Sailing
-
జల రథ సారథులు
మన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ఉంది. కొచ్చిలో కొత్తగా మెట్రో ఫెర్రీ మొదలైంది. కొచ్చిలో ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ‘మెట్రో వాటర్ ఫెర్రీ’ వ్యవస్థను దక్షిణాసియాలోనే మొదటిసారిగా మొదలెట్టింది. 100 మంది పాసింజర్లను మోసుకెళ్లే ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళా పైలట్లు సెలెక్ట్ అయ్యారు. దేశంలోనే వీరు ప్రథములు. జల రవాణాలో ఇది మహిళా శకం.మొన్నటి సాయంత్రం కొచ్చిలోని హైకోర్టు నుంచి ఫోర్ట్ కొచ్చికి ఫెర్రీ బయలు దేరింది. బ్యాక్‌వాటర్స్‌లో రాత్రి పార్టీలకు కొన్ని హౌస్ బోట్లు బయలుదేరాయి. బెస్త పడవలు వెనుకకు మరలుతున్నాయి. వాటి మధ్య హుందాగా మృదువుగా కదిలింది నీలి రంగు ఫెర్రి. తండ్రి చేయి పట్టుకుని ఫెర్రీ ఎక్కిన ఒక పదేళ్ల అమ్మాయి ఫెర్రీ పైలెట్‌కు సహాయంగా నిలబడి ఉన్న మహిళా పైలెట్‌ను చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత తండ్రితో అంది ‘నాన్నా... నేను కూడా ఇలా అవుతా’. తండ్రి చిరునవ్వు నవ్వి ఆ మహిళా పైలెట్‌తో ‘ఇలా మా అమ్మాయి కావాలంటే ఏం చదవాలమ్మా’ అని అడిగాడు. ఆ ప్రశ్న ప్రస్తుతం కొచ్చిలో ఫెర్రీలలో ప్రయాణిస్తున్న చాలామంది తల్లిదండ్రులతో. అంతగా స్ఫూర్తినిస్తున్నారు కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా పైలట్లు.అరుణిమ, లక్ష్మి, స్నేహఈ ముగ్గురు యువ సారథులు ‘కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్’లో ట్రెయినీలుగా నియమితులయ్యారు. ఫెర్రీలలో అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న వీరు సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి పైలట్లుగా విధులు నిర్వర్తిస్తారు. జనరల్ పర్పస్ రేటింగ్ (జిపిఆర్) కన్వర్షన్ కోర్సు పూర్తి చేసిన వారికే ఈ ఉద్యోగం దొరుకుతుంది. కేరళలో ఈ కోర్సు లభ్యమవుతోంది. కొల్ల్లంకు చెందిన అరుణిమ, తిరువనంతపురంకు చెందిన లక్ష్మి, అలెప్పికి చెందిన స్నేహ వివిధ ఇంజినీరింగ్ డిప్లమాలు చేశాక ఫెర్రీ పైలెట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపారు. అయితే జేపీఎస్ కోర్సు పూర్తి చేశాకనే వారికి ట్రెయినీలుగా అవకాశం వస్తుంది. ఆ కోర్సును కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ట్రెయినీ పైలట్లు నియమితులయ్యారు.75 ఫెర్రీలు 33 వేల పాసింజర్లుకొచ్చి చుట్టూ లంక గ్రామాలు ఉన్నాయి. కొచ్చిలో కూడా ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడానికి మైట్రో రైలు ఉన్నా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. దీంతో ఫ్రభుత్వం దాదాపు లక్షా పదమూడు వేల కోట్ల ఖర్చుతో వాటర్ మెట్రో సర్వీసును మొదలెట్టింది. ఇందులో భాగంగా 75 హైబ్రీడ్ ఫెర్రీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకపోకల కోసం 38 జెట్టీలు నిర్మించారు, 15 రూట్లు ఖరారు చేశారు. దీంతో 33 వేల మంది పాసింజర్లకు మేలు జరుగుతుంది. టికెట్ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది. 100 మంది పాసింజర్లున్న ఫెర్రీ గరిష్టంగా 23 కిలోమీటర్లు గంటలో ప్రయాణిస్తుంది.పురుష ప్రపంచంలో మహిళా సారథులుకేరళలో టూరిజం కోసం ఉపయోగించే హౌస్బోట్లు, ఇతర ఫెర్రీలలోగాని పురుషులే డ్రైవర్లుగా ఉంటారు. మెట్రో ఫెర్రీలలో కూడా పురుష పైలట్లే ఉన్నారు. కాని స్త్రీలు ఈ ఉపాధిలో తప్పక ఉండాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ‘మేము విధులు నిర్వర్తిస్తుంటే అందరూ మా యూనిఫామ్‌లు చూసి మెచ్చుకోలుగా మాట్లాడుతున్నారు’ అంటుంది అరుణిమ. ‘ఉద్యోగంలోకి బెరుగ్గా అడుగుపెట్టాను. కాని మెట్రో ఉద్యోగులు నా బెరుకును కొద్ది రోజుల్లోనే పోగొట్టారు. మేము కలిసి పని చేసే ఒక వాతావరణం ఇక్కడ ఉంది’ అంది లక్ష్మి. ‘ఫెర్రీ పైలట్ అంటే ఫెర్రీని నడపడమే కాదు... క్రౌడ్‌ను కూడా మేనేజ్ చేయాలి. ఫెర్రీ కదులుతుంటే కొంతమంది అంచుల్లో నిలబడతారు. వారిని హెచ్చరించాలి’ అంటుంది స్నేహ. ‘మొదటిసారి మేము ఫెర్రీ లోపలికి వచ్చి చూస్తే ఇదో షిప్పేమో అనిపించేంత ఆధునికంగా ఉంది. అన్ని సాంకేతిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. సీటింగ్ ఏరియా అంతా ఏసి ఉంటుంది’ అని తెలిపింది అరుణిమ.విమానాలు, మెట్రో రైళ్లు, మైట్రో ఫెర్రీలు.... దూసుకుపోతున్న మహిళలకు అభినందనలు. -
NAVIKA SAGAR PARIKRAMA II: కడలి అలలిక వాళ్ల కాళ్ల కింద...
సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావాలంటే పెట్టి పుట్టాలి. పట్టిన పట్టు విడువని స్వభావంతో పుట్టాలి. ‘ఓషన్ సెయిలింగ్ అడ్వంచర్స్’లో ఇండియా ఉనికి ప్రపంచానికి తెలియాలంటే అందునా స్త్రీ శక్తి తెలియాలంటే ‘సర్కమ్నావిగేషన్’ (ప్రపంచాన్ని చుట్టి రావడం) ఒక్కటే మార్గమని నేవీ వైస్ అడ్మిరల్ మనోహర్ అవతి ఉద్దేశం. అందుకే ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. అంటే సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం. ఇప్పటికి భారతదేశం మూడు సాగర పరిక్రమలు విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో రెండింటిని పురుష ఆఫీసర్లు; ఒకదానిని మహిళా ఆఫీసర్లూ పూర్తి చేశారు. మహిళల కోసమే ‘నావికా సాగర్ పరిక్రమ’ను నేవీ ప్రవేశపెడితే 2017లో ఏడుగురు మహిళా నేవీ ఆఫీసర్లు ఆ పరిక్రమను పూర్తి చేసి జేజేలు అందుకున్నారు. ఆ తర్వాత ‘నావికా సాగర్ పరిక్రమ 2’ యత్నాలు మొదలయ్యాయి. ఏడుగురి స్థానంలో ఇద్దరినే ఉంచి సాహసవంతంగా పరిక్రమ చేయించాలని నేవీ సంకల్పించింది. ఇందుకు నేవీలో పని చేసే మహిళా ఆఫీసర్ల నుంచి స్వచ్ఛందంగా దరఖాస్తులు ఆహ్వానించగా చాలామంది స్పందించారు. వారిలో అనేక దశల వడ΄ోత తర్వాత ఇద్దరు ఆఫీసర్లు మిగిలారు. వారే రూపా, దిల్నా. గత మూడేళ్లుగా వారితో చేయించిన ట్రైనింగ్ ముగియడంతో అతి త్వరలో సాహసయాత్ర మొదలుకానుందని నేవీ తెలిపింది.→ ఆటల నుంచి సాగరంలోకి...‘నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఆటలు ఆడుతూనే 2014లో నేవీలోకి వచ్చాను’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ డెల్నా. కేరళకు చెందిన డెల్నా ఆర్మీలో పని చేస్తున్న తండ్రిని చూసి నేవీలో చేరింది. ‘నేవీలో లాజిస్టిక్స్ ఆఫీసర్‌గా పని చేస్తూ ఉండగా ‘నావికా సాగర్ పరిక్రమ 2’ సంగతి తెలిసింది. నేను అప్లై చేశాను. సెలెక్ట్ అయ్యాను. అయితే అప్లై చేసిన చాలామంది మధ్యలోనే కుటుంబ వొత్తిళ్ల వల్ల మానుకున్నారు. సముద్రం మీద సంవత్సరం పాటు కేవలం మరొక ఆఫీసర్ తోడుతోనే ఉండాలంటే ఎవరైనా భయపడతారు. కాని మా నాన్న, నేవీలోనే పని చేస్తున్న నా భర్త నన్ను ్ర΄ోత్సహించారు. నేవీలో పని చేయడం అంటే జీవితం సముద్రంలో గడవడమే. అయినా నేనూ నా భర్త శాటిలైట్ ఫోన్ ద్వారా కనెక్టివిటీలోనే ఉంటాం’ అని తెలిపింది డెల్నా.→ నన్ను నేను తెలుసుకోవడమే‘నేలకు దూరంగా సముద్రం మీద ఉండటం అంటే నన్ను నేను తెలుసుకోవడమే’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా. పాండిచ్చేరికి చెందిన రూప తండ్రి నేవీలోనే పని చేస్తుండటంతో 2017లో ఆమె నేవీలో చేరింది. ‘ముంబైలో నేవీ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా నావికా సాగర్ పరిక్రమ 2లో పాల్గొనే అవకాశం వచ్చింది. సముద్రం అంటే నాకు ఇష్టం. నేలను ఒదిలి పెట్టి వచ్చిన మనిషిని సముద్రం ఎప్పుడూ నిరాశ పరచదు. అద్భుతమైన ప్రకృతిని సముద్రం మీద చూడవచ్చు. ఒక్కోసారి భయం వేస్తుంది. కాని అంతలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది’ అంటోందామె.→ కఠిన శిక్షణ‘నావికా సాగర్ పరిక్రమ2’కు ఎంపికయ్యాక గత మూడు సంవత్సరాలుగా డెల్నా, రూపాలు శిక్షణ తీసుకుంటున్నారు. తారిణి అనే సెయిల్ బోట్లో వీరికి శిక్షణ జరుగుతోంది. ఇప్పటికే వీరు ఈ బోట్లో సముద్రం మీద 34 వేల నాటికల్ మైళ్లు తిరిగారు. బోట్‌ను నడపడం, దిశను ఇవ్వడం, రిపేర్లు చేసుకోవడం, వైద్యం చేసుకోవడం, శారీరక మానసిక దృడ్వం కలిగి ఉండటం... ఇవన్నీ శిక్షణలో నేర్పిస్తారు. ‘మేము ఇద్దరమే బోట్లో ఉంటాం. అంటే పని ఎక్కువ నిద్ర తక్కువ ఉంటుంది. ఊహించని తుఫాన్లు ఉంటాయి. ఒకేవిధమైన పనిని తట్టుకునే స్వభావం, ఓపిక చాలా ముఖ్యం. మేము అన్ని విధాలా సిద్ధమయ్యాము. ఇక ప్రయాణమే ఆలస్యం’ అన్నారు ఈ ఇద్దరు ధీరవనితలు. త్వరలో ్రపారంభం కానున్న వీరి సాగర పరిక్రమ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిద్దాం. 56 అడుగుల సెయిల్ బోట్. 40000 కిలోమీటర్ల దూరం250 రోజుల ప్రయాణంరాకాసి అలలు... భీకరగాలులువీటన్నింటినీ ఎదుర్కొంటూ ఇద్దరే మహిళా నావికులు. స్త్రీలంటే ధీరలు అని నిరూపించడానికి ఇండియన్ నేవీ త్వరలో తన ఇద్దరు నావికులను సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావడానికి పంపనుంది. పాండిచ్చేరికి చెందిన రూపా కాలికట్కు చెందిన డెల్నా బయలుదేరనున్నారు. ఈ సాహస యాత్ర గురించి... -
హైదరాబాద్ : సాగర జలాల్లో ‘సెయిలింగ్’ విన్యాసాలు (ఫొటోలు)
-
సెయిలింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మాన్య
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన యువ సెయిలర్ మాన్య రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ 4 (లేజర్ 4.7) యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఆమె ఎంపికైంది. జూన్ 22నుంచి 30 వరకు పోర్చుగల్‌లోని వియానా డి కాస్టెలోలో ఈ టోర్నీ జరుగుతుంది. 15 ఏళ్ల మాన్య గత కొంత కాలంగా సెయిలింగ్ పోటీల్లో నిలకడగా రాణిస్తోంది. హుస్సేన్ సాగర్ జలాల్లో సెయిలింగ్ నేర్చుకున్న ఈ అమ్మాయి తొలి జూనియర్ రెగెట్టాలోనే రజతం సాధించింది. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో వరుస విజయాలు సాధించిన ఆమె ఇటీవల షిల్లాంగ్‌లో జరిగిన ర్యాంకింగ్ టోర్నీలో కాంస్యం గెలుచుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం భారత్‌నుంచి ఎంపికైన ఇద్దరు సెయిలర్లలో ఒకరిగా మాన్యకు అవకాశం దక్కింది. ఈ టోర్నీ కోసం ప్రస్తుతం మాన్య సిద్ధమవుతోంది. అయితే వరల్డ్ చాంపియన్íÙప్ స్థాయి టోర్నీలో పాల్గొనడం, ఇతర సన్నాహకాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే తన ఈవెంట్ కోసం మాన్య స్పాన్సర్ల సహాయాన్ని ఆశిస్తోంది. ప్రయాణ, వసతి, ఎక్విప్మెంట్, శిక్షణ కోసం తనకు అండగా నిలవాలని ఆమె కోరుతోంది. ఈ నేపథ్యంలో మాన్యకు స్పాన్సర్షిప్ అందించాలని భావించేవారు ఝ్చ్చny్చట్ఛఛీఛీy20ఃజఝ్చజీ .ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు. -
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) డ్రెస్సేజ్ టీమ్ ఈవెంట్లో భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్, హ్రిదయ్ చద్దా, అనుష్ అగర్వల్లాలతో కూడిన జట్టు 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. దీనికి ముందు సెయిలింగ్‌లో భారత్‌కు ఇవాళే (సెప్టెంబర్ 26) మూడు పతకాలు అందాయి. #EquestrianExcellence at the 🔝 After 41 long years, Team 🇮🇳 clinches🥇in Dressage Team Event at #AsianGames2022 Many congratulations to all the team members 🥳🥳#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/CpsuBkIEAw — SAI Media (@Media_SAI) September 26, 2023 భారత సెయిలర్లు నేహా ఠాకూర్ రజతం, ఎబాద్ అలీ, విష్ణు శరవనన్ కాంస్య పతకాలు సాధించారు. ఆసియా క్రీడల్లో మూడో రోజు మధ్యాహ్నం సమయానికి భారత పతకాల సంఖ్య 14కు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు) చేరింది. పతకాల పట్టికలో చైనా 78 పతకాలతో టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. -
సెయిలింగ్ రేసుల్లో మహిళలు భేష్
సాక్షి, హైదరాబాద్: సెయిలింగ్ వంటి విభిన్నమైన రేసుల్లో మహిళలు రాణించడం హర్షణీయమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. నగరంలో జరిగిన ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’లో 93 మంది సెయిలర్స్ పాల్గొంటే అందులో 17 మంది రేసర్లు బాలికలు ఉండటం అభినందనీయమన్నారు. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహించిన 37వ ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’పోటీల విజేతలకు ఆమె ఆదివారం మెడల్స్, ట్రోఫీలను అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ మాట్లాడుతూ., సెయిలింగ్ అనేది అనేక ఛాలెంజ్‌లతో కొనసాగే క్రీడ అని, ఇందులో రాణించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ఈ గేమ్‌లో రాణించిన రేసర్లు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే పరిపూర్ణతను సాధిస్తారని అభిప్రాయపడ్డారు. ఏషియన్స్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో కూడా మన వాళ్లు పతకాలను సాధించాలని ఆశించారు. సెయిలింగ్ వంటి విభిన్న ఆటలకు నగర వాతావరణం అనుకూలంగా ఉండటం హర్షణీయమన్నారు. సాగర్ పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలి ఈ సందర్భంగా హుస్సేన్ సాగర్‌ను మరింత పరిశుభ్రంగా చూసుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంతో పాటు నగరవాసులు కూడా హుస్సేన్ సాగర్ సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని, అందరూ కలిసి పనిచేస్తేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. గతంలో సాగర్ వేదికగా సెయిలింగ్ పోటీలు నిర్వహించే సమయంలో చేపలు, కప్పలు, పాములు కనిపించేవని, కానీ ఇప్పుడు కాలుష్యం వల్ల అవి కనిపించడం లేదని ఆర్మీ అధికారులు చెప్పారని గవర్నర్ పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా మంత్రిత్వ శాఖ, పర్యాటక శాఖ అందించిన సహకారానికి ఎమ్సీఈఎమ్ఈ కమాండెంట్, లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లేజర్స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 విభాగాల్లో మొత్తం 12 రేసుల్లో విజేతలకు గవర్నర్ మెడల్స్, ట్రోఫీలను అందించారు. ఐఎల్సీఏ 4 విభాగంలో వైష్ణవి, మల్లేష్, ఐఎల్సీఏ 6లో రితికా డాంగి, కోటేశ్వరరావు, ఐఎల్సీఏ 7లో హవ్ మోహిత్ సైనీ స్వర్ణ పతక విజేతలుగా నిలిచారు. ఛాంపియన్ ట్రోఫీలను మల్లేష్, వైష్ణవి, నేషనల్ ఛాంపియన్ ట్రోపీని రితికా డాంగి సాధించారు. వీటితో పాటు పలు విభాగాల్లో పతకాలను గవర్నర్ చేతుల మీదుగా రేసర్లు తీసుకున్నారు. -
హైదరాబాద్ హుసేన్ సాగర్ లో సెయిలింగ్ సందడి
-
హుస్సేన్ సాగర్ తీరాన సెయిలింగ్ వీక్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లేసర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ జే ఎస్ సిధాన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరచిన సెయిలర్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. ఈ పోటీలను ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌గా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌ను నిర్వహిస్తున్న సికింద్రాబాద్ ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్‌ను అభినందించారు. అంతే కాకుండా క్రీడా రంగంలో యువతను విశేషంగా ప్రోత్సహిస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ అభినందించారు. లేజర్ స్టాండర్డ్, లేజర్ 4.7 తదితర విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో మంగళవారం వరకు 11 క్లబ్స్ నుంచి 89 మంది సెయిలర్స్ రిజిష్టర్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇందులో దేశ వ్యాప్తంగా 11 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సెయిలింగ్ వీక్ లో రాష్ట్రం నుంచి 17 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీల్లో తన ప్రతిభను కనబరుస్తున్న 72 ఏళ్ల మురళి కానూరి అతి పెద్ద వయసు్కడిగా అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఈ పోటీలు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ్ రెడ్డి, తదితర ఆర్మీ అధికారులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆరు పతకాలతో అదరగొట్టిన హైదరాబాదీలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ సెయిలర్లు ఆరు పతకాలతో అదరగొట్టారు. మైసూర్లో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో వైష్ణవి వీరవంశం, కొమరవెల్లి లాహిరి స్వర్ణ పతకాలు సాధించారు. తనూజా కామేశ్వర్, సాహిత్ బండారం రజత పతకాలు నెగ్గగా... లావేటి ఝాన్సీప్రియ, అమితవ వీరారెడ్డి కాంస్య పతకాలు గెలిచారు. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కోచ్ సుహీమ్ షేక్ మాట్లాడుతూ భవిష్యత్‌లో హైదరాబాద్ సెయిలర్లు మరిన్ని పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
July 8th: వాస్కోడగామా తొలిసారి ఇండియాకు పడవెక్కిన రోజు
పదిహేనవ శతాబ్దాపు ప్రముఖ పోర్చుగీసు నావికుడు వాస్కోడగామా తొలిసారి నేరుగా ఇండియాకు నౌకాయానం ప్రారంభించిన రోజు ఇది. 1497 జూలై 8న ఆయన మహాయాత్ర లిస్బన్ రేవు నుంచి మొదలైంది. ఆఫ్రికాలోని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ప్రాంతాన్ని చుడుతూ ఏడాది తర్వాత 1498 మే 20న ఇండియాలోని కోళికోడ్ (కేరళ) తీర ప్రాంతాన్ని చేరుకుంది. ఐరోపా నుంచి సముద్ర మార్గంలో ఒకరు ఇండియాకు రావడం అదే మొదటిసారి. దాంతో ఐరోపా మళ్లీ ఇండియాతో తన వ్యాపార సంబంధాలను పునరుద్ధరించుకుంది. మొదట గ్రీకులు, రోమన్లు అరబ్‌లు భారత్ నుంచి సరకు కొనుక్కెళ్లి ఐరోపాలో లాభానికి అమ్ముకునేవారు. కాన్‌స్టాంట్‌నోపుల్ మీదుగా భారత్‌కు భూమార్గం అందుబాటులో ఉన్నంతవరకు వీళ్ల వ్యాపారాలన్నీ సజావుగా సాగాయి. ఎప్పుడైతే తురుష్కులు కాన్స్టాంట్ నోపుల్‌ను ఆక్రమించుకున్నారో అప్పటి నుంచి ఆ దారి మూసుకుపోయింది. -
10 మంది మహిళా సైనికులు సముద్రంలో 7 రోజులు
మనం నేల మీద మన రోజువారీ వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా ఇటీవల నీటి మీద ఒక సాహసం జరిగింది. బంగాళాఖాతంలో పది మంది మహిళా ఆర్మీ ఆఫీసర్లు ఒక్క పురుషుడి తోడు కూడా లేకుండా చిన్న యాట్ (తెరచాపతో నడిచే చిన్న పడవ)లో చెన్నై నుంచి విశాఖపట్నంకు తిరిగి విశాఖపట్నం నుంచి చెన్నైకు 7 రోజుల్లో సాహస యాత్ర చేశారు. ఫిబ్రవరి 15న చెన్నైలో బయలుదేరిన ఈ యాత్ర ఫిబ్రవరి 23న ముగిసింది. ‘నిజానికి మా యాత్ర 4 రోజుల్లో ముగుస్తుంది అనుకున్నాం. కాని సముద్రం లెక్క సముద్రానికి ఉంటుంది. అలలు, గాలులు మనం ఎప్పుడు గమ్యం చేరాలో నిర్దేశిస్తాయి. అందుకే 7 రోజులు పట్టింది’ అంది ఈ బృందానికి కెప్టెన్‌గా వ్యవహరించిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముక్త శ్రీ గౌతమ్. ‘ఆర్మీ అడ్వంచర్ వింగ్’ ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సెయిలింగ్ అసోసియేషన్’ నిర్వహణలో ఈ సాహస యాత్ర జరిగింది. ఈ యాత్రలో ఆర్మీ నుంచి ఎంపిక చేసిన 10 మంది మహిళా ఆఫీసర్లను ఎంపిక చేశారు. కెప్టెన్ ముక్త శ్రీ గౌతమ్ కాకుండా మేజర్ సంజనా మిట్టల్, మేజర్ అర్పితా ద్వివేది, కెప్టెన్ మాళవికా రావత్, కెప్టెన్ శుభమ్ సోలంకి, మేజర్ ప్రియా సంవాల్, మేజర్ ప్రియా దాస్, కెప్టెన్ జ్యోతి సింగ్, మేజర్ రష్మిల్, కెప్టెన్ సోనాల్ గోయల్ ఉన్నారు. ‘నేటి మహిళలు స్త్రీల పట్ల మన దేశంలో ఉన్న మూస అభిప్రాయాలను బద్దలు కొడుతున్నారు. వారు ధైర్యానికి కొత్త ప్రమాణాలు లిఖిస్తున్నారు’ అని చెన్నైలో జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. నిజమే. ఈ పదిమంది అలాంటి ధైర్యం చూపారు. ‘మాలో ఎక్కువమందికి ఇదే తొలి నౌకాయానం. కాని మాలో ఏదైనా సాహసం చేయాలన్న కోరిక ఎక్కువ. అందుకే ఈ యాత్రకు సై అన్నాం. మాకు 25 రోజులు ముంబైలోని మార్వెలో శిక్షణ ఇచ్చారు. అక్కడ పడవల గురించి, నౌకాయానం గురించి, సముద్రపు అలల గురించి తెలియ చేశారు. ఆ తర్వాత చెన్నైలో మేము ఏ యాట్ మీద అయితే ప్రయాణించాలో దాని మీద 10 రోజుల శిక్షణ ఇచ్చారు. కాని తీరంలో శిక్షణ వేరు. నిజమైన సముద్ర ప్రయాణం వేరు అని యాత్ర మొదలయ్యాక అర్థమైంది’ అంటారు ఈ బృంద సభ్యులు. చెన్నైలో ఫిబ్రవరి 15న బయలుదేరిన ఈ బృందం 330 నాటికల్ మైళ్లు (611 కి.మీ) ప్రయాణించి 54 గంటల్లో ఫిబ్రవరి 17న విశాఖ చేరుకుంది. అక్కడ యాట్‌ను ఒకసారి చెక్ చేసుకుని తిరిగి 18న బయలుదేరి 23న చెన్నై చేరుకున్నారు. వచ్చే సమయం కన్నా వెళ్లే సమయం ఎక్కువ పట్టింది. ‘కాకినాడ–కృష్ణపట్నం మధ్యలో ఉండే నూనె బావులను, చేపల వలల్ని తప్పించుకునేందుకు మేము బాగా సముద్రం లోపలికి వెళ్లాం. మా యాత్రలో ఒక పౌర్ణమి రాత్రి ఉంది. ఆ రాత్రంతా తీవ్రంగా ఉన్న సముద్ర అలలపై ప్రయాణం సవాలుగా మారింది’ అంది మేజర్ ముక్త. ఆమెది రాజస్థాన్. సముద్రమే లేని ప్రాంతం నుంచి సముద్రాన్ని ఈ యాత్రతో గెలిచింది. అయితే ఇదంతా సులభం కాదు. 44 అడుగుల పొడవు మాత్రమే ఉండే ఈ యాట్‌లో 150 చదరపు అడుగుల కేబిన్ ఉంటుంది. ఈ కేబిన్‌లోనే కిచెన్, టాయిలెట్లు, రెస్ట్ ప్లేస్ ఉంటాయి. పనిని బృందాలుగా విభజించుకుని ఒక బృందం డ్యూటీ దిగితే మరో బృందం డ్యూటీ ఎక్కితే డ్యూటీ దిగిన బృందం నిద్రకు ఉపక్రమించవచ్చు. కానీ అలల తాకిడికి కదిలే యాట్‌లో నిద్ర అంత సులభం కాదు. అయినా బృంద సభ్యులు లెక్క చేయలేదు. ‘మా యాత్రలో పెద్ద పెద్ద సముద్ర తాబేళ్లు చూశాం. ఒక డాల్ఫిన్ల గుంపు మా వెనుక చాలాసేపు వచ్చింది. అద్భుతం’ అంటారు మేజర్ ప్రియా దాస్. భారత నేవీ, తీర ప్రాంత గస్తీ దళాలు వీరి యాత్ర సాగినంత మేర వీరి యాట్‌ను ట్రాక్ చేస్తూ సాంకేతిక సహకారాన్ని అందించాయి. ‘నేను కేన్వాస్ మీద ప్రతిసారీ నీలి రంగును చిత్రించేదాన్ని. ఈ యాత్రతో జీవితకాలపు నీలిమను నేను గుండెల్లో నింపుకున్నాను’ అంది ప్రియా దాస్. స్త్రీలు నౌకాయానంలో రాణించాలని, సెయిలింగ్ క్రీడలో భాగస్వామ్యం తీసుకోవాలని వారికి సందేశం ఇవ్వడానికి ఈ యాత్ర చేశారు వీరంతా. 7500 కిలోమీటర్ల మేర తీరం ఉన్న మన దేశంలో నౌకాయానం వల్ల స్త్రీలు ఎంతో ఉపాధి పొందవచ్చు అని ఆలోచిస్తే ఈ సాహస యాత్ర పూర్తిగా విజయవంతమైనట్టే. -
నేత్ర... కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: సెయిలింగ్ క్రీడాంశంలో ఇప్పటివరకు భారత్ నుంచి తొమ్మిది మంది ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నారు. అయితే వారందరూ పురుషులే. కానీ మహిళల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ సెయిలర్‌గా తమిళనాడుకు చెందిన నేత్రా కుమనన్ బుధవారం రికార్డు సృష్టించింది. చెన్నైకి చెందిన 23 ఏళ్ల నేత్ర ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లో లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్లో పోటీపడుతోంది. బుధవారం రేసులు ముగిశాక 21 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో ఉంది. గురువారం జరిగే చివరి రోజు రేసుల తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేత్రకు ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. ‘మరో రేసు మిగిలి ఉండగానే నేత్ర కుమనన్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. గురువారం చివరి రేసు 20 పాయింట్లతో జరగనుంది. అయితే సమీప ప్రత్యర్థిపై నేత్ర 21 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో బుధవారమే ఆమెకు ఒలింపిక్స్ బెర్త్ ఖాయమైంది’ అని ఆసియా సెయిలింగ్ సమాఖ్య అధ్యక్షుడు మాలవ్ ష్రాఫ్ తెలిపారు. ఇప్పటివరకు భారత్ నుంచి సోలీ కాంట్రాక్టర్, బాసిత్ (1972 మ్యూనిక్), ధ్రువ్ భండారి (1984 లాస్ ఏంజెలిస్), కెల్లీ రావు (1988 సియోల్), ఫారూఖ్ తారాపూర్, సైరస్ కామా (1992 బార్సిలోనా), మాలవ్ ష్రాఫ్, సుమీత్ పటేల్ (2004 ఏథెన్స్), నచ్తార్ సింగ్ జోహల్ (2008 బీజింగ్) సెయిలింగ్‌లో ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు. -
సాహస యాత్రకు సబల సిద్ధం
సముద్రమంత తెగువ.. అవధులు లేని ఆత్మవిశ్వాసం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన.. సాగరం చిన్నబోయేలా.. సంకల్పం తలవంచేలా.. అలల ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తూ.. తిమిరంతో సమరం చేస్తూ కదన రంగంలోనూ సరిలేరు మాకెవ్వరంటూ భారత నౌకాదళం లో తమ శకాన్ని లిఖిస్తున్నారు మహిళలు. నౌకాదళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వర్తింపజెయ్యాలన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటినుంచి నౌకాదళంలో మహిళా శకం మొదలైంది. లింగసమానత్వానికి సరికొత్త నిర్వచనాన్ని తిరగరాస్తూ.. యుద్ధనౌకల్లో మహిళా అధికారుల్ని నియమించి కొత్త అధ్యాయానికి భారత నౌకాదళం తెరతీసింది. తొలి మహిళా పైలట్‌గా శివాంగి నియామకంతో సముద్రమంత ఉత్సాహం మహిళల్లో నెలకొంది. ఆ తర్వాత కొద్ది కాలానికే... యుద్ధ నౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితీసింగ్‌లు అడుగు పెట్టడంతో.. ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. నౌకాదళం అమ్ముల పొదిలో చేరిన అత్యాధునిక ఎంహెచ్–60 ఆర్ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి నియామకంతో సైన్యంలో మహిళలకు సమ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపించారు. ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలపై మహిళా అధికారులు మోహరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా... ఇప్పటి వరకూ నిర్మించిన ఏ యుద్ధ నౌకలోనూ మహిళలకంటూ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చెయ్యలేదు. కనీసం మహిళల కోసం ఏ ఒక్క యుద్ధ నౌకలోనూ ప్రత్యేక టాయిలెట్స్ లేవంటే.. తమకు యుద్ధ నౌకల్లో పని చేసే అర్హత లేదన్నట్లుగా భావించారన్న అనుమానాలు మహిళాలోకంలో వ్యక్తమవుతున్నాయి. అయితే.. మారుతున్న కాలానికనుగుణంగా నౌకా నిర్మాణంలోనూ మార్పులు రానున్నాయని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏకే జైన్ నేవీ డే సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే.. యుద్ధ నౌకల్లో మహిళల ప్రవేశం లాంఛనమైన నేపథ్యంలో.. వారికి కావల్సిన సౌకర్యాలతో నౌకల్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. తరిణి స్ఫూర్తితో బుల్ బుల్.... గోవా నుంచి కేప్‌టౌన్‌కు సెయిలింగ్ బోట్లో వెళ్లి తిరిగి దేశానికి చేరుకుంటూ.. భారతీయ మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఐఎన్ఎస్వీ తరిణి మహిళా బృందం చేసిన సాహసయాత్ర.. నౌకాదళంలోని మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. సుమారు 21 వేల నాటికల్ మైళ్ల దూరం.. ఐదు మహా సముద్రాలు, ఐదు అంచెల ప్రయాణం.. ఆరుగురు మహిళలు కలిసి... భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే లక్ష్యంగా సాగిన ‘నావికా సాగర్ పరిక్రమ’.. ఆసియాలోనే తొలిసారిగా కేవలం ఆరుగురు మహిళలతో కూడిన సెయిలింగ్ బోట్ సాహస యాత్ర ఇది. ఇండియన్ నేవీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల్లో 20 మందిని వివిధ పరీక్షల అనంతరం ఈ యాత్రకోసం ఆరుగురిని ఎంపిక చేశారు. తరిణికి సారధిగా లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి వ్యవహరించగా లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జమ్వాల్, లెఫ్టినెంట్ కమాండర్ పాతర్లపల్లి స్వాతి, లెఫ్టినెంట్లు విజయదేవి, లెఫ్టినెంట్ పాయల్‌గుప్తా, లెఫ్టినెంట్ ఐశ్వర్య బొడ్డపాటికి అవకాశం దక్కింది. స్వాతి విశాఖ అమ్మాయి కాగా, ఐశ్వర్య హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. ఈ యాత్ర అందించిన స్ఫూర్తి.. నౌకాదళంలో మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. తరిణి సాహస యాత్రని స్ఫూర్తిగా తీసుకొని.. మరో యాత్రకు మహిళల్ని పంపించేందుకు భారత నౌకాదళం సమాయత్తమవుతోంది. ఈ సాహస యాత్రకు బుల్బుల్ అని పేరు పెట్టినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సాహసయాత్రకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొదలైందనీ.. త్వరలోనే బుల్బుల్ యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా.. నౌకాదళంలో మహిళ పాత్ర అత్యవసరం.. ఆవశ్యకం అని చాటి చెప్పనున్నారు. మహిళల అంకితభావానికి హ్యాట్సాఫ్ ‘లింగభేదాన్ని సమూలంగా చెరిపేసేందుకు నౌకాదళం మహిళలకు పెద్ద పీట వేస్తోంది. యుద్ధనౌకల్లో క్రమంగా మహిళల ప్రాధాన్యం పెరిగే రోజులు సమీపంలోనే ఉన్నాయి. ఇప్పటికే వివిధ శాఖల్లో 9 నుంచి 10 మంది మహిళా అధికారులను శాశ్వతంగా నియమించే ప్రక్రియ మొదలైంది. అయితే సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు యుద్ధనౌకల్లో మహిళలకు సరైన మౌలిక వసతులు లేవు. ఇప్పుడా మచ్చ చెరిగిపోతుంది. వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు, వనరులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. కేవలం వృత్తిపరంగానే కాకుండా.. సాహసయాత్రల్లోనూ వారిది పై చేయి ఉండాలని సంకల్పించాం. ఇప్పటికే ఐఎన్ఎస్వీ తరిణి సాహస ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో త్వరలో బుల్బుల్ ప్రారంభం కానుంది. మహిళా అధికారులు నౌకాదళంలో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రదర్శిస్తున్న అంకిత భావానికి హ్యాట్సాఫ్ – వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, తూర్పు నౌకాదళాధిపతి – కరుకోల గోపీకిశోర్‌రాజా సాక్షి, విశాఖపట్నం -
తండ్రి లేడు... అమ్మ టైలర్
పదేళ్ల అమ్మాయి మూడున్నరేళ్ల క్రితం సెయిలింగ్ నేర్చుకుంది. ఇది భూమి ఉపరితలంపై ఆడే ఆటకాదు. కొలనులో ఈది గెలిచే స్విమ్మింగ్ కాదు. అలలపై తేలియాడుతూ గాలి ఉదుటున తెరచాపను తెలివిగా తిప్పే సెయిలింగ్. అలాంటి క్రీడలో అచిర కాలంలోనే పట్టుసాధించింది. పద్నాలుగేళ్లకే జాతీయస్థాయిలో విజేతగా నిలిచింది. ఆ టీనేజ్ సంచలనమే ప్రీతి కొంగరి. ఒక రేసుతో ముగియదు. రెండో రేస్‌తో ఫలితం వచ్చేయదు. కనీసం ఏడెనిమిది రేసుల్లో నిలకడగా రాణిస్తేనే గెలిచే ఆట సెయిలింగ్. తెరచాపే స్టీరింగ్. అలా అని సీట్లో కూర్చొని తిప్పడం కుదరనే కుదరదు. ఒంటిని విల్లులా మార్చాలి. గాలి వేగానికి అనుగుణంగా పడవ (సెయిలింగ్ బోట్)ను నీటిపై పరుగెత్తించాలి. ఇలాంటి భిన్నమైన క్రీడలో 14 ఏళ్ల ప్రీతి ప్రతిభ అపారం. ఈస్ట్ మారేడ్‌పల్లిలోని నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ప్రీతి కేవలం మూడున్నర ఏళ్ల కృషితోనే జాతీయ స్థాయిలో మెరిసింది. తాజాగా హుస్సేన్‌సాగర్‌లో నిర్వహించిన జాతీయ ర్యాంకింగ్ మాన్సూన్ రెగెట్టాలో హైదరాబాద్ యాట్ క్లబ్ (వైసీహెచ్)కు చెందిన ప్రీతి విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా 131 మంది యువ సెయిలర్లు బరిలో ఉన్న ఈ పోటీల్లో హైదరాబాద్ చిన్నది గెలవడం ఆషామాషీ కాదు. అనుకోకుండా అలలపైకి నీళ్లంటే ప్రీతికి భయం. అందుకే వాటర్‌స్పోర్ట్స్ వైపు కన్నెత్తి చూడలేదు. సెయిలర్ కావాలన్న ప్రణాళిక కూడా లేదు. కానీ ఇలాంటి భయభీతులున్న ఆమె అనుకోకుండా అలలకు పరిచయమైంది. పదేళ్ల వయసుదాకా ఇల్లే తన ప్రపంచం. అమ్మే ఆమెకు అందమైన లోకం. స్నేహితులతోనే సంతోషం. అలాంటి ప్రీతికి యాట్ క్లబ్ (వైసీహెచ్) కోచ్, వ్యవస్థాపకుడు సుహీమ్ షేక్ చేయూత నిచ్చారు. సెయిలింగ్‌లో నడిపించారు. ఇప్పుడామెకు నీళ్లంటే భయంలేదు. సెయిలింగే జీవితం. పోటీలే తనముందున్న ప్రపంచం. గెలుపే ఆమె లక్ష్యం. కోచ్ సుహీమ్ షేక్‌తో... ప్రీతి తండ్రి లేడు... అమ్మ టైలర్ పేదింటి అమ్మాయి ప్రీతి. తండ్రి లేడు. అమ్మ విజయలక్ష్మి టైలర్. ఇది చాలు ఆమె ఆర్థికస్థోమతేంటో తెలుసుకోడానికి..! కడుపునిండా తినడానికి, చదువుకోవడానికే అష్టకష్టాలు పడుతున్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె పట్టుదల ముందు ఆర్థిక నేపథ్యం ఓడిపోయింది. ఆమె లక్ష్యఛేదనలో ఎదురైన సవాళ్లన్ని నీట మునిగాయి. ఆమె మాత్రం జాతీయ చాంపియన్. అదికూడా అచిర కాలంలోనే! బెస్ట్ సెయిలర్ ప్రీతి జాతీయ ఈవెంట్లో అమె రెండు చాంపియన్‌షిప్ ట్రోఫీలు గెలుచుకుంది. ఆప్టిమిస్ట్లో చాంపియన్‌గా నిలిచిన ఆమె బాలికల ఆప్టిమిస్ట్ ఫ్లీట్ కేటగిరిలో ఓవరాల్ ట్రోఫీ కూడా గెలుచుకుంది. ఒక రేసులోనూ విఫలమవకుండా పూర్తి చేయడం ద్వారా ‘ఉత్తమ సెయిలర్’ అవార్డు కూడా అందుకుంది. అంతకుముందు ఈ నెలారంభంలో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సెయిలింగ్ రెగెట్టాలో ప్రీతి రెండు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఇందులో వందమందికి పైగా సెయిలర్లు పాల్గొన్నారు. లక్ష్యమే నన్ను నడిపిస్తోంది ‘‘సెయిలింగే నా జీవితం. ప్రాక్టీస్ తప్ప మరో ఆలోచన లేదిపుడు. నీళ్లలో దిగిన ప్రతిరోజు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలన్న లక్ష్యమే నన్ను నడిపిస్తుంది. తప్పకుండా గత రేసుకు కొత్త రేసుకు తేడా చూపాలనుకుంటాను. పోటీకి దిగితే మెరుగైన ప్రదర్శన తప్ప మిగతా వాటి గురించి ఆలోచించను.’’ – ప్రీతి కొంగరి అంతర్జాతీయ పోటీలకు సెయిలింగ్ మెరిక అయిన ప్రీతి ఇప్పుడు అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది చివర్లోగానీ లేదంటే 2020 ఆరంభంలోగానీ ఆ పోటీలు జరుగుతాయి. అప్పటిదాకా క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌లో నిమగ్నం కావాలనుకుంటోంది. ప్రతీరేసులో విజయాన్ని ఆస్వాదించాలని ఆశిస్తోంది. అలాగే చదువును అలక్ష్యం చేయనని చెబుతోంది. కెరీర్‌ను ఉన్నత చదువులకు ఇబ్బంది కాకుండా మలచుకుంటానని చెప్పింది.– యెల్లా రమేశ్సాక్షి స్పోర్ట్స్ డెస్క్ -
అగ్రస్థానంలో ప్రీతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లలో పెద్ద టోర్నీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్ తొలిరోజు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. హుస్సేన్‌సాగర్ జలాల్లో మంగళవారం ప్రారంభమైన ఈ చాంపియన్‌షిప్ తొలిరోజు పోటీల్లో అమ్మాయిల హవా కొనసాగింది. హైదరాబాద్‌కు చెందిన భారత నం.3 సెయిలర్ ప్రీతి కొంగర తన ప్రతిభను ప్రదర్శిస్తూ తొలిరోజు పోటీల్లో విజేతగా నిలిచింది. హైదరాబాద్ యాట్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మూడు రేసుల్లో ప్రీతి రాణించింది. రెండు రేసుల్ని అగ్రస్థానంతో ముగించిన ఆమె మూడో రేసులో రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా 4 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఎల్. ధరణి 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా... 22 పాయింట్లతో ఎల్. ఝాన్సీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వీరికి పోటీనిచ్చిన మరో సెయిలర్ లక్ష్మీ నూకరత్నం చివరకు 17వ స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. తొలి రెండు రేసుల్లో ఒక విజయం, మరోదాంట్లో మూడోస్థానంలో నిలిచిన లక్ష్మి.. మూడో రేసును నిర్ణీత సమయం కన్నా ముందే ప్రారంభించి అనర్హతకు గురైంది. దీంతో ఆమె 17వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వికారాబాద్‌కు చెందిన అజయ్ 30 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా.. సంతోష్ (34 పాయింట్లు) అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు. తెలంగాణ సెయిలింగ్ సంఘం (టీఎస్ఏ), భారత యాటింగ్ సంఘం, హైదరాబాద్ యాట్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 60 మంది సెయిలర్లు తలపడ్డారు. నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. -
జితేశ్‌కు ఆరు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ జలాల్లో సందడి చేసిన సీనియర్ మల్టిక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో ఆర్మీ యాటింగ్ నోడ్ (ఏవైఎన్) సెయిలర్ జితేశ్ అదరగొట్టాడు. ఈఎంఈ సెయిలింగ్ సంఘం, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, భారత లేజర్ క్లాస్ సంఘం (ఎల్సీఏఐ) సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా ఆరు టైటిళ్లను జితేశ్ కైవసం చేసుకున్నాడు. లేజర్ స్టాండర్డ్ ఓపెన్ ట్రోఫీ, లేజర్ రేడియల్ ఓపెన్ ట్రోఫీ, ఎస్ఎస్సీ రోలింగ్ ట్రోఫీ, వైఏఐ కటారి బౌల్ అవార్డు, లెఫ్టినెంట్ కెల్లీరావు ట్రోఫీ, మేజర్ ఏఏ బాసిత్ ట్రోఫీలను అతను హస్తగతం చేసుకున్నాడు. దేశంలోని 17 ప్రముఖ సెయిలింగ్ క్లబ్‌లకు చెందిన మొత్తం 192 మంది సెయిలర్లు ఈ పోటీల్లో తలపడ్డారు. ఇందులో 22 మంది మహిళా సెయిలర్లూ పోటీపడ్డారు. టోర్నీలో పాల్గొన్న వారిలో 68 ఏళ్ల మురళీ కనూరి, 13 ఏళ్ల అన్షురాజ్ అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఓవరాల్ విజేతలుగా నిలిచిన వారికి ఆదివారం బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్సీఏఐ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జీత్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, పతకాలను ప్రదానం చేశారు. లేజర్ స్టాండర్డ్ ఓపెన్ కేటగిరీలో జితేశ్ 16 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకోగా, హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్) 27 పాయింట్లతో రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ముజాహిద్ ఖాన్ (ఏవైఎన్) 33 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. లేజర్ స్టాండర్డ్ (అండర్–21) విభాగంలో శిఖర్ గార్గ్ (ఎన్ఎస్ఎస్, 90 పాయింట్లు), నాగార్జున (టీఎస్సీ, 133 పాయింట్లు), అథర్వ్ తివారీ (ఈఎంఈఎస్‌ఏ, 213 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమంలో ఈఎంఈఎస్‌ఏ వైస్ కమాండర్ టీఎస్ఏ నారాయణ్, షూటర్ గగన్ నారంగ్, రాష్ట్ర క్రీడా కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు లేజర్ రేడియల్ ఓపెన్: 1. జితేశ్ (ఏవైఎన్), 2. హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్), 3. నేత్ర (టీఎన్‌ఎస్‌ఏ). మహిళలు: 1. నేత్ర (టీఎన్‌ఎస్‌ఏ), 2. రమ్య శరవణన్ (సీఈఎస్సీ), 3. జయలక్ష్మి (టీఎన్‌ఎస్‌ఏ). వైయు–19: 1. ఎన్. హేమంత్ (టీఎస్సీ), 2. సతీశ్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 3. నవీన్ (టీఎస్ఎస్ఏ). ఏఎం: 1. షరీఫ్ ఖాన్ (ఏవైఎన్), 2. సీడీఆర్ ఎంఎల్ శర్మ (ఐఎన్‌డబ్ల్యూటీసీ). లేజర్ 4.7 ఓపెన్: 1. రమిలాన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 2. రితిక (ఎన్ఎస్ఎస్), 3. సిఖాన్షు సింగ్ (టీఎస్సీ). అండర్–19 బాలురు: 1. సిఖాన్షు సింగ్ (టీఎస్సీ), 2. సంజయ్‌రెడ్డి (ఈఎంఈఎస్‌ఏ), 3. ఆశిష్ (ఎన్ఎస్ఎస్). అండర్–16 బాలికలు: 1. రితిక (ఎన్ఎస్ఎస్), 2. సంచిత (ఈఎంఈఎస్‌ఏ), 3. అశ్విని (ఈఎంఈఎస్‌ఏ). అండర్–18 బాలికలు: 1. సాన్య (ఈఎంఈఎస్‌ఏ), శ్రద్ధ వర్మ (ఎన్ఎస్ఎస్), 3. నిత్య (టీఎన్‌ఎస్‌ఏ). ఆర్ఎస్:ఎక్స్: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. డేన్ కోయిలో (జీవైఏ), 3. మన్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్). ఫిన్: 1. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 2. వివేక్ (ఏవైఎన్). 470 క్లాస్: 1. పీపీ ముత్తు–ఎస్సీ సింఘా, 2. అయాజ్–ఉప్కార్ సింగ్, 3. అతుల్ లిండే–సీహెచ్ఎస్రెడ్డి 470 యూత్: బినూబ్, అఖిల్ (టీఎస్సీ). -
లేజర్ స్టాండర్డ్‌లో జితేశ్ ఆధిపత్యం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ జలాల్లో సందడి చేస్తోన్న ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో జితేశ్ (ఆర్మీ యాటింగ్ నాడ్–ఏవైఎన్) తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించాడు. లేజర్ స్టాండర్డ్ ఈవెంట్లో బుధవారం మూడు రేసులు జరుగగా... రెండింటిలో జితేశ్ విజేతగా నిలిచాడు. మొదటి, మూడు రేసుల్లో అగ్రస్థానాన్ని జితేశ్ అందుకోగా, రెండో రేసులో జితేశ్‌ను వెనక్కినెట్టి ముజాహిద్ ఖాన్ తొలి స్థానంలో నిలిచాడు. లేజర్ రేడియల్ విభాగంలోనూ ఏవైఎన్ క్రీడాకారుల హవా కొనసాగింది. రేడియల్ తొలి రేసులో హర్‌ప్రీత్ సింగ్, రెండో రేసులో జితేశ్ గెలుపొందారు. లేజర్ 4.7 తొలి రెండు రేసుల్లో ఎన్ఎస్ఎస్కు చెందిన ఆశిష్ విశ్వకర్మ, రమిలాన్ యాదవ్.. మూడో రేసులో టీఎస్ఈ సెయిలర్ సిఖాన్షు సింగ్ గెలుపొందారు. 470 క్లాస్ ఈవెంట్‌ను ఏవైఎన్ సెయిలర్లు హస్తగతం చేసుకున్నారు. తొలి రేసును అతుల్–సీహెచ్ఎస్ రెడ్డి, రెండో రేసును పీపీ ముత్తు–ఎస్సీ సింఘా, మూడో రేసును పీపీ ముత్తు–ఎస్సీ సింఘా గెలుచుకున్నారు. ఆర్ఎస్:ఎక్స్ విభాగం తొలి రేసును ఈఎంఈఎస్‌ఏ సెయిలర్ డేనీ కోయిలో గెలుపొందాడు. రెండు, మూడు రేసుల్లో ఏవైఎన్ క్రీడాకారులు వరుసగా మన్‌ప్రీత్ సింగ్, జెరోమ్ కుమార్ నెగ్గారు. ఫిన్ విభాగంలో మూడు రేసుల్లో వరుసగా స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), జస్వీర్ సింగ్ (ఏవైఎన్), ఎంకే యాదవ్ (ఏవైఎన్) విజేతలుగా నిలిచారు. -
నేవీ సెయిలింగ్ జట్టుకు రాష్ట్ర విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: సెయిలింగ్‌లో సత్తా చాటుతోన్న తెలంగాణ విద్యార్థులు సి. కార్తీక్, బి. సంతోష్‌లు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరిద్దరూ నేవీ సెయిలింగ్ జట్టుకు ఎంపికయ్యారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లో ఎనిమిదో తరగతి చదువుతోన్న సి. కార్తీక్ (మహబూబ్‌నగర్), సంతోష్ (జనగాం) నేవీ జట్టుకు ఎంపికయ్యారని సొసైటీ కార్యదర్శి షఫీయుల్లా తెలిపారు. కృష్ణపట్నంలో జరిగిన యూత్ నేషనల్, ఇంటర్నేషనల్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన వీరిద్దరూ గోవా మండోవికి చెందిన ‘నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ బ్యాచ్–2’లో చోటు దక్కించుకున్నారు. ఇందులో భాగంగా నేడు గోవాలోని నేవీ స్కూల్లో చేరనున్నారు. ఇక్కడ వీరికి చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యుత్తమ శిక్షణను అందిస్తారు. విద్యాభ్యాసం అనంతరం వీరిద్దరూ ఇండియన్ నేవీలో భాగమవుతారు. ఈసందర్భంగా టీఎంఆర్ఈఐఎస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు వీరి ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్‌లో గొప్పగా రాణించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఐఎఫ్ఎస్ షఫీయుల్లా ఆకాంక్షించారు. -
ఆకట్టుకున్న విజయ్, విక్రమ్
సాక్షి, హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. హుస్సేన్‌సాగర్‌లో శనివారం జరిగిన మూడోరోజు పోటీల్లో ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన విజయ్ 49 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. హైదరాబాద్ యాట్ క్లబ్ సెయిలర్ బి. జైకిరణ్ మూడో స్థానంలో ఉన్నాడు. కర్ణాటక త్రిష్ణ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన చున్ను కుమార్ 41 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉన్నాడు. హైదరాబాద్ యాట్ క్లబ్లో శిక్షణ పొంది ఆర్మీ స్కూల్‌కు ఎంపికైన విజయ్ శనివారం జరిగిన రెండు రేసుల్లో విజేతగా నిలిచాడు. ఉమా చౌహాన్ (ఎన్ఎస్ఎస్ భోపాల్) 49 పాయింట్లతో విజయ్‌తో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచింది. -
విజేతలు లలిత, గౌతమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యాటింగ్ క్లబ్ సెయిలర్లు మజ్జి లలిత, గౌతమ్ కంకట్ల సత్తా చాటారు. హుస్సేన్‌సాగర్‌లో జరిగిన ఈ టోర్నీలో లలిత ‘తెలంగాణ స్టేట్ సెయిలింగ్ సబ్ జూనియర్ చాంపియన్’ ట్రోఫీని అందుకుంది. ఓపెన్ కేటగిరీలోనూ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని గెలుచుకుంది. మరోవైపు జూనియర్స్, ఓపెన్ జూనియర్స్ కేటగిరీల్లో గౌతమ్ చాంపియన్‌గా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. బాలికల సబ్ జూనియర్స్ కేటగిరీలో తొలి మూడు స్థానాలను తెలంగాణ అమ్మాయిలే దక్కించుకోవడం విశేషం. 49 పాయింట్లతో లలిత స్వర్ణాన్ని గెలుచుకోగా... మహబూబీ (53), లక్ష్మి నూకరత్నం (56) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. ఓపెన్ విభాగంలో కర్ణాటకకు చెందిన చున్నుకుమార్ 19 పాయింట్లతో విజేతగా నిలిచాడు. లలిత (49) రన్నరప్‌గా నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమా చౌహాన్ 52 పాయింట్లతో మూడోస్థానాన్ని దక్కించుకుంది. బాలుర జూనియర్స్ విభాగంలో 29 పాయింట్లతో గౌతమ్, సంజయ్ రెడ్డి (47), టి. అజయ్ (52) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. ఓపెన్ జూనియర్స్ విభాగంలో గౌతమ్ (29), రామ్ మిలన్ యాదవ్ (31, మధ్యప్రదేశ్) స్వర్ణ, రజతాలను గెలుచుకోగా... సతీశ్ యాదవ్ (32, మధ్యప్రదేశ్) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. -
లక్ష్మి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ సెయిలింగ్ రెగెట్టా చాంపియన్‌షిప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో హైదరాబాద్ యాటింగ్ క్లబ్ (వైసీహెచ్) సెయిలర్లు లక్ష్మీ నూకరత్నం, మజ్జి లలిత, గౌతమ్ కంకట్ల ఆకట్టుకున్నారు. 48 మంది సెయిలర్లు తలపడిన సబ్ జూనియర్ విభాగం తొలిరేసులో హైదరాబాద్ అమ్మాయిలు లక్ష్మి, లలిత మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. 12 పాయింట్లు సాధించిన లక్ష్మి అగ్రస్థానాన్ని, 20 పాయింట్లతో లలిత రెండోస్థానాన్ని దక్కించుకున్నారు. తుంగర మహబూబీ 25 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. ఓపెన్ కేటగిరీలో కర్ణాటకకు చెందిన చున్ను కుమార్ (3 పాయింట్లు) అద్భుత ప్రదర్శనతో తొలిస్థానంలో నిలిచాడు. లక్ష్మీ (12 పాయింట్లు), ఉమా చౌహాన్ (13, మధ్యప్రదేశ్) తర్వాతి స్థానాలను సాధించారు. జూనియర్స్ విభాగంలో గౌతమ్ 15 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్ మిలన్ యాదవ్ (6), తమిళనాడు సెయిలర్లు చిత్రేశ్ (13), అనికేత్ రాజారామ్ (14) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 130 మంది సెయిలర్లు పాల్గొన్నారు. తెలంగాణలోని 15 జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు బరిలో దిగారు. -
రిషబ్, జూహీ దేశాయ్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో ఐదు రోజులుగా సందడి చేసిన సీనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసింది. ఈ పోటీల్లో యాటింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెయిలర్లు రిషబ్ నాయర్, జూహీ దేశాయ్ సత్తా చాటారు. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, భారత లేజర్ క్లాస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో లేజర్ 4.7 విభాగంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. లేజర్ 4.7 అండర్–18 ఓపెన్ కేటగిరీలో రిషబ్ నాయర్ 27 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్ఎస్ఎస్కు చెందిన సతీశ్ యాదవ్ (31 పాయింట్లు), రామ్ మిలన్ యాదవ్ (38 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల కేటగిరీలో జూహీ దేశాయ్ 113 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. రజతాన్ని సాధించిన కె. రజనీ ప్రియ (ఈఎంఈఎస్‌ఏ) 185 పాయింట్లతో రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్‌కు చెందిన దిలీప్ కుమార్ లేజర్ రేడియల్ ఓపెన్ కేటగిరీలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఆర్మీ యాటింగ్ నాడ్ (ఏవైఎన్)కు చెందిన రమ్య శరవణన్ మహిళల లేజర్ రేడియల్ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ఆసాంతం రాణించిన మోహిత్ సైనీ (ఏవైఎన్) లేజర్ స్టాండర్డ్ ఓపెన్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన గితేశ్ (ఏవైఎన్) లెఫ్టినెంట్ కమాండర్ కెల్లీ ఎస్ రావు స్మారక ట్రోఫీని అందుకున్నాడు. తొలిసారి ర్యాంకింగ్ ఈవెంట్‌గా నిర్వ హించిన ఈ పోటీల్లో 15 క్లబ్‌లకు చెందిన 195 మంది సెయిలర్లు పాల్గొన్నారు. లేజర్ స్టాండర్డ్ విభాగంలో 48 మంది, లేజర్ రేడియల్ విభాగంలో 67 మంది, లేజర్ 4.7 కేటగిరీలో 35, ఆర్ఎస్:ఎక్స్ విభాగంలో 16, 470 క్లాస్ కేటగిరీలో 24 మంది, ఫిన్ కేటగిరీలో ఐదుగురు సెయిలర్లు పోటీపడ్డారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జీత్ సింగ్ పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు 470 క్లాస్: 1. అతుల్ లిండే– సీహెచ్ఎస్ రెడ్డి (ఏవైఎన్), 2. ప్రవీణ్ కుమార్– సుధాన్షు శేఖర్ (ఈఎన్‌డబ్ల్యూటీసీ–ఎం), 3. సోను జాతవ్– ఆర్కే శర్మ (ఈఎన్‌డబ్ల్యూటీసీ–ఎం). ఆర్ఎస్: ఎక్స్: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. మన్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్), 3. కమలాపతి (ఈఎంఈఎస్‌ఏ). లేజర్ 4.7 ఓపెన్: 1. రిషబ్ నాయర్ (వైసీహెచ్), సతీశ్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్). లేజర్ 4.7 అండర్–16 బాలురు: 1. రామ్ మిలన్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 2. ఎ. సంజయ్ రెడ్డి (ఈఎంఈఎస్‌ఏ), 3. ఆశిష్ విశ్వకర్మ (ఎన్ఎస్ఎస్). లేజర్ 4.7 బాలికలు: 1. నిత్య బాలచంద్రన్ (టీఎన్‌ఎస్‌ఏ), 2. సంచిత పతం (ఈఎంఈఎస్), 3. ఆర్. అశ్విని (ఈఎంఈఎస్). లేజర్ 4.7 అండర్–18 బాలికలు: 1. జూహీ దేశాయ్ (వైసీహెచ్), 2. కె. రంజనీ ప్రియ (ఈఎంఈఎస్‌ఏ). ఫిన్: 1. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్), 2. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 3. నవీన్ కుమార్ (ఏవైఎన్). లేజర్ స్టాండర్డ్ ఓపెన్: 1. మోహిత్ సైనీ (ఏవైఎన్), 2. ముజాహిద్ ఖాన్ (ఏవైఎన్), 3. గితేశ్ (ఏవైఎన్). లేజర్ స్టాండర్డ్ అండర్–21 యూత్: 1. పునీత్ కుమార్ సాహూ (ఐఎన్డబ్ల్యూసీటీ–ఎం), 2. నాగార్జున (టీఎస్సీ), 3. యమన్దీప్ (ఈఎంఈఎస్సీ). లేజర్ స్టాండర్డ్ అప్రెంటీస్ మాస్టర్: 1. బీకే రౌత్ (ఈఎంఈఎస్‌ఏ), 2. పర్వీందర్ సింగ్ (ఈఎంఈఎస్‌ఏ), 3. చంద్రకాంత రావు (ఐఎన్‌డబ్ల్యూటీసీ–కే). లేజర్ రేడియల్ ఓపెన్: 1. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ), 2. గితేశ్ (ఏవైఎన్), 3. ఇస్రాజ్ అలీ (ఏవైఎన్). లేజర్ రేడియల్ మహిళలు: 1. రమ్య శరవణన్ (ఏవైఎన్), 2. తను బిసేస్ (ఎన్ఎస్ఎస్), 3. అనన్య (ఈఎంఈఎస్‌ఏ). లేజర్ రేడియల్ అండర్–19 యూత్: 1. రమ్య శరవణన్ (ఏవైఎన్), 2. సతీశ్ యాదవ్ (ఎన్ఎస్ఎస్), 3. ఎం. కోటేశ్వరరావు (టీఎస్సీ). లేజర్ రేడియల్ అప్రెంటీస్ మాస్టర్: 1. ధర్మేంద్ర (ఏవైఎన్), 2. జస్వీర్ సింగ్ (ఏవైఎన్), 3. బీకే శర్మ (ఈఎంఈఎస్‌ఏ). లేజర్ రేడియల్ మాస్టర్: 1. సీడీఆర్ ఎంఎల్ శర్మ (ఐఎన్‌డబ్ల్యూటీసీ–కే). లేజర్ రేడియల్ గ్రేట్ గ్రాండ్‌మాస్టర్: 1. మురళీ కనూరి (ఎస్ఎస్సీ). -
రెండో రోజూ మోహిత్ సైనీ జోరు
సాక్షి, హైదరాబాద్: ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, ఏజిస్ ఆఫ్ లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తోన్న సీని యర్ మల్టీ క్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో రోజు మోహిత్ సైనీ జోరు కనబర్చాడు. లేజర్ స్టాండర్డ్ విభాగంలో బరిలో దిగిన అతను గురువారం జరిగిన మూడు రేసుల్లో రెండింట్లో అగ్రస్థానంలో నిలిచాడు. మరో రేసులో ఉపమన్యు దత్తా తొలి స్థానం దక్కించుకున్నాడు. ఫిన్ క్లాస్ విభాగంలో నిర్వహించిన మూడు రేసులూ పోటాపోటీగా సాగా యి. తొలి రౌండ్లో స్వతంత్ర సింగ్, రెండో రౌండ్లో గుర్జీత్ సింగ్, మూడో రౌండ్లో నవీన్ అగ్రస్థానాలు దక్కించుకున్నారు. ముగ్గురు సెయిలర్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు. రెండో రోజు కూడా వాతావరణం సహకరించకపోవడంతో సెయిలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో గంటకు 20కి.మీ. వేగంతో గాలి వీస్తుండటంతో దాన్ని తట్టుకుంటూ ముందుకు సాగడం సెయిలర్లకు కష్టసాధ్యమైంది. -
సెయిలింగ్‌లో మోహిత్ సైనీ హవా
సాక్షి, హైదరాబాద్: ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, ఏజిస్ ఆఫ్ లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తోన్న సీనియర్ మల్టీ క్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు మోహిత్ సైనీ సత్తా చాటాడు. లేజర్ స్టాండర్డ్ విభాగంలో బరిలో దిగిన అతను మూడు రేసుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో ముజాహిద్ ఖాన్ మూడు రేసుల్లోనూ వరుసగా మూడో, రెండో, మూడో స్థానాలు దక్కించుకున్నాడు. కాగా వాతావరణం అనుకూలించకపోవడంతో సెయిలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వచ్చింది. బుధవారం హుస్సేన్ సాగర్ ప్రాంతంలో విపరీతమైన గాలులు వీస్తుండటంతో సెయిలర్లు తమ అత్యుత్తమ ప్రతిభను కనబర్చలేకపోయారు. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో దాన్ని తట్టుకుంటూ ముందుకు సాగడం సెయిలర్లకు కష్ట సాధ్యమైన పనిగా మారింది. ఉదయంతో పోల్చుకుంటే సాయంత్రం గాలి తీవ్రత తగ్గడంతో పోటీలు కాస్త సజావుగా సాగాయి. -
హైదరాబాద్‌లో సెయిలింగ్ సందడి
హైదరాబాద్: జాతీయ స్థాయి సెయిలింగ్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చేందుకు హుస్సేన్ సాగర్ సన్నద్ధమైంది. ప్రతి ఏడాది ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’ పేరిట జరుగనున్న ఈ టోర్నీని తొలిసారి ర్యాంకింగ్ ఈవెంట్‌గా నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది సెయిలర్లు ఇందులో తలపడతారని ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ వైస్ కమాండర్, మేజర్ జనరల్ నారాయణ తెలిపారు. టోర్నీలో ప్రదర్శన ఆధారంగా సెయిలర్లకు ర్యాంకులు కేటాయిస్తామని చెప్పారు. ఈ ర్యాంకులు జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు అర్హతగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ పోటీల్లో సీనియర్ మల్టీక్లాస్ ర్యాంకింగ్ రెగెట్టాతో పాటు, లేజర్ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తారు. సాగర్‌లో పరిశుభ్రత కార్యక్రమం... హైదరాబాద్ సెయిలింగ్ వీక్ జరుగనున్న నేపథ్యంలో ‘మిలిట్రీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్’ (ఎంసీఈఎంఈ) విద్యార్థులు ‘గ్రీన్ బ్రిగేడ్ వాక్’, ‘సేవ్ లేక్ క్యాంపెయిన్’, ‘ఫిట్ హైదరాబాద్ స్వచ్ఛ్ హైదరాబాద్’ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు 6000 మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి సరస్సులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు. ఆయన హుస్సేన్‌సాగర్‌ను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొంటూ చెత్తా చెదారాన్ని తొలగించారు. వ్యాయామం ఆవశ్యకతను తెలియజేస్తూ విద్యార్థులు నిర్వహించిన 3.5 కి.మీ నడకలో పాల్గొన్నారు. ‘స్వచ్ఛ్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ సెయిలింగ్ సంఘం గౌరవ కార్యదర్శి మేజర్ అలోక్‌కుమార్, లెప్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్న అజహర్