Women Voters
-
మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు!
సోలాపూర్: జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యతను ప్రదర్శించింది. లాడ్కీ బహీన్ పథకం ప్రయోజనాలు మహా కూటమి అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశాయి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి ప్రభుత్వానికి మహిళా ఓటర్లు భారీగా పట్టం కట్టారని స్పష్టం అవుతోంది. జిల్లాలోని ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇందులో ఐదు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ నాలుగు.. శివసేన యూబీటీకి చెందిన ఒకరు అలాగే షేకాపాకు చెందిన ఒకరు గెలుపొందారు. అక్కల్కోట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సచిన్ కల్యాణ్ శెట్టి 49 వేల 572 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామ్ మెత్రే పరాభవం చెందారు. భార్షీ నియోజకవర్గం నందు శివసేన యూబీటీకి చెందిన దిలీప్ సోపల్ 6,472 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఏక్నాథ్ శిందేకు చెందిన అభ్యర్థి రాజేంద్ర రౌత్ పరాభవం చెందారు. కరమాల నియోజకవర్గం నందు శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున నారాయణ పాటిల్ 16 వేల 85 ఓట్ల ఆధిక్యంతో విజయ ఢంకా మోగించారు. ఆయన తన ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సంజయ్ శిందేను ఓడించారు. మాడ నియోజకవర్గంలోని అభిజిత్ పాటిల్ కూడా శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున పోటీ చేసి 30 వేల 621 ఓట్ల అధిక్యంతో విజయం పొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి రంజిత్ శిందేను ఓడించారు. మోహల్ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరఫున పోటీ చేసిన రాజు కర్రే 30 వేల రెండు వందల రెండు ఓట్లతో విజయం సాధించారు. ఇచ్చట సిట్టింగ్ ఎమ్మెల్యే యశ్వంత్ మానే ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ఐపీఎల్ 2025 వేలం : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?పండరీపూర్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన సమాధాన్ అవతాడే 8 వేల 65 ఓట్ల తేడాతో ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి భగీరథ బాలికేను ఓడించారు. సోలాపూర్ సిటీ నార్త్ నియోజకవర్గం ద్వారా బీజేపీకి చెందిన విజయ్ దేశ్‌ముఖ్ 51 వేల 88 ఓట్ల మెజారీ్టతో వరుసగా ఐదవసారి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి శరద్ పవార్ ఎన్సీపీ అభ్యర్థి మహేశ్ కోటేను ఓడించారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన దేవేంద్ర కోటే 40 వేల 657 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి ఫారూక్ షాబ్దిని ఓడించారు. సాంగోల నియోజకవర్గంలో షేత్కారి కామ్‌గార్ పారీ్టకి చెందిన బాబాసాహెబ్ దేశ్‌ముఖ్ 25 వేల 386 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈయన ప్రత్యర్థి ఏక్నాథ్ శిందే శివసేనకు చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు షాహాజీ బాపు పాటిల్‌ను ఓడించారు. మాల్ శిరస్ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఉత్తం ఝాన్కర్ 137 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్సాత్ పూతేను ఓడించారు. ఆరు స్థానాల్లో బరిలోకి బీజేపీ అభ్యర్థులు.. ఐదు స్థానాల్లో గెలుపు -
USA Presidential Elections 2024: లేడీస్ అండ్ జెంటిల్మెన్!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వారం రోజుల్లో జరగనున్నాయి. పురుష ఓటర్లలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కే భారీ ఆదరణ కన్పిస్తుండగా మహిళలు మాత్రం డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ వైపే మొగ్గుతున్నారు. అగ్రరాజ్యంలోనూ రాజకీయంగా నెలకొని ఉన్న లింగ వివక్షను ఇది ప్రతిబింబిస్తోంది. ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కూడా ఈ అంశం కీలకంగా మారింది. హారిస్ తొలినుంచీ ఇలాంటి గుర్తింపు రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఎక్కడా తను మహిళను కనుక ఓటేయండని కోరలేదు. దాన్ని ప్రచారాంశంగా మలచుకునే ప్రయత్నమూ చేయలేదు. జాతి, జెండర్‌తో నిమిత్తం లేకుండా అమెరికన్లందరి శ్రేయస్సు కోసం పని చేయడానికి తానే సమర్థురాలినని నమ్ముతున్నట్టు పలు ఇంటర్వ్యూల్లో హారిస్ స్పష్టం చేశారు కూడా. అలా జెండర్‌ను తటస్థంగా ఉంచడానికి ఆమె ఎంత ప్రయత్నించినా అది ప్రధానాంశంగానే ఉంటూ వస్తోంది. ఎందుకంటే ‘మేడం ప్రెసిడెంట్’ అనేది అమెరికాకు చాలా కొత్త విషయం. ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా అత్యున్నత పీఠాన్ని అధిరోహించింది లేదు. ఈ నేపథ్యంలో హారిస్ ప్రెసిడెంట్ అవడమనే ఆలోచననే చాలామంది ఓటర్లు ఇష్టపడుతున్నారు. పలువురు అమెరికన్లు మాత్రం ఈ తరహా కొత్తదనాన్ని ఇబ్బందికరంగా భావిస్తున్నారు. బహిరంగ రహస్యమే హారిస్ తన ప్రచారంలో ఎక్కడా జెండర్ విషయాన్ని ప్రస్తావించకపోయినా లైంగికత అనేది అమెరికా సమాజంలోనే అంతర్లీనంగా దాగుందని, అధ్యక్షురాలిగా ఓ మహిళకు ఓటేయడానికి చాలామందికి ఇదో అడ్డంకిగా కనిపిస్తోందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రచార బృందం కూడా పైకి జెండర్‌తో సంబంధం లేదని చెబుతున్నా, ‘‘హారిస్ బలహీనురాలు. నిజాయితీ లేని వ్యక్తి. ప్రమాదకరమైన ఉదారవాది’’ తరహా ప్రచారంతో ఊదరగొడుతోంది. అమెరికా ప్రజలు ఆమెను తిరస్కరించడం ఖాయమంటోంది. అంతేగాక అధ్యక్ష అభ్యర్థుల్లోని ఈ లింగపరమైన తేడా తమకే లాభిస్తుందని ట్రంప్ ప్రచార బృందం సీనియర్ సలహాదారు బ్రయాన్ లాంజా బాహాటంగానే అన్నారు. ఫలితంగా ట్రంపే గెలుస్తారని తాను నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు. ‘మీటూ’ ప్రభావమెంత? సమాజంలో తన స్థానంపై మహిళల దృక్కోణంలో 2016 నుంచి పెను మార్పులొచ్చాయి. 2017లో ‘మీ టూ’ ఉద్యమం పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే వివక్షపై సమాజంలో అవగాహనను ఎంతో పెంచింది. మహిళల గురించి మాట్లాడే విధానాన్నీ మార్చింది. కానీ భిన్నత్వం, సమానత్వం, సమ్మిళితం వంటి అంశాల్లో అంతటి పెద్ద ముందడుగును జీరి్ణంచుకునే స్థితిలో అమెరికా సంప్రదాయ యువకులు లేరు. దీన్ని కేవలం తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా వారు భావిస్తున్నారు. అధ్యక్ష రేసులో లింగ అంతరం ప్రారంభమైందన్న సీబీఎస్ న్యూస్ పోల్ తాజా ఫలితాలు ఇందుకు అద్దం పట్టేవే. అమెరికాలో పురుషులు ప్రధానంగా ట్రంప్ మద్దతుదారులుగానే ఉన్నారు. హారిస్‌ను బలమైన నేతగా చూసే పురుషులు కూడా తక్కువగా ఉన్నారు. యువకులు చాలావరకు ట్రంప్, ఎలాన్ మస్క్ ‘బ్రో కల్చర్’లో నిండా మునిగి తేలుతున్నారు. ‘‘డెమొక్రాట్లు ఎంతసేపూ మహిళలు, గర్భస్రావ హక్కులు, ఎల్జీటీబీక్యూ సంస్కృతి గురించే మాట్లాడుతున్నారు. మరి మా పరిస్థితేమిటి?’’ అన్నది అమెరికా యువత నుంచి గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న. దీన్ని డెమొక్రాట్ల పాలిట డేంజర్ బెల్గా విశ్లేషకులు అభివరి్ణస్తున్నారు! ఎంతో అంతరం అమెరికా పురుషుల్లో 51 శాతం మంది ట్రంప్‌కు మద్దతిస్తుండగా హారిస్‌కు 45 శాతం మాత్రమే సానుకూలంగా ఉన్నట్టు ఇటీవలి సీఎన్ఎన్ జాతీయ ఓటర్ల సర్వే తేలి్చంది. హార్వర్డ్ యూత్ పోల్‌లో 30 ఏళ్ల లోపు మహిళల్లో హారిస్ ఏకంగా 47 శాతం ఆధిక్యంలో ఉన్నారు. అదే 30 ఏళ్లలోపు పురుషుల్లో ఆమెకు మద్దతిస్తున్నది కేవలం 17 శాతమే. దీంతో హారిస్ ప్రస్తుతం ఈ అంతరాన్ని తగ్గించే పనిలో పడ్డారు. గత వారాంతంలో స్వింగ్ స్టేట్స్‌లోని పురుషులను లక్ష్యంగా చేసుకుని కొత్త ప్రకటనలకు తెరతీశారు. ‘బీ ఏ మాన్.. ఓట్ ఫర్ ఉమన్’ వంటి నినాదాలను నమ్ముకున్నారు. హారిస్ రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్ ప్రచార కూడా పలు కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, డిజిటల్ మీడియా కంటెంట్‌తో పురుష ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ట్రంప్ మాత్రం మరిన్ని ఇంటర్వ్యూలతో పురుష ఓటర్లకు మరింత దగ్గరవుతున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ‘లేడీస్ అండ్ జంటిల్మెన్’, ‘బాయ్స్ అండ్ గాళ్స్’ డిసైడ్ చేయబోతున్నారు. ఆ లెక్కన అమెరికన్ల జీవితంలో మహిళల పాత్రపై దీన్ని రెఫరెండంగా కూడా భావించొచ్చేమో! ‘పురుష నిస్పృహ’.. ట్రంప్ ఆయుధం! అమెరికాలో యువతులతో పోలిస్తే యువకుల తీరు తీసికట్టుగానే ఉన్నట్టు గణాంకాలన్నీ చెబుతున్నాయి. కళాశాలలో యువకులు తక్కువగా చేరుతున్నారు. సమాజంతో సంబంధాలను కొనసాగించడమూ తక్కువే. ఆత్మహత్య రేటూ వారిలోనే ఎక్కువ. యువతులు బాగా చదువుకుంటున్నారు. సేవా రంగంలో రాణిస్తున్నారు. యువకులతో పోలిస్తే ఎక్కువ సంపాదిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక యువకుల కంటే యువతులే బాగా ఉదారంగా మారినట్టు గాలప్ పోలింగ్ బృందం తెలిపింది. అయితే ఇవన్నీ అమెరికా సమాజంలో లింగ విభేదాలను మరింతగా పెంచేందుకే దోహదపడుతుండటం చింతించాల్సిన విషయమే. యువత అసంతృప్తులను ట్రంప్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రచారం చివరి రోజుల్లో ఈ పురుష నిస్పృహపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ‘పురుషత్వం దాడికి గురవుతోంది’ అనే హెచ్చరికను తన సోషల్ మీడియా టూల్ ట్రూత్‌లో తిరిగి పోస్ట్ చేశారు.హిల్లరీకీ ఇదే పరిస్థితి!అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ హోరాహోరీ పోరులో హిల్లరీ ఓటమికి లింగ వివక్ష, స్త్రీల పట్ల అమెరికా సమాజంలో దాగున్న వ్యతిరేకత కూడా కారణమైంది. అప్పుడు కూడా ప్రధాన ప్రత్యరి్థ, అధ్యక్ష పోరులో అంతిమ విజేత ట్రంపే కావడం విశేషం. ఈసారి వివక్ష కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నా మరోసారి గెలుపోటములను నిర్ణయించే కీలకాంశం కావచ్చన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి!1920లో మహిళలకు ఓటు హక్కు అమెరికా మహిళలు తొలిసారిగా 1920 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వారెన్ జి.హార్డింగ్ మొదటి ప్రపంచ యుద్ధం తాలూకు అనిశ్చితి నుంచి దేశం త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఆ ‘సాధారణ స్థితి’ అంటే ఏమిటో 100 ఏళ్లు గడిచినా సగటు అమెరికన్లకు అర్థం కావడం లేదు. 2024లో కూడా అమెరికన్ అంటే ‘పురుషుడా, లేక మహిళా?’ అనే ప్రశ్న అడుగడుగునా తలెత్తుతూనే ఉంది. చారిత్రికంగా తెల్లజాతి పితృస్వామ్యంలో నిండా మునిగి తేలుతూ వస్తున్న అగ్ర రాజ్యం ఇప్పుడు తమ నాయకురాలిగా నల్లజాతీయురాలైన మహిళను నామినేట్ చేసింది. ఫలితంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. 1920తో పోల్చుకుంటే ఆర్థిక, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందినా అమెరికా మహిళలు ఇప్పటికీ తమ శరీరాలపై హక్కులు తదితరాల కోసం పోరాడాల్సే వస్తోంది. రాజకీయంగా పోటీని మరింత బలంగా ఎదుర్కోవాల్సి వస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: పేరు మరిచిన మహిళలు!
ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచిపోయిన కథ అందరికీ తెలుసు. 1951- 52లో మన దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళల విషయంలో ఇలాంటి ‘ఈగ’ తరహా కథే జరిగింది... మొదటి సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి చిత్రమైన సమస్య ఎదురైంది. చాలా రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు తమ సొంత పేర్లు నమోదు చేసుకోలేదు! బదులుగా తమ కుటుంబంలోని పురుష సభ్యులతో తమ సంబంధాన్ని బట్టి ఫలానా వారి భార్యను, ఫలానా ఆయన కూతురును అని నమోదు చేసుకున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. నాడు దేశవ్యాప్తంగా నమోదైన 8 కోట్ల మంది మహిళా ఓటర్లలో ఏకంగా 2.8 కోట్ల మంది ఇలా వైఫాఫ్, డాటరాఫ్ అని మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యభారత్, రాజస్తాన్, వింధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. దాంతో ఎన్నికల సంఘానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. అలాంటి మహిళా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సొంత పేర్లతో తిరిగి నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు. పురుష ఓటర్లతో ఉన్న సంబంధపరంగా కాకుండా విధిగా మహిళా ఓటర్ల పేరుతోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన మహిళను ఓటరుగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం బిహార్‌కు ఒక నెల ప్రత్యేక గడువిచ్చారు. ఈ పొడిగింపు బాగా ఉపయోగపడింది. ఆ గడువులో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు. రాజస్తాన్‌లో మాత్రం పొడిగింపు ఇచ్చినా అంతంత స్పందనే వచ్చింది. దాంతో అక్కడ చాలామంది మహిళా ఓటర్లను తొలగించాల్సి వచ్చింది! తొలి ఎన్నికల్లో 17.3 కోట్ల పై చిలుకు ఓటర్లలో మహిళలు దాదాపు 45 శాతమున్నారు. వారికోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 27,527 పింక్ బూత్‌లను మహిళా ఓటర్లకు రిజర్వ్ చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రేడియోలో వరుస ప్రసంగాలు, చర్చలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో మొత్తం 47.1 కోట్ల మంది మహిళలున్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ! -
బరితెగించిన టీడీపీ నేతలు
కొలిమిగుండ్ల/వీరపునాయునిపల్లె/చింతకొమ్మ దిన్నె/పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/చిల్లకూరు (తిరుపతి జిల్లా)/గంగాధర నెల్లూరు (చిత్తూరు జిల్లా): ఎన్నికల ముంగిట టీడీపీ నాయకులు బరితెగించారు. ఓడిపోవడం ఖాయమని తేలిపోవడంతో దింపుడుకళ్లెం ఆశతో ప్రలోభాలకు పాల్పడుతున్నారు. కనీసం పరువైనా దక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లకు భారీ ఎత్తున నగదు, మద్యం, బియ్యం బస్తాలను ఎరవేస్తున్నారు. మహిళా ఓటర్లకు చీరలు, ముక్కుపుడకలు, వెండి భరిణెలు పంపిణీ చేస్తూ ప్రలోభపెడుతున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పలు రకాల తాయిళాలు ఎరవేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. తద్వారా నిర్భీతిగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. 300 మందికిపైగా ముక్కుపుడకలు.. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండటంతో ఓటమి ఖాయం అని భావించిన టీడీపీ నేతలు నగదు పంచారు. అయినా ఫలితం లేకపోవడంతో కల్వటాలలో ఆదివారం మహిళా ఓటర్లకు 300 మందికిపైగా ముక్కుపుడకలను పంపిణీ చేశారు. మరికొన్ని గ్రామాల్లో చీరలు అందజేశారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యు.రాజుపాలెం, తాటిమాకులపల్లె సమీపంలోని అరటి తోటలో నాలుగు వందల చీరల బస్తాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. బస్తాలపై టీడీపీ నేతలు ఎన్.వేణుగోపాల్, ఎం.నాగరాజు పేర్లు ఉన్నాయి.వీరిద్దరూ ఓటర్లకు పంపిణీ చేసేందుకు అరటితోటలో చీరలు దాచి ఉంచారని తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కడప సమీపంలోని ఊటుకూరు వద్ద 250 బియ్యం బస్తాలతో వెళుతున్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వీటిని టీడీపీ నేత డాక్టర్ కృష్ణకిషోర్‌రెడ్డికి చెందినవిగా గుర్తించారు. ఈ బియ్యాన్ని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లి పంచాయతీ పరిధిలో ఓటర్లకు పంచేందుకు తీసుకెళుతున్నారు.ఆటోను, బియ్యం బస్తాలను విడిపించుకునేందుకు పోలీస్‌స్టేషన్ వద్ద టీడీపీ నేత కృష్ణ కిషోర్‌రెడ్డి, ఆయన అనుచరులు హల్చల్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లకు çపంపిణీ చేసే స్లిప్పులపైన టీడీపీ పథకాలను ఆ పార్టీ నేతలు ముద్రించి అందజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.1,500 విలువైన వెండి భరిణెల పంపిణీ శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఇంటింటికీ రూ.వెయ్యి నగదు, రూ.1,500 విలువైన వెండిభరిణెలు పంపిణీ చేశారు. శ్రీకాకుళంలో టీడీపీ నాయకులు ఒక్కో ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేల వరకు అందించారు. మద్యాన్ని కూడా ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు.బీజేపీ అభ్యర్థికి చుక్కెదురు తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్‌రావుకు చుక్కెదురైంది. చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లిలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రచార పర్వం ముగిశాక కూడా ఓటర్లను కలుసుకుని ఇలా ప్రలోభాలకు గురి చేయడం సబబుగా లేదని వెళ్లిపోవాలని కోరారు. దీంతో వరప్రసాద్‌రావు అక్కడ నుంచి జారుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డులను స్కాన్ చేస్తే రూ.500 తీసుకోవచ్చని ప్రలోభపెడుతున్నారు. -
డిసైడ్ చేసేది.. ఆమే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేపు జరగనున్న ఎన్నికల్లో ‘విజేత’ను మహిళలే నిర్ణయించబోతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 154 స్థానాల్లో మహిళా ఓటర్లదే పై చేయి. ఇందులో ఏకంగా 70 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా నాలుగు వేల నుంచి పది వేలకు పైగా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో విజేతల తలరాతను మహిళా ఓటర్లే డిసైడ్ చేయనున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో మహిళల నిష్పత్తి పెరుగుతూనే ఉంది.2014తో పోల్చి చూస్తే 2019లో మహిళా ఓటర్ల పోలింగ్ కూడా భారీగా పెరిగింది. అదేవిధంగా ఈ నెల 13న అసెంబ్లీకి, లోక్‌సభకు జరిగే పోలింగ్‌లో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందన్న అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తం చేసింది. పోలింగ్‌లో పాల్గొనే మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో రాష్ట్రంలో 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న యువతులు దాదాపు నాలుగు లక్షల మంది తమ ఓట్లు నమోదు చేసుకున్నారు.2019లో మాదిరిగానే ఈసారి కూడా పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్ని చోట్లా పెద్ద ఎత్తున మహిళలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాల లబ్ధిదారుల్లో కూడా మహిళలే అత్యధికంగా ఉన్నందున.. వారంతా ‘ఫ్యాన్’కు ఓటు వేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు.మహిళా కూలీల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు, గృహిణులు, యువతులు వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే వాతావరణం అన్ని నియోజకవర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో పాటు సొంతింటి కల నెరవేరిందంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ‘నవరత్నాల ద్వారా మహిళలకు ఏకంగా రూ.2,83,866.33 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగింది.ఇందులో నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1,89,519.07 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.94,347.26 కోట్లు ప్రయోజనం చేకూరింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీకి బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. అందువల్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. -
ఆ ఓటర్లే కీలకం..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు రాబట్టడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓ వైపు ఉధృతంగా ప్రచారం చేస్తూనే.. ఏయే వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశముందనే అంశంపై లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లు, అందులో పార్టీల వారీగా పోలైనవి, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. అయితే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నేపథ్యాన అతివలే కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నా యి. అలాగే, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతను ఆకట్టుకునేలా నేతలు ప్రసంగిస్తు న్నారు. ఇక పోస్టల్, హోం ఓటింగ్ వేసే వారిపైనా దృష్టి సారించి.. సాధారణ పోలింగ్ కన్నా ముందుగానే ఎక్కువగా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు పనిచేశాయి.పోస్టల్, హోం ఓటింగ్ కీలకం..రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోం ఓటింగ్ ఈనెల 3న ప్రారంభమై బుధవారం ముగు స్తుందని తొలుత ప్రకటించినా 10వతేదీ వరకు పొడి గించారు. ఇప్పటికే తమ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వేయించాలనే లక్ష్యంతో నేతలు పనిచేయగా మిగిలిన సమయంలోనూ ఎక్కువ ఓట్లు రాబట్టేలా ఉద్యోగు లను కోరేందుకు సిద్ధమవుతున్నారు.కాగా, బుధవా రం నాటికి ఉద్యోగులు 7,203మంది, వయోవృద్ధులు 2,713 మంది ఓటు వేశారు. ఇక ప్రచారానికి మరో మూడు రోజుల సమయమే ఉండడం.. అగ్రనేతల ప్రచారం ముగియడంతో ఓటర్లను నేరుగా కలి సేందుకు అభ్యర్థులు, నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు.పోలింగ్ శాతం పెరగాల్సిందే..ప్రచారం చేస్తూనే పోలింగ్ శాతం పెంపుపైనా పార్టీ లు దృష్టి సారించాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 75.30 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈసారి అది పెరిగేలా.. తద్వారా ఎక్కువ మంది ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా నేతలు పనిచేస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా పోలింగ్ పెంపునకు ప్రచా రం చేస్తోంది. వివిధ మాధ్యమాల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరి స్తూనే షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటుచేశారు.యువ ఓటర్లకు గాలం!ఈసారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనుండడంతో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాక యువతకు చేస్తున్న మేలును కూడా ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకంగా యువ ఓటర్లను కలుసుకునేందుకు సమ్మేళనాలు సైతం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల అంశాలను వివరిస్తూ ఓట్లు రాబట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని మొత్తం 16,31,039 మంది ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు 50,747 మంది ఉన్నారు. వీరిలో 26,775 మంది యువకులు, 23,967 మంది యువతులు ఉండగా.. మొదటిసారిగా ఓటు వేసే వీరిని ప్రసన్నం చేసుకోవడంలో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు.ఆమే.. అధికం!ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లోనూ వీరే ఎక్కువ మంది ఓటు వేసినా పూర్తిస్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ బూత్‌లకు రప్పించేలా పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. చాలా తక్కువ మంది ఓటు వేశారు.ఈసారి మొత్తం ఓటర్లు 16,31,039 మందికి పురుషులు 7,87,160 మంది, మహిళలు 8,43,749 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 56,589 మంది ఎక్కువగా ఉన్న నేపథ్యాన గత ఎన్నికల మాదిరి కాకుండా అందరినీ పోలింగ్ బూత్‌ల వద్దకు రప్పించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో మహిళలపైనే దృష్టి సారిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తమ హయాంలో కరెంట్ కోతలు లేవని, నీటి కొరత ఎదురుకాలేదని చెబుతుండగా.. కాంగ్రెస్ నేతలు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక బీజేపీ సైతం మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది. -
లింగసమానత్వమే మహిళల ఎజెండా
మహిళా ఓటర్లు రాజకీయ పార్టీలకు కీలకంగా మారారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, పురుషుల భాగస్వామ్యాన్ని మహిళా ఓటర్ల సంఖ్య అధిగమించింది. రానున్న సాధారణ ఎన్నికల్లో దాదాపు 47 కోట్ల మంది మహిళలు ఓటు వేయనున్నట్లు భారత ఎన్నికల సంఘం అంచనా వేసింది. మగవారి ఆదేశాల మేరకే మహిళలు ఓటు వేస్తారనే భావన క్రమంగా తన విలువను కోల్పోతోంది. పూర్తి స్పృహతో వారి ఎంపికలు ఉంటున్నాయి. సమానత్వం, గౌరవ ప్రదమైన జీవితం తప్ప మహిళలకు మరేదీ అంగీకారం కాదు. వీటిని సాధించే జెండర్ మేనిఫెస్టో తక్షణావసరం. లింగ సమాన ప్రపంచాన్ని సాధించ డానికి కొత్త పుంతలు తొక్కాలనే సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు. భారతదేశం సార్వత్రిక ఎన్నికల వైపు వెళుతున్నందున, నేను గత కొన్ని వారాలుగా మహిళలు, ఎల్జీబీటీక్యూ+ వ్యక్తులతో మాట్లాడి తదుపరి ప్రభుత్వంపై వారి అంచనాలను జెండర్ మేనిఫెస్టోలో పొందుపరిచాను. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 ప్రకారం, భారతదేశం ప్రస్తుతం లింగ సమానత్వంలో 146 దేశాలలో 127వ స్థానంలో ఉంది. ఈ విషయంలో కొన్ని చిన్న, కొన్ని భారీ అడుగులు పడ్డాయి. కానీ ఇది సరిపోదు. రాజ్యాంగ ప్రవేశిక పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమా నత్వానికి కట్టుబడి ఉంది. భారతదేశ జనాభాలో సగానికి పైగా, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారు ఇప్పటికీ ఈ ప్రాథమిక హామీలను పొందేందుకు కష్టపడుతున్నారు. జెండర్ మేనిఫెస్టో కోసం సంప్రదింపుల ప్రక్రియను మొత్తంగా చూస్తే, భారతదేశంలోని మహి ళలు సమానత్వం, గౌరవప్రదమైన జీవితాన్ని తప్ప మరేమీ కోరు కోవడం లేదని స్పష్టమైంది. హక్కుల కోసం పోరాడాలా? చారిత్రకంగా నేరపూరితమైన సంచార, డీనోటిఫైడ్ తెగల (నేరస్థ తెగల చట్టం నుండి మినహాయించిన) జనాభాలో ఎక్కువ మందికి, ప్రత్యేకించి మహిళలకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఇప్పటికీ, వారి ‘మృత పేర్లను‘ (లింగ పరివర్తన తర్వాత ఉపయోగంలో లేనటువంటి వారి పుట్టుక పేర్లు) కలిగి ఉన్న రాతపనిని నవీకరించడానికి అధిగమించలేని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి గుర్తింపు హక్కు చాలా కాలంగా నిరాకరించబడింది. 2024లో, ఉనికిలో ఉండే హక్కు ఏ వ్యక్తికైనా పోరాటం కాకూడదు. అన్ని వర్గాలకు చెందిన మహిళలు, ఎల్జీబీటీక్యూ+ వ్యక్తుల ఆశలు, ఆశయాలను గుర్తించే జెండర్ ఎజెండాను అనుసరించడం మన రాజ కీయ పార్టీల కర్తవ్యం కావాలి. ఈ ఎజెండా కోసం ఇక్కడ కొన్ని సిఫార్సులు: రాజ్యాంగం సమానత్వానికి హామీ ఇస్తుండగా, లింగ నిర్ధారిత కోణం నుండి చూసినప్పుడు వ్యక్తిగత హక్కులు తక్కువగా ఉంటున్నాయి. వివాహం చేసుకునే ప్రాథమిక హక్కు పౌరులకు లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎల్జీబీటీక్యూ+ వ్యక్తులకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కును తిరస్కరించినట్లయితే మనం సమానత్వాన్ని ప్రకటించుకోలేం. వీలైనంత త్వరగా పార్లమెంటు దీనిపై చట్టం చేయాలి. ప్రతిరోజూ, మహిళలు తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ఇంట్లో ప్రారంభమవుతాయి. శిక్షాస్మృతిలో వైవాహిక అత్యాచారం మినహాయింపుగా ఉండటం అనాలోచితం. తదుపరి ప్రభుత్వం ఈ చట్టాన్ని తొలగించి, లింగ ఆధారిత హింస పట్ల జీరో–టాలరెన్స్(ఏమాత్రం సహించని) విధానాన్ని అనుసరించాలి. చాలామంది మహిళలు డీప్ ఫేక్ (మార్ఫింగ్ వీడియోలు), ఆన్ లైన్ దుర్వినియోగం పట్ల ఉన్న వారి భయాల గురించి నాతో మాట్లా డారు. పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుత శాంతి భద్రతల యంత్రాంగాలు తగినంతగా సన్నద్ధంగా లేవు. మహిళలు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో సురక్షితంగా ఉండేలా చేయడానికి వీటిని తప్పనిసరిగా సంస్కరించాల్సి ఉంది. లింగ అపోహలు తొలగాలి అన్నిరకాల సామాజిక కలయికలు పెరగాలంటే, లింగ అపోహలను వదిలించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు తమ పరిసరాలలో లింగ పరమైన సామాజికీకరణ కారణంగా పితృస్వామ్య పద్ధతులను అవలంబిస్తారు. లింగపరమైన మూస పద్ధతులను తొలగించడానికి పాఠశాల పాఠ్యపుస్తకాలను సమీక్షించడం, తిరగరాయడం తక్షణ అవసరం. అదనంగా, లింగపరమైన సున్నితత్వాన్ని బోధించే వర్క్ షాప్‌లను పాఠశాల పాఠ్యాంశాలలో చేర్చాలి. తరువాత, పిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రుల ఉమ్మడి బాధ్యత అని మనం గుర్తించాలి. అన్ని అధికారిక సంస్థలలో వేతన చెల్లింపుతో కూడిన పితృత్వ సెలవును తప్పనిసరి చేయాలి. ఒక దృష్టాంతాన్ని నెలకొల్పడానికి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ‘క్రెష్’(శిశు సంరక్షణ కేంద్రం)లను కూడా ఏర్పాటు చేయాలి. తద్వారా పనిచేసే తల్లిదండ్రులు, లింగ భేదం లేకుండా పిల్లల సంరక్షణలో పాల్గొనేలా చేయాలి. కోవిడ్ తర్వాత, ఆరోగ్య హక్కుపై ఎక్కువ దృష్టి పడింది. అయితే, మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధ్యయనాలు కనుగొన్నాయి. ఆరోగ్య హక్కును కీలకమైనదిగా పరిగ ణించాలి. లింగపరమైన దృష్టితో విధానాలను రూపొందించాలి. గత కేంద్ర బడ్జెట్లో, గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తప్పనిసరిగా రొమ్ము, గర్భా శయ క్యాన్సర్‌కు ఉచిత పరీక్షలు చేయాలి. ఇంకా, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ద్రవ్యోల్బణంతో సరిపోయేలా ఆర్థిక సహాయాన్ని తప్పనిసరిగా పెంచాలి. మహిళలకు ఆర్థిక శ్రేయస్సును అందించడం తదుపరి ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సవాలు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు నిర్దిష్ట నిధులను తప్పనిసరిగా కేటాయించాలి. మహిళా రైతులను గుర్తించకపోవడం, తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం మహిళలకు సంబంధించినంతవరకు రెండు ప్రధాన బాధాకరమైన అంశాలు. తదుపరి ప్రభుత్వం మహిళా రైతుల హక్కుల బిల్లు, 2011ను తప్పనిసరిగా అమలులోకి తేవాలి. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలను, ముఖ్యంగా ఉత్పాదక రంగంలో అమలు చేయాలి. తమ సిబ్బందిలో 20 శాతం కంటే ఎక్కువ మంది మహిళలను నియమించుకునే సంస్థలకు పన్ను రాయితీలు మంజూరు చేయడం ఒక మార్గం. ప్రభుత్వం అతిపెద్ద ఉద్యోగ కల్పనా దారులలో ఒకటి కాబట్టి, 30 లక్షలుగా అంచనా వేసిన ప్రస్తుత ఖాళీ స్థానాలను త్వరగా భర్తీ చేయాలి. ఈ ఉద్యోగాలకు మహిళా రిజర్వేషన్ ను తప్పనిసరిగా విస్తరించాలి. చట్టం చేయాల్సిన ఆవశ్యకత భారతదేశంలో మహిళల రాజకీయ హక్కులకు సంబంధించి గత సంవత్సరం చాలా ముఖ్యమైనది. మూడు దశాబ్దాలకు పైగా జరిగిన ఉద్యమాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వానికి దృఢ సంకల్పం ఉంటే లింగ సమానత్వం వైపు చరిత్రాత్మక అడుగు వేయవచ్చని ఇది సూచిస్తోంది. అయితే, చట్టం అమలులో లేకపోవడం మనందరినీ నిరాశకు గురిచేస్తోంది. రాబోయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ ను వీలైనంత త్వరగా అమలు చేసేలా చూడాలి. ఇది జనాభా లెక్కలను పూర్తి చేయడానికి లోబడి ఉండ కూడదు. పైగా, ప్రాతినిధ్యం అనేది ఎగువ మరియు దిగువ సభలు రెండింటిలోనూ ప్రతిబింబించే ఆదర్శం. రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సి ల్లలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు రిజర్వేషన్ల నిబంధనలపై పార్లమెంటు తప్పనిసరిగా చట్టం చేయాలి. భారతదేశం లింగ సమానత్వాన్ని సాధించడానికి ఒక శతాబ్దానికి పైగా కాలం పడుతుంది. గత స్త్రీవాద ఉద్యమాలు మన ప్రధాన లక్ష్యాల సాధనలో పట్టుదలతో కొనసాగుతూనే, చిన్నపాటి విజయా లను జరుపుకోవాలని బోధించాయి. పైన పేర్కొన్న సిఫార్సులు కీలక మైనవి, దూరదృష్టితో కూడుకున్నవి. ముఖ్యంగా, తదుపరి ప్రభుత్వా నికి దాని పదవీకాలంలోనే సాధించదగినవి. మనకు కావలసిందల్లా లింగ–సమాన ప్రపంచాన్ని సాధించడానికి కొత్త పుంతలు తొక్కాలనే నిస్సందేహమైన సంకల్పం మాత్రమే. ఏంజెలికా అరిబమ్ వ్యాసకర్త ‘ఫెమ్మె ఫస్ట్’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు -
సార్వత్రిక ఎన్నికల నగారా : మహిళా ఓటర్ల జోరు!
దేశంలో ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక జరగనున్న ఎన్నికలు, లోక్‌సభ - 2024 ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్(rajiv kumar) శనివారం ప్రకటించారు. మూడు దశల్లో రాష్ట్రాల ఎన్నికలు, ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది 1.89 కోట్ల మంది తొలి సారి ఓటర్లుగా నమోదయ్యారని వీరిలో 85 లక్షల మంది మహిళలు ఉన్నారని కూడా ఆయన వెల్లడించారు. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్, సిక్కిం, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. అలాగే పలు రాష్ట్రాల్లోని మహిళా పురుష ఓటర్ల నిష్పత్తి గణాంకాల గురించి కూడా ఆయన పేర్కొన్నారు. ప్రతీ పౌరుడు తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాలని సూచించారు. హింసను వ్యాపింపజేసే వారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని కుమార్ హెచ్చరించారు. ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట వెలుగొందేలా రక్తపాతానికి, హింసకు తావులేకుండా ఈ ఎన్నికలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 12 రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి 1,000 పైన ఉంది. సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటన ప్రకారం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల నిష్పత్తి ఎక్కువగా ఉంది. దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా 96.8 కోట్లుగా ఉంది. వీరిలో 48వేల మంది ట్రాన్స్జెండర్లు కూడా నమోదయ్యారు. అలాగే 1.8 కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. అలాగే 20 - 29 ఏళ్ల మధ్య వయస్సు గల వారు 19.47 కోట్ల మంది ఉన్నారు. దేశంలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇది కాకుండా 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండగా, 19.74 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు. అలాగే దేశంలో 82 లక్షలకు పైగా వృద్ధ ఓటర్లు ఉన్నారు. 2023లో 940 నుంచి 2024లో 948కి లింగ నిష్పత్తి పెరిగిందని ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు 1.5 కోట్ల మంది సిబ్బందితో పాటు 55 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఈసీ 17 లోక్‌సభ ఎన్నికలు, 16 రాష్ట్రపతి ఎన్నికలు, 400కి పైగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిందని కుమార్ తెలిపారు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్ 52, తృణమూల్ కాంగ్రెస్ 22, బీఎస్పీ 10, ఎన్సీపీ 5, సీపీఐ-ఎం 3, సీపీఐ 2 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
నిర్ణయాధికారం ‘ఆమె’దే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తేలింది. రాష్ట్రం మొత్తం ఓటర్లలో ఎలక్ట్రోలర్ లింగ నిష్పత్తి సగటు కూడా ఎక్కువగానే ఉంది. పదేళ్లుగా పెరుగుతున్న నిష్పత్తి రాష్ట్రంలో 2014 నుంచి వరుసగా 2024 వరకు ఓటర్ల జాబితాల్లో మహిళా ఓటర్ల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. అర్హులైన యువతులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో 18 నుంచి 19 సంవత్సరాల వయసుగల ఎలక్ట్రోరల్ లింగ నిష్పత్తి 778 నుంచి 796కు పెరిగింది. ఈ వయసుగల మహిళా ఓటర్లు 3.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనుల్లోని ప్రత్యేక సంచార జాతులను కూడా ఓటర్లుగా నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4.29 లక్షలుండగా 18 సంవత్సరాలు నిండిన 2.94 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. బోడో గడబా, గుటోబ్ గడబా, చెంచు, బొండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరేంగి పోర్జా, డోంగ్రియా ఖోండ్, కుటియా ఖోండ్, కోలం, కొండారెడ్డి, కొండ సవరాల జాతుల్లోని అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
మహిళా ‘ముద్ర’
సాక్షి, అమరావతి: దేశ ఎన్నికల క్షేత్రంలో మహిళల పాత్ర పెరుగుతోంది. స్త్రీ శక్తి మద్దతు లేనిదే ఏ పార్టీ లేదా ఏ నాయకుడూ విజయం సాధించలేరన్నంతగా ఓటింగ్‌లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఆ తర్వాత 2029 నుంచి స్త్రీలదే ఆధిపత్యం. ఇది మహిళలు సాధించిన సాధికారత. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించిన విషయమిది. 1951 నుంచి ఎన్నికల పోలింగ్ శాతం సరళితో 2047 వరకు పోలింగ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య ఎలా పెరుగుతుందో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వివరించింది. 2014 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో పురుషులకన్నా మహిళా ఓటర్లు తక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల పోలింగ్‌లో పురుష ఓటర్లు 67.01 శాతం ఓట్లేయగా, మహళా ఓటర్లు 67.18 శాతం పాల్గొన్నట్లు ఆ నివేదిక తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్లతో మహిళా ఓటర్లు దాదాపుగా సమానంగా ఉంటారని పేర్కొంది. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి 2047 ఎన్నికల వరకు మహిళా ఓటర్లదే హవా. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే వారి సంఖ్య 68 కోట్లకు చేరుతుందని, అందులో 33 కోట్ల మహిళా ఓటర్లుంటారని అంచనా. ఇది మొత్తం పోలింగ్‌లో 49 శాతం. 2029 ఎన్నికల నుంచి పోలింగ్‌లో పాల్గొనే మహిళల సంఖ్య పెరుగుతూ పోతుందని, పురుష ఓటర్ల సంఖ్య తగ్గుతుందని నివేదిక వెల్లడించింది. 2024లో ప్రతి 100 మంది మహిళా ఓటర్లలో 67.6 శాతం ఓట్లు వేస్తారని, –2029లో ప్రతి 100 మంది మహిళా ఓటర్లలో 71.4 శాతం ఓట్లు వేస్తారని, 2047లో ప్రతి వంద మంది మహిళా ఓటర్లలో 86.3 శాతం ఓట్లు వేస్తారని నివేదిక తెలిపింది. 1951 ఎన్నికల్లో 8 కోట్ల మంది మాత్రమే ఓట్లు వేసినట్లు నివేదిక పేర్కొంది. 2009 ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య 42 కోట్లకు పెరగ్గా, ఇందులో 19 కోట్ల మంది మహిళలున్నారు. 2014 ఎన్నికల్లో 55 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా అందులో 26 కోట్ల మంది మహిళలున్నారని నివేదిక తెలిపింది. 2019 ఎన్నికల్లో 62 కోట్ల మంది ఓట్లు వేయగా అందులో 30 కోట్ల మంది మహిళలని తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 68 కోట్ల మంది ఓట్లు వేస్తారని, అందులో 33 కోట్ల మంది మహిళా ఓటర్లుంటారని నివేదిక పేర్కొంది. ప్రస్తుత పోలింగ్ సరళిని పరిశీలిస్తే 2029 ఎన్నికల్లో 73 కోట్ల మంది ఓట్లు వేస్తారని, ఇందులో 37 కోట్లు మహిళలుంటారని అంచనా వేసింది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు నమోదవుతారని అంచనా వేయగా అందులో 80 శాతం మంది.. అంటే 92 కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొంటారని అంచనా వేసింది. ఇందులో మహిళల ఓటింగ్ 55 శాతానికి పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. మహిళా ఓటర్లదే పెద్ద పాత్ర భారత దేశ రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, అలాగే లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గత దశాబ్దంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నివేదిక వ్యాఖ్యానించింది. గతంలోకంటే ఇప్పడు ఎన్నికల్లో మహిళా ఓటర్లు చాలా పెద్ద పాత్ర పోషిస్తారని నివేదిక పేర్కొంది. 1991 నుంచి పురుష, మహిళా ఓటర్ల మధ్య అంతరం తగ్గుతూ వస్తోందని తెలిపింది. 1991లో ఈ అంతరం పది శాతానికి పైగా ఉండగా 1996 నుంచి 2004 వరకు నాలుగు ఎన్నికల్లో 8.4 శాతానికి తగ్గిందని తెలిపింది. గత ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ శాతం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్లలో 23 ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 18 రాష్ట్రాల్లో పురుష ఓట్ల పోలింగ్ శాతం కన్నా మహిళా ఓట్ల పోలింగ్ శాతం అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. ఈ 18 రాష్ట్రాల్లో పది రాష్ట్రాల్లో అవే ప్రభుత్వాలు తిరిగి ఎన్నికయ్యాయని నివేదిక పేర్కొంది. -
AP: ఎన్నికల్లో కీలక శక్తిగా మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చట్ట సభలకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో మహిళలే కీలక శక్తిగా మారనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ తుది జాబితా 2023ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,84,868. వీరిలో పురుష ఓటర్లు 1,97,59,489 మంది కాగా, మహిళా ఓటర్లు 2,02,21,455 మంది ఉన్నారు. అంటే 4,61,966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్ల సంఖ్య 3,924గా ఉంది. మొత్తం 26 జిల్లాల్లో 22 జిల్లాల్లో పురుషులకంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 19,41,277 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,29,085 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 7,76,716 మంది ఓటర్లు ఉన్నారు. 2022తో పోలిస్తే తగ్గిన ఓటర్ల సంఖ్య గతేడాది తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 7,51,411 తగ్గింది. 2022 తుది జాబితాలో 4,07,36,279గా ఉన్న ఓటర్ల సంఖ్య 2023 జాబితా నాటికి 3,99,84,868కి పరిమితమయింది. కానీ, నవంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా జాబితా సవరణ తర్వాత నికరంగా ఓటర్ల సంఖ్య 1,30,728 పెరిగినట్లు మీనా తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా 5,97,701 మంది ఓటర్లు చేరితే 4,66,973 మంది ఓటర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే అదనంగా ఒక పోలింగ్ స్టేషన్ పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 45,951 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 721 మందికి ఓటు హక్కు ఉండగా, లింగ నిష్పత్తి 1,027గా ఉంది. పెరిగిన తొలి ఓటు హక్కు వినియోగదారులు 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారిని ఓటర్లుగా చేర్చుకున్నారు. గత ఏడాది నవంబర్ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్లు ఉన్న తొలి ఓటు హక్కు వినియోగదారుల సంఖ్య 78,438గా ఉంటే తుది జాబితా నాటికి ఈ సంఖ్య 3,03,225కు చేరినట్లు మీనా తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా ప్రచారం చేయడమే కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని చెప్పారు. మొత్తం ఓటర్లలో దివ్యాంగుల సంఖ్య 5,17,403గా ఉంది. ఈ తుది ఓటర్ల జాబితాను అన్ని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు శుక్రవారం అందజేస్తామని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోలేకపోయినవారు ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చని, అభ్యంతరాలను ఫారం–7 ద్వారా, సవరణలను ఫారం–8 ద్వారా చేయవచ్చని తెలిపారు. -
ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం
హిమాచల్ ప్రదేశ్. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ఆ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా రోడ్డుపక్కన టీ కొట్టుల్లో, ఆలయాల వద్ద, ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మహిళలే వ్యాపారాలు చేస్తూ కనిపిస్తారు. ఆర్థిక స్వాతంత్య్రం రాజకీయ చైతన్యం ఇష్టపడే మహిళలు ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అందుకే ప్రధాన పార్టీలన్నీ మహిళా ఓటర్లపై గాలం వేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడంలో మహిళలు అత్యంత కీలకంగా మారారు. రాష్ట్ర జనాభాలో 49% మంది మహిళలే ఉన్నారు. 1998 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని విశ్లేషిస్తే పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓట్లు వేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 55,92,828 ఉంటే వారిలో పురుష ఓటర్లు 28,54,945, మహిళా ఓటర్లు 27,37,845, థర్డ్ జెండర్ ఓటర్లు 38 ఉన్నాయి. స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తి జాతీయ సగటు కంటే హిమాచల్ ప్రదేశ్‌లో అధికం. ప్రతీ వెయ్యి మంది పురుషులకు జాతీయ స్థాయిలో 976 మంది మహిళలు ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో 981 మంది ఉన్నారు. 18 నియోజకవర్గాల్లో లింగ నిష్పత్తి వెయ్యి దాటి ఉండడం విశేషం. ’’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దేవేష్ కుమార్ వ్యాఖ్యానించారు. పోటీ పడి హామీలు అధికార బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేక మేనిఫెస్టో స్త్రీ సంకల్ప పత్ర విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లయ్యే సమయంలో రూ.51 వేల ఆర్థిక సాయం, ప్రాథమిక విద్య అభ్యసించే బాలికలకు ఉచిత సైకిళ్లు, ఉన్నత విద్య అమ్మాయిలకు స్కూటీలు, మహిళా సాధికారత సాధించడానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, ఆశావర్కర్ల జీతం రూ.4,700కి పెంపు వంటి హామీలు గుప్పించింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం కింద 1.36 లక్షల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, రాష్ట్రస్థాయిలో గ్రామీణ సువిధ యోజన కింద 3.24 లక్షల గ్యాస్ కనెక్షన్ల పంపిణీతో మహిళలు పొగ ముప్పు నుంచి విముక్తి చెందారని, తొలి స్మోక్ ఫ్రీ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచిందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు పైబడిన మహిళలందరికీ హర్ ఘర్ లక్ష్మి నారి సమ్మాన్ నిధి పథకం కింద నెలకి రూ.1500 ఇస్తామని ప్రకటించింది. ‘‘ఉన్నత విద్య అభ్యసించలేని యువతులు కానివ్వండి, సింగిల్ మదర్లు, వితంతువులు ఇలా అవసరం ఉన్న మహిళలందరికీ రూ.1500 బ్యాంకులో పడతాయి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది’’ అని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఆశాకుమారి చెప్పారు. అంతకు ముందే ఆప్ తాము అధికారంలోకి వస్తే నెలకి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాతినిధ్యం ఏది ? మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించే పార్టీలు వారికి టికెట్ ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. 68 స్థానాలున్న అసెంబ్లీలో గత సారి కేవలం నలుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సారి బీజేపీ ఆరుగురికి టికెట్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం ముగ్గురుకి మాత్రమే ఇచ్చింది. తొలిసారిగా ఎన్నికల బరిలో నిల్చొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరుగురికి టికెట్లు ఇచ్చింది. 1998లో తొలిసారిగా ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు నెలకొల్పారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 338 అభ్యర్థులు పోటీ పడితే వారిలో 19 మంది మాత్రమే మహిళలు. వారిలో నలుగురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 6% ఎక్కువగా మహిళల ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా అక్షరాస్యత ఎక్కువ. ఓటు ఎంత విలువైనదో వారికి బాగా తెలుసు. సామాజికంగా, రాజకీయంగా, మతపరంగా ఎంతో అవగాహనతో ఉంటారు. అందుకే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలవచ్చి ఓట్లు వేస్తారు. గత 20 ఏళ్లుగా పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6 శాతం అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 27 జిల్లాల్లో మహిళా ఓటరే న్యాయ నిర్ణేతలయ్యారు. పది జిల్లాల్లో పురుషాధిక్యం కొనసాగింది. ఒక కోటి 70 లక్షల మంది ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా తమ బాధ్యతను విస్మరించారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థానాలకు ఆరో తేదీన ఎన్నికలు జరిగాయి. గతంతో పోల్చితే ఈ సారి ఓటింగ్ శాతం కాస్త తగ్గింది. దీంతో గెలుపు ధీమా అభ్యర్థుల్లో ఉన్నా తెలియని టెన్షన్ తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఓట్ల వివరాలు, ఎవరెవరు ఏ మేరకు ఓటు హక్కు వినియోగించుకున్నారో అన్న సమగ్ర వివరాలను ఎన్నికల యంత్రాంగం శనివారం వెబ్సైట్లో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం, జిల్లాల వారీగా శాతాలకు తగ్గ వివరాలను ఇప్పటికే ప్రకటించినా, తాజాగా నియోజకవర్గాల వారిగా పురుషులు, స్త్రీలు, ఇతరులు ఏ మేరకు తమ హక్కును వినియోగించుకున్నారు, ఏ మేరకు విస్మరించారో అన్న విషయాన్ని వివరించారు. మహిళలే అధికం.. రాష్ట్రంలో ఆరు కోట్ల 28 లక్షల 69 వేల 955 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3 కోట్ల 9 లక్షల 23 వే 651 మంది, స్త్రీలు 3 కోట్ల 19 లక్షల 39 వేల 112 మంది ఉన్నారు. మిగిలిన వారు ఇతరులు. ఇందులో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న వారు 4 కోట్ల 57 లక్షల 76 వేల 311 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2 కోట్ల 26 లక్షల 3 వేల 156, స్త్రీలు 2 కోట్ల 31 లక్షల 71 వేల 736 మంది ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలు 5 లక్షల 68 వేల 550 మంది అధికంగా ఓట్లు వేశారు. సాధారణంగా పురుషులే అధికంగా ఓటు హక్కు ఇది వరకు వినియోగించుకునే వారి జాబితాలో ముందుండే వారు. అయితే, ఈ సారి పురుషుల్ని మించి మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని వేలూరు, తిరువణ్ణామలై, నామక్కల్, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్ వంటి పశ్చిమ పర్వత శ్రేణుల కూడిన జిల్లాల్లోని నియోజకవర్గాలనూ అధికంగా మహిళలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం విశేషం. కుగ్రామాలతో నిండిన పోలింగ్ కేంద్రాల్లోనూ అధికంగా మహిళలు ఓట్లు వేసి ఉండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో మహిళలు అత్యధికంగా ఓటు వేశారు. పది జిల్లాల్లో మాత్రం పురుషులు ముందంజలో ఉన్నారు. ఇందులో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, కృష్ణగిరి, ధర్మపురి, విల్లుపురం వంటి ఉత్తర తమిళనాడు జిల్లాలు ఉన్నాయి. ఇక, ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు దూరంగా ఉన్న వాళ్లు కోటి 70 లక్షల 93 వేల 644 మంది ఉన్నారు. తాజా ఎన్నికల్లో మహిళలు అధికంగానే నియోజకవర్గాల్లో ఓటు వేసిన దృష్ట్యా, వారి నిర్ణయమే అభ్యర్థుల తలరాతగా మారనున్నాయి. ఫలితాల రోజున మహిళ ఓటర్లే న్యాయనిర్ణేతలు కాబోతున్నారు. చదవండి: మరో వివాదంలో కమల్ -
ఆఫీసర్స్ అందరూ మహిళలే
మహిళల్లో ఓటు వేయాలన్న ఉత్సాహం కలిగించడం కోసం అస్సాంలోని నల్బరి జిల్లా యంత్రాంగం కొత్తగా ఆలోచిస్తోంది. నల్బరినే ఎందుకు అంటే.. ఆ జిల్లాలోని అత్యున్నతస్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావడం! డిప్యూటీ కమిషనర్ మహిళ. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహిళ. ముగ్గురు అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు మహిళలు. వీళ్లంతా కలిసి నల్బరిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు నడిపించేందుకు రకరకాల ప్రణాళికలు, పథకాలు రచిస్తున్నారు! 126 స్థానాలు గల అస్సాం అసెంబ్లీకి మూడు విడతలుగా.. మార్చి 27, ఏప్రిల్ 1, 6 తేదీలలో.. పోలింగ్ జరుగుతోంది. అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓటర్లే ప్రభావం చూపబోతున్నారని సర్వేల అంచనా. బ్రహ్మపుత్ర నది ఉత్తరపు ఒడ్డున అస్సాం నగరం గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంది నల్బరి జిల్లా. ఆ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలేనన్నది మరీ కొత్త సంగతైతే కాదు. అయితే వీళ్లంతా కలిసి మహిళా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. వీళ్లకేం పని? వీళ్లకే పని! డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు.. వీళ్లే కదా జిల్లా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయవలసింది, బాధ్యత గల పౌరులుగా మెలిగేలా నడిపించవలసింది! అస్సాంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడం పౌరధర్మం అయితే, ఓటు వేయించడం అధికారం ధర్మం. ఆ ధర్మాన్నే ఈ మహిళా అధికారులంతా బాధ్యతగా, వినూత్నంగా చేపడుతున్నారు. అభ్యర్థులు మహిళల ఓట్ల కోసం పాట్లు పడుతుంటే, అధికారులు మహిళల చేత ఓటు వేయించడం కోసం ‘ప్లాట్’లు ఆలోచిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. లోపల బూత్ సిబ్బంది, బయట భద్రతా సిబ్బంది అంతా మహిళల్నే నియమిస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. మహిళల్ని ఆ పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన నల్బరీ, బర్క్షెత్రి, ధర్మాపూర్లను ప్రత్యేక జోన్లుగా, సెక్టార్లుగా, చౌక్‌లుగా విభజించి అక్కడ మహిళా చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాలలో ఉండేది మళ్లీ మహిళలే. వారు తమ పరిధిలోని మహిళలకు ఓటు ఎందుకు వేయాలో చెబుతారు. ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో వివరిస్తారు. ‘ఈసారి మన మహిళల ఓటు మీద అస్సాం భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని సర్వేలను ఉదహరిస్తూ కొన్ని ప్రధానమైన అభివృద్ధి అంశాలను అర్థమయ్యేలా చేస్తారు. ఓటు ఎవరికి వేసినా గానీ, మొత్తానికైతే ఓటు వేయడం మానకూడదన్న స్పృహ కలిగిస్తారు. ఇందుకోసం ఆ కేంద్రాల్లోని మహిళా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. ఇక పోలింగ్ డ్యూటీలో ఉన్న మహిళలకైతే వాళ్లెంత చిన్న బాధ్యతల్లో ఉన్నా ప్రత్యేక వసతుల్ని కల్పిస్తున్నారు. ‘‘మహిళలు సౌకర్యంగా ఉంటే, సమాజం సవ్యంగా సాగుతుంది’’ అంటారు డిప్యూటీ కమిషనర్ పురబి కన్వార్. అందుకే ఆమె ఓటు వేసే మహిళలకే కాకుండా, ఓటు వేయమని చెప్పే, బూత్ లోపల ఓటు వేసేందుకు దారి చూపే మహిళా సిబ్బంది అందరికీ కూడా సౌకర్యంగా ఉండేట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. పురబి కన్వార్ జిల్లా ఎన్నికల అధికారి కూడా. మరోవైపు.. ఇళ్లకు డెలివరీ అయ్యే గ్యాస్ సిలిండర్లపై ‘ఓటు వెయ్యడం మీ కర్తవ్యం’ అని తెలియజెప్పే స్టిక్కర్లను అతికించమని చెబుతున్నారు. ఇప్పటి వరకు అలా స్టిక్కర్లు అంటించిన సిలిండర్లు ఐదు వేల వరకు డెలివరీ అయ్యాయి. అలాగే వీధి నాటకాలు వేయిస్తున్నారు. మహిళా కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ‘మహిళా అధికారుల జిల్లా’గా నల్బరి స్టోరీ అప్పుడే అయిపోలేదు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్.. అందరూ మహిళలే! జిల్లా ఎస్పీ మహిళ (అమన్‌జీత్ కౌర్). జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్ ఆఫీసర్లు, సబ్–రిజిస్ట్రార్ (రెవిన్యూ), ఇంకా.. డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, సబ్–డివిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అంతా మహిళలే. ఇంత మంది మహిళా అధికారులు ఉన్నప్పుడు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం లేకుండా ఉంటుందా? మహిళల్లో చైతన్యం వెల్లివిరవకుండా ఉంటుందా? -
ఓటు మన బాధ్యత
మనిషి ఇంట్లో ఉండటం తక్కువ. రోజంతా బయటే! చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాపకాలు. అలసి ఇంటికి చేరిన వారిని ఇల్లు ఆదరిస్తుంది. ఫ్యాన్ వేసి కూర్చోబెడుతుంది. మంచినీళ్ల గ్లాసు చేతికి అందిస్తుంది. స్నానానికి వేణ్ణీళ్లు పెడుతుంది. అప్యాయంగా భోజనం వడ్డిస్తుంది. సేదతీరాక, ‘ఈరోజు ఎలా గడిచింది?’ అని అడుగుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మనిషికి కూడా ఇలాంటి ఆదరణే ఉండాలి. రోజూ వెళ్లొచ్చే రోడ్లు బాగుండాలి. రాకపోకలకు రవాణా సౌకర్యం ఉండాలి. రద్దీ తక్కువగా ఉండాలి. రక్షణ, భద్రత ఉండాలి. ఒక్కమాటలో.. మహానగరమే అయినా మన ఇల్లులా ఉండాలి! ఆ నగర ‘గృహ’ బాధ్యత ‘మేయర్’ది అయితే, మేయర్ ఎన్నికల్లో ఓటు వేయడం పౌరుల బాధ్యత. ఇంట్లో నీళ్ల ట్యాప్ అయినా, రోడ్డు మీద నడిచే మన బతుకు బండైనా ఉండేది మేయర్ చేతిలోనే. ఆ మేయర్‌ని ఎన్నుకునే అవకాశం మళ్లీ ఇప్పుడు నగరజీవి చేతికి వచ్చింది. డిసెంబర్ 1న హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు. కోటీ 20 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ సిటీలో 74 లక్షలకు పైగా ఓటేయబోతున్నారు. వారిలో మహిళా ఓటర్లు 35 లక్షలకు పైగానే. ఈ మహిళల ఓట్లే ఇప్పుడు కీలకం! ఓటు హక్కును వినియోగించుకోడం తమ బాధ్యత అని భావిస్తున్నారా లేదా అని తెలుసుకోడానికి జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మెట్రో కార్పోరేషన్) పరిధిలోని మహిళా ఓటర్లను ‘సాక్షి’ కలిసింది. ఎక్కువమంది మహిళల్లో ఓటు వేయడం పట్ల చైతన్యంతో కూడిన బాధ్యత వ్యక్తం అయింది. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఓటు వేసేదాన్ని. సిటీ ఎన్నికల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే స్థానిక సమస్యల పరిష్కారంలో నగర పాలకవర్గానిదే ప్రధాన పాత్ర అని ఇప్పుడు తెలుస్తోంది. అందుకే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా ఓటేస్తాను. మా శేరిలింగంపల్లి డివిజన్లో అనుమతి లేని నిర్మాణాల వంటి అనేక అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దగలిగిన వ్యక్తినే కార్పొరేటర్‌గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. చుట్టూ ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత, సరైన ప్రతినిధిని ఎన్నుకోవాల్సిన విధి సిటిజన్‌గా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎన్నికల సమయంలో నిరాసక్తంగా ఉండి తర్వాత ఎవరిని తప్పు పట్టినా ప్రయోజనం ఉండదు. – పి. నీలిమ, ప్రాజెక్ట్ మేనేజర్, మైక్రోసాఫ్ట్ అప్పట్లో మాకు 21 ఏళ్లకు ఓటు హక్కు వచ్చేది. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ ఓటు వేస్తున్నాను. ఎలక్షన్ల సమయంలో రేడియో ఉద్యోగంలో పని ఎక్కువగా ఉంటుంది. ఎన్ని పనులున్నా సరే ఓటు వేయడం మానలేదు. ఉదయం ఓటింగ్ మొదలయ్యే సమయానికే బూత్‌కి వెళ్లి ఓటు వేసిన తర్వాత డ్యూటీకి వెళ్లేదాన్ని. ఢిల్లీలో ఉద్యోగం చేసినన్నాళ్లు అక్కడ వేశాను, ఇప్పుడు హైదరాబాద్‌లో వేస్తున్నాను. తలవంచుకుని వెళ్లి ఓటు వేసి రావడం కాదు, ఓటింగ్ సరళిని గమనించి సమాచారంతో ఆఫీసుకు వెళ్తుంటాను. – ఎమ్.ఎస్.లక్ష్మి, న్యూస్ కరస్పాండెంట్, ఆల్ ఇండియా రేడియో మేము హైదరాబాద్‌కి వచ్చి ముప్పై ఏళ్లయింది. ఇక్కడ ఓటు వచ్చి ఇరవై ఏళ్లయింది. ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నాం. మా కష్టం ఎవరూ తీర్చరు. అలాగని ఓటు వేయకపోతే... మనం ఊర్లో ఉన్నా లేనట్లే చూస్తారు. ప్రభుత్వం మాలాంటి వాళ్ల కోసం ఏదైనా పథకం పెట్టినప్పుడు మమ్మల్ని ఏ లీడరూ పట్టించుకోరు. మాకూ అర్హత ఉందని గట్టిగా అడగాలంటే ఓటు వేయాల్సిందే. – టి. సరస్వతి,పూల వ్యాపారి ఒకరొచ్చి చెప్పాలా?! ఓటు వేయడం ద్వారా మన జీవితంలో ఐదేళ్ల కాలాన్ని ఆ ప్రతినిధి చేతిలో పెడుతున్నాం. అందుకే ఆ ఎన్నిక ప్రక్రియలో విధిగా భాగస్వాములు కావాలి. సరైన వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకోవాలి. నగరంలో మనిషికి ప్రభుత్వం చేయాల్సిన కనీస సర్వీసులు కరెంటు, వాటర్, డ్రైనేజ్ సర్వీసులే. అవన్నీ మనం కట్టే పన్నుల నుంచి అందుతున్న సర్వీసులే. ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలను సక్రమంగా అందించే బాధ్యత ఆ ప్రతినిధిది. స్ట్రీట్ లైట్ వెలగకపోయినా, డ్రైనేజ్ పొంగినా మనకు అందాల్సిన సర్వీస్ గురించి అడగగలగాలి. అలాగే జనం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎవరో వచ్చి చైతన్యపరచాలని ఎదురు చూడకూడదు. ఎవరికి వాళ్లు చైతన్యవంతం కావాలి. ఇక చాలా మందికి క్యూలో నిలబడడం అంటే నామోషీ. బేషజాలకు పోయి విలువైన ఓటు హక్కును వినియోగించుకోరు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ కూడా రాష్ట్రపతి హోదాలో నేరుగా వెళ్లి ఓటేయకుండా, క్యూలో నిలబడి తన వంతు కోసం ఎదురు చూసి మరీ ఓటేశారు. అంతకంటే స్ఫూర్తి మరేం కావాలి? నా మట్టుకు నేను ప్రతి ఎన్నికలోనూ ఓటేశాను. సాధారణ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలో గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యుయెన్సీ ఓటు కూడా వేశాను. ఇప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఓటు వేస్తాను. – పి. హరిత, ఎంటర్ప్రెన్యూర్ -
‘ఆమే’ నిర్ణాయక శక్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన 2021 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతపురం జిల్లా మినహా మిగతా 12 జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సర్వీసు ఓటర్లను మినహాయిస్తే థర్డ్ జండర్ ఓట్లు 4,083 కలుపుకుని మొత్తం ఓటర్లు 4,00,79,025 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,02,83,145 మంది కాగా, పురుష ఓటర్ల సంఖ్య 1,97,91,797. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,91,348 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాగా, 2020 ముసాయిదా ఓటర్ల సవరణ జాబితా నుంచి ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ నాటికి అదనంగా 1,41,631 ఓటర్లు నమోదయ్యారు. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం పురుష ఓటర్లు 16,52,036 మంది ఉండగా, మహిళా ఓటర్లు 16,48,024 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,72,107 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18,65,266 మంది ఓటర్లు ఉన్నారు. -
మహిళా ఓటర్లకు రాహుల్ హ్యాట్సాఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పోటెత్తిన మహిళా ఓటర్లు క్రియాశీలకంగా వ్యవహరించారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటు చేసిన తల్లులు, సోదరీమణులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ఓ వీడియో ట్వీట్లో రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో మహిళలు కేవలం అభ్యర్ధులుగానే కాకుండా తమ గొంతుక వినిపించేందుకు కట్టుబడిన ఓటర్లుగానూ కీలకంగా వ్యవహరించిన వారందరికీ తాను శాల్యూట్ చేస్తున్నా’నని రాహుల్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు మహిళా ఓటర్లు తమకు సమాన అవకాశాలు, గౌరవం, ఐక్యతతో కూడిన భారతావని కోరుతున్న 30 సెకన్ల నిడివికలిగిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ పథకం మహిళలకు దక్కాల్సిన న్యాయపరమైన వాటాను వారికి లభించేలా చేస్తుందని ఈ వీడియోలో మహిళలు అభిప్రాయపడ్డారు. ఏడవ, తుది విడత పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో రాహుల్ మహిళా ఓటర్లకు ధన్యవాదాలు చెబుతూ ఈ ట్వీట్‌ను పోస్ట్ చేయడం గమనార్హం. తుదివిడత పోలింగ్ ఆదివారం ముగియడంతో ఈనెల 23న ప్రకటించనున్న ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. -
హాట్సాఫ్ వాట్సాప్
సార్వత్రిక ఎన్నికల్లో నేడు చివరి విడతగా 59 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బిహార్ (8 స్థానాలు), జార్ఖండ్ (3), మధ్యప్రదేశ్ (8), పంజాబ్ (13), పశ్చిమ బెంగాల్ (9), ఛండీగఢ్ (1), ఉత్తర ప్రదేశ్ (13), హిమాచల్ ప్రదేశ్ (4) రాష్ట్రాలలోని ఆయా నియోజక వర్గాల ప్రజలు తమ ఓటు హవినియోగింక్కును చుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే అనేక స్థానాలలో ఓటు వేసిన మహిళల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించగా.. ఇవాళ్టి ఎన్నికలు కూడా పూర్తయ్యాక జరిగే విశ్లేషణలో పురుష ఓటర్లను మించి మహిళా ఓటర్లు లెక్క తేలే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ జరిగిన 16 సార్వత్రిక ఎన్నికల్లోనూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారని, అందుకు కారణం.. మహిళల్లో నిరక్షరాస్యత శాతం తగ్గడం, స్త్రీ సాధికారత ప్రయత్నాలు పెరగడం, ఎన్నికల కమిషన్ ప్రచారం మొదలైనవి ప్రధానమైనవి కాగా.. టెక్నాలజీ పరంగా చూస్తే, వాట్సాప్ అందుబాటులోకి రావడం.. మహిళల్లో ఓటు వేయాలన్న చైతన్య కలగడానికి కీలకమైన అంశంగా దోహదపడిందని ‘షి ది పీపుల్.టీవీ’ వ్యవస్థాపకురాలు, ‘ది బిగ్ కనెక్ట్–సోషల్ మీడియా అండ్ ఇండియన్ పాలిటిక్స్’ పుస్తక రచయిత్రి అయిన శైలీ చోప్రా అంటున్నారు. ‘‘గతంలో ఓటు వెయ్యడం అనేది మహిళ జీవితంలో ఒక రోజుతో పూర్తయ్యే ప్రస్తావన. వాట్సాప్ వచ్చాక ఓటు విలువ, ఓటు వినియోగంపై విస్తృతంగా చర్చ జరిగి (వాట్సాప్ గ్రూపుల్లో), మహిళలకది తమ జీవితంలోని ఒక ముఖ్యమైన బాధ్యత అన్న స్పృహను కలిగించింది. పర్యవసానమే.. మహిళల ఓట్లు.. పురుష ఓట్లను మించిపోడం’’అని చెబుతున్న శైలీ, గ్రామీణ ప్రాంతాలలో సైతం వాట్సాప్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నా, మహిళల అభీష్టానుసారం మాత్రమే గెలుపోటములు ఉంటాయని శైలీ చోప్రా చెబుతున్న దానిని బట్టి అర్థమౌతోంది. -
సత్తా చూపిస్తున్న మహిళా ఓటర్లు
సాక్షి, న్యూఢిల్లీ : బీహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిధిలోని 72 లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సోమవారం జోరుగా పోలింగ్ జరుతుతోంది. పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటుండగా, ఇంతకుముందు జరిగిన మూడు విడతల్లాగానే నేటి పోలింగ్‌లో కూడా అక్కడక్కడా ఈవీఎంలు మొండికేస్తున్నాయి. ముందుగా నిర్దేశించిన గడువు ప్రకారం ఒక్క కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసిపోతుండగా, మిగతా అన్ని చోట్ల సాయంత్రం ఆరు గంటలకు ముగిసిపోనుంది. ఏప్రిల్ 11న జరిగిన మొదటి విడత లోక్‌సభ పోలింగ్‌లో 69.5 శాతం పోలింగ్, ఏప్రిల్ 18న జరిగిన రెండో విడత పోలింగ్‌లో 69.44 శాతం, మూడవ విడత పోలింగ్‌లో 67.99 శాతం పోలింగ్ నమోదయింది. మే 19 వరకు మరో మూడు విడత పోలింగ్ జరుగనుంది. మే 23వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. నాలుగో విడత ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల చైతన్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడా చూసినా సరే ఉదయం నుంచే వారు బారులు కట్టి కనిపిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈసారి దేశవ్యాప్తంగా పలు పార్టీలు, నాయకులు మహిళా ఓటర్లను ఆకర్షించడంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. మహిళా ఓటర్లను ఆకట్టుకున్నట్లయితే వారు కచ్చితంగా అనుకున్న పార్టీకి వేస్తారని, మగవారిలాగా వారిలో ఊగిసలాట ధోరణి ఉండదని వారి నమ్మకం. పోలింగ్‌లో ఒక్క శాతం ఓటు పెరిగినా అభ్యర్థుల జాతకాలు తారుమరయ్యే అవకాశం ఉండడంతో మహిళా ఓటర్ల శాతంపైన దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం పెరిగింది. అయితే ఓటింగ్ వయస్సు వచ్చినప్పటికీ కొంత మంది మహిళలు ఓటర్లుగా నమోదవడం లేదు. దేశవ్యాప్తంగా 45.10 కోట్ల మంది మహిళలకు ఓటు హక్కు వయస్సు రాగా, వారిలో 43 కోట్ల మంది మహిళలు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఓటర్లుగా నమోదు కాలేదు. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గంలో సరాసరి 38 వేల మంది మహిళల ఓట్లు గల్లంతైనట్లే. పలు లోక్‌సభ సీట్లలో ఇంతకన్నా తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడిపోవడం లేదా గెలవడం తెల్సిందే. ఓటు హక్కు కలిగిన మహిళలు మాత్రం పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 33 శాతం పురుషులు ఓటేయగా, 29 శాతం మహిళలు ఓటేశారు. ఆ ఎన్నికల ద్వారానే ఇప్పటివరకు అత్యధికంగా 16వ లోక్‌సభకు అత్యధికంగా మహిళలు ఎన్నికయ్యారు. మొత్తం లోక్‌సభ ఎంపీల్లో వారి ప్రాతినిథ్యం 11.4 శాతానికి పెరిగింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 55.82 శాతం మంది మహిళలు ఓట్లు వేయగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారి శాతం 65.63 శాతం మహిళలు ఓట్లు వేశారు. ఆ ఎన్నికల్లో పురుషులు 67.17 శాతం మంది ఓట్లు వేశారు. అంటే పురుషులకన్నా రెండు శాతం కన్నా తక్కువ మంది మహిళలు ఓట్లువేశారు. ఈసారి కచ్చితంగా పురుషుల సంఖ్యను మించి మహిళలు ఓట్లు వేస్తారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. -
ఆమే కింగ్ మేకర్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యం ఎవరికి ప్రయోజనం చేకూర్చనుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గంలో పురుషులతో పో ల్చితే మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్సాహంగా పోలింగ్ పోలిం గ్ బూత్‌లకు వచ్చి ఓటేశారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకంగా మారిన ఈ మహిళలు ఎవరికి పట్టం గడతారనేదానిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరి«ధిలో మొత్తం 15.53 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 7.37 లక్షల మంది పురుష ఓటర్లు కాగా, 8.15 లక్షల మంది మహిళా ఓటర్లు న్నారు. వాస్తవానికి పురుషుల కంటే మహిళ ఓటర్లు సుమారు 78 వేలు (సుమారు పది శాతం) అధికంగా ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్ రోజు 5.87 లక్ష ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 4.73 లక్షల మంది ఓట్లేయగా, వారికి 1.13 లక్షల మంది మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. మొత్తం 68.33 శాతం పోలింగ్ జరిగింది. 64.22 శాతం మంది పురుషులు ఓటేస్తే., మహిళలు 72.06 శాతం ఓటేశారు. అంటే సుమారు 7.64 శాతం మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మహిళా ఓటింగ్ శాతం అత్యధికంగా ఉంది. ఏకంగా 27,277 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓట్లేశారు. భారీగా పెరిగిన ఈ పోలింగ్ తమకే అనుకూలమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికుల భృతి, వితంతు పింఛన్లు, ఒంటరి మహిళలు.. ఇలా రకరకాల పింఛన్ల పొందుతున్న లబ్ధిదారులు తమకే పట్టం కడతారని టీఆర్ఎస్ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వీరికి ప్రతినెల రూ.వెయ్యి చొప్పున పింఛన్లు ఠంచనుగా అం దుతున్నాయి. ఈ పింఛను మొత్తాన్ని వచ్చే నెల నుంచి రూ.2,016కు పెంచుతామని ఇటీవల టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. వీటితో పాటు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను మహిళల నుద్దేశించి పకడ్బందీగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమ లు చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కల్వకుంట కవిత కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మహిళలతో మమేకమయ్యారు. దాదాపు అన్ని ప్రచార సభల్లోనూ మహిళ ల సందడే అధికంగా కనిపించింది. తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లోనూ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెరిగిన మహిళా ఓటింగ్ తమ కు అనుకూలమని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇటు బీజేపీ కూడా మహిళా ఓటర్లపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛనులో కేంద్ర సర్కారు వాటా అధికంగా ఉందనే అంశాన్ని ఆ పార్టీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో మహిళలకు వివరించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉపాధి హామీ, మరుగుదొడ్ల వంటి పథకాలను ప్రస్తావించి మహిళా ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తనను గెలిపిస్తే ఉచితంగా గృహాల నిర్మాణం వంటి పథకాలను అమలు చేయిస్తానని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీలతో పోల్చితే కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రంగానే సాగినా.. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు తంటాలు పడింది. రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదనే అంశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లి అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం ఆ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయేనని, అమ్మ రుణం తీర్చుకోవాలనే సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకునేందుకు అడుగులు వేశా రు. మరోవైపు కాంగ్రెస్ ఆ పార్టీ మహిళా అధ్యక్షులు నేరెళ్ల శారద, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి వంటివారిని ప్రచారంలో భాగస్వామ్యులను చేసింది. మొత్తం మీద ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేశారు. గెలుపు ఓటములను నిర్దేశించే ఈ మహిళా ఓటర్లు ఎవరి కి పట్టం కట్టబెడతారనే అంశంపై ఉత్కంఠ ఫలితాల వెల్లడి వరకు కొనసాగనుంది. -
ఓటర్ల నమోదులో వివక్ష
దేశంలో ఒక పక్క ఓటింగ్‌లో మహిళా చైతన్యం వెల్లువెత్తుతుండగా, మరో పక్క వారి ఓట్లు భారీగా గల్లంతవుతున్నాయి. ప్రముఖ సిఫాలజిస్ట్ ప్రణయ్‌రాయ్ తన తాజా పుస్తకం ‘వెర్డిక్ట్’లో ఈ విషయాన్ని బయటపెట్టారు. 1962లో మహిళా ఓటర్లలో 47 శాతం మందే ఓటేశారు. 2014కి వచ్చేసరికి వారి ఓటింగ్ శాతం 66కి పెరిగింది. 1962లో పురుషులకన్నా స్త్రీల ఓటింగ్ 15 శాతం తక్కువగా నమోదైంది. 2014 నాటికి ఈ వ్యత్యాసం 1.5 శాతానికి తగ్గింది. ఎన్నికలకు సంబంధించి మహిళల్లో చైతన్యం పెరిగిందనడానికి ఇదొక సంకేతం. అయితే మరోపక్క ఓటర్ల జాబితాలో నేడు 2.34 కోట్ల మంది స్త్రీలు అంతర్థానమయ్యారని ప్రణయ్‌రాయ్ అధ్యయనంలో తేలింది. జనాభా లెక్కలను, అందులో స్త్రీ పురుషుల ఓటర్ల శాతాన్ని పోల్చి ఆయన ఈ లెక్క తేల్చారు. దేశ పురుష జనాభాలో 97.2 శాతం ఓటర్లుగా నమోదయ్యారు. కానీ మహిళా ఓటర్ల విషయంలో ఇది 92.7 శాతమే. ఈ విధంగా 18 ఏళ్లు నిండిన 2.34 కోట్ల మంది స్త్రీలు తమ ఓటు హక్కు కోల్పోయారు. అంటే ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 40 వేల ఓట్లన్నమాట! ఓటర్ల జాబితాల్లో మహిళలు మిస్ కావడం వెనుక సామాజిక, రాజకీయ కారణాలున్నాయని ప్రణయ్‌రాయ్ విశ్లేషించారు. ఉదాహరణకు అమెరికాలో లక్షలాదిమంది నల్లజాతి ఓటర్ల పేర్లు నమోదు కానీయకుండా చేస్తున్నారు. భారత్ వంటి సమాజాల్లో కేవలం స్త్రీలు కావడం వల్లే విద్య, వైద్యం, ఆహారం సహా రకరకాల సేవల విషయంలో వారి పట్ల వివక్ష కనబరుస్తున్నారు. దేశంలో జరిపిన పలు అధ్యయనాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. మహిళల పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయడంలోనూ ఈ విధమైన వివక్ష ఉంటున్నదని ప్రణయ్‌రాయ్ వివరిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం మహిళల ఓటింగ్ భారీగా పెరగడమనేది ‘జండర్’ అంశాలు రాజకీయ చర్చలో భాగమయ్యేందుకు దారితీసింది. పార్టీలు, నాయకులు స్త్రీల అభివృద్ధి కోణంపై దృష్టి పెట్టేందుకు దోహదపడింది. మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచించి ఓటేయడాన్ని, కుటుంబ ప్రభావం నుంచి కొంతమేరకు బయటపడటాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అంతర్థానమయిన మహిళా ఓటర్ల పేర్లు నమో దు చేయించేందుకు ఈసీ తక్షణమే చర్యలు చేపట్టాల్సి వుంది. ముస్లింలూ, దళితులూ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు వేర్వేరు పరిశోధనలు పేర్కొన్నాయి. నిజానికి మన ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేస్తున్నది ఈ వర్గాలేనని, గత కొన్ని దశాబ్దాలుగా ముస్లిం, దళిత, మైనార్టీ, మహిళా ఓటర్ల ఓటింగ్ గణనీయంగా పెరుగుతూ వస్తున్నదని ప్రొఫెసర్ జావేద్ ఆలం తన పరిశోధన గ్రంథం ‘హూ వాంట్స్ డెమోక్రసీ’లో వెల్లడించారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డిబేట్స్ ఇన్ డెవలప్మెంట్ పాలసీ వ్యవస్థాపకులు ఆబూసలే షరీఫ్ ప్రకారం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తది తర రాష్ట్రాల్లోని 50శాతం ముస్లిం కుటుంబాల్లో ఇంటికొక పేరన్నా ఓటర్ల జాబితా నుంచి మాయమైపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం కుటుంబాల్లో సగటున నలుగురు సభ్యులుంటే ముగ్గురికే ఓటున్నట్టు బయటపడింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40–50 ముస్లిం కుటుంబాలపై జరిపిన పరిశీలనలో ఇంటికొక్క ఓటు మాత్రమే నమోదైనట్లు తేలింది. జనగణన లెక్కల ప్రకారం కర్ణాటకలో దాదాపు 60 లక్షల ఓట్లు నమోదు కాలేదని షరీఫ్ పేర్కొన్నారు. ఈ విధంగా దేశంలో 3 కోట్ల ముస్లింలు, నాలుగు కోట్ల మంది దళితుల ఓట్లు మిస్ అయినట్టు సాఫ్ట్వేర్ నిపుణులు ఖలీద్ సైఫుల్లా చెబుతున్నారు. స్పెల్లింగ్ తప్పులు, ఉర్దూలో వయసు నమోదు, వివక్ష వంటివి ఇందుకు కారణాలుగా కనబడుతున్నాయని ఆయన అన్నారు. మన సమాజంలో మహిళలు, దళిత బహుజనులే అత్యధిక వివక్ష ఎదుర్కొంటున్నారనే సత్యం చివరికి ఓటర్ల జాబితాల్లో సైతం బయటపడింది. - బి.భాస్కర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, 9989692001 -
ఆమెదే ఆధిపత్యం
పాలమూరు: అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా ముందు వరుసలో ఉంటున్నారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల వరకు మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో పురుషుల కంటే అధికంగా ఓటేసి తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు. నాలుగు సెగ్మెంట్లలో.. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో పురుషుల కంటే అధిక సంఖ్యలో మహిళలు ఓటేశారు. పార్లమెంట్ పరిధిలో 15,05,190 మంది ఓటర్లు ఉండగా వీటి లో 9,82,890 మంది ఓటు వినియోగించుకున్నారు. అందులో మహిళలు 4,89,453, పురుషులు 4,93,435 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే మహిళలు పురుషుల కంటే కేవలం 3,982 ఓట్లు మాత్రం తగ్గాయి. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే నాలుగింటిలో వారే ముందంజలో ఉన్నారు. దీంట్లో కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 64,158 మంది పురుషులు ఓటు వేయగా, 67,454మంది మహిళలు ఓటువేశారు. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గంలో 63,702మంది పురుషులు ఓటు వేయగా, 65,680మంది మహిళలు ఓటు వేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో 71, 572మంది పురుషులు ఓటు వేయగా, మహిళలు 71728 మంది ఓటు వేశారు. మక్తల్ నియోజకవర్గంలో 69,910మంది పురుషులు ఓటు వేయగా 71,608మంది మహిళలు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. -
1,86,17,091 మంది ఓటేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లకు గాను 1,86,17,091 (62.69 శాతం) మంది ఓటేశారు. 1,49,19,751 మంది పురుష ఓటర్లలో 93,73,320 (62.82శాతం) మంది, 1,47,76,024 మంది మహిళా ఓటర్లలో 92,42,193 (62.55శాతం) మంది, 1,504 మంది ఇతర (ట్రాన్స్‌జెండర్) ఓటర్లలో 232(15.43శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో పురుషుల కంటే మహిళల పోలింగ్ అధికంగా నమోదు కావడంతో ఇక్కడి ఫలితాలు ఆసక్తికరంగా మారనున్నాయి. మిగిలిన 14 లోక్‌సభ స్థానాల్లో పురుష ఓటర్లే స్వల్ప ఆధిక్యతను సాధించారు. రాష్ట్రస్థాయిలో సగటున స్త్రీ, పురుషుల ఓటింగ్ నిష్పత్తి సమానంగా నమోదు కావడం గమనార్హం. ఇందూరులో పోటెత్తిన మహిళా ఓటర్లు నిజామాబాద్ స్థానంలో మొత్తం 10,61,124 ఓట్లు పోలవ్వగా, అందులో 4,73,673 మంది పురుషులు, 5,87,447 మహిళలు, నలుగురు ఇతరులున్నారు. పురుషుల ఓటింగ్ 64.22 శాతం, మహిళల ఓటింగ్ 72.06 శాతం నమోదైంది. పురుషుల కంటే 1,13,774 మహిళా ఓట్లు అధికంగా పడ్డాయి. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీజేపీ నుంచి ధర్మవురి అరవింద్ పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసిన రైతన్నలు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో 5,58,352 (68.49%) మంది పురుషులు, 5,88,108 (70.38%) మంది మహిళలు ఓటేయడంతో ఇక్కడి ఫలితాలు సైతం ఆసక్తికరంగా మారాయి. మే 23న లోక్‌సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. -
పర్చూరులో యువత, మహిళా ఓటర్లే కీలకం
సాక్షి, పర్చూరు (ప్రకాశం): నియోజకవర్గ ఓటర్ల సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికలకు మొత్తం 2,14,392 మంది ఓటర్లు ఉండగా ఆ సంఖ్య 2019 ఎన్నికల నాటికి 2,29,742 పెరిగింది. అంటే 15,350 మంది ఓటర్లు పెరిగారు. పెరిగిన ఓట్లలో మహిళలు, యువతే కీలకం కానున్నారు. కొత్తగా నమోదైన ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమోదుకు ఉత్సాహం చూపిన యువత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఓట్ల నమోదు చేర్పులు, మార్పులకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 11 నాటికి పర్చూరు నియోజకవర్గ ఓటర్లు 2,19,427 మంది ఉండగా, అందులో పురుషులు 1,07,547 మంది, స్త్రీలు 1,11,870 మంది ఉన్నారు. దీనిలో మహిళా ఓటర్లే 4,323 మంది అధికంగా ఉన్నారు. అయితే చేర్పులు, మార్పుల విషయంలో ఫాం 6, ఫాం 7కు సంబంధించి వచ్చిన దరఖాస్తులు వివాదాస్పదమయ్యాయి. ఓటర్లు తమ ఓట్లు తామే తీసేయాలంటూ వచ్చిన అర్జీలపై పునర్విచారణ జరిగింది. దీంతోపాటు మళ్లీ నూతన ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి మార్చి 15వ తేదీ వరకూ చేర్పులకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 11 నుంచి మార్చి 11 వరకు 7782 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా, మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు 3020 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10,802 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 10,315 మందికి ఓటు హక్కు లభించింది. దీనిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసు వారే అధికంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. దీంతో ప్రస్తుతం 2019లో పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2,29,742 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,17,463 మంది మహిళలు కాగా, 1,12,269 మంది పురుషులు ఉన్నారు. అయితే వీరిలో పురుషుల కన్నా 5,194 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇతరుల కింద మార్టూరు మండలంలో ఇద్దరు, ఇంకొల్లు మండలంలో నలుగురు, చినగంజాం మండలంలో నలుగురు చొప్పున మొత్తం 10 మంది ఇతర ఓటర్లు అంటే థర్డ్ జండర్లు కూడా ఉన్నారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా ప్రస్తుత ఓటర్ల వివరాలు... మండలం మహిళా ఓటర్లు పురుష ఓటర్లు మొత్తం ఓటర్లు మార్టూరు 29,307 28,912 58,221 యద్దనపూడి 11,526 10,313 21,839 పర్చూరు 22,138 20,856 42,994 కారంచేడు 16,934 15,998 32,932 ఇంకొల్లు 21,133 19,987 41,124 చినగంజాం 16,425 16,203 32,632 మొత్తం ఓటర్లు 1,17,463 1,12,269 2,29,742 మండలాల వారీగా ఈ ఏడాది పెరిగిన ఓటర్లు మండలం పెరిగిన ఓటర్లు మార్టూరు 3751 యద్దనపూడి 788 పర్చూరు 1548 కారంచేడు 1145 ఇంకొల్లు 1604 చినగంజాం 1479 -
అతివలే అధికం.. వారే కీలకం
సాక్షి, విశాఖపట్నం: అన్ని రంగాల్లో అతివలు ముందంజ వేస్తున్న కాలమిది. చట్టసభలకు ఎవరు వేళ్లేదీ నిర్ణయించే విషయానికి కూడా ఇది వర్తిస్తుంది. మిగిలిన ప్రాంతాల సంగతి అటుంచితే.. విశాఖ జిల్లాలో మాత్రం ఇది అక్షరసత్యమవుతోంది. జిల్లాలోని 15 నియోజకవర్గాలలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంగతే అధికంగా ఉంది. అయిదేళ్ల కిందటి పద్ధతిని కొనసాగించే విధంగా ఈసారి కూడా మగువలదే పైచేయిగాఉంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 35,78,458 మంది ఓటర్లున్నారు. వారిలో 17,75,630 మంది పురుషులు కాగా, 18,02,631 మంది మహిళా ఓటర్లున్నారు. ఈ లెక్కన చూస్తే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు జిల్లాలో 27,001 మంది అధికంగా ఉన్నారు. ఇక గత ఎన్నికలతో పోల్చినా వీరి సంఖ్య అధికంగానే కన్పిస్తోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లలో 16,70,307 మంది పురుషులుండగా, 16,76,105 మంది మహిళలున్నారు. 2014లోని సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాదికి మహిళా ఓటర్లు 1,26,526 మంది, పురుష ఓటర్లు 1,05,323 మంది పెరిగారు.కాగా గతఎన్నికల సమయానికి 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండగా, ఈసారి అదనంగా మరో నియోజకవర్గంలో కూడా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్టుగా లెక్క తేలింది. కేవలం నాలుగు నియోజకవర్గాల పరిధిలోనే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు కాస్త అధికంగా ఉన్నారు. దీంతోఈసారి కూడా మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా పేర్కొనక తప్పదు. బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలు తలకిందులు చేసే సత్తా మళ్లీ వీరికే ఉందని స్పష్టమవుతోంది.పురుష ఓటర్లు మహిళా ఓటర్ల కంటే అత్యధికంగా విశాఖ పశ్చిమలో ఉన్నారు. అదే విధంగా మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే పాడేరులో అత్యధికంగా ఉన్నారు. మహిళల కంటే పురుష ఓటర్లు అధికంగా నియోజకవర్గాలను పరిశీలిస్తే పెందుర్తి (799 మంది), విశాఖ పశ్చిమ(7328 మంది), విశాఖ దక్షిణం (187 మంది), గాజువాక (5773 మంది) తేలాయి. ఇక పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు భీమిలి (1671 మంది), విశాఖ తూర్పు (2865 మంది) విశాఖ ఉత్తరం (566 మంది), యలమంచలి (3585 మంది), పాయకరావుపేట (2389 మంది), అనకాపల్లి (4956 మంది), నర్సీపట్నం (5410 మంది), చోడవరం(5312 మంది), పాడేరు (6088 మంది), మాడుగుల (3632 మంది) అరకు (4604 మంది)లలో అధికంగా ఉన్నారు. ఓటుహక్కు వినియోగంలోనూ వారే 2014 ఎన్నికల పోలింగ్ సరళిని గమనిస్తే 15 నియోజకవర్గాల్లో 24,08,696 మంది (71.97) తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. వీరిలో పురుషుల కంటే మహిళలే అధికం. నాటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 12,02,726 మంది కాగా, మహిళా ఓటర్లు 12,05,969 మంది. మొత్తం మహిళా ఓటర్లలో 71.95 శాతం మంది మహిళలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహిళలను అత్యధిక సంఖ్యలో చట్టసభలకు పంపాలన్న లక్ష్యం మేరకు ఈసారి వైఎస్సార్సీపీ మహిళలకు పెద్దపీట వేసిన సంగతి విదితమే. దీంతో గతంతో పోలిస్తే ఈసారి బరిలో నిలిచిన వారిలో మహిళా అభ్యర్థులు అధికంగానే ఉన్నారు. వైఎస్సార్సీపీ తరపున అనకాపల్లి, అరకు లోక్‌సభ స్థానాల నుంచి డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, అలాగే పాడేరు, విశాఖ తూర్పు నియోజకవర్గాల నుంచి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అక్కరమాని విజయనిర్మల బరిలో నిలిచారు. మహిళా అభ్యర్థులు అత్యధికంగా బరిలోకి దిగడంతో వారిని ఎలాగైనా చట్టసభలకు పంపాలన్న పట్టుదల మహిళల్లో కన్పిస్తోంది. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నూరు శాతం మహిళలు ఓట్లు వేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అంతేకాకుండా వైఎస్సార్సీపీ మహిళల కోసం ప్రకటించిన వైఎస్సార్ చేయూత (నాలుగు విడతల్లో ఉచితంగా రూ.75 వేలు పంపిణీ), డ్వాక్రా రుణమాఫీ (ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉందో ఆ మొత్తం నాలుగు విడతల్లో జమ చేయడం) వంటి హామీలు కూడా మహిళలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. అంతా అనుకున్నట్టే జరిగితే చాలా మంది అభ్యర్థుల తలరాతలు మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మొత్తం ఓటర్లు 35,78,458