RTC buses
-
కొత్తగా 500 బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కొత్తగా 500 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలులోకి రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. ఈ సంఖ్య 35 లక్షల నుంచి 66 లక్షలకు పెరిగింది. దీంతో బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తగా 500 బస్సులు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించబోతోంది. కనీసం 4 వేలు అవసరం.. ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో వంద శాతం దాటుతోంది. ప్రత్యేక సందర్భాల్లో అది 106 శాతాన్ని మించుతోంది. ఇప్పటికే చాలా బస్సులు పాతవై మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. పాత బస్సుల్లో దాదాపు వేయి వరకు తొలగించాల్సి ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు నాలుగు వేల బస్సుల అవసరం ఉంది. కానీ అన్ని సమకూర్చుకునే పరిస్థితి ఆర్టీసీకి లేదు. దీంతో కొన్నికొన్ని బస్సులు పెంచుకుంటూపోవాలని సంస్థ భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే తిరిగేలా చూడాలని ఆదేశించటంతో ఆమేరకు చర్యలు ప్రారంభించింది. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు కోరుతోంది. 2800బస్సులు మంజూరు చేయాలని దరఖాస్తు చేసింది. అవన్నీ సబ్సిడీ ద్వారా సరఫరా అవుతాయి. ఆర్టీసీ సొంతంగా వాటిని కొనదు. జీసీసీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలు వాటిని టెండర్ల ద్వారా పొంది ఆర్టీసీకి అద్దెకిస్తాయి. అవి దశలవారీగా ఆర్టీసీకి చేరుతాయి. అవి వచ్చే కొద్దీ వాటి సంఖ్యకు సమానంగా నగరంలోని డీజిల్ బస్సులను జిల్లాలకు తరలిస్తారు. జిల్లాలకు తరలే బస్సుల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులే ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులుగా మార్పుచేసి జిల్లాల్లో వాడతారు. దీనివల్ల కొంత కొరత తీరుతుంది. ఇక సొంతంగా కొత్త బస్సులు 500 కొంటే చాలావరకు సమస్య పరిష్కారమవుతుందని సంస్థ భావిస్తోంది. వాటి కొనుగోలుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరబోతోంది. ఆ సిబ్బంది కొత్త బస్సులకు...హైదరాబాద్‌లో తిరుగుతున్న డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోవాలన్న నిర్ణయంతో పెద్ద సంఖ్యలో సిబ్బంది మిగిలిపోనున్నారు. అద్దె బస్సులకు డ్రైవర్లు, మెకానిక్‌లు ప్రైవేటు వారే ఉండనున్నందున ఆర్టీసీ సిబ్బంది జిల్లాలకు తరలాల్సి ఉంటుంది. జిల్లాల్లో ఉన్న ఖాళీలు భర్తీ కాగా, మిగతావారు అదనంగా మారతారు. ఇప్పుడు కొత్తగా కొనే ఐదొందల బస్సులకు దాదాపు 1,300 మంది సిబ్బంది అవసరమవుతారు. ఆ అదనపు సిబ్బందిని ఈ బస్సులకు వినియోగించుకోవటం ద్వారా సర్దుబాటు చేస్తారు. ఇక మరో 3 వేల మందిని కొత్తగా నియమించుకునే ప్రతిపాదన పెండింగులో ఉంది. అలా వచ్చే వారిని కూడా ఈ కొత్త బస్సులతోపాటు ఇతరత్రా ఖాళీల్లో భర్తీ చేస్తారు. -
ఖర్చులు వెల్లడిస్తాం
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరకు చేసిన ఖర్చుల వివరాలను వెల్లడిస్తామని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను సోమవారం దర్శించుకున్న అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. జాతరకు డబ్బు లేదనకుండా ఖర్చు చేసి ఏర్పాట్లు చేశామన్నారు. గత ప్రభుత్వం జాతరకు మూడు వేల బస్సులను నడిపితే.. ఈ ప్రభుత్వం ఆరువేల బస్సులు నడుపుతోందన్నారు. ఇప్పటివరకు వనదేవతలను 17 లక్షల మంది మహిళలు దర్శించుకున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ రానంతమంది ఈసారి జాతరకు వచ్చిపోతున్నారని, వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. క్రమశిక్షణ, స్వీయ రక్షణతో జాతరకు వచ్చివెళ్లాలని, వాహనాలను ఓవర్టేక్ చేసి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. -
TSRTC: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వినియోగించనుండటంతో సాధారణ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈసారి జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భారీ సంఖ్యలో బస్సులను సమకూర్చింది. 4,479 ఆర్టీసీ బస్సులతో పాటు పాఠశాల, కళాశాల బస్సుల్లాంటి ప్రైవేటు వాహనాలు మరో 1,500 వరకు ఏర్పాటు చేసింది. ఇలా సుమారు 6 వేల బస్సులు ఐదు రోజుల పాటు మేడారం భక్తుల సేవలో ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నిర్దిష్ట ప్రాంతాలకు తరలిపోవడంతో బస్స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే సాధారణ ప్రయాణికుల తిప్పలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం. ‘మహాలక్మి’తో పెరిగిన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులో ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే మహిళల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఆటోలు లాంటి ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారిలో 90 శాతం మంది బస్సుల వైపు మళ్లారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల మేర ఉంటోంది. ఫలితంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకేసారి ఇన్ని బస్సులు అందుబాటులో లేకుండాపోతే పరిస్థితి గందరగోళంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిరోజే అవస్థలు రాష్ట్రంలోని 51 కేంద్రాల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడవాల్సి ఉంది. దీంతో విడతల వారీగా బస్సులు ఆయా కేంద్రాలకు తరలిపోతున్నాయి. సోమవారం దాదాపు 550 బస్సులు వెళ్లాయి. హైదరాబాద్ నగరం నుంచి కూడా 250 బస్సులు వెళ్లిపోయాయి. సాధారణంగా సోమవారాల్లో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్పేర్ బస్సులు సహా అన్ని బస్సులను తిప్పినా ఆ రోజు రద్దీని తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. గత సోమవారం ఏకంగా 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో తిరిగారు. ఈ సోమవారం కొన్ని బస్సులు మేడారం జాతరకు వెళ్లిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. బస్సులు సరిపోక తోపులాటలు చోటు చేసుకున్నాయి. నగరంలో ఫుట్‌బోర్డులపై వేళ్లాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ఇక బుధవారం నుంచి మిగతా బస్సులు వెళ్లిపోతే పరిస్థితి ఏంటని అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సాధారణ రోజుల్లోలాగే బుధవారం తర్వాత కూడా రద్దీ ఉంటే మేడారం డ్యూటీ బస్సుల్లో కొన్నింటిని తిరిగి వాపస్ పంపే యోచనలో ఉన్నారు. కానీ మేడారం ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి రైల్వే అధికారులు 30 ప్రత్యేక రైళ్లను మేడారం కోసం తిప్పుతున్నారు. ఒక రైలులో 1,500 మంది ప్రయాణికులు వస్తారు. మేడారం వరకు రైల్వే లైన్ లేనందున ఎక్కువ మంది కాజీపేట, వరంగల్, మహబూబాబాద్ స్టేషన్లలో దిగుతారు. దీంతో రైలు వచ్చే సమయానికి ఒక్కో స్టేషన్ వద్ద 30కి పైగా బస్సులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద వచ్చే ఆదివారం వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. 👉: తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సులు హౌస్‌ఫుల్ (ఫొటోలు) -
గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు. -
మహా రద్దీ..
సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకం’ ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద సవాలుగా మారింది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. ‘మహాలక్ష్మి’తర్వాత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య దాదాపు 13 లక్షల మేర పెరిగింది. గతంలో 66 శాతంగా ఉన్న ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 90 శాతానికి చేరుకుంది. కొన్ని మార్గాల్లో అది వందశాతం కూడా దాటింది. అంటే సీట్ల సామర్థ్యం కంటే ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రయాణికులు 70 శాతం సీట్లలో కూర్చుంటున్నారు. దీంతో మిగతా మహిళలు, పురుషులు నిలబడే ప్రయాణించాల్సి రావడం వివాదాలకు కారణమవుతోంది. బస్సులు సరిపోక... పెరిగిన రద్దీని క్రమబద్ధికరించాలంటే బస్సుల సంఖ్య భారీగా పెంచాలి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సగటున 41 లక్షల మంది, రద్దీ ఎక్కువగా ఉండే సోమవారాల్లో 51 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా ఉంటోంది. మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంది. ఈ కేటగిరీ బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలో 7292 బస్సులు మాత్రమే ఉన్నాయి. నిజానికి ఆర్టీసీ డిపోల్లో ఉన్న అన్ని బస్సులు రోజూ రోడ్డెక్కవు. వాటిల్లో కొన్ని బ్రేక్‌డౌన్‌లో ఉంటాయి. కొన్ని ఇతర అవసరాల కోసం స్పేర్‌లో ఉంటాయి. సాధారణ రోజుల్లోనే బస్సులు సరిపోక ట్రిప్పులకు ఇబ్బంది అవుతూ వస్తున్న తరుణంలో, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అమలులోకి రావటంతో బస్సులకు ఒక్కసారిగా తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వంద శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుండటంతో అదనపు ట్రిప్పు నడపాల్సి వస్తోంది. కానీ బస్సులు అందుబాటులో లేక సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఫలితంగా, ప్రయాణికులతో కిక్కిరిసి నడపాల్సి వస్తోంది. స్థలం సరిపోక కొందరు ప్రయాణికులు దిగిపోవాల్సి వస్తోంది. దీంతో అదనపు బస్సు నడపాలంటూ వారు సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు 4 వేల బస్సులు కావాల్సిందే.. ప్రస్తుత రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఇప్పటికిప్పుడు దాదాపు 4 వేల వరకు కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. గతంలోనే ఆర్టీసీ రెండు వేల బస్సులకు ఆర్డరిచ్చింది. వాటిల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు 1,500 వరకు ఉంటాయి. కానీ ఆ బస్సులు అందుబాటులోకి రావాలంటే ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది. వచ్చే మార్చి చివరి నాటికి అవి దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. మరో 20 రోజుల్లో 50 బస్సులు అందనున్నాయి. కానీ అప్పటి వరకు ఈ రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రయాణికులు–ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని సంతోషపడుతున్నా.. రోజూ నిలబడి ప్రయాణించటం ఇబ్బందిగా భావించేవారు మళ్లీ ఆటోల వైపు మళ్లుతారు. దీంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో కొంత పడిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే నాలుగు వేల బస్సులు కావాలి. కానీ, అన్ని బస్సులు సమకూర్చుకోవటానికి ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త బస్సుల అంశాన్ని ప్రస్తావించలేదు. ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా.. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది. వాటిలో 500 బస్సులు సిటీ సర్వీసులుగా తిరుగుతాయి. నగరంలో ఓఆర్ 90 శాతాన్ని దాటింది. అంత లోడ్‌ను ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. లాగినా, బ్యాటరీలు ముందుగానే డిస్ఛార్జి అవుతాయని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అద్దె బస్సుల నోటిఫికేషన్ సమస్య నుంచి గట్టెక్కాలంటే వెంటనే కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున, ఆర్టీసీ అధికారులు మరోసారి అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అద్దె బస్సులు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ప్రస్తుతం రద్దీ విపరీతంగా పెరిగినందున, పాత అద్దె రేట్లకు బస్సులు పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు సుముఖంగా లేరు. అద్దె చార్జీలు సవరించాలని కోరుతున్నారు. సవరిస్తే ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతుంది. వారంలో 50 కొత్త బస్సులు: ఎండీ సజ్జనార్ కొత్తగా వచ్చే బస్సుల నమూనాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం పరిశీలించారు. వాటిల్లో లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. సంక్రాంతి నాటికి 200 బస్సులు రోడ్డెక్కుతాయని, వీటిలో 50 బస్సులు వారం రోజుల్లో అందుతాయని సజ్జనార్ వెల్లడించారు. నాలుగైదు నెలల్లో విడతలవారీగా 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 రాజధాని, 540 ఎలక్ట్రిక్ సిటీ బస్సులు, నగరం వెలుపల తిరిగేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుతాయని వెల్లడించారు. -
‘మండే’ మహాలక్ష్మి@ 31లక్షలు
‘‘సోమవారం ఒక్కరోజే ఆర్టీసీ బస్సుల్లో 51 లక్షల మంది ప్రయాణించారు... ఇది ఆర్టీసీ చరిత్రలోనే ఒక రికార్డు... అందులోనూ మహిళల సంఖ్య 31 లక్షలు ఉండటం కనీవినీ ఎరుగని రికార్డు’’ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాకే ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో ఇలా నిండిపోతున్నాయి. సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆరు గార్యంటీల్లో భాగంగా ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో వాస్తవరద్దీ ఎంత ఉంటుందో అంచనా వేయటం కష్టం. సాధారణ రోజుల్లో కంటే సోమవారాల్లో బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆరోజు దాదాపు 35 లక్షల మంది వరకు బస్సుల్లో ప్రయాణిస్తారు. సాధారణ రోజుల్లో ఆ సంఖ్య 28 లక్షల మేర ఉంటుంది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజువారీ ఆదాయం రూ.14 లక్షలుంటే, సోమవారాల్లో రూ.18 లక్షల వరకు ఉంటుంది. అలాంటిది 11వ తేదీ సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో ఏకంగా 51 లక్షల మంది ప్రయాణించినట్టు ఆర్టీసీ లెక్క తేల్చింది. ఇందులో టికెట్ తీసుకున్న ప్రయాణికుల సంఖ్య 20.87 లక్షలుగా పేర్కొంది. అంటే మిగతావారు మహిళలే అని స్పష్టమవుతోంది. ఒక్కరోజే రూ.7 కోట్లు తగ్గిన ఆదాయం: సోమవారాల్లో రద్దీకి అనుగుణంగా ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. సగటున రూ.18.50 కోట్ల మేర ఆదాయం వస్తుంది. ఈ సోమవారం ప్రయాణికుల సంఖ్య 51 లక్షలు నమోదైనందున ఆదాయం కూడా భారీగానే పెరగాలి. కానీ ఇందులో మహిళల సంఖ్య 60 శాతానికి పైగా ఉన్నందున ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వారి నుంచి నయా పైసా ఆదాయం రాలేదు. దీంతో ఈ సోమవారం కేవలం రూ.11.74 కోట్ల ఆదాయం మాత్రమే రికార్డయ్యింది. జీరో టికెట్ విధానం వస్తేనే కచ్చితమైన లెక్కలు మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమే అయినా, టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తారో ఆ వివరాలతో కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. టికెట్‌పై చార్జీ స్థానంలో సున్నా అని ఉంటుంది. కానీ, వాస్తవానికి వారి నుంచి ఎంతచార్జీ వసూలు చేయాల్సి ఉందో ఆ టికెట్ ద్వారా అధికారులకు తెలుస్తుంది. నెల ముగియగానే ఆ టికెట్ల మొత్తాన్ని గుణించి ప్రభుత్వానికి అందిస్తే అక్కడి నుంచి రీయింబర్స్ అవుతుంది. ప్రస్తుతం టికెట్ జారీ యంత్రాల సాఫ్ట్వేర్ ఇంకా అప్డేట్ కానందున జీరో టికెట్ జారీ కావటం లేదు. మహిళల సంఖ్య కండక్టర్లు మాన్యువల్‌గా లెక్కించి రాస్తున్నారు. దీంతో వారి సంఖ్యలో కొంత తేడా ఉండే అవకాశం ఉంది. -
ఆర్టీసీకి ‘ఎన్నికల గిరాకీ’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ ఆర్టీసీకి మంచి బేరం దొరుకుతోంది. ఆర్టీసీ బస్సుల బుకింగ్ రాజకీయ పార్టీలకు మంచి వెసులుబాటుగా ఉంటుండగా, సంస్థకు సైతం లాభసాటిగా మారుతోంది. గత నెల రోజుల వ్యవధిలోనే రాజకీయ పార్టీలు తమ సభలకు దాదాపు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి. భలే మంచి ఆదాయ మార్గం.. ఆర్టీసీ బస్సులకు పండుగ రోజులు, శుభ ముహూర్తాలున్న రోజుల్లోనే ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటుంది. మిగతా రోజుల్లో సగటున 62 శాతం నుంచి 65 శాతం వరకు ఉంటుంది. అయితే, రాజకీయ సభలకు బస్సులను అద్దెకిస్తే మంచి ఆదాయం వస్తుంది. వారికి అద్దెకిచ్చిన సమయంలో బస్సుల్లో ఎంతమంది ఎక్కారన్న సంఖ్యతో నిమిత్తం లేకుండా.. 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోను లెక్కగడ తారు. అంటే.. ప్రతి సీటుకు టికెట్ జారీ చేసినట్టన్న మాట. ఈ లెక్కన ఒక్కో బస్సుకు రూ.20 వేల నుంచి 24 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం దసరా పండుగ రద్దీ అధికంగా ఉంది. మరమ్మతుల కోసం డిపోలకే పరిమితమైన బస్సులను కూడా సిద్ధం చేసి ప్రయాణికుల కోసం పంపుతుంటారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప, సాధారణ రోజుల్లో వీలైనన్ని బస్సులను అధికారులు పార్టీలకు కేటాయిస్తున్నారు. పార్టీలకు అద్దెకివ్వటం ద్వారా ఆదాయం ఎక్కువగానే వస్తున్నా.. ఆర్టీసీ మాత్రం తొలి ప్రాధాన్యం ప్రయాణికుల సేవకే ఇస్తుండటం విశేషం. గత నెల కొల్లాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. దానికి దాదాపు 2 వేల బస్సులను బుక్ చేశారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల మొదటి వారంలో రెండు రోజుల తేడాతో రెండు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారు. ఆ సందర్భంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో భారీ బహి రంగ సభలు నిర్వహించారు. వీటికి దాదాపు రెండు వేల బస్సులను బుక్ చేశారు. రాహుల్‌గాంధీ ఇటీ వల తెలంగాణ పర్యటనలో నిర్వహించిన సభలకు కూడా ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తు న్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, జడ్చర్ల, భువనగిరి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్నింటికి ప్రైవేటు వాహనాలను బుక్ చేస్తే, కొన్నింటికి ఆర్టీసీ బస్సు లను బుక్ చేశారు. ఇటీవల కేంద్రమంత్రులు రాజ్ నాథ్‌సింగ్, అమిత్‌షాలు బహిరంగ సభలు నిర్వ హించారు. గత నెల రోజుల్లో అన్ని పార్టీలు దాదాపు 12 వేలకుపైగా బస్సులను బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఒక్కో బస్‌కు సగటున రూ.20 వేల చొప్పున చెల్లిస్తుండటంతో వీలైనన్ని బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఆదాయాన్ని పొందే ప్రయ త్నంలో ఆర్టీసీ ఉంది. దసరా, దీపావళి, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి లాంటి పండుగల వేళ ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ఆ సంస్థ 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో సిబ్బందికి ప్రత్యేక టార్గెట్లను కేటాయించింది. ఇందులో ఎన్నికల అంశాన్ని కూడా చేర్చటం విశేషం. రాజకీయ పార్టీలకు బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందాలన్న ఆదేశాలు మౌఖికంగా వెలువడ్డాయి. పార్టీలకు కూడా సౌలభ్యమే.. పెద్ద నేతలు పాల్గొన్న బహిరంగ సభలకు పార్టీ నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఇందుకు వారికి వందల సంఖ్యలో వాహనాలు అవసరమవుతాయి. ప్రైవేటు వాహనాలను సమీకరించుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సులయితే కావాల్సినన్ని సిద్ధంగా ఉంటాయి. దీంతో ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవటం వారికి వెసులు బాటుగా మారింది. పైగా వ్యాన్లు లాంటి ప్రైవేటు వాహనాల ఖర్చుతో పోలిస్తే, ఆర్టీసీ బస్సుల ఛార్జీనే తక్కువగా ఉంటుంది. -
సీసీ కెమెరాలు తిప్పేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోణంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లను భయపెడుతున్నాయి. తమపై నిఘా కోసమే వాటిని ఏర్పాటు చేశారన్న అపోహలో ఉన్న డ్రైవర్లు గుట్టు చప్పుడు కాకుండా కెమెరాలను ఓ పక్కకు తిప్పేస్తున్నారు. దీంతో బస్సులోపల ప్రయాణికులు ఉండే భాగం కాకుండా, బస్సు గోడలు, కిటికీల ప్రాంతం కెమెరాల్లో రికార్డు అవుతోంది. తాజాగా బస్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అలాంటి డ్రైవర్లకు సీసీ కెమెరాలపై అపోహలు తొలగిపోయేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చర్యలు తీసుకుంటారన్న భయంతో..: ఇటీవలే ఆర్టీసీ దాదాపు 700 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సమకూర్చుకుంది. ఇప్పటి వరకు కొన్ని ఏసీ బస్సుల్లో తప్ప మిగతా ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు లేవు. బస్సులో ఏ ఘటన జరిగినా స్పష్టంగా తెలుసుకునే వీలు లేకుండా పోతోంది. దీంతో ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని భావించి, కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇలా కొత్త సూపర్ లగ్జరీ బస్సులను కంపెనీ నుంచి వచ్చినవి వచ్చినట్టు రోడ్డెక్కిస్తున్నారు. ఆ బస్సుల్లో లోపల డ్రైవర్ క్యాబిన్ ఎదురుగా ఒక కెమెరా, డ్రైవర్ క్యాబిన్ వెనక మరో కెమెరా ప్రయాణికులు కనిపించేలా ఉంటాయి. మరో కెమెరా బస్సు వెనక రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు సౌలభ్యం కలిగించేలా ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాబిన్ ముందువైపు ఉన్న కెమెరాను చూడగానే డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సస్పెన్షన్ వేటు పడుతుండటమే దీనికి కారణం. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ వినియోగం సాధారణ విషయంగా మారింది. ఇంటి నుంచి కాల్ వచ్చినా, అత్యవసర పనులకు సంబంధించి ఫోన్ కాల్‌వచ్చినా డ్రైవర్లు మాట్లాడేస్తుంటారు. అయితే బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడటాన్ని నేరంగా పరిగణిస్తారు. అలాగే కొందరిలో డ్రైవింగ్‌లో అప్పుడప్పుడు ఏమరపాటు వ్యక్తమవుతుంటుంది. ఇలాంటివన్నీ సీసీ కెమెరాలో రికార్డు అవుతాయి. ఇది తమపై చర్యలకు కారణమవుతుందేమోనన్నది డ్రైవర్ల భయానికి కారణంగా ఉంటోందని అధికారులంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు సంకటం.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అడ్వాన్సు టికెట్ బుకింగ్ సమయంలో డ్రైవర్ ఫోన్ నంబర్‌ను కూడా తెలియజేస్తారు. ప్రయాణికులు ఆ నంబర్‌కు ఫోన్ చేసి బస్సు ఎక్కడి వరకు వచ్చిందో వాకబు చేస్తుంటారు. కాగా, విశాఖపట్నం, బెంగళూరు లాంటి దూర ప్రాంతాల సర్విసులు మినహా మిగతా బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. ప్రయాణికుల నుంచి ఫోన్ కాల్ వస్తే అతనే మాట్లాడాల్సి వస్తోంది. ఇది రికార్డయితే, దానిని కూడా నేరంగా పరిగణిస్తారన్న భయం డ్రైవర్లలో ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బస్సులో కెమెరా యాంగిల్‌ను తిప్పేస్తున్నారన్నది అధికారుల మాట. దీంతో డ్రైవర్లలో అపోహలు తొలగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ కెమెరాలు ప్రయాణికుల భద్రత కోసమే కేటాయించాన్న విషయాన్ని తెలిపి, వారిలో ఆందోళన పోగొట్టాలని అధికారులు నిర్ణయించారు. -
ఆర్టీసీ కొత్త టికెట్! రూ.50 చెల్లించు.. 12 గంటలపాటు బస్సుల్లో ప్రయాణించు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టి9-30 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్ కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు వారు తెలిపారు. (చదవండి: పెద్దపల్లిలో విషాదం.. సబితం జలపాతం వద్ద జారిపడి విద్యార్థి మృతి) ఎక్కడ తీసుకోవాలంటే? ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 (గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ను వారు ఇస్తారని వెల్లడించారు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుందని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. టి9-30 టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. (చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్) అందరికీ ‘టి9-60 టికెట్’ వర్తింపు ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్ ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. టి9-30 టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. -
ఆర్టీసీ డ్రైవర్ రాములుకు సజ్జనార్ అభినందన!
జగిత్యాల: ఆర్టీసీ డ్రైవర్ రాములును ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు కిందపడి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా, డ్రైవర్ రాములు వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ఈ సంఘటనలో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎండీ సజ్జనార్.. డ్రైవర్‌ను అభినందించారు. ‘చాకచక్యం, అప్రమత్తతతో నిండు ప్రాణం నిలిచింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మహిళ ప్రా ణాలు కాపాడిన డ్రైవర్ రాములుకు అభినందనలు’ అని సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమయస్పూర్తితో వ్యవహారించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన మెట్పల్లి డిపో డ్రైవర్ పి.రాములుకు అభినందనలు. డ్రైవర్ చాకచాక్యం, అప్రమత్తత వల్ల ఓ నిండు ప్రాణం నిలిచింది. మెట్పల్లిలో జగిత్యాలకు వైపునకు వెళ్తొన్న బస్ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. బస్ కదలిక గమనించిన… pic.twitter.com/fylJs7zsH5 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 21, 2023 -
ఉచిత ప్రయాణాల ప్రభావం... ఆటో డ్రైవర్ల ఉపాధికి దెబ్బ
కర్ణాటక: ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు కల్పించడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆటోలు, కార్లు నడిపిస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తాజాగా మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడంతో వీరు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. గంగావతి తదితర పట్టణాలకు రాకపోకలు సాగిస్తూ నిత్యం రూ. 1500 వరకు సంపాదించేవారు. కంప్లి నుంచి రాంసాగర, దేవసముద్ర, కృష్ణానగర్ క్యాంప్, కంప్లి కొట్టాల తదితర గ్రామాలకు రాకపోకలు సాగించే ఆటో డ్రైవర్ల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఆటోల వద్దకు మహిళలు రావడమే కష్టంగా మారింది. వ్యవసాయ కూలీలు నిత్యం షేర్ ఆటోలను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆటోలను ఆశ్రయించే వారు కరువయ్యారు. దీంతో ఎలా బతుకు నెట్టుకురావాలో ఆటో డ్రైవర్లకు అర్థం కావడం లేదు. వికలాంగులకు, వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఉంటే బాగుండేదని వారు చెబుతున్నారు. -
డీజిల్ బస్సుకు బైబై
హైదరాబాద్: ఆర్టీసీ డీజిల్ బస్సులు ఇక తుక్కు జాబితాలో చేరనున్నాయి. ఏళ్ల తరబడి లక్షల కొద్దీ కిలోమీటర్లు తిరిగిన కాలం చెల్లిన బస్సులను వదిలించుకొనేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది. వీటి స్థానంలో అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడతో పాటు పలు జిల్లా కేంద్రాలకు ఈ– గరుడ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జూన్ నుంచి దశలవారీగా ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 28 డిపోల్లో సుమారు 2500 బస్సులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచి క్రమంగా డీజిల్ బస్సుల వినియోగాన్ని తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఈ సంవత్సరం వెయ్యి డీజిల్ బస్సులను తొలగించడంతో పాటు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తాం. ఇలా ప్రతి సంవత్సరం డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణహితమైన బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐటీ కారిడార్లకు పరుగులు.. నగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత సిటీ బస్సుల వినియోగం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో నగర శివార్లలో బస్సుల అవసరం బాగా పెరిగింది. ఔటర్‌ను దాటి సిటీ విస్తరించింది. ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్, తదితర రంగాలకు చెందిన ప్రజలు కూడా శివార్లకు తరలివెళ్తున్నారు. చాలామంది నగరంలోని ఐటీ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ శివార్లలో నివాసం ఉండడంతో రవాణా సదుపాయం సవాల్‌గానే మారింది. దీంతో జూన్ నుంచి ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను నగర శివార్ల నుంచి ఐటీ కారిడార్లకు నడపాలని అధికారులు భావిస్తున్నారు. తొలివిడత 28 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కంటోన్మెంట్ డిపో నుంచి వీటిని నిర్వహిస్తారు. ఈ బస్సులు సికింద్రాబాద్ నుంచి మణికొండ, ఇబ్రహీంపట్నం, దిల్సుఖ్నగర్లకు రాకపోకలు సాగిస్తాయి. జూలైలో మరో 32 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బస్సులు బాచుపల్లి నుంచి వేవ్‌రాక్. ప్రగతినగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు తదితర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లకు నడపనున్నారు. కోఠి– పటాన్చెరు డబుల్ డెక్కర్.. మరో రెండు నెలల్లో ప్రవేశపెట్టనున్న 10 డబుల్ డెక్కర్ బస్సులను కోఠి– పటాన్‌చెరుల మధ్య రెండు మార్గాల్లో నడిపేందుకు రూట్‌ను ఖరారు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కోఠి– పటాన్చెరు (218), కోఠి– పటాన్చెరు (222) రూట్లలో ఈ బస్సులు నడుస్తాయి. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు పెద్దగా ఆటంకాలు లేకపోవడంతో పాటు ఎక్కువ మంది ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఈ రెండు మార్గాలను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
గ్యాస్ లీకై రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కంప్రెషర్ నేచురల్ (సీఎన్జీ) గ్యాస్ లీకయిన కారణంగాఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో రెండు బస్సులు దగ్ధం అయ్యాయి. ఒకటి పూర్తిగా దగ్ధం కాగా పక్కనే ఉన్న మరో బస్ పాక్షికంగా కాలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ 11 జడ్ 7482 నంబర్‌గల మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ శుక్రవారం రాజమండ్రిలో ఏకలవ్య మోడల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిమిత్తం స్పెషల్ సర్వీస్‌గా వెళ్లింది. తిరిగి రాత్రి సుమారు 2.30 గంటల సమయానికి డిపోకు చేరుకుంది. డిపో ఆవరణలోనే ఉన్న సీఎన్జీ గ్యాస్ బంక్‌లో గ్యాస్ నింపుకుని మెయింటెనెన్స్ కోసం గ్యారేజీలో పెట్టారు. అనంతరం గ్యారేజీ వెనుక భాగంలో పార్కింగ్ చేసేందుకు వెళుతుండగా గ్యాస్ సిలెండర్ల నుంచి గ్యాస్ లీకవ్వటాన్ని గమనించిన సిబ్బంది దగ్గరకు వెళ్లి చూసేలోపే మంటలు చెలరేగి బస్‌కు అంటుకున్నాయి. దీంతో అది పూర్తిగా దగ్ధం అయ్యింది. దాని పక్కనే పార్క్ చేసి ఉన్న ఏపీ జడ్ 7430 నంబర్‌గల మరో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌కు మంటలు అంటుకుని పాక్షికంగా (డ్రైవర్ క్యాబిన్‌తోపాటు వెనుక భాగాన కొన్ని సీట్లు) కాలిపోయింది. ఘటన జరిగిన విధానాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. -
ఆర్టీసీ డొక్కు బస్సులు ఇక తుక్కే!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 15 ఏళ్లకుపైగా నడుస్తున్న డొక్కు బస్సులు ఇక కనిపించవు. 15ఏళ్ల కాలం తీరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలన్నింటినీ వచ్చే ఏప్రిల్ నాటికి తుక్కుగా మార్చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ బస్సులను తొలగించబోతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఏర్పాట్లు ప్రారంభించింది. సంస్థలో 15 ఏళ్లు దాటిన బస్సుల జాబితా సిద్ధం చేస్తోంది. సుమారు 700కుపైగా బస్సులను తొలగించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే 670 కొత్త బస్సుల కోసం ఆర్టీసీ ఇటీవల టెండర్లు పిలిచింది. ఈ నెలాఖరు నుంచి మార్చి వరకు దశలవారీగా కొత్త బస్సులు ఆర్టీసీకి సమకూరనున్నాయి. బస్సులు తగ్గితే ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ముందుజాగ్రత్తగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా అవే ఆధారం ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను వెంటనే తుక్కుగా మార్చే విధానం గతంలో ఉండేది. కానీ గత పదేళ్లలో పరిస్థితి మారింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ ఇబ్బంది పడుతోంది. 2015లో ఒకదఫా మినహా పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు సమకూర్చుకోలేకపోయింది. ఆర్టీసీలో ఏటా 200కుపైగా పాత బస్సులు తుక్కుగా మార్చి, వాటి స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. కానీ కొత్త బస్సుల కొనుగోలు దాదాపు నిలిచిపోవటంతో పాత బస్సులనే రిపేర్లు చేసుకుంటూ నడుపుతోంది. నిజానికి 2019 నాటి ఆర్టీసీ సమ్మె సమయంలో హైదరాబాద్ నగరంలో వెయ్యి బస్సులు తగ్గించాలని సీఎం ఆదేశించారు. అన్ని బస్సులు తగ్గిస్తే ప్రయాణికులకు ఇబ్బందని భావించిన అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా బాగా పాతబడ్డ బస్సులను తుక్కుగా చేసి, వాటినే తొలగించిన వెయ్యి బస్సులుగా చూపారు. అలా ఒకేసారి పెద్ద మొత్తంలో 15 ఏళ్లు పైబడిన బస్సులు తగ్గిపోయాయి. లేకుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 1,700 వరకు ఉండేదని అంటున్నారు. కన్వర్షన్ పేరుతో.. ఆర్టీసీకి లాభసాటి కేటగిరీ బస్సులు సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌లే. ఆరున్నర లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన బస్సులను తదుపరి తక్కువ కేటగిరీ బస్సులుగా మార్చే పద్ధతి ఆర్టీసీలో ఉంది. ఎక్కువ దూరం తిరిగిన సూపర్ లగ్జరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌లుగా, ఎక్స్‌ప్రెస్‌లను పల్లె వెలుగు బస్సులుగా, మరీ ఎక్కువ తిరిగిన బస్సులను హైదరాబాద్ సిటీ బస్సులుగా మారుస్తున్నారు. ఇలా మార్చినవాటిలో కొన్నింటికి ఏకంగా మరో పదేళ్లు తిప్పుతున్నారు. కానీ వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే పాత వాహనాలను కూడా కేంద్ర ఆదేశం మేరకు తొలగించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త వాహనాలు సమకూరాయి. చాలా వరకు పాతవాటిని పక్కనపెట్టేశారు. దీనితో తొలగించాల్సినవి నామమాత్రంగానే ఉంటాయని..అయితే పోలీసుశాఖ పరిధిలో వాడే వ్యాన్లు, బస్సులు, పాత జీపుల్లో కొన్నింటిని తొలగించాల్సి ఉంటుందని అంటున్నారు. -
AP: ఆర్టీసీ బస్సులకు సరికొత్త రూపు
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) బస్సులు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. దశాబ్ద కాలంగా పాతబడిన బస్సులతో ప్రయాణికులు పడుతున్న పాట్లకు ముగింపు పలకాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను ఆధునికీకరణకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే 650 కొత్త బస్సుల కొనుగోలుతోపాటు 880 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న బస్సులకు ఫేస్‌లిఫ్ట్ ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. రెండు దశల్లో 2,750 బస్సులను ఆధునికీకరిస్తారు. దసరా నాటికి మొదటి దశ ఆధునికీకరించిన బస్సులను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,271 బస్సుల్లో దాదాపు 3,800 బాగా పాతబడ్డాయి. వాటిలో ఏసీ బస్సులు 10 లక్షల కిలోమీటర్లు, ఎక్స్‌ప్రెస్ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. పూర్తి చేశాయి. ఆర్టీసీ ఆదాయం సరిపోక, ఉద్యోగుల జీతాలకే అప్పులు చేయాల్సి రావడంతో దశాబ్ద కాలంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. ఉన్న వాటికి మరమ్మతులు చేయించలేదు. ఉన్న బస్సుల ఆధునికీకరణా చేపట్టలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి 2020 జనవరి నుంచి ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. దాంతో ఆర్టీసీ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన బస్సు ప్రయాణాన్ని అందించేలా పాలక మండలి కార్యాచరణ చేపట్టింది. రెండు దశల్లో ఆధునికీకరణ 2,750 బస్సులను ఆధునికీకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త సీట్లు వేయడం, టైర్లు, హెడ్లైట్లు మార్చడం, రంగులు వేయడం, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు. బస్సులకు కొత్త రూపు తెస్తారు. మొదటి దశలో 1,250 పల్లె వెలుగు బస్సులు, 250 సిటీ బస్సుల ఆధునీకరణ చేపట్టారు. ఆర్టీసీ మెకానికల్ విభాగం సొంత గ్యారేజీల్లోనే ఈ పనులు చేపట్టింది. ఒక్కో బస్సుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం 1,500 బస్సుల ఆధునీకరణకు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారు. దసరా నాటికి తొలి దశ పూర్తి చేయనున్నారు. రెండో దశలో 1,250 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఆధునికీకరించనున్నారు. వాటిలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సెమీ లగ్జరీ సర్వీసులున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రాల మధ్య తిరిగే ఈ సర్వీసులను మరింత వినూత్నంగా ఫేస్ లిఫ్ట్ డిజైన్‌ను ఆర్టీసీ రూపొందించింది. సీట్లు, టైర్లు, లైట్లు మార్చడంతోపాటు అవసరమైన మేరకు బస్సు బాడీనీ కొత్తగా నిర్మిస్తారు. డిసెంబర్ దీనిని పూర్తి చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. -
ఆర్టీసీలో ఇక మహిళా డ్రైవర్లు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో ఇకపై మహిళా డ్రైవర్లు రానున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళా కండక్టర్లను చూసిన మనం ఇకపై వారిని డ్రైవర్లుగానూ చూడబోతున్నాం. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు మొదలెట్టారు. రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను తయారుచేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. దీనిపై ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లకు ప్రాథమికంగా ఆదేశాలిచ్చారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. వారికి ఉమ్మడి జిల్లాల్లోని అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లలో 32 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ బస్సుపైనే శిక్షణ ఇవ్వడంతో వారికి డ్రైవింగ్‌లో మరిన్ని మెలకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చినందుకు గాను ఆర్టీసీకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది. ఆర్టీసీలోనే పోస్టింగ్.. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆర్టీసీలోనే డ్రైవర్‌గా పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైవింగ్‌లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తారు. వారిలో అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలి దశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల్లో నియమించేందుకు ప్రతిపాదించారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా శిక్షణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మహిళలకు పదవులు, నామినేటెడ్ పనులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్రపీఠం వేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఎస్సీ మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అర్హుల ఎంపిక కోసం అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. ఎంపికైన ఎస్సీ మహిళలకు ఆర్టీసీ ద్వారా భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తాం. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను తొలి దఫా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 310 ఎస్సీ బ్యాక్లాగ్ డ్రైవర్ పోస్టుల్లో నియమించేలా ప్రభుత్వానికి నివేదిస్తాం. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
ఏఐతో ‘రాస్తే’ సేఫ్: పనిచేస్తుందిలా!
సాక్షి, హైదరాబాద్: బస్సు ప్రమాదాలను నివారించేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. రెండు రైళ్లు ఢీ కొనకుండా కవచ్ పేరుతో రైల్వే ఇటీవలే యాంటీ కొల్యూజన్ డివైస్‌లను అమర్చే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ తరహాలోనే, బస్సుల్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో యాంటీ కొల్యూజన్ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. డ్రైవర్‌ను నిరంతరం అప్రమత్తం చేసేలా.. గచ్చిబౌలిలోని ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్–సీఆర్ఆర్ఐ, ఐఎన్ఏఐలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘ఐ–రాస్తే’(ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్) పరిజ్ఞానాన్ని బస్సుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పరిజ్ఞానాన్ని నాగ్‌పూర్‌లోని బస్సుల్లో ఇటీవలే ఏర్పాటు చేసి విజయవంతంగా వినియోగిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కూడా ఈ పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంలో కీలకంగా వ్యవహరించిన ఐఐఐటీ నిపుణులతో ఇటీవల చర్చించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు తిరిగే 20 అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత మూడు రోజులుగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పది బస్సుల్లో దీన్ని బిగించారు. వాటి పనితీరును మూడు రోజులుగా పరిశీలిస్తున్నారు. మిగతా బస్సుల్లో కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ‘ఐ–రాస్తే’ పనిచేస్తుందిలా.. ► ఈ వ్యవస్థ నిరంతరం డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంటుంది. డ్రైవర్ వద్ద ఉండే స్క్రీన్‌పై సూచనలువస్తాయి. ► అవసరమైనప్పుడు బీప్ సౌండ్ ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. తద్వారా ముందు వెళ్లే వాహనానికి బస్సు అతి చేరువగా వెళ్లకుండా చూస్తుంది. ► ముందు వెళ్లే వాహనం నెమ్మదించినా, సడన్ బ్రేక్ వేసినా కూడా డ్రైవర్ గుర్తించేలా సిగ్నల్ ఇస్తుంది. ► రోడ్ల పరిస్థితిని కూడా డ్రైవర్‌కు తెలుపుతుంది. బస్సు రోడ్డుకు ఓ పక్కకు వెళ్లినా, రోడ్డు గతుకులుగా ఉన్నా, గోతులు చేరువవుతున్నా, మలుపులు సమీపించే ముందు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. గరిష్ట స్థాయిలో ప్రమాదాల నివారణ గత రెండుమూడు నెలలుగా ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్లు సరిగా లేకపోవటం, ముందు వెళ్లే వాహన డ్రైవర్ల తప్పిదాలు, ఇతర కొన్ని కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని గరిష్ట స్థాయిలో నివారించేందుకు ఈ కొత్త సాంకేతికత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 20 బస్సుల్లో ఈ వ్యవస్థ పనితీరును అంచనా వేసి, ఆ సాంకేతికత ద్వారా డ్రైవర్‌కు అందుతున్న సూచనలు, వాటిల్లో చేయాల్సిన మార్పు చేర్పులపై మరోసారి ఐఐఐటీ నిపుణులతో చర్చించి పూర్తిస్థాయిలో ఆ సాంకేతికతను సమకూర్చుకోనున్నారు. ప్రస్తుతానికి ఆ సాంకేతికతను ఉచితంగానే సమకూరుస్తున్నా.. ప్రయోగం విజయవంతమయ్యాక అవసర మైన బస్సుల్లో దాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కొనుగోలు చేయాల్సి ఉంది. ధర విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. -
ఆర్టీసీలో ప్రయాణం ఉచితం
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్ నుంచి నగరానికి చేరుకున్న వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు తగిన విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. -
శైవక్షేత్రాలకు 3,325 బస్సులు
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల వద్ద నుంచి ఆర్టీసీ పాత టికెట్ ధరలే వసూలు చేస్తుందని, ధరల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రెండేళ్లుగా డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినా.. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద జరిగే తిరునాళ్లకు ఆర్టీసీ సంస్థ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఆయన నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా గ్యారేజ్ ఆవరణలో సిబ్బందికి గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన మహాశివరాత్రికి సంస్థ సంసిద్ధమైందన్నారు. కోటప్పకొండ, కర్నూలు జిల్లాలోని శ్రీశైలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 96 చిన్నా, పెద్ద శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా శివరాత్రి ముందురోజు, శివరాత్రి రోజున 21 లక్షల మంది కోసం 3,325 బస్సులను సిద్ధం చేసినట్టు తెలిపారు. వాటిలో 410 బస్సులు కోటప్పకొండకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నరసరావుపేట నుంచి 285, మిగతా ప్రాంతాల నుంచి 55, ఘాట్‌రోడ్డులో 70 బస్సులు నడుస్తాయని చెప్పారు. -
మేడారంలో భక్తుల మొక్కులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహా జాతర శనివారం సాయంత్రం ముగిసినప్పటికీ ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగిసిన క్రమంలో అమ్మవార్ల గద్దెల ఐలాండ్ వరకు భక్తుల వాహనాలకు అనుమతిచ్చారు. ఆర్టీసీ బస్సులు కూడా ఐలాండ్ వరకు వెళ్లాయి. కలెక్టర్ కృష్ణ ఆదిత్య కుటుంబ సభ్యులు అమ్మవార్లను దర్శించుకున్నారు. -
కొత్త బస్సుల కోసం సీఎంకు ప్రతిపాదిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి కొత్త బస్సుల అవసరముందని, 2,820 బస్సులు కొనేందుకు సీఎంకు ప్రతిపాదించనున్నట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. అలాగే మృతిచెందిన ఆర్టీసీ ఉద్యో గుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా సంస్థలో ఉద్యో గం కల్పించే అంశాన్ని కూడా అందులో ప్రస్తావిస్తామని, కారుణ్య నియామకాల కోసం 1,200 మంది ఎదురు చూస్తున్నారన్నారు. శనివారం బస్‌భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మ జాతరకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని, ఆశించినంత ఆదాయం రాలేదన్నారు. రిటైర్మెంట్ బెని ఫిట్లకు సంబంధించి రూ.500 కోట్లను ప్రభుత్వం నుంచి కోరనున్నట్లు చెప్పారు. -
80 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తున్న దసరా ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్బీ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయని, అయితే సాధారణ సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. కేవలం 16 దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50శాతం అదనపు చార్జీ వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు బస్సులను నడుపుతున్నాయని వివరించారు. -
దసరాకు 4 వేల ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల కోసం రేపటి (శుక్రవారం) నుంచి ఈనెల 18వ తేదీ వరకు 4 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 14వ తేదీ వరకు 1,800 బస్సులు, 15 నుంచి 18వ తేదీ వరకు 2,200 బస్సులు తిప్పుతామని చెప్పారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా సందర్భంగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు సౌకర్యవంతంగా వచ్చి, పండుగ తరువాత మళ్లీ వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. హైదరాబాద్ నుంచి 1,383 బస్సులు, బెంగళూరు నుంచి 277 బస్సులు, చెన్నై నుంచి 97 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 2,243 బస్సులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతామని వివరించారు. దసరా ప్రత్యేక బస్సులను ఓ వైపు ఖాళీగా అంటే సున్నా రాబడితో నడపాల్సి ఉంటుందన్నారు. డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. అందువల్ల అనివార్య పరిస్థితులతో దసరా ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులు సహృదయంతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రెగ్యులర్ బస్ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కారుణ్య నియామకాలకు ఆమోదం గత సంవత్సరం జనవరి 1 తరువాత మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామన్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. అంతకుముందు అంటే ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నకాలంలో చనిపోయిన సంస్థ ఉద్యోగుల పిల్లలకు కూడా కారుణ్య నియామకాలపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 2020–21కి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు బస్ డిజైన్ మారుస్తామన్నారు. అన్ని బస్సులకు లైవ్ ట్రాకింగ్ సౌలభ్యం కల్పిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణా, పోలీసు అధికారులతో కలిపి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయి.ప్రయోగాత్మకంగా తొలుత సిటీ బస్సుల రంగు మార్చాలని ఆర్టీసీ భావిస్తోంది. తీవ్ర నష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొత్త ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని సంస్థ భావిస్తోంది. చాలాకాలంగా ఒకే రంగుతో ‘పాతబడ్డ’ బస్సులకు కొత్త రంగులతో కొత్త లుక్ తేవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో ఆర్టీసీ తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటోంది. కోవిడ్‌తో కునారిల్లి నెలరోజులుగా సిటీ బస్సులు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నా.. మరింత పెరగాల్సిందేనన్న ఉద్దేశంతో ఆర్టీసీ ఉంది. ఇందుకు వాటి రంగులు మార్చడం ద్వారా కొంత ఫలితాన్ని పొందొచ్చని ఆశిస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత.. గతంలో నగరంలో ఆకుపచ్చ, పెసర రంగులతో సిటీబస్సులు ప్రత్యేకంగా కనిపించేవి. డబుల్ డెక్కర్ బస్సులకు కూడా ఇవే రంగులుండేవి. 15 ఏళ్ల క్రితం దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో బస్సుల రంగులు మార్చారు. అప్పటి వరకు ఎర్ర బస్సు అన్న పేరుతో ఆర్టీసీ ఆర్డినరీ బస్సులు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి. పల్లెలు పచ్చదనంతో మెరిసిపోయే తరుణంలో, బస్సులు కూడా దాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్న ఉద్దేశంతో రంగులు మార్చారు. అందుకే పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ రంగుతో ఉంటున్నాయి. ఈ సమయంలోనే నగరంలో ఆకుపచ్చ, పెసర రంగు కాంబినేషన్లో ఉండే రంగులు కూడా మారి ఎరుపు రంగు వచ్చింది. దశాబ్దంనరపాటు ఆ రంగు చూసి జనానికి బోర్ కొట్టి ఉంటుందన్న భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది. అందుకోసం జనాన్ని ఆకట్టుకునే రంగుల్లోకి వాటిని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. తెలుపు రంగు వెంటనే ఆకర్షిస్తుందన్న ఉద్దేశంతో తెలుపుతో సమ్మిళితమై ఇతర రంగు వేయించాలన్న ఆలోచన ఉండగా, గతంలో బాగా ఆకట్టుకున్న ఆకుపచ్చ–పెసరి రంగును కూడా పరిశీలిస్తున్నారు. ఓ బస్సుకు ఆ రంగు వేయించారు కూడా. మరో ఏడెనిమిది కాంబినేషన్లతో రంగులు వేయించి మెరుగ్గా ఉన్న దాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జిల్లా బస్సుల రంగులు కూడా మార్చే అవకాశముంది. -
ఆర్టీసీ దిద్దు‘బాట'.. మారనున్న సిటీ బస్సుల రూటు
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సు రూటు మారనుంది. నగరంలో భారీగా పెరిగిన సొంత వాహనాల వినియోగం, మెట్రో రైళ్లు, ప్రైవేట్ వాహనాల పోటీ వంటి పరిణామాలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న గ్రేటర్ ఆర్టీసీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు హైదరాబాద్ చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో బస్సుల విస్తరణకు చర్యలు చేపట్టింది. శివార్లకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపడం ద్వారా ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుందని భావిస్తోంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాంతర రూట్లలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పడిపోయింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి క్యాబ్ సర్వీసులు మరింత దెబ్బతీశాయి. దీంతో ప్రధాన నగరంలో సిటీ బస్సులను తగ్గించి శివార్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ట్రిప్పులను పెంచనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు నగరం చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణ అవసరాలపైన అధ్యయనం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ సైతం సిటీ బస్సుల నష్టాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రేటర్లో దిద్దుబాటు మొదలైంది. చదవండి: తెలంగాణ: నష్టాల ఆర్టీసీలో దుబారా..! ప్రయాణికులకు చేరువగా... ► ప్రస్తుతం సిటీ బస్సులు గంటకు 15 కిలోమీటర్ల చొప్పున ప్రతి రోజు 250 కిలోమీటర్ల మాత్రమే తిరుగుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ, ట్రిప్పుల రద్దు, పరిమిత రూట్లు ఇందుకు కారణం. స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడం వల్ల కూడా బస్సులు ఎక్కువ దూరం తిరగడం లేదు. ► గతంలో హయత్‌నగర్ నుంచి పటాన్చెరు వరకు తిరిగిన బస్సులు ఇప్పుడు హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్కు పరిమితమయ్యాయి. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలు రావడం ఇందుకు కారణం. ► ఇదే సమయంలో జిల్లా బస్సులు మాత్రం గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల చొప్పున రోజుకు 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. ► గతంలో నగరంలో 3850 బస్సులు ప్రతిరోజు 9 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. 800కు పైగా సిటీ బస్సులను తొలగించారు. దీంతో ప్రస్తుతం 7 లక్షల కిలోమీటర్లే తిరుగుతున్నాయి. ► వివిధ కారణాల వల్ల నగరంలో తగ్గిన ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకొనేందుకు సిటీ బస్సు స్టీరింగ్‌ను శివార్ల వైపు తిప్పేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. చదవండి: ఆర్టీసీ నష్టాలకు వాస్తు దోషమా? బస్‌భవన్‌కు వాస్తు మార్పులు మారనున్న రూటు... ► సికింద్రాబాద్–కోఠి, నాంపల్లి–మెహిదీపట్నం వంటి తక్కువ దూరం ఉన్న రూట్లలో ఒక బస్సు రోజుకు 6 ట్రిప్పులు నడిచినా 250 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా ఉంది. అదే సమయంలో ఆక్యుపెన్సీ కూడా 60 శాతం లోపే ఉంటుంది. ► ప్రత్యామ్నాయంగా తక్కువ దూరం ఉన్న రూట్లలో ట్రిప్పులను తగ్గించి చౌటుప్పల్–ఎంజీబీఎస్, మాల్–కోఠి, భువనగిరి–సికింద్రాబాద్, చేవెళ్ల– మెహిదీపట్నం వంటి దూరప్రాంతాలకు ట్రిప్పులను పెంచనున్నారు. ► ఈ మార్పులతో గంటకు 15 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు, రోజుకు 250 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు బస్సు వినియోగం పెరిగే అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. భారీగా నష్టాలు ► ప్రస్తుతం నగరంలో సిటీ బస్సులు రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తున్నాయి. ► కిలోమీటర్‌కు రూ.36 ఆదాయం లభిస్తుండగా ఖర్చు మాత్రం రూ.85 వరకు నమోదవుతోంది. ఒక్క డీజిల్ కోసమే కిలోమీటర్‌కు రూ.20 చొప్పున వెచ్చించవలసి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► ప్రస్తుతం రోజు రూ.2.5 కోట్ల ఆదాయం ఉన్నా నిర్వహణ వ్యయం రూ.3.5 కోట్లు. ► సిటీ నుంచి చేవెళ్ల, శంకర్పల్లి, మాల్, రాయగిరి, భువనగిరి వంటి దూరప్రాంతాలకు బస్సులను పెంచుకోవడం వల్ల కిలోమీటర్‌పైన వచ్చే ఆదాయం రూ.36 నుంచి కనీసం రూ.50 వరకు పెరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులకు వాట్సప్ పరిష్కారం ► ప్రయాణికులకు చేరువయ్యేందుకు ఆర్టీసీ మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ► సిటీ బస్సుల సమస్యలపైన ప్రయాణికులు కింది నెంబర్లకు వాట్సప్ ద్వారా ఫిర్యాదులు చేసి పరిష్కారం పొందవచ్చు. కోఠి సహాయ కేంద్రం: 99592 26160 రెతిఫైల్ కేంద్రం: 83339 04531