Tombs
-
ప్రపంచంలోని 10 ప్రసిద్ధి చెందిన టొంబ్స్
-
పల్నాడులో మూడు వేల ఏళ్లనాటి నాగరికత గుర్తింపు.. ప్రత్యేకత ఇదే?
పల్నాడు.. పౌరుషగడ్డ. పల్నాడు అంటే.. రాజ్యాల మధ్య కాలుదువ్విన కోడిపుంజులు కనిపిస్తాయి. వెయ్యేళ్ల కిందట అధికారం, ఆధిపత్యం కోసం సాగిన యుద్ధభేరీ వినిపిస్తుంది. వీరులకు గుడికట్టిన సంప్రదాయం కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు చరిత్ర. కానీ.. కృష్ణానది ఒడ్డున పల్నాట క్రీస్తుపూర్వం 3 వేల ఏళ్లనాడే గొప్ప మానవ నాగరికత విలసిల్లింది. కిలోమీటర్ల మేర బృహత్ శిలాయుగపు (మెగాలిథిక్) సమాధుల రూపంలో నిక్షిప్తమైంది. మాచర్ల, వెల్దుర్ది మండలాల్లో పురావస్తు అధికారులు, పరిశోధకుల వెలికితీతతో ఆదిమ మానవ జీవనం ప్రపంచానికి పరిచయం అవుతోంది. సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండా అటవీ ప్రాంతంలో కృష్ణాతీరం వెంబడి ఆదిమ మానవ సంస్కృతి విస్తరించింది. ఇక్కడ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర 300 నుంచి 400 వరకు సమాధులు బయటపడ్డాయి. ఇంత పెద్ద ఎత్తున వరుసక్రమంలో ప్రాచీన కాలపు సమాధులు దేశంలో ఎక్కడా లేవు. ఇక్కడ అత్యధిక సంఖ్యలో గృహ సమాధి (డాల్మెన్), గూడు సమా«ధులు (సిస్ట్ బరియల్) ఉన్నాయి. ఈ సమాధుల నిర్మాణంలో వాస్తుశా్రస్తాన్ని పాటించడం విశేషం. అన్నింటిని దక్షిణం వైపు ద్వారం ఉండేలా నిరి్మంచారు. ప్రతి సమాధి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కృష్ణానది పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో అప్పటి ప్రజలు కృష్ణానది ఎగువభాగంలో నివసించినట్టు తెలుస్తోంది. వ్యవసాయంతోపాటు పశువులపై ఆధారపడి జీవనం సాగించారని, ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, కందులు పండించారని లభ్యమైన ఆధారాలను బట్టి తెలుస్తోంది. పూసలు, ప్రత్యేకమైన ఎరుపు, నలుపు రంగు మట్టిపాత్రల అవశేషాలను బట్టి అప్పటి ప్రజలు అలంకార ప్రియులుగా భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొదటగా బృహత్ శిలాయుగంలో ఇనుమును వినియోగించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతంలో ముడి ఇనుము అధికంగా లభ్యమవడంతో ప్రజలు ఇక్కడ నివసించేవారని తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర, గోదావరి, పెన్నానది తీరాల్లో వీటి ఆనవాళ్లు తరచు బయటపడుతున్నాయి. ప్రత్యేక నిర్మాణ శైలిలో సమాధులు ప్రాచీన శిలాయుగంలో మానవుడు మృతదేహాలను ప్రకృతికే వదిలేశాడు. నవీన శిలాయుగానికి వచ్చేసరికి మృతదేహాన్ని క్రమపద్ధతిలో పాతిపెట్టడం నేర్చుకున్నాడు. బృహత్ శిలాయుగంలో మానవ మృతదేహాన్ని జంతువులు పీక్కుతినకుండా, ఖనన సామగ్రిని పాడుచేయకుండా పెద్దపెద్ద శిలలతో సమాధులు నిరి్మంచారు. వీటిలో మృతుడు ఉపయోగించిన యుద్ధ, వ్యవసాయ సామగ్రి, మట్టిపాత్రలు, పెంపుడు జంతువులను కూడా సమాధి చేసేవారు. ఈ సమాధుల చుట్టూ పెద్ద బండరాళ్లను పేర్చేవారు. ఇవే రాక్షసగూళ్లు. వీటి ఆనవాళ్లు ప్రపంచం అంతటా ఉన్నాయి. ముఖ్యంగా ఐరోపా, ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోను బృహత్ శిలాయుగపు సమాధులు బయటపడ్డాయి. చదునైన బండరాళ్లతో నలువైపులా స్వస్తిక్ ఆకారంలో పేర్చి గది మాదిరి తయారు చేశారు. ఇందులో భూమి లోపల కొంత, భూ ఉపరితలంపై కొంతభాగం కనబడే విధంగా నిర్మించారు. ఈ సమాధులు పెద్ద బండరాళ్లతో ఉండటం, అక్కడ లభించిన మట్టిపాత్రలు, అస్థి పంజరాలను బట్టి ఇవి సామాన్య మానవులకు ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతో.. వీటిని రాక్షసుల స్థావరంగా నమ్మి రాక్షసగూళ్లుగా పిలిచేవారు. ఇలాంటి రాక్షసగూళ్లు అచ్చమ్మకుంటలో భారీగా ఉన్నాయి. వీటిలో కొన్ని అప్పటికప్పుడు నిర్మించినవైతే.. మరికొన్ని ముందే నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో కొన్ని సామూహిక సమాధులున్నాయి. వీటిలో రెండురకాలున్నాయి. మృతదేహాన్ని ఖననం చేసినవి ప్ర«థమశ్రేణి సమాధులుగా, మృతదేహాన్ని దహనం చేయగా మిగిలిన అవశేషాలను పూడ్చిపెట్టినవి ద్వితీయశ్రేణి సమాధులుగా వర్గీకరించారు. ముగ్గుదిన్నె కాలువకు ఇరువైపులా.. వెల్దుర్తి మండలం గంగలకుంటలోని కృష్ణానది కుడిగట్టుపైన.. ముగ్గుదిన్నె కాలువకు ఇరువైపులా దాదాపు మూడుచదరపు కిలోమీటర్లమేర వెయ్యికిపైగా ఇనుపయుగపు స్మారక కట్టడాలున్నాయి. ఇక్కడ 5–10 మీటర్ల వ్యాసార్థంతో, 1–2 మీటర్ల ఎత్తులో స్థానిక నాపరాళ్లను గుండ్రంగా పేర్చి, గులకరాళ్లతో ఉబ్బెత్తుగా అమర్చిన సమాధులు కనిపిస్తాయి. ఈ సమాధులకు ఉత్తరాన 10–25 అడుగుల ఎత్తు, 3–5 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంతో చనిపోయినవారికి గుర్తుగా రాళ్లను నిలువుగా ఏర్పాటు చేశారు. వాటిపై ఇనుపయుగపు అంత్యక్రియ పద్ధతులను తెలిపే ఎద్దు, చదరం, గండ్రం, ముగ్గును పోలిన రేఖాచిత్రాలున్నాయి. ‘గంగలకుంటలో గతంలో వందలాది నిలువురాళ్లు, రాకాసిగుళ్లు ఉండేవి. ఇప్పుడు పదో, పదిహేనో మిగిలాయని స్థానికులు ద్వారా తెలుసుకున్నాం. రైతులు నీళ్లగొట్టాలు వేసినప్పుడు, మైనింగ్ కారణంగా దాదాపు 500 సమాధులు, 700 నిలువురాళ్లు ధ్వంసమయ్యాయి. ఇక్కడ లభ్యమైన 25 అడుగుల నిలువురాయి (మెన్హిర్) రాష్ట్రంలోనే అతి పెద్దది. ఇంతటి మానవచరిత్రను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’ అని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ చెక్కు చెదరలేదు నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇంతటి గొప్ప నాగరికత విలసిల్లిందంటే సంతోషంగా ఉంది. నా పరిశోధనలో బృహత్ శిలాయుగపు సమాధులు కనుగొన్నప్పుడు వాటిని చూసి ఆశ్చర్యపోయాను. సమాధులు 10–15 కిలోమీటర్ల మేర విస్తరించినట్టు అంచనా వేస్తున్నాం. స్థానికులు వీటిని బండరాళ్లుగా భావించి కొన్ని చెదరగొట్టారు. మిగిలిన సమాధులు చెక్కు చెదరలేదు. ఈ సమాధులకు పక్కనే ఎండిపోయిన నదీపాయ ఉండటంతో అప్పటి ప్రజలు దిగువన సువిశాల ప్రాతంలో వ్యవసాయం చేసుకుని జీవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఆ ప్రాంతం సాగులో ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిగితే ఆ నాటి ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవనం, వర్తకవాణిజ్య వివరాలు వెలుగులోకొస్తాయి. – ఎం.స్వామినాయక్, ఏపీ పురావస్తు, ప్రదర్శనశాలల అసిస్టెంట్ డైరెక్టర్ -
పైగా టూంబ్స్కు అమెరికా సాయం
సంతోష్ నగర్ (హైదరాబాద్): భవిష్యత్తు తరాల కోసం అమూల్యమైన శిల్ప సంపదను పరిరక్షించాలని అమెరికా చార్జ్ డి అఫైర్స్ ఎలిజబెత్ జోన్స్ చెప్పారు. మంగళవారం ఆమె అమెరికా కాన్సుల్ జెన్నిఫర్ లార్సెన్తో కలిసి సంతోష్ నగర్ ఒవైసీనగర్ కాలనీలోని పైగా టూంబ్స్ (సమాధి)ను సందర్శించారు. 18, 19వ శతాబ్దాల్లో నిర్మించిన పైగా సమాధుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమైనందుకు తాము గరి్వస్తున్నామని ఎలిజబెత్ చెప్పారు. ఆరుకు పైగా సమా«ధుల పరిరక్షణ, పునరుద్ధరణకు కోసం అమెరికా ‘అంబాసిడర్స్ ఫండ్స్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ (ఏఎఫ్‌సీపీ)’రూ.2.04 కోట్ల సాయం చేసిందని ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రతీష్ నందా తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆగాఖాన్ ట్రస్ట్ అమలు చేస్తోందన్నారు. ఇది హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ద్వారా నిధులు సమకూర్చిన ఐదో ప్రాజెక్టని కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ చెప్పారు. హైదరాబాద్‌లో కుతుబ్‌షాహీ టూంబ్స్ వద్ద తమ ఏఎఫ్‌సీపీ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. -
సమాధుల తోట.. జ్ఞాపకాల మూట
కడప కల్చరల్: మన దేశాన్ని పాలించేందుకు వచ్చిన బ్రిటీషు వారు ఈ ప్రాంతాలపై ఎనలేని మక్కువ పెంచుకున్నారు. పరిపాలనలో తమదైన ముద్ర వేయడమే కాకుండా వారి నివాస గృహాలు, ఇతర నిర్మాణాల్లో కూడా వారి శైలిని కనబరిచారు. వారు నిర్మించిన ప్రార్థన మందిరాలు, కార్యాలయాలు, ఇతర భవనాలు నేటికీ పటిష్టంగా ఉండి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి చారిత్రక నిర్మాణాలలో కడప నగరంలోని క్రై స్తవుల సమాధుల తోట (దొరల గోరీలు) ఒకటి. క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంగా ఆ వివరాలు.. కడప నగరం మాసాపేట చివరన నిర్మల కాన్వెంట్ వద్ద క్రైస్తవుల సమాధులు ఉన్నాయి. దొరల గోరీలుగా పేరున్న ఇందులో 25కు పైగా బ్రిటీషు పాలనలో మరణించిన తెల్లదొరల సమాధులు ఉన్నాయి. దివంగతులైన తమ బంధుమిత్రుల సమాధుల వద్దకు తరచూ వెళ్లే సంప్రదాయం ఉండడంతో నాటి తెల్లదొరల బంధుమిత్రులు ఈ సమాధుల ప్రాంతాన్ని ఉద్యాన వనంగా తీర్చిదిద్దారు. పూలమొక్కలతోపాటు చెట్ల పెంపకం చేపట్టారు. ప్రత్యేకంగా తోట మాలీలను నియమించి ఆ ప్రాంతాన్ని పచ్చదనంతో, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. విశిష్టంగా.. దొరల గోరీలలో మన ప్రాంతంలో కనిపించే సమా«ధులకు భిన్నమైన సమాధుల నిర్మాణాలు కనిపిస్తాయి. ఒక్కో సమాధి చారిత్రక నిర్మాణ శైలితో భారీగా పలు ఆకర్శణీయమైన రూపాలలో కనిపిస్తుంది. నాటి నిర్మాణశైలికి ప్రతీకలుగా ఆ సమాధులు నేటికీ మనం చూడవచ్చు. ఇప్పుడు కూడా కడప నగరంలో క్రైస్తవ ప్రముఖులు ఎవరైనా మరణిస్తే సమాధుల తోటలోనే ఖననం చేస్తారు. ప్రముఖుల సమాధులు: క్రైస్తవుల సమాధుల తోటలో పలువురు బ్రిటీషు అధికారుల సమాధులున్నాయి. వాటి వివరాలను కడప గెజిటీర్లో ప్రచురించారు. అప్పట్లో జరిగిన ఓ ఘర్షణను నివారించేందుకు వెళ్లిన ఆంగ్ల యువ అధికారి మెక్‌డొనాల్డ్ మరణించాడు. భర్త మరణ వార్త విన్న ఆయన భార్య వెంటనే స్పృహ కోల్పోయి కొద్దిరోజుల్లోనే మరణించింది. మెక్డొనాల్డ్తోపాటు ఆయన భార్య సమాధిని కూడా పక్కపక్కనే నిర్మించి ఆ రెంటిని కలిపి ఒకే సమాధిగా తీర్చిదిద్దారు. ఈ విశిష్టమైన ప్రేమ చిహ్నాన్ని నేటికీ మనం క్రైస్తవుల సమాధుల తోటలో చూడవచ్చు. క్రెస్తవుల సమా«ధుల తోటను 1800వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. రాజంపేట సమీపంలోని గుండ్లూరు వద్ద 1807లో మరణించిన నాటి సివిల్ సర్వీసెస్ అధికారి వెబ్ థాకరె సమాధి కూడా ఈ ప్రాంగణంలో ఉంది. థాకరె ప్రసిద్ధ ఆంగ్ల రచయిత విలియం మెక్ పీస్‌కు మేనల్లుడు. అప్పట్లో జిల్లా పబ్లిక్ వర్క్స్శాఖలో అసిస్టెంట్ ఇంజినీరుగా పనిచేసిన చార్లెస్ (కాటన్ దొరకు మేనల్లుడు) సమాధి కూడా ఈ ప్రాంగణంలో ఉంది. ప్రతి సంవత్సరం పెద్దల సమాధుల దినోత్సవం (డూమ్స్ డే) నాడు నగరానికి చెందిన క్రైస్తవులు తమ బంధువుల సమాధులపై కొవ్వొత్తులు వెలిగించి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేస్తారు. ఇక్కడి బ్రిటీషు దొరల సమాధులు 200 సంవత్సరాల క్రితం నాటివి. వంద సంవత్సరాలు దాటిన నిర్మాణాలను వారసత్వ సంపదగా పరిగణిస్తారు.సమాధుల తోటను కూడా వారసత్వ ప్రాంతంగా ప్రకటించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలని నగరానికి చెందిన క్రైస్తవ ప్రముఖులు పేర్కొంటున్నారు. -
వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!
ధర్మవరం రూరల్(శ్రీ సత్య సాయి జిల్లా): చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా సమాధులు కట్టడం, వర్ధంతులు, జయంతులు, పండుగ పూట పూజలు చేయడం మామూలుగా మనం చూస్తుంటాం. అయితే ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామంలో వింత ఆచారం నడుస్తోంది. చనిపోయిన వారికి ఇక్కడ సమాధులు కట్టడమే కాకుండా పైన దేవతామూర్తుల విగ్రహాలు ఉంచి చిన్న పాటి గుడిలాంటిది నిర్మిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం పూజలు చేస్తుంటారు. దీంతో పాటు ఏటా తొలి ఏకాదశి రోజున ఇక్కడ జాతర నిర్వహిస్తుండం గమనార్హం. సమాధిపైన చనిపోయిన వారి చిత్రం.. 45 ఏళ్ల క్రితం బళ్లారి ప్రాంతం నుంచి ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామానికి పెద్ద బొమ్మయ్య వంశీకులు వచ్చి స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన కుటుంబాలు గ్రామంలో 14 వరకు ఉన్నాయి. పెద్ద బొమ్మయ్య మరణానంతరం అతని జ్ఞాపకార్థం సమాధి నిర్మించిన కుటుంబీకులు.. పూడ్చిన చోటనే గంగమ్మ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి పెద్ద బొమ్మయ్య వంశీకులు ఎవరు చనిపోయినా ఆలయం పక్కనే వారిని ఖననం చేసి సమాధి కడుతున్నారు. పెద్ద బొమ్మయ్య సమాధిపై ప్రతిష్టించిన గంగమ్మ దేవత విగ్రహాలు అనంతరం వాటిపై చిన్నదేవాలయం లాంటి నిర్మాణమో.. లేకుంటే పూడ్చిన వ్యక్తి చిత్రాన్నో దానిపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి చిన్నచిన్న ఆలయాలు కట్టిన ఆలయాలు నాలుగుదాకా ఉన్నాయి. ఇక.. సమాధులపై వేసిన చిత్రాలను దూరం నుంచి చూస్తే ఎవరో పడుకుని ఉన్నట్లుగా భ్రమ కలుగుతుండడం గమనార్హం. పెద్ద బొమ్మయ్య వంశస్తుల మరో ప్రత్యేకత ఏమిటంటే తమ కుటుంబంలో పుట్టే ప్రతి బిడ్డకూ పూరీ్వకుడు బొమ్మయ్యే పేరు కొనసాగిస్తుండడం. ప్రస్తుతం గ్రామంలో చిన్న బొమ్మయ్య, పెద్ద బొమ్మయ్య, నడిపి బొమ్మయ్య, సన్న బొమ్మయ్య ఇలా మగవాళ్ల పేర్లన్నీ ఒకేలా ఉన్నాయి. తాతల కాలం నుంచి అఖండం వెలుగుతోంది మేమంతా పూరీ్వకులను పూజిస్తుంటాం. వారి జ్ఞాపకార్థం సమాధులను నిర్మించి వాటిపై ప్రతిమలు ఏర్పాటు చేయించి పూజలు చేస్తాం. సమాధిపై నిర్మించిన గంగమ్మ గుడిలో మా తాతలు పెట్టిన అఖండం నేటికీ వెలుగుతోంది. కేవలం ఒత్తులు మాత్రమే మారుస్తుంటాం. ఆచారాన్ని మా పిల్లలకు కూడా నేర్పుతాం. – చిన్నబొమ్మయ్య, సుబ్బరావుపేట -
2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్..
World's Scariest Place Catacombs of Paris: ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ టూరిస్ట్ స్పాట్‌గా మనందరికీ సుపరిచితమే. ప్యారీస్‌లో కనులకు ఇంపైన ప్రదేశాలేకాదు.. వణుకు పుట్టించే మిస్టీరియస్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అలాంటివి ఏమీ ఉండవని పెదవి విరుస్తున్నారా? ఐతే ఇది చదవండి. ‘ప్యారీస్ కాటకోంబ్స్’ గురించే మీకు చెప్పబోతుంది. అక్కడ దాదాపు 60 లక్షల మృతదేహాలను భద్రపరిచిన మ్యూజియం ఉంది. దీనికి సంబంధించిన చరిత్ర 18వ శతాబ్ధం చివరి భాగం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. చనిపోయినవారిని పాతిపెట్టడానికి నగరంలో ఖాళీ స్థలం కూడా లేని కాలంలో దీనిని నిర్మించారు. 1785లో మరే ఇతర శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేయలేనంత మరణాలు సంభవించాయి. వర్షం కురవడంతో శ్మశానవాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి చొచ్చుకువచ్చాయట. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మృతదేహాలను సున్నపు గనుల సొరంగంలో పడవేశారట. ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడవేశారు. అనతికాలంలోనే దాదాపు 60 లక్షల మృతదేహాలు ఇక్కడ నిక్షిప్తమయ్యాయి. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ఆ తర్వాత ఈ మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించి మ్యూజియంగా మార్చారు. ఈ గోడను భూమిలోపల 20 మీటర్ల లోతులో నుంచి కట్టారు. అందుకే ఈ స్థలాన్ని ‘సమాధుల నేలమాళిగ (బేస్మెంట్ ఆఫ్ టోంబ్స్)’ అని పిలుస్తారు. నేడు ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. దీనిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు కూడా. చనిపోయినవారి ఎముకలు, పుర్రెలతో నిర్మించిన 2.2 కి.మీ పొడవున్న ఈ మొత్తం గోడ దాదాపు 800 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఐతే ఈ మొత్తం గోడను నేటివరకూ పర్యాటకుల సందర్శనకు ఇప్పటివరకూ ఉంచలేదు. ఈ సొరంగంలోని కొన్ని భాగాలు మాత్రమే చూసేందుకు అనుమతి ఉంది. ఏదిఏమైనప్పటికీ సమాధులను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా అస్థిపంజరాలతో కట్టిన ఈ గోడను చూడటానికి అన్ని వేల మంది ఎలా వెళ్తున్నారో!! చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! -
ఇంటి ముందే సమాధులు.. ‘ఆత్మల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష’
సమాధులు ఎక్కడ ఉంటాయి? సాధారణంగా ఎక్కడైనా శ్మశాన వాటికల్లోనే ఉంటాయి. ఆ ఊళ్లో మాత్రం సమాధులు ఇళ్ల ముంగిళ్లలోనే కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఇంటి ముందే సమాధి చేస్తారు. గతించిన వారి సన్నిధిలోనే నివసించాలని, వారి ఆత్మల ఆశీస్సులే తమకు శ్రీరామరక్ష అని భావిస్తారు. ఈ వింత గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. పేరు అయ్యకొండ. కర్నూలుకు దాదాపు అరవై కిలోమీటర్ల దూరాన గోనెగండ్ల మండలంలోని ఆ గ్రామంలో మరికొన్ని వింత ఆచారాలూ ఉన్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాల వెనుక కొన్ని గాథలూ ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలంటే, చరిత్రలో మూడున్నర శతాబ్దాలు వెనక్కు వెళ్లాలి. ఆనాడు అయ్యకొండపై ఊరు లేదు. చింతల మునిస్వామితాత అనే యోగి అక్కడ ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ ఉండేవారు. అప్పట్లో ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గంజిహళ్లి గ్రామంలో ఒక పెద్దభూస్వామి ఉండేవాడు. అతని దగ్గర ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా పనిచేసేవాడు. ఒకరోజు యజమాని ఒక ఆవును తీసుకువెళ్లి తన కూతురికి అప్పగించి రావాల్సిందిగా ఎల్లప్పను ఆదేశించాడు. ఎల్లప్ప ఆవును తోలుకుంటూ వెళుతుండగా, తోవలో అది తప్పించుకుని వెళ్లిపోయింది. యజమానికి ఈ సంగతి చెప్పడంతో, ఆగ్రహించి ఎలాగైనా వెతికి తేవాలంటూ ఆదేశించాడు. ఎల్లప్ప ఆవుకోసం అడవిలో వెదుకులాడుతూ కొండపైకి చేరుకున్నాడు. కొండపైన గుహలో చప్పుడు వినిపించడంతో, రాళ్ల సందుల్లోంచి తొంగి చూశాడు. గుహలో కూర్చున్న మునిస్వామికి పితకకుండానే ఆవు పాలిస్తుంటే, ఆయన దోసిలి పట్టి తాగుతున్న దృశ్యం కనిపించింది. ఎల్లప్ప ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈయనెవరో శక్తులు కలిగిన స్వామి అని తలచాడు. యజమాని వద్దకు తిరిగి వెళ్లకుండా, చింతల మునిస్వామి వద్దే ఉండిపోయి, ఆయనకు సేవలు చేసుకుంటూ కాలం వెళ్లదీశాడు. ఎల్లప్ప మరణించాక, అతని కొడుకు బాలమునిస్వామి ఇంటి ముందే సమాధి చేశాడు. ప్రతి శనివారం సమాధిని ఆవుపేడతో అలికి, అగరొత్తులు వెలిగించి పూజించడం ప్రారంభించాడు. క్రమంగా అయ్యకొండలో కుటుంబాలు పెరిగి, గ్రామంగా ఏర్పడింది. మరణించిన వారికి ఇళ్ల ముందే సమాధి చేయడం ఆ గ్రామ ఆచారంగా మారింది. మునిస్వామికి నిత్యనైవేద్యాలు గ్రామస్తులు ఏమి తినాలనుకున్నా, తాగాలనుకున్నా ముందుగా చింతల మునిస్వామి తాతకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆచారం కూడా ఎల్లప్ప కాలం నుంచే కొనసాగుతోంది. ఆయన వద్ద సేవలు చేస్తూ ఉండిపోయిన ఎల్లప్ప సమీప గ్రామాలకు వెళ్లి, అక్కడ అడిగి తెచ్చుకున్న ఆహారాన్ని ముందుగా స్వామికి సమర్పించిన తర్వాతే తినేవాడట. ఆహార పదార్థాలైనా, మద్యం వంటివైనా ముందుగా మునిస్వామి తాతకు సమర్పించిన తర్వాతే ఈ గ్రామస్తులు స్వీకరిస్తారు. రోజులో ఎన్నిసార్లు వండుకుంటే అన్నిసార్లూ తప్పనిసరిగా సమర్పిస్తారు. చింతల మునిస్వామితాత ఆశీస్సులే తమకు అండదండలనేది వారి విశ్వాసం. మంచం కనిపించదు అయ్యకొండలో ఏ ఇంటి ముందు చూసినా సమాధులు కనిపిస్తాయి గాని, ఏ ఇంట్లోనూ మంచం కనిపించదు. దీని వెనుక ఒక గాథ ఉంది. చింతల మునిస్వామితాతకు గంజిహళ్లి బడేసాహెబ్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఒకసారి గంజిహళ్లి ఉరుసుకు వెళ్లిన మునిస్వామి తన తిరునాళ్లకు బడేసాహెబ్‌ను ఆహ్వానించాడట. బడేసాహెబ్ బల్లిరూపంలో వచ్చాడట. దీనిని గ్రహించలేని మునిస్వామి తన తిరునాళ్లకు రాలేదని బడేసాహెబ్‌ను కోప్పడ్డాడట. అప్పుడు బడేసాహెబ్ ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయానికి మునిస్వామి మంచంపై కూర్చుని ఉన్నాడు. ‘నేను వచ్చినా మంచంపై కూర్చున్న నువ్వు నా రాకను గ్రహించలేదు. నువ్వు మంచం వాడరాదు’ అంటూ శపించాడట. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మంచం వాడబోమని ఈ గ్రామస్తులు చెబుతారు. ఈ ఆచారం వల్లనే ఈ గ్రామంలో కాన్పులు కూడా కటిక నేల మీదే జరుగుతాయి. పచ్చిబాలింత అయినా, బొంతపరుచుకుని బిడ్డతోపాటు కిందే పడుకుంటుంది. ఈ గ్రామంలో ఏడు తరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాల్లో ఇప్పటికీ ఎటువంటి మార్పులేదు. ఈ గ్రామంలో ఉండేవారంతా ఒకే కులానికి చెందినవారు. -
టర్కీలో వరుస హిమపాతాలు..
అంకారా: టర్కీలోని వాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న రెండు వరుస హిమపాతాల కారణంగా 38 మంది మంచులో సజీవసమాధి అయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన మొదటి హిమపాతంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వీరిని వెలికితీసేందుకు దాదాపు 300 మంది అత్యవసర విభాగం ఘటనా స్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మరో హిమపాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 8 మంది మిలిటరీ ఆఫీసర్లు, 9 మంది వాలంటీర్లు, మరో ముగ్గురు ప్రభుత్వం నియమించిన గార్డులు ఉన్నట్లు చెప్పారు. గల్లంతైన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. -
అక్షర దాతల గుర్తులు.. శిథిల సమాధులు!
సాక్షి, మచిలీపట్నం: విద్యాదాతలను గౌరవించడం అందరి బాధ్యత. వారి స్మారకాలను భవిష్యత్ తరాల కోసం పదిలంగా ఉంచడం మన కర్తవ్యం. అయితే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ కళాశాల వ్యవస్థాపకుల సమాధులకు పట్టిన గతి చూస్తే విద్యాదానం చేసిన వారిని ఏవిధంగా గౌరవిస్తున్నామో అర్థమవుతుంది. స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయమిది. 1906లో కోల్‌కత్తాలో నేషనల్ కాంగ్రెస్ జాతీయ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో ఉద్యమంలో ప్రజలను చైతన్యపర్చాలంటే దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. నేషనల్ కళాశాలల పేరిట వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశాల్లో తీర్మానించడమే తరువాయి స్వాతంత్య్ర సమరయోధులు కోపెల్ల హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మచిలీపట్నంలో నేషనల్ కళాశాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కృష్ణారావు తన 20 ఎకరాలను కళాశాల కోసం దానం చేయగా, దాంట్లో హనుమంతరావు, పట్టాభి సీతారామయ్య కలిసి 1907లో నేషనల్ కళాశాల నిర్మాణానికి పూనుకున్నారు. మూడేళ్ల పాటు శ్రమించి దాతల నుంచి విరాళాలు సేకరించి 1909 మార్చి 25న కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. 1910 మార్చి 27న ఆంధ్ర జాతీయ కళాశాలగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండే వెంకట్రామయ్య పంతులుతో ప్రారంభింపజేశారు. 1910 నుంచి 1922 వరకు ఈ కళాశాలకు వ్యవస్థాపక ప్రిన్సిపాల్‌గా కోపెల్ల హనుమంతరావు వ్యవహరించారు. 1922లో ఆయన మరణించారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ కళాశాల ఇదే. ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు అనాడే విద్యను విస్తరించారు. నేషనల్ కళాశాల విద్యార్థి అంటే దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఒక గుర్తింపు, గౌరవం ఉండేది. అలాంటి కళాశాల నాటి వైభవాన్ని నేడు కోల్పోయిందనే చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థలుగా గుర్తింపు పొందాయి. ప్రైమరీ, హైసూ్కల్, ఇంటర్, డిగ్రీ, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేసిన ఈ ప్రతిష్టాత్మక కళాశాల నేడు ఐదారువందల మందికి మించి విద్యార్థుల్లేని పరిస్థితి. అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ విద్యాలయాల వ్యవస్థాపకులైన కోపెల్ల హనుమంతరావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సమా«ధులు నేడు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. కళాశాల వెనుక భాగంలోనే హనుమంతరావుతో పాటు అతని కుటుంబ çసభ్యులందరి సమా«ధులున్నాయి. కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు బందరు వచ్చిన ప్రతిసారి ఈ సమా«ధులను దర్శించుకుని వెళ్తుంటారు. అలాంటి ఈ సమాధులు నేడు తుప్పల్లో శిథిలమై ఉన్నాయి. పైగా సమాధులు మందుబాబులకు నిలయంగా మారాయి. సమా«ధుల చుట్టూ ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు చెత్తాచెదారం చూడటానికే అత్యంత దయనీయంగా ఉంది అక్కడి పరిస్థితి. ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం ఈ సమా«ధుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని బందరు వాసులు కోరుతున్నారు. -
కుటుంబానికి ఒకే చోటు
ఈ ఊరిలో కుటుంబానికి ఒక సమాధి మాత్రమే ఉంటుంది. ఆయా కుటుంబాల్లో ఎవరైనా కన్నుమూస్తే సమాధి సిద్ధంగా ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామంలో నిర్మల హృదయవనం ఏర్పాటు చేసుకున్నారు. అర ఎకరం స్థలంలో గత 30 సంవత్సరాలక్రితం హృదయవనం నిర్మించుకున్నారు. తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అందులోనే వారిని సమాధి చేస్తారు... కొత్తగా సమాధి కట్టరు. అదేంటో చూద్దాం... గీసుకొండ మండలంలోని మరియాపురం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో 100 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వారిలో ఉన్న క్రైస్తవ కుటుంబాలు తమ వారెవ్వరైనా చనిపోతే హృదయవనంలో నిర్మించుకున్న సమాధిలో ఖననం చేసేలా అంతస్తుల మాదిరిగా సమాధులను నిర్మించుకున్నారు. ఇంతకీ ఎందుకిలా అంటే... సమాధుల కోసం స్థలాన్ని వృథా చేయడం ఇష్టం లేక అట.15 అడుగుల లోతులో దీర్ఘచతురస్రాకారంలో సమాధిని నిర్మిస్తారు. కిందిభాగంలో గచ్చు చేసి భూమి ఉపరితలంపై 2 లేదా 3 అంగుళాలు ఎత్తు వరకు గోడను కడతారు. సమాధి పైన బరువైన ఇనుప రేకును మూతలాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది తలుపులా ఉండి అవసరమైనప్పుడు తెరిచే వీలుంటుంది. ఇలా చేస్తారు కుటుంబాల్లో మొదటగా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కిందిభాగంలో ఖననం చేసి, దానిపై ఉప్పు, సుగంధద్రవ్యాలు చల్లుతారు. పైన నాలుగు షాబాదు బండలు అమర్చి మూసి వేస్తారు. ఆ తర్వాత మూతను బిగిస్తారు. అదే కుటుంబంలో మరో వ్యక్తి చనిపోయినప్పుడు అదే పద్ధతిలో ఖననం చేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఎక్కువమంది చనిపోతే సమాధిలో ఖాళీ లేనప్పుడు అంతకుముందు సమాధి చేసిన వారి కపాలం, ఎముకలను అందులోనుంచి తీసేసి లోపలి గోడల పక్కనున్న స్థలంలో వాటిలో భద్రపరుస్తారు. అనంతరం అప్పుడే చనిపోయిన వారి మృతదేహాన్ని అందులో ఖననం చేస్తారు. ప్రపంచవ్యాప్త పండుగ రోజు నవంబర్ 2న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆత్మల పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా తమ పూర్వీకుల సమాధులను శుభ్రం చేయడం వాటి రంగులు వేయడం, పూలతో అలంకరించడం చేస్తారు. సమాధుల వద్దకు వెళ్లి తమ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థిస్తారు. చిన్న తప్పులు చేసిన వారు స్వర్గానికి, నరకానికి మధ్యలో ఉండిపోతారని, అటువంటి వారి ఆత్మలు దైవసన్నిధికి చేరడానికి సంవత్సరంలో వారు మృతి చెందిన దినోత్సవం జరుపుకోవడాన్ని సమాధుల పండుగ అని అంటారు. ఈ సందర్భంగా సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి వరంగల్ రూరల్ ఫోటోలు: పెద్దపల్లి వరప్రసాద్ ►మా గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒక సమాధి ఉంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా అందులోనే ఖననం చేస్తాం. చనిపోయిన తరువాత అందరం ఒకేదగ్గర ఉంటామని, సమాధులు నిర్మించేందుకు స్థలం ఇబ్బంది లేకుండా ఉండేందుకు. గత కొన్నిసంవత్సరాలుగా ఇదేవిధంగా పాటిస్తున్నాం. ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పద్ధతిలో పలు గ్రామాల్లో చేస్తున్నారని తెలుస్తుంది. – అల్లం బాలిరెడ్డి, సర్పంచ్, మరియపురం -
ఆ సమాధుల పరిరక్షణకు సాయం
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత నృత్యకారిణులు తారామతి, ప్రేమామతి సమాధుల పరిరక్షణకు అవసరమైన నిధులను మంజూరు చేయనున్నామని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ.జస్టర్ అన్నారు. ఆయన గురువారం సమాధులను సందర్శించారు. ఈ సందర్భంగా యూఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్(ఏఎఫ్‌సీపీ) కింద రూ.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. భారతదేశవ్యాప్తంగా అత్యున్నత మానవ నిర్మిత కట్టడాలను పరిరక్షించేందుకు అమెరికా ఇతోధికంగా ఆర్థికసాయం అందజేయడం గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని తారామతి, ప్రేమామతి సమాధుల వద్ద దెబ్బతిన్న భాగాలను పునర్నిర్మించేందుకు, వాటికి పూర్వపు రూపు తీసుకొచ్చేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన తెలిపారు. సమాధులపై ఉన్న సిమెంట్పూతను తొలగించి ప్లాస్టర్‌తో తిరిగి పునర్నిర్మిస్తామని ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సీఈవో రాశిష్ నందా తెలిపారు. దేశవ్యాప్తంగా 2001 నుంచి అంబాసిడర్ల ఫండ్ నుంచి వెయ్యి ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందజేసినట్లు తెలిపారు. కుతుబ్‌షాహీ సమాధులు, మౌలాలీలోని మహ్లేకా భాయ్ సమాధుల పరిరక్షణకు కూడా ఆర్థికసాయం అందజేశామన్నారు. కార్యక్రమంలో వారి వెంట నగరంలో యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం పాల్గొన్నారు. ఫొటో ఎగ్జిబిషన్ నగరంలో అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కెన్నెత్ ఐ జస్టర్ బుధవారం సందర్శించారు. కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిశోర్, నగరంలో అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా తదితరులు పాల్గొన్నారు. ఫొటో ప్రదర్శన ద్వారా కాన్సులర్ జనరల్స్ పనితీరుతోపాటు రెండు దేశాల సమస్యలపై అవగాహన, పరిష్కారానికి దోహదం చేస్తాయన్నారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్లు్య.బుష్ పర్యటన, 2017లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ విశేషాలతో కూడిన ఫొటోలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. రెండు వారాలపాటు ఈ ప్రదర్శన జరగనుంది. అనంతరం ఏపీ, తెలంగాణ, ఒడిషా ప్రాంతాల్లో ఈ ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
ఈజిప్టులో బయటపడ్డ 50 మమ్మీలు
కైరో : మమ్మీలకు నిలయమైన ఈజిప్టులో తాజా గా మరో 50 మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్టులోని తూర్పు మల్లావిలో టు నా ఎల్ గెబల్ ప్రాంతంలో ఓ భారీ సమాధిని గుర్తించారు. దాదాపు తొమ్మిది మీటర్ల లోతైన గదులున్న ఈ సమాధిలో మొత్తం 50 మమ్మీలను గుర్తించారు. వాటిలో చిన్నపిల్లల శరీరాలను భద్రపర్చిన మమ్మీ లు 12 ఉన్నాయని పురాతత్వశాస్త్రవేత్తలు తెలిపారు. రోమన్ లేదా బైజాన్టియన్ కాలం నాటి మమ్మీలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 50 మమ్మీల్లో 40 పూర్తిగా వెలికితీశామని, వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని ఈజిప్టు పురావస్తు విభాగం సుప్రీం కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ముస్తఫా వజీరీ తెలిపారు. ఈ మమ్మీలను చాలా వరకు కుండల్లో భద్రపర్చారని, కొన్ని మమ్మీలపై నాటి భాషలో రాసిన విశేషాలు ఉన్నాయని, ఈజిప్షియన్ కాలంలో ఈ భాష సాధారణ ప్రజానికంలో వినియోగంలో ఉండేదని చెప్పారు. మిన్యా విశ్వవిద్యాలయం నేతృత్వంలో చేపట్టిన ఈ సంయుక్త కార్యక్రమంలో తొలిసారి ఈ మమ్మీలను కనుగొన్నారు. -
సమాధులు మాయం
జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులు, కుటుంబీ కులు మరణిస్తే వారికి గుర్తుగా సమాధులు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఏడాదికోసారి సమాధులకు పూజలు చేసి, గతించిపోయిన వారికి నివాళులర్పిస్తారు. అయితేఇసుకాసురులు ఆ సమాధులను ధ్వంసం చేసేస్తూ పూర్వీకులగురుతులను చెరిపేస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు..రాష్ట్రపరిశ్రమల శాఖా మంత్రిఅమరనాథరెడ్డి సొంత పంచాయతీ వీరప్పల్లిలో. ఇక్కడ కొన్నాళ్లుగా అధికారుల సాక్షిగా ఇసుక దందా సాగుతోంది. చిత్తూరు, పలమనేరు: పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని వీరప్పల్లి మంత్రి అమరనాథరెడ్డి సొంత పంచాయతీ. ఈ పంచాయతీలోని గ్రామమే కూరగాయల కొత్తపల్లి. ఇక్కడ 50 కుటుంబాలు కాపురముండగా 46 ఎస్సీలవే. గ్రామానికి ఆనుకుని కొత్తపల్లి చెరువు పక్కన ఎస్సీల శ్మశానం ఉంది. కొన్నాళ్లుగా కొందరు ఆ చెరువులో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో గ్రామస్తులు నోరుమెదపలేదు. చెరువులో ఉన్న ఇసుక ఖాళీ కావడంతో ఇసుకాసురుల కన్ను పక్కనే ఉన్న శ్మశానంపై పడింది. నాలుగు రోజులుగా జేసీబీ వాహనంతో శ్మశానంలోని సమాధులను పెకిలించి కిందనున్న ఇసుకను తోడేస్తున్నారు. దీన్ని గమనించిన గ్రామస్తులు సమాధులను తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సురేంద్రకు విన్నవించారు. అయితే మంత్రి సొంత పంచాయతీ కావడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. దీంతో గ్రామస్తులు ఆదివారం రాత్రి గ్రామంలో సమావేశమయ్యారు. తమ పూర్వీకుల సమాధులను కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయిం చుకున్నారు. కాస్త ధైర్యం చేసి మళ్లీ అధికారులకు విన్నవించుకున్నా లాభం లేకపోయింది. ఇక్కడ ఇసుక లాభసాటి వ్యాపారం.. పోలీసులు ట్రాక్టర్లకు జీపీఆర్ఎస్లను అమర్చి ఇసుక ట్రాక్టర్లు కర్ణాటకలోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కొన్నిచోట్ల అక్రమంగా తరలుతున్న ఇసుక వాహనాలను పట్టుకుని మైనింగ్ వారికి జరిమానాల నిమిత్తం పంపుతున్నారు. ఇసుక తవ్వకాలో ఇసుకదిన్నెలు కూలి ఈ ప్రాం తంలో 12మంది దాకా కూలీలు మృతిచెందారు. ఎన్ని జరిగినా ఇసుకాసురులు ఏమాత్రమూ తగ్గలేదు. కర్ణాటకకు ఇసుకు అక్రమ రవాణా ఆగలేదు. ఎందుకంటే నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం మండలాలు కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉండడమే కారణం. స్థానికంగా ట్రాక్టరు ఇసుక రూ.1,600 పలుకుతుండగా అదే ట్రాక్టరు పర్లాంగు దూరంలోకి కర్ణాటకలోకి వెళితే రూ.3,500 పలుకుతోంది. దీంతో ఇసుకాసురులు ఎంతటి రిస్క్‌నైనా భరిస్తూ ఇసుక వ్యాపారాన్ని మాత్రం వదులుకోవడం లేదు. కండువ కప్పుకో ఇసుక తోలుకో.. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే చాలామంది అధికార పార్టీలో చేరి ఇసుక వ్యాపారంలో లక్షలు గడిస్తున్నారు. దర్జాగా ఇసుక అక్రమ రవాణా చేయాలంటే ఒక్కటే మార్గం. అధికార పార్టీ కండువా కప్పుకుంటే చాలు ఇక అడిగేవారే లేరు. మూడేళ్లలో అధికార పార్టీలో చేరిన ఇసుకాసురులు 20మంది దాకా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో కూలీలుగా ఉన్నవారు ఇప్పుడు ట్రాక్టర్లకు యజమానులయ్యారు. ట్రాక్టర్లున్న వారు లారీలు కొనేశారంటే ఈ వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులకు ఏమీ కనిపించవు.. కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులకు కనిపించడం లేదు. వారి కళ్లముందే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పోలీసులైతే మనకెందుకొచ్చిన తంటా అని వదిలేశారు. కొందరు ఎస్ఐలు మామూళ్లు తీసుకుంటూ ఇసుక అక్రమ రవాణాను పెంచి పోషిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మంత్రి ఇలాఖా కావడంతో జిల్లా అధికారలది మౌనముద్రే. -
దాని
సమాధుల తోట మెయిన్ గేటులోంచి లోపలికి వస్తున్న అతణ్ని ఆమె పలకరించింది. ‘‘తెల్లవారుజామున వస్తే సరిపోయేది కదా, ఇంత ముందుగానా?’’ అంది. ‘‘ముందుగానే చూద్దామని,’’ అన్నాడు. అతను ఎవరితో మాట్లాడాడో తెలియక పక్కనున్న వాళ్లు దిక్కులు చూశారు. ‘పెద్దవాడు. మతిస్థిమితం లేదు.’ అని నిశ్చయించుకున్నారు. ఎదుటలేని మనిషితో మాట్లాడుతూ లోనికి పోతున్నాడు. ‘‘ఈస్టర్ పండగ రోజు ఉదయం నా సమాధిలోంచి లేచి, నన్ను వెంటబెట్టుకొని తీసుకుపోవడానికి వచ్చిన నా తండ్రితో కలిసి వెళ్లిపోతాను. ‘‘ఆ రోజే ఎందుకు?’’ అతను అడిగాడు. ‘‘సిలువ వేయబడ్డ తన కుమారుణ్ని బతికించి, తీసుకుని పోయింది ఆరోజునే. తన పిల్లలందరినీ నా తండ్రి ఆ రోజే తీసుకొని పోతాడు.’’ ‘‘సమాధిలోంచి లేచి, నువ్వు నీ తండ్రితో వెళ్లిపోయావని నాకెట్లా తెలుస్తుంది?’’ ‘‘నా సమాధి నాప బండ, తొలగి, పగిలి ఉంటుంది.’’ ఈ సంభాషణ హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల్లో ఉన్న భార్యాభర్తల మధ్య జరిగింది. ‘‘మనిద్దరం కలిసే చనిపోదాం’’ అన్నాడు భర్త. ‘‘అలా కుదరదు. నాకు పిలుపు వచ్చింది. నీకు రాలేదు. నేను వెళ్లక తప్పదు.’’‘‘నేను ఒంటరిగా ఉండాలా?’’ ‘‘కొద్దిరోజులే! నీకూ పిలుపు వస్తుంది. నాతోనే స్వర్గంలో శాశ్వతంగా ఉంటావు’’ ‘‘నీ తండ్రి నన్ను నీ దగ్గరకు రానిస్తాడా? ఉండనిస్తాడా?’’ ఆమె ఆలోచనలో పడింది. ఏభై ఏళ్ల క్రితం వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొని ఆమె తండ్రి ఇంటికి పోతే, కూతుర్ని ఇంట్లోంచి నెట్టేశాడు. తల్లీ, చెల్లి, తమ్ముడూ అడ్డంపడి ఆమెను లోనికి తీసుకుపోయారు. అతణ్ని వీధిలోనే నిలబెట్టాడు ఆమె తండ్రి. ‘‘కులం మతం లేని వాడి ముఖం నేను చూడను. నా గడప తొక్కరాదు’’ అన్నాడు. ఆమె ఇల్లు, ఊరు వదిలివచ్చి ఏభై ఏళ్లయింది. ఈ జీవితమంతా వాళ్లిద్దరూ సుఖంగానే ఉన్నారు. ‘‘ఈ లోకం తండ్రికి, ఆ లోకం తండ్రికి తేడా ఉంది. ఈయన సమాజం మనిషి. ఆయన స్వర్గం దాత. మనల్ని ఈ లోకంలో ఏకం చేసినట్టే ఆ లోకంలోనూ కలిపి ఉంచుతాడు,’’ ఆమె చెప్పింది. ‘‘నేనొక్కణ్నే ఇక్కడ ఉండను. నీతో వచ్చేస్తా, ఇప్పుడే’’ ‘‘ఆ సమయం రాలేదు. నీ చిట్టచివరి మనుమరాలి పెళ్లి చేసిందాకా నీకు పిలుపు రాదు’’ ‘‘అంతదాకా నేను ఒంటరిగా ఉండాలా? ఉండను!’’ ‘‘పిచ్చికన్నా! నీకు పని ఉంది. అందాకా ఉండాలి. ఇప్పటికీ నా తండ్రిని చాలాసార్లు బ్రతిమిలాడాను. సాకులు చెప్పి చెప్పి విసిగిపోయాను. నన్ను వెళ్లనివ్వు!’’‘‘నావల్ల అవుతుందా, వెళ్లు అనటానికి’’ ‘‘నువ్వు ఊ అనందే నేను ఈ బంధం తెంచుకోలేను.’’‘‘నువ్వు వెళితే, నేను ఒంటరిగా, నువ్వు ఒంటరిగా..’’ ‘‘తప్పదు. ఇరవై ఏళ్లు మనం ఒంటరి వాళ్లమే కదా, ఆపైనేగా జంటగా మారింది. ఇక కొంత కాలం ఎడబాటు, తర్వాత కలయిక, అన్యోన్య జీవనం శాశ్వతంగా’’ ఆమె మౌనంగా ఉంది. అతని కన్నీరు కదిలింది. ఉన్నట్టుండి అడిగాడు. ‘‘నువ్వు ఇప్పుడే చనిపోకపోతే ఏం?’’ ‘‘సమయం మన చేతుల్లో ఉందా? తండ్రి ఇష్టం.’’ పదేళ్ల కిందట, హాస్పిటల్ బెడ్ మీద, చేయి పట్టుకొని కన్నీళ్లు తుడిచి నవ్వింది. ‘‘మళ్లీ కలుద్దాం’’ అని కళ్లు మూసుకొంది. మళ్లీ కళ్లు తెరవలేదు. అదే ఆఖరు నవ్వు. అతనికి సమాధుల తోటలో ఆమె సమాధిని ఎన్నిసార్లు చూచినా తనివి తీరదు. ఆమెను చూచినట్లే ఉంటుంది. ప్రతి ఈస్టర్ రోజు రాత్రంతా ఆమె సమాధి పక్కనే కూర్చుంటాడు. ఆమె సమాధిలోనే ఉంటే దుఃఖ జీవి. లేచి తండ్రితో వెళితే ఆనంద జీవి. అందుకే ఆమె దుఃఖ విముక్తి కలగాలని తండ్రిని చేరుకోవాలని కోరుకుంటాడు. ఎప్పుడు సమాధి నాపబండ పగులుతుందా, తొలగుతుందా అని ఎదురుచూస్తుంటాడు.ఆమె తండ్రి దగ్గరకు పోయేటప్పుడు తనకు కనబడుతుందో లేదో, ఏ రూపంలో ఉంటుందో ఏమో, ఏమీ రూపం లేకుండా ఉండిపోతుందో ఏమో, తండ్రి కనిపిస్తాడో లేడో, ఇద్దరూ పవిత్ర ఆత్మ రూపంలో ఉంటారో ఏమో! అతణ్ని ఆమె గుర్తుపడుతుంది. పైగా ప్రతి ఈçస్టర్ రోజున పెళ్లినాటి బట్టలే కట్టుకోమంటుంది. అన్నీ తెల్లటి బట్టలే. చిరుగులు పట్టినా, చిమటలు కొట్టినా, రంధ్రాలు పడ్డా, ఆ బట్టలే, ఆ తెల్లటి బట్టలే కట్టుకోమంటుంది.ఆమెకిష్టం కదా, అవీ కట్టుకొంటాడు. ఆమె అతణ్ని గుర్తుపట్టటం తేలికే! ఏభై ఏళ్ల క్రితం అతను ఆమె చేయి పట్టుకొన్నాడు. ఆమె నవ్వింది. ‘‘నా చేయి పట్టుకొన్నావు’’ అంది. ‘‘అవును’’ అన్నాడు. ‘‘ఈ చేయి వదలవుగా’’ అని అడిగింది. ‘‘వదలను’’ అన్నాడు. ‘‘నిజం?’’ ప్రశ్నించింది. ‘‘నిజం, నేను చనిపోయినా వదలను’’ అన్నాడు. అప్పుడామె నవ్వింది. ‘‘మరి నువ్వూ?’’ అన్నాడు. ‘‘చనిపోయాక కూడా నీ చేయి వదిలిపెట్టను’’ అని నవ్వింది. ఆ నవ్వు ఏభై ఏళ్లు అతణ్ని బతికించింది. తోడుగా ఉంది. పదేళ్ల క్రితం హాస్పిటల్ బెడ్‌మీద, చనిపోయే ముందు నవ్వింది. అద్భుతమైన నవ్వు. అది పదేళ్ల నుంచి అతణ్ని బతికిస్తూ ఉంది. అప్పుడామె ధైర్యంగా ఉంది. నవ్వుతూనే ఉంది. అతను గుర్తు చేశాడు.‘‘చనిపోయినా నా చేయి వదలనన్నావు కదా’’ గుర్తుచేశాడు. ‘‘అవును. అన్నాను. నిజమే!’’ అంది. ‘‘మరి నన్ను విడిచి, మన పిల్లల్ని, పిల్లల పిల్లల్ని వీడి నువ్వు వెళతానంటున్నావే?’’ నవ్వింది. అంత అనారోగ్యంలో కూడా ఎంత చక్కగా నవ్విందో. ‘‘నేను ఇచ్చిన మాట తప్పటం లేదు’’ అంది. ‘‘మరి?’’ రెట్టించాడు. ‘‘నా తండ్రి రమ్మంటున్నాడు తండ్రిమాట జవదాటగలనా?’’ వెంటనే అడిగాడు. ‘‘నాకిచ్చిన మాట తప్పుతావా?’’ ‘‘తప్పాలని లేదు. నేను బలహీనురాలిని. ఏం చేయను? నీ బిక్కముఖం చూస్తుంటే నాకు బాధగా ఉంది. నన్ను, నా తండ్రితో వెళ్లనివ్వు’’ ‘‘కాదు, నేనూ, నీతో వస్తాను’’‘‘సంతోషమే. ఎన్నడూ ఆటంకపెట్టని నువ్వు, ఎప్పుడూ అనుమతించిననువ్వు, ఎల్లప్పుడు నన్ను అనుసరించిన నువ్వు, ఇప్పుడూ అనుసరిస్తానంటే ఆనందమే. కానీ, నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నై. నా తండ్రి నువ్వేం చేయాలని సంకల్పించి నిన్ను సృజించాడో, అవి నెరవేర్చిందాకా నువ్వురాలేవు. సంతోషంగా ఉండు. నిన్ను ఈ లోకం మీదికి ఆ లోకపు తండ్రి ఎందుకు పంపాడో అది తీరిందాకా నీకు పిలుపు రాదు. పిలుపు రానంతకాలం నువ్వు బయలుదేరలేవు. నువ్వు చేయవలసినవి, నువ్వే చేయవలసినవి, ఎన్నో పనులు ఉండి ఉంటాయి. నువ్వో పువ్వువు. పరిమళం పంచటమే నీ పని. కాలం తీరిందాకా పువ్వు వాడదు. రాలదు. పువ్వు రాలే సమయం వస్తే ఏ బంధమూ ఆపదు. ఆ గడియ వచ్చాక ఎవరూ ఉండరు. నా మాటేంటంటావా? నా తండ్రి నాకు అప్పగించిన పని సంపూర్ణంగా, నిర్విఘ్నంగా నెరవేర్చాను. నా తండ్రి నన్ను చెయ్యమన్న పనులన్నీ చేయటానికి నువ్వు అన్ని విధాలా సహకరించావు. నా తండ్రి నా కోసం నిన్ను సృష్టించాడు. నా పని అయిపోయింది. నన్ను తీసుకుపోతున్నాడు. నీ పనికాలేదు. నిన్నిక్కడే ఉంచుతున్నాడు.’’‘‘ఎంతకాలం, ఇలా.. ఒంటరిగా?’’‘‘నాకేం తెలుసు. నా తండ్రికి తెలుసు. నువ్వు వచ్చేముందు నా తండ్రి నాకు చెబుతాడు. నీకోసం చూస్తూ ఉండే నేను, నీకు ఎదురుగా వస్తాను. చేయి పట్టుకుంటాను. వెంట తీసుకుపోతాను. తండ్రికి చూపుతాను. దగ్గర కూర్చోబెడతాను. ఈ లోకంలో నా తండ్రి ఇంట్లోకి నిన్ను తీసుకొని పోలేకపోయాను. కానీ ఆ లోకంలో నా తండ్రి దయా సన్నిధిలో నిన్ను కూర్చోబెడతాను. ఇప్పుడు చెబుతున్నాను విను. నీ చేయి ఎప్పటికీ విడిచిపెట్టను’’ఆమె ఓదార్పు వింటుంటే, దుఃఖం తగ్గి అతనికి ఎంతో ఉపశమనం కలిగింది.‘‘నిన్ను నాకిచ్చినట్లే ఇచ్చి, ఇంతలోనే తీసుకుపోవటం ఏమిటి?’’‘‘ఇవ్వటం, తీసుకోవటం తండ్రి ఇష్టం. కొడుకునిచ్చాడు. కొడుకు సిలువ మీద రక్తం చిందించాడు. మనల్ని పునీతుల్ని చేశాడు. ఆ దైవరక్తమే మనకు రక్షణ, నిరీక్షణ ఇచ్చింది. ఈ లోకంలో రక్షణ. ఆ లోకంలో నిరీక్షణ. నేను నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను.’’ ‘‘ఇది నీకు న్యాయంగా ఉందా?’’‘‘అది నా తండ్రి నిర్ణయం. దానికి తిరుగులేదు. నీకు పిలుపు రాగానే నువ్వు వచ్చి నాతో కలిసి ఉంటావు.’’సమాధుల తోటలో పండువృద్ధుడు, ఎనభై ఏళ్లవాడు ఆమె సమాధి చుట్టూ తిరిగాడు. చుట్టూ చూశాడు.చిమ్మ చీకటి. అర్ధరాత్రి. నిశ్శబ్దం సమాధులతోటను పరిపాలిస్తూ ఉంది. సమాధి చుట్టూ కొవ్వొత్తులు వెలిగించాడు. వెలుతురులో సమాధిని చూశాడు. నాపబండ ఏదీ పగట్లేదు. సమాధి చెక్కు చెదరకుండా ఉంది.తండ్రిరాలేదు. ఆమె వెళ్ళలేదు. ఈ లోకంలోనే విశ్రాంతిగా ఉంది. అతను నిశ్చయించుకొన్నాడు.ఆమె పల్చటి మనిషి. గుత్తులపూల చెండ్లు బరువని ఒక్క గులాబిపెట్టుకొనేది. వేలెడు కనకాంబరాల మాల తలలో చెక్కుకొనేది.ఆమెకు సొమ్ములిష్టంకాదు. చీరెలిష్టంకాదు. పూలిష్టంకాదు. కాని భర్త ఏం తెచ్చినా, ఇచ్చినా పెట్టుకొనేది. కట్టుకొనేది. అలంకరించుకొనేది. గులాబీలు, కనకాంబరాల మాలలు తెచ్చాడు. సమాధిని అలంకరించాడు. ఆమెను చూసుకున్నట్లుగా ఉంది. సమాధిలోంచి ఆమె సమ్మతిని తెలుపుతూ తల ఊపి ఉంటుంది.అలంకరింపబడ్డ సమాధిని తనివి తీరా చూసుకోవటానికి పెద్దకొవ్వొత్తులు వెలిగించాడు. సమాధి దేదీప్యమానంగా వెలిగింది. తను సంతృప్తిగా నిలబడ్డాడు.అతనికెప్పటికీ అర్థంకాని సంగతి, ఆమె ధైర్యం! మృత్యువు ముఖంమీదికి వచ్చినా నవ్వగలగటం. అద్భుతంగా నవ్వగలగటం ఆమెకే చెల్లు. పైగా భర్తను ఓదార్చటం! చావును అంత ధైర్యంగా ఆహ్వానించేవాళ్లు అరుదు. ఆమె అరుదైన స్త్రీ. ‘‘నీకు భయంలేదా?’’ అని పదేళ్ల క్రితం, మృత్యుముఖంలో ఉన్న ఆమెను అడిగితే నవ్వుతూ చెప్పింది – ‘‘నాకేం భయం! ఇక్కడ నువ్వున్నావు! అక్కడ నా తండ్రి ఉన్నాడు’’.ఆమె మాటలు అతనికి ధైర్యమిచ్చాయి. ఆమె ఓదార్పు గొప్పవరం. ‘‘ఇదిగో నువ్విచ్చిన పువ్వు’’ అని తలలోని గులాబీని తడిమింది. ‘‘ఇది నీ ప్రేమ. ఇది నా సౌభాగ్యం. దీంతో నా తండ్రి దగ్గరకుపోవటం, ఎంత ఆనందం!’’ నవ్వింది.పూవును తడిమితే పరిమళం తుట్టెరేగినట్లు లేచింది. ఆమె అంతా పరిమళమయింది. ఆమె ఏమీ కోరేదికాదు. ఇది లేదు, అది లేదు అని విసుక్కొనేది కాదు. ఏమీ లేకపోయినా, సుఖంగా సంతోషంగా ఉండేది. సంసార సాగరంలో మునిగి తేలుతూ, ఒక్క నీటి చుక్క కూడా అంటకుండా ఉండటం ఆమెకే చెల్లు.ఆమె సమాధి చుట్టూ పూలు అలంకరించి, నాపబండ మీద పూల మాలలుంచి, కొవ్వొత్తులు వెలిగిస్తే అతనికి తృప్తి! సాంబ్రాణి కడ్డీలు కాలిస్తే వచ్చే పరిమళం ఆమె ఇష్టపడేది. ఇష్టపడేదని ఎలా తెలుసునంటే, పరిమళం ఆఘ్రాణిస్తూ కూర్చునేది.అలంకరించిన సమాధి కొవ్వొత్తులు వెలిగించి అగరొత్తులు కాలిస్తే వచ్చే పరిమళం సమాధుల తోటలో చాలా దూరం వ్యాపించింది, పొగతో పాటు. ముసలిప్రాణం అలసి పోయింది. నిలబడలేకపోయాడు. సమాధిమీద కూర్చోబోయాడు. అపచారమనిపించింది. సమాధి నాపరాతి బండనానుకొని నేల మీద కూర్చొని, తల సమాధి మీద పెట్టుకొన్నాడు. ఆమె చేతుల్లో తన తలపెట్టుకొన్నట్లు ఆనందించాడు. అగరబత్తీల పొగ తలలోకి దూరి, ఆమె సుతారంగా తల నిమిరినట్లు అనిపించింది. మగతగా ఉంది. కళ్ళు మూసుకుపోయాయి. మాగన్నుగా నిద్రపట్టేసింది. నిద్రలోనే, నేల మీదికి, దుమ్ములోకి, ధూళిలోకి, దూగరలోకి జారిపోయాడు. సమాధి బారుగా దానిని ఆనుకొని, దానిమీద చేయివేసి, బక్కప్రాణి నిద్రపోయాడు. ఆమె పక్కలో ఉన్నట్లు, తన చేయి ఆమె పైన వేసినట్లు సుఖంగా నిద్రపోయాడు.అమావాస్య అర్ధరాత్రి. పైగా సమాధులున్న చోటు. అటు రాత్రి మనుషులు రారు. ఈస్టరు తెల్లవారుజాము నుంచి పలచగా, తెల్లవారాక దట్టంగా జనసంచారం ఉంటుంది. నాపబండ చిట్లినట్లు అనిపించింది. కొద్దిక్షణాల్లోనే ఫటిల్లుమని పగిలిన శబ్దం. ఆమె సమాధిలోకి ప్రాణవాయువు ఊదినట్లు చిన్న శబ్దం వినవచ్చింది. అంతలో గాలి పీల్చినట్లు అలికిడి.బండకదిలింది. సమాధిలోంచి ఆమె వెలుపలికి వచ్చింది. అతన్ని చూచింది. ఆమె అతని దగ్గరకు రాలేదు. అతను ఆశించినట్లుగా ఆమె అతని తల నిమరలేదు. కాని చెప్పింది. ‘‘నా తండ్రి వచ్చాడు. నేను నా తండ్రితో స్వర్గానికి వెళుతున్నాను’’‘‘నా చేయి పట్టుకోవా?’’‘‘నేను మాటనే కాని, మనిషిని కాదు. నాకు నా సహజరూపంలేదు. నేనిప్పుడు నా ఆత్మస్వరూపం. నా తండ్రి స్వరూపం. నేన్నీకు కనబడను. నేను నీతో మాట్లాడగలగటం మన అన్యోన్య దాంపత్యానికి గుర్తు. ఈ దివ్యదేహంలో మనిషి మాటలు ఇంకా ఎంతోకాలం ఉండవు.’’‘‘నన్ను తాకవా?’’ – ‘‘తాకలేను.’’‘‘చేయి పట్టుకోవా?’’ – ‘‘పట్టుకోలేను’’‘‘నా తల సవరించవా?’’ – ‘‘సవరించలేను.’’‘‘ఏం? ఎందువల్ల? ఇష్టంలేదా?’’ – ‘‘ఇష్టంలేక కాదు. ఇప్పుడు నేన్నీ భార్యనుకాదు. నా తండ్రి కూతుర్ని. నాకు దేహం లేదు. నా తండ్రితో వెళుతున్నాను.’’‘‘నీ తండ్రి వచ్చాడా?’’ – ‘‘వచ్చాడు. నా చేయి పట్టుకొన్నాడు. నేను పసిపిల్లలాగా నడుస్తున్నాను. పడిపోవటం లేదు. ఎక్కువసేపు నీతో మాట్లాడితే పడిపోతానేమో.’’ ‘‘నీకు ప్రయాణం ఖర్చుకు డబ్బు కావాలి కదా! వస్తూ డబ్బు తెచ్చాను. ఇదిగో తీసుకో, దగ్గరుంచుకో..’’ – ‘‘నాకెందుకు డబ్బు?’’‘‘ఎందుకైనా మంచిది. తీసుకో’’ – ‘‘నాకు నా తండ్రి చేయి ఉండగా డబ్బెందుకు, ఎవరికైనా ఇవ్వు.’’‘‘కాదు నీకే ఇస్తా’’ – నీ చేయి లేదు. వెలుతురులాగా పొగలాగా, అస్పష్టమైన ఆకారం నీది. ఇదిగో డబ్బు ఇక్కడే పెడుతున్నా.’’ – ‘‘నీ ఇష్టం.’’డబ్బు తీసి, సమాధిమీద పెట్టి, దానిమీద పూల బరువు ఉంచి, ఆపైన ఆమె కుట్టిన ఎంబ్రాయిడరీ చేతి గుడ్డపెట్టి చూశాడు. గాలికి కొట్టుకొని పోదు అని నిర్ధారించుకొన్నాడు.ఆమె కావాలనుకొంటే ఈ డబ్బు తీసుకుపోతుంది. వద్దనుకొంటే వదిలి వెళ్ళిపోతుంది అనుకొన్నాడు.ఇంక ఆమె మాట కూడా వినిపించటంలేదు. స్వర్గానికి వెళ్ళిపోయింది కాబోలు, ఈ లోకపు బందిఖానా అయిన డబ్బును ఆ లోకపు స్వేచ్ఛాప్రాణికి ఇవ్వబోయి అపచారం చేశానా అని దిగులుపడ్డాడు.అంతలో ఆమె మాట మళ్లీ వినిపించింది. ‘‘నా తండ్రి పిలుస్తున్నాడు. నేను వెళతాను.’’ –‘‘వెళ్లొస్తానను’’– ‘‘అనలేను’’ – ‘‘నేనూ నీ వెంట వస్తాను’’ – ‘‘నా ఇష్టం ఏముంది?’’ ‘‘దేనికీ అడ్డుచెప్పేదానివి కాదుకదా! అన్నింటికి అవును, సరే, నీ ఇష్టం, అలాగే అనేదానివి కదా, ఇప్పుడు ఎందుకు నా ఇష్టానికి మాటకు, ఆలోచనకు అందకుండా ఉన్నావు’’‘‘అప్పుడు నీ భార్యను – ఇప్పుడు నా తండ్రి కూతురును’’‘‘నీ కొర్కెలన్నీ తీరాయా!’’‘‘నాకు కోర్కెలు లేవు. నా తండ్రి కోరిక, నీ కోరిక తీరటమే నాకు ముఖ్యం. మరి నేను వెళ్ళనా?’’‘‘మళ్ళీ ఎప్పుడో, ఎక్కడో, ఎలాగో మనం కలుసుకొనే రోజు?’’‘‘నా తండ్రి పిలుపు మేరకు నువ్వు వచ్చినప్పుడు మనది శాశ్వతమైన కలయిక.’’‘‘అందాకా నేను ఒంటరినా?’’ ‘‘నువ్వు ఎన్నుకోబడ్డ విత్తనానివి. నువ్వెట్లా మొక్కై, మానై, పుష్పించి ఫలించాలో అది నా తండ్రి ఇష్టం. నీ చేత ఇంకా ఏం చేయిస్తాడో ఆ తండ్రికి తెలుసు. ఆ పథకం పరిపూర్ణమయ్యేదాకా నీకు పిలుపురాదు. తండ్రి ఆహ్వానం ఉండదు. నిన్ను నా తండ్రి ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలియదు. నీకూ తెలియదు. ఈ తెలియనితనమే ఈ లోకంలో మన జీవితం. తండ్రి ఉద్దిష్టం నెరవేరితే, నీ పని అయిపోయినట్లే! అప్పుడు ఈ లోకానికి నీ అవసరం ఉండదు. నా తండ్రి పిలుపు వచ్చేదాకా ఆగు.’’‘‘మళ్ళీ నిన్ను చూచేరోజు?’’‘‘నా తండ్రి ఏర్పాటు చేసే ఉంటాడు.’’ ఆమె రూపం మసకబారింది. మంచులాగా విడిపోయింది. పొగ లాగా తేలిపోయింది. ఆమె ఆకారం లేదు. మాటలేదు. అర్ధరాత్రి అమావాస్య. నిశ్శబ్దం. శూన్యం.గాలి తేలి, ధూళి లేచి, సమాధి నాపబండకు తగిలి నేల మీద పడింది. నేల మీద ఉన్న అతని ముఖాన్ని తాకింది. నిద్ర చెడింది. లేచి కూర్చున్నాడు. కల గుర్తుకు వచ్చింది. వాస్తవమేమో అని భ్రాంతి కలిగింది. ఆమె తండ్రితో వెళిపోయిందన్న భావన స్ఫురించటంతో చటుక్కున లేచి నిలబడ్డాడు. సమాధిని చూశాడు. దాని చుట్టూ తిరిగాడు.పెట్టిన పూలు చెదరలేదు. వేసిన మాలలు కదలలేదు. చేసిన అలంకారం మారలేదు. కొవ్వొత్తులు ఆరిపోలేదు. అగరొత్తులు కాలిపోలేదు. పొగ ఆగలేదు.నాపబండ పగిలి, ఆమె లేచి, తండ్రితో వెళుతూ మాట్లాడిన మాటలు గుర్తుకు రాసాగాయి.గబగబా సమాధి చుట్టూ చూశాడు. నాపబండ పగల్లేదు. సమాధి ఒరగలేదు. ఆలోచించసాగాడు. ఆమె తండ్రితో వెళ్ళిపోవటం కలా, నిజమా?అతను ఊడిపోయిన పంచె కట్టుకొన్నాడు. లుంగలు చుట్టుకుపోయిన జుబ్బా సరిచేసుకొన్నాడు. కిందపడి గాలికి రెపరెపలాడుతున్న పై పంచె తీసి భుజాన వేసుకొన్నాడు.చేతిగుడ్డ కింది పూలు, వాటి కింది డబ్బుకాగితాల పొత్తి, చెక్కుచెదరకుండా స్ధిరంగా ఉంది.తెల్లవారుతూ ఉంది. సమాధుల తోటలో ఉన్న తమ ఆత్మీయుల, బంధువుల, అయినవాళ్ళ స్మృతి జెండాలుగా జనం వస్తున్నారు. అతను వెలుపలికి పోసాగాడు. అంతకు ముందే, అప్పటిదాకా నిద్రపోయిన సమాధుల తోట సంరక్షకుడు, లేచి, ముఖం కడుక్కొని, సమాధుల చుట్టూ తిరిగి చూచి వచ్చి విధి నిర్వాహణకు బయలుదేరాడు.ఆమె సమాధి కాంతి, పరిమళం ఆకర్షిస్తే అటు నడిచాడు. ఈమె బంధువులు వచ్చి వెళ్ళినట్లున్నారు అనుకొన్నాడు.తాను తెల్లవారుజామున లేచి చూచినప్పుడు ఆ సమాధి దగ్గర తెల్లటి ఆకారం కదులుతున్నట్లుగా ఉండటం గుర్తుకువచ్చింది.సమాధి మీద చేతిగుడ్డ, పూలు, డబ్బు కాగితాల పొత్తి చూశాడు. డబ్బు పైకి తీశాడు. లెక్కబెట్టాడు. కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. ఇంత డబ్బా? అనుకొన్నాడు. ఆనందం ఆగలేదు. తన సంవత్సర జీతమంత! ఇంత డబ్బు దేవుడి దానమే! జేబులో పెట్టుకొన్నాడు. తెల్లటి ఆకాశం గుర్తువచ్చింది.ఆగలేకపోయాడు.ఆవేశంతో ఊగిపోసాగాడు. పెద్దగా కేకలు పెడుతున్నాడు. ‘నా తండ్రి వచ్చాడు. నాకు దానం చేశాడు. ‘దాని’ తెల్లగా ఉన్నాడు. పొగలాగా ఉన్నాడు. మంచులాగా ఉన్నాడు. గాలిలో తేలియాడాడు. తోటలో దిగటం చూశాను. తోట నుంచి నిష్క్రమించటం చూశాను. ఆకాశంలోంచి దిగాడు. ఆకాశంలోకే వెళ్లిపోయాడు. నేను చూశాను. నా తండ్రి వచ్చాడు. తోటను ఆశీర్వదించాడు. నన్ను దీవించాడు. ఇదిగో దానం. ఇదిగో డబ్బు!’’ అని ఆనందంతో కేకలు పెడుతున్నాడు.జనం ఆశ్చర్యంగా అతడి అరుపులు వింటున్నారు.అతను సమాధుల తోట మెయిన్ గేటు నుంచి రోడ్డు మీదికి వచ్చాడు.అప్పుడే రద్దీ మొదలవుతూ ఉంది.సూర్యుడు రాకముందు, కనిపించకముందు, సూర్యకిరణాలు వచ్చి తొలివెలుగు, తొలి వెలుతురు సృష్టించినట్లు తూర్పు నవ్వుతూ ఉంది. ఆమె నవ్వుతూ ఉంది. అతనికి ఆనందంగా ఉంది. ముందుకు నడుస్తున్నాడు. ఆమె అడిగింది.‘‘అంతదూరం, ఇంటిదాకా నడిచే వెళతావా?’’ – ‘‘వెళ్తాను’’ఆమె అడిగితే సమాధానం చెప్పినట్లుగా అనిపించింది. ఆమె జాలిగా చెప్పింది.‘‘నడవలేవు, నామాట విను, టాక్సీఎక్కి ఇంటికి వెళ్ళు. జేబులో డబ్బులేకపోయినా, ఉన్నదంతా నాకే ఇచ్చినా, ఇంటిదగ్గర టాక్సీఫేర్ ఇవ్వవచ్చు. టాక్సీ ఎక్కు’’ – ‘‘నడుస్తాను’’‘‘ఈ వయస్సులో ఈ స్థితిలో ఎంతో దూరం నడవలేవు’’ – ‘‘నడుస్తాను’’‘‘ఎంతకాలం?’’ – ‘‘ఎంతకాలమైనా, తండ్రి పిలుపు వచ్చేదాకా, నడుస్తుంటాను. నడుస్తూనే ఉంటాను’’ఆమె మౌనంగా ఉంది. అతను నడుస్తూనే ఉన్నాడు. - ఆచార్య కొలకలూరి ఇనాక్ -
రన్‌వేపై.. వదల బొమ్మాళీ.. వదల..
అమెరికాలోని సవన్నా నగరంలోని ఎయిర్పోర్ట్.. ఇక్కడి రన్‌వేపై రిచర్డ్, క్యాథరీన్ డాట్సన్ సమాధులుంటాయి.. ఫొటోలోని వృత్తంలో చూశారుగా.. అవే! సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టేటప్పుడు అవసరమైతే తగు పరిహారం ఇచ్చి ప్రైవేటు ఆస్తులను కూడా తీసుకుంటుంది. రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో అప్పట్లో ఇక్కడ చిన్నస్థాయి సైనిక ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించిన అమెరికా ప్రభుత్వం.. ఇందుకోసం డాట్సన్ కుటుంబ సభ్యుల వ్యవసాయ భూమిని కూడా తీసుకుంది. అయితే, ఆ భూమిలోనే వీరి కుటుంబ సభ్యులు, వారి బానిసలకు చెందిన వందలాది సమాధులు ఉన్నాయి. దీంతో సైనికులు ఓ నాలుగు తప్ప మిగిలిన సమాధులను తవ్వి, వాటిని సమీపంలోని మరో శ్మశానానికి తరలించారు. అప్పట్లో వీటి వల్ల పెద్ద ఇబ్బంది లేకపోవడంతో వదిలేశారు. తదనంతర కాలంలో ఇది పౌర విమానాశ్రయంగా మారింది. 1970ల్లో రన్‌వేలను విస్తరించాలని నిర్ణయించారు. అయితే, రిచర్డ్, క్యాథరీన్ సమాధులు ఓ రన్‌వేకు మధ్యలో వచ్చేలా ఉన్నాయి. అక్కడి చట్టాల ప్రకారం వారి సంబంధీకులు ఒప్పుకుంటే తప్ప.. సమాధులను వేరే ప్రాంతానికి తరలించకూడదు. డాట్సన్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో అవి ఉంటుండగానే.. రన్‌వే నిర్మాణం కానిచ్చేశారు.. దీంతో అవిలా రన్‌వే మధ్యలో మిగిలిపోయాయి. అలాగే అమెరికాలోని మాథిస్ ఎయిర్‌పోర్టు(ప్రస్తుతం ఇది పనిచేయడం లేదు) కూడా.. ఇక్కడైతే.. ఓ 20 మందివి ఉంటాయి. 1960ల్లో రన్‌వే కట్టినప్పుడు చనిపోయినవాళ్ల సంబంధీకులు వాటిని అలాగే ఉంచేయాలని కోరడంతో వాటి మీదుగానే రన్‌వే నిర్మించేశారు. -
రుద్రమకోటలో అతి పురాతన సమాధులు
కుక్కునూరు : ప్రపంచంలో కెల్లా అతిపురాతనమైన సమాధులు ఈజిప్టు తర్వాత వేలేరుపాడు మండలంలోని రుద్రమకోటలో ఉన్నాయని పురావస్తుశాఖ కమిషనర్ వాణీమోహన్ అన్నారు. బుధవారం రుద్రమకోటలోని పురాతన సమాధుల తవ్వకాలను థాయిలాండ్, దక్షిణకొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ ఆర్కియాలజిస్టులతో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మూడునెలలుగా ఇక్కడ పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన వస్తువులు, ఆదిమానవుల అవశేషాలు, వారు వాడిన వస్తువులు తదితర సామగ్రిని పోలవరం, రాజమండ్రిల్లో మ్యూజియాలు ఏర్పాటుచేసి ప్రదర్శనకు ఉంచుతామన్నారు. అవశేషాలను హైదరాబాద్‌కు తరలించి వాటి డీఎన్‌ఏలపై పరిశోధనలు చేసి అప్పటి మానవుల ఆహారపు అలవాట్లు, జీవన విధానం తదితర విషయాలు తెలుసుకుంటామన్నారు. కొన్ని అవశేషాలను పూనేలోని ఆర్కియాలజీ కేంద్రానికి తరలించామన్నారు. ఇక్కడి సమాధులు క్రీస్తు పూర్వం వెయ్యి ఏళ్ల ముందువని, అప్పటి మహిళలు వాడిన పూసలను కార్మేలియన్ రాయి నుంచి తయారుచేశారని చెప్పారు. కార్మేలియన్ రాయి గుజరాత్లో మాత్ర మే లభిస్తుందని, దీని ద్వారా రుద్రమకోట నుంచి గుజ రాత్‌కు వాణిజ్య సంబంధాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. విదేశీ ఆర్కియాలజిస్టులు మాట్లాడుతూ తవ్వకాల్లో దొరికిన ఎముకలను బట్టి చూస్తే అప్పటివారు దృఢమైన శరీరాకృతిని కలిగి ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. పొక్లయిన్ సా యంతో తప్ప మోయలేని బండరాళ్లను సమాధుల మీద ఏర్పాటుచేసిన విధానం చూస్తే వారు ఎంత బలవంతులో అర్థం చేసుకోవచ్చన్నారు. రుద్రమకోట అద్భుతమైన చరి త్రగల గ్రామామన్నారు. ఆర్కియాలిజీ పరిశోధన కళాశాలలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, పురావస్తుశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
5 వేల ఏళ్లనాటి ప్రాచీన ఆవాసాలు
వెంకటగిరి: భారతదేశంలోనే అరుదైన ఇసుక దిబ్బల్లో బృహత్ శిలాయుగపు నాటి నివాసం, సమాధులు ఉన్న ప్రాంతాన్ని చిల్లకూరు మండలం లింగవరం వద్ద వెంకటగిరికి చెందిన చరిత్ర పరిశోధకుడు షేక్ రసూల్ అహ్మద్ కనుగొన్నారు. భారతీయ పురాతత్వశాఖ దక్షిణ విభాగం అసిస్టెంట్ ఎపిగ్రఫిస్ట్ ఏసుబాబులో కలిసి మళ్లీ సందర్శించి అవశేషాలను పరిశీలించి నిర్ధారించారు. సోమవారం చరిత్రకారుడు షేక్ రసూల్ అహ్మద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బృహత్ శిలాయుగం నాటి అవశేషాలు భారతదేశం అంతటా లభించినప్పటికీ, లింగవరంలో లభించిన అవశేషాలు ఇసుక దిబ్బల్లో మూడు అడుగుల నుంచి 15 అడుగుల లోతుల్లో మూడు స్థలాల్లో లభించడం గమనార్హమని తెలిపారు. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఇసుక దిబ్బల్లో లభిస్తున్న అవశేషాలు అన్నీ ప్రీహిస్టారిక్ (ఆదిమ మానవుల) కాలం నాటివిగా గుర్తించారు. అయితే బృహత్ శిలాయుగం నాటి అవశేషాలు లభించడం భారతదేశంలో మొట్టమొదటి స్థావరం లింగవరం అన్నారు. ఈ ప్రాంతంలో లభించిన కుండలు, సమాధులు తమిళనాడు రాష్ట్రంలోని ఆదిచెన్నలూరులో లభించిన కుండ సమాధులను పోలి ఉన్నప్పటికీ కొంతమేర ప్రాతీయ వైవిధ్యం కలిగి ఉన్నాయని రసూల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. -
గూడు సమాధుల గుట్టు వీడనుంది!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు వందల నిర్మాణాలు.. గుట్టలపై, దట్టమైన అడవిలో రాతి గుహల్లాంటి ఏర్పాట్లు.. చిన్న ద్వారం, తొంగి చూస్తే రాతి తొట్లు.. చుట్టూ భారీ రాతి గుండ్లతో కంచె.. కచ్చితమైన వృత్తా కారంలో ఏర్పాటు.. ప్రతి నిర్మాణం ముందు మానవాకృతిని సూచించే భారీ శిలలు.. వరం గల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి తీరం వెంట కనిపించే ఆది మానవుల సమాధుల ప్రత్యేక తలివి. ఇప్పటికీ ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా సమాధి నిర్మాణాలను గుర్తించలేదు. తెలంగాణ చరిత్రకే పరిమితమైన అరుదైన ఈ నిర్మాణాల గుట్టు వీడనుంది. గతంలో అమెరికాకు చెందిన శాన్‌డియాగో విశ్వవిద్యాల యం ప్రొఫెసర్ థామస్ ఇ లెవీ ఆధ్వర్యంలోని బృందం ఈ సమాధులను పరిశీలించి.. ఇవి ఈ ప్రాంతానికే ప్రత్యేకమైనవిగా తేల్చారు. వీటి నిగ్గు తేల్చేందుకు లైడార్ సర్వే చేస్తామనీ ప్రకటించారు. తాజాగా భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ఈ సమాధుల నిగ్గు తేల్చేందుకు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఖమ్మం జిల్లా పినపాక మండలం జానంపేట వద్ద తవ్వకాలు మొదలు కాబోతున్నాయి. తెలంగాణలో చాలాకాలం తర్వాత ఏఎస్ఐ చేపట్టే భారీ అన్వేషణ ఇదే. రాతిని తొలిచిన తొలి కాలం అదేనా? రాతిని తొలిచి ఆకృతిగా మలచటం క్రీస్తుపూర్వం 2 వేల ఏళ్ల క్రితం సింధూ నాగరి కతలో కనిపించిందని చరిత్ర చెబుతోంది. స్థాని కంగా క్రీస్తుపూర్వం 300 ఏళ్లనాడు మౌర్యుల కాలంలో ఆ తరహా శిల్పకళా వైభవం కనిపిం చింది. మరి ఈ రెండింటి మధ్య కాలంలో ఏం జరిగిందన్న దానికి స్పష్టమైన సమాచారం లేద ని నిపుణులు చెబుతారు. కానీ వరంగల్, ఖమ్మం మధ్య గోదావరి తీరంలో విస్తరించిన అడవులు, గుట్టలపై విస్తారంగా ఉన్న ఆది మానవుల సమాధులను పరిశీలిస్తే.. రాళ్లను ఆకృతిలోకి మలిచిన దాఖలాలు కనిపిస్తాయి. ఇవీ క్రీస్తుపూర్వం 1000–600 ఏళ్ల మధ్యనాటి వని ప్రాథమిక అంచనా ఉంది. ఇదే నిజమైతే సింధూ నాగరికత అంతరించాక రాతిని తొలిచి ఆకృతులుగా చెక్కిన కాలం ఇక్కడ నుంచి మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలా చెక్కారు? ఇక్కడి గుట్టల్లో, దట్టమైన అడవుల్లో వేల సం ఖ్యలో ఆది మానవుల సమాధులు విస్తరించి ఉన్నాయి. నాలుగైదు అడుగుల విస్తీర్ణంలో ఉండే పెద్ద పెద్ద బండరాళ్లు నిలిపి ఉంటాయి. వాటి వెలుపలి భాగం అర్ధ చంద్రాకారంలో చెక్కి ఉంటుంది. అన్ని రాళ్ల ఆకృతిని కలిపితే సంపూర్ణ వృత్తాకారంగా కనిపిస్తుంది. ఈ రాళ్ల మధ్య పది పదిహేను అడుగుల వెడల్పున్న గూడు ఉంటుంది. దానికి చిన్న ద్వారంతో పాటు లోపల ఏడెనిమిది అడుగుల పొడవున్న రాతి తొట్టి ఉంటుంది. అందులో మానవ అవశే షాలను గుర్తించారు. ఇక సమాధి ముందు అది ఎవరి సమాధి అని తెలిపేలా స్త్రీ/పురుష ఆకృతి లో ఎత్తయిన రాతి శిల పాతి ఉంటుంది. ఇనుము వాడిన దాఖలాలు నిజాం హయాంలో 1940–41 సమయంలో నాటి పురావస్తు శాఖ ఉన్నతాధికారి ఖాసీ మహ్మద్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి. ఆ సమయంలో గుర్రాల ముక్కుకు బిగించే ఇనుప వస్తువులు, నాగలికి ఏర్పాటు చేసే పరికరాలను, కొన్ని మట్టిపాత్రలు, ఇతర ఆకృతులు, ఆయుధాలను గుర్తించారు. ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ ఈ సమాధుల గుట్టు విప్పేందుకు పినపాక మండలం జానంపేట ప్రాంతాన్ని కేంద్ర పురావస్తు శాఖ తన అధీనంలోకి తీసుకుంది. కొన్ని వందల ఎకరాల ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా నిర్ధారించింది. ఆధునిక పద్ధతుల్లో, డీఎన్ఏ పరీక్షలను ఉపయోగించి ఆ సమాధులు ఏ కాలానికి చెందినవి, నాటి మనుషుల జీవన శైలి ఏమిటి, వారు స్థానికులేనా, వేరే ప్రాంతం నుంచి వలస వచ్చారా, ఇప్పుడు ఆ జాతి కొనసాగుతోందా, ఉంటే ఎక్కడ మనుగడలో ఉందన్న వివరాలను తేల్చనుంది. ఇది విదేశీ పరిశోధకులు, పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందని ఏఎస్ఐ భావిస్తోంది. -
రెస్ట్.. ఇన్ అరెస్ట్
మన శ్శాంతిని హరించడం కూడా ఆస్తుల్ని ధ్వంసం చేయడమే. ఈ సంగతి పెన్సిల్వేనియా మేయర్ బిల్ మిల్బ్రాండ్కి బాగా తెలిసివచ్చింది. సమాధులు ఉన్నచోట సెల్‌ఫోన్ టవర్ నిర్మించడానికి బిల్ అనుమతి ఇవ్వడంతో ఆ కాలనీ వాళ్లంతా బిల్‌పై విరుచుకుపడ్డారు. సమాధుల్లో గాఢ నిద్రలో ఉన్నవారి మనశ్శాంతిని ధ్వంసం చేయడానికి మీకెలా మనసొప్పిందని వారు బిల్ మీద కేసుపెట్టారు. పోలీసులొచ్చి ఆయన్ని ఆరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ‘వాండలిజం’ (ఆస్తుల్ని ధ్వసం చేయడం) కింద ఆయన్ని కోర్టు దోషిగా నిర్ధారించింది. మనుషులకే కాదు, ఆత్మలకూ హక్కులుంటాయని మేయర్‌గారు తెలుసుకుని, చే సిన తప్పుకు ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నారు. -
రుద్రమ్మ కోటలో రాతియుగం నాటి సమాధులు
నిర్ధారించిన పురావస్తు శాఖ వేలేరుపాడు : పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమ్మకోట గ్రామంలో రాతియుగం నాటి సమాధులను పురావస్తు శాఖాధికారులు బుధవారం గుర్తించారు. ఇవి 22 వేల సంవత్సరాలకు పూర్వం నాటి ఆది మానవుల సమాధులని నిర్ధారించారు. వీటిని ’మెగాలితిక్ బరియల్స్’ అంటారని అధికారులు తెలిపారు. ఆదిమానవుల కాలంలో ఎవరు చనిపోయినా పెద్ద గొయ్యి తీసి.. దానిచుట్టూ రాళ్లు పేర్చి దానిపై పెద్ద బండను మోపేవారని, చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన సామగ్రి అంతా అందులోనే పూడ్చిపెట్టేవారని వివరించారు. 15 ఏళ్ల క్రితమే ఈ సమాధులు ఉన్నట్టు గుర్తించామని, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. వేలేరుపాడు మండలం పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతంలో ఉన్నందున ఈ సమాధులు, వాటి చరిత్ర కనుమరుగు కాకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. నీటి పారుదల శాఖ అదికారుల అనుమతి పొంది, వీటి తవ్వకాలు చేపడతామని వివరించారు. రాతి యుగం నాటి సమాధులను పరిశీలించిన వారిలో కాకినాడ పురావస్తు శాఖాధికారులు తిమ్మరాజు, భాస్కర్‌నాయక్ , డీవీ సుబ్బారావు ఉన్నారు. -
కన్నీటితో సమాధుల పండుగ
కర్నూలు సీక్యాంప్: చనిపోయిన తమ కుటుంబీకుల ఆత్మలకు శాంతి కలగాలని జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు సమస్త పరిశుద్ధ ఆత్మల పండుగ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. సమాధుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా చనిపోయిన తమ వారికి ఆత్మలకు శాంతి కలుగుతుందని క్రైస్తవుల నమ్మకం. ప్రపంచ వ్యాప్తంగా కాథలిక్లు ఈ సమాధుల పండుగను జరుపుకుంటారు. కర్నూలు, నంద్యాలలో తమ పూర్వీకుల సమాధులపై కొవ్వొత్తులు వెలిగించి సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిషప్ పూల ఆంథోని, రెవరెండ్ అనిల్ కుమార్, రెవరెండ్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండలో బృహత్ యుగకాల సమాధులు
ఆత్మకూర్ (ఎస్) మండలంలో వెలుగు చూసిన వైనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: చారిత్రక ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లాలో పురాతన యుగం నాటి సమాధులు మరోసారి బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 200 సం వత్సరాల వరకు బృహత్ యుగకాలం. నాటి సమాధులను పురావస్తు శాఖ అధికారులు ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్, కందగట్లల్లో వెలికి తీశారు. నెమ్మికల్‌లో 3-4 ఎకరాల విస్తీర్ణంలో 25 వరకు ఇవి ఉన్నాయని పురావస్తుశాఖ చెబుతోంది. ఇదీ సమాధుల చరిత్ర: ఈ సమాధులను బృహత్ కాలయుగ సమాధులని అంటారు. నాటి ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ఈ సమాధుల్లో మనుషులను పాతిపెట్టేవారు. ఆత్మలుంటాయని నమ్మే ఆ రోజుల్లో ఆ ఆత్మలకు ఆహారం పెట్టడం తోపాటు ఆత్మలు బయటకు రాకుండా ఉండేందుకు, జంతువులు ఆ పార్ధివదేహాలను తినకుండా ఉండేందుకు పెద్ద బండరాళ్లతో ఆ సమాధులను ఏర్పాటు చేశారు. కాగా, సూర్యాపేట సమీపంలోని నెమ్మికల్, కందగట్లలో జరిపిన తవ్వకాల్లో నాటి సమాధులు బయటకు వచ్చాయి. -
ఖరీదైన సమాధులు
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉన్న స్థానిక చైనీయుల సమాధుల మధ్యనుంచి నడుస్తుంటే.. విలాసవంతమైన కాలనీ మధ్యనుంచి వెళ్తున్నట్లే అనిపిస్తుంది. రెండు వీధుల్లో విస్తరించి ఉన్న ఈ సమాధుల్లో కొన్ని రెండుమూడంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. చెప్పుకోవడానికి అవి సమాధులే కాని వాటిలో ఏసీ, టాయిలెట్, ఆధునిక వంటగది వంటి సమస్త సదుపాయాలన్నీ ఉంటాయి. మరణించిన వారి బంధువులు వారాంతాల్లో ఈ సమాధులను సంద ర్శించి తమ పూర్వీకులకు ఆహారం, సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తుంటారు. మిలియనీర్స్ రో, లిటిల్ బ్రేవర్లీ హిల్స్ అనే రెండు వీధులున్న ఈ శ్మశానవాటికను 19వ శతాబ్దం చివరి భాగంలో ఏర్పాటు చేశారు. స్థానిక కేథలిక్కులు తమ శ్మశానాల్లో చైనీయులను ఖననం చేయనివ్వకపోవడంతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో మనీలాకు వలసవచ్చిన చైనీయులు వ్యాపారంలో రాణించి సంపన్న వర్గంగా రూపాంతరం చెందారు. తమ స్థాయికి గుర్తుగా ఈ ఖరీదైన సమాధుల్ని నిర్మించారు. - మనీలా -
సమాధులపై కట్టుకోలేకపోయారా?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కావాల్సిన మాట నిజమే అయినా రైతుల కడుపుకొట్టి, బలవంతంగా బయటకు పంపి నిర్మిస్తారా? ఇంతకన్నా రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజల సమాధులమీద నిర్మించుకోలేకపోయారా?’’ అని అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అతుల్‌కుమార్ అంజన్ మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి భూమ్యాకాశాల్ని ఏకం చేసిన వ్యక్తికి ఇదో పెద్ద లెక్కా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలివితేటలేమిటో తమకు బాగా తెలుసంటూ.. సీఎం పీఠాన్ని ఎక్కడానికి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తన్నారు. గురువారమిక్కడ ప్రారంభమైన రైతుసంఘం 29వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన అతుల్, ఏపీకి చెందిన మరికొందరు రైతు నేతలు ‘సాక్షి’లో వస్తున్న ‘రాజధాని దురాక్రమణ’ కథనాలపై గురువారం స్పందిం చారు.ఎస్సీ, ఎస్టీలు, చిన్న,మధ్యతరహా రైతుల్ని తరిమివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారన్నారు. మంత్రులా? రియల్టర్లా? రాజధాని అమరావతిపై గద్దల్లా వాలిన పెద్దలు మంత్రులు కాదు.. రియల్టర్లు. మంత్రులుగా చెలామణి అవుతున్న నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు బరితెగించారనే దానికి నిదర్శనమే సాక్షి దినపత్రికలో వస్తున్న కథనాలు. రాజధాని ఎక్కడ వస్తుందో తెలియబట్టే వీళ్లు వందలాది ఎకరాల్ని పేదలనుంచి కొనేసి వాళ్లనోట మట్టికొట్టారు. -రామచంద్రయ్య, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు చినబాబు పాత్ర ఉంది ప్రస్తుత భూ కబ్జాలో పెద్దబాబు, చినబాబుల పాత్ర ఉంది. పేదల నోళ్లు కొట్టేలా జోన్లు ఏర్పాటు చేశారు. సీఎం, ఆయన అనుచరులు కొనుగోలు చేసిన భూముల్ని అగ్రికల్చర్ జోన్ నుంచి మినహాయించి ఇప్పుడు రియల్ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలి. - రావుల వెంకయ్య, కేవీవీ ప్రసాద్, రైతుసంఘం జాతీయ నేతలు విచారణకు సిద్ధంకండి ‘రాజధాని దురాక్రమణ’ వార్తలు రాసిన మీడియాపై చిందులేసే బదులు బహిరంగ విచారణకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిద్ధపడాలి. నీతిమంతులైతే భయపడడమెందుకు? -గుడితి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి ఎక్కడొస్తుందో సీఎం ముందే చెప్పారు.. సీఎం ముందే తన అనుచరులకు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పారు. రైతుల్ని త్యాగాలు చేయమన్నారు. మంత్రుల్ని కుబేరుల్ని చేశారు. - జి.చంద్ర, వైఎస్సార్ జిల్లా కార్యదర్శి -
బృహదు శిలాయుగం నాటి సమాధులు లభ్యం
లింగాలఘణపురం(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం ప్రాంతంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి, పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.సాగర్ తెలిపారు. మంగళవారం వారు సమాధులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో సుమారు 100కు పైగా సమాధులు ఉన్నాయని.. వాటిలో కొన్ని ధ్వంసమయ్యాయని అన్నారు. క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల క్రితం నాటివిగా భావిస్తున్నట్లు వెల్లడించారు. సమాధుల ఏర్పాటుకు గుర్తుగా బెహరాన్‌లు (ఎత్తైన రాతి స్తంభాలు) కూడా నాలుగు ఉన్నాయని వివరించారు. ఆనాటి సమాధులను పరిరక్షించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు. కళ్లెం పరిసరాల్లో రెండు శాసనాలు కూడా ఉన్నాయని, వాటిని విశధీకరించాలని కోరారు. తన వద్ద రాతితో తయారైన గొడ్డలి, బ్లేడు, వినాయకవిగ్రహం, గొర్రెపొటేలు విగ్రహం, మట్టి పాత్రలు ఉన్నాయని పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే ఎంతో చరిత్ర బయట పడుతుందని ఇటీవల మంత్రి కేటీఆర్ తన వద్దనున్న మట్టి పాత్రను కూడా బహూకరించినట్లు వివరించారు.