Inmates
-
ఖైదీల ఘర్షణ.. సిద్దు హత్య కేసు నిందితుల హతం
ఛండీగఢ్: సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుల్లో ఇద్దరు.. జైలు ఘర్షణలో హతమయ్యారు. పంజాబ్ టార్న్ తరణ్ జిల్లా గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలు ఆదివారం ఐదుగురు ఖైదీల మధ్య జరిగింది. ఈ ఘర్షణలో మన్దీప్ సింగ్ అలియాస్ తుపాన్ ఆఫ్ బటాలా, మన్మోహన్సింగ్ అలియాస్ మోహ్న ఆఫ్ బుద్లానాలు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. మరో ఖైదీ కేశవ్ ఆఫ్ బతిండాకు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురు ఒకే గ్యాంగ్‌కు చెందిన వాళ్లని, సిద్దు హత్యకేసులో నిందితులుగా ఉన్నారని ఎస్ఎస్పీ గుర్మిత్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. తుపాన్ మూసేవాలా హత్య కేసులో షూటర్లకు వాహనాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక పంజాబీ యువగాయకుడు సిద్దూ మూసేవాలా.. 2022, మే 29న కాల్పుల్లో హత్యకు గురయ్యాడు. అంతకు ముందురోజే ఆయనకున్న సెక్యూరిటీని పంజాబ్‌లో కొలువు దీరిన మాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిపారు ఆయనపై దుండగులు. -
తినే కంచంలో ఉప్పు పోశారు.. ఆమె చేసిన ఘోరం అలాంటిది
ఓ మహిళా ఖైదీ రిమాండ్‌లో ఉన్న సమయంలో తోటి ఖైదీలు.. జైలులో తినే కంచంలో అధికంగా ఉప్పు కలిపి చుక్కలు చూపించారు. ఆమె చేసిన తప్పుకు తోటి ఖైదీలు సైతం అసహ్యించుకున్నారు. అందుకే ఆమె చేసిన తప్పు గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని ఈస్ట్ ఉడ్ మహిళల కారాగారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఎమ్మా టుస్టిన్ అనే 32 ఏళ్ల మహిళ.. 29ఏళ్ల థామస్ హ్యూస్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భార్యతో థామస్ విడిపోయినప్పటికీ.. వారిద్దరికి జన్మించిన ఆర్థర్ పోషణ బాధ్యతను తానే తీసుకున్నాడు. ఇక తనకు, థామస్‌కు మధ్య బాలుడు ఆర్థర్ ఉండడం ఇష్టంలేని ఎమ్మా.. ఆర్థర్ తినే కంచంలో రోజూ మోతాదుకు మించి ఉప్పును కలపడం మొదలు పెట్టింది. దీంతో ఆర్థర్ ఆరోగ్యం క్షిణించి, రక్తంలో ఉప్పు శాతం పెరిగి మృతిచెందాడు. ఈ ఘటనలో బాలుడి సవతి తల్లి ఎమ్మకు కోవెంట్రీ క్రౌన్ కోర్ట్ డిసెంబర్ 3న 29 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. అయితే ఎమ్మా రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో అదే జైలులో శిక్ష అనుభవించిన ఎలైన్ ప్రిచర్డ్(మాజీ ఖైదీ).. జైలులోని జరిగిన సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. ఆరేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న ఎమ్మాకు.. ఆర్థర్ పడిన బాధను చూపించాలని జైలులో ఉన్న మహిళా ఖైదీలమంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎమ్మా బాలుడిని హింసించి కంచంలో ఉప్పు కలిపినట్టుగానే తామంతా.. ఆమె తినే కంచంలో ఉప్పు కలిపేవాళ్లమని తెలిపారు. తామంతా కారాగారంలో ఉన్న సమయంలో ఎమ్మా పట్ల క్రూరంగా ప్రవర్తించామని కానీ, ఆర్థర్‌ను హింసించి చంపినందుకు మేము(ఖైదీలు) చేసిన హింసకు ఆమె శిక్షార్హురాలని ఎలైన్ చెప్పారు. తన భర్త థామస్.. బాలుడు ఆర్థర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల తను జైలు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేదని పేర్కొంది. ఆర్థర్ ఎలా చనిపోయాడనే విషయాన్ని చెప్పేది కాదని, అసలు బాలుడి ప్రస్తావన కూడా తీసుకురాలేదని ఎలైన్ పేర్కొంది. -
ఘోరం: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు
జకర్తా: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. జైలులో అగ్ని ప్రమాదం సంభవించి 41 మంది ఖైదీలు మృతువాత పడ్డారు. 8 మంది తీవ్రంగా గాయపడగా 72 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచం ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో జైలులో మంటలు చెలరేగాయి. అయితే నిద్రలో ఉన్న ఖైదీలు ఈ విషయం తెలియకపోవడంతో అగ్నికీలలకు ఆహుతయ్యారు. ఆ దేశ రాజధాని జకర్తాలోని టాంగరింగ్ జైలులో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. జైలులోని బ్లాక్ సీలో అగ్నిప్రమాదం సంభవించిందని ఆ దేశ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపుపలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు అదుపులోకి వచ్చాక పరిశీలించగా ఖైదీలు అగ్నికీలల్లో చిక్కుకుపోయి కన్నుమూసినట్లు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రతినిధి రికా అప్రియంతి వెల్లడించారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వాస్తవంగా అయితే బ్లాక్‌లో 40 మంది ఖైదీలు ఉండాల్సి ఉండగా రెట్టింపు స్థాయిలో122 మందికి పైగా ఉంటున్నారని జైళ్ల శాఖ వెబ్సైట్ తెలుపుతోంది. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడం.. ప్రమాదం సంభివించిన తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీలో రికార్డయ్యింది. -
లేడీ ఆఫీసర్ కాదు.. ఆమె ఒక కామపిశాచి!
విధి నిర్వహణ పక్కకుపెట్టిన ఆ అధికారిణి.. విరహంతో రగిలిపోయి అకృత్యాలకు పాల్పడింది. మూడేళ్ల పాటు జైల్లోనే దారుణాలకు తెగించింది. ఆమె కామ దాహానికి బలైన బాధితులతో పాటు అధికారుల వాంగ్మూలంతో ఎట్టకేలకు నేరం ఒప్పుకోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఖైదీల లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎట్టకేలకు నిందితురాలికి శిక్ష పడింది. టీనా గోన్జలెజ్.. వయసు 27. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా మూడేళ్లపాటు పని చేసేది. ఆ మూడేళ్లలో ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడిందన్నది ఆమెపై నమోదైన ప్రధాన ఆరోపణ. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని, ఫోన్ కాల్స్‌లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె ఖైదీలను బెదిరించేది. కొందరు ఖైదీలు తెగించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేరవేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసిన అధికారులు.. గత మే నెలలో ఆమెను అరెస్ట్ కూడా చేశారు. వికృత చేష్టలు.. దర్యాప్తు సమయంలో గోన్జలెజ్ జైల్లో పాల్పడ్డ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. విడుదలైన ఖైదీల నుంచి, అధికారుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు.. ఆ వివరాల్ని జడ్జి ముందు ఉంచారు. ఖైదీలపై తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేదని తేలింది. ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్ వీడియోలు చూపించి.. అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్‌కు ఆమె రంధ్రాలు చేసుకునేదని నివేదిక ఇచ్చారు అధికారులు. ఆ అకృత్యాల రిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు. జీవితం నాశనం చేసుకున్నావ్ గోన్జలెజ్ మీద వృత్తిపరమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్ సప్లై చేసేదని, ‘సెక్స్ రిటర్న్ గిఫ్ట్’లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి, ఈ నివేదికను రూపొందించిన స్టీవ్ మెక్కోమాస్ కోర్టుకు వెల్లడించాడు. నిందితురాలి తరపున కౌన్సెలర్ మాట్లాడుతూ.. ఆ టైంలో గోన్‌జలెస్ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించండి’ అని వేడుకున్నాడు. అయితే ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక ‘కామ పిశాచి’గా వర్ణించడం విశేషం. ‘నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్. మూర్ఖంగా వ్యవహరించావు. మిగతా జీవితం అయినా మంచిగా బతుకు’ అని తీర్పు వెలువరించే ముందు జడ్జి వ్యాఖ్యానించాడు. కాగా, ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టాడు జడ్జి. ఇప్పటికే జైలులో గడిపినందున.. ఆ శిక్షను మైనస్ చేసి మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి వెల్లడించాడు. ఏ జైల్లో అయితే అధికారిణిగా అకృత్యాలకు పాల్పడిందో.. అదే జైలుకి ఇప్పుడామె ఖైదీగా వెళ్లింది. -
ఖైదీలకు తాత్కాలిక బెయిల్!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితులు, మధ్యంతర బెయిల్‌పై ఖైదీల విడుదల తదితర అంశాలపై చర్చించేందుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ (లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్), జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి (హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్), హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, జైళ్ల శాఖ డీజీ మహ్మద్ అసన్ రెజాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమావేశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ఈ కమిటీ పలు తీర్మానాలు చేసింది. ప్రాథమికంగా 90 రోజుల పాటు.. ఏడేళ్లు అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా డీజీపీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనలు ఇవ్వాలి. జిల్లా జడ్జీలంతా ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని మేజిస్ట్రేట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు సూచనలు చేయాలి. గత ఏడాది కమిటీ తీర్మానాల మేరకు మధ్యంతర బెయిల్‌పై విడుదలై తిరిగి జైలుకు చేరిన ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో జైల్లో ఉన్న అర్హులైన ఖైదీలను, అండర్ ట్రయిల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. విడుదలైన తరువాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటామని వారు హామీ ఇవ్వాలి. దీన్ని ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసి కస్టడీలోకి తీసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకునేలా హోంశాఖ, జైళ్ల శాఖ తగిన రవాణా సదుపాయం కల్పించాలి. ప్రాథమికంగా మధ్యంతర బెయిల్ 90 రోజులకు మంజూరు చేయాలి. బెయిల్ బాండ్ల మొత్తం సమంజసంగా ఉండాలి. వెబ్సైట్లో వివరాలుంచాలి.. దీనికి సంబంధించి హైకోర్టులో ఓ బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రార్ జనరల్ తీర్మానాల కాపీని ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలి. ఈ మొత్తం వ్యవహారంపై సుమోటో పిటిషన్‌ను సిద్ధం చేయాలి. రాష్ట్రంలో జైళ్ల సామర్థ్యం, ఎంత మంది ఖైదీలున్నారన్న విషయాలను జైళ్ల శాఖ వెబ్సైట్లో పొందుపరచాలి. ఈ వివరాలను ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీతో పంచుకోవాలి. ఉన్నత స్థాయి కమిటీ గత ఏడాది చేసిన అన్ని తీర్మానాలను లీగల్ సర్వీసెస్ అథారిటీ, హోంశాఖ, హైకోర్టు వెబ్సైట్లలో పొందుపరచాలి. జైళ్లలో వేగంగా వ్యాక్సినేషన్ ఖైదీలు, సిబ్బంది విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, వైద్య సాయం, రోజూ శానిటేషన్ తదితర వివరాలను ఉన్నత స్థాయి కమిటీకి జైళ్ల శాఖ వివరించింది. ఇప్పటి వరకు 643 మంది ఖైదీలు, సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు జైళ్ల శాఖ డీజీ వివరించారు. మిగిలిన 6 వేల మంది ఖైదీలు, సిబ్బందికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. -
కరోనాను జయించిన సెంట్రల్ జైల్ ఖైదీలు
రాజమహేంద్రవరం క్రైం: ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల 300 మంది ఖైదీలు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు గత నెలలో కరోనా బారినపడ్డారు. ఈ జైలులో 1,700 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 300 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కరోనా బారిన పడిన ఖైదీలకు ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి మిగిలిన ఖైదీలతో కలవకుండా చర్యలు చేపట్టి వైద్య సేవలు అందించారు. ప్రత్యేక నిధులు మంజూరు * ఖైదీలు కరోనా బారినపడిన వెంటనే పూర్తిస్థాయి వైద్యంతో పాటు బలవర్ధక ఆహారం అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. * ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న ఖైదీలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా వైద్య సేవలందించారు. * కరోనా బాధితులందరికీ చికిత్స అనంతరం పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని జైలు అధికారులు, వైద్యులు ధ్రువీకరించారు. -
కరోనా : కోలుకున్న సెంట్రల్ జైలు ఖైదీలు
ఢిల్లీ : కరోనా వైరస్ నుంచి రోహిణి జైలులోని 10 మంది ఖైదీలు, ఒక ఉద్యోగి బయటపడ్డారని మంగళవారం అధికారులు పేర్కొన్నారు. మే 15న హెడ్ వార్డెన్‌కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఈయనకు జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలేవీ బయటపడలేదు. ఇది జైలులో కరోనా వ్యాప్తి అధికం కావడానికి మరొక కారణమని అధికారులు భావిస్తున్నారు. లక్షణాలు లేకపోవడంతో అందరితో మామూలుగానే ఉండటంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. (శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు ) మే15న నిర్వహించిన కరోనా పరీక్షల్లో వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమై జైలు అధికారులు మిగతా సిబ్బంది, ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 16 మంది ఖైదీలు, నలుగురు సిబ్బంది వైరస్ బారినపడినట్లు గుర్తించారు. దీంట్లో ఎక్కువగా జైలులోని కరోనా సోకిన ఖైదీతో బ్యారక్ పంచుకున్న వాళ్లే ఉన్నట్లు తేలింది. దీంతో వారందరినీ స్థానిక సోనిపేట్ ఆసుపత్రిలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో పదిమంది ఖైదీలు, ఒక ఉద్యోగి కోలుకున్నారని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారు. వీరికి మంగళవారం కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. వైరస్ బారిన పడ్డ మిగతా ఖైదీలు కూడా తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. (6 రోజుల్లో కరోనాను జయించిన హెచ్ఐవీ పేషెంట్ ) -
కరోనా మహమ్మారి సోకాలని..
లాస్ఏంజిల్స్ : జైలు నుంచి విడుదల అవ్వడానికి ఖైదీలు వేసిన కొత్త ఎత్తుగడ బెడిసికొట్టింది. ఏకంగా కరోనా మహమ్మారిని కావాలనే అంటించుకుని ఆ సాకుతో జైలు నుంచి విడుదల అవ్వాలని ప్లాన్ వేశారు. ఈ సంఘటన లాస్ ఏంజిల్స్ కౌంటీ జైలులో చోటుచేసుకుంది. ఒకరు తాగిన నీళ్లు మరొకరు తాగుతూ, ఒకరు ఛీదిన మాస్కును మిగతా ఖైదీలు ధరిస్తూ.. ఇలా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడంతో కేవలం రెండు వారాల్లోనే దాదాపు 30 మంది ఖైదీలకు కరోనా వ్యాధి సోకింది. జైలులోని రెండు గదుల్లో ఉన్న ఖైదీలు కావాలనే కరోనా వ్యాపించేలా వ్యవహరించిన సీసీటీవీ వీడియో ఫుటేజీని ఉన్నతాధికారి అలెక్స్ విలాను మీడియా సమావేశంలో విడుదల చేశారు. కరోనా సోకినంత మాత్రాన విడుదల చేస్తామని ఖైదీలు తప్పుగా భావించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరోనా సోకిన ఖైదీల పరిస్థితి బాగానే ఉందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా కరోనా వ్యాధి వ్యాపించేలా చేసిన ఖైదీలపై చట్టపరంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఖైదీలెవరూ తాము కావాలనే అలా చేయలేదని చెబుతున్నారని, వారి ప్రవర్తన చూస్తే తప్పు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుందన్నారు. కాగా, అమెరికా వ్యాప్తంగా దాదాపు 25000 మంది ఖైదీలకు కరోనా సోకగా, 350 మంది ఖైదీలు మృతిచెందారు. -
సెంట్రల్ జైలులో కరోనా కలకలం..
లక్నో : ఆగ్రా సెంట్రల్ జైలులో 10 మంది ఖైదీలకు కరోనా సోకినట్టు ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డీజీ అనంద్ కుమార్ వెల్లడించారు. దీంతో జైలు సిబ్బందితోపాటు, ఇతర ఖైదీల్లో కలవరం మొదలైంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రా సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీకి కొద్ది రోజుల కిందట కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో జైలులో ఆ ఖైదీకి సన్నిహితంగా ఉన్న 14 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు.(చదవండి : మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: ఖైదీల విడుదల) ఈ నేపథ్యంలో జైలులోని సిబ్బందికి, ఇతర ఖైదీలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని జైలు అధికారులు.. వైద్య అధికారులను కోరారు. జైలులో మొత్తం 1,941 మంది ఖైదీలు, అధికారులతో కలిపి 121 మంది సిబ్బంది ఉన్నారు. కాగా, ఇటీవల ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో దాదాపు 185 మంది ఖైదీలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో జైళ్లలోని ఖైదీల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని సగం మంది ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. వారిని పెరోల్ లేదా తాత్కాలిక బెయిల్‌పై బయటకు పంపనున్నట్టు తెలిపింది. (చదవండి : మహిళా ఖైదీకి కరోనా పాజిటివ్) -
కరోనా: 17 వేల మంది ఖైదీల విడుదల
ముంబై: దేశంలోనే ఎక్కువ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడ ఎంతకూ కరోనా అదుపులోకి రావడం లేదు. నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మంగళవారం అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో నుంచి సగం మందిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 35 వేల మంది ఖైదీల్లో 17 వేల మందిని బయటకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్ మీద వీరిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. (ఖైదీలకు కరోనా.. హైకోర్టు ఆగ్రహం) అయితే యూఏపీఏ, ఎమ్‌సీఓఏ, పీఎమ్ఎల్ఏ వంటి తీవ్ర నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపిచబోమని స్పష్టం చేసింది. కాగా ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఖైదీలు, జైలు అధికారులతో కలిపి 100 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాంబే హైకోర్టు తీవ్రంగా మండిపడింది. జైల్లో ఉన్న ఖైదీలకు ఆరోగ్యంగా జీవించడం ప్రాథమిక హక్కు అని, ఖైదీలకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జైల్లోని ఖైదీలను బయటకు పంపించివేస్తున్నట్లు తెలుస్తోంది. (ప్లాస్టిక్ కవర్లలో శవాలు.. పక్కనే పేషెంట్లు) -
వారి ద్వారానే ఖైదీలకు వైరస్..
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలులో 77 మంది ఖైదీలు సహా అక్కడ విధులు నిర్వహిస్తున్న 26 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో జైలును పూర్తిగా లాక్డౌన్లో ఉంచామని అయినా మహమ్మారి విజృంభించడంపై ఆరా తీస్తున్నామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. జైలుకు కూరగాయలు, పాలు సరఫరా చేసే వారి ద్వారా వైరస్ సంక్రమించిందని భావిస్తున్నామని అన్నారు. అర్థర్ రోడ్ జైల్ సహా 8 జైళ్లను పూర్తిగా లాక్డౌన్ చేశామని, అయితే కూరగాయుల, పాలు సరఫరా చేసే వారు కోవిడ్-19 వాహకులుగా మారవచ్చని వ్యాఖ్యానించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి దక్షిణ ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముంబై నగరంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మహమ్మారి బారినపడటంతో వారిలో నైతిక స్థైర్యం నింపేందుకు ముంబై నగర పోలీస్ కమిషనర్ పరం వీర్ సింగ్ జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడి సిబ్బందిని ఉత్తేజపరిచారు. చదవండి : శవాలు తీసుకువెళ్లడం లేదు.. అందుకే ఇలా -
పారిపోయిన ఖైదీలు తిరిగొచ్చారెందుకో!
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రకాల నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీలు సందు దొరికితే చాలు జైలు నుంచి పారిపోదామని చూస్తారు. మరికొందరు సందు దొరక్కపోయినా గోడలకు కన్నం వేసి మరీ పారిపోదామని వ్యూహాలు పన్నుతుంటారు. ఇండోనేసియాలోని పపువా ప్రాంతంలోని సొరాంగ్ నగరంలోని జైలులో సోమవారం మంటలు వ్యాపించడంతో జైలు నుంచి పారిపోయిన 500 మంది ఖైదీలు పారిపోయారు. వారిలో 270 మంది ఖైదీలు గురువారం తిరిగి జైలుకు చేరుకున్నారు. అలా తిరిగొచ్చిన వారిలో హత్య కేసుల్లో శిక్షలు పడ్డ వారు కూడా ఉన్నారని జైలు అధికార ప్రతినిధి ఎల్లి యోజర్ మీడియాకు తెలిపారు. వారంతా ప్రాణ రక్షణ కోసమే జైలు నుంచి పారిపోయారని, మిగతా శిక్షకాలాన్ని పూర్తి చేసుకునేందుకు తిరిగొచ్చారని ఆయన చెప్పారు. ఏదో అంశంపై ఆందోళన చేస్తున్న పపువా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆగ్రహించిన మిగతా విద్యార్థులు, స్థానికులు సొరాంగ్ నగరం జైలుకు నిప్పుపెట్టారు. ఖైదీలతో కిక్కిరిసిపోవడం వల్ల జైలు పరిశుభ్రంగా ఏమీ ఉండదని, అయితే తాము ఖైదీలను బాగా చూసుకుంటామని అందుకనే వారంతా తిరిగొచ్చారని ఎల్లీ యోజర్ తెలిపారు. బయట ఆహారం దొరక్కా జైలుకొచ్చే ఖైదీలు ఇంకా ఎక్కడైనా ఉండవచ్చేమోగానీ తమ వద్ద మాత్రం అలాంటి ఖైదీలు లేరని చెప్పారు. శిక్షాకాలం పూర్తి కాకుండా పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదని, అపరాధభావం, భయం జీవితాంతం వెంటాడుతుందని, శిక్షాకాలం పూర్తయ్యాక దర్జాగా సాధారణ జీవితం గడపొచ్చని తాము ఎప్పుడూ చెబుతుంటామని ఆయన అన్నారు. తిరిగొచ్చిన ఖైదీలు కాలిపోయిన జైలు అధికారుల గదులను శుభ్రం చేయడమే కాకుండా మరమ్మతుల్లో కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని, అధికారుల మంచితనానికి వారూ మంచితనమే చూపారని ఎల్లి యోజర్ వ్యాఖ్యానించారు. మిగతా ఖైదీలు కూడా తమ బంధు, మిత్రుల యోగ క్షేమాలు కనుగొని ఒకటి, రెండు రోజుల్లో తిరిగొస్తారని తాము ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వం దృష్టికి చిత్రపురి సమస్యలు
‘‘చిత్రపురి కాలనీలో 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న సినీ కార్మికులకు కాకుండా సినిమాయేతరులకు ఇళ్లు కేటాయించారు. సుమారు 5 వేలకుపైగా నిజమైన సినీకార్మికులకు ఇళ్లు కేటాయించాల్సి ఉంది. దీనికోసం ‘చిత్రపురి పోరాట సమితి’ చేస్తున్న దీక్షల్లో న్యాయం ఉంది’’ అని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. చిత్రపురి కాలనీలో ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యుల అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ‘చిత్రపురి పోరాట సమితి’ ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షకు ప్రతాని రామకృష్ణ గౌడ్ బుధవారం మద్దతు పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘26 రోజులుగా దీక్షలు చేపడుతున్నా హౌస్‌ంగ్ సొసైటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సినీ కార్మికులకు ఇచ్చిన స్థలాన్ని ‘కైరోస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్’కి కేటాయించడం చట్ట విరుద్ధం, వెంటనే ఆ స్కూల్‌ను తొలగించాలి. ఈ సొసైటీలో జరిగిన అవకతవకలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం కేటాంచబోయే 9 ఎకరాలను ‘చిత్రపురి పోరాట సమితి’కి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతాం’’ అన్నారు. కాగా ధర్నాలో పాల్గొంటున్నారనే కారణంతో షూటింగ్‌లకు పిలవని కొందరు సినీ కార్మికులకు ప్రతాని రామకృష్ణ గౌడ్ బియ్యం వితరణ చేశారు. ‘‘న్యాయం కోసం పోరాటం చేసే వారిని బెదిరిస్తున్నారని, ఎవరు బెదిరించినా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’’ అని ‘చిత్రపురి పోరాట సమితి సభ్యుడు’, డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ అన్నారు. బి నరసింహా రెడ్డి, మహేందర్, ఓ. రవిశంకర్, మురళితో పాటు పలువురు సినీకార్మికులు పాల్గొన్నారు. -
నిమ్స్ నుంచి లక్ష్మణ్ డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ కోసమే నిరాహార దీక్ష చేశానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి అధికార మత్తులో ఉంది. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. అన్యాయాలపై నిలదీసిన నేతలను అరెస్టు చేస్తోంది. శాంతియుత పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తున్న వారిని నిర్బంధించడం ఏ మేరకు సమంజసమో ప్రభుత్వం చెప్పాలి’ అని నిలదీశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయస్థాయిలో ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై త్వరలో ఆందోళనలు నిర్వహిస్తామని, బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. అదే ఉద్యమాలను అణచివేస్తుందని ఆరోపించారు. పిల్లల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోకుండా, వారి చర్యలను వెనుకేసుకొస్తుండటం సిగ్గుచేటని లక్ష్మణ్ విమర్శించారు. ఆయన వెంట మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రాంచందర్‌రావు తదితర నేతలు ఉన్నారు. -
‘సింగూరు కోసం 18 నుంచి రిలే దీక్ష’
సాక్షి, హైదరాబాద్: సింగూరు జలాల కోసం ఈ నెల 18 నుంచి తాను, తన భార్య రిలే నిరాహార దీక్ష చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. దీక్షను అడ్డుకుంటే తలెత్తే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో లేకుం డా సింగూరు జలాలను తరలించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు. సింగూరు జలాల తరలింపు వల్ల సంగారెడ్డికి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. -
జ్ఞానమే ముక్తి మార్గం
ధర్మపరిరక్షణలో భాగంగా విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు పంచారామ పాదయాత్ర చేశారు. ఆగమ పరిరక్షణ కోసం తిరుమల శ్రీవారి ఆస్థానమండపంలో వైఖానస ఆగమ సదస్సు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు గోవులను పంపిణీ చేసి, వారిని ధర్మమార్గం వైపు నడిపిస్తున్నారు. విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలలో వేదపాఠశాలలను నిర్వహిస్తూ వేద పరిరక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షకోసం హృషీకేశ్‌లో ఉన్న స్వామి వారు 27న దీక్ష ప్రారంభిస్తారు. ఈ పర్వదినాన గురుపూజతోపాటు అనేక కార్యక్రమాలుంటాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ కి ప్రశ్నోత్తరాల రూపంలో అందించిన ప్రత్యేక అనుగ్రహ భాషణమిది. చాతుర్మాస్య వ్రతం చేయవలసిన సమయం ఏది? ఆ సమయాన ఏమి చేయాలి? స్వామీజీ: ఆషాఢ పున్నమినాడు∙మొదలుపెట్టి కార్తీక పున్నమికి ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. శ్రీ మహావిష్ణువు నిదురించు కాలమైన ఈ నాలుగు మాసాల కాలంలో ఈ వ్రతాన్ని శైవ, వైష్ణవభేదం లేక గృహస్థులందరూ ఆహారాది నియమాలను పాటిస్తూ ఆచరించాలి. లోకానికి ఆదర్శంగా నిలచే యతీంద్రులు ఈ చాతుర్మాస్యాన్ని ఆచరిస్తారు. మానవ జన్మ లక్ష్యం ఏమిటి? విశ్వమంతటికి కారణమైన ఒకే ఒక తత్త్వం ఉన్నది. అదే బ్రహ్మం. దానికే సత్యం, అక్షరం, పురుషుడు తదితర పేర్లు. ఆ బ్రహ్మతత్వమే మనందరి నిజ స్వరూపం. సకల జీవులు ఈ బ్రహ్మ స్వరూపమే అయి ఉన్నారు. దీనికి సరియైన రీతిలో అనుభవంతో తెలిసికొనిన వారికి సంసార భయం లేదు. దీనికే మోక్షం అని పేరు. ఇదే మానవ జన్మ లక్ష్యం. పిల్లలకు మంచి అలవాట్లు ఎలా వస్తాయి? భారతీయ సంస్కృతి, నాగరికతను, జీవన విధానాన్ని పిల్లలకు తల్లిదండ్రులు అలవాటు చేయాలి. అలా చేయాలంటే ముందు వారికి అలవాటు ఉండాలి. తరువాత తమ సంతానానికి అలవాటు చేయగలుగుతారు. అలా ప్రవర్తిస్తుంటే మనం మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాము. దీక్ష అంటే ఏమిటి? గురువునుండి శిష్యుడు పొందే అనుగ్రçహాన్ని లేక ఉపాసనను దీక్ష అంటారు. ఇది లౌకిక వ్యవహారానికి సంబంధించినది కాదు. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పాపాన్ని నిర్మూలించేది దీక్ష. శిష్యుడు సరైన మార్గం అనుసరించడానికి ఇచ్చే దీక్ష సమయదీక్ష. యోగమార్గం, మోక్షమార్గాలకు సంబంధించినది నిర్వాణ దీక్ష. వివాహితకి పతే ప్రత్యక్షదైవమంటారు. మరి దైవం ప్రధానం కాదా? స్త్రీ దైవాన్ని విడనాడాలని శాస్త్రం చెప్పలేదు. అలాగని దైవారాధనలు చేస్తూ భర్తను విస్మరించమనలేదు. అటు దైవారాధన చేస్తూనే, ఇటు భర్త చెప్పినట్లు వింటూ కుటుంబ జీవితం గడపాలి. అప్పుడు ఆ స్త్రీ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఈనాటి వేగవంతమైన జీవితంలో మంత్రానుష్ఠానాన్ని సావకాశంగా చేయడానికి కాలం సరిపోవడంలేదు. దీనిని సంక్షిప్తంగా చేసే మార్గం..? కాలం సరిపోవడం లేదన్నది సరియైన అంశం కాదు. కాలం నీ అధీనంలో ఉంది. నీవు కాలం అధీనంలో లేవు. మనకు శ్రద్ధ తగ్గడం చేత కాలం చాలడం లేదనే సాకు చెపుతున్నాము. నిత్యపూజను, ధ్యానాన్ని క్లుప్త పరచే వీలు లేదు. కర్మలకు ఫలితం ఉంటుందా? ‘న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకత్’ శరీరం ప్రతిక్షణం ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. మనిషి పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండజాలడు. అలాగే భూమి తిరగటం మనం చూస్తున్నామా? లేదు. అలా తిరగటం ఒక క్రియ. భూమి తన చుట్టు తాను తిరగటం వలన రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. తిరగటం అనే కర్మఫలితమే రేయింబవళ్ళు. ఇలాగే భూమి సూర్యుని చుట్టు తిరగటం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈ కర్మ అంతా మనకు కన్పించదు. ఇది అవ్యక్త కర్మ. దీని ఫలితమే రాత్రింబవళ్ళు. ఋతువులు కనిపిస్తున్నాయి. ప్రత్యక్షదైవాలు ఎవరు? తల్లిని మించిన దైవం లేద’ని, ‘న మాతుః పరదైవతం’ అన్నారు. ‘మాతృదేవో భవ, పితృదేవోభవ’ అని తైత్తిరీయం. తల్లిదండ్రులను దైవంగా భావించాలని శ్రుతి ఆదేశించింది. తల్లి చల్లని చూపులు లేకపోతే లోకమే లేదు కదా? కరుణామూర్తియైన భగవంతుడే మాతృమూర్తి రూపంలో అందరిని రక్షిస్తున్నాడు. తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరులని భావించి సేవిస్తే అంతకంటె గొప్ప ఉపాసనయే లేదు. ఇది సకల మానవులకు స్వధర్మం. దేవుడు ఉన్నాడా? మనకు కనిపించనంత మాత్రాన దేముడు లేడని చెప్పడం సరికాదు. దేముని యీ చర్మచక్షువులతో చూడడం సాధ్యంకాదు. జ్ఞానదృష్టితో అనుభవం ఆధారంగా చూడగలం. వాయువునకు రూపంలేదు. అంతమాత్రాన వాయువు లేదని చెప్పగలమా? వెన్నెల, నక్షత్ర కాంతి, గ్రహసంచారం ఆ పరమాత్ముని అనుగ్రహం వల్లనే కలుగుతున్నాయి. భగవంతుడు సర్వవ్యాపి. ఆయనకు నామరూపాలు లేవు. అది వర్ణనకు అందని చైతన్యం. మనయందే చైతన్యంగా ఉన్నాడు. దైవసాక్షాత్కారం ఎలా కలుగుతుంది? దైవసాక్షాత్కారమన్నది మామూలు విషయం కాదు. మన అజ్ఞానం వల్ల యీ దేహేంద్రియ సంఘాతమే నేను అనుకుంటున్నాము. దృఢచిత్తంతో సద్గురువుని సమీపించి శాస్త్రాధ్యయనం చేసి యీ దేహమే నేను అనే మన అపోహను తొలగించుకోవాలి. అప్పుడు మనకు గల అత్యాశ తొలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమార్గంలో పయనిస్తూ ముందుకు సాగితే భగవదనుభూతి కలుగుతుంది. దైవీ సంపదతో కూడిన దేవతామూర్తులు గొప్పవా? గ్రహాలు గొప్పవా? హెచ్చుతగ్గులు అన్నవి లోక వ్యవహార దృష్టిలో సహజం. గ్రçహాలకు ఉన్న శక్తి గ్రహాలకు ఉంటుంది. అందువలన గ్రహశాంతి అవసరం. గ్రహశాంతులు నిత్యం చేసేవి కావు. ఆయా గ్రహాలకు సంబంధించి అవసరమైన కాలంలో గ్రహశాంతులు చేస్తారు. అనునిత్యం దైవారాధన చేయవచ్చు. దైవశక్తి ముందు ఏ గ్రహశక్తియైనా తలవంచవలసిందే. గ్రామదేవతల ప్రాధాన్యం ఏమిటి? పరాశక్తి రూపాలు అనేకం. ఈ రూపాలే గ్రామ దేవతలుగా కొలువబడుతూ గ్రామ ప్రజలను మారీ, విషూచ్యాది రోగాల నుండి, భూతప్రేతాల నుండి కాపాడుతుంటాయి. గ్రామదేవత మందిరం కొన్ని గ్రామాలలో ఊరిచివర ఉంటుంది. ఈ గ్రామ దేవతలకు బహుకొద్ది ప్రాంతాలలో నిత్యపూజలు జరుగుతాయి. మిగిలిన చోట్ల విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుతారు. సాధారణంగా గ్రామదేవత పూజ అవైదికంగా ఉంటుంది. గ్రామదేవతలను అందరూ పూజించి నైవేద్యం సమర్పిస్తారు. దానధర్మాలవల్ల ఫలితం ఉంటుందా? ‘‘యజ్ఞం, దానం, తపశ్చైవ, పావనాని మనీషిణావ్ు’’ అని భగవంతుడే చెప్పి ఉన్నాడు. దానం చేత మన దారిద్య్రం తొలగుతుంది. దానం మూడు విధాలు. మనస్సు, వాక్కు, కాయము, మనస్సు ద్వారా, ఇతరులకు శుభం జరగాలనే సంకల్పంతో కాలాన్ని వినియోగించడం. దానం చేస్తూ తనదైన ఆ వస్తువును యిచ్చివేస్తున్నాననే శంక భావంలో కూడా ఉండరాదు. ఆవిధంగా సత్యహరిశ్చంద్రుడు చేసినట్లు పురాణాలలో తెలుసుకుంటాము. కర్ణుడు, శిబి, మొదలయినవారు. వారంతా తమ దానధర్మాలవల్ల ప్రసిద్ధులయి పుణ్యలోకాలకు వెళ్ళారు. అర్చనలో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎందుకు ? భగవంతుడు సర్వవ్యాపి. యావత్తు సృష్టిని ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయనను మించి వ్యాపకం గల వస్తువు వేరొకటి లేదు. పంచభూతాలు అంటే పృథ్వి, ఆప, తేజో, వాయు, ఆకాశాల ఆధారంగా యీ సృష్ఠి కృతజ్ఞతాభావంతో మనం పూజావిధానం ద్వారా ఆయనకు అర్పిస్తున్నాము. కలలు ఎందుకు వస్తాయి? స్వప్నంలో వచ్చే విషయాలు భవిష్యత్తును సూచిస్తాయా? జాగ్రదవస్థలో జరిగిన కొన్ని అంశాలు స్వప్నంలో రావడం సహజం. అనేక జన్మల సంస్కారం వల్ల చిత్రవిచిత్రంగా తోచే కలలు వస్తూ ఉంటాయి. స్వప్నంలో వచ్చినవన్నీ వాస్తం కావాలనే నియమమేది ఎక్కడా చెప్పలేదు. మెలకువలోకి వచ్చినపుడు మాత్రమే మనం స్వప్నం గురించి చెప్పుకుంటూ అది మంచిని సూచిస్తున్నది, లేక చెడును సూచిస్తున్నది అని చెప్పుకుంటాము. ఇది అంతా మన భ్రాంతి. జపస్థానాన్ని బట్టి ఫలితం మారుతుందా? మారుతుంది. ఇంటిలో జపం చేసిన ఒక ఫలితమైతే, గోశాలలో దానికి పదింతలు, వనంలో నూరురెట్లు, చెరువునందు వేయింతలు, నదీతీరాన లక్షరెట్లు, పర్వతాగ్రాన కోటిరెట్లు, శివాలయంలో నూరుకోట్ల అధిక ఫలం కలుగుతుంది. గురుసాన్నిధ్యాన చేస్తే అనంత ఫలం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. సత్యం అంటే ఏమిటి? సత్యానికి పదమూడు రూపాలున్నాయి. వాటిని మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజునకు ఉపదేశించాడు. ఏవిధంగా నంటే సత్యం, శమం, దమం, అమాత్సర్య, క్షమ, లజ్జ, తితిక్ష, అసూయ, త్యాగం, ధ్యానం, ఆర్యత, ధృతి, అహింస ఈ పదమూడున్నూ సత్యానికి ఆకారాలు. అన్ని ధర్మాలూ సత్యంలోనే వెలిసినాయి. సత్యం అన్ని ధర్మాలకు ప్రాణం. సత్యం లేని అహింస అహింస కాదు. సత్యం లేని ఆచారం దురాచారమే. సత్యం లేని శమాదులు వ్యర్థమే. సత్యం లేని బ్రహ్మచర్యం, తపస్సు, శౌచం అంతా కపట నాటకమే. రావణుడు కూడా తపస్సు చేశాడు. కాని ఆ తపస్సులో సత్యం లేదు. దుర్యోధనుడు సదా అన్నదాననిరతుడు. కాని ఆ దానధర్మానికి సత్యం అనే ఆధారశిల లేనందున నశించిపోయాడు. సత్యం అనే ధర్మం ఒక్కటుంటే చాలు ‘శతే పఞ్చాశత్’ వందలో యాభై అణగి ఉన్నట్లు సత్యంలో అన్ని ధర్మాలు నెలకొన్నాయి. ‘సర్వం పదం హస్తిపదే నిమగ్నం’ అన్నట్లు ఏనుగు అడుగు జాడలో అన్ని ప్రాణులు ఇమిడి ఉన్నట్లు సత్యధర్మం సకల ధర్మాలను తనలో ఇముడ్చుకుంది. అద్వైత సిద్ధాంతం విగ్రహారాధనను అంగీకరిస్తుందా? అద్వైత సిద్ధాంతం విగ్రహారాధనకు వ్యతిరేకం కాదు. మంత్ర, శిల్ప శాస్త్రాలలో, పురాణాలలో విగ్రహారాధనను గూర్చి వివిరంగా చెప్పారు. స్వర్గలోకప్రాప్తి లేదా చిత్తశుద్ధి ద్వారా క్రమ ముక్తిని గూర్చి తెలిపారు. మందమధ్యమాధికారులకు విగ్రహారాధన అవసరం. తెలిసిన వారు కూడా లోకసంగ్రహం కోసం విగ్రహారాధన చేస్తారు. -
82మంది మహిళా ఖైదీలకు ఆస్వస్థత
ముంబై : 82మంది మహిళా ఖైదీలు అస్వస్థకు గురైన సంఘటన శుక్రవారం ముంబై నగరంలో చోటుచేసుకుంది. ముంబైలోని బైకుళ్లా కారాగారంలో మహిళా ఖైదీలు శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైయ్యారు. వారిని జైలు సిబ్బంది ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జైలు అధికారులు చెబుతున్నారు. అపరిశుభ్రమైన నీటి కారణంగానే వారు అనారోగ్యానికి గురై ఉంటారని భావిస్తున్నారు. జైలు ఉన్నతాధికారి రాజ్‌వర్థన్ సిన్హా మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం ఓ మగఖైదీకి కలరా రాగా వెంటనే మందులు ఇచ్చామని తెలిపారు. కలరాను నివారించటానికి జైలులోని అందరికి ఆరోగ్యశాఖ వారు మందులు అందజేశారన్నారు. మహిళా ఖైదీలు అస్వస్థతకు గురైన వెంటనే జైలులోని మిగితా అందరికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. -
కదం తొక్కిన నిరుద్యోగులు
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం విడుదల చేసిన జీవో 39 రద్దు చేయాలని, గ్రూపు – 2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విడుదల చేసిన జీవో 622, 623ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరుద్యోగులు మంగళవారం విశాఖ నగర రోడ్లపై కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... సీఎం డౌన్ డౌనంటూ నినదించారు. వందలాది మంది నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన జరిగన తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల విభజన కూడా జరిగిందన్నారు. ఖాళీలున్న ఉద్యోగాల సర్వేకు కమల్‌నాథన్ కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీ చేసిన సర్వేలో రాష్ట్రంలో సుమారు 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సూచించారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం 20వేలు ఖాళీలే ఉన్నాయని ప్రకటించి 2016 – 17 ఏడాదిలో 4వేల పోస్టులకు మాత్రమే ప్రకటన జారీ చేసిందని, అన్ని శాఖలు కలుపుకుని ఇప్పటికి 10వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. 42 నోటిఫికేషన్లతో ఇయర్ క్యాలెండర్‌ని కూడా ప్రకటించి ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగ భద్రతకు ప్రమాదం పంచాయతీ కార్యదర్శులుగా ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో 1511మందిని నియమించడానికి జీవో 39ని ప్రభుత్వం జారీ చేసిందని, ఈ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15వేలు చెల్లిస్తారని ప్రకటించారని పేర్కొన్నారు. అసలు ఈ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఉద్యోగ భద్రత కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వ ఉద్యోగాలుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్‌ను నియమించిన తర్వాతే జీవో 39 విడుదల చేశారని గుర్తు చేశారు. అలాగే గ్రూప్ – 2 ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంగా పరీక్షను నిర్వహిస్తామని జీవో 622, 623 విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు అబ్జెక్ట్ విధానాన్ని అనుసరిస్తూ పరీక్షకు సిద్ధమవుతుంటే కొత్తగా డిస్క్రిప్టుగా పెడతామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. జీవో 39, జీవో 622, 623 వల్ల లాభం కంటే యువతకు జరిగే నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ జీవోలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్–1 సిలబస్‌ను మార్చి సివిల్ సర్వీస్ సిలబస్ పెడతానన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని, తెలంగాణ తరహాలో వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని, కానిస్టేబుల్ ఉద్యోగ వయో పరిమితి రెండేళ్లు పెంచాలని, తెలంగాణ రిజర్వేషన్లతో సమానంగా ఏపీలో కూడా నాన్‌లోకల్ రిజర్వేషన్ చేయాలని, వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి/నిరుద్యోగ లోకం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. నిరసనకు సెంచూరియన్ విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, డీవైఎఫ్ఐ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఉత్తరాం«ధ్ర విద్యార్థి సేన సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో విజయనగరం జిల్లా జేఏసీ కో ఆర్డినేటర్, రాష్ట్ర కో ఆర్డినేటర్ షేక్ మహబూబ్ బాషా, విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ జగన్ విద్యార్థులు పాల్గొన్నారు. -
‘వంచన వ్యతిరేక దీక్ష’కు తరలిరండి
రాజాం : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సోమవారం చేపడుతున్న వంచన వ్యతిరేఖ దీక్షను విజయవంతం చేయాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. ఈ దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, పార్టీ అభిమానులు, నాయకులు తరలిరావాలని కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ టీడీపీ నాలుగళ్లుగా ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా పని చేసిందని అన్నారు. కేంద్రానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన సీఎం చంద్రబాబుపై ప్రజలంతా వ్యతిరేక జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ విధివిధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని మోసగించిన ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంచన వ్యతిరేఖ దీక్ష జరుగుతుందని, ప్రజలంతా తరలిరావాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. తొలి నుంచి ప్రత్యేకహోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించిందన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ దీక్షలు
కోడుమూరు రూరల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్ష కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా అంటే జైలుకేనంటూ దీక్షలు చేసిన వారందరిపై కేసులు పెట్టి వేధించిన టీడీపీ ప్రభుత్వం నేడు హోదా ఇవ్వాలంటూ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ నాయకులు నాగేష్, మహేష్‌నాయుడు, మధు, సురేంద్ర, లక్ష్మన్న, రవి, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు దీక్ష చేస్తున్నారా?
రాయచోటి : కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టే దీక్ష మోసపూరితమైందని ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో ఏడేళ్లు, ఇప్పుడు నాలుగేళ్ల పాటు బీజేపీతో పొత్తుపెట్టుకుని రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చనందకు నిరాహార దీక్ష చేస్తున్నారా?, లేకపోతే నిరుద్యోగలందరికి ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు దీక్ష చేస్తున్నారా? డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పూర్తిగా రుణాలను మాఫీ చేయనందుకు దీక్ష చేపడుతున్నారా? రైతన్నలను మోసగించినందుకు నిరాహారదీక్ష చేస్తున్నారా? అన్న ప్రశ్నలన్నింటికీ ముందుగా సమాధానాలు చెప్పి నిరాహార దీక్షకు పూనుకోవాలన్నారు. ఒక్క రోజు ఐదు గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష చేయడానికి 50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడంతోనే వీళ్ల చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాసం పెడితే ఏమొస్తుంది, రాజీనామాలు చేస్తే ఏం లాభం అన్న ఆయన ఒక్క రోజు దీక్షకు ఎందుకు పూనుకొన్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతనని చెప్పుకునే ఆయన ఆ రోజు ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయంలో నేను మోదీకి సలహా ఇచ్చానని గొప్పగా చెప్పుకున్నారన్నారు. ఆ నోట్ల రద్దు వలన ప్రజలు, వ్యాపారస్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కబడటం లేదా అని ప్రశ్నించారు. -
దీక్షను అపహాస్యం చేస్తున్న సీఎం
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 20న దీక్ష చేయాలనుకోవడం విచిత్రంగా ఉందని, దీక్షను సీఎం అపహాస్యం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్ విమర్శించారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగి రాష్ట్ర ప్రజల గౌరవాన్ని పెంచారన్నా రు. వారికి మద్దతుగా రాష్ట్ర ప్రజలంతా రిలే నిరాహార దీక్షలు చేశారన్నారు. సీఎం చంద్రబాబు తన పుట్టిన రోజు ఏప్రిల్ 20వ తేది ఉపవాస దీక్ష చేస్తాననని చెబుతుండటం హాస్యాస్పదమన్నారు. ఎవరి కోసం, ఏం సాధించాలని సీఎం ఈ దీక్ష చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ముఖ్య మంత్రికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉంటే దొంగ దీక్షలు మాని ఆమరణ దీక్ష చేపట్టాలని, అప్పుడే ఆయన్ను ప్రజలు నమ్ముతారని తెలిపారు. సీనియర్ నాయకులు అన్నయ్యగారి హరినాథ్, 20వ డివిజన్ ఇన్చార్జి శ్యాంసన్, అలీ పాల్గొన్నారు. -
ఆ జైలులో ఖైదీలకు హెచ్ఐవీ..!
గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా 23 మందికి హెచ్ఐవీ ఉన్నట్టు బయట పడింది. గత కొన్ని నెలలుగా వైద్యులు జిల్లా జైలులోని ఖైదీలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 23 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షలను యూపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది పర్యవేక్షణలోనే నిర్వహించామని జైలు అధికారలు తెలిపారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలిన 23 మంది ఖైదీల్లో ఓ మహిళ కూడా ఉందన్నారు. వారంతా ప్రస్తుతం బీఆర్డీ వైద్య కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. హెచ్ఐవీ సోకిన వారంతా విచారణ ఖైదీలని.. అసలు హెచ్ఐవీ సోకడానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దీంతో పాటు జిల్లా జైలులో ఎక్కువ మంది ఖైదీలకు హై బీపీ, మధుమేహం సమస్యలున్నాయని వెల్లడైనట్టు తెలిపారు. ఎయిడ్స్ బాధిత ఖైదీలకు కౌన్సెలింగ్ చేస్తున్నామని వివరించారు. మరోవైపు యూపీలోని అన్ని జైళ్లలో ఇలాంటి ఖైదీలను గుర్తించి, సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జైళ్ల శాఖ ఐజీ ప్రమోద్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇటీవలే ఉన్నావో జిల్లా, బంగార్మావు తాలూకా పరిధిలోని మూడు గ్రామాల్లో 58 మందికి హెచ్ఐవీ సోకినట్టు వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. -
ప్రేమ పేరిట వంచించాడు..
నస్పూర్(మంచిర్యాల): తనను ప్రేమించి, కొతకాలంగా సహజీవనం గడిపిన ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ బెల్లంపల్లికి చెందిన గంపల సుజాత అనే యువతి గురువారం నస్పూర్‌లోని మోతునూరి నరేష్ ఇంటి ఎదుట బైఠాయించింది. సుజాత, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని ఒక స్కానింగ్ సెంటర్లో ఆరు సంవత్సరాలుగా ఇరువురు పనిచేశారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రస్తుతం నరేష్ వేరొక ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. సుజాత ప్రతిరోజు బెల్లంపల్లి నుంచి రాకపోకలు సాగించడంతో నరేష్ ఆమెను మంచిర్యాలలో ఒక అద్దె ఇంటిలో ఉంచి సంవత్సర కాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారు. సుజాత చిట్టీ వేస్తూ పొదుపు చేసుకున్న రూ.1.80 లక్షలు తన ఖర్చులకోసం వాడుకున్నాడు. ఇటీవల నరేష్ తల్లిదండ్రులు అతనికి వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో సుజాత తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని నిలదీసింది. దీనికి అతడు నిరాకరించాడు. దీంతో నరేష్‌పై మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నరేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సీసీసీ ఎస్సై రాజేంద్రప్రసాద్ సుజాతతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని సుజాత పేర్కొంది. -
రైతు ఆత్మహత్యలపై జస్టిస్ చంద్రకుమార్ దీక్ష
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్, హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ డిమాండ్ చేశారు. గురు వారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్ర కుమార్ ‘రైతు రక్షణ దీక్ష’ను చేపట్టారు. ఈ దీక్షకు పలు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లా డుతూ అందరికీ ఆహారాన్ని అందించే తల్లిలాంటి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రంగం మూతపడ్డా నష్టం జరగదని, కానీ వ్యవసాయ రంగం మూత పడితే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా రైతులను మోసం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వడ్డీ అంటే అది ముగిసిన ముచ్చట అని సీఎం అంటున్నారని, మరి రైతాంగాన్ని కాపాడటానికి ఏమి భరోసా ఇస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాలు పెంచారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల జీతాలను విపరీతంగా పెంచారు.. మరి రైతుల పంటకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మార్కెట్లో కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను చెల్లించడం లేదన్నారు. కార్యక్రమంలో ఏఐకే ఎంఎస్ నాయకుడు కెచ్చల రంగయ్య, రైతు సంఘం కార్యదర్శి టి.సాగర్, అఖిల భారత రైతు కూలీ సంఘం నేత అచ్యుత రామారావు, రైతు స్వరాజ్య వేదిక నాయ కులు కొండల్, ఏఐకేఎఫ్ నాయకులు ప్రభులింగం, మన్నారం నాగరాజు, మాజీ ఎంపీ సోలిపేట రాంచంద్రా రెడ్డి, ప్రొఫెసర్లు అరిబండి ప్రసాద రావు, లక్ష్మణ్, పీఎల్ విశ్వేశ్వర్ రావు, చంద్రన్న తదితరులు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. కాగా, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య రాత్రి 7 గంటలకు జస్టిస్ చంద్రకుమార్ తదితరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.