labour
-
గిగ్ వర్కర్లకూ ‘ఈ–శ్రమ్’తో భద్రత
సాక్షి, అమరావతి: ‘విజయవాడకు చెందిన సంతోశ్‌కు తాను చేస్తున్న ఉద్యోగంలో వచ్చే నెల జీతం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రైడ్ యాప్‌ల గురించి తెలుసుకుని పార్ట్‌టైమ్‌గా పనిచేసేందుకు వాటిలో రిజిస్టర్ చేయించుకున్నాడు. సంతోశ్‌ను ఒక వ్యక్తి తనను ఎయిమ్స్ వరకు తీసుకెళ్లాలని యాప్ ద్వారా సంప్రదించాడు. సరేనని తీసుకెళ్లాక.. నిర్మానుష్య ప్రదేశంలో సంతోశ్‌పై దాడిచేసి సెల్‌ఫోన్, నగదు, బంగారం దోచుకెళ్లాడు. ఆ షాక్ నుంచి బయటపడటానికి సంతోశ్‌కు చాలా కాలం పట్టింది’.. ఇది కేవలం ఒక్క సంతోశ్ అనుభవం మాత్రమే కాదు.. వేలాది మంది గిగ్ వర్కర్లు నిత్యం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా తగిన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమాతో పాటు ఎన్నో ప్రయోజనాలుమన దేశంలో ప్రస్తుతం 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు పెరుగుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా. ఒక్కో కార్మికుడు వారానికి ఐదు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తే నెలకు దాదాపు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు సంపాదించవచ్చు. అయితే వీరికి సామాజిక భద్రత అనేది ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోంది. అందుకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించింది. అందులో భాగంగా ముందుగా గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్య బీమా లభిస్తుంది. నిరుద్యోగ భృతి, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా వంటి ఇతర సౌకర్యాలూ లభిస్తాయని కేంద్రం చెబుతోంది. కార్మికుల వివరాలు నమోదు చేయాల్సిందిగా ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలకు కేంద్రం సూచించింది. నమోదు ఇలా.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డ్–2024ను ప్రారంభించింది. దరఖాస్తుదారులందరికీ రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ–శ్రమ్ కార్డు సహాయంతో 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.3,000 పెన్షన్ కూడా లభిస్తుంది. ఆన్లైన్లో eshram.gov.in ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, పాన్, రేషన్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, తాజా విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, ఐఎఫ్ఎస్సీ కోడ్‌తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దరఖాస్తుకు సంబంధించి ఏదైనా సహాయం కోసం ఫోన్ నంబర్ 011–23710704ను సంప్రదించవచ్చు. -
మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’?
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’ అమలు కానుందా? జాతీయ స్థాయిలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార సమస్య ల పెరుగుదలతో కొత్త రూపంలో ఈ పథకాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నాయనే చర్చ అధికార వర్గాల్లో జరుగు తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈఎస్) కింద చేసే ఉపాధి పనులకు ఇచ్చే కూలీలో కొంత (పార్ట్ పేమెంట్) బియ్యం ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన నిల్వలు..: గతేడాది బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషే ధం, పారాబాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీ వంటి చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలతో దేశంలో బియ్యం నిల్వలు 1.4 కోట్ల టన్నులకు చేరుకోవడంతో గిడ్డంగి ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ‘పనికి ఆహార పథకం’కింద గ్రామీణభివృద్ధి శాఖకు బియ్యం కేటాయింపును ఒక మార్గాంతరంగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వివిధ కాంబినేషన్లు, రూపాల్లో దీన్ని ఇచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. ప్రయోజనం ఉండదంటున్న నిపుణులు కూలీ మొత్తంలో కొంత భాగాన్ని బియ్యంగా ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కూలీలు ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొనే ఆస్కారం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి రావడానికి ముందు ‘పనికి ఆహార పథకం’కింద అనేక అక్రమాలు, కుంభకోణాలు జరిగిన తీరును గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘ఫుడ్ ఫర్వర్క్ స్కీం’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకోవడం, ఈ పథకం కింద కేటాయించిన బియ్యం నేరుగా బహిరంగ మార్కెట్‌కు చేరుకోవడం వంటివి జరిగిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. అదీగాకుండా ఉపాధి హామీ పథకం కింద కూలీని నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండటం, ఇచ్చే బియ్యానికి లెక్క కట్టడం, ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయని చెబుతున్నారు. -
గుడారాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు కూలీలు మృతి
పనాజీ: గోవాలో బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తూ అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనున్న గుడారాల్లోకి దూసుకెళ్లింది. శనివారం(మే25) రాత్రి పనాజీకి దక్షిణాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్నా పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుడారాల్లో నిద్రిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు నలుగురు దినసరి కూలీలని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు మొత్తం మూడు గుడారాల్లో తొమ్మిది మంది ఉన్నారు. రోడ్డు పనులు చేయడం కోసం కూలీలు బీహార్ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఒక కంపెనీ ఉద్యోగులకు చెందిన బస్సు ఈ ప్రమాదానికి కారణమైంది. ప్రమాదం కారణంగా బస్సులో ఉన్నవారెవరికీ ఏమీ కాలేదు. -
ప్రపంచం చూపు.. భారత్ వైపు..!
ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్తులో ఇతర దేశాలు శ్రామికశక్తికోసం యువకులు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాలవైపు చూసే పరిస్థితులు ఏర్పడవచ్చని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ ఉపాధ్యక్షుడు, బిజినెస్ హెడ్ ధృతి ప్రసన్న మహంత ఇటీవల తెలిపారు. ప్రపంచానికి నిపుణులైన కార్మికులను అందించే సత్తా భారత్‌కు ఉందని చెప్పారు. దశాబ్దం క్రితం భారత్ నుంచి ఉపాధి కోసం, ఇతర కారణాల వల్ల కార్మికులు పలు దేశాలకు వలస వెళ్లేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ప్రపంచ దేశాలకు నిపుణుల కొరత తీర్చేలా భారత్ సన్నద్ధం అవుతోందని మహంత చెప్పారు. అందులో భాగంగానే ప్రపంచంలోని నిపుణుల కొరత తీర్చడానికి ప్రస్తుతం ఇతర దేశాలకు పయనం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి శ్రామికశక్తిలో భారత కార్మికులు దాదాపు 15 శాతం ఉండడం గమనార్హం. రానున్న ఐదేళ్లలో భారత కార్మికులు ఇతర దేశాలకు వెళ్లడం 28-30శాతం పెరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా ఎక్కువగా ఐటీ, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ప్లబింగ్, మెకానిక్, ఆతిథ్యం, సేల్స్ రంగాల్లో నిపుణులకు, కార్మికులకు గిరాకీ ఏర్పడుతుందని అంచనా వేశారు. ఇదీ చదవండి: భారత్‌లో ‘యాపిల్’ ఇళ్ల నిర్మాణం..? భారత్‌లో 15-65 ఏళ్ల వయసు వారు సుమారు 55.4 కోట్ల మంది ఉన్నారని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, యూకే, స్వీడన్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూఎస్ఏ, జపాన్, మలేషియా తదితర దేశాల్లో భారతీయ కార్మికులకు గిరాకీ పెరుగుతోందని మహంత చెప్పారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా దాదాపు లక్ష మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా 13,944 మందిని, ఖతార్ 3,646 మంది, యూఏఈ 2,941 మంది భారత నిపుణులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. -
ఒకప్పుడు రోజు కూలీ..నేడు యూట్యూబ్ స్టార్‌గా..!
నాడు ఆ వ్యక్తి రోజు కూలీగా కటిక దారిద్య్రం అనుభవించేవాడు. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అలాంటి స్థితోలో అనుకోని అతిథిలా వచ్చిపడినా కరోనా మహమ్మారితో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. కనీసం కుటుంబాన్ని పోషించలేని దారుణమైన స్థితిలోకి వచ్చేశాడు. అయిపోంది జీవితం అనుకునే టైంలో "యూట్యూబ్" ఓ ఆశా కిరణంలా అతడి లైఫ్‌లోకి వచ్చింది. అంతే అక్కడ నుంచి అతడి జీవితమే మారిపోయింది. ఈ రోజు ఏకంగా నెలకు రెండు లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడెవరు? అతని యూట్యూబ్ ప్రస్థానం ఎలా సాగిందంటే..? ఒడిశాకు చెందిన ఇశాక్ రోజు వారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ చాలీచాలని సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. రోజుకి అతికష్టం మీద 250 రూపాయలు సంపాదించేవాడు. ఇంతలో కరోనా మహమ్మారి కారణం ఆ సంపాదన కూడా లేకుండా పోయింది. పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా అయిపోయింది. ఏంచేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో యూట్యూబ్ ఓ వరంలా అతడి జీవితంలోకి వచ్చింది. యూట్యూబ్ ఛానెల్‌తో డబ్బులు సంపాదించొచ్చు అనే విషయం తెలుసుకుని వీడియోల చేయడంపై దృష్టి సారించాడు. ఒడియా వంటకాలతో అలరించాలనుకున్నాడు. తమ సంప్రదాయ వంటకాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. అయితే మొదట్లో అతడి వీడియోలు ఎవ్వరూ చూసేవారు కాదు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒడిశాలో బాగా ఇష్టపడే పులియబెట్టిన అన్నం అయిన బాసి పఖాలా వీడియో బాగా ప్రేక్షకాధరణ పొంది వైరల్ అయ్యింది. అంతే అక్కడ నుంచి అతని వీడియోలు బాగా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగి అతని ఫాలోవర్ల సంఖ్య 20 వేలకు చేరింది. ఇక యూఎస్, బ్రెజిల్, మంగోలియా దేశాల వాళ్లు కూడా ఇతని వీడియోలను ఆదరించడంతో ఒక్కసారిగా ఓవర్ నైట్‌స్టార్ అయ్యిపోయాడు. ది బెటర్ ఇండియా వంటి ప్రముఖ వెబ్సైట్లు మీడియా అతడి గురించి రాయడంతో మరింత ఫేమస్ అయ్యాడు. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ రేడియో షోలో అతడి గురించి ప్రస్తావించడమే గాకుండా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆ యూట్యూబ్ స్టార్ ఇశాక్ మాట్లాడుతూ..ఈ రోజు నా వీడియోలు బాగా వెళ్తే గనుకు నెలకు దాదాపు రూ. 3 లక్షల దాక సంపాదించగలనని దీమాగా చెబుతున్నాడు. దీనివల్ల వీడియో ఎడిట్ చేసేందుకు ల్యాప్‌టాప్ కొనుక్కున్నాను, ఉపయోగించడం తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే ఓ సెకండ్ హ్యాండ్ కారుని కూడా కొనుక్కోగలిగానని ఆనందంగా చెప్పాడు. అలాగే నా కుటుంబాన్ని ఈ రేంజ్లో చూసుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదంటూ బావోద్వేగంగా మాట్లాడాడు ఇసాక్. (చదవండి: ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్!) -
‘గుర్తింపు’ ముందు అనేక సవాళ్లు!
పెద్దపల్లి: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సంస్థలో ఏడోసారి జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీపై 1,983 ఓట్ల మెజారిటీతో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరకు విజయాన్ని ౖకైవసం చేసుకుంది. సంస్థ వ్యాప్తంగా ఆరు ఏరియాల్లో ఐఎన్టీయూసీ, ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచాయి. ఈక్రమంలో ప్రధాన డిమాండ్ల సాధన బాధ్యత గెలిచిన యూనియన్‌పై సవాల్ విసురుతోంది. సొంతింటి పథకం, మారుపేర్ల మార్పు, నూతన భూగర్భగనుల తవ్వకం తదితర డిమాండ్ల సాధన అంతసులువు కానప్పటికీ.. పోరాటాల చరిత్ర కలిగిన గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ భవిష్యత్‌లో ఎలా ముందుకు సాగుతుందోనని సింగరేణి కార్మికులను ఆలోచింపజేస్తోంది. ఏఐటీయూసీ ఎన్నికల మెనిఫెస్టో ఇదీ.. సింగరేణిలో రాజకీయ జోక్యం నియంత్రిస్తాం. ఆర్థిక దుబారాను అరికడతాం. కోలిండియా మాదిరిగా పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తోంది. కార్మికుల పిల్లల ఉద్యోగ వయోపరిమితి 35ఏళ్ల నుంచి 40ఏళ్లకు పెంచుతాం. సొంతింటి పథకం కింద 250గజాల ఇంటి స్థలం, రూ.20లక్షల వడ్డీలేని రుణం మంజూరు చేయిస్తాం. నూతన భూగర్భగనులు తవ్వించి ఉద్యోగాలు పెంచడం బొగ్గు వెలికితీసే ప్రాంతాల్లో కాంట్రాక్టు కార్మికులను తొలగించి పర్మినెంట్ కార్మికులను నియమించడం. మైనింగ్‌స్టాఫ్, ట్రేడ్స్‌మెన్, ఈఅండ్ఎం సూపర్వైజర్లు, ఈపీ ఆపరేటర్లకు సర్ఫేస్‌లో అదే హోదా కల్పన. ప్లేడే, పీహెచ్‌డీలకు ఎన్–వన్ విధానం తొలగించి పాత పద్ధతి కొనసాగిస్తాం. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు డబ్బులు లేకుండా అందరికీ అన్‌ఫిట్ చేయిస్తాం సంస్థ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చి సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించేలా కృషి చేస్తాం. సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యా బోధన అందుబాటులోకి తెస్తాం. సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు డస్ట్ అలవెన్స్ ఇప్పిస్తాం. రిటైర్డ్ రోజునే కార్మికులకు టర్మినల్ బెనిఫిట్స్ అందేలా చూస్తాం. చదువుకున్న కార్మికులకు సూటబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తాం. మహిళా కార్మికులను భూగర్బగనుల్లోకి దింపకుండా చూస్తాం. అన్నిఏరియాల్లో కార్మికులకు డబుల్‌బెడ్‌రూమ్‌లు ఇచ్చేలా చూస్తాం. క్యాంటీన్లలో నాణ్యమైన టిఫిన్స్ అందించేలా చూస్తాం. గని ప్రమాదాల్లో ఇంక్రిమెంట్లు కోల్పోయిన వారికి వన్‌టైం సెటిల్మెంట్కింద ఇంక్రిమెంట్ ఇప్పిస్తాం. తెలంగాణ ఇంక్రిమెంట్ బేసిక్‌లో కల్పించేలా చూస్తాం. సింగరేణి డీఎంఎఫ్ఐటీ, సీఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేసేలా చూస్తాం. మారుపేర్ల కార్మికులను సొంత పేర్లపై రెగ్యులరైజ్ చేసేలా చూస్తాం. 2022లో జరిగిన 9డిమాండ్ల ఒప్పందం అమలయ్యేలా చూస్తాం. కార్మికుల పక్షాన పోరు! మాపై నమ్మకంలో ఎన్నికల్లో గుర్తింపు యూనియన్‌గా గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు. వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చుతాం. పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ, సొంతింటి కల నెర వేర్చుతాం. మారుపేర్లతో నిలిచిపోయిన డిపెండెంట్ ఉద్యోగాలను వన్‌టైం సెటిల్మెంట్ కింద క్లియర్ చేసేలా చూస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా దృష్టి సారిస్తాం. – సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ -
మారు పేర్లు మారేదెప్పుడు? చిక్కుముడి వీడేదెప్పుడు?
పెద్దపల్లి, గోదావరిఖని: రామయ్య(పేరు మార్చబడింది)అనే కార్మికుడికి కంటిచూపు మందగించింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే కళ్లు పరీక్షించి మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. అతడి సొంత కుమారుడికి ఆ ఉద్యోగం ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం ససేమిరా అంటోంది. ఊర్లో ఒకపేరు, గనిపై మరోపేరు ఉండటంతో ఇలా నాలుగేళ్లుగా సతాయిస్తోంది. ఆ యువకుడికి ఉద్యోగం లేక, పట్టుపైసా(గ్రాట్యుటీ) రాక ఆ కుటుంబం అప్పులపాలైంది. ఈచిక్కుముడి విప్పేందుకు అప్పటి సీఎం కేసీఆర్ కార్మికుల సభ సాక్షిగా మారుపేర్ల మార్పునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి రామయ్యలు సింగరేణిలో 600మందికిపైగా ఉన్నారు. నిరక్షరాస్యులు కావడంతో.. సుమారు 40ఏళ్ల క్రితం ఊళ్లో ఏ పేరు ఉందో, బొగ్గు గనిపై ఏ పేరు ఉందో కార్మికులకు ఎవరికీ తెలియదు. నిరక్షరాస్యులు కావడంతో తమ పేర్ల గురించి కార్మికులు ఏనాడూ రికార్డుల్లో పరిశీలన చేసుకోలేదు. ఇలా కాలం గడిచి పోయింది. ఇప్పుడు సింగరేణిలో కంప్యూటర్ యుగం వచ్చింది. ఆ నాటి పేరుతో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. అనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా తన తండ్రి పేరులో అక్షరదోషం ఉందనేసాకుతో తమ పిల్లలకు ఉద్యోగాలివ్వడం అంశాన్ని పక్కన బెట్టారు. ఇలా ఇప్పటివరకు కొత్తగూడెం కార్పొరేట్ విజిలెన్స్ విభాగం కార్యాలయంలో 600కు పైగా కేసులు పేరుకుపోయాయి. గత గుర్తింపు యూనియన్ ఈవిషయంపై అప్పటి సీఎం, ప్రస్తుత సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. భవిష్యత్‌పై హామీ ఇవ్వాలి.. మెడికల్ ఇన్వాలిడేషన్‌లో విజిలెన్స్ విచారణ పేరుతో నిలిచిపోయిన సింగరేణి సంస్థలోని సుమారు 600మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. మారుపేర్ల మార్పు అంశం తెరపైకి వచ్చినా ఆచరణ రూపం దాల్చకపోవడంతో ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉన్న కార్మిక సంఘాలు, అధికార పార్టీ నేతలు.. కార్మికులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే..
ఉత్తరకాశీ టన్నెల్ నుండి సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులను ప్రభుత్వం ఆర్మీకి చెందిన హెలికాప్టర్లో రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించింది. ఈ కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు, మానసిక పరీక్షలు చేసిన తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఎయిమ్స్‌కు కార్మికులు చేరుకోకముందే ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్ హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే, ఆరోగ్య కార్యకర్తలు.. కార్మికులను ఆరోగ్య పరీక్షల కోసం అంబులెన్స్‌లు, వీల్చైర్ల ద్వారా వారిని వార్డులకు తీసుకు వెళ్లారు. వైద్యుల బృందం కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సొరంగం నుండి బయటపడిన కార్మికులంతా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే వారి ఆరోగ్యం గురించి మరింతగా తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను పరీక్ష కోసం తీసుకుంటున్నట్లు వైద్యుల బృందం తెలిపింది. కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు సైకియాట్రిస్ట్ బృందం కూడా సేవలను అందిస్తోంది. ఇది కూడా చదవండి: కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు -
కార్మికులు కనిపించారు
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం కూలిన 10వ రోజైన మంగళవారం సానుకూల పరిణామం సంభవించింది. లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులతో వారి కోసం బయట వేచి ఉన్న కుటుంబసభ్యులు మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా, లోపలున్న వారికి సంబంధించిన విజువల్స్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి. దీంతో, కూలిన సొరంగం శిథిలాల్లోంచి తవ్విన ఆరంగుళాల పైప్‌లైన్ ద్వారా ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి, లోపలున్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లయింది. ఈ పైపును 53 మీటర్ల మేర అడ్డుపడిన శిథిలాల గుండా సోమవారం లోపలికి ప్రవేశపెట్టారు. కెమెరాను సోమ వారం రాత్రి ఢిల్లీ నుంచి అక్కడికి పంపించారు. పసుపు, తెలుపు రంగుల హెల్మెట్లను ధరించిన కార్మికులు, పైపులైన్‌ద్వారా లోపలికి పంపించిన ఆహార పదార్థాలను ఒకరికొకరు అందించుకుంటూ, మాట్లాడుకుంటూ ఆ విజువల్స్‌లో కనిపించారు. బయటున్న అధికారులు పెద్ద స్క్రీన్‌పై వారిని చూస్తూ తగు సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్ శుభ్రంగా ఉంచుతూ, తమను తాము పరిచయం చేసుకోవాలని కోరారు. పైప్‌లైన్ దగ్గరకు చేరుకుని లోపలికి పంపించిన వాకీటాకీలతో మాట్లాడాలని చెప్పారు. అనంతరం ఆ కెమెరాను వెనక్కి తీశారు. ఇప్పటికే కొందరి కుటుంబసభ్యులు నాలుగంగుళాల కంప్రెషర్ ట్యూబ్ ద్వారా లోపలున్న తమ వారితో మాట్లాడారు. ఆ ట్యూబ్ ద్వారానే డ్రైఫ్రూట్స్ వంటివి కూడా లోపలికి పంపించారు. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన పైప్‌లైన్ కార్మికుల పాలిటి లైఫ్‌లైన్‌గా మారింది. ఇంతకుముందు కంటే ఎక్కువ ఆహారాన్ని పంపొచ్చు. కుటుంబసభ్యులతో మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కొత్త పైపు ద్వారా లోపలున్న వారికి నారింజ, అరటి, యాపిల్ పండ్లు, బాటిళ్లలో కిచిడీ, సెల్ఫోన్లు, చార్జెర్లను సైతం పంపించారు. ఒక డాక్టర్ కూడా లోపలున్న కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడుపులో మంట, మూత్ర విజర్జనలో సమస్య..తదితరాలను తెలపగా వారికి మల్టీవిటమిన్ ట్యాబెట్లు, ఎలక్ట్రోలైట్ పౌడర్, యాంటీ డిప్రెస్సెంట్లను పంపినట్లు డాక్టర్ పీఎస్ పొఖ్రియాల్ చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన ప్రదీప్ కిక్సు క్షేమంగానే ఉన్నట్లు ఆయన మరదలు తెలిపారు. -
చైనాకు షాక్.. భారత్ నుంచి తైవాన్‌కు వేలాది కార్మికులు!
చైనాకు గట్టి షాక్ ఇచ్చే పని చేస్తోంది భారత్. పక్కనే ఉన్న తైవాన్ దేశానికి వేలాది మంది కార్మికులను పంపనుంది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య వచ్చే నెలలో కార్మిక ఒప్పందం జరగనుందని తెలిసింది. తైవాన్ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్‌కు చెందిన వర్కర్లను నియమించుకోనుంది. ఎంప్లాయిమెంట్ మొబిలిటీ అగ్రిమెంట్‌పై డిసెంబర్లో భారత్, తైవాన్లు సంతకాలు చేస్తాయని భావిస్తున్నారు. తైవాన్‌లో వయసు పైబడినవారి జనాభా పెరిగిపోయింది. ఫలితంగా పనిచేసే సామర్థ్యం ఉన్న యువతకు అక్కడ కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. అదే సమయంలో భారత్‌లో దీనికి విరుద్ధ పరిస్థితి నెలకొంది. దేశంలో యువత జనాభా పుష్కలంగా ఉంది. లేబర్ మార్కెట్లోకి ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు వచ్చి చేరుతున్నారు. అయితే ఈ ఉపాధి ఒప్పందం చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను రాజేసే అవకాశం ఉంది. ఎందుకంటే తైవాన్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా చైనాకు నచ్చదు. తైవాన్ స్వతంత్ర ప్రాంతంగా ఉన్నప్పటికీ అది తమ దేశంలో అంతర్భాగమే అని చైనా వాదిస్తోంది. ధ్రువీకరించిన అధికారి భారత్-తైవాన్ ఉపాధి ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ మీడియాకు తెలియజేశారు. అయితే తైవాన్ కార్మిక శాఖ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తమ దేశానికి కార్మిక సహకారం అందిస్తే స్వాగతిస్తామని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థకు చెప్పింది. కాగా భారత్ ఇప్పటి వరకు జపాన్, ఫ్రాన్స్, యూకే సహా 13 దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్లతోనూ ఇదే విధమైన ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. -
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం.. పంచాయితీ తీర్పు, రాత్రంతా చీకట్లోనే
ఇచ్చోడ: అప్పు చెల్లించేవరకు ఇంటికి తాళం వేసి ఉంచాలన్న పంచాయితీ పెద్దల తీర్పు కారణంగా బాధిత కుటుంబం రాత్రంతా చీకట్లోనే ఇంటి ముందు జాగరణ చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన రాజేందర్ అనే ఆసామి వద్ద అదే గ్రామానికి చెందిన తాత్ర శీను పాలేరుగా పనిచేసేందుకు మూడునెలల క్రితం ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.7 వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని రూ.34 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. గత జూలై 30వ తేదీ వరకు (దాదాపు మూడు నెలలపాటు) పనిచేశాడు. అయితే ఎడ్లజత సరిగా లేక, వాటితో వేగలేక తాను పనిచేయలేకపోతున్నానని యజమానికి పలుమార్లు చెప్పాడు. కానీ, రాజేందర్ స్పందించకపోవడంతో శీను సోమవారం పనికి వెళ్లలేదు. రాజేందర్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త కన్నమయ్యతోపాటు గ్రామానికి చెందిన కుమ్మరి సాయన్న, కాళ్ల భూమయ్య పంచాయితీ పెట్టారు. శీను పనికి రాకుంటే తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వా లని తీర్పు చెప్పారు. కొంత సమయం ఇవ్వాలని బాధితుడు ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. డబ్బులు చెల్లించేవరకు ఇంటికి తాళం వేస్తామని చెప్పా రు. పంచాయితీ పెద్దల తీర్పు మేరకు ఇంటికి తాళం వేయడంతో శీను భార్య గంగమణి, తల్లి పోసాని, కుమారులు మల్లేశ్, నవీన్‌తోపాటు కోడలు లక్ష్మి ఇంటి ఆవరణలోనే సోమవారం రాత్రంతా జాగరణ చేశారు. బాధితుడు శీను మంగళవారం ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
హెలికాఫ్టర్లతో మోరంచవాగులో రెస్క్యూ ఆపరేషన్
జయశంకర్ భూపాలపల్లి: చిట్యాల మండలంలోని నైన్పాక శివారు మోరంచవాగు బ్రిడ్జి నిర్మాణానికి కూలీలుగా పని చేస్తున్న ఆరుగురు కార్మికులు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి స్థానిక జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఎస్సై రమేష్‌లు ఎమ్మెల్యే, కలెక్టర్లకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన వారు రెండు హెలికాప్టర్లను పంపించి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. వరదల్లో చిక్కుకున్న బీకే ఆరుంగ్, బీపిన్ అరుణ్, గానో, ఉత్తమ్, మున్న, రోహిత్‌లు అస్సాం, జార్ఖండ్‌లకు చెందిన కార్మికులు బ్రిడ్జి పనులు చేస్తూ అక్కడే నివాసముంటున్నారు. వారితోపాటు మరో 20 మంది కార్మికులు రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పడుకున్నారు. ఈక్రమంలో తెల్లవారు జామున ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో కొంత మంది అప్రమత్తమై పరుగులు తీసుకుంటూ సురక్షితంగా బయటికి వచ్చారు. ఆరుగురు మాత్రం అక్కడే ఉండిపోయారు. దీంతో వరద పెరగడంతో జేసీబీపై కూర్కొని ఆర్తనాదాలు పెట్టారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. -
కార్మికుల్లో నైపుణ్యాలు పెంచాలి
ఇండోర్: అత్యాధునిక సాంకేతికతలను వినియోగించడంలో ఉద్యోగులకు, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని, వారిలో నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కొత్త తరం కార్మికులకు కొత్త తరం విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జి–20 దేశాల కార్మిక, ఉద్యోగ కల్పన శాఖ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో మొబైల్ వర్క్‌ఫోర్స్ అనేది వాస్తవ రూపం దాల్చబోతోందని ఉద్ఘాటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో పారిశ్రామిక విప్లవ హయాంలో ఉద్యోగాల సృష్టికి టెక్నాలజీకి ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని గుర్తుచేశారు. నూతన ఉద్యోగాల కల్పనలో ఇకపైకూడా టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్తులో ఉద్యోగులకు, కార్మికులకు స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ అనేది కీలకం కాబోతోందని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికతల వినియోగంలో నైపుణ్యాలు తప్పనిసరిగా పెంచుకోవాలని సూచించారు. వర్క్‌ఫోర్స్‌ను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లో ‘స్కిల్ ఇండియా మిషన్’ ప్రారంభించామని తెలియజేశారు. నైపుణ్యాలను పంచుకోవాలి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని ఇతర దేశాలతో పంచుకొనే విషయంలో జి–20 దేశాలు చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. నైపుణ్యాల సమాచారం ఇచి్చపుచ్చుకోవాలన్నారు. భారత్‌లో కోవిడ్–19 వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు, కార్మికులు ఎనలేని సేవలు అందించారని, వారు తమ నైపుణ్యాలను, అంకితభావాన్ని ప్రదర్శించారని మోదీ కొనియాడారు. సేవా సంస్కృతిని చాటిచెప్పారని, సాటి మనుషుల పట్ల కరుణ కురిపించారని ప్రశంసించారు. నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రపంచానికి అందించగల అతిపెద్ద దేశంగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. సాంకేతికతలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలను సృష్టించడంలో భారత్‌కు అపార అనుభవం ఉందని వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధిపై తాము ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. కౌశల్ వికాస్ యోజన కింద కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్ వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్‌లో 21.8 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారని మోదీ తెలిపారు. -
వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూపరులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ వీడియోలను చూస్తే జనానికి ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ ముక్కున వేలేసుకుంటాం. కొందరు కార్లను హెలీకాప్టర్లుగా మార్చేస్తూ ఉంటే, మరికొందరు ఇటుకలతో కూలర్ తయారు చేస్తారు. @TansuYegen పేరుతో ట్విట్టర్లో ఈ కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో @TansuYegen పేరుతో ట్విట్టర్లో షేర్ అయ్యింది. ఈ వీడియోలో కొందరు కూలీలు గోడ నిర్మించడం కనిపిస్తుంది. ఇద్దరు కూలీలు రెండు కర్ర చెక్కలపై కూర్చుని కనిపిస్తారు. వారు కిందకు మీదకు కదులుతుంటారు. ఈ చెక్కలకు మరోవైపున ఉన్న కూలీలు ఆ చెక్కలను పైకి కిందకు కదుపుతుంటారు. ఒక కూలీ ఇటుక, సిమెంట్లను పైనున్న కూలీకి అందిస్తుండగా అతను వాటిని పైనున్న కూలీకి అందిస్తుంటాడు. వాటిని అందుకున్న ఆ కూలీ గోడను వేగంగా నిర్మిస్తుంటాడు. Everything can be automated.., pic.twitter.com/VOow1m1b55 — Tansu YEĞEN (@TansuYegen) July 6, 2023 సూపర్ ఐడియా అంటూ.. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.5 మిలియన్లమందిపైగా నెటిజన్లు వీక్షించారు. చాలామంది దీనిని సూపర్ ఐడియా అంటూ ఆ కూలీలను మెచ్చుకుంటున్నారు. ఈ టెక్నిక్ నిర్మాణ పనిని మరింత వేగవంతం చేస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. కారణం తెలిస్తే షాకవుతారు.. -
తండ్రి మృతిని తట్టుకోలేని చిన్నారి.. సమాధి దగ్గరకు వెళ్లి..
ఆ చిన్నారి తన ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి వలస కూలీ. ఆ బాలికకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి తన తండ్రి సమాధి దగ్గర కూర్చుని తండ్రికి కథలు వినిపిస్తోంది. ఈ ఉదంతం చైనాలోని హెనాన్ ప్రాంతానికి చెందినది. ఆ బాలిక పేరు లిన్ లీ. ఆ బాలిక తండ్రి గత ఏడాది చేపలు పడుతూ నీట మునిగి మరణించాడు. తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి.. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు అందించిన రిపోర్టులోని వివరాల ప్రకారం.. ఆ బాలిక తన అత్తతో గత రాత్రి తనకు తండ్రి కనిపించాడని తెలిపింది. తరువాత తనను తండ్రి సమాధి దగ్గరకు తీసుకువెళ్లాలని మొండిపట్టు పట్టింది. ఆ బాలిక తండ్రి వారి ఇంటికి వెయ్యి కిలో మీటర్ల దూరంలో పనిచేస్తుండేవాడు. అతను ఇంటికి వచ్చినప్పడు పుస్తకాలు చదువుతూ, తన కుమార్తెకు కథలు చెప్పేవాడు. తండ్రి చనిపోయిన తరువాత ఆ చిన్నారి మామ్మతో ఉంటోంది. ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె తల్లి ఎప్పుడో ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ తల్లి దూరమై, తండ్రి చనిపోవడంతో ఆ చిన్నారి అనాథగా మారింది. ఆ చిన్నారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా అందడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలోనే ఆ బాలిక అత్త ఒక వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిని చూసి, ఆ చిన్నారికి ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆమె భావిస్తోంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్.. అంత చిన్నపిల్ల మదిలో అంత వేదన ఉండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అని రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు! -
అన్ని ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు!
సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తనం నుంచి కోత వరకు రైతులెదుర్కొంటున్న కూలీల వెతలకు చెక్ పెట్టింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ప్రతి ఆర్బీకే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో (సీహెచ్‌సీ) అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. నూరు శాతం ఆర్బీకేల్లో సీహెచ్‌సీల ఏర్పాటు లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6,525 ఆర్బీకేల పరిధిలో అందుబాటులోకి రాగా మిగిలిన 4,225 ఆర్బీకేల్లో మే మొదటి వారంలో సీహెచ్‌సీలను గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఖర్చులు తగ్గించి రాబడి పెరిగేలా.. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, మెరుగైన ఆదాయం పొందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తెచ్చింది. రూ.2,106 కోట్ల వ్యయంతో ఆర్బీకేల స్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 6,525 ఆర్బీకేల స్థాయిలో 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను నెలకొల్పగా రైతుల వినతి మేరకు రూ.175 కోట్ల వ్యయంతో 3,800 ట్రాక్టర్లను రైతు కమిటీలకు అందించింది. సీహెచ్‌సీల కోసం 40 శాతం సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లను ఖర్చు చేసింది. పంటల సరళి, స్థానిక డిమాండ్ బట్టి యంత్ర పరికరాల ఎంపిక, నిర్వహణ బాధ్యతలను రైతు గ్రూపులకే అప్పగించింది. పరికరాలు, అద్దె, వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఆర్బీకేల్లో కూడా సత్వరమే యంత్రసేవా కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. జూలైలో కనీసం 500 ఆర్బీకేల్లో డ్రోన్లు ఆర్బీకేల స్థాయిలో 2 వేల కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తేవడంలో భాగంగా జూలైలో కనీసం 500 ఆర్బీకేల్లో డ్రోన్లతో పాటు వ్యక్తిగతంగా 7 లక్షల మంది రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మిగిలిన 4,225 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 3,594 ఆర్బీకేల్లో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇప్పటి వరకు 1,532 గ్రూపులు ట్రాక్టర్లు కావాలని ప్రతిపాదించడంతో కోరుకున్న కంపెనీలకు చెందినవి సమకూర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా గ్రూపుల ఎంపిక, రుణాల మంజూరు ప్రక్రియ పూర్తి చేసి మే మొదటి వారంలో నూరు శాతం యూనిట్లు గ్రౌండింగ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేయగా మిగిలిన జిల్లాల పరిధిలో జిల్లాకు కనీసం ఐదు కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన సీహెచ్‌సీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. కూలీల వెతలు తీరాయి.. మా గ్రామం మండల కేంద్రానికి 13 కి.మీ. దూరంలో ఉంది. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం. యంత్రాల కోసం సీజన్లో ముందే బయానా ఇచ్చి రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అడిగినంతా ఇస్తే కానీ వచ్చేవారు కాదు. ఇప్పుడు ఆర్బీకే ద్వారా రైతుగ్రూపుగా ఏర్పడి రూ.2.17 లక్షల విలువైన యంత్రాలను తీసుకున్నాం. మా వ్యవసాయ అవసరాలకు వాడుకోవడంతోపాటు మిగిలిన రైతులకు అద్దెకిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. – జి.రాఘవకుమారి, కన్వి నర్, శ్రీలక్ష్మీనరసింహ సీహెచ్‌సీ గ్రూపు, దేవవరం, అనకాపల్లి జిల్లా మిగిలిన చోట్ల వచ్చే నెలే గ్రౌండింగ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అన్ని ఆర్బీకేల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం. ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. మిగిలిన 4,225 ఆర్బీకేల్లో మే మొదటి వారంలో సీహెచ్‌సీలను సీఎం జగన్ చేతుల మీదుగా గ్రౌండింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
గోడకూలి ఒకరు.. అది చూసి మరొకరు
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నెపల్లిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు చెందిన గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. హన్మంత్‌రావు తన అత్తగారి ఊరైన జన్నెపల్లిలో 22 ఏళ్ల క్రితం వ్యవసాయభూమిని కొనుగోలు చేసి, అందులో రెండంతస్తుల గెస్ట్‌హౌస్ నిర్మించారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలప్పుడు ఎమ్మెల్యే తొమ్మిది రోజులు ఇక్కడే ఉండి దుర్గామాత ఆలయంలో పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడూ వచ్ఛివెళ్తుంటారు. కాగా, తాజాగా చేపట్టిన గెస్ట్‌హౌస్ ఆధునీకరణ పనుల కోసం శుక్రవారం కాంట్రాక్టర్‌తోపాటు నిజామాబాద్ నుంచి ఐదుగురు కూలీలు వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు భోజనానికి వెళ్లగా, కొండపల్లి రాజు(28), అతడి మిత్రుడు రెండో అంతస్తులోని గోడను తొలగించి, కిందపడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గోడతోపాటు కొండపల్లి రాజు కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన మరో కూలీ ఒక్కసారిగా రెండో అంతస్తులోనే వాంతులు చేసుకుని కుప్పకూలాడు. పెద్దశబ్దం దరావడంతో మిగతా కూలీలు పైకి వచ్చి అతడి ఛాతీపై నొక్కి రక్షించేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజారెడ్డి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజు తండ్రి శంకర్ రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఉద్యోగి. నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో స్థిరపడింది. రాజుకు పెళ్లయిన సోదరి ఉంది.గుండెపోటుతో మృతి చెందిన మరోకూలీ పేరు చంపాల్వాడి సాయిలు(29). భార్యతో విడిపోయిన సాయిలు నిజామాబాద్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన వీరి కుటుంబం ఏళ్లక్రితం వలస వచ్ఛింది. -
ఇటీవలే పెళ్లి, అంతలోనే ..
సాక్షి, హోసూరు: ఇటీవలే పెళ్లయింది, కానీ అనారోగ్యంతో బాధపడుతూ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు హోసూరు సమీపంలోని కూస్తనపల్లి గ్రామానికి చెందిన అశోక్ (38). ఇతనికి గత ఏడు నెలల క్రితం పెళ్లి జరిగింది. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన అశోక్ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన బంధువులు అతన్ని చికిత్స కోసం హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. (చదవండి: ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను వేధించిన ట్రాఫిక్ పోలీసులు.. సృహతప్పి పడిపోయిన భార్య..) -
పని చేయాలన్నా బలం ఏది?
కార్మిక శక్తి నుంచి చాలామంది భారతీయులు వైదొలుగుతున్నారు. పని చేయగల వయసు వారిలో 46 శాతం మాత్రమే పనిచేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతోంది. కారణం ఏమిటి? పేదలకు అందుబాటులో ఉన్న పనులను వారు శారీరకంగా చేయగల స్థితిలో లేరు. నాలుగింట మూడొంతుల ఉపాధి వ్యవసాయం, నిర్మాణ, వాణిజ్య రంగాలే కల్పిస్తున్నాయి. ఈ మూడు రంగాలూ పెద్దగా డబ్బులు చెల్లించడం లేదు. పైగా రెండు రంగాలైతే కార్మికుల వెన్ను విరిచేస్తున్నాయి. దాంతో కఠిన శ్రమ చేయడానికి అవసరమైన పోషణ వీరికి అందడం లేదు. కాబట్టి వీరు పని నుండి తప్పుకొంటున్నారు. మన మీడియా వర్ణిస్తున్న ‘ఉచితాలపై’ శాశ్వతంగా ఆధారపడుతున్నారు. ఇదొక విష వలయం! పేద దేశాల ప్రజలు వేతన శ్రమ కోసం వేసారి పోతున్నారు. చట్టబద్ధంగా పనిచేయ గల 15 సంవత్సరాల వయసు రాకముందే వారు తమ పిల్లలను పనికి పంపిస్తున్నారు. తక్కువ ఆదాయాలు గల దేశాల్లోని పని చేయగల జనాభాలో సగటున 66 శాతం మంది పనిచేస్తున్నారనీ, లేదా పని చేయాలని అనుకుంటున్నారనీ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) చెప్పింది. అధికాదాయ దేశాల్లో ఈ నిష్పత్తి 60 శాతం ఉంది. పేద ప్రజలు ఏ వయసులో ఉన్నా వారు పనిచేయాల్సి ఉంటుందనేది అర్థం చేసుకోదగినదే. అదే సంపన్నుల విషయానికి వస్తే వయసు మీరగానే శ్రామిక శక్తి నుంచి తప్పుకోగలరు. భారత్ విషయానికి వస్తే ఈ తర్కం మారిపోతుంది. భారతీయ శ్రామిక జనాభాలోని 46 శాతం మాత్రమే పని చేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారు. ఇవి ఐఎల్ఓ గణాంకాలు. అదే సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) నుంచి మీరు గణాం కాలు తీసుకున్నట్లయితే, అవి షాక్ కలిగిస్తాయి. 2020 ఫిబ్రవరిలో అంటే కోవిడ్–19 మహమ్మారి మనపై దాడి చేయకముందు భార తీయ శ్రామిక జనాభాలో 44 శాతం మాత్రమే పని చేయాలను కుంటున్నారని ఈ డేటా చెప్పింది. 2022 అక్టోబర్ నాటికి ఇది 40 శాతానికి పడిపోయింది. అంటే పనిచేసే వయసు విభాగంలోకి వచ్చిన భారతీయుల్లో 60 శాతం మందికి పనిలేదు లేదా వారు పనిచేయాలని కోరుకోవడం లేదు. దీనికి అతి పెద్ద కారణం ఏమిటంటే, పని చేయగల వయసులో ఉన్న భారతీయ మహిళల్లో కొద్దిమంది మాత్రమే డబ్బు వచ్చే పని చేయగలుగుతున్నారు. 1990 నుంచి 2006 మధ్య కాలంలోని ఐఎల్ఓ డేటా 32 శాతం మహిళలు మాత్రమే శ్రామిక శక్తిలో పాల్గొంటున్నా రనీ, వీరు డబ్బు వచ్చే పని చేస్తుండటం లేదా అలాంటి పని చేయాలనుకుంటున్నారనీ చెబుతోంది. అదే 2019 నాటికి ఇది 22 శాతానికి పడిపోయింది. ఇక సిఎంఐఈ డేటా మరింత నిరాశాజనక మైన విషయాన్ని బయటపెట్టింది. 2020 ఫిబ్రవరిలో అంటే కోవిడ్ లాక్డౌన్లు రాకముందు పనిచేయగల వయసులో ఉన్న 12 శాతం మహిళలు మాత్రమే దేశంలో పనిచేస్తున్నారు లేదా పని చేయాలను కుంటున్నారు. 2022 అక్టోబర్ నాటికి ఇలాంటి వారి సంఖ్య 10 శాతానికి పడిపోయింది. అదే చైనాతో పోల్చి చూసినట్లయితే పనిచేసే వయసు ఉన్న 69 శాతం మంది మహిళలు అక్కడ కార్మిక శక్తిలో పాల్గొంటున్నారు. భారతదేశంలో అధోగతిలో ఉన్న మహిళా కార్మికశక్తి భాగస్వామ్య రేటు, పెరుగుతున్న మన ఐశ్వర్యంతో పోలిస్తే అనుషంగిక నష్టంలా కనిపిస్తోందని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు. ఇంటి బయట మహిళలు పనిచేయడం అంటేనే భారతీయులు మొహం చిట్లించుకుంటారు. కానీ డబ్బుకు కటకట అవుతున్న పరిస్థితుల్లో వారికి అంతకు మించిన అవకాశం మరొకటి లేదు. భారతీయులు రానురానూ దారిద్య్రం నుంచి బయటపడుతున్న కొద్దీ వారి మహిళలు పనిచేయడం ఆపివేసి ఇళ్లకు మరలిపోతున్నారు. ఐశ్వర్యం అనేది పేదలను కూడా సంస్కృతీ కరణ ప్రభావానికి గురి చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పేదలు కూడా ఆదాయ నిచ్చెన పైకి ఎక్కుతున్న కొద్దీ మహిళల పట్ల సాంప్రదాయిక భావజాలం వైపు వెళ్లిపోతున్నారు. సౌకర్యంగానే ఉందనిపిస్తున్న ఈ ధోరణిలో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి: 2005–06లో కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం గుర్తించదగినంత అధికంగా ఉన్నప్పుడు కూడా పిరమిడ్ దిగువ భాగంలో ఉన్న భారతీయ గృహాలు సంపన్నంగా మారాయనడానికి ఎలాంటి సాక్ష్యమూ లేదు. రెండు: కొద్దిమంది మహిళలు మాత్రమే వేతనం వచ్చే పనిని కోరుకుంటున్నారని అనుకుంటే, వారు సుల భంగా ఉద్యోగం సంపాదించగలగాలి. కానీ వాస్తవం దానికి వ్యతి రేకంగా ఉంది. దేశంలో పురుషుల నిరుద్యోగితా రేటు 8.6 శాతం ఉండగా, మహిళల్లో నిరుద్యోగితా రేటు మూడు రెట్లకంటే ఎక్కువగా 30 శాతం ఉందని సీఎంఐఈ అక్టోబర్ నెలకు ప్రకటించిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీని అర్థమేమిటంటే, భారత దేశంలో ప్రతి 100 మంది శ్రామిక మహిళల్లో 10 మంది మాత్రమే పనికోసం చూస్తున్నారు. ఇందులోనూ ఏడుగురికి మాత్రమే డబ్బు వచ్చే పని దొరుకుతోందన్నమాట. మరి 2019లో మగవారి పరిస్థితి ఏమిటి? కోవిడ్‌కి ముందు, పనిచేసే వయసులోని భారతీయ పురుషుల్లో 73 శాతం మంది కార్మిక శక్తిలో పాల్గొనేవారని అంతర్జాతీయ కార్మిక సంస్థల లెక్కలు సూచిం చాయి. దిగువ, మధ్య ఆదాయ దేశాల్లోని 74 శాతంతో పోలిస్తే ఇది కాసింత తక్కువే. 2019 మధ్యలో పురుషుల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు గురించిన సీఎంఐఈ డేటా ప్రకారం కూడా ఇది 72 నుంచి 73 శాతం మధ్య ఉంటోంది. ఇది 2022 అక్టోబర్ నాటికి 66 శాతానికి పడిపోయింది. 2020 ఫిబ్రవరి నుంచి (కోవిడ్ లాక్డౌన్లకు ముందు) 2022 అక్టోబర్ మధ్యనాటికి భారత్‌లో పనిచేసే వయసులో ఉన్న పురుషుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అదే స్థాయిలో ఉండివుంటే, మరో 3.3 కోట్లమంది పురుషులు కొత్తగా పని కోసం వెదుకుతూ ఉండాలి. కానీ ఈ సంఖ్య 13 లక్షలకు మాత్రమే పెరిగింది. ఫలితంగా 3.2 కోట్లమంది పనేచేసే వయసులోని పురు షులు కార్మిక శక్తి నుంచి వైదొలిగారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరణ ఏదంటే, భారతదేశంలోని పేదలకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల తీరు చూస్తే వారు శారీరకంగా పనిచేయగల స్థితిలో లేరు. దేశంలోని అన్ని ఉద్యోగాల్లో నాలుగింట మూడొంతులు వ్యవసాయం, నిర్మాణరంగ, వాణిజ్య రంగాలే కల్పిస్తున్నాయి. ఈ మూడు రంగాలూ పెద్దగా డబ్బులు చెల్లిం చడం లేదు. వీటిలో రెండు రంగాలైతే కార్మికుల వెన్ను విరిచే స్తున్నాయి. ఎనిమిది గంటలు పనిచేసే రైతు 4,500 కేలరీలను నష్ట పోతుంటారనీ, అదే సమయం పనిచేసే నిర్మాణ కార్మికుడు 4,000 కేలరీలను కోల్పోతుంటాడనీ యూరప్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భారత్‌లో నిర్మాణ రంగం మరింత తీవ్ర శ్రమతో కూడుకున్నది కాబట్టి దీనికి మరింత శక్తి అవసరం. దాదాపు 16 శాతం భారతీయులు పోషకాహార లేమితో ఉన్నారని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అంచనా. అంటే పని చేయగలిగే జనాభాలోని పేద ప్రజల్లో అధిక భాగం కఠిన శ్రమ చేయడానికి అవస రమైన కేలరీలలో సగం కూడా పొందలేదని దీని అర్థం. వారు రేషన్లు, ప్రభుత్వం అందించే ఉచితాలు, తమ గ్రామ కమ్యూనిటీ అందించే మద్దతుతో మనగలుగుతున్నారు. ఇదొక విష వలయం. ప్రభుత్వ రేషన్లు నిశ్చల జీవితానికి మద్దతు ఇచ్చేంతగా మాత్రమే పనికొస్తాయి. పేదలు తమ ప్రస్తుత పోషకాహార స్థాయికి తగిన పనులు పొందలేరు. కాబట్టి వారికి మరొక దారి లేదు. అందుకే మన మీడియా వర్ణిస్తున్న ‘ఉచితాలపై’ శాశ్వతంగా ఆధారపడుతున్నారు. మనం స్వాతంత్య్రం పొందినప్పుడు భారత్ ఊహించిన పంథాకు ఇది పూర్తిగా తిరోగమన దిశలో ఉంది. కఠిన శ్రమ నుంచి పరిశ్ర మల్లోని యాంత్రిక శ్రమ వైపు కార్మికులను తరలించడానికి బదులుగా ఈరోజు అత్యంత కఠినమైన పనితో కూడిన ఉపాధి అవకాశాలు మాత్రమే దొరుకుతున్నాయి. దీన్నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ఏదంటే– ప్రభుత్వం తక్షణ లాభాలను త్యాగం చేసి అధిక ఉద్యోగావకాశాలు, మెరుగైన పని పరిస్థితులు, ఉపాధిని కల్పించే యాంత్రీకరణ వైపు మరలడమే. ఇది జరగనంతవరకూ భారత్ తన ప్రజల్లో మెజారిటీకి కేవలం జీవనాధార ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఉండిపోతుంది. అనింద్యో చక్రవర్తి, వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దొంగతనం చేశాడని చెట్టుకు కట్టేసి మరీ..
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మణికందంలో ఒక కోత మిల్లులో దొంగతనం చేశాడనే ఆరోపణలపై చక్రవర్తి అనే వ్యక్తిని చెట్టుకు కట్టి చచ్చేదాకా కొట్టారు. మర్మాంగాల మీద బలంగా తన్నడంతో అతని ఊపిరి ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మిల్లు యజమాని, ఇద్దరు కార్మికులపై పోలీసులు హత్య కేసు నమోదుచేశారు. త్రిచీ-మధురై హైవేలో మణికందం వద్ద ఆశాపుర రంపపు మిల్లు ఉంది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన కలపతో.. ఇంటి ఫర్నీచర్ తయారు చేస్తుంటారు వాళ్లు. ఈ క్రమంలో.. శనివారం ఓ వ్యక్తి దొంగతనంగా మిల్లులోకి చొరబడినట్లు అసోంకు చెందిన ముగ్గురు కూలీలు చెప్పారు. దీంతో.. తువకుడికి చెందిన చక్రవర్తి అనే వ్యక్తిని బంధించి చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే కన్నుమూశాడు. మెడ, ఛాతీ, కుడి మోచేయి.. భుజం, మర్మాంగాలపై తీవ్రగాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. మర్మాంగాలపై బలంగా తన్నడంతోనే అతని ఊపిరి ఆగిపోయినట్లు తెలిపారు. దొంగతనం జరిగిందనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే.. చెట్టుకు కట్టేసి ప్రాణం లేని చక్రవర్తి కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి.. అసోంకు చెందిన ఫైజల్ షేక్, ముజ్ఫల్ హుక్తో పాటు మిల్లు ఓనర్ ధీరేంద్రపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. -
గల్ఫ్ దేశాల్లో 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' ఉండాలి!
ఆసియా-గల్ఫ్ వలసల కారిడార్ దేశాలలో వేతనాల చెల్లింపులపై ఉత్తమ ఆచరణపై ఖతార్ రాజధాని దోహాలో వలసలపై జరుగుతున్న సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ముఖ్యంగా వేతనాల ఎగవేత, ఇతర వేతన సమస్యల పరిష్కార విధానాలపై చర్చ సాగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏర్పాటు, వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నించారు. నష్టపోయిన కార్మికులను, విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల రక్షణకోసం మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ కోరారు. 32 సంవత్సరాల క్రితం 1990-91లో ఇరాక్ - కువైట్ గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్‌పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులను బలవంతంగా ఆయా దేశాల నుండి కట్టుబట్టలతో స్వదేశీలకు పంపించివేస్తున్నారని స్వదేశ్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్‌లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.రే జురీడిని పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు. వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం, దీనిక అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై ప్యానల్ వక్తలు ప్రసంగించారు. అలాగే కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు. -
రాష్ట్రంలో 2019–20లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 6.46%
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికోత్పత్తి 6.46 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక వార్షిక సర్వే నివేదిక వెల్లడించింది. 2018–19లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.3,76,143.34 కోట్లు కాగా 2019–20లో రూ.4,00,462.83 కోట్లుగా తెలిపింది. అంటే 2018–19తో పోలిస్తే 2019–20లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.24,319.49 కోట్లు (6.46 శాతం) పెరిగినట్లు సర్వే పేర్కొంది. కోవిడ్–19 సెకండ్‌వేవ్ నేపథ్యంలో 2019–20కి సంబంధించిన పారిశ్రామిక సర్వేని ఆలస్యంగా.. 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. ఈ సర్వే నివేదికను కేంద్ర కార్యక్రమాలు అమలు గణాంకాలశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2019–20లో రాష్ట్రంలో కొత్తగా 185 ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. 2018–19లో రాష్ట్రంలో 16,739 ఫ్యాక్టరీలుండగా 2019–20లో ఆ సంఖ్య 16,924కు పెరిగింది. 2019–20లో రాష్ట్రంలో మొత్తం 6.63 లక్షల మందికి ఉపాధి కల్పించారు. 2018–19తో పోలిస్తే 2019–20లో ఉపాధి కల్పించిన వారిసంఖ్య 30,432 పెరిగింది. 2018–19లో 6.33 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల సంఖ్య 2018–19తో పోలిస్తే 2019–20లో 29,105 పెరిగింది. 2018–19లో 5.12 లక్షలమంది కార్మికులు పనిచేస్తుండగా 2019–20లో వారిసంఖ్య 5.41 లక్షలకు చేరింది. 2018–19లో కార్మికులకు వేతనాల రూపంలో రూ.8,954.25 కోట్లు చెల్లించగా 2019–20లో రూ.10,243.15 కోట్లు చెల్లించారు. 2019–20లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.29,921 కోట్లు కాగా నికరలాభం రూ.9,584 కోట్లు. 2018–19లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.23,406 కోట్లు కాగా నికరలాభం రూ.5,562 కోట్లు. 1948 ఫ్యాక్టరీల చట్టం కింద ఏర్పాటైన పదిమందికి మించి కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలను సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. రక్షణసంస్థలు, చమురు నిల్వ, పంపిణీ డిపోలు, రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్, కంప్యూటర్ సేవలు, రైల్వే వంటి డిపార్ట్మెంటల్ యూనిట్లు, వర్క్‌షాప్‌లు, ప్రభుత్వ మింట్లు, శానిటరీ, నీటిసరఫరా, గ్యాస్ నిల్వ మొదలైనవాటిని సర్వే పరిధి నుంచి మినహాయించారు. -
Crime News: ఏలూరులో పెను విషాదం
సాక్షి, ఏలూరు: జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగంపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. జామాయిల్ తోటలో పనికి వచ్చారు ఆ కూలీలంతా. ఈ క్రమంలో.. సుమారు 30 మంది కూలీలు.. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. జామాయిల్ కర్రలు తొలగిస్తుండగా పిడుగుపడడంతో.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను 108లో ఏలూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్లిక్: గుడ్ న్యూస్.. కాకినాడ సెజ్ భూములు.. రైతులకు రీ రిజిస్ట్రేషన్ -
పాణాలు తీసిన ప్రహరీ
కృష్ణరాజపురం: భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ గోడ కూలి నలుగురు కూలీ కార్మికులు మరణించారు. ఈ సంఘటన బెంగళూరు సమీపంలో హొసకోటె తాలూకా అనుగొండనహళ్లి హోబళి పారిశ్రామిక ప్రాంతంలో ఒక అపార్టుమెంట్ వద్ద జరిగింది. మృతులు, క్షతగాత్రులంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు గోడ పక్కనే వేసుకున్న తాత్కాలిక షెడ్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. గోడ కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. స్థానికులు, పోలీసులు చేరుకుని వారిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బిహార్‌కు చెందిన మనోజ్ కుమార్ (35), రామ్‌కుమార్ (25), నితీశ్ కుమార్ (22), మణితన్ దాస్ అనే నలుగురు తీవ్రగాయాలతో మరణించారు. నాసిరకం నిర్మాణం నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో కూలీ కార్మికులు పనిచేస్తున్నారు. కారి్మకులు ఉండేందుకు తాత్కాలికంగా షెడ్‌ను నిర్మించారు. అయితే బుధవారం కురిసిన భారీ వర్షం, అలాగే పక్కనే ఉన్న రాజకాలువ పొంగడంతో ప్రమాదం జరిగింది. ప్రహరీని రాజకాలువను ఆక్రమించి, నాసిరకంగా కట్టినట్లు సమాచారం. ఎలాంటి పునాది లేకుండా ఆ కాంపౌండ్‌కు ఆనుకుని షెడ్‌ను నిర్మించారు. దీంతో వర్షానికి తడిసిన ఆ కాంపౌండ్ గోడ పేకమేడలా షెడ్డుమీద కూలి పోయింది. నలుగురికి తీవ్రగాయాలు ఈ ప్రమాదంలో సునీల్ మండల్, శంభు మండల్, దిలీప్, దుర్గేశ్ అనే నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైట్‌ఫీల్డ్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి ఎంటీబీ నాగరాజు, ఎస్పీ పురుషోత్తమ్, డీఎస్పీ పి.ఉమాశంకర్ పరిశీలించారు. (చదవండి: నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్ )