knowledge
-
సందిగ్ధ జ్ఞానం
జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్నది ‘అ’భేదమే కదా అనుకుంటాం కానీ, ఆ రెండింటికీ మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంది. అజ్ఞానమనే చీకటి ఒడ్డు నుంచి, జిజ్ఞాస అనే అలల మీదుగా, జ్ఞానమనే వెలుగుల తీరం వైపు సాగే ప్రయాణంలో ఆనందమే మనకు తెప్పవుతుంది. అందుకే జ్ఞానానందమనే మాట పుట్టింది. అయితే, ఆ ఆనందాన్ని అంటిపెట్టుకుని ఒక విషాదమూ ఉంటుంది. అది ఏమిటంటే... మన ఊహకు అందనంత వయసున్న ఈ అనంతవిశ్వంలో భూమి ఒక గోళీకాయ కన్నా కూడా చిన్నదనుకుంటే, దానిపై జీవించే మనిషి నలుసుపాటి కూడా చేయడు. అతని అస్తిత్వాన్ని కాలం కొలమానంతో కొలిస్తే అది కొన్ని క్షణాలను మించదు. కనుక అనంతవిశ్వం గురించిన జ్ఞానం సంగతలా ఉంచి, ఈ భూమి గురించి, ఈ భూమి మీద తన మనుగడ గురించిన జ్ఞానం మొత్తాన్నే ఒక మనిషి తన జీవితకాలంలో సంగ్రహించుకోవడం అసాధ్యం. అదీ అసలు విషాదం. మనిషిలో మెదడు ఎప్పుడు వికసించిందో అప్పుడే అతనిలో విశ్వం గురించిన జ్ఞానాన్వేషణ మొదలై, వేలసంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. చంద్రుడి వృద్ధి, క్షయాలను అనుసరించి కాలగణనాన్నీ, ఋతుభ్రమణాన్ని అనుసరించి వేటజంతువుల గుర్తింపునూ మనిషి ప్రారంభించి వాటిని ఒక పొడవాటి ఎముకపై నమోదు చేయడం నక్షత్రాలు, రాశులతో ముడిపడిన జ్యోతిర్విజ్ఞానానికి నాంది అయిందంటారు. ఆపైన మొక్కల సేకరణ నుంచి, పెరటిసాగుకు; అక్కడి నుంచి వ్యవసాయానికి సాగే క్రమంలో ఆహారవిజ్ఞానాన్ని బహుముఖాలుగా విస్తరించుకుంటూ వెళ్ళాడు. రాతిపనిముట్ల తయారీలో సాంకేతికజ్ఞానాన్ని, ఏదో అతీతశక్తి ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తోందన్న ఊహ నుంచి మత, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని; నియమ నిబంధనలు, కట్టుబాట్లతో కలసి జీవించడం నుంచి సంస్కృతిని సంతరిస్తూ, నిర్మిస్తూ వచ్చాడు. ఇందులో ప్రతిదీ జ్ఞానాన్వేషణలో మేలి మలుపే; జ్ఞానపు నిచ్చెన నధిరోహించడంలో నిశ్చయాత్మకమైన మెట్టే. నగరాల నిర్మాణం మీదుగా నాగరికతాదిశగా సాగిన ఈ యాత్రలో ఇంతవరకు మనిషి ఎక్కడా మడమ తిప్పింది లేదు; ఆకాశమే హద్దుగా ఆ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినా సరే, సంపూర్ణజ్ఞానం మనిషికి ఎప్పటికీ అందని ఎండమావిలా ఊరిస్తూనే ఉంది. కనిపించని జ్ఞానచంద్రుడి చీకటిపార్శ్వం అదే. సంకేతాల నుంచి లిపిని అభివృద్ధి చేసుకుని జ్ఞానాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం ఈ క్రమంలో మరొక మెరుపుల మజిలీ. మొదట్లో విశ్వసృష్టి, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం, సాంకేతికజ్ఞానం వగైరా వింగడింపు లేకుండా తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని, తనకు తెలిసిన ప్రక్రియలో ఒకేచోట రాశిపోసిన ఉత్సాహం మనిషిది. అందుకే గణితశాస్త్రాన్ని కూడా పద్యాల్లో చెప్పిన పావులూరి మల్లన్నలు మన దేశంలో, మన సాహిత్యంలో కనిపిస్తారు. తర్వాత తర్వాత జ్ఞానం అనేక శాఖలు గల మహావృక్షంగా ఎదిగిపోయి, ఒక మనిషి తన జీవితకాలంలో ఏ ఒక్క శాఖనూ పూర్తిగా తేరి చూసే వీలుకుండా నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది. తన కళ్ళ ముందే ఉన్న, తన నిత్యజీవనంతో ముడిపడి ఉన్న, తన అనుభవంలోకి వచ్చే అనేక విషయాల ఆనుపానులు తెలియకుండానే మనిషి తన జీవితకాలాన్ని ముగించవలసి రావడం కన్నా పెనువిషాదం ఇంక ఏముంటుంది? ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ అనే కథలో ఈ విషాదాన్నే ఒకింత హాస్యగంభీరస్ఫోరకంగా చిత్రిస్తారు. అందులో రాజశేఖరం అనే వ్యక్తిని ఇంగువ ఎలా తయారవుతుందనే ప్రశ్న చిరకాలంగా వేధిస్తూ ఉంటుంది. అతను వృద్ధాప్యంలో మంచం పడతాడు. ఒక మిత్రుడు అతణ్ణి చూడడానికి వెడతాడు. రాజశేఖరం అతి కష్టం మీద నోరు తెరచి అదే ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానం తెలుసుకోకుండానే జీవితం చాలిస్తానేమోనన్న బెంగ అతని ముఖంలో కనిపిస్తుంది. మిత్రుడు వెంటనే వెళ్ళి ఇంకో మిత్రుని కలసి సమాధానం కనుక్కొని తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాజశేఖరం కన్నుమూస్తాడు. ఇప్పటిలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, గూగుల్ శోధించి ఉంటే, ‘ఫెరులా’ అనే మొక్క నుంచి పుట్టే జిగురే గట్టిపడి ఇంగువగా తయారవుతుందనీ, ‘అసాఫోటిడా’ అనేది దాని శాస్త్రీయ నామమనీ, ఈ మొక్క ఎక్కువగా ఇరాన్ ఎడారుల్లో, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వతప్రాంతాలలో సాగవుతుందనీ రాజశేఖరం తెలుసుకుని ఉండేవాడు.అలాగని అతనికా అదృష్టం లేకపోయిందనడానికీ వీల్లేదు. ఇంటర్నెట్ ఆధారిత బహుళ మాధ్యమాలతో సమాచారవిప్లవం కొత్తపుంతలు తొక్కిందనుకునే ఈ రోజున కూడా చిన్న చిన్న సందేహాలు తీరకుండానే దేహం చాలించే రాజశేఖరాలు ఉంటూనే ఉన్నారు. జ్ఞానతీరానికి ఏ కొంచెమైనా దగ్గరవడానికి ఏ అత్యాధునిక సాధనాలూ సాయపడడం లేదు. పరిమిత జీవితకాలం అతని నిస్సహాయతను ఇప్పటికీ గుర్తుచేసి వెక్కిరిస్తూనే ఉంది. మరోవైపు సమాచార ఉల్బణం నుంచి నిక్కమైన సమాచారానికి బదులు అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చి జ్ఞానాన్వేషణను అజ్ఞానాన్వేషణగా మార్చివేశాయి. అలా వ్యాప్తిలోకి వచ్చినదే ‘ఫేక్’ లేదా నకిలీ సమాచారమనే మాట. నేటి రాజశేఖరాలను వేధిస్తున్నది కేవలం సమాచార రాహిత్యం కాదు, నిజమో, అబద్ధమో తెలియని సమాచార సందిగ్ధం. జ్ఞాన, అజ్ఞానాల మధ్య ఆ మాత్రపు అక్షరభేదాన్ని కూడా తుడిచేసి పూర్తి అభేదాన్ని స్థాపించే యుగంలో ఉన్నాం. అదీ విషాదం! -
అజ్ఞాన జ్ఞానం
‘ఆదియందు అక్షరమున్నది’(జాన్ 1:1) అని బైబిల్ వాక్కు. అజ్ఞానం అనాది నుంచి ఉన్నది. సృష్టిలో అజ్ఞానానికి ముందు ఏముందో ఎవరికీ తెలీదు. అజ్ఞానం అమేయమైనది; అజ్ఞానం అప్రమేయమైనది; అజ్ఞానం అనాదినిధనమైనది; అజ్ఞానం అప్రయత్నలబ్ధమైనది; అజ్ఞానం అగాధమైనది; అజ్ఞానం అనంతమైనది; అజ్ఞానం అజరామరమైనది. విచిత్రంగా జ్ఞానాజ్ఞానాల నడుమ ఒక సారూప్యత ఉంది. ఇవి రెండూ అగోచరమైనవే! రెండింటికీ ఒక భేదం కూడా ఉంది. జ్ఞానానికి అవధులు ఉంటాయేమో గాని, అజ్ఞానానికి ఎలాంటి అవధులూ ఉండవు.అజ్ఞానం నుంచి మానవాళికి అప్రయత్నంగా దొరికే ఆస్తి– మూర్ఖత్వం. అజ్ఞానం నుంచి ఉద్భవించడం వల్ల మూర్ఖత్వమూ అనంతమైనదే! ‘అనంతమైనవి రెండే రెండు. ఒకటి: ఈ విశ్వం, రెండు: మనుషుల మూర్ఖత్వం; విశ్వం సంగతి నాకింకా పూర్తిగా తెలీదు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్. మానవ మూర్ఖత్వానికి గల అనంత తత్త్వం అవగతమయ్యే నాటికి పాపం ఆయన తలపండితుడైపోయాడు. అనంతమైన అజ్ఞాన సాగరాన్ని ఈదులాడి ఒడ్డున పడితే తప్ప జ్ఞానమేమిటో తెలియదు. చాలామందికి అజ్ఞానసాగరంలో ఈదులాడుతూ ఒడ్డునున్న వాళ్ల మీదకు అజ్ఞాన తరంగాలను వెదజల్లుతుంటారు. వాళ్లకదో వేడుక!అజ్ఞానానికి గల అనేక పర్యాయపదాల్లో ‘మాయ’ ఒకటి. ఎవరి అజ్ఞానం వారికి తెలీదు. ఎదుటివారి అజ్ఞానాన్ని గుర్తించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞానులే! ప్రవచన ప్రసంగాల్లో అజ్ఞానాన్ని నేరుగా ప్రస్తావిస్తే, శ్రోతల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రవచనకర్తలు అజ్ఞానాన్ని ‘మాయ’ అని సున్నితంగా చెబుతుంటారు. ‘తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన/ ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత’– (4:42) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. అంటే, ‘అజ్ఞానం కలిగిన బుద్ధిలో నిలకడగా ఉన్న ఆత్మ గురించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి, తత్త్వజ్ఞానానికి సాధనమైన కర్మయోగాన్ని స్వీకరించు’ అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గుర్తించి చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాని. అజ్ఞానాన్ని ఖండించడానికి జ్ఞానఖడ్గాన్ని ప్రయోగించాలని ఆయన ఉద్బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గీతబోధ విన్న అర్జునుడు మొదలుకొని ఎందరెందరో జ్ఞానఖడ్గానికి పదునుపెట్టి అజ్ఞానాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఖండఖండాల అజ్ఞానం కొన్ని మెదళ్లలోకి చేరి, అఖండంగా పెరిగిపోతుండటమే విడ్డూరం. బహుశా, ఇదే మాయ కావచ్చు!‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, అజ్ఞానమే ఆనందమన్నమాట! ఈ నానుడినే కొంత విస్తరిస్తూ, ‘అజ్ఞానమే ఆనందం అంటుంటారు గాని, అజ్ఞానం మన విధికృతం’ అని చెప్పింది అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు గేయిల్ లైండ్స్. విధికృతమైన వాటిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? కాబట్టి అజ్ఞానాన్ని కూడా ఎవరూ తప్పించుకోలేరు. అజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, జ్ఞానులు ఎంతో ప్రయాసతో ప్రయత్నించవలసి ఉంటుంది. అజ్ఞానులకు ఆ బెడద లేదు. తమకు అప్రయత్నలబ్ధమైన అజ్ఞానానందాన్ని నిక్షేపంగా ఆస్వాదిస్తుంటారు. అజ్ఞానాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అని చెబుతారు చాలామంది. పాపం వాళ్లు చాలా అమాయకులు. అసలు సిసలు ముదురు జ్ఞానులు కొందరు ఉన్నారు. వాళ్లు అజ్ఞానాన్ని గురించి నానా రకాల అధ్యయనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జనబాహుళ్యంలో అజ్ఞాన విస్తరణకు పనికొచ్చే పద్ధతులకు రూపకల్పన చేస్తుంటారు. వాటిని జనాల మీద ప్రయోగిస్తుంటారు. ఇదొక ప్రత్యేక శాస్త్రం. ఇంగ్లిష్‌లో దీనినే ‘ఆగ్నటాలజీ’ అంటారు. అంటే, అజ్ఞానాధ్యయన శాస్త్రం అన్నమాట! మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద ఇంకా దృష్టి సారించలేదు గాని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ‘ఆగ్నటాలజీ’ అనే అజ్ఞానాధ్యయన శాస్త్రానికి ఆ పేరుతో పిలవడం ఆలస్యంగా మొదలైంది గాని, అజ్ఞానానికి సంబంధి«ంచిన పరిజ్ఞానం అంతకంటే ముందు నుంచే ఆచరణలో ఉంది. స్కాటిష్ సామాజిక చరిత్రకారుడు అయాన్ బోల్ 1992లో తొలిసారిగా ‘ఆగ్నటాలజీ’ అనే మాటను ప్రయోగించాడు. అమెరికన్ సిగరెట్ తయారీ కంపెనీలు 1969లో ఉద్ధృతంగా చేసిన ప్రచారం ఆగ్నటాలజీకి ఉదాహరణగా నిలుస్తుందని శ్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రోక్టర్ తేల్చిచెప్పాడు. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు నానా వర్గాలు ఆగ్నటాలజీ పద్ధతులను ఉపయోగించుకుంటూ, ప్రజల అజ్ఞానానికి జ్ఞాన ఖడ్గాల వల్ల ముప్పు లేకుండా కాపాడుతూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి.ఇది హైటెక్కు టమారాల యుగం. జ్ఞానం జనాలకు అందుబాటులో లేని సరుకేమీ కాదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన జనాలందరూ జ్ఞానాన్ని పొందినట్లు కాదు. ఈ కృత్రిమ మేధ కాలంలో కూడా రాజకీయ, తాత్త్విక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని జనాలు విశ్వాసాలు, మతాచారాలు, ప్రచారం ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఇది విపరీత అజ్ఞాన శకం. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఆగ్నటాలజీ ప్రయోగాలకు సాధనాలుగా మారుతున్నాయి. ప్రజలను మాయలో ముంచెత్తుతున్నాయి. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశయం ఎక్కడ? అజ్ఞానంపై శాస్త్ర పరిశోధనలు సాగిస్తున్న నేటి పరిస్థితులెక్కడ? -
సమయోచిత జ్ఞానమే.. వివేచన!
వివేచన అంటే సమయోచిత జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ, లోచూపు, శోధన, దార్శనికత, విశ్లేషణా సామర్థ్యం. ఇతరులకు తోచని, అవగాహనకు రాని సూక్ష్మాంశాలను గ్రహించగల ఓ శక్తి. ఈ వివేచన కొందరిలో మాత్రమే ఉండే ఓ అపురూపమైన శక్తి.అసలు వివేచన ఎలా ఒనగురుతుంది... అని ప్రశ్నించుకుంటే... ప్రధానంగా చదువు వల్ల పొందే జ్ఞాన, పరిజ్ఞానాల వల్ల అని చె΄్పాలి. ఈ భావాన్నే ΄ోతన‘‘జదివిన సదసద్వివేక చతురత గలుగు జదువగ వలయును జనులకు.. ’’అని హిరణ్యకశిపుని చేత పలికిస్తాడు. చదువు వల్ల జ్ఞానంతోపాటు ఔచిత్యాననౌచిత్యాలు, మంచి చెడు విచక్షణలు తెలుస్తాయి. అవి మన పలుకులో, ప్రవర్తనలో, ఆలోచనాసరళిలో అభిలషణీయమైన చక్కని మార్పు తెస్తాయి. ఈ వివేచన మన వైయుక్తిక జీవిత సుఖ సంతోషాలకు, ఆరోగ్యకరమైన సామాజిక వికాసానికి పునాదులు వేస్తుంది.విద్యనభ్యసించటం వలన వివేచన అనే శక్తిని పొందటం జరుగుతుంది. కాని ఇది ఎల్లప్పుడూ నిజం కావలసిన అవసరం లేదని లోకానుభావం, పరిశీలన చెపుతాయి. కొందరు విద్యావంతులలో కనిపించని ఈ వివేచన కొన్ని సందర్భాలలో అక్షర జ్ఞానంలేని వారెందరి లోనో కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది వాస్తవం. వారి సంభాషణల్లో, సమస్యలను పరిష్కరించే వేళల్లో సమయోచిత జ్ఞానాన్ని చూపుతూ, విచక్షణను ప్రదర్శిస్తూ వివేచనాపరులుగా పేరు తెచ్చుకున్న వారున్నారు."పంచతంత్రంలోని పావురాలు – వేటగాడి కథ వివేచనా పార్శ్వమైన ముందుచూపుని సూచిస్తుంది. ఆకాశమార్గం లో పయనించే పావురాలు భూమిపై ఒకచోట చల్లిన నూకలను చూచి, కిందకు దిగి తిందామనుకున్నప్పుడు వారిని వారించిన చిత్రగ్రీవునిలో ఉన్నది ముందుచూపే. అప్రమత్తతే. ఇవి వివేచనలోని కోణాలే . చిత్రగ్రీవుని మాటను పెడచెవిని పెట్టి ్రపాణాల మీదకు తెచ్చుకున్న మిగిలిన పావురాలలో ఉన్నది తొందరపాటుతనం, విచక్షణారాహిత్యం. జ్ఞానాన్ని సందర్భానుసారంగా ఉపయోగించగలగాలని ఈ ఉదంతం మనకు చెపుతుంది. అలాగే మూడు చేపలకథలోని దీర్ఘదర్శి అన్న చేప తన్రపాణాలను కాపాడుకున్నది ఈ ముందుచూపు వల్లే కదూ!"ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవనక్రమంలో వచ్చే ఆటు΄ోట్లను తట్టుకుని, నిబ్బరంగా ఉంటూ, మనసును దిటవు చేసుకోవటంవల్ల వారికి ఇది సాధ్యమవుతుంది. అలాగే చేదు అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు పొందిన ఇంగితజ్ఞానంతో జీవితాన్ని మరింత లోతుగా పరిశీలిస్తూ, విశ్లేషించుకునే వీరికి ఈ వివేచనాశక్తి కరతలామలకమవుతుంది.కౌరవులు పాండవులను పెట్టే ఇబ్బందులను, చేసే దుశ్చర్యలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తులను చేసి, రక్షించినవాడు శ్రీ కృష్ణుడు. అలా వివేచనకు గొప్ప ఉదాహరణగా నిలిచాడు. వివేచనాశీలి ఎదుటవారి మాటలను, వాటి అంతరార్థాన్ని గ్రహించగలడు. వారి మనసులో మెదిలే ఆలోచనలను పసిగట్టగలరు. వాటిని విశ్లేషించగలరు. ఇవన్నీ వివేచనకున్న కోణాలే.బెర్ట్రాండ్ రసెల్.. జ్ఞానం –వివేకం.. అన్న వ్యాసంలో ఈ రెండిటి మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాన్ని ఒక ఉదాహరణతో ఎంతో స్పష్టంగా వివరించాడు. రివాల్వర్ ఎలా ఉపయోగించాలో తెలియటం జ్ఞానం. దాన్ని ఎప్పుడు వాడాలి, అసలు వాడాలా, వద్దా అన్న సందర్భానౌచిత్య నిర్ణయశక్తే వివేచన. మనలో చాలామందికి విషయం పరిజ్ఞానం ఉంటుంది. కాని ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ కూడదోనన్న వివేకం ఉండదు. మన ప్రతిభా నైపుణ్యాలను అసందర్భంగా ప్రదర్శించి, అవమానం పొందకూడదు. ఉచితానుచితాలు తెలుసుకుని ప్రవర్తించటం కూడా వివేచనే. సాంకేతికాభివృద్ధి... ముఖ్యంగా అంతర్జాల సాంకేతికత విశ్వాన్ని కుగ్రామం చేసింది. ఆ సాంకేతికతను అంది పుచ్చుకోవాలి. వాటి ఫలితాలు అనుభవించాలి. ఇందంతా జ్ఞానపరమైనది. అభినందనీయం. కాని సక్రమమార్గంలో ఉపయోగించుకోవటంలోనే మన వివేచన ఉంటుంది. – లలితా వాసంతి -
విదేశాల్లో ‘మినీ ఇండియా’లు?
భారత్‌కు వెలుపల అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాలు ఏవో మీకు తెలుసా? మారిషస్, యూకే, యూఏఈ, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కొన్ని దేశాల్లో ‘మినీ ఇండియా’లు కూడా ఉన్నాయి. ఇక్కడ భారతీయుల ఇళ్లను సులభంగా గుర్తించవచ్చు. అవి ఏఏ దేశాలో ఇప్పుడు తెలుసుకుందాం. మారిషస్ మారిషస్‌లో 70శాతం జనాభా భారతీయులని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సాంస్కృతికరంగ స్వర్గధామం. ఇక్కడ భారతీయ ఆహార ఖజానా విరివిగా కనిపిస్తుంది. ఇది విదేశాల్లో స్థిరపడాలనుకున్న భారతీయుల ఉత్తమ ఎంపిక అని అంటారు. యూకే భారతదేశం- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. యూకేలో కనిపించే భారతీయ రెస్టారెంట్లు, దుకాణాలు దీనికి తార్కాణంగా నిలుస్తాయి. యూకేలో భారత సంస్కృతి కనిపిస్తుంది. యూకేలోని కొన్ని ప్రాంతాలు.. మనం భారత్‌లోనే ఉన్నామా అని అనిపించేలా ఉంటాయి. యూకేలోనూ భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్‌లో ఎక్కడికి వెళ్లినా భారతీయులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్నట్టేనని చాలామంది అంటుంటారు. యూఏఈ మొత్తం జనాభాలో భారతీయులు 42 శాతం ఉన్నారు. సౌదీ అరేబియా సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 10 శాతం నుంచి 13 శాతం వరకూ భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది. కెనడా మెరుగైన ఉద్యోగావకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తదితర అదనపు ప్రయోజనాలు భారతీయులను కెనడావైపు మళ్లేలా చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం కెనడాలో గణనీయ సంఖ్యలో భారతీయులున్నారు. ఒమన్ ఒమన్ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 20 శాతం ఉన్నారు. 2023 నాటికి ఒమన్‌లో దాదాపు తొమ్మది లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఒమన్‌లోని భారతీయులు అక్కడి సాంస్కృతిక వైభవానికి తోడ్పాటునందిస్తున్నారు. సింగపూర్ 2023లో సింగపూర్‌లో భారతీయుల జనాభా ఏడు లక్షలు. సింగపూర్ ప్రభుత్వం ‘లిటిల్ ఇండియా’ ప్రాంత అభివృద్ధికి చేయూతనందిస్తోంది. సింగపూర్ సాంస్కృతిక వైభవానికి అక్కడి భారతీయులు తోడ్పాటునందిస్తున్నారు. అమెరికా అమెరికాలో అత్యధిక సంఖ్యలో భారతీయులున్నారు. ప్రపంచంలో తమది రెండవ అతిపెద్ద భారతీయ ప్రవాసులు కలిగిన దేశమని యునైటెడ్ స్టేట్స్ పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కెరీర్‌ను మెరుగుపరుచుకోవడంలో పాటు పలు వ్యాపారాలు చేపడుతున్నారు. -
ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి?
మనుషులే కాదు ఎన్నో జంతువులను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈగలు, కుక్కలు, ఎలుకలు, చేపలు, కోతులు, చింపాంజీలను వివిధ ప్రయోజనాల కోసం అంతరిక్షంలోకి పంపారు. జంతువులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ 21వ శతాబ్దంలోనూ కొనసాగింది. దీని సాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్ష రంగంలో నూతన విజయాలు సాధించినప్పుడల్లా మనం శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకుంటాం. అయితే పలు జంతువులు కూడా ఈ విజయంలో భాగస్వామయ్యమయ్యాయనే సంగతిని మరచిపోతుంటాం. మనుషులు అంతరిక్షంలోకి వెళ్లకముందు పలు జంతువులను అక్కడికి పంపించారు. ఆ తర్వాతే మనుషులను అక్కడికి సురక్షితంగా పంపించవచ్చని శాస్త్రవేత్తలు గ్రహించారు. ఏఏ జంతువులు అంతరిక్షంలోకి పంపారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు ఈగలు, వీటిని 1947లో అమెరికా శాస్త్రవేత్తలు పంపారు. నాడు శాస్త్రవేత్తలు.. వ్యోమగాములపై ఖగోళ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు. V-2 బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి, 109 కిలోమీటర్ల ఎత్తుకు ఈగలను అంతరిక్షంలోకి పంపారు. పారాచూట్ ద్వారా వాటిని న్యూ మెక్సికోలో దింపారు. క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఈగలు సజీవంగా కనిపించాయి. అంతరిక్షంలోకి పంపబడిన జంతువులలో కోతుల జాతులు ఉన్నాయి. వీటిలో రీసస్ మకాక్స్, పిగ్-టెయిల్డ్ కోతులు, స్క్విరెల్-టెయిల్డ్ కోతులు, చింపాంజీలు కూడా ఉన్నాయి. ఆల్బర్ట్- II అనే పేరుగల రీసస్ మకాక్ 1949లో 134 కిలోమీటర్ల వరకూ చేరుకుంది. అయితే అది తిరిగి వస్తుండగా మృతి చెందింది. దీని తరువాత 1961 లో కోతి జాతికి చెందిన హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపింది, అది సురక్షితంగా తిరిగి వచ్చింది. మానవ ఆరోగ్యం, ఔషధాల తయారీ మొదలైన పరిశోధనలలో ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎలుకలను అంతరిక్షంలోకి పంపారు. ఎలుకల అంతరిక్ష అనుభవాల గురించి నాసా ఒక వివరణాత్మక అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. 1950లో 137 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. అయితే అది పారాచూట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందింది. సోవియట్ యూనియన్ గరిష్ట సంఖ్యలో కుక్కలను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1957లో లైకా అనే శునకం. అయితే అది భూమికి తిరిగి రాలేకపోయింది. ఇది అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి ముందు కూడా కొన్ని కుక్కలను అంతరిక్షంలోకి పంపారు. ఆశ్చర్యంగా అనిపించినా అంతరిక్షంలోకి తాబేలును కూడా పంపిన మాట మాత్రం నిజం. 1968లో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య చంద్రుడిపైకి వెళ్లేందుకు పోటీ నెలకొన్న నేపధ్యంలో రష్యా రెండు తాబేళ్లను జోండ్ 5 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపింది. అవి చంద్రుని చుట్టూ ఆరు రోజులు తిరిగిన తర్వాత భూమికి తిరిగి వచ్చాయి. అయితే అవి ప్రణాళిక ప్రకారం కజకిస్తాన్‌లో ల్యాండ్ కాకుండా హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. అయితే వాటిని రక్షించారు. నాసా ఈ జంతువులనే కాకుండా, కప్పలు, సాలెపురుగులు (1973), చేపలు (1973), టార్డిగ్రేడ్ (2007), పిల్లి (1963) ని అంతరిక్షంలోకి పంపింది. 2012లో జపాన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపలను పంపింది. ఇంతేకాకుండా అనేక మొక్కలపై, ముఖ్యంగా ఆహారం తయారీపై అంతరిక్షంలో పలు ప్రయోగాలు జరిగాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల పెరుగుదలపై కూడా అనేక ప్రయోగాలు జరిగాయి. ఇది కూడా చదవండి: పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
విషయ పరిజ్ఞానమే కొలమానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), నేషనల్ అచీవ్మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ (ఎన్ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్ఏస్, 2022లో ఎఫ్ఎల్ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్‌లో వివిధ రాష్ట్రాల అసెస్మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్మెంట్లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో అసెస్మెంట్ సెల్ ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎఫ్ఎల్ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది. పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. -
నాలెడ్జ్ క్యాపిటల్‌గా తిరుపతి
తిరుపతి సిటీ : తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్‌గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్‌గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి, అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న, తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్‌నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్‌లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
Natural Skills: సహజ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి
ఈ మధ్యన ఒకటి–రెండు సందర్భాలలో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒకరిద్దరు చురుకైన విద్యార్థులను కలవడం సంభవించింది. వాళ్లతో మాటా–మాటా కలిపి, వారి–వారి ప్రొఫెషనల్ విద్యాభ్యాసంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నారూ, అధ్యాపకులు ఏం నేర్పిస్తున్నారనీ ప్రశ్నిస్తే, వారిదగ్గర నుండి ఆశించిన సమాధానం రాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత ఏరకమైన మెషిన్లమీద పనిచేస్తావని ప్రశ్నిస్తే తెలియదని అమాయకంగా వచ్చింది జవాబు. కంప్యూటర్ ఇంజనీరింగ్ తరువాత సరాసరి ఏదైనా ప్రోగ్రామింగ్ చేయగలరా అంటే దానికీ జవాబు లేదు. సివిల్ ఇంజనీరింగ్ తరువాత ఎలాంటి ప్రాజెక్టులలో పనిచేయాలని అనుకుంటున్నావని అడిగితే అసలే అర్థం కాలేదు. అందరూ విద్యార్థులూ ఇలాగేనా అంటే కావచ్చు, కాకపోవచ్చు. స్వతహాగా తెలివైన కొందరి విషయంలో మినహాయింపు ఉండవచ్చు. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇటీవల కాలంలో ‘నాలెడ్జ్ బేస్డ్’ (అంతంత మాత్రమే) తప్ప ‘స్కిల్ బేస్డ్’ కాకపోవడమే బహుశా దీనికి కారణం కావచ్చు. ఇదిలా ఉంటే ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా రకరకాల వృత్తి నిపుణులు మన దేశంలో, రాష్ట్రంలో కోకొల్లలు. వారంతా స్వయంశక్తితో వారి వారి వృత్తుల్లో ఎలా ప్రావీణ్యం సంపాందించుకున్నారో అనేది కోటి రూకల ప్రశ్న. వారిలో గ్రామీణ వృత్తులు మొదలుకుని, పట్టణాలలో, నగరాలలో పనిచేస్తున్న వాహనాలు, ఎయిర్ కండీషన్లు వంటి వాటిని బాగుచేసే మెకానిక్కులు చాలామందే ఉన్నారు. వీరు రిపేర్లు చేయడానికి వచ్చేటప్పుడు తమ వెంట ఒక జూనియర్ కుర్రవాడిని తీసుకు వస్తారు. అతడు కొంతకాలానికి సీనియర్ అయిపోతాడు. అందుకే ఇటువంటివారు నేర్చుకున్న విద్య భావితరాలవారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధానం ప్రవేశపెట్టాలి. వీరికి సంబంధిత విద్యార్హతలు లేకపోయినా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ చెప్పేటప్పుడు ఉపయోగించుకునే విధానం రూపొందిస్తే మంచిదేమో! యాభై, అరవై ఏళ్ల అనుభవంతో చేస్తున్న సూచన ఇది. చేతి గడియారం పనిచేయకపోతే, కంపెనీ షోరూమ్‌కు పోయి ఇస్తే బాగుచేసి ఇవ్వడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే, ఆలవాటున్న ఒక రిపేర్ షాప్‌కు పోయాను ఇటీవల. ఆ చిన్న షాప్‌లో ఎప్పటిలాగే ఇద్దరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ కూర్చున్నారు. ఆ ఇద్దరిలో సీనియర్ వ్యక్తి (బహుశా) బ్యాటరీ కొత్తది వేయాలని చెప్పి రూ. 220 అవుతుందన్నాడు. నేను సరే అనగానే ఐదు నిమిషాలలో ఆ పని కానిచ్చి నా చేతిలో పెట్టాడు. గత ఏభై ఏళ్లుగా... తన తండ్రి కాలం నుంచి అక్కడే రిపేర్లు చేస్తున్నామనీ, గడియారాలు రిపేరు చేసే విద్య ఎప్పటినుంచో తనకు వచ్చనీ, ఎలా అబ్బిందో తెలియదనీ, ఎక్కడా నేర్చుకున్నది కాదనీ అన్నాడు. ఇటీవల మనం వాడుకునే వస్తువులు చెడిపోయినప్పుడు ఎక్కువగా కంపెనీల సర్వీసింగ్ మెకానిక్‌లను పిలవకుండా స్వంతంగా నేర్చుకున్న పనితనంతో తక్కువ ధరకు సర్వీసు చేసి పోతున్న లోకల్ టాలెంట్లనే వినియోగదారులు ఆశ్రయించడం వీరికి ఉన్న విశ్వసనీయతను తెలియ జేస్తోంది. ఇటువంటి నేచురల్ టాలెంట్ ఉన్న వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. మా చిన్నతనంలో ఖమ్మం పట్టణంలో మేమున్న మామిళ్ళ గూడెం బజారులో (లంబాడి) రాము అని ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేస్తున్న వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు కోలేదు. కాని అద్భుతమైన రీతిలో మెకానిజం తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో ఖమ్మంలో కార్లు, జీపులు బహుశా చాలా తక్కువ. వాటికి కానీ, లారీలకు కానీ ఏ విధమైన రిపేర్ కావాలన్నా రామునే దిక్కు. రాముకు సహజ సిద్ధంగా అబ్బిన విద్య అది. అప్పట్లో హైదరాబాద్‌లో మా బంధువు లబ్బాయి ఒకడిది అద్భుతమైన మెకానికల్ బ్రెయిన్. ఇంకా కంప్యూటర్లు ప్రాముఖ్యం చెందని రోజుల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో నైపుణ్యం సంపాదించాడు. ఎట్లా నేర్చుకున్నాడో, ఎవరికీ తెలియదు. ఇంటర్మీడియేట్ చదవడానికి ప్రయత్నం చేశాడు. కుదరలేదు. స్నేహితుల సహాయంతో అమెరికా చేరుకున్నాడు. చిన్నగా హార్డ్‌వేర్ మెకానిజంలో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కంపెనీలు అప్పట్లో అతడి మీద ఆధారపడేవి. అంచెలంచెలుగా ఎదిగి ఫార్మల్ డిగ్రీలు లేకపోయినా నైపుణ్యం ప్రాతిపదికగా అక్కడ స్థిరపడిపోయాడు. అతడా విద్య ఎలా నేర్చుకున్నాడు? చాలా కాలం క్రితం ఆంధ్రాబ్యాంక్‌లో కొఠారి చలపతి రావు అనే ఆయన పనిచేసేవారు. అక్కడ చేరడానికి ముందర కొన్ని చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశాడు. ఇంకా అప్పటికి కంప్యూటర్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. కేవలం మామూలు గ్రాడ్యుయేట్ మాత్రమే అయిన కొఠారి చలపతిరావు స్వయంగా నేర్చుకుని ఆంధ్రా బ్యాంక్ కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేశాడు. ఆయన్ని అంతా కంప్యూటర్ భీష్మ పితామహుడు అని పిల్చేవారు. ఆయన ఆ విద్య ఎలా నేర్చుకున్నాడు? వీరిలాంటి అనేకమంది సహజ నైపుణ్యం ఉన్నవారిని ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలలో క్వాలిఫికేషన్ లేకపోయినా అయినా ఉపయోగించుకోవాలి. అప్పుడే సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు మంచి నైపుణ్యం అందుబాటులోకి వస్తుంది. (క్లిక్ చేయండి: గట్టివాళ్లే చట్టానికి గౌరవం) - వనం జ్వాలా నరసింహారావు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వం -
ఇంగితమూ జ్ఞానమే!
విద్యాభ్యాసం, విస్తృత పుస్తక పఠనాల వల్ల పొందే జ్ఞానం ఒకటైతే, మనిషిలో ఉండే సహజమైన గ్రహింపు శక్తి, అవగాహన శక్తి వలన వచ్చే జ్ఞానం మరొకటి. దీనికే ఇంగితం లేదా ఇంగితజ్ఞానం అని పేరు. చదువుకున్న వారిలోనే ఇది ఉండనక్కరలేదు. ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక అంతర్లీనమైన ఒక జీవలక్షణం. జీవితంలో మనకు కలిగే అనేక అనుభవాలతో ఈ ఇంగితం మరింతగా పదునెక్కుతుంది. అందుకే ఇది ఎంతో విశిష్టమైంది. చదువుతో నిమిత్తంలేకుండా ప్రతి మనిషి జీవనానికి, జీవితానికి అత్యంత ఆవశ్యకమైనది. ఈ ఇంగితం మనలను అప్రమత్తులను చేసి వ్యవహార దక్షతను పొంచి జీవితం సజావుగా సాగేటట్టు చేస్తుంది. విద్యాధికులలో ఉండే జ్ఞానమనే బంగరు పళ్లెరానికి ఇది ఒక గోడ చేర్పు లాంటిది. అనేక శాస్త్రాలను మధించి దాని జ్ఞానామృతాన్ని గ్రోలిన పండితులైనా, తమ జీవితాన్ని నూతన ఆవిష్కరణల కోసమై ధారపోసే శాస్త్రవేత్తలైనా తమ ఇంగితం ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. అలా కానివేళ, వారి జ్ఞానం వారికే కాక మానవాళికే ముప్పు తెస్తుంది. చరిత్ర పుటలు తిరగవేసినా, మన సమకాలీన చరిత్రను పరిశీలించినా ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఒక గురువు తనవద్ద శ్రద్ధతో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్న నలుగురు శిష్యులకు చనిపోయిన వారిని బతికించగల అద్భుత శక్తినిచ్చాడు. అయితే, దానిని అత్యవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించ మని హెచ్చరించి పంపాడు. వారిలో ముగ్గురు మార్గమధ్యంలో ఒక పులి కళేబరాన్ని చూసి వారి అద్భుత శక్తిని ప్రయోగించాలని ఉవ్విళ్ళూరటం, నాలుగవవాడు వారి మూర్ఖత్వానికి వగచి, హితవు పలికి భంగపడి వీరికి దూరంగా వెళ్లి తన ప్రాణాలు దక్కించుకున్న కథ మనకు తెలుసు. ప్రాణాలు కోల్పోయిన ఆ నలుగురు జ్ఞానసంపన్నులే. కాని వారిలో కొరవడిన ఇంగితం ప్రాణం నిలబెట్టుకున్న వాడిలో మెండుగా ఉంది. అలాగే పరస్త్రీని తాకకూడదన్న ధర్మాన్ని మనసులో స్థిరరచుకున్న ఒక శిష్యుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక స్త్రీని రక్షించడానికి ముందుకు రాలేదు. అక్కడ ఆపదలో ఉన్నది ఒక జీవి మాత్రమేనని భావించిన రెండోవాడు ఆమెను కాపాడటానికి కారణం ఇంగితమే. ఇంగితమంటే వివేకమే. ఒకరకమైన యుక్తాయుక్త విచక్షణ. సందర్భోచిత జ్ఞానం. మన చదువుల సారానికి, జీవితానుభవాన్ని విచక్షణాశక్తిని కలిపి చూడగలగటమే ఇంగితం. మన ప్రవర్తనలో, వ్యవహార శైలిలో దానిని చూపగలిగేవారి జీవితం అపార్థాలు, తగాదాలు లేకుండా సాగుతుంది. వందలాది పక్షులకు ఆశ్రయమిచ్చే ఓపెద్ద చెట్టుకింద కూర్చుని ధ్యానముద్రలో ఉన్నాడో పండితుడు. అపుడో పక్షి విడచిన విసర్జనం అతని తల మీద పడింది. విపరీతమైన కోపమొచ్చిన ఆయన దాని వంక తీక్షణంగా చూసాడు. అంతే! ఆ పక్షి కాలి బూడిదై పోయింది. ఆయనకు సంతోషమూ, గర్వమూ కలిగాయి. అన్ని పక్షులున్న చెట్టు కింద కూర్చుంటే ఆ అనుభవం ఎదురవ్వటం నీరు పల్లానికి వెళుతుందన్న నంత సహజం. ఇంత చిన్న విషయం ఆయనకు తట్టకపోవటానికి కారణం తన ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించ లేకపోవటమే. ఇక్కడ ఇంగితమంటే వివేకమని అర్థం. చాల సహజమైన ఈ ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించకపోతే పండితులు, జ్ఞానసంపన్నులు వారి శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని, సాధన ద్వారా పొందిన జ్ఞానాన్ని ఎలా మట్టిపాలు చేసుకుంటారో చెపుతుందీ ఉదాహరణ. నిస్సందేహంగా జ్ఞానమే ఆధిక్యమైనది, గొప్పది, విలువైనది. ఈ జ్ఞానాన్ని ప్రదర్శించేటప్పుడు ఒక నియంత్రణాశక్తిగా ఈ ఇంగితం పనిచేయాలి. రివాల్వరు ఉపయోగించగలగటం జ్ఞానం. అయితే, దానిని ఆ సందర్భంలో వాడవలసిన అవసరం ఉందా లేదా అనే సంగతిని మనకు బోధపరచే గొప్ప వజ్జ ఈ ఇంగితం. ఇంగితమంటే తార్కికత, విచక్షణ, భావోద్వేగాలపై ఒక పట్టు. ఇంగితమంటే మన శక్తియుక్తుల్ని అవసరమైన చోట, తప్పనిసరైన క్షణాన మాత్రమే ఉపయోగించేటట్టు మనల్ని సమాయత్తం చేసే ఒక నిబద్ధత, ఒక అదుపు. అలా కానివేళలలో అది పిచుక మీద బ్రహ్మాస్త్రమే అవుతుంది. ఒక పండితుడు గణితంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. విశేషమైన ప్రజ్ఞతో గణితానికి చెందిన ఏ లెక్కనైనా, సమస్యనైనా పరిష్కరించసాగాడు. తన గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ అంతటి మేధావి లేడని ఖ్యాతి పొందాడు. పేరు, డబ్బు వచ్చింది. ప్రజలు, ఇంత గణితశాస్త్ర పండితులు ఆయన ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యానుభూతికి లోనై ఆయనకు నీరాజ నాలిచ్చి సత్కారాలు, సన్మానాలు చేసారు. గణితంలో తనకన్నా ప్రజ్ఞావంతుడు లేడనే అహంకారం ప్రవేశించింది అతనిలో. గర్వం తారస్థాయికి చేరుకొని ‘నాతో పోటీపడగలవారెవరైనా ఉన్నారా మీ గ్రామంలో?’ అని సవాలు విసరి, తలపడినవారిని ఓడించి, దూషించి అవమానించసాగాడు. ఒకసారి ఒక సాయంసంధ్య వేళలో ఒక గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయాన ఒక పశువుల కాపరి కలిసాడు. ఆ చదువురానివాడితోనూ తన గొప్పతనాన్ని గురించి అతిగా చెపుతూ వెళుతున్నాడు. ఒకచోట ఆ కాపరి తటాలున కిందకు వంగి ఒక గుప్పెడు ఇసుకను తీసుకుని ‘అయ్యా, కొంచెం ఇదెంతో లెక్కించి చెప్పగలరా?’ అని ఆ గణితశాస్త్ర పండితుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకాపండితుడి నోటివెంట ఒక క్షణం మాట రాలేదు. ఆలోచన స్తంభించి పోయింది. చివరకు ఆ ఇసుకను లెక్కించలేమన్నాడు. దానికా పశువులు కాపరి ‘సామీ! దీనిని గుప్పెడని కదా అంటారు. ఐదు వేళ్ళు దగ్గరకు చేర్చి తీసుకుంటే చారెడు, రెండు అరచేతులతో తీసుకుంటే దోసెడు, బొటనవేలికి, చూపుడువేలికి మధ్య తీసుకుంటే చిటికెడని కదా అంటారు’ అన్నాడు. అంతే ఆ పండితుడికి తన తప్పు తెలిసింది. మామూలు పద్ధతిలోనే ఆ ఇసుకను లెక్కించే యత్నం చేయటం వల్ల సమాధానం చెప్పలేకపోయానని. సహజసిద్ధమైన ఇంగితజ్ఞానాన్ని తను చూపలేకపోయానని అర్థం చేసుకుని తన అహంకారానికి సిగ్గుపడి అతడికి నమస్కరించి ఇంటిముఖం పట్టాడు. నిజానికి ఆ నిరక్షరాస్యుడు పండితుడికి ఏ విషయంలో పోటీనే కాదు. కాని అతడు పండితుణ్ణి ప్రశ్నించటానికి కారణం అతడి ఇంగితమే. దీనినే మరో కోణం నుండి చూస్తే ఆ పండితుడి గర్వానికి, అనుచిత ప్రవర్తనకు ఆ పశువుల కాపరి ప్రశ్న నిరోధకం. అంతేకాదు. సహజ సిద్ధమైన ఇంగితానికి.. జీవితపరిశీలన, అన్వయం, సందర్భాచిత ఆకళింపు జత కూడితే అది విశేషమైన ప్రజ్ఞ. ఏ పుస్తకాలలో చెప్పని ఏ గురువు నేర్పని విద్య ఇది. ఇంగితమనే పుస్తకంలో జీవితానుభావాలే పుటలు, అధ్యాపకులు. మనలో సహజంగా ఉండే ఏ అద్భుత శక్తి, మన జీవిత మార్గదర్శి. విద్య వల్ల మరింతగా పదునెక్కాలి. అపుడే మరింతగా ప్రకాశిస్తుంది. ఇంగితమంటే లోకజ్ఞానం. ఇది మన నిత్య వ్యవహారాల నిర్వహణలో సహాయపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్య సందర్భాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఇంగితం మనకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటుంది. ఇంగితం మన ‘వివేచనా నేత్రం’ ఇన్ని ఉదాహరణలవల్ల మనం గ్రహించవలసింది ఏమిటి? ఇంగితమంటే ఒకసహజమైన తెలివిడి, లోతైన పరిశీలన, బుద్ధికి, మనస్సుకి గోచరమయ్యే ఒక అద్భుత అవగాహన. చదువుకున్న వారిలో ఉండేవి, ఉండవలసిన లక్షణాలు ఇవే కదూ! శాస్త్రపరమైన జ్ఞానం అక్షరాస్యులదైతే, నిరక్షరాస్యులది పరిశీలనా గతమైనది. ఇంగితం జ్ఞానమే. అది సహజాతమైనది అన్నారు పెద్దలు. –బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
ఐదేళ్లలో 100% పరిజ్ఞానం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థి చదివే, రాసే సామర్థ్యాన్ని ఇకపై వారానికోసారి అంచనా వేయ బోతున్నారు. అభ్యసన సామర్థ్యాలపై ప్రతి నెలా రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేపట్టబోతున్నారు. ముఖ్యంగా భాష, గణితంపై దృష్టి పెట్టనున్నారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో 3, 5 తరగతుల విద్యార్థుల్లో 100% తెలివి తేటలు (పరిజ్ఞానం) పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. అలాగే 8వ తరగతి విద్యార్థుల్లో ప్రస్తుత సామర్థ్యాని 85 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘తొలిమె ట్టు’ కార్యక్రమానికి ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. 1–5 తరగ తుల విద్యార్థుల కోసం తొలిమెట్టు అమలు చేయబోతు న్నారు. దీంతో పాటే 6–10 తరగతుల విద్యార్థుల అభ్యసన నష్టాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ‘న్యాస్’ రిపోర్టుతో మేల్కొలుపు అన్ని రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) ప్రతి రెండేళ్ళకోసారి సర్వే నిర్వహిస్తుంది. సర్వేలో భాగంగా విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయడం ద్వారా వారి స్థాయిని అంచనా వేస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు వెల్లడించింది. కరోనా కారణంగా రెండేళ్ళలో విద్యా ప్రమాణాలు అనూహ్యంగా తగ్గాయని తాజా నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కార్యాచరణకు దిగింది. పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు నిర్వహించింది. దీనికి కొనసాగింపుగా 1–5 తరగతులకు తొలిమెట్టు, 6–10 తరగతుల్లో అభ్యసన నష్టాల భర్తీకి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారం వారం అంచనా... విద్యార్థులకు వారంలో ఐదు రోజుల పాటు రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. అదనంగా ఓ గంట తొలిమెట్టు కింద ప్రత్యేక క్లాసు తీసుకుంటారు. విద్యార్థి వెనుకబడిన సబ్జెక్టు, పాఠాన్ని అర్థమయ్యేలా మళ్ళీ బోధిస్తారు. వారికి అర్థమైందా లేదా అనే దానిపై పాఠశాల స్థాయిలో చిన్న పరీక్ష నిర్వహిస్తారు. ఇది రాత పూర్వకంగా లేదా మౌఖికంగానైనా ఉండొచ్చు. ఒక పాఠం కనీసం 80 శాతం మందికి అర్థమవ్వాలని తొలిమెట్టు ప్రణాళికలో పేర్కొన్నారు. ఉన్నత తరగతుల విద్యార్థులకూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు. -
ఉక్రెయిన్‌కు అంత సత్తా ఎక్కడిది?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేనని అందరూ అనుకున్నారు. ఏదో నాలుగైదు రోజుల్లో ఉక్రెయిన్‌ని రష్యా స్వాధీనం చేసుకుంటుందని అంచనాలు కట్టారు. కానీ అందరి లెక్కలు తప్పాయి. రెండు వారాలైనా ఉక్రెయిన్ దండు రష్యా దండయాత్రని సమర్థంగా అడ్డుకుంటోంది. నాటో తన బలగాలు దింపకపోయినా, నో–ఫ్లై జోన్‌ని ప్రకటించడానికి నిరాకరించినా ఉక్రెయిన్ పోరాటాన్ని ఆపలేదు. చావో రేవోకి సిద్ధమై యుద్ధం చేస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్ ఈ స్థాయి పోరాటపటిమను ఎలా చూపిస్తోంది? ఉక్రెయిన్‌కి కలిసొచ్చే అంశాలేమిటి? రష్యా చేసిన తప్పిదాలేంటి? సన్నద్ధత పశ్చిమ దేశాల సహకారంతో ఉక్రెయిన్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంది. రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న దగ్గర్నుంచి ఉక్రెయిన్ ఆత్మ రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి నాటో సైనికులతో శిక్షణనిచ్చింది. ‘ఏ క్షణంలో రష్యా దాడికి దిగినా ఎదుర్కోవడానికి 8ఏళ్లుగా ఉక్రెయిన్ ప్రణాళికలు రచిస్తోంది. ఆయుధాల పెంపు, బలగాలకు శిక్షణ, వ్యూహరచన వంటి అంశాల్లో బలంగా నిలిచింది’అని జార్జ్‌టౌన్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డౌగ్లస్ చెప్పారు. స్థానబలం స్థానబలానికి మించిన బలం ఏదీ లేదంటారు. సరిగ్గా ఇక్కడే రష్యా ఉక్రెయిన్‌ని తక్కువ అంచనా వేసింది. సోవియెట్ యూనియన్‌గా ఉన్న రోజుల్లో ఉక్రెయిన్ భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేసుకుందే తప్ప, ఇన్నేళ్లలో ఆ ప్రాంతం ఎంత మారిపోయిందో, స్థానికంగా ఉక్రెయిన్ బలగాల ప్రాబల్యం ఎలా పెరిగిందో తెలుసుకోలేకపోయింది. ప్రజలే ఆయుధాలు చేతపట్టి తిరుగుబాటు చేస్తారని గ్రహించుకోలేక ఇప్పుడు కదన రంగంలో గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారిపోవడంతో ఉక్రెయిన్ బలగాలు ఎటు నుంచి వచ్చి మీద పడతాయో తెలుసుకోలేక రాజధాని కీవ్‌ను పదిహేను రోజులైనా స్వాధీనం చేసుకోలేకపోతోంది. ‘ఉక్రెయిన్‌లో మార్పుల్ని అంచనా వేయడంలో రష్యా విఫలమైంది. వీధి వీధిలోనూ, ప్రతీ భవంతిలోనూ అన్నిచోట్లా రష్యా బలగాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి’అని కాలేజీ ఆఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ ప్రొఫెసర్ స్పెన్సర్ మెరెదిత్ చెప్పారు. సంఘీభావం పౌర నివాసాలు, పాఠశాలలు, ఆస్పత్రుల్ని లక్ష్యం గా చేసుకొని రష్యా బలగాలు దాడి చేస్తూ ఉండడంతో ఉక్రెయిన్ ప్రజలతో ప్రపంచదేశాల్లో రష్యా పై ఒక కసి పెరిగింది. ప్రాణాల మీదకొస్తున్నా అధ్యక్షుడు జెలెన్స్కీ లెక్కచేయకుండా కీవ్‌లో ఉంటూ అందరిలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించారు. దీంతో ప్రజలంతా స్వచ్ఛందంగా ఆయుధాలు చేతపూని ఎదురుదాడికి దిగారు. రష్యా భీకరమైన దాడులకు ఎదురుదాడికి దిగడం తప్ప ఉక్రెయిన్‌కు మరో మార్గం లేదని రిటైర్డ్ ఫ్రెంచ్ కల్పనర్ మైఖేల్ గోయా అభిప్రాయపడ్డారు. ఆయుధాలే ఆయుధాలు రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత నాటో బలగాలు నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ఆయుధాలను లెక్కకు మించి సరఫరా చేస్తున్నాయి. నాటోలో సభ్యత్వం లేకపోయినప్పటికీ స్వీడన్, ఫిన్లాండ్ సహా 20కిపైగా దేశాలు వేల సంఖ్యలో యుద్ధట్యాంక్ విధ్వంసక ఆయుధాలను పంపించాయి. దాడి మొదలయ్యాక రోజుకో కొత్త రకం ఆయుధాలు ఉక్రెయిన్‌కు అందుతున్నాయి. 2,000కు పైగా స్ట్రింగర్ మిస్పైల్ (మ్యానన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్), 17 వేలకు పైగా యుద్ధ ట్యాంక్ విధ్వంసక తేలికపాటి ఆయుధాలు, 2,000 యుద్ధట్యాంక్ విధ్వంసక క్షిపణులను పశ్చిమ దేశాలు సరఫరా చేశాయి. గ్రనేడ్లు, రాకెట్లు, ఇతర ఆయుధాలు భారీ సంఖ్య లో ఉన్నాయి. ఉక్రెయిన్‌లో ప్రతీ ఒక్కరి చేతిలో ఆయుధం ఉందంటే అతిశయోక్తి కాదేమో. రష్యా తప్పిదాలు ఉక్రెయిన్‌ని కొట్టడం ఏమంత పెద్ద పని కాదని రష్యా తేలిగ్గా తీసుకుంది. ఎక్కువగా బలగాలను మోహరించలేదు. మూడు రోజుల్లో రాజధాని కీవ్ వశమైపోతుందని భావించడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికాలోని రష్యా స్టడీస్ ప్రోగ్రామ్ ఎట్ ది సెంటర్ ఫర్ నేవల్ అనాలిసస్ డైరెక్టర్ మైఖేల్ కోఫ్మన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్ని బలగాలను మోహరించినప్పటికీ ఈలోగా ఉక్రెయిన్ చేతుల్లోకి ఆయుధాలు వచ్చి చేరాయి. నైతిక స్థైర్యం రష్యా సైన్యానికి ఊహించని నష్టం జరగడంతో సైనికులు నైతిక స్థైర్యం తగ్గిపోయింది. యుద్ధభూమిలో వేల సంఖ్యలో మరణాలు, క్షతగాత్రులతో పాటు చాలామందికి తాము యుద్ధానికి వెళుతున్నామన్న విషయం తెలీదు. పుతిన్ ప్రభుత్వం సైనికులకు అసలు విషయం చెప్పకుండా దాచి కదనరంగానికి పంపడం తప్పిదేమనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ముక్తి అంటే ఏమిటి? ఎలా సాధించాలి?
శాస్త్రాలలోని విషయాలను గురుసమ్ముఖంలో కూర్చొని శ్రవణం చేసి, గ్రహించిన జ్ఞానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో అనుభవానికి తెచ్చుకొని, స్వీయ స్వరూపాన్ని తెలుసుకోవటమే ‘జ్ఞానం’. ఆ జ్ఞానాన్ని ఏకాగ్రతతో అనుభవానికి తెచ్చుకొనుటకు ఆచరించే ఉపాయమే ‘యోగం’ (యోగ సాధన) మనస్సు పూర్తిగా నిర్మలంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ఉండేది. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా ప్రకాశిస్తుంది గాని, దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు గదా! కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి. అలాంటి జ్ఞానం కలిగి, నిరంతరం యోగం నందే ఉండాలి, ఏదో కొద్దిసేపు నేను ఆత్మను అనే జ్ఞానంలో ఉండటం కాక శాశ్వతంగా – స్థిరంగా ఆత్మగా ఉండిపోవాలి. ఇలా ఉండాలంటే మనం బ్రహ్మనిష్ఠ, కరుణా సముద్రుడైన గురువును ఆశ్రయించాలి. నిత్యం గురువు ద్వారా సందేహాలను తొలగించుకోవాలి. అలా జ్ఞానంలో నిలబడటం జరుగుతుంది. బుద్ధి ద్వారా పరమాత్మను గురించి శ్రవణం చేయడం, విచారణ చేయడం. ఆయనను చేరుకొనేందుకు కృషి చెయ్యాలి. సత్కార్యాలను సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చైపోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే. తాను చెప్పే నూతన విషయాలను, సూక్ష్మబుద్ధికి తప్ప అంతుబట్టని వేదాంత విషయాలను అతడు చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్షమార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు. అందుకే గురువులు ఇలా గట్టిగా చెబుతుంటారు. వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? మోక్షాన్ని గనక పొందాలంటే భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, పరోపకారాలు (దానధర్మాలు) చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు. ముక్తి పొందాలనుకున్నవారు, మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా ? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి – నిష్కామంగా, ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం. సరే మరి ఇంత కర్కశంగా చెప్పటం ఎందుకు? వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువు ను సమీపించేటప్పటికే శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు గురువు చెప్పే సునిశిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధిసూక్ష్మత శిష్యుడికి ఉండాలి. అలా ఉండాలంటే అప్పటికే వారు ధార్మిక జీవనానికి అలవాటు పడి, నిష్కామ కర్మలు, జపతపాలు ఇష్టదేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించేవారై ఉండాలి. ► మీరు ఇతరులను ఆదుకుంటే ఇతరులు మిమ్మల్ని ఆదుకుంటారు. ► మీరు ఇతరుల అభివృద్ధికి కృషి చేస్తే , మీ అభివృద్ధికి ఇతరులు కృషి చేస్తారు. ► మీరు ఇతరుల కోసం సమయాన్ని వెచ్చిస్తేనే, మీ కోసం ఇతరులు సమయాన్ని వెచ్చిస్తారు. ► మీరు ఇతరులకు ఆత్మ విజ్ఞానాన్ని పంచితే , మీకు సృష్టి ఆత్మ విజ్ఞానం పంచుతుంది. ► మీరు ఇతరుల దైవత్వానికి కృషి చేస్తేనే , మీరు దైవత్వం పొందగలుగుతారు. ► ‘పరోపకారం‘ (దానాలు) చేయాలని నిజంగా మీరు నిర్ణయించుకుంటే ఎన్నో రకాలుగా చేయవచ్చు. మనసు ఉంటే మార్గం ఎప్పుడూ ఉంటుంది. ► ‘పరోపకారం’ ద్వారా అన్ని సమస్యలలో నుంచి సులభంగా, వేగంగా, శాశ్వతంగా బయటపడవచ్చు. ► సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. కాని కలియుగంలో అన్నిటికన్నా ప్రధానం ► ‘పరోపకారం’. (దానాలు) చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది..? జీవితంలోని ఏ సమస్యలైనా ‘పరోపకారం’ ద్వారా తొలగిపోతాయి. సర్వ అనారోగ్యాలను, సమస్త సమస్యలను ‘పరోపకారం’ ద్వారా శాశ్వతంగా తొలగించుకోవచ్చు. ఎవరికైనా సహాయం చేయండి. మంచి పనులు చేయండి. అడగక ముందే వారి అవసరాన్ని కనిపెట్టి, ఏమీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయండి. ఏ సహాయం చేయగలుగుతారో అదే చేయండి. మీకు సహాయం చేసే వీలు లేకపోతే కనీసం సహాయం ఎక్కడ దొరుకుతుందో తెలియజెప్పండి. మీరు ఏదైనా సహాయం చేస్తేనే మీకు సహాయాలు లభిస్తాయి. మీరు ప్రేమను పంచితేనే, మీరు ప్రేమను పొందగలుగుతారు. బయటి ప్రవర్తన – లోపల మనస్సు రెండూ ఒక్కటిగా ఉంటేనే ధ్యానంలో మనస్సు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు. అప్పుడే మనస్సు పరమాత్మకు దగ్గరగా ఉంటుంది. ఇలా మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే – నిరంతరం భగవంతుని పూజలు, యజ్ఞలు, పరోపకారం (దానాలు), తపస్సులు, ఆధ్యాత్మిక సాధనలు భక్తితో ఆచరించాలి. అలాగాక ఆచరణ గొప్పగా ఉండి మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో వ్యవహరిస్తే అది పరమాత్మకు దూరం చేస్తుంది. – భువనగిరి, కిషన్ యోగి -
విద్వాన్ సర్వత్ర పూజ్యతే!
ధనం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంలో ఉండే భౌతికమైన ధనం. రెండవది మానసిక ధనం. మూడవది పుణ్యరూపమయిన ధనం. ఈ మూడూ సమానమైన ప్రాతినిధ్యాన్ని, సమానమైన ప్రతిపత్తిని పొంది ఉంటాయి. అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకోకపోతే మాత్రం బాహ్యంలో ధనమున్నప్పటికీ అది ప్రమాదహేతువై కూర్చుంటుంది. అందుకే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో – సరస్వతీదేవి, లక్ష్మీదేవి.. ఇద్దరి అనుగ్రహం అవసరమేనని అంటారు. సరస్వతీకటాక్షం లేని లక్ష్మీదేవికటాక్షం బాహ్యంలో భయ హేతువు. ఐశ్వర్యం ఉంది. చదువు లేదు. ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. అంతరంలో–ఎక్కడ దానం చేయాలో తెలియదు, అపాత్రదానం చేసి తనకున్న వైభవాన్ని పాడుచేసుకుంటాడు. అదే సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీకటాక్షంలో అభ్యున్నతి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరస్వతీ కటాక్షమున్నవారికి లక్ష్మీకటాక్షం లేకపోవడం అన్నమాట ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత చదువున్నా తాదాత్మ్యత చెందడు. ప్రసాదబుద్ధితో బతుకుతుంటాడు. ‘ఇవన్నీ నావి కావమ్మా, నీ పాదాలు పట్టుకోవడం చేత వచ్చిన కీర్తి’ అనే భావనతో ఉంటాడు. అది అభ్యున్నతికి హేతువవుతుంది. ఇది బాహ్యంలో శాంతికి, భోగాన్ని అనుభవించడానికి, పుణ్యకర్మ చేయడానికి అత్యంత ప్రధానం. రెండవది మానసిక ధనం. అంటే శాంతి. శాస్త్ర ప్రకారం మనం ఏది చేసినా...‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అంటాం. తాను శాంతంగా ఉండాలి. పదిమందిని శాంతంగా ఉంచగలగాలి. ప్రశాంతంగా ఉండడంకన్నా ఐశ్వర్యం లోకంలో మరొకటి ఉండదు. బాహ్యంలో ఎంత ఐశ్వర్యవంతుడయినా తనకింకా ఏదో లేదనే బాధతో బతికేవాడు దరిద్రుడు. తనకి ఏది లేకపోయినా ‘నాకేం తక్కువయిందని’..అన్నభావనతో బతికేవాడు మహదైశ్వర్యవంతుడు. కొంతమంది పూరింట్లో ఉన్నా ఎంతో తృప్తిగా జీవిస్తుంటారు. పెద్దపెద్ద రాజభవంతుల్లో ఉన్నా ఇంకా ఏదో లేదని ఎప్పుడూ వెంపర్లాడుతుండేవాడు నిత్య దరిద్రుడు. అందుకే మానసికమైన ధనం భౌతికమైన ధనం కన్నా చాలా గొప్పది. ఐశ్వర్యమయినా, ఆనందమయినా మానసికమైన ధనాన్ని ఆవహించి ఉంటాయి. మూడవది పుణ్యధనం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు. మంచిదే. ఇక్కడ ధనవంతుడిగా ఉన్నావు. మంచిదే. కానీ జన్మ పరంపర ఇక్కడితో ఆగిపోతుందని నమ్మకం ఏమిటి? జ్ఞానం కలుగుతుందనీ, దానివల్ల పునరావృతి పొందవనీ, మళ్ళీ జన్మ స్వీకరించవనీ నమ్మకమేం లేదుగా! ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ, ప్రశాంతత కానీ గత జన్మల పుణ్యఫలమేగా! దానిని నీవు అనుభవిస్తున్న కొద్దీ ఖర్చయిపోతుంటుందిగా! మరి వచ్చే జన్మకి పుణ్యం ఎక్కడినుంచి వస్తుంది ? ఇక్కడి ధనాన్ని, ఇక్కడి పుణ్యాన్ని, ఇక్కడి తెలివిని, ఇక్కడి శక్తిని పుణ్యం కింద మార్చుకోవాలిగా! అదెలా మారుతుంది? పాండిత్యం ఉంటే నీకున్న పాండిత్యాన్ని పదిమందికీ పంచి పెట్టడానికి ఉపయోగిస్తే అది అందరికీ చేరుతుంది. తరగని సంపదలా నీ వద్దే ఉంటుంది కూడా! అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! -
వైదిక విజ్ఞానం
వేద వాఙ్మయంలో ఆరు విభాగాలున్నాయి. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. వీటినే షడంగాలు అంటారు. ఇవి వేదాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ షడంగాలను అధ్యయనం చెయ్యకుండా వేదాలను చదువ కూడదన్నది సాంప్రదాయం. షడంగాలను అధ్యయనం చేయకుండా వేదాలను చదివితే, అవి సరైన రీతిలో అర్థంకాకపోగా, విపరీతమైన అర్థాలు వచ్చేదానికి అవకాశం వుంటుంది. అందుకే ముందుగా మనం వేదాంగాల గురించి తెలుసుకుందాం... వేదాల్లోని అక్షరాలు, పదాలు, అవి పలికే విధానం గురించి, వేద మంత్రాల స్వరాలు, ఒత్తిడి, శ్రావ్యతల గురించి, మంత్రాలు పలికే సమయంలో పదాల కలయిక, వాటి నియమాల గురించి శిక్షాశాస్త్రం వివరిస్తుంది. మనిషి ఆలోచనలను వ్యక్తపరచడానికి కావలసిన పదాలు, వాక్యనిర్మాణం, భాషావిశ్లేషణ నియమాలు, సంధులు, పదవిఛ్ఛేదాలు, పదాల ఏర్పాటు, మొదలైన వాటిగురించి వ్యాకరణం వివరిస్తుంది. వేదమంత్రాలన్నీ ఏదో ఒక ఛందస్సులో చెప్పబడినవే కనుక ఒక క్రమ పద్ధతిలో నిర్ణీతసంఖ్యలో అక్షరాల ఆధారంగా మంత్రాలను అర్థం చేసుకోవడాన్ని ఛందస్సు వివరిస్తుంది. వేదాలలోని శబ్దాలు, వాటి వ్యుత్పత్తి, నిర్మాణం, అవి ఉపయోగించిన సందర్భాన్ని బట్టి వాటి అర్థాలు, అస్పష్టమైన అర్థంతో చేసిన పద ప్రయోగాలను అర్థం చేసుకోవడం,మొదలైనవాటి వాటిగురించి వివరించేది నిరుక్తం. ఆచారాలు, సూర్యచంద్రాది గ్రహ, నక్షత్రాలను బట్టి ఏర్పడు శుభాశుభ సమయాలు, ఋతువులు, ఇత్యాది ఖగోళ శాస్త్ర విఙ్ఞానాన్ని అందించేదే జ్యోతిష్య శాస్త్రం. యఙ్ఞయాగాదులలో నిర్మించే యఙ్ఞగుండాలు, వేదికలు, యాగశాలల నిర్మాణ విధానాలు, జననం, మరణం, వివాహం వంటి సంఘటనలలో జరుపవలసిన ఆచారాలు మొదలైన వాటి గురించి కల్పం వివరిస్తుంది. వేదవాఙ్మయానికి జ్యోతిష్యం నేత్రం వంటిది అని శాస్త్రోక్తి. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. అలాగే షడంగాలలో జ్యోతిష్యం ప్రధానం. ఎందుకంటే, మిగిలిన ఐదు శాస్త్రాలూ ఎక్కువభాగం భాషకు సంబంధించినవి. కానీ జ్యోతిష్యశాస్త్రం మాత్రం ఖగోళంలోని గ్రహనక్షత్రాది జ్యోతుల గతులను, వాటివలన ఏర్పడే పరిణామాలను వివరిస్తుంది. ఆ రోజుల్లో ఖగోళాన్ని దర్శించి అధ్యయనం చేసేవారు. కాంతివంతంగా వుంటాయి కనుక గ్రహాలను నక్షత్రాలను కలిపి, జ్యోతులు అంటారు. వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రం అన్నారు. ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారానే వేదాల్లో వుండే ఎన్నో ఖగోళ అద్భుతాలను, విఙ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. వేదాల్లో వుండే ఖగోళ విఙ్ఞానాంశాలు మచ్చుకి కొన్ని. ఋగ్వేద ప్రథమ మండలంలో సూర్యుడు తన కక్ష్యలో చరించడాన్ని, సూర్యాకర్షణశక్తి వల్లనే భూమి, ఇతర పదార్థాలు సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయని, సూర్యుడు చాలా భారీగా వుంటాడనీ, అతని ఆకర్షణశక్తి వల్లనే గ్రహాలు ఒకదానితో మరొకటి ఢీకొనకుండా వుంటాయని తెలిపారు. మరొక మంత్రంలో, ‘కదిలే చంద్రుడు నిత్యం సూర్యునినుండి కాంతికిరణాలను పొందుతాడు’ అనీ, ‘చంద్రుడి వివాహానికి సూర్యుడు తన కుమార్తెలాంటి ఒక కిరణాన్ని బహుమతిగా ఇచ్చాడు’ అని, చంద్రకళలు మారడంలో సూర్యకిరణాల పాత్రని తెలియజేశారు. ఋగ్వేదం ఐదవ మండలంలో ఒక మంత్రం ‘ఓ సూర్యదేవా! ఎవరికైతే నీ వెలుగును బహుమతిగా ఇస్తున్నావో వారి (చంద్రుడు) వలన నీవెలుగు నిరోధించబడినప్పుడు, భూమి అకస్మాత్తుగా చీకటిలో భయపడుతుంది‘ అంటూ గ్రహణాలకు కారణం సుర్యుడు, చంద్రుడు, భూమియే అని చెప్పింది. ఋగ్వేద ఎనిమిదవ మండలంలో, సౌరకుటుంబంలోని ఆకర్షణశక్తుల గురించి, ‘ఓ ఇంద్రా..! గురుత్వాకర్షణ, ఆకర్షణ, ప్రకాశం, కదలిక లక్షణాలను కలిగియున్న శక్తివంతమైన కిరణాలను ప్రసరించి ఆకర్షించడం ద్వారా ఈ విశ్వాన్ని నిలపండి‘ అంటూ సూర్యుణ్ణి, భోగప్రదాత అయిన ఇంద్రుడితోపోల్చి చెప్పారు. మరొక మంత్రంలో సృష్టికర్తను ఉద్దేశించి ‘ఓ దేవా! మీకున్న అనంతమైన శక్తితో సూర్యుని సృష్టించి, ఆకాశంలో ధృవపరచి, సూర్యుని, ఇతర గోళాలను సమన్వయపరచి స్థిరం చేసినారు’ అని సూర్యుని చుట్టూ గ్రహాలు స్థిరంగా తిరగడం గురించి తెలిపారు. ఋగ్వేద పదవ మండలంలో ‘ఈ భూమికి కాళ్ళు, చేతులు లేకపోయినప్పటికీ అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దానితోబాటూ దానిమీద వుండే అన్నీ కదులుతాయి’ అని చెప్పారు. యజుర్వేదంలో ఒక మంత్రంలో సూర్యుని ఆకర్షణశక్తి గురించి, ‘సూర్యుడు తన కక్ష్యలో కదులుతూ తనతోబాటు భూమివంటి వస్తువులను తనతోబాటు తీసుకు వెళ్తున్నాడు’ అని చెప్పారు. అథర్వవేదంలో ‘సూర్యుడు భూమిని, ఇతర గ్రహాలను పట్టి వుంచాడు’ అని తెలియజేశారు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
అవగాహన లేకుంటే..చిక్కులే!
సాక్షి, కరీంనగర్: వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అమానవీయ ఘటనపై గత శుక్రవారం కువైట్‌లో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన 24మంది ప్రవాసాంధ్రులను కువైట్ నిఘా బృందాలు అరెస్టు చేశాయి. నిరసన ప్రదర్శన ఉద్దేశం మంచిదే అయినా ఆ దేశ చట్టాలకు విరుద్ధం కాబట్టి నిరసనకారులు ఇబ్బందుల్లో పడ్డారు. భారత దేశంలో పౌరులు తమ హక్కుల కోసం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసికెళ్లడానికి బంద్‌లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేయడం సర్వసాధారణం. భారత్‌లో పుట్టిపెరిగిన వారు ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచార వ్యవహారాలు, చట్టాలపై అవగాహన లేకపోవడం వలన చిక్కుల్లో పడుతున్నారు. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి రాచరిక పాలన, ముస్లిం షరియా చట్టాలు అమలులో ఉండే అరబ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి పరిస్థితులలో ఇమడలేక మానసిక సంఘర్షణ పడుతుంటారు. కొంత కాలం తర్వాత అలవాటుపడి సర్దుకుపోతుంటారు. రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న గల్ఫ్ దేశాలలో అక్కడి చట్టాల ప్రకారం సమ్మెలు, నిరసన ప్రదర్శనలు చేయడం నిషేధం. గల్ఫ్‌లో సభలు, సమావేశాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సదస్సులు తదితర ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అక్కడి ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా ప్రభావం గల్ఫ్‌లో ఉండే చాలా మంది ప్రవాసులు స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులతో వాయిస్ కాల్, వీడియో కాల్ మాట్లాడటానికి స్మార్ట్ ఫోన్లలో ఐఎంఓ (ఈమో), బోటిం, వాట్సాప్ లాంటి యాప్‌లను వినియోగిస్తున్నారు. సమాచారం తెలుసుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. స్వదేశంలో జరిగే సంఘటనలు, సామాజిక, రాజకీయ కార్యకలాపాలపై తమ సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తున్నారు. రకరకాల విషయాలపై ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపులలో వాగ్యుద్ధాలు, తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతుంటాయి. అర్థవంతమైన, విషయాత్మక చర్చలు, విలువైన సమాచార మార్పిడి కూడా జరుగుతున్నది. వార్తలు, విశేషాల అప్డేట్స్ కోసం ప్రవాసులు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. – మంద భీంరెడ్డి, ప్రవాసీ మిత్ర. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దు మంచి కోసమైనా సరే.. గల్ఫ్ దేశ నిబంధనలకు విరుద్ధంగా పొతే జైలుపాలవుతాం. ఏ కార్యక్రమం చేయాలన్నా మన దేశానికి చెందిన సీనియర్ల సలహా తీసుకుని నిర్వహించాలి. ఆ దేశ ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయకూడదు. గల్ఫ్‌లో చట్టం తన పని తాను కచ్చితంగా చేసుకుంటపోతది. వరంగల్ ఘటనపై ఆవేదనతో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అరెస్టయ్యారు. వారిని విడిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. – గోలి, శ్రీనివాస్,ఖతార్ వినతి పత్రం రూపంలో పంపాలి గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన మనం ఇక్కడ అతిథులం మాత్రమే. ఈ దేశాల పౌరులం కాదు. మన సమస్యలు గానీ, అభిప్రాయాలు గానీ ఏమైనా వ్యక్తం చేయాలన్నా వినతి పత్రం రూపంలో ఇండియన్ ఎంబసీకి పంపాలి. మన సమస్యలపై భారత ప్రభుత్వానికి, ఆయా శాఖలకు ఉత్తరాలు రాయవచ్చు. కానీ, గల్ఫ్‌లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేయడం నిషేధం. ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. – షహీన్ సయ్యద్, సామాజిక కార్యకర్త, కువైట్ -
బోధన నైపుణ్యాలు, ఆధునిక పరిజ్ఞానాల్లో సహకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. బోధన నైపుణ్యాల పెంపు, ఆధునిక పరిజ్ఞానంలో పరస్పర సహకారం, విద్యార్థులకు విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో తోడ్పాటును అందించేందుకు ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో (ఐఏ సీసీ) గురువారం ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసు కుంది. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ అమెరికా, తెలంగాణలోని వర్సిటీల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందన్నారు. అమెరికా వర్సిటీల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, మంచి సిలబస్, విద్యార్థులకు ఉపయోగపడే అంశాలు, బోధనా పద్ధతుల్లో అనుసరిస్తున్న విధానం వంటి అనేక అంశాలను విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, ఓయూ వీసీ ఎస్.రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాలరెడ్డి, వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడారు. -
ధర్మాన్ని తెలుసు కోవడమే జ్ఞానం తత్త్వ రేఖలు
భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం హేతుబద్ధతను మించిన తర్కాన్ని ఏనాడో చేసింది. వాటి రూపాలే ఉపనిషత్తులు. పూర్ణమదః పూర్ణమిదం అంటూ ‘థియరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ’ సూత్రాన్ని సంస్కృత భాష వేల ఏళ్ల క్రితమే ఉద్భోధించింది. తదేజతి తన్నైజతి అంటూ విశ్వశక్తి గురించి అప్పుడే విశ్లేషణ చేసింది. కామం, సంకల్పం, సంశయం, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యం, అధైర్యం, లజ్జ, బుద్ధి, భయం అన్నీ మనోరూపాలేనని మానసిక శాస్త్రాన్నీ విడమర్చింది. ఇలా అనేక శాస్త్రాలకు బీజమేశాయి ఉపనిషత్తులు. వీటిని ఆకళింపు చేసుకుంటే ఆత్మ, పరమాత్మల ఏకత్వాన్ని అర్థం చేసుకోవడంతోపాటు ఆచరణలో పెట్టడం సాధ్యం అవుతుంది. తద్వారా మనిషి అరిషడ్వర్గాలను అణచివేసి, నిష్కామకర్మను దినచర్యగా చేసుకోగలుగుతాడు. నిష్కామకర్మ వలన ఎలాంటి భవబంధాలు మనిషిని తాకలేవు. తద్వారా మృత్యుంజయ మంత్రంలో చెప్పినట్టుగా మనిషి మృత్యుభావనను జయించి అమృతమయ జీవితాన్ని జీవించగలుగుతాడు. అదే ఆధ్యాత్మికజ్ఞాన లక్ష్యం.ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక సాధారణ మానవుడు రజ్జుసర్ప భ్రాంతిని పొందుతున్నాడు. అంటే ఈ కనిపించే భౌతిక రూపాలు సత్యమనుకుంటూ బంధనాలు వేసుకుంటున్నాడు. కులం మతం లాంటి బలహీనతలను పొందుతున్నాడు. ప్రకృతిలో మానవుడు ఒక భాగమేనన్న నిజాన్ని మనం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రాకృతిక రూపాలు ఏ విధంగా తమ తమ కర్మలను ఆచరించి ఇతర ప్రాకృతిక రూపాల మనుగడకు దోహదపడుతున్నాయో, ఆ విధంగా మానవుడు కూడా తన మానవత్వ కర్మలను ఆచరించి, పాంచభౌతిక రూపాన్ని సాధించి, చివరకు పంచభూతాల ద్వారా అనంతశక్తిగా మార్పుచెందడమే ధర్మం. అదే మోక్షం. దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. అజ్ఞానం చేత కర్మఫలాలు శాశ్వతం అనుకుంటున్నాం. అయితే, సృష్టి, స్థితి, లయలు అనేవి నిరంతర క్రియలు అని తెలుసుకుని కర్మఫలాలు ఆశించకుండా కర్మలు ఆచరించడమే నిష్కామకర్మ. ఏతావాతా నిష్కామకర్మకు ఆధారం జ్ఞానం. జ్ఞానమంటే హేతువాదమే! జ్ఞాన సాహిత్య నిధి అయిన ఉపనిషత్తులు, ఆదిశంకరుని అద్వైతాన్ని అవగాహనలోకి తెచ్చుకోవడం తద్వారా నిష్కామ కర్మలను ఆచరించడం ద్వారా అరిషడ్వర్గాలను చిదిమి వేయగలం. నిష్కామ కర్మ వల్ల ప్రతిఫలించే తాదాత్మ్యత హృదయాంతరాల నుండి మొదలుకొని ముఖవర్చస్సు వరకు ఆవహించి ఉంటుంది. అద్వైతజ్ఞాని ప్రతి జీవిలోనూ, నిర్జీవిలోనూ, పంచభూతాలలోనూ, శూన్యంలోనూ అంతర్లీనంగా ఉండే ఈశావాస్యమిదం సర్వాన్ని దర్శించగలుగుతాడు. ’అహం బ్రహ్మాస్మి’ని అనుభవించగలుగుతాడు. – గిరిధర్ రావుల -
సత్యాన్వేషణమే జ్ఞానం
చీకటి తొలగాలంటే వెలుగు కావాలి. అరిషడ్వర్గాలు తొలగాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానార్జన అంత సులభమైన విషయం కాదు. జ్ఞానమంటే హేతువును అర్థం చేసుకోవడం. జ్ఞానమంటే స్థితిని అవగతం చేసుకోవడం. కార్యకారణ తత్వాన్ని ఆకళింపు చేసుకోవడం. ఆత్మానాత్మ వివేకం పొందడమే జ్ఞానం. ఏతావాతా ‘నేను’ లోపల, బయట ఏముందో అవగతం చేసుకోవడమే జ్ఞానం. జ్ఞాని స్థితప్రజ్ఞుడు. అతనికి సుఖదుఃఖాలతో, జయాపజయాలతో, కష్టనష్టాలతో, ఆరోగ్యానారోగ్యాలతో, కలిమిలేములతో పనిలేదు. ఏదైనా సమానమే. కంటికి కనిపించే భౌతిక రూపాలన్నీ ఆ అనంతమైనశక్తి నుండి ఉద్భవించినవే. పంచభూతాల మేలిమి కలయిక వల్ల శరీరాలు ఏర్పడ్డాయని తెలుసుకోవడం, తిరిగి పాంచభౌతికమైనవన్నీ అదేశక్తిలో విలీనమవుతుందని అర్థం చేసుకోవడం జ్ఞానం. అదే అద్వైతవాదం. జ్ఞానం అనేది ఓ మానసిక తపస్సు. నిరంతర శోధన దృశ్యమాన ప్రపంచం లో ఉన్న మానవుడు దృశ్యమాన ప్రపంచం ద్వారా అదశ్యమైన శక్తిని సాధ్యం చేసుకోవడమే జ్ఞానం. అదే సత్యాన్వేషణ. మరి ఈ సత్యం అంటే ఏమిటి? ‘సతత యతీతి సత్యం’. అంటే నిరంతరంగా ఉండేదే సత్యం. నేను ఉంటానా? ఉండను. మీరు ఉంటారా? ఉండరు. చుట్టూతా ఉండే చెట్టు, పుట్ట, గట్టు, ఏరులు, నదులు, కొండలు, కోనలు ఏవీ నిరంతరంగా ఉండేవి కావు. అంతేనా సూర్యుని నుండి జన్మించిన భూమి నశించేదే. మనందరికీ ఆధారమైన సూర్యుడూ నశిస్తాడు. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు నశించి తిరిగి అనంతశక్తిలో భాగమవుతాయి. అంటే భౌతిక రూపంలో ఉన్న ఖగోళ పదార్థాలన్నీ తిరిగి ఆ అనంత ఖగోళ శక్తిగా మారిపోవడం అనేది, అదే శక్తి నుండి ఖగోళ పదార్థాలు రూపొందడం అనేది నిరంతర ప్రక్రియ. అదే విషయాన్ని అంటే దృశ్యమాన భౌతిక ప్రపంచం ఆ అనంతశక్తి నుండి ఏ విధంగా ఉద్భవిస్తుంది అనే విషయం బృహదారణ్యకోపనిషత్తు స్పష్టంగా వివరించింది. ఏ విధంగానైతే సాలీడు నుండి దారం వెలువడుతుందో, ఏ విధంగానైతే నిప్పు నుంచి నిప్పురవ్వ లు వెలువడతాయో, అదే విధంగా ఈ ఆత్మ(అనంతశక్తి) నుండి అన్ని రకాల శక్తులు, అన్ని రకాల లోకాలు, అన్ని రకాల దేవతలు(అభౌతిక జీవులు), సంపూర్ణ స్థూల జగత్తు ఉత్పన్నమౌతుంది. దానిని తెలుసుకో! దాని దగ్గరకు వెళ్ళు! అది సత్యానికే సత్యం! ఆ మూలాధార ప్రాణమే సత్యం! అలా చెప్పేదీ సత్యమే! – రావుల గిరిధర్ -
మీ టూర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది..?
కొత్త కొత్త ప్రదేశాలు, సందర్శనీయ స్థలాలను చూడటం వల్ల విజ్ఞానంతో పాటు వినోదం కూడా దొరుకుతుంది. అందుకే చాలా మంది ఏడాదిలో ఒక్కసారైనా ఏదో కొత్త ప్రదేశానికి టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే మరికొందరు మాత్రం ముందస్తు టూర్ ప్రణాళిక వేసుకోరు. దాంతో కొత్త ప్రదేశంలో ఇబ్బందులు పడతారు. మీరు టూర్ ప్లానింగ్‌లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు? చెక్ చేసుకోండి. 1. మీరు వెళ్తున్న ప్రదేశం గురించి ముందుగానే ఇంటర్నెట్లోనో, గైడ్ నుంచో సమాచారం సేకరిస్తారు. ఎ. అవును బి. కాదు 2. అవసరమైన మేరకు నగదు ఉంచుకుని డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ట్రావెల్ చెక్స్ వంటివి దగ్గర పెట్టుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. అక్కడి వాతావరణం, వేసుకోవాల్సిన దుస్తుల గురించి వాకబు చేస్తారు. ఎ. అవును బి. కాదు 4. ఫస్ట్ ఎయిడ్ కోసం అవసరమైన మందులను క్యారీ చేస్తారు. ఎ. అవును బి. కాదు 5. కలుషితమైన నీళ్లు తాగే ప్రమాదాన్ని నివారించడానికి వాటర్‌బాటిల్‌ను క్యారీ చేస్తారు. ఎ. అవును బి. కాదు 6. మీరు వెళ్లాల్సిన ప్రదేశం రూట్ మ్యాప్‌ను జాగ్రత్తగా స్టడీ చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీరు వెళ్లే ప్రదేశంలోని హోటల్స్, బస చేయదగ్గ ప్రదేశాల గురించి ముందుగానే సమాచారం తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. అక్కడ స్థానికంగా ఉంటున్న ఒకరిద్దరి చిరునామాలు ముందుగానే తీసుకుని దగ్గర ఉంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 9. దారిలో మీరు చూడదగ్గ ప్రదేశాల విషయంపై కూడా మీకు అవగాహన ఉంటుంది. ఎ. అవును బి. కాదు 10. భద్రత పరంగా టూర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు బాగా తెలుసు. ఆ మేరకు భద్రతచర్యలు తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు కంటే ఎక్కువ వస్తే టూర్ ప్లానింగ్‌లో మీరు పక్కాగా ఉంటారు. మీరు వెంట ఉంటే మీ వెంట వచ్చేవారికి సైతం బోల్డంత ఊరటగా ఉంటుంది. ఒకవేళ ‘బి’ లు ఎక్కువగా వస్తే మీరు టూర్ ప్లానింగ్ గురించి పెద్దగా ఆలోచించరు. అప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి అప్పుడే ఆలోచించవచ్చు అని అనుకుంటారు. ఇలా ముందుగా ప్లాన్ చేసుకోకపోతే ప్రయాణంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ. వాటిని వీలైనంతగా తగ్గించుకోడానికి ‘ఎ’లను సూచనలుగా తీసుకుని టూర్ ప్లాన్ చేయండి. -
స్కూలు నుంచి వచ్చిన పిల్లలతో మీరెలా గడుపుతున్నారు?
ఇరుగుపొరుగు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక చలాకీగా ఆటల్లో మునిగిపోతారు, గెంతుతారు, గోలచేస్తూ ఆనందం పొందుతారు... ఇలా సంతోషించే వారిని, ఇంటì నుంచే కొంతమంది పిల్లలు చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ల ఇంట్లో బాగా స్ట్రిక్ట్. పిల్లలను బయటకు రానివ్వరు... ఆటలాడనివ్వరు. వారిని కేవలం పుస్తకాలకే పరిమితం చేయాలనుకుంటారు. వీరి తల్లిదండ్రులు వారివారి వృత్తుల్లో బిజీగా ఉండటం వల్ల పిల్లల్ని గమనించే సమయం వారికి దొరకదు. దీంతో స్కూలు నుంచి ఇంటికొచ్చాక ఏమిచేయాలో తెలియక పిల్లలు అయోమయంలో పడతారు. పట్టించుకునేవారు లేక తల్లడిల్లుతారు... స్కూలు నుంచి ఇంటికొచ్చిన పిల్లలను మీరెలా గమనిస్తున్నారు? లీజర్ టైంలో వారితో ఎలా గడుపుతున్నారు? 1. పిల్లలను బయటకి తీసుకెళతారు. వారిలో నాలెడ్జ్ (మేధను పెంచే గేమ్స్, బుక్ రీడింగ్ మొదలైనవి) పెంచేందుకు వివిధరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఎ. అవును బి. కాదు 2. ఉదాయాన్నే పిల్లలను నిద్రలేపి వారిలో యాక్టివ్నెస్ పెంచుతారు. ఎక్కువసేపు పడుకోనివ్వరు. ఎ. అవును బి. కాదు 3. పిల్లలతో పాటు పాఠశాలకు వెళ్ళటమన్నా, వారి యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవట మన్నా ఉత్సాహం చూపుతారు. ఎ. అవును బి. కాదు 4. పిల్లలకు హోంవర్క్‌లో సహాయం చేస్తారు. ఎ. అవును బి. కాదు 5. పిల్లలకు కొత్తకొత్త క్రేయాన్స్, పెయింట్స్, పుస్తకాలు కొనిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 6. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లకు తప్పక హాజరవుతారు. ఎ. అవును బి. కాదు 7. స్కూలు నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు రొటీన్ పనులను చెప్పి బోర్ కొట్టించరు. ఎ. అవును బి. కాదు 8. లంచ్‌లో పిల్లలకు ఇష్టమైన, బలమైన ఆహారాన్ని ఇచ్చేలా చూస్తారు. ఎ. అవును బి. కాదు 9. పిల్లలు ఎక్స్‌ట్రాకరికులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చూస్తారు. ఎ. అవును బి. కాదు 10. పాఠశాల నుంచి ఇంటికొచ్చిన పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు. వారి సందేహాలు తీర్చుతారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఆరు దాటితే పిల్లలను పాఠశాలకే పరిమితం చేయాలని అనుకోరు. స్కూల్ అయిపోయాక కూడ వారి గురించి శ్రద్ధ తీసుకుంటారు. దీనివల్ల పిల్లలు త్వరగా మెచ్యూరిటీ సాధిస్తారు. ‘బి’ లు ఆరు దాటితే పాఠశాల అనంతరం లేదా పాఠశాల బయట పిల్లల గురించి మీరు సరిగా పట్టించుకోరు. పాఠశాలే పిల్లలకు అన్ని విషయాలు నేర్పిస్తుందని అపోహ పడుతుంటారు. స్కూల్లో పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇంటిదగ్గర వారి గురించి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులది. -
నాలెడ్జ్ మన ఆయుధం
-
డ్యాన్స్ చేస్తే తెలివి పెరుగుతుంది
తెలివితేటలు పెరగాలంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా కాసేపే డ్యాన్స్ చేస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. డ్యాన్స్ చేస్తే మెదడు చురుకుగా మారి, తెలివితేటలు పెరుగుతాయని బ్రిటన్‌లోని కొవెంట్రీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరు విద్యార్థులపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన విశేషాలను కనుగొన్నారు. వారానికి ఒక సల్సా డ్యాన్స్ క్లాస్‌కు హాజరైన వారిలో విషయాలను ఆకళింపు చేసుకునే శక్తి 8 శాతం, ఏకాగ్రత 13 శాతం, జ్ఞాపకశక్తి 18 శాతం పెరిగినట్లు తమ పరిశోధనలో తేలిందని కొవెంట్రీ వర్సిటీ శాస్త్రవేత్త మైకేల్ డంకన్ చెబుతున్నారు. కేవలం సల్సా అనే కాదని, ఎలాంటి నాట్యమైనా ఏకాగ్రతను గణనీయం పెంచుతుందని ఆయన అంటున్నారు. ఇక ఆలస్యమెందుకు... మెదడు మందకొడిగా మారిందనిపిస్తే మరింకేమీ ఆలోచించకుండా మంచి మ్యూజిక్ పెట్టుకుని కాసేపు ఒళ్లు అలసిపోయేలా స్టెప్పులెయ్యండి చాలు. -
విజ్ఞానం పేరుతో విధ్వంసం
స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: విజ్ఞానం పేరుతో విధ్వంసం జరుగుతోందని, ప్లాస్టిక్ బియ్యం వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని శాసనసభా స్పీకర్ మధుసూదనా చారి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని తన చాంబర్లో కాకతీయ వర్సిటీ పరిశోధనా విద్యార్థులు రూపొందించిన ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ‘సమూలంగా ఒక జాతిని ఏ జీవీ చంపదని.. ప్లాస్టిక్ బియ్యం తింటే మానవ జాతి మనుగడ ఉంటుందా? సమాజం ఎటు పోతోందని ప్రశ్నించారు. నా జీవితంలో ఇద్దరు కాల జ్ఞానులను చూశానని, ఒకరు జయశంకర్ కాగా, రెండో వ్యక్తి సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళాలని 2000 సంవత్సరంలొనే అనుకున్నాం. ఏం జరుగుతుందో ఆనాడే కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఒక వైవిధ్యమైన ఉద్యమం’అని స్పీకర్ పేర్కొన్నారు. ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని తెచ్చిన ప్రొ.భాస్కర్‌ను ఆయన అభినందించారు. -
జ్ఞాన భాండాగారాలు
జీవన కాలమ్ ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరవకండి. ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉందని తను వెళ్లి నిరూపించిన సీని యర్ నాయకులు ఓంప్రకాష్ చౌతాలా. ఆయన ఉపాధ్యాయుల నియామకం విషయంలో పెద్ద కుంభకోణాన్ని జరిపి, జైలుకి వెళ్లి బుద్ధిగా చదువుకుని తన 82వ ఏట ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియెట్ పరీక్ష పాసయ్యారు. వారు తీహార్ జైల్లో గత నాలుగున్నర ఏళ్లుగా ఉంటున్నారు. ఇది ఈ దేశ చరిత్రలో మార్గదర్శకమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. ఈ వార్తను ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్ వంటి వారు శ్రద్ధగా గమనించాలి. వారు గడ్డి కుంభకోణంలో ఆ మధ్య జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయాన్ని ఆయన వృధా చేసుకున్నారని చౌతాలాని చూస్తే అర్థమౌతుంది. ఆ సమయంలో కనీసం రెండో ఫారం చదివినా రేపు ప్రభుత్వం ఫైళ్లు చదువుకోడానికి ఉపయోగపడేది. అలాగే లల్లూ ఇద్దరు కొడుకులు–తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ బిహార్‌లో మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకాయన ఉప ముఖ్యమంత్రి. అర్హతలు ఏమిటీ అనేది అర్థం పర్థం లేని ప్రశ్న. క్లాసయినా పాసయే సదవకాశాన్ని కల్పించాలి. ‘మిష’ అంటారా? తమ తండ్రిగారి లాగ ఏదో గడ్డి తిని ఆ సరాసరి ముఖ్యమంత్రి పదవికి వచ్చే అవకాశముంది. కనుక వారిని వెంటనే జైలుకి పంపి రెండో తరగతికయినా తర్ఫీదు ఇప్పిస్తారని మనం ఆశించవచ్చు. ఈ దేశంలో జైళ్లకు ఎంతో అపకీర్తి ఉంది. అలనాడు తిలక్ మహాశయులు జైల్లో ఉంటూ భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. రాజాజీ పిల్లలకు అర్థమయ్యే సరళమైన ఇంగ్లీషులో రామాయణ, భారతాలను వ్రాశారు. నెహ్రూగారు ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రాశారు. ఇవన్నీ ఆ పెద్దల వికారాలుగా మనం సరిపెట్టుకోవచ్చు. చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడయినా ఇంటర్ పరీక్ష పాసయ్యేవారా? వారికి చిన్నతనంలో చదువు సరిగ్గా సాగలేదు. తర్వాత సాగించాలనుకుంటే తండ్రి దేవీలాల్‌తో పాటు రాజకీయాలలో ఉండడంవల్ల చదువుకునే అవకాశం రాలేదని ప్రస్తుత హర్యానా ప్రతిపక్ష నేత–అభయ్ సింగ్ చౌతాలా తన తాత గురించి చెప్పారు. ఈ మధ్య ఒక నానుడి ఏర్పడింది. ‘నువ్వేం చదువుకోలేదా? మరేం పర్వాలేదు. సరాసరి పార్లమెంటుకి వెళ్లే అర్హతలున్నట్టే. లేదూ? చదువుకోవాలని ఉందా? నిక్షేపంగా జైలుకి వెళ్లు’. ఈ దేశంలో ఏ అర్హతా అక్కరలేని వ్యాపకం ఒక్కటే–రాజకీయ రంగం. చదువుకుంటే గుమస్తావి అవుతావు. చదువు లేకపోతే మంత్రివి అవొచ్చు. రేపట్నుంచి జస్టిస్ కర్ణన్ వంటివారు జైల్లో ఉంటారు. మన జైళ్లలో ఉన్న కొందరు మహనీయులైన నాయకుల పేర్లు– జయలలిత, కనిమొళి, శశికళ, సురేష్ కల్మాడీ, అక్బరుద్దీన్ ఒవైసీ, పప్పు యాదవ్, ఎ. రాజా, యడ్యూరప్ప, అమర్ సింగ్, పండిత సుఖ్రాం, మధుకోడా. అయితే వీరంతా జైళ్లను సద్వినియోగం చేసుకోలేదని చెప్పాలి. తను హత్యకు గురవడానికి చాలాకాలం ముందు చెర్లపల్లి జైలు నుంచి – జూలకంటి శ్రీనివాస్ అనే మొద్దు శీను నా నవల ‘సాయంకాలమైంది’ చదివి నాలుగు పేజీల ఉత్తరం రాశాడు. ఆ నవల చదివి ఉత్తరం రాసిన మరొకాయన ఉన్నారు. ఈ దేశపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారు. ఆ రెండు ఉత్తరాలూ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అయితే మొద్దు శీను ఉత్తరం కొట్టొచ్చినట్టు గుర్తుకు వస్తూంటుంది. కారణం– అతడు జైల్లో లేకపోతే కలలో కూడా నవల చదివి ఉండడు. ఏకాంతం అంతర్ముఖుడిని చేస్తుంది. ఆ నిశ్శబ్దం– తనకు లేనిదీ, తను కోల్పోయినదీ–గుర్తుకు తెస్తుంది. తీరిక, నిస్సహాయమైన ఏకాంతం–దాన్ని భర్తీ చేసుకునే వెసులుబాటుని కల్పిస్తుంది. అందుకు కనీసం – ఒక నేరమైనా చేయాలి. జైలుకి వెళ్లే అర్హతని సంపాదించుకోవాలి. అప్పుడు – కనీసం ఇంటర్మీడియెట్ చదువయినా అబ్బుతుంది. లేకపోతే ఏమవుతుంది? మీరు రాష్ట్రానికయినా ముఖ్యమంత్రులయిపోతారు. లేదా జైలుకి వెళ్లే తండ్రులుంటే పార్లమెంటు సభ్యులయినా అయిపోతారు. ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. ఈ సంస్కృతికి ఉన్న మన్నిక అది. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. కనుక నాయకులకిదే పిలుపు. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. సత్వరంగా ఏ ఉపాధ్యాయుల కొంపలో ముంచండి. లేదా గడ్డి తినండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరిచిపోకండి. గొల్లపూడి మారుతీరావు