Telangana history
-
''తెలంగాణ చరిత్ర మహోన్నతమైనది.. చరిత్రలో అజరామరమైంది''
తెలంగాణ సమాజం ఆది నుంచి మత సామరస్యం, మానవీయ విలువలకు కేంద్రంగా నిలిచిందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు.భారతదేశ చరిత్ర పటంలో తెలంగాణ చరిత్ర అజరామరమయ్యిందన్నారు..రాష్ట్ర అవతరణ తర్వాత మనకు తెలియని మన మహోన్నతమైన చరిత్రను వెలికితీసే కృషి ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట ఉన్నత విద్యామండలిలో ‘‘తెలంగాణ చరిత్ర’’ బృహత్ గ్రంథాన్ని విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డా డి. రవీంద్ర యాదవ్, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో పాటు ఇంటర్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు చదువుకునే విద్యార్థులకు ఈ గ్రంథం తప్పకుండా ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని తర్వాత తరాలకు అందజేయాలంటే మన చరిత్రను, మన సంస్కృతిని నిక్షిప్తం చేసి అందచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. తొలుత ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో, ఇప్పుడు తెలుగులో అందించడం వల్ల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఒకే గ్రంథంలో సమగ్రంగా మొత్తం చరిత్రను ముద్రించిన తెలంగాణ పబ్లికేషన్స్ కృషిని ఆయన అభినందించారు. -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్‌లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్‌లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్‌లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్‌లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్‌ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది : సీతారాం ఏచూరి
-
తెలంగాణ నిజానిజాలు గమనిస్తోంది!
ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ తెగదెంపుల సంగ్రామంలో తెగించి స్థిర పడిన తెలంగాణ తనను తాను చూసుకుంటోంది. రేపటి భవిష్యత్తుపై గంపెడు ఆశలతో కలలు కంటోంది. మార్పును ప్రతినిత్యం కోరుకునే తెలంగాణ ఊహించని మార్పులతో ఊహకందనంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. విషాదాల కొలిమి, విప్లవాల పొలి కేకలు, ఫెళఫెళ కూలిపడ్డ ఆధిపత్య అహంకారాలు... పాఠ్యాంశాలుగా మారిన తెలంగాణ ఇప్పుడు నిజానిజాల నిగ్గు తేల్చు కుంటోంది. ఎవరిది విద్రోహమో, ఏది విలీనమో, ఏది బల ప్రయోగమో, గాయాలు ఎక్కడ తగిలాయో, గేయాలై ఎక్కడ పలికాయో, సున్నితపు ఐకమత్యపు తెలంగాణ తీగలను ఎవరు తెంచ చూశారో... మళ్లీ అన్నింటినీ కలిపి జాతీయ ఐకమత్య మహానదిగా మన తెలంగాణను ఎవరు మారుస్తున్నారో... అంతా తెలంగాణ బిడ్డలకు తెలుసు. దయచేసి మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాత గాయాల కట్లు విప్పి కారం చల్లే పనులు ఎవరూ చేయకండి. తరతరాల సామాజిక తాత్విక సహజత్వ జీవ జలపాతం తెలంగాణతనం. అబ్బురపరిచిన ఆశ్చర్యాల నుంచీ, నిప్పుల వర్షాల నుంచీ... సకల జనుల ప్రశాంత వెండి వెన్నెల సిరుల పందిరిగా మారిన తెలంగాణను సంరక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. మానవీయ సంస్కృతికి పట్టుగొమ్మయిన తెలంగాణ అత్యున్నత మానవ సమాజ నిర్మాణం వైపు పయనించమంటోంది. ఈ కుళ్ళు కులసంకెళ్లను తెంచమంటోంది. కమ్ముకొస్తున్న మత మబ్బుల్ని చెదరగొట్టమంటోంది. ఒకనాడు భూమి, భుక్తి, విముక్తి అంటూ నినదించి ముందుకు సాగిన తెలంగాణ ఇప్పుడు ప్రతి మనిషినీ సంపదగా మార్చి ప్రపంచానికి ఒక నూతన సందేశం ఇవ్వమంటోంది. అన్నార్తులు, అనాథలు కానరాని సమాజ నిర్మాణం చేయమంటోంది. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని విత్తనాలుగా చల్లి మహోన్నత మానవీయ పాఠంగా దేశాన్నే తీర్చిదిద్దుకుందాం అంటోంది. జాతీయ సమైక్యత దినోత్సవ మహాసందేశంగా జాతిగీతమై మోగ మంటుంది. తరతరాల వారసత్వ చరిత్రకు ఎవరు పేటెంట్ దారులు కాదని తెలంగాణ పదేపదే చెబుతోంది. ప్రపంచానికి పిడికెడు అన్నం పెడుతున్న రైతు భారతానికి పట్టాభిషేకం చేయమంటోంది తెలంగాణ. వ్యవసాయాన్ని పరిశ్రమలుగా మార్చి, పండించిన పంటలకు రైతు కూలీలనే అత్యా ధునిక వ్యవసాయ పరిశ్రమల యజమానులను చేయమంటోంది. సాటి మనుషుల్ని కుల మతాల పేరుతో వెంటాడుతున్న ఆటవిక సంస్కృతిని దరిదాపుల్లోకి రానీయకుండా మానవీయ మహా కోటను నిర్మించుకుంది తెలంగాణ. ఆధిపత్య కుల అహంకార పదఘట్టనల కింద పశువుగా ప్రవర్తించే దుర్మార్గ సంస్కృతిని దరిదాపులకు రాకుండా సరిహద్దు సైనికునిగా పహారా కాస్తోంది తెలంగాణ. ఆదివాసీ గిరిజన వికాసంలో భాగంగా ‘మా గూడెంలో మా రాజ్యం’, ‘మా తండాలో మా రాజ్యం’ అన్న కలలను నిజం చేస్తోంది తెలంగాణ. పేదలైన ముస్లింలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మైనారిటీ పిల్లలకు ఒక్క తెలంగాణ లోనే 1160 గురుకులాలను పెట్టి కార్పొరేట్ స్థాయి చదువు అందిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వేలాది గురుకులాలు రావాలని తలుస్తోంది తెలంగాణ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును నూతన సచివాలయానికి పెట్టి ఎద ఎదలో రాజ్యాంగ రక్షణ స్ఫూర్తిని చాటింది. దేశ పార్ల మెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టమని నినదిస్తున్న ఆచరణవాది తెలంగాణ. సస్యశ్యామల దేశంలో క్షామాలు, నిరుద్యోగ రక్కసులు, రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని నడుంబిగించింది తెలంగాణ. నెర్రెలు బాసిన కరువు భూముల్లోకి గంగమ్మను రప్పించేందుకు కాళేశ్వరాన్ని కట్టుకొని జలకళతో నిండింది తెలంగాణ. ఇంటింటికీ ‘మిషన్ భగీరథ’నిచ్చి గొంతు తడిపిన తెలంగాణ... దేశానికి ఆ పథకాన్ని ఎందుకు అందించలేమని పయనమవుతోంది. దేశంలో జరగాల్సింది జాతీయ సమైక్యతా ఉత్సవాలు కానీ విద్వేష ఉత్సవాలు కాదని గొంతెత్తి పిలుస్తోంది తెలంగాణ. పగలు సెగలులేని, పరమత ద్వేషాలు లేని దేశమే సకల సంపదలతో తులతూగుతుందని ఆచరణాత్మకంగా తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. దళితుల ఆత్మగౌరవ జెండాగా నిలిచిన ‘దళిత బంధు’ పథకాన్ని పెట్టి వాళ్లను ఉత్పత్తి శక్తులుగా తీర్చి దిద్దుతున్న తెలంగాణ దేశంలో దళితులంతా ఇట్లనే వర్ధిల్లాలని తలంచుతోంది. బహుజనులకు ఆత్మగౌరవ భవనాలనిచ్చి ఆయా కులాల సామాజిక ఎదుగుదలకు ఇంతగా కృషిచేసిన రాష్ట్రం దేశంలో మరోటి లేదంటోంది తెలంగాణ. ఇప్పుడు అన్ని రంగా లలో పురోభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణను చూస్తున్నాం. వర్ధిల్లు వీర తెలంగాణ ! వర్ధిల్లు సామరస్య తెలంగాణ! జూలూరీ గౌరిశంకర్ (ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి) -
23 అడుగుల శాసన స్తంభం.. 898 ఏళ్ల చరిత్ర వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: రాతిఫలకలపై చెక్కిన శాసనాలు చాలా కన్పిస్తాయి..కానీ, శాసనం కోసం ఇలా 23 అడుగుల ఎత్తైన స్తంభాన్ని ఏర్పాటు చేసిన అరుదైన ఘట్టం కళ్యాణ చాళుక్యుల కాలంలో జరిగింది. ఈ స్తంభానికి 898 ఏళ్లు. ఈ స్తంభం భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి ఆరు కి.మీ.దూరంలో ఉన్న కొలునుపాక ఊబదిబ్బపై ఉంది. ఆరో విక్రమాదిత్యుని కుమారుడు సోమేశ్వరుని కీర్తి కోసం స్థానిక అంబర తిలకమనే జైనబసది భోగానికి (భోజన సదుపాయం) పానుపురాయి గ్రామాన్ని సర్వబాధా పరిహారంగా దానం ఇచ్చిన సందర్భంలో 1125లో వేయించిన శాసనంగా తెలుస్తోంది. నాలుగు వైపులా కన్నడ భాషలో... స్తంభం నలువైపులా 151 పంక్తులతో కన్నడంలో శాసనం చెక్కి ఉంది. నాటి చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ప్రతిబింబంగా ఉన్న ఈ శాసనం ప్రస్తుతం ఒకవైపు వంగిపోతూ కూలిపోయే స్థితికి చేరుకుంది. చుట్టూ ముళ్లపొదలు, బురదతో నిండి అడుగుతీసి అడుగు వేయాలంటేనే కష్టంగా మారిందని, ఆ శాసనాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా దానికి సమీపంలోని కొన్ని ప్రాంతాలను పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. అందులో కొలనుపాక సోమేశ్వరాలయం కూడా ఒకటి. ఆలయానికి చేరువగానే ఉన్న ఈ శాసన మూలస్తంభాన్ని హెరిటేజ్ ఆర్కిటెక్టు శ్రీలేఖతో కలిసి పరిశీలించారు. కుమార సోమేశ్వరుడు, త్రికలింగాధిపతిని, ద్రావిడ దేశాధిపతిని జయించాడని, అతని దండనాయకుడైన స్వామిదేవుడు హరి, హర, జిన, బుద్ధ అనే చతుస్సమయాలను ప్రోత్సహించాడన్న విషయాలు శాసనంలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ అరుదైన శాసన స్తంభాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొలనుపాకకు వచ్చే పర్యాటకులు ఈ శాసనస్తంభాన్ని చూసేలా ఏర్పాట్లు చేసి దాన్ని ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. -
Shanigaram Village: చరిత్రకెక్కిన శనిగరం
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌కు 20 కి.మీ. దూరంలో వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో శనిగరం గ్రామం ఉంది. ఇక్కడి పురాతన శిథిల శివాలయంలో అరుదైన ఆధారాలు బయటపడ్డాయి. నిర్మాణశైలి ప్రకారం ఈ గుడి కాకతీయుల శైలికి చెందింది. నాలుగు అడుగుల ఎత్తయిన జగతిపై ఆలయ నిర్మాణం జరిగింది. 16 కాకతీయ శైలి స్తంభాలతో కూడిన అర్ధమంటపం ఉంది. అలాగే, అంతరాలం, గర్భగుడులు ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు రమేష్‌శర్మ, ఉజ్జేతుల రాజు వెల్లడించారు. కొత్త కాకతీయ శాసనం శనిగరంలో కొత్త కాకతీయ శాసనం ఒకటి లభించింది. ఈ శాసనం ఒక గ్రానైట్ రాతిస్తంభం మీద మూడు వైపుల చెక్కి ఉంది. సూర్యచంద్రులు, శివలింగం, ఆవులు శాసనం పైవైపు చెక్కి ఉన్నాయి. శాసనాన్ని చూసి రాసుకున్న దాని ఆధారంగా ఈ శాసనం రామనాథ దేవాలయానికి ఆ ఊరిప్రజలు.. బ్రాహ్మణుల సమక్షంలో కొంత భూమి దానం చేసినట్లు గుర్తించారు. మహామండలేశ్వరుడు కాకతీయ ప్రతాపరుద్రుడు ఓరుగల్లులో రాజ్యం చేస్తున్నపుడు మన్మథనామ సంవత్సరం (క్రీ.శ.1295)లో వేసిన శాసనంగా భావిస్తున్నారు. ద్వారస్తంభం మీద కలశాలు చెక్కి ఉన్నాయి. గుడి కప్పుకు ప్రత్యేకమైన కాకతీయశైలి ప్రస్తరం (చూరు) కనిపిస్తుంది. ఈ గుడిలోని స్తంభాలపై చెక్కిన అర్థశిల్పాలు ప్రత్యేకం. ఇవి రామప్పగుడిలోని స్తంభశిల్పాలకన్నా ముందరి కాలానికి చెందినవి. విశేషమైన శిల్పం ఒక స్తంభం మీద కనిపించింది. ఈ స్తంభశిల్పంలో ఒకవైపు విల్లు ధరించిన చెంచులక్ష్మి కాలికి గుచ్చుకున్న ముల్లు తీస్తున్న దృశ్యం, ఇంకోవైపు ఎద్దులతో రైతు కనిపించడం విశేషం. ఇది ఏరువాకకు చెందిన శిల్పమే. ఇక కొన్ని ఆధారాలను పరిశీలిస్తే కాకతీయుల పాలనలో ప్రధాన కేంద్రం ఇదేనని ప్రాథమికంగా భావిస్తున్నారు. రామప్పను తలపించేలా.. ఈ స్తంభ శిల్పాల్లో ఒక స్తంభంపై ముగ్గురు నృత్యకారులు నాలుగు కాళ్లతో కనిపించే శిల్పం రామప్పగుడి మాదిరిగానే ఉంది. మరో స్తంభంపై ఏనుగులు తొండాలతో పోట్లాడుతున్నట్టు, ఇంకో స్తంభం మీద హంసలు ఉన్నాయి. వైష్ణవమత ప్రతీకైన గండభేరుండం, శైవమతంలో పేర్కొనబడే శరభేశ్వరుల శిల్పాలను ఎదురుపడినట్లుగా చెక్కిన శిల్పం మరో స్తంభంపై చూడొచ్చు. ఒక స్తంభంపై రెండు గుర్రాలమీద స్వారీ చేస్తూ ఆయుధాలతో ఇద్దరు వీరులు కనిపిస్తున్నారు. దేవాలయ స్తంభాలపై యుద్ధ దృశ్యం చాలా అరుదైంది. రామాయణాన్ని తలపించే లేడివేట దృశ్యం.. విల్లమ్ములతో వీరుడు, అమ్ముదిగిన జింకను తీర్చిదిద్దారు. ఏనుగును వధిస్తున్న వీరుడితో పాటు ఆలయ ప్రాంగణంలో హనుమంతుని శిల్పం, ఒక శాసనఫలకం ఉన్నాయి. హనుమంతుడి విగ్రహం కింద ఉన్న శాసనలిపిలో సింమ్వ సింగ్గన అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. అది హనుమాన్ శిల్పాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరై ఉంటుందని భావిస్తున్నారు. ఇలా కాకతీయుల పాలనకు అద్దంపట్టే అనేక శిల్పాలు రామప్ప గుడిని తలపిస్తున్నాయి. కాగా చాళుక్యల శైలి నిర్మాణవాస్తుతో కట్టిన గుడి ఆనవాళ్లు, గుడిస్తంభాలు ఉన్నాయని, వాటిమీద ఇనుమును కరగదీసిన ఆనవాళ్లు, నలుపు ఎరుపు కుండపెంకులు, రాగి నాణేలు లభించాయని శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు. -
సిద్దిపేటలో వీరుడి గుడి.. ఎలా ఉందో చూడండి
సాక్షి, సిద్దిపేట: వీరునికి గుడి కట్టడం అరుదుగా కనిపిస్తుంది. అది సిద్దిపేటలో కనిపించడం విశేషం. రాజుల చరిత్రకు సమాంతరంగా ఉంటుంది యుద్ధవీరుల చరిత్ర. పూర్వం ఊరిని కాపాడటానికి సొంత వీరులుండేవారు. వారు ఆ ఊళ్లలోని మహిళలు, పిల్లలు, పశువులు, సంపదను కాపాడటానికి దొంగలు, ఇతర రాజ్యాల సైనికులు, క్రూర జంతువులతోనైనా ప్రాణాలకు తెగించి పోరాడేవారు. ఈ పోరులో అమరులైన ఆ వీరుల పేరిట గ్రామస్తులు, పాలకులు నిలిపిన స్మారక శిలలే వీరగల్లులు. పట్టణంలోని భోగేశ్వరాలయం సమీప పొలాల్లో ఈ శిలలు కన్పించాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు అహోబిలం కర్ణాకర్, సామలేటి మహేశ్ వాటిని పరిశీలించారు. వీటిలో ఆత్మాహుతి శిలలెక్కువగా ఉన్నట్లు తేల్చారు. యుద్ధం చేసి మరణించిన వీరుల శిలలూ ఉన్నట్లు తెలిపారు. ఇటీవల గుడి పక్కన పొలాల్లో పశువులను కట్టేసే చోట నాలుగు రాతిస్తంభాల నడుమ భూమిలోపలికి నడుము వరకు మునిగివున్న వీరుని శిల్పం కనిపించింది. ఆ నాలుగు స్తంభాలు వీరుని గుడి కోసం పాతినవే కావడం గమనార్హం. ఇక్కడ గుర్తించిన రాచవీరునికి తలపై సిగ కుడివైపుకు కట్టి వుంది. చెవులకు పెద్దకుండలాలున్నాయి. వీరుని మెడలో రత్నాలు పొదిగిన హారాలున్నాయి. తలమీద రాచహోదాను తెలిపే ఛత్రం (గొడుగు) వుంది. పెద్దకళ్లు, తిప్పిన మీసాలు, దీర్ఘచతురస్రాకారపు ముఖంతో కనిపిస్తున్నాడు. దండరెట్టలమీద కడియాలున్నాయి. ఎదరొమ్ముమీద గుచ్చుకుంటున్న బాకును వీరుడు ఎడమచేత పట్టుకుని ఉన్నాడు. వీరుడు ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు తెలుస్తోందని కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు వివరించారు. ఈ వీరులలో మతం కోసం శరీరంలోని అంగాలను అర్పించేవారు. ముఖ్యంగా ఈ రకం వారు వీరశైవులలో ఎక్కువగా కనిపిస్తారు. 10, 11 శతాబ్దాలనాటి ఆహార్యంతో వీరుడు కనిపిస్తున్నాడని చెప్పారు. -
పరడ ‘బుద్ధుడి’పై క్వారీ పడగ!
సాక్షి, హైదరాబాద్: అదో పెద్ద గుట్ట.. దానిపై మూడో శతాబ్దం నాటి వృత్తాకార నిర్మాణం... మట్టిదిబ్బలో కూరు కుపోయి కొన్ని ఇటుకలు కనిపిస్తున్నాయి. వాననీటి ప్రవా హానికి కొట్టుకుపోకుండా దానికి ఆధారంగా గుట్ట అంచున రాతి నిర్మాణం.. వాటి దిగువన ముచుళింద శిల్పం... ఇవన్నీ బౌద్ధ స్తూప ఆనవాళ్లు. ఈ గుట్టపై ఉన్న నిర్మాణాలూ ఇది బౌద్ధస్తూపమనే దానిని రూఢీ చేస్తున్నా యి. అదే నిజమైతే... రాష్ట్రంలో బౌద్ధం జాడలున్నాయనే వాదన మరింత బలోపేతమవుతుంది. ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేసేందుకు ప్రచారం చేసిన బావరి రాష్ట్రానికి చెందినవాడేనని ఇప్పటికే ఆధారాలు వెలుగు చూడటం, విదేశీ బౌద్ధ సన్యాసులనూ అబ్బురపరిచే స్తూపాలు, చైత్యాల జాడలిక్కడ ఉండటం ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు దోహదం చేస్తున్నాయి. అంతటి ప్రాధాన్యమున్న ఈ ప్రాంతం కొద్ది రోజుల్లో కాలగర్భంలో కలిసిపోబోతోంది. ఆ నిర్మాణం బౌద్ధ స్తూపమా.. కాదా.. అన్నది వెలుగు చూడకుండానే అదృశ్యం కాబోతోంది. క్వారీ పనులతో గుట్టను గుటుక్కుమనేందుకు కొందరు శరవేగంగా ముందుకు కదులుతుండటమే దానికి కారణం. చరిత్ర బృందం పరిశోధన...: నల్లగొండ జిల్లా కట్టం గూరు మండలం పరడ గ్రామ శివారులో ఓ గుట్ట ఉంది. దానిపైన పురాతన శివుడి గుడి ఉండటంతో దాన్ని శివుని గుట్ట అని పిలుస్తారు. ఆలయానికి ఉత్తరాన మట్టి దిబ్బ ఉంది. దాన్ని ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళి, రాంప్రసాద్, చంటి çపరిశీలించారు. దిబ్బలో 25 అడుగుల వ్యాసంతో వృత్తా కార నిర్మాణం ఉన్నట్టు గుర్తించారు. దానికి వాడిన భారీ ఇటుకలను పరిశీలిస్తే అవి 2, 3 శతాబ్దాలకు చెందినవిగా తెలుస్తోంది. అంటే శాతవాహనుల కాలంనాటి నిర్మాణాలని ప్రాథమికంగా రూఢీ అయింది. అక్కడే 8 అంగుళాల ఎత్తున నాగ ముచుళింద శిల్పం కనిపించింది. దానిపై స్వస్తిశ్రీ మనుమధ నామ సంవత్సర... అన్న పొడి అక్షరా లున్నాయి. వెరసి ఇది బౌద్ధ స్తూపాన్ని పోలినట్టు స్పష్టమ వుతోంది. బుద్ధుడికి జ్ఞానోదయమైన సమయంలో ఎడతె రిపి లేకుండా 7 రోజులు భారీ వర్షాలు కురిస్తే నాగరాజైన ముచుళిందుడు పాతాళం నుంచి వచ్చి తన పడగ నీడతో రక్షణ కల్పించాడని పురాణగాథ. అందుకే బౌద్ధ స్తూపాలు న్న చోట నాగ ముచుళింద విగ్రహాలు కనిపిస్తాయి. చుట్టూ చెట్లు, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. దిబ్బను తవ్వితే లోపలి నిర్మాణంపై స్పష్టత వస్తుంది. కానీ, ఇప్పటికీ పురావస్తు శాఖ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఈలోపు కొందరు దాన్ని క్వారీగా మార్చి గుట్టను పిండి చేయటం మొదలు పెట్టారు. ఇప్పటికే కొంతవరకు అది నాశనమైంది. మిగతాది అదృశ్యం కాకుండా ప్రభుత్వం కాపాడాలంటూ స్థానికులు ఇప్పటికే కలెక్టర్‌కు పిటిషన్ దాఖలు చేశారు. పురావస్తు శాఖ స్పందించి దానిపై స్పష్టతనిచ్చి పరిరక్షించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. -
‘తెలంగాణ చరిత్ర–నూతన కోణం’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ రచించిన ‘తెలంగాణ చరిత్ర–నూతన కోణం’ పుస్తకావిష్కరణ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో జూలూరి గౌరీ శంకర్ అధ్యక్షతన శనివారం జరిగింది. కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్ర పాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేశవరావు మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్రం గురించి రాయాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ఎలా ముందున్నారో, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత తెలంగాణను విలీనం చేసే విషయాల్ని, సాయుధ పోరాటం తర్వాత కూడా భూస్వాములే పాలించి, దళితులు, మైనారిటీలను అణిచివేతకు గురిచేసిన వ్యాసాల్ని ఈ పుస్తకంలో అడపా సత్యనారాయణ చక్కగా పొందుపరిచారు’ అని కొనియాడారు. తెలంగాణ అస్థిత్వం గురించి ఈ పుస్తకంలో పొందుపర్చడం మంచి విషయమని అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ చరిత్రను టీఎస్పీఎస్సీ పోటీపరీక్షల సిలబస్‌లో పెట్టడం గొప్ప విషయం, ఇలా అయినా లక్షలాది మంది తెలంగాణ చరిత్రను తెలుసుకునే అవకాశం కలిగిందని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. అడపా సత్యనారాయణ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల గురించి, తెలంగాణలోని మిశ్రమ సంస్కృతిని తెలియజేసే విధంగా ఈ పుస్తకం రచించానని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ అశోక్, ఉస్మానియా ప్రొఫెసర్ సుధారాణి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 12 నుంచి హైదరాబాద్ ఫెస్ట్-2018
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఫెస్ట్-2018ను ఏప్రిల్ 12 నుంచి 22వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు అధ్యక్ష, కార్యదర్శులు నంద్యాల నరసింహరెడ్డి, కె చంద్రమోహన్లు తెలిపారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్ట్ గ్యాలరీ, సైన్స్ ఫెయిర్, ఫిల్మ్ ఫెస్టివల్, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఫెస్ట్‌కు హాజరయ్యేవారిని ఆకట్టుకునేలా ప్రతిరోజు కళా ప్రదర్శనలు, ప్రముఖుల కవితలు, ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసేలా సైన్స్ ఎగ్జిబిషన్ చేపడుతున్నట్టు ఫెస్ట్ నిర్వహకులు తెలిపారు. అంతే కాకుండా విద్యార్థులకు కథలు, కవితల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. హైదరాబాద్ చరిత్ర ప్రతిబింబించే అంశాలతో పాటు, తెలంగాణ కళలను ప్రోత్సహించే దిశగా ఫెస్ట్‌ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఐదు లక్షల మందికి పైగా ఫెస్ట్‌కు హాజరవుతారని, ప్రజలు దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
తెలంగాణ హిస్టరీ
శాతవాహన వంశ స్థాపకుడు? - శ్రీముఖ శాతకర్ణి మౌర్య సామ్రాజ్య పతనానంతరం, శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వతంత్రించారు అని తెలిపినవారు? - వి.ఎ. స్మిత్ శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం? - మత్స్య పురాణం శాతవాహనులు - ఆంధ్రులు ఒక్కరే అన్నవారు? - ఆర్.జి.భండార్కర్, వి.ఎ. స్మిత్, రాప్సన్ శాతవాహనుల జన్మస్థలం మహారాష్ర్ట అని పేర్కొన్నవారు? - పి.టి. శ్రీనివాస అయ్యంగార్ శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదించినవారు? - వి.వి.మిరాశి శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని పేర్కొన్నవారు? -సూక్తాంకర్ శాతవాహనుల తొలి రాజధాని? - కోటిలింగాల ఏ శాతవాహన రాజుకు చెందిన నాణేలు పూనా సమీపంలో లభించాయి? -మొదటి శాతకర్ణి నానాఘాట్ శాసన కర్త? - నాగానిక సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు? - రెండో శాతకర్ణి రెండో శాతకర్ణి.. శుంగుల రెండో రాజధాని విదిశను జయించాడని పేర్కొనే గ్రంథం? - గార్గి సంహిత తన పేరు మీద తొలిసారిగా శాసనాలు వేయించిన శాతవాహన రాజు? - మొదటి పులోమావి ఏ రాజు కాలంలో గౌతమీ బాలశ్రీ.. నాసిక్ శాసనం వేయించింది? - వాశీష్టపుత్ర పులోమావి నహపాణుడి పునర్ముద్రిత నాణేలు ఎక్కడ లభించాయి? - జోగల్తంబి ఆంధ్ర రాజులు సుశర్మను చంపి మగధను ఆక్రమించినట్లు పేర్కొనే పురాణం? - మత్స్య పురాణం కామర్థకవంశ చష్టానుడు.. వాశీష్ఠపుత్ర పులోమావి సమకాలీనుడు అని తెలిపిన విదేశీ రచయిత? - టాలమీ రాజు పేరు ముందు తల్లి నామం పెట్టుకునే ఆచారం ఏ రాజుతో ప్రారంభమైంది? - గౌతమీపుత్ర శాతకర్ణి శ్రీముఖుడు మొదట ఆదరించిన మతం? - జైన మతం ‘కవి వత్సల’ అనే బిరుదున్న రాజు? - హాలుడు శాతవాహన వంశంలో అతి గొప్ప రాజు? - గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు? - ఆహారము భారత్‌లో తొలిసారిగా బ్రాహ్మణులకు భూ దానాలు ప్రారంభించిన రాజ వంశం? - శాతవాహనులు నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం? - భట్టిప్రోలు శాతవాహనుల కాలంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉన్నాయని తెలిపే గ్రంథం? - గాథాసప్తశతి అమరావతి స్థూపాన్ని విస్తృతపరిచి, మహాచైత్య వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి? - యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు? - భూమి శిస్తు శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే? - వృత్తి సంఘాలు శాతవాహనుల కాలంలో నౌకా వాణిజ్యాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న శాసనం? - గుంటుపల్లి శాతవాహనుల రాజ భాష? - ప్రాకృతం సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు? - కుంతల శాతకర్ణి నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు? - మొదటి శాతకర్ణి సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరం ప్రకారం శాతవాహనుల మూలపురుషుడు? - శాతవాహనుడు శాతవాహనుల కాలంలో జనపదాలు అంటే? - సామంత రాజ్యాలు శాతవాహనుల శాసనాలు అన్నీ ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి? - ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన కుంద కుందనాచార్యుడు ఏ మతానికి చెందినవాడు? - జైనం నాసిక్, కన్హేరి గుహలను బౌద్ధ మతస్తులకు దానం చేసిన శాతవాహన రాజు? - కృష్ణుడు కార్లే గుహలను మహాసాంఘిక బౌద్ధశాఖకు దానం చేసిన రాజు? - రెండో పులోమావి అజంతా గుహల్లోని 9, 10 గుహలు ఏ యుగానికి చెందినవి? - శాతవాహనులు గాథాసప్తశతిని పోలిన గ్రంథం ‘వజ్జలగ్గ’ను రచించింది? - జయవల్లభ శాతవాహనుల కాలంలో రాతిలో తొలిచిన చైత్యం ఎక్కడ ఉంది? - గుంటుపల్లి శ్రీ పర్వతం వద్ద శైల మండపాలు నిర్మించిన రాజు? - యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనుల కాలంలో బౌద్ధ స్థూపాలను వేటితో నిర్మించారు? - ఇటుకలు ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లిన శాతవాహనుల రేవు పట్టణం? - ఘంటసాల శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించిన వర్తకులు? - స్థారవాహులు శాతవాహనుల కాలానికి సంబంధించిన రోమ్ దేశ నాణేలు ఏ ప్రాంతంలో లభించాయి? - కొండాపూర్ బృహత్కథను గుణాఢ్యుడు ఏ భాషలో రచించాడు? - పైశాచీ భాష శాతవాహనుల కాలంలో ఒక సువర్ణ (బంగారు) నాణేనికి ఎన్ని కార్షపణాలు (వెండి)? - 1:35 (ఒక బంగారు నాణేనికి 35 కార్షపణాలు) శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు? - 12 శాతం శాతవాహనుల కాలంలో వృత్తి పన్ను? - కారుకర ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి విస్తరించింది? - మొదటి కృష్ణుడు ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు? - సుహృల్లేఖ, ఆరోగ్య మంజరి, ప్రజ్ఞా పారమిత, మాధ్యమిక కారిక బౌద్ధ మతస్తుల కోసం నాగానిక తొలిపించిన గుహలు? - నానాఘాట్ ‘బెణకటకస్వామి’ అని బిరుదు గల శాతవాహన రాజు? - గౌతమీపుత్ర శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు? - శకారి, ఆగమనిలయ, క్షహరాట వంశ నిషేశకర, త్రిసముద్రతోయ పీతవాహన క్రీ.శ. 78లో శాలివాహన శకాన్ని ప్రారంభించింది? - గౌతమీపుత్ర శాతకర్ణి గ్రూప్- 2 ప్రత్యేకం శాసనాల ప్రకారం ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు? - వాశీష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు ఏ రాజును ఓడించి ఇక్ష్వాకులు విజయపురిలో అధికారాన్ని స్థాపించారు? - మూడో పులోమావి ఇక్ష్వాకులు స్థానికులు అని వాదించిన చరిత్రకారుడు? - కాల్డ్వెల్ ఇక్ష్వాకులు కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్రకు వలస వచ్చారని పేర్కొన్నవారు? - వోగేల్ శ్రీశాంతమూలుడు ఏ మతాన్ని ఆదరించాడు? - వైదిక మతం ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని పేర్కొనే పురాణం? - విష్ణు పురాణం రెంటాల, దాచేపల్లి, కెసానపల్లి శాసనాలు వేయించిన ఇక్ష్వాక par రాజు?ఙ- శ్రీశాంతమూలుడు శతసహస్రహలక, మహాదానపతి బిరుదులు కలిగిన ఇక్ష్వాక par రాజు?ఙ- శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకుల చరిత్రకు మూలాధారాలైన శాసనాలు? - నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి వీరపురుష దత్తుడి కాలంలో మహాచైత్య నిర్మాణానికి ఆయక స్తంభాన్ని ప్రతిష్టించింది ఎవరు? - అడవి శాంతిశ్రీ నాగార్జునకొండ వద్ద చుళ్లదర్మగిరిపై చైత్యగృహాన్ని నిర్మించింది? - ఉపాసిక బోధిశ్రీ మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఏ రాజు కాలంలో ప్రారంభమైంది? - వీరపురుష దత్తుడు ఏ రాజు కాలాన్ని ఆంధ్రలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు? వీరపురుషదత్తుడు అశ్వమేథయాగం చేసిన ఇక్ష్వాక రాజు? - శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకుల రాజభాష? - ప్రాకృతంఙఞ్చటరాజు.. శివలింగాన్ని కాలితో తొక్కుతూ, బౌద్ధులకు అభయం ఇస్తున్న శిల్పం ఏ ప్రాంతంలో లభించింది? - నాగార్జునకొండ ఇక్ష్వాకుల రాజ చిహ్నం? - సింహం భారతదేశంలో తొలి వైదిక (హిందూ) దేవాలయాలు నిర్మించిన రాజులు? - ఇక్ష్వాకులు ఏ ఇక్ష్వాక రాజు కాలంలో శ్రీ పర్వతం మహాయాన మతానికి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లింది? - వీరపురుషదత్తుడు దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన రాజు? - ఎహుబల శాంతమూలుడు ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన వృత్తి? - వ్యవసాయం హారతి అంటే? - చిన్న పిల్లలను రక్షించే దేవత వీరగల్ అంటే? - యుద్ధంలో మరణించిన వీరుల స్మారక చిహ్నాలు ఇక్ష్వాకుల కాలం నాటి వృత్తి పన్నుల గురించి వివరిస్తున్న శాసనం? - విషవట్టి శాసనం ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ వర్తక శ్రేణులు? - పర్నిక శ్రేణి, పుసిన శ్రేణి మొదటిసారిగా ఆయా నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది? - ఇక్ష్వాకులు విష్ణుకుండినులు విష్ణుకుండిన వంశ స్థాపకుడు? - ఇంద్ర వర్మ ప్రముఖ చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మశాస్త్రి ప్రకారం విష్ణుకుండినుల రాజధాని? - ఇంద్రపాల నగరం ప్రముఖ చరిత్రకారుడు పి.వి.కృష్ణశాస్త్రి ప్రకారం విష్ణుకుండినుల రాజధాని? - కీసర పి.వి.పరబహ్మ్రశాస్త్రి ప్రకారం స్వతంత్ర విష్ణుకుండిన రాజ్య స్థాపకుడు? - మొదటి గోవింద వర్మ విష్ణుకుండినుల రాజ లాంఛనం? - సింహం చైతన్యపురి వద్ద విహారాన్ని నిర్మించిన విష్ణుకుండిన రాజు? - గోవింద వర్మ విష్ణుకుండినుల రాజభాష? - సంస్కృతం విష్ణుకుండినుల ఆరాధ్య దైవం? - శ్రీపర్వత స్వామి రెండో మాధవవర్మ కాలంలో అమరావతి స్థూపం.. అమరేశ్వరాలయంగా మారిందని పేర్కొన్న చైనా యాత్రికుడు? - హ్యుయాన్‌త్సాంగ్ మాధవవర్మకు ‘త్రివర నగర భువన యువతి ప్రియ’ అనే బిరుదు ఉన్నట్లు తెలిపే శాసనం? - పొలమూరు శాసనం జనాశ్రయ అనే బిరుదు కలిగిన విష్ణుకుండిన రాజు? - మాధవ వర్మ-3 కుమారుడికి మరణశిక్ష విధించిన విష్ణుకుండిన రాజు? - మూడో మాధవ వర్మ ఘటికలు అంటే? - బ్రాహ్మణ విద్యాకేంద్రాలు తెలంగాణలో లభిస్తున్న తొలి ప్రాకృత శాసనం? - చైతన్యపురి శాసనం తెలంగాణలో తొలి లక్షణ గ్రంథం? - జనాశ్రయచ్ఛందోవిచ్ఛిత్తి న్యాయపాలన ప్రస్తావన ఉన్న విష్ణుకుండినుల శాసనం? - పొలమూరు గుల్మిక అంటే? - సరిహద్దు రాష్ట్రాల సైనిక రాజ ప్రతినిధి భారతదేశంలో మొదటి హిందూ గుహాలయాలు నిర్మించిన రాజవంశం? - విష్ణుకుండినులు విష్ణుకుండినులు ముద్రించిన నాణేలు? - ఇనుప నాణేలు ఉత్పత్తి పిడుగు అంటే? - శిల్పుల శ్రేణి ఉండవల్లి గుహల్లో ఉన్న ఏ విగ్రహాన్ని పడుకుని ఉన్న అనంత పద్మనాభస్వామి విగ్రహంగా మార్చారు? - నిల్చున్న బుద్ధుడి విగ్రహం విష్ణుకుండినుల నాణేలపైముద్రించిన ముద్రలు? - సింహం, శంఖువు కొప్పు నరేష్ సబ్జెక్టు నిపుణులు -
సీపీఐ బస్సు యాత్ర
మంచిర్యాల సిటీ : నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి పొందిన తెలంగాణ చరిత్రను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఈ నెల 11 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గుండా మల్లేశ్, వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 11న ఉదయం 9 గంటలకు నల్లగొండ జిల్లా యాదాద్రి నుంచి బస్సు యాత్ర ప్రారంభమై 17న హైదరాబాద్‌లో ముగుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బస్సు యాత్రను పురస్కరించుకొని సీపీఐ ఆధ్వర్యంలో జాతాలు, పతాకావిష్కరణలు, అమరవీరులకు నివాళులు ఘటించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 15న ఉదయం 8 గంటలకు బస్సుయాత్ర జైపూర్ మండలంలోని ఇందారం చేరుకుంటుందని, అక్కడి నుంచి 10 గంటలకు మంచిర్యాల, 11 గంటలకు రామకృష్ణాపూర్, 12 గంటలకు సోమగూడెం, ఒంటి గంటలకు బెల్లంపల్లికి చేరుతుందన్నారు. బెల్లంపల్లిలోని తెలంగాణ చౌక్ వద్ద బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అలాగే ఈనెల 10న జోడేఘాట్‌లో కొమురం భీమ్‌కు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని 17న హైదరాబాద్‌లోని నిజాంగ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, సభకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, నియోజకవర్గ కార్యదర్శి కలవేని శ్యాంతోపాటు నాయకులు ఎండీ షఫీ, జోగుల మల్లయ్య, పుల్లక్క, లింగమూర్తి, కిషన్‌రావు ఉన్నారు. -
మట్టి పోరల్లో మహా చరిత్ర
- తెలంగాణ చరిత్రపై మహాన్వేషణ - తొలిసారి భారీ పురావస్తు పరిశోధనలకు రాష్ట్ర సర్కారు నిర్ణయం.. శాతవాహనుల రాజధాని నగరం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం - కరీంనగర్ జిల్లా కోటిలింగాల, ఆదిలాబాద్ జిల్లా కర్ణమామిడిలో తవ్వకాలకు సిద్ధం - అనుమతి కోసం కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదన.. వంద ఎకరాల రాజధాని నగరాన్ని గుర్తించిన పురావస్తు శాఖ - తెలుగు జాతి బీజాలపై సంపూర్ణ స్పష్టత దిశగా అడుగులు సాక్షి, హైదరాబాద్: తెలుగు జాతికి మూలం ఎక్కడ? తెలంగాణ గడ్డ మీద శతాబ్దాల పాటు వర్ధిల్లిన రాజవంశం ఏది? ఈ ప్రశ్నలకు చరిత్రకారులు ఠక్కున చెప్పే సమాధానం శాతవాహనులు అని! క్రీ.పూ.మూడో శతాబ్దంలో పరిఢవిల్లిన ఈ మహాసామ్రాజ్యానికి రాజధాని ఏది అంటే మరో ఆలోచన లేకుండా చెప్పే సమాధానం కోటిలింగాల!! కానీ చరిత్ర ఇంతేనా..? వెలుగు చూడని నిజాలు ఇంకేమైనా ఉన్నాయా? తెలుగు, తెలంగాణ చరిత్రకు కొత్త భాష్యం చెప్పే వాస్తవాల జాడలు మట్టిపొరల్లో దాగి ఉన్నాయా? తెలంగాణ ఆవిర్భవించిన నేపథ్యంలో ఈ గడ్డను ఆధారం చేసుకుని దేశాన్ని మలుపుతిప్పిన చ రిత్ర జాడల కోసం అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ చరిత్రలో ఓ భారీ పురావస్తు అన్వేషణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ పురావస్తు శాఖ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదన పంపింది. అక్కడ్నుంచి అనుమతి రాగానే అన్వేషణ మొదలుకానుంది. తెలంగాణ చరిత్ర, తెలుగు జాతి మూలంపై మరింత స్పష్టత రానుంది. గోదావరికి అటూ... ఇటూ! కోటిలింగాల.. తెలంగాణ గడ్డ మీద వెలసిన తొలి మహా సామ్రాజ్యపు రాజధాని నగరం. భారతదేశంలో మూడో వంతు భాగాన్ని అప్రతిహతంగా దాదాపు మూడు శతాబ్దాలపాటు ఏలిన శాతవాహన సామ్రాజ్య కేంద్రబిందువు. అలనాటి మహానగరం ఇప్పుడు ఓ కుగ్రామం. కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరు మండలం పరిధిలో గోదావరి నదీ తీరంలో ఉందా గ్రామం. ఈ పల్లెటూరు శివారులోని భూగర్భంలో అలనాటి గొప్ప సామ్రాజ్య రాజధాని విశ్రాంతి తీసుకుంటోంది. ఇది గతించిన చరిత్ర. ఇప్పుడు ఆ రాజధాని నగర జాడలను పూర్తిగా వెలుగులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. దాదాపు వంద ఎకరాల స్థలంలో తవ్వకాలు జరపబోతోంది. నాడు రాజధాని నగరంగా వెలిగిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు రైతుల పొలాలుగా ఉన్నాయి. వాటిని సేకరించి పూర్తిస్థాయిలో తవ్వకాలు జరిపే బృహత్ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక.. గోదావరి నదికి మరోవైపు ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న మరో కుగ్రా మం కర్ణమామిడి. ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్నందున ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రభుత్వం భూసేకరణ చేసి పెట్టింది. అక్కడ కూడా తవ్వకాలు జరపాలని నిర్ణయించింది. వీటికోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉన్నందున రాష్ట్రప్రభుత్వం ‘సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ అన్ ఆర్కియాలజీ(కాబా)’కి ప్రతిపాదన పంపింది. గోదావరికి అటూ.. ఇటూ.. తవ్వకాలు జ రిపేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రయోజనం ఏంటి? కోటిలింగాల ప్రాంతం గొప్ప చరిత్రకు సాక్ష్యమనే విషయం 1978 వరకు పుస్తకాలకే పరిమితం. అప్పట్లో పురావస్తు నిపుణులు పరబ్రహ్మశాస్త్రి ఆధ్వర్యంలో తొలిసారి తవ్వకాలు జరిపారు. అప్పటికిగాని అది భారతదేశ చరిత్రల్లో అత్యద్భుతంగా విలసిల్లిన మహాసామ్రాజ్యానికి రాజధాని అని తెలిసిరాలేదు. ఇక్కడే రెండున్నర వేలకుపైగా నాణేలు, గాజు వస్తువులు, పాత్రలు, నేరస్తులను శిక్షించే కేంద్రాలు, గొప్ప నిర్మాణ ఆనవాళ్లు వెలుగుచూశాయి. క్రీ.పూ.మూడో శతాబ్దంలో శాతవాహన తొలి చక్రవర్తి చిముకుడి హయాం నాటి నాణేలు ఇక్కడ తప్ప ఇప్పటివరకు మరే ప్రాంతంలో వెలుగుచూడలేదు. 1978 నుంచి 1983 వరకు జరిగిన తవ్వకాల ఫలితంగా... కోటిలింగాలలో వంద ఎకరాల సువిశాల నగరం ఉన్నట్టు తేలింది. దాని చుట్టూ రాజప్రాకారం, 4 మూలలా బురుజులు, వాచ్ టవర్, పెద్ద గోపుర ద్వారం ఉన్నట్టు స్పష్టమైంది. కానీ అవి పూర్తిగా వ్యవసాయ భూములు కావటంతో అంతకంటే ఎక్కువగా తవ్వలేకపోయారు. నగరం విస్తరించిన ప్రాంతంలో ఒక శాతం భూమిలో మాత్రమే తవ్వకాలు జరిపినట్టు అప్పట్లో పరబ్రహ్మశాస్త్రి వెల్లడించారు. దాని ఆధారంగానే తెలంగాణ చరిత్ర మూలాల్లో కొంత స్పష్టత తెచ్చారు. ఇప్పుడు పూర్తిగా దాన్ని తేల్చి చెప్పేందుకు వంద ఎకరాల్లో తవ్వకాలు జరపబోతున్నారు. ఆవలివైపు ఉన్న కర్ణమామిడి ప్రాంతంలో శాతవాహన కాలానికి ముందు చిన్నచిన్న రాజ్యాలుగా పాలన సాగించిన మహాజనపధ-16 కాలాల నాటి నాణేలు పొలాలు దున్నుతుంటే బయటపడ్డాయి. దీంతో అక్కడ కూడా తవ్వకాలు జరిపి తెలంగాణ మూలాల్లో మరింత స్పష్టత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చరిత్రను వెలుగులోకి తెచ్చి చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కించి నేటి, భావి తరాలకు తెలంగాణ మూలాలైపై అవగాహన తెచ్చే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. వారికున్న శ్రద్ధ మనకేదీ? ఆక్స్ఫర్డ్, ప్రిన్స్టన్ వర్సిటీలు గతంలోనే ప్రపంచ చరిత్ర పటాన్ని సమగ్రంగా వెలుగులోకి తెచ్చా యి. 5 వేల ఏళ్ల చరిత్రను ఆలంబనగా చేసుకుని వెల్లడించిన ఆ సమాచారం ప్రకారం.. భార త్లో మూడో వంతు భాగాన్ని 3 శతాబ్దాలపాటు ఏలిన సామ్రాజ్యం శాతవాహన కాలమని పొందుపరిచారు. అలాగే నాగ్‌పూర్ వర్సిటీలో ప్రపంచ చరిత్రకారుల సదస్సు జరిగిన సందర్భంలో 1972లో శాతవాహనుల పాలనాదక్షతను వెల్లడించారు. ప్రపంచంలో రెండు సామ్రాజ్యాల హయాంలో శాంతిసామరస్యాలు గొప్పగా పరిఢవిల్లాయన్నారు. హరప్ప-మొహంజదారో నాగరికత కాలంలో తొలిసారి ఆ తర్వాత శాతవాహనుల కాలంలో రెండోసారి శాంతిసామరస్యాలు వెల్లివిరిశాయని తేల్చి చెప్పారు. ఇంతగొప్ప చరిత్రకు తెలంగాణ గడ్డ సాక్షీభూతంగా నిలిచినా.. ఆ సామ్రాజ్య రాజధాని జాడలను వెలుగులోకి తేవటం లో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పు డు పూర్తిస్థాయిలో తవ్వకాలు జరిపి ఆ మహా సామ్రాజ్య రాజధానిని వెలుగులోకి తెచ్చి, పరిరక్షణ చర్యలు తీసుకుని, పర్యాటకులకు అందుబాటులోకి తె చ్చేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. -
శ్రీజకు రూ.10 లక్షల చెక్కు ఇచ్చిన సీఎం
♦ చిన్నారి ధారణ శక్తికి ముగ్ధుడైన సీఎం కేసీఆర్ ♦ సొంత ఖాతా నుంచి రూ.10 లక్షలు అందజేత ♦ ఇంటికి భోజనానికి వస్తానని హామీ సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలం నాటి స్వర్ణయుగం, శాతవాహనుల పాలనా దక్షత, నిజాం నవాబుల హయాంలోని ప్రగతి, సమైక్య రాష్ట్రం-తెలంగాణ ఉద్యమం.. ఒక్కటేమిటి ఇలా అనేక విషయాలను ఓ చిన్నారి ధారాళంగా చెబుతుంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఎలాంటి భయం లేకుండా మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి సీఎం ముందు అనేక విషయాలను అనర్గళంగా చెప్పింది. ఆ పాప జ్ఞాపకశక్తి, మేధోసంపత్తికి ముగ్ధుడైన సీఎం తన సొంత ఖాతా నుంచి రూ.10 లక్షల పదహార్లు అందజేశారు. బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. ఏదైనా ఓ రోజు భోజనానికి వస్తానని పాప తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అనర్గళంగా చెప్పడంలో దిట్ట ఖమ్మంకు చెందిన కిరణ్‌కుమార్, సుధారాణి దంపతుల కూతురు లక్ష్మీ శ్రీజ.. ఎన్నో విషయాలను గుర్తుంచుకుని తిరిగి చెప్పడంలో దిట్ట. పాప ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తెలంగాణ చరిత్రతో పాటు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించేవారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ముఖ్యమంత్రి పనితీరు, మంత్రుల పేర్లు ఇలా అనేక విషయాలను అలవోకగా శ్రీజ చెప్పేస్తుంది. ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీజ తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలిశారు. ముందుగా చెప్పినవే కాకుండా అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెప్పే తీరును చూసి కేసీఆర్ ఆశ్చర్యపోయారు. -
‘తెలంగాణ ఉద్యమాల చరిత్ర’ గొప్ప ప్రయత్నం
వి.ప్రకాశ్ రచించిన పుస్తక ఆవిర్భావంలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు వి.ప్రకాశ్ రచించిన ‘తెలంగాణ ఉద్యమాల చరిత్ర - రాష్ట్ర ఆవిర్భావం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తక రచన ఒక గొప్ప ప్రయత్నమని, ఇంత సమగ్రంగా తెలంగాణ చరిత్రను ఇంతవరకు ఎవరూ కూడా గ్రంథస్తం చేయలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకాశ్‌ను అభినందించారు. ఈ పుస్తకం చదివితే తెలంగాణ చరిత్ర పరిపూర్ణంగా అవగాహనకు వస్తుందని, ఇది అవశ్య పఠనీయమని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే అనేక పోటీ పరీక్షలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలోని పబ్లిక్ లైబ్రరీలతో పాటు కళాశాలలు, ఉన్నత పాఠశాలల గ్రంథాలయాల్లో కూడా ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచితే మంచిదని అన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రకాశ్ దంపతులను సన్మానించారు. రచయిత ప్రకాశ్ ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులకు అంకితం ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, మంత్రి జగదీశ్రెడ్ది, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నాలుగు భాగాలుగా తెలంగాణ చరిత్ర
* ‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు * ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ * సిలబస్‌ను విభజించుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మేలు * గ్రూప్స్ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు తెలంగాణ కోణం నుంచే.. * తెలంగాణ చరిత్ర, పోరాటాలు, ఉద్యమాలు, సామాజిక అంశాలపై దృష్టిపెట్టాలి * రాజవంశాలు, యుద్ధాలు, వాటి కాలాలకు ప్రాధాన్యం తగ్గించాం * తెలంగాణేతర అంశాలకూ పెద్దగా ప్రాధాన్యం ఉండదు * ప్రిపరేషన్‌కు ప్రామాణిక గ్రంథాలను ఎంచుకోవాలి * తెలుగు అకాడమీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు రాసిన పుస్తకాలైతే ఉత్తమం హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కువగా తెలంగాణ కోణంలోనే ఉండనున్నాయి. గ్రూప్-1, గ్రూప్-2లో తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ఉద ్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు ప్రత్యేకంగా పెట్టిన పేపర్లలోనే కాదు వేరే పోటీ పరీక్షల జనరల్ స్టడీస్, ఇతర పేపర్లలోనూ తెలంగాణ కోణంలో ప్రశ్నలు ఉండనున్నాయి. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, గ్రూప్-3, గ్రూప్-4 వంటి పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష పేపర్లలోనూ తెలంగాణకు సంబంధించిన అంశాలకు పెద్దపీట వేసి ప్రశ్నపత్రాలు రూపొందించే అవకాశం ఉంది. వాటిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ చ రిత్ర, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, నైసర్గిక స్వరూపం, వివిధ పోరాటాలు, ఉద్యమాలు.. ఇలా అన్నింటిపై ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోవాల్సిందే. ఈ క్రమంలో ఏయే పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి.. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.. అన్న అంశాలను టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు, హిస్టరీ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన అవసరం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యే ఉద్యోగులకు తమ ప్రాంతంపై సంపూర్ణ అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగాల్లో చేరి... వచ్చే 20-30 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించే వారికి రాష్ట్ర స్థితిగతులు, భవిష్యత్తు అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి ఉండాలి. గతాన్ని వదిలేయకుండా చరిత్రను తెలుసుకుంటేనే భవిష్యత్తుకు బాటలు వేయగలుగుతారు. అందుకే పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్ర, పోరాటాలు, ఉద్యమాలు, ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులపై ప్రశ్నలు ఉండబోతున్నాయి. ఈ దిశగా అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావాలి. వాటికి ప్రాధాన్యం తగ్గించాం.. అకడమిక్, పోటీ పరీక్షల మధ్య మౌలికమైన తేడా ఉంటుంది. అక్కడ పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలే అడుగుతారు. కానీ పోటీ పరీక్షల్లో పాఠ్య పుస్తకాల్లోని అంశాలతో పాటు సామాజిక, చారిత్రకాంశాలపై అవగాహన ఉండాలి. అందుకే హిస్టరీ అనగానే బీఏలో (డిగ్రీ) హిస్టరీ చదువుకున్న వారికే సులభం అనే అపోహ అక్కర్లేదు. ఆర్ట్స్, సైన్స్, టెక్నికల్, వృత్తి విద్యా కోర్సులు.. ఇలా అన్ని రకాల కోర్సులు చేసినవారికీ తగ్గట్టుగా అందరూ చదువుకునేలా సిలబస్‌ను రూపొందించాం. ఇందులో ప్రధానంగా రాజకీయాలు, రాజ వంశాలు, యుద్ధాలు, వాటి తేదీల (కాలం) ప్రాధాన్యాన్ని చాలా వర కు తగ్గించాం. ఉదాహరణకు శాతవాహనుల కాలం తీసుకుంటే వారి పరిపాలన క్రమం (తేదీలు), రాజుల వంశ క్రమంపై చరిత్రకారుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి వాటికి ప్రాధాన్యం తగ్గించాం. ఇలా విభజించుకోండి.. తెలంగాణకు సంబంధించిన సిలబస్‌ను అర్థం చేసుకునేందుకు నాలుగు భాగాలుగా విభజించుకొని సిద్ధమైతే ఉపయోగంగా ఉంటుంది. 1. ప్రాచీన తెలంగాణ చరిత్ర-సంస్కృతి 2. మధ్యయుగ తెలంగాణ చరిత్ర 3. ఆధునిక తెలంగాణ చరిత్ర 4. సమకాలీన తెలంగాణ చరిత్ర(1948-2014)గా సిలబస్‌ను విభజించుకోవాలి. ప్రాచీన తెలంగాణ చరిత్ర ఇందులో శాతవాహనుల నుంచి చాళుక్య యుగం వరకు ఉంటుంది. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు శాతవాహనుల కాలానికి సంబంధించి తేదీలు, రాజ వంశీయుల క్రమంపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటిపై చరిత్రకారులు ఒకరకంగా రాస్తే శాసనాల్లో మరో రకంగా ఉంది. కానీ ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వర్తక వ్యాపారాలు, సాహిత్య వికాసం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తే ఉపయోగం. తెలంగాణ మధ్యయుగ చరిత్ర ఇందులో కాకతీయ, పద్మనాభ, కుతుబ్‌షాహీల వరకు చరిత్ర ఉంటుంది ఇందులో ఆనాటి సామాజిక, వర్తక, వాణిజ్య అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రజా సంక్షేమం, విద్యా రంగం వంటి అంశాలను చదువుకోవాలి. ముఖ్యంగా నాటి నీటిపారుదల వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ఆధునిక తెలంగాణ చరిత్ర ఇందులో అసఫ్‌జాహీల కాలం నుంచి ఉంటుంది. 1724 నుంచి 1948 వరకు జరిగిన అన్ని చారిత్రక అంశాలు ఉంటాయి. ముఖ్యంగా నిజాం కాలం నాటి సంస్కరణలు, వ్యవసాయ రంగంలో భూమిశిస్తు విధానం, విద్యారంగం, రోడ్డు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అసఫ్‌జాహీల కాలంనాటి సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు.. ప్రధానంగా ఆర్య సమాజ్, ఆది హిందూ ఉద్యమాలు, ఆంధ్ర మహాసభ నిర్వహించిన రాజకీయ ఉద్యమాలు, వందేమాతరం ఉద్యమం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన రాజకీయ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటంపై దృష్టి పెట్టాలి. తెలంగాణ ఆదివాసీల సమస్యలు.. ఆదివాసీ ఉద్యమాలు, ఆంధ్ర మహిళా సభ నిర్వహించిన మహిళా ఉద్యమాలు కూడా కీలకాంశాలే. సమకాలీన తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు.. రాష్ట్ర అవతరణ క్రమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. గ్రూప్-1లో ఆరో పేపరు, గ్రూప్-2లో నాలుగో పేపరు దీనిపైనే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని చదువుకునే క్రమంలో అభ్యర్థులు అకడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అర్థం చేసుకోవాలి. ఉద్యమ క్రమాన్ని భావోద్వేగాలతో కూడిన ధోరణిలో చదవొద్దు. ఇందులో ఉద్యమానికి దోహదం చేసిన సామాజిక, ఆర్థిక కారణాలు, అస్తిత్వ పోరాటం, ఆకాంక్షల కోసం వివిధ సంస్థలు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాయన్న కోణంలో చదువుకోవాలి. 1952లో మొదటిసారిగా జరిగిన ముల్కీ ఉద్యమం.. 1969-70లో వచ్చిన జైఆంధ్ర ఉద్యమం, 1990వ దశకంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేసిన రాజకీయ, రాజకీయేతర , పౌరసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, మేధావి వర్గాలు స్థాపించిన సంస్థలు, సంఘాలు, వాటి పాత్రను పరిగణనలోకి తీసుకోవాలి. మలిదశ ఉద్యమం..: 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన తర్వాత జరిగిన వివిధ ఘట్టాలను మలిదశ ఉద్యమంలోకి తీసుకోవాలి. ఇందులో వివిధ పార్టీలు, సం ఘాలు, ఉద్యోగులు, కళాకారులు తెలంగాణ ఉద్యమాన్ని సమష్టి ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లిన క్రమాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజా ఉద్యమంగా మారిన తీరు.. అందులో వివిధ పక్షాల పాత్ర తెలుసుకోవాలి. ఈ సిలబస్‌లో ఏ ఒక్క రాజకీయ పార్టీ, వాటి భావజాలం ప్రధానం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడిన అందరి పాత్ర గురించి ఉంటుంది. ఇందులో ఉద్యమం కొనసాగిన తీరు, వివిధ సంఘాలు, మేధావులు, ఉద్యోగులు, రాజకీయేతర సంఘాలు, సంస్థలపైనా ప్రశ్నలు ఉంటాయి. మరిన్ని ప్రధాన అంశాలు ప్రాచీన చరిత్ర నుంచి సమకాలీన చరిత్ర వరకు అన్నింటిలో సాంస్కృతిక వికాసం, సామాజిక ఆర్థిక వ్యవస్థ, వాస్తు శిల్పం, కళలు, సాహిత్య వికాసం వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. వివిధ కాలాల్లో విశిష్ట అంశాల గురించి ప్రత్యేకంగా చదువుకోవాలి. ⇒ ఉదాహరణకు నీటిపారుదల వ్యవస్థ తీసుకుంటే కాకతీయుల కాలంలో ప్రారంభమై అసఫ్‌జాహీల కాలం వరకు వికాసం పొందిన తీరు తెన్నులు. ⇒ శాతవాహనుల నుంచి కుతుబ్‌షాహీల వరకు జరిగిన సాహిత్య వికాసం. ప్రముఖ కవులు, రచయితలు, గ్రంథాలపై అవగాహన అవసరం. ఉదాహరణకు బమ్మెర పోతన, పండిత రాజ చరిత్రం వంటివి. ⇒ కుతుబ్‌షాహీల కాలంలో సాహితీవేత్తలు, వారి రచనలపై అవగాహన పెంచుకోవాలి. కుతుబ్షాహీలతోపాటు అసఫ్‌జాహీల కాలంనాటి ప్రముఖ కట్టడాలు, వారు ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా సంస్కరణలు. ఉదాహర ణకు వర్తక, వ్యాపార అభివృద్ధి, గోల్కొండను సందర్శించిన విదేశీ వర్తకులు, వారి కాలంలో జరిగిన ఆర్థిక వికాసం, పారిశ్రామిక విధానం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. శాతవాహనుల రాజధాని కోటిలింగాల నాలుగు భాగాలుగా తెలంగాణ చరిత్రహనుమంతరావు రాసిన పుస్తకంలో శాతవాహనుల తొలి రాజధాని కృష్ణా జిల్లా శ్రీకాకుళం అని ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ చరిత్రకారులు రాసిన అలాంటి అంశాలను మార్చుతున్నార . దేశ చరిత్రలో భాగంగా ఏపీ అంశాలు తెలంగాణలో తెలంగాణేతర అంశాలకు ప్రాధాన్యం తక్కువ. ఇందులో విజయనగర చరిత్ర ఉండదు. అయితే భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ఏపీ చరిత్ర, సంస్కృతి, అక్కడి సంఘ సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలు ఉంటాయి. అభ్యర్థులు ఈ విషయాలను గమనించాలి. పోటీ పరీక్షను బట్టి కొన్ని ఆబ్జెక్టివ్ విధానంలో, మరికొన్ని డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అందుకే ప్రైవేటు పబ్లిషర్లు రూపొందించే ప్రశ్నల నిధిపైనే ఆధారపడవద్దు. దానివల్ల సబ్జెక్టుపై అవగాహన రాదు. అందుకే అభ్యర్థులు ప్రామాణిక గ్రంథాల ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రామాణిక గ్రంథాలుగా వేటిని తీసుకోవాలి? పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే క్రమంలో అభ్యర్థులు ప్రామాణిక గ్రంథాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలుగు అకాడమీ పుస్తకాలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు రాసినవి, బీఎన్ శాస్త్రి వంటి వారి రచనలు, ప్రభుత్వ సంస్థలు ప్రచురించినవి ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగనీ ప్రైవేటు రచనలను పట్టించుకోవద్దని కాదు. సాధ్యమైనంతవరకు ప్రభుత్వ పుస్తకాలను తీసుకుంటే మంచింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రచురించినవి ఉన్నాయి. తెలుగు అకాడమీ నుంచి తెలంగాణ చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం పుస్తకాలు రాబోతున్నాయి. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర-సంస్కృతి పుస్తకంలోని అంశాలను తీసుకోవచ్చు. అందులో తెలంగాణ చరిత్ర, సంస్కృతి అంశాలు ఉన్నాయి. ఏపీ కాంగ్రెస్ ప్రచురించిన సమగ్ర ఆంధ్ర దేశ చరిత్ర-సమస్యలు గ్రంథాన్ని చదువుకోవచ్చు. ఇలాంటి వాటి ఆధారంగానే నోట్స్ సిద్ధం చేసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ముద్రణలు, కొన్ని సందర్భాల్లో ప్రైవేటు ముద్రణలు ప్రామాణికం అవుతాయి. విషయ వాస్తవికతను బట్టి ఎంచుకోవాలి. హైదరాబాద్ బుక్ ట్రస్టు, విశాలాంధ్ర, ప్రజాశక్తి ప్రచురణల్లో తెలంగాణ అంశాలు బాగానే ఉన్నాయి. -
ప్రణాళికతో చదివితే విజయమే...
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తోంది... చరిత్ర, సంస్కృతిని సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ, ప్రణాళికతో చదివితే విజయాలు సాధించడం సులభం.’ అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, చరిత్ర పరిశోధకులు జి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. ‘సాక్షి- భవిత’ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. నిరుద్యోగులు, విద్యార్థులు భారీ సంఖ్యలో సదస్సుకు తరలివచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్‌తో పాటు కరీంనగర్ జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు వివిధ సబ్జెక్ట్‌లలో నిష్ణాతులైన ఉపన్యాసకుల ప్రసంగాలు ఓపికగా విన్నారు. అనంతరం ఆ సబ్జెక్టులపై అభ్యర్థులు తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ప్రొఫెసర్ సుదర్శన్‌రెడ్డితోపాటు నిజామాబాద్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ వి.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ తొంటి దేవన్న, అర్థశాస్త్ర నిపుణులు డాక్టర్ ఎస్. భూమన్నయాదవ్ పలు సూచనలు చేశారు. శాతవాహనుల కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాకా ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలని ప్రొఫెసర్ సుదర్శన్‌రెడ్డి వివరించారు. శాతవాహనుల కాలంలో సామాజిక, సాంస్కృతిక అంశాలను గురించి తెలుసుకోవాలన్నారు. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక తెలంగాణపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, వెచర్ల వంశస్తులు, కుతుబ్‌షాహీలు, నిజాం, రజాకార్ల పాలన నుంచి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు, ముగింపు వరకు పూర్తి వివరాలను అధ్యయనం చేయాలన్నారు. ముఖ్యంగా సామాజిక నిర్మాణాలు, కులమతాలు, చిత్రలేఖనం, నాట్యాలు, వాస్తుకళా నిర్మాణం, స్త్రీల స్థానం, తెలుగు భాష, కవులు, జమీందారీ వ్యవస్థ, అణచివేతలు, తిరుగుబాట్ల గురించి చదవాలన్నారు. 1948 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు రెండో పేపర్లో ఉంటుందని వివరిస్తూ మిలిటరీ రూల్, పోలీస్ చర్య, తెలంగాణ సాయుధ రైతాంగ పోరు, ఏపీ ఏర్పాటు, పెద్దమనుషుల ఒప్పందంతోనే మొదలైన ఉల్లంఘనలు, కమిషన్లు, 1969 నాటి చరిత్రాత్మక పోరాటం, నక్సలైట్ల ఉద్యమం, మలిదశలో తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజాఫంట్, టీఆర్ఎస్, జేఏసీల ఉద్యమాలను అధ్యయనం చేయాలని సూచించారు. అపజయాలతో కుంగిపోవద్దు గ్రూప్స్ సాధించాలన్న పట్టుదలతో చదవాలి. ఒక్కోసారి అపజయాలు ఎదురైతే కుంగిపోకుండా మరింత పట్టుద ల, కసితో చదవాలి. మన ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాల నియామకాల కోసం గ్రూప్స్ పరీక్షలు నిర్వహించనుంది. ఇప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలి.. స్నేహితులతో చర్చించుకోవాలి. లక్ష్యసాధ న కోసం కృషి చేస్తే తప్పక విజయం వరిస్తుంది. - వి.వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రణాళికాబద్ధంగా చదవాలి పతీ అభ్యర్థి ప్రణాళిక రూపొందించుకుని ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. అర్థశాస్త్ర అవగాహన పెంపొందించుకోవడం అవసరం. ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి అన్న అంశాల నుంచి జీఎన్‌పీ, జీడీపీల దాకా అధ్యయనం చేయాలి. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చదవాలి. - డాక్టర్ ఎస్. భూమన్న యాదవ్, ఆర్థిక శాస్త్ర నిపుణులు చరిత్రపై పట్టు సాధించాలి చరిత్రపై పట్టు సాధించకుండా గ్రూప్స్‌లో విజయం సాధించలేరు. చరిత్ర గొలుసులాంటిది. చరిత్రలో ఒకదానికి మరొకదానికి సంబంధం ఉంటుంది. చరిత్రను అధ్యయనం చేయడం అంటే ఇబ్బంది అన్న భావనను తొల గించుకుని చదివితే అందరికీ సులువే. పోటీ పరీక్షలకు చరిత్రను గుర్తు పెట్టుకోవడం చాలా తప్పనిసరి. - తొంటి దేవన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలి ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవడం ద్వారా విజయాలను సొంతం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నందున లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగాలి. గ్రూప్స్‌కు సంబంధించి జనరల్ స్టడీస్ సమాచారం ఎక్కువగా పత్రికల్లోనే ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పత్రికలు చదివే అలవాటు ఉండటం వల్లే గ్రూప్-1 ద్వారా డీఎస్పీ ఉద్యోగం సంపాదించా. తెలుగు మీడియంలోనే చదివి, తెలుగు మీడియంలోనే పరీక్ష రాసి విజయం సాధించాను. ‘సాక్షి’ చేపట్టిన కార్యక్రమం అభినందనీయం. - చంద్రశేఖర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎస్పీ -
తెలంగాణ చరిత్రకే పెద్దపీట
చరిత్రపై పట్టుతోనే విజయం సాధ్యం - ఉద్యమంలో ఉన్నవారే సిలబస్ కమిటీ మెంబర్లు - గ్రూప్స్‌పై అవగాహన సదస్సులో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య - ‘సాక్షి’ కృషి అభినందనీయం సిద్దిపేట రూరల్/ సిద్దిపేట టౌన్/ సిద్దిపేట జోన్: సిలబస్ ఎంపికలో తెలంగాణ చరిత్రపైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందని, పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్రకు ప్రాముఖ్యత ఉంటుందని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులైన 32మంది మేధావులతో కమిటీ వేసి, తెలంగాణ చరిత్ర సిలబస్‌ను మదింపు చేసినట్లు ఆయన తెలిపారు. రాబోయే గ్రూప్స్ పరీక్షలలో విశ్లేషణాత్మక విషయాలపై ప్రశ్నలు రావచ్చని రామయ్య వివరించారు. మంగళవారం మెదక్‌జిల్లా సిద్దిపేటలో ‘సాక్షి’ భవిత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కొన్నేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగం సాధించాలంటే ఎన్నో అవరోధాలు అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాగం ద్వారా ప్రజలకు సేవ చేయడం అదృష్టమన్నారు. ఉద్యోగాన్ని సాధించాలంటే పట్టుదల ఎంతో ముఖ్యమని చెప్పారు. గ్రూప్స్‌లో విజయం సాధించాలంటే తెలంగాణ చరిత్రను ఔపోసన పట్టాలన్నారు. గ్రూప్స్ కోసం సిద్ధం అయ్యే అభ్యర్థులు ముందుగా తమ నడవడికను సరిచేసుకోవాలని సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు నా రాష్ట్రం, నా ఊరు అనే పద్ధతిలో పని చేయాలన్నారు. ఎలాంటి ఉద్యోగం అయినా అవకాశం అందిపుచ్చుకోవడమే ముఖ్యమన్నారు. పరీక్ష సిలబస్‌లో ఎక్కువ మార్పులు చేయొద్దని తమ కమిటీ ప్రభుత్వానికి సూచిందన్నారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా రాబోయే రోజుల్లో దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. సెల్ఫోన్లో సమస్య చెబితే స్పందించే కొత్త తరం రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. అమెరికా లాంటి దేశాలల్లో జరుగుతున్న పని విధానాన్ని ఇక్కడ అవలంబిస్తే తిరుగులేని ఫలితాలు పొందుతామన్నారు. ఇదంతా టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే సాధ్యమవుతుందని వివరించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం సాక్షి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది సైమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్ అన్నారు. ఎన్నో కలలతో పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగబోయే మొట్టమొదటి గ్రూప్ పరీక్షపై యావత్ తెలంగాణ సమాజం దృష్టి సారించిందన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ ముందుకు సాగాలన్నారు. తెలంగాణ చరిత్రను పూర్తిగా అవగాహన చేసుకుని గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన పరీక్షలకు నేడు జరగనున్న పరీక్షలకు వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. కేవలం తెలంగాణ చరిత్రను అవగాహన చేసుకున్న వారికి మాత్రమే విజయం సులువవుతుందని ప్రకాష్ తెలిపారు. వాటిపై పట్టు సాధిస్తేనే.. గ్రూప్స్ పరీక్షల్లో కరెంట్ ఎఫైర్స్ సబ్జెక్ట్ ఎంతో కీలకమైందని దాన్ని నేర్చుకోవాలనే తపన అభ్యర్థుల్లో ఉండాలని కరెంట్ ఎఫైర్స్ నిఫుణులు కుమార్ అన్నారు. పరీక్షకు సన్నద్ధం అయ్యే దశలో ఒక్కో అంశంపై లోతుగా పరిశీలన చేసినప్పుడు విజయం సాధ్యమన్నారు. అలాగే ప్రతి సబ్జెక్ట్‌పై విశ్లేషణ చేసుకోవాలన్నారు. నిరంతరం జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రచార సాధనాల ద్వారా గమనించాలన్నారు. పరీక్షలో వచ్చే ప్రశ్నలు విభిన్న రకాలుగా ఉంటాయని వాటిని జాగ్రత్తగా పరిశీలించి సమాధానం ఇవ్వాలన్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అనే అంశాలపై పట్టు సాధిస్తే అరవై శాతం విజయం సాధించినట్లేనని చెప్పారు. కార్యక్రమంలో సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. -
గ్రూప్స్ సిలబస్‌పై ఆందోళన వద్దు
అభ్యర్థులకు సుంకిరెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: ‘సీమాంధ్రుల పాలనలో తెలంగాణ చరిత్ర పూర్తిగా మరుగున పడిపోయింది. తెలంగాణ చరిత్రను వక్రీకరించి సీమాంధ్రుల పాలనను చరిత్రలో అక్రమంగా చొప్పించారు. దాన్ని పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టి ఇంతకాలం విద్యార్థులతో బలవంతంగా చదివించారు. ఇప్పుడిక ఆ అవసరం లేదు. సీమాంధ్రులు రాసిన ఆంధ్రుల చరిత్రతో తెలంగాణ అభ్యర్థులకు ఇక పన్లేదు. మన చరిత్రను మనమే మన పాఠ్యాంశాల్లో పొందుపర్చుకుని చదువుకునే సమయం వచ్చింది’ అని ప్రముఖ రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఆయన ఆదివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. ‘‘తెలంగాణ చరిత్రపై ఇప్పటికే అనేక పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఏది పడితే అది చదివి మోసపోవద్దు. ఒకరు చేసిన తప్పలను మిగతా వారు అనుసరించడం వల్ల వాటిలో అనేక తప్పులు దొర్లాయి. దీనిపై మేం పలువురు తెలంగాణ నిపుణులతో చర్చించాం. శాసనాలు, గ్రంథాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాం. వాస్తవాలను ప్రామాణికంగా తీసుకుని ‘తెలంగాణ చరిత్ర-క్రీస్తుపూర్వం నుంచి 1948 వరకు’ పుస్తకాన్ని ముద్రించాం. ఇది గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణ చుట్టూ విస్తరించి ఉన్న సామ్రాజ్యాలు, సామంత రాజులు తదితరాలను కూడా అధ్యయనం చేయాలి. తెలంగాణ చరిత్రనే తెలంగాణ అభ్యర్థులు ప్రమాణికంగా తీసుకోవాలి. ప్రశ్నలు జవాబుల కోణంలో కాకుండా తెలంగాణ చరిత్రను సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. చరిత్ర పట్ల ఆసక్తి, మమకారముంటేనే ఇది సాధ్యం. పేపర్లను దిద్దేదీ తెలంగాణ నిపుణులే. కాబట్టి తెలంగాణ చారిత్రక నేపథ్యంపై పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు నిర్భయంగా జవాబు రాయవచ్చు’’ అని వివరించారు. -
అమర వీరులకు చోటేది?
- ఉద్యమ వీరుల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్ర పాఠాలు - ‘తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం’లో ప్రస్తావించని వైనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థుల పోరాటక్రమం లేకుండానే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై విద్యార్థులకు పాఠాలు రూపొందాయి. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల ప్రస్తావన లేకుండా ఉద్యమ చరిత్రను లిఖించారు. దీంతో ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థులను విస్మరించి తెలంగాణ ఉద్యమ క్రమాన్ని భావి పౌరులకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం’ పేరుతో ప్రవేశపెట్టిన పాఠ్యాంశం చర్చనీయాంశమైంది. ఇందులో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి, పార్లమెంటు వద్ద బలిదానం చేసుకున్న యాదిరెడ్డి, ఉస్మానియా క్యాంపస్‌లో ప్రాణాలు వదిలిన ఇషాంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, నిజామాబాద్‌లో కాల్చుకుని చనిపోయిన కానిస్టేబుల్ కిష్టయ్య వంటి అమరుల ప్రస్తావన లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని వివరించారు. ఈ అమరులకు పదో తరగతి చరిత్ర పుస్తకంలో చోటు లేకుండా చేశారు. అంతేకాదు, తెలంగాణ సిద్ధాంతకర్తగా అంతా ఆరాధించే ప్రొఫెసర్ జయశంకర్, తన ఇంటినే(జలదృశ్యం) టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేదికగా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి అనేక మంది ఉద్యమ నేతలకూ ‘చరిత్ర పుస్తకం’లో చోటు కల్పించలేదు. అయితే 9వ తరగతి తెలుగు ఉపవాచకంలో మాత్రం నాలుగో పాఠంగా జయశంకర్ పేరుతో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో ఆయన పాత్రను వివరించారు. ఇక అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లో రాష్ట్ర గేయం లేకుండానే ముద్రించారు. మలి దశలో బలిదానాలెన్ని? విద్యార్థుల బలిదానాల విషయంలోనూ సరైన వివరాలను పొందుపరచక పోవడం గమనార్హం. మలి దశ(2009 నుంచి) ఉద్యమంలో ఎంత మంది విద్యార్థులు చనిపోయారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. నిజానికి తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యయనంలో 1,080 మంది చనిపోయినట్లు తేలింది. అయితే మలిదశలో బలిదానాల సంఖ్యను మాత్రం పదో తరగతి పాఠ్యాంశంలో ఎక్కడా చెప్పలేదు. వందల మంది చనిపోయారన్న విషయాన్ని పేర్కొంటూ ముగించేశారు. 8వ తరగతి తెలుగు వాచకంలో మాత్రం 1969 ఉద ్యమంలో తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా యువకులు, విద్యార్థులు ఉద్యమం చేశారని, అందులో 360 మందికి పైగా చనిపోయారని పేర్కొంటూ ‘అమరులు’ పేరుతో 9వ పాఠంగా పద్య, గద్య రూపంలో చేర్చారు. పాఠ్యాంశంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పాఠంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్రస్తావన ఉంది. 2009లో టీఆర్ఎస్ అధ్యక్షునిగా కె.చంద్రశేఖర్‌రావు నిరాహార దీక్షతోనే విద్యార్థులు ఉస్మానియా సహా అన్ని యూనివర్సిటీల్లో ఐక్య కార్యాచరణ సమితులుగా ఏర్పడ్డారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఉద్యమ తీవ్రత, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన, తర్వాత దాని ఉపసంహరణ వంటి అంశాలను వివరించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు పొలిటికల్ జేఏసీ ఏర్పాటు, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వారి కృషిని పాఠంలో ఎక్కడా వివరించలేదు. -
రెడ్డి రాజులు అన్నం పెడితే.. ఆంధ్ర రాజులు ఆగం చేసిండ్రు
* తెలంగాణ చరిత్ర పట్ల సమైక్య పాలకులు వివక్ష చూపారు * చెరువుల్లో గుండ్లు ముంచి ఇక్కడి ప్రజలకు గుండ్లు కొట్టించారు * నల్లగొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ * నకిరేకల్ మండలం చందుపట్ల ‘మిషన్’ పనుల్లో మట్టి ఎత్తిపోసిన సీఎం * బోర్ల రాంరెడ్డి కుమారుడి వివాహానికి హాజరు * అక్కడ రైతులతో కలసి భోజనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘ప్రతాపరుద్రుడి నుంచి రుద్రమదేవి వరకు 11వ శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్‌షెడ్ గురించి చెప్పిన రాచరిక చరిత్ర మనది. 900 ఏళ్ల క్రితమే కాకతీయ రెడ్డి రాజులు వర్రెలు, వంకలు, డొంకల్ల నీళ్లు ఆపుకొని భూగోళానికి పాఠాలు నేర్పిన ఘనత వహించిన రాజులు మన వాళ్లు. ఆ రాజులు తెలంగాణకు అన్నం పెడితే ఆంధ్ర రాజులు ఆగం చేసిండ్రు. అందుకే ఆ రాజుల్ని తలచుకుని వాళ్లకే దండం పెడితే బర్కత్ ఉంటుందని చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ చేపట్టినం.’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని చెరువు పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చెరువు మట్టిని తవ్వి తట్ట ఎత్తి మట్టి పోశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, ఈ చందుపట్ల చెరువులో గుండ్లు ఉండేవని, ఇప్పుడు ఆ గుండ్లు కన బడట్లేదని చెప్పారు. పశువులు కాసే పిల్లలకు వర్షం వచ్చినప్పుడు ఆ గుండే తలదాచుకునేందుకు అవకాశమిచ్చేదని, కానీ సమైక్య పాలనలో గుండ్లను ముంచి తెలంగాణ ప్రజలకు గుండ్లు కొట్టారని విమర్శించారు. 1974లో బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణకు 175 టీఎంసీల గోదావరి, 93 టీఎంసీల కృష్ణా నీటిపై హక్కులిచ్చారని, కాకతీయుల నుంచి ఆసిఫ్‌జాహి నిజాంల వరకు అంత సామర్థ్యమున్న చెరువులను నిర్మించారు కాబట్టే ఆ మేరకు తెలంగాణకు హక్కులు వచ్చాయని అన్నారు. ‘ఈ 265 టీఎంసీల నీరు, తెలంగాణలోని 46 వేల చెరువుల్లో ఉంటే తెలంగాణకు కరువొస్తదా?’ అని కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ చరిత్ర పట్ల వివక్ష చూపారని ఆయన ఆరోపించారు. ‘కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవికి సేనాధిపతిగా పనిచేసిన మల్లిఖార్జున నాయుడుది చందుపట్ల గ్రామం. కాయస్తా అంబయ్య అనే రాజుతో యుద్ధం చేసి తన రక్తాన్ని రాణి రుద్రమ ధారపోసింది కూడా ఇక్కడే. దాని గుర్తుగానే ఇక్కడ శిలాశాసనం కూడా ఉంది. ఆ తర్వాత విగ్రహం కూడా బయటపడింది. ఇంత గొప్ప ప్రదేశాన్ని వెలుగులోనికి రానీయలె. అంత మరుగున పడిపోయింది మన చరిత్ర.’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చందుపట్ల చెరువుకు ఇప్పటికే మంజూరు చేసిన రూ.55 లక్షలకు తోడు మరో కోటిన్నర కలిపి మొత్తం రెండు కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. మళ్లీ తాను వచ్చినప్పుడు ఈ చెరువు బ్రహ్మాండంగా ఉంటే మరో రూ. 5 కోట్లు నకిరేకల్ నియోజకవర్గానికి బహుమతి ప్రకటిస్తానని చెప్పారు. అంతకుముందు నల్లగొండ పట్టణంలో రైతు బోర్లరాంరెడ్డి కుమారుడు కృష్ణారెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అక్కడ కొంత మంది రైతులతో కలసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్న కేసీఆర్ వ్యవసాయంపై కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ అక్కలెక్కుండాలె చందుపట్ల చెరువుకు ఎక్కువ నిధులు మంజూరు చేస్తున్నానని ముఖ్యమంత్రి చెబుతుండగానే ఓ మహిళ ఆ డబ్బులిస్తే నీళ్లే ములుపుతం అని గట్టిగా అరిచింది. దీన్ని గమనించిన కేసీఆర్ ‘అగో ఆ అక్కలెక్కుండాలె అందరు. అసుంటోళ్లు ఊరికి ఇద్దరుంటె ఏడికిపోయిన గెలిచొస్తా. ఇప్పుడు తెలంగాణకు తెగువ కావాలె. ఆడబిడ్డలు పిడికిలి ఎత్తితేనే మనకు న్యాయం జరుగతది.’అని అన్నారు. ఆమెను స్టేజిపైకి పిలిపించి ఆమెతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పర్యటనలో విద్యుత్ శాఖ మంత్రి జి,జగదీశ్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గ్యాదరి కిశోర్, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరే శం, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్. బాలూనాయక్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, వేనేపల్లి చందర్రావు, మాజీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ మార్కు ట్రీట్మెంట్ చందుపట్ల సభలో ప్రసంగం ప్రారంభించగానే ఓ వ్యక్తి ఈలలు వేసి కేకలు పెట్టడాన్ని గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చారు. భానుచందర్ అనే ఆ వ్యక్తినుద్దేశించి మాట్లాడుతూ ‘ ఏ ఆగవయ్.. నీలొల్లి పాడువడ. పొద్దుయినంక కావాలె. అప్పుడే షెడిపోయినవా నువ్వు. ఏ ఆయన్ని ఈడకు పంపురి. ఆయన నా పాత దోస్తు. రానీయండి ఆయన్ను. నా దోస్తు ఇప్పుడు నాతో మాట్లాడడం లేదనుకున్నడేమో.. ఈ పోలీసులేమో రానీయరాయె. రానీయండి. ’ అని స్టేజి మీదకు పిలిపించారు. ఆయనను ఏమీ అనకుండా కూర్చోబెట్టాలని చెప్పారు. -
'తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను చేర్చాల్సిందే'
-
చంద్రబాబూ! చరిత్రలో లేకుండా పోతావ్: కవిత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్రకు ఎక్కడా చోటు కల్పించకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని, వీరోచిత తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెడితే, చరిత్రలో లేకుండా పోతారని నిజామాబాద్ ఎంపీ కవిత హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు, పలువురు కార్యకర్తలు ఆ పార్టీలను వీడి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై అనేకమంది టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదుకు స్పందన బాగుందని, సినీ హీరో ఆకాశ్ కూడా పార్టీలో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పద్మారావుగౌడ్, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. -
చరిత్రను వెలికి తీయాలి
మంత్రి అజ్మీరా చందూలాల్ కేయూ క్యాంపస్ : సమైకాంధ్ర పాలనలో మరుగునపడిన తెలంగాణ చరిత్రను వెలికి తీయాల్సిన అవసరం ఉందనిమంత్రి ఆజ్మీరాచందులాల్ కోరారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ, అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో 35వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధించుకునే దిశగా సీఎం కేసీఆర్ అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతున్నారన్నారు. చరిత్ర పరిశోధించి అనేక రకాలచరిత్ర సంస్కృతులను కాపాడుకోవాలన్నారు. మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీర సీతారంనాయక్ మాట్లాడుతూ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించటం అభినందనీయమన్నారు. జిల్లాలో 61 టూరిజం ప్లేస్లున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఓ మూజియంను కూడా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఐసీహెచ్ఆర్ చైర్మన్ ప్రొఫెసర్ సుదర్శన్‌రావు, కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవి రంగారావు, సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ అయాబ్అలీఖాన్, జనరల్ ప్రసిడెంట్ ఆర్ మిశ్రా, ప్రొఫెసర్ వి కిషన్‌రావు, లోకల్ సెక్రటరీ కేయూ హిస్టరీ విభాగం అధిపతి డాక్టర్ పి.సదానందం మాట్లాడారు. హిస్టరీ కాంగ్రెస్ ప్రొసీడింగ్స్ సీడీలను ఆవిష్కరించారు. తుంకూరు యూనివర్సిటీమాజీ వీసీ ప్రొఫెసర్ అనంతరామయ్య, మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జగదీశం, చంద్రబాబు, గౌతమ్, కేరళ యూనివర్సిటీ ప్రొఫెసర్శోభనం, మదురై యూనివర్సిటీ ప్రొఫెసర్ డేనియల్, డాక్టర్ అబ్బాస్ కేయూ హిస్టరీ విభాగం ప్రొఫెసర్టి దయాకర్‌రావు, ప్రొఫెసర్ టి విజయబాబు,ప్రొఫెసర్ శ్రీనాధ్,డాక్టర్ టిమనోహర్ ,పరిశోధకులు వివిధ చోట్లనుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
బూడిద రాశులు..బండరాళ్ల సమాధులు..
మానవుడు భూమిపై తిరగడం మొదలుపెట్టి దాదాపు ఐదు లక్షల సంవత్సరాలైంది. అప్పట్లో ఆది మానవుడు చెట్లపైన, రాతిగుహల్లోనూ నివసించేవాడు. ప్రకృతిలో లభించిన కాయాకసరూ.. వేరూదుంపా తినేవాడు. లేదంటే జంతువులను వేటాడి వాటి మాంసం తినేవాడు. తలదాచుకునేందుకు ఇళ్లు, కట్టుకునేందుకు బట్టలు లేవు. వ్యవసాయం అంటే ఏమిటో తెలీదు. ఆధునిక మానవుడి వరకు నాటి నుంచి నేటి వరకు గడచిన ఇన్నేళ్లలో ఆది మానవుడు ఎన్నో ఆపదలను ఎదుర్కొన్నాడు. భయంకరమైన ప్రకృతి ప్రళయాలను చవిచూశాడు. అయినా రోజురోజుకూ శారీరకంగా, మానసికంగా ఎదుగుతూ రాయీరప్పను మలచి అనేక ఆయుధాలను తయారు చేసుకున్నాడు. ప్రకృతితో, జంతువులతో పోరాడి చివరకు విజేతగా నిలిచాడు. అప్పటి ఆది మానవుడు నేటి ఆధునిక మానవుడయ్యాడు. మానవ జాతి పరిణామక్రమాన్ని ఒక గంట వ్యవధిగల సినిమా తీస్తే అందులో 59 నిమిషాలు మనిషి ఆదిమ దశ నుంచి పైకి ఎగబాకడానికి సంబంధించిన పరిణామాలకే సరిపోతుంది. మిగిలిన నాగరిక జీవితం అంతా ఒక నిమిషంలో గడచిపోతుంది. తెలంగాణ-మానవుడి ఆనవాళ్లు ఆది మానవుడి ఆనవాళ్లు కలిగిన అతి ప్రాచీన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఆది మానవుడి ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తాయి. ఒకప్పటి తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం. దక్కన్ పీఠభూమిలోని తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన, వేటాడటానికి సంబంధించి గీసిన చిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. వీటి గురించి విశ్లేషించుకోవడం అంటే మన గతాన్ని తవ్వుకోవడమే! మన పూర్వీకులను మనం వెదుక్కోవడమే. దశలవారీగా.. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని గమనిస్తే తొలి మానవుడి కదలికలు మూడు దశలుగా కనిపిస్తున్నాయి.పాత రాతియుగంలో నివసించిన మానవుడిని మెగాలిత్ మానవుడని అంటారు. ఈ మానవుడు రాతపూర్వకంగా మనకు మిగిల్చిన ఆనవాళ్లేమీ లేవు. కానీ ఆ కాలపు ఆయుధాలు, ఎముకలు, ఆభరణాలు, బొమ్మలు, చిత్రాలు (గుహల్లో గీచినవి) మాత్రం అప్పటి ఆది మానవుడి జీవనానికి సాక్షీభూతాలుగా నేటికీ నిలిచి ఉన్నాయి. వీటన్నింటినీ వెలికితీసి మనకు అందించిన ఆంగ్లేయుడు, చరిత్ర పూర్వయుగ పితామహుడు(Father of Pre Historical Period in India) రాబర్ట్ బ్రూస్‌ఫూట్. ఈ కాలంలో మనిషి ఉపయోగించిన పనిముట్లను మెగాలిత్స్ అంటారు. ఇవి మొరటుగా ఉండే పెద్ద బండరాళ్లు. పెద్దపులిని చంపాలన్నా, చెట్టును కొట్టాలన్నా, నేలను తవ్వాలన్నా.. ఇలా అన్ని పనులకూ ఆ ‘రాయే’ ఆధారం. పాతరాతి యుగపు చివర్లో మానవులు తమ భుజ బలం సహాయంతో జంతువులను వేటాడేందుకు విల్లు-అంబులు ఉపయోగించారు. దీనికి సంబంధించి గార్డెన్ చైల్డ్ తన గ్రంథమైన Man makes Himselfలో.. ‘‘మనిషి కనుక్కొన్న మొట్టమొదటి యంత్రం విల్లే’’ అని పేర్కొన్నారు. పాత రాతియుగపు ప్రదేశాలు తెలంగాణ ప్రాంతంలో పాత రాతియుగపు ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని భద్రాచలానికి 40 మైళ్ల దూరంలో ఆది మానవుడికి చెందిన 35 రకాల పనిముట్లు 50 గజాల మేర తవ్వకాల్లో దొరికాయి. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఏకంగా ఈ 50 గజాల ప్రదేశాన్ని ‘పాత రాతియుగపు పనిముట్ల పరిశ్రమ’గా అభివర్ణించారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ పాత రాతియుగపు మానవుడికి చెందిన ఆధారాలు లభించాయి. హైదరాబాద్‌కు 50 కి.మీ. దూరంలో ఉన్న రాచకొండ గుట్టల్లో ఆది మానవుడి కళా జీవనం కనిపిస్తుంది. ఇక్కడి గుహల్లో వేల ఏళ్ల కిందట ఆది మానవులు గీసిన ఎరుపు రంగు వర్ణ చిత్రాలు, రేఖాచిత్రాలు అబ్బురపరుస్తాయి. ఆరుగురు వ్యక్తులు తమ వద్ద ఉన్న బాణాలతో పులిని వేటాడుతున్నట్లు చిత్రకారుడు గీశాడు. తెలంగాణలో ఆది మానవుడి చిత్రకళకు ఇది నిదర్శనం. మధ్య రాతియుగం- మైక్రోలిత్స్ మధ్య రాతియుగం అంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది నిప్పు. ఈ నిప్పును మధ్య రాతియుగంలోనే కనుగొన్నారు. ఈ యుగంలోనే జంతువులను కూడా మచ్చిక చేసుకున్నారు. నిప్పు ఆవిష్కరణకు, జంతువుల మచ్చికకు దగ్గర సంబంధాలున్నాయి. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం కలిగిస్తుందని, తన వద్ద నిప్పు నెగడులు ఉంటే అటవీ జంతువులు భయపడతాయని ఆది మానవుడు తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని గ్రహించాడు. నిప్పుల్లో మాంసం, దుంపలు కాల్చుకొని తినడం ప్రారంభించాడు. నిప్పు పుట్టుకకు సాక్ష్యం దేశం మొత్తంమీద నిప్పును కనుగొన్న ఆనవాళ్లు మొట్టమొదటగా రాబర్ట్ బ్రూస్‌ఫూట్ తెలంగాణ ప్రాంతంలోనే కనుగొన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉట్నూరులో నిప్పును మండించిన తర్వాత మిగిలిన బూడిద రాశులు అనేకం తవ్వకాల్లో దొరికాయి. కర్రలను లేదంటే రాళ్లను రాపాడించి నిప్పును కనుగొన్నది తెలంగాణలోని తొలి మానవుడే కావడం విశేషం. రాబర్ట్ బ్రూస్‌ఫూట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఉట్నూరులోని బూడిద రాశులు (అటజి కౌఠఛీట) మొదట పేడ పోగులు. వేసవిలో అవి అంటుకుంటూ, రాపిడికి గురై బూడిద రాశులుగా మిగిలాయి. వీటికి బ్రిటిష్ మ్యూజియం అధికారులు రసాయన పరీక్షలు కూడా నిర్వహించారు. బూడిద రాశులు ఎలా ఏర్పడ్డాయి? తెలంగాణలో బయటపడిన బూడిద రాశులపై పరిశోధన చేసిన మరో బ్రిటిష్ శాస్త్రవేత్త ఎఫ్.ఆర్.ఆల్చిన్. ఆయన అభిప్రాయం ప్రకారం బూడిద రాశులు అనేక అంచెలుగా ఉన్నాయి. అవి ఉన్న ప్రదేశాల్లో మొదట్లో పశువులను కట్టి ఉంచారు. వాటి పేడను ఒక చోట పెంటపోగుగా వేశారు. ఆది మానవులు ఆ ప్రదేశం నుంచి వెళ్లేటప్పుడు పేడపోగులను తగలబెట్టేవారు. ఇలా ఏర్పడిన బూడిద రాశులే తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆది మానవుడు పేడదిబ్బలను కాల్చడం, తర్వాత ఆ ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్లడం వంటి పరిణామాలను పరిశీలిస్తే రుతువులు మారినప్పుడు పశువులతో సహా మనుషులు మరో చోటుకు తరలివేళ్లేవారని తెలుస్తోంది. పశువుల మందలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు ఉత్సవాలు, కర్మకాండలు నిర్వహించేవారు. ఈ అలవాటు శతాబ్దాలు గడిచినా నేటికీ సంప్రదాయంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఇప్పటికీ పశువులను గౌరవిస్తూ, ఆరాధిస్తూ ‘సదర్’ అనే ఉత్సవాన్ని జరుపుకోవడం దీనికి నిదర్శనం. ఉట్నూరులో బయటపడిన బూడిదరాశుల ద్వారా రెండు విషయాలను తెలుసుకోవచ్చు. అవి 1. మానవుడు నిప్పును కనుగొనడం. 2. పశువులను మచ్చిక చేసుకొని, వాటిపై ఆధారపడి జీవించడం. మరొక ఉదాహరణ ఏమిటంటే.. నేటికీ తెలంగాణ ప్రాంతంలో పంట మార్పి డి జరిగిన తర్వాత పొలంలో మిగిలిన దుబ్బులను తగలబెడతారు. అవి నల్లటి బూడిదలా మారతాయి. భారతదేశానికి నిప్పు ద్వారా వెలుగు నింపిన కొద్ది ప్రాంతాల్లో మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు ఉండటం గొప్ప ఉద్వేగాన్ని కలిగిస్తోంది. మధ్య రాతియుగంలో మానవుడు చిన్నచిన్న రాతి పరికరాలు (పెచ్చులు- రాతి బ్లేడులు) ఉపయోగించాడు. వీటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తేలిగ్గా తీసుకెళ్లేవాడు. నవీన శిలాయుగం తెలంగాణ ప్రాంతంలో నవీన శిలాయుగానికి చెందిన చాలా ప్రదేశాలు కనిపిస్తాయి. వీటిలో మౌలాలి, హఫీజ్‌పేట ముఖ్యమైనవి. ఈ ప్రాంతాల్లో అప్పట్లో ఉపయోగించిన రాతి పనిముట్లు, మంటల్లో కాల్చిన మట్టిపాత్రలు-వాటిపై వేసిన డిజైన్లలను చూడొచ్చు. మౌలాలి, భువనగిరిమెట్టల్లో నవీన శిలాయుగపు చిన్నెలు (ఎత్తయిన, సన్నని దిమ్మెలు) బయటపడ్డాయి. ప్రమాదాల సమయంలో ఆది మానవుడు వీటిపైకి ఎక్కి తలదాచుకునేవాడు. ఇలాంటి చిన్నెలు ఇంకా గోల్కొండ కోట, దౌలతాబాద్ కోటల్లో కూడా కనిపిస్తాయి. ఖమ్మం జిల్లాలో ఐదు చోట్ల, భువనగిరిలో రెండు చోట్ల నవీన శిలాయుగపు వస్తువులు లభించాయి. భువనగిరి ప్రాంతంలో ఏకంగా నవీన శిలాయుగపు గ్రామమే తవ్వకాల్లో బయటపడింది. తెలంగాణలో లోహయుగం (మెటల్ ఏజ్) తొలి మానవుడు మొదట వాడిన లోహం రాగి (కాపర్). ఈ రాగి కాలానికి చెందిన ఒక కత్తి ఖమ్మం జిల్లాలోని కల్లూరులో దొరికింది. దేశం మొత్తంమీద ఈ ప్రాంతంలో మాత్రమే రాగి కత్తి లభించింది. బృహత్ శిలాయుగం పాత రాతియుగపు మానవుడు పెద్దపెద్ద రాళ్లను ఉపయోగించి, జీవనం సాగించేవాడన్నది తెలిసిందే. నవీన శిలాయుగం చివర్లో బృహత్ శిలాయుగాన్ని తెలంగాణ ప్రాంతంలో మనం చూడొచ్చు. అతిపెద్ద వలయాకారపు బండరాళ్లను చనిపోయిన వారి సమాధులపై ఉంచేవారు. చనిపోయిన మనిషిని రాతిపెట్టె బండల మధ్య ఉంచేవారు. ఈ రాతి పెట్టెలో మనిషి ఉపయోగించిన ఎరుపు-నలుపు చిత్రాలు, చాకులు, బల్లేలు, ఆభరణాలు ఉంచి పైన మరో రాతి పలకతో మూసేవారు. పక్కన పేర్చిన రాతి పలకల్లో ఒక దానికి రంధ్రం చేశారు. ఇలా ఉంచడానికి కారణం.. బహుశా అతని ఆత్మ స్వేచ్ఛగా బయట తిరిగి, మళ్లీ లోపలికి వచ్చి శరీరంలో ప్రవేశిస్తుందనే నమ్మకం కావచ్చు. ఈ పెట్టె వంటి నాలుగు పలకల రాతి బండను సిస్ట్ (జీట్ట) అంటారు. ఈ రాతి పేటికపై ఒక పెద్ద వలయాకారపు బండరాయిని పెడతారు. వీటినే రాక్షసగుళ్లు లేదా పాండవ గుళ్లు అని అంటారు. కొన్ని రాతి సమాధులపై మూడు టన్నుల బరువైన రాళ్లను కూడా పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి పనులు చేసేందుకు అవసరమైన దేహ దారుఢ్యం అప్పటి మనుషుల సొంతం! బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు దక్షిణ భారతదేశం మొత్తంమీద బృహత్ శిలాయుగపు వలయాకారపు బండరాళ్లు ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ముఖ్యంగా కొండలు, గుట్టల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి.మెడోస్ టైలర్ అనే శాస్త్రవేత్త నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద పదుల సంఖ్యలో రాక్షసగుళ్లను కనుగొన్నాడు. నిజామాబాద్ తూర్పు కొన నుంచి తెలంగాణ అంతటా ఈ తరహా రాక్షసగుళ్లు కనిపిస్తాయి.మధిర, చింతగాని, డోర్నకల్, మానుకోట, రాయగిరి, మౌలాలి, బాలానగర్, బేగంపేట, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, కరీంనగర్‌లోని ధూళికట్టల్లో వలయాకారపు పెద్దపెద్ద బండరాళ్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటిని రాక్షసగుళ్లుగా చెప్పొచ్చు. వీటికింద తొలి మానవుడు వాడిన వస్తువులతో పాటు, అస్తిపంజరం కచ్చితంగా నిక్షిప్తమై ఉంటుంది.