kovur
-
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
-
కోవూరులో చంద్రబాబు రోడ్‌షో అట్టర్ ఫ్లాప్
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా: కోవూరులో చంద్రబాబు చేపట్టిన రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జన సమీకరణ కోసం రోడ్ షోను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ స్పందన కరువైంది. చివరకు డబ్బులిచ్చి వాహనాల్లో జనాన్ని తరలించినా రోడ్ షో మాత్రం ఫ్లాప్ అయ్యింది. అధినేత మెప్పుకోసం స్థానిక నేతలు పడరాని పాట్లు పడ్డా జన స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. దాంతో సభా స్థలి వద్ద కనీస సందడి కనిపించలేదు. కొంతమంది మహిళలకు రూ. 200 ఇచ్చి మీటింగ్‌కు తరలించారు. డబ్బులిస్తే తాము వచ్చామని సదరు మహిళలు చెప్పడంతో అసలే నిరాశలో ఉన్న టీడీపీ నేతలకు మరింత తలపోటు ఎక్కువైంది. -
కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే
సాక్షి, కోవూరు: తనను నమ్ముకొన్న కార్యకర్తల కుటుంబాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అండగా నిలిచారు. కార్యకర్తలు తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన యాట అశోక్, చల్లాయపాళెం గ్రామానికి చెందిన అత్తిపాటి గోపి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇటీవల అకాల మరణం చెందారు. అశోక్‌కుమార్ కుటుంబానికి రూ.లక్ష నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న పార్టీని, తనను నమ్ముకున్న ఆ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే ప్రసన్న సోమవారం పరామర్శించి, ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష వంతున నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బాధను తెలుసుకుంటూ ప్రసన్న కంటనీరు పెట్టుకున్నారు. ఆయన కంట కన్నీరు గమనించిన పార్టీ నేతలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్లే మనస్తత్వం ఎమ్మెల్యే ప్రసన్నది అని పలువురు చర్చించుకున్నారు. ఎమ్మెల్యే వెంట వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, నాయకులు యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ సతీష్ రెడ్డి, వెంకయ్య, శేషు, చరణ్, మస్తాన్ ఉన్నారు. -
ఇనమడుగు వాసి ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు
కోవూరు (నెల్లూరు): మండలంలోని ఇనమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు పొన్నవోలు సుధీర్‌రెడ్డి అల్లుడు ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి లండన్ రాయల్ కమిషన్ ఫెలోషిఫ్ అవార్డు అందజేసింది. సాయికుమార్‌రెడ్డి 2018లో లండన్ ఇంపీరియల్ కళాశాలలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ సమయంలో ఆధునిక హైడ్రోజన్ వాయువుతో ఐదు రెట్లు వేగంతో నడిచే విమాన ఇంజిన్ల అభివృద్ధి మీద పరిశోధన చేశారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన పరిశోధనకు మెచ్చి 2021లో యంగ్ సెంటిస్ట్ అవార్డును ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆయన రాసిన ఆర్టికల్‌ను జనరల్ ఆఫ్ ప్లూయిడ్స్ మెకానిక్స్‌లో ప్రచురించారు. అదే ఏడాది ఇంగ్లాడ్ దేశ రాయల్ కుటుంబంచే నడపబడే రాయల్ కమిషన్ ఆయన ప్రతిభను గుర్తించి ప్రతిష్టాత్మకమైన రాయల్ ఫెలోషిఫ్ అవార్డును అందజేశారు. ఇటీవల బ్రిటన్æ రాణి ఎలిజిబెత్ కుమార్తె రాయల్ ప్రిన్సెస్ అన్నే డాక్టర్ ఎద్దుల సాయికుమార్‌రెడ్డిని కొద్దిరోజుల క్రితం ప్రెసిడెన్సియల్ విందుకు ఆహ్వానించి రాయల్ ఫెలోషిప్ అవార్డును అందించి ఘనంగా సత్కరించారు. అవార్డు దక్కించకునేందుకు తనకెంతో సహకరించిన తల్లిదండ్రులు, అత్తమామలు కుటుంబ సభ్యులు, స్నేహితులకు సాయికుమార్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తనను ప్రోత్సహించిన అన్న స్వర్గీయ సాయిసందీప్రెడ్డికి డాక్టరేట్‌ను అంకితం ఇస్తున్నానని తెలిపారు. చదవండి: (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కలిసిన మంత్రులు కాకాణి, అమర్నాథ్) -
చంద్రబాబు డైరెక్షన్.. కన్నా యాక్షన్
సాక్షి, కోవూరు: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాల కోరు. చంద్రబాబునాయుడు డైరెక్షన్లోనే ఆయన యాక్షన్ చేస్తున్నారు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడు గ్రామంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని, అలాంటి వ్యక్తి చేతికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ నాయకులంటే తమకు, తమ పార్టీ నాయకులకు గౌరవం ఉందన్నారు. అయితే లక్ష్మీనారాయణ వంటి వ్యక్తుల వల్ల ఆ గౌరవం సన్నగిల్లుతోందన్నారు. కన్నాకు గుంటూరులో రౌడీగా ముద్ర ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల విధివిధానాలను అపహాస్యం చేస్తూ కన్నా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఖజానాను ఖాళీ చేసి అప్పుల ఊబిని తమ పార్టీకి అప్పగించడం జరిగిందన్నారు. దానిని ఒక సవాల్‌గా స్వీకరించి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇతర దేశాల ప్రతినిధులతో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు లాంటి నీచరాజకీయాలు చేసే వ్యక్తితో కన్నా చేయి కలపడం దారుణమన్నారు. చంద్రబాబు, కన్నా వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమి ఒరగదన్నారు. ఎవరెన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీంతో లక్షలాదిమందికి లబ్ధి చేకూరుతుందన్నారు. సమావేశంలో కాటంరెడ్డి దినేష్‌రెడ్డి, ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, డి.నిరంజన్‌బాబురెడ్డి, మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, ఎస్కే అహ్మద్, సొసైటీ అధ్యక్షులు ములుమూడి సుబ్బరామిరెడ్డి, ఎస్.నరసింహులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
4.5 ఎకరాల చెరకు తోట దగ్ధం
రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం కోవూరు : విద్యుత్తు వైర్లు తెగిపడటంతో ఐదు ఎకరాల చెరకు తోట అగ్నికి ఆహుతైన సంఘటన మండలంలోని గంగవరంలో గురువారం చోటు చేసుకుంది. పందిళ్లపల్లి దయాకర్‌రెడ్డి గ్రామంలో 8 ఎకరాల్లో చెరకు పంట సాగు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో పంట మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు వైరు తెగి ఒక్కసారిగా తోటలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో దయాకర్‌రెడ్డి నెల్లూరు అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు తోట వద్దకు చేరుకొని మంటలు అదుపు చేశారు. కాలిపోయిన చెరకు ఎందుకు పనిరాకపోవడంతో రైతు అయోమయస్థితిలో ఉన్నాడు. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు. -
ట్రాక్టర్‌పై నుంచి పడి డ్రైవర్ దుర్మరణం
కొత్తూరు (ఇందుకూరుపేట): అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ ట్రాక్టర్‌పై నుంచి జారిపడి డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని కొత్తూరు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నాల్గో మైలు దొరంతోపు కాలనీకి చెందిన యాటగిరి హరి (40)ట్రాక్టర్లో ఇసుక, సిమెంట్‌ను తీసుకుని మండలంలోని పాములవారిపాళెంకు వచ్చాడు. వాటిని అన్లోడ్ చేసి తిరిగి నెల్లూరుకు వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను అతివేగంగా నడపడంతో జీవీకే చిన్మయ విద్యాలయం సమీపాన ఉన్న స్పీడు బ్రేకర్లు వద్దకు వచ్చే సరికి డ్రైవర్ హరి అదుపు తప్పి కింద పడ్డాడు. అతనిపై ట్రాక్టర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. -
హ్యాండ్ బ్యాగ్‌లో నగల చోరీ
కోవూరు : కుటుంబ సభ్యులందరూ గాఢనిద్రలో ఉండగా దుండగలు ఇంట్లోని హ్యాండ్ బ్యాగ్‌లోని వస్తువులు అపహరించారు. ఈ సంఘటన కోవూరు మండలంలోని చిన్నపడుగుపాడు నాగల కట్ట వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగింది. బాధితుల కథనం మేరకు.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల వరకు కుటుంబ సభ్యులందరూ మేలుకొని ఉన్నారు. బుధవారం ఉదయం నిద్రలేచి చూసే సరికి హ్యాండ్ బ్యాగ్‌లోని వస్తువులు అపహరణకు గురైన విషయాన్ని గుర్తించారు. బ్యాగ్‌లో పది సవర్ల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు, రూ.14 వేలు విలువ చేసే సెల్‌ఫోన్, రూ.5 వేలు నగదు ఉందని, బాధితురాలు ఎస్కే హఫిజిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎంటీఎం కార్డును బ్లాక్ చేశామన్నారు. ఎస్ఐ వెంకట్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఐడీ పార్టీ సిబ్బంది విజయప్రసాద్, కృష్ణ, సత్యం చోరీ జరిగిన ఇంటి పరిసరాల్లో గాలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ధి
కోవూరు: పరిశ్రమలు ఏర్పడితేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేలాయుధం తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం కోవూరు నియోజకవర్గ స్థాయి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నూతన పారిశ్రామికవేత్తలతో పాటు పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో బొడ్డువారిపాళెంలో 48 ఎకరాల స్థలాన్ని పరిశ్రమల కోసం కేటాయించామని వివరించారు. ఆరీఫ్ సంస్థ సహకారంతో మహిళలను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల పెట్టుబడుల్లో 35 నుంచి 45 శాతం వరకు రాయితీ ఇవ్వడమే కాకుండా నూరుశాతం సేల్స్ టాక్స్ రాయితీని ఇస్తుందన్నారు. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు పావలా వడ్డీతో పాటు విద్యుత్ రాయితీని కూడా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం నూతనంగా 2015 పరిశ్రమల ప్రణాళికను రూపొందించామన్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారి కోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సింగిల్ డెస్క్ విధానంలో మంజూరుచేసేలా చర్యలు తీసుకుటున్నామన్నారు. పరిశ్రమల అనుమతికి దరఖాస్తు చేసుకొన్న 21 రోజుల్లో అనుమతిని మంజూరు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమల శాఖ ఏడీ సురేష్, ఏపీఐఏసీ మేనేజర్ మునిరత్నం, బీమ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్‌బాబు, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ సుబ్బరాయులు, పరిశ్రమలశాఖ ఐపీఓలు ప్రసాద్, ఫణికుమార్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
కోవూరు: గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే క్రీడాకారుడి గొప్ప లక్షణమని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి టీ లవకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో హో ప్రాంగణంలో బుధవారం కబడ్డీ క్రీడాకారులకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42వ అంతర జిల్లాల రాష్ట్ర స్థాయి బాల,బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయన్నారు. క్రీడాకారులు పోటీల్లో సత్తాచాటాలని కోరారు. అనంతరం కోవూరు సబ్ రిజిస్ట్రార్ ఎన్ నాగేశ్వరరావు, ఎస్ఐ వెంకట్రావు మాట్లాడారు. యువతో విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అశోక్‌కుమార్, కోవూరు ఉపసర్పంచ్ ఇంతా మల్లారెడ్డి, సీనియర్ క్రీడాకారులు పూండ్ల జాన్సన్, తదితరులు పాల్గొన్నారు. జట్లు వివరాలు. బాలుర జట్టు : షేక్ ఫిరోజ్ ,కెప్టెన్ (లేగుంటపాడు), ఏ కళ్యాణ్, వీ సాయి (లేగుంటపాడు) ఏ కరుణాకర్ (చెర్లోపాళెం), వీ జనార్దన్ (కావలి), ఉదయ్ (కోవూరు) , ఐ కళ్యాణ్ (సోమరాజుపల్లె), కే రాజకుమార్ (కావలి), క్రాంతి (దువ్వూరు), సీహెచ్ ప్రదీప్(ముదివర్తి) సాయి (ముదివర్తి), శివకృష్ణ (కావలి). బాలికల జట్టు : షేక్ తహసీన్ (కెప్టెన్) (నెల్లూరు), ఈ.ఇందు (తడ), ఆర్.చెంగమ్మ( తడ), ఓ.వసుధ (ముదివర్తి) , ఎన్.మౌనిక(తడ), కే పద్మ (కావలి), డీమహిత (కోవూరు), జీ నిర్మల (వావిళ్ల), పీ సుకన్య (సీఎస్‌పురం), బీ రాజ్యలక్ష్మి (కోవూరు), కే జాగృతి(కోవూరు). -
లక్కీ డ్రా పేరుతో ఫోన్ కాల్
ఫోన్‌కు బదులు దేవుడి వస్తువులు నార్తురాజుపాళెం (కొడవలూరు) : లక్కీ డ్రాలో బహుమతి గెలుపొందారని ఫోన్ కాల్‌తో ఎర వేసి రూ.4 వేలు కాజేసిన ఉదంతం నార్తురాజుపాళెంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఉయ్యాల మధుసూదన్‌రావుకు పది రోజుల క్రితం 85108 52576 నంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము ఢిల్లీలోని శ్యామ్‌సంగ్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని, పూర్తి వివరాలు ఇస్తే పోస్టల్ ద్వారా రూ.15 వేలు విలువైన శ్యామ్‌సంగ్ జే–7 ఫోన్ పంపుతామని తెలిపారు. పార్శిల్ అందాక వారికి రూ.4 వేలు చెల్లించవచ్చని సూచించారు. పోస్టుద్వారా మధుసూదన్‌రావుకు ఒక పార్శిల్ రావడంతో డబ్బులు చెల్లించి తీసుకుని ఇంటికి వచ్చి ఆనందంగా తెరిచారు. అందులో బంగారు రంగు పూత వేసిన చిన్నచిన్న దేవుడి వస్తువులు ఉన్నాయి. తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసుల దృష్టికి తీసుకుపోయారు. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
రూ.7.32 లక్షల సొత్తు స్వాధీనం నిందితులిద్దరూ నీటి పారుదలశాఖలో లస్కర్లు కోవూరు : చోరీ కేసులో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల నుంచి రూ.7.32 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2016 మే 25వ తేదీన సూళ్లూరుపేట మహాదేవయ్యనగర్కు చెందిన ఉక్కు సురేష్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ధాన్యం దళారీ దగ్గర గుమస్తాగా పనిచేస్తూ పరిసర ప్రాంతాల్లోని రైతుల వద్దకు వెళ్లి వచ్చేవారు. సమీప ప్రాంతంలో ఉన్న రైసుమిల్లర్ల వద్ద నుంచి ధాన్యం డబ్బులు రూ.8 లక్షలు తీసుకుని తిరిగి సూళ్లూరుపేటకు బస్సులో బయల్దేరారు. ఈ విషయాన్ని నల్లగొండ జిల్లా నేరేడుచెర్లలో చెందిన మోహన్‌రెడ్డి, మిర్యాలగూడ ఇస్లాంపురానికి చెందిన నేరిళ్ల నరసింహ పసిగట్టారు. సురేష్‌ను వెంబడిస్తూ అతను బస్సు ఎక్కగా, వీరు కూడా బస్సులో బయల్దేరారు. ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉండగా, పసిగట్టిన దుండగలు ఇద్దరు బస్సు కొడవలూరు మండలం కమ్మపాళెం ప్రాంతానికి వచ్చే సరికి తెల్లవారు జామున 4 గంటల సమయంలో మోహన్‌రెడ్డి డ్రైవర్ వద్దకు వెళ్లి బూత్‌రూమ్‌కు వెళ్లాలని బస్సును ఆపాలని కోరడటంతో డ్రైవర్ బస్సును ఆపాడు. వెంటనే మరో వ్యక్తి నరసింహ సురేష్ వద్ద ఉన్న నగదు బ్యాగును తీసుకుని ఇద్దరు పారిపోయారు. సురేష్ కొడవలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించామన్నారు. నిందితులిద్దరూ నల్గొండ జిల్లా గరిడేపల్లిలో ఉన్నట్లు సమాచారం అందటంతో మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరు నేరేడుచెర్ల మండలంలో నీటిపారుదలశాఖలో లస్కర్‌గా పనిచేస్తూ క్రికెట్ బెట్టింగులు, పేకాట ఇతర వ్యసనాలకు బానిసై అప్పులు కావడంతో ఎక్కడ అప్పులు పుట్టక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన కోవూరు సీఐ మాధవరావు, కొడవలూరు ఎస్ఐ నారాయణరెడ్డి, పోలీసు సిబ్బంది సత్యం, కేవీ సుధాకర్, కృష్ణ, విజయప్రసాద్, రియాజ్, శ్రీనివాసులురెడ్డి, ఏ ప్రసాద్, వినోద్, రవిచంద్ర, పి.రమేష్‌బాబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు ప్రకటించేందుకు ఎస్పీకి సిపార్సు చేస్తామన్నారు. -
వ్యాను బోల్తా: క్లీనర్ మృతి
కోవూరు: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వరికోత మిషన్‌తో వెళ్తున్న వ్యాను బోల్తా పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన రామన్నపాళెం గేటు వద్ద మలిదేవి వంతెన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. అల్లూరు మండలం నార్తుమోపూరుకు చెందిన నన్నూరు గోపాల్ (23) వరికోత మిషన్‌కు సహాయకుడిగా వెళ్తుతున్నాడు. ఈ క్రమంలో మిషన్‌ను తీసుకుని మోపూరు నుంచి లేగుంటపాడుకు వెళ్తున్నారు. మలిదేవి వంతెన సమీపంలో వ్యాను అదుపు తప్పడంతో గోపాల్ ఒక్కసారిగా బయటకు దూకేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు వరికోత మిషన్ పైన పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఏఎస్సై మురళీమోహన్ తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
యోగా పోటీల్లో కోవూరు వాసుల ప్రతిభ
కోవూరు : ఇటీవల విశాఖపట్నంలో జరిగిన యోగా పోటీల్లో 35 ఏళ్లు పైబడిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో కోవూరుకు చెందిన ఈ.రమణయ్య ప్రథమ స్థానం, ఏ శ్రీనివాసులు 35 ఏళ్ల లోపు విభాగంలో ప్రథమ స్థానం సాధించారని యోగా గురువు గోళ్ల రమణయ్య తెలిపారు. కోవూరులో ఆయన మంగళవారం మాట్లాడారు. యోగా అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ శ్యాప్ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరుకు చెందిన పలువురు పాల్గొన్నారన్నారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క యోగా వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఈ విషయాన్ని 192 దేశాలు గుర్తించి యోగాను ఆచరిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని యోగాను సాధన చేయాలని ఆయన కోరారు. కోవూరు టీఎన్సీ కళాశాలలో చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కేంద్రంలో యోగా సాధన చేస్తున్న ఎంతో మంది రాష్ట్ర స్థాయిలో వివిధ పతకాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. విజేతలను యోగా జాతీయ కార్యదర్శి మనోహర్, స్వామిజీ యోగానంద్ భారతి, రాష్ట్ర కార్యదర్శి రామారావు ప్రతిభ పురస్కారాలు అందుకుని ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు చేపట్టారు. -
రూ.62.15 కోట్లతో కళాశాలల అభివృద్ధి
కోవూరు: రాష్ట్రంలో ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.62.15 కోట్లు మంజూరు చేసిందని ఆర్జేడీ వై.పరంధామయ్య తెలిపారు. కోవూరు టీఎన్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేసేందుకు నూతనంగా ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్లు్య కోర్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈ కోర్సులను ఇప్పటికే ఆత్మకూరు, నెల్లూరు, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట, కావలి ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. ఎంఎల్టీ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి కళాశాలకు కంప్యూటర్లను అందచేశామన్నారు. త్వరలో శ్రీ సిటీకి అనుసంధానంగా ఒక వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. ఏ కళాశాలకు ఎన్ని నిధులంటే.. కోవూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల రూ.1.50 కోట్లు, దామరమడుగు రూ.62లక్షలు, దగదర్తికి రూ.1.28 కోట్లు, మనుబోలు రూ.1.85కోట్లు వెంగమాంబ పురం రూ.1.90కోట్లు, రాపూరు రూ.1.90 కోట్లు నాబార్డు కింద విడుదలకు సంబం«ధించి ఆదేశాలు కూడా వచ్చాయన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్ 3లో 120 జూనియర్ అధ్యాపక పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. వీటి స్థానంలో గెస్ట్ అధ్యాపకులతో భర్తీ చేయాలని సూచించామన్నారు. అందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. కళాశాలలో శిథిలావస్థకు చేరుకొని ఉన్న గదులను ఆయన క్షుణంగా పరిశీలించారు. అనంతరం కళాశాల అధ్యాపక సిబ్బంది ఆర్జేడీ పరంధామయ్యను సన్మానించారు. కార్యక్రమంలో వి.వెంకటసుబ్బయ్య, అధ్యాపకులు సురేష్, వెంకటేశ్వర్లు, రాఘవయ్య, విష్ణువర్థన్, గోపి, సతీష్, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సురేష్ పాల్గొన్నారు. -
మామిడి తోరణాలు కట్టేందుకు ప్రయత్నిస్తూ..
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు మృతులు కావలి ప్రాంత మత్స్యకారులు పండుగనాడు విషాదం కోవూరు : పండుగనాడు ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వినాయకుడి ప్రతిమ ఏర్పాటుచేసిన చోట పచ్చని తోరణాలు కట్టేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు యువకులు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన కోవూరులో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కావలి రూరల్ ప్రాంతమైన అన్నగారిపాళెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న లక్ష్మీపురం మత్స్యకార గ్రామానికి చెందిన బత్తాని రామకృష్ణ (24), పెద్దపట్టపాళెం పంచాయతీ పరిధిలో ఉన్న చిన్నపట్టపుపాళెం చెన్నెయపాళెంకు చెందిన యల్లంగారి పార్వతయ్యలు(24) (చంటి), విడవలూరు రామచంద్రాపురం మత్స్యకార గ్రామానికి చెందిన పామంజి సుబ్రహ్మణ్యంలు కోవూరు ఇనమడుగు సెంటర్లో ఉన్న రాజరాజేశ్వరి ఐస్ ఫ్యాక్టరీలో రొయ్యలను ప్యాకింగ్ చేసేందుకు కూలీలుగా పనిచేస్తున్నారు. చవితి సందర్భంగా ఫ్యాక్టరీ ఆవరణలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటుచే శారు. పై ముగ్గురు ఫ్యాక్టరీ గేట్ ముందు మామిడాకుల తోరణాలు ఏర్పాటుచేసేందుకు ఒక ఇనుపపైనును నిల»ñ ట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఫ్యాక్టరీ ముందువెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లకు ఇనుపపైపు తగిలి ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న ఓ వాహనంలో నెల్లూరుకు తరలిస్తుండగా రామకృష్ణ, పార్వతయ్యలు మార్గమధ్యలో మృతిచెందారు. సుబ్రహ్మణ్యం నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలం పరిశీలన విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందిన విషయం తెలుసుకున్న సీఐ మాధవరావు, ఎస్సై వెంకట్రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు తెలుసుకుని రామకృష్ణ, పార్వతయ్యల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏఎస్ఐ మురళీమోహన్ పోస్టుమార్టానికి సంబంధించిన నివేదిక తయారుచేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే విద్యుత్‌శాఖ ఏడీ యుగంధర్ తన సిబ్బందితో ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని పరిశీలించారు. మిన్నంటిన రోధనలు రామకృష్ణ, పార్వతయ్యల మృతితో వారి గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. చేతికి అందివచ్చిన వారు పండుగరోజు మృత్యువాతపడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పార్వతయ్య సోదరుడు చనిపోవడంతో అతని తల్లిదండ్రులు యల్లంగారి జయరామయ్య, బుజ్జమ్మలకు చేదోడువాదోడుగా ఉన్నాయి. ఈ క్రమంలో పార్వతయ్య మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
కూలీ పనులకు వెళ్తూ..
కానరాని లోకాలకు కారు అదుపు తప్పి భర్త మృతి ప్రాణాలతో బయటపడిన భార్యా పిల్లలు కోవూరు : విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఎదుగుతూ పది మందికి సహాయ పడుతుండటం చూసి సహించలేకపోయింది. ఎన్నో కష్టాలు పడి కుదురుకుంటున్న కుటుంబ యజమానిని రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ దురదృష్ట సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై భారత్‌బెంజ్ షోరూం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని సూదరగుంట రామాపురానికి చెందిన ఎద్దు ఏడుకొండలు (34) బెంగళూరులో కూలీలను తీసుకుని వెళ్లి బేల్దారి పనులు చేయించేవాడు. ఇటీవల రామాపురంలో జరిగిన ఓ వివాహానికి ఏడుకొండలు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చాడు. శనివారం రాత్రి ఏడుకొండలు భార్య అంకమ్మ, మూడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెతో పాటు తండ్రి చెన్నయ్య, సమీప బంధువు చలమయ్యతో కలిసి బెంగళూరుకు బయలుదేరారు. పడుగుపాడు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుకొండలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మిగిలిన వారికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై అళహరి వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరిని బతికించేందుకు.. కారు నడుపుతున్న ఏడుకొండలు ప్రమాదంలో అందరిని బతికించేందుకు తాను ప్రాణాలను పణంగా పెట్టాడు. కారు అదుపు తప్పిన సమయంలో ఏడుకొండలు బయటకు దూకేసి ఉంటే కారు పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తాపడేది. దీంతో పెనుప్రమాదం జరిగేది. అయితే ఏడుకొండలు అప్రమత్తమై కారు కంట్రోల్ చేస్తూ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన ఇనుపు కంచెను ఢీకొన్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బోల్తా పడటంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. మమ్మల్ని బతికించి నువ్వు దూరమయ్యావా... మమ్మల్ని బతికించేందుకు నీవు దూరమయ్యావా అంటూ ఏడుకొండలు భార్య అంకమ్మ రోదిస్తూ విలపిస్తుంది. ఇద్దరు బిడ్డలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న తీరను చూసిన స్థానికులను కలిచివేసింది. ఏడుకొండలకు భార్యతో పాటు నలుగురు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. -
మూడు లారీల ఢీ
కోవూరు : మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఓ లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన స్థానిక జాతీయరహదారి తూర్పు అరుంధతీయవాడ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణపట్నం పోర్టు నుంచి కడపకు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఇచ్చాపురాని వరినాటే యంత్రాన్ని తీసుకుని వెళ్తున్న లారీ వేగంగా ఢీకొంది. దీంతో బొగ్గు లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో బొగ్గు లారీడ్రైవర్ ఆకుల రవిబాబు (39) అక్కడికక్కడే మృతి చెందారు. అదే లారీ క్లీనర్ తాడిపర్తికి చెందిన ప్రతాప్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఇచ్చాపురానికి వరినాటే యంత్రాలు తీసుకెళ్లే లారీలో ఉన్న శివకుమార్‌కు రెండు కాళ్లు విరిగాయి. క్షతగాత్రులిద్దరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న అళహరి వెంకట్రావు ఏఎస్ఐ మురళి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రహదారికి అడ్డంగా ఉన్న లారీలను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. రవిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి దారుణ హత్య
చంపేసి..ముఖం చెక్కేసి.. కాలువలో కుక్కేసి జిల్లేడు కొమ్మలతో కప్పేశారు కోవూరు : గుర్తు తెలియని ఓ యువతి (30) దారుణ హత్యకు గురైంది. చంపేసి.. ముఖం చెక్కేసి కాలువలో కుక్కేశారు. పైన జిల్లేడు కొమ్మలతో మృతదేహం కనపడకుండా కప్పేశారు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని పడుగుపాడు సమీపంలో సాయి ఎన్క్లేవ్ లే అవుట్లో వెలుగుచూసింది. నిర్మానుష్యమైన ఈ ప్రాంతంలో మృతదేహం పడి ఉండటంతో ఎవరూ గుర్తించలేకపోయారు. శుక్రవారం అటుగా వాకింగ్‌కు వెళ్తున్న కొందరికి సమీపంలో దుర్గంధం రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా యువతి మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ మాధవరావు, ఎస్ఐ వెంకట్రావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా దారుణంగా చెక్కేసి ఉంది. మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి రెండు..మూడు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. మృతురాలు పింక్, గ్రీన్ కలర్స్ టాప్, పింక కలర్ ఫ్యాంట్, వైట్ చున్నీ ధరించి ఉంది. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు యువతి హత్యోదంతాన్ని ఛేదించేందుకు నెల్లూరు నుంచి బిందు అనే జాగిలంతో తనిఖీలు చేపట్టారు. జాగిలం మృతదేహం ఉన్న దగ్గర నుంచి దాదాపు 300 మీటర్లు పరిధిలో జాతీయ రహదారిపైన లే అవుట్ పరిసర ప్రాంతాల్లో సంచరించింది. దీన్ని బట్టి పరిశీలిస్తే మృతురాలిని బయట ఎక్కడైనా హత్య చేసి ఇక్కడకు తీసుకు వచ్చి ఎవరికి అనుమానం రాకుండా లే అవుట్లో ఉన్న సైడు కాలువలో తొక్కిపెట్టి జిల్లేడు చెట్లు వేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిపై అఘాయిత్యం చేసి అనంతరం హత్య చేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్ టీం మృతదేహంపై ఉన్న వేలిముద్రలను సేకరించింది. మృతదేహం పరిసర ప్రాంతాల్లో పడి ఉన్న రెండు మద్యం బాటిళ్లు, డిస్పోజల్ గ్లాస్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం తర్వాతనే ప్రాథమిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మూడిళ్లల్లో చోరీలు
రూ.60 వేలు నగదు, 12 సవర్ల బంగారు అపహరణ కోవూరు: ఇళ్లల్లో ఎవరూ లేరని పసిగట్టిన దుండగులు ఆదివారం అర్ధరాత్రి మూడిళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. రూ.60 వేలు నగ దు, 12 సవర్ల బంగారు అపహరించారు. చిన్నపడుగుపాడు ప్రాంతానికి చెందిన లఘతోటి నరసమ్మ ఇంటికి తాళం వేసి మిద్దెపై నిద్రపోతున్న సమయంలో దుం డగులు ఇంటి తలుపులు పగుల కొట్టి బీరువాలో ఉన్న రూ.40 వేలు నగదుతో పాటు 5 సవర్ల బంగారు ఆభరణాలు అపహరిం చారు. సమీపంలోనే ఉన్న అంబటి రాజేష్ కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ వివాహానికి వెళ్లగా దుండగలు ఆ ఇంటి తలుపులు పగులకొట్టి రెండు సవర్ల బంగారు వస్తువులు అపహరించారు. ఎన్టీఎస్ గేటు ఎదురుగా ఉన్న బడికాల శ్రీనివాసులు అల్లూరులోని వివాహానికి వెళ్లగా ఆ ఇంట్లో కూడా దుండగలు ప్రవేశించి రూ.10,500 నగదుతో పాటు 5 సవర్ల బంగారు వస్తువులను తీసుకువెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. ఎస్ఐ అళహరి వెంకట్రావు సంఘటన స్థలాలను పరిశీలించారు. క్లూస్‌టీం ఏఎస్ఐ శరత్‌బాబు చోరీ జరిగిన ఇళ్లల్లో దుండగలు వేలిముద్రలు సేకరించారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్నాలో దూకి వివాహిత ఆత్మహత్య
పోతిరెడ్డిపాళెం(కోవూరు) : మండలంలోని పోతిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన బొజ్జ కవిత (26) పెన్నానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కవిత సోమవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎక్కడికి వెళ్లిందో తెలియక భర్త శ్రీకష్ణ పలు ప్రాంతాల్లో వెతికాడు. ఆచూకీ తెలియకపోవడంతో తెలిసిన వారి దగ్గర వాకబు చేశాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పోతిరెడ్డిపాళెం ఎంప్లాయీస్ కాలనీవద్ద పెన్నానదిలో శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకట్రావ్ సంఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కవిత మతికి గల కారణాలు తెలియరాలేదు. అప్పులబాధతో.. ఇందుకూరుపేట (విడవలూరు) : అప్పుల బాధతో ఇందుకూరుపేట మండలంలోని కొరుటూరు గ్రామానికి చెందిన షేక్ రంతుల్లా (45) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు..రంతుల్లా వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాడు. స్థోమతకు మించి అతను అప్పులు చేశాడు. ఈ క్రమంలో బాకీలు చెల్లించాలని అప్పులిచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. మంగళవారం ఇంట్లో కుటుంబసభ్యులు లేని సమయంలో రంతుల్లా ఉరి వేసుకుని మతిచెందాడు. మతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీస్‌లకు సమాచారంలేదు. -
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి
కోవూరు : త్వరలో జరగబోయే పాఠశాల అభివద్ధి కమిటీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎంఈఓ జగన్నాథశర్మ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మండల పరిధిలోని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎస్ఎంసీ ఎన్నికలపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఈనెల 20 నుంచి 26వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఒక్కొక్క తరగతికి ముగ్గురు సభ్యుల చొప్పున ఎంపిక చేసి ఎంపికైన సభ్యులందరి చేత చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకోవాలన్నారు. ఓటర్ల జాబితాను ముందుగానే పాఠశాల వద్ద ప్రచురింపజేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలు జరిగే రోజు పాఠశాలల్లోనే నామినేçషన్ దాఖలు చేసుకోవచ్చనన్నారు. ఎన్నికలు 7 నుంచి 1 గంట లోపు నిర్వహించాలని, మూడు గంటలకు చైర్మన్ ఎన్నిక జరపాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా హెచ్ఎంలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
కోవూరు : నెల్లూరు జిల్లా కోవూరులో కరెంట్ షాక్‌తో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. మైథిలి సెంటర్లో ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆదివారమైనా పనికి రావాలని ఒత్తిడి చేయడంతో శ్రీకాంత్ అనే కార్మికుడు (20) కూలీ పనులకు వెళ్లాడు. భవనం పక్కనే విద్యుత్ తీగలు ఉన్నాయి. కమ్ములు తీస్తున్న సమయంలో విద్యుత్ తీగలను తాకడంతో షాక్‌కు గురై శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మిగతా కార్మికులు ఆందోళన చేశారు. -
రాష్ర్ట స్థాయి ఎండ్లబండ్ల పోటీలు
-
లెక్చరర్ కొట్టాడని విద్యార్థులు ఆందోళన
నెల్లూరు : కళాశాల లెక్చరర్ కొట్టాడనే కారణంతో కోవూరులోని గీతాంజలి కాలేజీ ఎదుట గురువారం విద్యార్ధులు ఆందోళకు దిగారు. గీతాంజలి కాలేజీలో బుధవారం ఇంటర్నల్ ఎక్జామ్స్ జరిగాయి. బీటెక్ ట్రిపుల్ఈ రెండో సంవత్సరం విద్యార్థి సంతోష్ కుమార్ పరీక్ష రాసి పేపర్ ఇచ్చేశాడు. ఇంకా సమయం ఉంది అక్కడే కూర్చో అని ఇన్విజిలేటర్ ప్రణయ్ కుమార్ సదరు విద్యార్థికి చెప్పాడు. సంతోష్ తన పేపర్‌ను పక్కన పెట్టి అలాగే సీట్లో కూర్చున్నాడు. అయితే పక్కన పెట్టిన పేపర్‌ను వెనకాల విద్యార్థి కాపీ చేయడాన్ని లెక్చరర్ గుర్తించాడు. ఆ క్రమంలో సదరు ఇద్దరు విద్యార్థులను మందలించాడు. ఈ విషయంలో లెక్చరర్ తమపై చేయి చేసుకున్నాడని, లెక్చరర్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు గురువారం తరగతులను బహిష్కరించారు. తోటి విద్యార్థులతో కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.