంగ్లం, హైదరాబాద్ వాళ్లది ఉర్దూ. ఇక్కడి శాసనాలన్నీ ఉర్దూలో ఉండేవి. పరిపాలన ఉర్దూలో జరిగేది. హైకోర్టులో కూడా ఉర్దూలో వాదనలు వినిపించేవాళ్లు. ఇక్కడి న్యాయవాదుల సౌకర్యార్థం ఓ ఉర్దూ బెంచిని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు దశలో వాగ్ధానం చేశారు. కానీ చేయలేదు. చాలామంది తెలంగాణ న్యాయవాదులకు ఇంగ్లీషులో ఆంధ్రావాళ్లకి ఉన్న ప్రావీణ్యం లేకపోవడం వల్ల రెండవ శ్రేణి న్యాయవాదులుగా పరిగణించబడినారు. దానికి తోడు ఆంధ్ర రిజిస్ట్రార్ల, అధికారుల ఆధిపత్యం కింద నలిగిపోయినారు. హైకోర్టు న్యాయమూర్తులను ఎంపికచేసే కొలీజియమ్‌లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులే ఉండటం వల్ల ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే హైకోర్టు న్యాయమూర్తులుగా, వారు నేరుగా ఎంపిక చేసిన ఆంధ్రా న్యాయవాదులే జిల్లా జడ్జీలుగా నియమితులైనారు. న్యాయవ్యవస్థ మొత్తం ఆంధ్రా ప్రాంత వాసుల గుప్పిటిలోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఏర్పడటానికి ముందు మాత్రమే అడ్వకేట్ జనరల్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి నియామకం కావడం వల్ల ప్రభుత్వ న్యాయవాదుల ఎంపికలో ఎంత వివక్ష జరిగిందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం రావడం, న్యాయవాదులు చురుగ్గా పాల్గొనడం నేటి ఆధునిక చరిత్ర. 14 మార్చి, 2004న తెలం గాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడవ మహాసభలు జరిగాయి. ఈ సమావేశానికి అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేశారు.)ని ఆహ్వానించాం. ఆ సమయంలో ఎంతో భవిష్యత్ ఉన్న హైకోర్టు న్యాయమూర్తి ఆ సమావేశాలకు రావడం సాహసమనే చెప్పాలి. సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న నేను క్రియాశీలక పాత్ర పోషించడమూ అంతే సాహసమని చెప్పుకోక తప్పదు. ఆ రోజు న్యాయ మూర్తుల ఎంపికకు పరీక్ష జరుగుతోంది. అందరు న్యాయమూర్తులు ఆ డ్యూటీలో ఉన్నారు. నాకు మాత్రం మినహాయింపునిచ్చారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ నర్సింహారెడ్డి తదితరులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా బలపరిస్తే పరోక్షంగా బలపరిచిన న్యాయమూర్తులు ఎందరో. దేశంలో ఉండేటువంటి మౌలిక వనరులు ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకూడదు. అవి వివిధ ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజల మధ్యన సమానత్వం పెంపొందించడానికి ఉపయోగపడాలి. రాజ్యం ఏర్పాటు చేసేటువంటి ప్రతి వ్యవస్థ ఆర్థిక రాజకీయ, సాంఘిక సమానత్వం సంపాదించడానికి, పెంపొందించడానికి సాధనాలుగా ఉపయోగపడాలి. భిన్న ప్రాంతాల, వృత్తుల ప్రజల మధ్యన ఉన్నటువంటి ఆర్థిక తారతమ్యాలను రూపుమాపడాన్ని రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఈ స్ఫూర్తితో న్యాయమూర్తులు తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారు. ఈ మూడవ సభ జరిగిన పది సంవత్సరాల తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నర సంవత్స రాల తరువాత తెలంగాణకి హైకోర్టు ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేరుని హైదరాబాద్ హైకోర్టుగా మార్చి దాన్ని రెండు రాష్ట్రాలకు కామన్ హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఒక్కపేరు తప్ప ఏమీ మారలేదు. మిగతా కొత్త రాష్ట్రాల్లో విభజించినట్టు క్రిందికోర్టు న్యాయమూర్తుల విభజన కూడా జరుగలేదు. ఈ విషయం పట్ల దృష్టి కేంద్రీకరించాలన్న హైకోర్టు న్యాయమూర్తి నర్సింహారెడ్డి వాదనని ఎవరూ పట్టించుకోలేదు. దాని ఫలితంగా ఎంతోమంది తెలంగాణ న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాందిశీకుల్లా బతికారు. 31 డిసెంబర్న వారి విభజన జరిగింది. ఈ విభజనపట్ల ఎన్నో అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా ప్రత్యేక హైకోర్టు ఏర్పడుతున్నందుకు సంతోషిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఏర్పాటుని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం పూర్వ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా 2 జూన్ 2014న ఏర్పడినాయి. ఈ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకి రెండు హైకోర్టులు ఉండాలి. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడాలి. ఈ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా హైదరబాద్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని విడదీసి ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజలు కోరినారు. హైదరాబాద్‌లోనే రెండు హైకోర్టులు వేరువేరుగా ఏర్పాటు చేయడానికి అవసరమైన సౌకర్యాలని కల్పిస్తామని ధన్‌గోపాల్ కేసులో తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అలా వీల్లేదని హైదరాబాద్ హైకోర్టు తీర్పుని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అప్పీలుని దాఖలు చేసింది. హైదరాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టు ముందు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. 16 నుంచి 18 నెలల లోపు పూర్తిస్థాయిలో హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తి అవుతుందని అంతలోపు తాత్కాలిక భవనంలో హైకోర్టుని ఏర్పాటు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారని హైకోర్టు తమ ప్రమాణ పత్రంలో పేర్కొంది. హైదరాబాద్ హైకోర్టు నియమించిన హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ అమరావతిలోని భవనాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మధ్య కాలంలో ఆ హైకోర్టుకు వెళ్లడానికి ఇష్టపడే న్యాయమూర్తులు తమ ఇష్టాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. న్యాయమూర్తులు అమరావతి వెళ్లడానికి ఇష్టపడటం లేదన్న అపప్రధని తొలగించారు. డిసెంబర్ 15నాటికి హైకోర్టు తాత్కాలిక భవనం సిద్ధమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించింది. న్యాయమూర్తులు కూడా అక్కడ ఉన్న సౌకర్యాల పట్ల సంతృప్తి చెం దారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు లేవని అందుకని కాంపిటెంట్ అథారిటీ (రాష్ట్రపతి) తగు చర్యలు తీసుకొని నోటిఫికేషన్ని జారీ చేయాలని సూచించింది. 1 జనవరి 2019 నాటికి రెండు హైకోర్టులు వేర్వేరుగా పని చేస్తాయని సుప్రీంకోర్టు ఆశించింది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జనవరి 1 నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు అవుతుందని నోటిఫికేషన్ని విడుదల చేసింది. రెండు హైకోర్టుల న్యాయమూర్తుల జాబితాని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సి.ప్రవీణ్‌కుమార్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనవసర సందేహాలు,అపో హలు కావాలని సృష్టించారు. ఈ విభజన వల్ల జగన్మోహన్రెడ్డి కేసులు మళ్లీ మొదటి దశకు చేరుకుంటాయన్న వాదనను లేవనెత్తారు. కేసుల విచారణకి అధికార పరిధి ఉంటుంది. ఆ అధికార పరిధిలోని కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతుంది. న్యాయమూర్తులు బదిలీ అయినంత మాత్రాన అవి మళ్లీ మొదటిదశకు చేరుకోవు. ఎందుకంటే, అవి వారంట్ కేసులు. సమ్మరీ(చిన్న కేసులు)ల్లో మాత్రమే అలాంటి అవకాశం ఉం టుంది. ఈ విషయాన్ని న్యాయకోవిదులు ముఖ్యమంత్రికి చెబుతారు. అయినా, అన్నీ తెలిసీ ముఖ్యమంత్రి ఇలాంటి అపోహలని సృష్టిస్తున్నా రని భావించాల్సి ఉంటుంది. చేరువలో న్యాయం ఉండాలి. సత్వర న్యాయం అందాలి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక సూత్రాలు చెబుతున్నది ఇదే. హైకోర్టు దగ్గరలో ఉండటం న్యాయవాదులకే కాదు, కక్షిదారులకీ అవసరం. మన దేశంలో న్యాయవ్యవస్థ నత్తనడక నడుస్తున్నదని పేరుంది. 28 డిసెంబర్ 2018నాటికి మన దేశంలో 30 సంవత్సరాలకు మించి కోర్టు పరిశీలనలో 66వేల కేసులు ఉన్నాయి. ఐదు సంవత్సరాలకు పైబడిన కేసులు 60లక్షలు ఉన్నాయి. 1800 కేసులు గత 48–58 సంవత్సరాలుగా వాదన దశలో ఉన్నాయి. 60 సంవత్సరాలకు పైబిన కేసులు 140ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి కొత్త కోర్టునీ, అందులో హైకోర్టునీ స్వాగతించాల్సింది పోయి అనవసర అపోహలు సృష్టించడం, ఆటంకాలు సృష్టించడం ఎవరికీ తగదు. గత 62 సంవత్సరాలుగా న్యాయవ్యవస్థతో తెలంగాణ నలిగిపోయింది. తెలంగాణ న్యాయమూర్తులు తక్కువ మంది ఉన్నారు. తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే అధికంగా ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్ న్యాయమూర్తులు, జిల్లా జడ్జీల్లో సీనియర్లు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. ఈ అసమానతలు తొలగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలేం. ఏమైనా, 1 జనవరి 2019 తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నేను పని చేశాను. అది హైదరాబాద్ హైకోర్టుగా రూపాంతరం చెందిన తరువాత పదవీ విరమణ చేశాను. ఇప్పుడు న్యాయవాదిగా తెలంగాణ హైకోర్టులోకి ప్రవేశించడం ఓ భావోద్వేగానికి సంబంధించిన అంశం. ఇది ఒక్క నాకే కాదు, ఎంతోమంది న్యాయవాదులకీ, న్యాయమూర్తులకీ కూడా. అందరికీ అభినందనలు. వ్యాసకర్త: మంగారి రాజేందర్, మాజీ న్యాయమూర్తి మొబైల్: 9440483001 -
బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మతిభ్రమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు విభజనపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఏపీ హైకోర్టు నూతన భవనాన్ని డిసెంబర్ 15, 2018 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని, అందువల్ల హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. దాని ఆధారంగానే జనవరి 1, 2019 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారన్నారు. భవన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడం చేతకాని చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు కేంద్రంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకొనే చంద్రబాబుకు ఏపీలో రెండు అంతస్తుల హైకోర్టు భవనాన్ని నిర్మించడం చేత కాలేదని విమర్శించారు. హైకోర్టు నిర్మాణం ఆలస్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి ఉంటే దాని ఆధారంగా న్యాయస్థానం తగిన ఆదేశాలు ఇచ్చివుండేదన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును సైతం టీడీపీ ప్రభుత్వం తప్పుదోవపట్టించిందన్నారు. కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన టీడీపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి ఏపీ హైకోర్టులో మొదటి కేసుగా దాన్నే విచారించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు కార్యకలాపాలను తన క్యాంప్ ఆఫీసులలో ప్రారంభిస్తామని చెప్పిన చంద్రబాబు న్యాయవ్యవస్థను తీవ్రంగా అవమానించారన్నారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, చెప్పిన సమయానికి భవన నిర్మాణం పూర్తిచేయలేక న్యాయమూర్తులను, న్యాయవాదులను రోడ్డుమీద నిలబడేలా చేసినందుకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ జారీ కాగానే ఇదంతా తమ వల్లే సాధ్యమైందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మీడియా ముందు డబ్బాకొట్టుకున్నారని జీవీఎల్ గుర్తు చేశారు. మీపై ఉన్న కేసులు విచారణకే రావడం లేదెందుకు? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేసులకు, హైకోర్టు విభజనకు లింకుపెడుతున్న చంద్రబాబు ముందు తనపై ఉన్న అనేక కేసులు అసలు విచారణకే రావడంలేదెందుకని జీవీఎల్ ప్రశ్నించారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసు విచారణ జరగడం లేదెందుకో వివరించాలన్నారు. ఇతరుల కేసుల విచారణపై ఆక్షేపించేముందు చంద్రబాబు తన నిజాయితీ ఏస్థాయిలో ఉందో తెలుసుకుంటే మంచిదన్నారు. -
హడావుడిగా హైకోర్టును విభజించారు
సాక్షి, అమరావతి: సమయం ఇవ్వకుండా హైకోర్టును హడావుడిగా విభజించారని సీఎం చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక సమావేశ మందిరంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఉద్యోగులు వచ్చేందుకు సంసిద్ధంగా లేకుండానే విభజించారని చెప్పారు. అయినా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. కోర్టులు వస్తున్నందున సరిపడా విమానయాన సర్వీసులు వెంటనే కల్పించాలని అందరూ కోరుతున్నారని తెలిపారు. కాంక్రీట్ విభాగంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సచివాలయం ర్యాఫ్ట్ పనులకు రెండు రోజుల కిందట శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ఎయిర్‌షో చివరి నిమిషంలో రద్దు చేసి కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరించిందని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం డబ్బులు సకాలంలో ఇస్తే పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మించవచ్చని, 2019లో పోలవరం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ డ్వాక్రా మహిళలకు.. అధికారులు ఏం చేసైనా సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజల్లో 90 శాతంపైగా సంతృప్త స్థాయి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్న ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాలని, అదేవిధంగా కార్డుల విభజనను అడిగిన వారందరికీ ఇవ్వాలని సూచించారు. రేషన్ డీలర్లకు కమీషన్ వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ షాపు పరిధిలోని రేషన్ కార్డుల సంఖ్యలో 5 శాతం కార్డులకు డీలర్ వేలి ముద్రతో సరుకులు తీసుకొని వేలి ముద్రలు పడని లబ్ధిదారులకు ఇచ్చేలా అనుమతి ఇవ్వాలని పౌరసరఫరాల కమిషనర్ బి.రాజశేఖర్‌కు సీఎం ఆదేశించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ.. ఆ విధంగా అనుమతి ఇస్తే అవినీతిని ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల్లో ఇటు గ్రామీణ అటు పట్టణాల్లో నిర్మిస్తున్న వాటిపై సరైన లెక్కలు లేవని, 4 లక్షల ఇళ్ల వరకు తేడాలు కన్పిస్తున్నాయని సీఎం చెప్పారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణను డ్వాక్రా గ్రూపు సభ్యులకు అప్పగించాలని సూచించారు. దీనికి వారికి పారితోషికం ఇవ్వాలన్నారు. ఇళ్లు అడిగిన వారికి మొదట జన్మభూమి పత్రాలు ఇవ్వాలని, ఇళ్లు ఎప్పుడు నిర్మించాలనేది తర్వాత చూద్దామని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాల వివరాలన్నీ ఒక స్టిక్కర్ రూపంలో తయారు చేసి ఇళ్ల వాకిళ్లకు అతికించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంసహకరించకున్నా 10.52 శాతం గ్రోత్... కేంద్రం సహకరించకున్నా 10.52 శాతం గ్రోత్ రేటు సాధించామని చంద్రబాబు చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్నారు. ఇచ్చిన కొద్ది నీటితోనే అనంతపురం జిల్లా రైతులు ఉద్యానవన రంగంలో అద్భుత ఫలితాలు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు. సాంకేతికతతో అవినీతిని చాలావరకు నియంత్రించగలిగామన్నారు. అవినీతి నిర్మూలనలో రాష్ట్రం 3 స్థానంలో ఉందన్నారు. నాలుగేళ్లుగా వృద్ధి ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2014 నుంచి జాతీయస్థాయి కంటే ఎక్కువగా వృద్ధి ఫలితాలను సాధిస్తూ వస్తున్నామని తెలిపారు. రూ. 2864 కోట్ల పంట నష్టం... రాష్ట్రంలోని 347 మండలాల్లో ఖరీఫ్‌లో రూ. 2,864 కోట్లు పంటనష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలిపారు. నష్టపోయిన రైతులకు రూ.1,900 కోట్లు ఇన్పుట్ సబ్సిడి ఇవ్వాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. చుక్కల భూముల సమస్యపై సబ్ కమిటీ రాష్ట్రంలో ఉన్న చుక్కల భూములు, గ్రామ కంఠక భూముల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కమిటీలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు ఉంటారని తెలిపారు. ఈ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. -
హైకోర్టు విభజన తీరు సరిగా లేదు
సాక్షి, అమరావతి: హైకోర్టు విభజన తీరు సరిగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయం ఇవ్వకుండా జనవరి ఒకటినే వెళ్లిపోవాలనడంతో న్యాయవాదులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. డిసెంబర్ 15 కల్లా కోర్టు భవనం పూర్తవుతుందని తాము చెప్పిన మాట నిజమేనని అయినా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అన్నింటినీ తరలించడం కష్టమవుతుందన్నారు. సమయం ఇవ్వకుండా నాలుగు రోజుల్లోనే అంతా వెళ్లిపోవాలని చెప్పారని, ఉద్యోగులు వెళ్లడానికి మానసికంగా సిద్ధం కావాలి కదా అని ప్రశ్నించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో శుక్రవారం విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సాంస్కృతిక శాఖలపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయవాడ క్యాంపు కార్యాలయం, సమీపంలోనే ఆర్అండ్బీ భవనంలో ఫైళ్లు, ఇతర కార్యాలయాలకు వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జడ్జిలు, న్యాయాధికారులకు హోటళ్లు, అపార్టుమెంట్లు, విల్లాల్లో వసతి చూస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసుల విచారణలో జాప్యం చేసేందుకే హైకోర్టు విభజన జరిగిందనే అనుమానం కలుగుతోందన్నారు. హైకోర్టు విభజన వల్ల కేసుల విచారణ మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. సీబీఐ కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని అప్పుడు విచారణ ప్రక్రియ మొదటికొస్తుందని చెప్పారు. ఏపీని దేశంలో భాగంగా కేంద్రం చూడటం లేదని, రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో నిర్వహించకుండా కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. కేంద్రం ఇప్పుడు రుణమాఫీ అంటే ఎన్నికల స్టంటేనని ఆరోపించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ సమాచారం పలు ప్రెస్మీట్లు, ఇతర సమావేశాల్లో అన్ని విషయాలు కేంద్రానికి చెప్పామన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై వైఎస్ జగన్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉంది పదేళ్లలో రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని, ఈ రేటు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముగ్గురు పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులయ్యే నిబంధనను మారుస్తామని, పంచాయతీ ఎన్నికల్లో ఈ నిబంధనను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు ఏర్పాటుచేయడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గించామని, మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, హైస్కూళ్లలో వంద శాతం ఫర్నిచర్, టాయిలెట్ల నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయించామని తెలిపారు. 11 ప్రైవేట్ యూనివర్సిటీలు రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. నాలుగున్నరేళ్లలో విద్యా రంగంలో 1.31 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని అందులో స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.79.50 వేల కోట్లు, ఉన్నత విద్యకు రూ. 15 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. వైద్య రంగంలో పలు పథకాలు తెచ్చాం.. వైద్యరంగంలో 24 పథకాలను పీపీపీ పద్ధతిలో అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ముఖ్యమంత్రి బాల సురక్ష, ఈ–ఔషధి, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, మహాప్రస్థానం, ఎన్టీఆర్ బేబీ కిట్స్, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు, 108 బైక్ అంబులెన్సులు కొత్తగా ప్రవేశపెట్టామన్నారు. పేదవాళ్లకు ఉచితంగా డయాలసిస్ చేయడమే కాకుండా, నెలకు రూ. 2,500 పింఛన్ ఇస్తున్నామన్నారు. 108 సర్వీసును సంస్కరించామన్నారు. మలేరియా కేసులను తగ్గించామని, విశాఖలో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు చేసి ఒకేచోట అన్ని వైద్యపరికరాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని, ఇది ప్రపంచానికే మోడల్ అని చెప్పారు. భవిష్యత్‌లో మరింతగా మానవ వనరులపై శ్రద్ధ పెడతామన్నారు. సేవల రంగంలో రాష్ట్రం వెనుకబడిందని, దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీలో సేవల రంగం వాటా తక్కువుగా ఉందని చెప్పారు. హైకోర్టు ఏర్పాటుపై చంద్రబాబు సమీక్ష హైకోర్టు ఏర్పాటుపై సీఎం చంద్రబాబు శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఎనిమిది కోర్టు హాళ్లు ఏర్పాటుకు అవకాశం ఉందని జీఏడీ అధికారులు చెప్పగా వెంటనే వాటిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్అండ్బీ బంగ్లాలో న్యాయాధికారులు, ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జడ్జిలు, న్యాయాధికారులు, ఇతర ముఖ్యులకు బస కోసం అనువైన అన్నింటినీ పరిశీలించి వెంటనే ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పారు. మరోవైపు రాజధానిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనంపై కాంట్రాక్టు సంస్థ, సీఆర్డీఏ అధికారులతో సంప్రదింపులు జరిపారు. జనవరి 22 నాటికి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో అడ్వొకేట్ జనరల్, సీఆర్డీఏ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక హైకోర్టు కోసం చాలా నిరసనలు చేశాము’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజన చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న 20 వేల మంది న్యాయవాదులందరికి ఆనందంగా ఉందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కోసం చాలా నిరసనలు చేశామన్నారు. హైకోర్టు విభజించడం వల్ల కేసులు పరిష్కారం తొందరగా అవుతాయని తెలిపారు. హైకోర్టు విభజన వల్ల తెలంగాణ న్యాయమూర్తులకు అవకాశం ఉంటుందన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కేసులు పరిష్కారంకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఏపీ న్యాయమూర్తులు, న్యాయవాదులకు సహకరిస్తామన్నారు. కేసుల బదిలీలో విచారణ, పరిష్కారం వంటి సమస్యలు ఉంటాయని, కానీ వారికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఏపీ న్యాయమూర్తులు, అడ్వకేట్లు ఆప్షన్లు ఇచ్చుకున్నారని తెలిపారు. న్యాయమూర్తుల కమిటీ వెళ్లి పరిశీలించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. -
జనవరి మొదటివారం నుంచే..
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు తమను ఏ దశలోనూ సంప్రదించడం లేదని, ఏ విషయం కూడా తమకు చెప్పడం లేదంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో న్యాయమూర్తుల కమిటీ సోమవారం పలువురు సీనియర్ న్యాయవాదులతో సమావేశమైంది. ప్రస్తుతం నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక భవనాన్ని డిసెంబర్ 15కల్లా హైకోర్టుకు అప్పగిస్తామని సీఆర్డీఏ అధికారులు చెప్పిన విషయాన్ని న్యాయవాదులకు ఆ కమిటీ తెలియచేసింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి మొదటివారం నాటికి తాత్కాలిక భవనం నుంచి హైకోర్టు కార్యకలాపాలు సాగించేందుకు వీలవుతుందని ఆ కమిటీ తెలిపింది. అంతేకాక హైకోర్టు భవనంలో న్యాయవాదులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆ కమిటీ వివరించింది. అందుకు సంబంధించి సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేసిన ప్లాన్లను న్యాయవాదులకు చూపింది. దాదాపు 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో న్యాయవాదుల కోసం ఓ హాల్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా న్యాయవాదుల సంఘం కార్యవర్గం కోసం చేస్తున్న ఏర్పాట్లను కూడా కమిటీ వివరించింది. సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ఛాంబర్లు, మహిళా న్యాయవాదులకు చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లు వారికి తెలియచేసింది. అలాగే పార్కింగ్ ఏర్పాట్లను కూడా కమిటీ వివరించింది. ఇదే సమయంలో న్యాయవాదులు తాము ఎదుర్కొనే ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. రవాణా సదుపాయంతో పాటు బ్యాంకు, పోస్టాఫీస్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వారు కమిటీని కోరారు. వీటన్నింటినీ కూడా జస్టిస్ రామసుబ్రమణియన్ ఓ పుస్తకంలో నోట్ చేసుకున్నారు. ఇబ్బందులు కలగకుండా తగిన సంఖ్యలో బస్సులను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటున్నామని కమిటీ న్యాయవాదులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అవసరాన్ని బట్టి మరోసారి సమావేశానికి పిలుస్తామని న్యాయవాదులకు తెలియచేసింది. న్యాయవాదులతో సమావేశమైన కమిటీలో న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలున్నారు. సీనియర్ న్యాయవాదులు డి.వి.సీతారామమూర్తి, టి.నాగార్జునరెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, ఆర్.రఘునందన్‌రావు, వై.వి.రవిప్రసాద్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర, ఇతర కార్యవర్గ సభ్యులు, పలువురు న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
‘జీవోలు కూడా విజయవాడ నుంచే..’
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి అధికారంలోకి వస్తే జీవోలు కూడా విజయవాడ నుంచే విడుదలవుతాయని తెలంగాణ ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలిపేందుకు న్యాయవాదులు అంబర్‌పేట్‌లో సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై, మహాకూటమిపై నిప్పులు చెరిగారు. హైకోర్టు విభజనను అడ్డుకుంది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన జరిగితే తన మీద ఉన్న కేసులు ఎక్కడ బయటపడతాయోనని చంద్రబాబు భయపడుతున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ అధఙకారంలోకి రాగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయం జరిగేలా చూస్తామిన కేటీఆర్ హామీ ఇచ్చారు. -
హైకోర్టు విభజనపై సుప్రీం తాజా ఉత్తర్వులు
-
హైకోర్టు విభజనపై సుప్రీం తాజా ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక వసతులు సిద్ధమైతే ఏపీ, తెలంగాణ హైకోర్టుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ అనంతరం ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా విధులు నిర్వహించడం ప్రారంభమవుతుంది. ఏపీ హైకోర్టు కొత్త భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక భవనాలు సిద్ధమవుతాయని ఏపీ ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. పరిశీలన కమిటీ ఇచ్చిన నివేదికపై ఏపీకి వెళ్లే హైకోర్టు న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారని ఏపీ తెలిపింది. అమరావతిలో జస్టిస్ సిటీ పేరుతో పెద్ద కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని, అందులోనే హైకోర్టు, సబార్డినేట్ కోర్టు జడ్జీల వసతి సదుపాయాలు, నివాస గృహాలు ఏర్పాటు చేస్తారని సుప్రీంకు ఏపీ నివేదించింది. అప్పటివరకూ తాత్కాలిక భవనాల్లో హైకోర్టు కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు ఏపీలో హైకోర్టు కార్యకలాపాలకు అవసరమైనవన్నీ సిద్ధమైతే నోటిఫికేషన్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. -
హైకోర్టు విభజన; సుప్రీం సానుకూల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజనకు సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు డిసెంబరు 15 నాటికి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. విభజన జరుగకుండా కొత్త జడ్జీల నియామకం చేపడితే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కాబట్టి.. వీలైనంత త్వరగా విభజన పూర్తైతే మంచిదని అభిప్రాయపడింది. అమరావతిలో తాత్కాలిక కోర్టు భవన నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మార్చి లేదా ఏప్రిల్ నాటికి స్టాఫ్ క్వార్టర్స్, జడ్జీల నివాసాలు నిర్మిస్తామని పేర్కొంది. -
అవసరమైతే హైకోర్టు భవనం మొత్తాన్ని ఏపీకి ఇచ్చేస్తాం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఉమ్మడి హైకోర్టు విభజనను ఇక ఎంత మాత్రం జాప్యం చేయడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఇప్పుడున్న ఉమ్మడి హైకోర్టు భవనం మొత్తాన్ని ఏపీకి ఇచ్చేసి తాము విడిగా హైకోర్టు ఏర్పాటు చేసుకొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలోనే ఏర్పాటు చేయాలంటూ 2015లో ధన్‌గోపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు విడిగా హైకోర్టు ఏర్పాటులో వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇప్పుడున్న ఉమ్మడి హైకోర్టు భవనంలో 24 గదులు ఖాళీగా ఉన్నాయని, వాటిలోనైనా ఏపీ హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వివరించారు. అవసరమనుకుంటే ఉమ్మడి హైకోర్టు భవనం మొత్తాన్ని ఏపీకి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తాము మరో చోట హైకోర్టు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. చట్టసభలు, అధికారుల విభజన జరిగినా న్యాయవ్యవస్థ విభజన జరగలేదని వివరించారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. న్యాయాధికారుల కేసు కూడా ఇదే కోర్టులో నడుస్తోందని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ ప్రాంత వాటా అమలు కావడంలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో రెండు వారాల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ధన్‌గోపాల్‌కు కూడా కోర్టు నోటీసులిచ్చింది. నిబంధనలేవీ అడ్డంకిగా లేవు.. ఇప్పుడున్న ఉమ్మడి హైకోర్టు భవనాన్ని రెండుగా విభజించి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేసేందుకు నిబంధనలేవీ అడ్డంకిగా లేవని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు భవన నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు ఉమ్మడి హైకోర్టు భవనంలో రెండు రాష్ట్రాల హైకోర్టుల కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో ఏపీ భూభాగంలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో హేతుబద్ధత లేదని, దీన్ని కొట్టివేయాలని కోరారు. అటార్నీ జనరల్ వేణుగోపాల్ చేసిన వాదనలతో తెలంగాణ ప్రభుత్వం ఏకీభవించింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసుకొనేందుకు ఎంత సమయం ఉందని ప్రశ్నించింది. దానికి పదేళ్ల సమయం ఉందని వేణుగోపాల్ బదులిచ్చారు. ఉమ్మడి హైకోర్టులో 24 గదులు ఖాళీగా ఉన్నాయని, అవసరమైతే తాము మరోచోట హైకోర్టు ఏర్పాటు చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకొచ్చిందని చెప్పారు. ఇప్పుడున్న భవనంలోనే ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నిబంధనలేవీ అడ్డురావని స్పష్టం చేశారు. కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఏఏజీ రామచంద్రారావులు కోర్టుకు హాజరయ్యారు. -
ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు విభజన ఇక ఎంతమాత్రం జాప్యం కావడానికి వీలులేదని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, విభజన జరగాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌లు వాదించారు. ఏపీలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24 హాళ్లలో ఏపీకి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని,..లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ వాటా కూడా లేదని కోర్టుకు తెలిపింది. కేసు వాదనల సమయంలో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. -
హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. విభజన చేస్తే ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు చెందుతుందని తెలిపారు. ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర కొత్త రాజధానిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి నాలుగు భవనాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు. అందులో ఏదో ఒకటి ఖరారు చేయాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారని వివరించారు. భవనాలు సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరపాలని, హైకోర్టును తాత్కాలికంగా మార్చగలం కానీ శాశ్వతంగా మార్చడానికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు. అంతవరకు పరస్పరం ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని రెండు రాష్ట్రాలను కోరుతున్నానని విన్నవించారు. న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులు తమ పరిధిలోని అంశం కాదని, నియామకలన్నీ కొలీజియమే చేస్తుందని పేర్కొన్నారు. పదోన్నతులు నిలిపివేయాలన్న విషయంపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. నాలుగు భవనాలను ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా ముందుకు రావడం సంతోషం అయితే విభజన జరిగే వరకు న్యాయమూర్తుల పదోన్నతులు చేయవద్దని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కేంద్రమంత్రికి విన్నవించారు. హైకోర్టు విభజన ఒక్కటే సమస్య కాదు. విభజన చట్టంలో అనేక పెండింగ్ అంశాలున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు, ఇంకా చాలా అంశాలు పరిష్కరించాల్సి ఉన్నాయని మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలని, ఆ సమావేశం ఏర్పాటు చేసేందుకు తాము రెడీగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
'హైకోర్టు విభజన ఎందుకు చేయడంలేదు'
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా హైకోర్టు విభజన ఎందుకు జరగలేదని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల న్యాయవాదులు నష్టపోతున్నారన్నారు. అన్ని సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా కేంద్రం హైకోర్టు విభజన చేయడం లేదన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం హైకోర్టును తక్షణమే విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పుడు హైకోర్టు విభజనలో అప్పటి ప్రభుత్వాలు ఆలస్యం చేయలేదని ఎంపీ జితేందర్‌రెడ్డి గుర్తు చేశారు. -
హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం: పీపీ చౌదరి
హైదరాబాద్: హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి పీపీ చౌదరి స్పందించారు. హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. ఆదివారాం బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఆరుగురు హైకోర్టు జడ్జిలను నియమించనున్నట్లు తెలిపారు. హైకోర్టు కొలీజియం సిఫారసు చేస్తే మిగతా నియామకాల గురించి పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రామచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. పేదల ఆర్యోగ్యానికి మోడీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గుండె శస్త్ర చికిత్సలో ఉపయోగించే స్టంట్లను రూ. 20 వేలకే అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర చాలా గొప్పదని గుర్తుచేసుకున్నారు. హైకోర్టు విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు విభజనకు పరస్పరం సహకరించుకోవాలని దత్తాత్రేయ అన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీ పరిపాలన పారదర్శకంగా కొనసాగుతుంటే. రాష్ట్రంలో మాత్రం నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి పాలనా కొనసాగుతోందని విమర్శించారు.