marri chenna reddy
-
ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది: మంచు విష్ణు
కొద్దిరోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సంఘటనలు జరగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడితే... కుటుంబంలో విభేదాలు రావడంతో మంచు ఫ్యామిలీలో కేసుల వరకు గొడవలు వెళ్లాయి. దీంతో పలువురు చిత్ర పరిశ్రమ నుంచి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షునిగా మంచు విష్ణు అధికారిక ప్రకటన చేశారు.'మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం,సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకత పై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన ఇండస్ట్రీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి.ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం గానీ నివారించండి.కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.' అని విష్ణు ఒక ప్రకటన చేశారు. -
ఏ బిల్లు.. ఏ తీర్మానం ఏంటి..?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 11, 12 తేదీల్లో రెండురోజులపాటు అవగాహన కల్పించే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధ, గురువారాల్లో జరిగే ఈ అవగాహన కార్యక్రమ ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఎంసీహెచ్ఆర్డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ వివరించారు. » తొలిరోజు బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే అవగాహన కార్యక్రమంలో ‘ప్రభావంతమైన శాసనసభ్యులుగా ఉండటం ఎలా’అనే అంశంపై చక్షురాయ్, ‘ప్రజాప్రతినిధులు–గౌరవ మర్యాదలు, ప్రొటోకాల్, పాలనలో వారి పాత్ర’అనే అంశంపై పీడీటీ ఆచారి ప్రసంగిస్తారు. » మధ్యాహ్నం సెషన్లో ‘ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, తీర్మానాలు, వాయిదా తీర్మానాలు, ప్రత్యేక ప్రస్తావనలు, అత్యవసర అంశాలు’తదితరాలపై చక్షురాయ్ ప్రసంగిస్తారు. » రెండోరోజు గురువారం జరిగే ప్రారంభ సెషన్లో ‘బిల్లుల ప్రస్తావన.. వాటిని పరిగణనలోకి తీసుకోవడం, పాస్ చేయడం’, ‘రాష్ట బడ్జెట్‌ను అవగాహన చేసుకోవడం’పై తుషార్ చక్రవర్తి ప్రసంగిస్తారు. » భోజన విరామం అనంతరం జరిగే సెషన్లో ‘రాష్ట్ర లెజిస్లేచర్ కమిటీలను బలోపేతం చేయడం’పై పీడీటీ ఆచారి ప్రసంగిస్తారు. అనంతరం జరిగే ముగింపు కార్యక్రమంలో స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొంటారు ఓరియెంటేషన్‌ను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్ రెండు రోజులపాటు జరిగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాసమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాని్చవేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నొక్కేలా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల్లో అతి తక్కువమంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఈ భవంతి.. వందేళ్ల గంధర్వ మహల్! ఇక్కడ?
ఈ భవంతి.. జైపూర్ హవా మహల్‌ని గుర్తుకు తెస్తోంది కదూ! ఇది గంధర్వ మహల్.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో ఉంది! ప్రస్తుతం ఇందులో నివసిస్తున్న మూడోతరం.. ఇటీవలే దీని వందేళ్ల వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ మహల్‌ని చూపించడానికి సందర్భం అదే!ఆచంటకు చెందిన జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు చిన్నతనం నుంచీ కోటలు చూస్తూ పెరగడంతో సొంతూళ్లో అటువంటి కట్టడాన్ని నిర్మించాలని భావించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి కోటలను క్షుణ్ణంగా పరిశీలించి, 1918లో.. ఈ గంధర్వ మహల్‌కు శంకుస్థాపన చేశారు. ఆరేళ్లపాటు కొనసాగిన దీని నిర్మాణం 1924 నాటికి పూర్తయింది. సుమారు ఎకరం విస్తీర్ణంలో కొలువై ఉన్న ఈ మహల్ కోసం అప్పట్లోనే సుమారు పది లక్షల రూపాయల వరకు వెచ్చించినట్టు జమీందారు కుటుంబ సభ్యులు చెప్పారు.ప్రత్యేకతలెన్నో.. మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. రవాణా సదుపాయం అంతగాలేని ఆ రోజుల్లో జలరవాణా ద్వారా వాటిని తీసుకువచ్చారు. ఈ కట్టడానికి ఇనుప ఊచల ఊసు లేకుండా డంగు సున్నాన్నే వాడారు. ఈ మహల్లోకి అడుగుపెడితే మైసూర్ మహారాజా ప్యాలస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతి కలుగుతుంది. 1885, లండన్ ఎగ్జిబిషన్లో రజత పతకం గెలిచిన పియానో ఈ మహల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికీ ఆ పియానో స్వరాలను పలికిస్తుంది. విశాలమైన హాల్లో బెల్జియం నుంచి తెప్పించిన నిలువెత్తు అద్దాలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో వెలిగించేవారని, ఆ వెలుగుల్లో మహల్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారని స్థానికులు చెబుతారు. ఈ మహల్ కట్టిన పదేళ్లకు గానీ ఆచంటకు విద్యుత్‌సదుపాయం రాలేదట.ముఖ్యమంత్రులు బసచేశారు..ఈ గంధర్వ మహల్ ఎందరో ప్రముఖులకు విడిదిగా విరాజిల్లింది. మాజీ ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి, ఎన్టీ రామారావుతో పాటు ఎంతో మంది మాజీ మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ భవంతిలోనే బసచేసేవారు. ఈ మేడలో మొత్తం నాలుగు అంతస్తులు, 12 గదులున్నాయి. గొడవర్తి నాగేశ్వరరావు అనంతరం మూడు తరాలకు ఇది నివాసంగా ఉంది. నాలుగోతరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని జమీందారు కుటుంబ సభ్యుల్లో ఒకరైన గొడవర్తి వెంకటేశ్వరస్వామి తెలిపారు. ఈ భవంతి కట్టాక రెండు పర్యాయాలు రంగులు వేయగా, వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూ. 40 లక్షల వ్యయంతో మరమ్మతులు చేయించి రంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరో 30 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా మరమ్మతులు చేయించామని వెంకటేశ్వరస్వామి చెప్పారు. గంధర్వ మహల్లో సినిమా షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని ఎంతోమంది సినీరంగ ప్రముఖులు కోరినప్పటికీ జమీందారు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమ తాతగారి వారసత్వ సంపదగా వస్తున్న ఈ మహల్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం -
సీఎంను అందించిన భాగ్యనగరం!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అందించిన కీర్తిని భాగ్యనగరం మూటగట్టుకుంది. రాజకీయ ఉద్దండుడు మర్రి చెన్నారెడ్డి 1989లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. సనత్‌నగర్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన 1989 డిసెంబర్ 3 నుంచి 1990 డిసెంబర్ 17 వరకు సీఎం బాధ్యతలు చేపట్టారు. నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి తనదైన మార్క్‌ను సాధించారు. సనత్‌నగర్ నుంచి పోటీ చేయకముందే 1978 మార్చి 6 నుంచి 1980 అక్టోబర్ 11 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న సనత్‌నగర్ నియోజకవర్గం 1978లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడగా నాలుగో ఎమ్మెల్యేగా మర్రి చెన్నారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు మర్రి శశిధర్‌రెడ్డిని నిలబెట్టి 1992లో గెలిపించుకుని తన రాజకీయ వారసత్వాన్ని అందించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకుసాగారు. దశాబ్ద కాలం క్రితం వరకు సనత్‌నగర్ అంటే మర్రి కుటుంబం, మర్రి అంటే సనత్‌నగర్‌గా ఉంటూ వచ్చింది. ఇవి చదవండి: TS Election 2023: దోస్త్ వర్సెస్ దోస్త్..! -
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మర్రి చెన్నారెడ్డి
కవాడిగూడ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రస్తుతం కొంతమంది తామే ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ వారికి వారే తెలంగాణ జాతిపితగా చెలామణి అవుతున్నారని అన్నారు. కానీ తెలంగాణ సమాజానికి మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్కులోని రాక్‌గార్డెన్‌లో ఆయన సమాధికి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డి, మర్రిచెన్నారెడ్డి మనుమలు ఆదిత్యరెడ్డి, పురూరవరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై నివాళులర్పించారు. -
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సివిల్ సర్వీస్ స్టడీ శిక్షణ టూర్లో భాగంగా సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి వచ్చిన నాగలాండ్‌కు చెందిన 12 మంది ప్రతినిధులతో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు పెన్షన్లతోపాటు ఆడపిల్లల వివాహనికి కల్యాణలక్ష్మి అందిస్తుందన్నారు. ఉచిత విద్యలో భాగంగా ప్రతీ విద్యార్థిపైన రూ.లక్ష ఖర్చు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో వైద్య, విద్యకు పెద్దపీట వేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపామన్నారు. నాగలాండ్ బృందాన్ని హైదరాబాద్ బిర్యానీతో పాటు ఇరానీ చాయ్ రుచి చూడాలని కోరారు. నాగలాండ్‌లో జరుగుతున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలను సివిల్ సర్వీస్ శిక్షణ పొందుతున్న ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నాగలాండ్ ప్రతినిధులు గజ్వేల్‌లో నిర్మించిన ఇంటిగ్రేటేడ్ కార్యాలయంతో పాటు మార్కెట్, కోమటిచెరువు, ఆక్సిజన్ పార్క్ సందర్శించారన్నారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశంలో ఏక్కడా లేవని పేర్కొన్నారు. పేదలకు అందిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లను చూసి ఇవి దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి శిక్షణా కేంద్రం కోఆర్డినేటర్ కందుకూరు ఉషారాణి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెన్నారెడ్డి సేవలు చిరస్మరణీయం
సాక్షి, హైదరాబాద్: ప్రజాహితం కోసం మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తుతించారు. హైటెక్ సిటీ శిల్ప కళావేదికలో ఆదివారం జరిగిన మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మర్రి చేసిన పోరాటాన్ని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. చెన్నారెడ్డి సూచించిన దారిలో నడవడమే ఆయనకు మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు. ‘శాసనసభ లో ఎన్ని విమర్శలు చేసినా హుందాగా స్వీకరించే వారు. మేం అడిగిన ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు చెప్పేవారు. శాసన సభలో తాను, జైపాల్ రెడ్డి ఎన్నో సార్లు ప్రశ్నలు సంధించేవాళ్లం’ అని చెప్పారు. పదవులకే వన్నె తెచ్చారు.. ఆయన చేపట్టిన ప్రతి పదవికి వెన్నె తెచ్చారని వెంకయ్య నాయుడు కొనియాడారు. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని, రైతు కుటుంబం వచ్చి.. రైతులకు ఎంతో మేలు చేశారని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు. నీటి పారుదల రంగం కోసం విస్తృతంగా కృషి చేశారన్నారు. పరిపాలనలో ఉన్న లోటుపాట్లను సరి చేశారన్నారు. భూ సమస్యల పరిష్కారం కొసం కొత్త పద్దతిని అవలంబించారని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు.. నిరుపేదలకు భూ పంపిణీ చేశారని పేర్కొన్నారు. యువత నక్సలిజం, తీవ్రవాదం వైపు మళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో మర్రి చెన్నారెడ్డి అవలంబించిన విధానాలను ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. వ్యక్తిగత దూషణలు ప్రమాదకరం.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలు ప్రమాదకరమని.. మన దగ్గర సబ్జెక్టు ఉంటే అరిచి గగ్గోలుపెట్టాల్సిన అవసరం ఉండదని వెంకయ్య నాయుడు అన్నారు. నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినప్పుడే వ్యవస్థను మెరుగుపర్చవచ్చని పేర్కొన్నారు. కన్నతల్లిని, మాతృభూమిని మరిచిపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. సాధించే వరకు నిద్రపోయే వారు కాదు.. భారత రాజకీయ చరిత్రలో చెన్నారెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా గొప్పదని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన అనుకున్నది సాధించే వరుకు నిద్రపోయేవారు కాదన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేవారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత కూడా ఆయన అన్ని ప్రాంతాల వారి హృదయాలను గెలుచుకున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు. ఎస్సారెస్పీతో తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. ఆయన గొప్ప జాతీయవాది అని, రాజస్థాన్ గవర్నర్‌గా ఉండి కశ్మీర్ అంశంపై మాట్లాడిన వ్యక్తి అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన ఓ మహానుభావుడు.. మర్రి చెన్నారెడ్డి ఎంతంటి గొప్పవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఓ మహానుభావుడని మాజీ గవర్నర్ కె.రోశయ్య పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టారని, వాటికి వన్నె తెచ్చారని తెలిపారు. అభివృద్ధిపైనే చర్చించే వారు.. మర్రి చెన్నారెడ్డిని ఎప్పుడు కలిసినా అభివృద్ధి గురించే చర్చించేవారని సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేదన్నారు. ఆయన పోరాటం ఎంతో గొప్పది.. పేదల అభివృద్ధికి మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ నేత ఆర్సీ కుంతియా అన్నారు. ఇందిరాగాంధీతో రాజకీయంగా ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. తెలంగాణ సాధించడం కోసం చెన్నారెడ్డి చేసిన పోరాటం ఎంతో గొప్పదన్నారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఏ బాధ్యత చేపట్టిన దానికి వెన్నె తెచ్చారన్నారు. -
పుస్తక రూపంలో చెన్నారెడ్డి జీవిత చరిత్ర
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకువచ్చి భవిష్యత్ తరాలకు తెలియజేయాలని పలువురు రాజకీయ, ప్రముఖ వక్తలు అభిప్రాయపడ్డారు. గొప్ప పరిపాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడైన చెన్నారెడ్డిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో ఉన్న మర్రి చెన్నారెడ్డి రాక్‌గార్డెన్‌లో చెన్నారెడ్డి మ్యూజియం ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదివారం ఇందిరాపార్కు రాక్‌గార్డెన్‌లో చెన్నారెడ్డి శత జయంతి (100) ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభలో ప్రతిపక్షాల దాడిని సైతం హుందాగా స్వీకరించే ముఖ్యమంత్రుల్లో స్వర్గీయ చెన్నారెడ్డి ఒకరని కితాబిచ్చారు. చెన్నారెడ్డి జీవితం పట్టువిడుపులా ఉండేదని, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని తెలిపారు. గొప్ప వ్యక్తిత్వం గల బహుముఖ ప్రజ్ఞశాలి చెన్నారెడ్డి అని కొనియాడారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ.. చెన్నారెడ్డి కొందరివాడు కాదని, అందరి వాడని, తనతో విభేదించే వారిని కూడా ఆమోదింపజేసుకునే విలక్షణ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ గవర్నర్లు రోశయ్య, రాంమోహన్‌రావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వరరెడ్డి, నంది ఎల్లయ్య, టి.సుబ్బరామిరెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డీకే అరుణ, సమర సింహారెడ్డి, ఉమావెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, గడ్డం ప్రసాద్‌కుమార్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, కిష్టయ్య, దైవజ్ఞశర్మ, ఏఐసీసీ సభ్యుడు ఎం.సూర్యనాయక్, మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయన సమాధి, విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. -
పరిపాలనాదక్షుడు మర్రి చెన్నారెడ్డి
పరిపాలనపై సంపూర్ణ అవగాహన, పూర్తి పట్టు ఉన్న చెన్నారెడ్డి 33 ఏళ్లకే మంత్రి కాగలిగారు. సీఎంగా ఉన్నతాధికార వర్గంపై అదుపు, ప్రభుత్వ ఫైళ్లు, పాలనపై లోతైన అవగాహనతో మర్రి పాలన సాగించారు. అధికారులు చెప్పినట్టు సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, నోటింగ్‌లు రాసి మరీ సంతకం చేసేవారనీ, తనదైన నిర్ణయం తీసుకునేవారనీ ప్రతీతి. అలంకారపూరితమైన గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు సైతం మర్రి నిజమైన అధికారాలున్న నేతగా కనిపించడం, రాజకీయ నేతలా మాట్లాడడం చరిత్రలో భాగమే. ఇంతటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్న చెన్నారెడ్డి శత జయంతి నేడు. ఆయన ఆనవాళ్లు తెలుగునాట ఇంకా సజీవంగా నిలిచే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జాడలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ చెక్కుచెదర లేదు. 1969–70 తెలంగాణ ఉద్యమ సారథిగానే మొదట ఆయన తెలుగువారికి పరిచయమయ్యారు. ఉద్యమానికి ముందు, తర్వాత ఆయన కాంగ్రెస్ నేతగా అనేక పదవులు నిర్వహించారు. ఆరో ముఖ్య మంత్రిగా రెండున్నరేళ్లకు పైగా పనిచేసిన పదేళ్ల తర్వాత ఏడాదిపాటు ఇదే పదవి చేపట్టారు. సీఎం పదవిలో కన్నా గవర్నర్ పదవిలోనే ఎక్కువ కాలం పనిచేశారు. పార్టీ నాయకత్వంతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడానికి వెనుకాడలేదు. ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీతో రాజీపడి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి ఉన్నత పదవులు స్వీకరించడం కూడా చెన్నా రెడ్డి రాజకీయ జీవితంలో భాగమే. ఇందిర కేబి నెట్లో ఉక్కు, గనుల శాఖా సహాయ మంత్రిగా ఉన్న ఏడాది కాలంలో, సీఎంగా ఉమ్మడి ఏపీని పాలించిన రెండుసార్లూ పాలనాదక్షునిగా పేరు తెచ్చుకున్నారు. చెన్నారెడ్డిని మంత్రివర్గం వెలుపలా, వల్లూరి బసవ రాజుని మంత్రివర్గం లోపలా ఉంచితే చిక్కులు తప్ప వని కాంగ్రెస్‌పార్టీకి చెందిన సీనియర్ నేతలు చెప్పు కునేవారు. పరిపాలనపై సంపూర్ణ అవగాహన, పూర్తి పట్టు ఉన్న చెన్నారెడ్డి 33 ఏళ్లకే మంత్రి కాగలిగారు. అసమ్మతి రాజకీయాల కారణంగా సీఎం పదవిలో ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. తాండూరు ఎన్నికతో ఊహించని మలుపు! 1950 నుంచి సాఫీగా సాగిన ఆయన రాజకీయ జీవితం 1967 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త మలుపు తిరి గింది. తాండూరులో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావును ఓడించి నాలుగో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వెంటనే కాసు కేబినెట్లో మరోసారి మంత్రి పదవి చేపట్టాక మర్రి రాజకీయ జీవితంలో ఊహించని మార్పులు మొద లయ్యాయి. అప్పటి ప్రధాని ఇందిర చెన్నారెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని రాజ్యసభకు నామి నేట్ చేశారు. తాండూరు ఎన్నికల ప్రచారంలో చెన్నా రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన ఎన్నికను సవాలు చేస్తూ రామచంద్రరావు హైకోర్టుకెక్కారు. హైకోర్టు మర్రి ఎన్నిక చెల్లదని తీర్పు ఇస్తూ ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్ధించడంతో 1968లో చెన్నారెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి చట్ట సభలకు దూరమయ్యారు. 1956లోనే ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన నేప థ్యం చెన్నారెడ్డిది. తెలంగాణ ఉద్యమం నడపడానికి వచ్చిన అవకాశంతో ఆయన తన సామర్థ్యాన్ని నిరూ పించుకున్నారు. ఈ ఉద్యమకాలంలో హైదరాబా ద్లో స్థిరపడిన కోస్తా, రాయలసీమ జిల్లాలకు చెందిన వారిపై చెదరుమదురుగా మొదలైన దాడులు చెన్నారెడ్డి సకాల జోక్యంతో నిలిచిపోయాయని ఆయ నకు పేరొచ్చింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణ ప్రజా సమితి(టీపీఎస్) తెలంగాణలోని 14 సీట్లలో పది గెలుచుకోవడానికి చెన్నారెడ్డి నాయ కత్వం తోడ్పడింది. తెలంగాణ ప్రజల మనోభావా లను గమనించిన ఇందిర పిలుపు మేరకు టీపీఎస్‌ను మర్రి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1974లో అనర్హతా కాలం ముగిశాక ఇందిర సూచన మేరకు గవర్నర్ పదవి చేపట్టారు. ఇందిర పిలుపు మేరకు యూపీ గవ ర్నర్ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్(ఐ) అధ్యక్షుడయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్–ఐ మెజారిటీ సాధించడంతో ఆయన తొలి సారి సీఎం పదవి సాధించారు. పాలనలో వినూత్న పోకడలు చెన్నారెడ్డి సీఎంగా ఉండగానే హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి వేగం పెరిగింది. ఎవరూ ఊహించని రీతిలో 40 ఏళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పనివారం ప్రవేశపెట్టారు. ఆచరణలో ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో పాత పద్ధతిని పునరుద్ధరించడానికి చెన్నారెడ్డి వెనుకా డలేదు. ఇందిరాగాంధీ ప్రధాని పదవిలో లేనప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం చెన్నారెడ్డికి ఎక్కువ అధికారం, స్వేచ్ఛ అనుభవించే అవకాశం కల్పిం చింది. దాంతోపాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యత కూడా మర్రిపైనే పడింది. ఈ నేపథ్యంలో ఆయన సర్కారుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. గన్నవరం నుంచి శాసన సభకు ఎన్నికైన సీపీఎం నేత పుచ్చలపల్లి సుందర య్యను రాష్ట్ర డ్రయినేజీ బోర్డు చైర్మన్ పదవి తీసు కునేలా మొదట మర్రి ఒప్పించగలిగారు. తెలుగు నాట వేళ్లూనుకున్న కాంగ్రెస్ వర్గ రాజకీయాలను అధికారం, తెలివితేటలతో ఆయన అదుపు చేయగలి గారు. 1980 జనవరి పార్లమెంటు మధ్యంతర ఎన్ని కల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ఇందిర మరో సారి ప్రధాని అయ్యాక చెన్నారెడ్డికి ఇబ్బందులు ఎదు రయ్యాయి. రాష్ట్ర కేబినెట్లోని, కాంగ్రెస్‌లోని అస మ్మతి వర్గానికి అధిష్టానం అండ దొరికింది. అసమ్మ తివర్గంలో మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరిపో యారు. ఫలితంగా చెన్నారెడ్డి అదే ఏడాది అక్టోబర్‌లో పదవికి రాజీనామా చేశారు. మళ్లీ గవర్నర్ పదవి పంజాబ్‌లో ఉగ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ పదవిని చేపట్టాలని ఇందిర ఆదేశించడంతో చెన్నారెడ్డి చండీగఢ్ వెళ్లిపోయారు. తర్వాత కొన్నా ళ్లకు కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి తన అనుచ రులతో నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. 1984 డిసెంబర్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో అనూహ్యంగా కరీంనగర్ నుంచి పార్లమెంటుకు పోటీచేసి మర్రి చొక్కారావు చేతిలో ఓడిపోయారు. తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్‌లో మళ్లీ చేరిపోయారు. 1978లో మాదిరిగానే 1989 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమ యంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం చెన్నారెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అప్పగించగా ఆయన పార్టీని విజయ పథంలో నడిపించారు. 1989 డిసెం బర్లో సీఎం పదవిని రెండోసారి అధిష్టించిన మర్రి ఏడాదికే అసమ్మతి మంటల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత ఎన్నికల రాజకీయాలకు దూరమై మరణించే వరకూ ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ పదవిలోనే కొనసాగారు. సీఎంగా ఉన్నతాధికార వర్గంపై అదుపు, ప్రభుత్వ ఫైళ్లు, పాలనపై లోతైన అవగాహనతో మర్రి పాలన సాగించారు. అధికా రులు చెప్పినట్టు సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, నోటింగ్‌లు రాసి మరీ సంతకం చేసేవారనీ, తనదైన నిర్ణయం తీసుకునేవారనీ ప్రతీతి. అలంకారపూరితమైన గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు సైతం మర్రి నిజమైన అధికారాలున్న నేతగా కనిపిం చడం, రాజకీయ నేతలా మాట్లాడడం చరిత్రలో భాగమే. ఇంతటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్న చెన్నారెడ్డి శత జయంతి నేడు. ఆయన ఆనవాళ్లు తెలుగునాట ఇంకా సజీవంగా నిలిచే ఉన్నాయి. (నేటి ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో డాక్టర్ ఎం. చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్స్‌లో శత జయంతి ఉత్సవం) నాంచారయ్య మెరుగుమాల‘ 99121 99385 -
పల్లె, పట్నం కలగలుపు ఎవరిదో తుది గెలుపు?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా.. రాష్ట్రంలో ఏ కొత్త పార్టీ ఏర్పాటైనా అంకురార్పణ జరిగేదిక్కడే. మారుతున్న రాజకీయ పరిస్థితులను, అనివార్యతలను అర్థం చేసుకొని ముందుకెళ్లే ఈ జిల్లా ప్రజానీకమే ప్రభుత్వ ఏర్పాటుకు దిక్సూచి. రియల్ ఎస్టేట్, పారిశ్రామికాభివృద్ధితో రాష్ట్రంలోని సగానికిపైగా ఆర్థిక సంపద ఉండేదీ.. ప్రయాణ సౌకర్యం సైతం లేని వెనుకబడిన పల్లెలు ఉండేదీ ఇక్కడే. నగర, గ్రామీణ ఓటర్ల కలబోతతో మిశ్రమ రాజకీయ వ్యూహాలను ప్రస్ఫుటించే ఈ జిల్లాకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఇక్కడి ప్రజల తీర్పే కీలకం. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి వంటి ప్రముఖులు ఈ జిల్లావాసులే. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో రంగారెడ్డి జిల్లాది ప్రత్యేక స్థానం. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీచినా రంగారెడ్డిలో నామమాత్రమే. ఉమ్మడి రంగారెడ్డిలో 14 నియోజకవర్గాలు ఉంటే అందులో 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిస్తే టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈసారి పరిస్థితి మారింది. గతంలో టీడీపీ నుంచి గెలిచిన వారు ఇపుడు టీఆర్ఎస్ తరపున బరిలో దిగితే, గతంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రమే ఇప్పుడు పోటీలో ఉన్నారు. జిల్లాలోని 7 గ్రామీణ నియోజకవర్గాలపై గ్రౌండ్ రిపోర్ట్.. తాండూరు: సై అంటే సై టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్యే ప్రధాన పోటీ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం. నారాయణ్రావుపై 16,074 ఓట్ల మెజారిటీతో మహేందర్‌రెడ్డి గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్లో చేరి మహేం దర్‌రెడ్డి పోటీలో దిగారు. దీంతో అప్పటి వరకు టీఆర్ఎస్లో ఉన్న రోహిత్‌రెడ్డికి అవకాశం రాలేదు. ఆ ఎన్నికల తర్వాత యంగ్ లీడర్స్ సంస్థ తరపున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టిన పైలెట్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరి, కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే మహేందర్‌రెడ్డి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, పైలెట్ రోహిత్‌రెడ్డి మొదటిసారి బరిలో దిగారు. ఇక బీజేపీ తరపున పటేల్ రవిశంకర్ పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ టీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మహేందర్‌రెడ్డి ముందుకు సాగుతుంటే.. నియోజవకర్గంలో తాను చేసిన సేవా కార్యక్రమాలు, గ్రామ గ్రామాన వివేకానంద విగ్రహాల ఏర్పాటు, యువత రాజకీయాల్లో రావాలంటూ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న భరోసాతో రోహిత్‌రెడ్డి ఉన్నారు. చేవెళ్ల: కాంగ్రెస్ – టీఆర్ఎస్ పోటాపోటీ మాజీ హోం మంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డి గతంలో ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలు పొందారు. ఆయన మరణానంతరం భార్య సబిత ఇక్కడి నుంచి ఎన్నికై వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో హోం మం త్రిగా పని చేశారు. 2009లో ఈ స్థానం ఎస్సీ రిజర్వు కావడంతో కేఎస్ రత్నం (టీడీపీ).. యాదయ్య (కాంగ్రెస్)పై గెలు పొందారు. 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కాలే యాదయ్య.. కేఎస్ రత్నం (టీఆర్ఎస్)పై 781 ఓట్ల మెజారిటీతో గెలు పొందారు. ఈసారి యాదయ్య టీఆర్ఎస్ నుంచి.. రత్నం కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని యాదయ్య.. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన కేడర్, కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తి తనను కలిసొస్తాయని రత్నం నమ్మకంతో ఉన్నారు. కంజర్ల ప్రకాష్ (బీజేపీ), సునీల్‌కుమార్ (బీఎస్పీ) కూడా పోటీలో ఉన్నారు. పరిగి: ఇద్దరి మధ్యే పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి బరిలో నిలవగా, టీఆర్ఎస్ నుంచి రాజకీయ కురువృద్ధుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కుమారుడు మహేశ్‌రెడ్డి తొలిసారి పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, తన తండ్రి రాజకీయ అనుభవం, తన సతీమణి ప్రచార సరళి, పార్టీ కేడర్ బలంగా ఉండటంతో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిలో గెలుపు ధీమా కనిపిస్తోంది. వివాదరహితునిగా ఉన్న పేరుకు తోడు సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేకత తనను గెలిపిస్తాయన్న ధీమాతో తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. సాగునీటి సమస్య పరిష్కారంలో ప్రభుత్వ తాత్సారం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న 300 వరకు తండాల్లోని ఓట్లు కీలకం కానున్నాయి. గుడుంబా అమ్మకాల కేసుల నమోదుపై వీరిలో వ్యతిరేకత ఉంది. వేల మందిపై కేసులు ఉంటే 160 మందికి మాత్రమే పునరావాసం కల్పించడంపై ఎస్టీల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. బహుజన్ ముక్తి పార్టీ నుంచి పోటీలో ఉన్న గట్లానాయక్ ఎస్టీల ఓట్లను కొంత మేర చీల్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌రావు యువతను తమవైపు తిప్పుకోవడంతో ఈసారి ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరగచ్చు. మహేశ్వరం : సబిత వర్సెస్ తీగల తాజా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (టీఆర్ఎస్), ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్) ఇక్కడ పోటీలో ఉన్నారు. తీగలకు వివాదరహితునిగా పేరున్నా ఆయన హయాంలో నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రచారం పూర్తి చేసిన కృష్ణారెడ్డి మూడోసారి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న భరోసాతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటుబ్యాంకు, గతంలో ఎమ్మెల్యేగా తను చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయన్న ధీమాతో సబిత ఉన్నారు. వ్యక్తిగత ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తాయని ఆమె భావిస్తున్నారు. ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ కూడా అలుపు లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. వికారాబాద్: ముగ్గురి మధ్య ఉత్కంఠ పోరు వికారాబాద్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీ.. టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్ ఇవ్వకుండా డాక్టర్ మెతుకు ఆనంద్‌కు అవకాశమిచ్చింది. మరోవైపు ఎ.చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. ఆయనకు బదులు గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఇవ్వడంతో చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ క్రమంలో సంజీవరావు కూడా టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి చంద్రశేఖర్ తరపున ప్రచారం చేస్తుండటంతో రాజకీయం రసకందాయంలో పడింది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కంటే కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులే ప్రచారంలో ముందున్నారు. ప్రధాన పోటీ వారిద్దరి మధ్యే ఉంది. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా, విద్యావేత్తగా చంద్రశేఖర్‌కు పేరుంది. ఆయన విద్యా సంస్థల్లో పిల్లలను చదివించిన ప్రతి గ్రామంలో అనేకమంది తల్లిదండ్రులతో పరిచయాలు ఉండటం తనకు మేలు చేస్తుందని ఆయన భావిస్తున్నారు. అలాగే, తన విద్యాసంస్థల్లో చదివే పిల్లల ఫీజుల విషయంలో ఆయన సానుకూలంగా ఉండేవారనే పేరుంది. ఇక నియోజకవర్గంలో ప్రజలందరికీ పాస్ బుక్కులు, రైతుబంధు చెక్కులు అందకపోవడం, అసంతృప్తి తనను గెలిపిస్తాయని కూటమి తరఫున పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్‌కుమార్ భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు తనను బయట పడేస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం: చీలే ఓటు.. ఎవరికో లాభం? ఇబ్రహీంపట్నంలో తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (టీఆర్ఎస్), టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి (ప్రజా కూటమి) పోటీ పడుతున్నారు. ఈ స్థానాన్ని ఆశించిన కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున పోటీలో దిగారు. సామ రంగారెడ్డి ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. ప్రధాన పోటీ మల్రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మధ్యే ఉంది. గతంలో ఓడిపోయారన్న సానుభూతి మల్‌రెడ్డికి కొంత ఉంది. ఆ సానుభూతితోపాటు తన హయాంలో చేసిన అభివృద్ధి తనకు మేలు చేస్తుందని, మరోవైపు బలమైన కాంగ్రెస్ పార్టీ కేడర్ తన గెలుపునకు దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ హవా కలిసివస్తాయని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన క్యామ మల్లేష్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు కొంత వరకు మారాయి. కాంగ్రెస్ పార్టీలోని మల్లేశ్ వర్గం ఓట్లు మల్‌రెడ్డికి పడతాయా? కిషన్‌రెడ్డికి పడతాయా? అన్నది ఆసక్తికరం. రంగారెడ్డి మాత్రం 2.5 లక్షల ఓట్లలో సగం ఓట్లు కలిగిన హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలపై దృష్టిపెట్టి ప్రచారం చేస్తున్నారు. పగడాల యాదయ్య (బీఎల్ఎఫ్) మంచాల మండలంలో కొన్ని ఓట్లు చీలుస్తారని అంచనా. చివరకు చీలిక ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. మేడ్చల్: ముగ్గురి హల్చల్ మేడ్చల్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఓటర్లను ప్రభావితం చేసే అభ్యర్థులు నలుగురు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యే ఉంది. టీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ తరఫున కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నక్క ప్రభాకర్‌గౌడ్ బీఎస్పీ నుంచి పోటీకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఇక్కడ టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన వర్గీయులు సహకరించే పరిస్థితిని బట్టి టీఆర్ఎస్ గెలుపోటములు ఉండనున్నాయి. ప్రభాకర్‌గౌడ్ కారణంగా టీఆర్ఎస్ ఓట్లు కొంత చీలే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో మల్లారెడ్డి కొన్ని మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆయనకు ప్రధాన ప్రచారాస్త్రాలు కాగా ఉద్యోగుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత తనకు మేలు చేస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి భావిస్తున్నారు. ‘రంగారెడ్డి’.. మదిలో ఏముంది? ► పరిగి, చేవెళ్లకు సాగునీటి సదుపాయం.. 2.70 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం ► వికారాబాద్–పరిగి–కొడంగల్–మక్తల్ రైల్వే లైన్ ఏర్పాటు ► తాండూరు నాపరాయి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వైద్య సదుపాయం ►వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్లో కలపడం.. ► జిల్లా కేంద్రం వికారాబాద్‌లో డిగ్రీ కళాశాల లేకపోవడం.. రోడ్ల విస్తరణ.. రూ.3 వేల కోట్లతో శాటిలైట్ టౌన్ ఏర్పాటు.. ► హైదరాబాద్ చుట్టూ విస్తరించిన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో గల ఉద్యోగుల ఐఆర్ విషయం ప్రస్తావన.. ►మూడో దశలో కృష్ణా జలాలను ఇబ్రహీంపట్నం చెరువుకు తరలించి వ్యవసాయానికి సాగునీటిని అందించడం ► మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం. రైతులు, వలస కార్మికులు, ఉద్యోగులే కీలకం జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గాలైన తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చెల్‌లో రైతులు, వలస కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగుల ఓట్లే కీలకం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాధారిత వ్యవసాయం ప్రధానా«ధారమైతే.. సెమీ అర్బన్‌లో వలస కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులే అత్యధికం. వారే ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుంటారు. తాండూరు కంది పంట, నాపరాయి, సిమెంటు పరిశ్రమకు కీలకమైతే పరిగి, వికారాబాద్, చేవెళ్ల పూర్తిగా వ్యవసాయాధారిత నియోజకవర్గాలే. ఇక మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ నియోజకవర్గాలు సెమీ అర్బన్. ఇక్కడ రియల్ ఎస్టేట్, వలస కార్మికులు, ఉద్యో గుల ఓట్లే గెలుపోటములను నిర్ధారించనున్నాయి. ఈసారి ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో సాగునీటి వసతి కల్పన, విద్య, వైద్య సదుపాయం వంటి హామీలే కీలకం కానున్నాయి. వికారాబాద్, పరిగి వరకు వచ్చేలా డిజైన్ చేసిన ప్రాణహిత–చేవెళ్లను రీడిజైన్‌లో పరిమితం చేసి, పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని ఇస్తామన్న ప్రభుత్వం కేటాయింపులే జరపలేదని రైతులు అంటున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ఎక్కువ మంది తమకు ఐఆర్ ఇవ్వకపోగా, ఎక్కువ వేతనాలు ఉన్నాయంటూ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆదుకుంటారని ఎదురుచూపు ఇతని పేరు వెంకటయ్య. చేవెళ్ల నియోజకవర్గం ద్యామెరగిద్దె గ్రామం. గొర్రెలను పెంచుతూ జీవనం గడుపుతున్నాడు. అయితే తను యాదవుడిని కాకపోవడంతో గొర్రెలు ఇవ్వలేదని, ఒకవేళ ఇచ్చి ఉంటే తన జీవనం మరోలా ఉండేదని అంటున్నాడు. అలాగే, తనకు పెన్షన్ మంజూరు చేస్తే.. ఈ వయసులో ఆసరాగా ఉంటుందని అన్నాడు. కౌలు రైతులకు సహాయం చేయాలి రైతుబంధు డబ్బు వచ్చింది. అయితే మాకు కొద్దిగానే భూమి ఉంది. కాబట్టి తక్కువ మొత్తం వచ్చింది. ప్రభుత్వం కౌలు చేసుకునే రైతులకు కూడా రుణమాఫీ లేదా మరో రూపంలో ఆర్థిక సహాయం అందిస్తే బాగుంటుంది. ఈ విషయం సర్కార్ ఆలోచించాలి. – అజ్మీర్, పరిగి పెంచిన పెన్షన్ ఆదుకుంటోంది ప్రభుత్వం పెన్షన్‌ను పెంచడం వల్ల ఇబ్బందులు తగ్గాయి. అంతకుముందు రూ. 200 ఉన్నపుడు ఖర్చులకు సరిపోయేవి కావు. ఈ ప్రభుత్వం పెన్షన్‌ను పెంచి ఇవ్వడం వల్ల ఎవరినీ డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండాపోయింది. ఎకరానికి రూ. 4 వేలు ఇవ్వడం కూడా ఎంతో ఉపయోగపడుతోంది. – కుమ్మరి పాపయ్య, కేసారం ఇల్లు కావాలె.. నేను ఒంటరిని. పిల్లలు ఎవరూ లేరు. ఒక్క దానినే కిరాయి ఇంట్లో ఉంటున్నా.. ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం ఇల్లు ఇస్తదని చూస్తున్నా. ఇప్పుడైనా ఇస్తరా?. గతంలో పెన్షన్ వచ్చినా డబ్బులు సరిపోయేటివి కావు. ఇప్పుడా ఇబ్బంది లేదు. – బుగ్గమ్మ, ఆగపల్లి, మంచాల మండలం రైతుబంధుతో ఎంతో ఉపయోగం రైతుబంధు పథకం కింద మొదటి విడత డబ్బు వచ్చింది. పెట్టుబడి సమయంలో ఉపయోగపడ్డాయి. అయితే మండలంలో అందరికి పాస్ పుస్తకాలు రాలేదు. వాటిని వెంటనే ఇచ్చి, అందరికి పథకం ద్వారా మేలు చేయాలి. ఎన్నికల్లో మమ్మల్ని పట్టించుకునే అభ్యర్థులకే ఓట్లు వేస్తాం. 2014లో గెలిచిన ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోలేదు. – పుణ్యానాయక్, వికారాబాద్ ఇల్లు కట్టిస్తే మేలు పేదలకు త్వరగా ఇళ్లు మంజూరు చేయాలి. గతంలో నాకు ఇల్లు మంజూరైనా మధ్యలోనే ఆగిపోయింది. ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె చెల్లించేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇందిరమ్మ ఇల్లు కాకపోయినా మరో పథకం పేరుతో అయినా ఇళ్లను మంజూరు చేయాలి. – దస్తప్ప, కరన్‌కోట్ -
ఇద్దరు సీఎంలు మన జిల్లా వాళ్లే..
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎంలుగా, మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు నిర్వర్తించి ఈ ప్రాంతానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 1980లో సీఎంగా టీ. అంజయ్య బాధ్యత స్వీకరించిన అనంతరం రామాయంపేట నుంచి శాసనసభకు పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గెలిచిన తెలంగాణ మలిదశ ఉద్యమ నేత కేసీఆర్ సీఎం పదవిని చేపట్టారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో అందోల్ ఎమ్మెల్యేగా ఉన్న దామోదర్ రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. నర్సాపూర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందిన సీ. జగన్నాథరావు డిప్యూటీ సీఎం పదవిని చేపట్టి ఈ ప్రాంత ప్రాభవాన్ని చాటారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్వాతంత్య్రానంతరం తొలిసారిగా హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న వికారాబాద్ మెదక్ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మర్రి చెన్నారెడ్డి, 1970, 80 దశకాల్లో రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1957 నాటికి వికారాబాద్ నియోజకవర్గం హైదరాబాద్‌లో అంతర్భాగం కావడంతో మర్రి చెన్నారెడ్డి పొరుగు జిల్లా నేతగా ముద్ర పడ్డారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాల మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1978–83 మధ్య కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. 1978లో మర్రి చెన్నారెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, ఆయనపై సొంత పార్టీలోనే అసమ్మతి తలెత్తింది. దీంతో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న టంగుటూరి అంజయ్య 11 అక్టోబర్ 1980న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల మేరకు ఆరు నెలల్లోగా శాసనసభలో ప్రాతినిథ్యం పొందాల్సి ఉండటంతో ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అంజయ్య సన్నద్దమయ్యారు. రామాయంపేట ఎమ్మెల్యే రాజన్నగారి ముత్యంరెడ్డిని రాజీనామా చేయించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 1981 ఏప్రిల్ 8న జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసిన అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే కొద్దికాలంలోనే కాంగ్రెస్ అసమ్మతి రాజకీయాల మూలంగా 1982 ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1983 ఎన్నికల్లోనూ రామాయంపేట అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేసిన అంజయ్య విజయం సాధించారు. నాటి ఉద్యమ నేతే.. నేటి సీఎం 1983 ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కే. చంద్రశేఖర్‌రావు తొలి ప్రయత్నంలో ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999 సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి వరుస విజయాలు సాధించిన కేసీఆర్.. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుతో విభేదించి టీడీపీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ను స్థాపించారు. 2001 ఉప ఎన్నికతో పాటు, 2004 సాధారణ ఎన్నికల్లోనూ సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ విజయం సాధించి, సిద్దిపేటలో డబుల్ హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. 2004లో కరీంనగర్, 2009లో మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కేసీఆర్, తిరిగి 2014 సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2014లో జరిగిన తొలి ఎన్నికలో కేసీఆర్.. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకతను చాటారు. డిప్యూటీ సీఎంగా సీజేఆర్.. 1961లో నర్సాపూర్ సమితి అధ్యక్షుడిగా పనిచేసిన సి.జగన్నాథరావు 1962లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 1962–1994 మధ్యకాలంలో ఎనిమిది పర్యాయాలు నర్సాపూర్ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1967, 1972, 1983 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన సీజెఆర్ పలువురు ముఖ్యమంత్రుల కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1982 ఫిబ్రవరి 24న భవనం వెంకట్రాంరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్లో సీజేఆర్ ఉపముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రిగా పనిచేశారు. ఒక పర్యాయం రాష్ట్ర శాసనమండలికి కూడా సీజెఆర్ ఎన్నికయ్యారు. ఉద్యమ నేపథ్యంలో ఉప మఖ్యమంత్రిగా దామోదర.. తండ్రి రాజనర్సింహ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న దామోదర రాజనర్సింహ 1989 ఎన్నికల్లో తొలిసారిగా అందోలు రిజర్వుడు స్థానం నుంచి కాంగ్రెస్ పక్షాన విజయం సాధించారు. 1989 మొదలుకుని ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు అందోలు స్థానానికి పోటీ చేసిన దామోదర నాలుగు పర్యాయాలు గెలుపొందారు. 2007 ఏప్రిల్‌లో జరిగిన కేబినెట్ విస్తరణలో అందోలు ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహకు వైఎస్ కేబినెట్లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా చోటు దక్కింది. 2009 ఎన్నికల్లో వైఎస్ నేతృత్వంలో ఏర్పాటైన మలి విడత కేబినెట్లో దామోదర రాజనర్సింహ మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 2009 సెప్టెంబర్ 02న సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన స్థానంలో కే.రోశయ్య సీఎం పదవి చేపట్టగా, వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన దామోదర, గీత, సునీత చేరారు. 2010 నవంబరులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్‌రెడ్డి పదవి చేపట్టగా, ఈ ముగ్గురు నేతలకే మళ్లీ మంత్రి పదవి దక్కింది. అయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం దామోదర రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నత విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
ఆరేళ్ల అసెంబ్లీ ఇదొక్కటే!
1972 ఎన్నికలకు ఏడాది ముందునుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకోసం ఉద్యమాన్ని నడిపిన మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపించింది. నాటకీయ పరిణామాల మధ్య చెన్నారెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ రాజకీయాల పరిణామక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు తొలి తెలంగాణ సీఎంగా పీవీ నరసింహారావు బాధ్యతలు స్వీకరించారు. 1972 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నడూలేనంత ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52.3% ఓట్లు సంపాదించింది. అంతకుముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ఎప్పుడూ ఇంతశాతం ఓట్లను పొందలేదు. తెలంగాణలోని 101 సీట్ల (ఏపీ మొత్తంగా 287)లో ఎస్సీలకు 17, ఎస్టీలకు మూడు అసెంబ్లీ స్థానాలు రిజర్వ్‌చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు 17 మంది పోటీలేకుండా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 78 సీట్లు వచ్చాయి. అయితే 1972 చివర్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడం.. దీన్ని సమర్థవంతంగా అణచివేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలతో సీఎం పదవిని పీవీ వదులుకోకతప్పలేదు. ఆ తర్వాత 11 నెలలపాటు రాష్ట్రపతి పాలన తర్వాత జలగం వెంగళ్రావు సీఎం బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఇందిర జోరుకు చెన్నారెడ్డి బ్రేకులు నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1971లో ముందస్తు పార్లమెంటు ఎన్నికలకు వెళ్లారు. ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ (కొత్త కాంగ్రెస్ లేదా కాంగ్రెస్–రిక్విజిషనిస్ట్) ఘనవిజయం సాధించింది. అంతకు కొద్దినెలల క్రితమే బంగ్లాదేశ్ అవతరణకు దారి తీసిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయం తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగులేని విజయాలు లభించాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆమె పప్పులు ఉడకలేదు. ఇందిర జోరుకు చెన్నారెడ్డి బ్రేకులు వేశారు. ఈ ప్రాంతంలోని మొత్తం 14 పార్లమెంటు స్థానాల్లో టీపీఎస్ 10చోట్ల విజయం సాధించింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానంద రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీపీఎస్ ఘన విజయం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం జరిగింది. ఈ సమయంలో ఇందిర, చెన్నారెడ్డి మధ్య కుదిరిన ఒప్పందాల్లో భాగంగానే పీవీ నరసింహారావు (తెలంగాణకు సీఎం పదవి ఇవ్వాలని)ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే.. పీవీ 1971 సెప్టెంబర్ 30 ప్రమాణం చేసిన ఆరు నెలలకే 1972 మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మైనార్టీలు, బీసీలకు గుర్తింపు టికెట్ల కేటాయింపులో గతంలో పోల్చితే తెలుగునాట వెనుకబడిన కులాలు, మైనారిటీలకు కొంత ప్రాధాన్యం కూడా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి కారణమైంది. చీలిక తర్వాత సీపీఎం నుంచి అనేక నక్సలైట్ పార్టీలు పుట్టడం కామ్రేడ్లకు చాలా నష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకే ఎక్కువ సీట్లు (16) రావడం ఇందుకు నిదర్శనం. సీపీఐకి మూడు, ఎంఐఎంకు రెండు సీట్లు లభించాయి. చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఇష్టంలేని కొందరు నేతలు ‘సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి’పేరుతో పోటీచేశారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జెట్టి ఈశ్వరీబాయి ఒక్కరే గెలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి టికెట్ లభించకపోవడంతో వారు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేశారు. వారిలో కొందరు ఇండిపెండెంట్లుగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 57 మంది స్వతంత్రులుగా గెలిచారు. పీసీసీ అధ్యక్షునిగా కాకినాడకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ ఉన్నారు. ముఖ్యమంత్రి పీవీ, పీసీసీ నేత ఇద్దరూ పలుకుబడి ఉన్న నేతలు కాకపోవడంతో రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ హైకమాండ్ పెత్తనం పెరిగింది. ఆరేళ్ల అసెంబ్లీ ఇదొక్కటే! 1972 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఐదో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆరేళ్లపాటు కొనసాగింది. ఎమర్జెన్సీ కాలంలో చట్ట సవరణతో అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితిని మరో ఏడాది పొడిగించారు. ఈ కారణంగా మామూలుగా 1977లో జరగాల్సిన ఎన్నికలు 1978లో జరిగా యి. ఈ ఆరేళ్ల కాలం లో పీవీ, జలగం కలిసి ఐదేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. రాష్ట్రపతి పాలనను తెలుగు ప్రజలు మొదటిసారి చూశారు. చివరిసారిగా అసెంబ్లీకి పీవీ సీఎం పీవీ నరసింహారావు నాలుగోసారి కరీంనగర్ జిల్లా మంథని నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన అసెంబ్లీకి పోటీచేయడం ఇదే చివరిసారి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి జేవీ నరసింగరావు లక్సెట్టిపేటలో మరోసారి విజయం సాధించారు. పీవీ తర్వాత రెండో తెలంగాణ ప్రాంత సీఎం అయిన జలగం వెంగళరావు వేంసూరులో విజయంసాధించారు. పీవీ కేబినెట్ సభ్యులైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు జె.చొక్కారావు (కరీంనగర్), మహ్మద్ ఇబ్రహీం అలీ అన్సారీ(పాలమూరు), ఎం.మాణిక్‌రావు (తాండూరు), సహాయ మంత్రులు సి.రాజనరసింహ (ఆంధోల్), పి.మహేంద్రనాథ్ (అచ్చంపేట), కె.భీంరావు (ఆసిఫాబాద్), ఎ.మదన్మోహన్ (సిద్దిపేట) విజయం సాధించారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి నిర్మల్ నుంచి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా కల్వకుర్తి నుంచి మరోసారి గెలిచారు. కొన్నేళ్ల తర్వాత కేబినెట్ మంత్రి అయిన కమతం రాంరెడ్డి పరిగి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు టి.అంజయ్య (ముషీరాబాద్), కొండా లక్ష్మణ్ బాపూజీ (భువనగిరి), పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (మునుగోడు) తదితరులు కూడా శాసనసభకు ఎన్నికయ్యారు. పీవీ కేబినెట్ మంత్రి టి.హయగ్రీవాచారి ఘన్పూర్ నుంచి సీపీఐ నాయకురాలు ఆరుట్ల కమలాదేవిపై విజయం సాధించారు. 1969–71 మధ్య జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై గెలిచిన ఎ.మదన్మోహన్ (సిద్దిపేట), నాగం కృష్ణారావు (ఖైరతాబాద్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం నేత సలావుద్దీన్ ఓవైసీ హైదరబాద్ నగరంలోని యాకుత్‌పురాలో జనసంఘ్ అభ్యర్థి ఆర్.అంజయ్యను ఓడించి అసెంబ్లీకి మూడోసారి వరుసగా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు కాలంలో సహచరులతో మర్రి చెన్నారెడ్డి పీవీ సర్కారు రాజీనామా, రాష్ట్రపతి పాలన! రాష్ట్రంలో మొత్తం 219 సీట్లు, తెలంగాణలో దాదాపు ఐదింట నాలుగొంతుల సీట్లు (78/101) కైవసం చేసుకున్నా ఎన్నికలు జరిగిన ఏడాదిలోపే వచ్చిన ముల్కీ నిబంధనల రద్దుకు, తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ వచ్చిన ‘జై ఆంధ్ర’ఉద్యమం ఊపందుకుంది. దీని కారణంగా పీవీ ప్రభుత్వం 1973 జనవరి రెండో వారంలోనే రాజీనామా చేసింది. ఉద్యమం కారణంగా పాలన స్తంభించడంతో అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ 11నెలలు రాష్ట్రపతి పాలన విధించారు. డిసెంబర్లో మాజీ హోంమంత్రి వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఓడిన ప్రముఖులు కాంగ్రెస్ నేత డీకే సత్యారెడ్డి కుమారుడు డీకే సమరసింహారెడ్డి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై గద్వాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. అలాగే అంతకుముందు అసెంబ్లీకి రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన టీఎన్ సదాలక్ష్మి వికారాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థి తిరుమలయ్య చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఏఎస్పీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బద్రివిశాల్ పిత్తీ మహరాజ్‌గంజ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపో యారు. గతంలో రెండుసార్లు విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు రెడ్డిగారి రత్నమ్మ రామాయంపేటలో ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కమ్యూనిస్ట్ నేత చెన్నమనేని రాజేశ్వరరావును సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింగరావు ఓడించారు. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్.యతిరాజారావు భార్య విమలాదేవి వరంగల్ జిల్లా చెన్నూరులో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఆరుగురు మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. వారిలో ఐదుగురు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. రిపబ్లికన్ పార్టీ నాయకురాలు జెట్టి ఈశ్వరీబాయి ఈసారి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరఫున గెలిచారు. పార్లమెంటులో టీపీఎస్ జోరు తెలంగాణలోని మొత్తం 14 ఎంపీ సీట్లలో టీపీఎస్ 10 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాజా రామేశ్వరరావు (పాలమూరు), జీఎస్ మేల్కొటే (హైదరాబాద్), ఎంఎం హషీం (సికింద్రాబాద్), ఎం.మల్లికార్జున్ (మెదక్), ఎం.సత్యనారాయణరావు (కరీంనగర్), కంచర్ల రామకృష్ణారెడ్డి (నల్లగొండ), వి.తులసీరాం (పెద్దపల్లి–ఎస్సీ)లు టీపీఎస్ తరపున గెలిచి తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లారు. డీకే సత్యారెడ్డి (పాలమూరు), కేఎల్ నారాయణ (సికింద్రాబాద్), టీఎన్ సదాలక్ష్మి (టీఈసీ) వంటి ప్రముఖులకు ఓటమి తప్పలేదు. మిర్యాలగూడ నుంచి సీపీఎం అభ్యర్థిగా భీంరెడ్డి నర్సింహారెడ్డి గెలుపొంది తొలిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ఏకగ్రీవ హీరోలు మక్తల్ – రామచంద్రరావు కల్యాణీ తాండూరు – ఎం.మాణిక్‌రావు, ముధోల్ – జి.గడ్డెన్న నిర్మల్ – పి.నర్సారెడ్డి ఆ ఐదుగురు శాంతాబాయి తపాలికర్ – గగన్‌మహల్ బి.సరోజినీ పుల్లారెడ్డి – మలక్‌పేట సుమిత్రాదేవి – మేడ్చల్ దుగ్గినేని వెంకట్రావమ్మ – మధిర ప్రేమలతా దేవి – నుస్తులాపూర్ -
ఐఏఎస్ అధికారికి ఏ శాఖా అప్రధానం కాదు
తెలంగాణ రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు తమను ‘‘అప్రధానమైన’’ పోస్టుల్లో నియమిస్తున్నారనీ, సీనియారిటీ లేకపోయినా ఇతరులకు కీలక పోస్టులు కట్టబెడుతున్నారనీ, తమ పట్ల వివక్ష చూపుతున్నారనీ, ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు వార్తలొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యం కోసం అవసరమైనప్పుడు బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులలో కొందరు తమకు ప్రాధాన్యత పోస్టులు లభించలేదన్న అసంతృప్తితో వున్నారని వార్తలొస్తున్నాయి. వారిలో కొందరు తమ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోలేదని, మరి కొందరు తమను అంతగా ప్రజలతో సంబంధం లేని పదవులకు పంపారని– తామెంత బాగా పనిచేస్తున్నప్పటికీ తమ సమర్థతకు తగిన గుర్తింపు రాలేదని, తమపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని కూడా ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి, వీరంతా తమకప్పగించిన ఏ బాధ్యతనైనా, అది ఏ శాఖకు సంబంధించినదైనా అరమరికలు లేకుండా, ప్రధానమా? అప్రధానమా? అని ఆలోచించకుండా విధులు, బాధ్యతలు నిర్వర్తించాలి. అలా కాకుండా ఆరోపణలు చేయడం సమంజసమా? 1995 సెప్టెంబర్ నెలలో నాకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డెప్యుటేషన్ మీద ఉద్యోగం వచ్చినప్పుడు, అక్కడకు చేరుకోవడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. కారణం, ఆ సంస్థ చిరునామా కనుక్కోవడం కూడా చాలా కష్టమైంది. అప్పట్లో ఆ సంస్థలో పోస్టింగ్ అంటే ఒక పనిష్మెంట్ లాగా భావించేవారు. ఒక ఏడాదిన్నర తరువాత నేనక్కడ పనిచేస్తున్నప్పుడే, స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దగ్గర మీడియా సలహాదారుడిగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ అనే ఐఏఎస్ అధికారి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్‌గా, ఊర్మిళా సుబ్బారావు అనే మరో ఐఏఎస్ అధికారిణి అదనపు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. వీళ్ళిద్దరినీ అక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నిం చినవారికి, వాళ్లిచ్చిన జవాబు, విశ్రాంతిగా పనిచేసుకోవడానికని. కానీ, ఆ తరువాత జరిగిందేమిటి? 1995లో ఎవరికీ అంతగా తెలియని ఆ శిక్షణా సంస్థ అచిరకాలంలోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంస్థగా, ప్రపంచ శిక్షణా సంస్థల చిత్రపటంలో అతిప్రధానమైన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. దానికి కారణం.. పనిష్మెంట్ పోస్టింగ్ అని ఇతరులు భావించిన చోటే, పీవీఆర్కే ప్రసాద్, ఊర్మిళా సుబ్బారావులు అపారమైన నిబద్ధతతో ఆ సంస్థను అంచెలంచలుగా అభివృద్ధి చేశారు. అక్కడ ఇప్పుడు పనిచేయడం అంటే ఒక పెద్ద క్రెడిట్‌గా భావిస్తారు. పీవీ నరసింహారావును మంత్రిమండలిలోకి తీసుకునే ముందర ఆయనకేం పోర్ట్ ఫోలియో కావాలని అడిగిన ఇందిరాగాంధీ, రక్షణ శాఖ కానీ, విదేశాంగ శాఖ కానీ, మరేదైనా మంచి శాఖ కానీ ఆయన అడుగుతాడని భావించారు. దానికి భిన్నంగా విద్యాశాఖ కోరుకున్నాడట! అదేంటి అలాంటి అప్రధానశాఖ అడిగావంటే, ప్రభుత్వంలో ఏదీ అప్రధానమైన శాఖ కాదని జవాబిచ్చాడు పీవీ. ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు ఆ శాఖను పీవీ. స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి రెండవసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, మునిసిపల్ శాఖ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించి, అప్పటి ఆ శాఖా మంత్రితో (స్వర్గీయ కోనేరు రంగారావు) రాజీనామా చేయించి, సంబంధిత ఐఏఎస్ అధికారి సి.అర్జున్ రావును, అందరూ అప్రధానమైందని భావించే ‘విపత్తుల నిర్వహణ’ శాఖకు కార్యదర్శిగా బదిలీ చేయించారు సీఎం. కొన్నాళ్లకే మే నెల 13, 1990న భయంకర పెనుతుఫాను రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. విపత్తుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న అర్జున్‌రావు, తన అసమాన ప్రతిభతో వేలాదిమంది ప్రాణాలు కాపాడడానికి ముందస్తు చర్యలు చేపట్టడమే కాకుండా, సహాయ–పునరావాస చర్యలు అద్భుతంగా చేపట్టి ‘విపత్తుల నిర్వహణ’ ప్రాధాన్యతను లోకానికి తెలియచెప్పాడు. రీడర్స్ డైజెస్ట్ లాంటి ప్రముఖ మ్యాగజైన్ ఆయన మీద ప్రత్యేక కథనం రాసింది. ప్రభుత్వ శాఖల్లో అన్నీ ప్రధానమైనవే. కాకపోతే వాటిని నిర్వహించేవారి సత్తాను బట్టి, వారి–వారి కృషిని బట్టి, సమయ–సందర్భాలను బట్టి, ఒక్కో శాఖకు ప్రధానమైనదిగానో, అప్రధానమైనదిగానో తాత్కాలికంగా గుర్తింపు వస్తుంది. తన శాఖ అప్రధానమైనది కాదని నిరూపించాల్సిన బాధ్యత దాన్ని నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిదే! గతంలో, ఉమ్మడి రాష్ట్రంలో, పలు సందర్భాలలో అర్హతలు కాకుండా, పలుకుబడి కలిగిన రాజ కీయ నాయకుల అండతో, వారితో వీరికున్న చనువు ఆధారంగా పదవులు పొందారన్న ఆరోపణలు అనేకం వచ్చాయి. ‘సమర్ధత‘ కన్నా, ‘చొరవ‘, ‘పలుకుబడి‘ ప్రాతిపదికలుగా, ప్రాధాన్యతల పోస్టులు దక్కించుకున్నారని అనేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత అలాంటి అవకాశం కోల్పోయిన కొందరు బహుశా తమను అప్రధానమైన శాఖలకు బదిలీ చేశారని ఆరోపిస్తున్నట్లు అర్థమవుతున్నది. వీరిలాంటి కొందరు గతంలో పదవిలో వున్న సీఎంల దగ్గర వ్యక్తిగతంగా పలుకుబడి ఉపయోగించుకోగలిగినవారైతే, ఇంకొందరు తెలుగుదేశం హయాంలో, కాంగ్రెస్ హయాంలో, చాలా కాలం ఒకే పోస్టులో ఉంటూ అధికారం, పెత్తనం పరోక్షంగా చెలాయించిన వారు కావడంతో ప్రస్తుతం బదిలీ చేసిన పోస్టులోకి వెళ్లాలన్న ఆలోచనను జీర్ణించుకొనలేకపోతున్నారేమో! ఏదేమైనా, ఫలానా పోస్టు ప్రాధాన్యతకలదని, మరోటి మామూలుదని ఎవరైనా ఐఏఎస్ అధికారి భావించడమంటే వారి అవగాహనా లోపమే అనాలి. ఐఏఎస్‌కు ఎంపికైన వారందరూ, సాహిత్యం నుంచి వైద్య శాస్త్రం వరకు, ఒకటికి మించిన విభిన్న విద్యల్లో, తమదంటూ ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడా రాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన రక్షణ వుంటుంది కాబట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన అగత్యం లేదు. ఏడాదికి పైగా శిక్షణానంతరం ఏదో ఒక సబ్ డివిజన్లో, సబ్ కలెక్టర్‌గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. అసలు సిసలైన అధికార రుచి చవి చూసే అవకాశం అలా లభిస్తుంది వారికి. సబ్ కలెక్టర్‌గా పనిచేసిన కొందరిని, అక్కడి ప్రజలు ఎన్నటికి మరవలేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలామంది వున్నారు. సబ్ కలెక్టర్ తర్వాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా, జాయింటు కలెక్టరుగా పదోన్నతి పొంది మరో మెట్టుకు ఎదుగుతారు. ఇక ఆ తర్వాత, సుమారు ఏడెనిమిదేళ్లకు, జిల్లా కలెక్టర్‌గా నియామకం దొరుకుతుంది. ఈ అన్ని పదవులకుండే మెజిస్టీరియల్ అధికారాలు, ఇక ఆ తర్వాత, ఎన్ని పదోన్నతులొచ్చినా ఉండవు. అఖిల భారత సర్వీసులలో ఐఏఎస్ కున్న ప్రత్యేకత, దానికి ఎంపికైనవారికి ఒక ‘జిల్లా కలెక్టర్’ గా పని చేయడమే. కలెక్టర్ పదవిని సుమారు పదేళ్లపాటు, వివిధ జిల్లాలలో చేపట్టి శాఖాధిపతులుగానో, కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగానో, సచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగానో పని చేసేందుకు కొందరైనా రాజధానికి చేరుకుంటారు. ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ పదవి నుంచి, రాష్ట్ర రాజధానికి చేరుకున్న తర్వాత, అటు పిమ్మట సొంత రాష్ట్రానికో, కేంద్ర సర్వీసులకో, విదేశాలలో పదవులకో వెళ్లిన తర్వాత, ఒక వైపు అట్టడుగు స్థాయి సేవలకు దూరమవడం, మరో వైపు అసలు–సిసలైన అధికారానికి దూరం కావడం జరుగుతుందనాలి. కలెక్టర్ పదవి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ఏకైక పదవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానో, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగానో నియామకం కావ డం. ఆ అవకాశం అతి కొద్దిమందికి మాత్రమే దక్కుతుంది. మిగిలిన పోస్టులన్నీ ఒకేరకమైన ప్రాధాన్యతను సంతరించుకున్నవనే అనాలి. అందుకే, ఇటీవల బదిలీ అయిన ఐఏఎస్ అధికారులలో కొందరు తమకు అప్రాధాన్యత పోస్టిం గులు ఇచ్చారనడం సరైంది కాదు. అలా భావించే ఐఏఎస్ అధికారులున్నారంటే, అది వారి అవగాహనా రాహిత్యమే అనాలి. ఉదాహరణకు తమకు అప్రధానమైన పోస్టింగులు ఇచ్చారని ఆరోపణ చేస్తున్న వారి నూతన శాఖలను పరిశీలిస్తే వాటిలో ఏదీ అప్రధానమైనది కాదని స్పష్టంగా తెలుస్తుంది. వీరిలో ఒకరు గతంలో కలెక్టర్‌గా, ఆబ్కారీ కమిషనర్‌గా, రెవెన్యూశాఖ ముఖ్య (ప్రత్యేక ప్రధాన) కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ఎస్సీ–ఎస్టీ కమిషన్‌కు కార్యదర్శి అయ్యారు. మారుతున్న సమాజంలో, సమాజంలోని బలహీన వర్గాలవారికి చేయూతను అందించాల్సిన ఈ సమయంలో బహుశా దీనికంటే మంచి ప్రాధాన్యత కల పోస్టు లేదేమో! అలాగే మరొకరిని పోస్టింగ్ చేసిన మునిసిపల్ శాఖ అయినా, ఇంకొకళ్ళను పోస్టు చేసిన హోం శాఖ అయినా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ అయినా, ఆర్కైవ్స్ శాఖ అయినా. అన్నీ ప్రధానమైనవే.. ఆలోచించి చూస్తే. కాదేదీ అప్రధానమైంది. వనం జ్వాలా నరసింహారావు, వ్యాసకర్త ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి 80081 37012 -
నిరుద్యోగ సమస్యపై ఉద్యమిద్దాం
జాతీయ సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ చేతన్ బీ సంఘీ సాక్షి, హైదరాబాద్: దేశంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాలు నిరుద్యోగమేనని జాతీయ సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ చేతన్ బీ సంఘీ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న వారిలో 35 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శుక్రవారం జరిగిన జాతీయ సాంఘిక సంక్షేమ మండలి సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి మహిళకు చేరేలా రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండళ్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం మహిళల కోసం తలపెట్టిన కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు త్వరలో రాష్ట్రాని కి కేంద్ర మంత్రి మేనకాగాంధీ రానున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ చెప్పారు. సదస్సులో వివిధ రాష్ట్రాల ఎస్ డబ్ల్యూబీ చైర్పర్సన్లు, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ పాల్గొన్నారు. -
బాలలతో పనులు చేయిస్తే ఖబడ్దార్
హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం యుద్ధం మొదలైంది. కార్మిక శాఖతోపాటు అన్ని శాఖలూ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఇకపై బాలలతో పనులు చేయిస్తే ఊరుకునేది లేదు. సమాచారం ఇస్తే చాలు దాడులు చేసి జైలుకు పంపుతాం’ అని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సదస్సులో మంత్రి మాట్లాడారు. చిన్నపిల్లల్ని పనుల్లో పెట్టుకోవడంతో పాటు వారిని హింసిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించి యజమానులపై కేసులు నమోదు చేసి బాలలకు విముక్తి కలిగిస్తున్నామని చెప్పారు. -
మర్రి చెన్నారెడ్డికి ఘన నివాళి
హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఇందిరాపార్కులో ఉన్న చెన్నారెడ్డి రాక్ గార్డెన్లో ఆయన సమాధికి స్పీకర్ మధుసూదనాచారి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. -
సాగునీటి కోసం వాటర్ షెడ్లు అవసరం
-
నీతికి నిలువెత్తు రూపమైన ప్రజానేత
ఒకే నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు వరు సగా గెలుపొందిన ఓటమి ఎరుగని ప్రజానాయకుడు ఆయన. కుల మతాలను, గ్రూపులను ఆకట్టుకొనే రాజకీ యాలకు ఆయన ఆమడ దూరం. రాజకీయమంటేనే నాలుగు డబ్బులు.. కాదు కాదు.. రూ.కోట్లు పోగేసుకునే నేటి కాలంలో విలువల కోసం కట్టుబడ్డారు... ఆస్తులు కరిగించుకొన్నారు. కానీ, నిబద్ధతకు ప్రతిరూ పంగా నిలిచారు. అందుకే ఆయన కన్ను మూసిన రోజు పార్టీల కతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన గుదిబండి వెంకటరెడ్డి. గుంటూరు జిల్లా రాజకీయాల్లో చిరపరిచితుడు. 2004 వరకు కొనసాగిన దుగ్గిరాల నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరిగితే 11సార్లు కాంగ్రెస్ పార్టీదే విజయం. 1985 వరకు ఇక్కడ ఏ ఎమ్మెల్యే కూడా రెండు పర్యాయాలు గెలుపొందలేదు. ఆ ఒరవడికి గుదిబండి గండికొట్టారు. 1989లో ఆరం భించి వరుసగా నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నిక య్యారు. సీఎంలుగా పనిచేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్. జనార్ధనరెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జిల్లా సీనియర్ నేతలు కే.రోశయ్య, ఆలపాటి ధర్మారావుతో సన్నిహితంగా వ్యవహరించేవారు. వెంకటరెడ్డి నిర్మొహమాటి. తన మనసుకు మంచి అనిపించింది ఎవరి ఎదుటైనా, ఎక్కడైనా ముక్కుసూటిగా చెప్పటం అలవాటు. సహచర శాసనసభ్యుల్లో అవినీతిపరులున్నా రంటూ సంచలన వ్యాఖ్యలు చేయటానిక్కూడా ఆయన వెనుకాడ లేదు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంకటరెడ్డికి, ఒక పర్యాయం మంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా దుగ్గిరాల నియోజకవర్గం రద్దయింది. ఆయన స్వస్థల మైన కొల్లిపర మండలం తెనాలి నియోజకవర్గంలో కలిసింది. ఆ ఎన్నికల్లో పార్టీ టికెట్ ద క్కలేదు. కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయంకోసం పాటుపడుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్ని కలకు మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుకు పనిచేసిన వెంకటరెడ్డికి పల్నాడులోని దైద, తేలుకుట్ల, కరాలపాడు, ముత్యాలం పాడు గ్రామాల్లో పంచెలు, చీరెలు పరిచి నడిపిస్తూ స్వాగతం పలకటం ఆయనకు గల ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వం కల్పించే గన్‌మ్యాన్ సౌకర్యాన్ని ఏనాడూ అంగీకరించ లేదు. ఎన్నికల్లో ఖర్చుపెట్టడమే కానీ తిరిగీ తీసుకునే అలవాటు ఆయనకు లేదు. రాజకీయ అవలక్షణాలు అంటని ఆయన వ్యక్తిత్వం మాత్రం వెలుగుదివ్వెలా వెలుగులీనుతూ ఉంది. (గురువారం గుంటూరు జిల్లా కొల్లిపరలో ఆకస్మికంగా కన్నుమూసిన సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డికి నివాళిగా..) బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి - గుదిబండి వెంకటరెడ్డి మొబైల్: 97059 31082 -
నేడు కలెక్టర్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణతోపాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థ(ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా జిల్లాల్లో నిర్వహించనున్న సంబరాలపై ప్రధానంగా చర్చించనున్నారు. జూన్ 2న అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్లను జారీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కలెక్టర్లకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది. వ్యవసాయం, కొత్త విద్యా సంవత్సరంలో అమలు చేయాల్సిన ముందస్తు ప్రణాళికలపైనా కలెక్టర్లకు ప్రభుత్వం మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. -
ఛనాఖా-కొరటపై ఒప్పందానికి సిద్ధం
సంతకాలు చేసేందుకు మహారాష్ట్ర అంగీకారం నేడు హెలికాప్టర్లో మేడిగడ్డ ప్రాంతం సందర్శనకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది పెన్‌గంగపై రాష్ట్రం నిర్మించతలపెట్టిన ఛనాఖా-కొరట బ్యారేజీపై అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు మహారాష్ట్ర సమ్మతించింది. వచ్చే నెల 15 తర్వాత జరిగే సమావేశంలో బ్యారేజీ నిర్మాణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ముసాయిదా ఒప్పందంపై వారం రోజుల్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామంది. మంగళవారం ప్రాణహిత-చేవెళ్ల అంతర్రాష్ట్ర సమన్వయ కమిటీ హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో భేటీ అయింది. రాష్ట్రం తరఫున నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, వెంకటేశ్వర్రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే... మహారాష్ట్ర తరఫున చీఫ్ ఇంజనీర్లు ఆర్ఎం చౌహాన్, హెచ్ఏ దంగారే, ఎస్ఈలు కట్పిల్ వార్, టీఎం షేక్, కుల్దీప్ హాజరయ్యారు. అంతర్రాష్ట్ర బోర్డు కార్యదర్శి నరేందర్‌రెడ్డి, సీఈ హరిరామ్‌లు మేడిగడ్డవద్ద 103 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలు, కేంద్ర జల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని.. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో మేడిగడ్డ బ్యారేజీకి, తుమ్మిడిహెట్టి వద్ద తక్కువ ముంపు ఉండేలా బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించాలని కోరారు. వీటికి సంబంధించిన సాంకేతిక అంశాలను చర్చించి స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసం పంపాలని జోషి విజ్ఞప్తి చేశారు. దీనిపై మహారాష్ట్ర సీఈ చౌహాన్ స్పందిస్తూ.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సాంకేతిక వివరాలు, ముంపును అధ్యయనం చేయాల్సుందన్నారు. ఆ తర్వాతే అభిప్రాయాన్ని చెబుతామన్నారు. నేడు పరిశీలన... మేడిగడ్డ వద్ద బ్యారేజీ ప్రతిపాదించిన ప్రాం తాన్ని తాము పరిశీలిస్తామని మహా రాష్ట్ర అధికారులు కోరారు. సమ్మతించిన తెలంగాణ అధికారులు బుధవారం వారికి ఆ ప్రాంతాన్ని చూపా లని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఇరు రాష్ట్రాలకు చెందిన 10 మంది అధికారులు రెండు హెలికాప్టర్లలో మేడిగడ్డకు వెళ్లి ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేస్తారు. ఈ సందర్భంగా జనవరి ఒకటిలోగా మేడిగడ్డకు సంబంధించిన సాంకేతిక, ముంపు వివరాలను మహా రాష్ట్రకు సమర్పించాలని ఎస్కే జోషి వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. జనవరి 15 తర్వాత స్టాం డింగ్ కమిటీలో వీటిపై చర్చించి ఒక అంగీకారానికి రావాలని భావిస్తున్నారు. అనంతరం మంత్రి మహారాష్ట్ర ప్రతినిధులను హరీశ్‌రావు కలసి... మహారాష్ట్ర అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఘర్షణ వైఖరి విడనాడి పరస్పరం సహకరించుకుంటే ఇరు రాష్ట్రాలకు ప్రయోజన కరమన్నారు. -
స్టార్టప్స్‌కు రాజధానిగా హైదరాబాద్
♦ టెక్నాలజీతో ప్రభుత్వ విభాగాల అనుసంధానం ♦ మైక్రోసాఫ్ట్ స్మార్ట్ సిటీస్ వర్క్‌షాప్‌లో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: యువతరం సరికొత్త ఆలోచనలకు, ఔత్సాహిక పరిశ్రమ (స్టార్టప్స్)లకు హైదరాబాద్ రాజధానిగా మారనుందని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ముందుకు వ చ్చే స్టార్టప్స్‌కు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. మంగళవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసిన స్మార్ట్‌సిటీస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. స్మార్ట్ సిటీస్ సొల్యూషన్స్ అంశంపై స్టార్టప్స్ రూపొందించిన ‘యాక్సలరేట్ ఇండియా’ పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల్లో హైదరాబాద్ కూడా ఉందని, నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు పరిష్కారమార్గాల కోసం స్టార్టప్స్ కృషిచేస్తున్నాయన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలను సమన్వయ పరిచి పౌరసేవలను సులువుగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. త్వరలో ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లెసైన్స్‌లు రవాణ శాఖ, ట్రాఫిక్ విభాగాలను సమన్వయపరిచి వివిధ రకా ల వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్స్‌లు ఎలక్ట్రానిక్ విధానంలో అందించేలా చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో చేపట్టనున్న ఈ పెలైట్ ప్రాజెక్టు విజయవంతమైతే మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖల సమన్వయంతో ఇటీవల ప్రారంభించిన పల్లె సమగ్ర సేవాకేంద్రాలు గ్రామీణ ప్రజల ఆదరణను చూరగొన్నాయని, ఈ-హెల్త్ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించడంతో పాటు వారి వివరాలను డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు. అలాగే నీటి సరఫరా, విద్యుత్, శాంతి భద్రతలు.. తదితర విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్మార్ట్ టెక్నాలజీస్ ద్వారా పరిష్కారాలను కనుక్కునేందుకు మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన స్టార్టప్స్ సదస్సు ఎంతగానో దోహదపడుతుందన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు ఒకే రకమైన ఈ మెయిల్ ఐడీలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మరింత సులువుగా ప్రజలకు చేర్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు స్టార్టప్స్‌తో కలసి పరిష్కారాలను రూపొందిస్తున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ నీరజ్ గిల్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ వెంచర్ల ద్వారా స్టార్టప్స్‌కు విస్తృతమైన అవకాశాలను అందించడం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నామని చెప్పారు. -
5 ముక్కలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం చేకూరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం జిల్లాల సంఖ్యను పెంచుతామని కేసీఆర్ సర్కారు ఇదివరకే ప్రకటించింది. గతేడాది కాలంగా ఈ అంశంపై ఎలాంటి కదలిక లేకపోవడంతో ప్రస్తుతానికి కొత్త జిల్లాల ప్రతిపాదనను పక్కనపెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారానికి తెరదించుతూ తాజాగా జిల్లాల డీలిమిటేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపి కొత్త జిల్లాల ఏర్పాటు తథ్యమనే సంకేతాలిచ్చింది. అందులో భాగంగా మన జిల్లాను కూడా విభజించనున్నారు. ప్రస్తుతమున్న జిల్లా రూపురేఖలు మార్చి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిపాలనా సౌలభ్య ప్రాతిపదికగా విభజించనున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా కుస్తీపడుతున్న సర్కారు 2016 నాటికి జిల్లా విభజనకు కార్యరూపం ఇచ్చే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. వికారాబాద్ ప్రాంతం.. ప్రత్యేక జిల్లా 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లో 11.09 లక్షల జనాభా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 52.76 లక్షలకు చేరింది. నగరీకరణతో జన విస్ఫోటం తలపిస్తున్న జిల్లా జనాభా ఏయేటికాయేడు పెరుగుతూ వస్తోంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజనలో ఆరు అసెంబ్లీ స్థానాలస్థానే 14 శాసనసభ సెగ్మెంట్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పరిపాలనా సౌలభ్యం మేరకు జిల్లాను విభజించాలనే అంశం చర్చకు వచ్చింది. ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో.. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ పుట్టుకొచ్చింది. దీన్ని ఎన్నికల హామీగా మార్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తే వికారాబాద్ పరిసరాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చాయి. ఈక్రమంలోనే ఇటీవల కాంగ్రెస్ కూడా ఈ అంశంపై ప్రభుత్వ జాప్యాన్ని తప్పుబడుతూ మహాధర్నా చేపట్టింది. యాదాద్రి పేరిట కొత్త జిల్లా సగటున 15 లక్షల జనాభా, ఐదు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలను పునర్వ్యస్థీకరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బ్లూప్రింట్ తయారు చేసింది. దీనికి అనుగుణంగా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు జిల్లాల్లో మిళితం కానున్నాయి. ప్రస్తుతం వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూరు, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను కలుపుతూ వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అలాగే ఇబ్రహీంపట్నం, మలక్‌పేట, మహేశ్వరం, ఎల్బీనగర్, నల్లగొండ జిల్లాలోని భువనగిరి నియోజకవర్గాలను కలుపుతూ యాదాద్రి/ హైదరాబాద్ (తూర్పు) పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, పాలనాపరంగా హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మలక్‌పేట సెగ్మెంట్లను నల్గొండ జిల్లాలోని యాదాద్రిలో కలిపినా, జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. అయితే, మలక్‌పేట లేదా ఇబ్రహీంపట్నం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తే బాగుంటుందని రాజకీయ నిపుణులు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఈ నియోజక వర్గాలను వేరే చోట కలిపితే మాత్రం పరిపాలన సౌలభ్యం మాట అటుంచితే నాలుగు నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో సహేతుక కారణాలు, శాస్త్రీయత లేకుండా నూతన జిల్లాల ఏర్పాటు తలపెడితే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్టేననే ప్రచారం జరుగుతోంది. -
భగవంతుడు టీడీపీ నేతలకు సిగ్గు పెట్టలా...
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి, ఎమ్మెల్యే ఆర్కే పట్నంబజారు(గుంటూరు) : భగవంతుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గుఎగ్గు పెట్టలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బందిపోట్లుగా మారి ప్రభుత్వ వనరులను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను పక్కన పెట్టి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సమరదీక్షను దొంగ దీక్ష అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. అరండల్‌పేటలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఐదు హామీల విషయంలో టీడీపీ నేతలు జనంలోకి వచ్చి నిజం చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. జగన్ అవినీతిపరుడని వ్యాఖ్యలు చేస్తున్న నేతలు, తెలంగాణలో రేవంత్‌రెడ్డి విషయాన్ని సైతం పరిశీలించాలన్నారు. నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే డబ్బులు ఇవ్వాలని చెప్పడం సిగ్గుచే టన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆర్కే మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేయడం టీడీపీ నేతలకు కొత్తేమీ కాదన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలను రాక్షసులుగా, తెలంగాణ నేతలను గొర్రెలుగా అభివర్ణించిన చంద్రబాబు నైతిక విలువలు మరచి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసులో చంద్రబాబును ఏ 2గా పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలు విభాగాల నేతలు గుదిబండి చిన వెంకటరెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, కొత్తా చిన్నపరెడ్డి, మండేపూడి పురుషోత్తం, మొగిలి మధు, బండారు సాయిబాబు, శిఖా బెనర్జీ, ఉప్పుటూరి నర్సిరెడ్డి, ముత్యాలరాజు పాల్గొన్నారు. -
రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి సాగునీటి కోసం రైతుల రాస్తారోకో నకరికల్లు : ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగునీటికోసం రైతులతో కలసి మండలంలోని అడ్డరోడ్డు వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ రుణమాఫీ చేశామని చెబుతున్న చంద్రబాబు ఎక్కడ చేశారో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. అభివృద్ధి పేరిట రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప మరో ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. కొత్తగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాల్సింది పోయి గతంలో అవినీతి జరిగింది.. ఎంక్వయిరీ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పంటలకు వేలకువేలు పెట్టుబడులు పెట్టి సాగునీరు లేక ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదనవ్యక్తంచేశారు. నోటికాడికి వచ్చిన పంట చేజారిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అవగాహన రాహిత్యం వలన వేలాది ఎకరాల్లో పంట నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రుణమాఫీ చేస్తారని ఓట్లేస్తే రైతుల కొంపముంచుతున్నారని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తపా ఎద్దేవా చేశారు. అన్నదాతను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ పంటపొలాలు కళ్లముందే ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. రైతుల పట్ల వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. వెంటనే సాగునీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తామని హామీలపై హామీలు ఇచ్చిన చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపిన మహిళారైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి కౌలు చెల్లించి సాగుచేసుకుంటుంటే సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయంటూ మహిళారైతులు పురుగు మందు డబ్బాలతో నిరసన వ్యక్తంచేశారు. వెంటనే సాగునీరివ్వకుంటే ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు రాస్తారోకోను విరమించాలని కోరడంతో తమ ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ రైతులు విన్నవించారు. ఓ మహిళ పురుగుమందు డబ్బా చేతబట్టి ఇది తాగాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీరుమున్నీరవుతుండగా ఎమ్మెల్యే ముస్తపా ఆమెను వారించి ఓదార్చారు. సాగునీరిచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. ఓ దశలో మాకు మీరే న్యాయం చేయాలి.. అంటూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కారు వద్దకు మహిళారైతులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఆయన ఎదుట తమగోడు వెలిబుచ్చారు. రైతుల ఆవేదనను గుర్తించిన గోపిరెడ్డి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం పొలాల్లోకి వెళ్లి పంటలు పరిశీలించారు.కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు రమావత్‌సామ్రాజ్యంబాయి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు భవనం రాఘవరెడ్డి, నకరికల్లు సొసైటీ అధ్యక్షుడు దొండే టి కోటిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
సభల్లో మాట్లాడే అంశాలపై కేసు పెట్టే హక్కు లేదు
పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ : పార్లమెంట్, శాసనసభలలో, బహిరంగ సభలలో మాట్లాడే అంశాలపై కేసు పెట్టే హక్కులేదని, దీని ఆధారంగానే ఒక పార్టీవారు మరో పార్టీ వార్ని విమర్శిస్తున్నారని భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు.పాలకొల్లులోని యార్న్ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో ‘సమాచార హక్కు చట్టం’పై బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి శ్రీధర్ మాట్లాడుతూ 1975లో ఇందిరాగాంధీపై పోటీచేసి పరాజయం పొందిన రాజ్‌నారాయణ ఆమె ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని ఎన్నికల్లో విజయం సాధించార ని కోర్టును ఆశ్రయిస్తే ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ అధికారం ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేయకండా ఉండడానికే ఎన్నికల కోడ్ అని వివరించారు. మర్రి చెన్నారెడ్డిపై పోటీచేసిన వందేమాతరం రామచంద్రరావు కూడా ఆయన ఎన్నిక సరైనది కాదని కోర్టుకు వెళ్లటంతో చెన్నారెడ్డికి ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చిందని వివరించారు. 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం ఇప్పుడు అమల్లో వుందని, సామాన్య వ్యక్తి ఈ చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వివరణ రాతపూర్వకంగా ఇవ్వవలసి ఉందన్నారు. ఇది ప్రతి భారతీయుడికి లభించిన వరమని శ్రీధర్ చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీటీడీ చైర్మన్‌గా ఉండే అర్హత లేదు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉండరాదని, అలాగే టీటీడీ చైర్మన్‌గా పనిచేసేవారు ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు పోటీ చేయరాదని రాజ్యాంగంలో నిర్దేశించారన్నారు. తమకు వచ్చిన చందాల వివరాలు తెలపమని రాజకీయ పార్టీలను కోరినప్పుడు సీపీఎం, సీపీఐ మినహా ఏ రాజకీయ పార్టీ సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రజలతో సంబంధం ఉన్న పార్టీలు వారి జమాఖర్చులను ప్రజలకు తెలియజేయాలని అప్పటి సమాచార కమిషనర్ తీర్పుచెప్పారని పేర్కొన్నారు. సన్మానం... మాడభూషి శ్రీధర్‌ను, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్‌ను ప్రెస్‌క్లబ్ సభ్యులు సన్మానించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీఎస్ఎన్ రాజు, జిల్లా కార్యదర్శి వానపల్లి సుబ్బారావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సంకు సుబ్రహ్మణ్యం, బుడిగ గోపి, విన్నకోట వెంకటేశ్వరరావు, కేవీఎస్‌ఎల్ నరసింహరాజు, కాగిత సూర్యనారాయణ పాల్గొన్నారు.