SEMI CONDUCTORS
-
లక్షల కోట్ల విలువైన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌లు.. శంకుస్థాపన చేయనున్న మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇండియాస్ టేకేడ్ : చిప్స్ ఫర్ విక్షిత్ భారత్’లో భాగంగా దాదాపు రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ‘సెమీ కండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధితో భారత్‌ను గ్లోబల్హబ్గా నిలబెట్టడం, దేశ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ భారీ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. రెండు గుజరాత్, ఒకటి అస్సాంలో ప్రధాని శంకుస్థాపన చేయనున్న సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌లు గుజరాత్‌లోని ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (డీఎస్ఐఆర్)లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సౌకర్యం, గుజరాత్‌లోని సనంద్‌లో అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ ,టెస్ట్ ఏర్పాటు చేయనుంది. అస్సాంలోని మోరిగావ్‌లో అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ యూనిట్లను నెలకొల్పనుంది. India is set to become a prominent semiconductor manufacturing hub. The three facilities will drive economic growth and foster innovation.https://t.co/4c9zV3G9HL — Narendra Modi (@narendramodi) March 13, 2024 100 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ జిల్లా ధొలేరా ప్రాంతంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంల స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌గా తీర్చిదిద్దేలా నడుంభింగింది. ఈ 100 ఎకరాల్లో ఆయా సంస్థ సెమీ కండర్టర్ యూనిట్లను ఏర్పాటు చేయొచ్చు. తద్వారా యువతకు విస్త్రృత ఉపాధి అవకాశాలు, ఎకనమిక్ గ్రోత్ సాధించొచ్చుని కేంద్రం భావిస్తోంది. రూ91వేల కోట్లతో టాటా ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంలో దేశంలోనే తొలి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్) సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈపీఎల్) సిద్ధమైంది. రూ.91వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.ఈ సౌకర్యాలు సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. భారత్ సైతం సెమీ కండర్టర్ విభాగంలో రాణించడమే కాదు..వేలాది మందికి ఉపాధిని కల్పిస్తాయి.ఎలక్ట్రానిక్స్, టెలికాం మొదలైన సంబంధిత రంగాలలో ఉపాధి కలగనుంది. -
సెమీ కండక్టర్ల కొరత తీరనుందా..? కేంద్రం కీలక నిర్ణయం
భారత్ సెమీకండెక్టర్ చిప్సెట్ల కొరతను ఎదుర్కొంటోంది. ప్రతివాహనం, ఎలక్ట్రానిక్ వస్తువు తయారుచేయాలంటే సెమీకండక్టర్ చిప్సెట్ ప్రముఖపాత్ర వహిస్తోంది. వాటి కొరత తీరేలా త్వరలో రెండు పూర్తి స్థాయి చిప్ తయారీ ప్లాంట్లు ఇండియాలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ రెండింటికి తోడు మరికొన్ని సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేంజింగ్ ప్లాంట్లు కూడా ఇండియాకు రానున్నాయని చెప్పారు. ఇజ్రాయిల్ కంపెనీ టవర్ సెమీకండక్టర్స్ దేశంలో 8 బిలియన్ డాలర్లు (రూ.66,400 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు నిర్ధారించారు. టాటా గ్రూప్ కూడా అసోంలో చిప్ తయారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాట్లాడుతూ ‘రెండు పూర్తి స్థాయి చిప్‌ల తయారీ ప్లాంట్లు త్వరలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశానికి రానున్నాయి. ఈ ప్లాంట్లలో 65, 40, 28 నానోమీటర్ చిప్‌లు తయారవుతాయి. వీటికి తోడు మరికొన్ని చిప్ ప్యాకేజింగ్, అసెంబ్లింగ్‌కు సంబంధించి కొన్ని పెట్టుబడులను పరిశీలిస్తున్నాం’ అని మంత్రి తెలిపారు. భారీ రాయితీలతో.. సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ పెట్టేందుకు ప్రభుత్వం నాలుగు ప్రపోజల్స్‌ను అందుకున్నట్లు తెలిసింది. మరో 13 చిప్ అసెంబ్లింగ్, టెస్టింగ్, మానిటరింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్లకు సంబంధించి ప్రపోజల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ ప్రపోజల్స్ గుజరాత్లో యూఎస్ కంపెనీ మైక్రాన్ పెట్టుబడులకు అదనం. కాగా, సెమీకండక్టర్ సెక్టార్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం రూ.76 వేలకోట్ల విలువైన రాయితీలను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో రాబోయే ఇళ్లు ఎన్నంటే.. ఇందులో భాగంగా ఏదైనా కంపెనీ ఇండియాలో చిప్‌ల తయారీ ప్లాంట్ పెడితే ప్రాజెక్ట్‌లో 50 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మైక్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్, కేన్స్ కార్పొరేషన్ ఇండియాలో చిప్‌ల తయారీ ప్లాంట్ పెడతామని ప్రకటించాక చాలా కంపెనీలు ఈ సెక్టార్‌లోకి ప్రవేశిస్తామని ప్రకటించాయి. హెచ్‌సీఎల్ గ్రూప్, మురుగప్ప గ్రూప్ ఇందులో ఉన్నాయి. -
జపాన్ సహకారంతో వేదాంత సెమీకండక్టర్ ప్లాంట్!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్ ప్లాంటు కోసం జపాన్ టెక్నాలజీ కంపెనీలతో సహకారాన్ని అన్వేషిస్తున్నట్లు వేదాంత గ్రూప్ తెలిపింది. గుజరాత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను నెలకొల్పుతున్నట్టు వేదాంత ఇప్పటికే ప్రకటించింది. జపాన్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ రోడ్‌షో సందర్భంగా వేదాంత సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్ గ్లోబల్ ఎండీ ఆకర్ష్ కె హెబ్బార్ మాట్లాడారు. గుజరాత్‌లోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలకు ఇది 80 బిలియన్ డాలర్ల అవకాశం అని చెప్పారు. దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌ను నిర్మించడంలో సహాయం చేయడానికి భాగస్వామ్యం కావాలని జపాన్ కంపెనీలను ఈ సందర్భంగా ఆహ్వానించినట్టు వేదాంత తెలిపింది. భారత సెమీకండక్టర్, గ్లాస్ డిస్ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి వేదాంత గ్రూప్‌నకు చెందిన అవన్‌స్ట్రేట్ ఇంక్ గత ఏడాది చివర్లో 30 జపనీస్ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
‘కేనెస్’ పెట్టుబడి రూ.2,800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: సెమీ కండక్టర్ల రంగంలో పేరొందిన ‘కేనెస్ టెక్నాలజీ’రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.2,800 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ఫాక్స్‌కాన్‌కు పొరుగునే కేనెస్ టెక్నాలజీ నూతన తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావుతో కేనెస్ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ కన్నన్, చైర్పర్సన్ సవితా రమేశ్ శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. కొంగరకలాన్ యూనిట్లో ఔట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్(ఓఎస్ఏటీ)తోపాటు సంక్షిష్ట సెమీ కండక్టర్ల తయారీ వసతులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. కేనెస్ టెక్నాలజీ తన అనుబంధ కేనెస్ సెమీకాన్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు విద్యుత్ ఉపకరణాలకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెస్తోంది. ఐఐటీ ముంబై సహకారంతో కేనెస్ సెమీకాన్ అత్యాధునిక వసతులతో కూడిన పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి, ఎలక్ట్రానిక్స్ విభాగం డైరక్టర్ సుజయ్ కారంపూరి, కేనెస్ సెమీకాన్ సీఈవో రఘు ఫణిక్కర్ పాల్గొన్నారు. -
Semicon India 2023: సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సాయం
గాంధీనగర్: దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. స్థానికంగా సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తోందని అన్నారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాం«దీనగర్‌లో ‘సెమికాన్ ఇండియా–2023’ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ప్రపంచంలో వేర్వేరు కాలాల్లో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే ప్రతి పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారతీయుల ఆకాంక్షలే ముందుకు నడిపిస్తున్నాయని తాను నమ్ముతున్నానని తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. దీన్ని మరింత పెంచుతున్నామని, ఇకపై దేశంలో సెమికండర్టక్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ఏకంగా 50 శాతం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. 300 కాలేజీల్లో సెమికండక్టర్ డిజైన్ కోర్సులు భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధికి ఇక ఆకాశమే హద్దు అని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏడాది క్రితం భారత్‌లో ఈ పరిశ్రమలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రశ్నించేవారని, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ‘గ్రాండ్ కండక్టర్’గా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన ‘చిప్ సప్లై చైన్’ అవసరం ప్రపంచానికి ఉందన్నారు. అతి తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ ‘నేషనల్ క్వాంటన్ మిషన్’ను ఇటీవలే ఆమోదించామని, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ పరిశోధనలు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు క్వాంటన్ మిషన్ దోహదపడుతుందన్నారు. సెమికండక్టర్ పరిశ్రమకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టామని, దేశంలో పదేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. సోలార్ పీవీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్స్ విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. సదస్సులో పలు దేశాల పారిశ్రామికవేత్తలు, సెమికండక్టర్ రంగ నిపుణులు పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో భారత్ ముందంజ చెన్నై: జీవ వైవిధ్య పునఃస్థాపన, పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ‘జి–20 పర్యావరణ, వాతావరణ స్థిరత్వ మినిస్టీరియల్’ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గంగా నదిని శుభ్రపరిచేందుకు నమామి గంగ మిషన్ అమలు చేస్తున్నామన్నారు. ‘‘భారతీయులకు ప్రకృతే పెద్ద గురువు. భూమాత పరిరక్షణ అందరి బాధ్యత’’ అన్నారు. -
చైనాకు 30 ఏళ్లు పట్టింది .. మనకు పదేళ్లే
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద వ్యవధిలో అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు పురోగమిస్తోందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఆ స్థాయికి చేరుకునేందుకు చైనాకు 25–30 సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్ నుంచి కార్ల వరకూ అన్నింటా ఉపయోగించే చిప్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలు భారత్ పురోగమనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. ‘ఈ 10 బిలియన్ డాలర్ల తోడ్పాటుతో వచ్చే 10 ఏళ్లలో సెమీకండక్టర్ల విభాగంలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు వెడుతోంది. దీనికోసం చైనా వంటి దేశాలకు 25–30 ఏళ్లు పట్టేసింది. అయినా అవి ఇంకా పూర్తిగా సఫలం కాలేదు ‘అని మంత్రి చెప్పారు. మెమరీ సొల్యూషన్స్ దిగ్గజం మైక్రాన్ తలపెట్టిన ఏటీఎంపీ ప్రాజెక్టుతో సెమీకండక్టర్ల పరిశ్రమలో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో .. వేదాంత, ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజాలు ఇక్కడ చిప్స్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. -
‘సెమీ’ ఆశలకు సడన్ బ్రేకులు!
ఆశించిన పురోగతికి అర్ధంతరంగా బ్రేకులు పడినప్పుడు నిరాశ సహజమే! అందులోనూ అది సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పిన ఆత్మనిర్భర ఆశయాలకు భంగకరమని అనిపించినప్పుడు నిరుత్సాహం మరీ ఎక్కువే! భారత దేశ సెమీ కండక్టర్ల (చిప్‌ల) తయారీ ఆకాంక్షలకు ఇప్పుడు అలాంటి అవరోధాలే వచ్చాయి. సెమీ కండక్టర్ల తయారీకి కలసి కృషి చేసేందుకు ఒక్కటైన తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్‌కాన్’, భారత సంస్థ ‘వేదాంత’ ఇప్పుడు దేని దారి అది చూసుకోవడం అలాంటి పరిణామమే. దీనివల్ల భారత చిప్ లక్ష్యాలకు ఇబ్బంది ఏమీ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ అది సంపూర్ణ సత్యమేమీ కాదు. చిప్‌ల తయారీ నిమిత్తం వేదాంత– ఫాక్స్‌కాన్‌లు గత ఏడాది ఉమ్మడి భాగస్వామ్యానికి దిగి, గుజరాత్ ప్రభుత్వంతో 19.5 బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండర్ల కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. తీరా పట్టుమని పది నెలలకే ఆ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్టు ఫాక్స్‌కాన్ ప్రకటించడం ఒక విధంగా ఆకస్మిక బ్రేకనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మన దేశం ఆవిర్భవించేందుకు తగిన వాతావరణ పరికల్పనే లక్ష్యంగా పెట్టుకున్న భారత సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు ఇది శుభవార్త కానే కాదు. ‘సెమీ కండక్టర్ల ఆలోచనను నిజం చేయడానికి’ వేదాంత సంస్థతో కలసి ఏడాది పైగా కృషి చేసిన ఫాక్స్‌కాన్ పరస్పర అంగీకారంతో, ఈ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం ప్రకటించింది. అంటే ఇక ఆ బృహత్ ప్రయత్నంలో ఫాక్స్‌కాన్ పేరు ఉండదు. ప్రాజెక్ట్ పూర్తిగా వేదాంత సంస్థకే సొంతమన్నమాట. తొలి ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఇటు ఫాక్స్‌కాన్ సైతం విడిగా తగిన సాంకేతిక భాగస్వామిని చేర్చుకొని, తనదైన వ్యూహంతో ముందుకు నడుస్తుందన్న సంకేతాలొచ్చేశాయి. కలసి అడుగులేసిన సంస్థలు ఏడాదికే ఇలా వేరు కుం పట్లయిన పరిణామానికి కారణాలేమిటన్నది అవి చెప్పలేదు. గుజరాత్లో చిప్‌ల తయారీకి కావాల్సిన లైసెన్స్‌తో కూడిన సాంకేతిక పరిజ్ఞానంకోసం వేదాంత, ఫాక్స్‌కాన్‌లు ఎస్టీమైక్రోను ఆసరాగా బరిలోకి దింపాయి. కానీ, ప్రభుత్వం మాత్రం సదరు యూరోపియన్ చిప్ తయారీ సంస్థ కూడా నిష్పూచీగా మిగలక, ఒప్పందంలో భాగస్వామిగా ఉండాల్సిందే అనడంతో చిక్కొచ్చినట్టుంది. ప్రపంచంలో 37 శాతం చిప్‌లు తైవాన్వే! భారత ఎలక్ట్రానిక్ చిప్ అవసరాలన్నీ ప్రధానంగా దిగుమతి ద్వారానే తీరుతున్నాయి. కొన్నేళ్ళుగా ఏటా దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన చిప్‌లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సుమారు 70 శాతం చైనా నుంచి వస్తున్నవే. చిప్‌ల తయారీలోని ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఐఎస్ఎం ప్రారంభమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, అనేక ఐరోపా దేశాలు చిప్‌ల తయారీ సత్తా పెంచుకుంటున్నాయి. తాజాగా భారత్ ఆ పరుగులో చేరింది. దేశంలో చిప్‌ల తయారీ కేంద్రాల్ని నెలకొల్పాలని వచ్చేవారికి పెట్టుబడి రూపంలో ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడింది. అమెరికా చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ఇటీవలే భారత్‌లో చిప్ కేంద్రానికి ఆమోదం పొందింది. కేంద్ర, గుజరాత్ సర్కార్లు దానికి గణనీయంగా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. ఆత్మ నిర్భరతకై ఇలాంటి యత్నాలు జరుగుతున్న వేళ భారీ ఒప్పందమైన వేదాంత – ఫాక్స్‌కాన్ చిక్కుల్లో పడడమే విచారకరం. కారణాలేమైనా గత ఏడాది ఫిబ్రవరి 14న ఫాక్స్‌కాన్– వేదాంతల మధ్య మొలకెత్తిన ప్రేమ మూణ్ణాళ్ళ ముచ్చటైంది. గుజరాత్లో చిప్‌ల తయారీ కేంద్రాల ఏర్పాటుకై గత సెప్టెంబర్‌లో చేసుకున్న రూ. 1.54 లక్ష కోట్ల మేర ఒప్పందాలు ఇరుకునపడ్డాయి. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా ముందుకు పోయినా భారత సెమీ కండక్టర్ల మిషన్‌లో జాప్యం తప్పదనిపిస్తోంది. చిప్‌ల తయారీకి తగ్గ పునాది లేకున్నా చిప్ డిజైన్‌లో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. సొంత తయారీతో పదునుపెట్టుకోవాలి. పైగా, కరోనాతో సరఫరా వ్యవస్థలకు అంతరాయం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో వచ్చిపడ్డ అనివార్యతల రీత్యా రక్షణ, ఎలక్ట్రానిక్స్ తదితర కీలక రంగాల్లో భారత్ ఎంత త్వరగా సొంతకాళ్ళపై నిలబడగలిగితే వ్యూహాత్మకంగా అంత మంచిది. ఆ మాటకొస్తే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా పైచేయి సాధించగలిగిందీ ఈ చిప్‌ల వల్లేనంటారు విశ్లేషకులు. అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు నడుస్తున్న భౌగోళిక రాజకీయాల తోపులాటలోకూ ఇవే కారణం. ఇవాళ దేశాలన్నీ తమ గడ్డపైనే అన్ని రకాల చిప్‌ల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందీ, ప్రోత్సాహకాలిస్తున్నదీ అందుకే. కాబట్టి, మనకు అవసరమైన చిప్‌ల డిజైనింగ్ నుంచి తయారీ దాకా అన్నీ మన చేతుల్లోనే ఉండడం పోటీలో ముందు ఉండడానికో, ఆర్థిక ప్రయోజనాల రీత్యానో కాకున్నా... వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకం. అందుకే, వేదాంత – ఫాక్స్‌కాన్‌ల బంధం విచ్ఛిన్నమైందన్న నిరాశను పక్కనపెట్టి, సెమీ కండక్టర్ల రంగాన్ని దృఢంగా నిర్మించేందుకు మరింతగా కృషి చేయాలి. చైనా లాంటివి పడనివ్వకుండా చేసినా పట్టుదలతో సాగాలి. వేదాంత – ఫాక్స్‌కాన్‌లకు ఇరుకున పెట్టిన ఆర్థిక, సాంకేతిక అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఇలాంటి మరో ప్రయత్నానికి ఆ చిక్కులు రాకుండా నివారించాలి. సెమీ కండక్టర్ల రంగంలో సాంకేతిక విజ్ఞాన బదలీని ప్రోత్సహించాలి. పరిశోధన, అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థల మధ్య సహకారాన్నీ పెంచిపోషించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే, ఐఎస్ఎం కింద రూ. 76 వేల కోట్ల కేటాయింపుతో నాలుగు పథకాలు ప్రవేశపెట్టామంటున్న ప్రభుత్వం సంస్థలకు తగిన వాతావరణం కల్పిస్తేనే ఫలితం. మేకిన్ ఇండియాకు బ్రేకులు పడకూడదంటే అది అత్యంత కీలకం. -
వేదాంతా చేతికి ట్విన్ స్టార్ బిజ్
న్యూఢిల్లీ: సహచర సంస్థ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టీఎస్‌టీఎల్) నుంచి సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్‌లను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా లిమిటెడ్ వెల్లడించింది. తద్వారా సమీకృత సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్‌లు కలిగిన తొలి కంపెనీగా వేదాంతా ఆవిర్భవించనుంది. వేదాంతాకు అల్టిమేట్ హోల్డింగ్ కంపెనీ అయిన టీఎస్‌టీఎల్.. వోల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పూర్తి అనుబంధ సంస్థకావడం గమనార్హం! కాగా.. షేర్ల బదిలీ ద్వారా టీఎస్‌టీఎల్ సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్ యూనిట్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో వేదాంతా డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోకు సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ బిజినెస్ జత కలవనున్నాయి. -
‘ఆటో’కు తీరని చిప్ చిక్కులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వాహనాల పరిశ్రమకు మొదలైన సెమీ కండక్టర్ల కష్టాలు ఇంకా పూర్తిగా తీరలేదు. గతంతో పోలిస్తే తీవ్రత కొంత తగ్గినా ఇప్పటికీ చిప్‌ల కొరత వెన్నాడుతూనే ఉంది. దీంతో ఆర్డర్లు పుష్కలంగా ఉన్నా ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకోలేకపోతున్నాయి. ఫలితంగా పెండింగ్ ఆర్డర్లు పేరుకుపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీలు దాదాపుగా ఇవే విషయాలను ప్రస్తావించాయి. రెండో త్రైమాసికంతో పోలి స్తే మూడో క్వార్టర్లో పరికరాల సరఫరాపరమైన సమస్య స్వల్పంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) పేర్కొంది. క్యూ3లో దా దాపు 46,000 వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఉత్పత్తి ప్రణాళికలు వేసుకోవడం సవాలుగా మారిందని ఎంఎస్ఐఎల్ వివరించింది. దీనితో మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,63,000 వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని.. వీటిలో 1,19,000 ఆర్డర్లు ఇటీవల ప్రవేశపెట్టిన మోడల్స్వే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అదే పరిస్థితిలో మరిన్ని సంస్థలు .. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం తెలంగాణ, మహారాష్ట్రలో దాదాపు రూ. 11,000 కోట్లతో పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినప్పటికీ ప్రస్తుతమున్న ప్లాంట్ల సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలే ఇందుకు కారణమని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ వెల్లడించారు. స్కార్పియో, ఎక్స్‌యూవీ700 వంటి వాహనాల తయారీలో దాదాపు 200 రకాల సెమీకండక్టర్ చిప్స్ అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంఅండ్ఎం వద్ద 2,66,000 వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి. ఇక చిప్లపరమైన సవాళ్లు 2023లో కూడా కొనసాగవచ్చని జేఎల్ఆర్ పేర్కొంది. చిప్‌ల సరఫరాను మెరుగుపర్చుకునే దిశ గా మంచి పురోగతే సాధించామని .. అయినప్పటికీ కొన్ని సవాళ్లు నెలకొన్నాయని తెలిపింది. చైనాలో మళ్లీ కోవిడ్ ప్రబలడం, మార్కెట్లో అధిక రేట్లకు చిప్‌లు కొనాల్సి వస్తుండటం తదితర సవాళ్లు ఉన్న ట్లు వివరించింది. 2023లో డిమాండ్ సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నామని అయితే వాహనాలను ఎంత మేరకు అందించగలమనేది చిప్‌ల సరఫరా అంశమే నిర్దేశిస్తుందని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఎండీ పియుష్ ఆరోరా తెలిపారు. -
చిప్ తయారీలో ముద్ర వేయగలమా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌తోపాటు ఓ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్, సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు ‘వేదాంత’ గ్రూపు ప్రకటించింది. రెండు కారణాల వల్ల ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మొదటిది వీటి ఏర్పాటుకు ఏకంగా ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూండటం. ఇక రెండోది, ఈ ప్లాంట్ ముందు నుంచి సూచిస్తూ వచ్చిన మహారాష్ట్రలో కాకుండా గుజరాత్లో ఏర్పాటు కానుండటం! ఇంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. వేదాంత గ్రూపు భాగస్వామిగా తైవాన్‌కు చెందిన హోన్ హై టెక్నాలజీ(ఫాక్స్‌కాన్) గ్రూపు వ్యవహరిస్తూండటం. సెమీకండక్టర్ల తయారీకి తైవాన్ పెట్టింది పేరన్నది తెలిసిన విషయమే. కోవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చిప్‌లకు కొరత ఏర్పడటం కనువిప్పు లాంటి దని చెప్పాలి. ఒకరిద్దరు తయారీదారులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవని రుజువు చేసిందీ మహమ్మారి. ఈ కాలంలో సెమీకండక్టర్ చిప్‌లు కార్లు మొదలుకొని వాషింగ్ మెషీన్ల వరకూ అన్నింటిలో చేరి పోతున్నాయి. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో చాలామంది తయారీ దారులు తైవాన్‌లోని ఫ్యాబ్‌లపై (చిప్ తయారీ కేంద్రాలను ఫ్యాబ్లని పిలుస్తారు) ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించారు. అందుకే ఈ మార్కెట్లో సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సము పార్జించుకోవడం భారత్‌కు ఎంతైనా అవసరం. ఈ ఏడాది అమెరికా ‘చిప్స్’ పేరుతో ఓ చట్టాన్ని ఆమోదించింది. ఇందులో భాగంగా మైక్రోప్రాసెసర్లు లేదా చిప్‌లు తయారు చేసే లేదా పరిశోధనలు చేసే అమెరికన్ కంపెనీలకు దాదాపు 5,200 కోట్ల డాలర్ల ప్రోత్సాహకాలు అందించనున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. దక్షిణ కొరియా దేశీ సంస్థలకు సబ్సిడీలతో కలుపుకొని సుమారు 45,000 కోట్ల డాలర్లతో సెమీ కండక్టర్ల తయారీకి భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. మన దేశంలో ‘సెమీ కండక్టర్ మిషన్’లో భాగంగా సుమారు 76 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు చిప్స్, డిస్ప్లే ఫ్యాబ్స్‌కు ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. ప్రైవేట్ సంస్థలకు ప్రాజెక్టుకయ్యే ఖర్చులో దాదాపు 50 శాతం సబ్సిడీగా అందిస్తున్నారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించిన పునాదులు 1974లో పంజాబ్‌లో పడ్డాయని చెప్పాలి. సెమీ కండక్టర్ల డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్లలో మన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఇందుకోసం విదేశీ సాయం తీసుకోవాలని తొలినాళ్లలో నిర్ణయించింది. ‘సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్’ (ఎస్సీఎల్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర పడిన తరువాత 1976లో నిపుణుల బృందం మొహాలీ, మద్రాస్‌లలో ఒకచోట ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సూచిం చింది. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ మద్రాస్ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సిఫారసు చేసింది. అయితే అప్పటి పంజాబ్ ముఖ్య మంత్రి జైల్‌సింగ్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఈ కాంప్లెక్స్ మొహాలీలో ఏర్పాటయ్యేలా చేసుకున్నారు. ఈ కేంద్రంలో అత్యధిక నైపుణ్యం ఉన్న వారి అవసరం ఎక్కువగా ఉంటుందనీ, దీని వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలేవీ పెరగవన్న విషయాన్ని జైల్ సింగ్‌కు వివరించాల్సిందిగా ఇందిరాగాంధీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అధికారి అశోక్ పార్థసారథిని పురమాయించారు. అయినాసరే మొహాలీలోనే ఆ కాంప్లెక్స్ ఏర్పాటు కావాలని జైల్‌సింగ్ పట్టు పట్టడంతో భారత్‌లో తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం 1978లో మొహాలీలో ఏర్పాటైంది. అప్పట్లో ఈ ఫ్యాబ్‌కు రూ.15 కోట్లు ఖర్చు అయ్యింది. 1983లో అమెరికన్ మైక్రోసిస్టమ్స్ నుంచి పొందిన టెక్నా లజీ ఆధారంగా ఈ ఫ్యాబ్లో చిప్‌ల తయారీ మొదలైంది. ఎస్సీఎల్ ఏర్పాటయ్యే సమయానికి కొంచెం అటూయిటుగానే దేశంలో సెమీ కండక్టర్ డిజైనింగ్ కార్యకలాపాలు కూడా మొదల య్యాయి. చిప్ డిజైనింగ్‌లో అమెరికాలో పెద్ద పేరు సంపాదించిన ఐఐటీ – కాన్పూర్ పూర్వ విద్యార్థి ప్రభాకర్ గోయెల్ ఈ దిశగా చొరవ తీసుకున్నారు. ప్రభాకర్ మొదలుపెట్టిన ‘గేట్‌వే డిజైన్ ఆటోమేషన్’ సంస్థ చిప్‌లను పరీక్షించేందుకు వెరిలాగ్ పేరుతో టెస్టింగ్ టూల్‌ను తయారు చేసింది. వెరిలాగ్కు జపాన్, తైవాన్‌లలోని చిప్ తయారీ దారుల నుంచి మంచి డిమాండ్ ఏర్పడటంతో ప్రభాకర్ గోయెల్ సంస్థ లక్షల డాలర్లు ఆర్జించగలిగింది. వెరిలాగ్ రూపకల్పన కొంత శ్రమతో కూడిన వ్యవహారం కావడంతో ప్రభాకర్ ఈ ప్రక్రియను భారత్‌లో చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం నోయిడాలోని ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లో 1985లో కొంతమంది ఇంజినీర్లతో ఓ చిన్న యూనిట్‌ను మొదలుపెట్టారు. నాలుగేళ్ల తరువాత అమెరికాకు చెందిన కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ ప్రభాకర్ కంపెనీని కొనేసింది. ఈ రకంగా కాడెన్స్ సంస్థ భారత్‌లోనూ కాలుపెట్టిందని చెప్పాలి. సెమీ కండక్టర్ డిజైనింగ్ రంగంలోనే ఉన్న ఇంకో రెండు కంపెనీలు టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్ కూడా ఈ సమయంలోనే దేశంలో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఆ తరువాత పదేళ్ల కాలంలోనే ఇంటెల్ లాంటివాటితో కలుపుకొని ప్రపంచంలోని 25 సెమీకండక్టర్ డిజైనింగ్ కంపెనీల్లో 17 భారత్‌లో కేంద్రాలను తెరి చాయి. ఫలితంగా సెమీకండక్టర్ డిజైనింగ్ రంగంలో భారత్ ఓ బలీయమైన శక్తిగా మారింది. మైక్రోప్రాసెసర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు అమెరికా, యూరప్ కంపెనీలు భారతీయ ఇంజినీర్ల డిజైనింగ్ నైపు ణ్యాన్నీ, తైవాన్‌లోని తయారీ కేంద్రాలనూ ఉపయోగించుకోవడం మొదలైంది. ఇంకోవైపు ఎస్సీఎల్ ఈ పోటీలో వెనుకబడి పోయింది. తయారీ టెక్నాలజీని ఆధునికీకరించే ప్రయత్నంలో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ఒకటి చోటు చేసుకోవడం... పునర్నిర్మాణానికి చాలా సమయం పట్టడంతో కంపెనీ మళ్లీ కోలుకోలేకపోయింది. కాకపోతే సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై విదేశాలు నిషేధాలు విధించిన సమ యంలో అంతరిక్ష, రక్షణ రంగాల అవసరాలను తీర్చేందుకు మాత్రం ఉపయోగపడింది. తాజాగా ఎస్‌సీఎల్‌ను వాణిజ్యస్థాయి ఫ్యాబ్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెమీ కండక్టర్ రంగంలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అవసరమైన మేరకు పెట్టుబడులు పెట్టలేకపోవడం, స్థానికంగా మైక్రోప్రాసెసర్లకు డిమాండ్ తక్కువగా ఉండటం, ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవడం వంటివి మచ్చుకు కొన్ని. సెమీ కండక్టర్ రంగంలో టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతూంటుంది. వేదాంత సంస్థ ఏర్పాటు చేయదలచుకున్న ఫ్యాబ్లో 28 నానోమీటర్ల టెక్నాలజీ నోడ్లను తయారు చేసేందుకు నిర్ణయించారు. కంప్యూటర్లకు గుండె వంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రాఫిక్ ప్రాసెసర్లు, నెట్వర్కింగ్ చిప్స్, స్మార్ట్‌ఫోన్స్, కార్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లలో ఉపయోగించే మైక్రోప్రాసెసర్లను ఇక్కడ తయారు చేయవచ్చు. అయితే తైవాన్‌లో ప్రస్తుతం ఇంతకంటే చాలా సూక్ష్మమైన స్థాయిలో టెక్నాలజీ నోడ్లను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇవెంత సూక్ష్మమైన వంటే... కేవలం మూడు నానోమీటర్ల సైజున్నవన్నమాట! మొహాలీలో ఏర్పాటైన ఎస్‌సీఎల్‌లో ఐదు మైక్రాన్ల (5,000 నానో మీటర్లు) సైజున్న ట్రాన్సిస్టర్ల తయారీ చేపట్టారు. ఈ సైజును 1.2 మైక్రాన్లకు(1,200 నానోమీటర్లు) తగ్గించేందుకు జరిగిన ప్రయత్నం లోనే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా అంత ర్జాతీయ సంస్థలు 0.8 మైక్రాన్ల సైజులో మాత్రమే ట్రాన్సిస్టర్ల తయా రీలో ఉండేవి. పదేళ్లలోపు ఎస్సీఎల్ ఈ అంతరాన్ని సొంతంగానే తగ్గించుకుని ఉండేది. విదేశీ టెక్నాలజీలను ఆపోశన పట్టడంలో భారతీయులు నైపుణ్యం కలవారన్నది తెలిసిందే. ఎప్పటి కప్పుడు మారిపోతూండే ఈ సెమీ కండక్టర్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్ రంగంలో మనదైన ముద్ర వేయాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చు కోవడం ఎంతైనా అవసరం. ఇందుకు పరిశోధనలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికైతే వేదాంత ప్రతిపాది స్తున్న జాయింట్ వెంచర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై మాట విప్పడం లేదు. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా ఉంటుందా, లేదా అన్నది కూడా అస్పష్టం. భారత్ మరోసారి సెమీ కండక్టర్ రంగంలో లభిస్తున్న గొప్ప అవకాశాన్ని కోల్పోదనే ఆశిద్దాం! వ్యాసకర్త: దినేశ్ సి. శర్మ, వైజ్ఞానిక అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ!
న్యూఢిల్లీ: టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. ఇది టెలికం కంపెనీలనూ తాకింది. సిమ్‌కార్డుల సరఫరాలో కొరత నెలకొంది. అంతేకాదు, 2024కు ముందు సిమ్ల సరఫరా పరిస్థితి మెరుగుపడేలా లేదు. దీంతో రూ.10,000 అంతకుమించి విలువ చేసే అన్ని మొబైల్ ఫోన్లలో, ఫిజికల్ సిమ్ స్లాట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ–సిమ్) ఉండేలా మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలని టెలికం ఆపరేటర్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు లేఖ రాసింది. కానీ, సీవోఏఐ డిమాండ్‌ను ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసిసోయేషన్ (ఐసీఈఏ)ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. సెల్యులర్ ఆపరేటర్లు కోరుతున్నట్టు మొబైల్ ఫోన్లలో ఈ–సిమ్ కార్డులను ప్రవేశపెట్టడం వాటి తయారీ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అదనపు హార్డ్‌వేర్ అవసరంతోపాటు, డిజైన్లోనూ మార్పులు అవసరమవుతాయని వివరించింది. ధరలు పెరిగే ప్రమాదం.. ప్రస్తుతం ఈ–సిమ్ ఆప్షన్ ఖరీదైన ఫోన్లలోనే ఉంది. కేవలం 1–2 శాతం మంది చందాదారులే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. రూ.10,000పైన ధర ఉండే ఫోన్లు మొత్తం ఫోన్ల విక్రయాల్లో 80 శాతంగా ఉన్నాయని ఐసీఈఏ అంటోంది. ఈ–సిమ్‌ను తప్పనిసరి చేస్తే భారత మార్కెట్లో అమ్ముడుపోయే ఫోన్ల కోసం ప్రత్యేక డిజైన్లు అవసరమవుతాయని పేర్కొంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ–సిమ్ తప్పనిసరి అనే ఆదేశాలేవీ లేవు. దీంతో భారత మార్కెట్లో విక్రయించే ఫోన్లను ఈ–సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మధ్య స్థాయి ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. మొబైల్ ఫోన్ల మార్కెట్లో సగం రూ.10,000–20,000 బడ్జెట్‌లోనివే కావడం గమనార్హం. సిమ్‌కార్డులకు కొరత ఏర్పడడంతో వాటి ధరలు పెరిగాయన్నది సెల్యులర్ ఆపరేటర్ల మరో అభ్యంతరంగా ఉంది. దీన్ని కూడా ఐసీఈఏ వ్యతిరేకిస్తోంది. ‘‘సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా ఫర్వాలేదు. కానీ, ఈ–సిమ్ కోసం ఫోన్లో చేయాల్సిన హార్డ్‌వేర్ మార్పుల కోసం అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువే’’అన్నది ఐసీఈఏ వాదనగా ఉంది. అన్ని మొబైల్ ఫోన్లకు ఈ–సిమ్‌లను తప్పనిసరి చేసినట్టయితే అది మొబైల్ ఫోన్ల పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఎగుమతుల పట్ల నెలకొన్న ఆశావాదాన్ని సైతం నీరుగారుస్తుందని అంటోంది. త్వరలో కుదురుకుంటుంది.. సిమ్‌కార్డుల కొరత సమస్య త్వరలోనే సమసిపోతుందని ఐసీఈఏ అంటోంది. వచ్చే 6–9 నెలల్లో సాధారణ పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతోంది. కానీ, సిమ్ సరఫరాదారులతో సీవోఏఐ ఇదే విషయమై చేసిన సంప్రదింపుల ఆధారంగా చూస్తే.. సిమ్ కార్డుల సరఫరా 2024కు ముందు మెరుగయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. హైలైట్స్ ► సరఫరా సమస్యల కారణంగా సిమ్ కార్డుల ధర పెరిగిపోయింది: సీవోఏఐ ► సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా, హార్డ్‌వేర్‌లో ఈ–సిమ్ల కోసం చేయాల్సిన మార్పుల వల్ల అయ్యే వ్యయాలతో పోలిస్తే తక్కువే: ఐసీఈఏ ► ఈ–సిమ్ కార్డులతో సిమ్‌కార్డుల వ్యర్థాలను (నంబర్ పోర్టబులిటీ రూపంలో) నివారించొచ్చు: సీవోఏఐ ► 1–2 శాతం చందాదారులే ఈ సిమ్‌లను వాడుతున్నారు. అన్ని ఫోన్లకు తప్పనిసరి చేయొద్దు: ఐసీఈఏ ► సిమ్ కార్డుల సరఫరా 2024లోపు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు: సీవోఏఐ ► 6–9 నెలల్లో సరఫరా సాధారణ స్థితికి వచ్చేస్తుంది: ఐసీఈఏ -
రయ్‌మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు జూన్‌లో 19 శాతం దూసుకెళ్లి 2,75,788 యూనిట్లు నమోదయ్యాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగుపడడం ఈ వృద్ధికి కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 10.6 లక్షల నుంచి 13.08 లక్షల యూనిట్లకు చేరింది. త్రిచక్ర వాహనాలు సుమారు మూడురెట్లు ఎగసి 26,701 యూనిట్లుగా ఉంది. అన్ని విభాగాల్లో కలిపి 13.01 లక్షల నుంచి 16.11 లక్షల యూనిట్లకు పెరిగింది. ఏప్రిల్–జూన్‌లో ప్యాసింజర్ వాహనాలు 41 శాతం పెరిగి 9.1 లక్షల యూనిట్లకు ఎగసింది. వాణిజ్య వాహనాలు 1.05 లక్షల నుంచి 2.24 లక్షల యూనిట్లకు చేరింది. ద్విచక్ర వాహనాలు 24.13 లక్షల నుంచి 37.24 లక్షల యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 24,522 నుంచి 76,293 యూనిట్లకు చేరాయి. అన్ని విభాగాల్లో కలిపి జూన్ త్రైమాసికంలో 31.9 లక్షల నుంచి 49.3 లక్షల యూనిట్లకు పెరిగాయి. రెండింతలైన పోర్ష్ అమ్మకాలు లగ్జరీ కార్ల తయారీలో ఉన్న పోర్ష్ ఈ ఏడాది జనవరి–జూన్‌లో భారత్‌లో 378 యూనిట్లు విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా వృద్ధి. ఖరీదైన స్పోర్ట్స్ కార్ల డిమాండ్‌తో పరిశ్రమ కోలుకుంటోందని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనమని కంపెనీ తెలిపింది. 2021లో భారత్‌లో 474 పోర్ష్ కార్లు రోడ్డెక్కాయి. ఇప్పటి వరకు సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే. -
Youth Pulse: ‘చిప్స్’.. ఇప్పుడు హాట్‌టాపిక్! వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు!
Semiconductor Career Opportunities in India: ‘శుభాకాంక్షలు’ తెలియజేసే ఛీర్... హిప్ హిప్ హుర్రే. ఇప్పుడు అదే ఛీర్తో భవిష్యత్కాల శుభ సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ‘చిప్ చిప్ హుర్రే’ అంటుంది యూత్. ఎందుకంటే...పరాధీనతకు చరమగీతం పాడడానికి, సెమికండక్టర్ చిప్‌ల తయారీవ్యవస్థను బలోపేతం చేస్తూ, స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. రాబోయే కాలంలో ఈ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు యూత్ కోసం ఎదురుచూస్తున్నాయి. సర్వం సాంకేతికమయం అయిన ఈ ప్రపంచంలో సెమికండక్టర్ చిప్‌లు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. కరోనా కాటేసిన రంగాలలో ‘చిప్’ తయారీరంగం కూడా ఒకటి. కరోనాదెబ్బతో ‘చిప్’ల డిమాండ్, సరఫరాకు మధ్య భారీ అంతరం ఏర్పడింది. తయారీదార్లు రేట్లు పెంచారు. ఈ నేపథ్యంలో దేశాలు సెమీకండక్టర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టడం, బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. మన దేశం సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పన,తయారీ ప్రాజెక్ట్ కోసం 76వేల కోట్లు కేటాయించింది. మరోవైపు విద్యాసంస్థలు తమ పాఠ్యప్రణాళికలో సెమికండక్టర్ల డిజైన్‌ను అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘దేశంలో చిప్‌ల కొరత...అనే వార్త చదువుతున్న క్రమంలో ఎందుకు? ఏమిటి? ఎలా? అనే కోణంలో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నన్ను ఆశ్చర్య,ఆనందాలకు గురి చేసిన విషయం ఈ రంగంలో భారీ ఉద్యోగావకాశాలు. ఇంజనీరింగ్ చదువుతున్న చెల్లి సుహానితో నేను చదివిన విషయాలను షేర్ చేసుకున్నాను’ అంటోంది నాగ్‌పూర్(మహారాష్ట్ర)కు చెందిన కావేరి. చెల్లి సుహానికి ఇప్పుడు ‘చిప్స్’ అనేది హాట్‌టాపిక్. ఆ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? అనేదాని గురించి చిన్నపాటి రిసెర్చ్ చేయడమే కాదు ఆ విషయాలను స్నేహితులకు చెబుతోంది. పెద్ద పెద్ద సంస్థలు దేశంలోని వివిధప్రాంతాలలో సెమికండక్టర్ల తయారీ యూనిట్లను ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం కూడా బాగానే ఉంది. ఇదే సందర్భంలో మాన్యుఫాక్చరింగ్ టాలెంట్, ప్రాక్టికల్ స్కిల్స్‌పై చర్చ మొదలైంది. కళాశాల చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులను ‘జాబ్–రెడీ’కి సిద్ధం చేయడానికి ఆరు నుంచి పన్నెండు నెలల టైమ్ పడుతుంది అంటున్నారు సాంకేతిక నిపుణులు. ‘ఫ్యూచర్ ఏమిటి?’ అని రకరకాలుగా ఆలోచించిన సహజకు ‘చిప్’ల రూపంలో ఇప్పుడొక దారి దొరికింది. తిరునెల్వేలి(తమిళనాడు) చెందిన సహజ ‘సెమీకండక్టర్ ఇంజనీర్’ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ‘సెమీకండక్టర్ల పరిశ్రమలో నైపుణ్యం కొరతను దృష్టిలో పెట్టుకొని చైనా ప్రభుత్వం చిప్ స్కూల్‌ను ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా సైన్స్‌పార్క్‌ను ఏర్పాటుచేసింది. చిప్ స్కూల్లో విద్యార్థులకు సెమీకండక్టర్లకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందించడంతో పాటు సీనియర్ ఇంజనీర్లు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లు, ప్రొఫెసర్లతో ఉపన్యాసాలు ఇప్పిస్తుంది. అలాంటి స్కూల్స్ మన దేశంలో కూడా ఏర్పాటుచేయాలి’ అంటుంది సహజ. మాసివ్ టాలెంట్ షార్టేజీ... అనే మాట ఒకవైపు నుంచి నిరాశగా వినిపిస్తున్నప్పటికీ, మరోవైపు నుంచి మాత్రం అత్యంత ఉత్సాహంగా ‘మేము రెడీ’ అని సన్నద్ధం అవుతోంది యువతరం. సాంకేతిక చదువు మాత్రమే చిప్ తయారీ పరిశ్రమలో రాణించడానికి ప్రధాన అర్హత కావడం లేదు. దీనికి క్రియేటివిటీ కూడా అత్యవసరం అంటున్నారు నిపుణులు. తమ డిజైనింగ్ ద్వారా టైమ్, డబ్బును ఆదా చేయడం యూత్ క్రియేటివిటీలో ఒకటి కాబోతుంది. చదవండి: Indravathi Inspiring Story: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇంద్రావతి.. పాపులర్ ఎలా అయింది -
“మేక్ ఇన్ ఇండియా”..5 కంపెనీలు..రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: వచ్చే నాలుగేళ్లలో (2026 నాటికి) దేశీయంగా 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం 70–80 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్లు (చిప్‌లు) అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2022 సదస్సుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చే దిశగా సెమీకాన్ ఇండియా తొలి సదస్సు ఏప్రిల్ 29–మే 1 మధ్య బెంగళూరులో జరగనుంది. ఈ సదస్సులో పలు దిగ్గజ సెమీకండక్టర్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ‘డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విజన్ డాక్యుమెంట్ ప్రకారం 2026 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దీని ప్రకారం చూస్తే దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగమే 70–80 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. సెమీకాన్ ఇండియా పథకం కింద భారత్‌లో దాదాపు రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్ చిప్, డిస్ప్లే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అయిదు కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. వేదాంత ఫాక్స్‌కాన్ జేవీ, ఐజీఎస్ఎస్ వెంచర్స్, ఐఎస్ఎంసీ సంస్థలు..ఎలక్ట్రానిక్ చిప్ తయారీ ప్లాంట్లను పెట్టే యోచనలో ఉన్నాయి. వేదాంత, ఎలెస్ట్ సంస్థలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిలో ఉపయోగించే డిస్ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేశాయి. -
పుతిన్.. నీకు అర్థమవుతుందా? సెమీకండక్టర్లకు యుద్ధం దెబ్బ
ముంబై: మహమ్మారి దెబ్బతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న సెమీకండక్టర్ల సరఫరా సమస్య తాజాగా ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల మరింత తీవ్రం కానుంది. చిప్‌ల తయారీకి అవసరమైన కీలక ముడి ఉత్పత్తుల్లో సింహభాగం వాటా ఈ రెండు దేశాల నియంత్రణలో ఉండటమే ఇందుకు కారణం. సెమీకండక్టర్ల తయారీలో పల్లాడియం, నియాన్ కీలకమైన ముడి ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా పల్లాడియం సరఫరాలో 44 శాతం వాటా రష్యాదే ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే నియాన్ .. 70 శాతం భాగం ఉక్రెయిన్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే అంతర్జాతీయంగా చిప్‌ల కొరత మరింత పెరగవచ్చని మూడీస్ అనలిటిక్స్ ఒక నివేదికలో పేర్కొంది. సెమీకండక్టర్ చిప్‌లను మొబైల్ ఫోన్స్ మొదలుకుని వాహనాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ తదితర ఉత్పత్తులన్నింటిలోనూ విరివిగా వాడతారు. రేట్లు రయ్.. 2014–15లో రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు నియాన్ ధరలు అనేక రెట్లు పెరిగిపోయాయి. యుద్ధం అంటూ వస్తే సెమీకండక్టర్ల పరిశ్రమకు ఎలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు అన్నది అప్పుడే వెల్లడైంది. 2015 తర్వాత నుంచి చిప్‌ల తయారీ కంపెనీలు నిల్వలను గణనీయంగా పెంచుకున్నప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొరత ఏర్పడింది. ఇక గోరుచుట్టుపై రోకటిపోటులాగా యుద్ధం కూడా వచ్చి పడటంతో.. ఉద్రిక్త పరిస్థితులు సత్వరం చక్కబడకపోతే వాహనాల తయారీ సంస్థలు, ఎల్రక్టానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు మొదలైన పరిశ్రమలన్నింటిపైనా తీవ్ర ప్రభావం పడొచ్చని నివేదిక హెచ్చరించింది. ఎగియనున్న ద్రవ్యోల్బణం .. క్రూడాయిల్ రేట్లు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం కూడా ఎగియనుంది. అమెరికా తన ఇంధన అవసరాల కోసం రష్యా, ఉక్రెయిన్లపై నేరుగా ఆధారపడకపోయినా రష్యన్ ఇంధనాన్ని ఉపయోగించే పలు యూరప్, ఆసియా దేశాల సంస్థల నుంచి అనేక ఉత్పత్తులు, సర్వీసులను దిగుమతి చేసుకుంటోంది. ఆ రకంగా పరోక్షంగా రష్యన్ ఇంధన కొరత సెగ అమెరికాకు కూడా తగిలే అవకాశం ఉంది. ఇంధనాల ధరలు ఎగియడం వల్ల ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంపై గణనీయంగా ప్రభావం పడనుంది. యుద్ధం రావడానికి ముందే .. మహమ్మారి విజృంభించిన సమయంలోనే 2021లో షిప్పింగ్ వ్యయాలు ఏకంగా 300 శాతం పెరిగిపోయాయి. చాలా మటుకు సరిహద్దులు, పోర్టులను మూసివేయడం వల్ల పలు పోర్టుల్లో కంటైనర్లు చిక్కుబడిపోవడం ఇందుకు కారణం. దీంతో అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య అత్యంత లాభదాయక రూట్లపైనే దృష్టి పెడుతున్నాయి. గతేడాది ఆఖరు నుంచి షిప్పింగ్ వ్యయాలు.. గరిష్ట స్థాయి నుంచి కాస్త దిగి వచ్చినప్పటికీ కొత్త కంటైనర్ల కొరత వల్ల ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ యుద్ధం వల్ల చాలా మటుకు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోవచ్చని, ఫలితంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాల్సి రావచ్చని నివేదిక అభిప్రాయపడింది. దీనివల్ల వృద్ధి మందగించడంతో పాటు యుద్ధంతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా కంపెనీలు, వినియోగదారులపై అధిక ధరలు.. వడ్డీ రేట్ల వల్ల ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొంది. యూరప్ దేశాలకు చమురు సెగ.. ఇరు దేశాల మధ్య యుద్ధంతో చమురు ధరలు గణనీయంగా పెరిగిపోతాయని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది. ఒకవేళ రష్యా నుంచి సరఫరా పెరిగినప్పటికీ చమురును దిగుమతి చేసుకునే దేశాలపై ప్రతికూల ప్రభావం కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం చమురు ధర తొమ్మి దేళ్ల గరిష్టానికి ఎగబాకి, బ్యారెల్‌కు దాదాపు 111 డాలర్ల స్థాయిలో తిరుగాడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 12%గా ఉంటుంది. సహజ వాయువు ఉత్పత్తిలో 17%, బొగ్గు 5.2%, జింక్ 15%, బంగారం 9.5%, పల్లాడియం 44%, ప్లాటినం ఉత్పత్తిలో 14% రష్యాకి ఉంది. వీటిపై కూడా చమురు కాకుండా అల్యుమినియం, గోధుమలు, నికెల్, వెండి మొదలైనవి కూడా ఉత్పత్తి చేస్తోంది. యూరప్ దేశాలు తమ ఇంధన అవసరాల కోసం ఎక్కువగా రష్యాపైనే ఆధారపడుతుండటం వల్ల వాటిపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కరోనాతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు ఇప్పటికే బలహీనపడగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధనాలపై ఆధారపడే చాలా మటుకు పరిశ్రమలు సమస్యలను ఎదుర్కొనాల్సి రానుంది. చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్.. ఆదాయం, ఖర్చుల లెక్కలపై రోజువారీ పర్యవేక్షణ -
చిప్‌ల తయారీకి తరుణమిదే
భారత్‌లో చిప్ డిజైనర్లకు కొదవ లేదు. అలాగని చిప్‌లు తయారు చేసే సంస్థలు విస్తృతంగానూ లేవు. విద్యుత్ ఉప కరణాలను విజ్ఞతతో పనిచేయించే కీలకమైన అర్ధవాహకాలే (సెమీకండక్టర్) చిప్‌లు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, గేమింగ్ సాఫ్ట్వేర్, శాటిలైట్స్, వైద్య సామగ్రి... ఒకటేమిటి, దైనందిన జీవితాలను దాదాపుగా మొత్తం ఈ చిప్లే వెన కుండి నడిపిస్తున్నాయి. ఒక్క కంప్యూటర్ చిప్ మీదే ఆయా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఏటా 37.4 లక్షల కోట్ల బిజి నెస్ చేస్తున్నాయి. అయినప్పటికీ అన్ని దేశాలలోనూ చిప్‌ల కొరత ఉంది. ఆ కొరత భారత్‌కి మరింతగా ఉంది. చిప్ డిజైనింగ్‌లోని దశలు, ఒక ఆకాశ హర్మ్యాన్ని నిర్మించడంలోని దశలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటాయి. అంత పెట్టుబడి పెట్టడం దుస్సాహసమే. ప్రభుత్వం కూడా ఒక చెయ్యి వెయ్యందే లాభదాయకమైన ఉత్పత్తి సాధ్యపడని రంగమిది. చిప్ తయారీ కర్మాగారాలను ‘ఫ్యాబ్రికేషన్ ఫౌండ్రీలు’ అంటారు. వాడుకలో ‘ఫ్యాబ్స్’. భారత్‌కు సొంత ఫ్యాబ్స్ లేవంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అరకొరగా ఉన్నప్పటికీ వాటిల్లో విడి భాగాలుగా తప్ప చిప్‌ల ఉత్పత్తి పూర్తిగా మన దగ్గరే జరగదు. అత్యంత కీలక మైన రక్షణ, రైల్వే, అంతరిక్ష, ఆర్థిక రంగాల అవసరాల కోసం భారత్ ప్రస్తుతం యూఎస్ఏ, తైవాన్, నైరుతి ఆసియా దేశాల్లోని ఫ్యాబ్స్పై ఆధారపడి ఉంది. ‘‘డిజైన్ మనదే అయినా, తయారీ ఇతర దేశాలది కావడంతో చిప్‌ల ఐపీ ఎంతోకాలం మనదవదు. దాంతో దేశభద్రత సమస్యలు తెలెత్తే ప్రమాదం ఉండదని కచ్చితంగా చెప్పలేం’’ అని డీఆర్డీవోలోని ఒక సీనియర్ శాస్త్రవేత్త అన్నారు. వాస్తవానికి దశాబ్దాల క్రితమే మనకో సొంత సెమీ కండక్టర్ ఫ్యాబ్ ఉండాల్సింది. 1987లో ఇప్పుడున్న అత్యాధునిక చిప్ తయారీ పరిజ్ఞానానికి మనం రెండేళ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాం. ఇప్పుడా దూరం రెండేళ్ల నుంచి పన్నెండు తరాల వెనక్కు దాటిపోయింది. అత్యంత కఠినమైన అనుమతి నిబంధనలు, అవినీతి, మౌలిక సదుపాయాల లేమి, అధికార యంత్రాంగంలో అలసత్వం, నాయకత్వంలో దార్శనికత లోపించడం... ఇవన్నీ దేశవాళీ ఫ్యాబ్‌ల ఏర్పాట్లను వెనక్కు తోస్తూ వచ్చాయి. సిలికాన్ విప్లవం ప్రారంభమైన 1960లలోనే ‘ఫెయిర్‌చైల్డ్ సెమీ కండక్టర్’ సంస్థ భారత్‌లో ప్లాంట్‌ను తెరిచేందుకు ముందుకు వచ్చింది. అయితే మన ‘బ్యూరోక్రటిక్ బద్ద కాలు’ ఆ సంస్థను మలేషియా పారిపోయేలా చేశాయి. 1962 ఇండో–చైనా యుద్ధం తర్వాత ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ సిలికాన్, జర్మేనియం ట్రాన్సిస్టర్ల తయారీ ఫ్యాబ్‌ను నెలకొల్పగలిగింది. ‘‘అప్పుడు మన సిలికాన్ ట్రాన్సిస్టర్లకు ఎంత డిమాండ్ ఉండేదంటే... ప్రపంచం లోని పెద్ద పెద్ద కంపెనీలు సైతం అర్డర్లు ఇచ్చేందుకు క్యూలో వేచి ఉండేవి’’ అని బీఈఎల్ రిటైర్డ్ డీజీఎం ఎన్.రవీంద్ర గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని ఫ్యాబ్‌లు భారత్‌లో సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ చైనా, తైవాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులు మనకన్నా చౌకగా ఉండటంతో మనవి ఎంతోకాలం మనుగడ సాగించలేక పోయాయి. చైనా, తైవాన్ ఈ ఫ్యాబ్‌ల తయారీలోకి రాకముందే చండీగఢ్‌లో మనకు ‘సెమీకండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్’ (ఎస్íసీఎల్) ఉండేది. 1984లో 5000 నానో మీటర్ల ప్రాసెస్ సామర్థ్యంతో మొదలైన ఎస్íసీఎల్ కేవలం ఏడాదీ రెండేళ్లలో 800 నానో మీటర్ల అదనపు ప్రాసెస్ టెక్నాలజీని సాధించ గలిగింది. దురదృష్టం... 1989లో కాంప్లెక్స్ మొత్తం అగ్ని ప్రమాదంలో బుగ్గిపాలైంది. ఇస్రో దానిని పునరుద్ధ రించ గలిగింది గానీ, పునరుజ్జీవింప జేయలేకపోయింది. 2005 మధ్యకాలంలో బహుళజాతి సంస్థలు కొన్ని మన దేశంలో చిప్‌ల తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేసేం దుకు ముందుకు వచ్చినప్పటికీ అనుమతుల పరంగా అను కూల, తక్షణ స్పందనలు లేకపోవడంతో అవి చైనాకు తరలివెళ్లాయి. వాటితో పాటే 4000 ఉద్యోగ అవకాశాలు కూడా! 2012–13లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం దేశంలో రెండు ఫ్యాబ్‌లను నిర్మించేందుకు 39 వేలకోట్ల రూపా యలను కేటాయించింది. గుజరాత్ ప్రభుత్వం ఆ ఫ్యాబ్‌ల కోసం గాంధీనగర్‌లో 300 ఎకరాల స్థలాన్ని కూడా సిద్ధం చేసింది. ఐబీఎం, హెచ్ఎస్ఎంసీతో పాటు జేపీ గ్రూప్ బిడ్లకు ఆసక్తి చూపాయి గానీ పెట్టుబడిదారులకు భవిష్యత్ లాభాలపై నమ్మకం కలిగించలేకపోవడం వల్ల అవి బిడ్లను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ‘‘ప్రతి పదేళ్లకు ఒక ఫ్యాబ్ సైకిల్ ఉంటుంది. దాన్ని వదిలేసుకుంటే మళ్లీ పదేళ్ల వరకు ఆ అవకాశం రాదు. ఇదొక ఖరీదైన భారీ వ్యాపారం. చిప్‌ల అప్‌గ్రేడెడ్ సామర్థ్యంతో పాటు ఉత్పత్తి సామర్థ్యమూ అవసరాలకు దీటుగా ఉండాలి. అప్పుడే మార్కెట్లో నిలుస్తాం’’ అంటారు ఇన్నటెరా సహ వ్యవస్థాపకులు ఉమా మహేశ్. భారత్‌లో ఇప్పుడు ఫ్యాబ్‌ల ఏర్పాటుకు పరిస్థితులు మెరుగయ్యాయనే చెప్పాలి. నాణ్యమైన విద్యుత్తు, నీరు, మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలను భారత్ నమ్మకంగా అందించగలదు. అయితే అందించగలనన్న నమ్మకం కలిగించాలి. స్టార్టప్‌లను ఆకర్షించాలి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఫ్యాబ్ నిర్మాణం కోసం గత డిసెంబరులో ‘మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’... పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచింది. చిప్‌ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీఎస్ఎంసీ (తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ)తో కలిసి, టాటా గ్రూప్ ఒక ఫ్యాబ్‌ను నెలకొల్పే అవకాశాలు కనిపి స్తున్నాయి కనుక మన మంత్రిత్వశాఖ చురుగ్గా అడుగులు వేయాలి. తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించని చైనా... ఆ దేశంపై ఏ రోజైనా దాడి చేయవచ్చు. ఆ లోపే టీఎస్ఎంసీకి భారత్ ఒక సురక్షిత ప్రదేశం అనే నమ్మకాన్ని తైవాన్‌కి కలిగించాలి. ఇది వ్యాపార వ్యూహం కాదు. ప్రపంచానికి అవసరమైన చిప్‌ల తయారీలో పరస్పర సహకారం. భారత్‌కు సమకూరే టెక్నాలజీ బలం. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ‘సన్‌రైజ్ కేటగిరీ’ కింద ప్రభుత్వం కేటాయించిన రూ. 7.5 లక్షల కోట్లలో ఫ్యాబ్‌లకూ వాటా ఉంది కనుక ఒక కొత్త ఫ్యాబ్ కోసం మనం నమ్మకంగా ఎదురు చూడవచ్చు. – చూడీ శివరామ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
ఇంటెల్‌కు షాక్.. శాంసంగ్ దెబ్బ మామూలుగా లేదు!
ఒకవైపు సెమీకండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ రంగం, డివైజ్ తయారీ రంగం ఘోరంగా దెబ్బ తిన్నాయి. కొత్త మోడల్స్ సంగతి ఏమోగానీ.. ప్రొడక్టివిటీని పెద్ద మొత్తంలో చేయలేకపోతున్నాయి. ఈ తరుణంలో ఈ గ్యాప్‌లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ దూసుకొచ్చింది. ఏకంగా చిప్ దిగ్గజం ‘ఇంటెల్’కు ఎసరు పెట్టి.. తొలి స్థానాన్ని అధిగమించింది. 2021లో లాజిక్ ఐసీ, మెమరీ చిప్ సెగ్మెంట్లలో ఉత్పత్తి అధికంగా జరగడంతో శాంసంగ్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీలో ఉపయోగించే డైనమిక్ ర్యాన్డమ్-యాక్సెస్ మెమరీ (DRAM), NAND ఫ్లాష్ మార్కెట్ ఫర్ఫార్మెన్స్ సైతం ఇంటెల్ కంటే మెరుగైన బిజినెస్ చేయడం విశేషం. వాస్తవానికి కిందటి ఏడాది రెండో త్రైమాసికం వద్దే ఇంటెల్‌ను శాంసంగ్ అధిగమించింది. అయితే అది కొన్ని విభాగాల్లో మాత్రమే కావడం గమనార్హం. ఇప్పుడు పూర్తి కేటగిరీల్లో ఇంటెల్‌ను శాంసంగ్ డామినేట్ చేసేసింది. స్మార్ట్‌ఫోన్ ఎస్వోసీ (సిస్టమ్ ఆన్ చిప్), జీపీయూ అమ్మకందారులు కూడా యాభై శాతం అధిక ఆదాయాన్ని చవిచూసినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. తద్వారా అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ ఇంటెల్‌ను.. దక్షిణ కొరియా శాంసంగ్ అన్నింటా అధిగమించినట్లయ్యింది. ఈ పోటీలో శాంసంగ్‌ను ఇంటెల్ ఇప్పట్లో అధిగమించకపోవచ్చనే భావిస్తున్నారు నిపుణులు. అదనంగా టాప్ 15 అమ్మకందారుల్లో.. 27 శాతం ఆదాయ వృద్ధిని గమనించినట్లు రీసెర్చ్ అనలిస్ట్ విలియమ్ లీ వెల్లడించారు. ఇదిలా ఉంటే చిప్ కొరత సమస్య 2023 వరకు తీరేది కాదని ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ చెప్తున్నారు. మరోవైపు చిప్ కొరతను క్యాష్ చేసుకునే ఉద్దేశంలో శాంసంగ్ ఉంది. సుమారు 17 బిలియన్ల డాలర్లతో సెమీకండక్టర్ కంపెనీని ఆస్టిన్ బయట నెలకొల్పుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత వార్త: చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్ -
బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ
This Toyota Car Will Deliver After 4 Years: ఆ కారును బుక్ చేసుకున్నవాళ్లు డెలివరీ కోసం నాలుగేళ్లు ఎదురుచూడక తప్పదంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్ కార్ మేకర్ టయోటా స్పందించింది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300 కోసం ఎదురు చూడకతప్పదంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారం వాస్తవమని, వాహనదారులు మన్నించాలంటోంది టయోటా. నిజానికి ఈ మోడల్‌ను కిందటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, హై ఫీచర్లతో తీసుకొచ్చింది. 2022 మూడవ త్రైమాసికంలో మార్కెట్లోకి రావొచ్చని భావించారు. అయితే.. సెమీకండక్టర్ల కొరత వల్ల ఇప్పుడు బుక్ చేసుకున్నవాళ్లకు నాలుగేళ్ల దాకా వాహనం డెలివరీ చేయలేమని కంపెనీ తేల్చేసింది. హై ఫీచర్లు ఉండడంతో సెమీకండర్లు అధికంగా అవసరం పడుతోందని, అందుకే అవాంతరాలు ఎదురవుతున్నాయని, అయినా నాలుగేళ్లలోపే డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని టయోటా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభావం ఇతర మార్కెట్లపై పడనుంది. భారత మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ300 ధర కోటిన్నర రూపాయలకు పైనే ఉండొచ్చని అంచనా. ఈ వెహికిల్ 10 శాతం తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇంజిన్‌పరంగా రెండు వేరియెంట్స్ లభించనున్నాయి. నిస్సాన్ పాట్రోల్, బెర్సిడెజ్ బెంజ్ జీఎస్, బీఎండబ్ల్యూ ఎక్స్ 6 మోడల్స్‌కు గట్టి పోటీగా దీనిని భావిస్తున్నారు. -
మరీఘోరంగా టూ వీలర్స్ అమ్మకాలు
November 2021 Record Lowest wholesales In automobile industry Due To Chip Shortage: ఆటోమొబైల్ రంగంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక నెలలో ద్విచక్ర వాహనాలు రికార్డు స్థాయిలో తక్కువగా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లోనూ ఇదే ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. 2021 నవంబర్ నెల ఆటోమొబైల్ రంగానికి అచ్చి రాలేదు. ఓవైపు పండుగ సీజన్ కొనసాగినా.. ఊహించినంత వాహన అమ్మకాలు లేకపోవడం విశేషం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చురర్స్ (SIAM) నివేదికల ప్రకారం నవంబర్ నెలలో.. ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల మొత్తం 18.6 శాతం పడిపోయింది. అదే విధంగా టూ వీలర్స్ ఏకంగా 34 శాతం తగ్గింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ డౌన్‌ఫాల్ దారుణంగా నమోదు అయ్యింది. ►ప్యాసింజర్ వెహికిల్స్ ఈ నవంబర్‌లో 2, 15, 626 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 2, 64, 898గా ఉంది. ఇక ఉత్పత్తి కూడా 9.5 శాతం పడిపోయింది (2,94,596 యూనిట్ల నుంచి 2,66,552కి). ►టూ వీలర్స్ ఈ నవంబర్‌లో 10, 50, 616 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. కిందటి ఏడాది నవంబర్‌లో ఈ సంఖ్య 16 లక్షల యూనిట్లకు పైనే ఉంది. ఇక ఉత్పత్తి కూడా 29 శాతం పడిపోయి.. పదకొండేళ్ల తర్వాత పతనం నమోదు చేసుకుంది. 19, 36, 793 యూనిట్లకు గానూ 13, 67, 701 యూనిట్లను ఉత్పత్తి పడిపోయింది. ►ఇక త్రీ వీలర్స్ విషయానికొస్తే.. ఈ నవంబర్‌లో 6.64 శాతం క్షీణత కనిపిస్తోంది. 22, 471 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 24, 071 యూనిట్లుగా ఉంది. ఉత్పత్తి మాత్రం 6 శాతం పడిపోయింది. 65, 460 యూనిట్ల నుంచి 61, 451 యూనిట్లకు పడిపోయింది. పెరిగిన ఎగుమతి.. అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీలు అస్సలు తగ్గట్లేదు. మొత్తంగా ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే.. ప్యాసింజర్ వెహికిల్స్‌లో 15.5 శాతం పెరుగుదల (44, 265 యూనిట్లు), టూ వీలర్స్‌లో 9 శాతం (3, 56, 659 యూనిట్లు), త్రీ వీలర్స్‌లో 14 శాతం (42, 431 యూనిట్లు) ఎగుమతి శాతం పెరిగింది. కారణం.. సెమీ కండక్టర్ల కొరత. కరోనా సమయంలో చిప్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు మూతపడి.. ఈ ప్రభావం ఏడాది తర్వాత కూడా వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అయితే నవంబర్‌లో అదీ పండుగ సీజన్లో ఈ రేంజ్ ప్రతికూల ప్రభావం చూడడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి అని సియామ్(SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్తున్నారు. ముఖ్యంగా త్రీ వీలర్స్ అమ్మకాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారాయన. చదవండి: గూగుల్, యాపిల్‌ను తలదన్నే రేంజ్ ప్లాన్.. 17 బిలియన్ డాలర్లతో చిప్ ఫ్యాక్టరీ -
చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్
Samsung Texas Chip Factory: కరోనా వైరస్-లాక్డౌన్ ప్రభావాల వల్ల స్మార్ట్ డివైజ్‌లు, వాహనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు.. చిప్ కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు ఏకంగా సొంతంగా చిప్ తయారీకి పూనుకుంటున్నాయి ఫోన్ కంపెనీలు. ఈ క్రమంలో శాంసంగ్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. చిప్ ఫ్యాక్టరీల నిర్మాణానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్, యాపిల్ కంపెనీలు రంగంలోకి దిగగా.. ఇప్పుడు శాంసంగ్ వాటి ప్రాజెక్టులను తలదన్నేలా భారీ ప్రణాళికకు ముందడుగు వేసింది. ఏకంగా 17 బిలియన్ డాలర్ల(17 X ఏడువేల కోట్ల రూపాయలు) భారీ ఖర్చుతో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు టెక్సాస్ ఆస్టిన్ నగరం శివారులో జెయింట్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్లు ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం అధికారికంగా ప్రకటించింది కూడా. గత కొన్నేళ్లుగా టెక్ కంపెనీలకు అడ్డాగా మారుతున్న టెక్సాస్‌లో ఈ రేంజ్లో ఓ విదేశీ కంపెనీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుండడం విశేషం. వచ్చే ఏడాది నుంచి బిల్డింగ్ నిర్మాణం.. 2024 నుంచి చిప్ తయారీ పనులు ప్రారంభించాలని శాంసంగ్ ప్రణాళిక వేసుకుంది. చదవండి: గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా? లాక్డౌన్ ప్రభావంతో చిప్ ఫ్యాక్టరీలు మూతపడగా.. ప్రస్తుతం చిప్ షార్టేజ్ సమస్య ప్రపంచం మొత్తం కొనసాగుతోంది. అమెరికా లాంటి అగ్రదేశాలు.. చైనా, తైవాన్ లాంటి ఆసియా దేశాల మీద చిప్ కోసం ఆధారపడి ఉన్నాయి. కానీ, ముందు ఆసియా దేశాల కొరత తీర్చాకే బయటి దేశాలకు ఉత్పత్తి చేసే ఉద్దేశంలో ఉన్నాయి చిప్ తయారీ కంపెనీలు. చదవండి: చిప్‌ల తయారీలోకి ఆపిల్, గూగుల్.. ఏమిటీ వివాదం? -
యాపిల్‌పై పిడుగు..! ఇప్పట్లో ఐఫోన్ 13లేనట్లే..!
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల విడుదలైన క్యూ3 ఫలితాలతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. యాపిల్ ఎన్నడు లేనంతగా ఐఫోన్ 13తో ఇండియన్ మార్కెట్లో సత్తచాటడంపై తెగ సంబరపడిపోయారు. కానీ ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది. చిప్ కొరత కారణంగా ఆ ప్రభావం ఐఫోన్ 13పై పడింది. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఐఫోన్ల కొరత ఏర్పడనుంది. ఈ కొరత యాపిల్ కు భారీ నష్టాన్ని మిగల్చనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల మనదేశంలో స్మార్ట్ ఫోన్ మూడో త్రైమాసిక (జులై,ఆగస్ట్, సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. త్రైమాసికంలో ఐఫోన్13 తో యాపిల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా ఐఫోన్13 తో యాపిల్ ఇండియన్ మార్కెట్లో పట్టు సాధించిందని మార్కెట్ వర్గాలు అభివర్ణించాయి. దీంతో ఐఫోన్13ను భారత్‌లో పెద్ద ఎత్తున అమ్ముకాలు ప్రారంభించాలని టిమ్ కుక్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతులోనే 'డిగిటైమ్స్ ఏషియా' రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్13 సిరీస్ స్టాక్ లేవని తెలిపింది. ఫిబ్రవరిలోపు వినియోగదారులకు తగినంత ఐఫోన్లను అందించలేదని రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే డిమాండ్‌కు తగ్గట్లు చిప్ ఉత్పత్తులను పెంచితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి గ్లోబల్‌గా చిప్కొరత డిమాండ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఐఫోన్ 13 పై భారీ ప్రభావం వరల్డ్ వైడ్‌గా టెక్నాలజీ, ఆటోమొబైల్‌తో పాటు ఇతర రంగాలు సెమీకండక్టర్ చిప్‌పై ఆధారపడ్డాయి. గ్లోబల్ చిప్ కొరత కారణంగా సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్13 అమ్మకాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆ చిప్ కొరత మనదేశంలో డిమాండ్ ఉన్న ఐఫోన్ 13 సిరీస్ లోని ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్ లపై పడిందని డిగిటైమ్స్ ఏషియా వెల్లడించింది. కానీ డిమాండ్‌కు తగ్గట్లు ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు లేవని స్పష్టం చేసింది. యాపిల్ కు భారీ నష్టమే క్యూ3 (త్రైమాసికం)లో చిప్ కొరత కారణంగా యాపిల్ సుమారు 6 బిలియన్ డాలర్లను కోల్పోయింది. దీంతో పాటు చాలా దేశాల్లో ఫెస్టివల్ సీజన్ కారణంగా పెరిగిన సేల్స్‌కు అనుగుణంగా ప్రొడక్ట్‌లు లేకపోవడం, చిప్ కొరత ఏర్పడడం మరో కారణమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. అదే సమయంలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల కోసం యాపిల్ ఐపాడ్లతో పాటు మిగిలిన ప్రొడక్ట్‌ల ఉత్పత్తిని తగ్గించింది. ఐఫోన్లకు చిప్‌లను అందించింది. కానీ తాజాగా భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు తగినంత లేకపోవడం యాపిల్ భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు చిప్‌లు అందుబాటులో ఉంటేనే నష్టాల్ని నివారించ వచ్చనేది మరికొన్ని రిపోర్ట్లు నివేదికల్లో పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా చిప్ కొరత యాపిల్‌కు పెద్ద దెబ్బేనని, ఆటోమోటివ్ రంగంలో మహమ్మారి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఏడాది ప్రారంభం నుంచి సెమీకండక్టర్ కొరత ఏర్పడింది. 2023లోపు ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ అన్నారు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి షాక్ ! గతేడాదితో పోల్చితే ...
ప్రీమియం బైక్ సెగ్మెంట్లో మార్కెట్ నంబర్ వన్‌గా కొనసాగుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి షాక్ తగిలింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై బాగా పడింది. ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన ఫలితాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. భారీగా తగ్గిన అమ్మకాలు యూత్‌లో విపరీతమైన పాపులారిటీ సాధించిన రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. సెప్టెంబరుకి సంబంధించిన అమ్మకాల వివరాలను రాయల్‌ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. ఇందులో 2020 సెప్టెంబరుతో పోల్చితే ఏకంగా 44 శాతం అమ్మకాలు పడిపోయాయి. గతేడాది ఒక్క సెప్టెంబరులో ప్రపంచ వ్యాప్తంగా 60,331 బైకులు అమ్ముడవగా ఈ ఏడు కేవలం 33,529 బైకులే అమ్ముడయ్యాయి. ఇక దేశీయంగా అమ్మకాలను పరిశీలిస్తే గతేడాది 56,200 బైకులు సేల్ అవగా ఈ సారి 27,233 సేల్ అయ్యాయి. దేశీయంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల అమ్మకాలు 52 శాతం పడిపోయాయి. మూడో ఏడు ఇలా రాయల్ఎన్ఫీల్డ్కి ప్రీమియం సెగ్మెంట్లో గత రెండేళ్లుగా ఎదురే లేకుండా పోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రాయల్‌ఎన్‌ఫీల్డ్ 1,96,635 బైకులు అమ్మగలిగింది. ఆ తర్వాత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ ఉన్నా 2,10,270 బైకులు అమ్మింది. దాదాపు 7 శాతం వృద్ధిని అమ్మకాల్లో సాధించింది. ఈసారి అదే జోరు కొనసాగితే పదిశాతాన్ని మించి వృద్ధి రేటు ఉండవచ్చని అంచనాలు ఉండగా సెప్టెంబరులో ఒక్కసారిగా అమ్మకాలు 52 శాతం మేర పడిపోయాయి. అదే కారణమా ? కోవిడ్ ఫస్ట్‌వేవ్ తర్వాత కూడా ఆర్ఈ బైకుల అమ్మకాలు జోరు తగ్గలేదు. ఈసారి కూడా సెకండ్ వేవ్ ప్రభావం తమ అమ్మకాలపై పడలేదని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అయితే సెమికండక్టర్ల కొరత కారణంగా తయారీ తగ్గిందని చెబుతున్నారు. మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి ఉన్న క్రేజ్ అలాగే ఉందని చెబుతున్నారు. అందుకే సెప్టెంబరులో క్లాసిక్ 350 ఫేస్ లిఫ్ట్ మోడల్ రిలీజ్ చేశామంటున్నారు. చదవండి : బాపు చూపిన బాటలో జెఫ్‌బేజోస్, బిల్‌గేట్స్.... -
షాక్..పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు..కారణం ఇదే!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే విడుదలైన మోడళ్ల ధర 7–10 శాతం అధికం కానుంది. సెమికండక్టర్ చిప్స్‌తోసహా ఇతర విడిభాగాల కొరత తీవ్రం కావడమే ఇందుకు కారణమని కంపెనీలు అంటున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పని విధానం, ఆన్లైన్ క్లాసులు.. వెరసి సెమికండక్టర్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడి కొరతకు దారితీసింది. దీని ప్రభావం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమపై కొన్ని త్రైమాసికాలు ఉంటుందని కౌంటర్ పాయింట్ రిసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వెల్లడించారు. ‘నూతన మోడళ్ల రాక ఆలస్యం కావడం లేదా కొన్ని మోడళ్లే మార్కెట్లోకి వస్తాయి. అయినప్పటికీ ఈ పండుగల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుంది. 4జీ చిప్‌సెట్స్‌పైనే ప్రభావం ఉంది. డిసెంబర్ వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది’ అని వివరించారు. 5జీ చిప్సెట్ల సరఫరా కాస్త మెరుగ్గా ఉంది. మాస్ మార్కెట్ 5జీ చిప్సెట్స్ సరఫరా తక్కువగా ఉంటుంది. ‘కొరత కారణంగా పెరుగుతున్న చిప్ ధరలు స్మార్ట్‌ఫోన్ తయారీదారుల విడిభాగాల బిల్లును గణనీయంగా ప్రభావితం చేశాయి. ఇది ఇప్పుడు వినియోగదారులపై, నూతన మోడళ్ల విడుదలపైనా ఉంటుంది’ అని గార్ట్నర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ కనిష్క చౌహాన్ అన్నారు. కొన్ని బ్రాండ్ల చేతుల్లోకి.. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్రొడక్ట్స్ విభాగంలో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ మార్కెట్ కొన్ని బ్రాండ్లకే పరిమితమైంది. ఇవి పెద్ద కంపెనీలే కాదు, నిధులు, విడిభాగాల సరఫరా విషయంలోనూ అగ్రస్థానంలో ఉంటాయని ఇండియన్ సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
ఆ రంగంలో మూడు కోట్ల ఉద్యోగాలు - టాటా గ్రూప్ చైర్మన్
భవిష్యత్తులో డిజిటల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగంల్లో డిజిటల్ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమికండర్లు, 5జీ ఎక్విప్మెంట్ తయారీలోకి టాటా అడుగుపెడుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై జాతీయ మీడియాకు ఆయన వివరించిన అంశాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఈ నాలుగే కీలకం కరోనా తర్వాత పరిస్థితులూ పూర్తిగా మారిపోయాయి. జీవన విధానం మారిపోయింది, పని చేఏ తీరులో మార్పులు వచ్చాయి. వ్యాపారం కూడా రూపు మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో డిజిటలీకరణ, కొత్త రకం సప్లై చైయిన్, పర్యవరణానికి హానీ చేయకుండా అభివృద్ధి చెందడం ముఖ్యమైన అంశాలుగా మారబోతున్నాయి. వీటన్నింటీలో ఆరోగ్యం కాపాడుకోవడం ఓ అంతర్భాగంగా ఉంటుంది. ఈ నాలుగు అంశాల్లో వ్యాపార విస్తరణపై టాటా గ్రూపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో ఈ నాలుగు థీమ్‌లకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయి. టేకోవర్లు డిజిటలీకరణ అని సింపుల్‌గా చెప్పుకున్నాం. కానీ ప్రయాణాలు, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా అన్నింటా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద పని. ఈ రంగంలో విస్తరించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అవసరాలను బట్టి కొన్ని సంస్థలను కొనాల్సి రావచ్చు. సెమికండక్టర్ల తయారీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెమి కండక్టర్ల కొరత ఉంది. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్ ఉంటుంది. వ్యూహాత్మకంగా టాటా గ్రూపు సెమికండక్టర్ల తయారీ పరిశ్రమలోకి అడడుగుపెడుతోంది. ఇప్పటి వరకు సెమికండక్టర్ల తయారీకి చాలా దేశాలు చైనాపై ఆధారపడేవి. ప్రపంచ వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా దేశాలు చైనాకు ప్రత్యామ్నయం చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇండియా వినియోగించుకోవాలి. అందుకే సెమికండక్టర్లు, 5జీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తయారీపై దృష్టి పెట్టాం. 3 కోట్ల ఉద్యోగాలు కరోనా కారణంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. ఇవి సమసిపోవాలంటే విద్యా, వైద్య రంగంలో త్వరితగతిన మార్పులు జరగాల్సి ఉంది. ఈ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా స్కిల్ తక్కువగా ఉన్న వారికి ఉద్యోగాలను కల్పించే వెసులుబాటు కలుగుతుంది. హైబ్రిడ్‌తో ఇంటి నుంచి, ఆఫీసు నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మరింత విస్త్రృతమైతే పదో తరగతి వరకు చదివిన గృహిణులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మా అంచనా ప్రకారం హైబ్రిడ్ పద్దతి సక్సెస్ అయితే 12 కోట్ల మంది మహిళలు ఇంటి నుంచే వివిధ ఉద్యోగాలు చేయగలుతారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి 440 బిలియన్ డాలర్లు సమకూరుతాయి. -
చిప్ తయారీ ఇక ‘లోకల్’
న్యూఢిల్లీ: దేశంలో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలను భారత్‌కు రప్పించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీఐఏ టెక్నాలజీస్, యునైటెడ్ మైక్రో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, ఇంటెల్, మైక్రాన్ టెక్నాలజీ, ఎన్ఎక్స్పీ సెమీకండక్టర్స్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఫుజి ఎలక్ట్రిక్ కంపెనీ, ప్యానాసోనిక్, ఇన్ఫీనియాన్ టెక్నాలజీస్ ఏజీ, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎస్కే మైనిక్స్, శామ్సంగ్ కంపెనీలతో ఒక జాబితాను రూపొందించింది. అంతర్జాతీయ కంపెనీలతోపాటు, దేశీయ కంపెనీల జాయింట్ వెంచర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ శాఖా ఆహ్వానం పలికింది. ప్రాథమిక స్థాయి ప్రాజెక్టు నివేదికను సమర్పించేందుకు ఈ నెల 31వతేదీ వరకు గడువు ఇచ్చింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలను రాబట్టే చర్యలను మొదలు పెట్టింది. 400 డాలర్లకు పైగా (రూ.30వేలు) ఖరీదైన ల్యాప్‌టాప్‌లను తయారు చేసే, 200 డాలర్లకు పైగా ఖరీదైన ట్యాబ్లెట్లను (రూ.15వేలు) తయారు చేసే సంస్థలకు, సర్వర్లు, పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థలకు పీఎల్ఐ పథకం కింద విక్రయాలపై 2–4 శాతం వరకు ప్రోత్సాహకంగా ఇచ్చే ప్రణాళికలతో ఎలక్ట్రానిక్స్ శాఖా ఉంది. మూడు దశల్లో.. తైవాన్‌కు చెందిన క్వాంటా కంప్యూటర్ ఇన్కార్పొరేటెడ్, ఫాక్స్‌కాన్, ఏసర్, ఆసుస్, ఇన్వెంటెక్ కార్పొరేషన్.. అమెరికాకు చెందిన డెల్, యాపిల్, సిస్కో సిస్టమ్స్, ఫ్లెక్స్, భారత్‌కు చెందిన కోకోనిక్స్, హెచ్‌ఎల్‌బీఎస్ టెక్నాలజీస్లను ఆకర్షించే ప్రణాళికలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖా ఉంది. పీఎల్ఐ పథకం కింద రూ.7,350 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను రాబట్టడంలో మూడు దశలను అనుసరించనుంది. మొదట ఇంటెగ్రేటెడ్ డిజైన్ తయారీదారులు, ఫౌండ్రీలు లేదా భారత కంపెనీల భాగస్వామ్యంతో ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయదలిచిన సంస్థలను తీసుకురావాలన్న ప్రణాళికతో ఉంది. లేదా ఇప్పటికే ఉన్న ప్లాంట్ విస్తరణ ప్రతిపాదలను అయినా అనుమతించనుంది. ప్రతీ నెలా 30,000 వేఫర్ స్టార్స్ సామర్థ్యంతో (300ఎంఎం వేఫర్ సైజ్) కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సయిడ్ సెమీకండక్టర్ టెక్నాలజీతో చిప్‌లను తయారు చేయాల్సి ఉంటుంది. ఇక రెండో దశలో 200 ఎంఎం వేఫర్సైజ్తో కూడిన చిప్‌లను అత్యాధునిక టెక్నాలజీల సాయంతో తయారు చేసే సంస్థలకు ఆహ్వానం పలకనుంది. మూడో దశలో భారత సంస్థల భాగస్వామ్యంతో సెంమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసే సంస్థలను తీసుకురానుంది. ఎటువంటి మద్దతుకైనా సిద్ధమే.. తమ నుంచి ఏ తరహా ఆర్థిక మద్దతు కావాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంస్థలను కోరింది. ఈక్విటీ రూపంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ డేలా వయబులిటీ గ్యాప్ ఫండ్, దీర్ఘకాల వడ్డీ లేని రుణాలు, పన్ను ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలు.. ఏ విధమైన మద్దతు కావాలో చెప్పాలని కోరింది. ఆసక్తి కలిగిన కంపెనీలు తమ పెట్టుబడుల ప్రతిపాదనలను, టెక్నాలజీల వినయోగం వివరాలను సమర్పించాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా ఇప్పటికే స్పష్టం చేసింది. కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా దేశంలో ఫ్యాబ్రికేషన్ సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆకర్షణీయమైన పథకాన్ని రూపొందించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.