visakha patnam
-
మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత
సాక్షి, తాడేపల్లి: విశాఖ ఫిషింగ్ హార్బర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారత చాటుకున్నారు. వారికి కనీవినీ ఎరుగని రీతిలో సహాయం ప్రకటించారు సీఎం జగన్. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదస్తలికి మంత్రి అప్పలరాజు, జిల్లా కలెక్టర్‌ను పంపి మత్స్యకారులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ‘ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ. వారి జీవితాను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా సాయం ఉండాలి. బోట్లకు బీమా లేదనో.. మరో సాంకేతిక కారణాలను చూపి మత్స్యకారుల జీవితాలను గాలికి వదిలేయడం సరికాదు. కష్టకాలంలో ఉన్న మత్స్యకారులకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సురెన్స్ చేయించుకునేలా అధికారులు తగిన తోడ్పాటు అందించాలి. జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలను వెలికితీయాలి.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్ ఎక్కడ? -
టెక్ హబ్‌ల జాబితాలో ఏపీ నుంచి మూడు - అవేవో తెలుసా?
Nasscom-Deloitte Report: ఆధునిక ప్రపంచంలో భారతదేశం అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రాలు కూడా ఇదే దిశలో పయనిస్తున్నాయి. దేశంలో 26 డెవెలప్ అవుతున్న టైర్-2 నగరాలు టెక్నాలజీ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయని డెలాయిట్ ఇండియా వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు.. అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖర్చులు 25 నుంచి 30 శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రెంటల్స్‌లో 50 శాతం ఖర్చు ఆదా అవుతుంది. మన రాష్ట్రంలో టెక్ హబ్‌లుగా అవతరిస్తున్న నగరాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలోని టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11 నుంచి 15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు 60 శాతం మంది చిన్న పట్టణాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? దేశంలోని మొత్తం స్టార్టప్‌లలో 39 శాతం (7,000 కంటే ఎక్కువ) డీప్ టెక్ నుంచి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM) వరకు పరిశ్రమలు విస్తరించి ఉన్న ఈ అభివృద్ధి చెందుతున్న టైర్-2 నగరాల్లో పనిచేస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించి పెద్ద నగరాలు గతంలో ఫోకస్లో ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా చెప్పుకో తగ్గ స్థాయిలో వికేంద్రీకరణ జరిగింది. 2014 - 2018 మధ్య కాలంలో కంపెనీలు గణనీయంగా ఎదిగాయి. 2025 నాటికి ఇవి 2.2 రెట్లు వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు కూడా ప్రస్తుతం పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాల్లోని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో మనదేశంలో మరిన్ని కొత్త నగరాలు టెక్ హబ్‌లుగా మారతాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. -
చల్లని కబురు.. రేపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: కొన్నాళ్లుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకనున్నాయి. సాధారణంగా ఏటా జూన్ ఒకటో తేదీకి ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తుగా అంచనా వేసింది. అయితే ఆ అంచనాలు కూడా తప్పాయి. ఈనెల ఏడు, లేదా ఎనిమిది తేదీల్లో కేరళలోకి ప్రవేశించవచ్చని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులేర్పడ్డాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు కొనసాగుతున్నాయి. పశ్చిమ గాలుల లోతులో పెరుగుదల, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ తీర ప్రాంతాలపై మేఘావృతం ఉధృతం వంటి పరిణా మాలున్నాయి. దీంతో శుక్రవారం నాటికల్లా నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ బుధవారం వెల్లడించింది. అనంతరం ఈ రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతాయని తెలిపింది. అలాగే అరేబియా సముద్రం, మొత్తం లక్షద్వీప్, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలు, నైరుతి, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని వివరించింది. మరో మూడు రోజులు వడగాలులే ఇటు రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం రాష్ట్రంలో భగభగలతో జనం విలవిల్లాడారు. కరీంనగర్ జిల్లా తంగులలో 45.8 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మేడారంలో 45.5 డిగ్రీలు నమోదైంది. కాగా, రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. మరికొన్నిచోట్ల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
‘వ్యక్తిగత విభేదాలు లేవు.. అక్రమాలను మాత్రమే ప్రశ్నిస్తున్నా’
సాక్షి, విశాఖ: తనకు రామోజీరావుతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం ఆయన చేసిన అక్రమాలని మాత్రమే ప్రశ్నిస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. చట్టాలు, నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, అందుకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు ఉండవల్లి. ‘రామోజీరావు సంస్థల చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది - రామోజీరావుకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు. మార్గదర్శి చిట్‌ఫండ్ డబ్బును మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో పెట్టారు. ఇదే విషయం ప్రశ్నిస్తే నాపై పరువునష్టం దావా వేశారు. రామోజీరావుకు చట్టం, నిబంధనలు వర్తించవా? రామోజీ కేసులో వాస్తవాలు వెలుగుచూడాలన్నదే నా ఆకాంక్ష. రామోజీకి వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని పార్టీలు మద్ధతు పలుకుతున్నాయి. ప్రజల నుండి మద్ధతు ఉండబట్టే నా పోరాటం కొనసాగుతోంది. దేశంలోని ఆర్థిక నేరాలకు ఇకనైనా ఫుల్స్టాప్ పడాలి. రామోజీరావు అయినా రూల్స్ పాటించాల్సిందే. చట్టాలు అందరికీ వర్తించాలన్నదే మా డిమాండ్ - చట్టాలకు లోబడే మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందా? ఈ అంశాన్ని ప్రశ్నించినందుకే ఉండవల్లిని ఈనాడు బ్యాన్ చేసింది. ఈ పోరాటంలో ఉండవల్లికి అన్ని వర్గాల మద్ధతు ఉంది. 17 ఏళ్లుగా ఉండవల్లి చేస్తున్న పోరాటం చాలా గొప్ప విషయం. తప్పులను ఎత్తిచూపాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఉండవల్లి పోరాటం వల్లే రామోజీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చట్టంలోని లోపాలను అడ్డుపెట్టుకుని తప్పించుకోవడం రామోజీరావుకు వెన్నతో పెట్టిన విద్య. నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి వ్యవహరిస్తోంది. డిపాజిటర్లకు ఇవ్వాల్సిన డబ్బు తన దగ్గరే పెట్టుకుంది. డిపాజిటర్లకు డబ్బు చెల్లిస్తే ఆ వివరాలను వెల్లడించవచ్చు కదా. చెల్లించాల్సిన డబ్బు మార్గదర్శి దగ్గర ఉందా?. అక్రమాలను నిరోధించేందుకే చర్యలు చేపట్టింది. వ్యవస్థలోని లోపాలను పత్రికలు ఎత్తిచూపాలి. ప్రభుత్వంలోని తప్పులను పత్రికలు చెప్పాలి. ఒక వ్యక్తి వ్యవస్థగా మారితే మార్గదర్శిలాంటి పరిస్థితి వస్తుంది. వ్యక్తికి, పార్టీకి కొమ్ముకాసే విధంగా పత్రికలు వ్యవహరించకూడదు పొలిటికల్ మాఫియాతో మీడియా మాఫియా చేతులు కలిపిందిమార్గదర్శిలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. 1980 నుంచి మార్గదర్శిలో అవకతవకలు జరిగాయి. కొందరు గ్యారెంటీస్ ఇవ్వకపోవడం వల్ల చిట్ పాడుకున్న తర్వాత కూడా డబ్బు ఇచ్చేవారు కాదు. మార్గదర్శిలో అవకతవకల పై ప్రశ్నించేందుకు సీఐడీ వెళ్లినప్పుడు మంచం పై ఉన్నా సహకరించాననే చెప్పుకునేందుకే రామోజీ యత్నం. చంద్రబాబు లేకుండా రామోజీ లేరు.. రామోజీ లేకుండా చంద్రబాబు లేరు’ అని ఉండవల్లి తెలిపారు. -
రేపటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యే ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ. పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లతో పాటు వారి తర్వాత స్థాయిలో పనిచేసే గృహసారథుల నియామకం తర్వాత మొట్టమొదటి సారిగా ఒక భారీ పార్టీ కార్యక్రమంతో ప్రజలతో మమేకమవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ నియమించిన ఈ రెండు వ్యవస్థలు (కన్వీనర్లు, గృహసారథులు) ఒక మిషన్ మోడ్‌లో బాధ్యతగా ఫోకస్డ్గా.. సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తే ఎలా ఉంటుందనే విషయంపై దృష్టిసారించింది. పార్టీ పరంగా పనిచేసే వారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి.. వాటిని తీర్చే బాధ్యతగల కార్యకర్తలున్న రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుందన్నది నిరూపించాలనేది తమ ప్రయత్నం. అలాగే, ప్రభుత్వం పనితీరుపై పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ .. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండా మార్చుకోవాలనుకునే సమర్ధమంతమైన పార్టీ అధ్యక్షుడుని కలిగి ఉన్నది ‘వైఎస్ఆర్సీపీ’ అని మనందరం గర్వంగా చెప్పుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్లు వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి..? పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’... ఈనెల 7 నుంచి 20 వ తేదీ వరకు ‘జగన న్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 7 లక్షల మందిదాకా ప్రధాన కిందిస్థాయి కార్యకర్తలు మా పదాధిదళంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సచివాలయ వాలంటీర్లు స్థానికంగా ఎంత ఏరియా కవర్ చేస్తారో.. అంతే పరిధిలో గృహసారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. వాళ్లమీద సచివాలయ కన్వీనర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జేసీయస్ మండల ఇన్ ఛార్జులు సైతం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వాములవుతారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదంతో... ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. ఈ నినాదమనేది మాకు మేముగా అనుకున్నది కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకొచ్చాక ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే లక్షణం రాజకీయ పార్టీలకు ఉండాలని, అలాగే ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించాలని, ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. రియల్ ఛేంజ్... ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తెస్తూ, బాధ్యతగా సేవలందించడంలో అందరికంటే మేము ముందున్నాం. పార్టీ అజెండా రూపకల్పన దగ్గర్నుంచి, మా పార్టీ విధానాలు.. సంక్షేమ పథకాలు అమలు తీరు.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న క్రమాన్ని అందరూ గుర్తించారు. ఈ విషయాన్ని మా పార్టీ జనంలోకి వెళ్లినప్పుడు, గడపగడపకు మా ప్రభుత్వం కార్యక్రమం పేరిట మేము ఇంటింటికీ తిరిగినప్పుడు.. సచివాలయాల ద్వారా వాలంటీర్లు క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తున్న సర్వేల ద్వారా పరిశీలిస్తే.. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు సమాజంలో ఒక రియల్ ఛేంజ్ (గుణాత్మకమైన మార్పు) కనిపిస్తుందని నిరూపితమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో.. దాన్ని ఒకటికి రెండింతలు నిలబెట్టుకున్నారని .. అందుకనే జగన్మోహన్రెడ్డినిమేమంతా నమ్ముతున్నామని ఈరోజు ప్రజలు చెబుతున్నారు. మా భవిష్యత్తు జగన్మోహన్రెడ్డిలో కనిపిస్తోందని బలంగా ప్రజల మాటల్లో వినిపిస్తోంది. ఇవన్నీ చూశాక.. ప్రజల నుంచి వచ్చిన ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదంగా తీసుకుని, దీన్నే కార్యక్రమం పేరుగా ఎందుకు చేయకూడదని అనుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసి... 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1కోటి 60 లక్షల కుటుంబాలను జగన్మోహన్రెడ్డి గారి ప్రతినిధులుగా నియమించిబడిన గృహసారథులు, సచివాలయ కన్వీనర్లుతో పాటు మిగతా అన్ని స్థాయిల్లో నేతలు కలుస్తారు. గత ప్రభుత్వాలకు-ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. అర్హులైన కుటుంబాలను నూటికి నూరుశాతం సంక్షేమ పథకాల అమలులోకి తీసుకువచ్చి.. వాళ్లందర్నీ కూడా సొంతకాళ్లమీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే, సర్వే ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాల్ని సమాధానాల రూపంలో ఇస్తారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సగటున 87శాతం ప్రజలు మా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తిస్థాయి విశ్వసనీయత కనబరుస్తారనే నినాదం ఈ కార్యక్రమం ద్వారా వినబోతున్నామని వైఎస్ఆర్సీపీ తరఫున బలంగా నమ్ముతున్నాం. దీని తరువాత ఒక ప్రత్యేకమైన ‘పీపుల్స్ సర్వే’ నిర్వహించనుంది.. ఈ సర్వేలో ప్రతి ఇంటికి తిరిగి వారి పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగన్‌పై నమ్మకం ఉందా? అని అడిగి తెలుసుకుంటారు. ఇది ‘ప్రజా మద్దతు పుస్తకం’ లేదా ‘5 పాయింట్ల ప్రశ్నాపత్రం’ ద్వారా నిర్వహించనున్నారు. ప్రతిపక్షాల పేరుతో వికృతచేష్టలకు ఒడిగట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ రథానికి అడ్డంపడే ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్న దుష్టశక్తులకు మా పార్టీ కార్యక్రమం తగిన గుణపాఠం చెబుతుంది. - వైఎస్సార్సీపీ విశాఖ ఐటీ విభాగం -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌తో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కీలకమని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ 'గ్యారెత్ ఓవెన్' అన్నారు. విశాఖలో ఈ సమ్మిట్ జరగడం చాలా మంచి పరిణామమని తెలిపారు. తీరప్రాంతం ఎప్పుడూ పెట్టుబడులకు అనుకూల ప్రదేశమని సాక్షి ప్రతినిధులతో అన్నారు. మీ వైజాగ్ పర్యటనకు కారణాలు... తెలుగు రాష్ట్రాలలో బ్రిటిష్ ప్రతినిధిగా ఇక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో రెండు సార్లు విజయవాడలో పర్యటించాను. దీనిలో భాగంగా తొలిసారి వైజాగ్ వచ్చాను. ఇక్కడ ఉన్న మౌళిక వసతులు, వ్యాపార అవకాశాలను పరిశీలించడానికి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి బ్రిటన్ ఎలాంటి వ్యాపారాలు చేయవచ్చో అధ్యయనం చేసేందుకు వచ్చాను. వైజాగ్ ఎలా అనిపించింది... ఇక్కడ మీకు నచ్చిన అంశాలు ఏంటి? విశాఖపట్టణం అద్భుతమైన నగరం. ఇక్కడి తీరప్రాంతం ఎంతో నచ్చింది. ఇక్కడి వాతావరణం, ప్రజలు నాకు చాలా నచ్చారు. ఒక్కసారే వచ్చినప్పటికీ ఎప్పటి నుంచో ఇక్కడే నివాసం ఉంటున్నట్లు అనిపించింది. వ్యాపార పరంగా ఎంతో అవకాశాలు ఉన్న నగరం విశాఖపట్టణం. చాలా మంది ఇక్కడి వ్యాపారస్థులు బ్రిటన్‌తో వ్యాపార సంబంధాలు పెంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పారిశ్రామికంగా, ఐటి హబ్‌గా విశాఖపట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. విశాఖ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయా? అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయి. మారిటైం బోర్డ్‌తో చాలా విషయాలపై చర్చించాను. తీరప్రాంత అభివృద్ధికి వారు చాలా ప్రణాళికలు సిద్ధం చేశారు. విశాఖపట్నంలో త్వరలో ప్రారంభమయ్యే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వేదికను ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ సమ్మిట్‌కు సంబంధించి మీ దృష్టి ప్రధానంగా ఏయే రంగాలపై ఉండబోతోంది? మొదట మేము ప్రధానంగా తీరప్రాంత వ్యాపార అభివృద్ధిపై ఎక్కువ ఆసక్తిగా ఉన్నాము. తీర ప్రాంతంలో వ్యాపారం చేసేందుకు కంపెనీలు ఉత్సాహంగా ఉంటాయి. రెండవ ప్రధాన అంశం... నైపుణ్యం ఉన్న మానవవనరులు వ్యాపార రంగానికి ఎంతో ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో టాలెంట్ ఉంది. నేను విశాఖపట్నంలో మెడ్‌టెక్ జోన్‌కు వెళ్లాను... అక్కడ నైపుణ్య అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నారు. చాలామంది విశాఖకు చెందినవారే మెడ్‌టెక్ జోన్‌ను నడిపిస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ టాలెంట్ అంతా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండి ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేసి ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారు చేయగలరు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగిన మీరు విశాఖ నగరాన్ని ఎలా చూస్తారు. అందరు అంటున్నట్టు వైజాగ్ ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగే అవకాశముందా? అభివృద్ధికి కావాల్సిన అన్ని హంగులు, అర్హతలు విశాఖపట్టణానికి ఉన్నాయి. తీరప్రాంతంలో ఉండటం విశాఖకు ఎంతో ప్లస్ పాయింట్. సహజమైన మౌళిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన మానవవనరులు విశాఖ అభివృద్దికి కీలకం కాబోతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది విశాఖపట్నంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అద్భుతమైన అవకాశం. ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ విదేశీ పెట్టుబడులకు సిద్ధంగా ఉందనే విషయం అందరికి తెలుస్తుంది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా విశాఖపట్టణానికి మేలు జరగనుంది గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణం వ్యాపార రంగంలో చర్చకు కేంద్రబిందువుగా ఉంటాయి. పెట్టుబడుల పరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ సమ్మిట్ ద్వారా గుర్తింపు వస్తుంది. ఇన్వెస్టర్ సమ్మిట్‌లో కార్పోరేట్ సంస్థలు ప్రభుత్వం మధ్య జరిగే చర్చల ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయి. విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలపై సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఉంది. నా వైజాగ్ పర్యటనలో పెట్టుబడి అవకాశాలపై మారిటైమ్ సంస్థ ఇచ్చిన ప్రెజంటేషన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. మారిటైమ్ బోర్డ్ ద్వారా సముద్రతీరంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయి. దేశ, విదేశీ వ్యాపార సంస్థలు ఆంధ్రప్రదేశ్ గురించి మరింత ఎక్కువగా తెలుసుకోడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. తీర ప్రాంతం ఏవిధంగా వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది చారిత్రకంగా చూస్తే సముద్రతీర ప్రాంతం వ్యాపారానికి ఎంతో అనువైనది. భారతదేశం ఎన్నో దేశాలకు వ్యాపార పరంగా గేట్‌వే ఉంది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలాంటి దేశాలతో వ్యాపారానికి భారత తీరప్రాంతమే ముఖద్వారం. పరిశ్రమలు ఉత్పత్తులను వెంటనే విదేశాలకు కంటైనర్లలో పంపించడానికి వీలుగా తీరప్రాంతాలలోనే తమ ప్లాంట్ల పెడుతున్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు... ఆయనతో ఏ అంశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతో దార్శనికత ఉన్న నాయకులు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో ఎంతో ఫలప్రదమైన సంభాషణ జరిగింది. పాలనలో ఆయన తన ప్రాధాన్యతలైన విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల గురించి ఎంతో సుదీర్ఘంగా చర్చించారు. ఇతర మంత్రులతో జరిగిన చర్చలు కూడా ఎంతో సంతృప్తినిచ్చాయి. గతంలో చాలామంది ఆర్బీకేలను సందర్శించమని నాకు సూచించారు. కేవలం పదినిమిషాల పాటు చూద్దామని రైతుభరోసా కేంద్రానికి వెళ్లిన నేను అక్కడ దాదాపు మూడు గంటలు గడిపాను. ఆర్బీకేలు రైతులకు ఎంతో ఉపయోగకరమైనవి. రాష్ట్రప్రభుత్వం రైతులకు మద్దతుగా చేస్తున్న ప్రయత్నాలు చూసి నేను అబ్బురపడ్డాను. విద్యా, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేపట్టిన మార్పులపై మీ అభిప్రాయం.... అద్భుతం... విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి పరిచేందుకు ఏపీ ప్రబుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో గొప్పవి. ఏపీలో పెద్ద ఎత్తున ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మించాలనే ముఖ్యమంత్రి ఆలోచన ఎంతో మంచిది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏ రంగాలకు ప్రాధాన్యం పెరగనుంది ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ప్రతినిధులు వ్యాపార అవకాశాలతో పాటు ఏపీలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెడతారు. ఆంద్రప్రదేశ్ తీరప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు మీకు నచ్చాయా... ఇక్కడి ఆహరం, అలవాట్లు ఎలా ఉన్నాయి? దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నరెండు తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ ప్రతినిథిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడి వాతావారణం అద్భుతం. భోజనం కొంత స్పైసీగా ఉన్నా... పరవాలేదు. ఒకసారి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇచ్చిన ఆతిథ్యం మరీ స్పైసీగా ఉండింది. ఇక ఇక్కడి ప్రజలు అద్భుతమైన వారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రిటిష్ సంస్థల పెట్టుబడులు వచ్చేవిధంగా నా ప్రయత్నాలు చేస్తాను. రెండు ప్రాంతాల మధ్య మరింత బలమైన సామాజిక, ఆర్ధిక సంబంధాలకు నా శాయశక్తులా కృషి చేస్తా. -
AP: గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు: సీఎస్
అమరావతి: మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళశాల మైదానంలో జరగనున్నగ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్(ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు)కు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు సీఎస్ సమావేశ మందిరంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు సంబంధించిన 3వ వర్కింగ్ కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో రానున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈసందర్భంగా సీఎస్ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 3, 4తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్దఎత్తున్న విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈసదస్సులో పాల్గొనే పలువురు కేంద్ర,రాష్ట్ర మంత్రులు,వివిధ జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు,ఇతర డెలిగేట్లు,తదితరులు అందరికీ ఆహ్వాన పత్రాలు అందించండంతో పాటు వారికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తగిన రవాణా, వసతి వంటి అన్నిఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. రెండు రోజులపాటు జరగనున్నఈగ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుల్లో వివిధ సెక్టార్లపై పెద్ద ఎత్తున చర్చ జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఏరో స్పేష్ అండ్ డిఫెన్సు,అగ్రి అండ్ పుడ్ ప్రాసెసింగ్,ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు,హెల్తు కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్,ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రోకెమికల్స్,రెన్యువల్ ఎనర్జీ,ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్,టెక్స్టైల్స్ అండ్ అపారెల్స్, టూరిజం,స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్,ఎలక్ట్రానిక్స్,స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఐటి అండ్ జిసిసి వంటి రంగాలపై పెద్దఎత్తున చర్చ జరగనుందని సీఎస్ పేర్కొన్నారు. ప్రతి రంగంలోను చర్చకు సంబంధించి ఇతర ప్రతినిధులతోపాటు ఇద్దరు అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనే చూడాలని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు సంబంధించి ఈనెల 14వతేదీన బెంగుళూర్ లోను,17న చెన్నెలోను,20న ముంబై లోను,24న హైదరాబాదులోను డొమెస్టిక్ రోడ్డు షోలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి తెలిపారు.ఈసదస్సుకు వచ్చే ఆహ్వానితులందరికీ త్వరితగతిన ఆహ్వాన పత్రికలు అందించే ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు సదస్సులో పాల్గొన్నఆహ్వానితులుకు జ్ణాపికలు అందించేందుకు వీలుగా జ్ణాపికల ఎంపికను కూడా త్వరగా పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇంకా ఈసమావేశంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు విజయవంతానికి సంబంధించి పలు అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులతో సమీంచారు. ఈసమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్,ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరిష్ కుమార్ గుప్త, చేనేత జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఐటిశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్,పరిశ్రమలు శాఖ అధికారులు,సిఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.అలాగే వీడియో లీంక్ ద్వారా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ భార్గవ,వై.శ్రీలక్ష్మి,కె.విజయానంద్, ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, విశాఖపట్నం పోలీస్ కమీషనర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం..రోజుకు రెండున్నర టన్నుల రీసైక్లింగ్
మధురవాడ (భీమిలి): నగరంలోని మధురవాడ జోన్–2 పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డులో రోటరీ ఫౌండేషన్, రోటరీ క్లబ్‌లు, ఎన్జీవోలు, పలు సంస్థలు సహాయ సహకారాలతో ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ ప్రాజెక్టును ఆదివారం సాయంత్రం రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్. స్టీఫెన్ ఉర్షిక్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. దీనికి రోటరీ ఫౌండేషన్, ఆమెరికాలోని నేపర్ విల్లే, సన్‌రైజ్, అరోరా, డారియన్, బ్రాడ్లీబోర్బోనైస్, ఓక్ పార్క్ రివర్ ఫారెస్ట్, సోనోమా వ్యాలీ రోటరీ క్లబ్ సహకారం, భారతీ తీర్థ, నార్త్ సౌత్ ఫౌండేషన్ వంటి ప్రభుత్వేతర సంస్థలు, అరబిందో ఫార్మా ఫౌండేషన్, విహాన్ కియా వంటి సంస్థలు తమ సీఎస్ఆర్ నిధులు సమకూర్చాయి. ఈ ప్రాజెక్టు ఇండియా యూత్ ఫర్ సొసైటీ (ఐవైఎఫ్ఎస్) వంటి పర్యావరణ పరిరక్షణ రంగంలో చురుగ్గా పనిచేస్తున్న ఎన్జీవో ద్వారా అమలు చేయనున్నట్టు నిర్వాహకులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను సేకరించి రోజుకు రెండున్నర టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఒక కిలోకి 60–70 బాటిల్స్ ఉంటాయన్నారు. ఈ వ్యర్థాలతో టూత్ బ్రష్‌లు, దువ్వెనలు, ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు అరెకరం విస్తీర్ణంలో ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసి తాజాగా మొయినాబాద్ సహకారంతో ప్రారంభించినట్టు తెలిపారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థ రహిత విశాఖగా మారే అవకాశం ఉందన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్. స్టీఫెన్ ఉర్షిక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ రోటరీ 7 ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు అమెరికా, ఇండియాలతో రోటరీ ప్రతినిధులు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ విజయవంతమైతే ప్రపంచంలో మరిన్ని చోట్ల ఆయా రోటరీ క్లబ్‌లతో కలసి అమలుకు కృషి చేస్తామని చెప్పారు. పూర్వ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ మెహతా మాట్లాడుతూ రోటరీ గ్లోబల్ గ్రాంట్‌తో ఇండియా,అమెరికా క్లబ్ కలిసి పనిచేశాయన్నారు. తద్వారా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినా బాద్ ప్రెసిడెంట్ పతాంజలి రామ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఇక్కడ బాటిల్ రీసైక్లింగ్ చేస్తుందని, భవిష్యత్‌లో మరిన్ని నిధులు వెచ్చించి వేరే రకాల ప్లాస్టిక్ కూడా రీసైక్లింగ్ చేసేవిధంగా రూపకల్పన చేస్తామన్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ రఘనాథన్ కన్నన్ మాట్లాడుతూ వేరే ప్రాంతాల్లో కూడా అమలు చేసే విదంగా ఈ ప్రాజెక్టులు డిజైన్, ప్లానింగ్ చేశామన్నారు. అలాగే యువత కూడా పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వినియోగించిన అనంతరం సక్రమంగా డస్ట్‌బిన్స్‌లో వేయాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ నీరజ్ జెల్లి, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సునీల్ వడ్లమాని, సర్వీస్ ప్రాజెక్టు చైర్మన్ ఉదయ్ పిలానీ, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ అంజు బ్రిజేష్, రోటరీ క్లబ్ అమెరికా ప్రతినిధి శ్రీ నమశ్శివాయం, రోటరీ క్లబ్ వైజాగ్ ఎలైట్ ప్రతినిధి రవీంధ్ర నాథ్ డొక్కా తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ కోస్తా వైపు వాయుగుండం!
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అది అదే దిశలో 3 రోజులు ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 20 నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 21, 22 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. -
విశాఖలో ఐటీ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నంలో వచ్చే ఏడాది జనవరిలో ఐటీ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఐటీ అసోసియేషన్ (ఐటాప్), ఏపీఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏపీఐఎస్, ఎస్టీపీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ వైజాగ్–2023 ఐటీ సమ్మిట్ పోస్టర్, వెబ్‌సైట్‌ని మంత్రి అమర్నాథ్ శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు. జనవరి 20, 21 తేదీల్లో స్థానిక మారియట్ హోటల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తొలి రోజున ఎస్టీపీఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, స్టార్టప్‌లతో పాటు ఐటీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, రెండో రోజున బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం)తో పాటు ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, ఐటీ రంగ నిపుణులు చర్చిస్తారని వివరించారు. ఐటాప్ అధ్యక్షుడు శ్రీధర్ కొసరాజు పాల్గొన్నారు. -
మహాదీపారాధనతో ప్రకాశించిన సాగరతీరం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): విశాఖ సాగరతీరం దీపకాంతులతో ప్రకాశించింది. ఆర్కేబీచ్ భక్తులతో కిటకిటలాడింది. సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో మహాదీపోత్సవం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం మూడుగంటలకు శోభయాత్రతో బయలుదేరిన శ్రీవేంకటేశ్వరస్వామి సాయంత్రానికి ఆర్కేబీచ్ ప్రధానవేదిక వద్దకు చేరుకున్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రమిదలు, ఒత్తులు, మండపాలు, తులసి మొక్కలను టీటీడీ సమాకుర్చింది. డాక్టర్ పి.వి.ఎస్.ఎన్.మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు శ్రీఫణియాజులు బృందం వేదస్వస్తి వినిపించింది. అనంతరం డాక్టర్ మారుతి దీపప్రాశస్త్యాన్ని వివరించారు. టీటీడీ ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన చేశారు. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం శ్రీమహాలక్ష్మి పూజ చేశారు. భక్తులతో తొమ్మిదిసార్లు దీపమంత్రం పలికిస్తూ సామూహిక లక్ష్మీనీరాజనం సమర్పించారు. భక్తుల గోవిందనామ స్మరణతో విశాఖ సాగరతీరం మారుమోగింది. ఈ సందర్భంగా బాలకొండలరావు నేతృత్యంలో బృందం ప్రదర్శించిన దీపలక్ష్మీనమోస్తుతే నృత్యరూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. చివరిగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు కీర్తిస్తుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. టీటీడీ హిందూధర్మ ప్రచారం అద్భుతం ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మాట్లాడుతూ టీటీడీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూధర్మ ప్రచారం చేస్తోందని అభినందించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంతోపాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇటీవల శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో జమ్ములో శ్రీవారి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తామని చెప్పారు. స్వామికి వివిధ బ్యాంకుల్లో ఉన్న 15,938 కోట్ల నగదు, 10,258 కిలోల బంగారం డిపాజిట్లకు సంబంధించిన ఇటీవల శ్వేతపత్రం విడుదల చేశామని ఆయన గుర్తుచేశారు. టీటీడీ జేఈవో సదా భార్గవి, మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవేణుగోపాల దీక్షితులు, శ్రీశేషాచల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. -
South Coast Railway Zone: కలల జోన్‌కు సొంతగూడు
సాక్షి, విశాఖపట్నం: కలల జోన్ పనులు ప్రారంభమయ్యేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ పనులకు త్వరలో టెండర్లు పిలిచేందుకు రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. ప్రస్తుత డీఆర్ఎం కార్యాలయానికి, రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న వైర్లెస్ కాలనీలో రూ.106 కోట్ల వ్యయంతో ప్రధాన కార్యాలయం నిర్మించనున్నారు. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక నిర్మాణంగా ఈ కార్యాలయం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే తయారు చేసిన డిజైన్లకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పనులు ప్రారంభించిన 36 నెలల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని బోర్డు నిర్ణయిస్తే.. డీఆర్ఎం కార్యాలయం నుంచి తాత్కాలికంగా జోనల్ మేనేజర్ బాధ్యతలు నిర్వర్తించేలా కూడా సన్నాహాలు చేస్తున్నారు. టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్స్ భవన నిర్మాణానికి ఈ నెలాఖరులోగా వర్చువల్‌గా ప్రధాని మోదీ చేతుల మీదుగానే శంకుస్థాపన నిర్వహించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. శంకుస్థాపన జరిగిన వెంటనే టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైర్లెస్ కాలనీలో ఉన్న 13 ఎకరాల్లో 8 ఎకరాల విస్తీర్ణంలో హెడ్‌క్వార్టర్స్ రానుంది. రూ.106 కోట్ల వ్యయంతో జోన్ ప్రధాన కార్యాలయానికి టెండర్లు పిలవనున్నారు. మొత్తం ఏడు ఫ్లోర్లలో హెడ్‌క్వార్టర్స్ బిల్డింగ్ ఉండనుంది. ప్రతి భవనానికి 2 యాక్సెస్ పాయింట్స్, రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బీటీరోడ్స్ కోసం రూ.2.64 కోట్లు, సీసీ రోడ్లకు రూ.1.66 కోట్లు, ఫుట్‌పాత్ ఏరియాకు రూ.32 లక్షలు, పార్కింగ్ పావ్డ్ ఏరియా కోసం రూ.1.08 కోట్లు, ప్లాంటేషన్‌కు రూ.2.16కోట్లు, బిల్డ్అప్ ఏరియాకు రూ.71.64 కోట్లు, బేస్మెంట్, స్టిల్ట్‌లో పార్కింగ్ కోసం రూ.21 కోట్లు ఖర్చు చేయనున్నారు. టెండర్లు ఖరారు చేసిన తర్వాత అగ్రిమెంట్ జరిపి.. 36 నెలల్లో భవనాన్ని పూర్తి చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. తాత్కాలిక సేవలు మొదలయ్యేనా.? 2019 ఫిబ్రవరి 28న కేబినెట్ ఆమోద ముద్రవేస్తూ విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజా పరిణామాలతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను సమర్థంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనే ఆదేశాలు కూడా ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. ఒకవేళ బిల్డింగ్ నిర్మాణంతో పనిలేకుండా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్డీ, తను సమర్పించిన జోన్ డీపీఆర్‌లోనూ పొందుపరిచారు. జోనల్ కార్యాలయానికి సరిపడా నిర్మాణాలు ఉండటంతో జీఎం కార్యాలయాన్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టే అవకాశాలున్నాయి. శభాష్.. సత్పతి ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన రైలేమంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాఠీ.. వాల్తేరు స్టేషన్ పరిసరాలను చూసి ఆశ్చర్యపోయారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అతి సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఎక్కడా లేని విధంగా అతి తక్కువ సమయంలోనే వాల్తేరు డివిజన్ నుంచి అత్యధికంగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తిరిగేలా శ్రమించిన డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతిని అభినందించారు. వినూత్న విధానాలతో డివిజన్‌ను లాభాల బాటలో తీసుకెళ్తున్నారంటూ ప్రశంసించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఫిర్యాదుని, సలహాలను స్వీకరించి దానికనుగుణంగా వ్యవహరించడం నిజంగా అరుదని కితాబిచ్చారు. జోన్ హెడ్ క్వార్టర్స్, విశాఖపట్నం రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలోనూ ఇదే తరహాలో పర్యవేక్షించి అద్భుత ఫలితాలు తీసుకురావాలని డీఆర్ఎంకు రైల్వే మంత్రి స్వయంగా బాధ్యతలు అప్పగించడం విశేషం. ప్రపంచ స్థాయి భవనం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలు పెడుతున్నాం. వైర్లెస్ కాలనీలో అత్యద్భుతంగా ప్రపంచస్థాయి భవనాన్ని నిర్మించనున్నాం. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక కట్టడంగా హెడ్‌క్వార్టర్స్ ఉండాలని రైల్వే మంత్రి సూచించారు. పాత వైర్లెస్ కాలనీలోని 13 ఎకరాల్లో భూమిని జోన్ కోసం సమీకరించాం. ఇందులో తొలి దశలో 8 ఎకరాల్లో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ రానున్నాయి. కచ్చితంగా విశాఖ కేంద్రంగా రాబోతున్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ బిల్డింగ్ ప్రపంచ స్థాయి భవనంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. – అనూప్‌కుమార్ సత్పతి, వాల్తేరు డీఆర్ఎం -
అంతరిక్ష రంగంలో తెలుగు తేజం
భారత అంతరిక్ష రంగంలో నవశకం ఆరంభం కాబోతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లేందుకు ఓ ప్రైవేట్ రాకెట్ సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే..భవిష్యత్‌లో అంతరిక్ష యానం మరింత సులభతరం కానుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ నెలలోనే శ్రీహరికోట నుంచి మూడు పేలోడ్లతో కూడిన ఈ ప్రైవేట్ రాకెట్ రోదసి బాట పట్టనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో స్కైరూట్ ఏరో స్పేస్ స్టార్టప్ సంస్థ తయారు చేసిన రాకెట్ ఈ నెల 16 లేదా 18న రోదసిలోకి దూసుకుపోనుంది. రాకెట్ రూపకర్తల్లో విశాఖకు చెందిన నాగభరత్ దాకా (33) ఒకరు కాగా.. మరొకరు హైదరాబాద్‌కు చెందిన చందన్ పవన్‌కుమార్. వీరిద్దరూ స్కైరూట్ ఏరో స్పేస్ పేరిట స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. వ్యవస్థాపకులలో ఒకరిగా.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా వ్యవహరిస్తున్న నాగభరత్ విశాఖలోనే విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన విక్రమ్–ఎస్ అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతూ చరిత్ర సృష్టించబోతోంది. భీమిలిలో బీజం విశాఖ శివారు భీమిలిలోని అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (అనిట్స్) ఫౌండర్ ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన డాక్టర్ రఘురామిరెడ్డి కుమారుడు నాగభరత్. 1999 నుంచి 2001 వరకూ రుషి వ్యాలీ స్కూల్లో విద్యనభ్యసించిన ఆయన 2001 నుంచి 2005 వరకు నగరంలోని లిటిల్ ఏంజల్స్ హైస్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. అనంతరం ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూరి చేసుకొని 2012 అక్టోబర్ నుంచి 2015 మే వరకూ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఇంజినీర్ (ఎస్సీ)గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2018 ఆగస్ట్‌లో తోటి శాస్త్రవేత్త పవన్‌కుమార్ చందనతో కలిసి స్కైరూట్ ఏరో స్పేస్ అనే స్టార్టప్ సంస్థను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించారు. చిన్న చిన్న రాకెట్స్ మోడల్స్‌ను తయారు చేస్తూ వాటిపై పరిశోధనలు వేగవంతం చేశారు. రెండేళ్ల నుంచి పరిశోధనలు ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లను పంపించేందుకు ఇస్రోకు మాత్రమే అనుమతులు ఉండేవి. అయితే, రెండేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల కూడా అడుగు పెట్టేందుకు ఇస్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి నాగభరత్, పవన్‌కుమార్ కలిసి దేశ అంతరిక్షంలోకి అడుగుపెట్టే మొదటి ప్రైవేట్ రాకెట్ తమదే కావాలన్న లక్ష్యంతో పరిశోధనలు ప్రారంభించారు. అనేక సంస్థల నుంచి పోటీ ఎదురైనా.. వాణిజ్య అవసరాలు తీర్చేలా స్నేహితులిద్దరూ ముందుగా రాకెట్ తయారు చేసి రికార్డు సృష్టించారు. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడైన విక్రమ్ అంబాలాల్ సారాభాయ్కు నివాళిగా తొలి ప్రైవేట్ రాకెట్‌కు విక్రమ్–ఎస్ (శరభి) అని నామకరణం చేశారు. తొలుత ఈ ప్రైవేట్ రాకెట్‌ను ఈ నెల 15న ప్రారంభించాలని భావించగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నెల 16 లేదా 18వ తేదీన ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం చేయనున్నారు. ప్రస్తుతం చేపట్టబోయే ప్రయోగం డెమాన్‌స్ట్రేషన్ మాత్రమే. ఇందులో మూడు శాటిలైట్లను పంపిస్తున్నారు. తొలి ప్రైవేట్ రాకెట్ కావడంతో ఈ ఆపరేషన్‌కు ‘ప్రారంభ్ మిషన్’ గా నామకరణం చేశారు. విక్రమ్ పేరుతో మూడు రకాల రాకెట్లను తయారు చేస్తున్నారు. -
మూడు రాజధానులకే మా మద్దతు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకే తమ మద్దతని రాష్ట్ర నూర్‌బాషా(దూదేకుల) సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో స్వర్ణాప్యాలెస్ హోటల్లో ఆదివారం నూర్ బాషా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. నూర్‌బాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రసూల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిందేనన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో విభజనవాదం తలెత్తదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాన్ని తమ సంఘం స్వాగతిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నవరత్న పథకాలు నూర్‌బాషాలకు అందుతున్నాయని తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి షాన్ బాషా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.బాదుల్లా, ఉపాధ్యక్షుడు మదీనా, అధికార ప్రతినిధి, గాజుల బాజీ, యూత్ ప్రెసిడెంట్ శ్రీనుబాషా పాల్గొన్నారు. -
ఢిల్లీ తర్వాత విశాఖలోనే చెగ్ బ్రాంచ్
సాక్షి, విశాఖపట్నం: అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ ‘చెగ్’ విశాఖపట్నంలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ దేశంలో ఢిల్లీ తర్వాత విశాఖలోనే తమ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా 2005లో ప్రారంభమైన చెగ్ సంస్థ.. 2013లో న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ప్రవేశించింది. విద్యార్థులకు ఆన్లైన్ ట్యూటరింగ్, మెంటార్, స్కాలర్షిప్స్, ఇంటర్న్‌షిప్, అడ్వాన్స్డ్ రైటింగ్ తదితర సేవలను చెగ్ సంస్థ అందిస్తుంటుంది. అలాగే డిజిటల్, ఫిజికల్ విధానంలో పాఠ్యపుస్తకాలను అద్దెకు ఇస్తుంటుంది. ఈ సంస్థ 2021లో అమెరికాలో యూనివర్సిటీని కూడా ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. విద్యార్థులకు అవసరమైన సేవలతో పాటు ఆన్లైన్ సంపాదనకు అత్యంత విలువైన ట్రెండింగ్ మార్గాలు, కెరీర్ గైడెన్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు, దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు అవసరమైన మెటీరియల్‌ను అందించే బ్రాంచ్‌ను విశాఖలో ప్రారంభించినట్లు ‘చెగ్’ ప్రతినిధులు తెలిపారు. -
గ్రేటర్ సిటీ ప్రతిష్టను టీడీపీ మంటగలిపే ప్రయత్నం చేస్తుందా..?
విశాఖను ఏపీ పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి నగరంలో అలజడి సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందా? ఎల్లో మీడియాతో కలిసి లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ..ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందా? ఎక్కడో జరిగిన సంఘటనలను విశాఖకు ముడిపెట్టి గ్రేటర్ సిటీ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తుందా..? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో విశాఖపట్నంపై టిడిపి కుట్రలు చేస్తోందని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారు. లోకేష్, చంద్రబాబు విశాఖ వచ్చిన ప్రతి సందర్భంలోనూ నగరం మీద విషం చిమ్ముతూనే ఉంటున్నారని అనుకుంటున్నారు. * సమీప భవిష్యత్తులో విశాఖ సముద్ర తీరం మునిగిపోతుందంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయించారు. నగరం మునిగిపోతుంది కాబట్టి.. విశాఖ పరిపాలనా రాజధానిగా పనికిరాదంటూ అదే పనిగా తప్పుడు ప్రచారం చేశారు. * విశాఖ సమీపంలోని సముద్ర గర్భంలో ఖండాంతర చీలికలు వచ్చి తీరంలో సునామిలు సంభవిస్తాయంటూ కొన్ని వార్తలు సృష్టించారు. ముందు సోషల్ మీడియాలో, తర్వాత ఎల్లో మీడియాలో అచ్చేయించి వికృతానందం పొందారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర చేశారు. * ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని బూచిగా చూపించి భయపెట్టారు. విశాఖ నగరం విష వాయువులు, రసాయనాలతో కూడిన ప్రాంతమని ప్రచారం చేశారు. ప్రమాదాలు జరిగే నగరమంటూ విశాఖపట్నంపై వరుసగా ఎల్లో మీడియాలో చర్చలు పెట్టారు. * ఒక్క విశాఖ నగరంలోనే ప్రమాదాలు జరుగుతున్నట్టు, ప్రపంచంలో ఎక్కడా ఏవీ జరగనట్టుగా కలరింగ్ ఇచ్చి ప్రజలను, తద్వారా రాష్ట్రాన్ని మభ్యపెట్టడంలో ఏ రోజుకు ఆ రోజు చేయని ప్రయత్నం లేదు. * సముద్ర తీరం కోత పైన, సునామీలపైన విశాఖ నగరానికి ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చినా టిడిపి నేతలు తమ వంకర బుద్ధిని మార్చుకోలేదు. * రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదం జరిగితే దాన్ని వైఎస్సార్సీపీసీకి అంటగడుతూ విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ నేతల రౌడీయిజం పెరిగిపోయిందంటూ నారా లోకేష్ అదే పనిగా ప్రచారం చేస్తున్నాడు. ప్రజలు నమ్మకపోయినా.. చెప్పిందే చెప్పి ఎల్లో మీడియా ద్వారా కళ్లకు గంతలు కట్టే పనిలో పడ్డాడు. * టీడీపీ ప్రభుత్వం హయాంలో కేటాయించిన భూములను వైఎస్ జగన్ హయాంలో కేటాయించినట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసే పనిలో పడ్డాడు లోకేష్. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు NCC సంస్థకు భూముల్ని కేటాయించారు. దీన్ని పట్టుకొని టిడిపి నేతలు విశాఖలో భూ కుంభకోణం జరిగిపోయిందంటూ నానా రాద్దాంతం చేశారు. * సుప్రీంకోర్టు తీర్పు మేరకు రుషికొండలో నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు మాత్రం రుషికొండలో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడైతే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారో అప్పటినుంచి టీడీపీ ఏదో ఒక రూపంలో విశాఖపై తప్పుడు ప్రచారం చేస్తోందని స్థానికులంటున్నారు. నిజానికి విశాఖలో భూకబ్జాలకు పాల్పడింది, ప్రభుత్వ భూములను అక్రమంగా దోచుకుంది టిడిపి ప్రభుత్వ హయంలోనేని గుర్తు చేస్తున్నారు. హుదూద్ తుఫాన్ సమయంలో ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసి వేల ఎకరాలను టిడిపి నాయకులు దోచుకున్నారని చెబుతున్నారు. విశాఖను అభివృద్ధి చేద్దామన్న ఆలోచన రాగానే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా: జేపీ
విశాఖ: విద్యా, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభినందించారు. ఏపీలో విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్న జేపీ.. ఇది అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ సంకల్పాన్ని అభినందించాలన్నారు. విశాఖలో అందరికీ ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ... ‘విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్నా. విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్సార్ దేశానికే ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్‌ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. -
మూడు దశాబ్దాలకు పైగా సేవలు..సెలవిక.. అగ్రజా!
పదేళ్ల క్రితమే దీని పనైపోయిందన్నారు. మరమ్మతులకు వచ్చిన ప్రతిసారి స్క్రాప్ అని హేళన చేశారు. కానీ.. వయసుతో సంబంధం లేదంటూ దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది. సముద్రంలో చిక్కుకున్న సబ్ మెరైన్లలోని సైనికుల్ని కాపాడే అతి పెద్ద ప్రయోగానికి కేంద్ర బిందువుగా మారింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న అనేక జలాంతర్గాములకు దిక్సూచిగా నిలిచింది. మూడున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ సేవలందించి సలాం అంటూ నిష్క్రమించింది. సాక్షి, విశాఖపట్నం: ఐఎన్ఎస్ సింధు ధ్వజ్.. ప్రపంచంలోనే అత్యంత సాధారణ సంప్రదాయ జలాంతర్గామి. దీనిని కిలో క్లాస్ సబ్మెరైన్గా పరిగణిస్తారు. 35 ఏళ్ల క్రితం రష్యా నుంచి కొనుగోలు చేసిన దీనిని అత్యంత పటిష్టమైన సబ్మెరైన్గా భారత్ తీర్చిదిద్దింది. స్వదేశీ సోనార్, స్వదేశీ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌తో పాటు స్వదేశీ టార్పెడో ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంతో సింధు ధ్వజ్ తన సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకుంది. భారత నౌకాదళం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారు చేస్తున్న ప్రతి సబ్‌మెరైన్ డిజైన్ వెనుక.. సింధు ధ్వజ్‌ని స్ఫూర్తిగా తీసుకుంటుండటం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇన్నోవేషన్ ఫర్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రోలింగ్ ట్రోఫీని పొందిన ఏకైక జలాంతర్గామిగా చరిత్రలో నిలిచింది. మలబార్ విన్యాసాల్లో సత్తా సింధు ధ్వజ్ భారత నౌకాదళంలో చేరిన తర్వాత సాగర గర్భంలో నిర్విరామంగా శత్రు సేనల రాకను పసిగట్టేందుకు ‘స్పెషల్ ఐ’గా విధులు నిర్వర్తించింది. తరచుగా మరమ్మతులకు గురవుతుండటంతో పదేళ్ల క్రితమే డీ కమిషన్ చెయ్యాలని భావించారు. (ఉపసంహరించాలని) అయితే.. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే మలబార్ విన్యాసాల్లో భాగంగా 2015లో జరిగిన ఎడిషన్‌లో దీని అసలు బలం ప్రపంచానికి తెలిసింది. అమెరికా తన సరికొత్త లాస్ ఏంజిల్స్ క్లాస్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ యూఎస్ఎస్ సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టీ(ఎస్ఎస్ఎన్–705)తో విన్యాసాల్లో తలపడింది. ఈ విన్యాసాల్లో అప్పటికే పలుమార్లు మరమ్మతులకు గురైన సింధు ధ్వజ్ మట్టికరవడం ఖాయమనుకున్నారు. కానీ.. అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. అత్యాధునిక సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేసినంత పని చేసి.. అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. చారిత్రక విజయంలో కీలక పాత్ర మహా సముద్రాల లోతుల్లో చిక్కుకుపోయే సబ్ మెరైన్లలో సిబ్బందిని కాపాడే అతి క్లిష్టమైన పరీక్షని భారత నౌకాదళం విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగంలోనూ సింధు ధ్వజ్ ముఖ్య భూమిక పోషించింది. 2019లో బంగాళాఖాతంలో నిర్వహించిన పరీక్షల్లో ఐఎన్ఎస్ సింధు ధ్వజ్‌ను వినియోగించారు. సముద్రం అడుగున ఉన్న సింధు ధ్వజ్ వద్దకు డీప్ సబ్ మెరైన్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్వీ)ను నేవీ పంపించగా.. డీఎస్ఆర్వీని సింధు ధ్వజ్ సేఫ్‌గా సముద్ర ఉపరితలానికి తీసుకొచ్చింది. ఈ విజయంతో డీఎస్ఆర్వీ వినియోగంలో అగ్ర నౌకాదళాల సరసన ఇండియన్ నేవీ చేరింది. అనేక విజయాల్లో కీలక భూమిక పోషించిన సింధు ధ్వజ్ సబ్‌మెరైన్ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విధుల నుంచి నిష్క్రమించింది. దేశ రక్షణకు నిర్విరామంగా అందించిన సేవలకు గాను తూర్పు నౌకాదళం సింధు ధ్వజ్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. -
ఈజ్ ఆఫ్ సెల్లింగ్‌లో బీజేపీ టాప్
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో ఏపీని మొదటి స్థానంలో నిలిపితే.. దేశంలోనే ప్రముఖ కర్మాగారాలను అమ్మకానికి పెడుతూ ఈజ్ ఆఫ్ సెల్లింగ్‌లో బీజేపీ నంబర్‌వన్‌గా ఉందని రాష్ట్ర పరి శ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ టాప్ ర్యాంక్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడు తూ పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు సేకరించి ఈ ర్యాంకులని ప్రకటిస్తే.. దాన్నికూడా తప్పుపట్టి జీవీఎల్ సెల్ఫ్‌గోల్ వేసుకున్నారన్నారు. ర్యాంకు ఇచ్చిందీ మీరే, విమర్శించేదీ మీరే అని అన్నారు. పారిశ్రామికరంగంలో కీలక మార్పులు తీసుకొస్తు న్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలి పెడుతున్నామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 60 పరిశ్రమలను అమ్మించింది మీరు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రా నికి వేలకోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్న సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను మీ ప్రభుత్వం అమ్మాలని చూస్తుంటే ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. 2019 తరువాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని, బీజేపీకీ ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 175 స్థానాల్లో పోటీచేసీ మళ్లీ డిపాజిట్లు పోగొట్టుకోవాలన్న సరదా ఉంటే అందుకు సిద్ధం కావాలని అన్నారు. -
డీఎస్సీకి ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ
చోడవరం: రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత సాధించారు. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. ఈ విషయమై ఆయనను కదిలించగా.. ‘అప్పుడు నా వయసు సుమారు 30 ఏళ్లు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివాను. ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకున్నాను. 1998 డీఎస్సీ రాశాను. అర్హత సాధించినా అది పెండింగ్‌లో పడటంతో న్యాయవిద్య (బీఎల్) చదవడం ప్రారంభించాను. ఆ సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. ఈ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుచరునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, ఈ రోజు వైఎస్సార్సీపీలో సముచిత స్థానంలో ఉన్నాను. అప్పుడే ఉద్యోగం వస్తే రాజకీయాల కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చేవాడిని. సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న చొరవ వల్ల పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల స్వప్నం నెరవేరింది. ముఖ్యమంత్రికి డీఎస్సీ 1998 బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అన్నారు. -
నిర్వాహకులదే నిర్వాకం!?
కాకినాడ రూరల్: వేలాది మంది నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీసి కాకినాడలోని సర్పవరం జంక్షన్లో బోర్డు తిప్పేసిన జయలక్ష్మి సొసైటీ బాగోతం నిర్వాహకుల నిర్వాక ఫలితమేనని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక విచారణలో స్వార్థ ప్రయోజనాల కోసమే వారు సొసైటీని దివాళా తీయించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. తమ కష్టారితాన్ని ఎంతో నమ్మకంతో సొసైటీలో పొదుపు చేసుకున్న సభ్యులు ఈ మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరికి వారే యమునా తీరే రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు కలిగి సుమారు పదివేల మంది నుంచి డిపాజిట్ల రూపంలో రూ.520 కోట్లు సేకరించిన జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీలో జవాబుదారీతనం పూర్తిగా లోపించింది. ఈ కుంభకోణంపై అడిగేందుకు పాలకవర్గం అందుబాటులో లేదు. ఒకరిద్దరు సిబ్బంది ఉన్నా తమకేమీ తెలీదని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డిపాజిటర్ల సొమ్ములు తిరిగి చెల్లించడం ఇప్పట్లో అసాధ్యంగా కనిపిస్తోంది. మరోవైపు.. సుధాకర్ అనే ఉద్యోగి ఫిర్యాదుతో సొసైటీలో సహకార శాఖాధికారులు ప్రాథమిక విచారణ పూర్తిచేసి నివేదికను ఉన్నతాధికారులకు గురువారం రాత్రి అందజేశారు. తొలుత ముగ్గురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, తరువాత సహకార శాఖ కమిషనర్ ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన డిప్యూటీ రిజిస్ట్రార్ కృష్ణకాంత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జవహర్, ఏవీ లక్ష్మి, పి. ఉమాశంకర్, వెంకటేశ్వరరావుల బృందం రెండ్రోజుల పాటు విచారణ చేపట్టింది. సొసైటీలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సొసైటీ వైస్ చైర్పర్సన్ నిర్వాకం కంచే చేను మేసింది అన్నట్లుగా.. సొసైటీ వైస్ చైర్పర్సన్ హోదాలో ఉన్న ఆర్బీ విశాలక్షి తన స్వార్థ ప్రయోజనాల కోసం సొసైటీని దివాలా తీసేలా చేశారని అధికారులు అంచనాకు వచ్చారు. సుమారు రూ.64 కోట్ల వరకు ఆమె రుణాలు రూపేణా వాడుకోగా మరో రూ.140 కోట్లను బినామీల పేరిట అందించారు. ఇలా మొత్తం రూ.200 కోట్లు పక్కదారి పట్టాయి. మరో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు రుణాలిచ్చినా వాటికి సరైనా సెక్యూరిటీ లేకపోవడంతో అవి పత్తాలేకుండా పోయాయి. దీంతో సొసైటీ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. విశాఖ సంస్థే కారణం? ఇక సొసైటీ దివాలాకు విశాఖపట్నానికి చెందిన రావు అండ్ రావు చార్టెడ్ అకౌంటెంట్స్, కన్సెల్టెంట్స్ ప్రధాన కారణమని భావిస్తున్నారు. సొసైటీ ఆర్థిక పరిస్థితి దివాలా తీసేలా ఉన్నప్పుడు వీరు అడ్డుకట్ట వేయాల్సింది పోయి వైస్ చైర్‌పర్సన్‌కు సహకరించడంతో బినామీల ద్వారా డిపాజిట్లను పక్కదారి పట్టించేందుకు బీజం వేసినట్లు అధికారుల బృందం ప్రాథమిక విచారణలో తేల్చి నివేదికను డీసీఓ దుర్గాప్రసాద్‌కు అందజేసింది. ఆయన దానిని గుంటూరులోని సహకార శాఖ రిజిస్ట్రార్, కమిషనర్లకు పంపారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. జయలక్ష్మి సొసైటీలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలడంతో సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ల విచారణకు ఆదేశించాలని కోరామన్నారు. అలాగే, సీబీసీఐడీ విచారణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక సొసైటీలో క్షుణ్ణంగా విచారణ నిర్వహించేందుకు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. 30మంది డిపాజిటర్ల ఫిర్యాదులు మరోవైపు.. సర్పవరం, టూటౌన్, ఇంద్రపాలెం, పిఠాపురం తదితర పోలీసుస్టేషన్లలో డిపాజిటర్లు తమ సొమ్ము కోసం పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణను వివరణ కోరగా.. తమకు 30మంది వరకు ఫిర్యాదులు ఇచ్చారని, ఎస్పీ సూచనల మేరకు వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య
పెదగంట్యాడ(గాజువాక): భరించలేని తలనొప్పి కారణంగా ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలు.. పందిరి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. ఇతనికి కుమారుడు, కుమార్తె శ్రావణి (22) ఉన్నారు. కుమార్తె మూడేళ్లుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతోంది. ఆమె డిగ్రీ కూడా మధ్యలో ఆపేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. శనివారం యువతి తండ్రి పని మీద నగరానికి వెళ్లగా, తల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లింది. సోదరుడు మిత్రులతో కలసి బయటకు వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడికి చేరే సరికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువతి త్రండి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరణంలోనూ వీడని స్నేహబంధం..
కె.కోటపాడు (మాడుగుల) : మండలంలో మర్రివలస వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. దైవ కార్యక్రమానికి వచ్చిన వారిని బైక్ ప్రమాదరూపంలో మృత్యువు కబళించింది. వీరిలో ఒకరు కె.కోటపాడు మండలం గొట్లాం గ్రామానికి చెందిన కొట్యాడ మణికంఠ (23)కాగా, మిగతా ఇద్దరు విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం దాసులపాలెంకు చెందిన కూనిశెట్టి త్రినా«థ్(20), జామి మండలం చింతాడకు చెందిన యర్రా సాయి(18) అని పోలీసులు తెలిపారు. స్నేహితుని ఆహ్వానం మేరకు.. కె.కోటపాడు మండలం గొట్లాం గ్రామంలో శుక్రవారం జరిగిన నూకాలమ్మ ఆలయ ప్రారంభ కార్యక్రమానికి గ్రామానికి చెందిన కొట్యాడ మణికంఠ ఆహ్వానం మేరకు స్నేహితులు కూనిశెట్టి త్రినాథ్, యర్రా సాయి వచ్చారు. వీరు ముగ్గురూ ఒకే బైక్‌పై పాతవలస గ్రామానికి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వారు ప్రమాదానికి గురయ్యారు. గొట్లాం గ్రామం వస్తుండగా మర్రివలస కూడలి వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పింది. రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. రోడ్డుపక్కన పడి ఉన్న మృతదేహాల్లో మణికంఠను స్థానికులు గుర్తించారు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మణికంఠ సోదరుడు అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కె.కోటపాడు ఎస్ఐ జి.గోపాలరావు తెలిపారు. మణికంఠ బైక్ నడుపుతుండగానే ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు. గొట్లాంలో విషాదఛాయలు గొట్లాం గ్రామానికి చెందిన మృతుడు కొట్యాడ మణికంఠ తల్లిదండ్రులు రమణ, లక్ష్మమ్మలు వసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు మణికంఠ. మృతుడు విశాఖపట్నం పోర్ట్‌లో కంటైనర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడంతో అందరినీ కంట తడి పెట్టించింది. పండగ రోజున గొట్లాం గ్రామంలో విషాదం చోటు చేసుకోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కూనిశెట్టి త్రినాద్ దాసులపాలెం గ్రామంలో ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తున్నాడు, జామి మండలం చింతాడకు చెందిన యర్రా సాయి విజయనగరంలోని ఓ కళాశాలలో డిప్లొమో చదువుతున్నాడని ఎస్ఐ తెలిపారు. ముగ్గురు మృతదేçహాలకు చోడవరం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. -
‘స్వామి వారిని దర్శించుకోవడం అనుభూతి కలిగించింది’
విశాఖ: ప్రత్యేక విమానంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విశాఖ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి విశాఖ పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న బిశ్వభూషణ్‌కు ఘనస్వాగతం లభించింది.ఎయిర్పోర్ట్ నుంచి కాన్వాయ్‌లో నేరుగా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయానికి గవర్నర్ దంపతులు చేరుకున్నారు. ఈ మేరకు మాట్లాడిన ఆయన..సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం చాలా అనుభూతి కలిగించిందని పేర్కొన్నారు. పంచగ్రామాల భూ సమస్యపై చర్చించి , తన వంతు కృషి చేస్తానని గవర్నర్ తెలిపారు. అంతకుముందు సింహగిరికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ఉన్న కప్ప స్తంభం ఆలింగనం చేసుకొని , అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఏపీలో పల్సస్ విస్తరణ.. 60 వేల చ.అ. విస్తీర్ణంలో క్యాంపస్
సాక్షి, విశాఖపట్నం: హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పల్సస్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. వైజాగ్‌లోని మధురవాడ ఐటీ పార్క్‌లో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ క్యాంపస్ సిద్ధమవుతోందని పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీను బాబు సోమ వారం పేర్కొన్నారు. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత సెజ్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా వెల్లడించారు. ‘ఓమిక్స్ ఇంటర్నేషనల్, కాన్ఫరెన్స్ సిరీస్ వంటి ప్రధాన సంస్థలను స్థాపించాం. మీటింగ్స్ ఇంటర్నేషనల్, పల్సస్, అలైడ్ అకాడమీలు, యూరోసికాన్, లాంగ్డమ్, లెక్సిస్, హిలారిస్ మొదలైన బ్రాండ్లను సొంతం చేసుకున్నాం. వేలాది ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ నిర్వహిస్తున్నాం. వైద్య, ఆరోగ్య, విజ్ఞాన, ఇంజనీరింగ్ నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులకు సమాచార వేదికను ఏర్పాటు చేశాం. మూడేళ్ల క్రితం ఏర్పాటై విజయవంతంగా నడుస్తోన్న విశాఖ పల్సస్ యూనిట్లో ఒక్క 2021లోనే సుమారుగా 3,500 వెబినార్లు నిర్వహించి.. 700 జర్నల్స్ ప్రచురించాం. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ఏకైక సంస్థ పల్సస్ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. 15,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడం మా విజయం అని ప్రకటిస్తున్నాం’ అని తెలిపారు.