samai kayandhara
-
చివరి 5 గంటలు...సమైక్యాంధ్ర సీఎస్‌గా కృష్ణారావు
ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలు స్వీకరణ నేడు ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా జె.వి.రాముడు నియామకం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బయ్యారపు ప్రసాదరావు హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని సీ బ్లాకులో పదవీ విరమణ చేయనున్న సీఎస్ మహంతి నుంచి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్‌గా కొనసాగిరికార్డు సృష్టించినట్లైంది. ఒక రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్‌గా పనిచేసిన చరిత్ర ఇప్పటివరకూ ఎక్కడా లేదు. 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్.కృష్ణారావు సీసీఎల్ఏ కమిషనర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సమైక్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహంతి ఆదివారం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటంతో.. కృష్ణారావుకు సమైక్యాంధ్రప్రదేశ్ సీఎస్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావును నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారమే మరో ఉత్తర్వును జారీ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఐ.వై.ఆర్.కృష్ణారావు నియామకం అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన సీఎస్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కృష్ణారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు నెలల కిందటే సీఎస్ కావాల్సింది... సీఎస్‌గా మహంతి పదవీ కాలం మూడు నెలల కిందటే ముగిసింది. అప్పుడే కృష్ణారావు సీఎస్ అవుతారని అందరూ భావించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పలనాపరమైన కొనసాగింపు కోసం కేంద్ర ప్రభుత్వం మహంతినే మరో నాలుగు నెలలు సీఎస్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడే కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహంతి ఈ నెలాఖరు వరకు సీఎస్‌గా కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో నెల రోజుల ముందుగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. దీంతో కృష్ణారావుకు రాష్ట్రం విడిపోవటానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్రప్రదేశ్‌కు సీఎస్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా రాముడు రాష్ట్ర పోలీసు విభాగంలోని ఆపరేషన్స్ వింగ్ డీజీపీగా పని చేస్తున్న జాస్తి వెంకట రాముడును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 1981 బ్యాచ్‌కు చెందిన జె.వి.రాముడు ప్రస్తుతం ఆపరేషన్స్ డీజీపీ హోదాలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ నియామకం అన్నది ఆయా ప్రభుత్వాల సిఫారసు మేరకు యూపీఎస్సీ సిఫారసుల ఆధారంగా జరుగుతుంది. ఈ తంతు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌కు రాముడు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రాముడు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో పాటు పోలీసు విభాగంలో ఇతర కీలక పోస్టుల భర్తీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీగా ఉన్న డాక్టర్ బయ్యారపు ప్రసాదరావును ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి టి.పి.దాస్‌ను ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డెరైక్టర్ జనరల్‌గా, ఆర్.పి.ఠాకూర్‌ను ఆ విభాగం అదనపు డెరైక్టర్ జనరల్‌గా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ ప్రసాదరావుకు విచిత్రమైన అనుభవం ఎదురవుతోంది. సాధారణంగా డీజీపీగా పని చేస్తూ బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన అధికారులు తమ బాధ్యతల్ని ఒక్కరికే అప్పగిస్తారు. కొత్తగా ఆ పోస్టులోకి వచ్చిన వారికి లేదా మరో డీజీ స్థాయి/అదనపు డీజీ స్థాయి వారికి అప్పగించి రిలీవ్ అవుతుంటారు. ప్రసాదరావు విషయం దీనికి పూర్తి భిన్నంగా ఉండనుంది. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి డీజీపీ కావడంతో ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తాత్కాలిక డీజీపీలుగా నియమితులైన జె.వి.రాముడు, అనురాగ్ శర్మలకు బాధ్యతలు అప్పగించనున్నారు. పోలీసు విభాగంలో హెచ్ఓడీలుగా (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) వ్యవహరించే వారంతా ఈ రకంగానే బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఉంది. ఐదుగురు ఐపీఎస్‌ల డెప్యుటేషన్ పొడిగింపు రాష్ట్రంలో డెప్యుటేషన్‌పై పని చేస్తున్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల డెప్యుటేషన్ కాలాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న జె.అజయ్‌కుమార్ (1997), డి.కల్పననాయక్ (1998), మహేందర్కుమార్రాథోడ్ (2001), ఎస్.గోపాల్‌రెడ్డి (1985), బి.బాలనాగదేవి (1995) డెప్యుటేషన్ కాలం ముగుస్తున్నప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. -
నేడు జిల్లా బంద్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వ దూకుడుకు నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక గురువారం బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగళ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో, కళాశాలలన్నీ బంద్‌లో భాగంగా మూతపడనున్నాయన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా చేపడుతున్న బంద్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. ఆర్టీసీ బస్సులను సైతం తిరుగనివ్వబోమన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. -
సమైక్యవాదుల కన్నెర్ర
వైవీయూ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ఇప్పటికే ఏపీఎన్జీఓలు సమ్మెబాట పట్టడంతో పలు చోట్ల కార్యాలయాలు మూతపడ్డాయి. కడప నగరంలోని ఎన్జీఓల ఆధ్వర్యంలో ఇర్కాన్సర్కిల్లో రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. దీనికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించి రహదారిపై బైఠాయించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ర్టపతి వ్యతి రేకించకుండా పార్లమెంట్క పంపడం దారుణమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అలా గే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కడప డిపో ఆవరణంలో ధర్నా చేపట్టారు. రీజినల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం మాట్లాడుతూ అవసరమైతే సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజంపేటలో తెలంగాణ లాయర్లు జయప్రకాష్నారాయణపై ఏపీభవన్‌లో వ్యవహరించిన తీరుపై రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. బైపాస్‌రోడ్డులో ఎన్జీఓలు రహదారి దిగ్బంధన కార్యక్రమం కొనసాగించారు. ప్రొద్దుటూరులో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పుట్టపర్తి సర్కిల్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు భారీర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో జేఏసీ ఆధ్వర్యంలో అరవింద్ పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహిం చారు. జమ్మలమడుగులో సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దముడియం మండలం కాండపాంపల్లె గ్రామస్థులు దీక్షలో బైఠాయించారు. వీరికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం ప్రకటించారు. పులివెందులలో సైతం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో సమావేశం నిర్వహిం చి ఉద్యమానికి సంఘీభావంగా తాము సైతం ఉద్యమబాట పట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నేడు జిల్లా బంద్‌కు పిలుపు.. పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వివిధ రాజ కీయ పార్టీలు ప్రకటించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యచరణను గురువారం సమావేశంలో ప్రకటించనున్నట్లు లాయర్ల జేఏసీ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నేడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రబుత్వానికి బుద్ధి వచ్చేలా ప్రతి ఒక్కరూ బంద్‌లో పాల్గొనాలని కోరారు. ప్రజల మనోభావాలు పట్టవా..! వైవీయూ: ఆంధ్రుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఆమోదించడం రాష్ట్రపతికి తగదని ఏపీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం నగర శివారులోని ఇర్కాన్సర్కిల్లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు. వీరికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీఓ నాయకులు గోపాల్‌రెడ్డి, చిన్నయ్య, రమేష్, చంద్రశేఖరరెడ్డి, జేఏసీ నాయకులు అమీర్‌బాబు, పీరయ్య, జోగిరామిరెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దద్దమ్మలు వీళ్లు
సాక్షి, అనంతపురం : సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా దద్దమ్మలుగా మారిపోయారని ఏపీ ఎన్జీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి ఫొటోలున్న ఫ్లెక్సీలను శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట దహనం చేశారు. సోనియాగాంధీతో పాటు మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, చిందంబరం, షిండే, జైరాం రమేష్ తదితరుల ఫొటోలు కల్గిన ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. విభజనను అడ్డుకునేందుకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమేనని ఉద్యోగులు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరోసారి తీవ్రతరం చేసేందుకు జాక్టో ముందుకు వచ్చి కార్యాచరణ రూపొందించింది. అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై చర్చించాయి. ఆదివారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చే సేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా 9వ తే దీన నల్ల బ్యాడ్జీలతో నిరసన, 10వ తేదీ జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో ర్యాలీలు, 11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేయించాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో జాక్టో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మరోసారి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బందులు కలగకుండా, ఉద్యమ తీవ్రత తగ్గకుండా ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు ఆందోళనలో భాగంగా మూడు రోజులపాటు కలెక్టర్ కార్యాలయంలో కార్యకలాపాలు ముందుకు సాగలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకుపోవడంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు విఫలమయ్యారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చే శారు. జీతాలు రాకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఉద్యోగులు రెండు నెలలకుపైగా ఉద్యమంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారని విమర్శించారు. హిందూపురంలో ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో ఎన్జీఓలు విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను తగులబెట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. మడకశిర , పెనుకొండ, గోరంట్లలో ఆందోళనలు చేపట్టారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మాత్రం విభజనను వ్యతిరేకిస్తూ 160వ రోజూ దీక్ష కొనసాగించారు. -
నేటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యశంఖారావం
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది. నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర రెండురోజుల పాటు జిల్లాలో సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాలు, 108 గ్రామాల మీదుగా కొనసాగుతుంది. జగన్మోహన్రెడ్డి శంఖారావం యాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా కంటే యాత్రను రెట్టింపు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు సమైక్యోత్సాహంతో ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు. తొలిరోజు శంఖారావం యాత్ర వివరాలు శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట మండలంలోని పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నాయుడుపేటలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మనుబోలులో నిర్వహించే సభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు గూడూరు సభలో ప్రసంగిస్తారు. రాత్రి గూడూరులో బస చేస్తారు. రెండోరోజు యాత్ర వివరాలు శనివారం ఉదయం 10 గంటలకు వెంకటగిరి బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు. -
రావమ్మా.. సంక్రాంతి లక్ష్మి
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి.. సంక్రాంతి.. కనుమ.. ఈ మూడు రోజులూ పల్లెలు సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. కొలువుల కోసం పల్లెలు విడిచి ఎక్కడో సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం సంక్రాంతి పర్వదినం సందర్భంగా పల్లెలోగిళ్లలో చేరిపోతారు. రావమ్మా.. సంక్రాంతి లక్ష్మి అంటూ సంక్రాంతిని స్వాగతించాల్సిన పల్లెల్లో ప్రస్తుతం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఏరోజుకారోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. చాలీ చాలని వేతనాలు.. కరువు.. కాటకాలు.. ఇలా రకరకాల కారణాలతో నేడు పల్లెసీమలు సంక్రాంతి శోభను సంతరించుకోలేకపోతున్నాయి. అయినా ఉన్నంతలో తృప్తిగా.. సంతోషంగా జరుపుకునేందుకు కొందరు సిద్ధమవుతుంటే.. మరికొందరు ఏం పండగో ఏమో అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. సంక్రాంతి పర్వదిన వేడుకల తీరుతెన్నులపై న్యూస్‌లైన్ ప్రత్యేక కథనం. కడప కల్చరల్, న్యూస్‌లైన్ : సంక్రాంతిని తెలుగునాట పెద్ద పండుగగా మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. పండుగ అంటే ఎవరికైనా సంతోషమే. అందులోనూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఆశించినమేరకు పండుగ సందడి కనిపించడం లేదు. అకాల వర్షాలతో అందివచ్చిన పంటలు దెబ్బతిని రైతు దిగాలుగా ఉన్నాడు. ధరలు చుక్కలను చూపుతున్నాయి. వ్యాపారుల పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా వ్యాపారాలు బాగా దెబ్బతినడంతో ఆ వర్గాల్లో సైతం నిరాశ నెలకొని ఉంది. పెరిగిన ధరల స్థాయిలో జీతాలు పెరగక ఉద్యోగుల పరిస్థితి కటకటగానే ఉంది. అయినా తప్పదు : ధరల బరువుతో ఎగువ మధ్యతరగతి స్థాయి ప్రజల్లో కూడా పండుగ ఉత్సాహం కనిపించడం లేదు. అయినా పిల్లల ఉత్సాహంపై నీళ్లు చల్లలేక, నలుగురిలో చిన్నతనంగా ఉంటుందని భావించి అప్పోసప్పో చేసైనా ప్రజలు పండుగకు సిద్ధమయ్యారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో ఉంటున్న జిల్లా వాసులు ఆదివారానికే స్వగ్రామాలకు చేరారు. ప్రైవేటు బస్సుల సంఖ్య బాగా తగ్గడంతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇన్స్టంట్ పేడరంగు సంక్రాంతి అంటేనే ఇంటి ముంగిళ్లను శుభ్రపరిచి కల్లాపి (పేడ) చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆవు పేడను లక్ష్మిదేవికి ప్రతిరూపమని చెబుతారు. అందుకే శుభప్రదంగా పండుగల సమయంలో సిరిని ఆహ్వానించేందుకు ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఆవు పేడ దొరకడమే కష్టంగా మారింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇన్స్టంట్ పేడ రంగు అందుబాటులోకి వచ్చింది. ప్యాకెట్ ఖరీదు రూ.5. దీనిని నీటిలో కలిపి నేలపై చల్లితే అచ్చం కల్లాపి చల్లినట్లుగా ఉంటుందని విక్రయదారులు చెబుతున్నారు. ఈ రంగును కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. - న్యూస్‌లైన్, సింహాద్రిపురం పల్లెకు పోదాం. చలో చలో సంక్రాంతి సెలవులొచ్చాయి. ఊరికెళ్లాలి. అంతే.. అది బస్సయితేనేం.. ఆటో అయితేనేం.. అంటూ పట్నం నుంచి పల్లెలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఈ పాటికే ఊర్లకు చేరుకున్నారు. మిగిలిన వారు కూడా భోగి పండుగ నాటికంతా ఇంట్లో ఉండాలని ఏ వాహనం దొరికితే దాన్ని పట్టుకుని ఇలా చాపాడు మండల కేంద్రం నుంచి గ్రామాలకు పయనమయ్యారు. - చాపాడు, న్యూస్‌లైన్ పిండి వంటలకు ప్రిపరేషన్ సంక్రాంతి అంటూనే నోరూరించే పిండి వంటలే గుర్తుకొస్తాయి. ఒకప్పుడైతే బియ్యాన్ని రోటిలో పోసి దంచి పిండి వంటలకు వాడేవారు. క్రమక్రమంగా రోళ్లు మాయం కావడంతో ఇప్పుడంతా పిండి మిషన్లపై ఆధారపడుతున్నారు. రాయచోటిలో ఆదివారం ఇలా ఓ పిండి మిషన్ వద్ద మహిళలు తమ టిఫిన్ బాక్సులను ఇలా వరుసగా పెట్టారు. పిండి మిషన్ యజమానులకు ఇప్పుడు పండగే పండగ. - న్యూస్‌లైన్, రాయచోటిటౌన్ సకల భోగాల భోగి.. సకల భోగాలతో ప్రజలు సంతోషంగా ఉండే కాలాన్ని భోగిగా పిలుచుకుంటారు. భోగి పండుగ రోజు భోగి మంటలు కాలుస్తారు. అందులో పాత పనికిరాని వస్తువులు వేసి చెడు తొలగి మంచి చేకూరాలని వేడుకుంటారు. ఇదేరోజు పిల్లలకు భోగి పండ్లు కోస్తారు. ఇలా చేయడం ద్వారా ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకం. పతంగుల సందడి.. సంక్రాంతి వేడుకల్లో పతంగుల సందడి మరువలేనిది. చిన్నా, పెద్దా తారతమ్య భేదం లేకుండా గాలి పటాలను ఎగురవేస్తారు. సంక్రాంతి వేడుకల్లో బాహ్యంగా కనిపించే సంబరాలకు ప్రతీకగా గాలిపటాలు నిలుస్తాయి. పండగకు వారం రోజు ల ముందు నుంచే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ప్రధానంగా చిన్న పిల్లలు గాలిపటాల ఎగురవేతతో ఈ పండుగ రాకను తెలియజేస్తుంది. లక్ష్మీదేవికి ఆహ్వానం.. సంక్రాంతి పండుగకు, రైతుకు మధ్య విడదీయరాని బంధం ఉంది. ఏ పండుగకు ఇంట్లో చేరకపోయినా సంక్రాంతికి మాత్రం పంటలు చేతికంది ధాన్యరాసులు కళకళలాడుతుంటాయి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంట ఇంటికి చేరిన తర్వాత చూసి రైతు కళ్లల్లో ఆనందం పొంగిప్రవహిస్తుంది. ఎండనక, వాననక, రేయనక, పగలనక తాను పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా రైతు కుటుంబం సంక్రాంతి రోజు ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మను ఇంటి ముందు పెట్టి భూమాత రుణం తీర్చుకుంటుంది. ఆ రూపేణా ధాన్యలక్ష్మీ, పుష్పలక్ష్మీలను ఇంటిలోకి ఆహ్వానిస్తారు. రైతుల పండుగ కనుమ.. సంక్రాంతి మరునాడు రోజును కనుమ అంటారు. కనుమ రైతుల పండుగగా ప్రసిద్ధి చెందింది. రైతులందరికీ చేతినిండా పనిఉంటుంది. అందుకే కనుమ రోజు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలు శుభ్రం చేస్తారు. కల్లాపి చల్లి బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. అందులో గొబ్బెమ్మలను పెడుతారు. పాలిచ్చి మనల్ని పోషించే ఆవులు, వ్యవసాయంలో తమకెంతగానో ఉపయోగపడే ఎడ్లను శుభ్రంగా కడుగుతారు. పశులకు దిష్టి తీసి గుమ్మడికాయ పగులగొట్టి గజ్జెలు, పట్టెడలు, పూలదండలు వేసి చక్కగా అలంకరించి ఊరంతా ఊరేగిస్తారు. పొంగళి, పసుపు, కుంకుమలు కలిపి పొలాల్లో చల్లుతారు. గంగిరెద్దుల విన్యాసాలు.. సంక్రాంతి వేడుక ఆరంభమైందంటే చాలు గంగిరెద్దు ఆటలు మొదలవుతా యి. వీధుల్లో, ముఖ్య కూడళ్లలో గంగిరెద్దులను ఆడిస్తుంటారు. అయ్యగారికి దండం పెట్టు... అమ్మగారికి దండం పెట్టు... ఇంటిళ్లిపాదిని సల్లంగ చూడు అంటూ డూడూ బసవన్నలను ఆడిస్తా రు. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రా లను ఎద్దులకు అలంకరించి గంగిరెద్దులను తయారు చేస్తారు. నేలపై పడుకొని గంగిరెద్దును ఆమాంతం పైకి ఎక్కించుకోవడం, గంగిరెద్దు నోట్లో తలపెట్టడం వంటి విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి. రై తులు ఆనందంగా తోచిన రీతిలో గంగి రెద్దుల వారికి సమర్పించుకుంటారు. ఎద్దుల శ్రమను రైతుకు గుర్తు చేయడానికి పండుగ రోజు గంగిరెద్దులను ఇళ్లముందుకు తీసుకొస్తారు. డూడూ బసవన్నా.. ఎన్నాళ్లకొచ్చావయ్యా! గ్రామాలలో సంక్రాంతి సందడి మొదలైందంటే చాలు రకరకాల వేషధారణలో భిక్షగాళ్లు వస్తుంటారు. ఇలాంటి వారిలో డూడూ బసవన్నలు ఒకరు. వీరు ఏడాదిలో రెండు మూడు సార్లుగా గ్రామాలలో పర్యటించి గంగిరెద్దులను ఆటాడించి వినోదాన్ని పంచి గ్రామీణులు ఇచ్చే చిరుకానులన తీసుకెళుతుంటారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ మొదలు కాగానే డూడూబసవన్నలు వచ్చేశారు. రాత్రివేళల్లో రాముడు - సీత పేర్లతో శ్రీరామచంద్రుడి కథను నాటక రూపంలో ప్రదర్శించి పురాణాలు గుర్తుకుతెస్తున్నారు. వీరిని చూసిన గ్రామీణులు అరే డూడూ బసవన్నా ఎన్నాళ్లకు వచ్చావు.. అంటూ ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. - న్యూస్‌లైన్, సంబేపల్లె ‘పుంజు’కోనున్న పందేలు సంక్రాంతి పండుగ సందడి పల్లెల్లో మొదలైంది. పందెం కోళ్లను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. సత్తా ఉన్న కోడిపుంజులను వెతికి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల వద్ద కోళ్లు సమరానికి సై అంటూ రె‘ఢీ’గా ఉన్నాయి. - న్యూస్‌లైన్, చిన్నమండెం కొత్త కళ వచ్చేసింది గ్రామాల్లో సంక్రాంతి శోభ సంతరించు కొంది. మహిళలు కొత్త ఉత్సాహంతో లోగిళ్లను ముస్తాబు చేస్తున్నారు. ఇళ్లముందు అందమైన ముగ్గులు వేస్తున్నారు. గాజులు విక్రయించే మహిళలు పల్లెల్లో దర్శనమిస్తున్నారు. చేతులకు మట్టి గాజులు తొడిగించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. వచ్చేసింది సంక్రాంతి అంటూ ఆనందంగా గడుపుతున్నారు. - న్యూస్‌లైన్, దువ్వూరు పెద్ద పండుగ చిన్నబోయింది.. అతివృష్టి, అనావృష్టితో పైరు ఎత్తిపోయింది.. ధాన్యం లేక గాదె బావురుమంటోంది.. రైతన్నకు తిండిగింజల దిగులు పట్టుకుంది.. కిటకిటలాడాల్సిన దుకాణాలు వెలవెలబోయాయి.. వ్యాపారం లేక వర్తకులు దివాలా తీశారు.. ఉద్యోగులకు ‘సమైక్య’ ఉద్యమం నిరాశను మిగిల్చింది.. వేతనాలందక అడ్వాన్సులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. కర్మాగారాలు నడవ లేదు.. కార్యాలయాలు పనిచేయ లేదు.. పనుల్లేక కార్మికుల పరిస్థితి అప్పుచేసి పప్పుకూడు తిన్నట్టైంది... సగటు మనిషిలో సంతోషం ఆవిరైంది. కొత్త బట్టలు.. పిండి వంటల మాటే లేదు.. గంగిరెద్దులు.. డూడూ బసవన్నల సందడీ లేదు... కొత్త అల్లుళ్ల జాడ లేదు.. పండుగ పూట ‘పెద్ద’ సందడి లేదు.. బక్కచిక్కిన బడుగుజీవి సంక్రాంతి లక్ష్మిని పిలువ లేక పిలుపు లేక పెద్ద పండుగ చిన్నబోయింది.. -న్యూస్‌లైన్, కమలాపురం పండుగ చేసు‘కొన’లేం పులివెందులలో ఆదివారం సంక్రాంతి పండుగ సందడి కనిపించలేదు. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోయాయి. పూలు అమ్ముడుపోక నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. మూర రూ.30లు అమ్మాల్సిన పూలు రూ.10లకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడిందన్నారు. వస్త్ర, రంగు పొడుల దుకాణాలు, పండ్ల వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. -న్యూస్‌లైన్, పులివెందుల టౌన్ -
సమైక్యంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ముత్తుకూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించాలని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమైక్య దీవెనయాత్రలో భాగంగా శుక్రవారం ముత్తుకూరులో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త దళితవాడ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంటే విభజన నిర్ణయంపై రాష్ట్రపతి పునరాలోచించేవారని కాకాణి అభిప్రాయపడ్డారు. తీర్మానం చేయకుండా, ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం ద్వారా సమైక్యవాదానికి తూట్లు పొడిచారన్నారు. తీర్మానానికి పట్టుబట్టిన వైఎస్సార్సీపీ శాసనసభ్యులను సభ నుంచి బహిష్కరించడంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు బయటపడిందన్నారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, బలవంతంగా వ్యానులో తరలించడం వెనుక ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం ఉందన్నారు. ఈ ఉదంతం ద్వారా సమైక్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి డ్రామాలాడుతున్న విషయం స్పష్టమైపోయిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశవాదం బట్టబయలయిందన్నారు. మొహం చూపని ఎమ్మెల్యే ఆదాల ఓట్లేసిన ప్రజలకు మొహం చూపని ఎమ్మెల్యేల్లో ఆదాల ప్రభాకరరెడ్డి ప్రముఖులని కాకాణి ఎద్దేవా చేశారు. పనుల కోసం ఎవరైనా వెళ్లి అడిగితే ‘నేనిచ్చిన నోటు, మీరేసిన ఓటుకు చెల్లు’ అంటూ హేళన చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్దనరెడ్డి, నాయకులు దాసరి భాస్కర్‌గౌడ్, దువ్వూరు విజయభాస్కర్‌రెడ్డి, మారు సుధాకర్‌రెడ్డి, నంగా చెంగారెడ్డి, పోలిరెడ్డి చిన్నపరెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, సర్పంచ్ పల్లంరెడ్డి జనార్దనరెడ్డి, దువ్వూరు గోపాలరెడ్డి, సన్నారెడ్డి రమణారెడ్డి, కారంచేటి ప్రసాద్‌శర్మ, సుమంత్‌రెడ్డి, జవహర్, టీ రాజ పాల్గొన్నారు. -
సమైక్య దీక్షలు
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పది నియోజకవర్గాల సమన్వయకర్త ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహరదీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలకు దిగారు. ఈ దీక్షలకు పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రిలేదీక్షలు కొనసాగనున్నాయి. వెంకటగిరిలో వెఎస్సార్సీపీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీభవానీ సెంటర్లో రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు స్థానిక బస్టాండు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మండల కన్వీనర్ పెద్దమల్లు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూ ళ్లూరుపేట బస్టాండు సెంటర్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. -
‘ఇండియాటుడే’ తీయబోతున్నా
ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర, తెలంగాణ విభజన ఉద్యమాల నేపథ్యంలో నేతల స్వార్థ ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు జయం మూవీస్ పతాకంపై ‘ఇండియాటుడే’ సినిమా తీయనున్నట్టు ప్రముఖ నిర్మాత, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలి పారు. తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని సూళ్లూరుపేటలో చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం 500 మందికి జగదీశ్వరరెడ్డి అన్నదానం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనది సొంత జిల్లా నెల్లూరే అన్నారు. సొంత బ్యానర్‌పై స్వీయ దర్శకత్వలో ఇండియాటుడే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి చెప్పారు. ఇందులో అందరూ కొత్త నటులే నటిస్తారన్నారు. అన్యాయాన్ని ఎదిరించే జర్నలిస్టు పాత్రను సినిమాలో ప్రధానంగా చిత్రీకరించనున్నట్టు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇది వరకు జయం, నిజం, జై, అందరం, కేక సినిమాలతో పాటు ఎన్నో ఇంగ్లిష్ సినిమాలను డబ్బింగ్ చేసినట్టు కేతిరెడ్డి తెలిపారు. గత ఏడాది శ్రీలంకలో తమిళులు పడుతున్న బాధల ఇతివృత్తంగా తీసిన ‘రావణదేశం’ సినిమాను తమిళ రాజకీయ నేతలు వైగో, విజయ్‌కాంత్ లాంటి వారు చూసి తాము చేయలేని పనిని తెలుగువాడివైన నీవు చేశావని తనను ప్రశంసించారన్నారు. రాజకీయ జీవితంలో గత 35 ఏళ్లుగా మహానేత వైఎస్సార్ అభిమానినన్నారు. అలాగే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానిగా ఉంటున్నానని చెప్పారు. ఇండియాటుడే సినిమాను వీలైనంత త్వరలో ప్రారంభించి దక్షిణాదిలో అన్ని భాషల్లో విడుదల చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలకా యుగంధర్ పాల్గొన్నారు. -
ఉద్యమ దండు
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్య మం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఉద్యమ దండులా ముందుకు కదిలి సమైక్యవాణి వినిపించాయి. అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు భారీ ఎత్తున సాగాయి. పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుజబుజనెల్లూరులో ర్యాలీ చేశారు. గూ డూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీ వయ్య సూళ్లూరుపేటలో ర్యాలీ నిర్వహించారు. కావలి సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మర్రిపాడు నుంచి ఆత్మకూరు వరకు, తిరిగి మర్రిపాడు వ రకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో వెంకటగిరిలో ర్యాలీ జరిగింది. -
కడపలో క్రీడా సందడి
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడప గడపలో ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. గత అక్టోబర్‌లో నిర్వహించాల్సిన ఈ పోటీలు సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం టోర్నమెంట్ నిర్వహణకు జిల్లా ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దీంతో మరో 30 రోజుల్లో జిల్లాలో క్రీడాసందడి నెలకొననుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య చౌదరి శనివారం కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంను సందర్శించారు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పులను సూచించారు. అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు టోర్నమెంట్ నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను, మార్గదర్శకాలను వివరించారు. దాదాపు 700 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యే ఈ టోర్నమెంట్‌కు ఏర్పాట్లను చక్కగా చేయాలని చెప్పారు. అనంతరం అక్కడే బ్యాడ్మింటన్ ఆడేందుకు వచ్చిన ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్, డీఎస్డీఓ బాషామొహిద్దీన్లను కలిసి టోర్నమెంట్‌పై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి జిలానీబాషా, కోశాధికారి నాగరాజు, సభ్యులు మారుతీమోహన్రెడ్డి, రెడ్డిప్రసాద్, మునికుమార్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, సుదర్శన్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీల సంపూర్ణ సహకారం.. జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు సహకరించాలని రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డిలను వేర్వేరుగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ కడపలో నిర్వహించే టోర్నమెంట్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
సమైక్యోద్యమం
ఓట్లు, సీట్లు.. అధికారమే పరమావధిగా రాష్ట్ర విభజనకు బాటలు వేసిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు జూలై 30న విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో పురుడుపోసుక్ను సమైక్య ఉద్యమం తమ మనోభిప్రాయాలను ‘అధికారం’ కోసం తాకట్టు పెట్టిన కాంగ్రెస్, టీడీపీలను చీదరించుకుంటోన్న జనం మనోభీష్టాల మేరకు సమైక్యాంధ్ర ఉద్యమ బావుటా ఎగరవేసిన వైఎస్సార్సీపీకీ జైకొడుతున్న ప్రజాసైన్యం విశాలాంధ్ర ప్రజారాజ్యమన్న సీపీఐ విభజనకు జైకొట్టిన వైనం.. సమైక్యాంధ్రకే కట్టుబడిన సీపీఎం తెలుగుజాతి ఐక్యతను దెబ్బతీసేందుకు సిద్ధమైన కమలనాథులపై వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహం జనంతిరగబడటంతో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రణాళికపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్,టీడీపీ అగ్రనేతలు 2013లో ‘అనంత’ రాజకీయ ప్రస్థానం ఇదీ..! సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల మనోభిప్రాయాలను గౌరవించని రాజకీయపార్టీలకు మనుగడ ఉండదన్నది చరిత్ర చెబుతోన్న సత్యం. రాష్ట్ర విభజన ప్రక్రియలో అది మరో సారి నిరూపితమైంది. ఓట్లు, సీట్లే ప్రాతిపదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై రాష్ట్ర విభజనకు బాటలు వేశాయి. అధికారం కోసం ప్రజల మనోభిప్రాయాలను తాకట్టు పెట్టాయి. తమ మనోభిప్రాయాలను గౌరవించని కాంగ్రెస్, టీడీపీలను జనం చీదరించుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ‘అనంత’లో పురుడుపోసుకున్న ‘సమైక్య’ ఉద్యమం సీమాంధ్రకు దావానలంలా వ్యాపించి.. మహోద్యమంగా రూపాంతరం చెందింది. ప్రజల మనోభీష్టాల మేరకు సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి వెంట ‘అనంత’ జనం కదంతొక్కుతున్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యమన్న నినాదాన్ని ఆరు దశాబ్దాలపాటు ప్రతిధ్వనింపజేసిన సీపీఐ ప్లేటు ఫిరాయించి.. వేర్పాటువాదం ఎత్తుకుంది. ప్రజల మనోభిప్రాయాల మేరకు సీపీఎం సమైక్యాంధ్రకే కట్టుబడింది. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసేందుకు సహకరిస్తామంటోన్న కమలనాథులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ‘అనంత’ రాజకీయాలను 2013 ఓ కుదుపు కుదిపేసింది. ఏడాది ఆరంభంలోనే అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 30, ఫిబ్రవరి 4న రెండు విడతలుగా నిర్వహించిన సహకార ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని రాజకీయశక్తిగా వైఎస్సార్సీపీ అవతరించింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ సహకార సొసైటీ(డీసీఎంఎస్) ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురువేస్తుందనే సాకుతో ఫిబ్రవరి 17న జరగాల్సిన ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేయించింది. అధికారం కోసం సహకార వ్యవస్థను నీరుగార్చుతోంది. పంచాయతీల్లోనూ కుమ్మక్కు పర్వం సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్సార్సీపీని దెబ్బతీయడానికి రచించిన ప్రణాళికను రైతులు ఛీ కొట్టారు. అయినా.. ఆ రెండు పార్టీలు తీరు మార్చుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే సూత్రాన్ని అమలుచేశాయి. జూలై 23, 27, 30 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్‌కు పోటీగా అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించలేదు. టీడీపీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ కూడా అభ్యర్థులను పోటీకి దించకుండా ముందస్తుగా కుదుర్చుకున్న అవగాహనను అమలుచేశాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులను చావుదెబ్బతీయాలన్న కుట్రను ప్రజలు చీదరించుకున్నారు. సింహభాగం పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించారు. ప్రజాభిమానంతో వైఎస్సార్సీపీ కదం తొక్కుతుండటంతో కాంగ్రెస్, టీడీపీలు వ్యూహాత్మకంగా పావులు కదిపాయి. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం ద్వారా 2014లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళిక రచించాయి. ఆ క్రమంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చారు. విశాలాంధ్రలోనే ప్రజారాజ్యమన్న నినాదంతో ఆరు దశాబ్దాలపాటూ నడచిన సీపీఐ వేర్పాటువాదంతో జతకట్టింది. సీపీఎం మాత్రం సమైక్యాంధ్రకే కట్టుబడింది. సీట్లే లక్ష్యంగా కమలనాథులు తెలుగుజాతిని రెండు మక్కలు చేయడానికి సహకరిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇచ్చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖ ఆధారంగా కాంగ్రెస్ ఏపీ విభజనకు కుట్ర పన్నింది. ఆ మేరకు సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంలోని యూపీఏ పక్షాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తూ జూలై 30న తీర్మానం చేశాయి. సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర సమైక్య ఉద్యమంతో రాజకీయ మనుగడ ఉండదని కాంగ్రె స్, టీడీపీ నేతలు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను సీమ నుంచి విడదీసి.. తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొట్రికే మధుసూదన్ గుప్తా బలంగా ముందుకు తెచ్చారు. సమైక్య ఉద్యమంలో ముసుగువీరుడైన ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తెరచాటుగా జేసీతో చేతులు కలిపి.. రాయలతెలంగానం చేశారు. సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రపై ‘అనంత’ ప్రజానీకం తిరగబడ్డారు. ప్రజాసైన్యం తిరగబడటంతో రాయలతెలంగానం ప్రతిపాదనను పక్కనపెట్టారు. ‘రాయల తెలంగాణపై నన్ను ముందుకు తోసి.. ఆ తర్వాత అంతా తప్పుకున్నారు’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఇటీవల ప్రకటించడమే అందుకు తార్కాణం. ‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం పురుడుపోసుకుంది. ఇది సీమాంధ్రకు దావానలంలా వ్యాపించింది. సమైక్య ఉద్యమంలో సీమాంధ్రకు ‘అనంత’ మార్గనిర్దేశనం చేసింది. వేర్పాటువాదం చేసిన టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను జనం ఎక్కడికక్కడ అడ్టుకుంటూ ఛీకొట్టారు. ప్రజాభిప్రాయం మేరకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సెప్టెంబరు 4న సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా కదిరి, హిందూపురం, అనంతపురంలో నిర్వహించిన సభలకు జనం భారీ ఎత్తున హాజరై, మద్దతు ప్రకటించారు. విభజన తీర్మానానికి నిర్భందాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సారి.. టీనోట్‌పై కేంద్ర మండలి ఆమోదముద్ర వేయడానికి నిరసనగా మరొక సారి ఆమరణ నిరాహారదీక్ష చేశారు. సమైక్యాంధ్ర నినాదంతో అక్టోబరు 26న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు ‘అనంత’ ప్రజానీకం భారీ ఎత్తున తరలివెళ్లారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలుగుతారని జనం గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆ రెండు పార్టీల నేతలు జంకుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలే అందుకు తార్కాణం. -
చివరి వరకు పోరాటం
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు తెలిపారు. గడపగడపన సమైక్య నినాదం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మైదుకూరు రోడ్డులోని అన్వర్ థియేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సురేష్‌బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్కాంగ్రెస్పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందన్నారు. వైఎస్ కృషి వల్ల జిల్లాకు ఎంతో మేలు జరిగిందన్నారు. జైలులో సైతం సమైక్యాంధ్ర కోసం దీక్ష చేసిన ఘనత జగన్‌దేనని తెలిపారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ర్టం కోసం ఎక్కడా లేని విధంగా నాలుగు నెలలుగా ప్రొద్దుటూరులో దీక్షలు చేపడుతున్నారన్నారు. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందని, రైతులకు సాగు నీరు అందడం ప్రశ్నార్థకంగా మారుతుందని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తెలుగుజాతిని నిలువునా చీల్చే ప్రయత్నాన్ని సోనియా గాంధీ చేస్తున్నారన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జగన్మోహన్రెడ్డి దేశమంతా తిరిగి శ్రమిస్తున్నారన్నారు. తెలుగు సంస్కృతిపై ఏమాత్రం అవగాహన లేని ఇటలీ మహిళ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిచెందాలంటే హైదరాబాద్‌పై వచ్చే పన్నులే ఆధారమని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 150 సీట్లు, తెలంగాణాలో మరో 30 శాతం సీట్లను వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం ఉందన్నారు. డబ్బు ఇచ్చి రాజ్యసభ సీటును కొనుక్కున్న సీఎం రమేష్‌నాయుడుకు జగన్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవ్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీఎం పదవి కోసం కక్కుర్తి పడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజకీయ అవకాశవాది చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే అస్త్రం ద్వారా రాష్ట్ర విభజనను సులువుగా ఆపవచ్చన్నారు. కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్ బాషా మాట్లాడుతూ తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ నేతల స్వార్థం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ జై సమైక్యాంధ్ర అనకుండా రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, పట్టణాధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, గోపికృష్ణ విద్యా సంస్థల అధినేత కేవీ రమణారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, మాధవ్ రెసిడెన్సీ మాధవరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్లు పోరెడ్డి నరసింహారెడ్డి, గరిశపాటి లక్ష్మిదేవి తదితరులు ప్రసంగించారు. జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నేతలు వేదికపైనే కేక్ కట్ చేశారు. -
రోడ్ల దిగ్బంధం
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో పార్టీ శ్రేణులు, విద్యార్థులు, సమైక్యవాదులు రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఎన్‌హెచ్-5 జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనను అంగీకరించేది లేదంటూ పార్టీశ్రేణులు నినదించాయి. ఆందోళనలను మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. ఆత్మకూరులో జరిగిన ఆందోళనల్లో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. గత మూడు రోజులుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి. సర్వేపల్లి సమన్వయకర్త, సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో జాతీయరహదారిపై మనుబోలు వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. వందలసంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి. అనీల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చింతారెడ్డిపాళెం హైవేపై రాస్తారోకో నిర్వహించింది. ఈ రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ విద్యార్థి విభాగం నాయకులు ఎన్‌హెచ్-5 కనుపర్తిపాడు సెంటర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగుజాతిని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీ ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం సెంటర్ వద్ద గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన వంటావార్పులో ఆయన పాల్గొన్నారు. దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల వద్ద కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయరహదారిని దిగ్బం ధించారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. రెండు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కోట క్రాస్‌రోడ్డు వద్ద జాతీయరహదారిపై గూడూరు సమన్వయకర్త బాలచెన్నయ్య ఆధ్వర్యంలో వంటావార్పు, రాస్తారోకోలను నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి బస్టాండు సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. సూళ్లూరుపేట నియోజక వర్గంలోని నాయుడుపేట-శ్రీకాళహస్తి జాతీయరహదారిపై నియోజకవర్గ సమన్వయకర్తలు కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి రాస్తారోకో నిర్వహించారు. -
దేశ సంస్కృతి సోనియాకేం తెలుసు
ఉదయగిరి, న్యూస్‌లైన్: భారతదేశ సమైక్యత, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం విదేశీయురాలైన సోని యాకు ఏం తెలుసని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉదయగిరిలో బుధవారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్వప్రయోజనాల కోసమే ఆమె తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజలను నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. సోనియాగాంధీ తెలుగువారి ఉసురుపోసుకోక తప్పదన్నారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో ఎవరూ విభజనను కోరుకోవడం లేదన్నారు. తెలంగాణలోని కొందరు రాజకీయ బికారులు మాత్రమే విభజనను కోరుకుంటుంటే, వారి మాటలు నమ్మి రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజన ఆలోచనను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి సత్ఫలితమిస్తుందనే నమ్మకముం దన్నారు. ఆర్టికల్ 3ను రద్దు చేయాలనే డిమాండ్‌కు అందరూ మద్దతు పలకడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారైందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని, మరో అవకాశం తమకు కల్పిస్తే మరిం త అభివృద్ధికి ప్రయత్నిస్తానన్నారు. మొదట ఆయన రైతు వేషధారణలో ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో ముందుకుసాగారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కల్లూరి రమణారెడ్డి, అక్కుల్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఆనందరావు, గడియాల్చి ఎస్ధాని, ఖిల్జీ సలీం, ఏడుకొండలు, ముర్తుజా హుస్సేన్, పెద్దిరెడ్డి, సోమిరెడ్డి, అశోక్‌కుమార్, ఎం.వెంకటేశ్వర్లు, గుంటుపల్లి నాగభూషణం, పాణెం రమణయ్య పాల్గొన్నారు. -
గీన్ సిగ్నల్‌పై ‘అనంతా’గ్రహం
ఏదైతే కాకూడదనుకున్నారో అదే అయ్యింది. సమైక్య వాదులు అలుపెరుగకుండా 129 రోజుల పాటు సాగించిన ఉద్యమాన్ని కేంద్ర పెద్దలు ఇసుమంతైనా పట్టించుకోలేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపిందంటూ ప్రకటించడంతో అనంత వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థి లోకం భగ్గుమంది. ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం అర్ధరాత్రి దాటినా నిరసన కొనసాగింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నేటి బంద్ పిలుపునకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగు ప్రజల మనోభావాలకన్నా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి జన్మదినోత్సవ కానుక ఇవ్వడానికే కేంద్ర కేబినెట్ మొగ్గు చూపడంపై ‘అనంత’ ప్రజానీకం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. 129 రోజులుగా సాగుతోన్న సమైక్యాంధ్ర మహోద్యమాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడాన్ని అన్ని వర్గాల ప్రజలు నిరశించారు. ఎస్కేయూ వద్ద విద్యార్థులు భారీ సంఖ్యలో రోడ్డుపైకొచ్చి నిరసన తెలిపారు. టైర్లకు నిప్పంటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్సీపీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాలతో కలిసి సమైక్యాంధ్ర మహోద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు పూనుకుంది. అధిక శాతం మంది ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ జీవోఎంను కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా జీవోఎంను కోరారు. సమైక్యంగా ఉంచడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ అధిష్టానం ఒకానొక దశలో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. రాయలసీమను నిలువునా చీల్చి.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేసేందుకు పూనుకుంది. జీవోఎం కూడా రాయల తెలంగాణకే ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రాయలసీమ విభజనపై సీమ ప్రజానీకం భగ్గుమనడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటును ప్రతిపాదిస్తూ జీవోఎం ఇచ్చిన నివేదికపై కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాయి. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం పోలీసు బలగాలతో భారీ ఎత్తున కవాతు నిర్వహించి.. ప్రజలను భయోత్పాతానికి గురిచేసే యత్నం చేయడం గమనార్హం. కాగా కేంద్ర ప్రకటనపై ఉరవకొండ, కదిరి, పుట్టపర్తిలో సమైక్యవాదులు ఆందోళన నిర్వహించారు. -
ఆర్టీఏ కార్యాలయంలో అడ్డగోలు దందా!
సాక్షి ప్రతినిధి, న్యూస్‌లైన్: ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగినా.. పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నా.. అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకుల వుతున్నా.. ఆర్టీఏ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడరు. కళ్లముందే అదనపు ప్రయాణికులతో పాటు ప్రమాద కరమైన లగేజీని బస్సులో తరలిస్తుంటే రూ.500 తీసుకుని రైట్ చెబుతున్నారు. ఈ శాఖ అవినీతికి పునాది రాయిలా నిలిచిందని జిల్లా వాసులు నెత్తి నోరు బాదుకున్నా.. దాన్ని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోరు. నెల వస్తే ఎవరి వాటా వారి ఇళ్లకు చేరాల్సిందే. పైసా తగ్గినా సహించరట! కింది స్థాయి సిబ్బందినీ ఉపేక్షించరట! తాజాగా మూడు నెలల పాటు సమైకాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున సాగితే ఆర్టీఏ కార్యాలయం సిబ్బంది కూడా అందులో పాల్గొన్నారు. కాగా తిరిగి విధులకు హాజరైన సిబ్బంది పనిదినాల్లో వచ్చిన అక్రమ సొమ్మును పంచుకుని ఓ ఉన్నతాధికారికి ఆయన వాటా ముట్టజెప్పేందుకు వెళ్లారు. అక్రమ సొమ్మును లెక్కపెట్టుకున్న అధికారి డబ్బును విసిరి కొట్టినట్లు తెలిసింది. ఇదేంది లెక్క తగ్గిందని సిబ్బందిపై హుకుం జారీ చేసినట్లు సమాచారం. కాగా సిబ్బంది రెండు నెలల పాటు ఉద్యమంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తనకు అదంతా సంబంధం లేదని అధికారి తేల్చి చెప్పారట! ప్రతి నెలా తనకు చెందాల్సిన సొమ్ము పక్కాగా ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో మీ ఇష్టం అని చెప్పడంతో సిబ్బంది వారి వాటాల్లో తగ్గించుకుని మిగిలిన సొత్తు పోగేసి ఇచ్చినట్లు తెలిసింది. చెక్‌పోస్ట్ నుంచి రూ.2 లక్షలు పెనుకొండ చెక్‌పోస్ట్ నుంచి రూ.2 లక్షల నగదు ప్రతి నెలా జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నతాధికారికి ముట్టజెప్పాల్సిందేనని తెలిసింది. కాగా ఆ డబ్బును వసూలు చేయాలంటే అక్కడి సిబ్బంది వాహనాలు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నా.. వదిలి పెట్టాల్సిందే. కాక పోతే వాహనాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. మాట వినక పోతే వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు హజరు పరుస్తూ వస్తారు. అధికారుల ఒత్తిడితోనే తాజాగా ఓ టూరిస్ట్ బస్సును కూడా రూ.500 లంచంగా తీసుకుని వదిలిపెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ విషయం బహిర్గతం కావడంతో చెక్ పోస్ట్‌కు ఆఫీస్ సబార్డినేటర్లను వేయకుండా వారిని కేవలం కార్యాలయం విధులకు నియమించినట్లు తెలిసింది. చెక్‌పోస్ట్‌లో ప్రెవేట్ వ్యక్తులను నియమించి వారి ద్వారానే డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. మహాబూబ్‌నగర్ ఘటనతో కురుస్తున్న ధనం మహబూబ్‌నగర్ జిల్లా పాల్యం వద్ద ఓల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల అధికారులకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బస్సులను కట్టడి చేయాలని సూచించింది. దీంతో ఆర్టీఏ అధికారుల జేబుల్లో ధన వర్షం కురుస్తోంది. అర్ధ రాత్రిళ్లు 44వ జాతీయ రహదారిపై వందలాది బస్సులు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఓ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకే నెంబరుతో తిరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసినా అధికారులు స్పందించడం లేదని కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి పర్వానికి తెర వేయాలని సంబంధిత శాఖాధికారులను జిల్లా వాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీఏ అధికారుల అవినీతి బాగోతాలపై అసలు నిజాలను వెలికి తీసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
పక్కాగా ‘పది’
సాక్షి, కర్నూలు: ‘‘ జిల్లాలో గత మూడేళ్లుగా పదోతరగతి ఫలితాలు గణనీయంగా మెరుగయ్యాయి. గతేడాది జిల్లా చరిత్రలోనే అత్యధికంగా 91.06 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ప్రస్తుతం దీనిని కాపాడుకోవడం కత్తిమీద సాములాంటిదే. అయినా పక్కా ప్రణాళికతో ఇంతకంటే ఉత్తమ ఫలితాలను సాధిస్తాం.’’ అని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో 33 పనిదినాలను నష్టంపోయామని, ఇందుకు సెలవు రోజులను సద్వినియోగం చేసుకుంటున్నామని ఆయన వివరించారు. విద్యాసంవత్సరం సాఫీగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే.. డిసెంబర్1 నుంచి త్రైమాసిక పరీక్షలు సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో సమ్మె చేసిన ఉపాధ్యాయులు వచ్చే ఏడాది మార్చి 18 వరకు వచ్చే అన్ని రెండో శనివారాలు, ఆదివారాలు పనిచేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సిలబస్ పూర్తవుతుందనే నమ్మకం ఏర్పడింది. పదోతరగతి సహా అన్ని తరగతులకు డిసెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు త్రైమాసిక, జనవరి మొదటి వారంలో అర్థసంవత్సర పరీక్షలను నిర్వహిస్తాం. సంక్రాంతికి ప్రభుత్వ పాఠశాలలకు మూడు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. విద్యార్థులకు గ్రేడ్లు.. పదోతగరతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం గంట చొప్పున అదనపు తరగతులు నిర్వహించాలని ఇప్పటికే అన్ని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. వచ్చే నెల మొదటివారం హాఫ్యర్లీ పరీక్షలు ముగిశాక విద్యార్థుల స్థాయిని ఏ, బీ, సీ, డీ నాలుగు గ్రేడులుగా విభజిస్తాం. ఆ తరువాత సీ, డీ కేటడిరీ విద్యార్థులను కొంతమంది ఉపాధ్యాయులకు దత్తత ఇస్తాం. వీరిని మార్చి నాటికి మెరుగుపడేలా చూస్తాం. సీ, డీ గ్రేడు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబోతున్న స్టడీ మెటీరియల్‌ను అన్ని పాఠశాలలకు తర్వలో అందజేస్తాం. తక్కువ ఉత్తీర్ణత ఉన్న పాఠశాలలను మండల విద్యాశాఖాధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు, నిపుణులతో అవగాహన తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 150 పాఠశాలల్లో అదనపు గదులు ఎనిమిదో తరగతి వరకు మౌలిక సదుపాయాలన్నింటినీ రాజీవ్ విద్యామిషన్ చూస్తుంది. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విడుదలవుతున్న నిధులను వినియోగిస్తున్నారు. ఇటీవలే ఆర్ఎంఎస్ ద్వారా 150 పాఠశాలల్లో అదనపు గదులు నిర్మిస్తున్నాం. సైన్స్ ల్యాబ్‌లను కడుతున్నారు. మరో 125 పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టారు. లేబొరేటరీల ఏర్పాటుకు చర్యలు పదోతరగతి విద్యార్థుల కోసమైతే సైన్స్ లేబొరేటరీలు ప్రత్యేకంగా ఉన్నత పాఠశాలల్లో లేవు. గదులు లేకపోవడమే ఇందుకు కారణం. అయినా విద్యార్థుల కోసం నమూనా పరికరాలను ఉంచి బోధిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి గదులు అందుబాటులోకి రానున్నాయి కాబట్టి సైన్స్ లేబొరేటరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ‘ప్రైవేట్’లో పనివేళల నియంత్రణ ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపునిచ్చిన సమయంలోనే అన్ని ప్రభుత్వ నిబంధనలకు, మార్గదర్శక సూత్రాలకు బద్ధులమై ఉంటామని డిక్లరేషన్‌ను తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లోనే ప్రైవేటు పాఠశాలలను నిర్వహించాలి. దీనిని ఉల్లంఘించిన ఆయా యాజమాన్యాలపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. అయితే పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు హైకోర్టు కూడా ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జీవనోపాధి’పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్ : నిరుద్యోగుల జీవనోపాధి కోసం కేటాయించిన యూనిట్లు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్ సూచించారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని యూనిట్ల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ మండలాలకు చెందిన బ్యాంక ర్లు, ఎంపీడీఓలు, ఐకేపీ ఏపీఎం, సీసీలతో మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీడీ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన జేఎంఎల్‌బీసీ సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఐదు నెలలుగా నిర్వహించడం లేదన్నారు. దీంతో ఎక్కడి పనులు నిలిచిపోయాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల కింద 2013-14 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన జీవనోపాధి యూనిట్లను త్వరిత గతిన మంజూరు చేసి వాటిని ప్రారంభించాలని సూచించారు. ఆయా బ్యాంకుల అధికారులు, ఎంపీడీఓలు యూనిట్ల విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కోవెలకుంట్ల స్టేట్‌బ్యాంక్ పరిధిలో 41, ఎస్బీహెచ్ పరిధిలో 19, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో 38, గోస్పాడు పరిధిలో 21 యూనిట్లను కేటాయించగా ఇప్పటి వరకు ఒక్కయూనిట్ కూడా ప్రారంభం కాకపోవడంపై పీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్వరమే చర్యలు తీసుకుని అర్హులైన వారికి లబ్ధీ చేకూర్చాలన్నారు. డిసెంబర్లో ఆయా బ్యాంకులకు కేటాయించిన యూనిట్లన్నీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెల రెండో వారంలో జేఎంఎల్‌బీసీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్బీఎం ఆండవార్, బ్యాంకు ఉన్నతాధికారులు చంద్రశేఖర్‌రెడ్డి, ఫణికుమార్, తహశీల్దార్ సుధాకర్, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఎంపీడీఓలు, ఏపీజీబీ మేనేజర్లు సుజాతమ్మ, శ్రీలత, కేవీసుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, ఇందిరకాంత్రిపథం ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
పోలీసుల హెచ్చరికల మధ్య ‘రచ్చబండ’
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమస్యలపై, సమైక్యాంధ్రపై ప్రశ్నించినా, సభలో కార్యక్రమంలో గలాటా సృష్టించాలని చూసినా అరెస్టులు తప్పవంటూ పోలీసులు చేసిన హెచ్చరికల మధ్య జిల్లాలోని గంపలగూడెం, గుడివాడ, చాట్రాయి, ముసునూరు మండలాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయి నుంచి మండల కేంద్రాలకు మారిన రచ్చబండ కార్యక్రమాన్ని మరింత కుదించారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. చాట్రాయి సభకే ముసునూరు మండల లబ్ధిదారులను రప్పించి కార్యక్రమం అయ్యిందనిపించారు. చాట్రాయిలో మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ ఎం.రఘునందనరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జేఏసీ చాట్రాయి మండల నాయకులు సమైక్యాంధ్ర నినాదాలు చేసి, సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని జేఏసీ నాయకులు విమర్శించారు. దీంతో మంత్రి సారథి రాజకీయాలను చొప్పించి ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫ్లెక్సీలను చించివేస్తున్నారని, రాష్ట్ర విభజనలో సమన్యాయం చేయాలని చెబుతున్న చంద్రబాబునాయుడిని టీడీపీ నాయకులు ఎందుకు నిలదీయలేకపోతున్నారని ఆపార్టీ చాట్రాయి మండల అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావును మంత్రి ప్రశ్నించారు. చాట్రాయిలో వంద మందికి పైగా పోలీసులు, ఒక డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించడం గమనార్హం. గంపలగూడెం సభలో తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పాల్గొన్నారు. తడిచిన పత్తిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరారు. ఎ.కొం డూరు మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుడివాడ మండలంలో జరిగిన రచ్చబండలో ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించాల్సి ఉండగా సందేశం పేపరు లభ్యంకాక కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారని తటివర్రు సర్పంచి కె.రాజారెడ్డి అధికారులను నిలదీశారు. గతంలో గ్రామస్థాయిలో రచ్చబండ జరిగేదని ఇప్పుడు మండల కేంద్రాలకు కుదించి ఏ సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నిం చారు. సమావేశంలో చాలినన్ని కుర్చీలు లేక పలువురు సర్పంచులు నిలబడే ఉన్నారు. -
మంత్రి రఘువీరాకు సమైక్య సెగ
కళ్యాణదుర్గం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి మరోసారి ‘సమైక్య’ సెగ తగిలింది. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి, సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు ఆదివారం కళ్యాణదుర్గంలోని రఘువీరా ఇంటిని ముట్టడించారు. మంత్రి కళ్యాణదుర్గానికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న జేఏసీ నాయకులు ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. గంట పాటు అక్కడే బైఠాయించారు. మంత్రి బయటకు రావాలని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, మంత్రి స్పందించలేదు. దీనికి ఆగ్రహించిన జేఏసీ నాయకులు.. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు తోపులాట జరిగింది. జేఏసీ నాయకులు పెద్దఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు మంత్రి రఘువీరా జేఏసీ నాయకుల వద్దకు వచ్చారు. ఆయన రాగానే ఉద్యమకారులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని మరింత హోరెత్తించారు. ఉద్యమంలో పాల్గొనాలని మంత్రిని పట్టుబట్టారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. మంత్రి మాత్రం గంట పాటు మౌనం వీడలేదు. చివరకు ఇలా నినాదాలు చేస్తే ఫలితం లేదని, అందరం కూర్చుని సమస్యపై చర్చించుకుందామని జేఏసీ నాయకులను కోరారు. అనంతరం మంత్రి నివాసంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రాయల్ వెంకటేశులు, కన్వీనర్ మాధవ్, కో-కన్వీనర్లు జె.నాగరాజు, పోతుల రాధాకృష్ణ, మల్లారెడ్డి, చల్లా కిశోర్, అశోక్, ఈశ్వరయ్య, నరసింహులు, మోరేపల్లి నారాయణ, పాల్గుణప్రసాద్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజులకు పైగా సమైక్య ఉద్యమం సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే అయిన మీరు ఇక్కడి స్థితిగతులను పట్టించుకోకపోవడం బాధాకరమని మంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ తాను ముమ్మాటికీ సమైక్యవాదినేనని అన్నారు. దీంతో ఉద్యమకారులు శాంతించారు. రాజీనామాలతో సాధించేదేమీ లేదు ‘మా రాజీనామాలతో సాధించేదేమీ లేదు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఇప్పటికీ కృషి చేస్తున్నాం. అసెంబ్లీకి తీర్మానం వస్తే మా అభిమతం వ్యక్తం చేస్తాం. విభజన జరిగితే మేం శిక్షార్హులం. ప్రజలు ఏ శిక్ష విధించినా శిరసావహిస్తాం. పదవుల కోసం డ్రామాలాడాల్సిన దౌర్భాగ్యస్థితిలో నేను లేన’ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గం వైపు మూడు నెలలకుపైగా కన్నెత్తి చూడని మంత్రి రఘువీరా ఆదివారం ఇక్కడికి వచ్చారు. ఆయనకు సమైక్యవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. -
పన్ను వసూళ్లకు ‘సమైక్య’ పోటు
సాక్షి, కడప: ప్రజలపై సమైక్య భారం పడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రజలు మొదటి విడతగా చెల్లించే ఇంటి, నీటి పన్నును సకాలంలో చెల్లించలేకపోయారు. ప్రస్తుతం దీనికి అధికారులు వడ్డీ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. వసూళ్ల కోసం నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి, నీటి పన్ను ఏప్రిల్-సెప్టెంబర్, అక్టోబర్-మార్చి వరకు రెండు విడతలుగా వసూలు చేస్తారు. అయితే ఇప్పటికే మొదటి విడత గడువు దాటి నెలరోజులైంది. 50 శాతం లోపే వసూళ్లు : జిలా ్లవ్యాప్తంగా కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలలో 50శాతం లోపే వసూళ్లు జరిగినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఉదాహరణకు కడప కార్పొరేషన్‌ను పరిశీలిస్తే నగరంలో 78,656 గృహాలు, 1094 ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అయితే దీనికి ఏప్రిల్-సెప్టెంబర్ మొదటి విడతకు ఇంటిపన్ను మొత్తం 8 కోట్ల 55 లక్షల 57 వేల రూపాయలు. కాగా, కేవలం వసూలైంది 4 కోట్ల 23 లక్షల 95 వేల రూపాయలు. అంటే వసూలైన మొత్తం 50 శాతం లోపే ఉంది. 33,413 మంచినీటి కుళాయి కనెక్షన్లు ఉండగా, వీటికి 3 కోట్ల 72 లక్షల 66 వేల రూపాయలు పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ. 51.12 లక్షలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను పరిశీలిస్తే కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నాయి. అధికారులు మాత్రం.. మొదటి విడత, రెండో విడత బకాయిలను మార్చి లోపల వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే నిర్ణీత సమయంలో ఇంటిపన్ను చెల్లించని వారికి నెలకు 2శాతం అదనంగా వడ్డిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ఇంటిపన్ను, నీటిపన్నుతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరింత భారం కానుంది. సమైక్య సమ్మె నేపథ్యంలో కార్యాలయాలు లేకపోవడంతో తాము పన్నులు చెల్లించలేకపోయామని, ఇప్పుడు ప్రభుత్వం అదనంగా రెండు శాతం చెల్లించమనడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం సమ్మెకాలంలో సైతం మీసేవ కేంద్రాలు పనిచేశాయి. కాబట్టి ఆన్లైన్లో చెల్లింపులు చేసే అవకాశమున్నందున పన్ను కట్టుకోవాల్సి ఉందని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వసూళ్లను వేగవంతం చేశాం : కార్పొరేషన్ పరిధిలో నిలిచిపోయిన ఇంటి, నీటి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేశాం. మొదటి విడత ఏప్రిల్-సెప్టెంబరుకు సంబంధించి 50శాతం లోపు మాత్రమే పన్నులు వసూలయ్యాయి. పన్నులు సకాలంలో చెల్లించని వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనంగా రెండు శాతం వడ్డీని చెల్లించాల్సిందే. - చంద్రమౌళీశ్వరరెడ్డి, కమిషనర్, కడప నగర పాలక సంస్థ. నోటీసులు జారీ చే స్తున్న అధికారులు మార్చిలో పన్నులు చెల్లిస్తే గతంలో మాదిరి వడ్డీ మాఫీ జరిగే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు కట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం రెండు శాతం వడ్డీ తప్పక కట్టాల్సిందేనని, మాఫీ కాదని అధికారులు పేర్కొంటున్నారు. కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలలో ఇంటి, నీటి పన్ను వసూళ్లకు సంబంధించి డిమాండ్ నోటీసులను జారీచేస్తున్నారు. -
దారులన్నీ బంద్
సాక్షి, కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా, జీవోఎంకు నిరసనగా వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48గంటల జాతీయరహదారుల దిగ్బంధం రెండోరోజు గురువారం కొనసాగింది. కడపలో రాజంపేట వైఎస్సార్ సర్కిల్లో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో, ఇర్కాన్సర్కిల్లో నగరసమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ర హ దారులను దిగ్బంధించారు. ఇర్కాన్సర్కిల్లో వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. కళాకారులు సమైక్యాంధ్ర పాటలు పాడి ఉద్యమకారులను అలరించారు. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలు, చిన్నపిల్లల తల్లులు రోడ్లపక్కన చెట్లకింద సేదతీరారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు నేతలను అరెస్టు చేశారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచే దారులను దిగ్బంధించారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీలను రోడ్లకు అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. రోజంతా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లలేకపోయారు. చాలా గ్రామాల్లో పాఠశాలలకు అనధికారికంగా సెలవులు ప్రకటించారు. రోడ్లలో చిక్కుకుపోయిన ప్రయాణీకులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పొలీసులు మధ్యాహ్నం ఒంటిగంటకు అరెస్టు చేశారు. అయితే కార్యకర్తలు సాయంత్రం వరకూ దిగ్బంధనాన్ని కొనసాగించారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకూ ర హదారులను దిగ్బంధించారు. రోడ్లపై ట్రాక్టర్లు, బస్సులు అడ్డుగా పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్లపై వంటావార్పు చేసి, సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అందరినీ అరెస్టు చేశారు. పులివెందులలో యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైసీపీ జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6నుంచి సాయంత్రం 5గంటల వరకూ రోడ్లను దిగ్బంధించారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణీకులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. తొండూరులో రోడ్డుపై టెంటు ఏర్పాటు చేసి వంటావార్పు చేపట్టారు. మైదుకూరులో క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి, మైదుకూరు ఇన్చార్జ్ శెట్టిపల్లి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నాలుగరోడ్ల కూడలిని దిగ్బంధించారు. టెంటు ఏర్పాటు చేసి వంటవార్పు చేపట్టారు. రైల్వేకోడూరులో రాఘవరాజుపురం వద్ద రోడ్డుపై ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా కంప, మొద్దులు వేశారు. మధ్యాహ్నం 3గంటలకు పోలీసులు ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి ఆధ్వర్యంలో రోడ్లపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం 3.30గంటలకు పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. బద్వేలు, పోరుమామిళ్ల, అట్లూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి మూడుచోట్లా పాల్గొన్నారు. అట్లూరులో గోవిందరెడ్డిని అరెస్టుచేశారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6.30-11గంటల వరకూ రహదారులను దిగ్బంధించారు. రోడ్డుపై టెంట్లు వేసి కార్యకర్తలు బైఠాయించారు. వాహనాల రాకపోకలను మళ్లించేందుకు పోలీసులు యత్నించగా ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. 11 గంటలకు ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కమలాపురంలో మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. -
సమ్మె పేరుతో చేతివాటం
అక్రమార్కులు సమైక్యాంధ్ర సమ్మెనూ వదల్లేదు. ఆ పేరుతో సొమ్ము చేసుకున్నారు. ఎంచక్కా రేషన్ బియ్యం, కిరోసిన్‌లను డీలర్లు అక్రమంగా నల్లబజారులో అమ్ముకున్నారు. కంచే చేనుమేసినట్లుగా.. అడ్డుకోవాల్సిన అధికారులే దగ్గరుండి సహకరించారు. అక్టోబర్ కోటా సరుకుల కోసం చౌకదుకాణాల వద్దకు వెళ్లిన నిరుపేదలను పలు గ్రామాల్లో ‘సమ్మె వల్ల ఈ నెల సరుకు రాలేదు’ అంటూ డీలర్లు వెనక్కు పంపారు. కొండాపురం, న్యూస్‌లైన్ : నిరుపేదలను రేషన్‌డీలర్లు, అధికారులు ఏమార్చారు. కొండాపురం మండలంలోని పలు రేషన్‌దుకాణాల్లో అక్టోబర్ నెలకు సంబంధించి బియ్యం, కిరోసిన్ పేదలకు అందలేదు. అధికారులు, డీలర్లు కుమ్మక్కై పక్కదారి పట్టించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్లపల్లి, లింగనపాలెం, కొమ్మి-1, సత్యవోలు, కుంకువారిపాలెం, అగ్రహారం గ్రామాల్లోని రేషన్‌షాపుల పరిధిలో ఇలా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఈ ఆరు దుకాణాల్లో కలిపి 1610 కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా 17,308 కిలోల పీడీఎస్ బియ్యం, అంత్యోదయ లబ్ధిదారులకు 3,080కిలోల బియ్యం, 3145 లీటర్ల కిరోసిన్ ఇస్తారు. వింజమూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరకులు ఆయా షాపులకు వెళ్తాయి. అక్టోబర్ నెలకు సంబంధించి ఈ ఆరు దుకాణాల సురుకులను అధికారులు, డీలర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై గ్రామాల్లో డీలర్లను ప్రజలు ప్రశ్నిస్తే తుపాను, సమైక్యాంధ్ర సమ్మెల వల్ల సరుకులు రాలేదని జవాబు ఇస్తూ తప్పించుకుంటున్నారు. సహకరించని దుకాణాలపై దాడులు మండలంలో 34 రేషన్‌షాపులు ఉన్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి సరుకులు నల్లబజారులో అమ్ముకోవాలని, అందుకుగాను షాపునకు రూ.పదివేలు చొప్పున తమకు ఇవ్వాలని మండలానికి చెందిన ఓ అధికారి డీలర్లను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు అధికారికి భయపడిన ఆరుగురు డీలర్లు సరుకులను పక్కదారి పట్టించినట్లు సమాచారం. అతడి మాట వినని డీలర్ల షాపులపై దాడులు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా గొట్టిగొండాల-2 షాపుపై దాడిచేసి సొమ్ముచేసుకోవడం ఈ కోవకే చెందినదని సమాచారం. అధికారి మాట విననందుకు తమ షాపులపై దాడులు చేస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. -
సమైక్యం కోసం..
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్సీపీ రహదారుల దిగ్బంధం తొలిరోజు విజయవంతమైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా బుధ, గురువారాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు బుధవారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. పార్టీ సమన్వయకర్తలు, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై మరోమారు రాస్తారోకో చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అనిల్‌తో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. గూడూరులో పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, బాలచెన్నయ్య, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు నేదరుమల్లి పద్మనాభరెడ్డి, బత్తిన విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయరహదారిపై పోటుపాళెం కూడలి ప్రాంతం వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు నేతలను అరెస్టు చేశారు. జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అరెస్టయ్యారు. ఉదయగిరిలో ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో కార్యకర్తలు అరగంటపాటు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపి వేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వింజమూరు బంగ్లా సెంటర్లో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు. కలిగిరిలోని కలిగరమ్మ దేవాలయం వద్ద జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పావులూరి మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. జలదంకి బస్టాండ్‌లో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్లు దిగ్బంధం చేశారు. పార్టీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కావలిరూరల్ మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ప్రతాప్‌కుమార్‌రెడ్డితో సహా 30 మందిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం కూడలి వద్ద మండల కన్వీనర్ ఇందూరు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచి పోయాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం జాతీయ రహదారిపై పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో రోడ్డును దిగ్బంధించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కాకాణితో సహా 26 మందిని అరెస్ట్‌చేశారు. సూళ్లూరుపేలో పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. తడలో పార్టీ కార్యకర్తలు ఆర్కే సుందరంరెడ్డి, గండవరం సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో తడ చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో నిర్వహించారు. దొరవారిసత్రంలో దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నెలబల్లి, అక్కరపాక వద్ద జాతీయ రహదారుల దిగ్భంధం జరిగింది. నాయుడుపేటలో వైఎస్సార్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మల్లాం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయుడుపేట-శ్రీకాళహస్తి రోడ్డులో జాతీయ రహదారులను దిగ్బంధించారు. వెంకటగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో క్రాస్ రోడ్డు కూడలి వద్ద రహదారులను దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. కలువాయిలో మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. సైదాపురంలో మండల కన్వీనర్ కష్ణారెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. కోవూరు నియోజక వర్గంలోని కోవూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రహదారుల దిగ్బంధం జరిగింది. కోవూరులో ములుముడి వినోద్‌రెడ్డి, ఇందుకూరుపేటలో మావులూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్సీపీ నాయకులు ముంబయి రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.