Indian womens hockey team
-
చైనాపై భారత్‌దే పైచేయి
మస్కట్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్ చాంపియన్‌గా టీమిండియా నిలిచింది. మూడుసార్లు చాంపియన్ చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున సాక్షి రాణా, ఇషిక, సునెలిత టొప్పో సఫలమయ్యారు. ముంతాజ్ ఖాన్, కనిక సివాచ్ విఫలమయ్యారు. చైనా తరఫున గువోటింగ్ హావో, లియు టాంగ్జీ సఫలంకాగా... వాంగ్ లిహాంగ్, లి జింగీ, దన్దన్ జువో విఫలమయ్యారు. ముగ్గురు చైనా ప్లేయర్ల షాట్లను భారత గోల్‌కీపర్ నిధి నిలువరించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఫైనల్ చేరుకునే క్రమంలో లీగ్ దశలో చైనా చేతిలో మాత్రమే ఓడిపోయిన భారత జట్టుకు టైటిల్ పోరులోనూ గట్టిపోటీ ఎదురైంది. తొలి 29 నిమిషాల వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను చైనా జట్టు సద్వినియోగం చేసుకుంది. టాన్ జిన్జువాంగ్ గోల్ చేయడంతో మాజీ చాంపియన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 41వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కనిక సివాచ్ గోల్‌గా మలచడంతో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయడానికియత్నించినా ఫలితం లేకపోయింది. -
సెమీఫైనల్లో భారత్
మస్కట్: డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్ టోర్నీలో సెమీఫైనల్స్‌కు చేరింది. తద్వారా జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సంపాదించింది. ఆసియా టైటిల్ వేటలో భారత్ రెండు అడుగుల దూరంలో ఉంది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్‌పై ఏకపక్ష విజయం సాధించింది. భారత ఫార్వర్డ్ ప్లేయర్ దీపిక అద్భుతంగా రాణించింది. ఆమె నాలుగు (28వ, 31వ, 35వ, 55వ నిమిషాల్లో) గోల్స్ చేయగా, కనిక సివాచ్ (23వ, 25వ, 40వ నిమిషాల్లో) మూడు గోల్స్ అందించింది. మిగతా వారిలో సాక్షి రాణా (17వ నిమిషంలో), లాల్రిన్పుయి (27వ నిమిషంలో), గోల్స్ చేశారు. భారత్ తొలి అర్ధభాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికే 5–0తో మ్యాచ్‌ను శాసించేస్థితిలో నిలిచింది. మూడు, నాలుగో క్వార్టర్లలో మరో నాలుగు గోల్స్ సాధించింది. మూడో క్వార్టర్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేయడం ద్వారా దీపిక, కాసేపటికే మూడో గోల్ సాధించిన కనిక ‘హ్యాట్రిక్స్’ నమోదు చేశారు. శనివారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్; చైనాతో దక్షిణ కొరియా తలపడతాయి. -
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెంగళూరు: జూనియర్ ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకునేందుకు భారత మహిళల హాకీ జట్టు మంగళవారం ఒమన్‌కు బయల్దేరింది. ఒమన్ రాజధాని మస్కట్‌లో ఈ నెల 7 నుంచి 15 వరకు ఆసియా టోర్నీ జరుగుతుంది. ఇందులో రాణించి టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు వచ్చే ఏడాది జూనియర్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత అమ్మాయిల జట్టు సన్నద్ధమై వెళ్లింది. మస్కట్ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతక విజేతలు (టాప్–3 జట్లు) శాంటియాగో (చిలీ)లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తారు. ఆసియా కప్ ఈవెంట్లో భారత్ పూల్ ‘ఎ’లో ఉంది. ఈ పూల్‌లో భారత్‌తో పాటు చైనా, మలేసియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి. పూల్ ‘బి’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, హాంకాంగ్, శ్రీలంకలు పోటీపడతాయి. జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టులో పలువురు ప్రతిభావంతులు నిలకడగా రాణిస్తున్నారు. వైష్ణవి విఠల్ ఫాల్క, సునేలిత టొప్పొ, ముంతాజ్ ఖాన్, దీపిక, బ్యూటీ డుంగ్డుంగ్లకు సీనియర్లతో కలిసి ఆడిన అనుభవం ఉంది. ఈ జట్టుకు భారత మాజీ కెప్టెన్ తుషార్ ఖండ్కేర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒమన్‌కు బయలుదేరే ముందు మీడియాతో కెపె్టన్ జ్యోతి సింగ్ మాట్లాడుతూ జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైందని, కొన్ని నెలలుగా జట్టు సన్నాహాల్లో చెమటోడ్చుతుందని తెలిపింది. అక్కడే ఉన్న పురుషుల జట్టు నాకౌట్‌కు చేరడం ఆనందంగా ఉందని, మేం కూడా వారిలాగే రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. -
Asian Champions Trophy 2024: ఎదురులేని భారత్
రాజ్‌గిర్ (బిహార్): మరోసారి సాధికారిక ఆటతీరుతో అలరించిన భారత మహిళల హాకీ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఐదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2–0 గోల్స్ తేడాతో 2018 జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ (48వ నిమిషంలో), లాల్రెమ్సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. సలీమా టెటె నాయకత్వంలో ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా నాకౌట్ మ్యాచ్‌లోనూ గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రస్తుత ఆసియా క్రీడల చాంపియన్ చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో చైనా 3–1తో మలేసియాపై గెలిచింది. లీగ్ దశలో భారత జట్టు 3–0తో చైనాపై గెలిచింది. అదే ఫలితాన్ని నేడూ పునరావృతం చేస్తే భారత జట్టు మూడోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా దక్షిణ కొరియా (2010, 2011లలో) జట్టు తర్వాత వరుసగా రెండుసార్లు ఈ టైటిల్‌ను నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందుతుంది. గతంలో భారత జట్టు 2016, 2023లలో విజేతగా నిలిచింది. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీ సాధించింది. జపాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక్కదానిని కూడా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లేదంటే భారత గెలుపు ఆధిక్యం భారీగా ఉండేది. మరోవైపు జపాన్ కేవలం ఒక్క పెనాల్టీ కార్నర్కే పరిమితమైంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, జపాన్‌పై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ 48వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. అనంతరం లాల్రెమ్సియామి 56వ నిమిషంలో మరో గోల్ చేసింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్ చైనాతో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ లీగ్ దశలో చైనాను ఓడించింది. చైనా తొలి సెమీఫైనల్లో మలేసియాపై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది.మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో మలేసియా, జపాన్ తలపడతాయి. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో కొరియా థాయ్‌లాండ్‌ను 3-0 గోల్స్ తేడాతో ఓడించి, ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా..
రాజ్‌గిర్ (బిహార్): లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు కీలక సమరానికి సమాయత్తమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో నేడు మాజీ చాంపియన్ జపాన్‌తో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలతో సంబంధం లేకుండా ఈ నాకౌట్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. మరో సెమీఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనాతో మలేసియా పోటీపడుతుంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. లీగ్ దశలో భారత్ మొత్తం 26 గోల్స్ సాధించి ప్రత్యర్థి జట్లకు కేవలం 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. ‘డ్రాగ్ ఫ్లికర్’ దీపిక ఏకంగా 10 గోల్స్‌తో అదరగొట్టింది. సంగీత కుమారి నాలుగు గోల్స్... ప్రీతి దూబే మూడు గోల్స్ చేశారు. లాల్రెమ్సియామి, మనీషా చౌహాన్, నవ్‌నీత్ కౌర్ రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఉదిత, కెప్టెన్ సలీమా టెటె, బ్యూటీ డుంగ్‌డుంగ్ ఒక్కో గోల్ చేశారు. మరోవైపు జపాన్ జట్టు ఓవరాల్‌గా 6 గోల్స్ మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో భారత్ తమ సహజశైలిలో ఆడితే వరుసగా ఆరో విజయంతో ఐదోసారి ఈ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఏడుసార్లు జరగ్గా.. భారత జట్టు రెండుసార్లు చాంపియన్‌గా (2016, 2023) నిలిచి, మరో రెండుసార్లు (2013, 2018) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. జపాన్ జట్టు మూడుసార్లు (2010, 2013, 2023) ఫైనల్‌కు చేరుకొని ఒకసారి (2010లో) విజేతగా నిలిచి, రెండుసార్లు తుది పోరులో ఓడిపోయింది. ‘మా జట్టు బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో సభ్యులందరికీ తెలుసు. మా బలాన్ని మరింత పెంచుకొని, భవిష్యత్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ టోర్నీని వినియోగించు కుంటున్నాం. ఇప్పటి వరకైతే భారత జట్టు అద్భుతంగా ఆడింది. అయితే నాకౌట్ మ్యాచ్ అయినా సెమీఫైనల్లో జపాన్ను తక్కువ అంచనా వేయకూడదు’ అని భారత జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. -
చైనానూ చుట్టేసి...
రాజ్‌గిర్ (బిహార్): సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా జట్టుతో శనివారం జరిగిన నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (32వ నిమిషంలో), కెప్టెన్ సలీమా టెటె (37వ నిమిషంలో), దీపిక (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో చివరిదైన ఐదో పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను చైనా జట్టు వృథా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఆరంభంలో గట్టిపోటీ లభించింది. తొలి రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మూడో క్వార్టర్లో భారత క్రీడాకారిణులు ఒక్కసారిగా విజృంభించి ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించారు. చివరి నిమిషంలో దీపిక గోల్‌తో భారత్ విజయం సంపూర్ణమైంది. ఇతర నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ 2–1తో మలేసియాపై, కొరియా 4–0తో థాయ్‌లాండ్‌పై గెలిచాయి. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన చైనా జట్టు 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. లీగ్‌లో టాప్ ర్యాంక్ అధికారికంగా ఖరారు కావాలంటే నేడు జపాన్‌తో జరిగే చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌ను (సాయంత్రం గం. 4:45 నుంచి) భారత జట్టు ‘డ్రా’ చేసుకుంటే చాలు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత జట్టు 23 గోల్స్ చేసి 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. మరోవైపు చైనా జట్టు 22 గోల్స్ చేసి, 4 గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. నేడు జరిగే ఇతర చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌తో మలేసియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), దక్షిణ కొరియా జట్టుతో చైనా (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. -
సొంతగడ్డపై భారత్‌కు పరీక్ష
రాజ్‌గిర్ (బిహార్): పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందకపోవడం... ఆ తర్వాత ప్రొ హాకీ లీగ్‌లోనూ ఆడిన 16 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో విజయం సాధించడం... వెరసి ఈ ఏడాది భారత మహిళల హాకీ జట్టుకు ఏదీ కలసి రాలేదు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వరుసగా రెండోసారి జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో సలీమా టెటె సారథ్యంలో భారత బృందం ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.సోమవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. గత ఏడాది రాంచీలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారీ టైటిల్ నిలబెట్టుకోవాలంటే టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ జట్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నాయి. తొలి రోజు జరిగే ఇతర మ్యాచ్‌ల్లో జపాన్‌తో దక్షిణ కొరియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), చైనాతో థాయ్‌లాండ్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. సోమవారం మలేసియాతో మ్యాచ్ తర్వాత భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా (12న)తో, థాయ్‌లాండ్ (14న)తో, చైనా (16న)తో, జపాన్ (17న)తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ 19న, ఫైనల్ 20న జరుగుతాయి. -
భారత మహిళల హాకీ జట్టు కొత్త కెప్టెన్ గా సలీమా... వైస్ కెప్టెన్‌గా నవ్‌నీత్
ఈ నెలలో బెల్జియం, ఇంగ్లండ్‌లలో జరిగే మహిళల ప్రొ హాకీ లీగ్‌లో బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించారు. ఇన్నాళ్లూ కెప్టెన్ గా వ్యవహరించిన గోల్‌కీపర్ సవితా పూనియాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. సవిత స్థానంలో కొత్త కెపె్టన్‌గా జార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల సలీమా టెటెను నియమించారు. కొత్త వైస్ కెప్టెన్‌గా ఫార్వర్డ్ నవ్‌నీత్ కౌర్‌ను ఎంపిక చేశారు. చీఫ్ కోచ్‌గా హరేంద్ర సింగ్ వ్యవహరిస్తారు. భారత హాకీ జట్టు: సలీమా టెటె (కెపె్టన్), నవ్‌నీత్ కౌర్ (వైస్ కెపె్టన్), సవితా పూనియా, బిచ్చూదేవి (గోల్‌కీపర్లు), నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషిక, మోనిక, జ్యోతి ఛత్రి, మహిమ, వైష్ణవి ఫాల్కే, నేహా, జ్యోతి, బల్జీత్ కౌర్, మనీషా చౌహాన్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్, సంగీత, దీపిక, షర్మిలా దేవి, ప్రీతి దూబే, వందన కటారియా, సునెలితా టొప్పో, దీపిక సోరెంగ్. -
మహిళల హాకీ మనోవేదన!
సొంతగడ్డపై అర్హత టోర్నీ... 8 జట్లలో టాప్–3లో నిలిస్తే సరిపోయే సులువైన ఫార్మాట్... ప్రత్యర్థి బలహీనమైన జపాన్... ఆ టీమ్‌పై గత ఐదు మ్యాచ్‌లలో వరుసగా గెలిచిన రికార్డు... క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 9 పెనాల్టీ కార్నర్ అవకాశాలు ... కానీ ఒక్క దానినీ గోల్‌గా మలచలేని వైఫల్యం... వెరసి వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు కోల్పోయింది... గత టోక్యో ఒలింపిక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి ఆశలు రేపిన జట్టు ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత కాలేకపోయింది. రాంచీ: భారత మహిళల హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో కనీసం మూడో స్థానంలో నిలిస్తేనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా, భారత్ దానిని కోల్పోయింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జపాన్ చేతిలో 0–1 గోల్ తేడాతో ఓటమి పాలైంది. జపాన్ తరఫున 6వ నిమిషంలో కానా ఉరాటా పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా మన జట్టు స్కోరును సమం చేయలేకపోయింది. శుక్రవారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో జర్మనీ 2–0తో అమెరికాను ఓడించింది. టాప్–3లో నిలువడం ద్వారా జర్మనీ, అమెరికా, జపాన్ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. సమష్టి వైఫల్యం... జపాన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. రెండో నిమిషంలోనే గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా భారత కీపర్ సవిత అడ్డుకోగలిగింది. అయితే మరో నాలుగు నిమిషాల వ్యవధిలోనే జపాన్‌కు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. మొదటిసారి విఫలమైనా... రెండో సారి సవిత అడ్డంకిని దాటడంలో జపాన్ సఫలమైంది. ఆ తర్వాతి నుంచి జపాన్ తమ ఏకైక గోల్‌ను నిలబెట్టుకునేందుకు డిఫెన్స్‌పై బాగా దృష్టి పెట్టింది. దీనిని ఛేదించేందుకు భారత ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో వరుసగా పెనాల్టి లను మన జట్టు వృథా చేసుకుంది. 12వ నిమిషంలో మోనిక అందించిన పాస్‌తో లాల్‌రెమిసియామి చేసిన ప్రయత్నంలో బంతి గోల్పోస్ట్పైనుంచి వెళ్లిపోయింది. రెండో క్వార్టర్లో రెండు పెనాల్టీ అవకాశాలను దీపిక గోల్‌గా మలచలేకపోయింది. ఆపై ఒత్తిడిని లోనైన ప్లేయర్లు పాస్‌లు ఇవ్వడం మానేసి ఆశ్చర్యకరంగా 30 గజాల సర్కిల్ నుంచే బంతిని బలంగా బాదే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన పెనాల్టి లను ఉదిత వృథా చేసింది. చివరి 11 నిమిషాల్లో కూడా భారత్‌కు 3 పెనాల్టీలు దక్కగా ఈసారి కూడా దీపిక, ఉదిత చేతులెత్తేశారు. ఆట ముగియడానికి కొద్దిసేపు ముందు జపాన్ పటిష్ట డిఫెన్స్‌ను ఛేదించి సలీమా టెటె గోల్‌పోస్ట్ వైపు దూసుకుపోయినా... ఆమె కొట్టిన షాట్ పోస్ట్‌కు దూరంగా వెళ్లిపోయింది. పని చేయని వ్యూహాలు... టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన నెదర్లాండ్స్ మాజీ ప్లేయర్ జేన్కే స్కాప్‌మన్ ఇప్పుడు టీమ్ హెడ్ కోచ్‌గా ఉంది. సీనియర్లను పక్కన పెట్టి చాలా వరకు యువ క్రీడాకారిణులతోనే ఫలితాలు రాబట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఫలితమివ్వలేదు. రెగ్యులర్ డ్రాగ్‌ఫ్లికర్ ఒక్కరూ లేకుండా ఫార్వర్డ్లను పెనాల్టీ గోల్ కోసం నమ్ముకోవడం పెద్ద తప్పు. ఈ టోర్నీలో జర్మనీ మినహా ర్యాంకింగ్‌పరంగా మిగతా జట్లన్నీ భారత్‌కంటే బలహీనమైనవే. మనల్ని ఓడించిన జపాన్ జట్టుకు భారత మాజీ ఆటగాడు జూడ్ మెనెజెస్ హెడ్ కోచ్ కావడం విశేషం. -
Womens Hockey Olympic Qualifier: గెలిచి నిలిచిన భారత్
రాంచీ: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటుకుంది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సంగీత కుమారి (1వ ని.లో), ఉదిత (12వ ని.లో), డుంగ్‌డుంగ్ బ్యూటీ (14వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు మేగన్ హల్ (9వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. మరో మ్యాచ్‌లో అమెరికా 2–0తో ఇటలీ జట్టును ఓడించింది. ప్రస్తుతం అమెరికా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, న్యూజిలాండ్ 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో అమెరికాతో న్యూజిలాండ్; ఇటలీతో భారత్ తలపడతాయి. -
పరాజయంతో మొదలుపెట్టిన భారత్.. ఆరు అవకాశాలు లభించినా..!
రాంచీ: మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీని భారత జట్టు ఓటమితో మొదలు పెట్టింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 0–1 తేడాతో అమెరికా చేతిలో పరాజయంపాలైంది. అమెరికా తరఫున 16వ నిమిషంలో తామెర్ అబిగైల్ ఏకైక గోల్ నమోదు చేసింది. తొలి క్వార్టర్ హోరాహోరీ సాగి ఒక్క గోల్ కూడా నమోదు కాకపోగా, రెండో క్వార్టర్ ఆరంభంలోనే యూఎస్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత భారత మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోరును సమం చేయలేకపోయారు. దురదృష్టవశాత్తూ ఆరు పెనాల్టీ అవకాశాలు వచ్చినా... ఒక్కదానిని కూడా గోల్‌గా మలచలేక భారత్ వృథా చేసుకుంది. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. -
జాతీయ హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్ర అమ్మాయి
వచ్చే నెలలో స్పెయిన్‌లో జరిగే ఐదు దేశాల హాకీ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా హాకీ ఇండియా (హెచ్ఐ) ఈనెల 22 నుంచి డిసెంబర్ 10 వరకు బెంగళూరులో జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించనుంది. 34 మందితో కూడిన బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఇతిమరపు రజని కూడా చోటు దక్కించుకుంది. ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత్‌తోపాటు ఐర్లాండ్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్ జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీ తర్వాత భారత్ జనవరిలో స్వదేశంలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో పోటీపడుతుంది. -
Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వాలిఫయింగ్ టోర్నీ: భారత్‌కు కఠిన సవాలు
వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు భారత మహిళల హాకీ జట్టు శ్రమించాల్సి ఉంటుంది. జనవరి 13 నుంచి 19 వరకు రాంచీలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్న–1కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సోమవారం విడుదల చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్‌తోపాటు ఈ టోరీ్నలో ప్రపంచ ఐదో ర్యాంకర్ జర్మనీ, న్యూజిలాండ్ (9), జపాన్ (11), చిలీ (14), అమెరికా (15), ఇటలీ (19), చెక్ రిపబ్లిక్ (25) జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గిన మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. జనవరి 13 నుంచి 20 వరకు స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఎనిమిది జట్ల (బెల్జియం, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, మలేసియా, దక్షిణ కొరియా, స్పెయిన్, ఉక్రెయిన్) మధ్య క్వాలిఫయింగ్–2 టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీ ద్వారా మరో మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాయి. -
అజేయ భారత్.. జపాన్‌పై గెలుపు
రాంచీలో జరుగుతున్న మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మరో విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఇది భారత్‌కు వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం. మంగళవారం హోరాహోరీగా జరిగిన పోరులో భారత్ 2–1 గోల్స్ తేడాతో జపాన్ను ఓడించింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ 31వ నిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించగా...47వ నిమిషంలో సంగీత కుమారి పెనాల్టీని గోల్‌గా మలచింది. జపాన్‌కు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకుంటూ 37వ నిమిషంలో ఉరాటా కానా గోల్ నమోదు చేసింది. భారత సీనియర్ ప్లేయర్ వందన కటారియాకు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా హాకీ ఇండియా ఆమెను ఘనంగా సన్మానించింది. టోర్నీలో థాయిలాండ్, మలేసియా, చైనా, జపాన్‌లను ఓడించి భారత్ నేడు జరిగే మ్యాచ్‌లో కొరియాతో తలపడుతుంది. -
లెక్క సరిచేసిన భారత్.. చైనాపై ప్రతీకార విజయం
రాంచీ: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. చైనా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున దీపిక (15వ ని.లో), సలీమా టెటె (26వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. చైనా జట్టుకు జాంగ్ జియాకి (41వ ని.లో) ఒక గోల్ అందించింది. ఈ గెలుపుతో ఇటీవల హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా జట్టు చేతిలో సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. -
ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీని భారత మహిళల జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున హోలీ హంట్ ఏడో నిమిషంలో గోల్ చేయగా... భారత జట్టుకు లాల్రెమ్సియామి 41వ నిమిషంలో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్లో రెండు జట్లకు రెండు చొప్పున పెనాల్టీ కార్నర్లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇదే టోర్నీలో పోటీపడుతున్న భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు చేతిలో 1–2తో ఓడిపోగా... నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. -
ఫైనల్లో టీమిండియా సంచలన విజయం.. టైటిల్ సొంతం
జపాన్‌లో జరిగిన మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్లో సంచలనం నమోదైంది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఫోర్ టైమ్ ఛాంపియన్స్ దక్షిణ కొరియాకు షాకిచ్చారు. తుది పోరులో టీమిండియా.. 2-1 గోల్స్ తేడాతో సౌత్ కొరియాను ఖంగుతినిపించి, తొలిసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. The winning moments ✨️ Here a glimpse of the winning moments after the victory in the Final of Women's Junior Asia Cup 2023.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/ZJSwVI80iH — Hockey India (@TheHockeyIndia) June 11, 2023 అన్నూ 22వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా.. ఆతర్వాత సౌత్ కొరియా తరఫున 25వ నిమిషంలో పార్క్ సియో ఇయోన్ గోల్ చేసి స్కోర్‌ను సమం చేసింది. అనంతరం రెండో అర్ధభాగం 41వ నిమిషంలో నీలమ్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేసి మరోసారి భారత్‌కు ఆధిక్యం అందించింది. దీని తర్వాత సౌత్ కొరియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, భారత అమ్మాయిలు అద్భుతమైన డిఫెన్స్‌తో వారిని అడ్డుకున్నారు. 🇮🇳 2-1 🇰🇷 Our girls create HISTORY💥 India defeats 4-time champions South Korea in an intriguing final to lift its first-ever Women's Junior Hockey Asia Cup title!#Hockey 🏑| #AsiaCup2023 pic.twitter.com/bSpdo2VB5N — The Bridge (@the_bridge_in) June 11, 2023 రెండో అర్ధభాగం చివరి నిమిషం వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయినా సౌత్ కొరియా అమ్మాయిలకు ఫలితం దక్కలేదు. దీంతో జూనియర్ విభాగంలో భారత్ అమ్మాయిలు తొలిసారి ఆసియా ఛాంపియన్లుగా అవతరించారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంతో దిగాలుగా ఉన్న అభిమానులకు ఈ విజయం ఊరటనిచ్చింది. భారత మహిళల జూనియర్ హాకీ టీమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
నేషన్స్ కప్ బరిలో భారత హాకీ జట్టు
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) నేషన్స్ కప్‌లో భారత మహిళల జట్టు తమ తొలి పోరులో కెనడాను ఢీకొంటుంది. వచ్చే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ సీజన్‌కు క్వాలిఫయింగ్ టోర్నీ అయిన ఈ టోర్నీ స్పెయిన్‌లో డిసెంబర్ 11 నుంచి 17 వరకు జరుగుతుంది. పూల్ ‘బి’లో కెనడా, జపాన్, దక్షిణాఫ్రికాలతో భారత్ తలపడుతుంది. పూల్ ‘ఎ’లో ఆతిథ్యస్పెయిన్తో పాటు కొరియా, ఇటలీ, ఐర్లాండ్ ఉన్నాయి. చదవండి: మెద్వెదెవ్కు చుక్కెదురు -
16 ఏళ్ల తర్వాత మహిళల హాకీలో పతకం, అంబరాన్ని అంటిన సంబురాలు.. వైరల్ వీడియో
గోల్‌కీపర్, కెప్టెన్ సవిత పూనియా అన్నీ తానై అడ్డుగోడలా నిలబడటంతో... 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. చివరి క్షణాల్లో చేసిన పొరపాటు వల్ల షూటౌట్ దాకా వెళ్లిన భారత్... కెప్టెన్ సవిత చురుకైన ప్రదర్శన వల్లే ‘షూటౌట్’లో 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. Watch | Indian women's hockey team celebrates their victory in the Bronze medal match in #CommonwealthGames2022 @Media_SAI@YASMinistry | @TheHockeyIndia#CWG2022 | #Cheer4India pic.twitter.com/MWGvsDsruM— DD News (@DDNewslive) August 7, 2022 ఆట 29వ నిమిషంలో సలీమా టెటె చేసి గోల్‌తో 1–0తో ఆఖరి దాకా ఆధిక్యంలో నిలిచిన భారత్... ఇంకొన్ని క్షణాల్లో మ్యాచ్ గెలిచేందుకు సిద్ధమైపోయింది. 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా... కివీస్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా ఒలీవియా మెర్రీ (60వ ని.) దాన్ని గోల్‌గా మలిచింది. 1–1తో సమంకాగా, షూటౌట్ అనివార్యమైంది. భారత బృందంలో తొలి షాట్లో సంగీత గురి తప్పగా... రెండు, మూడు షాట్లలో సోనిక, నవనీత్ స్కోరు చేశారు. నాలుగో షాట్లో నేహా విఫలమైంది. న్యూజిలాండ్ జట్టులో తొలి షాట్‌ను మేగన్ హల్ మాత్రమే గోల్‌పోస్ట్‌లోకి తరలించగా... మిగతా నాలుగు షాట్లను రాల్ఫ్ హోప్, రోజ్ టైనన్, కేటీ డోర్, ఒలీవియా షనన్‌ల షాట్లను సవిత అడ్డుకుంది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల హాకీలో భారత్‌కిది మూడో పతకం. 2002 గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా 2006లో రజతం సాధించింది. -
పట్టు వదలని భారత మహిళా హాకీ జట్టు.. సెమీస్‌లో రిఫరీ దెబ్బకొట్టినా కాంస్యం సొంతం
CWG 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. తొమ్మిదో రోజు వరకు మొత్తం 40 పతాకలు (13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు) సాధించిన భారత్.. పదో రోజు ఆరంభంలోనే రెండు స్వర్ణాలు, మరో కాంస్యం సాధించి పతకాల సంఖ్యను 43కు పెంచుకుంది. మహిళల బాక్సింగ్ 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసరగా.. మహిళల హాకీలో భారత్ కాంస్యం చేజిక్కించుకుంది. సెమీస్‌లో (ఆస్ట్రేలియా) అంపైర్ తప్పిదం కారణంగా స్వర్ణం లేదా రజతం గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన భారత మహిళా హాకీ జట్టు.. కాంస్య పతక పోరులో అసమాన పోరాట పటిమ కనబర్చి పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్‌పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. మ్యాచ్ కొద్ది సెకెన్లలో (18 సెకెన్లలో) ముగుస్తుందనగా న్యూజిలాండ్ గోల్ చేసి 1-1తో స్కోర్‌ను సమం చేయడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున సోనికా, నవ్‌నీత్ కౌర్ గోల్స్ సాధించగా.. కివీస్ తరఫున మెగాన్ హల్ మాత్రమే గోల్ చేయగలిగింది. చదవండి: Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు -
ఆట ఏదైనా ఒక్కటే.. అంపైర్ల చీటింగ్ మాత్రం మారదు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పెనాల్టీ షూటౌట్లో భాగంగా ఆసీస్ చేతిలో భారత్ 3-0తో పరాజయం చవిచూసింది. అయితే పెనాల్టీ షూటౌట్ ప్రారంభానికి జరిగిన ఒక చిన్న తప్పిదం భారత మహిళలను ఓటమి వైపు నడిపించింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఆస్ట్రేలియా డిపెండర్ అంబ్రోషియా మలోనే షూటౌట్‌కు సిద్దమైంది. ఆమె షాట్ ఆడగా.. భారత గోల్‌కీపర్ సవితా అడ్డుకుంది. అలా ఆసీస్ ఒక పెనాల్టీ వృథా చేసుకుందని మనం సంతోషించేలోపే అంపైర్ మధ్యలో దూరింది. సారీ.. షూటౌట్ క్లాక్ టైంలో తప్పిదం ఉందని.. మళ్లీ ప్రారంభించాలని చెప్పింది. అప్పటికే షూటౌట్ చేయడానికి వచ్చిన భారత క్రీడాకారిణికి విషయం చెప్పి అక్కడి నుంచి పంపించేసి మల్లీ అంబ్రోషియాను పిలిచింది. తొలిసారి మిస్ అయిన అంబ్రోషియా ఈసారి మాత్రం గురి తప్పలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ కొట్టగా.. భారత్ మాత్రంఒక్క గోల్ చేయలేకపోయింది. అలా భారత మహిళల హాకీ జట్టు ఫైనల్ చేరడంలో విఫలమైంది. అయితే పెనాల్టీ షూటౌట్ సమయంలో అంపైర్ విధానంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడుతున్నది ఒక సెమీఫైనల్ మ్యాచ్ అని మరిచిపోయి.. క్లాక్‌టైం మిస్టేక్ అని చెప్పడం సిల్లీగా ఉందని.. అంపైర్ కావాలనే ఇలా చేసిందేమో అంటూ కామెంట్స్ చేశారు. ఇదే విషయమే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా అంపైర్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ''ఆస్ట్రేలియాకు పెనాల్టీ మిస్ కాగానే అంపైర్ పరిగెత్తుకొచ్చి.. సారీ క్లాక్ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు.. మళ్లీ ఆరంభిద్దామా అని సింపుల్‌గా చెప్పేసింది. అంపైర్లు ఇలా ఎందుకుంటారో అర్థం కావడం లేదు. క్రికెట్.. హాకీ ఇలా ఏదైనా ఒక్కటే.. అంపైర్లు తమకుండే సూపర్ పవర్‌తో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. ఇలాంటివి క్రికెట్లో బాగా జరిగేవి.. అందుకే మేం హాకీలోకి కూడా త్వరలోనే ఎంటరవుతాం.. అమ్మాయిలు.. ఓడిపోయారు పర్లేదు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. మరోవైపు భారత్- ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్‌పై విమర్శలు పెరగడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ కూడా స్పందించింది. ''కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్- ఆస్ట్రేలియా సెమీఫైనల్లో షూటౌట్ చిన్న తప్పిదం వల్ల క్లాక్ సెట్ చేయకముందే ప్రారంభమయింది. అందుకే మళ్లీ ప్రారంభించాం. ఈ తప్పిదానికి మేం క్షమించమని కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతాం.'' అని కామెంట్ చేసింది. కాగా సెమీస్‌లో ఓడినప్పటికి భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమవనుంది. మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్ న్యూజిలాండ్‌పై 2-0 తేడాతో విజయం సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక కాంస్య పతక పోరులో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మహిళల జట్లు పోటీ పడనున్నాయి. Penalty miss hua Australia se and the Umpire says, Sorry Clock start nahi hua. Such biasedness used to happen in cricket as well earlier till we became a superpower, Hockey mein bhi hum jald banenge and all clocks will start on time. Proud of our girls 🇮🇳pic.twitter.com/mqxJfX0RDq — Virender Sehwag (@virendersehwag) August 6, 2022 My heart goes out to the Indian women’s hockey team who fought like bravehearts against Australia. No shame in losing in penalties to the Aussies. Our ladies gave everything on the pitch. As fans, we cannot expect more. Really proud of the this team. 🇮🇳🏑❤️ — Viren Rasquinha (@virenrasquinha) August 5, 2022 చదవండి: 'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్' ప్రశంసలు -
పతకం దిశగా దూసుకుపోతున్న భారత అమ్మాయిలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు పతకం దిశగా దూసుకుపోతుంది. క్వార్టర్ ఫైనల్లో భారత అమ్మాయిలు కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు. ఈ విజయంతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. భారత్ గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఘనాపై 5-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. ఆతర్వాతి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1 తేడాతో గెలుపొందింది. అయితే ఇంగ్లండ్‌తో తదుపరి జరిగిన మ్యాచ్‌లో 1-3 తేడాతో ఓటమిపాలవ్వడంతో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అనంతరం కెనడాతో మ్యాచ్‌లో పుంజుకున్న భారత అమ్మాయిలు.. అద్భుతంగా రాణించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నారు. సలీమా టెటె, నవనీత్ కౌర్, లాల్రెమ్సియామి తలో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్.. కెనడాతో సమానంగా ఆరు పాయింట్లు సాధించినప్పటికీ, ఎక్కువ గోల్స్ చేసిన కారణంగా కెనడా గ్రూప్-ఏలో అగ్ర జట్టు హోదాలో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే, ఆరో రోజు లవ్‌ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. మరో 3 పతకాలు భారత జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్‌పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. చదవండి: CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు -
అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా రెండో విజయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఏలో భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు 3-1 తేడాతో ఘన విజయం అందుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో పూల్-ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్ తరపున వందనా కటారియా(ఆట 26, 48వ నిమిషం), గుర్జీత్ కౌర్(ఆట 28వ నిమిషం)లో గోల్స్ చేయగా.. వేల్స్ తరపున గ్జెన్నా హ్యూజెస్(ఆట 45వ నిమిషం) గోల్ చేసింది. ఇక భారత్ తమ తర్వాతి మ్యాచ్ ఆగస్టు 2న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. కానీ ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే దృడ సంకల్పంతో ఉంది. మరోవైపు ఎలాగైనా స్వర్ణం సాధించాలని బరిలోకి దిగన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఘనాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. GOAL! And the avalanche of goals continues with #TeamIndia's third goal. IND 3:1 WAL #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI — Hockey India (@TheHockeyIndia) July 30, 2022 -
ఎట్టకేలకు ఒక విజయం.. ప్రపంచకప్‌లో భారత్ బోణీ
థెరస (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించింది. ఇప్పటికే పతకం రేసుకు దూరమైన అమ్మాయిల జట్టు వర్గీకరణ మ్యాచ్‌లో షూటౌట్లో కెనడాను కంగుతినిపించింది. 9 నుంచి 16 స్థానాల కోసం మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సవిత పూనియా సేన షూటౌట్లో 3–2తో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1–1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. కెప్టెన్ సవిత గోల్‌పోస్ట్ వద్ద అడ్డుగోడగా మారి షూటౌట్లో భారత్‌ను గెలిపించింది. షూటౌట్ సహా మ్యాచ్ మొత్తమ్మీద ఆమె ఏకంగా ఆరు గోల్స్‌ను చాకచక్యంగా అడ్డుకుంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన షూటౌట్లో భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్, సోనిక, నేహా గోల్స్ సాధించారు. 11వ నిమిషంలోనే మ్యాడిలైన్ సికో కెనడా తరఫున ఖాతా తెరిచింది. ఆ తర్వాత పలు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా భారత రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకుంది. అయితే రెండు క్వార్టర్లు ముగిసినా గోల్ చేయడంలో వెనుకబడిపోయిన భారత అమ్మాయిలపై ఒత్తిడి పెరిగింది. మూడో క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు సువర్ణావకాశం వచ్చింది. కానీ నవ్‌జ్యోత్ కౌర్ కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌ను తాకుతూ బయటికి వెళ్లిపోయింది. మరోవైపు కెనడా ఫార్వర్డ్ లైన్ దాడులను కొనసాగించింది. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టుకు మరో పెనాల్టీ కార్నర్ లభించగా, సవిత అసాధారణ డైవింగ్‌తో వారి ప్రయత్నాన్ని విఫలం చేసింది. ఎట్టకేలకు భారత అమ్మాయిలు ఆఖరి క్వార్టర్లో అది కూడా మ్యాచ్ ముగిసే సమయంలో కెనడా గెలుపుదిశను మార్చేశారు. 58వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌పోస్ట్ దిశగా గుర్జీత్ కౌర్ కొట్టిన షాట్ రీబౌండ్ కాగా సలిమా టేటే సమయస్ఫూర్తితో గోల్‌గా మలిచింది. దీంతో స్కోరు 1–1తో సమమై షూటౌట్‌కు దారితీసింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగే పోరులో భారత్... జపాన్‌తో తలపడుతుంది.