Q4
-
తగ్గిపోయిన బంధన్ బ్యాంక్ లాభం
కోల్‌కతా: నాలుగో త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నికర లాభం రూ. 55 కోట్లకు పరిమితమైంది. క్రితం క్యూ4లో ఇది రూ. 808 కోట్లు. తాజాగా రైటాఫ్‌లు, మొండిబాకీలకు అధిక కేటాయింపులు జరపాల్సి రావడం వంటి అంశాలు లాభాలు తగ్గడానికి కారణం.జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రొవిజనింగ్ రూ. 735 కోట్ల నుంచి రూ. 1,774 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ చంద్రశేఖర్ ఘోష్ తెలిపారు. అలాగే రూ. 3,852 కోట్లు రైటాఫ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. క్యూ4లో నికర వడ్డీ మార్జిన్ 7.6 శాతంగా ఉంది.స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 4.9 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.1 శాతంగా ఉన్నాయి. జూలైలో ఎండీ, సీఈవో పదవి నుంచి రిటైర్ కానున్న ఘోష్.. రిటైర్మెంట్ తర్వాత హోల్డింగ్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌లో వ్యూహాత్మక బాధ్యతలు పోషించనున్నట్లు తెలిపారు. -
Q4: కార్పొరేట్ ఫలితాల సీజన్
న్యూఢిల్లీ: ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుడుతోంది. నేడు (శుక్రవారం) క్యూ4తోపాటు.. మార్చితో ముగిసిన గత పూర్తిఏడాది(2023–24)కి సైతం పనితీరు వెల్లడించనుంది. అయితే క్యూ4సహా.. గతేడాదికి ఐటీ కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి సాఫ్ట్వేర్ రంగ కంపెనీల క్యూ4, పూర్తి ఏడాది పనితీరు వెల్లడికానుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) ఆదాయ అంచనాలు(గైడెన్స్) సైతం ప్రకటించనున్నాయి. అయితే పలు కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలనే ప్రకటించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఐటీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంటున్నాయి. ఆర్థిక అనిశి్చతుల కారణంగా టెక్నాలజీ సేవలకు డిమాండ్ మందగించడం, ఐటీపై క్లయింట్ల వ్యయాలు తగ్గడం ఈ ఏడాది అంచనాలను సైతం దెబ్బతీసే వీలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వెరసి ఐటీ కంపెనీలు అప్రమత్తతతో కూడిన గైడెన్స్‌ను ప్రకటించనున్నట్లు తెలియజేశాయి. బ్రోకింగ్ వర్గాల అంచనాలు నేడు(12న) ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీసీఎస్ క్యూ4సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ 18న, విప్రో 19న, టెక్ మహీంద్రా 25న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఎమ్కే ఇటీవల అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో మాత్రమే రికవరీ ఆశలనుపెట్టుకోవచ్చునంటూ పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన నిరాశామయ పనితీరుతో పోలిస్తే క్యూ4లో త్రైమాసికవారీగా కాస్తమెరుగైన ఫలితాలు సాధించవచ్చని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల రీత్యా ఐటీ సరీ్వసులకు డిమాండ్ మందగించినట్లు పేర్కొంది. వెరసి కరోనా మహమ్మారి తలెత్తిన 2019–20ను మినహాయిస్తే వార్షికంగా 2008–09 తదుపరి బలహీన ఫలితాలు విడుదలయ్యే వీలున్నట్లు తెలియజేసింది. వ్యయాలు తగ్గడం ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఐచి్చక వ్యయాలు తగ్గడంతో ఐటీ పరిశ్రమలో ప్రస్తావించదగ్గ మార్పులకు అవకాశంతక్కువేనని అభిప్రాయపడింది. కాగా.. యూఎస్ ఫెడ్ సానుకూల ధృక్పథం, పూర్తి చేయవలసిన భారీ ఆర్డర్లు వంటి అంశాలు ఈ ఏడాది(2024–25)లో ప్రోత్సాహక ఫలితాలకు దారిచూపవచ్చని అంచనా వేసింది. క్యూ4లో డీల్స్ ద్వారా సాధించే మొత్తం కాంట్రాక్టుల విలువ(టీసీవీ) సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ ఆదాయంపై స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒత్తిడి కనిపించవచ్చని వివరించింది. ఐటీ సేవలకు ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు, రిటైల్, హైటెక్, కమ్యూనికేషన్స్ విభాగాలతోపాటు.. ప్రాంతాలవారీగా కూడా బలహీనతలు కనిపిస్తున్నట్లు ఐటీ విశ్లేషకులు పేర్కొన్నారు. గ్లోబల్ దిగ్గజాలు సైతం గ్లోబల్ దిగ్గజాలు యాక్సెంచర్, కాగి్నజెంట్ టెక్నాలజీ, క్యాప్‌జెమిని సైతం ఈ క్యాలండర్ ఏడాది(2024) ఓమాదిరి పనితీరును ఊహిస్తున్నాయి. ఫలితంగా తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేశాయి. అయితే ద్వితీయార్ధం(జూలై–డిసెంబర్)లో రికవరీకి వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. కాగా.. దేశీ ఐటీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రక్షణాత్మక బిజినెస్ మిక్స్ ద్వారా లబ్ది పొందే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఇక డిజిటల్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ విభాగాల కారణంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ కీలక పురోగతిని సాధించవచ్చని అభిప్రాయపడింది. -
గత ఏడాదితో పోలిస్తే.. జొమాటోకు భారీగా తగ్గిన నష్టాలు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 188 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 360 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,212 కోట్ల నుంచి రూ. 2,056 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,702 కోట్ల నుంచి భారీగా పెరిగి రూ. 2,431 కోట్లను తాకాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ. 1,226 కోట్ల నుంచి తగ్గి రూ. 971 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం రూ. 7,079 కోట్లకు జంప్‌చేసింది. 2021–22లో రూ. 4,192 కోట్ల ఆదాయం నమోదైంది. ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈవోగా రాకేష్ రంజన్, సీవోవోగా రిన్షుల్ చంద్రను ఎంపిక చేసినట్లు జొమాటో పేర్కొంది. జొమాటో హైపర్‌ప్యూర్ సీఈవోగా రిషి అరోరాను నియమించినట్లు తెలియజేసింది. -
మహీంద్రా హాలిడేస్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ దిగ్గజం మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడున్నర రెట్లు జంప్‌చేసి రూ. 56 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 16 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 712 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 551 కోట్ల నుంచి రూ. 658 కోట్లకు పెరిగాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 67 శాతం దూసుకెళ్లి రూ. 114 కోట్లకు చేరింది. 2021–22లో రూ. 68 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం, నిర్వహణ లాభం తదితరాలలో కంపెనీ అత్యుత్తమ పనితీరు చూపినట్లు ఎండీ, సీఈవో కవీందర్ సింగ్ పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ వివాదాల కారణంగా తలెత్తిన స్థూలఆర్థిక సవాళ్లలోనూ యూరోపియన్ కార్యకలాపాలలో టర్న్‌అరౌండ్‌ను సాధించినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా హాలిడేస్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 311 వద్ద ముగిసింది. చైర్మన్ పదవీ విరమణ మహీంద్రా గ్రూప్ నాయకత్వ శ్రేణిలో కీలక సభ్యుడు మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ చైర్మన్ అరుణ్ నందా పదవీ విరమణ చేయనున్నారు. 50 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుంటున్న నందా 2023 జులై 25న నిర్వహించనున్న వాటాదారుల సాధారణ వార్షిక సమావేశంలో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. నాన్‌ఎగ్జిక్యూటివ్ పదవుల విషయంలో వయసును పరిగణించి తిరిగి ఎంపిక చేయవద్దంటూ బోర్డుకు సూచించినట్లు నందా తెలియజేశారు. మహీంద్రా గ్రూప్‌లో నందా 1973లో అకౌంటెంట్‌గా కోల్‌కతాలో చేరారు. 1976లో సీఎఫ్‌వో, కంపెనీ సెక్రటరీ(మహీంద్రా సింటర్డ్ ప్రొడక్ట్స్‌గా పుణేలో బాధ్యతలు స్వీకరించారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం బలపడి రూ. 3,983 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 3,599 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసికవారీగా అంటే గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 4,096 కోట్లతో పోలిస్తే నికర లాభం 3 శాతం తగ్గింది. కాగా.. ఈ క్యూ4లో మొత్తం ఆదాయం 18 శాతం ఎగసి రూ. 26,606 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 22,597 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 10 శాతం మెరుగై రూ. 14,845 కోట్లను తాకింది. 2021–22లో రూ. 13,499 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. లక్ష కోట్లను దాటి రూ. 1,01,456 కోట్లకు చేరింది! అంతక్రితం ఏడాది రూ. 85,651 కోట్ల ఆదాయం అందుకుంది. భారీ డీల్స్ అప్ క్యూ4లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 13 భారీ డీల్స్ గెలుచుకుంది. వీటి విలువ 207.4 కోట్ల డాలర్లుకాగా.. వార్షికంగా 18 శాతం క్షీణించింది. ఈ కాలంలో కంపెనీ 3,674 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,25,944కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతంగా నమోదైంది. డీల్ పైప్‌లైన్ దాదాపు కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ పేర్కొన్నారు. గైడెన్స్ గుడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 6–8 శాతం వృద్ధి చెందగలదని హెచ్‌సీఎల్ టెక్ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండును ప్రకటించింది. వరుసగా 81వ త్రైమాసికంలోనూ డివిడెండును చెల్లిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,037 వద్ద ముగిసింది. -
టీసీఎస్.. భేష్.. క్యూ4 నికర లాభం రూ. 11,392 కోట్లు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల నంబర్‌వన్ దేశీ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 11,392 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,959 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం బలపడి రూ. 59,162 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 50,591 కోట్ల ఆదాయం నమోదైంది. రూ. 41,440 కోట్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన గతేడాదికి టీసీఎస్ 10 శాతం అధికంగా రూ. 42,147 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 2,25,458 కోట్లను తాకింది. కాగా.. కొత్త సీఈవో, ఎండీగా ఎంపికైన కె.కృతివాసన్ ప్రస్తుత సీఈవో రాజేష్ గోపీనాథన్ నుంచి జూన్1న బాధ్యతలు స్వీకరించనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. ఆర్డర్ బుక్ జోరు గతేడాది ఆర్డర్‌బుక్ 34.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. క్యూ4లో 10 బిలియన్ డాలర్లు జమైనట్లు తెలియజేసింది. చరిత్రాత్మక స్థాయిలో భారీ డీల్స్ సాధించినట్లు పేర్కొంది. 10 కోట్లకుపైగా డాలర్ల క్లయింట్ల సంఖ్య 60కు చేరింది. బ్యాంకింగ్ రంగం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఉత్తర అమెరికా నుంచి 15 శాతంపైగా వృద్ధి సాధించినట్లు పేర్కొంది. ఇతర హైలైట్స్ ► షేరుకి రూ. 24 తుది డివిడెండ్ ప్రకటించింది. ► నిర్వహణ లాభ మార్జిన్లు 24.1 శాతం నుంచి 24.5 శాతానికి బలపడ్డాయి. ► నికర మార్జిన్లు సైతం 18.7 శాతం నుంచి 19.3 శాతానికి మెరుగుపడ్డాయి. ► క్యూ4లో నికరంగా 821మందిని, పూర్తిఏడాదిలో 22,600 మందిని జమ చేసుకుంది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 6,14,795ను తాకింది. దీనిలో మహిళల వాటా 35.7 శాతం. ► ఉద్యోగ వలసల రేటు 20.1%గా నమోదైంది. ► ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనుంది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 3,246 వద్ద ముగిసింది. మరోసారి పటిష్ట ఫలితాలు ప్రకటించినందుకు సంతృప్తిగా ఉన్నాం. మా సర్వీసులకున్న డిమాండును ఆర్డర్‌బుక్ ప్రతిఫలిస్తోంది. రిటైల్, కన్జూమర్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగాలు 13–12 శాతం వృద్ధిని సాధించాయి. బీఎఫ్ఎస్ఐ 9 శాతంపైగా పుంజుకుంది. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, టీసీఎస్ -
క్యూ4లో బ్యాంకుల జోరు.. టార్గెట్ లక్షకోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో బ్యాంకింగ్ రంగం ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు ఫైనాన్షియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. జనవరి–మార్చి(క్యూ4) లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లు ప్రధాన పాత్రను పోషించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల మొత్తం లాభాలు రూ. లక్ష కోట్లను తాకవచ్చని అంచనా వేశారు. మొండి రుణాలు తగ్గడం, రుణ వృద్ధి పుంజుకోవడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. రూ. 40,000 కోట్లకు మార్చితో ముగిసిన గతేడాదికి పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ రూ. 40,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలుంది. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలోనే రూ. 33,538 కోట్లు సాధించింది. ఇది అంతక్రితం ఏడాది(2021–22)లో అందుకున్న రూ. 31,676 కోట్లకంటే రూ. 1,862 కోట్లు అధికంకావడం గమనార్హం! ఈ బాటలో ఇతర ప్రభుత్వ బ్యాంకులు సైతం పటిష్ట పనితీరు ప్రదర్శించనున్నాయి. ఇందుకు మొండి బకాయిలు(ఎన్పీఏలు), స్లిప్పేజీలు తగ్గడానికితోడు రెండంకెల రుణ వృద్ధి, పెరుగుతున్న వడ్డీ రేట్లు సహకరించనున్నాయి. గతేడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) 12 పీఎస్‌బీలు మొత్తంగా రూ. 70,166 కోట్ల నికర లాభాలను ప్రకటించాయి. 2021–22లో సాధించిన రూ. 48,983 కోట్లతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఈ ట్రెండ్ క్యూ4లోనూ కొనసాగనున్నట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ స్వరూప్ కుమార్ సాహా పేర్కొన్నారు. దీంతో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 30,000 కోట్లు ప్రకటించే వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి పూర్తి ఏడాదికి రూ. లక్ష కోట్ల నికర లాభాలను అందుకోనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రైమాసికవారీగా ఇలా పీఎస్‌బీలు గతేడాది క్యూ1లో ఉమ్మడిగా రూ. 15,306 కోట్లు, క్యూ2లో రూ. 25,685 కోట్లు, క్యూ3లో రూ. 29,175 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా మిగిలిన అన్ని పీఎస్‌బీల నికర లాభాలూ క్యూ3లో మెరుగయ్యాయి. ఎస్బీఐ అత్యధికంగా 68 శాతం వృద్ధితో రూ. 14,205 కోట్లు ఆర్జించగా.. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పీఎన్బీ లాభం మాత్రం 44 శాతం క్షీణించి రూ. 628 కోట్లకు పరిమితమైంది. అయితే డిపాజిట్ల రేట్లు పెరగడం, కాసా(సీఏఎస్ఏ) తగ్గుతున్న కారణంగా నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి పడనున్నట్లు సాహా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెరుగుదలలోనూ క్యూ4లో రుణ వృద్ధి పుంజుకుకోవడం గమనార్హం. ఐసీఐసీఐ దూకుడు బ్రోకరేజీ.. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం త్రైమాసికవారీగా ప్రొవిజనింగ్ తగ్గనున్నట్లు అంచనా. ప్రొవిజనింగ్ కవరేజీ రేషియో(పీసీఆర్) భారీ బిల్డప్ నేపథ్యంలో ఎన్పీఏలు వెనకడుగు వేయనున్నాయి. అయితే ఆర్బీఐ నిబంధనల కారణంగా భారీ కార్పొరేట్ రుణాలుగల బ్యాంకులు అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి ఉంటుంది. కాగా.. ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ లాభాలు సాధించనుండగా.. యాక్సిస్ బ్యాంక్ నష్టాలు ప్రకటించే వీలున్నట్లు ఎమ్కే గ్లోబల్ నివేదిక పేర్కొంది. సిటీబ్యాంక్ పోర్ట్‌ఫోలియో కొనుగోళ్లతో గుడ్‌విల్ రైటా ఫ్స్ చేపట్టవలసిరావడం ప్రభావం చూపనుంది. ఇక పటిష్ట వృద్ధి, తక్కువ ప్రొవిజన్లతో ఇండస్ఇండ్ బ్యాంక్ ఉత్తమ ఫలితాలు ప్రకటించవచ్చు. ఫెడరల్ బ్యాంక్ ఆశావహ ఫలితాలు వెల్లడించే వీలుంది. ప్రయివేట్ రంగ బ్యాంకులు క్యూ3లో 33% అధికంగా రూ. 36,512 కోట్ల నికర లాభాలు ప్రకటించిన విషయం విదితమే. బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్ మినహా అన్ని ప్రయివేట్ బ్యాంకులూ సానుకూల పనితీరు చూపాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా రూ. 12,259 కోట్లు ఆర్జించింది. -
మహీంద్రా అండ్ మహీంద్రా, సంస్థ చరిత్రలోనే తొలిసారే ఇలా!
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం భారీగా పెరిగి రూ.1,192 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.245 కోట్లుగానే ఉండడం గమనార్హం. ఆదాయం 28 శాతం పెరిగి రూ.17,124 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.13,356 కోట్లుగా ఉంది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్టాండలోన్ లాభం రూ.4,935 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.984 కోట్లుగానే ఉంది. ఇక ఆదాయం రూ.55,300 కోట్లుగా నమోదైంది. సంస్థ చరిత్రలో ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక స్టాండలోన్ లాభం ఇదేనని ఎంఅండ్ఎం ప్రకటించింది. అలాగే, కంపెనీ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో (ఒక త్రైమాసికానికి) యుటిలిటీ వాహనాలను మార్చి త్రైమాసికంలో విక్రయించినట్టు తెలిపింది. సాగు పరికరాలు, ట్రాక్టర్ల విభాగంలో (ఎఫ్ఈఎస్) కంపెనీ మార్కెట్ వాటా 40 శాతంగా ఉంది. ఎగుమతుల్లో సంస్థ 77 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021–22లో 17,500 ట్రాక్టర్లను సంస్థ ఎగుమతి చేసింది. ఇది కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రికార్డు గరిష్టం కావడం గమనార్హం. క్యూ4లో ఎస్యూవీ ఆదాయం పరంగా చూస్తే నంబర్1 స్థానంలో ఉంది. ‘‘క్యూ4లో పనితీరు మా వ్యాపార బలానికి నిదర్శనం. కరోనా, కమోడిటీ ధరలు, సెమీ కండక్టర్ల కొరత, ఉక్రెయిన్ సంక్షోభం తదితర రూపాల్లో సవాళ్లు ఉన్నప్పటికీ బలమైన ఫలితాలను నమోదు చేశాం. వృద్ధి అవకాశాలను అందుకునేందుకు గ్రూపు కంపెనీలు అన్నీ మంచి స్థితిలో ఉన్నాయి’’ అని ఎంఅండ్ఎం ఎండీ, సీఈవో అనీష్‌షా తెలిపారు. -
ఐడీఎఫ్సీ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 168 శాతం జంప్‌చేసి రూ. 343 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4,811 కోట్ల నుంచి రూ. 5,385 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం ఎగసి రూ. 2,669 కోట్లకు చేరింది. ఫీజు, ఇతర ఆదాయం 40 శాతం వృద్ధితో రూ. 841 కోట్లను తాకింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మాత్రం ఐడీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 68 శాతం క్షీణించి రూ. 145 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 452 కోట్లు ఆర్జించింది. కోవిడ్–19 రెండో దశ ప్రభావం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 18,179 కోట్ల నుంచి రూ. 20,395 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం సైతం 32 శాతం ఎగసి రూ. 9,706 కోట్లకు చేరింది. కాగా.. రిటైల్ విభాగంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.01 శాతం నుంచి 2.63 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ వెల్లడించారు. ఈ బాటలో నికర ఎన్పీఏలు సైతం 1.9 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. -
లాభాల్లోకి యస్ బ్యాంక్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ గతేడాది(2021–22) రూ. 1,066 కోట్ల నికర లాభం ఆర్జించింది. మూడేళ్ల(2019) తదుపరి బ్యాంక్ లాభాల్లోకి ప్రవేశించినట్లు బ్యాంక్ సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కాగా.. గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో బ్యాంక్ రూ. 367 కోట్ల నికర లాభం ప్రకటించింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. ఈ క్యూ4(జనవరి–మార్చి)లో నికర వడ్డీ ఆదాయం 84 శాతం జంప్‌చేసి రూ. 1,819 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.5 శాతానికి బలపడగా.. వడ్డీ యేతర ఆదాయం 28 శాతం ఎగసి రూ. 882 కోట్లకు చేరింది. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ అధ్యక్షతన బ్యాంకుల కన్సార్షియం ఆర్థిక సవాళ్లలో ఇరుక్కున్న యస్ బ్యాంకుకు మూడేళ్ల క్రితం బెయిలవుట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 15.7 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఏడాది(2022–23)లో రూ. 5,000 కోట్లకుపైగా రికవరీలు, అప్గ్రేడ్లను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రశాంత్ వెల్లడించారు. ఈ బాటలో నికర వడ్డీ మార్జిన్లను 2.75 శాతానికి మెరుగుపరచుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. 2022 మార్చికల్లా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.4 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు. -
వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్మీ..!
భారత మార్కెట్లోకి అడుగుపెట్టి జస్ట్ మూడేళ్లయ్యింది. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకే అందిస్తూ రియల్మీ భారత్‌లో మరోసారి సత్తా చాటింది. క్యూ4లో నంబర్ 2 భారత్‌లో మొబైల్ సేల్స్‌కి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ 2021గాను క్యూ4 ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 17 శాతం మార్కెట్ వాటాతో రియల్మీ శాంసంగ్‌ని వెనక్కి నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్ రెండో కంపెనీగా రికార్డు సృష్టించింది. శాంసంగ్ నుంచి కొత్త మోడళ్ల రాక తగ్గిపోవడంతో కేవలం 16 శాతం మార్కెట్‌కే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. షావోమి నెంబర్ వన్..! ఇక భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో షావోమీ మరోసారి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. భారత మార్కెట్లో ఒక వెలుగు వెలిగినా శాంసంగ్‌కు షావోమి భారీగానే గండి కొట్టింది. 2021 క్యూ4లో షావోమీ ఏకంగా 24 శాతం మార్కెట్ వాటాతో నంబర్ వన్‌గా నిలిచింది. 2021లో టాప్ షావోమీ..! 2021గాను ఒవరాల్ చూసుకుంటే షావోమీ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్‌లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. చదవండి: గంటకు 19 వేలకుపైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..! -
పెట్రోల్ డిమాండ్ తగ్గేదేలే!
న్యూఢిల్లీ: కోవిడ్–19పరమైన ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ, ప్రస్తుత త్రైమాసికంలో దేశీయంగా ఇంధనానికి డిమాండ్ మెరుగుపడటం కొనసాగనుంది. అయితే, కొంగొత్త వేరియంట్లతో కేసులు పెరగడం, తత్ఫలితంగా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాల వల్ల ఆర్థిక వ్యవస్థ, ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడే రిస్కులు కూడా పొంచి ఉన్నాయి. ఒక నివేదికలో ఫిచ్ రేటింగ్స్ ఈ అంశాలు వెల్లడించింది. ఇంధనానికి డిమాండ్, తద్వారా ధరల పెరుగుదలతో చమురు, గ్యాస్ ఉత్పత్తి కంపెనీల ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. క్యూ 4లో ‘‘జనవరి–మార్చి త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాం. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే మాత్రం 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2–4 శాతం తక్కువగానే ఉండవచ్చు’’ అని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఫిచ్ నివేదిక ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ 5 శాతం మేర పెరిగింది. అయితే, నెలవారీ సగటు మాత్రం కోవిడ్ పూర్వ స్థాయికన్నా 8–10 శాతం తక్కువగా సుమారు 16.4 మిలియన్ టన్నుల స్థాయిలో నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీయంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహమ్మారి కట్టడికి సం బంధించిన ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. ‘‘ కోవిడ్–19 కేసుల ఉధృతి, ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలపై ప్రభావాల రిస్కులకు లోబడి నాలుగో త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌కు సంబంధించిన రికవరీ కొనసాగవచ్చు’’ అని ఫిచ్ తెలిపింది. మరింతగా ఓఎంసీల పెట్టుబడులు.. రిఫైనింగ్ సామర్థ్యాలు, రిటైల్ నెట్‌వర్క్‌లను పెంచుకునేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ).. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందు కు తయారీ కంపెనీలు.. మరింతగా ఇన్వెస్ట్ చేయ డం కొనసాగించనున్నట్లు ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ‘‘క్రూడాయిల్ ఉత్పత్తి స్థిరంగా కొనసాగవచ్చు. అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలపై ఉత్పత్తి కంపెనీలు మరింతగా పెట్టుబడులు కొనసాగించడం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక మోస్తరుగా పెరగవచ్చు. దేశీయంగా ఉత్పత్తి పెర గడం, స్పాట్ ధరల్లో పెరుగుదల తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులపై ప్రభావం చూపవచ్చు. అయితే, వినియోగం పుంజు కునే కొద్దీ మధ్యకాలికంగా చూస్తే ఎల్ఎన్జీ దిగుమతులు క్రమంగా పెరగవచ్చు’’ అని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది. మెరుగుపడనున్న రిఫైనింగ్ మార్జిన్లు .. ఎకానమీ రికవరీ క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే కొద్దీ కీలకమైన చమురు రిఫైనింగ్ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (అక్టోబర్ 2021–మార్చి 2022) మెరుగుపడనున్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. డిమాండ్, ఉత్పత్తి ధర–విక్రయ ధర మధ్య వ్యత్యాసం, తక్కువ రేటుకు కొని పెట్టుకున్న నిల్వల ఊతంతో ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్ 2021) ప్రభుత్వ రంగ ఓఎంసీలు మెరుగైన మార్జిన్లు నమోదు చేశాయి. ఒక్కో బ్యారెల్‌పై బీపీసీఎల్ 5.1 డాలర్లు, ఐవోసీ 6.6 డాలర్లు, హెచ్‌పీసీఎల్ 2.9 డాలర్ల స్థాయికి మార్జిన్లు మెరుగుపర్చుకున్నాయి. క్రూడాయిల్ అధిక ధరల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కొనసాగించడం ద్వారా ద్వితీయార్ధంలో కూడా ఓఎంసీలు స్థిరంగా మార్కెటింగ్ మార్జిన్లను నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. -
Xiaomi: మరో ఫోల్డబుల్ ఫోన్..త్వరలోనే
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి అతి త్వరలోనే మరో ఫోల్డబుల్ మొబైల్‌ను లాంచ్ చేయనుంది. హై ఎండ్ ఫీచర్స్‌తో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో తీసుకురానుంది. తన కంపెనీ నుంచి ఎంఐ మిక్స్ ఫోల్డ్ సిరీస్‌లో భాగంగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2ను కొనసాగింపుగా మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. కాగా ఈ ఫోల్డబుల్ ఫోన్లో ఆప్గ్రేడేడ్ హింజ్ మెకానిజం రానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2 శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 కు పోటీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ 2 స్పాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ రిలీజ్ చేయనుంది. వీటితో పాటుగా 108 ఎంపీ రియర్ కెమరాను అమర్చనుంది. అత్యధికంగా 120హెర్జ్ రిఫ్రెష్ రేటుతో ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ మొబైల్‌ను 2021 క్యూ4లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. చదవండి: ఐటెల్ నుంచి అతి తక్కువ ధరకే 4జీ ఫోన్ -
నిఫ్టీ–500 స్టాక్స్‌లో డీఐఐల వాటా డౌన్
ముంబై: దేశీ స్టాక్స్‌లో ఓవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులకు దిగుతుంటే.. మరోపక్క దేశీ ఫండ్స్(డీఐఐలు) అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో గతేడాది (2020– 21) చివరి త్రైమాసికంలో నిఫ్టీ–500 ఇండెక్సులో భాగమైన కంపెనీలలో ఎఫ్‌పీఐల వాటా పుంజుకోగా.. డీఐఐల వాటా డీలా పడింది. వెరసి జనవరి–మార్చి(క్యూ4)లో డీఐఐల వాటా 0.5 శాతం క్షీణించి 14.2 శాతానికి పరిమితమైంది. ఇది గత 7 త్రైమాసికాలలో కనిష్టంకావడం గమనార్హం. ఇక ఇదే కాలంలో ఎఫ్‌పీఐల వాటా 1.6 శాతం బలపడి 22.3 శాతానికి చేరింది. బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్రోడీకరించిన గణాంకాలివి. ఇతర వివరాలు చూద్దాం.. క్యూ3తో పోలిస్తే వార్షికంగా చూస్తే నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా 20.7 శాతం నుంచి 1.6 శాతం పుంజుకోగా.. డీఐఐల వాటా 14.7 శాతం నుంచి 0.5 శాతం క్షీణించింది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్) తో పోలిస్తే ఎఫ్‌పీఐల వాటా 0.2 శాతం వెనకడుగు వేయగా.. డీఐఐల వాటా సైతం 0.1 శాతం నీరసించింది. క్యూ4లో ఎఫ్‌పీఐలు 7.3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో డీఐఐలు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. రంగాల వారీగా గత రెండు త్రైమాసికాలలో ఎఫ్‌పీఐలు టెలికం, మెటల్స్, కన్జూమర్ డ్యురబుల్స్, రియల్టీ, సిమెంట్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. డీఐఐలు ఈ రంగాలలో అధిక అమ్మకాలు చేపట్టాయి. కన్జూమర్, హెల్త్‌కేర్, ప్రభుత్వ బ్యాంకులను పెట్టుబడులకు ఎంచుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్చికల్లా ఎఫ్‌పీఐల వాటా 22.3 శాతానికి ఎగసింది. ఇది కోవిడ్–19 తలెత్తకముందు స్థాయికావడం గమనార్హం! గతేడాది ద్వితీయార్థంలో ఎఫ్‌పీఐలు నిఫ్టీ–500 ఇండెక్స్‌లోని 286 కంపెనీలలో వాటాలు పెంచుకున్నాయి. నిఫ్టీ–50లో 32 కంపెనీలున్నాయి. ఈ బాటలో డీఐఐలు 203–18(నిఫ్టీ) స్టాక్స్‌లో వాటాలు కొనుగోలు చేశాయి. ఇదే కాలంలో ఎఫ్‌పీఐలు 203–18 కంపెనీలలో వాటాలు తగ్గించుకోగా.. డీఐఐలు 271–31 స్టాక్స్ పెట్టుబడుల్లో వెనకడుగు వేశాయి. విలువ రీత్యా నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా విలువ 593 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రయివేట్ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 139 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు డీఐఐల వాటాల విలువ 378 బిలియన్ డాలర్లకు చేరగా.. ప్రయివేట్ బ్యాంక్స్‌లో పెట్టుబడులు 59 డాలర్లుగా నమోదయ్యాయి. ఈ బాటలో టెక్నాలజీ స్టాక్స్ వాటా విలువ 43 బిలియన్ డాలర్లను తాకగా, కన్జూమర్ విభాగంలో 40 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ప్రయివేట్ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐలు 47.9% ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నారు. ఈ బాటలో ఎన్బీఎఫ్సీలలో 32.9 శాతం, ఆయిల్, గ్యాస్‌లో 23.1 %, బీమాలో 22.2 శాతం, రియల్టీలో 21.5% ఓనర్‌షిప్‌ను పొందారు. డీఐఐలు క్యాపిటల్ గూడ్స్ (21.9%), ప్రయివేట్ బ్యాంక్స్(20.4%), మెటల్స్ (18.3%), కన్జూమర్ డ్యురబుల్స్ (17.8%), పీఎస్బీ(17.6%)లలో ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నాయి. ఇటీవల డీఐఐలు అత్యధికంగా(1 శాతానికిపైగా) వాటా పెంచుకున్న కంపెనీల జాబితాలో బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేరాయి. -
టాటా స్టీల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ టాటా గ్రూప్ దిగ్గజం టాటా స్టీల్ గతేడాది(2020–21) చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో టర్న్అరౌండ్ అయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 7,162 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 1,615 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,323 కోట్ల నుంచి రూ. 50,250 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 35,432 కోట్ల నుంచి రూ. 40,052 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 25 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. రికార్డ్ ఇబిటా: తొలి అర్ధభాగంలో కోవిడ్–19 ప్రభావం చూపినప్పటికీ ద్వితీయార్థం నుంచి దేశీయంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతోపాటు.. ఆర్థిక రికవరీ ప్రారంభంకావడంతో స్టీల్ వినియోగం పెరిగినట్లు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. దీంతో పటిష్ట ఫలితాలను సాధించగలిగినట్లు తెలియజేశారు. క్యూ4లో ముడిస్టీల్ ఉత్పత్తి 4.75 మిలియన్ టన్నులకు చేరి రికార్డును సృష్టించగా.. అమ్మకాలు 16 శాతం పెరిగి 4.67 మిలియన్ టన్నులను తాకినట్లు టాటా స్టీల్ పేర్కొంది. క్యూ4లో ఇబిటా 40 శాతం వృద్ధితో రూ. 12,295 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 14,290 కోట్ల ఇబిటాను సాధించినట్లు వెల్లడించింది. మార్జిన్లు 40.9 శాతంగా నమోదయ్యాయి. పెట్టుబడి వ్యయాల తదుపరి రూ. 8,800 కోట్ల ఫ్రీక్యాష్ ఫ్లోను సాధించినట్లు నరేంద్రన్ తెలియజేశారు. పూర్తి ఏడాదికి క్యాష్‌ఫ్లో రూ. 24,000 కోట్లకు చేరగా.. రూ. 28,000 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. వెరసి మొత్తం రుణ భారం 28 శాతం తగ్గి రూ. 75,389 కోట్లకు దిగివచ్చినట్లు వివరించారు. టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 1,071 వద్ద ముగిసింది. -
హీరో మోటోకార్ప్ లాభం రూ.621 కోట్లు
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.621 కోట్ల నికర లాభం(స్డాండ్‌అలోన్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.730 కోట్ల నికర లాభం ఆర్జించామని, 15 శాతం క్షీణించిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.7,885 కోట్ల నుంచి 21 శాతం పతనమై రూ.6,235 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అమ్మకాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం, ఆదాయాలు తగ్గాయని వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.25 తుది డివిడెండ్‌ను ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డ్ సిఫార్సు చేసింది. వాహన అమ్మకాలు 25 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 17.81 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు గత క్యూ4లో 13.35 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హీరో మోటో షేరు స్పల్ప లాభంతో రూ.2,386 వద్ద ముగిసింది. -
క్యూ4 ఫలితాల తర్వాత ఎస్బీఐ టార్గెట్ ధర తగ్గింపు
ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ గతవారంలో శుక్రవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. రుణ వృద్ధి స్తబ్దుగా ఉండటం, నికర వడ్డీ మార్జిన్లు ఇప్పటికీ ఒత్తిళ్లను ఎదుర్కోంటున్న నేపథ్యంలో పలు బ్రోకరేజ్ సంస్థలు ఎస్బీఐ షేరు టార్గెట్ ధరను తగ్గించాయి. అయితే తక్కువ వాల్యూయేషన్లు, మంచి అసెట్ నాణ్యతను కలిగి ఉండటంతో చాలా బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. యస్ బ్యాంక్ సంక్షోభం తర్వాత ఎస్బీఐ డిపాజిట్లు భారీగా పెరగడం కలిసొచ్చే అంశంగా ఉందని బ్రోకరేజ్ సంస్థలు చెప్పుకొచ్చాయి. డిపాజిట్లు, అండర్రైట్, డిజిటలైజేషన్ అంశాల కారణంగా ఎస్బీఐ అత్యుత్తమ ప్రమాణాలను కనబరుస్తోంది. అనుబంధ సంస్థల వాల్యూయేషన్లను అన్‌లాక్ చేయగల భారీ సామర్థ్యం, బ్యాంక్ నిర్వహణ లాభం 1.7-2.0 శాతంగా నమోదు కావడం తదితర సానుకూలాంశాలతో ఎస్బీఐ ఒత్తిళ్లను తట్టుకోగలుగుతుంది. ‘‘మార్చి తర్వాత ఎంసీఎల్ఆర్ 50బేసిస్ పాయింట్లు తగ్గడంతో నికర వడ్డీ మార్జిన్లకు మరింత ప్రమాదం పొంచి ఉంది. ఆకర్షణీయమైన వాల్యూయేషన్, బలమైన ఫ్రాంచైజీలు ఉన్నప్పటికీ.., ఆర్థిక / సామాజిక బాధ్యతల భారాన్ని భరించడంలో ముందంజలో ఉండటం ఎస్బీఐ మరింత ఒత్తిడిని పెంచుతుంది.’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ చెప్పుకొచ్చింది. మారిటోరియం పరిగణనలోకి తీసుకుంటే ఇతర రుణదాతలతో పోల్చితే ఎస్బీఐ తక్కువ కేటాయింపులు జరపడం నిరాశపరిచిందని ఎంకే గ్లోబల్ సంస్థ తెలిపింది. -
టీసీఎస్ లాభం 8,049 కోట్లు
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.8,049 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం (రూ.8,126 కోట్లు)తో పోల్చి తే 1 శాతం మేర తగ్గిందని టీసీఎస్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.38,010 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.39,946 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో రూ.32,340 కోట్లకు, ఆదాయం 7 శాతం ఎగసి రూ.1,56,949 కోట్లకు పెరిగాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 తుది డివిడెండ్‌ను(600 శాతం) ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► ఇతర ఆదాయం తక్కువగా రావడం, అధిక వడ్డీ వ్యయాలు, లాక్డౌన్ విధింపు(దేశీయంగా, అంతర్జాతీయంగా) లాభదాయకతపై ప్రభావం చూపాయి. ► డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం తగ్గి 544 కోట్ల డాలర్లకు తగ్గింది. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం పెరిగింది. ఆదాయం అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 13 శాతం, గత క్యూ3లో 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► గత క్యూ4లో ఎబిట్ అర శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.10,025 కోట్లకు పెరిగింది. మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 25.1 శాతానికి చేరింది. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019–20) ఎబిట్ 3 శాతం వృద్ధితో రూ.38,580 కోట్లకు పెరగ్గా, మార్జిన్ మాత్రం 1 శాతం మేర తగ్గి 24.58 శాతానికి చేరింది. ► గత క్యూ4లో మొత్తం 1,789 మందికి ఉద్యోగాలిచ్చింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 24,179 మందికి కొలువులిచ్చింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,48,464కు పెరిగింది. ఉద్యోగుల వలస (అట్రిషన్ రేటు) 12.1 శాతంగా ఉంది. ► గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.37,702 కోట్ల మేర డివిడెండ్లు చెల్లించింది. ఈ మార్చి క్వార్టర్లో ఒక్కో షేర్‌కు రూ. 12 మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.6 తుది డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే, ఈ మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.18కు పెరుగుతుంది. మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 1 శాతం నష్టంతో రూ. 1,715 వద్ద ముగిసింది. ఉద్యోగాల కోత ఉండదు.. కరోనా ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో కోత విధించే యోచనేదీ లేదని టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జీతాల పెంపు మాత్రం ఉండదని తెలిపారు. మరోవైపు, ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కాటేసింది.... మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి. కానీ ఆ సానుకూలతలన్నింటినీ కరోనా మహమ్మారి ధ్వంసం చేసింది. గుడ్డిలో మెల్లలా కొన్ని భారీ డీల్స్‌ను సాధించగలిగాం. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆర్డర్లను ఈ క్వార్టర్‌లోనే సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ, ఎమ్డీ సంతృప్తికరంగానే సేవలు... కార్యకలాపాల నిర్వహణలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ, క్లయింట్లకు సంతృప్తికరమైన స్థాయిల్లోనే ఐటీ సేవలందిస్తున్నాం. అత్యవసర సేవలే కాక, అన్ని విభాగాల సేవలను అందిస్తున్నాం. –ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం, టీసీఎస్ సీఓఓ, ఈడీ -
క్యూ3, క్యూ4లలో బ్యాంకింగ్‌కు వెలుగురేఖలు!
ముంబై: భారత్ బ్యాంకింగ్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో చక్కటి ఫలితాలు నమోదుచేసుకునే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజ్నీష్ కుమార్ విశ్లేషించారు. భారీ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దీనికి ప్రధాన కారణమనీ వివరించారు. రుణాలకు సంబంధించి ఎడిల్వీస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. కొన్ని కీలక అంశాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే... రుణ వృద్ధి ‘పరుగు’ కష్టమే! ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలాన్ని (2019 ఏప్రిల్–సెప్టెంబర్) 2018లోని ఇదే కాలంతో పోలిస్తే ఎస్బీఐకి సంబంధించినంతవరకూ రుణ వృద్ధిలేకపోగా ప్రతికూలత నమోదయ్యింది. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ మాత్రం ఈ పరిస్థితి మెరుగుపడింది. వార్షిక ప్రాతిపదికన రుణ వృద్ధి దేశీయంగా 5 శాతానికి తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధించి ఈ శాతం 7గా ఉంది. మరికొంత కాలం రుణ వృద్ధి మందగమనంలోనే ఉండే అవకాశం ఉంది. 2018–19లో మొత్తం బ్యాంకింగ్ రుణ వృద్ధిరేటు 13.3 శాతం. అయితే 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంతకు ముం దటి ఏడాదితో పోలి్చచూస్తే పెరుగుదల 7.1 శాతం మాత్రమే. విలువ రూపంలో రూ.92.87 లక్షల కోట్ల నుంచి రూ.99.47 లక్షల కోట్లకు చేరింది. 2019–20లో రుణ వృద్ధిరేటు అరవై సంవత్సరాల కనిష్టస్థాయి 6.5 – 7 శాతానికి పడిపోయే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా ఇటీవలే ఒక నివేదికలో పేర్కొంది. రుణ మంజూరీల విషయం లో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ►చమురు గ్యాస్, సోలార్, రహదారుల రంగాల నుంచి బ్యాంకులకు రుణాల డిమాండ్ వస్తోంది. ►అమెరికా–ఇరాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీస్తాయి. ఇది కరెంట్ అకౌంట్‌లోటు, కరెన్సీ విలువపైనా ప్రభావం చూపే అంశం. ► కొన్ని ప్రతికూలతలు ఉన్నా మొత్తంగా ప్రభుత్వ ఫైనాన్షియల్ పరిస్థితులు బాగున్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు (జీడీపీలో 3.3 %) కట్టడిలో ఉండాలని డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ప్రభుత్వం పట్టంచుకుంటుందని భావించడం లేదు. 2019– 20 ఆరి్థక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3%) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు(బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి) చేరింది. -
మళ్లీ లాభాల్లోకి సెయిల్
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం సెయిల్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో లాభాల బాట పట్టింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.771 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.816 కోట్ల నికర లాభాలు (స్టాండ్అలోన్) వచ్చాయని సెయిల్ తెలిపింది. ఆదాయం బాగా పెరగడంతో ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.14,544 కోట్ల నుంచి రూ.17,265 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,833 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.482 కోట్లకు తగ్గాయని సెయిల్ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సెయిల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.76 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ లాభం 78% డౌన్
న్యూఢిల్లీ: మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా తగ్గింది. టారిఫ్‌ల యుద్ధం తీవ్రంగా ఉండటం, అంతర్జాతీయ టెర్మినేషన్ చార్జీల్లో కోత కారణంగా గత క్యూ4లో నికర లాభం 78 శాతం తగ్గినట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.373 కోట్లుగా (ఒక్కో షేర్‌కు 93 పైసలు) ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.83 కోట్లకు (ఒక్కో షేర్‌కు 21 పైసలు) తగ్గిందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.21,935 కోట్ల నుంచి 11 శాతం తగ్గి రూ.19,634 కోట్లకు చేరింది. భారత ఆదాయం 8 శాతం తగ్గి రూ.14,796 కోట్లకు చేరిందని, ఆఫ్రికా ఆదాయం మాత్రం 11 శాతం ఎగసిందని గోపాల్ తెలియజేశారు. మొబైల్ డేటా ట్రాఫిక్ 505 శాతం వృద్ధితో 1,616 బిలియన్ మెగాబైట్లకు పెరిగింది. నికర రుణ భారం రూ.91,714 కోట్ల నుంచి రూ.95,228 కోట్లకు పెరిగింది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్ఓసీఈ) 6.5 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గిందని, ఇబిటా తక్కువగా ఉండటం, స్పెక్ట్రమ్ వ్యయాలు పెరగడం, భారత్‌లో పెట్టుబడులు కొనసాగడం, తదితర అంశాలు దీనికి కారణాలని గోపాల్ విట్టల్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌గా రూ.2.5ను ఇవ్వనున్నామని, గతంలో ప్రకటించిన మధ్యంతర డివిడెండ్ రూ.2.84 కలుపుకుంటే, మొత్తం డివిడెండ్ గత ఆర్థిక సంవత్సరానికి రూ.5.34గా ఉంటుందని తెలియజేశారు. రూ. 24,000 కోట్ల పెట్టుబడులు... ఇంత తక్కువ నికర లాభం సాధించడం 14 ఏళ్లలో కంపెనీకి ఇదే తొలిసారి. 2004, ఏప్రిల్–జూన్ క్వార్టర్ తర్వాత అతి తక్కువ లాభం వచ్చిన క్వార్టర్ ఇదే. నికర లాభం తగ్గడం ఇది వరుసగా ఎనిమిదో క్వార్టర్. కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన రిలయన్స్ జియో ఉచితవాయిస్ కాల్స్‌ను, కారు చౌకగా డేటా ఆఫర్లను ఇస్తుండటంతో ఈ కంపెనీ లాభాలు హరించుకుపోయాయి. కృత్రిమంగా తగ్గిస్తున్న ధరలతో టెలికం పరిశ్రమపై వ్యయాల భారం కొనసాగుతోందని గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ టెర్మినేషన్ చార్జీల తగ్గింపు వల్ల పరిశ్రమ ఆదాయం భారీగా తగ్గిందన్నారు. నేరుగా రిలయన్స్ జియోను ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.3,800 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 71% తగ్గి రూ.1,099 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12% తగ్గి రూ.83,688 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.24,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే స్థాయిలో పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. కొనసాగిన అగ్రస్థానం... టెలికం పరిశ్రమలో గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో అగ్రస్థానాన్ని కొనసాగించామని గోపాల్ పేర్కొన్నారు. గత క్యూ4లో కోటిన్నర మంది కొత్తగా ఎయిర్టెల్ వినియోగదారులయ్యారని, డేటా సామర్థ్యం పెంపునకు సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, ఎయిర్టెల్ టీవీ ద్వారా వినూత్నమైన డిజిటల్ కంటెంట్‌ను అందివ్వడం, వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఆఫర్లనందించడం, తదితర కారణాల వల్ల ఈ స్థాయిలో కొత్త వినియోగదారులు లభించారని వివరించారు. ప్రస్తుతం తమకు 16 దేశాల్లో 41.38 కోట్ల మంది వినియోగదారులున్నారని, వినియోగదారుల సంఖ్య 12 శాతం వృద్ధి చెందిందని వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.406 వద్ద ముగిసింది. -
దూసుకుపోయిన ఎం అండ్ ఎం
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఇవాల్టి (బుధవారం) మార్కెట్లో దూసుకుపోతోంది. క్యూ4 ఫలితాలు, 2018 ఆర్థిక సంవత్సరానికి మెరుగైన గైడెన్స్ అంచనాల నేపథ్యంలో ఎంఅండ్ ఎం 6 శాతానికిపైగా లాభపడింది. మార్చి క్వార్టర్లో 26.3 శాతం వృద్ధిని, రూ. 874 కోట్ల నికర లాభాలను నమోదు చేయడంతో ఫ్టాట్ మార్కెట్లో టాప్ గెయినర్‌గా నిలిచింది. తద్వారా 8 నెలల గరిష్టాన్ని నమోదుచేసింది. ఎం అండ్ ఎం మొత్తం ఆదాయం ఇతర ఆదాయంతో సహా 5 శాతం పెరిగి రూ .12,889 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో వార్షిక లాభం రూ .4050 కోట్లకు చేరింది. గత ఏడాది క్వార్టర్లో ఇది రూ.3,554 లుగా ఉంది. ఏకీకృత ఆదాయం 10.6 శాతం పెరిగి రూ .88,983 కోట్లకు చేరింది. దాదాపు 130,778 వాహనాలను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఇది ఫ్లాట్ దేశీయ మార్కెట్లో అమ్మకాలు 13.3 శాతం పెరిగి 46,583 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ ఎగుమతులు 10, 831 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే సుప్రీంకోర్టు (2017 ఏప్రిల్ 1 నుంచి) ద్వారా బీఎస్-3 వాహనాల విక్రయాలపై ఆంక్షలు విధించటంతో ఈ కంపెనీ ఒక్కసారిగా రూ. 171 కోట్ల నష్టపోయిన సంగతి తెలిసిందే. సెడాన్, యుటిలిటీ వాహన విభాగంలో 30 శాతం మార్కెట్ వాటాలో తాము సంతోషంగా లేమనీ, తీవ్రమైన పోటీతో మార్కెట్ వాటాను కోల్పోయామ ని మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన పనితీరును నమోదు చేసే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఎంఅండ్ఎం షేరులో ట్రేడ్ పండితులు బై కాల్ ఇస్తున్నారు. బ్రోకింగ్ సంస్థ సీఎల్ఎస్ఏ తాజాగా రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై ఆసక్తి చూపుతున్నట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. -
ఐవోసీ లాభం 85% అప్
⇔ క్యూ4లో రూ.3,720 కోట్లు ⇔ కలిసొచ్చిన అధిక రిఫైనరీ మార్జిన్లు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఐవోసీ మార్చి త్రైమాసికానికి సంబంధించి బంపర్ ఫలితాలను ప్రకటించింది. అధిక రిఫైనరీ మార్జిన్ల అండతో కంపెనీ లాభం ఏకంగా 85 శాతం పెరిగి రూ.3,720 కోట్లకు చేరుకుంది. షేరు వారీ ఆర్జన రూ.7.85గా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన లాభం రూ.2,000 కోట్లే. లాభాల్లో భారీ వృద్ధికి అధిక రిఫైనరీ మార్జిన్లకు తోడు ఇన్వెంటరీ గెయిన్స్ కారణమని ఐవోసీ చైర్మన్ బి.అశోక్ విలేకరులకు తెలిపారు. ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.1,22,285 కోట్లుగా నమోదైంది. దేశంలో అతి పెద్ద రిఫైనరీ సంస్థ అయిన ఐవోసీ మార్చి త్రైమాసికంలో 17.1 మెట్రిక్ టన్నుల ముడి చమురును శుద్ధి చేసింది. ప్రతీ బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు 8.95 డాలర్లను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది కేవలం 3 డాలర్లుగానే ఉండడం గమనార్హం. 2015–16 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఇన్వెంటరీ పరంగా కంపెనీ రూ.3,417 కోట్ల నష్టాలను ఎదుర్కోగా... తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,634 కోట్ల ఇన్వెంటరీ లాభాలు మెరుగైన ఫలితాలకు కారణమయ్యాయి. కంపెనీ ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేసి విక్రయించే లోపు ధరలు పెరిగితే దాన్ని ఇన్వెంటరీ లాభాలుగా పేర్కొంటారు. ఒకవేళ ధరలు తగ్గితే నష్టాలు ఎదురవుతాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్టాండలోన్ లాభం 11,242 కోట్ల నుంచి రూ.19,160 కోట్లకు వృద్ది చెందింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభంగా ఐవోసీ చైర్మన్ అశోక్ పేర్కొన్నారు. ఎగుమతులు సహా 2016–17లో 83.49 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను విక్రయించినట్టు చెప్పారు. ఇంధన రిటైలింగ్ వ్యాపార విస్తరణ కొనసాగుతుందని అశోక్ చెప్పారు. కాగా, షేరు ఒక్కింటికీ రూ.1 తుది డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. -
బ్యాంకు ఆఫ్ ఇండియా మళ్లీ కుదేలు
ముంబై : దేశంలోనే ఆరో అతిపెద్ద రుణదాత బ్యాంకు ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరోసారి భారీ నష్టాలను నమోదుచేసింది. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో ఈ బ్యాంకు నికర నష్టాలు 1,046 కోట్లగా ఫైల్ చేసింది. బ్యాడ్ లోన్స్ శాతం తగ్గకుండా అలానే అత్యధికంగా ఉండటంతో బ్యాంకుకు మరోసారి భారీ నష్టాలే నమోదయ్యాయి. అయితే ముందటి ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది కొంత నష్టాలను బ్యాంకు ఆఫ్ ఇండియా తగ్గించుకుంది. గతేడాది ఈ బ్యాంకు నష్టాలు రూ.3,587 కోట్లు. డిసెంబర్ క్వార్టర్ లో బ్యాంకు రూ.102 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. గత క్వార్టర్ కంటే ఆస్తుల నాణ్యత క్షీణించిందని బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం బ్యాంకుకు 9 శాతం పెరిగి రూ.3469 కోట్లగా నమోదయ్యాయని తెలిపింది. ముందటి ఆర్థిక సంవత్సరం ఈ వడ్డీ ఆదాయాలు రూ.3187 కోట్లు. బ్యాంకు ఆస్తుల నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణం స్థూల నిరర్థక ఆస్తులు పెరగడమేనని తెలిసింది. డిసెంబర్ క్వార్టర్ లో రూ.51,781 కోట్లగా ఉన్న ఈ స్థూల నిరర్థక ఆస్తులు, ఈ క్వార్టర్ లో రూ.52,044 కోట్లకు పెరిగాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఇవి రూ.49,879 కోట్లు. మొత్తం రుణాల్లో బ్యాడ్ లోన్స్ అలానే అత్యధికంగా 13.22 శాతంగా ఉన్నాయి. గత క్వార్టర్ లో ఇవి 13.38 శాతం. ఫలితాల ప్రకటనాంతరం బ్యాంకు ఆఫ్ ఇండియా షేర్లు 7 శాతం మేర నష్టపోయి, రూ.166 వద్ద నమోదవుతున్నాయి. -
ఐడీబీఐకి బ్యాడ్ లోన్ల బెడద
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ గత ఏడాది క్యూ4 ఫలితాల్లో ఢమాల్ అంది. గురువారం విడుదల చేసిన జనవరి-మార్చి క్వార్టర్ ఫలితాల్లో భారీగా నష్టపోయింది. ముఖ్యంగా తమ లోన్లలో అయిదుశాతం బాడ్ లోన్లుగా మారినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో క్యూ4లో బ్యాంకు నికర నష్టం 84శాతం ఎగిసి రూ. 3,200 కోట్లగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,736 కోట్లగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 14 శాతం పెరిగి రూ. 1633 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 15.6 శాతం నుంచి 21.25 శాతానికి ఎగశాయి. ఐడిబిఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 27 శాతం పెరిగి రూ. 44,753 కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. ఐడీబీఐ బ్యాంకు మొత్తం అభివృద్ధిలో నికర అసంతృప్త ఆస్తులు భారీగా పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో 9.61 శాతంతో పోలిస్తే 13.21 శాతం పెరిగాయి. నికర ప్రొవిజన్లు రూ. 4450 కోట్ల నుంచి రూ. 6209 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 9శాతానికిపైగా పతనమైంది. గత మూడు నెలల్లో నిఫ్టి బ్యాంక్‌లో 12 శాతం లాభంతో పోలిస్తే ఐడిబిఐ బ్యాంకు షేర్లు 13 శాతం పడిపోయాయి.