uncertainty
-
దేహం.. గాలిలో కదిలే దీపం!
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇక్కడ దేనికి, ఎప్పుడు కాలం చెల్లిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక, ఇక్కడ శాశ్వతమైనది ఏది? అని ప్రశ్న వేసుకుంటే ‘అంతాన్ని గురించిన అనిశ్చితియే!’ అనే సమాధానం దొరుకుతుంది. ఆ అనిశ్చితిని మనసులో ఒక వాస్తవంగా స్థాపించుకున్న వ్యక్తికి దుఃఖం దూరమై, ముక్తి దగ్గరౌతుందని విజ్ఞులు చెప్పారు.వేదాంత పరమైన ఈ వాస్తవాన్ని కనుపర్తి అబ్బయా మాత్యుడు, తాను రచించిన ‘కవిరాజ మనోరంజనం’ ప్రథమాశ్వాసంలోని ఒక సన్నివేశంలో పురూరవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఒక చక్కటి పద్యంలో చెప్పాడు. తన జనరంజక పాలనను గొప్పగా పొగుడుతున్న నారదుడితో పురూరవుడు ఎందరో రాజులు ఈ పుడమిని ఇంతకు మునుపు గొప్పగా పాలించారు కనుక తనను అంతగా పొగడవలసిన పనిలేదని చెప్పాడు. ఆపై సంభాషణ కొనసాగింపుగా ఇలా అంటాడు..దేహము వాయుసంచలిత దీపిక, పుత్రకళత్ర మిత్ర సందోహము స్వప్నకాలమున దోచెడి సందడి రాజ్యభోగ సన్నాహము జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీయైహికసౌఖ్య మేమి సుఖమంచు దలంచెదనయ్య నారదా!పద్యం ప్రారంభంలోని ‘దేహము వాయుసంచలిత దీపిక’ అనే మాట లలో సామాన్యము, విశేషము అయిన రెండు భావాలు అవగత మౌతాయి. మానవ దేహం గాలిలో కదులుతున్న దీపం వంటిది. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఆ కారణంగా దాని భవితవ్యం అనిశ్చితం అని సామాన్యార్థం. విన్నవెంటనే మనసుకు తోచే అర్థం. ఇక రెండవది – మానవ శరీరంలో ఊపిరి అనే వాయువు ప్రసరిస్తున్నంత వరకు దేదీప్యమానంగా వెలిగే దీపం వంటిది ఈ దేహం. ఊపిరి ప్రసరణం ఆగిపోగానే అదీ ఆగిపోతుంది, ఆరి పోతుంది అనే విశేషమైన భావం! ఈరెండు భావాలు కూడా పద్యంలోని సందర్భానికి సొగసును కూర్చేవే!‘భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులతో కూడిన జీవితం, సందడి అంతా కలలో జరిగేదిగానే భావిస్తాను. జీవం లేని మరబొమ్మ చేసే నాట్యం వంటిది రాజ్యభోగం అనీ, ఐంద్రజాలికుడు వెదజల్లే ధనం వంటిది సంపద అనీ సదా భావించి, ఇహలోకంలో సౌఖ్యం లేదనుకోవడంలోనే సుఖముందని నేను భావిస్తాను!’ అనేది పురూరవుడు నారదుడితో చెప్పిన మాటలకు అర్థం. – భట్టు వెంకటరావు -
తక్షణం తగ్గినా.. భవిత ‘బంగారమే’!
పుత్తడిపై కస్టమ్స్ సుంకాలు 15% నుంచి 6%కి తగ్గిస్తున్నట్లు వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వెంటనే ఇటు స్పాట్లో అటు ఫ్యూచర్స్ మార్కెట్లలో రూ.4,000 వరకూ పడిపోయిన పసిడి ధరలు.. ఇదే రీతిలో ముందు ముందు ఆభరణ ప్రియులకు అంతే సంతోషాన్ని కలిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయంగా రూపాయి విలువ పతనం ఇందుకు కారణం.→ భౌగోళిక ఉద్రిక్తతలను మొదట ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, దీనికి పశ్చిమ దేశాల మద్దతు అలాగే చైనాతో అమెరికాకు ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితికి దారితీసే అంశాలు. ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొన్నా.. పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ బంగారం వైపే చూస్తాడనడంలో సందేహం లేదు. → ఇక రెండో అంశానికి వస్తే.. అమెరికాతో సహా పలు దేశాలు సరళతర వడ్డీరేట్ల విధానంలోకి మారినప్పటికీ ఆ విధానాన్ని ఎంతవరకూ కొనసాగిస్తాయో తెలియని పరిస్థితి. సరళతర వడ్డీరేట్ల విధానంతో బంగారంలో కొనుగోళ్లు పెరుగుతాయి. అయితే ఈ విధానం కొనసాగింపునకు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. → కీలక మూడవ అంశం.. రూపాయి విలువ. డాలరుతో రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయి రికార్డులను కొనసాగిస్తోంది. బుధవారం ఆల్‌టైమ్ కనిష్టం 83.71 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 83.72 కనిష్టాన్ని తాకింది. → భౌగోళిక ఆర్థిక అనిశ్చితి అంశాల నేపథ్యంలో... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చ ంజ్లో ఈ నెల 16వ తేదీన ఔన్స్ కు (31.1గ్రా) ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ధర అటు పై కొంత తగ్గినప్పటికీ... పటిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. అంతర్జాతీయ ఫ్యూ చర్స్లో 18 డాలర్లు అధికంగా 2,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో రూపాయి క్షీణిస్తూ... అంతర్జాతీయంగా ధర పెరుగుదల ధోరణే కొనసాగిస్తే దేశీయంగా సైతం బంగారం మున్ముందుకే సాగుతుందనడంలో సందేహం లేదు. పెట్టుబడులకు ప్లస్సే... దేశీయంగా శుభకార్యాల్లో భారతీయులు పసిడి కొనుగోళ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిన అంశమే. ఇది ఎలాగూ తప్పని అంశం. ఇక పసిడి పెట్టుబడులకు ఇది తగిన అవకాశమనడంలో సందేహం లేదు. వినియోగదారులకు ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఎలానూ ఉంటుంది. తక్కువ ఖర్చులు అలాగే 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమ యం అనడంలో సందేహం లేదు.దేశీయంగా రెండోరోజూ భారీ తగ్గుదల బడ్జెట్లో నిర్ణయంతో దేశీయంగా రెండవరోజూ బుధవారమూ దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధానిలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.650 తగ్గి, రూ. 71,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇంతే స్థాయిలో దిగివచ్చి రూ. 71,300కు దిగివచి్చంది. ఇక మంగళవారం రూ.4 వేల వరకూ తగ్గిన వెండి ధర బుధవారం అక్కడక్కడే 87,500 వద్ద ముగిసింది. దేశ రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ. 451, రూ.449 తగ్గి రూ.69,151, రూ.68,874కు దిగివచ్చాయి. వెండి ధర రూ.57 తగ్గి రూ.84,862 వద్ద ముగిసింది. -
అంతులేని అనిశ్చితి!
అయిదేళ్ళలో అయిదో ప్రధానమంత్రి వచ్చారు. పొరుగున నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఇదే దర్పణం. అనుభవజ్ఞుడైన కమ్యూనిస్టు రాజకీయ నేత ఖడ్గ ప్రసాద్ (కె.పి) శర్మ ఓలీ నూతన ప్రధానిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయడంతో... కష్టాల్లో ఉన్న తమ దేశానికి మంచి రోజులు రావచ్చేమో అని నేపాలీయులు ఆశగా చూస్తున్నారు. దేశంలోకి పెట్టుబడులు, దరిమిలా కొత్తగా ఉద్యోగాలొస్తాయని నిరీక్షిస్తున్నారు. అయితే ఓలీకి ఇది కత్తి మీద సామే. 2018లో లాగా ఆయనేమీ శక్తిమంతమైన కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి సారథ్యం వహించట్లేదు. ఇప్పుడాయన సంకీర్ణ ప్రభుత్వ సారథి. పైగా, సంకీర్ణంలో ఆయన పార్టీ మైనారిటీ. అది మరో బలహీనత. సైద్ధాంతికంగా పరస్పర విరుద్ధ భావాలున్న నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్–యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్)లు రెండూ 2027లో ఎన్నికల వరకు ప్రధాని పదవిని సమాన కాలం పంచుకోవాలన్న అవగాహనతో అనైతికంగా జట్టు కట్టాయి. ఇది ఏ మేరకు ఫలిస్తుందో తెలీదు. అది నేపాల్ సమస్యనుకున్నా, చైనా అనుకూల ఓలీ గద్దెనెక్కడం భారత్‌కు ఇబ్బందికరమే! నేపాల్‌లో 239 ఏళ్ళ రాచరికాన్ని 2008లో రద్దు చేశారు. అదేమి శాపమో రాజరిక వ్యవస్థ రద్దయి రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి దేశం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికి 13 ప్రభుత్వాలు మారాయి. ఏణ్ణర్ధ కాలంలో నాలుగుసార్లు సభలో బలపరీక్షను తట్టుకొని బయట పడ్డ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ – మావోయిస్ట్ సెంటర్ (సీపీఎన్–ఎంసీ) నేత పుష్ప కమల్ దహల్ ప్రచండ శుక్రవారం జూలై 12న మాత్రం ఓడిపోయారు. అధికార సంకీర్ణ భాగస్వామి అయిన మితవాద సీపీఎన్– యూఎంఎల్ మద్దతు ఉపసంహరణతో ఆయనకు ఓటమి తప్పలేదు. 72 ఏళ్ళ ఓలీ నాయకత్వంలో కొత్త సంకీర్ణ సర్కార్ గద్దెనెక్కింది. ఇప్పుడొచ్చింది 14వ ప్రభుత్వం. ప్రధాని పదవి ఓలీకి కొత్త కాదు. ఆయన పగ్గాలు పట్టడం ఇది నాలుగోసారి. ఏ ప్రభుత్వం వచ్చినా నేపాల్‌లో వెంటాడే పాత సమస్యలు ఓలీకీ తప్పవు. మరో రెండు నెలల్లో పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిన ఆయన పరస్పర విరుద్ధ సిద్ధాంతాలతో నిండిన కూటమితో ప్రభుత్వాన్ని ఎలా నడపగలరో చూడాలి. ప్రచండ ప్రభుత్వాన్ని కూల్చి, కొత్త కూటమి కట్టి దేశంలోని రెండు పెద్ద పార్టీలు ఎన్సీ, యూఎంఎల్ సాహసమే చేశాయి. సుపరిపాలన, రాజకీయ సుస్థిరతలో ఈ సంకీర్ణం విఫలమైతే అది మొత్తం రాజ్యాంగం, వ్యవస్థల వైఫల్యమేనని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. నిజానికి, ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల్లో నేపాల్ ఒకటి. రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టేవారు కరవయ్యారు. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. లక్షలాది యువకులు ఉద్యోగం, ఉపాధి నిమిత్తం మలేసియా, దక్షిణ కొరియా, మధ్యప్రాచ్యం దారి పట్టారు. పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే, గద్దెనెక్కిన ప్రభుత్వాలేవీ దేశాభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదు గనక మళ్ళీ రాచరికాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనం అడపాదడపా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. భారత్‌తో పాటు పొరుగున ఉన్న మరో పెద్ద దేశం చైనా సైతం నేపాల్ లోని రాజకీయ పరిణామాలను ఆది నుంచి ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నాయి. ఈ హిమాలయ దేశాభి వృద్ధికి ఆర్థిక సాయం అందించి, ప్రాథమిక వసతి సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాల్లో ప్రాబల్యం సంపాదించాలని సహజంగానే ఢిల్లీ, బీజింగ్‌ల యత్నం. భౌగోళికంగా భారత, చైనాల మధ్య చిక్కుకుపోయిన నేపాల్‌కు మొదటి నుంచి మనతో స్నేహ సంబంధాలు ఎక్కువే. కానీ గత దశాబ్ద కాలంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. కమ్యూనిస్ట్ నేత ఓలీ తొలివిడత నేపాల్ ప్రధానిగా వ్యవహరించినప్పుడు 2015–16లో చైనాతో ప్రయాణ, సరుకు రవాణామార్గ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా, నేపాల్ విదేశీ వాణిజ్యంపై అప్పటి దాకా భారత్‌కు ఉన్న ఆధిపత్యానికి తెర పడింది. తాజాగా పడిపోయిన ప్రచండ సర్కార్ సైతం చైనా వైపు మొగ్గింది. నిన్న గాక మొన్న పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ముందు ఆయన నేపాల్‌తో చైనాను కలిపే రైలు మార్గానికి పచ్చజెండా ఊపడం గమనార్హం. ఇది అనేక వందల కోట్ల డాలర్లతో డ్రాగన్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్ట్స్ కింద కొస్తుంది. దీంతో నేపాల్ – చైనా సరిహద్దు వెంట వసతులు పెరుగుతాయని పైకి అంటున్న మాట. నిజానికి సరిహద్దులో చైనాకు పట్టు పెంచే ఈ చర్య భారత్‌కు తలనొప్పి!అసలు బీఆర్ఐ ప్రాజెక్టుల వెనక చైనా వ్యూహం వేరు. చిన్న చిన్న దేశాలకు పెద్దయెత్తున అప్పులిస్తూ, ఋణ దౌత్యం ద్వారా ఆ యా ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయాల్లో పైచేయి సాధించడం డ్రాగన్ ఎత్తుగడ. అందుకే, ప్రపంచ దేశాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్ట్‌లు సంబంధిత చిన్నదేశాలకు భరించలేని భారమవుతాయి. చివరకు ఆ దేశాలు చైనా మాటకు తలూపాల్సి వస్తుంది. గతంలో చైనా ఇలాగే శ్రీలంకలో హంబన్‌తోట పోర్ట్‌కు ఋణమిచ్చింది. బాకీలు తీర్చడంలో విఫలమైన సింహళం చివరకు బాకీకి బదులు ఈక్విటీలిచ్చి, 2017లో ఆ పోర్ట్‌ను 99 ఏళ్ళ లీజుకు చైనాకు అప్పగించింది. ఇలాంటి కారణాల వల్లే బీఆర్ఐ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలున్నాయి. అలాగే బీఆర్ఐ కింద చైనా–పాక్ ఆర్థిక నడవా ప్రాజెక్ట్ అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా దాన్ని చేపట్టడాన్ని భారత్ నిరసించింది. ఇప్పుడు భారత్ కన్నా చైనాకు మరింత సన్నిహితుడైన ఓలీ వల్ల నేపాల్ కూడా చైనా గుప్పిట్లోకి జారిపోవచ్చు. మనం తక్షణమే అప్రమత్తం కావాలి. మనతో సన్నిహిత సంబంధాలు కీలకమని ఓలీ గుర్తించేలా చేయాలి. ఓలీ సంకీర్ణంలో అధిక సంఖ్యాబలమున్న ఎన్సీ చిరకాలంగా భారత అనుకూల పార్టీ కావడం ఉన్నంతలో కొంత ఊరట. -
ద్రవ్యోల్బణం.. తీవ్ర అనిశ్చితే
ముంబై: అస్థిరత, అనిశ్చిత ఆహార ధరల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం– అవుట్‌లుక్ తీవ్ర అస్పష్టంగా ఉందని ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. శక్తికాంత దాస్ నేతృత్వంలో డిసెంబర్ 6 నుండి 8 వరకూ జరిగిన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యింది. ద్రవ్యోల్బణ ఆందోళనలను ఉటంకిస్తూ కీలక వడ్డీ రేటు (బ్యాంకులు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో) 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా ఈ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కూరగాయల ధరల తీవ్రత వల్ల ఆహార ద్రవ్యోల్బణం పుంజుకునే వీలుందని ఈ సమావేశంలో గవర్నర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్య పరపతి విధాన వైఖరిలో ఏదైనా మార్పు ఉంటే అది ప్రమాదకరమని దాస్ ఉద్ఘాటించారు. -
ఎగుమతులు మళ్లీ మైనస్‌లోకి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్‌లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోయాయి. 2022 ఇదే నెలతో పోలి్చతే 2023 నవంబర్‌లో ఎగుమతుల విలువ 2.83% క్షీణించి 33.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక 10 నెలల తర్వాత అక్టోబర్‌లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్‌లో మళ్లీ క్షీణతలోకి జారాయి. 4.33% పతనంతో 54.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ముందు.. వెనుకలు ఇలా... అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్‌లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెలలోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఏప్రిల్–నవంబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎనిమిది నెలల కాలంలో పసిడి దిగుమతులు 21 శాతం పెరిగి 32.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
RBI Monetary policy: అయిదోసారీ అక్కడే..!
ముంబై: ద్రవ్యోల్బణంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ వరుసగా అయిదోసారీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం హోదాను నిలబెట్టుకుంటూ భారత్ మరింత వృద్ధి నమోదు చేయగలదని అంచనా వేసింది. అటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మరోవైపు, రికరింగ్ చెల్లింపుల ఈ–మ్యాండేట్ పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6–8 మధ్య ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మళ్లీ సమావేశం అవుతుంది. ఆర్బీఐ నిర్ణయాలు అధిక వృద్ధి సాధనకు దోహదపడగలవని బ్యాంకర్లు, కార్పొరేట్లు వ్యాఖ్యానించగా .. రేటును తగ్గించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని రియల్టీ రంగం అభిప్రాయపడింది. వచ్చే సమీక్షలోనైనా తగ్గించాలని కోరింది. వివరాల్లోకి వెడితే.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రామాణిక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు) యధాతథంగా 6.5%గా కొనసాగించాలని కమిటీలోని సభ్యులందరూ (ఆరుగురు) ఏకగ్రీవంగా తీర్మానించారు. ధరలను కట్టడి చేసే దిశగా 2022 మే నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును 2.5% పెంచింది. యూపీఐ పరిమితులు పెంపు.. ► ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపుల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు. ► మళ్లీ మళ్లీ చేసే (రికరింగ్) చెల్లింపులకు సంబంధించి ఈ–మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలు 6.5 శాతం నుంచి 7%కి పెంపు. జీడీపీ డిసెంబర్ త్రైమాసికంలో 6.5%గా, మార్చి క్వార్టర్లో 6 శాతంగా ఉంటుందని అంచనా. ► వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం క్యూ3లో 5.6%గా, క్యూ4లో 5.2%గా ఉండొచ్చని అంచనా. 2024–25 జూన్ క్వార్టర్లో ఇది 5.2 శాతంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 4 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 4.7 శాతంగా ఉండవచ్చు. ► డేటా భద్రత, గోప్యతను మరింతగా పెంచే దిశగా ఆర్థిక రంగం కోసం ఆర్బీఐ క్లౌడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ► ఆర్థిక రంగ పరిణామాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా ‘‘ఫిన్‌టెక్ రిపాజిటరీ’’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2024 ఏప్రిల్‌లో లేదా అంతకన్నా ముందే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని అందుబాటులోకి తేనుంది. ఫిన్‌టెక్ సంస్థలు స్వచ్ఛందంగా సంబంధిత వివరాలను రిపాజిటరీకి సమర్పించవచ్చు. ► డిసెంబర్ 1 నాటికి విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఇతర వర్దమాన దేశాలతో పోలిస్తే రూపాయి మారకంలో ఒడిదుడుకులు తక్కువగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఎఫెక్ట్.. సెపె్టంబర్ క్వార్టర్ వృద్ధి గణాంకాలు పటిష్టంగా ఉండి, అందర్నీ ఆశ్చర్యపర్చాయి. ఆహార ధరల్లో నెలకొన్న అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ అంచనాలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. వేగంగా మారిపోయే ఆహార ధరల సూచీలన్నీ కూడా కీలక కూరగాయల రేట్ల పెరుగుదలను సూచిస్తున్నాయి. ఫలితంగా సమీప భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగొచ్చు. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంచనాల పెంపు సముచితమే.. ప్రథమార్ధంలో సాధించిన వృద్ధి, ఆ తర్వాత రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) గణాంకాలన్నీ సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం సముచితమే. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి రేటు తగ్గించాల్సింది.. వడ్డీరేట్లను య«థాతథంగా కొనసాగించడం మంచి నిర్ణయమే. అయితే, ప్రస్తుతం స్థూల–ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున రేటును తగ్గించి ఉంటే రియల్టీ రంగం, ఎకానమీకి గణనీయంగా ప్రయోజనం కలిగేది. – »ొమన్ ఇరానీ, నేషనల్ ప్రెసిడెంట్, క్రెడాయ్ సానుకూల సంకేతాలు ద్రవ్యోల్బణం స్థిర స్థాయిలో ఉంటూ, ఎకానమీ అధిక వృద్ధి సాధించే దిశగా ముందుకెడుతుందని పాలసీ స్పష్టమైన, సానుకూల సంకేతాలిస్తోంది. వరుసగా మూడో ఏడాది 7 శాతం వృద్ధిని సాధించే అవకాశాలను సూచిస్తోంది. – దినేష్ ఖారా, చైర్మన్, ఎస్బీఐ -
ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో కొన్నాళ్లుగా ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన ఐటీ పరిశ్రమంలో పని చేస్తున్న టెక్ ఉద్యోగుల్లో ఉంది. అయితే ఈ భయంపై ఊరట కలిగించే మాటను గ్లోబల్ డేటా స్టోరేజ్ అండ్ సొల్యూషన్స్ మేజర్ నెట్‌యాప్ (NetApp) సీఈవో జార్జ్ కురియన్ (George Kurian) చెప్పారు. భారత్.. ఆసియాలో అతిపెద్ద మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని నెట్‌యాప్ అంచనా వేస్తోంది. దేశ ఆర్థిక బలం, పెరుగుతున్న యువ జనాభా ఇందుకు దోహం చేస్తాయని భావిస్తోంది. ఈ సంవత్సరం భారతదేశంలో 20 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసిన ఈ సంస్థ, దేశంలో భాగస్వామ్యాలను, హెడ్‌కౌంట్‌ను విస్తరించడాన్ని కొనసాగిస్తుందని సీఈవో జార్జ్ కురియన్ పేర్కొన్నారు. తేలికపాటి మాంద్యం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి స్థాయి తగ్గడంతో ఐటీ పరిశ్రమలో తేలికపాటి మాంద్యం ఉండొచ్చని తెలిపారు. సంవత్సరం క్రితంతో పోలిస్తే, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వడ్డీ రేటు పెరుగుదల వేగం మందగించడం వల్ల అనిశ్చితి స్థాయి కొద్దిగా తగ్గింది. బిజినెస్ సెంటిమెంట్లు ఇప్పటికే వేగవంతమయ్యాయని చెప్పను కానీ విశ్వాసం మెరుగుపడటం ప్రారంభించిందని కురియన్ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మరింత దిగజారకపోతే అన్ని దేశాలూ మాంద్యం నుంచి బయటకు వస్తాయన్నారు. -
భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉన్నప్పటికీ, భారత ఫైనాన్షియల్ వ్యవస్థ నియంత్రణలకు అనుగుణంగా పటిష్ట బాటలో ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 27వ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరిస్తూ, ‘‘భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. అయితే ఏదైనా తీవ్ర సమస్య సూచిక కనిపించిన వెంటనే మనం ఎల్లప్పుడూ అప్రమత్తం కావాలి. అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మన కాలిపై మనం నిలబడాలి’’ అని అన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యం అలాగే క్రెడిట్ సూచీ ఎదుర్కొంటున్న ద్రవ్య పరమైన ఒత్తిడి గురించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. వీటి ప్రభావం మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై లేదని భావిస్తున్నాం. ► ప్రభుత్వ బాండ్ల మార్కెట్ విషయంలో సాంకేతికత వినియోగం మరింత పెంపొందేలా చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. పెట్టుబడిదారులు ఆర్బీఐ లేదా సెబీ ఇన్ఫ్రా ద్వారా ఇందుకు సంబంధించి పొందుతున్న సదుపాయాలకన్నా, సాంకేతికత ద్వారా పొందుతున్న ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. ఇవే సాంకేతిక చర్యల మరింత పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నాం. ► అంతర్జాతీయంగా వస్తున్న ముందస్తు హెచ్చరిక సూచికలకు అనుగుణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకోవడం, ఆయా అంశాల్లో భారత్ సంసిద్ధత, నియంత్రణ నాణ్యతను మెరుగుపరచడం, దేశంలో కార్పొరేట్లు అలాగే గృహాల రుణ స్థాయిలు, కేవైసీ సరళీకరణ–క్రమబద్ధీకరణ, తద్వారా ఆర్థిక రంగంలో నియంత్రిత సంస్థలపై అనవసర భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై కౌన్సిల్ చర్చించింది. ఆయా అంశాలన్నీ డిజిటల్ ఇండియా అవసరాలను తీర్చడానికి మరింత పటిష్ట ఫ్రేమ్‌వర్క్‌ని రూపొందిస్తాయని భేటీ భావించింది. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీ నిర్ణయాలు, ఎఫ్ఎస్డీసీ గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కార్యాచరణ వంటి అంశాలపైనా తాజా కౌన్సిల్ దృష్టి సారించింది. ► ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్, ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాషిస్ పాండా, దివాలా బోర్డ్ (ఐబీబీఐ) చైర్మన్ రవి మిట్టల్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్‌గా కొత్తగా నియమితులైన దీపక్ మెహంతీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికశాఖ సహాయమంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కృష్టారావు కరాద్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్‌జోషి, తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై దృష్టి... కాగా, ఎఫ్ఎస్డీసీ సమావేశం ప్రత్యేకించి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రెగ్యులేటర్లకు సూచించింది. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ చేశాయి. దాదాపు 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించిన ఈ మొత్తాలను గత 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. డిపాజిటర్లు, లబ్ధిదారులు వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను యాక్సెస్ చేయగల కేంద్రీకృత పోర్టల్ మూడు లేదా నాలుగు నెలల్లో సిద్ధమవుతుందని గత నెలలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. -
పసిడి దిగుమతులు 24 శాతం డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొ న్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం (2022– 23)లో పసిడి దిగుమతులు 24% తగ్గాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 35 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2021– 22లో ఇవి 46.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మందగించిన పసిడి దిగుమతులు మార్చిలో ఒక్కసారిగా ఎగిశాయి. ఆ నెలలో 3.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది మార్చిలో ఇవి 1 బిలియన్ డాలర్లే. ఇక వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 6 శాతం పెరిగి 5.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బంగారం దిగుమతులు తగ్గినప్పటికీ వాణిజ్య లోటు భర్తీ యత్నాలకు పెద్దగా తోడ్పడలేదు. 2022– 23లో ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 181 బిలియన్ డాలర్ల నుంచి 267 బిలియన్ డాలర్లకు పెరిగింది. రత్నాభరణాల ఎగుమతులు 3 శాతం క్షీణించి 38 బిలియన్ డాలర్లకు పరిమిత మయ్యాయి. అధిక సుంకాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు బంగారం దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీ పరిశ్రమకు తోడ్పాటు అందించే దిశగా సుంకాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నాయి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం, చైనా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం తదితర అంశాల కారణంగా రత్నాభరణాల రంగానికి సవాళ్లు తప్పకపోవచ్చని పరిశ్రమ సమాఖ్య జీజేఈపీసీ మాజీ చైర్మన్ కొలిన్ షా అభిప్రాయపడ్డారు. జ్యుయలరీ పరిశ్రమ అవసరాల కోసం భారత్ ఏటా దాదాపు 800–900 టన్నులను దిగుమతి చేసుకుంటోంది. కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేసే దిశగా పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. -
ప్రస్తుత జాబ్‌లోనే కొనసాగుతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలతోపాటు ఉద్యోగార్ధులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక ప్రకారం.. ఇంటర్వ్యూలో పాల్గొన్న 47 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాదిలో ఉద్యోగాలు మారడానికి ఇష్టపడడం లేదు. అంటే తాము పనిచేస్తున్న సంస్థలోనే కొనసాగాలని నిర్ణయించారన్న మాట. 37 శాతం మంది 2023లో తమ కెరీర్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. కంపెనీలు ఇప్పుడు ఈ నిపుణులను నిలుపుకోవడానికి, ఆకర్షిస్తూ ఉండే మార్గాలను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. వాల్యూవాక్స్ 2023 జనవరి–ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో వివిధ రంగాలకు చెందిన 1,157 కంపెనీలు, 1,583 ఉద్యోగార్థులు పాలుపంచుకున్నారు. ‘బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్ రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయి. ఈ విభాగాల్లో బలమైన భవిష్యత్ కనిపిస్తోంది. బీఎఫ్ఎస్ఐలో 71 శాతం, ఆరోగ్య సేవల్లో 64, నిర్మాణం, రియల్టీ 57, మీడియా, వినోదం 49, తయారీ 39, ఐటీ, ఐటీఈఎస్ 29 శాతం కంపెనీలు కొత్త వారిని చేర్చుకుంటున్నాయి. కొత్తగా జాబ్ మార్కెట్లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య అక్టోబర్–డిసెంబర్‌తో పోలిస్తే 16 నుంచి 23 శాతానికి ఎగబాకింది. తాత్కాలిక ఉద్యోగులను పెద్దగా ఆమోదించడం కూడా ఈ ఏడాది జాబ్ మార్కెట్‌ను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు’ అని నివేదిక వివరించింది. -
దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు
న్యూఢిల్లీ: భారత్ బంగారం దిగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 30 శాతం పడిపోయాయి. దిగుమతులుమొత్తం విలువ 31.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది యల్లో మెటల్ దిగుమతుల విలువ 2021-22 ఇదే కాలంలో 45.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 ఆగస్టు నుంచి దిగుమతుల్లో పెరుగుదల లేకపోగా, క్షీణత నమోదుకావడం దీనికి నేపథ్యం. బంగారంపై అధిక దిగుమతి సుంకం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు విలువైన లోహం దిగుమతులు తగ్గడానికి కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది కేంద్రం పసిడిపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. పసిడి దిగుమతులను నిరుత్సాహ పరచడం, తద్వారా ఈ బిల్లును తగ్గించడం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరక్కుండా కట్టడి చేయడం ఈ నిర్ణయం లక్ష్యం. వెండి వెలుగులు.. కాగా, వెండి దిగుమతులు మాత్రం 2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 66 శాతం పెరిగి 5.3 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం. -
ఇకపై ఎఫ్‌డీఐలు పుంజుకుంటాయ్
న్యూఢిల్లీ: గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యలోనూ రానున్న కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) పుంజుకోనున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ తాజాగా అంచనా వేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో పెట్టుబడులు, ఈక్విటీలకు నిధులు తరలి వస్తుంటాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి మన్మీత్ కె.నందా పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది(2022–23) తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఎఫ్‌డీఐ ఈక్విటీ నిధులు 14 శాతం క్షీణించి 26.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం ఈక్విటీ పెట్టుబడులు, రాబడులను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, ఇతర మూలధనం కలసిన మొత్తం ఎఫ్‌డీఐలు సైతం ఈ కాలంలో 9 శాతం నీరసించి 39 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది(2021–22) తొలి అర్ధభాగంలో ఇవి 42.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మందగమనం కారణంగా 18 నెలలుగా విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడుతున్నట్లు మన్మీత్ తెలియజేశారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఇకపై ఊపందుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
కంపెనీలకు క్లౌడ్ దన్ను
లాస్ వెగాస్, అమెరికా: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు తదితర సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో కంపెనీలు వ్యయాలను నియంత్రించుకుని .. సమర్ధంగా పని చేసేందుకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు క్లౌడ్ కంప్యూటింగ్ తోడ్పాటునిస్తోందని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) సీఈవో ఆడమ్ సెలిప్స్కీ తెలిపారు. సవాళ్లతో కూడుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో సరైన సాధనాలతో కంపెనీలు నిలదొక్కుకుని, పురోగమించగలవని పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్ రీ:ఇన్వెంట్ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. 2025 నాటికి తమ కార్యకలాపాలకు 100 శాతం పునరుత్పాదక విద్యుత్‌నే వినియోగించుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆడమ్ వివరించారు. ఇప్పటివరకూ ఈ లక్ష్యంలో 85 శాతం వరకూ చేరుకున్నామని పేర్కొన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్‌తో చాలా మంది కస్టమర్లకు 30 శాతం వరకూ ఖర్చులు ఆదా అవుతున్నాయని ఆడమ్ చెప్పారు. కేవలం ఉపయోగించుకున్న సేవలు, మౌలిక సదుపాయాలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, కార్యకలాపాలను వేగవంతంగా విస్తరించుకునేందుకైనా .. తగ్గించుకునేందుకైనా ఇది ఎంతో అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. డేటా సెంటర్లు, సర్వర్లను కొనుక్కుని పెట్టుకోవడం, వాటిని నిర్వహించుకోవడం వంటివి ఖర్చులతో కూడుకున్న వ్యవహారమని .. అందుకు భిన్నంగా ఏడబ్ల్యూఎస్ వంటి క్లౌడ్ సేవల సంస్తల నుంచి టెక్నాలజీ సర్వీసులను సులభతరంగా పొందవచ్చని ఆడమ్ చెప్పారు. ఏడబ్ల్యూఎస్ ఇటీవలే 4.4 బిలియన్ డాలర్లతో హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెజాన్‌కు ఇది భారత్‌లో రెండోది కానుంది. -
ఈక్విటీల్లో విజయానికి.. బఫెట్ పంచ సూత్రాలు
2020 నుంచి రెండేళ్లపాటు తారాజువ్వలా సాగిన ఈక్విటీల ర్యాలీ చూసి మార్కెట్లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన యువ ఇన్వెస్టర్లు బోలెడు మంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు వారిని ఇప్పుడు అయోమయానికి గురిచేయవచ్చు. అంతెందుకు సుదీర్ఘకాలం నుంచి మార్కెట్లో ఉన్న వారు సైతం షేర్ల ధరలు పేకమేడల్లా రాలుతున్నప్పుడు స్థిరంగా చూస్తూ ఉండలేరు. నష్టానికైనా అమ్ముకుని బయటపడదామనుకుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లకు సంక్షోభాలు కొత్త కాదు కదా! ఎన్నో స్కాములు, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలను చూసి పడిపోయాయి. అంతే బలంగా పైకి లేచి నిలబడ్డాయి. ఈక్విటీల్లో విజయానికి ముందుగా కావాల్సింది పెట్టుబడి కాదు. విజయ సూత్రాలు. వారెన్ బఫెట్ వంటి విఖ్యాత ఇన్వెస్టర్ల అనుభవాలు, సూత్రాలు లోతుగా పరిశీలిస్తే ఈక్విటీ తత్వం కొంతైనా బోధపడుతుంది. వారెన్ బఫెట్ పెట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్ హాతవే 1970 నుంచి ఏటా వాటాదారులకు వార్షిక నివేదిక పంపిస్తుంటుంది. ఇందులో వాటాదారులను ఉద్దేశించి బఫెట్ రాసే లేఖ ఇన్వెస్టర్లకు ఒక చుక్కానిలా పనిచేస్తుంది. బఫెట్ అనుసరించిన సూత్రాలు కాల పరీక్షకు నిలబడినవి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కరోనా విపత్తు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక ఆంక్షలు, చైనాలో మందగమనం, అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల శరాఘాతం, దీర్ఘకాలం పాటు ఆర్థిక స్తబ్దత, రూపాయి బలహీనత ఇలా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఒకవైపు వృద్ధికి ప్రోత్సాహం కావాలి. మరోవైపు ధరలకు కట్టడి వేయాలి. సెంట్రల్ బ్యాంకులకు ఇదొక సవాలుగా మారిపోయింది. ధరల పెరుగుదలకు సరఫరా వ్యవస్థలో సమస్యలూ తోడయ్యాయి. ఇలా ఒకటికి మించిన ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు గురిచేస్తున్నాయి. స్వల్పకాలంలో కనిపించే ఇలాంటి ప్రకంపనలకు కదిలిపోతే దీర్ఘకాలం పాటు మార్కెట్లో నిలిచి రాణించడం అసాధ్యం. ద్రవ్యోల్బణం ప్రభావం ద్రవ్యోల్బణం ఎగసిపడడం అన్నది తాత్కాలికమేనన్న వాదన గతేడాది నుంచి వినిపిస్తోంది. కానీ, ఇది నిజం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా తక్కువ ద్రవ్యోల్బణం ఉంది. ఫలితంగా దీర్ఘకాలం పాటు సరళతర విధానాలు కొనసాగడం వల్ల ఉండే రిస్క్‌ను ఇన్వెస్టర్లు, విశ్లేషకులు, ఆర్థికవేత్తలు సైతం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కానీ, ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం నడుమ సెంట్రల్ బ్యాంకుల ముందున్న ఏకైక మార్గం ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేయడమే. ఇన్నాళ్లూ తక్కువ వడ్డీ రేట్లు, మిక్కిలి ద్రవ్య లభ్యతతో లాభపడిన మార్కెట్లు.. పరిస్థితులకు తగ్గట్టు మార్పునకూ గురి కావాల్సిందే. వడ్డీ రేట్లు పెరగడం స్టాక్స్‌కు ప్రతికూలమే. ద్రవ్యోల్బణాన్ని బఫెట్ టేప్వార్మ్తో పోల్చారు. టేప్‌వార్మ్‌లు పేగుల లోపలి గోడల్లో ఉండి మనం తీసుకునే ఆహారంలోని శక్తిని గ్రహిస్తుంటాయి. అలాగే, ద్రవ్యోల్బణం కంపెనీల నిధుల శక్తిని హరిస్తుంటుంది. రుణాలను భారంగా మారుస్తుంది. అధిక ద్రవ్యోల్బణం తర్వాత కనిపించేది అధిక వడ్డీ రేట్లే. అందుకుని మార్కెట్లు ఖరీదుగా మారినప్పుడు, వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మిగులు నిధులను బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తానని బఫెట్ తన 1986 లేఖలో పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరిగితే టేప్‌వార్మ్ మాదిరిగా ఏ స్టాక్స్ విలువలు హరించుకుపోతాయన్న విశ్లేషణ చేయాలి. కమోడిటీలు ఇన్‌పుట్‌గా (ముడి సరుకులుగా) వ్యాపారం చేసేవి, అధిక రుణభారంతో నడిచే కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అప్పటి వరకు రుణాల అండతో ఇన్ఫ్రా, పవర్ కంపెనీలు దూకుడు ప్రదర్శించగా.. ఆ తర్వాత కుదేలయ్యాయి. రుణాలు తీర్చలేక ఎన్నో కనుమరుగయ్యాయి. పెన్నీ షేర్లుగా మారిపోయినవీ ఉన్నాయి. వడ్డీ రేట్ల సైకిల్ మారే దశలో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే, నష్టాలతో వచ్చే న్యూఏజ్ కంపెనీలపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపిస్తాయి. భద్రత పాళ్లు ఎంత? 1991, 1993 వార్షిక లేఖల్లో బఫెట్ ‘మార్జిన్ ఆఫ్ సేఫ్టీ’ (భద్రత) గురించి ప్రస్తావించారు. పెట్టుబడి విజయంలో దీని పాత్ర ఎంతో ఉంటుందన్నది ఆయన అనుభవ సారం. స్టాక్స్ విలువను మదింపు వేసే విషయంలో ఊహించిన, ఊహించని రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాలకు దారితీస్తుంది. వచ్చే పదేళ్ల పాటు మార్కెట్లలో సానుకూల పరిస్థితులు ఉంటాయని వినడా నికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవంలో ఇది సాధ్యమేనా? ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, కంపెనీలకు సంబంధించి రిస్క్‌లు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. లాభాల్లేకుండా ఏటా మార్కెట్ వాటా పెంపు కోసం నష్టాలను అధికం చేసుకుంటూ వెళ్లే కంపెనీలకు సంబంధించి భవిష్యత్తు అంచనాలు ఎంతో ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ, ఆర్జించే ఆదాయానికి 3,000 రెట్లు ధర పలుకుతున్న ఆయా కంపెనీల్లో మీరు పెట్టే పెట్టుబడికి భద్రత పాళ్లు ఎంత? ఎన్నో రేట్ల అధిక స్పందన అందుకున్న ఇటీవలి జొమాటో, పేటీఎం, నైకా, పీబీ ఫిన్‌టెక్, కార్‌ట్రేడ్ షేర్లు.. లిస్ట్ అయిన తర్వాత గరిష్టాల నుంచి చూస్తే 40–70 శాతం స్థాయిలో పడిపోయాయి. కానీ, ద్రవ్యోల్బణం ప్రభావం వీటిపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. జొమాటో రూ.76 ధరకు ఐపీవో తీసుకురాగా, ఆ తర్వాత రూ.179 వరకు వెళ్లింది. ఇప్పడు రూ.79 వద్ద ట్రేడవుతోంది. విలువను సరిగ్గా అంచనా కట్టకుండా రూ.150–179 మధ్య పెట్టుబడులు పెట్టిన వారి స్థితి ఏంటి? వారు మార్జిన్ ఆఫ్ సేఫ్టీని పట్టించుకోలేదన్నది స్పష్టం. స్పెక్యులేషన్‌కు దూరం దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలంటే స్పెక్యులేటర్గా ఉండకూడదని బఫెట్ చెబుతారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్ వేర్వేరు. ఈ రెండింటి మధ్య విభజన గీత స్పష్టంగా ఉంచుకోవాల్సిందే. ఫలానా షేరు ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలో, ర్యాలీ చేస్తుండడమే మీ పెట్టుబడి వెనుక కారణం అయి ఉంటే, షేరు ధర కంపెనీ మూలాలను ప్రతిఫలించడం లేదంటే అది స్పెక్యులేషన్ అవుతుంది. అయినా కానీ, లాభాలు రావచ్చు. మన దేశంలో కొన్ని పాపులర్ స్టాక్స్ కొన్నేళ్ల పాటు అసాధారణ వ్యాల్యూషన్లతోనే ట్రేడవుతుంటాయి. కానీ, ఒక్కసారిగా ఆయా కంపెనీల్లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటే ఈ వ్యాల్యూషన్లు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఉదాహరణకు పెయింట్స్ స్టాక్స్ ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలోనే, అంతర్గత విలువకుపైనే ట్రేడవుతుంటాయి. కానీ, చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు వాటి ధరలు దిగొస్తున్నాయి. చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగితే పెయింట్స్ స్టాక్స్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వృద్ధి అవకాశాలూ సన్నగిల్లుతాయి. ఎందుకంటే ఆయా కంపెనీలు ధరలను పెంచితే విక్రయాలపై ప్రభావం పడుతుంది. అం దుకని పెట్టుబడికి స్పెక్యులేషన్ ధోరణి పనికిరాదు. అంతర్గత విలువ కంపెనీకి ఫలానా ధర పెట్టొచ్చా అన్నది ఎలా తెలుస్తుంది? దీనికి అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) చూడడం బఫెట్ అనుసరించే సూత్రాల్లో మరొకటి. బెర్క్‌షైర్ వాటాదారులకు బఫెట్ తరచుగా దీన్ని సూచిస్తుంటారు కూడా. కంపెనీ వ్యాపారం నుంచి తీసుకోతగిన ‘డిస్కౌంటెడ్ క్యాష్ వ్యాల్యూ’ను అంతర్గత విలువగా బఫెట్ చెబుతారు. కానీ పెట్టుబడుల నిపుణులకు సైతం ఇది కొరుకుపడని అంశం. ఇందుకు సంబంధించి ఎవరికి వారు తమదైన లెక్కింపు విధానాలను అనుసరిస్తుంటారు. కంపెనీకి సంబంధించి నికర పుస్తక విలువను అంచనా వేసి, దానికి సమీప భవిష్యత్తులో వచ్చే క్యాష్ ఫ్లో, ప్రస్తుత లాభాలను కలిపితే అంతర్గత విలువ వస్తుంది. ఇవన్నీ కష్టంగా అనిపించిన వారు.. కంపెనీ లాభాలు ఆ కంపెనీ గత చరిత్ర సగటు స్థాయిలోనే ఉన్నాయా? అని చూడాలి. తర్వాత స్టాక్ ధర చారిత్రకంగా (గతంతో పోలిస్తే) సగటు వ్యాల్యూషన్ల స్థాయిలోనే ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా? గమనించాలి. ఒకవేళ స్టాక్ ధర చారిత్రక సగటు వ్యాల్యూషన్లకు ఎగువన ట్రేడ్ అవుతుంటే అంతర్గత విలువకు మించి ట్రేడవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీల లాభాల వృద్ధి కంటే వాటి స్టాక్స్ వ్యాల్యూషన్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో అవి అంతర్గత విలువను దాటిపోయి ట్రేడవుతున్నాయి. 2011 నుంచి 2021 వరకు నిఫ్టీ–50 ఇండెక్స్ 275 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఈ మొత్తంలో 170 శాతం రాబడులు పీఈ రేషియో పెరగడం రూపంలోనే వచ్చాయి. కానీ, ఫండమెంటల్స్ మెరుగుపడడం వల్ల కాదు. అదంతా బబుల్గానే భావించాల్సి ఉంటుంది. పెరుగుదల వెనుక వాస్తవ బలం 100 శాతంగానే భావించాలి. ఇలాంటప్పుడు అంతర్గత విలువకు లభించే స్టాక్స్ తక్కువగానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. సరైన ధర సరైన ధర వచ్చే వరకు వేచి చూడాలి.. ఇన్వెస్టర్లకు 1993 లేఖలో బఫెట్ ఇచ్చిన సూచన ఇది. పెట్టుబడులకు సంబంధించి ఎలా నడుచుకోవాలో తెలియని ఇన్వెస్టర్లను మార్కెట్ క్షమించదని ఆయన చెబుతారు. అత్యుత్తమమైన కంపెనీ అయినా సరే షేరు ధర సహేతుక స్థాయి వద్ద ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్నది బఫెట్ అనుసరించే సూత్రం. ఒక కంపెనీకి సంబంధించి ఆయన అనుసరించే అంశాలను గమనిస్తే.. ఎంపిక చేసుకునే కంపెనీ చేస్తున్న వ్యాపారం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. దీర్ఘకాలం పాటు అనుకూలతలు ఆ కంపెనీకి ఉండాలి. సమర్థులైన, నిజాయతీపరులైన వ్యక్తులు నడిపిస్తుండాలి. ఆకర్షణీయమైన ధర వద్ద ఉండాలి. వీటిల్లో మొదటి మూడు అంశాలకు రైట్ మార్కులు పడే కంపెనీలను ఆయన ఎన్నో సందర్భాల్లో గుర్తిస్తూనే ఉంటారు. కానీ, నాలుగో అంశమైన ఆకర్షణీయమైన ధర వద్ద లేకపోవడంతో బఫెట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మార్కెట్లో ప్రతి పతనం పెట్టుబడికి అవకాశం కావాలనేమీ లేదు. కొన్ని సందర్భాల్లో కంపెనీలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణం కావచ్చు. పెట్టుబడులకు ముందు భిన్నమైన అంశాలను విశ్లేషించుకోవాలని, వేగంగా స్పందించకుండా ఓపిక పట్టాలన్నది బఫెట్ ఫిలాసఫీ. పెట్టే ధర విషయంలో రిస్క్ తీసుకోవడం బఫెట్‌కు నచ్చదు. అవకాశం వచ్చే వరకు ఓపిక పట్టడమే ఆయన అనుసరించే విధానం. చక్కని అవకాశాలన్నవి మళ్లీ మళ్లీ వస్తుంటాయని ఆయన నమ్ముతారు. అందుకనే అందరూ ఎగబడి కొంటున్న వేళ అప్రమత్తంగా వ్యవహరించాలని.. అందరూ విక్రయిస్తున్న వేళ కొనుగోళ్లకు మొగ్గు చూపాలన్నది బఫెట్‌కు ఫలితాలిచ్చిన సూత్రాల్లో ఒకటి. ఎగసిపడే కెరటాన్ని పట్టుకోకుండా.. అది నేలను తాకే వరకు ఆగాలంటారు. 100–150–200 పీఈ వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు అయినా బఫెట్ సూత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. -
రెండేళ్లలో కో–లివింగ్ రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కో–లివింగ్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. దశల వారీగా విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావటం, రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ చేరుకోవటంతో దేశీయ కో–లివింగ్ మార్కెట్ క్రమంగా రికవరీ అయింది. దీంతో వచ్చే రెండేళ్లలో దేశీయ కో–లివింగ్ మార్కెట్ రెట్టింపు అవుతుందని కొలియర్స్ అడ్వైజరీ అంచనా వేసింది. ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60 శాతం ఆక్యుపెన్సీకి చేరుకోవటంతో ఈ విభాగం శరవేగంగా కోలుకుందని పేర్కొంది. ఈ ఏడాది వ్యవస్థీకృత రంగంలో 2.10 లక్షల బెడ్స్ ఉండగా.. 2024 నాటికి రెట్టింపు వృద్ధి రేటుతో 4.50 లక్షల పడకలకు చేరుతుందని అంచనా వేసింది. కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవటం, వర్క్ ఫ్రం హోమ్, వలసల నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితులు అనిశ్చితిలోకి వెళ్లిపోయాయి. దీంతో కో–లివింగ్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఈ ఏడాది మేలో 11.84 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు నవంబర్ నాటికి 7 శాతం క్షీణించింది. కరోనా సమయంలోనూ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు నియామకాలను పెంచడంతో కో–లివింగ్ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొందని కొలియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. ఉద్యోగ నియామకాలలో వృద్ధి, పట్టణాలకు వలసలు, విద్యార్థుల సంఖ్య పెరగడం, అసంఘటితక రంగంలో కో–లివింగ్ నమూనా వృద్ధి వంటివి ఈ పరిశ్రమ డిమాండ్ పెరిగిందని వివరించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో కో–లివింగ్ ఆక్యుపెన్సీ 45–50 శాతం, ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60–70 శాతానికి చేరిందని పేర్కొన్నారు. మధ్యలో సెకండ్ వేవ్ ప్రచారం కారణంగా రెండో త్రైమాసికంలో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిందన్నారు. సంప్రదాయ నివాస సముదాయాలలో 2–3 శాతం ఆదాయంతో పోలిస్తే కో–లివింగ్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. -
ఒమిక్రాన్‌పై సంసిద్ధమా?
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. టీకాల బూస్టర్ డోసుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో వెల్లడించాలని ప్రశ్నించారు. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 40 దాటాయని, పలు రాష్ట్రాల్లో దీని ఛాయలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ హెచ్చరించింది. ఒమిక్రాన్‌ను ఎమర్జెన్సీగా బ్రిటన్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని టీఎంసీ గుర్తు చేసింది. దీని కట్టడికి ప్రభుత్వం తీసుకునే చర్యలేంటని పలువురు సభ్యులు ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వం తీసుకునే హ్రస్వదృష్టి విధాన నిర్ణయాలతో ఆర్థిక పునరుజ్జీవనం అనిశ్చితిలో పడిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శించారు. దేశంలో ప్రస్తుత సంక్షోభానికి పెద్దనోట్ల రద్దుతో పునాదులు పడ్డాయన్నారు. మంగళవారం పార్లమెంటు రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పెంచే వీలునిచ్చే బిల్లులను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. వీటికి ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో ఇవి త్వరలో చట్ట రూపం దాల్చనున్నాయి. సభలో మీ ఆఫీసులు నడపొద్దు కేంద్ర మంత్రులు పార్లమెంట్లో సభ్యులతో తరచూ సమావేశం కావడంపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు తమ కార్యాలయాలను పార్లమెంట్ నుంచి నడిపించొద్దని కోరారు. సభ జరిగే సమయంలో పలువురు సభ్యులు కేంద్ర మంత్రుల వద్దకు వచ్చి మాట్లాడూతుండడం ఇటీవల సర్వసాధారణమైంది. మంగళవారం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సీటు వద్దకు ఒక సభ్యుడు వచ్చి చర్చలు జరపడాన్ని గమనించిన స్పీకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభ్యులు ఆయా అంశాలపై వ్యక్తిగతంగా చర్చించాలనుకుంటే తమ ఆఫీసుల్లో కలుసుకోవాలని గౌరవనీయులైన మంత్రులు సూచించాలన్నారు. సభ్యులు సభా గౌరవాన్ని కాపాడాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిందన్న తర్వాత కూడా సమాధానం కొనసాగించడంపై మరో మంత్రి కైలాస్ చౌధరిపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. -
తాలిబాన్ ఎఫెక్ట్.. ఎగుమతిదారుల్లో ఆందోళన
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆ దేశంతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో అభిప్రాయపడింది. అఫ్గానిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని దేశీ ఎగుమతిదారులకు ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ సూచించారు. అఫ్గానిస్తాన్.. తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లిపోవడం, పరిస్థితులు అదుపు తప్పడం వంటి పరిణామాల కారణంగా కొంత సమయం పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోవచ్చని ఎఫ్ఐఈవో వైస్ ప్రెసిడెంట్ ఖాలిద్ ఖాన్ తెలిపారు. అనిశ్చితి తొలగిపోయిన తర్వాతే తిరిగి లావాదేవీలు ప్రారంభం కావచ్చని వివరించారు. అఫ్గానిస్తాన్‌కు భారత్ ఇస్తున్న ఆర్థిక సహాయం వల్ల దేశీ ఉత్పత్తులకు మార్కెట్ ఉంటోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇదంతా నిల్చిపోవచ్చని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిస్వజిత్ ధర్ పేర్కొన్నారు. సకాలంలో చెల్లింపులు జరుగుతాయో లేదోనన్న సందేహాల వల్ల అఫ్గానిస్తాన్‌కు భారత్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిల్చిపోవచ్చని సాయి ఇంటర్నేషనల్ సంస్థ చీఫ్ రాజీవ్ మల్హోత్రా పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2019–20 ఆర్థిక సంవత్సరంలో 1.52 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2020–21లో 1.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. భారత్ నుంచి ఎగుమతులు 826 మిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 510 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
పునరాగమనంపై అనిశ్చితి: ఫెడరర్
ఈనెల 30న మొదలయ్యే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేది లేనిది ఇప్పుడే చెప్పలేనని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది కేవలం 13 మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ వింబుల్డన్ టోర్నీ తర్వాత ఆటకు విరామం ఇచ్చాడు. ‘వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో మళ్లీ రాకెట్ పట్టలేదు. ఈ వారంలో డాక్టర్లను కలవాల్సి ఉంది. ఇప్పటికైతే నా పునరా గమనంపై అనిశ్చిత నెలకొని ఉంది’ అని ఫెడరర్ వివరించాడు. -
అనిశ్చితికి తెర పడేదెప్పుడు?
పొరుగున ఉన్న నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఇప్పుడప్పుడే తెర పడేలా లేదు. దురదృష్టవశాత్తూ – అనిశ్చితి, నేపాల్ ప్రభుత్వం – ఈ రెండూ కొద్దికాలంగా పర్యాయపదాలైపోయాయి. ఎప్పటికప్పుడు ఓ కొత్త ప్రధాని, ఓ కొత్త ప్రభుత్వం. ఎవరొచ్చినా మూణ్ణాళ్ళ ముచ్చట వ్యవహారం. మావోయిస్టుల హింసాకాండ, నేపాల్ రాజరిక వ్యవస్థల నుంచి దశాబ్దం పైచిలుకు క్రితం బయటపడ్డ నేపాల్ ఇప్పటికీ సుస్థిరత కోసం చీకటిలో గుడ్డిగా తడుముకుంటూనే ఉండడం ఒక విషాదం. ఆరేళ్ళ క్రితం 2015లోనే నేపాల్‌లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయినా ఇప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వివిధ పార్టీల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో రాజకీయ నేతలు అక్కడ కలసి పనిచేసే పరిస్థితులే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే నేపాల్‌లో రాజకీయం ఎప్పటికప్పుడు మారుతోంది. ప్రభుత్వాలు పడిపోతున్నాయి. పాలకులు తరచూ మారిపోతున్నారు. ఒక దశలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందా అన్న అనుమానం కలిగేలా పరిణామాలు సాగుతున్నాయి. పార్టీల అంతర్గత కుమ్ములాటల మధ్య గద్దెనెక్కిన తాజా దేవ్బా సర్కార్ బలమూ పార్లమెంట్లో అంతంత మాత్రమే కావడంతో సుస్థిర ప్రభుతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. కాస్తంత వెనక్కి వెళితే, మొన్నామధ్య దాకా కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం సాగింది. దేశాధ్యక్షురాలు విద్యాదేవి అండతో ఓలీ గద్దెనెక్కారు. అస్తుబిస్తుగా ఉన్న అధికారాన్ని చేతిలో ఉంచుకుంటూనే, ప్రతినిధుల సభను రద్దు చేయించారు. ప్రధానిగా పదవిలో కొనసాగుతూ, ఎన్నికలకు వెళ్ళేందుకు సన్నద్ధమయ్యారు. ఇంతలో, నేపాల్ సుప్రీమ్‌కోర్టు రంగంలోకి దిగడంతో కథ మారింది. రద్దయిన ప్రజాప్రతినిధుల సభను అయిదు నెలల్లో రెండోసారి పునరుద్ధరిస్తూ, అయిదుగురు సభ్యుల నేపాల్ సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ప్రధాని ఓలీ రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రతినిధుల సభను రద్దు చేశారని పేర్కొంది. ఆ సుప్రీమ్ తీర్పుతో ఓలీ గద్దె దిగాల్సి వచ్చింది. మిగిలిన పార్టీలకు మరో మార్గం లేకపో వడంతో నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధినేత షేర్ బహదూర్ దేవ్బా ఈ జూలై 13న ప్రధానమంత్రి అయ్యారు. అలా ఏడున్నర పదుల వయసున్న దేవ్బా అచ్చంగా అయిదోసారి ప్రధాని పీఠమెక్కారు. ఆ మధ్య ఓలీ పాలనలో దెబ్బతిన్న నేపాల్ – భారత సంబంధాలు దేవ్బా వల్ల సర్దుకుంటాయని ఆశ. కానీ, అసలు ఆయన ఆ పదవిలో ఎంత కాలం ఉంటారన్నదీ అనిశ్చితంగానే ఉంది. ఓలీలో అంతకంతకూ పెరిగిన నియంతృత్వ పోకడలతో పోలిస్తే దేవ్బా మధ్యేవాద రాజకీయ వైఖరి చాలామందికి నచ్చవచ్చు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గి పదవిలో కొనసాగగలిగినా, దేవ్‌బాకు అది ముళ్ళకిరీటమే. ఇప్పటికిప్పుడు ఆయనకు బోలెడు తలనొప్పులున్నాయి. కరోనా మహమ్మారితో నేపాల్ అతలాకుతలమైంది. పొరుగు దేశాలైన భారత, చైనాలతో ఆయన ఒకప్పటి కన్నా మరింత సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గతంలో కన్నా ఇప్పుడు నేపాల్‌పై చైనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మరోపక్క చిరకాల మిత్రదేశమైన భారత్‌తో సత్సంబంధాల పునరుద్ధరణకు శ్రమించాల్సి ఉంటుంది. అందుకే, పరిపాలన ఆయనకు నల్లేరుపై బండి నడకేమీ కాదు. నిజానికి, ప్రధానిగా దేవ్బా కొనసాగాలంటే, నెలరోజుల్లో సభలో బలం నిరూపించుకోవాలి. ఆయన మాత్రం పదవి చేపట్టిన ఆరో రోజైన ఆదివారమే సభలో విశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డారు. తుది సమాచారం అందే సమయానికి నేపాల్ పార్లమెంట్లో విశ్వాస పరీక్ష పర్యవసానాలు వెల్లడి కాలేదు. మొత్తం 275 మంది సభలో ఇప్పుడున్నది 271 మందే. బలపరీక్షలో నెగ్గాలంటే అందులో సగానికి పైగా, అంటే కనీసం 136 ఓట్లు దేవ్‌బాకు అవసరం. ఆయన సొంత పార్టీ ‘నేపాలీ కాంగ్రెస్’కున్నవి 61 స్థానాలే. ఆ పార్టీ సంకీర్ణ భాగస్వామి ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్)’కు ఉన్నవి 49 స్థానాలు. ఆయనకు మద్దతునిచ్చే మిగతా పార్టీలవన్నీ కలిపినా సరే అవసరమైన 136 ఓట్ల సంఖ్యకు చేరుకోవడం లేదు. మరోపక్క, ఓలీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి 121 మంది సభ్యులున్నారు. ఈ పరిస్థితుల్లో ఓలీని వ్యతిరేకిస్తున్న వివిధ పార్టీ వర్గాల మద్దతు దేవ్‌బాకు కీలకం. అది లభిస్తే తప్ప, దేవ్బా ఈ పరీక్ష నెగ్గడం కష్టం. నెగ్గినా బొటాబొటీ మద్దతుతో ఎంతకాలం నెగ్గుకొస్తారో చెప్పలేం. ఒకవేళ పరీక్షలో ఆయన ఓడిపోతే, కథ మళ్ళీ మొదటికొస్తుంది. దిగువ సభ రద్దవుతుంది. ఆరునెలల్లో మళ్ళీ నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ప్రహసనం. నిజానికి, అటు సుప్రీమ్ తీర్పుకు ముందు దిగువ సభను రద్దు చేసిన ఓలీకి కానీ, ఇటు న్యాయ స్థానం అండతో గద్దెనెక్కిన దేవ్‌బాకు కానీ ఎవరికీ ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపేంత మెజారిటీ లేదు అన్నది చేదు నిజం. కాబట్టి, ఎప్పటికైనా మళ్ళీ బంతి ప్రజాతీర్పు కోసం ఓటర్ల ముందుకు రావాల్సిందే. ఇలా తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుందన్నది ఆసక్తికరం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓటింగే అధికారానికి రాచబాట. కానీ, ప్రజలు స్పష్టమైన తీర్పునిస్తేనే ఎక్కడైనా సుస్థిరమైన పాలన సాధ్యమవుతుంది. వాళ్ళ తీర్పు అస్పష్టంగా ఉంటే, మైనారిటీ ప్రభుత్వాలు, అనిశ్చిత పరిపాలన తప్పవు. దినదిన గండం లాంటి ప్రభుత్వాల వల్ల పరిపాలనా సాగదు. ప్రజలకు మేలూ ఒనగూరదు. ఈసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేపాల్ ప్రజానీకం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొంటే, ఈ అయోమయ పరిస్థితి కొంత మారవచ్చు. అప్పటి దాకా మూణ్ణాళ్ళ ముచ్చట ప్రభుత్వాలు, పార్లమెంట్ సాక్షిగా రాజకీయ ప్రహసనాలు తప్పవు. -
బుల్ పరుగుకు బ్రేక్!
న్యూఢిల్లీ: సూచీల పదిరోజుల సుదీర్ఘ ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అలాగే మార్కెట్ 10 రోజుల ర్యాలీతో ఆయా షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపారు. ట్రేడింగ్ ప్రారంభంలో మొదలైన అమ్మకాల సునామీ మార్కెట్ ముగిసేవరకు కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 1,066 పాయింట్లను నష్టపోయి 40,000 దిగువన 39,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 291 పాయింట్లను కోల్పోయి 11,680 వద్ద ముగిసింది. అన్ని రంగాలకు షేర్లలో విపరీతమైన విక్రయాలు జరిగాయి. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో ఒక్క ఏషియన్ పెయింట్స్(0.32 శాతం)మాత్రమే లాభపడింది. ఇక నిఫ్టీలోని 50 షేర్లలో 3 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. గురువారం ఎఫ్ఐఐలు రూ.604 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.808 కోట్ల షేర్లను అమ్మారు. బీఎస్ఈ ఎక్సే్చంజ్‌లో మిడ్‌క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.75 శాతం నష్టాన్ని చవిచూశాయి. ఆరంభ లాభాల్ని కోల్పోయిన ఇన్ఫీ.. ఆరంభ లాభాల్ని కోల్పోవడంతో ఇన్ఫోసిస్ షేరు గురువారం బీఎస్ఈలో 2.50 శాతం లాభపడి రూ.1,108 వద్ద ముగిసింది. రెండో త్రైమాసికపు ఫలితాల్లో లాభాల పంట పండిచిన ఇన్ఫీ షేరు ఉదయం సెషన్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో షేరు 4 శాతం లాభపడి రూ.1,185 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో మార్కెట్ క్యాప్ రూ.5 లక్షల కోట్లను తాకింది. అనంతరం మార్కెట్ పతనంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనై 2.5% లాభంతో ముగిసింది. ప్రపంచమార్కెట్ల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ గురువారం మన మార్కెట్ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరుకూ ఎలాంటి ప్యాకేజీ ఉండదని తేటతెల్లం కావడం ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాగే రెండో దశ కరోనా కేసుల విజృంభణతో యూరప్ దేశాల్లో విధించిన ఆంక్షలు, లాక్డౌన్ మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. రిలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ‘అమెరికా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన’’ అంశం ఈక్విటీ మార్కెట్లను నడిపింది. అయితే భారత్ మరోమారు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోవడం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ వాయిదా పడటం ఈక్విటీలను నష్టాల వైపు మళ్లించాయి’అని జియోజిత్ ఫైనాన్షియల్ వినోద్ నాయర్ తెలిపారు. నష్టాల్లో ప్రపంచమార్కెట్లు ప్రపంచమార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల వరకు ఎలాంటి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలుండవన్న అమెరికా ప్రకటనతో అమ్మకాలు నెలకొన్నాయి. యూరప్‌లో రెండో దశ కరోనా వైరస్ కేసులు విజృంభణ, అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలు మరోసారి తెరపైకి రావడం తదితర కారణాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా నేడు ఆసియా మార్కెట్లు 2% వరకు నష్టాలతో ముగిశాయి. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు 2–3శాతం క్షీణించాయి. అలాగే అమెరికా సూచీలు భారీ నష్టంతో మొదలయ్యాయి. రూ. 3.23 లక్షల కోట్ల సంపద ఆవిరి మార్కెట్ పతనంతో రూ. 3.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం విలువ గురువారం రూ.157.22 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇటీవలే ఈ సంపద రూ. 160.68 లక్షల కోట్ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. పతనానికి కారణాలు ► అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆశలు ఆవిరి... అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన ఆశలు ఆవిరయ్యాయి. ఈ నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలోపు అమెరికా స్వల్ప మొత్తంలో ఉద్దీపన ప్యాకేజీని ప్రపంచ మార్కెట్లు ఆశించాయి. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మునుచిన్ ఈ ఆశలపై నీళ్లు చల్లారు. ఎన్నికలయ్యేంత వరకు ఎలాంటి ఆర్థిక ఉద్దీపనలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ► తెరపైకి మరోసారి లాక్డౌన్ ఆందోళనలు... రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండడంతో లాక్డౌన్ విధింపు ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. యూరప్‌లో రోజుకు లక్షకు మించి కోవిడ్ –19 కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ –19 కట్టడి చర్యల్లో భాగంగా యూరప్‌లోని పలు దేశాలు కఠినతరమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. బ్రిటన్‌లో బడులను మూసేశారు. శస్త్రచికిత్సలను నిషేధించారు. లాక్డౌన్ విధింపుపై అక్కడి ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి. ► అమెరికా–చైనా ఉద్రిక్తతలు... చైనాకు చెందిన కొన్ని కంపెనీల చర్యలు అమెరికా జాతీయ సమగ్రత, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయంటూ అమెరికా వాణిజ్య గూఢచార విభాగం దేశాధ్యకుడు ట్రంప్‌నకు ఫిర్యాదు చేశాయి. ఈ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చర్యలతో అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి వచ్చాయి. ► ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు... సూచీల పది రోజుల వరుస ర్యాలీకి ప్రాతినిధ్యం వహించిన ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. మెరుగైన క్యూ2 ఫలితాలు, భారీ బైబ్యాక్ ప్రకటనల నేపథ్యంలో కేవలం నెలరోజుల్లో 6 శాతం లాభపడిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గురువారం 3 శాతం నష్టాన్ని చవిచూసింది. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు కూడా సూచీల పతనానికి కారణమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 3.50 శాతం నష్టంతో ముగిసింది. -
అంతర్జాతీయ సంకేతాలే కీలకం...
ప్రధాన ఆర్థిక గణాంకాలేమీ లేకపోవడంతో ఈ వారం మార్కెట్‌కు అంతర్జాతీయ సంకేతాలే కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి... ఈ అంశాలు కూడా తగినంత ప్రభావం చూపుతాయని వారంటున్నారు. సెప్టెంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులంటున్నారు. దేశీయంగా ప్రధాన ట్రిగ్గర్లు ఏమీ లేకపోవడంతో అనిశ్చితి కొనసాగుతుందని, అందుకే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. ప్రపంచ పీఎమ్ఐ గణాంకాలు.... అమెరికా ఫెడరల్ రిజర్వ్ తక్షణ తాయిలాలేమీ ఇవ్వకపోవడం గత వారం ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ను కూడా దెబ్బతీసింది. సున్నా స్థాయి రేట్లు మరో మూడేళ్ల పాటు కొనసాగుతాయని సంకేతాలిచ్చిన ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రికవరీపై అనిశ్చితిని వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లాండ్, యూరోజోన్‌ల పీఎమ్ఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు ఈ వారం విడుదలవుతాయి. ఈ వారం మూడు ఐపీఓలు.... ఈ వారంలో మూడు కంపెనీల ఐపీఓలు వస్తున్నాయి. క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో సందడి చేయనున్నాయి. విదేశీ పెట్టుబడులు రూ.3,944 కోట్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండటంతో ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో రూ.3,944 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.1,766 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.2,178 కోట్ల చొప్పున ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ జోరుగా బాండ్లను కొనుగోలు చేస్తుండటంతో బాండ్ల రాబడులు తక్కువగా ఉండటం, అంతర్జాతీయంగా అధికంగా లభిస్తున్న లిక్విడిటీ... ఈ కారణాల వల్ల మన మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వస్తున్నాయని నిపుణులంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సున్సా స్థాయిల్లోనే మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతుందని వారంటున్నారు. ఐపీఓల సందడి చాలా రోజుల తర్వాత ఈ నెలలో ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నెలలో హాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్ మొబైల్స్ తమ ఐపీఓలతో దుమ్ము రేపాయి ఇక ఈ వారం మూడు కంపెనీలు–క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓలతో సందడి చేయనున్నాయి. ఈ ఐపీఓలకు సంబంధించిన తేదీలు, ప్రైస్‌బాండ్, జీఎమ్‌పీ తదితర వివరాలు..... -
యస్ బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి
ముంబై: యస్ బ్యాంక్‌లో పెట్టుబడుల ప్రతిపాదనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని భావించగా, కేవలం 50 కోట్ల డాలర్లకే బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది. సైటాక్స్ హోల్డింగ్స్, సైటాక్స్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ప్రతిపాదించిన ఈ ఆఫర్ విషయంలో సానుకూలంగా ఉన్నామని మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం యస్ బ్యాంక్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని తదుపరి బోర్డ్ సమావేశంలో తీసుకుంటామని వెల్లడించింది. ఎర్విన్ సింగ్ బ్రెయిచ్/ఎస్పీజీపీ హోల్డింగ్స్ ప్రతిపాదించిన 120 కోట్ల బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆఫర్‌పై డైరెక్టర్ల బోర్డు ఇంకా పరిశీలన జరుపుతోందని పేర్కొంది. 200 కోట్ల డాలర్ల దాకా పెట్టుబడులు సమీకరించే దిశగా ఇతరత్రా ఇన్వెస్టర్ల ప్రతిపాదనలపై కసరత్తును కొనసాగిస్తున్నట్లు యస్ బ్యాంక్ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు 2018 ఆగస్టులో ప్రమోటరు, సీఈవో రాణా కపూర్ నిష్క్రమించినప్పట్నుంచి యస్ బ్యాంక్ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్న సంగతి తెలిసిందే. మొండిబాకీల భారం, మూలధనంపరమైన సమస్యల కారణంగా రుణ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఇన్వెస్టర్ల నుంచి 200 కోట్ల డాలర్ల దాకా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు యస్ బ్యాంక్ గత నెలలో వెల్లడించింది. వీటినే ప్రస్తుతం మదింపు చేస్తోంది. తాజా వార్తల నేపథ్యంలో యస్‌బ్యాంక్ షేర్ 10 శాతం నష్టంతో రూ.50.55 వద్ద ముగిసింది. -
అవుట్సోర్సింగ్కు అనిశ్చితి ముప్పు
బెంగళూరు: అంతర్జాతీయ అవుట్సోర్సింగ్ మార్కెట్‌కు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిపరమైన ముప్పు పొంచి ఉందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ పేర్కొంది. కంపెనీలు సాధ్యమైనంత వరకూ రిస్కులు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ వనరుల మేళవింపుతో కంపెనీలు అనుసరిస్తున్న విధానంతో డిమాండ్, సరఫరాపరంగా కొన్నాళ్లుగా విదేశీ అవుట్సోర్సింగ్ మార్కెట్ స్థిరంగా ఉంటోందని గార్ట్నర్ తెలిపింది. అయితే, శ్రీలంకలో ఉగ్రవాద దాడులు, అమెరికా–చైనా మధ్య వాణిజ్య వివాదం, హాంకాంగ్‌లో రాజకీయ ఆందోళనలు మొదలైన వాటితో సరఫరాపరమైన అనిశ్చితి తలెత్తిందని ఒక నివేదికలో వివరించింది. ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ మొదలైన దేశాలకు చైనా దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువ చేసే ఐటీ అప్లికేషన్స్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసులు అందిస్తోంది. భారతీయ అవుట్సోర్సింగ్ సంస్థలు .. అంతర్జాతీయంగా సేవల ద్వారా గతేడాది 45 బిలియన్ డాలర్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. అయితే, తాజాగా వాణిజ్య యుద్ధంపై ఆందోళనలతో ఐటీ సేవల విషయంలో చైనాకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చని గార్ట్నర్ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఆఫ్‌షోర్ అవుట్సోర్సింగ్ ఒప్పందాలను పునఃసమీక్షించుకోవడం శ్రేయస్కరమని సూచించింది. -
బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు
-
బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రెండు వారాలకు పైగా నెలకొన్న రాజకీయ అనిశ్చితిలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆదివారం సాయంత్రం వేగంగా పరిణామాలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బీజేపీని శనివారం గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ వెనకడుగు వేయడంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. సీఎం పదవి విషయంలో శివసేనతో అంతరం పెరిగిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుకు చాలినంత బలం కూడగట్టలేక బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపింది. దీంతో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానం పంపారు. ఈ విషయంలో అభిప్రాయం తెలపాలంటూ సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకు గవర్నర్ ఆ పార్టీ శాసనసభా నేత ఏక్నాథ్ షిండేకు గడువిచ్చారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్లో మకాం వేసిన శివసేన ఎమ్మెల్యేలంతా గవర్నర్ ఆహ్వానం అనంతరం పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు. అంతకుముందు సేన చీఫ్ ఠాక్రే నగరంలోని ఓ హోటల్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో తమ పార్టీ నేత సీఎం పీఠం ఎక్కనున్నారంటూ ప్రకటించారు. ప్రతిపక్షం మద్దతుతో సర్కారు ఏర్పాటుకు గల అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ కూడా తెలిపారు. ఏదేమైనా తమ పార్టీ నేతే సీఎం అవుతారన్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్నారు. ఈ పరిణామాలతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య చర్చలు ఊపందుకున్నాయి. శివసేన ఎన్డీఏ నుంచి వైదొలిగితేనే.. శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జైపూర్‌లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు అంతిమ నిర్ణయాన్ని సోనియా గాంధీకి వదిలివేసేందుకు ఆమోదం తెలిపారు. ఎన్సీపీ చీఫ్ పవార్ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సోనియాతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘సేన–ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో కాంగ్రెస్ మద్దతిస్తుంది. కాంగ్రెస్‌కు స్పీకర్ పోస్టు దక్కే అవకాశముంది’ అన్నారు. కాంగ్రెస్ తమకు విరోధి కాదంటూ సామ్నా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. సేనకు మద్దతు తెలపాలంటే, ముందుగా ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాలి. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా చేయాలి’ అన్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శివసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం అప్పగించరాదని కొందరు, కాంగ్రెస్–ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వానికి శివసేన మద్దతిస్తే చాలునని మరికొందరు అంటున్నారు. రాష్ట్రపతి పాలన రావాలని తమ పార్టీ కోరుకోవడం లేదని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉండేందుకు బీజేపీ నిర్ణయం ఇటీవలి ఎన్నికల్లో శివసేనతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ ఆదివారం ప్రభుత్వం ఏర్పాటులో అన్ని ప్రయత్నాలు చేసింది. శివసేన ససేమిరా అనడంతో గవర్నర్‌ను కలిసి ప్రతిపక్షంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. శివసేన పట్టు కారణంగా ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయానికి వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ‘శివసేన ప్రజల తీర్పును అపహాస్యం చేసింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అందుకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాం’అని ఆయన అన్నారు. అందరి చూపు కాంగ్రెస్ వైపు మహారాష్ట్ర పరిణామాలు మరోసారి కర్ణాటక రాజకీయాలను జ్ఞప్తికి తెస్తున్నాయి. అక్కడ ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ కొన్ని స్థానాలు మాత్రమే గెలుచుకున్న జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి, తలబొప్పి కట్టించుకుంది. మహారాష్ట్రలో.. శివసేనతో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ అతిపెద్ద పార్టీ గా అవతరించింది. శివసేనతో సీఎం పీఠం విషయంలో పొసగక తెగదెంపులు చేసుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు 25 సీట్ల దూరంలో ఉండిపోయింది. అయితే, గవర్నర్ ఆహ్వానంతో సైద్ధాంతిక విభేదాలున్న కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టేందుకు సేన సిద్ధమయింది. అయితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భాగస్వామ్య పక్షాలతో సాధారణంగా తలెత్తే విభేదాల కారణంగా తమ ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వలలో పడే అవకాశముందని కర్ణాటక అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని కాంగ్రెస్ భయపడుతోంది. సంకీర్ణంలో భాగస్వామి అవుతుందా? లేక బయటి నుంచి మద్దతిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను ఎక్కడ బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందోననే భయంతో శివసేన కూడా క్యాంపు నడుపుతున్న విషయం తెలిసిందే. శివసేన తన ప్రయత్నాల్లో ఉందా? బీజేపీ మద్దతు లేకుండానే శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావడం ఆసక్తి కరంగా మారింది. కొన్ని రోజులుగా శివసేన నేత సంజయ్ రౌత్ ‘త్వరలోనే మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందంటూ’ మాట్లాడటం వెనుక అంతరార్థం ఇదా అని విశ్లేషకులు విస్తుపోతున్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ వారం రోజుల్లో మూడు సార్లు పవార్ ఇంట్లో భేటీ కావడం అంతర్గతంగా ఏదో ఒప్పందం జరిగి ఉండొచ్చని అనే ఊహాగానాలకు తావిస్తోంది. దీంతోపాటు, సోమవారం శివసేన సంజయ్ రౌత్ సోనియా గాంధీతో భేటీ అయేందుకు డిల్లీ వెళుతున్నట్లు సమాచారం.