nizam sugar factory
-
ఆ 32 నియోజకవర్గాల్లో.. గల్ఫ్ కార్మికులు, చెరకు రైతులది కీలకం
చెరకు సాగు.. నిజాం షుగర్స్ సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ఫలితాన్ని తారుమారు చేసిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ రైతులకు బాండ్ రాసిచ్చిన నేపథ్యంలో ఎంపీగా ప్రజలు పట్టం కట్టారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనే లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ ద్వారా పసుపు బోర్డు ప్రకటన చేయించింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ అంశం అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదనే చెప్పాలి. ఇప్పుడు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, నిజాం షుగర్స్ అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో (మొత్తం 32 నియోజకవర్గాలు) సుమారు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడంతో గల్ఫ్‌కు వలస వెళ్లారు. ఈ కార్మిక కుటుంబాలు తమ సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేకంగా గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దొనికెన కృష్ణ(స్వతంత్ర), వేములవాడ నుంచి గుగ్గిల్ల రవిగౌడ్, నిర్మల్ నుంచి స్వదేశ్ పరికిపండ్ల, ధర్మపురి నుంచి భూత్కూరి కాంత, కోరుట్ల నుంచి చెన్నమనేని శ్రీనివాసరావు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. గల్ఫ్ జేఏసీ నాయకులు గల్ఫ్ దేశాల్లో పర్యటించి వలస కార్మికులతో సమావేశమై ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ప్రచారం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా గల్ఫ్యేతర దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో తెప్పిస్తోంది. గల్ఫ్ మృతుల విషయంలో మాత్రం వివక్ష కనిపిస్తోందన్న విమర్శ ఉంది. గల్ఫ్ బోర్డు ఏర్పడితే ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని ఆ కార్మికులు చెబుతున్నారు. నిజాం షుగర్స్ అంశాన్ని సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. తాము గెలిస్తే నిజాం షుగర్స్ యూనిట్లను తెరిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తద్వారా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో చెరకు రైతులను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తున్నాయి. చెరకు పంట విస్తీర్ణం పెంపు విషయమై రెండు జాతీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంగనర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సైతం ప్రకటించారు. గల్ఫ్ బోర్డు ద్వారానే సమస్యలు పరిష్కారం.. గల్ఫ్ బోర్డు ద్వారానే వలస కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. వలస కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలి. గల్ఫ్ ప్రవాసులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. గల్ఫ్ ప్రవాసుల ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు లభిస్తోంది. – మంద భీమ్‌రెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధ్దరించాలి.. ఏళ్ల తరబడి చెరకు పంట పండిస్తున్నాం. మా ప్రాంత భూములు చెరకు పంటకు అనుకూలమైనవి. ఈ సీజన్లోనూ 5 ఎకరాల్లో చెరకు పండిస్తున్నాను. బోధన్ నిజాం షుగర్స్‌ను మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని మూసినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్స్‌కు తరలించి అమ్ముతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తే మాకు మేలు కలుగుతుంది. కొత్త ప్రభుత్వం నిజాం షుగర్స్‌నూ పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నాం. – పల్లె గంగారాం, రైతు, హున్స గ్రామం, సాలూర మండలం -
ప్రచారాస్త్రం.. ‘నిజాం షుగర్స్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరకు రైతుల అంశం ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయనుంది. పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీల పరిధిలోని చెరకు రైతుల విషయం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రమైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాన్ని శాసించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో చెరకు పంట విస్తీర్ణం పెంపు అంశం కీలకం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ వాడకం పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారీకి ఆయా పరిశ్రమల ఏర్పాటుపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారా్రస్తాలుగా చేసుకుంటున్నాయి. 2002లో చంద్రబాబు విక్రయం.. నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామన్నారు. అయితే 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లు లేఆఫ్ ప్రకటించాయి. అయితే 2005–06లో చెరకు 35 వేల టన్నుల దిగుబడి ఉన్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను 2015లో లక్ష టన్నుల చెరకు దిగుబడి ఉన్నప్పటికీ మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి వైపు మళ్లారు. నిజాం షుగర్స్ పరిధిలో చెరకు పండించే 12 నియోజకవర్గాల్లో గతంలో సుమారు 1.22 లక్షల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. చెరకు రైతులే ప్రధానాంశంగా బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. -
కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మొద్దు
కోరుట్ల/మెట్పల్లి(కోరుట్ల): నిజాం చక్కెర ఫ్యాక్టరీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలను రైతులు నమ్మవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. స్వాతంత్య్రం రాక ముందే నిజాం చక్కెర ఫ్యాక్టరీలను నిజాం ప్రభువులు ఏర్పాటు చేస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిందని జీవన్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం వీటిని బీజేపీకి చెందిన మాజీ ఎంపీకి విక్రయించినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు చోద్యం చూశా రా అని మండిపడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బతుక మ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టు కొని పండుగ చేసుకుంటామని జీవన్‌రెడ్డి వ్యాఖ్యా నించడం ఆయన వయసుకి, హోదాకి తగదని కవిత చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి దిగజారి పోయి బతుకమ్మను అవమానించిన ఆయనను జగిత్యాల ప్రజలు తిరస్కరించడం ఖాయమ న్నారు. నేడు మహారాష్ట్రకు కవిత సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఆదివారం జరిగే బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. అలాగే దత్తవాడ నుంచి సాయంత్రం ప్రారంభమయ్యే బతుకమ్మ శోభాయాత్రలో ఆమె పాల్గొంటారు. -
నిజాం షుగర్సే ప్రధాన ప్రచారాస్త్రం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీల అంశం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారా స్త్రం కానుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇందూరు కు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసి చ్చిన ధర్మపురి అర్వింద్ అనూహ్యంగా విజయం సాధించారు. ఈనెల 3న ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి పసుపు బోర్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీకి ఆదరణ పెరిగింది. ఇదే తరహాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరి పించడం, చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచడమనే అంశాన్ని ఎజెండాగా తీసుకుని మరొక బాండ్ రాసి చ్చేందుకు అర్వింద్ రంగం సిద్ధంచేస్తున్నారు. ని జాం షుగర్ ఫ్యాక్టరీలు ఉమ్మడి నిజామాబాద్ (బో ధన్), ఉమ్మడి కరీంనగర్ (జగిత్యాల జిల్లా ముత్యంపేట), ఉమ్మడి మెదక్ (ముంబోజిపల్లి) జిల్లాల్లో ఉన్నాయి. దీంతో బీజేపీ ఎంపీ అర్వింద్ పార్టీ అధినాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లా డి తగిన కార్యాచరణ సిద్ధం చే స్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని చెరుకు పాలసీని స్టడీ చేస్తున్నారు. యూపీలో మాదిరిగా చెరుకు పంట సాగుతో పాటు దాన్ని రెగ్యులేట్ చేసేందుకు షు గర్, బ్రౌన్ షుగర్, ఇథనాల్ అనే మూడు ఉత్పత్తుల తయారీకి ప్లాన్ చేస్తున్నారు. చెరుకుకు మద్దతు ధర ఇస్తున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదక ఖర్చు 30 శాతం ఎక్కువ ఉంటోంది. దీంతో షుగర్ ఎగుమతులు అంతగా చేయలేని పరిస్థితి. దీంతో ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో చెరుకు సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించేందుకు ఎంపీ అర్వింద్ ప్రణాళికలు సిద్ధం చేసుకుని పార్టీ నాయకత్వంతో ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ తెరిపిస్తామని హామీ ఇస్తోంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. -
ఆ డబ్బులతో నిజాం షుగర్స్ తెరిపించండి: బండి సంజయ్ కౌంటర్
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. దీంతో, తమ వల్లే కేంద్రం స్టీల్‌ప్లాంట్‌పై ఈ నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ నేతలు ఓవరాక్షన్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాగా, బండి సంజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొంటామన్న డబ్బుతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం షుగర్స్‌ను తెరిపించాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ డబ్బు ఖర్చు చేయాలి అని వ్యాఖ్యలు చేశారు. -
చక్కెర పరిశ్రమలు తెరిపించకుంటే గద్దెదిగాలి
మల్లాపూర్(కోరుట్ల): నిజాం చక్కెర పరిశ్రమలను తెరిపించడం చేతకాకపోతే సీఎం కేసీఆర్ గద్దెదిగాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో రైతులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. హరియాణాలో కంటే జగిత్యాల జిల్లా రైతులు లాభసాటి పంటలు పండిస్తారని చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎదుట శనివారం చెరకు రైతులతో నిర్వహించిన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో చెరకు పరిశ్రమలను ప్రభుత్వపరం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత వాటిని మూసివేయించారని మండిపడ్డారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి మోసం చేశారని దుయ్యబట్టారు. ‘రైతుల సాక్షిగా చెబుతున్నా, కేసీఆర్.. తెలంగాణలో కూడా నీ అధికారం ఇక ముగిసిన అధ్యాయమే’అని రేవంత్ అన్నారు. రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో రూ.300 కోట్లతో చక్కెర ఫ్యాక్టరీలు నడిపించలేరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌పై కోపంతో బీజేపీ మాయలో పడొద్దని రైతులు, ప్రజలకు సూచించారు. మోదీ మెడలు వంచిన హరియాణా రైతుల స్ఫూర్తితో ఏకతాటిపైకి వచ్చి రైతు ఉద్యమాలు కొనసాగిస్తే చెరకు పరిశ్రమ పునరుద్ధరణ, పసుపుబోర్డు ఏర్పాటు సాధించుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఛత్తీస్‌గఢ్ మోడల్ అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నదీమ్ జావెద్, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జువ్వాడి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
నిజాం షుగర్స్ మూసివేత వెనక భూ కుంభకోణం
మల్లాపూర్(కోరుట్ల): నిజాం షుగర్ ఫ్యాక్టరీల మూసివేత వెనుక భారీ భూ కుంభ కోణం దాగి ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. శనివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిర్వహించిన మహాధర్నాలో చెరకు రైతులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..2002లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఫ్యాక్టరీల 51% వాటాను ప్రైవేటుపరం చేశారన్నారు. ఐదేళ్లలో 100% ప్రైవేటీ కరించి బడా వ్యాపారి గోకరాజు గంగరాజుకు కట్టబెట్టేందుకు కుట్రపన్నారని మండిపడ్డారు. కానీ, వైఎస్సార్ సీఎం అయ్యాక ప్రైవేటీకరణ నిలిపివేసి, ప్రభుత్వ పరం చేసేందుకు మాజీ మంత్రి రత్నాకర్‌రావుతో కమిటీ వేశారని గుర్తుచేశారు. ప్రభుత్వపరం చేస్తానన్న సీఎం కేసీఆర్ ఫ్యాక్టరీలను మూసివేయించారని విమర్శించారు. నిజాం ఫ్యాక్టరీల మూసివేత వెనుక కుంభకోణం దాగి ఉందని, మూడు ఫ్యాక్టరీల పరిధిలో రూ.3 వేల కోట్లు విలువచేసే భూములు న్నాయని, అందుకే కేసీఆర్ ఫ్యాక్టరీలను నడపకుండా చేతులేత్తేశారని ఆరోపించారు. -
నిజాం షుగర్స్‌ను తెరిపించాలి: మహేంద్రనాథ్
పెర్కిట్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిస్తే చెరుకు రైతుల జీవితాలు బాగుపడతాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ సమస్యపై మెట్పల్లి రైతులు అసెంబ్లీకి వస్తే లాఠీచార్జి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించే మాట్లాడతారే తప్ప.. కాయిలా పడిన చక్కెర కార్మగారం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ శాసన మండలికి రారని.. అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాటవేత ధోరణిలో వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇస్తున్నామంటూ రాయితీలకు కోత పెట్టడం ఏమిటని నిలదీశారు. -
కేటీఆర్.. ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపి.. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంగతి సరే.. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పని.. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోని బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. చదవండి: బండి సంజయ్‌కు చుక్కెదురు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ ‘‘2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. వంద రోజుల్లో ఈ ఫ్యాక్టరినీ ప్రభుత్వ పరం చేసుకుంటామని మీ చెల్లెలు కల్వకుంట్ల కవిత.. హామీ ఇచ్చారు. ఇన్నేళ్లయినా.. ఈ హామీ ఎందుకు నెరవేరలేదు. దాదాపు 16 వేల ఎకరాల్లో ఏర్పడిన బోధన షుగర్ ఫ్యాక్టరి ఆసియాలోనే అతిపెద్దది. ఈ ఫ్యాక్టరీ మీరు అధికారంలోకి వచ్చిన ఏడాది తిరగకుండానే మూతపడింది. ఫ్యాక్టరీకి చెందిన వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా ఫ్యాక్టరీ భూములును టీఆర్ఎస్ నేతలే కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని’’ మధు యాష్కీ గౌడ్ దుయ్యబట్టారు. -
నిజాం షుగర్స్ భవిత తేలేదెప్పుడో?
సాక్షి, బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ భవిత న్యాయస్థానాల చుట్టూ చక్కర్లు కొడుతోంది. విచారణ సాగుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ పునరుద్ధరణపై తీపి కబురు వస్తోందని చెరుకు రైతులు, కార్మికులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ న్యాయస్థానాల్లో విచారణ వాయిదా మీద వాయిదా పడటం, ఫ్యాక్టరీ భవిత ఏటూ తేలకపోవడంతో రైతులు, కార్మికులు నిరాశ చెందుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 29న ఢిల్లీ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో కొనసాగిన విచారణ నవంబర్ 10కి వాయిదా పడింది. ప్రైవేటీకరణ నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో 2002లో టీడీపీ హయాంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ బోధన్‌తో పాటు, ముత్యంపేట (జగిత్యాల), మంబోజిపల్లి (మెదక్) యూనిట్లను ప్రైవేటీకరించారు. నాటి నుంచి నిజాం షుగర్స్‌కు సంబంధించిన అనేక అంశాలపై రైతులు, కారి్మక సంఘాల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనుహ్యాంగా 2015 డిసెంబర్ 23న ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించి మూడు ఫ్యాక్టరీలను మూసి వేసింది. లే ఆఫ్ చట్ట విరుద్దమని, ఫ్యాక్టరీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని కారి్మకులు ఫిర్యాదులు చేశారు. దీంతో 2016లో కార్మిక సంఘాలు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో కారి్మక సంక్షేమ శాఖ అధికారులు చర్చలు జరిపారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో చర్చల నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచగా, 2017 ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం కేసును లేబర్ కోర్టుకు అప్పగించింది. కారి్మకుల వేతనాలు, లే ఆఫ్ సమస్య అంశాలపై అప్పటి నుంచి లేబర్ కోర్టులో విచారణ సాగుతోంది. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని టీఆర్ఎస్పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. మరో మలుపు.. ఫ్యాక్టరీ మూసివేత, పునరుద్ధణ సమస్య పరిష్కారం కోసం 2017 సెపె్టంబర్లో ఎన్సీఎల్టీ( నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) హైదరాబాద్ బెంచ్ రంగ ప్రవేశం చేసింది. ఈ ట్రిబ్యునల్‌కు ఐపీఆర్(ఇంటెర్మీ రిసోల్యూషన్ ప్రొఫిషనల్)గా రాచర్ల రామకృష్ణగుప్తా నియమితులై, అదే ఏడాది అక్టోబర్‌లో ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగింది. 2019 జూన్3న ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్‌కు ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ఎన్సీఎల్టీని ఆశ్రయించి స్టే తెచ్చింది. అప్పటి నుంచి ఈ ట్రిబ్యునల్‌లో విచారణ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని నడిపేందుకు ముందుకు వచ్చి విధానపరంగా నిర్ణయం తీసుకుంటేనే సమస్యకు ముగింపు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే నిజాంషుగర్స్ భవిత ఆధారపడి ఉంది. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోవాలి ఢిల్లీ ఎన్సీఎల్టీలో కొనసాగుతున్న విచారణకు ముగింపు పలికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. ఫ్యాక్టరీ మూసివేతతో కారి్మక కుటుంబాల బతుకులు అధోగతి పాలయ్యాయి. లేఆఫ్ నాటి నుంచి బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలి. – రవి శంకర్‌గౌడ్,ఎన్డీఎస్ఎల్ మజ్దూర్ సభ యూనియన్ ప్రధాన కార్యదర్శి -
నిజాం షుగర్స్ అమ్మకానికి పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూతపడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌ను విక్రయించి.. బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయిలు చెల్లించాల్సిందిగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌టీ) ఆదేశించింది. సుమారు 8 దశాబ్దాల చరిత్ర కలిగిన నిజాం షుగర్స్ పునరుద్ధరణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్రయం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేకుండా పోయిందని పేర్కొంది. ఇప్పటికే పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోవడంతో వేతనాల కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నెల 3న తీర్పు వెలువరించిన ట్రిబ్యునల్ గురువారం లిక్విడేషన్‌కు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అందిన తర్వాత.. తదుపరి కార్యాచరణపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని చక్కెర శాఖ అధికారులు నిర్ణయించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటు చేసిన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్ఎస్ఎల్) సుమారు రెండు దశాబ్దాలుగా నష్టాల బాటలో నడిచింది. నష్టాల నుంచి పరిశ్రమను గట్టెక్కించే నెపంతో 2002లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం డెల్టా పేపర్ మిల్స్‌కు 51శాతం వాటాను విక్రయించింది. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్)గా పేరు మార్చుకున్న నిజాం చక్కెర కర్మాగారం.. నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో 2015 డిసెంబర్లో పరిశ్రమను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఎల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్డీఎస్ఎల్ను నడిపేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 2015, ఏప్రిల్‌లో కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థకు చెందిన 51శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కార్యదర్శుల కమిటీని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ 28ను విడుదల చేసింది. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఎన్డీఎస్ఎల్... బ్యాంకర్ల వద్ద భారీగా అప్పులు పెరిగిపోవడంతో దివాలా పరిశ్రమగా గుర్తించాలని 2017లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, హైదరాబాద్ బెంచ్‌ను ఎన్డీఎస్ఎల్ ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషనల్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ)ని ప్రారంభించాలని కోరింది. ఈ నేపథ్యంలో రుణ దాతలతో (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్) సంప్రదింపులు జరిపేందుకు ఆర్.రామకృష్ణ గుప్తా అనే నిపుణుడికి బాధ్యతలు అప్పగించింది. 2017, అక్టోబర్ మొదలుకుని 2018, సెప్టెంబర్ వరకు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా.. పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలేదు. సహకార రంగంలో పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీసీ) నిబంధనల మేరకు 2018, సెప్టెంబర్ 19లోపు సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. 12 వారాల పాటు గడువు పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు పరిశ్రమను కొనుగోలు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కొన్ని సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే పరిశ్రమ ఆస్తులు, అప్పులను పరిశీలించిన సంస్థలు చివరి నిమిషంలో వెనుకడుగు వేశాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భద్రు మాలోత్ నిజాం చక్కెర కర్మాగారం లిక్విడేషన్ అనుమతికి సంబంధించి ఎన్సీఎల్టీ ఉత్తర్వులు అధికారికంగా అందిన తర్వాత.. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని చక్కెర శాఖ కమిషనర్ భద్రు మాలోత్ ‘సాక్షి’కి వెల్లడించారు. రైతులు, ఉద్యోగులకు నష్టం జరగకుండా పరిశ్రమ పునరుద్ధరణ మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఎన్సీఎల్టీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు లేదా ఎన్సీఎల్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. లిక్విడేషన్‌కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు.. అయితే వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గడువులోగా పునరుద్ధరణ ప్రణాళిక అందకపోవడంతో పరిశ్రమ అమ్మకానికి (లిక్విడేషన్) అనుమతిస్తూ ఎన్సీఎల్టీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 12 వారాల గడువును ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ వినతిని ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. రామకృష్ణ గుప్తాకు లిక్విడేటర్‌గా బాధ్యతలు అప్పగించింది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు.. పునరుద్ధరణకు సంబంధించి కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థలతో సంప్రదింపులు జరపడంతో పాటు, ప్రభుత్వ స్పందన కోసం కొంత కాలం వేచి చూసే యోచనలో లిక్విడేటర్ ఉన్నట్లు సమాచారం. వివిధ సంస్థలకు రూ.360 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఆస్తులు కూడా అంతే మొత్తంలో ఉన్నట్లు సమాచారం. లిక్విడేషన్‌కు ఎన్సీఎల్టీ అనుమతి ఇవ్వడంతో సంస్థపై ఆధారపడిన సుమారు 250 మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. -
బోధన్ ఎన్నికల ప్రచార సభలోనైనా..
సాక్షి, బోధన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ సభకు వస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంషుగర్స్ భవితవ్యంపై స్పష్టత ఇవ్వాలని నిజాంషుగర్స్ రక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు, ప్రతినిధులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చకుండా ఏ ముఖంతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెలంగాణ వారసత్వ సంపద, ఈ ప్రాంత అస్తిత్వం అవునా? కాదా? ప్రత్యేక రాష్ట్రసాధనోద్యమంలో షుగర్ ఫ్యాక్టరీ సమస్యను చోదక శక్తిగా ఉపయోగించుకున్నారా? లేదో? జవాబు చెప్పాలన్నారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ కంపెనీ కబంధ హస్తాల నుంచి విడిపించి, ప్రభుత్వపరం చేసుకోకుండా, ఇచ్చిన హామీని నెరవేర్చలేక, నడిచే ఫ్యాక్టరీని మూసివేసి కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఆంధ్రప్రాంత ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాల లాబీయింగ్ ప్రభావంతో ఈ ప్రాంత షుగర్ ఫ్యాక్టరీలను మూసివేశారని ఆరోపించారు. ఫ్యాక్టరీ మూసివేతతో వందలాది మంది చెరుకు రైతులు ఇబ్బందులపాలయ్యారని, ఉపాధి కోల్పోయి ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో చిత్తశుద్ధి చూపకపోవడం దుర్మార్గ వైఖరికి నిదర్శనమని కెసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, స్వాధీనం అంశంపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ ప్రతినిధులు గంగాధర్ అప్ప, వరదయ్య, మల్లేష్, షేక్‌బాబు, శంకర్ గౌడ్, యేశాల గంగాధర్, ఎండీ గౌస్, సుల్తాన్ సాయిలు, ఎన్డీఎస్ఎల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రవి, శంకర్‌గౌడ్, ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశీర్వదించండి
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో తాము అధికారంలో లేకపోయినా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయిస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహేర్ హామీ కోరారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తమ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేస్తామని ఇచ్చారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధానితో చర్చించాలని సూచించారు. చెరుకు రైతుల చర్నాకోల్ మహా పాదయాత్ర ముగిం పు సందర్భంగా ఆదివారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. చెరుకు రైతులు, కార్మికులకు భరోసా కల్పించేందుకు నాయకులు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎప్పుడూ అధికారంలో లేకపోయినా.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గోదావరి, పెన్‌గంగా నదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు వెంటవెంటనే అనుమతులిచ్చామని, మహారాష్ట్రలోని తమ ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. అధికారం కష్టమేమీ కాదు.. త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వలస వెళ్లకుండా స్థానికంగా ఉపాధి కల్పించేందుకు యువతకు నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూత పడ్డాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు సైతం ఇదే ధోరణితో ముందుకెళుతోందని విమర్శించారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభకు పంపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని శాసన మండలి బీజేపీ పక్ష నేత రాంచంద్రరావు విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోవడమే గుణాత్మకమైన మార్పా అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, 140 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో సమస్యలు దృష్టికి వచ్చాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. బోధన్ చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేసిన చంద్రబాబు మహా పాపాత్ముడని, దీన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనతోనే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కేసీఆర్ పాలనలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు. చక్కెర కర్మాగారం కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, మహిళా సంఘాలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి అడ్లూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు అండగా నిలిచేందుకు చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లెగంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, బస్వ లక్ష్మినర్సయ్య, శివప్ప, గురూజీ బాబుసింగ్రాథోడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై తీరుపై అసహనం ముగింపు సభలో కేంద్రమంత్రి మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు. వర్గీకరణపై బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు పాదయాత్ర చేసి ముగింపు సభ నిర్వహిస్తే కొందరు వచ్చి నిరసన తెలుపుతుంటే పోలీసులు చూస్తూ ఉండడం ఏమిటని ప్రశ్నించారు. చేతులు కట్టుకోవడానికి వచ్చారా? అని అసహనం వ్యక్తం చేశారు. -
బతుకు చేదు!
- తేలని నిజాం షుగర్స్ భవితవ్యం - లేఆఫ్తో ఉపాధి కోల్పోయిన కార్మికులు - చెప్పులు కుడుతూ.. కూలికెళ్తూ.. - స్వాధీనం హామీని విస్మరించిన సీఎం కేసీఆర్ - 17న బోధన్‌లో పాదయాత్ర, బహిరంగ సభ చెప్పులు కుడుతున్న ఇతని పేరు వి.సాయిలు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పర్మినెంట్ కార్మికుడు. భార్య లక్ష్మి, కూతురు, కుమారునితో చింత లేకుండా జీవితం గడిచిపోయేది. అయితే ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటించి మూసేయడం.. సాయిలు జీవితాన్ని తలకిందులు చేసింది. ఒకవైపు ఫ్యాక్టరీ మూతపడటంతో ఏ దారీ లేక కుల వృత్తి అయిన మోచీ పనినే మళ్లీ మొదలుపెట్టాడు. బోధన్ ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో చెప్పులు కుడుతూ.. పాలిష్ చేస్తూ.. ఆ వచ్చే కాస్త డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితి సాయిలుది. ఇతని పేరు ఈరవేణి సత్యనారాయణ. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్ విభాగంలో టర్బన్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. కానీ ఫ్యాక్టరీకి లేఆఫ్ ప్రకటిచడంతో వేతనం ఆగిపోయి.. కుటుంబ పోషణ భారంగా మారింది. నెల క్రితం వరకూ బోధన్‌లోని ఓ సినిమా «థియేటర్లో గేట్ కీపర్‌గా రోజుకు రూ.115 కూలీ పనిచేసేవాడు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 11 వరకు డ్యూటీ చేయాల్సి రావడంతో అక్కడ మానేసి ఓ వాటర్ ప్లాంట్‌లో పనికి చేరాడు. రోజుకు వంద కూలీ ఇస్తున్నారు. కూలీ పనికి పోతేనే కుటుంబం గడిచే పరిస్థితి కావడంతో ఆ వంద కోసం రోజంతా చెమటోడుస్తున్నాడు. బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ(ఎన్ఎస్ఎఫ్) భవితవ్యం ఎటూ తేలకపోవడంతో కార్మికుల బతుకులు చేదెక్కుతున్నాయి. ఈ ఫ్యాక్టరీని 1938లో నిజాం పాలకులు నెలకొల్పారు. ఫ్యాక్టరీ ఆవిర్భావంతో ఈ ప్రాంతమంతా చెరకు తోటలతో పచ్చదనం వెల్లివిరిసింది. చెరకు రైతులు, కార్మికుల కుటుంబాలు సంతోషంగా జీవనం సాగించాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఈ ఫ్యాక్టరీ ఎదిగింది. ఇదంతా గత వైభవం. ఫ్యాక్టరీ టీడీపీ హయాంలో ప్రైవేటుపరం కాగా, తదనంతర పరిణామాల్లో యాజమాన్యం లేఆఫ్ ప్రకటించడంతో రైతులు, కార్మికుల జీవితాలు ఛిద్రమయ్యాయి. పచ్చని చెరకు తోటలు కనుమరుగయ్యాయి. ప్రైవేటీకరించిన చంద్రబాబు సర్కారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 2002లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీకి భాగస్వామ్యం కల్పించి జాయింట్ వెంచర్ పేరుతో ప్రైవేటీకరించారు. దీంతో ఫ్యాక్టరీ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్)గా రూపాంతరం చెందింది. 2015 డిసెంబర్ 23న ఎన్డీఎస్ఎల్ యాజ మాన్యం లేఆఫ్ ప్రకటించింది. బోధన్‌తో పాటు ప్రస్తుత జగిత్యాల జిల్లా ముత్యంపేట, వికారాబాద్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లకు కూడా దీనిని వర్తింప చేసింది. దీంతో 305 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. లేఆఫ్తో 2015–16, 2016–17 క్రషింగ్ సీజన్ కూడా నిలిచిపోయింది. దీంతో ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని కార్మికులు పలువురు మంత్రులను వేడుకోగా.. బకాయి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే 16 నెలలు గడుస్తున్నా వేతనాలు అందలేదు. 3 ఫ్యాక్టరీల కార్మికులకు రూ.8 కోట్ల వరకు బకాయి వేతనాలు రావాల్సి ఉంది. సీఎం కేసీఆర్ హామీ.. అధికారం చేపట్టిన వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హయాంలో నడుపుతామని కేసీఆర్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా ఈ హామీ నెరవేరలేదు. ఫ్యాక్టరీని ప్రభుత్వం నడపటం సాధ్యం కాదని, మహారాష్ట్ర తరహాలో సహకార రంగంలో రైతులు ముందుకు వస్తే ఆధునీకరించి ఫ్యాక్టరీని అప్పగిస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినా.. ఇప్పటివరకు విధివిధానాలు ప్రకటించలేదు. 17న బోధన్‌లో పాదయాత్ర.. ఎన్డీఎస్ఎల్ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని, లేఆఫ్ ఎత్తివేసి వెంటనే పునరుద్ధరించాలని, కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలనే డిమాండ్లతో నిజాం షుగర్స్ రక్షణ కమిటీ, అఖిలపక్ష పార్టీలు ఏడాదిగా ఆందోళనలు సాగిస్తున్నాయి. టీజేఏసీ, నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈ నెల 17న పాదయాత్ర, బహిరంగ సభ తలపెట్టారు. ఈ కార్యక్రమానికి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. -
నిజాం షుగర్స్‌పై అఖిలపక్షం ఏమైంది
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని హామీ ఇచ్చి టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు.రైతులు నడిపించుకుంటామంటే ఇస్తా మని, అఖిలపక్షం ఏర్పాటుచేసి చర్చి ద్దామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిం చారు. కొందరు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై నిజాం షుగర్స్‌ని ప్రభుత్వం పట్టించు కోవడంలేదని ఆరోపించారు. దీనిపై వెంటనే అఖిలపక్షం వేయాలని, నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. -
అభివృద్ధి పేరుతో అణచివేస్తే ఎలా?
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన కోదండరాం సమైక్య రాష్ట్రంలో ఉన్నట్లుగానే ఇప్పుడూ ఉంటే ఎట్లా? త్యాగాలు చేయక తప్పదనడం సరికాదు సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో ఉన్న ట్టుగానే ఇప్పుడు కూడా కొందరిని పట్టించుకో కుంటే ఎట్లాగని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీశారు. అభివృద్ధి కోసం కొందరు త్యాగాలు చేయక తప్పదని ప్రభుత్వం చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. త్యాగం చేస్తున్నవారి పట్ల ప్రభుత్వం కూడా త్యాగం చేయాలనే బుద్ధితో, మానవతా కోణంలో ఆలోచించాలని సూచించారు. త్యాగం చేసేవారి పట్ల ప్రభు త్వానికి బాధ్యత ఉందని గుర్తు చేశారు. గురువారం జేఏసీ ముఖ్యనేతలు పిట్టల రవీం దర్, ఇటిక్యాల పురుషోత్తం, నల్లపు ప్రహ్లాద్, వెంకటరెడ్డి, ఖాజా మొయిను ద్దీన్లతో కలిసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ‘‘నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి కనీస సాను భూతి ఉండనవసరం లేదా? బాధ్యత ప్రభుత్వానికి లేదా? భూములు కోల్పోయి, బతుకుదెరువు కోల్పోయినవారిని అభివృద్ధి పేరుతో అణచివేయడం సరికాదు. అందరికీ న్యాయం జరిగే విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది..’’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరు సరికాదు... సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అభివృద్ధిలో భాగస్వామ్యం లేదని మాట్లాడిన విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు. ‘‘మీ ప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అని సమైక్య పాలకులను ప్రశ్నించాం. ఇప్పుడు కూడా అదే కొనసాగితే ఎట్లా..? అభివృద్ధిలో నిర్వాసితులను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడం సరికాదు.. సంపద పెరగడం ఒక్కటే కాదు.. పెరిగిన సంపదను ఎలా పంపిణీ చేస్తారనేదీ ప్రధాన మే’’ అన్నారు. కొందరి అభివృద్ధి కోసం మరికొందరు త్యాగం చేయాలని నిర్బంధించే ఆలోచన సరికాదని.. అది అభివృద్ధికి అవరో« దాలు సృష్టిస్తుందన్నారు. అభివృద్ధి పేరిట తీసుకుంటున్న చర్యలపై సమీక్షించుకుంటే చాలా అంశాలు అర్థమవుతాయన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన కారణంగా కార్మికులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని.. కార్మికులకు 13 నెలల వేతన బకాయిలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోదండరాం కోరారు. నిజాం షుగర్స్‌లో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, ఆ ఫ్యాక్టరీని తెరిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. ఇక సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరం టూ అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన వాదన తప్పని... సింగరేణిలో కాంట్రాక్టు పద్ధతిన ఇంకా కార్మికులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. సింగరేణిలో ఓపెన్ కాస్టులపై త్వరలోనే సదస్సును నిర్వహి స్తామని చెప్పారు. ఓపెన్ కాస్టుల వల్ల తీవ్ర ఇబ్బం దులున్నాయని.. పర్యావరణ అసమ తుల్యం వంటి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఓపెన్‌కాస్టుల పద్ధతిని సమీక్షించుకోవాలని సూచించారు. ముస్లిం రిజర్వేషన్లపై సుధీర్ కమిటీ సిఫా ర్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సమస్యలపై త్వరలోనే విద్యాయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. భూసేకరణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సవరణలను ఆమో దించవద్దంటూ రాష్ట్రపతిని కలుస్తామని టీజేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ తెలిపారు. సింగరేణిలో ఓపెన్‌కాస్టులు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక కొత్తగా ఓపెన్ కాస్టులు వస్తాయని చెప్పడం దారు ణమని వ్యాఖ్యానించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ నెల 16న సదస్సును నిర్వహిస్తున్న ట్టుగా ఖాజా మొయినుద్దీన్ వెల్లడించారు. -
‘నిజాం షుగర్స్ పై సర్కార్ స్పందించాలి’
హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 49 శాతం వాటా సర్కార్‌కు ఉందని, కాబట్టి దీనిపై సర్కార్ వెంటనే స్పందించి సమస్యలు తీర్చాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నిజాం షుగర్ మూసి వేసిన కారణంగా కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. వెంటనే కార్మికులకు ఇవ్వవలసిన 13 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని అసెంబ్లీలో సర్కార్ వాదించడాన్ని తప్పు పట్టారు. సింగరేణి ఓపెన్ కాస్టుపై, ముస్లిం రిజర్వేషన్లు, విద్యార్థి సమస్యలపై త్వరలోనే సదస్సు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం కూడా త్యాగం చేసిన ప్రజలను మానవతా దృష్టి కోణంలో చూడాలన్నారు. అభివృద్ధిలో నిర్వాసితులను పట్టించుకోకుండా సర్కార్ ముందుకు వెళ్లడం సరికాదన్నారు. -
సీఎం దిష్టిబొమ్మ దహనం
బోధన్: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిజాం సుగర్ ఫ్యాక్టరీపై సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇంతవరకూ ఎలాంటి పురోగతీ లేదన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గంగా శంకర్‌తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
'నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించం'
హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించబోమని సీఎం కేసీఆర్ తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీని నిర్వహించేందుకు రైతులు ఆసక్తి చూపడంలేదన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. రూ.16,500 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను కూడా చెల్లించామని సీఎం చెప్పారు. -
చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలి
సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని లేఖ సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని పునరుద్ధరించి వాటిని ప్రభుత్వ రంగంలో నిర్వహిం చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రభుత్వ రంగంలో నడిపిస్తామని టీఆర్ఎస్ ఎన్నికల హామీ సంగతి ఎలా ఉన్నా.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే నిజాం షుగర్స్ పేరుతో నడుస్తున్న 3 యూనిట్లు పూర్తిగా మూతపడ్డా యన్నారు. ఇవి మూతపడి ఏడాదవుతున్నా వాటిని తెరిపించలేకపోయారన్నారు. -
'నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవాలి'
-
'నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవాలి'
నిజామాబాద్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. బోధన్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, జీవన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంతవరకు పోరాటం చేస్తామని జానారెడ్డి హెచ్చరించారు. మరో నేత ఉత్తమ్ మాట్లాడుతూ...ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పారు. -
రైతుల అయిష్టత వల్లే నిజాం షుగర్స్ తెరవలేదు
• వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్య • జిల్లా వ్యవసాయాధికారులు, ఏడీఏలతో రబీ సన్నద్ధ సమావేశం • సొసైటీల ద్వారా రబీకి ఎరువులు, విత్తనాల పంపిణీ సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవకపోవడానికి రైతుల అయిష్టతే కారణమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజాం ఫ్యాక్టరీని మరమ్మతు చేసి తెరవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నా ఫ్యాక్టరీ పరిధిలోని మెట్పల్లి, మెదక్, శక్కర్పల్లి రైతులు ముందుకు రాలేదని, అందుకే అది వెనకడుగు పడిందని అన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా అన్ని జిల్లాల వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, ఏడీఏలతో రబీ సన్నద్ధతపై శుక్రవారం మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీని తెరవాలని మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి చేస్తున్న యాత్ర వృథా ప్రయాస అని అన్నారు. తొలిసారిగా సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ వర్షాలతో దెబ్బతిన్న సోయాబీన్‌ను కొనుగోలు చేయడానికి ఏడు ఫ్యాక్టరీలకు బాధ్యత అప్పగించామని, ఆ ఏడింటికి ఏడు జిల్లాలు అప్పగించామని చెప్పారు. ఏ గ్రేడ్‌కు రూ.2,775 చొప్పున కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభిస్తున్నామని, కనీస మద్దతుధర లభించేలా చూస్తామని అన్నారు. నాబార్డు నుంచి రూ.వెయ్యి కోట్ల రుణం త్వరలో వస్తుందని, దాంతో రాష్ట్రంలో రైతులకు విరివిగా బిందుసేద్యం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇవ్వాల్సిన రుణమాఫీ సొమ్ములో మిగిలిన మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఈసారి గణనీయంగా పప్పుధాన్యాల దిగుబడులు వస్తాయని చెప్పారు. రబీకి అవసరమైన వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర, వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని, అన్ని విత్తనాలను కూడా ప్రాథమిక సహకార సంఘాల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పారు. 12.35 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లక్ష్యానికిగాను ఇప్పుడు తమ వద్ద 8.05 లక్షల మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వానలు వచ్చే అవకాశమున్నందున రబీ పంట కోతలను వచ్చే మార్చి 31 నాటికి పూర్తి చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. నకిలీ మిరప విత్తనాలు విక్రయించిన 98 మంది డీలర్ల లెసైన్సులు రద్దు చేశామని, ఐదుగురిపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టామని చెప్పారు. తనను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్‌నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, ఆయన గృహనిర్మాణమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలకు ఎన్నిసార్లు బర్తరఫ్ చేయాల్సి ఉంటుందోనని ఎద్దేవా చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి, కమిషనర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాంషుగర్స్‌ను పునరుద్ధరించాలి: భట్టి
బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి, టీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు దానిని కబళించేందుకు యత్నిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ ప్రజల హక్కు అని, దానిని పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీని తక్షణమే పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్‌తో మాజీమంత్రి పి. సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో గురువారం కామారెడ్డి జిల్లా కోటగిరి మండలం కొల్లూరులో చేపట్టిన అఖిల పక్ష రైతు పాద యాత్రను ప్రారంభించారు. రైతులనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని నడుపుతామని ఎన్నికలసభల్లో కేసీఆర్ వాగ్దానం చేసి ఇప్పుడు పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతు సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. -
సీఎం వాగ్దానం ఏమైంది?: టీటీడీపీ
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని వందరోజుల్లో తెరిచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం ఇంత వరకు ఎందుకు అమలుకాలేదో ఎంపీ కవిత సమాధానం చెప్పాలని టీటీడీపీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం టీటీడీపీ నాయకులు అరికెల నర్సారెడ్డి, అమర్‌నాథ్‌బాబు, ఒంటేరు ప్రతాపరెడ్డి, రాజారాంయాదవ్ విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో నిజాం షుగర్స్‌ను విక్రయానికి పెట్టే దుస్థితి ఏర్పడిందన్నా రు. ఈ ఫ్యాక్టరీ ప్రస్తుత దుస్థితికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావులే బాధ్యులన్నారు. త్వరలో నిజాం షుగర్స్ అంశంపై ధర్నాను నిర్వహిస్తామని, దానికి నిజామాబాద్ ఎంపీ కవిత హాజరుకావాలని వారు డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్ కోసం ఈ నెలాఖరులోగా రూ.400 కోట్లు విడుదల చేయాలని..లేకుంటే పదివేల మంది రైతులతో చక్కెర ఫ్యాక్టరీలను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
కేసీఆర్ మాటిచ్చి మరిచారు: కోదండరాం
సుభాష్‌నగర్: అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొందని గుర్తుచేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘బోధన్‌లోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలనే డిమాండ్ ఇప్పటిది కాదని, ఉద్యమ సమయంలోనే నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ ప్రధానమైన అంశమన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని వేచి చూశాం. అలా కాని పక్షంలోనే ప్రత్యక్ష కార్యాచరణ అనివార్యమైంది. జిల్లా చరిత్రలో నిలిచిపోయే ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం’ అని పేర్కొన్నారు. -
100రోజుల దీక్ష చేస్తాం..
నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిజాం షుగర్ రక్షణ కమిటీడిమాండ్ చేసింది. గురువారం బోదన్ మండల కేంద్రంలో కమిటీ సభ్యులు దీక్ష చేపట్టారు.కమిటీకన్వీనర్ రాఘవులు మాట్లాడుతూ.. 100రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కార్మికులు, రైతులు, పలు ప్రజా సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి. -
అధినేతకు అక్షరాల విజ్ఞప్తి
కొత్త ఏడాది 2016 కానుకగా కాబోలు నిజాం చక్కెర కర్మాగారం కార్మికులకు ‘లాకౌట్’ బహుమానం ప్రకటించింది యాజమాన్యం. కొత్త రాష్ట్రంలో కార్మిక విధానంగా పరిగణించాలని కాబోలు ఈ సంకేతం! మాంధ్ర పాలనలో ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా వేల కోట్ల ఆస్తులను సుమారు ఎనిమిది కోట్లకే ధారాదత్తం చేశారు. పనిచేసిన మూడు వేల మంది కార్మికులలో స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో, బలవంతపు తొలగింపుతో, రాచి రంపాన పెట్టి మూడు వందల మందికి కుదించి కన్నీళ్ల ఉప్పుటేరుల్ని పారించారు. చేసేదిలేక సుమారు డెబ్బై మంది కార్మికులు బలవంతపు మరణాలు పొందారు. అనారోగ్యాలతో, బెంగలతో కుళ్ళి కుళ్ళి మరణించినవారి ప్రేతాత్మలు నిజామాబాదు జిల్లాలో నడయాడుతున్నాయి. లాభాల్లో నడిచే కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టి ఆ కర్మాగారం కూకటివేళ్ళతో ముక్కలు ముక్కలుగా అమ్ముకు తినాలని ప్రైవేటీకరణ ప్రణాళికల జాతర మొదలైంది. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కార్మికులందరూ ఉత్సాహంగా పోరాటంలో పాల్గొని తమ వంతు కృషి చేశారు. కాని సమస్య ఇంకా జటిలం అవుతోంది. అంతరించే అంచులలో కర్మాగారమే కాదు, కార్మికులే కాదు, తెలంగాణ వాదుల కలలు కూడా కల్లలయ్యే మతలబు ఏదో జరుగుతోంది. అనేక మాసాల నుండి ఎంతోమంది నిరాహార దీక్షలు చేస్తున్నా తెలంగాణ లోకం కిమ్మనకుండా ఉండడం వారిని బాధిస్తోంది. కొందరు ప్రజాతంత్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగవలసి ఉంది. సుదీర్ఘ న్యాయ పోరాటంలో తీర్పులు కార్మిక పక్షం ఉన్నా- కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వం దన్ను కనుపిస్తున్నా- ఉద్యమ కాలంలో కేసీఆర్ గర్జన ఇంకా అందరి చెవుల్లో మారుమోగుతునే ఉంది. రాబోయే తెలంగాణా ప్రభుత్వం చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని మునుపటి వైభవం తెస్తుందని - మిగిలిన కార్మికుల ప్రాణాలు కాపాడకుండా ఆతరువాత కర్మాగారం స్వాధీనం చేసుకుంటే ఏం లాభం? 22 డిసెంబర్ 2015 నాడు అర్ధరాత్రి రహస్యంగా కంపెనీ ‘లాకౌట్’ ప్రకటించి విభ్రాంతికి గురి చేసింది. ఆసియాకే గర్వకారణంగా ఉన్న తీపి తేనెతుట్టలో పొగలేచింది. అది తెలంగాణ అంతటా కమ్ముతోంది. ఈ సందర్భంగా- యాగాగ్నికి ఆహుతైన వాటిలో కార్మికుల బతుకులు లేవని తెలిస్తే బాగుండు. యాగ ఫలితం కొంతైనా వెచ్చించి తెలంగాణ కడుపు చిచ్చుని చల్లార్చగలిగితే మేలు. అయ్యా! ప్రియతమ అధినేతా! ఎవరి మాటని మీరు పట్టించుకోకండి. వినకండి. మీరు మాట్లాడిన మాటలనే ఓసారి గుర్తు తెచ్చుకోండి! ఒక ఆశ్వాసనకి ఇంతకన్నా మించిన మంచి సమయం మరోటి లేదు! ఒక మీ స్పందన కోసం తెలంగాణ వేచి ఉంది. దేశమే ఊపిరి బిగబట్టి చూస్తున్నది. (నేడు నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని దీక్షా శిబిరానికి వెళ్ళి, పీల్చి పిప్పి చేసిన చక్కెర కర్మాగారం కార్మికులని అక్షరాల దన్నుతో పలకరించాలని బయలుదేరిన సందర్భంగా) - తెలంగాణ రచయితల వేదిక -
నిజాం షుగర్స్‌కు రూ.13.80 కోట్లు
* 3 ఫ్యాక్టరీలకు నిధులు మంజూరు చేసిన సర్కారు * మంబోజిపల్లి రైతుల బకాయిలకు త్వరలో మోక్షం సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని మూడు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలలో చెరకు రైతులకు చెల్లించేందుకు రూ.13.80 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లాలోని మంబోజిపల్లి, నిజామాబాద్ జిల్లా షక్కర్నగర్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల్లో 2014-15 క్రషింగ్ సీజన్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం ఈ నిధులు మంజూరు చేసింది. అయితే ఏ ఫ్యాక్టరీకి ఎన్ని నిధులు కేటాయించిందీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. మూడు చక్కెర ఫ్యాకర్టీల్లో రైతులకు సుమారు రూ.27.50 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 13.80 కోట్లు మంజూరు కాగా, మిగతా నిధులు మరో విడతలో ఇచ్చే అవకాశం ఉంది. మంబోజిపల్లి చెరకు రైతుకు ఊరట! మెదక్ సమీపంలోని మంబోజిపల్లిలోని నిజాం దక్కన్ షుగర్స్ చెరకు రైతులకు సుమారు రూ.6.60 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాల్సిందిగా రైతులు చాలా కాలంగా కోరుతున్నారు. తాజాగా చెరకు బకాయి నిధులు విడుదల చేసిన నేపథ్యంలో మంబోజిపల్లి రైతులకు బకాయిలు త్వరలో చెల్లించే అవకాశం ఉంది. మూడు చక్కెర ఫ్యాక్టరీలకు సమానంగా నిధులు కేటాయించిన పక్షంలో మంబోజిపల్లి ఫ్యాక్టరీ వాటాగా రూ.4.6 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చెరకు రైతులకు కొంత ఊరట లభించనుంది. -
ఇది ప్రజా ప్రభుత్వం: కవిత
బోధన్: టీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మాటికీ ప్రజాపక్షమని, సమస్యలపై ప్రభుత్వాన్ని.. ప్రజాప్రతినిధులను నిలదీసే హక్కు ప్రజలకు, ప్రజా సంఘాలకు ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆదివారం తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, కళాకారులు, ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కవిత మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ కిందిస్థాయిలో ఉద్యోగుల విభజన జరగలేదని, అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అంతకుముందు బోధన్ మండలం భవానీపేట్‌లో బోనాల పండుగలో ఎంపీ మాట్లాడు తూ జోగిని, విడాకులు పొందిన మహిళలకు పింఛన్ల మంజూరు విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే వీరికి పెన్షన్లు అందించే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో 21 వేల మంది జోగినీలున్నారని తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రైతులకు అప్పగిస్తామని, వారికి ఒక్క పైసా నష్టం కలుగకుండా చూస్తామని తెలిపారు. చంద్రబాబువి దివాలాకోరు రాజకీయాలు.. ఏపీ సీఎం చంద్రబాబు దివాళాకోరు రాజకీయూలకు పాల్పడుతున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బులు పంచుతూ ఏసీబీకి దొరకడం ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. -
'చంద్రబాబు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు'
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు వచ్చాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మట్లాడారు. కమలనాథన్ కమిటీ వల్లే ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యం జరిగిందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ నేతలు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదంటూ ఈ సందర్భంగా ఎంపీ కవిత ప్రశ్నించారు. -
'రాజకుమారుడు విహారయాత్రకు వచ్చి వెళ్లిపోయాడు'
నిజామాబాద్: రాజకుమారుడు విహారయాత్రకు వచ్చి వెళ్లిపోయాడంటూ' కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత సోమవారం వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కవిత రాహుల్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయమై ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వపరం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను కూడా పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో నిజామాబాద్ జిల్లాలో పసుపు పార్క్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత పేర్కొన్నారు. -
‘నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలి’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ చేస్తున్న పనులకు పొంతనే లేదని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. -
నిజాం షుగర్స్‌ను రైతులకే ఇస్తాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నిజాం చక్కెర ఫ్యాక్టరీని రైతులకే అప్పగిస్తామని చెరుకు రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజాం చక్కెర కర్మాగారం పరిరక్షణ సమితికి చెందిన రైతులు సోమవారం సచివాలయంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత నేతృత్వంలో సీఎంను కలిశారు. రైతులే నడుపుకున్నట్లయితే షుగర్ ఫ్యాక్టరీని ఉచితంగా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పరిరక్షణ సమితి కన్వీనర్ అప్పిరెడ్డి మీడియాకు తెలిపారు. -
హామీలన్నీ నెరవేరుస్తా..
జగిత్యాల జిల్లా ఏర్పాటు పండ్ల మార్కెట్ అభివృద్ధి మాడ్రన్ కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు ధర్మపురి పుష్కరాలకు రూ.500 కోట్లు కోరుట్ల, మెట్పల్లిలో నిజాం షుగర్స్‌కు అనుబంధ ఫ్యాక్టరీలు ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీలు జిల్లాలో సుడిగాలి పర్యటన విజయవంతం సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను వంద శాతం నెరవేర్చడంతో పాటు కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం కేసీఆర్ జిల్లాలో నిర్వహించిన సుడిగాలి పర్యటన విజయవంతమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఎ న్నికల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించా రు. కోరుట్ల నుంచి మొదలైన కేసీఆర్ పర్యటన ధర్మపురి, జగిత్యాల, గంగాధర (చొప్పదండి), కథలాపూర్ (వేములవాడ), తిమ్మాపూర్ (మానకొండూర్), హుజూరాబాద్), మంథని మీదు గా పెద్దపల్లి వరకు సాగింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ లక్ష్యంగా కేసీఆర్ ప్రసంగాలు కొనసాగా యి. కరీంనగర్ జిల్లాలో గ్రామగ్రామాన నీళ్లు వచ్చేలా సిద్దిపేట తరహాలో మంచినీటి పథకా న్ని ఏర్పాటు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సర్కారు స్వాధీనం చేసుకుంటుందని, కోరుట్ల, మెట్పల్లిలో నిజాం షుగర్స్‌కు అనుబంధ ఫ్యాక్టరీలను నెలకొల్పి ఉ పాధి కల్పిస్తామన్నారు. జగిత్యాలను జిల్లా కేం ద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఉత్తర తెలంగాణ పండ్ల మార్కెట్‌గా జగిత్యాల మార్కెట్‌ను అభివృద్ధి చేస్తానని, మాడ్రన్ కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాలలో ఇళ్ల నిర్మాణానికి తానే స్వయంగా వచ్చిముగ్గు పోస్తానన్నారు. ఎస్సారెస్పీ నీటిని చివరి ఆయకట్టు భూమికి అందడానికి 20 వేల క్యూసెక్కుల పరిమితి పెంచుతామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సా గయ్యేట్లుగా కుర్చీ వేసుకుని ప్రాజెక్ట్‌లు కట్టిస్తానని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు రూ.500 కో ట్లు కేటాయిస్తామన్నారు. పుష్కరస్నానం కూడా ఇక్కడే చేస్తానన్నారు. తెలంగాణ ప్రజలకు మే లు చేయాలనే లక్ష్యంతో తయారు చేసిన మేని ఫెస్టో గాలి కబుర్లది కాదని, అనేక మంది మేధావులు, ఆర్థిక నిపుణులు, ఐఏఎస్‌లతో చర్చించి రూపొందించామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను చెప్పిన మాటలనే మేనిఫెస్టోలో పొందుపర్చామన్నారు. రైతులకు రూ. లక్ష రుణం మాఫీ చేస్తామని, బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడతామని, మానవీయ కోణంలో వృద్ధులు, వితంతువులు రూ.వెయ్యి, వికలాంగులకు రూ. 1500 పింఛన్ ఇస్తామని, మహిళా సంఘాలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామ ని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, తండాలన్నీ గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగేళ్లుగా లాఠీచార్జీలు, తుపాకి తూటాలకు గురయ్యాం.. దీక్షలు చేశాం.. కేసుల పాల య్యాం.. రాష్ర్ట కలను సాకారం చేసుకున్నాం.. తెలంగాణ ప్రజల తలరాతను మార్చే ఎన్నికలివి.. ఏ మాత్రం ఏమరుపాటు వహించినా.. సన్నాసుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టినా.. అధోగతి పాలు తప్పదని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నా తర్వాత స్థానం ఈటెలదే.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తన తర్వాత స్థానం ఈటెల రాజేందర్‌కే దక్కుతుందని కేసీఆర్ అన్నారు. అప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. ఇంతకాలం ఉద్యమంపై దృష్టి పెట్టడం వల్ల కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని, ఈటెల మంత్రి అయిన తర్వాత అన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పారు. ఈ ఒక్కసారి అవకాశం కల్పిస్తే మీకే అర్థమవుతుందన్నారు. మాట ఇచ్చి తప్పే సంస్కృతి టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. కంటతడిపెట్టిన తుల ఉమ వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్‌లో జరిగిన సభలో టీఆర్ఎస్ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు తుల ఉమను స్టేజీపైకి పిలవకపోవడంతో ఆమె కంటతడిపెట్టారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు అనూప్‌రావు ఆమెను స్టేజీపైకి తీసుకువచ్చారు. రెండేళ్లలో లక్ష ఎకరాలకు సాగునీరు మానకొండూర్ నియోజకవర్గంలో రెండేళ్లలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని కేసీఆర్ అన్నారు. వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నా రు. ఎల్ఎండీ, మిడ్ మానేరు ద్వారా పది టీఎం సీల నీరు వాడుకోవడానికి ఆలోచిస్తామన్నారు. మతసామరస్యానికి ప్రతీక.. నిజాంల కాలంలో హిందూ ముస్లింలు కలిసి ఉండడాన్ని చూసిన మహాత్మాగాంధీ ఎంతో ఆనందపడ్డారని, ఇదే పరిస్థితి గుజరాత్లో ఉం టే బాగుండేదని ఆనాడు హైదరాబాద్‌లో జరిగి న వివేకవర్దిని సభలో అన్నారని కేసీఆర్ జగి త్యాల సభలో గుర్తుచేశారు. ఆయనిక్కడ సుమా రు పది నిమిషాలు ఉర్దూలో ప్రసంగిచారు. -
చంద్రబాబును జైల్లోకి తోస్తాం
నిజాం షుగర్స్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాడు : కెసిఆర్ రాజకీయ అవినీతిని రూపుమాపుతాం కన్నబిడ్డలైనా సరే... జైలుకు పంపిస్తా ప్రాణం పోయినా సరే ఆంధ్ర ఉద్యోగులను పంపిస్తామని వ్యాఖ్య మహబూబ్‌నగర్: ‘‘తెలంగాణ సొమ్ము మింగిన వాళ్లను వదిలి పెట్టం. కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాడు. ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ శాసనసభ కమిటీ సిఫారసు చేసినా పట్టించుకోలేదు. మేం అధికారంలోకి రా గానే... దీనిపై విచారణ జరిపి చంద్రబాబును జైల్ల్లో తోస్తాం’’ అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి, మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన ‘ఎన్నికల జనభేరి’ సభల్లో ఆయన ప్రసంగించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసి ‘పచ్చని పాలమూరు’గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడటం ఖాయమని, ఉద్యమకారులు, ఉద్యమ పార్టీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య అధ్యక్షతన జరిగిన వనపర్తి, మహబూబ్‌నగర్ సభల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులు మందా జగన్నాథం, ఏపీ జితేందర్‌రెడ్డితో పాటు 14 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. ఈ సభల్లో కేసీఆర్ ఏమన్నారంటే...ప్రాణం పోయినా సరే తెలంగాణ నుంచి ఆంధ్ర ఉద్యోగులను పంపించి వేస్తాం. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఉద్యమించి తెలంగాణ అభివృద్ది కోసం ఒత్తిడి తెస్తాం. బలిదానాలు, త్యాగాలు, దీక్షలు, జైళ్లు, నిర్బంధాలను తట్టుకుని తెలంగాణ సాధించింది కడుక్కు తినడానికి కాదు. మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ అవినీతిని పూర్తిగా రూపుమాపుతా. చివరకు కన్నకొడుకు, కూతురు, బంధువులు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపిస్తా.మెడలు పట్టి నూకినా వెళ్లకుండా చంద్రబాబు ఇక్కడే వేళ్లాడుతడట. చంద్రబాబు జెండాలు మోసే సన్నాసులు ఇంకా తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ వచ్చినా వారికి జ్ఞానోదయమైతలేదు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అటు టీడీపీ, ఇటు బీజేపీ నడుమ బలవంతపు దోస్తీ కుదర్చడం ద్వారా దొంగతనాలు, దోపిడీలు, అక్రమ కబ్జాలను కాపాడుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ హయాంలో గుటకాయ స్వాహా చేసిన 70వేల ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. వక్ఫ్‌బోర్డుకు జుడిషియల్ అధికారాలు ఇవ్వడం ద్వారా వక్ఫ్‌భూములు పరిరక్షించడంతో పాటు, గతంలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అవినీతివల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం పరువు పోయింది. సెటిలర్స్ ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నిధులు, నీళ్లు, నియామకాల్లో ఇంకా వివక్ష కొనసాగాలని కోరుకుంటున్నారు. దేశ రాజధానిలో రాష్ర్టపతి భవన్ తర్వాత అత్యంత విలువైన ఆస్తి హైదరాబాద్ హౌజ్. నిజాం నిర్మించిన ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వానికి అమ్మి, బదులుగా తీసుకున్న ఏపీ భవన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కిమ్మనడం లేదు. తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతికత, హక్కు కాంగ్రెస్ నేతలకులేదు. నియోజకవర్గానికో కేసీఆర్ సభ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ప్రతీరోజు కనీసం 8 సభల్లో ప్రసంగించనున్నారు. వీలైతే రోజుకో జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేయాలని.. హెలికాప్టర్లోనే ఈ సుడిగాలి పర్యటనలు చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ఇప్పటికే మూడు రోజులుగా ప్రతీరోజు ఒక సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో రెండు సభలకు హాజరయ్యారు. ఇదే తరహాలో 19వ తేదీ నుంచి రోజుకు 8 నుంచి 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచార షెడ్యూలును ఖరారు చేస్తున్నారు. -
'పచ్చ' మచ్చ
-
పుస్తకం చెప్పిన అవినీతి కథ !
-
బాబు అభివృద్ధి వెనుక దాగున్న 'చేదు' నిజం
-
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు..
నిజాం షుగర్స్‌పై సభా సంఘం నిర్ధారణలివీ నిజాం షుగర్స్‌కు చెందిన నాలుగు యూనిట్లు - షక్కర్నగర్, మెట్పల్లి, ముంబోజిపల్లి చక్కెర మిల్లులు, షక్కర్నగర్ డిస్టిలరీల విక్రయం వ్యవహారంలో రెండేళ్ల పాటు విచారణ జరిపిన సభా సంఘం 2006 ఆగస్టులో 350 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ యూనిట్ల అమ్మకంలో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలకు అంతేలేదంటూ తూర్పారబట్టింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. చంద్రబాబు నిర్వాకంపై సభా సంఘం తన నివేదికలో నిర్ధారించిన ముఖ్యాంశాలివీ... * ‘‘నిజాం షుగర్స్ యూనిట్లను అమ్మటానికి ప్రైవేటు వ్యక్తులతో చర్చలు జరపడమనేది ప్రపంచంలో ఇంకెక్కడా జరగని వ్యవహారమని ప్రపంచ బ్యాంకు అధికారులే చెప్పారు. ఈ పద్ధతిలో అమ్మటానికి కేబినెట్ అనుమతి కూడా లేదు. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై కేబినెట్ సబ్-కమిటీ సొంతంగా ఈ పని కానిచ్చింది. అడ్వొకేట్ జనరల్ సలహాలను సైతం పెడచెవిన పెట్టింది. * కేబినెట్ సబ్ కమిటీలోని యనమల రామకృష్ణుడు (అప్పటి ఆర్థికమంత్రి), ఇ.పెద్దిరెడ్డి (అప్పటి చక్కెర శాఖ మంత్రి), కె.విద్యాధరరావు (అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి).. ముగ్గురూ ఈ మోసానికి ప్రధాన కారకులు. ఇతర రాజకీయ పార్టీలు, చెరకు రైతులు, ఉద్యోగుల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం)కే నిజాం షుగర్స్ యూనిట్లు అమ్మేందుకు కేబినెట్ సబ్‌కమిటీ మొండిగా మొగ్గుచూపింది. * అమ్మకానికి పెట్టిన నిజాం షుగర్స్ యూనిట్ల ఆస్తులలో కొన్నిటికి అతి తక్కువ విలువ కట్టారు. కొన్నిటికి అసలు విలువే కట్టలేదు. అలా ప్రస్తావించని ఆస్తుల విలువ రూ. 40 కోట్లు. దీంతో కొనుగోలు దారులు ఈ నాలుగు యూనిట్లకు చాలా తక్కువ మొత్తానికి బిడ్లు దాఖలు చేశారు. * డీపీఎం తుది బిడ్‌ను ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా కట్టింది. వారి ధర మిగిలిన వాటికన్నా మెరుగైనదిగా చూపింది. * నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను బాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు, భారీ నష్టానికి అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తర్వాత. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న సమయంలో 2003 నవంబర్ 14న సేల్ డీడ్స్ 2004 ఫిబ్రవరి 25న, 2004 మే 20న రిజిస్టరయ్యాయి. కొత్త ప్రభుత్వం కొద్ది రోజుల్లో రానుండగా చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా ఈ తంతు పూర్తిచేసింది. కొత్త ప్రభుత్వానికి తెలియనివ్వకుండానే ఈ భూమి బదిలీ జరిగిపోయింది. * నాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాసిన లేఖకు 2002 మే 3న నాటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జవాబు రాస్తూ.. ‘‘అదనపు ఆస్తులలోని 101 ఎకరాలకు డీపీఎం రూ. 10 కోట్లు చెల్లిస్తోంది’’ అంటూ అబద్ధమాడారు. నిజానికి డీపీఎం చెల్లించింది రూ. 6.16 కోట్లే.’’ -
నిజాం షుగర్స్‌ను అప్పనంగా ఇచ్చేశారు
చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టిన మాజీ ఐఏఎస్ ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్?’ పుస్తకంలో గుట్టు విప్పిన పరేఖ్ సాక్షి, న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల తన పాలనలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ఊదరగొడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. నిజానికి ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన నిర్వాకమేమిటో మచ్చుకు ఒక ఉదంతాన్ని నాటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తన పుస్తకంలో వెల్లడించారు. ప్రభుత్వ రంగంలోని నిజాం చక్కెర కర్మాగారం యూనిట్లను ఎలాంటి టెండర్లు లేకుండా.. ‘రాజకీయ అనివార్యత’ల పేరుతో చంద్రబాబు ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేసిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్.. తాను పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు ఎదురైన అనుభవాలు, కేంద్ర ప్రభుత్వంలో తాను పనిచేసినప్పుడు ఎదురైన అనుభవాలను ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్?.. కోల్ గేట్ అండ్ అదర్ ట్రూత్స్’ (ధర్మయుద్ధ సైనికుడా లేక కుట్రదారుడా? బొగ్గు కుంభకోణం.. ఇతర నిజాలు) అన్న శీర్షికతో గ్రంథస్తం చేశారు. ఈ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సింఘ్వీ ఆవిష్కరించారు. ఇందులో ప్రధానంగా బొగ్గు కుంభకోణంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజాం షుగర్స్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టిన తీరును ఆయన వివరించారు. అది తప్పుడు నిర్ణయమని తాను అనేకసార్లు వారించినా.. చంద్రబాబు చివరికి అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఆనాడే రూ. 308 కోట్ల నష్టం వాటిల్లిందని సభాసంఘం సైతం తప్పుపట్టిన విషయాన్నీ తెలిపారు. నిజాం షుగర్స్ విషయంలో చంద్రబాబు నిర్వాకం గురించి పరేఖ్ తన పుస్తకంలో ఏం రాశారంటే... ప్రపంచబ్యాంకు షరుతులతో షురూ... ‘నేను 2000 సంవత్సరం జూలై సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల శాఖలో బాధ్యతలు స్వీకరించాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా వరకు ప్రభుత్వానికి భారంగా మారాయి. అందువల్ల ప్రపంచబ్యాంకు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించడంలో భాగంగా ఒక షరతు విధించింది. ప్రభుత్వ రంగ సంస్థలను పునర్వ్యవస్థీకరించాలని, నష్టాల్లో ఉన్న వాటిని ప్రయివేటు పరం చేయాలని ఆ షరతుల సారాంశం. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి విభాగం కూడా సాయం చేసింది. ఈ కమిటీకి నేను ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా కూడా ఉన్నాను. ప్రయివేటీకరణ చేయాలనుకున్నవాటిలో ప్రధానమైన కంపెనీ నిజాం షుగర్స్ లిమిటెడ్. దీన్ని హైదరాబాద్ నిజాం 1934లో ఏర్పాటుచేశారు. అప్పట్లో ఇది ఆసియాలోనే పెద్దదని చెప్పేవారు. ఈ కంపెనీకి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కలిపి ఆరు చక్కెర మిల్లులు, రెండు డిస్టిలరీలు ఉండేవి. పక్కనే ఉన్న ప్రయివేటు మిల్లులేమో లాభాల్లో ఉండేవి. కానీ ఇవి మాత్రం నష్టాలు మిగుల్చుతున్నాయి. అనేక ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాక వీటన్నింటినీ బహిరంగ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించడమైంది. అడకుండానే ఆఫర్ ఇచ్చిన గోల్డ్‌స్టోన్... రెండు మిల్లులు, ఒక డిస్టిలరీని విజయవంతంగా ప్రయివేటీకరించాం. కన్సల్టెంట్లు నిర్దేశించిన అప్సెట్ ధర కంటే మెరుగ్గానే ధర లభించింది. వీటిని దక్కించుకున్న వారంతా ఆర్థికంగా ఉన్నవారు కావడంతో పాటు షుగర్ పరిశ్రమలో అనుభవం ఉన్నవాళ్లే. యూనిట్లను విడతలవారీగా వేలానికి పెడితే పోటీ బాగా వస్తుందని నమ్మి ఆ మేరకే విడతల వారీగా వేలానికి పెట్టాం. మూడు యూనిట్లను ప్రయివేటీకరించాక శక్కర్‌నగర్‌లోని ప్రధాన యూనిట్‌కు కూడా వాణిజ్య ప్రకటన ఇచ్చే ప్రక్రియను పరిశీలించాం. ఇది పరిశీలనలో ఉండగానే.. మెస్సర్ గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మేం కోరకుండానే ఒక ప్రతిపాదన వచ్చింది. చక్కెర శాఖ మంత్రి ఈ ప్రతిపాదనను అధ్యయనం చేయాలని కోరారు. ప్రయివేటీకరణ ప్రతిపాదనలను అధ్యయనం చేసి ఆమోదించేందుకు ప్రభుత్వం ఒక కేబినెట్ కమిటీని ఆర్థికమంత్రి నేతృత్వంలో ఏర్పాటుచేసింది. ఏ జిల్లాల్లోనైతే చక్కెర కర్మాగారాలు ఉన్నాయో.. ఆ జిల్లాలకు చెందిన మంత్రులు ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. నేను ఈ గోల్డ్‌స్టోన్ ప్రతిపాదనను పరిశీలించాను. కొద్ది మొత్తం పెట్టుబడితో ఆస్తులన్నీ ఇవ్వాలన్నారు... టెండర్ ప్రక్రియ కొనసాగే క్రమంలో కోరకుండానే వచ్చిన ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని నేను కేబినెట్ కమిటీకి చెప్పాను. అంతేకాకుండా ఈ కంపెనీకి చక్కెర పరిశ్రమలో ఎలాంటి అనుభవం లేదు. పైగా ఆయన కొద్దిమొత్తం పెట్టుబడితో కంపెనీకి చెందిన భారీ ఆస్తులను తమ కంపెనీకి బదిలీ చేయాలని కోరారు. అమలు కమిటీ కన్సల్టెంట్లు కూడా నా నిర్ణయంతో ఏకీభవించారు. కమిటీ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని భావించా. కానీ కమిటీ చైర్మన్ ఆ కంపెనీ ప్రతినిధిని ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ఆహ్వానించారు. ఆ ప్రజెంటేషన్ పూర్తయ్యాక కూడా నేను ప్రతిపాదన తిరస్కరణకు నా వద్ద ఉన్న కారణాలను వివరించాను. కానీ కమిటీ మాత్రం గోల్డ్‌స్టోన్ తన ఆఫర్‌ను పెంచాలని సలహా ఇస్తూ పోయింది. ఈ విషయమై కమిటీ దాదాపు 6 సార్లు సమావేశమైంది. ప్రతి సమావేశంలో గోల్డ్‌స్టోన్ కంపెనీ తన ఆఫర్‌ను పెంచుతూ పోయింది. కానీ ప్రతిసారీ నేను ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చాను. చంద్రబాబు అనూహ్య నిర్ణయం... చివరగా ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చింది. దీంతో చంద్రబాబునాయుడుతో ఒక సమావేశం ఏర్పాటుచేశాం. ప్రతిపాదనపై ముఖ్యమంత్రికి ఆర్థికమంత్రి వివరించారు. ప్రతిపాదనను అంగీకరించాలన్న కేబినెట్ కమిటీ అభిప్రాయాన్ని కూడా వివరించారు. కానీ నేను నా అభిప్రాయానికే కట్టుబడి ఉన్నా. బహిరంగ వేలానికి వెళ్లాలని సూచించా. రెండు వైపులా వాదనలు విన్న ముఖ్యమంత్రి.. కేబినెట్ కమిటీలోని మంత్రులు, చక్కెర యూనిట్లు ఉన్న జిల్లాలకు చెందిన మంత్రులంతా ఈ ప్రతిపాదనకు సమ్మతిస్తున్నప్పడు గోల్డ్సోన్ ఆఫర్‌ను ఆమోదించాలని చెప్పారు. చంద్రబాబు ఈ తీర్పు చెప్తారని నేను ఊహించలేదు. నన్ను బాధ్యతల నుంచి తొలగించాలని లేఖ రాశా... మంత్రులంతా వెళ్లిపోయాక నేను చంద్రబాబుతో చెప్పాను. టెండర్ లేకుండా వచ్చిన ఈ ఆఫర్‌ను ఆమోదిస్తే తప్పవుతుందని చెప్పాను. అప్పటికే అమలులో ఉన్న పారదర్శకమైన ఓపెన్ టెండర్ విధానాన్ని పాటించాల్సి ఉందని వివరించాను. చంద్రబాబునాయుడు దాన్ని అంగీకరించినా.. ‘రాజకీయ అనివార్యతల వల్ల మీ సిఫారసులకు వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తోంద’ని నాతో చెప్పారు. చంద్రశేఖర్‌రావు తెలంగాణ పార్టీ పెట్టారని, పంచాయతీ ఎన్నికలు సమీపంలోని ఉన్నాయని, ఈ సందర్భంలో తెలంగాణకు చెందిన మంత్రుల మాటకు అవునన కుండా తాను ముందుకు వెళ్లలేనని చెప్పారు. ఆ తరువాత నేను ఆఫీసుకు వచ్చిన మరుక్షణమే చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాను. కేబినెట్ కమిటీ నన్ను విశ్వాసంలోకి తీసుకోనందున ఈ బాధ్యతల నుంచి నన్ను తొలగించాలని, అందుకు తగిన మరో అధికారిని నియమించాలని కోరాను. అలాగే రెండు నెలల పాటు సెలవుకు దరఖాస్తు చేసుకున్నాను. కేబినెట్ మంత్రులందరినీ ఎలా ఒప్పించారో..! నాకు ఇప్పటికీ అంతుబట్టని విషయమేమిటంటే.. గోల్డ్‌స్టోన్ కంపెనీ కేబినెట్ కమిటీలోని మంత్రులందరినీ ఎలా ఒప్పించగలిగిందనే ది! ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో నిజాం షుగర్స్ ప్రయివేటీకరణ ఒక ప్రధాన రాజకీయ అంశం అయ్యింది. దీనిపై సభాసంఘం ఏర్పాటైంది. కేబినెట్ కమిటీ గోల్డ్‌స్టోన్ కంపెనీ ప్రతిపాదనను ఆమోదించడాన్ని సభాసంఘం తీవ్రంగా తప్పుబట్టింది. 2006 ఆగస్టు 31న సభాసంఘం సంబంధిత అక్రమాలపై నివేదిక ఇచ్చింది. సభాసంఘం నా వైఖరిని ప్రశసించింది. గోల్డ్‌స్టోన్ ప్రతిపాదనను ఆమోదించడం కారణంగా రూ. 308 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది...’ అని పరేఖ్ తన పుస్తకంలో సమగ్రంగా వివరించారు. -
కష్టానికి ఫలమేది?
బోధన్, న్యూస్‌లైన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2013-14 సీజన్లో 1.72 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడించారు. దీనికి టన్ను ధర రూ. 2.600 చొప్పున లె క్కించినా రైతులకు రూ. 44 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు మూడు పర్యాయాలుగా రూ. 22 కోట్ల వరకు మాత్రమే చెల్లించారని రైతులు తెలిపారు, మిగిలిన బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫ్యాక్టరీ యాజమాన్యం లాభాపేక్ష వైఖరితో రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. ఏటా తిప్పలే నిజాం షుగర్స్‌ను 2002లో చంద్రబాబు నిర్ధాక్షిణ్యం గా ప్రైవేటీకరించారు. దీంతో కర్మాగారం ప్రయివేటు భాగస్వామ్యంతో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ ఎల్)గా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాజమాన్యం రైతులకు బిల్లుల చెల్లింపులో ఏటా తీవ్ర జాప్యం చేస్తోంది. మరోవైపు రైతులు బ్యాంకులలో తీసుకున్న అప్పులకు అపరాధ వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఎ దురవుతోంది. పెరిగిన పెట్టుబడులు, గిట్టుబాటు ధర రాక చెరుకు రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. బోధన్ ప్రాంతంలో వాణిజ్య పంటగా చెరుకు సాగుచేసిన రైతులు ఏటా సాగును తగ్గించుకుంటున్నారు. గిట్టుబాటు ధర రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. క్రషింగ్ ప్రారంభమే వివాదాస్పద ం 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభంలోనే వివాదాస్పదమైంది. 2013, నవంబర్ 28న క్రషింగ్ ప్రారంభిస్తామని ప్రకటించిన యాజమాన్యం ఏకపక్షంగా క్రషింగ్ నిలి పివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖంగు తిన్న రైతులు గిట్టుబాటు ధర విషయం పక్కనపెట్టి క్రషింగ్ ప్రారంభించాలని ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో యాజమాన్యం దిగివచ్చి డిసెం బర్ 9న క్రషింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 19 వరకు క్రషింగ్ కొనసాగింది.1.72 లక్షల టన్నుల చెరుకు గానుగాడింది. ఈ క్రమంలో ధర విషయంలో రైతులు సందిగ్ధతకు గురయ్యారు. ప్రైవేట్ యాజమాన్యం నిరుడు చెల్లించిన టన్ను ధర రూ.2,600 ప్రకటించింది. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని, టన్నుకు రూ. 3,500 చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు క్రషింగ్ సీజన్ ప్రారంభానికి రెండు నెలల ముందునుంచే యాజ మాన్యంపై ఒత్తిడి పెంచారు. కాని యాజమాన్యం నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదు. టన్నుకు రూ. 2,400 చొప్పున చెల్లింపు టన్ను ధర రూ.2,600 ఉండగా, యాజమాన్యం ఇప్పటి వరకు రూ, 2,400 చొప్పున మూడు రౌండ్లలో చెల్లించింది. మిగిలిన టన్నుకు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు మరో రెండు రౌండ్లలో చెల్లించాల్సిన బకాయిలు కలుపుకుంటే సుమారు రూ. 22 కోట్ల వరకు ఉంటాయని రైతు నాయకులు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో క్రషింగ్ ప్రారంభంలో జరిగిన చర్చలలో చెరుకు సరఫరా చేసిన 15 రోజుల్లో టన్నుకు రూ, 2,400 చొప్పున చెల్లిస్తామని, మిగిలిన టన్నుకు రూ.200 చొప్పున ఫ్యాక్టరీ క్రషింగ్ పూర్తయిన నెలలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ క్రషింగ్ పూర్తయి నెల దాటినా మరో రెండు రౌండ్లకు సంబంధించిన రైతుల బిల్లులు పూర్తిగా ఆగిపోయాయని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆరోపించారు. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది, కాని ఫ్యాక్టరీ యాజమాన్యానికి నిబంధనలు వర్తిం చడం లేదు. ఇప్పటికైనా మిగిలిన బకాయిలు వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు. -
ఈ శ్రమకు ఫలితమేది!
బోధన్, న్యూస్‌లైన్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ అధీనంలో ఉండగా చెరుకు పంటకు గిట్టుబాటు ధర లభించేది. రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందేవి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఈ చక్కెర కర్మాగారాన్ని 2002లో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో(జాయింట్ వెంచర్) ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ప్రైవేట్ యాజమాన్యం లాభాపేక్షతో వ్యవహరిస్తూ రైతులను కడగండ్ల పాలు చేస్తోంది. ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. సమాచారం లేకుండానే.. ఈ సీజన్లో క్రషింగ్‌ను 2013 నవంబర్ ఆఖరి వారంలో ప్రారంభిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు రైతులు చెరుకు నరికి ఫ్యాక్టరీకి తరలించారు. అయితే ఫ్యాక్టరీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే క్రషింగ్‌ను నిలిపివేసింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. క్రషింగ్ ప్రారంభించాలంటూ ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో బంద్ కూడా పాటించారు. దిగివచ్చిన యాజమాన్యం డిసెంబర్ ఏడో తేదీనుంచి క్రషింగ్ ప్రారంభించింది. క్రషింగ్ కొనసాగుతోంది. చెల్లింపుల్లో జాప్యం ఎన్డీఎస్ఎల్ పరిధిలో 2013 -14 సీజన్‌కుగాను సుమారు 5 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేశారు. ఇప్పటి వరకు సుమారు లక్షా 60 వేల టన్నుల వరకు చెరుకును ఫ్యాక్టరీకి తరలించారు. ఫ్యాక్టరీ ప్రకటించిన ధర ప్రకారం రైతులకు సుమారు రూ. 42 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. అయితే గడువు దాటినా బిల్లులు చెల్లించకపోవడంతో ఫ్యాక్టరీ యాజమాన్యంపై రైతులు ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో తొలి విడతలో రూ. 7 కోట్లు చెల్లించారు. క్రషింగ్ ప్రారంభానికి 20 రోజుల ముందు హార్వెస్టింగ్ అడ్వాన్స్‌ల కింద ఎకరానికి రూ. 3 వేల చొప్పున ఫ్యాక్టరీ చెల్లించింది. తొలి విడత బిల్లులోనే ఈ అడ్వాన్స్‌తోపాటు ఎరువులకోసం ఇచ్చిన రుణాన్ని మినహాయించుకొంది. మిగిలిన బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. సమస్య సబ్‌కలెక్టర్ దృష్టికి.. బిల్లులు చెల్లించడంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రైతులు గురువారం బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. బిల్లుల చెల్లింపులో ప్రతి ఏటా గడువులు విధిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. స్పందించిన సబ్‌కలెక్టర్.. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ జానకీ మనోహర్‌తో మాట్లాడారు. ఆదివారం బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈ హామీని రైతులు నమ్మడం లేదు. మూడేళ్లుగా ఫ్యాక్టరీ గడువులు విధిస్తూ ఉల్లంఘిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. -
నిజాంషుగర్స్‌ను టేకోవర్ చేస్తాం
బోధన్,న్యూస్‌లైన్ : రాబోయే తెలంగాణ రాష్ట్రంలో నిజాంషుగర్స్‌ను టేకోవర్ చేసుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) అన్నారు. నిజాంషుగర్స్ కార్మికులకు మంచి రోజులు వచ్చే సమయం దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. నిజాంషుగర్స్ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ షకీల్ అధ్వర్యంలో ఆదివారం ఫ్యాక్టరీ ప్రధాన గేట్‌కు ఎదురుగా వజ్రోత్సవ సభను నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై మాట్లాడారు. వందల కోట్ల విలువచేసే నిజాంషుగర్ ఫ్యాక్టరీని 2002లో అప్పటి సీఎం చంద్రబాబు ఆంధ్ర ప్రాంతానికి చెందిన తన అస్మదీయులకు అప్పన్నంగా అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వరంగంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో నెలకు రూ. 18 వేల వేతనంపై పనిచేసిన కార్మికులు ,ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో తొలగించారన్నారు. ప్రైవేట్ యాజమాన్యం వారినే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుని నెలకు రూ. 6 వేల వేతనంతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ఆరోపించారు.కోర్టు తీర్పులను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసి అన్యాయం చేశాడన్నారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా మంత్రులతో సబ్ కమిటీ వేసి నిజాంషుగర్స్‌ను ప్రైవేటీకరించేందుకు చేసిన కుట్రలను నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం.అప్పిరెడ్డి హైకోర్టులో స్టే తెచ్చి అడ్డుకున్నారని చెప్పారు. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీగా పేరు గడించిన నిజాంషుగర్స్ పరిస్థితి సీమాంధ్ర పాలకుల హయాంలో దయనీయంగా మారిందన్నారు. ఫ్యాక్టరీ వజ్రోత్సవాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. బాధ్యతయుత పార్టీగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాము నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ కవచంగా నిలుస్తుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు పార్టీకి అండగా నిలువాలని కోరారు. సచార్ కమిటీ సిఫార్సులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. జిల్లా అభివృద్ధిని విస్మరించారు... టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పో శెట్టి మాట్లాడుతూ... సీమాంధ్ర పాలకులు జి ల్లా అభివృద్ధికి ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. నిజాం ప్రభువులు కాలంలోనే నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధికి పాలకులు విస్మరించారన్నారు. టీఆర్ఎస్ విలీనం అవాస్తవం... పార్టీ జిల్లా ఇన్చార్జి కరమిమెల్ల బాబూరావు మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు ఖాయమని, రాబోయే ఎన్నికల్లో 119 అసెంబ్లీ, 19 పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. తమ పార్టీతో ఇతర పార్టీలో విలీనం అవుతుందని ప్రచారం అవాస్తవం అన్నారు. ఫ్యాక్టరీని అమ్మే కుట్ర... టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలోని ఏ ఫ్యాక్టరీ అమ్మితే ఎన్ని కోట్లు మిగులుతాయేనని డబ్బు కక్కుర్తితో ఫ్యాక్టరీలను అమ్ముకునేందుకు యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ఎస్ఎఫ్ వజ్రోత్సవ సభ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ రజాక్, జిల్లా నాయకులు బిగాల గణేష్‌గుప్త, బస్వ లక్ష్మీనర్సయ్య, జీవన్‌రెడ్డి, రాజేందర్, దాదన్నగారి విఠల్, వేముల సురేందర్, నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం.అప్పిరెడ్డి, నియోజకవర్గ నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, రవికిరణ్, శ్యాంరావు, బాల్‌రాజ్, కాశ్యం సాయిలు, నవీన్ కుమార్, భరత్‌యాదవ్, ఫయాజుద్దీన్, కార్యకర్తలు, కాలనీ వాసులు, కార్మికులు పాల్గొన్నారు. -
చర్చ, ఓటింగ్ జరగకపోయినా పర్వాలేదు: కెటిఆర్
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చ, ఓటింగ్ జరుగకపోయినా పర్వాలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ వజ్రోత్సవ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. తెలంగాణపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట తప్పారని విమర్శించారు. అందుకే ఆయన రెంటికి చెడ్డ రేవులా తయారయ్యారన్నారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక మన ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీని టేకోవర్ చేస్తుందని చెప్పారు. -
నిజాం షుగర్స్ భవితవ్యంపై నిర్ణయం?
మెదక్, న్యూస్‌లైన్: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ యాజ మాన్య భవితవ్యంపై సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటే ఎంత పరిహారం చెల్లించాలనే విషయంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత నెలలో ఫ్యాక్టరీ భవితవ్యంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తరుణంలో కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు రైతుల అభిప్రాయం తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే నియోజకవర్గ పరిధిలోని మంభోజిపల్లి దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న 12 మండలాలకు చెందిన సుమారు 3వేల మంది రైతులు రెండుమార్లు ఈ విషయమై సమావేశమయ్యారు. మొదటిసారి కేవలం రైతుల సమక్షంలో రెండోసారి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే నిర్ణయం తీసుకోవాలని రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే ఇందులో కొంతమంది పెద్ద రైతులు అధిక ధరలు రావాలంటే ప్రైవేటీకరణే బాగుంటుందని అభిప్రాయ పడగా, చిన్న సన్నకారు రైతులంతా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం మేరకు కలెక్టర్లు రైతులను అభిప్రాయాలు కోరితే తెలంగాణ ఏర్పడిన అనంతరమే తమ నిర్ణయం చెబుతామని రైతులంటున్నారు. మందకొడిగా చెరకు క్రషింగ్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయం విషయంలో స్పష్టత రాక పోవడంతో ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం మొక్కుబడిగా క్రషింగ్ నిర్వహిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మంభోజిపల్లి షుగర్ ఫ్యాక్టరీ సామర్థ్యం రోజుకు 2500 టన్నులు కాగా, ఈ ఏడు ఫ్యాక్టరీ ప్రారంభమై 30 రోజులు గడిచినా నేటికీ కేవలం 47వేల టన్నులు మాత్రమే క్రషింగ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే 15 రోజుల్లో బిల్లులు చెల్లించాల్సిఉనప్పటికీ ఇప్పటి వరకు నయాపైసా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము రెండు, మూడు రోజులపాటు ఫ్యాక్టరీ పరిసరాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. తద్వారా చెరకు ఎండిపోయి తూకంలో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. తమకే అప్పగించాలనే ఉద్దేశంతో యాజమాన్యం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే పర్మిట్లలో సైతం తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్డీఎస్ఎల్ ఏజీఎం కృష్ణారెడ్డి మాట్లాడుతూ యంత్రాలు సరిగా పనిచేయక పోవడం వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. హౌస్ కమిటీ నివేదిక అమలయ్యేనా? చంద్రబాబు హయాంలో కేవలం రూ.65.40 కోట్లకు మూడు భారీ చెక్కర ఫ్యాక్టరీలను ప్రైవేట్ యాజమాన్యాలకు కట్టబెట్టడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి 31-08-2004 నాడు జె.రత్నాకర్‌రావు ఆధ్వర్యంలో 9మంది సభ్యులతో అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెండేళ్లపాటు వివరాలు సేకరించిన కమిటీ 31-08-2006న ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేసుకోవాలని నివేదిక సమర్పించినట్లు కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు. అయితే ఒకవేళ ప్రభుత్వపరం చేసుకుంటే అప్పట్లో తీసుకున్న రూ.65.40 కోట్లు మాత్రమే పరిహారంగా ఇవ్వాలని శశిధర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాలన్నారు. -
నిరీక్షణ ఫలించేనా?
నిరీక్షణ ఫలించేనా? బోధన్‌లోని చక్కెర కర్మాగారం విషయంలో శాసనసభా సంఘం చేసిన సిఫారసులు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంత రైతులు, కార్మికుల కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం త్వరగా ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని, ఇళ్లకోసం కార్మికుల వద్దనుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా కల సాకారమవుతుందేమోనన్న ఆశతో నిరీక్షిస్తున్నారు. బోధన్ టౌన్, న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాల పాటు ఈ ప్రాంతంలో వెలుగులు నింపి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ(ఎన్ఎస్ఎఫ్) ప్రైవేట్ పరం కావడంతో కార్మికులు, రైతుల కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రోత్సాహం కరువై రైతులు చెరుకు సాగుకు దూరమయ్యారు. ఉపాధిపోయి కార్మికులు వీధిన పడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం నిజాం ప్రభువు నిర్మించిన ఇళ్లకూ ప్రభుత్వం డబ్బులు వసూలు చేసింది. బాధితులంతా శాసనసభా సంఘం సిఫారసుల అమలు కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని నిరీక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతుండడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. నష్టాల సాకుతో 2002లో టీడీపీ ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఎఫ్‌ను ప్రైవేట్ పరం చేసింది. సుమారు రూ 300 కోట్ల విలువైన ఫ్యాక్టరీ ఆస్తులను *60 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. ఫ్యాక్టరీపై ఆధార పడి ఉన్న రైతులకు, కార్మికులకు అప్పటి నుంచి కష్టాలు మొదల య్యాయి. ఫ్యాక్టరీని అమ్మేటప్పుడు దానికి అనుబంధం గా ఉన్న 14 ఫారాలతో పాటు శక్కర్నగర్కాలనీలోని ఇళ్లను అమ్మేశారు. వీటిని కార్మికుల శ్రేయస్సు కోరి నిజాం ప్రభువు నిర్మించారు. శక్కర్‌నగర్ కాలనీలోని ఇళ్లు శిథిలావస్థకు చేరినా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇంటికి రూ 35 వేలనుంచి రూ 60వేల వరకు రేటు కట్టి కార్మికుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసిం ది. ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేసినప్పుడు 1,200 కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చారు. ఇంటి డబ్బులను కట్ చేసుకొని వీరికి వీఆర్ఎస్ మొత్తాన్ని ఇచ్చారు. ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ అప్పటి ప్రతిపక్ష నేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ వ్యవహారంపై 12మందితో శాసనసభా సంఘాన్ని నియమించా రు. విచారణ జరిపిన శాసనసభాసంఘం ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని తేల్చింది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించింది. భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకుల విజ్ఞప్తి మేరకు నివేదికలో కార్మికుల ఇళ్ల అంశాన్నీ చేర్చారు. దీని ప్రకారం కార్మికులనుంచి ప్రభుత్వం వసూలు చేసిన ఇంటి డబ్బులు రూ 5.50 కోట్లను తిరిగి ఇవ్వాలని సిఫారసు చేశారు. ఫ్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఇటీవల హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో దీనికి సంబంధిం చిన ఫైల్ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉంటోంది. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, కిషన్‌రెడ్డి పలుమార్లు మాట్లాడారు. ఫ్యాక్టరీపై శాసనసభా సంఘం చేసిన సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శాసనసభ్యులు సైతం పోరాడి నా ఫలితం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధు లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి శాసనసభా సంఘం సిఫారసులు అమలయ్యేలా చూడాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు. ఇళ్ల విషయంలో కార్మికులనుంచి వసూలు చేసిన డబ్బులను త్వరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.