NATO
-
యుద్ధానికి తెర దించేందుకు..రష్యా రెడీ!
రెండున్నరేళ్లు దాటిన యుద్ధం. కనీవినీ ఎరగని విధ్వంసం. ఇరువైపులా లెక్కకైనా అందనంత ఆస్తి, ప్రాణనష్టం. యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరూ ఉండరని ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిరూపిస్తోంది. అగ్ర రాజ్యపు అపార ఆర్థిక, సాయుధ సంపత్తి ముందు ఏ మూలకూ చాలని ఉక్రెయిన్ యుద్ధంతో కకావికలైంది. ఆర్థికంగా, సైనికంగా మాత్రమే గాక జనాభాపరంగా, అన్ని రకాలుగానూ దశాబ్దాలు గడిచినా కోలుకోలేనంతగా నష్ట పోయింది. అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక, సాయుధ దన్నుతో నెట్టుకొస్తున్నా ట్రంప్ రాకతో ఆ సాయమూ ప్రశ్నార్థకంగా మారేలా కన్పిస్తోంది. అదే జరిగితే చేతులెత్తేయడం మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే. ఇంతటి యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ. అందులో ముఖ్యమైనది సైనిక నష్టం. యుద్ధంలో ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి! దీనికి తోడు కనీసం మరో 5 లక్షల మంది సైనిక విధులకు పనికిరానంతగా గాయపడ్డట్టు సమాచారం. ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బే. యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలూ పెద్దగా ఫలించడం లేదు. యుద్ధ భూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతోంది. దాంతో సైనికుల కొరత కొన్నాళ్లుగా రష్యాను తీవ్రంగా వేధిస్తోంది. మరో దారి లేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి! దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నిండుకోవడంతో రష్యాకు ఎటూ పాలుపోవడం లేదు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెర పడాలని ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా కోరుకుంటున్నట్టు సమాచారం. ఇటీవలి పుతిన్ ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చిందంటున్నారు.ఇవీ షరతులు...→ భూతల యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యానికి గతంలోలా కొన్నాళ్లుగా పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు.→ దాంతో నెనెట్స్క్ తదితర ఉక్రెయిన్ భూభాగాల్లోకి రష్యా నానాటికీ మరింతగా చొచ్చుకుపోతోంది.→ కానీ ఇందుకు చెల్లించుకోవాల్సి వస్తున్న సైనిక, ఆయుధ మూల్యం తదితరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆలోచనలో పడేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏదోలా ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెర దించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.→ కొన్ని ప్రధాన షరతులకు ఉక్రెయిన్ అంగీకరించే పక్షంలో యుద్ధా్దన్ని నిలిపేసేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.→ ఆక్రమిత ప్రాంతాలకు తోడు మరింత భారీ భూభాగాన్ని ఉక్రెయిన్ తమకివ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు.→ అది కనీసం అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వర్జీనియా పరిమాణంలో ఉండాలని కోరుతున్నారు.→ ఉక్రెయిన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండ్‌ను నాటో పరిగణనలోకే తీసుకోవద్దని కోరుతున్నారు. యుద్ధంలో మరణించిన రష్యా సైనికులు: 1.5 లక్షల నుంచి 2లక్షలుగాయపడ్డ సైనికులు: 5 లక్షల పైచిలుకువామ్మో సైన్యం!రష్యా యువతలో వణుకుసైన్యంలో చేరడమనే ఆలోచనే రష్యా యువతకు పీడకలతో సమానం! కొత్తగా చేరేవారిని వేధించడంలో రష్యా సైనికుల ట్రాక్ రికార్డు సాధారణమైనది కాదు! రిటైరైన తర్వాత కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ వణికిపోయే పరిస్థితి! వాటి బారిన పడే బదులు బతికుంటే బయట బలుసాకైనా తినొచ్చని రష్యా యూత్ భావిస్తుంటారు. డెడొవ్షినా అని పిలిచే ఈ వేధింపుల జాఢ్యం ఇప్పటిది కాదు. రష్యా సైన్యంలో 17వ శతాబ్దం నుంచే ఉందని చెబుతారు. దీనికి భయపడి రష్యా యువత సైన్యంలో చేరకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తుంటుంది. ఉక్రెయిన్ యుద్ధంలో కనీవినీ ఎరగనంత సైనిక నష్టం జరుగుతుండటంతో భారీగా రిక్రూట్మెంట్కు రష్యా రక్షణ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. యువతీ యువకులకు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని పేర్కొనే ‘డ్రాఫ్ట్ నోటీస్’ పంపిస్తోంది. దాంతో సైనిక జీవితాన్ని తప్పించుకునేందుకు రష్యా యువత లక్షలాదిగా విదేశాల బాట పట్టారు. అలా వెళ్లలేని వారిలో చాలామంది ఫేక్ మెడికల్‌గా అన్‌ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తుంటారు. ఆ క్రమంలో అవసరమైతే తమ ఎముకలు తామే విరగ్గొట్టుకుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! దాంతో చెచెన్యా, యకుట్జియా, దగెస్తాన్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతను రక్షణ శాఖ కొన్నాళ్లుగా ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఖైదీలను నిర్బంధంగా సైన్యంలో చేరుస్తోంది. ఇలాంటి వారిని సైన్యంలో దారుణంగా చూస్తున్నారు. చనిపోతే మృతదేహాలను గుర్తించి గౌరవప్రదంగా కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి కూడా ఉండటం లేదు! దీనికి తోడు రష్యాలో మామూలుగానే సైనికులు దారుణమైన పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. వారికి అత్యంత అవసరమైన పౌష్టికాహారానికే దిక్కుండదు! పైగా సరైన వైద్య సదుపాయమూ అందదు. సంక్షేమం దేవుడెరుగు, చివరికి సైనికుల భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మామూలు సమయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటుందంటే ఇక యుద్ధ సమయాల్లోనైతే సైనికుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సర్కారు అక్షరాలా గాలికే వదిలేస్తుంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్ డీసీ : తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపి వేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ ఆదేశాలపై రష్యా మద్దతివ్వగా.. రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా నాటోలో చేరకుండా సుధీర్ఘకాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బదులుగా అమెరికా.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జోబైన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆర్ధికంగా,ఆయుధాల్ని అందించడంపై ట్రంప్ పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే ట్రంప్ ఉక్రెయిన్‌కు ఆయుధ సంపత్తిని సమకూర్చనుండడం ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌పై జెలెన్స్కీ ప్రశంసలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. అనంతరం ‘ మా ఇద్దరి మధ్య సంభాషణ సన్నిహితంగా జరిగింది. అమెరికా-ఉక్రెయిన్ దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగించేందుకు అంగీకరించాం. బలమైన, తిరుగులేని అమెరికా నాయకత్వం ప్రపంచానికి, న్యాయమైన శాంతికి చాలా అవసరం’ అని ఎక్స్ వేదికపై జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లకు పైగా సాగుతున్న దాడుల్లో రెండు దేశాల సైన్యం వీరోచితంగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు. ఈ పోరులో ఉక్రెయిన్ సైన్యం.. రష్యా భూభాగంలో అడుగుపెట్టింది. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకు వచ్చాయి. మరోవైపు.. రష్యాకు సాయం చేసేందుకు ఉత్తర కొరియా బలగాలు రంగంలోకి దిగాయి.ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నాటో వెల్లడించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలను మోహరించినట్లు నాటో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు తెలిపారు. ఇక, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇది రెండు మధ్య యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు.NATO confirms North Korean troops have been sent to Russia to support its war in Ukraine. This marks a dangerous escalation, violating UN resolutions and risking global security. As Putin turns to Pyongyang for military aid, democracies must unite to uphold peace and security.… pic.twitter.com/kHT1g57y68— Pete (@splendid_pete) October 28, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే పుతిన్.. ఉక్రెయిన్‌పై పోరుకు నార్త్ కొరియా సాయం కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం రష్యాకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా సైన్యంలోకి భారీగా యువత వచ్చి చేరారు.మరోవైపు.. రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే చర్చ కూడా జరుగుతోంది. -
విజ్ఞత మరిచిన నాటో!
వ్యక్తిగా ఒక్కరు తీసుకునే నిర్ణయం కంటే సమష్టి నిర్ణయమే ఎప్పుడూ సరైందని పెద్దలు చెబుతారు. కానీ వాషింగ్టన్లో మూడు రోజులపాటు జరిగిన నాటో 75 ఏళ్ల వార్షికోత్సవాల్లో దేశాధినేతలు మాట్లాడిన తీరు చూసినా, చివరిలో ప్రకటించిన డిక్లరేషన్ గమనించినా పరిణతికన్నా పరమ మూర్ఖత్వమే కనబడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచ దేశాలను కదిలించే ప్రయత్నం దర్శనమిస్తుంది. రష్యా దురాక్రమణపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు వచ్చే ఏడాదిలోగా సైనిక సాయం రూపంలో కనీసం 4,000 కోట్ల యూరోలు అందజేయాలని నాటో సంకల్పించింది. అంటే రెండున్నరేళ్లుగా వేలాదిమంది మరణాలకూ, కోట్లాది డాలర్ల ఆస్తుల విధ్వంసానికీ కారణమైన ఆ యుద్ధాన్ని మరింత ఎగదోస్తూ పోతారన్నమాట! ఇంకా విడ్డూరమేమంటే నెదర్లాండ్స్ భూభాగంలో ఎఫ్–16 యుద్ధ విమానాలను మోహరించి రష్యాపై దాడులకు ఉక్రెయిన్ను పురిగొల్పుతారు. అంతేకాదు... ఎన్నడూ లేనివిధంగా తొలిసారి చైనాపై నాటో నిప్పులు చెరిగింది. దురాక్రమణ యుద్ధం కొనసాగించేందుకు రష్యాకు దన్నూ, ధైర్యమూ ఇస్తున్నది చైనాయేనని డిక్లరేషన్ ఆరోపించింది. నాటో ఎప్పుడూ చైనా జోలికి పోలేదు. అయిదేళ్లుగా చైనా వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. అది కూడా చాలా మర్యాదైన, మృదువైన పదాలతోనే! ఇప్పుడేమైంది? నాటో కొత్త రాగం వెనకున్న కారణమేమిటి?నిజానికి నాటో సదస్సులో ఈసారి జో బైడెన్ ఆరోగ్యం, ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ ప్రస్తావనకొస్తాయని అందరూ ఆశించారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో బైడెన్ ఆరోగ్యం ప్రధాన అంశంగా మారింది. ఆయన కొనసాగితే ఓటమి ఖాయమని డెమాక్రాట్లు నిర్ణయానికొచ్చారు. సర్వేలు సైతం రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బలపడుతున్న వైనాన్ని ఏకరువు పెడుతున్నాయి. అందుకే నాటో స్వరం మారిందని విశ్లేషకుల ఆరోపణ. ట్రంప్ వస్తే నాటో ఉనికే ప్రశ్నార్థకం కావటం ఖాయం. ఉక్రెయిన్ భవిష్యత్తు అనిశ్చితం. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ వల్ల ఇంతవరకూ 1,86,000 మంది పౌరులు మరణించారని లాన్సెట్ నివేదిక అంచనా. ఈ నేపథ్యంలో ఆ యుద్ధాన్ని నివారించటంపై నాటో దృష్టి పెడుతుందని అందరూ అంచనా వేయగా, తీరా దాని గురి చైనా వైపు మళ్లింది! మరోపక్క భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ... ఘర్షణల సమయంలో ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ ఉండదంటూ పరోక్షంగా మనల్ని హెచ్చరించారు. ‘అవసర సమయాల్లో’ భారత్, అమెరికాలు సమష్టిగా పనిచేయాల్సి వుంటుందని చెప్పారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై లోపాయికారీగా మన అధికారుల వద్ద అమెరికా అసంతృప్తి వ్యక్తంచేసినట్టు కథనాలొచ్చాయి. గార్సెటీ దాన్నే బహిరంగంగా చెప్పారు. రెండేళ్లక్రితం తాను చెప్పిందేమిటో అమెరికాకు గుర్తుందా? ఉక్రెయిన్‌కు చేయూతగా పోలాండ్ నుంచి మిగ్–29 యుద్ధ విమానాలను రంగంలోకి దించటానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని 2022 మార్చిలో అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ చేసిన ప్రకటనను అమెరికా రక్షణ శాఖ తప్పుబట్టింది. ఇందువల్ల రష్యా తీవ్రంగా ప్రతిస్పందించే ప్రమాదం వుంటుందని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ హెచ్చరించారు. ఆ సమయంలోనే జో బైడెన్ సైతం ఉక్రెయిన్ గగనతలంపై నాటో నో ఫ్లైజోన్ విధించాలన్న ప్రతిపాదనను కొట్టిపడేశారు. దాన్ని అమలు చేయటానికి నాటో నేరుగా యుద్ధరంగంలోకి దిగాల్సివస్తుందని చెప్పారు. మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించాలని అమెరికా భావించటం లేదని అన్నారు. ఆఖరికి నాటోలో ప్రధాన భాగస్వాములైన జర్మనీ, ఫ్రాన్స్ సైతం అదే ఉద్దేశంతో ఉన్నాయి. నిరుడు ఫిబ్రవరిలో ఒక విందు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి జర్మనీ చాన్సలర్ ఓలోఫ్ షుల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మేక్రాన్‌లు హితవు చెప్పారు. ‘ఈ యుద్ధంలో మీరు ఓడిపోబోతున్నారు. కనుక రష్యాతో చర్చలకు సిద్ధపడి సంధి చేసుకోవటం అత్యుత్తమం’ అని సలహా ఇచ్చారు. హిట్లర్ కాలంలో జర్మనీ తమ దేశాన్ని దురాక్రమించినా ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ పాత వైరాన్ని మరిచిపోయిన సంగతిని గుర్తుచేశారు. ‘నువ్వు గొప్ప యుద్ధ వీరుడివే కావొచ్చుగానీ... ఈ వైరంలో రాజనీతిజ్ఞత అవసరం.నొప్పి కలిగించినా కష్టమైన నిర్ణయం తీసుకోవటానికి సిద్ధపడాలి’ అని జెలెన్స్కీకి మేక్రాన్ హితబోధ చేశారు. అవన్నీ ఏమైనట్టు? నాటో పుట్టిననాటి నుంచి దాన్ని కొనసాగించటానికి అమెరికా సాకులు వెదుకుతూనే వుంది. సోవియెట్ యూనియన్ పెను భూతమనీ, అది యూరప్‌ను కబళించబోతున్నదనీ ఊదరగొట్టి ఏర్పరిచిన నాటో ఉనికిని కాపాడేందుకు పడరాని పాట్లు పడుతోంది. 1989లో పనామా పాలకుడు నొరీగా, 1999లో సెర్బియా పాలకుడు స్లోబోదన్ మైలోసెవిక్, 2003లో ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్‌లు ప్రపంచాన్ని కబళించటానికి సిద్ధంగావున్న హిట్లర్లుగా చిత్రీకరించి ఆ దేశాలపై అమెరికా, నాటో దళాలు విరుచుకుపడి గుల్లచేశాయి. లక్షలాదిమంది అమాయక పౌరులు బలయ్యారు. ఇన్నాళ్లకు నాటోకు యూరప్‌లో పుతిన్ రూపంలో శత్రువు ‘తారసపడ్డాడు’. ఆ లంపటంలోకి ప్రపంచ దేశాలన్నిటినీ దించి లోకరక్షకుడిగా ఆవిర్భవించాలని అమెరికా తలపోస్తున్నట్టు కనబడుతోంది. రష్యా అణ్వాయుధాల ప్రయోగానికి దిగదని అమెరికా, నాటోలు నమ్ముతున్నట్టున్నాయి. ఇలాంటి తప్పుడు సూత్రీకరణలతో, అసంబద్ధ అంచనాలతో ప్రపంచాన్ని యుద్ధంలోకి నెడితే ఊహకందని పర్యవసానాలు ఏర్పడే ప్రమాదముంది. అగ్రరాజ్యాలు విజ్ఞతతో మెలిగి ఉక్రెయిన్, రష్యాల మధ్య సంధికి ప్రయత్నించాలి. ఆ మేరకు ప్రపంచ ప్రజానీకం ఒత్తిడి తేవాలి. -
NATO: విధ్వంసకారి చైనా
వాషింగ్టన్/బీజింగ్: చైనా–రష్యా దేశాల మధ్య బంధం నానాటికీ బలపడుతుండడం పట్ల నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం పేరిట ఉక్రెయిన్‌లో విధ్వంసానికి రష్యాకు చైనా అండదండలు అందిస్తోందని మండిపడ్డాయి. డ్రాగన్ దేశం నిర్ణయాత్మక విధ్వంసకారిగా మారిందని ఆరోపించాయి. రష్యాతో భాగస్వామ్యానికి ఎలాంటి పరిమితులు లేవంటూ చైనా నాయకత్వం చేసిన ప్రకటనలను నాటో దేశాలు ప్రస్తావించాయి. రష్యా రక్షణ పారిశ్రామిక రంగానికి చైనా పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తోందని, దీనివల్ల రష్యా పొరుగు దేశాలతోపాటు యూరో–అట్లాంటిక్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో నాటోలోని 32 సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. కూటమి 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కూటమిలో 32వ సభ్యదేశంగా చేరిన స్వీడన్‌కు సాదర స్వాగతం పలికారు. భేటీ అనంతరం ‘వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్’ పేరిట ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా దుందుడుకు విధానాలు, చర్యలు తమ ప్రయోజనాలకు, భద్రతకు, విలువలకు సవాలు విసిరేలా ఉంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు మద్దతిస్తే చైనాకే నష్టం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా బాధ్యతాయుతంగా మసలుకోవాలని నాటో సభ్యదేశాల ప్రతినిధులు హితవు పలికారు. ఉక్రెయిన్‌లో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు సహకరించుకోవడం తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత చైనాపై ఉందని పునరుద్ఘాటించారు. రష్యాకు ఆయుధపరంగా, రాజకీయంగా ఎలాంటి సహకారం అందించవద్దని స్పష్టం చేశారు. రష్యాను గుడ్డిగా వెనుకేసుకొస్తే చైనాయే నష్టపోతుందని, ప్రపంచంలో ఏకాకిగా మారుతుందని తేలి్చచెప్పారు. రష్యా–చైనా–ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొత్త చివుళ్లు తొడుగుతున్న నేపథ్యంలో దానికి ప్రతిచర్యగా ఇండో–పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకుంటామని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. అలజడి యత్నాలు మానుకోండి: చైనా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో చైనా విధ్వంసకారిగా మారిందంటూ నాటో కూటమి నేతలు చేసిన విమర్శలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ గురువారం ఖండించారు. సొంత భద్రత కోసం ఇతర దేశాల ప్రయోజనాలను బలిపెట్టడం నాటో దేశాలకు అలవాటేనని విమర్శించారు. ఆసియాలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు.నాటో సభ్య దేశాలు ఇవి...1.అమెరికా, 2.యునైటెడ్ కింగ్డమ్, 3.అల్బేనియా, 4.బెల్జియం, 5.బల్గేరియా, 6.కెనడా, 7.క్రొయేíÙయా, 8.చెక్‌రిపబ్లిక్, 9.డెన్మార్క్, 10.ఎస్తోనియా, 11.ఫిన్లాండ్, 12.ఫ్రాన్స్, 13.జర్మనీ, 14.గ్రీస్, 15.హంగేరీ, 16.ఐస్లాండ్, 17.ఇటలీ, 18.లాతి్వయా, 19.లిథువేనియా, 20.లక్సెంబర్గ్, 21.మాంటెనిగ్రో, 22.నెదర్లాండ్స్, 23.నార్త్ మాసిడోనియా, 24.నార్వే, 25.పోలాండ్, 26.పోర్చుగల్, 27.రొమేనియా, 28.స్లొవాకియా, 29.స్లొవేనియా, 30.స్పెయిన్, 31.స్వీడన్, 32.తుర్కియే -
భారత్–రష్యా సాన్నిహిత్యం
దౌత్య ప్రపంచంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. పర్యటనలైనా, ప్రసంగాలైనా, సమావేశాలైనా, ఒప్పందాలైనా– దేశాల ప్రయోజనాలతో ముడిపడివుంటాయి. సమయం, సందర్భం తప్పనిసరిగా ఉంటాయి. తమ ఆలోచనలేమిటో నిక్కచ్చిగా చెప్పడం కూడా వీటి ఉద్దేశం కావొచ్చు. ప్రధాని మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఇరుగు పొరుగు దేశాలను సందర్శించే ఆనవాయితీని పక్కనబెట్టి రష్యాను ఎంచుకున్నారు. రెండు రోజుల ఆ పర్యటన మంగళ వారం ముగియబోతుండగా అమెరికా ప్రాపకంతో 75 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన సైనిక కూటమి నాటో వజ్రోత్సవాలు వాషింగ్టన్లో మొదలయ్యాయి. ఇవి మూడురోజులపాటు సాగుతాయి. రష్యా పూర్వరూపమైన సోవియెట్ యూనియన్‌కు వ్యతిరేకంగా నాటో ప్రారంభమైంది. కనుక మోదీ రష్యా పర్యటన సహజంగానే అమెరికాకు కంటగింపుగా ఉండొచ్చు. ఈ పర్యటన ‘శాంతి ప్రయత్నాలకు’ తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. పైగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత అత్యంత క్రూరుడైన నేరగాణ్ణి హత్తుకోవటం ఏమిటని విమర్శించారు. జెలెన్స్కీ చెబుతున్న శాంతి ప్రయత్నాలేమిటో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా రష్యాను ఎదుర్కొనటానికి యుద్ధం మొదలైననాటి నుంచీ ఉక్రెయిన్‌కు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎడాపెడా ఆయుధాలు, డబ్బు సరఫరా చేయటం. అందువల్లే ఆ ఘర్షణ ఎడతెగకుండా సాగుతోంది. ఇందులో శాంతి ప్రసక్తి ఎక్కుడుందో అర్థంకాదు. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఖండించాల్సిందే. కానీ ఇందులో ఉక్రెయిన్ బాధ్యత కూడా ఉంది. దాని సంగతలావుంచితే భారత–రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధానంగా మోదీ రష్యా వెళ్లారు. ఈ సందర్భంగా వివిధ ఒప్పందాలు కూడా కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందజేశారు. అయితే మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కియూవ్‌లో ఒక ఆసుపత్రిపై జరిగిన క్షిపణి దాడిలో 37 మంది చనిపోయిన ఉదంతాన్ని ఖండించటానికి మోదీ వెనకాడలేదు. రష్యాతో మనకున్న మైత్రి ఈనాటిది కాదు. ఆ మైత్రికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. మోదీ అన్నట్టు రష్యా అన్ని కాలాల్లోనూ దృఢంగా మన వెనక నిలబడింది. స్నేహ హస్తం అందించింది. 1971లో పాకిస్తాన్‌తో మనకు యుద్ధం వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదుకుంది. ఆ యుద్ధంలో మనం సాధించిన విజయంలో సోవియెట్ పాత్ర కీలకమైనది. మన అమ్ములపొదిలో ఉన్న రక్షణ పరికరాల్లో అత్యధిక భాగం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇది కేవలం కొనుగోలుదారు– అమ్మకందారు సంబంధం కాదు. పరిశోధన, అభివృద్ధితో మొదలెట్టి ఉమ్మడి ఉత్పత్తుల వరకూ ఇరు దేశాలూ సహకరించుకుంటున్నాయి. మనకున్న రెండు విమానవాహక నౌకల్లో ఒకటి రష్యానుంచి వచ్చినదే. ఇంకా ఎస్–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ, మిగ్–29, ఎస్‌యూ–30 ఎంకెఐ యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, ఏకే–203 రైఫిళ్లు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు తదితరాలున్నాయి. ఇవిగాక తన టీ–90 శతఘ్నుల ఉత్పత్తికి మనకు అనుమతులిచ్చింది. విడి భాగాల దగ్గర్నుంచి నూతన పరిశోధనల వరకూ మన రక్షణ వ్యవస్థ పూర్తిగా రష్యాతో ముడిపడివుంది. అణు విద్యుత్ కర్మాగారాల స్థాపన, నిర్వహణలో తోడ్పడుతోంది. ఇరవై అయిదేళ్ల క్రితం మనకు అమెరికాతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి కూడా మనం రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తున్నాం. మనను రష్యాకు దూరం చేయాలని ఆది నుంచీ అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాకైతే ఇది మరింతగా పెరిగింది. ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ సంస్థల్ని బేఖాతరుచేసి ఘర్షణలు నివారించే పేరుమీద అమెరికా ఒక పక్షాన్ని సమర్థించటం, అవతలిపక్షంతో ఎవరూ సాన్నిహిత్యం నెరపకూడదని ఫర్మానా జారీచేయటం ఆశ్చర్యకరం. వాస్తవా ధీన రేఖ వద్ద చైనాతో మనకు అయిదేళ్లుగా లడాయి నడుస్తోంది. ఆ దేశంతో ఘర్షణలు వస్తే మనకు రష్యా నుంచి రక్షణ పరికరాలు, విడిభాగాలు అత్యవసరమవుతాయి. అంతేకాదు... రక్షణ సాంకేతి కతలు చైనాకు పోకుండా చూడటం మనకు ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రయోజనాలూ వదులుకుని తాను చెప్పినట్టల్లా నడుచుకోవాలని అమెరికా భావించటం ఎంతమాత్రం సరికాదు. పాకిస్తాన్‌తో మనకున్న సమస్యల విషయంలో ఏనాడూ అమెరికా సానుభూతిగా లేదు. కంటితుడుపు చర్యలు తీసుకోవటం, ఏదో వంకన ఆ దేశానికి సైనిక, ఆర్థిక సాయం అందించటం అమెరికాకు రివాజుగా మారింది. మనం మాత్రం తన ఫర్మానాలు పాటించాలని ఆ దేశం ఆశిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి వద్దన్న అమెరికా ఒత్తిడిని కాదని, రోజుకు 21 లక్షల బ్యారెళ్ల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాం. చౌకగా లభించే ఆ ముడి చమురు వల్ల మనం లాభపడటం మాట అటుంచి ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వం సాధించింది. వర్తమాన సంక్లిష్ట పరిస్థితుల్లో రష్యాతో సాన్నిహిత్యం ఇబ్బందికరమే అయినా, దేశ ప్రయోజనాల రీత్యా దాన్ని కొనసాగించాలనుకున్న మన దేశ వైఖరి మెచ్చదగినది. ఏదేమైనా రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలను మూడో దేశం ప్రభావితం చేయాలనుకోవటం, వాటిని తెంచుకోవాలని ఒత్తిడి తీసుకురావటం మంచి సంప్రదాయం కాదు. తన పర్యటన ద్వారా అమెరికాకు ఈ సంగతిని స్పష్టం చేసిన ప్రధాని మోదీ చర్య ప్రశంసించదగ్గది. -
వృద్ధ జంబూకం ‘నాటో’
రెండు ఖండాలను కలుపుతూ ప్రపంచానికి శాంతినీ, సుస్థిరతనూ, రక్షణనూ వాగ్దానం చేస్తూ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఏర్పడిన నాటో కూటమి గురువారం తన 75 వసంతాల సంబరాలను జరుపుకొంది. అయితే ప్రకటిత సంకల్పానికీ, దశాబ్దాల దాని ఆచరణకూ ఎక్కడా పొంతన కనబడదు. నాటో నేపథ్యం, దాని ఉద్దేశాలు పూర్తిగా కొట్టిపారేయదగ్గవి కాదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ యూనియన్ సేనలు తూర్పు యూరప్ దేశాల్లో తిష్ఠవేసి కదల్లేదు. అవి తమవైపు చొచ్చుకు రావొచ్చన్న సందేహం పశ్చిమ యూరప్ దేశాలకుంది. తాము ఒక్కటై ఎదిరించకపోతే దురాక్రమణకు బలి కావటం ఖాయమన్న భయం వాటికి పట్టుకుంది. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జతకట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. సోవియెట్ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కుడ్యం ఏర్పర్చటమే దీని ప్రధాన ధ్యేయం. నాటో దేశాలు రోజూ పరస్పరం సంభాషించుకుంటాయని, పరిస్థితులను సమీక్షించుకుంటూ నిరంతర సంసిద్ధ తలో వుంటాయని, తగిన నిర్ణయాలు తీసుకుంటాయని నాటో వెబ్సైట్ ఘనంగా చెబుతోంది. మంచిదే. కానీ ఇన్నేళ్ల దాని ఉనికిలో ఒక్కసారైనా సోవియెట్ యూనియన్ నుంచీ లేదా దాని ప్రస్తుత రూపమైన రష్యా నుంచీ ప్రత్యక్షంగా కావొచ్చు... పరోక్షంగా కావొచ్చు ఏనాడూ సవాళ్లు ఎదురు కాలేదు. సైనిక కూటమి ఆవిర్భావం దానికదే ప్రత్యర్థిని హద్దు మీరకుండా చేసివుండొచ్చన్న వాదన కూడా కొట్టి పారేయలేం. కానీ నాటో హడావిడి గమనించాక 1955లో సోవియెట్ యూనియన్ సైతం తన ఆధ్వర్యంలోని తూర్పు యూరప్ దేశాలను కలుపుకొని వార్సా కూటమి పేరుతో మరో సైనిక కూటమి నిర్మించింది. ఇరుపక్షాలూ అణ్వాయుధాలనూ, ఇతర భారీ ఆయుధ సామగ్రిని మోహరించటంతో ప్రచ్ఛన్న యుద్ధ దశలో యూరప్ ఖండం మొత్తం నిరంతర యుద్ధ భయంతో వణికింది. మరి ప్రపంచ శాంతి, సుస్థిరతల జాడెక్కడ? పరస్పర మోహరింపులతో నెలకొన్న ఒక రకమైన స్తబ్దతను శాంతిగా భావించటం సాధ్య మేనా? నాటో అంచనాకు తగ్గట్టు సోవియెట్ సేనలు దండయాత్రలు చేయకపోలేదు. 1956లో హంగరీ, 1968లో జెకొస్లోవేకియా, 1979లో అఫ్గానిస్తాన్ దేశాలను అవి దురాక్రమించాయి. కానీ యూరప్ ఖండంలోని తటస్థ దేశాలు ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, యుగోస్లేవియా, ఆస్ట్రియా వైపుగానీ... నాటో దేశాలవైపుగానీ చొచ్చుకొచ్చే ఆలోచన చేయలేదు. నిజానికి తాను కూడా నాటోలో చేరతానన్న సోవియెట్ యూనియన్ వినతిని 1954లో తోసిపుచ్చాకే వార్సా కూటమి ఏర్పడింది. 1989లో సోవియెట్ పతనం, అంతకుముందే తూర్పు యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా దాన్నుంచి దూరం జరగటం, వార్సా కూటమి కనుమరుగవటం వంటి పరిణామాల తర్వాత వాస్తవానికి నాటో అవసరం ఎంతమాత్రం లేదు. చిత్రం ఏమంటే... సోవియెట్ పతనానికి బాటలు పరిచిన నాటి అధ్యక్షుడు గోర్బచెవ్, ఆ తర్వాతకాలంలో ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం నాటోలో చేరటా నికి సిద్ధపడ్డారు. కానీ ఆ ప్రతిపాదనను నాటో తోసిపుచ్చింది. అంతేకాదు... ఉభయ జర్మనీల విలీ నానికి సహకరించాలంటూ పశ్చిమ యూరప్ దేశాల నేతలు గోర్బచెవ్‌ను అర్థించినప్పుడు ఆయన కొక హామీ ఇచ్చారు. నాటోను ఒక్క అంగుళం కూడా విస్తరించబోమన్నదే ఆ హామీ సారాంశం. కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. సోవియెట్ పతనం నాటికి నాటో సభ్య దేశాలు 16 కాగా, రష్యా అభ్యంతరాలనూ బేఖాతరు చేస్తూ మరో 15 దేశాలను చేర్చుకున్నారు. ఇందులో పూర్వపు వార్సా కూటమి దేశాలున్నాయి. కనీసం తన ఇరుగు పొరుగు దేశాలకు సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా ప్రతి పాదన సైతం బుట్టదాఖలా అయింది. పొరుగునున్న కెనడా, మెక్సికో దేశాలకు వార్సా కూటమి సభ్యత్వం ఇస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? నాటో పుట్టుకకు దారితీసిన మూలకారణమే మాయమైనప్పుడు విశాల యూరప్ భద్రత కోసం ఒక నూతన వ్యవస్థ ఏర్పాటు చేయటానికి బదులు రష్యాను ఏకాకి చేయాలన్న వ్యూహం వెనకున్న విజ్ఞతేమిటో ఆ కూటమి నేతలు చెప్పగలరా? నిజానికి నాటో చిత్తశుద్ధితో విశాల యూరప్ భద్రతపై దృష్టి సారించివుంటే పుతిన్ ఉక్రెయిన్ దురాక్రమణకు సాహసించేవారు కాదు. యూరప్ ఖండంలో అణ్వాయుధాల బెడద పూర్తిగా సమసిపోయేది. అసలు ప్రపంచ శాంతి, సుస్థిరతలకు దోహదం కలగటం మాట అటుంచి నాటో వల్ల ప్రపంచానికి వచ్చిన సమస్యలే అధికం. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ 200 సైనిక ఘర్షణలు చోటు చేసుకోగా అందులో 20 వరకూ విస్తృతమైనవి. వెళ్లినచోటల్లా విధ్వంసమే తప్ప నాటో సాధించిందేమీ లేదు. ఇందుకు లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా వగైరాలను ఉదా హరించవచ్చు. స్థానిక ప్రభుత్వాలను కూలదోసేందుకు విచ్చలవిడిగా మిలిటెంట్ సంస్థలకు నాటో ఆయుధాలందించటం పర్యవసానంగా ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ పురుడుపోసుకుంది. కనిపించని శత్రువుపై కత్తి ఝుళిపించటం కోసం నాటో సభ్యదేశాల్లో ప్రతి ఒక్కటీ తమ జీడీపీల్లో 2 శాతం నాటోకు అర్పిస్తున్నాయి. తన ఉనికి కోసం శత్రువును ‘సృష్టించుకునే’ ధోరణి నుంచి నాటో బయటపడనంతకాలం ఈ పరిస్థితి మారదు. ప్రపంచంలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నించ టమా... నిరంతరం యుద్ధ భయంతో అణ్వాయుధాల నీడలో మనుగడ సాగించటమా అన్నది యూరప్ దేశాల ప్రజలే తేల్చుకోవాలి. -
రష్యాతో నాటో ఘర్షణకు దిగితే... మూడో ప్రపంచ యుద్ధమే
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. ‘‘అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరు’’ అన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కదనరంగంలోకి ఫ్రాన్స్ బలగాలను దింపే ఉద్దేశముందన్న ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలపై పుతిన్ ఇలా స్పందించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లిష్, ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఇది సరికాదు’’ అన్నారు. చర్చలకు సదా సిద్ధం ఉక్రెయిన్ సైన్యం దాడులు ఇలాగే కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్‌ను సృష్టిస్తామని పుతిన్ అన్నారు. ‘‘దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మేం మొదట్నుంచీ చెబుతున్నాం’’ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగలేదన్న అమెరికా, పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోనే ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2030 దాకా అధ్యక్ష పీఠంపై రష్యా రాజకీయ వ్యవస్థపై పుతిన్ పట్టు మరోసారి రుజువైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్ల) ఓట్లు ఆయనకు పడ్డట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. పుతిన్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఆరేళ్లపాటు, అంటే 2030 దాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత సుధృఢంకావాలని అభిలషించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా పాలకుడు కిమ్, హోండురాస్, నికరాగ్వా, వెనిజులా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలూ పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమదేశాలు మాత్రం ఈ ఎన్నికలు పెద్ద మోసమని విమర్శించాయి. నవాల్నీని వదిలేద్దామనుకున్నాం.. దివంగత విపక్ష నేత అలెక్సీ నవాల్నీ ప్రస్తావనను పుతిన్ తొలిసారిగా బహిరంగంగా తెచ్చారు. ‘‘ఖైదీల మార్పిడిలో భాగంగా నవాల్నీని విదేశాలకు అప్పగించి పశ్చిమదేశాల జైళ్ల నుంచి రష్యన్లను వెనక్కు తెద్దామని మా అధికారుల సలహాకు వెంటనే ఒప్పుకున్నా. ఆ లోపే ఆయన జైల్లో చనిపోయారు. కొన్ని అలా జరుగుతాయంతే. ఇదే జీవితం’’ అన్నారు. -
అడుగు దూరంలో వరల్డ్ వార్-3.. హెచ్చరించిన పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని పశ్చిమ దేశాలను పుతిన్ హెచ్చరించారు. ఇక, తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ భారీ మెజార్టీతో మరోసారి ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 88శాతం ప్రజల మద్దతుతో ఆయన రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉంది. రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికీ మధ్య ఘర్షణ తలెత్తితే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అయితే దీన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపుతామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యలను పుతిన్ తప్పుబట్టారు. ఇక, మార్చి 15 నుంచి 17 మధ్య రష్యా ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసింది. సరిహద్దు ప్రాంతాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరమని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు పుతిన్.. దాడులు ఇలాగే కొనసాగితే తమ భూభాగాన్ని రక్షించడానికి రష్యా మరింత ఉక్రేనియన్ భూభాగం నుంచి బఫర్ జోన్‌ను సృష్టిస్తుందని చెప్పారు. ఇది చదవండి: రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం ఉక్రెయిన్‌లో నాటో సైనిక సిబ్బంది ఇప్పటికే ఉన్నారని, రష్యా యుద్ధభూమిలో ఇంగ్లిష్, ఫ్రెంచ్ దళాలు తలపడుతున్నాయి. ఇందులో వారికి ఎటువంటి మంచి జరగడం లేదు.. ఎందుకంటే వారు అక్కడ పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని అన్నారు. ఈ రోజు జరుగుతున్న విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, కీవ్ పాలనలోని భూభాగాల్లో ఒక నిర్దిష్ట 'శానిటరీ జోన్'ని సృష్టించడానికి మేము ఏదో ఒక సమయంలో బలవంతపు చర్యలు చేపడతామని పుతిన్ చెపుకొచ్చారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి మాత్రం పుతిన్ నిరాకరించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని తీవ్రతరం చేయడాన్ని మెక్రాన్ ఆపివేసి.. శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించాలని తాను కోరుకుంటున్నానని పుతిన్ అన్నారు.. ‘నేను పదే పదే చెబుతున్నాను.. నేను మళ్లీ అదే చెబుతాను.. మేము శాంతి చర్చల కోసం ఉన్నాం.. కానీ శత్రువుల తూటాలు అయిపోతున్నందుకు కాదని వ్యాఖ్యలు చేశారు. -
నాటోలో స్వీడన్ చేరికకు తుర్కియే ఆమోదం
అంకారా: నాటోలో స్వీడన్ సభ్యత్వానికి తుర్కియే గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది. హంగేరీ కూడా ఓకే చెబితే నార్డిక్ దేశం స్వీడన్ నాటో దేశంగా మారిపోనుంది. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు తుర్కియే పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే సమ్మతం తెలిపింది. స్వీడన్ సభ్యత్వంపై అభ్యంతరం తెలుపుతూ వస్తోంది. వాటికి కూడా తగు పరిష్కారం దొరకడంతో తాజాగా ఆమోదం తెలిపింది. ఇక, నాటోలో స్వీడన్ చేరికపై హంగరీ పార్లమెంట్లో ఫిబ్రవరి ఆఖరులో చర్చించొచ్చని భావిస్తున్నారు. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందటే..
ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఇప్పటికి ఏడాదిన్నర పైబడింది. అయినా కూడా అక్కడ యుద్ధం సద్దుమణిగే పరిస్థితులైతే కనుచూపుమేరలో కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఇదే అభిప్రాయం నెలకొందని ఉక్రెయిన్‌లో యుద్ధం ఇప్పటిలో ఆగదని సుదీర్ఘంగా కొనసాగుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టన్బెర్గ్. ఏడాదిన్నర పైబడింది.. ఫిబ్రవరి 2022లో మాస్కో ఉక్రెయిన్‌కు బలగాలను పంపడంతో మొదలైన యుద్ధంలో ఉక్రెయిన్ మొదట్లో అంత దూకుడుగా వ్యవహారింకపోయినా జూన్ నుంచి మాత్రం దూకుడు పెంచి ప్రతిదాడులు కూడా మొదలు పెట్టిందని ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశముందని అన్నారు నాటో చీఫ్ స్టోల్టన్బెర్గ్. చాలా వరకు యుద్ధాలు మొదలైనప్పుడు ఊహించినదానికంటే ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటాయని చెబుతూనే వీలైనంత తొందరగా అక్కడ శాంతి స్థాపించబడాలని కోరుకుంటున్నానన్నారు. ఆపితే అంతే సంగతులు.. యుద్ధంలో వ్లాదిమిర్ జెలెన్స్కీ గానీ ఉక్రెయిన్ గానీ పోరాడకపోతే ఆ దేశం తుడిచి పెట్టుకుపోతుందనడంలో సందేహమే లేదు. ఎప్పుడైతే రష్యా ఆయుధాలను విడిచిపెడుతుందో అప్పుడే యుద్ధం సద్దుమణుగుతుందని అన్నారు. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ నాటోలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని క్యివ్ ఇప్పటికే నాటోకు చాలా దగ్గరైందని అన్నారు. యుద్ధం ముగిశాక ఉక్రెయిన్‌కు అన్నివిధాలా భద్రతా భరోసా కల్పించాలని అన్నారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.330 -
వినాశకర సాటన్-ll మిసైల్‌ను బయటకు తీసిన రష్యా.. ఏమీ మిగలదు!
మాస్కో: రష్యా అత్యంత వినాశకరమైన అణుక్షిపణి (సర్మాత్)సాటన్-ll ను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణి విజయవంతమైనప్పుడు దీని గురించి చెబుతూ.. ఇకపై మాతో కయ్యానికి కాలు దువ్వే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని ప్రత్యర్థులను హెచ్చరించారు. తాజాగా ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఈ క్షిపణిని బయటకు తీయడం చర్చనీయాంశమైంది. శుక్రవారం సాటన్-llగా పిలవబడే ఈ సర్మాత్ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్‌ను రష్యా సైన్యం బయటకు తీసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కాస్మోస్ ప్రకటించింది. ఈ మేరకు రోస్కాస్మోస్ జనరల్ డైరెక్టర్ యూరి బోరిసోవ్ సాటన్-ll విధినిర్వహణకు సిద్ధమైందని ప్రకటించారు. అసలేంటి సాటన్-ll ప్రత్యేకత.. సాటన్-ll మిసైల్ పొడవు 116 మీటర్ల. 220 టన్నులు బరువుండే ఈ మిసైల్ 10-15 వార్హెడ్లను అమర్చే వీలుంటుంది. అందుకే ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సులువుగా ఛేదిస్తుంది. శత్రువుల రాడార్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు ఈ మిసైల్‌ను గుర్తించే లోపే ఇది లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సాటన్-ll గంటకు 10 వేల నుంచి 18 వేల కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఐరోపాలోని ఏ ప్రాంతానికైనా ఇది కేవలం 3 నిమిషాల్లోపే చేరుకోగలదు. ఇక అగ్రరాజ్యం అమెరికా చేరుకోవడానికి ఈ క్షిపణికి కేవలం 14 నిముషాలు మాత్రమే పడుతుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలై ఏడాదిన్నర పైబడిండి. ఇప్పటికీ యుద్ధం ఒక కొలిక్కి రాకపోగా ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్ధవంతనగానే తిప్పికొట్టింది. ఇక ఇప్పుడైతే అమెరికా అండదండలతో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తూ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుద్ధప్రారంభంరోజుల్లో రష్యా స్వాధీనం చేసుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి తన వశం చేసుకుంటోంది. ఇప్పటికే డిఫెన్స్‌లో పడిన రష్యా సేనలు ఈ నేపథ్యంలోనే ఈ భయానక మిసైళ్లను బయటకు తీసిందని చెప్పేవారు లేకపోలేదు. మరోపక్క రష్యా ఈ క్షిపణిని నాటో సంస్థ మూలస్థంభాలైన అమెరికా, యూకెలపై మాత్రమే ప్రయోగించడానికి సిద్ధం చేసిందనే వారూ ఉన్నారు. ఏదైతేనేం ప్రస్తుతానికైతే రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత భయంకరమైన మిసైళ్లను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతీయ టీవీ ఛానల్లో ప్రసంగిస్తూ.. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి మాకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని అన్నారు. అందులో భాగంగానే ఈ చర్యకు ఉపక్రమించారని మాత్రం అర్ధమవుతోంది. BREAKING: Putin has put the ‘Satan-2’ nuclear weapon on combat duty for the first time Putin unveiled the RS-28 Sarmat rocket system along with five other weapons in this video at a conference in March 2018 Putin claimed the Sarmat can fly a trajectory over the South Pole and… pic.twitter.com/otKqUi6uIw — Liam McCollum (@MLiamMcCollum) September 1, 2023 ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక! -
ఈ విస్తరణ మంచిదేనా?
అనేక సందర్భాల్లో ఆగి ఆలోచించడం, జరిగిన కథను సింహావలోకనం చేసుకోవడం అత్యవసరం. వివిధ దేశాల అంతర్ ప్రభుత్వ సైనిక కూటమి ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’ (నాటో) సభ్యులు గత వారం లిథువేనియాలో ఆ పనే చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి 500 రోజులు పూర్తయిన వేళ బాధితదేశానికి తామిస్తున్న ఆర్థిక, సైనిక సహకారాలను పరిశీలించడానికి సమావేశ మయ్యారు. ‘నాటో’లో స్వీడన్ చేరేందుకు టర్కీ, ఆ వెంటనే హంగరీ అంగీకరించడం తాజా సమా వేశంలోని కీలక పరిణామం. అదే సమయంలో ఉక్రెయిన్ చేరికపై మాత్రం నిర్ణీత కాలవ్యవధి ఏదీ ఈ కూటమి ప్రతిపాదించ లేదు. అమెరికా అధ్యక్షుడు సాంత్వన వచనాలు పలికినా, ఇది ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీలో నిరుత్సాహం రేపింది. వెరసి, యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్ ఎదురుదాడి నిదానించిందేమో కానీ, ఆ దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన పాశ్చాత్య కూటమి బలోపేతమవుతోంది. రష్యాను చక్రబంధంలో ఇరికించే ప్రయత్నం నిరంతరాయంగా సాగుతోంది. మొన్నటి దాకా స్వీడన్ చేరికను వీటో చేస్తూ టర్కీ అడ్డుకుంటోంది. ఇప్పుడు ఎత్తివేతతో స్వీడన్‌కు ఇక అన్ని అవరోధాలూ తొలగిపోయినట్లే! అటు రష్యాతో సుదీర్ఘమైన సరిహద్దున్న ఫిన్లాండ్, అలాగే ఇటు బాల్టిక్ సముద్రంలోని కీలకమైన గాట్లాండ్ తన చేతుల్లో ఉన్న స్వీడన్... రెండూ నాటో వైపు మొగ్గడం రష్యాకు చీకాకు పెంచే విషయమే. అసలైతే... ఫిన్లాండ్, స్వీడన్లు సాంప్రదాయికంగా సైనిక వ్యవహారాల్లో ఏ కూటమి వైపూ మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించినవే. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో అవి తమ వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. 2022 మేలోనే ఫిన్లాండ్తో పాటు స్వీడన్ కూడా సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంది. మొన్న ఏప్రిల్‌లో ఫిన్లాండ్ ‘నాటో’లో 31వ దేశ సభ్యదేశం కాగా, త్వరలోనే స్వీడన్ 32వది కానుందన్న మాట. తాజా పరిణామాలతో ఒక విషయం అర్థమవుతోంది. బెలారుస్, ఉక్రెయిన్, జార్జియా మినహా పడమటి సరిహద్దులంతా ఇక నాటో బలగాల ఉనికితో రష్యా సర్దుకుపోక తప్పదు. అంతా అనుకు న్నట్టు జరిగి నాటో ఇలాగే విస్తరిస్తూపోతే, యూరోపియన్ ప్రపంచ భద్రతా వలయంలోనూ మరిన్ని మార్పులు తథ్యం. దశాబ్దాలుగా రక్షణ వ్యయంపై వైముఖ్యం ప్రదర్శించిన దేశాలు సైతం ఇప్పటికే తమ సైనిక సన్నద్ధతకు పదును పెట్టుకుంటున్నాయి. ‘నాటో’ను విస్తరించబోమంటూ సోవియట్ పతనకాలంలో వాగ్దానం చేసిన అమెరికా ఆ మాట తప్పి, ఉక్రెయిన్ను చేర్చుకొనేందుకు ఉత్సాహప డడమే సమస్యకు మూలమనేది రష్యా ఆరోపణ. నాటో విస్తరణతో తనకు భౌగోళిక, వ్యూహాత్మక ప్రమాదాలున్నాయనేది దాని వాదన. అందుకే కీవ్‌పై దాడికి తెగబడింది. ఈ రష్యా దురాక్రమణ వైఖరిని అటుంచితే దాని భయసందేహాలు సమంజసమే. ఆ సంగతి పాశ్చాత్యప్రపంచానికీ తెలుసు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఇటు పాశ్చాత్య ప్రపంచ ‘నాటో’ ఏర్పాటు, అటు దానికి ప్రతిగా సోవి యట్ యూనియన్ కూటమి ‘వార్సా’ ఒప్పందం గత చరిత్ర. సోవియన్ యూనియన్ విచ్ఛిత్తితో ‘వార్సా’నే రద్దయ్యాక, ఇప్పుడు నాటో ప్రాసంగికత, దాన్ని విస్తరించాలనే అమెరికా ఆకాంక్ష దేనికి చిహ్నమనేది కొందరి ప్రశ్న. అయితే, రష్యాతో యుద్ధం ముగిసేవరకు ‘నాటో’లో ఉక్రెయిన్ చేరిక అసాధ్యమే. స్వీయభద్రత సాకుతో రష్యా దండెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు అధికారికంగా సభ్యత్వమిచ్చి, మరింత కోపం తెప్పించడం తెలివైన పని కాదు. అది పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయవచ్చు. అందుకే పాశ్చాత్య లోకం కీవ్‌కు కావాల్సిన ఆర్థిక, సైనిక సహకారమిస్తూనే సాంకేతికంగా కూటమిలో చేర్చుకోకుండానే కథ నడిపించే పనిలో ఉంది. నాటో భేటీ అదే ధ్రువీకరించింది. మరోపక్క ఉక్రెయిన్‌పై దాడితో... నాటో వైపు చూస్తున్న పొరుగు దేశాలను దారికి తేవచ్చను కున్న రష్యా అధినేత పుతిన్ అంచనాలూ తప్పాయి. నాటోలో సంఘీభావాన్ని బలహీనపరచడం, రష్యా సరిహద్దుల వైపు నాటో మరింత విస్తరించకుండా ఆపడమనే లక్ష్యంలో ఆయన విఫల మయ్యారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు నాటోతో రష్యా భూ సరిహద్దు 754 మైళ్ళే. ఇవాళ అది 1584 మైళ్ళయింది. రేపు ఉక్రెయిన్ కూడా ఆ కూటమిలో చేరితే, అది మరింత పెరుగుతుంది. పెనునష్టం తెచ్చిపెట్టిన యుద్ధంతో ఉక్రెయిన్ భూభాగంలో 17 నుంచి 18 శాతం రష్యా కలుపుకో గలిగింది. ఈ కలుపుకొన్న కొద్ది ప్రాంతం సాంకేతికంగా లాభదాయకమే కానీ, అంతకన్నా విశ్వ వేదికపై వ్యూహపరంగా రష్యాకు జరిగిన నష్టమే అధికం. ఒక్కమాటలో పుతిన్ సెల్ఫ్ గోల్ చేసు కున్నారు. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు తప్పవని తీవ్రంగా హెచ్చరించినా, ఇప్పటికే ఫిన్లాండ్, త్వరలోనే స్వీడన్ నాటోతో జట్టు కడుతున్నాయి. ఇక పుతిన్ ఏం చేస్తారో? వాస్తవానికి, ఉక్రెయిన్ యుద్ధంతో నిరంతర నాటో విస్తరణ రాజకీయ వ్యూహ అనివార్యతగా తయారైంది. కానీ, ఇది రెండంచులా పదునైన కత్తి. ఈ చర్య రష్యా పొరుగుదేశాలకే చేటు తేవచ్చు. నిత్యం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, వివాదాలు ఏదో ఒక సమయంలో యుద్ధానికి దారి తీయ వచ్చు. పొరపాటున అది ప్రపంచ యుద్ధమైనా ఆశ్చర్యం లేదు. నిర్ణీత ప్రాంతంలో భద్రత, సుస్థిరత కోస మంటూ సైనిక కూటములలో చేరుతున్నామంటారు. తీరా ఆ కూటములు మరింత అస్థిరతకూ, భావి యుద్ధాలకు పునాదులు వేస్తున్నాయనిపిస్తుంది. నాటో విస్తరణతో ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా, ఐరోపా మాత్రం వ్యూహాత్మక సుస్థిరతను అందుకుంటున్న దాఖలాలైతే లేవు. పైపెచ్చు, అది దీర్ఘకాలిక అస్థిరత, నిరంతర అభద్రత వైపు అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ అనుమానాల రీత్యా చూస్తే, నాటో సభ్య దేశాలు పెరగడం పాశ్చాత్య ప్రపంచానికి నిజంగా శుభప్రదమేనా అన్నది ప్రశ్న. -
Ukraine-Russia war: నాటో నాటో.. ఎప్పుడో ఎప్పుడో!
ఎస్.రాజమహేంద్రారెడ్డి: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సమావేశం ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. నాటో.. నాటో అంటూ కలవరించిన ఉక్రెయిన్ ఇప్పుడు నాటు.. నాటు అనక తప్పడం లేదు. గతేడాది మాడ్రిడ్‌లో జరిగిన సమావేశం అనంతరం స్వీడన్, ఫిన్లండ్లను కూటమిలో చేర్చుకుంటున్నట్టు నాటో ప్రకటించింది. ఆ రెండు దేశాలు జూలై 11, 12 తేదీల్లో లిథువేనియాలో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాయి. ఇదే బాటలో నాటో కూటమి తమను కూడా అక్కున చేర్చుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశించారు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి! ఉక్రెయిన్ భవిష్యత్తు తమతోనే ముడిపడి ఉంటుందని సమావేశం చివరి రోజు నాటో పేరుకు ఒక ప్రకటన చేసినా, ఆ భవిష్యత్తు ఎప్పుడు ఆరంభమవుతుందో మాత్రం స్పష్టం చేయలేదు. దాదాపు 500 రోజులకు పైగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు పశి్చమ దేశాలు ఆయుధ సామగ్రితో పాటు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను సమకూరుస్తూ అండగా ఉన్నప్పటికీ, ఆ సాయం వెనక ఆయా దేశాల ఊగిసలాట ధోరణి జెలెన్స్కీని కలవరపరుస్తూనే వస్తోంది. ప్రతిదానికీ చేతులు జోడించి ఎదురు చూడాల్సి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నాటో కూటమిలోకి ప్రవేశం దక్కితే ఈ అవస్థ ఉండదన్నది జెలెన్స్కీ ఆలోచన. నిజానికి నాటోలో చేరితే ఉక్రెయిన్ రక్షణ బాధ్యతను కూటమి దేశాలన్నీ సంయుక్తంగా మోయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ భవితవ్యాన్ని, రష్యాతో జరుగుతున్న యుద్ధ గమనాన్ని శాసించే నాటో సభ్యత్వ వ్యవహారంలో నిజానికి ఏం జరిగింది? ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చేందుకు ఎందుకు నాటో పచ్చజెండా ఊపలేదు? అసలు జెలెన్స్కీ ఆశించిందేమిటి? వివరాల్లోకి వెళ్దాం... అనుకున్నదొక్కటి... జెలెన్స్కీ ఏం ఆశిస్తున్నదీ సుస్పష్టం. గత సెపె్టంబరుకు ముందు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కావాలన్న తన అభ్యర్థనను 2023 జూలైలో లిథువేనియాలో జరిగే కూటమి సమావేశంలో వ్యక్తం చేస్తానని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యల్లో మొక్కుబడితనమే తప్ప గాఢమైన కోరికేమీ ధ్వనించలేదు. ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్్క, డొనెట్స్్క, ఖెర్సన్, జపోరిజియాలను తమ భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సెపె్టంబరులో ప్రకటించగానే జెలెన్స్కీ స్వరం మారిపోయింది. నాటోలో తమకు పూర్తి సభ్యత్వమిచ్చే అంశాన్ని ఆగమేఘాల మీద పరిశీలించాల్సిందిగా జెలెన్స్కీ అభ్యరి్థంచడం మొదలెట్టారు. అంటే నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ సీరియస్‌గా ఆశిస్తున్నది కేవలం ఏడాది క్రితం నుంచేనని సుస్పష్టం. నాటో మార్గదర్శకాల ప్రకారం యూరప్‌లోని ఏ దేశమైనా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పన్నెండు దేశాల కూటమిగా మొదలైన నాటో సభ్య దేశాల సంఖ్య ఇప్పుడు 32కు పెరిగింది. లిథువేనియాలోని విలి్నయస్లో జరిగిన నాటో భేటీకి హాజరైన జెలెన్స్కీ పనిలో పనిగా లుకిస్కస్ స్క్వేర్‌లో జరిగిన ఓ సభలో తమ అభీష్టాన్ని అక్కడి జనాలతో పంచుకున్నారు. సభా వేదికపై ‘ఉక్రెయిన్–నాటో 33’ నినాదాన్ని కూడా ప్రదర్శించడం విశేషం. నాటో నేతలకే ఇష్టం లేదు...! లుకిస్కస్ స్క్వేర్ సభా వేదికపై ప్రదర్శితమైన ‘ఉక్రెయిన్–నాటో 33’ బ్యానర్ అక్కడివారి మది దోచినా, ఉక్రెయిన్ మెడలో ఇప్పటికిప్పుడే ‘నాటో–33’ గుర్తింపు కార్డు పడటం మాత్రం నాటో నేతల్లోనే చాలామందికి అసలు ఇష్టం లేదు. అందుకే ‘అప్పుడే కాదం’టూ ఉక్రెయిన్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని మంజూరు చేస్తే నాటో దేశాలన్నీ రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధ బరిలోకి దిగాల్సి వస్తుంది. నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్య దేశంపై దాడి జరిగినా కూటమిలోని దేశాలన్నీ సంయుక్తంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. నాటో నిబంధనల్లోని ఆరి్టకల్–5 ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశించింది. నాటో చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి, అమెరికాపై 9/11 ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఈ నిబంధన అమలైంది. ఒకవేళ ఇప్పుడు గనక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తే కూటమిలోని మిగతా 32 దేశాలూ రష్యాపై యుద్ధానికి దిగాల్సి వస్తుంది. ‘నాటో దేశాల భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. ఇప్పుడు యుద్ధం నడిమధ్యలో ఉంటే తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మేమంతా రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటో కూటమి తమ సభ్య దేశాల పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో బైడెన్ ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటారు. అయితే బైడెన్ వ్యాఖ్య వెనక అసలు ఉద్దేశాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జెన్ వాలెస్ కుండబద్దలు కొట్టారు. ‘ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్న దేశాన్ని ఇప్పటికిప్పుడు కూటమిలోకి ఆహా్వనించలేం. అలా చేయడం మొత్తం కూటమినీ యుద్ధభూమిలోకి లాగడమే అవుతుంది’’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. యుద్ధం ముగిశాక గెలుపోటములతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సభ్యత్వానికి నాటో ఇలా సూత్రప్రాయంగా అంగీకరించినా అధికార ముద్ర ఎప్పుడు పడుతుందో చెప్పలేం. యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్‌కు నాటో మోక్షం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది మాత్రం అస్పష్టం! జెలెన్స్కీకీ ముందే తెలుసు...! యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం రావడం కల్లేనని జెలెన్స్కీకీ తెలుసు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆయన పదేపదే నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం మాటే ఉండదు. మాకది ఇష్టం లేక కాదు, కానీ అసాధ్యం’ అని జెలెన్స్కీ ఐదారు నెలల క్రితం కీవ్‌లో తన మనసులో మాటను సుస్పష్టంగా చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే నాటో సభ్యత్వం లభించేలా ఓ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసుకోవడానికే పదేపదే ఇలా సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సభ్యత్వంపై ఎటూ తేల్చని నాటో కనీసం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడిని నిరాశకు గురి చేసింది. ఇది ఒకరకంగా ఉక్రెయిన్ను ఆగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టిందనే భావించాలి. ఉక్రెయిన్ ఉక్రెయిన్‌గా నిలవాలంటే యుద్ధాన్ని గెలవాలి, లేదా రష్యాతో సంధి కుదుర్చుకోవాలి. ఈ రెండు పరిస్థితుల్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరగలుగుతుంది. ఓడిపోతే ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగంగా మారిపోతుంది. అప్పుడిక దానికి నాటో ప్రస్తావన అవసరమే లేకుండా పోతుంది. గెలుపోటములను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటిదాకా ‘అయితే గియితే’లో ఉన్న నాటో సభ్యత్వ అంశం ‘ఆ సుదినం ఎప్పుడు’ అనేదాకా అయితే వచి్చంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌కు ఊరటనిచ్చే విషయం ఇదొక్కటే. యుద్ధం త్వరలో ఓ కొలిక్కి వచ్చి ఉక్రెయిన్‌కు నాటో తలుపులు తెరుకోవాలని కోరుకుందాం! తెరుచుకుంటాయనే ఆశిద్దాం!! -
నాటోలో సభ్యత్వం: స్వీడన్‌కు సై.. ఉక్రెయిన్‌కు నై.. కారణమిదే!
విల్నియస్: స్వీడన్‌ను తమ కూటమిలో 32వ సభ్యదేశంగా చేర్చుకునేందుకు నాటో అంగీకరించింది. లిథువేనియా దేశంలోని విలి్నయస్ నగరంలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. అయితే ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై 31 సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం దక్కకపోవచ్చు. యుద్ధంలో నిమగ్నమైన దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదన్న నిబంధన కారణంగా ఇప్పుడే కూటమిలో చేర్చుకోలేమని, యుద్ధం ముగిశాక వెంటనే సభ్యత్వం ఇచ్చేలా పాత రెండంచెల పద్ధతిని సరళతరం చేశామని నాటో ప్రధాన కార్యదర్శి జీన్స్ స్టోల్టెన్బెర్గ్ మీడియాతో చెప్పారు. కాగా, తమ పట్ల నాటో వైఖరిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. -
బలపడుతున్న భారత్–నాటో బంధం?
భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, మన సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ ధోరణి అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అన్యోన్యతను కలిగి ఉంది. హిందూ మహాసముద్రంలో దొంగతనాల (పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం స్పష్టంగా ఉంది. కాబూల్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు భారత అధికారులు నాటో అధికారులతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు. 2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్ దాడుల తర్వాత భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్) ఫిన్లాండ్తో, నాటోతో సహకరించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) వార్షిక శిఖరాగ్ర సమావేశం లిథువేనియా రాజధాని విల్నియస్‌లో జరుగుతోంది (జూలై 11–12). ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల పరస్పర రక్షణ కూటమిగా 1949 నుండి ఉంటూ వస్తున్న నాటోను ఇటీవలి వరకు చాలామంది ప్రచ్ఛన్న యుద్ధ అవశేషంగానే భావించారు. (ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ అయితే 2019లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాటో బ్రెయిన్ డెత్ గురించి ప్రముఖంగా ప్రకటించారు కూడా.) కానీ ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం నాటో కూటమిలో సరికొత్త ప్రయోజనాత్మక లక్ష్యాన్ని నింపింది. గత సంవత్సరంలో ఫిన్లాండ్ను నాటోలో చేర్చుకున్నారు. సభ్యులందరి ఆమోదానికి లోబడి స్వీడన్ కూడా కూటమిలో చేరుతుందని భావిస్తున్నారు. దీంతో నాటో సభ్యత్వం 32 దేశాలకు పెరగనుంది. పైగా, మంగోలియా, పాకిస్తాన్ వంటి విభిన్న దేశాలతో సహా 39 దేశాలతో నాటో అధికారిక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వాటిలో మూడు (రష్యా, బెలారస్, అఫ్గానిస్తాన్) దేశాల సభ్యత్వాన్ని ప్రస్తుతం నిలిపివేశారు. ఇవి పార్లమెంటరీ వ్యవహారాల నుండి సాంకేతిక సహకారం వరకు వివిధ స్థాయుల్లో ప్రమేయాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని నాటో భాగస్వామ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... రష్యాకు వ్యతిరేకంగా సమన్వయం విషయంలో మరింత సన్నిహితంగా ఉన్నాయి. నాటో 2022 వ్యూహాత్మక భావన అనేది రష్యాపై దృష్టిని తిరిగి కేంద్రీకరించడం, కూటమి సభ్యత్వ విస్తరణను చేపట్టడంతో సహా చైనా ప్రజా రిపబ్లిక్కు (పీఆర్సీ) కొంత ప్రాధాన్యమిచ్చింది. బీజింగ్ ‘ప్రకటిత ఆశయాలు, దాని బలవంతపు విధానాలు, మన ఆసక్తులను, భద్రతను, విలువలను సవాలు చేస్తున్నాయి’ అని ప్రకటించింది. ‘యూరో–అట్లాంటిక్ భద్రతకు పీఆర్సీ ద్వారా ఎదురయ్యే దైహిక సవాళ్లను పరిష్కరిస్తా’మని ఈ డాక్యుమెంట్ ప్రతినబూనింది. నాటో ఆందోళన చెందుతున్న అంశాల్లో చైనాను కూడా చేర్చడం వల్ల భారత్‌తో ఈ కూటమి చర్చలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇండో–పసిఫిక్ దేశాలతో నిమగ్నమవ్వడానికి జపాన్‌లో నాటో కార్యాలయాన్ని ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. మారుతున్న ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా దాని వ్యూహాత్మక ప్రాధాన్యాలు ఉంటున్నాయి. భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, భారతదేశ సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ మౌనం కొంతవరకు అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అధికారిక అన్యోన్యతను కలిగి ఉంది. భారత్, నాటో మధ్య ప్రారంభ వ్యవహారాలు... ఆయుధాల నియంత్రణ, తీవ్రవాద వ్యతిరేక సమస్యలతో నడిచాయి. వాటి మొదటి అధికారిక ఒడంబడిక 2005లో జరిగింది. తరువాతి రెండేళ్లలో, అంటే 2006, 2007లో ఇండియా తరఫున ప్రణబ్ ముఖర్జీ రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిగా ఇరు హోదాల్లో నాటో సెక్రటరీ జనరల్‌తో సమావేశమయ్యారు. నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ 2007లో భారత్‌ను సందర్శించారు. 2019లో నాటో–భారత్ మధ్య జరిగిన రాజకీయ చర్చల్లో చైనా, తీవ్రవాదం, పాకిస్తాన్ వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. రెండు సంవత్సరాల తరువాత, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ న్యూఢిల్లీలో యేటా జరిగే ‘రైజీనా డైలాగ్’ని ఉద్దేశించి ప్రసంగించారు. హిందూ మహాసముద్రంలో దొంగతనాల(పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం చాలా స్పష్టంగా ఉంది. 2009, 2011 మధ్య, బీజింగ్‌లో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆతిథ్య భేటీలోనూ, బ్రస్సెల్స్‌లో నాటో నిర్వహించిన సమావేశంలోనూ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో పైరసీ వ్యతిరేక ప్రయత్నాలను సమన్వయం చేయడంలో భారత్, నాటో అధికారులు పాల్గొన్నారు. భారత నౌకాదళం వాలెన్సియాలోని నాటో ర్యాపిడ్ డిప్లాయబుల్ కోర్తో కూడా పరిచయాలను ఏర్పరచుకుంది. ఈ దశలు కొన్ని కచ్చితమైన ఫలితాలను అందించాయి. ఉదాహరణకు, 2011 మే నెలలో, అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడిని అడ్డుకోవడానికి భారత నౌకాదళం నాటో పెట్రోలింగ్ నౌకలతో సమన్వయం చేసుకుంది. రెండు సంవత్సరాల తరువాత, నాటో నౌకాదళ వాహనాలు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో 14 మంది భారతీయ నావికులను రక్షించడంలో సహాయపడ్డాయి. నాటో, భారత్ మధ్య కాలానుగుణమైన అధికారిక వ్యవహారాలు అఫ్గానిస్తాన్, సైనిక విద్య, శాంతి పరిరక్షక కార్యకలాపాలు, సైబర్ భద్రత వంటి ఇతర రంగాలకు విస్తరించాయి. కాబూల్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు, భారత అధికారులు అక్కడి అంతర్జాతీయ భద్రతా సహాయ దళం (ఐఎస్ఏఎఫ్)లో పాల్గొన్న నాటో అధికారులతోనూ, సైనిక కమాండర్లతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు. 2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్ దాడుల తర్వాత భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్) ఫిన్లాండ్తో, నాటోతో సహకరించింది. తర్వాత 2008లో ఉత్తర సముద్రంలో నాటో కసరత్తులకు భారత అధికారులను పరిశీలకులుగా ఆహ్వానించారు. ఇటీవల, కమాండెంట్ నేతృత్వంలోని భారత జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం, నాటో మారిటైమ్ ఇంటర్‌డిక్షన్ ఆపరేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించింది. బ్రస్సెల్స్ సదస్సు దృక్పథం నుండి అఫ్గానిస్తాన్ ఇప్పుడు వెనక్కిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ ఇది న్యూఢిల్లీకి అధిక ప్రాధాన్యంకలిగిన అంశమే. ఏదేమైనా, అతి వ్యాప్తి చెందుతున్న వారి ఎజెండాల స్వరూపాలు నేడు మరింత సులభంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఇండో–పసిఫిక్‌లో రాజకీయ పరిణామాలు, వృత్తిపరమైన సైనిక విద్య, వాతావరణ మార్పులు, బహుశా ఆయుధాల నియంత్రణతోపాటు అణు ఎస్కలేటరీ డైనమిక్స్ ఇందులో ఉన్నాయి. సహజంగానే, వేర్వేరు ప్రయోజనాలు, ఆసక్తులు, తరచుగా భిన్నమైన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా... భారత్, నాటోలు రష్యాతో పరస్పర చర్చలకు భిన్నమైన విధానాలను కొనసాగిస్తాయనడంలో సందేహం లేదు. ఆర్మేనియా, కజకిస్తాన్, సెర్బియా వంటి రష్యాతో సన్నిహితంగా ఉన్న అనేక భాగస్వామ్యదేశాలతో నాటో తలపడుతోంది. అంతే కాకుండా, ఇటీవలి వరకు అది న్యూఢిల్లీతో కంటే బీజింగ్, మాస్కోలతో మరింత విస్తృతమైన సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు నాటోతో విద్యా శిక్షణా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. నవంబర్ 2021 వరకు, మాస్కోలో నాటో తన కార్యాలయం కూడా కలిగి ఉంది. వాటి మధ్య విభిన్న అనుకూలతలు ఉన్నప్పటికీ... ఇండో–పసిఫిక్‌లో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీని నాటో అంగీకరించడం అనేది భారతదేశంతో విస్తృతమైన, లోతైన సంభాషణకు తలుపులు తెరుస్తుంది. – ధ్రువ జైశంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఓఆర్ఎఫ్ అమెరికా; అమ్మార్ నైనార్, జూనియర్ ఫెలో, ఓఆర్ఎఫ్ అమెరికా (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఉక్రెయిన్‌కు నాటో భారీ ఆయుధ సాయం
కీవ్: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్‌కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. -
పుతిన్‌కు పెరిగిన తలనొప్పి
మూలిగే నక్క మీద తాటిపండు పడడమంటే ఇదే! ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో)లో చేరడానికి ఉక్రెయిన్ ఉత్సాహపడుతోందని కోపగించి, కదనానికి కత్తి దూసిన రష్యాకు ఆ తలనొప్పి తగ్గకపోగా, ఇప్పుడు ఫిన్లాండ్ రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. అమెరికా సహా మొత్తం 30 పాశ్చాత్య దేశాల కూటమి ‘నాటో’లో 31వ దేశంగా మంగళవారం ఫిన్లాండ్ అధికారికంగా చేరింది. దీంతో, రష్యాకు కంటి మీద కునుకు పట్టనివ్వకుండా ఆ దేశంతో ‘నాటో’ సభ్య దేశాల సరిహద్దు రెట్టింపయింది. పాశ్చాత్య ప్రపంచంతో దీర్ఘకాలంగా ఘర్షణలో ఉన్న మాస్కో విషయంలో ఇన్నేళ్ళుగా తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ ఇప్పుడిలా ప్రత్యర్థితో జట్టు కట్టడం రష్యాకూ, ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్‌కూ పెద్ద ఎదురుదెబ్బ. కానీ, ఉక్రెయిన్‌తో ఏడాది పైగా ఎగతెగని పోరు చేస్తూ, ముందుకు పోలేక వెనక్కి రాలేక సతమతమవుతున్న మాస్కో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఫిన్లాండ్ చేసినపనికి తగురీతిలో ప్రతిచర్యలు ఉంటాయని హూంకరించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి తమను తాము రక్షించుకొనేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, నెదర్లాండ్స్, కెనడాలు స్థాపించిన సైనిక కూటమి ‘నాటో’. 1949లో సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని ఇది అమలు చేస్తుంది. ‘నాటో’లోని ఏ సభ్యదేశం పైన అయినా బయట దేశాలు దాడికి దిగితే, మిగతా సభ్యదేశాలన్నీ సాయం చేయాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకోవడమూ ‘నాటో’ లక్ష్యం. తన ప్రయోజనాలకు విరుద్ధంగా పాశ్చాత్య ప్రపంచం కూడగట్టిన ఈ కూటమి అంటే రష్యాకు అందుకే ఒళ్ళు మంట. 1990ల ద్వితీయార్ధం నుంచి తన పొరుగు దేశాలను ‘నాటో’లో చేర్చుకొని, పక్కలో బల్లెంలా మార్చడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘నాటో’ విస్తరణ విషయంలో ఉక్రెయిన్‌కు సంబంధించి ఇచ్చిన మాట తప్పేందుకు పాశ్చాత్య ప్రపంచం సిద్ధపడడాన్ని మాస్కో జీర్ణించుకోలేకపోయింది. అందుకే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాది క్రితం ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగారు. సరిహద్దు వెంట ‘నాటో’ బెడద తగ్గించుకోవాలనీ, యూరప్‌లో మరే దేశమూ ‘నాటో’లో చేర కుండా చేయాలనీ ఉక్రెయిన్‌తో పోరాటం ప్రారంభించిన పుతిన్ సఫలం కాలేదు. పైపెచ్చు, అందుకు పూర్తి విరుద్ధంగా ఆ సైనికకూటమి విస్తరణకు కారణమయ్యారు. ఇది విరోధాభాస. మాస్కో చేపట్టిన యుద్ధంతో ‘నాటో’ పట్ల ఆకర్షణ పెరిగింది. రష్యాతో తిప్పలు తప్పవనే అనుమానంతో, ‘నాటో’ సైనిక కూటమిలో సభ్యత్వానికి మరిన్ని మధ్యయూరప్ దేశాలు క్యూ కట్టాయి. ఆ క్రమంలో ఫిన్లాండ్, స్వీడన్లు ‘నాటో’ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. నిజానికి, ఫిన్లాండ్ దాదాపు 1,340 కిలోమీటర్ల తూర్పు సరిహద్దును రష్యాతో పంచుకుంటోంది. ఆ దేశం ఎన్నడూ రష్యా వ్యతిరేకి కాదు. పైగా, రెంటికీ మధ్య ఎన్నడూ విభేదాలు లేవు. అలాంటిది– ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో ‘నాటో’లో చేరేందుకే ఫిన్లాండ్లో 80 శాతం మేర ప్రజాభిప్రాయం మొగ్గింది. చివరకు అదే జరిగింది. సభ్యత్వానికి ఫిన్లాండ్ పెట్టుకున్న దరఖాస్తు రికార్డు సమయంలో ఆమోదం పొందింది. ఫిన్లాండ్ అధికారికంగా ‘నాటో’లో చేరినా, స్వీడన్‌కు మాత్రం ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. సభ్యత్వానికి స్వీడన్ అంగలారుస్తున్నా, టర్కీ, హంగరీలు అడ్డంగా నిలిచాయి. టర్కీలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ప్రమాణాల గురించి స్వీడన్ వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశం కినుక వహించింది. మే 14న టర్కీలో ఎన్నికల తర్వాత కానీ ఆ దేశం స్వీడన్ దరఖాస్తుకు ఆమోదముద్ర వేయకపోవచ్చని విశ్లేషకుల అంచనా. హంగరీ విషయానికొస్తే, స్వీడన్ అనేక సంవత్సరాలుగా హంగరీ పట్ల వైరభావంతో వ్యవహరిస్తోంది. పైగా, హంగరీలో న్యాయం క్షీణించిందంటూ స్వీడన్ ప్రధాని ఆ మధ్య వ్యాఖ్యానించారు. దాంతో, హంగరీకి పుండు మీద కారం రాసినట్లయింది. టర్కీ లాగా డిమాండ్ల జాబితా లేకున్నా, తన సాధకబాధకాలను తీరిస్తే హంగరీ సైతం ‘నాటో’లో స్వీడన్ ప్రవేశానికి ఓకే అంటుంది. మొత్తానికి, అమెరికా సారథ్యంలోని ద్వితీయ ప్రపంచ యుద్ధానంతర కూటమి బలోపేతమవుతోంది. బోలెడన్ని నిధులందిన ఆధునిక రక్షణ దళాలతో కూడిన ఫిన్లాండ్ ‘నాటో’కు బలమైన చేర్పు. రేపు ఉక్రెయిన్ యుద్ధం ఎటు తిరిగి ఎలా ముగిసినా, రష్యా మాత్రం బలహీనపడింది. ఏదైతే జరగరాదని పుతిన్ ఆశించారో, అదే జరిగి సరిహద్దు వెంట ‘నాటో’ దేశాల సంఖ్య, సత్తా ఇనుమడించాయి. ఈ పాపపుణ్యాలు పూర్తిగా పుతిన్వే. దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ, నియమాను సారం సాగే అంతర్జాతీయ క్రమాన్ని ఆయన తోసిపుచ్చారు. పాశ్చాత్య ప్రపంచం ఉలిక్కిపడి, కార్యా చరణకు ఉద్యుక్తమయ్యేలా చేశారు. ఇకపై రష్యా – యూరప్‌ల మధ్య బంధం మునుపటిలా ఉండబోదు. మరోపక్క చైనా సైతం నిత్యం ఎవరో ఒకరితో కయ్యానికి కాలుదువ్వుతోంది. వీటన్నిటి దృష్ట్యా ‘నాటో’ లాంటి సైనిక కూటములు మరింత విస్తరించడం ఖాయం. ఇప్పటికే ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి తటస్థంగా ఉన్న ఫిన్లాండ్, స్వీడన్లు పాశ్చాత్య ప్రపంచ మిత్రపక్షాలుగా మారాయి. రష్యాతో చేతులు కలిపి ఆర్కిటిక్‌లో చైనా తన ప్రాబల్యం పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో ధ్రువవృత్తం దాటి, ఆర్కిటిక్ ప్రాంతమంతటా సైనికీకరణ తప్పకపోవచ్చు. భారత్ సైతం ఆర్కిటిక్‌లో తలెత్తే పరిణామాలనూ, ప్రభావాన్నీ జాగ్రత్తగా గమనించక తప్పదు. వెరసి, ఆర్కిటిక్ ప్రాంతం మరింత సమస్యాత్మకం కానుంది. పుతిన్‌తో పాటు ప్రపంచానికీ తలనొప్పి పెరగనుంది! -
భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు
భారత్‌తో సంబంధాల కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) తలుపులు తెరిచే ఉంచింది అని నాటోలోని యూఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌తో సాన్నిహిత్యంగా ఉండటం తమకు చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు. అంతేగాదు భారత్ కోరుకుంటే ఏ సమయంలోనైనా దీని గురించి చర్చిండానికి నాటో సిద్ధంగా ఉందని కూడా స్మిత్ చెప్పారు. దీంతో ఒకరకంగా నాటోలో భారత్ చేరేలా యూఎస్ ప్రత్యక్ష సంకేతాలిస్తునట్లుగా ఉంది. ఈ మేరకు భారత్, యూఎస్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు గురించి మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య భాగస్వామ్యం అత్యంత దృఢంగా ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాలు ప్రజాస్వామ్యం, నియమాల ఆధారిత క్రమం, వాతావరణ మార్పు, హైబ్రిడ్ బెదిరింపులు, సైబర్ భద్రత, సాంకేతికత, విఘాతం కలిగించడం తదితర అంశాలపై కలిసి పనిచేయడంపై నిమగ్నమయ్యాయని అన్నారు. సోవియట్ యూనియన్ కోసం ఏర్పడ్డ నాటో తొలిసారిగా ఇండో పసిఫిక్‌తో తన విస్తరణను పెంచుకుందని తెలిపారు. అలాగే చైనాను నాటో వ్యవస్థాగత సవాలుగా గుర్తించిందని చెప్పారు. అయితే ఆయా ప్రాంతాలలోని భాగస్వామ్యుల వ్యూహాత్మక విధానాల తోపాటు ముఖ్యంగా చైనా దూకుడు విధానానికి సంబంధించి వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నాలుగు ఇడో పసిఫిక్ దేశాలు జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లిథువేనియాలో జరగనున్న అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందినట్లు ఆమె తెలిపారు. ఈ దేశాలతో తమ భాగస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం మీద నాటో ఏ ఇండో పసిఫిక్ దేశంతోనూ పొత్తుల పెట్టుకునే యోచన చేయడం లేదని, పైగా విస్తృత కూటమిగా విస్తరించే ఆలోచన కూడా లేదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేవలం ఒక్క రోజులో యుద్ధాన్ని ముగించగలరని అన్నారు. పశ్చిమ దేశాలు కేవలం ఉక్రెయిన్‌కు అవసరమైన వాటిని అందించడమే కాకుండా భవిష్యత్తులో రష్యన్లు చేసిన పనిని ఇతర దేశాలు చేసే ప్రమాదం ఉందని స్మిత్ హెచ్చరించారు. అలాగే ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కి భారత్ అందించిన మానవతా సాయాన్ని నాటో ప్రశంసించింది. యుద్ధాన్ని ముగించాలని పిలుపునివ్వడమే గాక ఇతర దేశాల యూఎన్ నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. ఏదీఏమైనా ఈ ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని స్మిత్ అన్నారు. ఈ యుద్ధంలో రష్యా గనుక అణ్వాయుధాలను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. దీని గురించి నాటో నిఘా ఉంచినట్లు కూడా యూఎస్ నాటో ప్రతినిధి స్మిత్ వెల్లడించారు. (చదవండి: పంజాబ్ సీఎం కూతురు సహా.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు ఖలీస్తానీ గ్రూపుల బెదిరింపులు) -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. సాయానికి నాటో దేశాల కీచులాట? కారణాలేంటి?
దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో నాటో దేశాల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయా? ఉక్రెయిన్ మరో అఫ్గానిస్తాన్‌గా మారుతుందేమోననే అనుమానాలు నాటో కూటమిలో కలుగుతున్నాయా? ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సంప్రదాయక యుద్ధం ముదిరి నాటో దేశాలు కూడా ప్రభావితమై భీకర యుద్ధంగా మారుతుందా? ఉక్రెయిన్ పద్మవ్యహంలో పీకల దాకా చిక్కుకుపోయామనే సందేహం నాటో దేశాల అధినేతల్లో మొదలవుతోందా? ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు సరఫరా చేసే విషయంలో నాటో కూటమిలో చెలరేగిన పొరపొ చ్చాలను గమనిస్తే కూటమి మధ్య స్నేహ సంబంధాలు సజావుగా సాగడం లేదని అర్థం అవుతోంది. ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో తామంతా ఒక్కతాటిపై ఉన్నట్లు పైకి చెబుతున్నా నాటో దేశాధినేతల మధ్య అనేక అంశాలపై విభేదాలు ఉన్నట్లు బయటపడింది. ఒత్తిడికి తలొగ్గిన అగ్రరాజ్యం... నాటో కూటమిలో విభేదాలు తలెత్తే పరిస్థితులను గమనించి అమెరికా తలొగ్గక తప్పలేదు. ఉక్రెయిన్ బెటాలియన్‌కు సరిపడా 31 అబ్రహం ట్యాంకులను పంపడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయిష్టంగానే అంగీకరించారు. ఆ వెంటనే జర్మనీ సహా ఇతర యూరప్ దేశాలన్నీ తమ వద్ద ఉన్న లెపర్డ్–2 ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు ప్రకటించాయి. నాటో కూటమిలో చీలికలు తప్పవని ఎదురుచూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నిరాశే ఎదురయ్యింది. ఇప్పుడు జరుగుతోంది రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కాదని... అమెరికా తెరవెనుక ఉండి నిర్వహిస్తున్న యుద్ధమని అమెరికాలోని రష్యా దౌత్యవేత్త అనతోలి టానోల్ వ్యాఖ్యానించారు. లెపర్డ్–2 యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్ పట్టు సుదీర్ఘ చర్చలు, మంతనాల తర్వాత ఉక్రెయిన్‌కు ట్యాంకులు సరఫరా చేయడానికి నాటో కూటమి అంగీకరించిందో లేదో ఇప్పుడు తమకు యుద్ధవిమానాలు కూడా కావాలని ఉక్రెయిన్ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. భూతలంపై ఉన్న తమ సైనిక బలగాల రక్షణకు గగనతలంలో యుద్ధవిమానాల అవసరం ఉందని ఉక్రెయిన్ అధినేతలు నాటోను కోరుతున్నారు. నాలుగో తరానికి చెందిన ఎఫ్16, యూరోఫైటర్స్, టోర్నడో, ఫ్రెంచ్ రఫేల్ యుద్ధవిమానాల అవసరాన్ని ఉక్రెయిన్ అధినేతలు బహిరంగంగానే చెబుతున్నారు. రష్యా దగ్గర నాలుగోతరం యుద్ధవిమానాలు 772 ఉంటే తమ దగ్గర సోవియెట్ యూనియన్ నాటి పాతబడిన 69 విమానాలే ఉన్నాయని... వాటితో రష్యాను నిలువరించడం కష్టమని ఉక్రెయిన్ రక్షణ శాఖ సలహాదారు యూరి సక్ చెబుతున్నారు. ట్యాంకుల పంపిణీపై అంగీకారానికి రావాడానికి తల బొప్పికట్టి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న నాటో దేశాలు ఈ కొత్త డిమాండ్‌తో బిత్తరపోయాయి. ఎఫ్16 విమానాలను ఉక్రెయిన్‌కు కేటాయిస్తున్నారా అని ఓ విలేఖరి అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ‘నో’అని ఒకమాటలో కొట్టిపారేశారు. ఇది అర్థంపర్థంలేని డిమాండ్ అని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పష్టం చేశారు. అయితే ఈ యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్ చేసిన వినతిపట్ల కొన్ని నాటో దేశాలు సానుకూలంగా స్పందించాయి. ఎఫ్16 యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్ అధికారికంగా కోరితే సానుకూలంగా పరిశీలిస్తామని నెదర్లాండ్ విదేశాంగ మంత్రి హొప్కి హోక్స్ట్రా అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ కూడా తమ దేశ యుద్ధవిమానాలను ఉక్రెయిన్‌కు పంపడానికి సిద్ధమన్నారు. లిథువేనియా అధ్యక్షుడు గిటినస్ న్యూసెథా కూడా సానుకూలంగా స్పందించారు. అయితే యుద్ధ విమానాల అంశం నాటో కూటమిలో మరోసారి విభేదాలకు దారితీయవచ్చని దౌత్యవేత్తలు అనుమానిస్తున్నారు. అసలు భయం ఇదీ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన నాటో కూటమిలో ఆయా దేశాలు అందిస్తున్న సాయంపై అంతర్మథనం జరుగుతోంది. ఏడాదిపాటు రష్యా లాంటి అతిశక్తివంతమైన దేశాన్ని నిలువరించగలిగిన ఉక్రెయిన్... ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మరింత దూకుడుగా వెళ్లి యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకువెళుతుందేమోనన్న అనుమానాలు కూటమి దేశాల్లో మొదలయ్యాయి. రష్యా ఆక్రమించుకున్న క్రిమియా వంటి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉక్రెయిన్ ఉవ్విళ్లూరుతున్న విషయం ఆ దేశ నాయకుల ప్రకటనల్లో అర్థమవుతోంది. నాటో అందిస్తున్న ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్ కనుక ఇలాంటి దుస్సాహసం చేస్తే అది యుద్ధం విస్తృతరూపం దాల్చడానికి దారితీస్తుందని అమెరికా, జర్మనీ వంటి దేశాలు భయపడుతున్నాయి. తామిచ్చే సాయం రష్యా దురాక్రమణలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ఉపయోగించుకోవాలని, ఇది శ్రుతి మించితే యుద్ధం తమ సరిహద్దుల వరకూ వచ్చే ప్రమాదం ఉందని నాటో దేశాలు ముఖ్యంగా రష్యా సరిహద్దుగా ఉన్న యూరప్ దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంపై ఆయా దేశాల ప్రజల్లో కొంత అసహనానికి దారి తీస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కనుక తమ భూభాగాలను టార్గెట్ చేయడానికి ఉపయోగపడే యుద్ధవిమానాలు, క్షిపణి ప్రయోగ యంత్రాల వంటివి అందిస్తే నాటో హద్దు మీరుతున్నట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ సహా రష్యా నేతలు హెచ్చరిస్తున్నారు. తమ పట్టణాలపై దాడి చేసే ఆయుధ సంపత్తిని నాటో గనక ఉక్రెయిన్‌కు అందిస్తే తీవ్ర రూపంలో ప్రతిఘటిస్తామని... దీనివల్ల యుద్ధం స్వరూపం మారే ప్రమాదం ఉందని రష్యా దౌత్యాధికారి గౌవ్రిలోవ్ హెచ్చరించారు. ట్యాంకులపై గొడవ ఉక్రెయిన్ కోరిన యుద్ధ ట్యాంకులు అందించడంపై వారాల తరబడి సాగిన మంతనాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చి నాటో దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఉక్రెయిన్‌కు సమీపాన ఉన్న యూరప్ దేశాలు ట్యాంకులు సరఫరా చేయాలని అమెరికా కోరుకుంది. అక్కడి భూ ఉపరితల పరిస్థితులకు ఐరోపా ట్యాంకులు సరితూగుతాయి కాబట్టి అయా దేశాలే ట్యాంకులు పంపిణీ చేయాలని అమెరికా వాదించింది. కానీ యూరప్‌లోని నాటో దేశాలు ముఖ్యంగా జర్మనీ అందుకు అంగీకరించలేదు. నాటో కూటమి సభ్యుల మధ్య అధికారికంగా జరిగిన అనేక సమావేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాయి. అమెరికా ముందుగా ట్యాంకులు పంపేందుకు ఒప్పుకుంటేనే తాము కూడా సిద్ధమవుతామని జర్మనీ తేగేసి చెప్పింది. అమెరికా తన దగ్గరున్న అధునాతన అబ్రహం ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందజేయడానికి అంగీకరిస్తేనే తాము లెపర్డ్–2 ట్యాంకులు ఇవ్వడానికి ఒప్పుకుంటామని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ పట్టుబట్టారు. అమెరికా భాగస్వామ్యం లేకుండా తాము ట్యాంకులు పంపితే రష్యా తన ఆగ్రహాన్ని తమపై గురిపెడుతుందన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెరవెనుక చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యూరప్‌లోని నాటో దేశాలు స్పెయిన్, పోలాండ్, ఫిన్లాండ్, నార్వే తమ వద్ద ఉన్న లెపర్డ్–2 ట్యాంకులను పంపడానికి సిద్ధంగా ఉన్నా జర్మనీ అనుమతి లేకుండా వాటిని ఇతర దేశాలకు పంపకూడదన్న ఒప్పందాన్ని అనుసరించి ముందడుగు వేయలేని పరిస్థితి. అబ్రహం ట్యాంకులు అత్యాధునికమైనవని, వాటిని ఉపయోగించడం కష్టసాధ్యమని, వాటి తయారీకి అనేక నెలలు పడుతుందని, రిపేర్లు చేయడం ఉక్రెయిన్‌కు సాధ్యం కాదని అమెరికా అధినేతలు బహిరంగంగా వాదిస్తూ వచ్చారు. పెంటగాన్ అధికారి కాలిన్ హెబ్ కాల్, అమెరికా జాతీయ భద్రతా దళ ప్రతినిధి జాన్ కిర్బి ఈ వాదనలు ముందుకు తెచ్చారు. అయినా కూడా జర్మనీ ససేమిరా అంది. -
అందుకు అమెరికా ఒప్పుకుంటే చర్చలకు రెడీ!...భారీ ట్విస్ట్ ఇచ్చిన పుతిన్
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాని ఎంతమంది చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోమని సలహ ఇచ్చిన అందుకు అంగీకరించలేదు. కానీ ఇప్పుడూ అనుహ్యంగా తాము చర్చలకు సిద్ధం అంటూ అనుహ్యంగా ముందుకు వచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అదీగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశాక అనుహ్యంగా పుతిన్ చర్చలకు తెరతీయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఇరు దేశాలవైపు భారీ మొత్తంలో సైనికులు నేలకొరిగి, జరగాల్సిన తీవ్ర నష్టం చవిచూశాక రష్యా అధ్యక్షుడు ఇలా అనడంలో ఆంతర్యం తెలియదు గానీ అందర్నీ మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే పుతిన్ చర్చలకు సిద్ధం అంటూనే మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఉక్రెయిన్‌లో రష్యా తన సొంతమని చెప్పుకుంటున్న భూభాగాలను అమెరికా గుర్తించాలి అని ఒక షరతు పెట్టాడు. అమెరికా అందుకు అంగీకరిస్తానే తాను యుద్ధ ప్రాతికన చర్చలకు సిద్ధం అని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ఆసక్తి చూపితే తాను పుతిన్‌తో మాట్లేడేందుకు సిద్దం అని చెప్పారు కూడా మెరికా అధ్యక్షుడు బైడెన్ . అయితే బైడెన్ నాటో మిత్ర దేశాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. -
పోలండ్‌పైకి క్షిపణులు... రష్యా దాడి కాదు
షెవాడో (పోలండ్): పోలండ్ సరిహద్దుల్లోని పంట పొలాల్లో మంగళవారం ఇద్దరిని బలిగొన్న క్షిపణి దాడులు రష్యా పనేనంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలానికి దారితీశాయి. దీని ఫలితంగా ఉక్రెయిన్‌కు బాసటగా నాటో రంగంలోకి దిగొచ్చని, దాంతో రష్యా 9 నెలలుగా చేస్తున్న యుద్ధం రూపురేఖలే మారిపోవచ్చని ఒక దశలో ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ దాడితో రష్యాకు సంబంధం లేదని పోలండ్‌తో పాటు నాటో కూటమి కూడా బుధవారం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘అది ఉద్దేశపూర్వక దాడి ఎంతమాత్రమూ కాదనిపిస్తోంది. బహుశా తమ విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం చేస్తున్న భారీ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణులు దురదృష్టవశాత్తూ సరిహద్దులు దాటి ఉండొచ్చు’’ అని పోలండ్ అధ్యక్షుడు ఆంద్రే డూడ అభిప్రాయపడ్డారు. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ కూడా బ్రసెల్స్‌లో జరిగిన నాటో భేటీలో అదే అన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్ను తప్పుబట్టలేం. యుద్ధానికి కారణమైన రష్యాయే ఈ క్షిపణి దాడులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అంటూ నిందించారు. ఈ ఉదంతంలో కచ్చితంగా ఏం జరిగిందో త్వరలోనే తేలుస్తామన్నారు. రష్యా క్షిపణిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు ఈ క్షిపణులను ప్రయోగించినట్టు ప్రాథమికంగా తేలిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. -
పోలాండ్‌లో మిస్సైల్ అటాక్.. టెన్షన్లో జో బైడెన్!
ఉక్రెయిన్‌లో దాడులతో ప్రపంచదేశాలను రష్యా ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ సరిహద్దులోకి ఓ మిస్సైల్‌ను ప్రయోగం జరగడం కలకలం సృష్టించింది. కాగా, ఈ మిస్సైల్ రష్యాకు చెందినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరోవైపు.. ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్న సమయంలో పోలాండ్‌లో ఇలా జరగడం మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. కాగా, ఈ మిస్సైల్ దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ అప్రమత్తమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బైడెన్.. జీ-7, నాటో దేశాల నేతలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా, జీ-20 సమావేశాల అనంతరం ఈ వీరితో బైడెన్ భేటీ కానున్నారు. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. నాటోలో పోలాండ్ సభ్య దేశంగా ఉంది. ఇక.. పోలాండ్‌లో మిస్సైల్ దాడిని నాటో సభ్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మిస్సైల్ దాడికి రష్యానే పాల్పడిందని ఆరోపిస్తూ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఇక, ఈ మిస్సైల్ దాడి చేసింది.. రష్యా అనేందుకు ఆధారాలు లేవని, అయినప్పటికీ వివరణ కోరుతూ మాస్కో రాయబారికి సమన్లు జారీ చేసినట్లు పోలాండ్ ప్రకటించింది. మరోవైపు ఇదే విషయాన్ని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు. President Biden on Missile Strike in Poland: "I'm going to make sure we figure out exactly what happened...and then we're going to collectively determine our next step as we investigate and proceed." pic.twitter.com/pY55Feq66m — CSPAN (@cspan) November 16, 2022 -
పుతిన్ వార్నింగ్‌ని బేఖాతారు చేస్తూ..నాటో సైనిక కసరత్తులు
ఉక్రెయిన్‌పై మిసైల్ దాడులతో దూకుడు పెంచిన రష్యా ఒకవేళ నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు అని హెచ్చరించింది. అవసరమనుకుంటే అణ్వాయుధ దాడికి దిగుతానని వార్నింగ్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఉద్రిక్తతల నడుమ పశ్చిమ యూరప్‌లో నాటో దళాలు అణు నిరోధ కసరత్తులు నిర్వహించాయి. ఇది తమ రోటిన్ అణు నిరోధక డ్రిల్ అని నొక్కి చెబుతోంది. వాస్తవానికి ఈ కసరత్తులు రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగక మునుపే ఈ కసరత్తుల ప్రణాళిక ఉందని తెలిపింది. ఈ విన్యాసాలకు రష్యా బెదిరింపులతో సంబంధంల లేదని నాటో స్పష్టం చేసింది. పుతిన్ బెదిరింపుల మధ్య తాము కసరత్తులు నిర్వహించకపోతే తప్పు అర్థం వస్తుందని స్పష్టం చేసింది. అలా రద్దు చేస్తే తమ సైనిక బలాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని చెప్పింది. అయినా పుతిన్ అణ్వాయుధాలకు పాల్పడతానని హెచ్చరిక నేపథ్యంలో నాటో జనరల్ స్టోలెన్‌బర్గ్ ఈ కసరత్తులు రద్దు చేయకూడదని నిర్ణయించారు. ఏం చేసినా రష్యా అణుదాడికి సంబంధించిన వైఖరిలో మార్పు ఉండదని తెలుసన్నారు. ఏదీఏమైన తాము మాత్రం అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. (చదవండి: జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...:) -
'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
Direct clash of NATO troops: ఒకవేళ రష్యా సైన్యంతో నాటో దళాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగితే గనుక ప్రపంచానికి ప్రమాదకరమైన విపత్తు ఏర్పడుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కజకిస్తాన్ రాజధాని అస్తానాలో విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అదీగాక గతనెలలో ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన తదనంతరం తమ రష్యా భూభాగాలను రక్షించడానికి ఎంతకైన తెగిస్తాం, అవసరమైతే అణ్వాయుధాలను సైతం ఉపయోగిస్తానంటూ.. వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని జీ7 దేశాలు తీవ్రంగా హెచ్చరించాయని వాషింగ్టన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు జీ7 నాయకులు రష్యా ఉద్యేశపూర్వక దురాక్రమణ దాడిని, ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు వాటిల్లే పెద్ద ఎత్తున సాగించిన సైనిక సమీకరణ వంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. అంతేగాదు రష్యా రసాయన, జీవ సంబంధింత అణ్వాయుధాలను వినియోగిస్తోందేమోనని భయాందోళనలను కూడా వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్ నగరంలో నిధుల సేకరణ కోసం జరిగిన డెమోక్రటిక్ సెనేటోరియల్ క్యాంపెయిన్ కమిటీలో ప్రసంగిస్తూ...ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడాన్ని ఉద్దేశిస్తూ...ఈ యుద్ధం మహా సంగ్రామంగా మారుతుందనుకోలేదన్నారు. అలాగే కెన్నడీ, క్యూబా క్షిపణి సంక్షోభంలో కూడా మహా సంగ్రామాన్ని చవిచూడలేదన్నారు. అణ్వాయుధాలను ఉపయోగించే సామర్థ్యం గల రష్యా దురాక్రమణ యుద్ధానికి అడ్డుకట్టవేసే పరిష్కార మార్గం ఏముందే తెలియడం లేదన్నారు. వాస్తవానికి రష్యా సైన్యం తక్కువగా ఉంది, మరోవైపు ఉక్రెయిన్‌పై పూర్తి పట్టు కూడా సాధించలేకపోతుంది కాబట్టి రష్యా ఎలాంటి దుశ్చర్యకైనా దిగే ప్రమాదం లేకపోలేదు అన్నారు. ఈ కారణాల రీత్యా పుతిన్ పెద్ద ఎత్తున్న ఆర్మీ సమీకరణ, అణ్వయుధాల దాడి వంటి బెదిరింపులకు దిగుతున్నాడంటూ విమర్శించారు. తాను అనుకున్నట్లుగా చేసేందుకు పుతిన్ ఏం చేసేందుకైనా వెనుకాడడు, పైగా ఏ చిన్న అవకాశాన్ని సైతం వదలుకోడని అన్నారు. అందువల్లే పుతిన్ తన ప్రతిష్టను దిగజార్చుకోవడమే కాకుండా రష్యాలో తన ప్రాభవాన్ని సైతం కోల్పోతున్నాడంటూ బైడెన్ తిట్టిపోశారు. (చదవండి: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్)