sunstroke
-
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాడ్పులూ వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8, 9 గంటల ప్రాంతంలోనే ఇంటినుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల కారణంగా.. మార్చి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారినపడ్డారు. ఈ క్రమంలో రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స చేయాలి. దుస్తులు వదులు చేసి చన్నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేయాలి. 72 ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. వడదెబ్బ నివారణకు, అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే వైద్య శాఖ మార్గదర్శకాలిచి్చంది. పీహెచ్సీ వైద్యులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేసింది. గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. గతేడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై, వడదెబ్బ కేసులు ఎక్కువగా నమోదైన 72 ఆస్పత్రులను వైద్య శాఖ గుర్తించింది. వీటిల్లో క్లైమేట్ రెసిలియంట్ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. వడదెబ్బ బాధితులకు వైద్యం అందించడానికి వీలుగా ఈ వార్డుల్లో ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మండిన సన్డే సాక్షి, విశాఖపట్నం: ఇప్పటికే నిప్పులు కక్కుతున్న భానుడు ఆదివారం మరింత చెలరేగిపోయాడు. శనివారం నమోదైన 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆదివారానికి 46 డిగ్రీలకు దూసుకెళ్లాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా అలూరు, ప్రకాశం జిల్లా బోట్ల గూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా అనేక చోట్ల 40–44 డిగ్రీలు రికార్డయ్యాయి. వీటి ప్రభావంతో 107 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 670 మండలాలకు గాను సగానికి పైగా (342) మండలాల్లో వడగాడ్పులు వీచాయన్నమాట. దీంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అయితే సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. సోమవారం కేవలం రెండు మండలాల్లో (అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో) తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. మరో 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాలు, విజయనగరం 20, పార్వతీపురం మన్యం 8, అల్లూరి 8, అనకాపల్లి 11, కాకినాడ 6, కోనసీమ 4, ఏలూరు 4, ఎన్టీఆర్ 2, గుంటూరు 7, పల్నాడు 2, తూర్పు గోదావరి జిల్లాలో 15 మండలాల్లోను వడగాడ్పులకు ఆస్కారం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రస్తుతం అంతర్గత ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరఠ్వాడా, అంతర్గత కర్నాటక మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోను ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమలోను అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ద్రోణి కారణంగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వడగాడ్పుల నుంచి ఉపశమనం కలగనుంది. కూల్‌డ్రింక్స్ తాగొద్దు ఇంట్లో ఉన్నా, బయట పనిలో ఉన్నా తప్పనిసరిగా గంట గంటకూ ఉప్పు, చక్కెర కలిపిన ద్రవాలు తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస తినాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరైనా తాగాలి. ఎండలో పనిచేస్తున్న వారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలి. గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్త్రాలు, తలకు టోపీ, గొడుగు ధరించాలి. బాటిల్లో తాగు నీటిని వెంటబెట్టుకోవాలి. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ నాగా చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ -
విషాదం.. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్జా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వృద్దురాలు వడదెబ్బ తగిలి మృతిచెందింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వజ్రమ్మ(80) ప్రాణాలు విడిచింది. ఉదయం నుంచి పెన్షన్ కోసం పడిగాపులు కాసిన వజ్రమ్మ వడదబ్బతో అక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. పెన్షన్ల కోసం బారులు తీరారు. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. బాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. -
వడదెబ్బతో విద్యార్థిని మృతి
కామారెడ్డి టౌన్ : వడదెబ్బ సోకి చికిత్స పొందు తూ 15 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన కా మారెడ్డి జిల్లా కేంద్ర ప్రభు త్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. క్యాసంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ నాజు–నీలా దంపతుల పెద్ద కూతురు లావణ్యకు వాంతులు, తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుధవారం మధ్యాహ్నం లావణ్య ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు రాజధానికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చి ధర్నాకు దిగారు. సీ ఐ నరేష్ వారిని సముదాయించారు. ఆర్ఎంవో శ్రీ నివాస్ మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. లావణ్యకు మెదడులో రక్తం గడ్డ కట్టిందన్నారు. -
వడదెబ్బ కారణంగా పలువురు మృతి
వడదెబ్బ కారణంగా పలువురు మృతి -
నిప్పులకొలిమి.. ఎండకు వెళ్తే మండిపోతారు! డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పులకొలిమిపై మండుతోంది. తీవ్రమైన ఎండలతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితేచాలు ఎండ తీవ్రతతో బెంబేలెత్తిపోతున్నారు. ఆరుబయట పనిచేసే కూలీలు, ఇతర కార్మి కులు, ఉద్యోగులు వడదెబ్బ బారినపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఎండల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా రోజువారీ పనులు, శుభకార్యాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రజలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తారు. ఎండలు దంచికొడుతున్నా ఉపాధి కూలీలు పని మానుకునే పరిస్థితి ఉండదు. దీంతో వేలాది మంది వడదెబ్బకు గురవుతున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, వీరోచనాలకు గురవుతున్నారు. తలనొప్పి, వికారం ఉంటాయి. ఇలాంటి రోగాలతో వడదెబ్బ బాధితులు అనేక ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారిన పడే ప్రమాదముంది. ఆహారం, తాగునీరు కలుషితమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక అధిక వేడి, వడదెబ్బలతో మానవులపై శారీరక ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కొందరిలో అకాల మరణం, వైకల్యం సంభవిస్తుందని హెచ్చరించింది. అధిక వేడి కారణంగా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, మూత్రపిండ వ్యాధులు కూడా సంభవిస్తాయి. పగటి పూట గది ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో 24 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఎండ తీవ్రతకు గురయ్యే వారు కఠినమైన శారీరక శ్రమను నివారించాలి. తప్పనిసరిగా శ్రమతో కూడిన పని చేయాల్సి వస్తే, సాధారణంగా వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఉండేలా చూసుకోవాలి. వేసవిలో చల్లగా ఉండడం ఎలా... ఫ్లూయిడ్స్ పుష్కలంగా తాగాలి: వేడి వాతావరణంలో, పనితో సంబంధం లేకుండా ద్రవపదార్థాలు తీసుకోవాలి. దాహం వేసే వరకు వేచి ఉండకూడదు. రోజూ 8–10 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగాలి. కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, నిమ్మకాయ నీరు, ప్రత్యేకంగా నీటితో ఎలక్ట్రోలైట్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ లేదా పెద్ద మొత్తంలో చక్కెర ఉన్న ద్రవాలను తాగవద్దని నిపుణులు చెబుతున్నారు. మసాలాలు మానుకోవాలి తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలి. వేడి ఆహారాలు తీసుకోవద్దు. అధిక మోతాదులో భోజనం చేయొద్దు. పుచ్చకాయ, ద్రాక్ష, పైనాపిల్, క్యారెట్, దోసకాయ వంటి చల్లని పదార్థాలను తీసుకోవాలి. రోజువారీ వంటలో మసాలాలు, ఆవాలు, ఎర్ర మిరపకాయలను ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి వేడి లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. పుల్లని, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. తగిన దుస్తులు ధరించండి ♦ తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. ముదురు రంగు బట్టలను ధరించవద్దు. ♦ చర్మాన్ని తేమగా ఉంచుకుని సంరక్షించుకోవాలి. ఆరుబయటకి వెళ్లాల్సి వస్తే సన్ గ్లాసెస్తోపాటు టోపీని ధరించడం ద్వారా సూర్యుని నుండి రక్షించుకోండి. సాధారణంగా వేసవిలోవచ్చే వ్యాధులు ♦ నీటి ద్వారా వచ్చే వ్యాధులు: అతిసారం, విరోచనాలు, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ తదితరాలు ♦ అంటువ్యాధులు: దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా ♦ వేడి సంబంధిత వ్యాధులు: వడదెబ్బ, డీహైడ్రేషన్, తలనొప్పి వంటివి ♦ చర్మ వ్యాధులు: సన్ బర్న్, టానింగ్, చర్మ కేన్సర్ వంటివి ♦ కంటి వ్యాధులు: కండ్లకలక వంటివి -
24 గంటలూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు.. మార్గదర్శకాలు జారీ!
సాక్షి, హైదరాబాద్: ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. ఎండ తీవ్రత మార్చి నుంచి జూన్ మధ్య ఉంటుందని, కొన్ని సందర్భాల్లో జూలై వరకు కూడా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలో జిల్లాల్లో 24 గంటలూ పనిచేసేలా హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా నిఘా అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారన్నారు. వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలకు ఎవరైనా గురైతే వారిని కాపాడేందుకు జిల్లా, డివిజనల్ స్థాయిల్లో 24 గంటలూ పనిచేసే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు వడదెబ్బ కేసులు/మరణాలు, తీసుకున్న నివారణ చర్యలపై రోజువారీ నివేదికను తనకు పంపాలని కోరారు. ప్రతీ రోజూ నీటి క్లోరినేషన్‌ను పీహెచ్సీ వైద్యాధికారులు తనిఖీ చేయాలని కోరారు. మార్గదర్శకాలివీ... ♦ అన్ని పీహెచ్‌సీలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ♦ ఎండదెబ్బకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ♦ అన్ని ఆసుపత్రుల్లోనూ అత్యవసర ఔషధాలను తగినంత సంఖ్యలో నిల్వ ఉంచాలి. ♦ సీరియస్ కేసులేవైనా వస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలి. ♦ శిశువులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆయా వర్గాలకు చెందినవారు ఎండకు దూరంగా ఉండాలి. ♦ ఆరు బయట పనిచేసే కార్మీకులు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో పనిచేయకూడదు. పని ప్రదేశంలో వారికి ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలి. పని చేసే ప్ర దేశానికి సమీపంలోని కమ్యూనిటీ హాల్స్‌లో అవసరమైన షెల్టర్లను ఏర్పాటు చేయాలి. ♦ పట్టణ ప్రాంతాలు, మునిసిపాలిటీలలో స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతృత్వ సంస్థలు ‘చలివేంద్రం’ ద్వారా సురక్షితమైన మంచినీటి సరఫరా అందజేయాలి. ♦ నీటి పైపులైన్లు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలి. ♦ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఎండ వేడిమి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ♦ ఆసుపత్రుల్లో బాధితులకు వడదెబ్బ పాలైన వారికోసం ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేయాలి. ♦ ప్రజలు దాహం వేయకపోయినా, వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) వాడాలి. నిమ్మరసం, మజ్జిగ లేదా లస్సీ, పండ్ల రసాలు వంటి వాటిని తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు నీటిని తీసుకెళ్లాలి. ♦ పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలను తినాలి. ♦ సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించడం మంచిది ♦ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ఉపయోగించాలి. ♦ పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి. ♦ వేసవి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి. వంట ప్రదేశాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవండి. ♦ ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తాగకూడదు. -
ఎండలు ‘మండే’న్
సాక్షి, అమరావతి: భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపించాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా చందర్లపాడు, కంచికచర్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నందలూరు, పెనగలూరు, చిట్వేల్, ప్రకాశం జిల్లా దోర్నాలలో 43.4 డిగ్రీలు, కర్నూలు జిల్లా కల్లూరు, వెల్దుర్తి, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి అర్బన్‌లో 43.1 డిగ్రీలు, కర్నూలు, కృష్ణా జిల్లా తిరువూరు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పుల్లల చెరువు, ముండ్లమూరులో 43 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రాజమండ్రి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 42.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో 42.8, కర్నూలు జిల్లా పాణ్యం, బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 42.6, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రకాశం జిల్లా తర్లపాడులో 42.5, చిత్తూరు జిల్లా చిత్తూరు, గుడిపలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 152 మండలాల్లో తీవ్రమైన వేడి రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా.. 514 మండలాల్లో సోమవారం బాగా వేడి వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 152 మండలాల్లో మాత్రం తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోత వాతావరణంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళ, బుధవారాలు కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి. వడదెబ్బకు ఇద్దరు మృతి నారాయణవనం (తిరుపతి): తిరుపతి జిల్లా నారాయణవనంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానిక కోమటి బజారువీధికి చెందిన దొరస్వామి కుమారుడు ప్రేమ్(12) ఆదివారం వడదెబ్బ బారినపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. అరుణానది సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను సేకరిస్తున్న పళనిస్వామి (47) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. -
బాబోయ్.. ఎండలు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త! ఇవి మాత్రం వద్దు!
సాక్షి, ఖమ్మం: ఎండలు తీవ్రంగా మండుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో బయటకు వెళ్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇక వచ్చే మే నెలలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న వేడి నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నాపెద్ద అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. లక్షణాలు ఇవీ.. కళ్లు తిరగడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, శరీర కండరాలు పట్టుకోవడం, కాళ్లు వాపులు రావడం, తీవ్ర జ్వరం వంటివి కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరం సూర్యరశ్మి వలన త్వరగా డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రాథమిక చికిత్స.. ►వడదెబ్బ తగిలిన వ్యక్తి వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. ►వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి. ►చల్లని గాలి తగిలేలా చూడాలి. ►ఉప్పు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి బొండాం నీరు, చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్) తాగించవచ్చు. ►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి. జాగ్రత్తలు.. ►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపి వంటివి ధరించాలి. ►ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ►హారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ►వదులైన నూలు దుస్తులు ధరించాలి. ►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. ►మాంసామారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా భోజనంలో తీసుకోవాలి. ►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీర, తాటి ముంజలు, బీర పొట్టు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి డైట్ కంట్రోల్ అవుతుంది. ►వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. సరైన డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. చేయకూడని పనులు.. ►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ►రోడ్లపై చల్లగా ఉండే రంగు పానీయాలు తాగొద్దు. ►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకూడదు. ఇంట్లో వండుకున్నవే తినాలి. ►శీతల పానీయాలు అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు తీసుకుంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. -
పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగితే..
Summer Care- Useful Tips: ఎండలు ముదురుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ తగిలితే కష్టం. దానికంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ►వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపీలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిస్తే వడదెబ్బ తగలదు. ►వడడెబ్బ తగిలిందని అనుమానంగా ఉంటే ముఖం మీద, ఒంటిమీదా నీళ్లు చల్లుతూ తలపైన ఐస్‌క్యూబ్స్ ఉంచి నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగించడం వల్ల నష్ట నివారణ జరుగుతుంది. ►ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగడం వల్ల వడదెబ్బ తగలదు. ►తరువాణి తేటలో ఉప్పు కలిపి తాగుతుండాలి. ►తాటిముంజలను పంచదారతో కలిపి తింటూ ఉంటే వడదెబ్బనుంచి తప్పించుకోవచ్చు. ►వేడి వేడి గంజిలో ఉప్పు వేసి తాగించడం, ఉల్లిపాయ రసాన్ని రెండు కణతలకు, గుండె మీద పూయడం వల్ల వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. చదవండి: Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే! -
నిజామాబాద్ జిల్లాలో విషాదం..
సాక్షి, నిజామాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండల ధాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎండదెబ్బతో నిజామాబాద్ జిల్లాలో ఓ యువతి మృతి చెందింది. డిచ్పల్లి మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన చిన్నోళ్ల సవిత(19) వడదెబ్బకు మృత్యువాత పడటం ఆ గ్రామంలో విషాదం రేపింది. వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురైన సవితను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. కాగా, జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజుల నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
మండుతున్న ఎండలు... వడదెబ్బ తగలకుండా ఉండాలంటే
ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మార్చిలోనే విరుచుకుపడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి సెగలతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏటా ఏప్రిల్ నెలాఖరులో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. వాతావరణ సమతుల్యత లోపించిన కారణంగా మార్చి నెలాఖరులోనే సూర్యుడు మండిపోతున్నాడు. గత నాలుగేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నెల రోజుల ముందే అమాంతంగా పెరిగిపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి ఆరంభంలో 31 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత.. ఆ నెల చివరికే 36 డిగ్రీలుగా నమోదైంది. అదే వేగంతో పెరుగుతూ మార్చి నెల చివరి వారంలో 41 డిగ్రీలకు చేరుకుంది. దీనికి తోడు వడగాల్పులు అధికమయ్యాయి. పగలంతా ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ కూలర్ల ముందే సేదతీరుతున్నారు. సాక్షి – కరీంనగర్ ఉదయం 10 గంటలకే... వారం రోజులుగా ఉదయం 10 గంటలకే ఎండలు మండుతుండడంతో జిల్లా వాసులు బయటకు రావాలంటేనే అల్లాడిపోతున్నారు. ఒకవేళ వచ్చినా 11 గంటలకల్లా నీడను ఆశ్రయిస్తున్నారు. దీంతో 12 కొట్టే సరికి రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే టవర్‌సర్కిల్, బస్టాండ్ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో ఇబ్బంది తలెత్తింది. ఏప్రిల్ ఆరంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సెగలు కక్కే ‘మే’ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వడదెబ్బ తగలకుండా.. చెమటపట్టకపోవడం.. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం.. వణుకు పుట్టడం.. ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి రావడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా ఎండలో తిరగద్దు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం తగ్గించాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు వాడడం, టోపీ ధరించడం మంచిది. నిర్లక్ష్యం చేయవద్దు.. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వీలైనంత త్వరగా చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్ఎస్ తాగించాలి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మరింత జాగ్రత్త తీసుకోవాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి తరలించాలి. – డాక్టర్ కొండపాక కిరణ్, కార్డియాలజిస్టు -
Health Tips: ఆకలి నశించడం, అలసటగా అనిపిస్తోందా? అయితే..
వేసవి కాలం మొదలైంది. ఇప్పటికే ఎండలు ముదిరిపోయాయి. ఉదయం పదకొండు దాటిందంటే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మరి.. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే సన్‌స్ట్రోక్(వడదెబ్బ) తగిలితే అంతే సంగతులు! ఈ గడ్డు కాలాన్ని దాటాలంటే లక్షణాలను ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది. లక్షణాలు: ►తలనొప్పి, తల తిరగడం, మెదడు బ్లాంక్‌గా మారి అయోమయంలోకి జారిపోవడం ►ఆకలి నశించడం, అనారోగ్యంగా అనిపించడం, ఫలానా సమస్య అని స్పష్టంగా తెలియకపోవడం, అలసట ►చేతులు, కాళ్లు, కడుపు కండరాల నొప్పులు, పట్టేసినట్లు ఉండడం ►ఊపిరి తీసుకోవడంలో వేగం పెరగడం ►దేహం ఉష్ణోగ్రతలు పెరగడం... ►పిల్లలైతే ఊరికే పడుకోవడానికి ఇష్టపడుతుంటారు. సాధారణంగా కంటే ఎక్కువ సమయం నిద్రపోతుంటారు. లేచిన తర్వాత కూడా హుషారుగా ఉండలేకపోతారు. ఈ లక్షణాలు కనిపిస్తే సన్‌స్ట్రోక్ నుంచి సాంత్వన కోసం వైద్యం చేయాల్సిందే. సాంత్వన ఇలాగ ►ఎండ నుంచి వెంటనే చల్లటి ప్రదేశంలోకి మారాలి. ►పడుకుని పాదాలను కొంచెం ఎత్తులో ఉంచాలి. ►డీ హైడ్రేషన్‌కు గురయిన దేహం తిరిగి హైడ్రేషన్ పొందడానికి ఇన్స్టంట్ రీ హైడ్రేషన్ ద్రవాలను తాగాలి. ►తడి టవల్‌తో దేహాన్ని, పాదాలను, అరచేతులను, ముఖాన్ని, మెడను తరచుగా తుడవాలి. ∙గాలి ధారాళంగా తగిలేటట్లు, హాయిగాఊపిరి పీల్చుకోగలిగిన స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి. ►ఈ జాగ్రత్తలు పాటిస్తే అరగంట సేపటికి వడదెబ్బ నుంచి దేహం సాంత్వన పొందుతుంది. తీవ్రంగా వడదెబ్బ బారిన పడినప్పుడు నీళ్లు, ఇతర రీ హైడ్రేషన్ ద్రవాలు ఏవి తాగినా వాంతి అవుతుంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుని పర్యవేక్షణలో సెలైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. చదవండి: Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక -
బెంబేలెత్తిన బీహార్.. ఒక్కరోజులో 40 మంది మృతి
పాట్నా : బీహార్ రాష్ట్రంలో భానుడి భగభగలకు మనుషులు పిట్టల్లా నేలకొరుగుతున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు 40మంది వడదెబ్బ కారణంగా మృతిచెందారు. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 70 మంది మృత్యువాత పడ్డారు. ఔరంగా బాద్, గయ, నవాడా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఔరంగాబాద్‌లో 30 మంది, గయలోని అనురాగ్ మగద్ మెడికల్ కాలేజీలో దాదాపు 10మంది వడదెబ్బ కారణంగా మరణించారు. మరణించిన వారిలో 40 సంవత్సరాలు దాటిన వారు ఎక్కువగా ఉన్నారు. ఎండల కారణంగా పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడగా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతిచెందిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేంద్రమంత్రి డా. హర్ష వర్ధన్ దీనిపై స్పందిస్తూ.. వడదెబ్బ కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించటం దురదృష్టకరమన్నారు. -
భానుడి ఉగ్రరూపం
-
నిప్పుల కొలిమిగా తెలంగాణ
సాక్షి నెట్వర్క్ : భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మండుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్టోగ్రతలు 48 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు వడదెబ్బ బారిన పడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 55 మంది వ్యక్తులు పిట్టల్లా రాలిపోవడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18 మంది, నల్లగొండ జిల్లాలో 10 మంది, ఖమ్మం జిల్లాలో 13 మంది, వరంగల్ జిల్లాలో 14 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం కొల్వాయి, వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామాల్లో రెండ్రోజులుగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఏకంగా 47.9 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ స్థాయిలో ఎండలు గతంలో చూడలేదని వృద్ధులు అంటున్నారు. ఉష్ణోగ్రతల ధాటికి కూలర్లు సైతం ఉపశమనం కల్పించడం లేదు. ప్రజలు చెట్ల నీడన చేరి సాంత్వన పొందుతున్నారు. రానున్న మూడ్రోజులు తీవ్ర వడగాడ్పులు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు సాధారణం నుంచి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు మంగళవారం వెల్లడించారు. మరోవైపు మధ్య మహారాష్ట్ర నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్రంలో తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. మంగళవారం 43 నుంచి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ఏకంగా 46 డిగ్రీల చొప్పన ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. హన్మకొండ, ఖమ్మం, మెదక్, నల్లగొండ, రామగుండంల్లో 45 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 44, హైదరాబాద్, భద్రాచలంల్లో 43 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా నమోదైన ఉష్టోగ్రతలు సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'సల్ల'ని కబురేది?
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆర్టీసీ బస్సు కండక్టర్.. కొడుకు పుట్టినరోజు వేడుకను పొద్దున్నే పూర్తి చేసుకుని సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లాడు. డిపోకు రాగానే అందుబాటులో ఉన్న తోటి కార్మికులు ఆయన చుట్టూ మూగారు. కొడుకు పేరుతో డిపోలోని సిబ్బంది అందరికి మజ్జిగ తాగించమని అడిగారు. జేబులోంచి రూ.2 వేలు తీసి అప్పటికప్పుడు పెరుగు డబ్బాలు తెప్పించి మజ్జిగ చేయించి అందరికీ తాగించాడు. కానీ మరుసటి రోజు ఎవరింటిలో ఏ ప్రత్యేక సందర్భం లేకపోవటంతో సిబ్బందికి మజ్జిగ లేకుండా పోయింది. ఈ వ్యవహారం కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఆర్టీసీ డిపోల్లో జరుగుతున్న తంతు ఇదే. భగభగలాడుతున్న భానుడి ప్రభావానికి గురికాకుండా వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఇలా మజ్జిగనో, నిమ్మరసమో తాగాల్సి ఉంది. అవి దొరకాలంటే కచ్చితంగా సిబ్బందిలో ఎవరింటిలోనో ప్రత్యేక సందర్భం ఉంటే వారి పేరుతో ఆ సిబ్బంది జేబు ఖర్చు నుంచి తెప్పించాల్సిందే. లేదంటే మంచినీళ్లు తాగి సరిపెట్టుకోవాల్సిందే. జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేక అల్లాడుతున్న ఆర్టీసీలో సిబ్బందికి మజ్జిగ తాగించే పరిస్థితి లేకుండా పోయింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలల సెలవులను ప్రభుత్వం పొడిగించింది. కానీ ఉష్ణోగ్రత ఎంతున్నా సరే విధుల్లో నిమగ్నమయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రం వేసవి నుంచి కాస్త ఉపశమనం కూడా లేకుండా పోవటం గమనార్హం. నయా పైసా రాదు.. ఓవైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఇంజిన్ వేడితో ఆర్టీసీ డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలో గంటల తరబడి బస్సు ఉంటుండటంతో అది బాగా వేడెక్కి డ్రైవర్లు, కండక్టర్లు సెగకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బకు గురికాకుండా వారికి మంచినీటితోపాటు మజ్జిగ, నిమ్మరసం సరఫరా చేయాల్సి ఉంది. కానీ మంచినీళ్లు తప్ప అవి దొరికే పరిస్థితి లేదు. బస్‌భవన్ నుంచి డిపోలకు వీటి ఖర్చు కోసం నయాపైసా రావటం లేదు. కొన్ని డిపోల్లో మేనేజర్లే సొంత ఖర్చుతో కొన్నిరోజులు వాటిని ఏర్పాటు చేసినా కొనసాగించలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది రోజుకొకరు చొప్పున వాటాలేసుకుని వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉండే డిపో అయితే రోజువారి ఖర్చు దాదాపు రూ.2 వేలు అవుతోంది. అంతమొత్తం భరించటం కొందరికి ఇబ్బందిగా మారటంతో చేతులెత్తేస్తున్నారు. మరో 20 రోజులకుపైగా ఎండలు కొనసాగనున్నాయి. రోహిణి కార్తె కావటంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా 45 డిగ్రీలను మించుతుండటంతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంత ఎండలో సెకండ్ షిఫ్ట్‌లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు బస్సులో ఏర్పడే సెగతో వడదెబ్బకు గురవుతున్నారు. దాన్నించి తప్పించుకోవాలంటే సొంత డబ్బులతోనే మజ్జిగ, నిమ్మరసం తాగాల్సి వస్తోంది. కోటితో వేసవి మొత్తం.. రాష్ట్రంలో ఉన్న 97 డిపోలకు వేసవి మొత్తం మజ్జిగ, నిమ్మరసం నిత్యం అందుబాటులో ఉంచాలంటే దాదాపు రూ.కోటి వరకు ఖర్చవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అది ఆర్టీసీకి భరించలేని మొత్తమే. నిత్యం రూ.11 కోట్ల ఆదాయం ఉన్నా, ఖర్చు దాన్ని మించి ఉంటుండటంతో ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోతోంది. వేరే పద్దు నుంచి ఈ ఖర్చును భరిద్దామన్నా అవకాశం ఉండటం లేదు. దీంతో డబ్బు లేక వేసవి ప్లాన్‌ను అమలు చేయటం లేదు. మంచినీళ్లు చల్లగా ఉండేందు కు కుండలు కొనటం తప్ప వేసవి ప్లాన్‌లో మజ్జిగ, నిమ్మరసం సరఫరా లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఉన్నతాధికారులు దాతలతో మాట్లాడి వాటిని ఏర్పాటు చేసే వీలున్నా అది అమలు కావటం లేదు. రాష్ట్రంలో విజయ డెయిరీతోపాటు పలు ప్రైవేటు డెయిరీలున్నాయి. వాటి యజమానులతో ఉన్నతస్థాయి వర్గాలు మాట్లాడితే.. సామాజిక బాధ్యత కింద పెరుగు సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఈసారి అలాంటి ప్రయత్నమే చేయలేదు. డిపో మేనేజేర్ల స్థాయిలో చిన్న దాతలు తప్ప పెద్ద స్థాయి కంపెనీలతో మాట్లాడటం సాధ్యం కావటం లేదు. చిన్న దాతలు ఒకట్రెండు రోజులు ఖర్చు భరించటానికే పరిమితమవుతున్నారు. డబుల్ డ్యూటీలపై ఆరా.. మజ్జిగ సంగతి పట్టించుకోరా.. డ్రైవర్లు కొరత వల్ల కొన్ని సర్వీసులు నిత్యం డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది. కొందరు డ్రైవర్లను డబుల్ డ్యూటీలకు ఒప్పించటం ద్వారా కొన్ని సర్వీసులను తిప్ప గలుగుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో డబుల్ డ్యూటీలకు వారు నిరాకరిస్తున్నారు. ఫలితంగా డిపోలకు పరిమితమయ్యే బస్సుల సంఖ్య పెరుగుతోంది. ఇది మళ్లీ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే అంశం కావటంతో ఉన్నతాధికారు లు నిత్యం డిపో మేనేజర్ల స్థాయిలో వాకబు చేస్తూ డబుల్ డ్యూటీల విషయంపై ఆరా తీస్తున్నా రు. బస్సులు నిలిచిపోతే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున ఎలాగోలా కొందరు డ్రైవర్లను ఒప్పించి డబుల్ డ్యూటీలకు పంపాలని పేర్కొంటున్నారు. ఎండలో మాడిపోతున్నా డబుల్ డ్యూటీలకు పంపుతూ.. వడ దెబ్బకు గురికాకుండా మజ్జిగ ఏర్పాటు చేయలేరా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు బస్సులు ఆగిపోతే జనం అల్లాడిపోతారు. అలాంటి అతి ముఖ్యమైన బస్సులను ఎండ తీవ్రతకు వెరవకుండా నడుపుతున్న వారికి ఇప్పటికైనా మజ్జిగ, నిమ్మరసం అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. -
ముందుంది నిప్పుల వాన!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి నిప్పుల ముప్పు ఇంకా పొంచి ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణ తీవ్రత కొనసాగనుంది. ఫొని తుపాను తీరాన్ని దాటక ముందు నుంచీ భానుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. ఎడతెరపి లేకుండా వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ అన్న తేడా లేకుండా సాధారణం కంటే 4–7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లోనూ వెరసి 139 మండలాల్లో వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఉష్ణోగ్రతల పెరుగుదల తీరుపై ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీడీఎంఏ) ఒక అట్లాస్‌ను రూపొందించింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే ఐఎండీ నేషనల్ మాన్సూన్ మిషన్ ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఉష్ణోగ్రతల ప్రభావంపై పరిశీలన చేసింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలను తీవ్ర వడగాడ్పుల ప్రభావిత ఏరియాలుగా తేల్చింది. ఏపీ, తెలంగాణపైనా డెడ్లీ హీట్‌వేవ్స్ ప్రభావం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఈ వేసవిలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు (డెడ్లీ హీట్‌వేవ్స్) నమోదయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఇటీవల హెచ్చరించింది. వాటి ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కూడా ఉంటుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల ధాటికి చాలా మరణాలు సంభవిస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి అత్యంత అరుదుగా ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉపరితల ద్రోణి ప్రభావంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి రెండు మూడు రోజులకే పరిమితమని, ఎండలు విజృంభించి, మళ్లీ తీవ్ర వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బకు గురై మంగళవారం ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో నలుగురు వంతున, గుంటూరు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు వంతున మృతి చెందారు. నేడు, రేపు కోస్తాంధ్రకు వర్ష సూచన కోస్తాంధ్రలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి ఒక నివేదికలో తెలిపింది. ఈదురుగాలులు, వర్షాలతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం గానీ, జల్లులు గానీ కురిసే అవకాశం ఉంది. గురువారం నుంచి అక్కడ రెండు రోజులు పొడి వాతావరణం నెలకొంటుంది. 47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ‘‘జూన్ ఒకటి రెండు తేదీల్లో రుతుపవనాలు కేరళను తాకిన వారం పది రోజుల నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అప్పటిదాకా ద్రోణుల ప్రభావంతో ఒకట్రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసి కాస్త చల్లబరచినా మళ్లీ వడగాడ్పులు విజృంభిస్తాయి. ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్నిచోట్ల 47 డిగ్రీల వరకు నమోదై నిప్పుల కొలిమిని తలపిస్తాయి. రానున్న రెండు మూడు రోజుల్లోనే వీటి పెరుగుదల మొదలవుతుంది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మంచి వర్షాలనే కురిపిస్తాయి. ముందుగా ఊహించినట్టుగా ఎల్‌నినో (వర్షాభావ) భయం లేదు’’ – ఓఎస్ఆర్యూ భానుకుమార్, వాతావరణం, సముద్ర అధ్యయనవిభాగ మాజీ అధిపతి. ఏయూ -
తెలంగాణ : నిప్పుల కొలిమి..!
మున్ముందు భగభగే.. గత నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 13 వడగాడ్పు రోజులు నమోదయ్యాయి. మున్ముందు దాదాపు 20 వడగాడ్పు రోజులు ఉండనున్నాయి. గతంలో ఎన్నడూ ఇన్ని వడగాడ్పు రోజులు వచ్చిన పరిస్థితి లేదు. 13 రెడ్ అలర్ట్‌లు... ఈ సీజన్లో ఇప్పటివరకు 13 రెడ్ అలర్ట్‌లు నమోదైనట్లు నిపుణులు అంటు న్నారు. ఈ నెల రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. అలర్ట్ జారీ ఇలా.. సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్, నాలుగైదు డిగ్రీల వరకు అధికమైతే ఆరెంజ్, సాధారణం కంటే కొద్దిగా ఎక్కువైతే ఎల్లో, సాధారణం కంటే తక్కువైతే వైట్ అలర్ట్ జారీ చేస్తారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్.. నిప్పుల గుండం) సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విజృంభిస్తున్న వడగాడ్పులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పదుల సంఖ్యలో జనం చనిపోతున్నట్లు అంచనాలున్నా.. కలెక్టర్ల నుంచి ఇప్పటివరకు వడదెబ్బ మృతులకు సంబంధించి తమకు ఎటువంటి నివేదిక రాలేదని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. మే రెండో వారం ప్రారంభం నుంచే.. ఎండల పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. ఈ పరిస్థితి రోహిణీ కార్తె వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాది నుంచి వేడిగాలులు రాష్ట్రంపై పంజా విసురుతున్నాయి. దీంతో గాలిలో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గతేడాది ఎండాకాలంలో మధ్యమధ్యలో కాస్తంత ఉపశమనం కలిగించేలా వర్షాలు వచ్చేవి. కానీ ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎక్కడా వర్షపు జాడలే లేవు. నిరంతరాయంగా వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిల్లాడుతున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే గత నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 13 రోజులు వడగాడ్పులు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు ఇంకా 15 నుంచి 20 వడగాడ్పు రోజులు ఉంటాయని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు హెచ్చరించారు. అంటే మొత్తంగా ఈ ఎండాకాలం సీజన్లో 30 రోజులకుపైగా వడగాడ్పుల రోజులు నమోదయ్యే పరిస్థితి కనిపి స్తుంది. గతంలో ఎన్నడూ ఇన్ని రోజులపాటు వడగాడ్పులు వచ్చిన పరిస్థితి లేదు. 2017లో అత్యధికంగా 27 వడగాడ్పుల రోజులు నమోదు కాగా, ఈసారి ఆ రికార్డును ఈ ఎండాకాల సీజన్ బద్దలు కొట్టే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో ఊరటనిచ్చేలా ఏమైనా వర్షాలుంటే సరేసరి.. లేకుంటే ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ కేంద్రం అలర్ట్ ఎండల తీవ్రతను బట్టి వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే అప్పుడు ఎండల తీవ్రతగా గుర్తించి ఆరెంజ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే వేడి రోజుగా గుర్తించి ఎల్లో (హీట్‌వేవ్ వార్నింగ్) ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే వైట్ అలర్ట్ జారీచేస్తారు. తీవ్రమైన వడగాడ్పులు నమోదైతే రెడ్ అలర్ట్ ఉంటుంది. ఆ ప్రకారం ఈ సీజన్లో ఇప్పటివరకు 13 రెడ్ అలర్ట్‌లు నమోదైనట్లు నిపుణులు అంటున్నారు. తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ వరకు అధికంగా ఉంటాయని వాతావరణ కేంద్రం వేసవి ఆరంభంలోనే హెచ్చరించింది. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాడ్పులు వీస్తున్నాయి. అంతేకాదు దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉండటంతో ఈసారి భగభగలాడుతోంది. ఈ నెల రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ వస్తోంది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో ఈసారి 45–47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే ప్రమాదం ఉంది. ఎండదెబ్బకు గురికాకుండా.. ఎండ తీవ్రత బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు సూచించింది. ఆ మేరకు ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. వడదెబ్బ లక్షణాలు... తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం కలిగి ఉండటం, చర్మం పొడిబారటం, మత్తు నిద్ర, వాంతులు, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి. నేడు వడగాడ్పులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో శనివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల (గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో)తో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఇదిలావుండగా శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పు న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 42 డిగ్రీలు రికార్డు అయింది. వడగాడ్పులుంటే... నిర్మాణ కార్మికుల కోసం సంబంధిత యాజమాన్యాలు తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. కార్మికులకు అవసరమైన నీడ కల్పించాలి. ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. పశువులు, కోళ్లకు వడదెబ్బ తగలకుండా తగు చర్యలు తీసుకోవాలి. క్యాబ్, ఆటో డ్రైవర్లకు వేసవి తీవ్రతపై అవగాహన కల్పించాలి. బస్టాండ్లలో ప్రయాణికుల కోసం తాగునీటి వసతి కల్పించాలి. కరపత్రాలు పంచాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చల్లని తాగునీరు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి. వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులను నిలిపివేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి ఎండలో తిరగకూడదు. బాగా ముదురురంగు ఉండే దుస్తులు ధరించకూడదు. కాఫీ, టీలు సేవించకూడదు. ఎండవేడిలో అధికంగా పనిచేయకూడదు. మధ్యమధ్యలో చల్లని ప్రదేశంలో సేదతీరుతూ పనిచేయాలి. తగిన జాగ్రత్తలు లేని నిల్వ చేసిన ఆహారం, అధిక వేడి వల్ల త్వరగా చెడిపోతాయి. వాటిని తినకూడదు. డయేరియాకు గురయ్యే ప్రమాదముంది. ఎండలో పార్కు చేసిన కారులో చిన్న పిల్లలు, వృద్ధులను, అనారోగ్యస్తులను ఎక్కువ సేపు ఉంచకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ బయటకు వెళ్లేప్పుడు వెంట మంచినీళ్లు ఉండేలా చూసుకోవాలి. వేసవిలో ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరినీళ్ల వంటివి తీసుకోవాలి. తెలుపురంగు, లేతవర్ణం కలిగిన పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచాడు చక్కెర ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఇంటిలోనే తయారుచేయబడిన ఓఆర్ఎస్ ద్రావణం తాగినట్లయితే వడదెబ్బ నుంచి తక్షణం ఉపశమనం లభిస్తుంది. వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. కావున సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు వడగాడ్పులకు గురికాకుండా కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. -
నేడు రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పొడివాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గంటకు 40 కి.మీ. నుంచి 50 కి.మీ.)లతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర ఇం టీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ వరకు కోస్తాంధ్ర మీదుగా 0.9 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. వడదెబ్బకు ఏడుగురు మృతి వడదెబ్బకు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన మాజీ ఉప సర్పంచ్ బచ్చు పురుషోత్తం (82), ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం గ్రామానికి చెందిన పొన్నెకంటి వెంకమ్మ (75),, వైరా మండలం కేజీ సిరిపురంలో దుప్పటి సత్యం (63), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ప్రకాశ్‌నగర్ కాలనీకి చెందిన చింతలచెరువు వీరస్వామి (59) మృతి చెందారు. అలాగే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన బురగల్ల వెంకటయ్య (65), సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కొమ్ముల చిన్నమల్లయ్య (55), ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో సందెవేణి మల్లయ్య (55) మృతి చెందిన వారిలో ఉన్నారు. -
ఎన్నికల పోలింగ్‌కు వడదెబ్బ ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్‌పై వడదెబ్బ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎండ ప్రభావంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 44డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 7 నుంచి 9 వరకు ఓటర్లు బారులు తీరినా, 10 తర్వాత పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. ఎండ దెబ్బకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
భానుడి భగభగ
మంచిర్యాల అగ్రికల్చర్ : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడిజిల్లా అగ్నిగుండలా తలపిస్తుంది. ఆదివారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరకుంటుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 35 డిగ్రీలకు చేరుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా వేడిగాలుల ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతుండడంతో జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బదాటికి మార్చి నుంచి ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు ఒకరిద్దరు చొప్పున వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గుబావులు, ఓపెన్‌కాస్టులు ఉన్న ప్రాంతాల్లో ఆదివారం మధ్నాహ్నం ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఓపెన్ కాస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు అల్లాడిపోయారు. అడవులు అంతరిస్తుండటం, జలాశయాలు అడుగంటడం.. తదితర కారణాల వల్ల ఎండ తీవ్రత ఏటేటా పెరుగుతోంది. సాయత్రం 6 గంటలు దాటితే కాని జనాలు బయటికి రాని పరిస్థితి. వాహన చోదకులు ముఖానికి రక్షణ లేకుండా బయటకు రావడం లేదు. అడవుల జిల్లాగా పెరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాగులు, బోరు బావులుల్లో నీరు అడుగంటుతున్నాయి. గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి తలెత్తుతోంది. మే నెలలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. భానుడు.. బ్యాండ్ బాజా ఇదే నెలలో అత్యధికంగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఇటు ఎండలతో ఇళ్లలో ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేవారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు... ►శరీరాన్ని పట్టుకునేలా ఉండే దుస్తులను కాకుండా కొద్దిగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు. ►సాధ్యమైనంత మేరకు ఉదయం చల్లగా ఉన్న సమయంలోనే వివాహాలకు బయలుదేరాలి. అక్కడ బంధువులతో కాలక్షేపం చేస్తూ సాయంత్రం వరకు ఉంటే మేలు. ► ముఖ్యంగా వ్యాన్, లారీల్లో వెళ్లాల్సి వస్తే.. వాటిపై తాటిపత్రిలాంటివి వేసుకోవాలి. ఇరుకుగా కాకుండా తక్కువ మోతాదులో మందిని తరలించేలా ఏర్పాటు చేసుకోవాలి. ►తప్పనిసరిగా తగినంత మేర చల్లని నీటిని తీసుకెళ్లాలి. ►వాహనాలపై వెళ్లాల్సి వస్తే తల, ముక్కు, చెవులకు నిండుగా ఉండేలా కాటన్ టవల్, కర్చీఫ్ కానీ కట్టుకోవాలి. కళ్లకు చల్లని చలువ అద్దాలు పెట్టుకోవాలి. గోడుగు, టోపి వెంట తీసుకెళ్తే మేలు. ►నీళ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. ఎండకు తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లని నీరు ఒకేసారి తీసుకోకూడదు. ►త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ► తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీటిని తాగాలి. ►నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తాగాలి. ►సోడియం, పొటాషియం ఉన్న ద్రవపదార్థాలు తీసుకోవాలి. ►వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. ►నుదుటిపై తడిగుడ్డ వేసి తడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి. ►బీపీ లేదా పల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ►గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి. ►నీరు ఎక్కువగా తాగించాలి. ►అవసరాన్ని బట్టి వైద్యుడికి చూపించి ప్రాథమిక చికిత్స అందించాలి. వారంరోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు తేదీ కనిష్టం గరిష్టం 22 27.6 40.8 23 27.5 39.8 24 27.4 42.3 25 26.8 43.3 26 29.8 44.3 27 32.4 44.8 28 32.5 45.3 జిల్లాలో ఐదేళ్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు, ప్రాంతాలు సంవత్సరం ప్రాంతం ఉష్ణోగ్రత 26–04–2014 దండేపల్లి 46.3 29–04–2015 దండేపల్లి 45.6 26–04–2016 దండేపల్లి 48.8 21–04–2017 జన్నారం 45.0 21–04–2018 దండేపల్లి 44.3 27–04–2019 దండేపల్లి 45.3 -
నేడు, రేపు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు రోజులు ఉత్తర తెలంగాణలో వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 44, నల్లగొండ, మెదక్‌లో 43 డిగ్రీలు, భద్రాచలం, ఖమ్మంలో 42 డిగ్రీలు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుండగా ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఫణి తుఫాను ఉత్తర దిశగా ప్రయాణించి ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది 12 గంటలలో తీవ్ర తుఫానుగాను, తదుపరి 24 గంటలలో అతి తీవ్ర తుఫానుగాను మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అనంతరం మే 1వ తేదీ సాయంత్రం వరకు వాయవ్య దిశగా ప్రయాణించి, తరువాత దిశ మార్చుకుని క్రమంగా ఉత్తర ఈశాన్య దిశ వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వచ్చే మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వడదెబ్బతో నలుగురు మృతి ధర్మపురి/వెల్గటూర్/కథలాపూర్/కోల్‌సిటీ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఒక్కరోజే నలుగురు మృత్యువాతపడ్డారు. వెల్గటూర్ మండలం ఎండపెల్లి గ్రామానికి చెందిన ముస్కు ఆదిరెడ్డి (80) వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామానికి చెందిన ముత్తునూరి శాంతమ్మ (58) వారం రోజుల క్రితం వడదెబ్బకు గురైంది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందింది. కథలాపూర్ మండలం పెగ్గెర్లలో వార్డు సభ్యుడు మామిడిపెల్లి గంగారెడ్డి(50) వడదెబ్బకుగురై సాయంత్రం మృతిచెందారు. అలాగే గోదావరిఖనిలో అనిల్‌కుమార్ షిండే (55) ఇంట్లో అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
పోలింగ్ కేంద్రం వద్దే చేనేత కార్మికుడి మృతి
సాక్షి,ధర్మవరం టౌన్: ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన చండ్రాయుడు(74) భార్య నరసమ్మతో కలసి గురువారం ఇందిరమ్మ కాలనీ వద్దనున్న పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చాడు. జనం ఎక్కువగా ఉండటం...అధికారులు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో క్యూలోనే గంటల తరబడి వేచి ఉన్నాడు. కనీసం తాగేందుకు మంచినీరు, షామియానాలు కూడా సమకూర్చకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈక్రమంలోనే ఎలాగోలా లోనికి వెళ్లి ఓటు వేసిన చంద్రాయుడు తిరిగి వస్తూ పోలింగ్ కేంద్రం వద్దనే కుప్పకూలాడు. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యింది. మృతదేహం వద్ద భార్య రోధనలు అందరిని కలచివేశాయి. -
సన్‌దడ
ఎండలు బాగా ముదిరాయి. గతంతో పోలిస్తే ఈ వేసవిలో ఎండ చండప్రచండంగా కాస్తూ ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదు కావచ్చంటూ వాతావరణశాఖ వారూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత ఎండలో బయటకు వెళ్లడం ప్రమాదకరం. కానీ పరీక్షలంటూ ఇటు విద్యార్థులూ, ఎన్నికల హడావుడిలో కార్యకర్తల రూపంలో అటు సాధారణ ప్రజలూ ఎండలో తిరగక తప్పని పరిస్థితి. అందుకే బాగా తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల వచ్చే సమస్యలూ, పిల్లల్లో ఎండదెబ్బకు అవకాశాలూ, ఎండ తీవ్రతకూ, వడదెబ్బకూ గురికాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కోసం ఈ కథనం. ఎండ తీవ్రత వల్ల చాలా రకాల సమస్యలొస్తుంటాయి. వాటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని... హీట్ సింకోప్: ఎండలో ఎక్కువసేపు తిరుగుతూ ఉండటం వల్ల తల తిరిగినట్లు అనిపించడం, మరీ ఎక్కువ సేపు తిరిగితే సొమ్మసిల్లి పడిపోవడం జరగవచ్చు. ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దాంతో మెదడుకు ఎంత రక్తం అందాలో అంతా అందకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో సొమ్మసిల్లడం జరుగుతుంది. ఈ పరిస్థితినే హీట్ సింకోప్ అంటారు. ఎంత ఆరోగ్యవంతులకైనా ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరం. అయితే కొన్ని జాగ్రత్తలతో రోగులు కోలుకుంటారు. చికిత్స: హీట్ సింకోప్‌కు గురైన వ్యక్తిని వెంటనే చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. అక్కడ మంచినీరు, తాజా పండ్లరసాలు, కొబ్బరినీళ్ల వంటి ద్రవాలను తాగించాలి. హీట్ క్రాంప్స్ / మజిల్ క్రాంప్స్: ఎండలో బాగా తిరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో రాత్రివేళల్లో లేదా అప్పటికప్పుడు కూడా పిక్కలు పట్టేసినట్లుగా ఉండి, తీవ్రమైన నొప్పికి గురికావడం జరుగుతుంది. ఎండలో ఆరుబయట ఆటలాడే పిల్లలకూ, రాత్రివేళల్లో పిక్క బలంగా పట్టేసి నిద్రాభంగమయ్యే పెద్దలకు ఇది అనుభవమే. దీనికి కారణం మన ఒంట్లో లవణాలూ, ద్రవాలు తగ్గడమే. శరీరం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలందాలి. ఈ ఆదేశాలన్నీ లవణాలలోని విద్యుదావేశం కలిగిన అయాన్ల రూపంలో నరాల ద్వారా ప్రసరించి, కండరాలకు ఆదేశాలిస్తాయి. ఎండవేడిమి తీవ్రతతో నీటిని తీవ్రంగా కోల్పోయి, దాంతోపాటూ లవణాలనూ కోల్పోవడం వల్ల నరాల ద్వారా మెదడునుంచి కండరాలకు ఆదేశాలు సరిగా అందవు. దాంతో నీరు కోల్పోయి డీ–హైడ్రేషన్‌కు గురి కాగానే... కండరాలు బిగుసుకు పోతాయి. వీటినే మజిల్క్రాంప్స్ అంటారు. జాగ్రత్తలు: మజిల్క్రాంప్స్కు గురైనప్పుడు శరీరం కోల్పోయిన నీటిని మళ్లీ వెంటనే భర్తీ చేయాలి. అందుకే గంటలకొద్దీ సాగే టెన్నిస్ వంటి ఆటలాడే సమయంలో ఆటగాళ్లు పొటాషియం లవణాలు ఉండే అరటిపండునూ, చక్కెరతోపాటు, ఇతర లవణాలు ఉండే నీళ్లను తరచూ కొద్దికొద్ది మోతాదుల్లో తాగుతూ ఉంటారు. చికిత్స: పిల్లలకు మజిల్క్రాంప్స్ వచ్చి వాళ్ల కండరాలు బిగదీసుకుపోతుంటే వారికి ‘ఓరల్–రీ–హైడ్రేషన్ (ఓఆర్ఎస్) ద్రావణాన్ని తాగించాలి. ఇప్పుడీ ఓఆర్ఎస్ పాకెట్లు అన్ని మెడికల్ దుకాణాలలోనూ ఓఆర్ఎస్ ద్రావణపు పౌడర్ మనకు ఇష్టమయ్యేలా ఎన్నో ఫ్లేవర్లలో దొరుకుతుంది. ►ఓఆర్ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు. ►ఓఆర్‌ఎస్‌గానీ, కొబ్బరినీళ్లుగానీ అందుబాటులో లేకపోతే... ఒక అరటిపండు తిని, మంచినీళ్లు తాగాలి. పిల్లల విషయంలోనూ ఇదే జాగ్రత్త పనిచేస్తుంది. అరటిపండులో పొటాషియం వంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండు, నీటితో అవి చాలావరకు భర్తీ అవుతాయి. హీట్ ఎగ్జషన్: శరీరంలోని నీరు, ఖనిజలవణాలు కోల్పోవడం వల్ల కలిగే పరిస్థితి ఇది. బాగా తీవ్రమైన ఎండకు కొన్నాళ్లపాటు అదేపనిగా ఎక్స్పోజ్ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. నీరసం, నిస్సత్తువ, కండరాల్లో పట్టులేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. జాగ్రత్తలు / చికిత్స : ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిని చల్లటి ప్రదేశానికి తరలించి, అక్కడ తగినన్ని ద్రవాలు తాగించాలి. వెంటనే మళ్లీ ఎండకు వెళ్లకుండా చూడాలి. బయట తిరగాల్సిన అవసరం ఉంటే... బాగా చల్లబడ్డాకే వెళ్లనివ్వాలి. హీట్ హైపర్ పైరెక్సియా: బయటి ఎండ కారణంగా రోగికి జ్వరం వచ్చేస్తుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత గరిష్ఠంగా 104 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకూ పెరుగుతుంది. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితినే హైపర్ పైరెక్సియా అంటారు. దీనికీ, వడదెబ్బకూ కాస్త తేడా ఉంది. ఈ కండిషన్లో మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగా దెబ్బతింటే... వడదెబ్బ (హీట్‌స్ట్రోక్)లో మాత్రం తక్షణం వైద్యసహాయం అందితే తప్ప మెదడులో ఉష్ణోగ్రత వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించలేం. హీట్ స్ట్రోక్ / వడదెబ్బ : ఈ హీట్స్ట్రోక్నే మనం సాధారణ పరిభాషలో వడదెబ్బగా చెబుతుంటాం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో వచ్చే ఈ కండిషన్ వల్ల ఒక దశలో శరీర ఉష్ణోగ్రత గరిష్ఠంగా 106 డిగ్రీల ఫారెన్హీట్ను కూడా దాటిపోవచ్చు. కళ్లు తిరగడం, వాంతులు కావడం, శరీరాన్ని ముట్టుకుని చూస్తే విపరీతమైన వేడి కనిపిస్తుంది. రోగి క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది చాలా తీవ్రమైన దశ. చివరికి చంకల్లో కూడా చెమట పట్టని పరిస్థితి వస్తుంది. దీన్ని వడదెబ్బకు సూచనగా గుర్తుంచుకోవాలి. ఇదే పరిస్థితి వస్తే... రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లడానికి (మార్బిడిటీకి) 40% అవకాశం ఉంటుంది. అప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ ప్రాణాంతకం కూడా కావచ్చు. ఎందుకింత తీవ్రం : వడదెబ్బ ప్రాణాంతకంగా ఎందుకు పరిణమిస్తుందో చూద్దాం. మన పరిసరాల ఉష్ణోగ్రత బాగా ఎక్కువైనప్పటికీ లేదా బాగా తక్కువైనప్పటికీ మన శరీర ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా 98.4 డిగ్రీల ఫారిన్‌హీట్ ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతల వద్దనే మన శరీరం నిర్వహించాల్సిన జీవక్రియలన్నీ (మెటబాలిక్ ఫంక్షన్స్) సక్రమంగా జరుగుతుంటాయి. మన ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారిన్‌హీట్ ఉండేందుకు మెదడులోని హైపోథెలామస్ తోడ్పడుతుంది. మన ఒంటి ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు దాని ఆదేశాల మేరకు స్వేదగ్రంథులు మనకు చెమట పట్టేలా చూస్తాయి. ఇలా చెమటలు పట్టినప్పుడు బయటి గాలి తగిలితే... ఆ స్వేదం ఇగిరిపోతుంటుంది. ఇలా ఇగిరిపోడానికి అది మన ఒంటి ఉష్ణోగ్రత (లేటెంట్ హీట్)ను తీసేసుకుంటుంది. దాంతో ఒంట్లోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే వాతావరణంలో వేడి మరీ ఎక్కువగా ఉండి, స్వేదగ్రంథులు అదేపనిగా నిరంతరం పనిచేయాల్సి వస్తే... అవి కూడా పూర్తిగా అలసిపోతాయి. ఇక దాంతో చెమటపట్టని పరిస్థితి. ఫలితంగా ఒంట్లోని ఉష్ణం బయటకు పోదు కాబట్టి... మన శరీర ఉష్ణోగ్రత అదేపనిగా, అనియంత్రితంగా పెరిగిపోతుంది. హైపోథెలామస్ కూడా దాన్ని తగ్గించలేని పరిస్థితి. మన దేహంలోని అన్ని వ్యవస్థలూ తమ జీవక్రియలను నిర్వహించేందుకు ఆదర్శ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్ అన్న విషయం తెలిసిందే. కానీ శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106... కొన్ని సందర్భాల్లో 110కి కూడా చేరి అది ఎంతకూ తగ్గకపోవడంతో, దేహంలోని అన్ని వ్యవస్థల పనితీరుకు (మెటబాలిక్ ఫంక్షన్స్) తీవ్రంగా దెబ్బ తగులడంతో అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోతాయి. దాంతో వృద్ధులు, బలహీనంగా ఉన్న కొందరిలో మరణం కూడా సంభవించే ఆస్కారం ఉంది. అది అపోహ మాత్రమే : కొంతమంది ఎండలో లేకుండా నీడ పట్టున ఉంటే వడదెబ్బ తగలదని అనుకుంటారు. అయితే ఎండలో ఉన్నా నీడలో ఉన్నా పరిసరాలు చాలా వేడిగా ఉన్నప్పుడు, వేడి చాలా అధికంగా ఉండే సముద్రప్రాంతాల్లో నేరుగా ఎండతగలని చోట ఉన్నప్పటికీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే వడదెబ్బనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే... మనకు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం మాత్రమే సరిపోదు. చల్లటి ప్రదేశంలో ఉండటం అవసరమని గుర్తించాలి. వడదెబ్బ లక్షణాలు : వికారం; వాంతులు; కళ్లు తిరగడం; నీరసం; ►స్పృహతప్పడం; ఫిట్స్ రావడం; ►చివరగా కోమాలోకి వెళ్లడం జరగవచ్చు. వడదెబ్బకు చికిత్స ఒంటి ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్ డిగ్రీలకు మించుతున్నట్లు తెలియగానే పెద్దలనైనా, పిల్లలనైనా వెంటనే చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు). దుస్తులను వదులుగా చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఒకవేళ బట్టలు ఇబ్బందికరంగా ఉంటే నడుముకు చిన్న ఆచ్ఛాదన ఉంచి, మిగతా బట్టలన్నీ తీసేయాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లలకు చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. పిల్లలకూ, వృద్ధులకూ వడదెబ్బ ప్రభావం మరింత ఎక్కువ: పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట పట్టడం తక్కువ. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లోనూ చెమట గ్రంథుల పనితీరు తగ్గుతుంది. దాంతో పిల్లలూ, వృద్ధులు తేలిగ్గా వడదెబ్బ ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంది. పిల్లలకు పెద్దగా చెమట పట్టకపోవడం వల్ల వారు పెద్దగా ద్రవాలను కోల్పోవడం లేదనీ, వారు సురక్షితంగానే ఉన్నారని అపోహ పడుతుంటారు. కానీ తమకు విపరీతంగా చెమటలు పడుతున్నందున పిల్లల కంటే తామే ఎక్కువగా ద్రవాలను కోల్పోతున్నామని అనుకుంటారు. కానీ ఈ అభిప్రాయాలు వాస్తవం కాదు. పిల్లలతో పోలిస్తే పెద్దల్లో చెమట గ్రంథులు ఎక్కువ. కాబట్టి ఉష్ణోగ్రతలు కాస్తంత ఎక్కువగా పెరగగానే పెద్దల్లో చెమటలు పట్టే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది. కానీ పిల్లల్లో అలా కాదు. వాళ్లలో పెద్దల తరహాలోనే చెమటలు పట్టాలంటే పెద్దలకంటే ఉష్ణోగ్రత చాలా చాలా రెట్లు పెరగాలి. కానీ అమితంగా పెరిగినప్పుడు పిల్లల ఒంటిని చల్లబరిచే మెకానిజం అయిన చెమట పట్టడం తక్కువ కావడంతో పిల్లల ఒంటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే పిల్లల్లో పెద్దగా చెమటలు పట్టకపోయినా... వాళ్ల ఒంటి ఉష్ణోగ్రత తేలిగ్గా పెరుగుతుందని పెద్దలు గ్రహించాలి. పైగా ఒంటిని చల్లబరిచేందుకు ఉద్దేశించిన స్వేద గ్రంథుల సంఖ్య వాళ్లలో తక్కువ కాబట్టి ఒళ్లు వెంటనే ఒక పట్టాన చల్లబడదని గ్రహించాలి. అందుకే ఈ వేసవి సీజన్లో వారిని ఎప్పుడూ చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఆడుకొమ్మని చెప్పాలి. ఒకవేళ ఆరుబయట ఆడుకోడానికి వెళ్తుంటే సాయంత్రం 5 తర్వాతే వారిని బయటకు అనుమతించాలి. ఒబేస్ పిల్లల విషయంలో మరింత జాగ్రత్త.. మామూలు పిల్లలతో పోలిస్తే కాస్త ఒళ్లు చేసి ఉన్న పిల్లలూ, ఒబేసిటీతో బాధపడే పిల్లలూ వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బాగా ఒళ్లు చేసి ఉన్న పిల్లలు ఆటలాడుతున్నప్పుడు వాళ్లకు చెమట పట్టడం, బరువు తగ్గడం జరుగుతుంది. అలా తమ పిల్లలు బరువు తగ్గారు కదా అంటూ పెద్దలు ఆనందించడం మామూలే. కానీ ఇలా స్థూలకాయంతో ఉన్న పిల్లలు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గితే అది ఆనందించాల్సిన విషయం కాదు. ఆ పిల్లలు ఆటలాడటం వల్ల తమ ఒంట్లోంచి నీళ్లు కోల్పోవడంతో పాటు, ఆ నీటితో పాటు విలువైన ఖనిజలవణాలనూ కోల్పోయారని గ్రహించాలి. ఇలా స్థూలకాయం కలిగి ఉన్న పిల్లలు బాగా ఆటలాడితే ప్రతి కిలో బరువుకు 500 మిల్లీలీటర్ల మేరకు ద్రవాలను కోల్పోవచ్చు. ఆ మేరకు బరువూ తగ్గుతారు. దాంతో తమ పిల్లలు బరువు కోల్పోయి ఆరోగ్యంగా మారుతున్నారంటూ పెద్దలు అపోహ పడవచ్చు. కానీ అలా సరికాదు. వాళ్లు విలువైన ఖనిజలవణాలు కోల్పోయి డీ–హైడ్రేషన్‌కు గురవుతున్నారనే విషయాన్నే గ్రహించాలి. అందుకే ఇలా బరువు తగ్గుతున్నప్పుడు పెద్దలు వారి ఒంటిలో జరిగే జీవక్రియలకు (మెటబాలిక్ ఆక్టివిటీస్‌కు) అవసరమైన నీటిని భర్తీ చేస్తూ ఉండాలి. అందుకే స్థూలకాయులైన పిల్లలు వెంటవెంటనే మరింత బరుతు తగ్గుతున్నట్లు గ్రహిస్తే పెద్దలు వారి ఒంట్లోకి తగిన ఎలక్ట్రోలైట్స్ పంపించేందుకు కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ వంటివి ప్రతి 20 నిమిషాలకొకసారి తప్పనిసరిగా తాగిస్తూ ఉండాలి. ఎండ దుష్ప్రభావాల నివారణ ఇలా... ►ఎండవేళల్లో పెద్దలూ, పిల్లలూ ఎండకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పిల్లలను ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎండవేళల్లో పిల్లలను కేవలం ఇన్డోర్ గేమ్స్‌కు మాత్రమే పరిమితం చేయాలి. ►పెద్దలూ, పిల్లలూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండాలి. మరీ ఎక్కువ పని ఉంటే తప్ప ఉదయం పది తర్వాత పెద్దలు బయటకు ఎండవేడికి వెళ్లకూడదు. ►మనం నేరుగా ఎండ∙తగలకుండా నీడలోనే ఉన్నా లేదా గదిలోనే ఉన్నా ఒకవేళ ఆ గది ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్నప్పటికీ వడదెబ్బ తగలవచ్చు. కాబట్టి నేరుగా ఎండకు వెళ్లకపోవడమే కాదు... మనం ఉన్నచోట చల్లగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఉండండి. ►ఆరుబయటకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తప్పక గొడుగు తీసుకెళ్లండి. లేదా అంచు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ వాడాలి. ►బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా వాటర్‌బాటిల్‌ను దగ్గర ఉంచుకోండి. డ్రైవింగ్ చేసేవారు ఎప్పుడూ తప్పనిసరిగా తమతో వాటర్ బాటిల్ ఉంచుకోవాల్సిందే. ►మనం వేసవిలో తరచూ నీరు తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఆటల్లో నిమగ్నమైపోయే పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే వారికి తరచూ మంచినీళ్లు తాగిస్తూ ఉండాలి. ఈ వేసవిలో కొబ్బరినీళ్లు, తాజా పండ్లరసాలు తీసుకుంటూ ఉండటం మంచిది. కూల్‌డ్రింక్స్ వద్దు. కార్బొనేటెడ్ డ్రింక్స్, శీతల పానీయాల వల్ల మరింత డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. దాంతో ఒంట్లోని లవణాలను మరింత వేగంగా కోల్పోతామని గుర్తుపెట్టుకోండి. -
వడదెబ్బకు విరుగుడు
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేయాలని వేసవి కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసింది. వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలయ్యేవారికి అవసరమైన వైద్యం అందించాలని పేర్కొంది. ఈ ఏడాదీ వడగాడ్పులు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో వేసవి ప్రణాళికపై అధికారులు దృష్టి సారించారు. ఏటా ఈ ప్రణాళికను అమలుచేసే బాధ్యతను విపత్తు నిర్వహణ శాఖ చేపడుతుంది. అందులో భాగంగా ఈ ఏడాదికీ వేసవి ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తీవ్రమైన ఎండల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడం, బాధితులకు అవసరమైన సహాయ చర్యలు తీసుకోవడమే ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. ఈ విషయంలో వివిధ శాఖలు ఎటువంటి పర్యవేక్షణ చేయాలన్న దానిపై వేసవి ప్రణాళిక కార్యాచరణ రూపొందించింది. జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు.. వడదెబ్బకు ఎక్కువగా పేదలే గురవుతున్నారు. పైగా వారిలో ఎక్కువమంది ఆరుబయట కాయకష్టం చేసేవారు, కార్మికులు. వడదెబ్బకు చనిపోయే వారిలో 40–60 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉంటున్నారు. వారికి ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రస్థాయి కమిటీకి విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ నోడల్ ఆఫీసర్‌గా ఉంటారు. వైద్య, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో వేసవి ప్రణాళిక అమలుకు కలెక్టర్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంబంధిత కమిషనర్లు నోడల్ ఆఫీసర్లుగా ఉంటారు. మార్చి నుంచి జూన్ వరకు ఈ ప్రణాళిక అమలు చేస్తారు. తీవ్రమైన వడగాడ్పులు, ఎండలుండే హైరిస్క్ ప్రాంతాలను ఈ కమిటీలు గుర్తించాలి. తద్వారా వడదెబ్బకు ప్రజలు గురికాకుండా నివారించాలి. ఆరోగ్య కార్యకర్తలకు, పాఠశాల విద్యార్థులకు, స్థానిక ప్రజలకు వడదెబ్బ నివారణపై శిక్షణ ఇవ్వాలి. వాతావరణ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ఎండల తీవ్రతపై హెచ్చరికలు జారీచేయాలి. మీడియాకు, వివిధ ప్రభుత్వ శాఖలకు వర్క్‌షాప్ నిర్వహించాలి. పౌరసంబంధాల శాఖ ద్వారా ముఖ్యమంత్రి బహిరంగ సభల లేఖలను ముద్రించి గ్రామ సభల్లో చదివించాలి. సినిమా హాళ్లలో స్లైడ్లను ప్రదర్శించాలి. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశా వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించాలి. వైద్య విద్య సంచాలకుల ద్వారా వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. వైద్య విధాన పరిషత్, వైద్య విద్య సంచాలకుల ఆధ్వర్యంలో సంబంధిత ఆస్పత్రుల్లో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం బస్సులు నిలిపివేసేలా.. - నిర్మాణ కార్మికులకోసం సంబంధిత యాజమాన్యాలు తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. - ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. - పశువులు, కోళ్లకు వడదెబ్బ తగలకుండా తగు చర్యలు తీసుకోవాలి. - క్యాబ్, ఆటో డ్రైవర్లకు వేసవి తీవ్రతపై అవగాహన కల్పించాలి. - బస్టాండ్లలో ప్రయాణికులకోసం తాగునీటి వసతి కల్పించాలి. కరపత్రాలు పంచాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చల్లని తాగునీరు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి. - వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులను నిలిపివేయాలి. - పాఠశాల తరగతి గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి కల్పించాలి. ఓఆర్ఎస్, ఐస్ ప్యాక్‌లను అందుబాటులో ఉంచాలి. వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించకూడదు. అలాగే ఆరుబయట తరగతులను నడపకూడదు. - ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. - వాతావరణశాఖ ఎప్పటికప్పుడు వడగాడ్పులపై సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి.