telugu medium
-
‘ఇంగ్లీష్ మీడియం.. మీ పిల్లలకేనా?..మా పిల్లలకొద్దా?’
విశాఖపట్నం, సాక్షి: తెలుగు వికాసం ముసుగులో బడుగు బలహీన వర్గాల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని, అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా? అని విదసం ఐక్య వేదిక ప్రశ్నిస్తోంది. ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలంటూ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు మహా సభలు తీర్మానాలను వ్యతిరేకిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం రద్దును మేము ఖండిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. వేదిక మీద మాట్లాడిన వారి పిల్లలు ఎక్కడ చదువుకున్నారు?. మీ పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా?.. మా పిల్లల మాత్రం మీ దొడ్లుల్లో పశువులు కాయలా.. అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా?.. .. తెలుగు మహా సభల వేదిక మీద ఉన్నవారు కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా మాట్లాడారు. వేదికపై ఒకరు కూడా బడుగు బలహీను వర్గాలకు చెందిన వారు లేరు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నది బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలే!. అందుకే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి. ప్రపంచీకరణలో ఉద్యోగాల రావాలంటే ఇంగ్లీష్ అవసరం. ఇంగ్లీష్ కి వచ్చిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇంగ్లీషు రాక ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు రాక నష్టపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని విదసం ఐక్య వేదిక పేర్కొంది. -
ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే'
సాక్షి, అమరావతి: కాలానుగుణంగా చదువుల తీరు తెన్నులు మారిపోతున్నాయి! పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యనే బలంగా కోరుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్ధికంగా భారమైనప్పటికీ ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సిద్ధపడుతున్నారు. పేదింటి తల్లిదండ్రుల ఆరాటం, పిల్లల ప్రతిభను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యా రంగాన్ని సమున్నతంగా మార్చాలని తపన పడ్డారు. మునుపెన్నడూ చూడని విద్యా సంస్కరణలు తెచ్చారు. విద్యా బోధనలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకోకుండా మూస విధానాలతో వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు అంతులేని నష్టం జరుగుతుందని గుర్తించారు. పేద కుటుంబాల్లో మరో తరం అణగారిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ఓ మేనమామలా అడుగడుగునా వారి చదువులకు అండగా నిలిచారు. ఐరాస వేదికపై మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటేలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. విద్యారంగ సంస్కరణల కోసం ఐదేళ్లలో ఏకంగా రూ.72,919 కోట్లు వెచ్చించారు. కానీ విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్న కూటమి సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను నీరుగారుస్తూ పేదింటి పిల్లలపై పగ సాధిస్తోంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, భాషా వికాసం, మేధావుల ముసుగులో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేసే కుట్రలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరి ఈ ప్రముఖులు వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఏ మీడియంలో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు? ఏ ఒక్కరైనా తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నారా? పిల్లల్లో బలమైన ఆసక్తి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంగ్లీష్ మీడియంలోనే చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరీక్షలు సైతం ఆంగ్లంలోనే రాస్తూ తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆరాట పడుతున్నారు. గతేడాది 9వ తరగతి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేశారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో 91.33 శాతం మంది పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేయడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల్లో దాదాపు 2.20 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయడం.. 1.94 లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. తద్వారా పిల్లలు ఇంగ్లీష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ.. ‘దేశంలో పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యం. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువొక్కటే. పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత. పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే అది ఇంగ్లీష్ చదువులతోనే సాధ్యమవుతుంది..’ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన మాటలివీ! అందుకు అనుగుణంగానే ఆయన 2020–21లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2024–25 నాటికి టెన్త్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు (మిర్రర్ ఇమేజ్), ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, ఉన్నత తరగతులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అందించి ప్రోత్సహించారు. దీంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించే రాష్ట్రంగా, దక్షిణాదిలో ఇంగ్లీష్ మీడియం అమలు టాప్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనేవైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో 2023 – 24లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల చేరికలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1,50,005 అధికంగా నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2023–24 పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసిరారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి టాప్ 28 మంది విద్యార్థుల్లో 26 మంది ప్రభుత్వ స్కూళ్లలో చదివి బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాల సహాయంతో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి 590 నుంచి 594 వరకు మార్కులు సాధించడం గమనార్హం. జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులను గత ప్రభుత్వం సత్కరించి ప్రోత్సహించింది. ఇంగ్లీష్ మీడియంలో కేరళను దాటిన ఏపీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) 2023లో ఇంగ్లీష్ మీడియం అమలులో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో టాప్‌లో నిలిచింది. ఈమేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థులను పరీక్షించి సర్వే చేపట్టారు. సర్వేలో జాతీయ సగటు 37.03 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 84.11 శాతంగా నమోదు కావడం గమనార్హం. కేరళ, కర్ణాటక, తమిళనాడు కంటే ఏపీ మెరుగైన స్థానంలో నిలిచింది. ప్రైవేట్ స్కూళ్లకు 2 లక్షల మంది విద్యార్థులు వైఎస్ జగన్‌పై కోపంతో ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలను సీఎం చంద్రబాబు ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే టోఫెల్‌ను రద్దు చేశారు. అనంతరం విద్యార్థుల్లో ప్రమాణాలు లేవంటూ 1,000 సీబీఎస్ఈ స్కూళ్లను రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్లను తొలగించారు. వచ్చే జూన్ నుంచి అమల్లోకి రావాల్సిన ఐబీ విద్యను కూడా రద్దు చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులను నీరుగార్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోవడం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎలా నీరుగారుతోందో చెప్పేందుకు నిదర్శనం. 95% తల్లిదండ్రుల కోరిక ఇంగ్లీష్ మీడియంరాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను బలంగా కోరుకున్నారు. అది ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ప్రైవేట్ బాట పట్టారు. దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలు వివిధ దశల్లో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలోప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై అధ్యయనం నిర్వహించిన జగన్ ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం సేకరించింది. రాష్ట్రంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఫీజులు ఆర్ధికంగా భారమైనా పిల్లల భవిష్యత్ దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నట్లు చెప్పారు. సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో మరో దారి కానరాక ప్రైవేట్‌లో చేర్చినట్లు వాపోయారు. ఈ క్రమంలో పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రేపటి పౌరుల ఉజ్వల భవిష్యత్తు దిశగా జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా 2020–21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమల్లోకి తెచ్చింది. తొలుత ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టగా 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ స్కూళ్లపై పెరిగిన నమ్మకం మనబడి నాడు–నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో సదుపాయాలతో సమూలంగా తీర్చిదిద్దే బృహత్తర పథకాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2019–20లో 15,713 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా అన్ని సదుపాయాలను కల్పించారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. డ్రాపౌట్స్‌ను అరికట్టడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా అందించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2020 జనవరి 1న జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో రుచికరమైన మెనూతో 16 రకాల పదార్థాలు, ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో ఆహారాన్ని అందచేశారు. గోరుముద్దపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్లు వెచ్చించింది.మేధావుల్లారా ఆలోచించండి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని తెలుగు రచయితల మహాసభల్లో వక్తలు, మేధావులు డిమాండ్ చేశారు. కానీ రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రభుత్వానికి తెలుగు భాషపై నిజంగా ప్రేమ ఉంటే ప్రతి గ్రామం, పట్టణంలో ఒకేచోట తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏ మీడియం కావాలంటే అందులో చేరుతారు. కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకు అన్యాయం తలపెట్టవద్దు. – ఎస్.రామకృష్ణ, పురపాలక టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుమీ పిల్లలు ఎక్కడ చదివారు?.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదులు, రాజకీయ నాయకులు, రచయితలు మూకుమ్మడిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే జీవో 85ను రద్దు చేయాలని కోరడం అత్యంత దుర్మార్గం. వారిలో ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇంగ్లీష్‌తోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని పాలకులపై ఒత్తిడి తేవాలి. మహాసభలో పాల్గొన్న న్యాయ కోవిదుల పిల్లలు, రాజకీయ నేతల పిల్లలు, తెలుగు భాషా రచయితల పిల్లలు ఏ మాధ్యమంలో చదివారో.. ప్రస్తుతం ఏ దేశాల్లో ఉంటున్నారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. – బి.మనోజ్‌కుమార్, రమేష్, బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుఏపీలో విద్యా విప్లవాన్ని మళ్లీ వెనక్కి తీప్పాలనే..⇒ తెలుగు మీడియంలో చదివి కష్టపడి న్యాయవాద డిగ్రీ సంపాదించిన యువ లాయర్లు ఇప్పుడు కోర్టుల్లో చాలామంది ఉన్నారు. వారికి చట్టాలపై ఎంత పట్టు ఉన్నా ఇంగ్లీష్‌లో సమర్థంగా వాదించే నైపుణ్యం లేక ఎంత డిప్రెషన్‌కు గురవుతున్నారో నేను చూశా. ⇒ ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్’ అంటున్న తెలుగు భాషకు సివిల్ సర్వీస్‌లో ప్రశ్నాపత్రం లేని గతి ఎందుకున్నది? తెలుగు భాషలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ⇒ కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లను కన్నడలో బోధించాలని జీవో ఇచ్చినప్పుడు తమ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రుల ఫండమెంటల్ రైట్ అని సుప్రీం కోర్టే చెప్పింది కదా! ⇒ చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటోంది. ఆయన మనవడు ఏ భాష స్కూలులో చదివి ఇప్పుడు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ కాబోతున్నాడు? ⇒ మేధావులకు తెలుగుపట్ల ప్రేమ ఉంటే ప్రపంచ భాషల్లోకి అనువదించి నోబెల్ ప్రైజ్ పొందే పుస్తకాలు రాయాలిగానీ దిక్కులేని ప్రజల జీవితాల్లో మట్టి పొయ్యడానికి సిద్ధాంతాలు అల్లకూడదు కదా! ⇒ ప్రపంచ రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో లేదా రచించాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! ⇒ ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపివేశారు. ⇒ ఇంగ్లీష్ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే గానీ అది బతకదు. పోరాటం చేస్తేగానీ ఈ తిరోగమన రథ చక్రం ఆగదు. – ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సామాజిక విశ్లేషకుడు, ప్రముఖ రచయిత -
తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు?
సాక్షి, హైదరాబాద్: మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంటోంది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు దీనిపై సూచనలు చేసింది. సాంకేతిక విద్య సహా అన్ని ఉన్నత విద్య కోర్సులకు స్థానిక భాషల్లో పుస్తకాలు అందించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు చెబుతోంది. అయితే రాష్ట్రంలో తెలుగు మీడియం పరిస్థితిపై రెండు నెలల క్రితం రాష్ట్ర విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా స్కూల్ స్థాయిలో తెలుగు మీడియం పరిస్థితి అంతంత మాత్రంగానే తేలింది. తెలుగు మీడియంలో బోధించడం ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందిగానే ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంగ్లిష్ వాడుక భాషగా మారడం, కొత్తతరం ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంతో తెలుగు బోధనలోనూ ఇంగ్లిష్ పదాలు దొర్లుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యను తెలుగులో బోధించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై నిపుణులతో కమిటీ వేసే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చూపంతా ఆంగ్ల మాధ్యమం వైపే.. రాష్ట్రంలో తెలుగు మీడియం కన్నా ఇంగ్లిష్ మీడియం వైపే ప్రజలు మొగ్గుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కేవలం 0.6 శాతం మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇది 6.7 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో 41,628 ప్రభుత్వ, ప్రైవేటు బడులు ఉండగా.. వాటిలో 59 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.ప్రభుత్వ బడుల్లో ఒకటి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 22,63,491 మందికాగా.. ఇందులో 4,08,662 మంది (18 శాతం) మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో 34,92,886 మంది చదువుతుంటే... అందులో 20,057 మంది (0.57 శాతం) మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉండటం గమనార్హం. ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న 62,738 మందిలో 8,960 మంది మాత్రమే తెలుగు మీడియం వారు. ఇంగ్లిష్ ముక్కలొస్తే చాలంటూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదివించాలనే భావిస్తున్నారని విద్యాశాఖ పరిశీలనలో తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో 2023 నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా... ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇంగ్లిష్ నేర్చుకుని, మాట్లాడటం వస్తే చాలన్న భావన కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. మరోవైపు టెన్త్, ఇంటర్ తర్వాత దొరికే చిన్నా చితక ఉద్యోగాలకూ ఆంగ్ల భాష ప్రామాణికంగా మారిందని.. దీనితో ప్రైవేటు బడుల్లో ఆంగ్ల మాధ్యమం కోసం పంపుతున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లోనూ తెలుగు మీడియం కంటే ఆంగ్ల మాధ్యమంలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాతృభాషలో విద్యా బోధన ఉండాలన్న కేంద్ర సూచనలపై పీటముడి పడుతోంది. తెలుగు మీడియంలో చేరేవారెవరు, బోధించేవారెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఇంగ్లిష్ .. ఫుల్ జోష్!
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘నాక్కూడా ప్రైవేటు బడిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని ఉండేది. కానీ నాన్న ఆకస్మికంగా చనిపోవటం, అమ్మకు నన్ను ప్రైవేటు బడికి పంపే స్తోమత లేకపోవడంతో మా సీతారాంకుంట తండా ప్రభుత్వ బడిలో ఐదవ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నా. కానీ ఈ ఏడాది మా మారేపల్లి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టగానే అక్కడ చేరా. ఇంగ్లిష్ మీడియంలో కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సంపాదించి అమ్మకు గిఫ్ట్‌గా ఇస్తా..’అని సంగారెడ్డి జిల్లా మారేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేరిన అపర్ణ అనందంతో చెప్పిన మాటలివి. ఒక్క అపర్ణే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువుతున్న సుమారు పదకొండున్నర లక్షల మంది నిరుపేద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మూతపడిన స్కూళ్లు మళ్లీ కళకళ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతూ క్లాసులు మొదలవటంతో మెజారిటీ విద్యార్థులు తెలుగు మీడియం నుండి ఇంగ్లిష్ మీడియానికి (1 నుండి 8వ తరగతి వరకు) మారిపోతున్నారు. ఇక కొత్తగా ఒకటవ తరగతిలో చేరే వారు నూటికి నూరుశాతం ఇంగ్లిష్‌నే ఎంచుకుంటున్నారు. ఉమ్మడి పది జిల్లాలకు గాను ఆరు జిల్లాల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో గతంలో విద్యార్థులు లేక మూతపడ్డ పాఠశాలలు సైతం ఈ మారు తెరుచుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కేశారం పాఠశాల విద్యార్థులు లేక మూతపడగా, ప్రస్తుతం ఇంగ్లిష్ విద్యాబోధనకు సిద్ధం చేయటంతో 25 మంది విద్యార్థులు ప్రైవేటు నుండి ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చేరారు. దక్షిణ తెలంగాణతో పోల్చుకుంటే వెనుకబడిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పేద విద్యార్థులు భారీ సంఖ్యలో ఇంగ్లిష్ మీడియం వైపు ఆకర్షితులవుతుండటం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చేరికలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లో తెలుగు మీడియం కన్నా రెట్టింపు సంఖ్యలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్నారు. దక్షిణ తెలం గాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మాత్రం తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. సమస్యలు అధిగమిస్తే సక్సెస్సే.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు మంచి స్పందన కనిపిస్తున్నా, తొలి ఏడాదిలో ఉపాధ్యాయుల సన్నద్ధత, పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలల్లో మన ఊరు మన బడి కింద చేపట్టిన అభివృద్ధి పనులు పదిశాతం కూడా పూర్తి కాకపోవటం, ఇప్పటికీ 25 శాతమే పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రావటం వంటి అంశాలు ప్రతి బంధకాలుగా మారాయి. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారంతో ఉపాధ్యాయులకు ఆఫ్‌లైన్ –ఆన్లైన్లో ఇంగ్లిష్ బోధనపై బ్రిడ్జికోర్సు, ఇతర శిక్షణలు నిర్వహించినా ఉపాధ్యాయుల సన్నద్ధతపై ఇంకా కొంత సందిగ్ధత ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉపాధ్యాయులను ఇంగ్లిష్ బోధనలో సుశిక్షితులుగా చేయటంపై ప్రభుత్వం దృష్టి సారించి, మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయటంతో పాటు బై లింగ్వల్ (ఇంగ్లిష్ –తెలుగు ద్విభాషల్లో)లో రూపొందించిన పాఠ్య పుస్తకాలు వీలైనంత త్వరగా సరఫరా చేయగలిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో ‘నాడు – నేడు’విజయవంతమైనట్టే తెలంగాణలో ‘మన ఊరు–మన బడి’విజయవంతం అవుతుందని విద్యారంగ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తెరుచుకున్న స్కూళ్లివే.. ► నాలుగేళ్ల క్రితం మూతపడిన నిజామాబాద్ జిల్లా కేశా రం పాఠశాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు పాఠశాలలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. కొము రం భీం జిల్లాలో పన్నెండు, ఆసిఫాబాద్‌లో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది విద్యార్థులతో నిండాయి. కొమురం భీం జిల్లా కోయగూడ ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్ల తర్వాత 15 మంది విద్యార్థులు చేరారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో 22 స్కూళ్లు తెరుచుకున్నా యి. మళ్లీ ప్రారంభం అవుతున్న పాఠశాలల్లో అత్యధి కం గిరిజన తండాల్లోనే ఉన్నాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. శిక్షణ ఇచ్చేందుకు ఇఫ్లూ రెడీ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చేందుకు, మెళకువలు నేర్పేందుకు ఇంగ్లిష్ అండ్ ఫారెన్లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) సిద్ధంగా ఉంది. దేశంలో ఇంగ్లిష్ భాష విస్తరణే లక్ష్యంగా 1958లో ఏర్పడిన సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ (సీఫెల్) ఇప్పుడు ఇఫ్లూగా స్థిరపడింది. ఇఫ్లూ ప్రస్తుతం 105 దేశాల రాయబారులు, ఇతర ముఖ్యులకు ఇంగ్లిష్‌లో మెళకువలు నేర్పుతోంది. అలాగే తెలంగాణ రేపటి భవిష్యత్తు కోసం ఏం చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. – సురేశ్‌కుమార్, వైస్ చాన్స్‌లర్, ఇఫ్లూ ఆత్మగౌరవంతో బతకడానికి.. ఇంగ్లిష్ అనేది ప్రపంచంలో మన వాళ్లు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తుంది. అందుకే సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టాలని నేను చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నా. ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు నాడు –నేడు పేరుతో పాఠశాల విద్యను ఆధునీకరించి బలోపేతం చేశారు. తెలంగాణలోనూ ఓట్ల పథకంలా కాకుండా నిజాయితీగా ఇంగ్లిష్ మీడియంను ముందుకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొందరికే లబ్ధి చేకూర్చే దళితబంధు లాంటి పథకాలు ఎత్తేసి దళితులు, బలహీనవర్గాలకు అన్నివిధాలా మేలు చేసే విద్య కోసం నిధులు కేటాయించాలి. నా వంతు చేయూతగా యూట్యూబ్‌లో ఇంగ్లిష్ క్లాస్‌లు అందుబాటులోకి తేబోతున్నా. – ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఇంటి వద్దే ఇంగ్లిష్ పాఠాలు.. ఇంగ్లిష్ మీడియం కోసం తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపే తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు కొత్తగా మా పాఠశాలకు వస్తున్నవారంతా ఇంగ్లిష్ మీడియాన్నే ఎంచుకుంటున్నారు. – బిందుశ్రీ, టీచర్, ఆదిలాబాద్ ఇంటి వద్దే ఇంగ్లిష్ పాఠాలు.. నేను ఇంతకు ముందు ఆటోలో పక్క గ్రామానికి వెళ్లేవాడిని. ఇప్పుడు మా ఇంటి వద్ద స్కూల్లోనే ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్నారు. దీంతో నేను ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతిలో చేరా. – బి.శివ, కేశారం, నిజామాబాద్ జిల్లా -
బంఫర్ ఆఫర్.. తెలుగు మీడియంలో చేరిన విద్యార్థులకు..
పళ్లిపట్టు(చెన్నై): ప్రభుత్వ పాఠశాలలో తెలుగు విద్యార్థుల సంఖ్యను పెంపొందించే లక్ష్యంతో అత్తిమాంజేరి తెలుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. పళ్లిపట్టు మండలం అత్తిమాంజేరి ప్రభుత్వ ప్రాథమిక తెలుగు పాఠశాలలో 15 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా భూపతి, సహాయ ఉపాధ్యాయులుగా మునెమ్మ, మాధవన్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు విద్యపట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు మోజు పెరగడంతో పాటు నిర్భంద తమిళ విద్యా విధానం తెలుగు పాఠశాలలకు శాపంగా మారింది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయా లు మెరుపడడంతో పాటు నాణ్యమైన బోధన అందుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్లు పెంచాలని నిర్ణయించారు. హెచ్ఎం భూపతి సహాయ ఉపాధ్యాయులు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చేరే విద్యార్థుల కుటుంబాలకు రూ.వెయ్యి విలువైన టేబుల్ ఫ్యాన్‌ను అందిస్తున్నారు. దీంతో తొలిరోజు నలుగురు విద్యార్థులు పాఠశాలలో చేరారు. వీరికి సర్పంచ్ ఝాన్సీ ప్రకాష్ బహుమతి ప్రదానం చేశారు. గతంలో తెలుగు మీడియంలో విద్యార్థులను చేర్చే ఆశయంతో అడ్మిషన్ పొందే ప్రతి విద్యార్థికి గ్రాము బంగారం ఉచితంగా ప్రధానోపాధ్యాయు డు భూపతి పంపిణీ చేయడం విశేషం. చదవండి: AP Crime: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. -
సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలు
అనంతపురం విద్య: సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఒకే పుస్తకంలో ఒక పేజీలో ఇంగ్లిష్, మరొక పేజీలో తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇవి తెలుగు మీడియం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం సాంకేతిక విద్యా కోర్సులైన ఇంజినీరింగ్, డిప్లొమా పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. ఈ మేరకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఇంజినీరింగ్, డిప్లొమా పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించే బాధ్యతను జేఎన్టీయూ(అనంతపురం)కు అప్పగించింది. దీంతో ఇప్పటికే మొదటి సంవత్సరం డిప్లొమా పుస్తకాలు 11, బీటెక్‌లో తొమ్మిది పుస్తకాలు ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇదే తరహాలోనే బీటెక్, డిప్లొమాలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలకు రూపకల్పన చేశారు. దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులు విషయాన్ని త్వరగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మన్యూనతా భావం తగ్గించేలా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి అడుగుపెట్టే విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటోంది. విషయ పరిజ్ఞానంలో ఇంగ్లిష్ మీడియం వారితో పోటీపడలేమని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారిలో ధైర్యాన్ని నింపేలా మిర్రర్ ఇమేజీ పుస్తకాలు రూపొందించాం. 2022–23 విద్యా సంవత్సరం నుంచి బీటెక్, డిప్లొమా రెండో సంవత్సరం విద్యార్థులకు సైతం తెలుగు భాషలో కంటెంట్ అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ కె.శేషమహేశ్వరమ్మ, ఏఐసీటీఈ టెక్నికల్ బుక్స్ రైటింగ్ కోఆర్డినేటర్ (రీజినల్ లాంగ్వేజెస్) (చదవండి: పల్లె జనం.. పట్టణ జపం) -
‘నవోదయ’ ప్రశ్నపత్రంలో తప్పులు
కోడూరు: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 30న నిర్వహించిన పరీక్షలో తప్పులు దొర్లాయి. తెలుగు మాధ్యమం ప్రశ్నపత్రంలో నాలుగు మ్యాథ్స్ ప్రశ్నల్లో అనువాద, అన్వయ లోపాల కారణంగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మ్యాథ్స్ ప్రశ్నల్లో తెలుగు అనువాదం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తెలిసిన ప్రశ్నలే అయినప్పటికీ జవాబు గుర్తించేందుకు తికమకపడ్డారు. ప్రశ్నపత్రం ‘హెచ్’ కోడ్‌లో 48వ ప్రశ్న ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఏవి?’ అని ఉంది. అయితే ఈ ప్రశ్నకు ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఎన్ని’ అని ఉంటే విద్యార్థులు సరైన సమాధానం గుర్తించేవారు. 47వ ప్రశ్న ‘ఒక అంకె నుంచి తీసివేయబడిన అంకె ఇవ్వబడింది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని తప్పుగా ఇచ్చారు. అయితే.. ‘ఒక సంఖ్యలోని అంకెల మొత్తం నుంచి అంకె తీసివేయబడుతుంది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 44వ ప్రశ్న.. ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ గుణకం వల్ల వస్తుంది’ అని ఉంది. ఇది ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ ప్రధానాంకాల గుణకం వల్ల వస్తుంది’ అని ఉండాలి. 42వ ప్రశ్న అనువాదం తప్పుగా ఉండడం వల్ల ఆ ప్రశ్న విద్యార్థులకు అర్థం కాలేదు. నవోదయ పరీక్షలో సీటు సాధించడానికి ప్రతి మార్కు ఎంతో విలువైనది కావడంతో విద్యార్థులు ఈ నాలుగు ప్రశ్నల వల్ల తాము సీటు కోల్పోయే పరిస్థితి ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై కృష్ణా జిల్లా కోడూరు ఎంఈవో టి.వి.ఎం.రామదాసు, గణితం ఉపాధ్యాయులు రేపల్లె జయపద్ర, కో–ఆర్డినేటర్ మన్నె ప్రేమ్‌చంద్ మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం జరిగేలా తప్పులు ఉన్న 4 ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నవోదయ విద్యాలయ సమితిని కోరారు. -
Govt Schools: ఇంగ్లిష్.. చిక్కుముడి
►రాష్ట్రంలో సర్కారీ స్కూళ్లల్లో ఆంగ్లమాధ్యమంలో చేరే విద్యార్థులు పెరుగుతున్నారు. అయితే తెలుగు మాధ్యమ టీచర్లు 80% ఉండ గా, ‘ఇంగ్లిషు’లో బోధించేవారు 20% ఉన్నారు. ►ఇంగ్లిష్ టీచర్ల సంఖ్యను పెంచేందుకు కొత్తగా నియామకాలు చేపట్టాలి. లేదా తెలుగు మీడియం టీచర్లకు ఇంగ్లిష్‌లో తర్ఫీదు ఇవ్వాలి. నియామకాలు చేపడితే తెలుగు మీడియం టీచర్లు మిగిలిపోతారు. వీరిని ఏం చేయాలన్నది విద్యాశాఖను వేధిస్తున్న సందేహం. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. జిల్లా స్థాయి అధికారులు సమగ్ర వివరాలతో నివేదికలు పంపాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు తాజాగా ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు? విద్యార్థులు ఎక్కువ ఉండి, టీచర్లు తక్కువ ఉన్న స్కూళ్లు ఎన్ని ఉన్నాయనే డేటాను సేకరిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని 1.08 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80% వరకు తెలుగు మాధ్యమంలో బోధించేవారే ఉన్నారు. కాగా 2009లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. అప్పట్నుంచీ ఆ మాధ్యమంలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అదే ఏడాది జరిగిన డీఎస్సీలో ఆంగ్ల మాధ్యమం బోధించే అధ్యాపకుల నియామకం జరిగింది. అయితే స్వల్ప సంఖ్యలోనే ఈ నియామకాలు జరిగాయి. ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ (నిష్టా) ఆధ్వర్యంలో తెలుగు టీచర్లకు ఆంగ్లంలో శిక్షణ ఇస్తూ పరీక్షలు నిర్వహించి పాస్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ మొత్తం టీచర్లలో ఇంగ్లిష్ మీడియం బోధించే వారి సంఖ్య 20 శాతానికి మించకపోవడం సమస్యగా మారింది. 2009 నుంచి ఇప్పటివరకు ఎక్కువ స్కూళ్ళల్లో తెలుగు మీడియం టీచర్లే ఆంగ్లంలో బోధిస్తున్నారని, దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే పెద్ద సమస్య! రాష్ట్రవ్యాప్తంగా 40,898 ప్రభుత్వ, ప్రైవేటు పాఠాశాలలుండగా వీటిల్లో 60,06,344 మంది విద్యార్థులున్నారు. 2019–20 యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) లెక్కల ప్రకారం ఇంగ్లిష్ మీడియంలో ఉన్న వాళ్ళు 73.60 శాతమైతే, తెలుగు మాధ్యమంగా చదివేవాళ్ళు 23.84 శాతమే ఉన్నారు. ఇక మొత్తం స్కూళ్లలో 30 వేల వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 26.87 లక్షల మంది చదువుతున్నారు. వీరిలో 10 లక్షల మంది వరకు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నట్టు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరేవారిలో 65 శాతం ఇంగ్లిష్ మాధ్యమాన్నే కోరుకుంటున్నారని తేలింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధించే ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా పెరగాలి. 2019–20 లెక్కల ప్రకారం మొదటి తరగతిలో (ప్రభుత్వ, ప్రైవేటు కలిపి) 6.55 లక్షల మంది చేరితే, ఇందులో 4.63 లక్షల మంది ఇంగ్లీష్ మీడియాన్నే ఎంచుకున్నారు. దీన్నిబట్టి చూసినా సర్కార్ స్కూళ్ళలో సైతం ఆంగ్ల మాధ్యమం బోధించే ఉపాధ్యాయుల సంఖ్య భారీగా పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేం ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు మీడియం బోధించే వారికి అవసరమైన నైపుణ్యం కల్పించడమా? లేదా మిగులు టీచర్లను డీఈవో పూల్‌లో పెట్టడమా? అనే దానిపై ఇప్పటికిప్పుడే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో సమగ్ర డేటా సేకరించిన తర్వాత పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని, అక్కడి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆంగ్లంలో బోధన జరగకపోతే విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళకు వెళ్లే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యానికి రేషనలైజేషన్ ఓ సవాల్‌గా మారనుందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. టీచర్లకు శిక్షణలో ‘నిష్టా’కీలకపాత్ర ఆంగ్ల మాధ్యమంలో బోధించే టీచర్ల సంఖ్య పెంచేందుకు జాతీయ స్థాయిలో కృషి జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ‘నిష్టా’కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా కాలంలోనూ ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు కూడా ఇస్తోంది. తెలంగాణలోని మొత్తం టీచర్లలో 20 శాతం మంది మాత్రమే ఆంగ్లంలో బోధించేవారుండగా, వీరిలో సగం మందికి నిష్టాయే శిక్షణ ఇచ్చింది. వాస్తవానికి విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై శిక్షణ తరగతులు నిర్వహించాలి. అయితే తెలుగు మీడియం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు దీనిపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారని అధికారులు అంటున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి సెలవుల్లో శిక్షణపై టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇంగ్లిష్‌లో సంభాషణ పెరగాలి ఇంగ్లిష్ మీడియంలో సైతం బోధన సరిగా జరగడం లేదనే విమర్శలున్నాయి. అయితే తెలుగు మాతృభాషగా ఉన్న విద్యార్థులకు అర్థం కాకపోవడం వల్లే తెలుగులో బోధిస్తున్నట్టు టీచర్లు చెబుతున్నారు. ఇంగ్లిష్‌లో పరస్పర సంభాషణ క్రమంగా పెంచుకుంటూ వెళితే అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయుడికీ ఇంగ్లిష్ భాష మీద పట్టు వస్తుందని నిష్టా అధికారి ఒకరు తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లిష్‌లో పాఠం చెప్పాలంటే కనీసం ఒక రోజు ముందు ప్రిపేర్ కావాలని పేర్కొన్నారు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా ఉన్నత విద్యావంతులేనని, కాస్త శ్రద్ధ పెడితే వారంతా ఆంగ్లంలో బోధన వైపు తేలికగా మళ్ళొచ్చని నిష్టా పరిశీలనలో వెల్లడైంది. అందరికీ ఆదర్శం ‘బోరేగావ్’ సాధించాలనే తపన, శ్రద్ధ ఉంటే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దొచ్చనడానికి నిజామాబాద్ జిల్లా బోరేగావ్ గ్రామ హైస్కూల్ ఓ ఉదాహరణ. అక్కడి ప్రధానోపాధ్యాయుడి ప్రత్యేక పర్యవేక్షణలో 1,100 మంది విద్యార్థులు ఆంగ్ల బోధనలో విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఉపాధ్యాయుడు ఇంగ్లిష్ మీడియంలో చెప్పగలిగేలా ఆయన వారిలో స్ఫూర్తిని రగిలించారు. టీచర్లలో కొందరు నిష్టా ద్వారా శిక్షణ పొందారు. కార్యాచరణలో చిత్తశుద్ధి అవసరం చిత్తశుద్ధి గల కార్యాచరణ ప్రణాళికతో ముందుకువెళ్తే ఉపాధ్యాయులు తమ నైపుణ్యం పెంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇది అన్ని స్థాయిల్లోనూ జరగాలి. ఇప్పటికే తెలుగు మీడియంలో చదివిన వాళ్ళే ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. సోషల్, బయోసైన్స్ చెప్పే టీచర్లు మినహా మిగతా సబ్జెక్టులు చెప్పే తెలుగు మీడియం టీచర్లు ఇంగ్లిష్‌లో బోధించేలా తర్ఫీదు ఇవ్వొచ్చు. దీనికి టీచర్ల సంఘాలూ సహకరిస్తాయి. పిల్లలు, తల్లిదండ్రులు సంతృప్తి చెందేలా బోధన జరగాల్సిన అవసరమైతే ఉంది. అయితే ఈ ప్రక్రియను క్రమంగా, ప్రణాళిక బద్ధంగా ముందుకు తీసుకెళ్ళాలి. – జంగయ్య, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు 2019–20 లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళలో ఏ మాధ్యమంలో ఎంతమంది విద్యార్థులు... మాధ్యమం విద్యార్థుల సంఖ్య ఇంగ్లిష్ 44,21,111 తెలుగు 14,32,098 ఉర్దూ 1,45,545 హిందీ 3229 మరాఠీ 2515 కన్నడ 1441 బెంగాలీ 250 తమిళం 155 -
తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమానికి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో పలు కాలేజీలు తమ తెలుగు మాధ్యమ కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలికి దరఖాస్తులు సమర్పించాయి. 2021–22 విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉంటాయని, తెలుగు మాధ్యమ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఈ నెల 12వ తేదీ గడువు ముగిసే సమయానికి రాష్ట్రంలోని 557 కాలేజీలు తాము నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమ కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేయాలని దరఖాస్తు చేశాయి. దీనితో పాటు విద్యార్థులు చేరని పలు కోర్సులను ఉపసంహరించుకుంటూ 111 కాలేజీలు దరఖాస్తు చేశాయి. రాష్ట్రంలో మొత్తం డిగ్రీ కాలేజీల్లో 154 ప్రభుత్వ పరిధిలో ఉండగా 111 కాలేజీలు ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలుగా కొనసాగుతున్నాయి. 1,022 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయి. -
డిగ్రీ @ ఇంగ్లిష్ మీడియం
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరించే పరిజ్ఞానం ఆంగ్లం ద్వారానే సమకూరుతున్నందున రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఉన్నత విద్యలో తెలుగు మాధ్యమంలో ప్రవేశాలు భారీగా తగ్గుతుండగా ఆంగ్ల మాధ్యమంలో పెరుగుతుండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పరిజ్ఞానంతో కూడిన సబ్జెక్టులు ఆంగ్ల మాధ్యమం ద్వారానే అందుబాటులో ఉన్న నేపథ్యంలో డిగ్రీ కోర్సులన్నిటినీ 2021–22 విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలోనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తెలుగు మీడియం కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేసుకోవాలని ఆయా కాలేజీలకు సూచించింది. ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థుల మొగ్గు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అత్యుత్తమ ప్రమాణాలు, నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ విద్యార్థులకు చాలా కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాధ్యమంలో ఉన్నత చదువుల వైపు తల్లిదండ్రులు, యువత మొగ్గు చూపుతున్నారు. 2020–21లో డిగ్రీ కోర్సుల్లో చేరిన వారిలో 76% విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే ప్రవేశాలు పొందడం గమనార్హం. తెలుగు మాధ్యమంలో చేరికలు 24 శాతమే ఉన్నాయి. ఇంటర్ తెలుగు మాధ్యమంలో చదివిన వారు సైతం డిగ్రీలో ఇంగ్లిష్ మీడియం ఎంచుకుంటున్నారు. మొత్తం విద్యార్థుల చేరికలు 2.62 లక్షల వరకు ఉండగా ఆంగ్ల మాధ్యమంలో 1,96,322 మంది, తెలుగు మాధ్యమంలో 65,981 మంది ప్రవేశాలు పొందారు. ఆంగ్లం వైపు అణగారిన వర్గాల చూపు గతేడాది డిగ్రీలో చేరికల గణాంకాలను పరిశీలిస్తే ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలు పొందిన వారిలో అత్యధికులు బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారే ఉన్నారు. మొత్తం చేరికల్లో ఓసీలు 23 శాతం ఉండగా, ఈడబ్ల్యూఎస్ 1 శాతం, బీసీలు 54 శాతం, ఎస్సీలు 19 శాతం, ఎస్టీలు 3 శాతం ఉన్నారు. తెలుగు మాధ్యమంలో చేరిన వారిలో ఓసీలు 11 శాతం, ఎస్సీలు 24 శాతం, ఎస్టీలు 10 శాతం ఉండగా తక్కిన వారంతా బీసీలున్నారు. తెలుగు మాధ్యమంలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల వారే ముఖ్యంగా బాలికలే ఎక్కువగా ఉన్నారు. సమీపంలోని కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడం, దూర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటులేక వీరు తెలుగు మాధ్యమంలో చేరుతున్నారు. మొత్తం విద్యార్థుల్లో పట్టణ ప్రాంతాల వారు 75,578 మంది ఉండగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు 1,91,227 మంది ఉన్నారు. తెలుగు మాధ్యమం విద్యార్థుల్లో 80 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కోర్సులను (లాంగ్వేజ్‌లు మినహా) ఇంగ్లిష్ మీడియంలోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రామీణ విద్యార్థులకు కూడా వారికి సమీప కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమం కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగాలకు ఇంగ్లిష్ ముఖ్యం... ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2019 ప్రకారం నేర్చుకోవడంలో చురుకుదనం, అనుకూలతతో పాటు ఇంగ్లిష్‌లో నైపుణ్యాలున్న వారికి ఆయా సంస్థల యజమానులు నియామకాల్లో ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. ఇదే కాకుండా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వెలువరించిన 2016 నివేదిక ‘ఫైండింగ్స్ ఆఫ్ ఇంగ్లిష్ ఎట్ వర్క్: గ్లోబల్ ఎనాలిసిస్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ వర్క్ ప్లేస్’లో కూడా భారత దేశంలో 90 శాతం మంది తమ సంస్థల్లో ఉద్యోగాలకు ఆంగ్ల భాషా నైపుణ్యాలు ముఖ్యమని చెప్పినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిగ్రీ కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో అందించడం ద్వారా యువతకు ఆంగ్ల నైపుణ్యాలతో పాటు ఆయా సబ్జెక్టుల్లో పరిజ్ఞానం పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బీఎస్సీలో అత్యధికం ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బీఎస్సీ, బీకాంలకు ప్రాధాన్యమివ్వగా తెలుగు మాధ్యమంలో బీఎస్సీ, బీఏలకు సమప్రాధాన్యమిచ్చారు. -
ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు
సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలకు వీలుగా అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి సిలబస్‌ను మార్పు చేయడంతోపాటు పాఠ్యపుస్తకాలను సైతం వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరైన నేపథ్యంలో దాన్ని పిల్లలకు నేర్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంగ్లం/తెలుగు మాధ్యమాలు కోరుకునేవారికి రెండు మాధ్యమాలు ఒకే పాఠ్యపుస్తకంలో ఉండేలా ‘మిర్రర్ ఇమేజ్’ పాఠ్యపుస్తకాలను రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆంగ్ల పాఠాలు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఆంగ్ల మాధ్యమ పాఠాల సిలబస్ రూపకల్పనకు ప్రత్యేక ప్రాజెక్టు అధికారిగా ఐఏఎస్ అధికారిణి వెట్రిసెల్విని నియమించారు. ఇతర రాష్ట్రాలతోపాటు సింగపూర్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల సిలబస్‌తోనూ తులనాత్మక పరిశీలన చేశారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త మాయా గుణవర్థన నేతృత్వంలో నిపుణుల బందాన్ని, మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, హైదరాబాద్‌లోని ఇఫ్లూలను పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వాములుగా చేశారు. పాఠ్యాంశాలకనుగుణంగా బొమ్మలు, అందమైన లేఔట్ డిజైన్లను రూపొందించారు. సులువుగా అర్థమయ్యేలా పేజీకి ఒకవైపు ఆంగ్లం, రెండోవైపు తెలుగులో ఉండేలా పుస్తకాలు సిద్ధం చేయించారు. సిలబస్‌లో అనేక మార్పులు 1 నుంచి 6వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు చేశారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇకపై మూడో తరగతి నుంచే ఉంటుంది. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు వర్క్‌బుక్స్‌ను అందించనున్నారు. తెలుగులో గతంలో 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, అన్ని మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యంశాలుగా తీసుకోవడం విశేషం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటిలోనూ తెలు గును తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. తెలుగు భాషా సామర్థ్యాలను పెంచుకోవడం, భాషా సౌందర్యాన్ని తెలుసుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందాయి. సెమిస్టర్ విధానంలో పాఠ్యపుస్తకాలు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాల స్థాయి నుంచే సెమిస్టర్ విధానం పెట్టి పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందిస్తాం. దీనివల్ల పాఠ్యపుస్తకాల బరువు చాలా తగ్గుతుంది. విద్యార్థులు ఏయే సెమిస్టర్లలో ఏమేరకు రాణిస్తున్నారు? ఎక్కడ వెనుకబడి ఉన్నారో సులభంగా అంచనా వేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాల వల్ల టీచర్లకు, విద్యార్థులకు బోధనాభ్యసనం సులువుగా ఉంటుంది. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇష్టంగా చదువుకునేలా పాఠాలున్నాయి.. గతంలో పాఠాలు చెప్పి అభ్యాసాల్లోని వ్యాకరణం, ఇతర ప్రక్రియలను విద్యార్థులతో చేయించేవారు. ఇప్పుడు కృత్యాధారిత అభ్యసనం ద్వారా నేర్చుకోనున్నారు. పాఠాల వెనుక ప్రశ్నలు, జవాబులు, అభ్యాసాలు ఉండవు. అవన్నీ పాఠంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఇష్టంగా చదువుకునేలా ప్రస్తుత పాఠ్యాంశాలున్నాయి. – డాక్టర్ డి.చంద్రశేఖరరెడ్డి, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి అన్ని మాండలికాలకు పెద్దపీట తెలుగు భాషను మరింత పరిపుష్టం చేసే దిశగా ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 1 నుంచి 6వ తరగతి వరకు తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతో పాఠ్యాంశాలు రూపుదిద్దుకున్నాయి. అన్ని ప్రాంతాల మాండలికాలు, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన అంశాలకూ పెద్దపీట వేశాం. – డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి -
ఇంగ్లిష్ మాధ్యమమే భేష్
సాక్షి, అమరావతి: ‘చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్ మీడియంలో మాధ్యమంలో బోధన ఉంటేనే మంచిది. దానివల్ల పెద్దయ్యేకొద్దీ ఆంగ్ల ప్రావీణ్యం సులభంగా అలవడుతుంది. మాతృ భాష సహజంగా అలవడుతుంది. కానీ ఇంగ్లిష్ అలా కాదు. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియం ఉంటేనే తెలుగు మాదిరిగా ఆంగ్ల ప్రావీణ్యం లభిస్తుంది. కొన్ని సార్లు తప్పు చేసినా.. పై తరగతుల్లో వాటిని సరి చేసుకుని ఆంగ్ల ప్రావీణ్యం పెంచుకునే వీలుంటుంది. మేము చిన్నప్పుడు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లిష్ మీడియంలో చదివాం. దీంతో ఇంగ్లిష్ ఫ్లూయన్సీ లేక మొదట్లో ఇక్కడ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇతర దేశాల్లోనే కాదు మన దేశంలో సైతం ఇంగ్లిష్ నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకుని పిల్లలు, తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే ఇంగ్లిష్ ఉండేలా చూసుకోవాలి’ ► అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాంధ్రులు ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియం, ఇంగ్లిష్ భాష నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలపై పలువులు ప్రవాసాంధ్ర విద్యార్థులు, ఉద్యోగుల అనుభవాలు వివరించారు. అవేంటో వారి మాటల్లోనే.. భవిష్యత్తుకు బలమైన పునాది ‘ఇంగ్లిష్’ చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియం. నా స్నేహితులు కొంతమంది తెలుగు మీడియంలో చదవడం వల్ల బీటెక్‌లో ఇబ్బంది పడ్డారు. సబ్జెక్ట్ నైపుణ్యం ఉన్నా.. ఇంగ్లిష్ ఇబ్బంది వల్ల తమ ఆలోచనల్ని వ్యక్తపరిచే వాళ్లు కాదు. ఈ కారణంతోనే నాతో పాటు ఉన్నత విద్యకు అమెరికా రాలేక పోయారు. చిన్నప్పుడు మాతృ భాష అలవడుతుంది. స్కూల్లోనూ సబ్జెక్టుగా తెలుగు ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ ఉంటే మనకు భవిష్యత్తుకు అవసరమైన ఆంగ్ల పరిజ్ఞానానికి బలమైన పునాది పడుతుంది. ఇంగ్లిష్ మీడియంలో అభ్యసిస్తేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటాం. –వరుణ్, ఎమ్మెస్, పోర్ట్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ ఆత్మ స్థైర్యం కోల్పోయాను తెలుగు మీడియంలో చదివి.. పై చదువులకు ఇంగ్లిష్ మీడియంలోకి మారాను. ఇంగ్లిష్ నైపుణ్యం లేకపోవడం వల్ల ఉన్నత చదువులకు అవసరమైన ప్రక్రియల విషయంలో చాలా మంది విద్యార్థులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. తెలుగు మీడియం వారు ఉన్నత విద్య, ఉద్యోగ ఇంటర్వ్యూల సమయంలో ఇంగ్లిష్ మీడియం వారితో పోటీ పడలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రతీదీ ఇంగ్లిష్తో ముడిపడింది. వాటిని అందుకోవాలంటే ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాల్సిందే. ఇందుకోసం చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలి. –ఎ.రాజేశ్, ఎమ్మెస్, కాలిఫోర్నియా ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్, వర్జీనియా ఇంగ్లిష్ నైపుణ్యం లేక అవకాశాలు పోయాయి నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదవడంతో అమెరికా వచ్చిన తొలి రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాను. సబ్జెక్ట్ నైపుణ్యం ఉన్నా భావ వ్యక్తీకరణ ఇబ్బంది ఎదురయ్యేది. దీని వల్ల అవకాశాలు కూడా కోల్పోయాను. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కింది తరగతుల నుంచే ఇంగ్లిష్‌లో బోధన ఉండేలా చేయాలి. –సుధాకర్ గౌతమ్, ఎమ్మెస్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్టు ప్రపంచంతో పోటీపడవచ్చు ఇంగ్లిష్‌పై పట్టు లేక.. మంచి ఉద్యోగాలు రాక ఇక్కడ మన వాళ్లు చాలా కష్టపడుతుంటారు. ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడలేక చాలా మంచి అవకాశాలు కోల్పోతుంటారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే ప్రపంచంతో పోటీపడవచ్చు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివించే అవకాశం వదులుకోవద్దు. తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశం అందరికీ ఉండదు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. రాబోయే తరాలకు ఇది మంచి అవకాశం. – పి. దుర్గాచరణ్, ఫుల్‌స్టాక్ డెవలపర్, అమెరిహెల్త్ కారిటాస్, ఫిలడెల్ఫియా పొరపాట్లు దొర్లినా సరిదిద్దుకునే అవకాశం చిన్నప్పటి నుండే ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఒక్కసారిగా పై తరగతుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే... ఇటు సబ్జెక్ట్ అటు ఇంగ్లిష్ రెండూ రాక చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దేశంలో లక్షల మందికి అవకాశాలు లేకపోవడానికి ఇదే కారణం. ఇంగ్లిష్ ప్రావీణ్య కోర్సులు ప్రవేశ పెట్టినంత మాత్రానా ఆ భాషపై పట్టు లభించదు. – జి.నాగశ్రీనివాసులు, సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ, కనెక్టికట్ చిన్నప్పుడైతేనే సులభంగా గ్రహించగలరు ఇంగ్లిష్ మీడియం బోధన చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి. చిన్నతనంలోనే ఏదైనా సులభంగా నేర్చుకుని, గ్రహించగలిగి, ఆకళింపు చేసుకుంటారనేది వాస్తవం. ఇంగ్లిష్ రాక పోవడం వల్ల ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్య కోర్సుల్లో ఎంతో మంది వెనుకబడి పోతున్నారు. సబ్జెక్ట్ ఉన్నా వ్యక్తీకరించలేక అవకాశాలు కోల్పోతున్నారు. తల్లితండ్రులు ఇంగ్లిష్ మీడియం బోధన ఉండేలా చూసుకోవాలి. – నాగసాయి శశాంక్, ఎమ్మెస్, విల్మింగ్టన్ యూనివర్సిటీ, న్యూక్యాజిల్ -
విజ్ఞాన ప్రపంచంలో ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి
సాక్షి, అమరావతి: విజ్ఞానంతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆంగ్ల భాషా పరిజ్ఞానం, నైపుణ్యాలు బాగా ఉన్నవారికే ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ స్పష్టం చేశారు. ఆంగ్ల నైపుణ్యాలు ఉన్నవారికే ఆదాయం కూడా ఎక్కువగా వస్తోందని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ ఎవరూ కాదనలేని వాస్తవమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపవుట్లు పెరగడానికి కారణం.. అక్కడ ఇంగ్లిష్ మాధ్యమం లేకపోవడమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి ఆంగ్ల మాధ్యమంలో సమర్థంగా, సమగ్రంగా బోధించగలిగేలా టీచర్లను తీర్చిదిద్దాలన్నారు. అప్పుడే ఆంగ్ల మాధ్యమం సత్ఫలితాలిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► మాతృభాషలో బోధన శాస్త్రీయమే అయినప్పటికీ ఈనాటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇంగ్లిష్ ప్రభావమే ఎక్కువ. గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ నాలెడ్జి దానిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య లావాదేవీలు కూడా అత్యధికం ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయి. ► ప్రతిభావంతులైన విద్యార్థులు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ► స్టార్ హోటల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం రావాలన్నా మంచి ఇంగ్లిష్ రావాలి. ఆ స్థాయిలో ప్రపంచ ఎకానమీ మారింది. మంచి ఉద్యోగం, ఆదాయం పొందాలంటే అది ఇంగ్లిష్‌తోనే సాధ్యం. ప్రపంచ పరిజ్ఞానం కూడా అత్యధికం ఇంగ్లిష్‌లోనే ఉంది. ఆ విజ్ఞానాన్ని సముపార్జించాలంటే ఇంగ్లిష్ మాధ్యమం కావాల్సిందే. ► అయితే తెలుగు మీడియంలో చదువుకుంటూ ఇంగ్లిష్‌ను నేర్చుకుంటానన్నా అవకాశం ఇవ్వాలి. ► బోధన ఏ మాధ్యమంలో ఉండాలన్నది తల్లిదండ్రులు, పిల్లల నుంచే తెలుసుకోవాలి. వారి అభిప్రాయం మేరకు మాధ్యమం పెట్టాలి. ► ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇంగ్లిష్ మీడియమే కోరుతున్నారు. నా అభిప్రాయం కూడా ఇంగ్లిష్ మాధ్యమం ఉండాలనే. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని పెడితే డ్రాపవుట్లను కూడా నియంత్రించొచ్చు. ఇంగ్లిష్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ప్రతి స్కూల్లో సమర్థులైన ఇంగ్లిష్ టీచర్లను నియమించాలి. ఇంగ్లిష్ ల్యాబ్స్, పుస్తకాలు,రిఫరెన్సు గ్రంథాలను సమకూర్చాలి. అదేవిధంగా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియానికి మార్చేటప్పుడు ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా పాఠశాలల్లో ప్రమాణాలు పెరగాలి. బోధన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. అలాంటి ప్రమాణాలుంటేనే అన్ని వర్గాల మధ్య సమానత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొనే పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు అందుకే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం వల్లే డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. పేదలు కూడా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం కోసమే ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. పేదపిల్లలు ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు వెళ్తున్నారని అధ్యయనం చేస్తే కనిపించే మొట్టమొదటి కారణం.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం లేకపోవడమే. భాషాభిమానం ఉన్నా వాస్తవాన్ని గ్రహించాలి భాషాభిమానం ఉండొచ్చు కానీ రియాలిటీ ఏమిటో గుర్తించాలి. మన అభిప్రాయాలతో రియాలిటీని ఆపలేం. తెలుగును ప్రేమించినంత మాత్రాన ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించాల్సిన పనిలేదు. తెలుగు పండితులు, కవుల పిల్లలు ఈరోజు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. -
ఆంగ్ల మాధ్యమంతోనే విద్యార్థులకు మేలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయిస్తేనే మన పిల్లలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకోగలుగుతారని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఉమ్మడి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ‘ప్రపంచంలో ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉన్న వారికే అన్ని అవకాశాలు దక్కుతున్నాయి. మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారు, ఇక్కడే పరిశ్రమలు పెట్టినవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడిన వారందరూ చిన్నప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారేనన్న విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల మాతృభాష తెలుగుకు ఎలాంటి ముప్పు రాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీనవర్గాలు, నిరుపేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందితేనే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమం ఉండాలో ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు బంగారు భవిష్యత్తు పొందాలంటే ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమం ఎంత అవసరమో తల్లిదండ్రులందరూ గుర్తించాలి’ అని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ► స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లయినా ఇప్పటికీ బడుగు, బలహీనవర్గాలు, పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు తెలుగు మాధ్యమంలోనే కొనసాగుతున్నాయి. ► డబ్బున్న వారి పిల్లలకే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం దక్కేలా కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఆంగ్ల మాధ్యమంలో స్కూళ్లు ఏర్పాటు చేసుకోవడానికి గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయి. ► ఉన్నత వర్గాల వారు ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే ఎందుకు చదువుకుంటున్నారు? మాతృభాషకు ఏదో అయిపోతుందని అంటున్న వారంతా తమ పిల్లలను ఎందుకు ఆంగ్ల మాధ్యమ స్కూళ్లలో చదివిస్తున్నారో చెప్పాలి. ► తెలుగు తప్పనిసరిగా నేర్పిస్తూ ఆంగ్ల మాధ్యమం పెట్టడం వల్ల భాష మరింత అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా పిల్లలు తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ► ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఆంగ్లంలో ప్రావీణ్యం చూపకపోవడానికి కారణం వారు చిన్నప్పుడు తెలుగు మాధ్యమంలో చదువుకోవడమే. ► ప్రైవేటు స్కూళ్లలో కంటే ప్రభుత్వ స్కూళ్లలో ఎంతో నైపుణ్యం ఉన్న టీచర్లున్నారు. ► ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉన్నా ప్రమాణాలు శూన్యం. ► ప్రైవేటు స్కూళ్లను ఏ జీవో ప్రకారం ఆంగ్ల మాధ్యమాలుగా కొనసాగిస్తున్నారో ప్రభుత్వం కూడా అదే జీవో ప్రకారం విద్యార్థుల అభిప్రాయాలకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమాలుగా మార్పు చేస్తే సరిపోతుంది. ఇంగ్లిష్ వచ్చినవారికే ఉద్యోగాలు ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఆంగ్ల మాధ్యమం కావాలని అడుగుతున్నారు. ఇంతకుముందే పేరెంట్స్ కమిటీలు ఈ మేరకు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందించాయి. వారి అభీష్టం ప్రకారం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలి. గతంలో కూడా ఇంగ్లిష్ వచ్చినవారికే ఉద్యోగాలు, ఉపాధి లభించాయి. మాతృభాషను ఇంట్లో నేర్చుకుంటారు ఏ మాతృభాషనైన ఇంటిలో అమ్మానాన్న, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఎలాగూ నేర్చుకుంటారు. దాన్ని స్కూళ్లలో మాధ్యమాలుగా పెట్టనక్కరలేదు. దాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా నేర్పిస్తే చాలు. చాలా భాషలకు లిపి కూడా లేదు. ఆ పిల్లలంతా వారి మాతృభాషలోనే చదువుతున్నారా? వారికి ఇతర భాషా మాధ్యమంలోనే బోధిస్తున్నారు కదా! -
ఇంగ్లిష్ విలాసం కాదు.. అవసరం
ఈ రాష్ట్ర సీఎంగా.. ఓ తండ్రి స్థానంలో ఉన్న నేను నా పిల్లలను ఏ స్కూల్లో చదివించాలనుకుంటాను? తెలుగు మీడియానికి పంపుతానా? మీరు పంపుతారా? ఇక్కడున్న ప్రముఖులను అడుగుతున్నా? మనం ఎవరైనా మన పిల్లలను తెలుగు మీడియంలోనే చదివించాలనుకుంటామా? అలాంటప్పుడు అట్టడుగు వర్గాల వారి పిల్లలను తెలుగు మీడియంలోనే చదివించాలని ఎలా అడుగుతాం? అది సమంజసమేనా? – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో తెలుగు సబ్జెక్టును ఆప్షనల్‌గా మాత్రమే ఉంచారు. కానీ మేము దాన్ని తప్పనిసరి చేశాం. మా దగ్గరకు వచ్చి అడిగే వాళ్లందరికీ నేను చెబుతున్నదేమంటే ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేస్తున్నామని పునరుద్ఘాటిస్తున్నా. నేడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఒకటో తరగతిలో చేరుతున్న ఒక విద్యార్థి డిగ్రీకి వచ్చే సరికి 20 ఏళ్లు అవుతుంది. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి? అప్పటికి కనీసం డ్రైవర్ల అవసరం కూడా ఉండదు అని మాట్లాడుకుంటున్నాం. దీన్ని బట్టి మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించాలి. ఇక్కడ నేనో ప్రాథమిక ప్రశ్న అడుగుతున్నా.. ఇలాంటి అత్యాధునిక కాలంలో ఉంటూ ఇంగ్లిష్ మీడియం వద్దని అనగలమా? సాక్షి, అమరావతి: ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఇవాళ అవసరమే కానీ విలాసం కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్ మీడియంపై విమర్శలు చేస్తూ, తనపై రాళ్లు వేస్తున్న వారి పిల్లలు, మనుమలు ఎక్కడ చదువుతున్నారో చెప్పాలని నిలదీశారు. విజయవాడలో బుధవారం ‘ది హిందూ’ గ్రూపు నిర్వహించిన ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనను వ్యతిరేకిస్తున్న వారు తొలుత వారి పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి మాట్లాడితే బాగుంటుందని చురక అంటించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. 77 శాతం మంది ఇంటర్ తర్వాత మానేస్తున్నారు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్, ఇతర ప్రముఖులతో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏమిటంటే.. మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో చూసుకోవడం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో నిరక్షరాస్యత 33 శాతంగా ఉంది. ఇది దేశీయ సగటు 27 శాతం కంటే ఎక్కువ. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) విషయాన్ని చూద్దాం. 18 నుంచి 23 ఏళ్ల వయసు పిల్లలు కాలేజీల్లో చేరే శాతాన్ని జీఈఆర్ అంటారు. తరుచూ మనం బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనాలతో పోల్చుకుంటూ ఉంటాం. రష్యాలో 81 శాతం మంది, చైనా, బ్రెజిల్ దేశాల్లో 50 శాతం మంది పిల్లలు కళాశాలల్లో చేరుతుంటే మన దేశంలో అది కేవలం 23 శాతంగా ఉంది. అంటే మన దేశంలో 77 శాతం మంది పిల్లలు ఇంటర్ తర్వాత కాలేజీలకు వెళ్లడం లేదు. ఇది వాస్తవం. (చదవండి: భావి తరాల బాగుకే వికేంద్రీకరణ) ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లిష్ అవసరం ఇంగ్లిష్ విషయానికి వస్తే కొన్ని చేదు వాస్తవాలు కనిపిస్తాయి. నేడు అందరూ కంప్యూటర్ వాడుతున్నారు. సెల్‌ఫోన్, స్మార్ట్ ఫోన్, ఐపాడ్ ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నా మౌలిక ప్రశ్న ఏమిటంటే.. వీటిని వాడేందుకు మనం ఏ భాష వినియోగిస్తున్నాం? ఇంటర్నెట్లో వాడే భాషేమిటి? ఇంగ్లిష్ మాత్రమే. ఇవాళ ఇంగ్లిష్ అనేది విలాసం కాదు.. అవసరం. మన పిల్లలకు మంచి ఉద్యోగం కావాలన్నా, మంచి జీతం కావాలన్నా వాళ్లు ఈ ప్రపంచంతో పోటీపడాలి. ప్రస్తుత పరిస్థితి ఇది. 20 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే ప్రపంచం నేడు ఎలా ఉంది? 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతోంది? అనేది చూడాలి. రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఇంగ్లిష్ మీడియం కావాల్సిన అవసరం లేదా? ప్రజలు కోరుకుంటున్నారు కనుకే ఇంగ్లిష్ మీడియం ఇంగ్లిష్ మీడియం చదువులు చాలా ఖరీదుగా ఉన్నాయి. 98.5 శాతం ప్రైవేటు స్కూళ్లు కేవలం ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే నడుస్తున్నాయి. వాటిల్లో తెలుగు మీడియం ఎందుకు లేదు? ఎందుకంటే ప్రజలు అదే (ఇంగ్లిష్ మీడియం) ఆకాంక్షిస్తున్నారు కనుక. వారు పేదరికం నుంచి బయట పడాలనుకుంటున్నారు కనుక. నిరుపేదల జీవన శైలి మారాలంటే, వారికి సరైన విద్య అందించడం ఒక్కటే మార్గం అని నేను బలంగా విశ్వసిస్తున్నా. అదే పోటీ ప్రపంచంలో వారు వారి కాళ్లపై నిలబడేలా చేస్తుంది. భవిష్యత్తులో ఒక డ్రైవర్, ఒక గార్డెనర్ సైతం వచ్చి ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు అందరూ ఇంగ్లిష్ మాట్లాడాల్సిందే కదా! 4 కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో మార్పులు కేవలం ఆంగ్ల మాధ్యమాన్నొక్కటే మేము తీసుకు రావడం లేదు. విద్యా వ్యవస్థలోనే సమూలమైన మార్పును తీసుకువస్తున్నాం. ఇందుకు నాలుగు కార్యక్రమాలను చేపట్టాం. వాటిలో మొదటిది.. పేదలకు అత్యంత ఖరీదైన ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రభుత్వ సూళ్లలో ఉచితంగా (జీరో కాస్ట్) అందిస్తున్నాం. దీనితో పాటు తెలుగును నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తున్నాం. ఈ ఏడాది 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, తర్వాత ఏడాదికో తరగతి చొప్పున నాలుగేళ్లలో 10వ తరగతి వరకూ పెంచుకుంటూ వెళ్తాం. ఆ నాలుగేళ్ల తర్వాత పదో తరగతి పిల్లలు తమ పరీక్షలను ఇంగ్లిష్‌లో రాసేలా చూస్తాం. ఈ నాలుగేళ్ల కాలంలో ఎదురయ్యే సమస్య లేమిటో మాకు తెలుసు. మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ నాలుగేళ్లలో వాటిని పరిష్కరించుకుంటూ వెళతాం. బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తాం. టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వడంలో భాగంగా పేరున్న సంస్థలతో ఇంటరాక్షన్ కార్యక్రమాలు చేపడతాం. రెండోది నాడు–నేడు ఇంగ్లిష్ మీడియంతో పాటు నాడు– నేడు ద్వారా రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ వేళ ఆ స్కూళ్లు ఎలా ఉన్నాయో మూడేళ్ల తర్వాత ఎలా ఉంటాయో చూపించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఏడాదికి 15 వేల స్కూళ్ల చొప్పున మూడేళ్లలో విడతల వారీగా స్కూళ్ల రూపు రేఖలు మార్చబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా స్కూళ్లలో కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగు నీరు, ప్రహరీ, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్ బోర్డులు, పెయింటింగ్, ఫినిషింగ్, ఇంగ్లిష్ ల్యాబ్ వంటివి విధిగా ఉండేలా చర్యలు చేపట్టాం. ఈ విధంగా 9 రకాల పనులు చేసి ఆ స్కూళ్ల స్థితిగతులను మార్చ బోతున్నాం. ఈ ఏడాది 15,750 స్కూళ్లను ఎంపిక చేశాం. మూడోది పౌష్టికాహారం పాఠశాలల నాణ్యత ప్రమాణాల పెంపులో భాగంగా చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం. నేను నా పాదయాత్రలో పిల్లలకు పెడుతున్న భోజనం ఎంత దారుణంగా ఉందో కళ్లారా చూశా. ఇప్పుడు ఆ భోజనాన్ని పూర్తిగా మార్చడమే కాకుండా ఆయాలకు మంచి గౌరవ వేతనం ఇస్తున్నాం. భోజన నాణ్యత పెంచుతూ పిల్లల్ని ఆకట్టుకునేలా రోజుకో రకమైన మెనూ అమలు చేస్తున్నాం. పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. నాలుగో కార్యక్రమం అమ్మఒడి పిల్లల తల్లులను మోటివేట్ చేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 42.32 లక్షల మంది తల్లులకు, తద్వారా 81.77 లక్షల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలిగేలా అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. పిల్లలను బడికి పంపించే తల్లులకు ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు ఇస్తున్నాం. ఈ పథకంలో లబ్ధి కోసం ఈ ఏడాది ఎలాంటి నిబంధనలు లేకపోయినా వచ్చే ఏడాది నుంచి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి. ప్రతి పిల్లవాడు స్కూల్‌కు పోవాలి. చక్కగా ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ఇది తోడ్పడుతుంది. ఆ విధంగా 12వ తరగతి వరకు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాం. పాఠ్యప్రణాళికలోనూ మార్పులు ప్రస్తుతం 23 శాతం మంది పిల్లలు మాత్రమే ఉన్నత చదువుల కోసం కళాశాలల్లో చేరుతున్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా పాఠ్య ప్రణాళికలోనూ మార్పులు చేస్తున్నాం. ఇక నుంచి డిగ్రీ నాలుగేళ్లు ఉంటుంది. ఇంజనీరింగ్ ఐదేళ్లు ఉంటుంది. అన్ని డిగ్రీ కోర్సులు ‘ఆనర్స్’గా మారతాయి. చివరి ఏడాది తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌షిప్ ఉంటుంది. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండేలా పాఠ్య ప్రణాళికలో మార్పులు తెస్తున్నాం. మంచి చేస్తుంటే రాళ్లు వేస్తున్నారు.. విద్యార్థులకు, సమాజానికి ఎంతో అవసరం అయిన ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ, రాళ్లేయాలని చూస్తున్నారు. మీరు.. మీ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ.. పేదింటి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ఒకవేళ మీరు మీ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తుంటే మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టొద్దు’ అని సీఎం జగన్ అన్నారు. ఉన్నత చదువుల కోసం అప్పులపాలు కానివ్వం పిల్లల ఉన్నత చదువుల కోసమని తల్లిదండ్రులు అప్పుల పాలు కావాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. దీని ద్వారా విద్య పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. ఇదొక్కటే కాకుండా విద్యార్థుల వసతి, భోజన అవసరాల కోసం ఏటా రూ.20 వేలు ఇవ్వబోతున్నాం. ఏటా ఫిబ్రవరిలో రూ.10 వేలు, ఆ తర్వాత జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు ఇస్తాం. ఈ పథకాలే విద్యా దీవెన, వసతి దీవెన. నాణ్యమైన విద్య అనేది పిల్లలకు మనమిచ్చే ఒక ఆస్తి. ఆ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. విద్య వల్ల దారిద్య్రం పోతుంది. పేద కుటుంబాలు కూడా ఎంతో వృద్ధిలోకి వస్తాయి. వీటన్నింటి ద్వారా విద్యా రంగంతో పాటు, పేద కుటుంబాలలో కూడా మార్పులు తీసుకువస్తున్నాం. విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచేందుకు మేము చేస్తున్న కృషి ఇది. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారి జీవనం మెరుగు పడేందుకు ఈ ప్రభుత్వం తెస్తున్న విద్యా సంస్కరణలు ఎంతో సాయపడతాయి. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఆ దేవుని ఆశీస్సులతో పాటు, ప్రజల దీవెనలు, భావసారూప్యతగల వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. మా ఈ కార్యక్రమానికి ది హిందూ లాంటి పత్రికలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. టీచర్లకు శిక్షణ పరిస్థితి ఏమిటి? : ఎన్ రామ్ ‘మీరు చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం విషయంలో ఏం చేయబో తున్నారు?’ అన్న ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్ ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. వేదికపై ఉన్న మా విద్యా శాఖ మంత్రి సురేష్ సమాధానం ఇస్తారన్నారు. ‘మా మంత్రి రెవెన్యూ సర్వీస్‌లో పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. సామాజిక మార్పును కోరుకుంటున్నారు. అందుకే ఆయన్ను విద్యా శాఖ మంత్రిని చేశాం. మేము ఆశిస్తున్న మార్పును ఆయనే ముందుండి నడిపిస్తారు. ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి టీచర్ల ట్రైనింగ్ కోసం ఓ కరిక్యులమ్ తయారు చేశాం. ప్రాథమికంగా జిల్లాకు 20 మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం. వారు మిగతా వాళ్లకు శిక్షణ ఇస్తారు. ఒకపక్క టీచర్లకు ట్రైనింగ్ కరిక్యులమ్‌తో పాటు మరో వైపు విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సును ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి వెట్రి శెల్వన్ అనే యువ ఐఏఎస్ ఆఫీసర్‌ను ఇంచార్జ్‌గా నియమించాం. ఈ అంశాలకు సంబంధించి అన్ని విషయాలను ఆమె వివరిస్తారు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం విప్లవాత్మకం నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక ముందడుగు అని ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టబోతున్న వైఎస్ జగన్ డైనమిక్ సీఎం అని అభివర్ణించారు. సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. కేవలం ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనే కాకుండా మొత్తం విద్యా వ్యవస్థలో సంస్కరణలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. 3,648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలను, బాధలను కళ్లారా చూశారని, ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలను తీరుస్తుండటం అభినందనీయం అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రభుత్వ స్కూళ్ల దుస్థితిని, అక్షరాస్యత శాతాన్ని చూసిన తర్వాత గ్రామీణ, ప్రభుత్వ స్కూళ్లను సంస్కరించి బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవాలనే సంకల్పంతో విద్యా సంస్కరణలకు నడుంకట్టారని ప్రశంసించారు. ప్రైవేట్ స్కూళ్లలో మాదిరి సర్కారీ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని కొనియాడారు. తమిళనాడు, కేరళలో ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా లేదని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అభినందించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. ఇంగ్లిష్‌లో విద్యా బోధనను పలువురు విమర్శిస్తున్నప్పటికీ వారి పిల్లలను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో టీచర్ ట్రైనింగ్ వర్సిటీ : మంత్రి సురేష్ రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన నేపథ్యంలో టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం ఆయన మాట్లాడారు. టీచర్లు, విద్యార్థులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేందుకు ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటున్నామని చెప్పారు. విద్యావేత్తల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాలకు చెందిన రిసోర్స్పర్సన్లు హాజరయ్యారు. -
తెలుగు భాషపైన నిజమైన ప్రేమేనా?
ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులకు హఠాత్తుగా తెలుగు భాషపైన ఎక్కడ లేని ప్రేమ పుట్టు కొచ్చింది. తెలుగు భాష సంస్కృతి అంతమైపోయిందన్న ఆందోళనతో నిద్రకూడా పోవడం లేదు. ఇప్పటికిప్పుడు తెలుగు పైన ఇంత అభిమానం ఎందుకు కలిగింది? ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక విద్య ఆంగ్ల మాధ్య మంలో ఉంటుందన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటన వల్లనే గదా. తెలుగు మాట్లాడితే జరిమానా విధిస్తూ, ఎండలో నిలబెట్టి శిక్షిస్తూ, తెలుగు వాసనని కూడా లోపలికి రాకుండా జాగ్రత్త పడుతున్న కార్పొరేట్ స్కూళ్లలో సంపన్న వర్గాల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నప్పుడు తెలుగు భాషకు ఏ అపకారం, అపచారం జరగలేదా? ఇప్పుడు పేదలు, బలహీనవర్గాలు, దళిత, మైనారి టీల పిల్లలు ఇంగ్లిష్‌లో చదువుకుంటేనే తెలుగుకు అంత పెద్ద ఉపద్రవం వచ్చి పడబోతున్నదా? తెలుగు భాషపైన ఇప్పుడు అలవిమాలిన ప్రేమని ఒలకబోస్తున్న గత ప్రభుత్వం తెలుగు భాషాభి వృద్ధికి ఏం చేసింది? ఓరియంటల్ కళాశాలలు వరుసగా మూతప డుతున్నాయి. భాషా ప్రవీణ, విద్వాన్ వంటి కోర్సుల సిలబస్‌లో తెలుగు భాషకు సంబంధిం చిన సిలబస్‌ను తగ్గించి ఇంగ్లిష్‌ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. మరి పద్నాలుగేళ్లు సీఎం రాజ్య మేలిన చంద్రబాబుకు, ఆయన అనుచరు లకు, వంత పాడుతున్న మేధావులకు ఆనాడే తెలుగు భాషకు జరిగిన అపచారం తెలీలేదా? మరో విషయం. టెన్త్, ఇంటర్ తరగతుల్లో సంస్కృతం పేపర్ ఎందుకొచ్చింది? ఎవరి ప్రయోజనం కోసం వచ్చింది? తెలుగు పేపర్‌ను వదిలేసి విద్యార్థు లంతా సంస్కృతం పేపర్లోకి పరుగులు తీసే పరి స్థితి ఎందుకేర్పడింది? విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ సంస్థలు ర్యాంకుల పంట పండించు కోవడం కోసం కాదా? దీంతో తెలుగు బడులకు మనుగడ లేక, తెలుగు పండితులకు గౌరవం లేక, తెలుగు భాష ఇంత చులకనైపో తుంటే, పలుచనై పోతుంటే ఇన్నేళ్లుగా చూస్తూ కూర్చున్నారు కదా.. ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడే అర్హత వీరికి ఎక్కడినుంచి వచ్చింది? గ్రామీణ ప్రాంతాల బడుల్లో సరిపడినంత విద్యార్థులు లేరన్న నెపంతో గత ప్రభుత్వం వేలాది బడులను మూసివేసింది. దాంతో పేద విద్యార్థులు అప్పులు చేసి ప్రైవేటు బడులకు పరు గులు తీయవలసి వచ్చింది. ఆ మాత్రం శక్తి కూడా లేని వేలాదిమంది పసివాళ్లు బడిబాటే మర్చి పోవాల్సి వచ్చింది. ఇంత నిర్దయగా నిరుపేదలు, బడుగు, బలహీనుల బిడ్డలకు చదువుని దూరం చేసి గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు పసి బిడ్డల చదువుల గురించి కాకుండా వాళ్ల భాష గురించి బాధపడటం ఎంత విచిత్రం. మాతృభాషలో విద్యాబోధనే ఉత్తమం అని మేధావులు, భాషా శాస్త్రవేత్తలు చెబుతోంది నిజమే. అయితే మాతృభాషలోనే ఉన్నత విద్య అభ్యసిస్తున్న జర్మనీ, జపాన్, రష్యా వంటి పలు దేశాల పరిస్థితి వేరు. ఈ దేశాలు ఆంగ్లేయుల పాలనకు తలొగ్గలేదు. ఇంగ్లిష్ నేర్చుకునే అవసరం వారికి ఏర్పడనందున శాస్త్ర, సాంకేతిక జ్ఞాన మంతా వారి మాతృభాషలోనే లభ్యమవుతుంది. కానీ భారత్ వంటి దేశాల పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ వలసగా మనం ఉండటంతో ఇంగ్లిష్ మనపై బలవంతంగా రుద్దారు. భారతీయులు అనివార్యంగా ఇంగ్లిష్ నేర్చుకోవలసి వచ్చింది. ఇంగ్లిష్‌లో మాట్లాడటం గొప్ప అన్న భావన స్థిరపడి పోయింది. ఇంగ్లిష్ రానివాళ్లు ఆత్మన్యూనతలో ఉండిపోయారు. అంతగా పాతుకుపోయిన ఆంగ్ల భాషను ఇప్పటి కిప్పుడు తోసెయ్యగలమా? వారు చెబుతున్నట్లే తెలుగు భాషని ఉద్ద రిద్దాం. ‘ఆంధ్రదేశంలోని ప్రతి పాఠశాలలోనూ ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించాలి, ఏ మినహాయింపూ లేకుండా ప్రతి తెలుగువాడూ తెలుగు మాధ్యమంలోనే చదువుకోవాలి’ అనే నినా దంతో ముందుకురండి. ఆ ఉద్యమాన్ని చేపట్టండి. కనీసం ఒక ప్రకటన చేయగలరా? చేయలేరు. ఇంగ్లిష్ మీడియం బడుల్ని పల్లెత్తు మాటనలేరు. ఇంగ్లిష్తో విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థలకు నష్టం జరిగే ఏ నిర్ణయమూ తీసుకోలేరు. ఎందు కంటే ఆ వ్యాపార సంస్థలు మన వాళ్లవి. అక్కడ చదువుకోవలసింది మన పిల్లలు. ఏమిటీ ద్వంద్వ నీతి? లెక్కలు, సైన్సు, సోషల్ ఇంగ్లిష్‌లో బోధిం చినంత మాత్రాన తెలుగు అంతమైపోతుందా? ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వాళ్లు మాత్రమే తెలుగును బ్రతికించాలా? ఇంగ్లిష్ మాధ్యమంలో చదివే సంపన్నులకు ఆ బాధ్యత లేదా? పైగా అంబేడ్కర్ అంత గొప్పవాడు కాలేదా? పీవీ నరసింహారావు దేశ ప్రధాని కాలేదా? సీవీ రావు సైంటిస్ట్ కాలేదా? అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాలేదా? వారంతా వారి వారి మాతృభాషల్లో ప్రాథమిక విద్య అభ్యసించినవాళ్లే కదా అంటూ ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లని ఉదా హరణగా చూపిస్తున్నారు. ఇదెలా ఉందంటే కార్పొ రేట్ విద్యా సంస్థలు ఒకటి రెండు ర్యాంకులు చూపించి తమ వద్ద చదివితే అందరికీ ఇలాంటి ర్యాంకులు వస్తాయన్న భ్రమని కల్పించి దోచు కుంటున్నట్టుగా ఉంది. స్వయం ప్రతిభతో, అసా ధారణ మేధస్సుతో రాణించే వాళ్లకు ఇవేవీ వర్తిం చవు. పైగా వారు చదువుకునే రోజుల్లో ఊళ్లో ఒకే బడి ఉండేది. అందరికీ ఒకే సిలబస్ ఉండేది. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వృద్ధి చెందేవారు. ఇప్పుడా పరిస్థితి ఉందా? విద్యార్థి లోక మంతా నిట్టనిలువునా రెండుగా చీలిపోలేదా? సంపన్నులందరూ ప్రైవేట్ బడుల్లోకి, పేదలు, బలహీన వర్గాలూ ప్రభుత్వ బడుల్లోకి అనివా ర్యంగా నెట్టబడలేదా? ఈ విభజన ఎవరి ప్రయో జనం కోసం జరిగింది? ఈ తెలుగు వాదం చేస్తున్న పెద్దలెవరైనా వాళ్ల పిల్లల్ని ఒక్క సంవత్సరం ఆ బడుల్లో చదివించగలరా? తమిళ మాధ్యమంలో చదివిన వారికి తమిళులు 20 శాతం రాయితీ ఇస్తు న్నారు. కన్నడిగులు 10 శాతం ఇస్తున్నారు. తెలు గుపైన అంత ప్రేమ ఉంటే గత ప్రభుత్వం వారి నెందుకు ఆదర్శంగా తీసుకోలేదు. ఇప్పుడు 90 శాతం మంది ప్రజల్ని పీడించి దోపిడీ చేస్తున్నాయి విద్య, వైద్య రంగాలు. వాటిని సమూలంగా సంస్కరించే ప్రయత్నం ప్రారంభించారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు 9 రకాల వసతులు సమకూరుస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. తెలుగు భాష బాగుండాలి అనేవారు అంతకంటే ముందు తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకోవాలి. వ్యాసకర్త, పాటిబండ్ల ఆనందరావు, మొబైల్ : 98498 98800. -
ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే టాప్
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. పాఠశాలల విద్యార్థుల్లోని ప్రమాణాలను గమనిస్తే తెలుగు మాధ్యమ విద్యార్థుల కంటే ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే అన్ని అంశాల్లో ముందంజలో ఉన్నారని తేలింది. ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలను విశ్లేషించిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఈ అంశాలను నిగ్గుతేల్చింది. ఏ గ్రేడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులదే అగ్రస్థానం 2018–19 విద్యా సంవత్సరంలో 6, 7, 8, 9 తరగతుల ఎస్ఏ–2 పరీక్షల ఫలితాలను ఎస్సీఈఆర్టీ పరిశీలించగా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే ముందంజలో ఉన్నారు. ఏ–1 నుంచి బీ2 వరకు గ్రేడ్ల సాధనలో వీరిదే పైచేయి. తెలుగు మాధ్యమ విద్యార్థులు వెనుకంజలో ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లు పరుగులు.. ప్రభుత్వ స్కూళ్లు నత్తనడక తెలుగు మాధ్యమంలో నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు మంచి గ్రేడ్లు సాధించలేకపోతున్నారు. ఏ1తోపాటు ఆ తర్వాత గ్రేడ్లలో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే అత్యధికం సాధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం నడుస్తున్న ప్రభుత్వ గురుకుల స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ స్కూళ్ల ప్రమాణాలు బాగుండగా తెలుగు మాధ్యమం నడుస్తున్న ఇతర ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే వెనుకబడి ఉంటున్నారు. సబ్జెక్టుల ఉత్తీర్ణతలోనూ ఆంగ్ల భాషలోనే అధికం ఇక సబ్జెక్టుల వారీ ఉత్తీర్ణతను చూసినా ఆంగ్ల భాషదే పైచేయిగా ఉంది. తెలుగు విద్యార్థులు సంఖ్యలోనే కాకుండా ఉత్తీర్ణతలోనూ వెనుకంజలోనే ఉన్నారని ఎస్సీఈఆర్టీ విశ్లేషణలో తేలింది. లెక్కల్లో అత్యధిక శాతం మంది ఉత్తీర్ణులవ్వగా భౌతిక శాస్త్రంలో వెనుకబడుతున్నారు. ఆంగ్ల మాధ్యమంతోనే మెరుగైన ఫలితాలు – ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ 2008లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సక్సెస్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఫలితాలను విశ్లేషిస్తే ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులే మంచి ఫలితాలు సాధిస్తూ ప్రైవేటు విద్యార్థులకు దీటుగా రాణిస్తున్నారు. గత ఐదేళ్ల ఫలితాలను విశ్లేషించినా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే అత్యధికంగా ఉత్తీర్ణతను సాధించారు. ప్రభుత్వం ఇప్పుడు అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో మరింత మంచి ఫలితాలు వస్తాయి. అందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనలో అత్యుత్తమ రీతిలో శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇతర రాష్ట్రాలు, సింగపూర్, అమెరికా సహా ఇతర దేశాలకు చెందిన పాఠ్యపుస్తకాల సిలబస్‌లను పరిశీలించి ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నాం. -
ఘోరతప్పిదం: తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ నిర్వహించిన రాతపరీక్షలో తెలుగు మీడియం అభ్యర్థులకు 14 ప్రశ్నలను ఎటువంటి అనువాదం లేకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. దీనిని ఘోర తప్పిదంగా అభివర్ణించింది. పోటీ పరీక్షల్లో ఒక్కో మార్కు కూడా అభ్యర్థి జీవితాన్ని తారుమారు చేస్తుందని, అటువంటిది 14 ప్రశ్నలను ఇంగ్లిష్‌లోనే ఇచ్చారంటే అభ్యర్థులు 14 మార్కులు కోల్పోయినట్లేనని బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలుగు మీడియంలో పరీక్ష రాసిన అభ్యర్థుల 4.62 లక్షల మంది పరిస్థితి ఏంటని, ఈ ఘోర తప్పిదాన్ని ఎలా సరి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చేసిన తప్పును ఒప్పుకుని దానిని సరిదిద్దుకోవాలే తప్ప, సమర్థించుకోవడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికింది. పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసే ప్రసక్తే లేదని జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు తేల్చి చెప్పారు. తమకు స్పష్టత వచ్చేంత వరకు ఆ మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ 14 ప్రశ్నల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మొత్తం 6 ప్రశ్నలకు తుది కీలో ఇచ్చిన సమాధానాలు తప్పుగా ఉన్నాయంటూ అభ్యర్థులు చెబుతున్న నేపథ్యంలో వాటి విషయంలో ప్రభుత్వ వైఖరేంటో తెలపాలంటూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. నిబంధనల ప్రకారమే: సర్కారు ఇదిలా ఉంటే, పంచాయతీ కార్యదర్శుల పోస్టుల విషయంలో రిజర్వేషన్లు 50% దాటాయన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో, సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం 100 పాయింట్ రోస్టర్‌ను, ఆ రూల్స్‌లోని 22వ నిబంధనను, అలాగే జీవో 107 ప్రకారం నడుచుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అదే విధంగా స్పోర్ట్స్ కోటా కింద అర్హుల జాబితా తయారీ విషయంలోనూ తప్పు జరిగిందని, దానిని సరిదిద్దుకుంటామని వివరించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగడం లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఇదే సమయంలో తుది కీలో పలు తప్పులున్నాయని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్‌లో ప్రశ్నలు ఇచ్చారంటూ మరికొంత మంది అభ్యర్థులు లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై కూడా న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. అందరికీ కోర్టుకొచ్చేంత స్తోమత ఉంటుందా? నలుగురైదుగురి కోసం మొత్తం నియామక ప్రక్రియను ఆపేయడం సరికాదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. బయట అభ్యర్థులు న్యాయస్థానాలను నిందిస్తున్నారని చెప్పారు. కోర్టుకొచ్చిన పిటిషనర్లకు మాత్రమే మధ్యంతర ఉత్తర్వులను పరిమితం చేయాలని కోరారు. దీనికి న్యాయమూర్తి ఒకింత ఘాటుగా స్పందిస్తూ.. ‘బయటకు ఎవరు ఏమనుకుంటున్నారో మాకు అనవసరం. నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయా? లేదా? నిబంధనలు అమలు చేస్తున్నారా? లేదా? అన్నదే మాకు ముఖ్యం. కోర్టుకు రాలేని అభ్యర్థికి సైతం కోర్టు ఆదేశాలను వర్తింప చేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా ప్రతీ అభ్యర్థికి కూడా కోర్టుకు వచ్చే స్థోమత ఉండకపోవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి హైకోర్టుకు వచ్చి, డబ్బిచ్చి న్యాయవాదిని పెట్టుకుని వాదనలు వినిపించే పరిస్థితి ఉండకపోవచ్చు. మరి వారి సంగతేమిటి? వారు కోర్టుకు రాలేదు కాబట్టి వారికి మేం ఇచ్చే ఉత్తర్వులు వర్తించవద్దంటే ఎలా?’ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు దానిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలే తప్ప, ఆ తప్పు జరిగిన తీరును వివరిస్తూ దానిని సమర్థించుకునే ప్రయత్నం చేయరాదని హితవు పలికారు. ఈ వ్యవహారంపై సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేసిన న్యాయమూర్తి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సర్కారుకు సూచించారు. ఇదే సమయంలో పిటిషనర్లు పలు ప్రశ్నలకు అసలు సమాధానాలను, కీలో పొందుపరిచిన తప్పుడు సమాధానాలను ఇచ్చారంటూ ఆధారాలతో చూపగా.. వీటిని న్యాయమూర్తి రికార్డ్ చేసుకున్నారు. మా దృష్టికి తీసుకురాలేదు ఈ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ, తమకు ఈ విధంగా 14 ప్రశ్నలు ఇంగ్లీష్‌లో వచ్చినట్లు తమ దృష్టికి తీసుకురాలేదని, ఇప్పుడు కోర్టుకొచ్చి రాద్దాంతం చేయడం సరికాదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ‘ఇప్పుడు తీసుకొచ్చారు కదా. తప్పును సరి చేయండి’అని సూచించారు. తెలుగు మీడియంలో ఎంత మంది పరీక్ష రాశారని ప్రశ్నించిన న్యాయమూర్తి.. 4.62 లక్షల మంది రాశారని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ‘వారంతా కూడా ఈ 14 ప్రశ్నలను వదిలేసి ఉంటే మొత్తం నియామకపు ప్రక్రియ పరిస్థితే మారిపోతుంది. వీరిందరికీ కూడా 14 మార్కులు ఇవ్వాల్సి వస్తే అప్పుడు నియామకాల సంగతేంటి? ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయండి. నియామకపు పత్రాలు ఇవ్వొద్దంటూ గతవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయి’అని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌లో ఇస్తే.. వారికి కష్టమే కదా! ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏ మీడియం ఎంచుకున్న అభ్యర్థులకు ఆ మీడియంలో ప్రశ్నాపత్రం ఇవ్వాలని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్, దాని కిందనే తెలుగులో కూడా ప్రశ్న ఇచ్చారని తెలిపారు. అయితే 56 నుంచి 70 ప్రశ్నల వరకు ఇంగ్లీష్‌లోనే ప్రశ్నలున్నాయని, వాటిని తెలుగులోకి అనువదించలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన ప్రశ్నల కాపీలను ఆయన కోర్టు ముందుంచారు. ఈ ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉన్నాయని, వీటిని చదివి సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో పిటిషనర్లు ఆ 14 ప్రశ్నలను వదిలేశారని వివరించారు. దీనిపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేస్తూ ..‘తెలుగు మీడియం అభ్యర్థులకు ఇలా 14 ప్రశ్నలను ఇంగ్లీష్‌లో ఇవ్వడం ఏంటి? ఇలా ఇస్తే అది వారికి కష్టమే కదా’అని వ్యాఖ్యానిం చారు. పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు కూడా జీవితాన్ని తలకిందులు చేస్తుందని, అలాంటిది ఏకంగా 14 ప్రశ్నలంటే, అది చాలా ఘోర తప్పిదమన్నారు. -
‘డైట్’లో ఇంగ్లిష్ మీడియం
∙ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు ∙ తెలుగు మీడియంలో 50 సీట్ల కోత ∙ ఆదిలాబాద్ ‘డైట్’లో అమలు ∙ సర్కార్ బడుల్లో ఆంగ్ల విద్యాబోధన కోసం నిర్ణయం ఆదిలాబాద్‌టౌన్: సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్æ) కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ఇదివరకు తెలుగు, ఉర్దూ మీడియంలో డైట్ కళాశాలల్లో తరగతులు నిర్వహించే వారు. ఇకనుంచి అభ్యర్థులకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ప్రైవేట్ వైపే మొగ్గు చూపుతున్నారు. సర్కారు బడుల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గడం, కొన్ని పాఠశాలలు మూతపడుతున్నాయి. దీంతో సర్కార్ బడులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డీఎడ్, బీఎడ్ శిక్షణ పూర్తి చేసిన వారితో విద్యాబోధన చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో డీఎడ్ విద్యార్హత లేని వారితోనే విద్యాబోధన సాగుతోంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభించినా తెలుగు మీడియం ఉపాధ్యాయులతోనే పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఆంగ్ల బోధనకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆరు డైట్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డైట్ కళాశాల, మావల మండల కేంద్రంలో వివేకానంద డీఎడ్ కళాశాల, కుమురంభీం(ఆసిఫాబాద్) జిల్లాలో శ్రీనిధి, మంచిర్యాలలో ఎస్‌ఆర్‌కేఎం డీఎడ్ కళాశాల, నిర్మల్‌లో పంచశీల్, ఉట్నూర్‌లో పులాజీ బాబా డీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ, వివేకానంద కళాశాలల్లో 100 సీట్ల చొప్పన, మిగతా కళాశాలల్లో 50 సీట్ల చొప్పన ప్రవేశాలు చేపడుతున్నారు. ఇదివరకు ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో మొత్తం 150 సీట్లకు ప్రవేశాలు చేపట్టేవారు. ఉర్దూ మీడియంలో 50 సీట్లు, తెలుగు మీడియంలో 100 సీట్లు అభ్యర్థులకు కేటాయించే వారు. ఈ విద్యా సంవత్సరంలో తెలుగు మీడియంలో 50 సీట్లకు కోత విధించారు. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం కలిగే విధంగా ఉంది. భవిష్యత్తులో సర్కారు బడులకు డిమాండ్.. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను ప్రవేశపెట్టడంతోపాటు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో సర్కారు బడులకు డిమాండ్ పెరగనుంది. ఇంగ్లిష్ మీడియం బడులకు అవసరమైన బోధకులను తయారు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పటిష్టం చేయనుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది. తెలుగు మీడియం విద్యార్థులకు నష్టం.. ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో తెలుగు మీడియంలో వంద సీట్లు భర్తీ చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 50 సీట్లను కుదించారు. దీంతో తెలుగు మీడియం 50 మంది విద్యార్థులకు నష్టం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మీడియంకు సంబంధించి మొత్తం 1050 సీట్లను ప్రభుత్వం తగ్గించింది. ఇందులో పది జిల్లాల్లోని ప్రభుత్వ డైట్ కళాశాలల్లో 50 సీట్ల చొప్పున 500 సీట్ల కోత విధించగా, మిగతావి ప్రైవేట్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను కేటాయించారు. ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు మాత్రం మేలు జరిగే విధంగా ఈ నిర్ణయం ఉంది. కొత్త సీట్లు పెంచేది పోయి తగ్గించడం, ప్రస్తుతం కౌన్సెలింగ్ కొనసాగుతుండడంతో జిల్లాలో 50 మంది అభ్యర్థులకు సీట్లు రాకుండా పోయాయి. -
తెలుగు అంటే చాలా ఇష్టం: సివిల్స్ ర్యాంకర్
హైదరాబాద్: తెలుగు అంటే తనకు ఎంతో ఇష్టమని, తెలుగులోనే పరీక్ష రాశానని సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంటే స్నేహితులు, గురువులు అవమానించారని వాపోయారు. దూరవిద్యలో డిగ్రీ చేసి సివిల్స్‌కు ప్రిపరేషన్ అంటే ఎవరెస్టు అధిరోహించడమే అంటూ నిరుత్సాహపరిచారని అన్నారు. గురువారం ‘సాక్షి’ టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తన కుటుంబం ఎంతగానో ప్రోత్సహించిందన్నారు. గ్రామీణ వాతావరణం, అణగారిన వర్గాల పరిస్థితుల కారణంగా సివిల్స్ వైపు వెళ్లానని వెల్లడించారు. ‘మా గ్రామం నుంచి మమ్మల్సి వెలివేయడం నాకు మరింత కసిని పెంచింద’ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ గ్రామానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం రాత్రి ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామి నేషన్–2016 ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించారు. -
టెన్త్‌లో పెరిగిన ఇంగ్లిషు మీడియం విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు 5,09,831 మంది రెగ్యులర్ విద్యార్థులు, 28,397 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు హాజరుకానున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 2,96,251 మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులు, 2,01,262 మంది తెలుగు మీడియం విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే వారిలో తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య 10 శాతం వరకు తగ్గిపోగా, ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పెరిగింది. గతేడాది తెలుగు మీడియం విద్యార్థులు 49 శాతం మంది పరీక్షలకు హాజరుకాగా ఈసారి ఆ సంఖ్య 39.47 శాతానికి పడిపోయింది. ఇంగ్లిషు మీడియంలో పరీక్షలు రాసిన విద్యార్థులు 51 శాతం ఉండగా ఈసారి అది 58.10 శాతానికి పెరిగింది. మరో 2.42 శాతం మంది విద్యార్థులు ఇతర మీడియంలలో పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారు. ఇంగ్లిషు మీడియంపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి కారణంగా తెలుగు మీడియంలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2016–17 విద్యా సంవత్సరంలో 128 ప్రైవేటు పాఠశాలలు తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంలోకి మారాయి. మరోవైపు మోడల్ స్కూళ్లలో సీట్లు పెరగడం, కొత్త ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుతో ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. 2,856 కేంద్రాల్లో పరీక్షలు.. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం చేస్తున్న ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,856 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 5,38,228 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు పరీక్షకు విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఆలస్యం కాకుండా చూసుకోవాలని పరీక్ష విభాగం అధికారులు స్పష్టం చేశారు. -
తెలుగు మీడియం కొనసాగించాలి
– కలెక్టరేట్ ఎదురుగా జీఓ నెం.14 జీఓ కాపీలు దగ్దం కర్నూలు (న్యూసిటీ): మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని కొనసాగించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎన్.నరసింహుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.14 కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. తెలుగుమీడియం ఎత్తేస్తే మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేష్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామశేషయ్య మాట్లాడుతూ తెలుగు జాతి, తెలుగు భాషను కాపాడటానికి తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని గొప్పలు చెప్పే నాయకులు ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే జీఓ నెం.14ను రద్దు చేయాలని లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి.ఆనంద్, జిల్లా కార్యదర్శి జి.ఆనంద్‌కుమార్, జిల్లా నాయకులు నాగరాజు, శశికుమార్, రఫీ, తిరుమల చౌదరి పాల్గొన్నారు. -
ఏపీలోని మున్సిపల్ స్కూల్లో హౌస్‌ఫుల్ బోర్డు
సీట్లు లేవని బోర్డు పెట్టిన పాఠశాల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హౌస్‌ఫుల్ బోర్డు పెట్టారు.. నిజమే.. ఏపీలోని నెల్లూరులోని కేఎన్నార్ మున్సిపల్ హైస్కూలు ముందు ఈ బోర్డు కనిపిస్తోంది. సాధారణంగా కార్పొరేట్ పాఠశాలల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు నెల్లూరు నగరపాలక సంస్థ పాఠశాలలో కూడా ఈ దృశ్యం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. 7, 8, 9, 10 తరగతుల్లో సీట్లు లేవు అని ఇక్కడ బోర్డు పెట్టారు. ఏటా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు వస్తుండటంతో పేద, మధ్యతరగతికి చెందిన ప్రజలు ఈ పాఠశాలలో పిల్లలను చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో బోధిస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 నుంచి 220 మంది వరకు విద్యార్థులున్నారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయప్రకాష్ తెలిపారు. కేవలం 6వ తరగతికి మాత్రమే బడి పునఃప్రారంభమైన 13వ తేదీ నుంచి కొత్తగా విద్యార్థులను చేర్చుకుంటామని చెప్పారు. ఏటా ఈ స్కూల్లో 1,200 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. - నెల్లూరు టౌన్ -
తెలుగును గౌరవించండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో గల అన్ని ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు తమకు ఇష్టం లేన ప్పటికీ బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని సైతం ప్రారంభిం చాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండు గాలిలో కలిసిపో యింది. సక్సెస్ పాఠశాలల తరహాలో ఆదర్శ పాఠశాలల్లో సైతం ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెడితే ప్రయోజన కరంగా ఉంటుంది. మన రాష్ట్రంలో 155 ఆదర్శ పాఠశాలలున్నాయి. ఇక కస్తూర్బా గాంధీ బాలి కా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రస్తుత విద్యా సంవత్సరం (2015-16) నుంచి తెలుగు మాధ్యమాన్ని తొల గించి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలను జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 352 కేజీబీవీలుండగా, 18 కేజీబీవీల్లో ఆంగ్ల మాధ్యమం ఇప్పటికే ఉంది. అయితే సవరించిన ఉత్తర్వుల మేరకు మిగిలిన 334 విద్యాలయాల్లో సైతం కొత్త విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ ఉత్త ర్వులు సైతం తెలుగు భాషకు తీరని అన్యాయం చేస్తాయని వేరేగా చెప్పనవసరం లేదు. ఇకనైనా ప్రభుత్వం ఆదర్శ పాఠశా లలతో పాటు కేజీబీవీల్లో ఆంగ్ల భాషకు సమాంతరంగా తెలు గు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి. ఇందుకోసం శాంతియుతంగా ఉద్యమించాలి. వి. కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా -
నేటి నుంచి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): శాస్త్ర సాకేంతిక రంగాల పరిశోధనలో విద్యార్థులను ఆకర్షించేం దుకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన(ఇన్స్పైర్) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. స్థానిక సంతపేట సెయింట్‌జాన్స్ తెలుగుమీడియం పాఠశాల్లో జిల్లా స్థాయి 4వ ఇన్‌స్పైర్‌ను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలను తెలిపే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం 10 కౌం టర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో సు మారు 700 మంది విద్యార్థులు తమ సృజనాత్మక శక్తిని ప్రదర్శించనున్నారు. ఒక్కొక్క ప్రాజెక్ట్‌కు ఒక విద్యార్థి, ఒక గైడ్ హాజరవుతారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు గైడ్ సాయంతో వివిధ అంశాలపై ప్రాజెక్ట్‌లను రూపొందించారు. పదర్శనలో పాల్గొనే వారికి ఉచిత భోజన వసతిని కల్పించారు. మొత్తం ప్రాజెక్ట్‌ల్లో 7 శాతం ప్రాజెక్ట్‌లను రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపిక చేస్తారు. డీఈఓ ఎన్.ఉషా, డిప్యూటీ ఈఓలు మేరీచంద్రిక, మేరీహారతి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాఠశాల స్థాయి నుంచే సైన్స్‌పై అవగాహన కలిగించేందుకు ఇన్స్పైర్ కార్యక్రమాన్ని 12వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రాజెక్ట్, మో డల్ రూపొందించేందుకు రూ.5 వేలను చెల్లిస్తారు. సైన్స్ టీచర్ మార్గదర్శకంలో విద్యార్థి సృజనాత్మకతను జోడించి విజ్ఞానాభివృద్ధికి తోడ్పడేలా మోడల్స్‌ను తయారు చేయాలి. నిర్దేశించిన సమయం ఈ వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించేందుకు డివి జన్ల వారీగా తేదీలను నిర్ణయించారు. 30న ఉదయం కావలి డివిజన్, నెల్లూరు డివిజన్ రైల్వే ట్రాక్ తూర్పు వైపు ఉన్న పాఠశాల విద్యార్థులు, 31న గూడూరు డివిజన్, నెల్లూరు డివి జన్ రైల్వే ట్రాక్‌కు పడమర వైపున్న స్కూళ్ల వి ద్యార్థులు, 1న నెల్లూరు డివిజన్, మిగిలిన స్కూళ్ల విద్యార్థులు తిలకించవచ్చు. ఈ సారైనా... ఇన్స్పైర్ నిర్వహణపై పలు ఆరోపణలున్నాయి. గతంలో 2012 వైజ్ఞానిక ప్రదర్శనలో నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని గత వారమే ఆర్జేడీ విచారణ నిర్వహిం చారు. వైజ్ఞానిక ప్రదర్శనలో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థికి ఇవ్వాల్సిన రూ.5వేలను టీచర్లే స్వాహా చేశారని వాస్తవాన్ని ఉపాధ్యాయ వర్గమే జీర్ణించుకోలేక పో తుంది. దీనికి తోడు ప్రజా ప్రతినిధి విరాళంగా ఇచ్చిన రూ.లక్షా 50వేలు కూడా స్వాహా చేశారని తెలియడంతో వైజ్ఞానిక ప్రదర్శన పేరుతో విపరీతంగా డబ్బులు దండుకున్నారనే మరో కోణం బయటకొచ్చింది. జ్యూరీ సభ్యులు పరిశీలించాలి వైజ్ఞానిక ప్రదర్శనలో ఏర్పాటుచేసిన ప్రతి మోడల్‌ను జ్యూరీ సభ్యులు పరిశీలించాలి. అ యితే వారు లాబియింగ్‌కు పాల్పడుతూ తమ ఇష్టానుసారంగా ప్రాజెక్ట్‌ల ఎంపికలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించినిబంధనలననుసరించి మోడళ్ల ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. ఏర్పాట్లు: ఈ ఏడాది ఇన్స్పైర్ నిర్వహణ ఏర్పాట్లలో హడావిడి.. ఆర్భాటం కనపడింది. ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులను ఎదుర్కోవా ల్సి వచ్చింది. ప్రాజెక్ట్‌ల రిజిస్ట్రేషన్లలో తీవ్ర జా ప్యం నెలకొంది. విద్యార్థులు ఇబ్బందులు ప డ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌లు, లగేజీలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. భోజనపు టో కెన్ల కౌంటర్ వద్ద రద్దీ పెరగడంతో తోపులాట జరిగింది. కమిటీల మధ్య సమన్వయలోపంతో చిన్న సమస్య సైతం పెద్దదైంది. సమన్వయ పరచాల్సిన వారు కరువవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.