ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రిమ్స్ మెడికల్ కళాశాల
జిల్లాకు పత్తి పరిశోధన ఉపకేంద్రం
మొదలైన ఎన్‌హెచ్ 353(బి) పనులు
కొత్తగా మూడు మండలాలు
రిమ్స్‌కు 60 సీట్లతో డీఎంఎల్‌టీ కోర్సు
అడవులు, ఆదివాసీలతో కూడిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయి. ఇక్కడి పత్తికి మహర్దశ కల్పించేలా జిల్లాకు కేంద్ర ప్రభుత్వం పత్తి పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసింది. దీంతో భవిష్యత్తులో మరింత నాణ్యమైన పత్తి ఉత్పత్తే లక్ష్యంగా ఇక్కడ జాతీయస్థాయిలో పరిశోధనలు సాగనున్నాయి. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భోరజ్ నుంచి చంద్రాపూర్ వరకు గల అంతర్రాష్ట్ర రహదారికి జాతీయ హోదా లభించి పనులు సైతం మొదలయ్యాయి. అంబారీ నుంచి పిప్పల్‌కోటి వరకు విద్యుదీకరణతో కూడిన రైల్వేప్రయాణం ప్రారంభమై వ్యాపార, వాణిజ్య అభివృద్ధికి మార్గం సుగమమైంది. పలు గ్రామాల ప్రజల దశాబ్దాల కలను నిజం చేసేలా కొత్తగా మూడు మండలాలకు సైతం మోక్షం లభించింది. పారామెడికల్ కోర్సుల్లో ఉచిత విద్యనందించేలా ప్రత్యేక కోర్సులను మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో జిల్లా అభివృద్దికి కొంత ప్రయోజనం చేకూరగా వచ్చే ఏడాదిలోనూ ఇదే ఒరవడి కొనసాగతే మరింత ప్రయోజనం కలుగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. – కై లాస్‌నగర్
నాణ్యమైన పత్తి ఉత్పత్తికి దోహదం..
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కింద పనిచేసే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) దేశంలో సాగయ్యే అన్ని పంటలకు సంబంధించి పరిశోధనలు చేస్తోంది. తాజాగా అఖిల భారత పత్తి పరిశోధన పథకం (ఏఐసీఆర్‌పీ) కింద ఆదిలాబాద్‌కు పత్తి పరిశోధన ఉపకేంద్రాన్ని మంజూరు చేసింది. కాటన్ సాగులో నూతన వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. వీటిలో చీడపీడల సమస్యతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రెండు దశాబ్దాల క్రితం జిల్లాలో పత్తికి సంబంధించి నాన్‌బీటీ రకాలైన సంకర, సూటితో పాటు దేశావళి రకాలను సాగు చేసేవారు. ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అప్పటినుంచి ఆ వైరెటీలపైనే పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. 2002–03 నుంచి బీటీ పత్తి విత్తనాల సాగును రైతులు అవలంభిస్తున్నారు.ఈ సాగులో రైతులు కొత్త కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి, అందులో ఆదిలాబాద్ పత్తికి డిమాండ్ ఉన్నందున ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు పరిశోధన కేంద్రం ఏర్పాటు తోడ్పడనుంది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి.. ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీంతో నాణ్యమైన పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశమేర్పడి రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
60 సీట్లతో కొత్త కోర్సు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రిమ్స్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఇప్పటికే నర్సింగ్ కళాశాల కొనసాగుతుంది. తాజాగా సూపర్ సేవలను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అప్తాల్మిక్, డీఎంఎల్‌టీ కోర్సులను మెడికల్ కళాశాలకు మంజూరు చేసింది.
ఆయా విభాగాల్లో 60 సీట్లను కేటాయించింది. దీంతో వైద్య విద్యతో పాటు అనుబంధ కోర్సుల్లోనూ విద్యనభ్యసించేందుకు అవకాశమేర్పడింది. పేద విద్యార్థులకు లబ్ధి చేకూరడంతో పాటు దాని ద్వారా జిల్లాలోని రోగులకు ప్రయోజనం చేకూరే అవకాశముంది.
పాలన చేరువయ్యేలా...
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను వారికి మరింత చేరువచేసేలా ప్రభుత్వం జిల్లాలో కొత్తగా మూడు మండలాలను ఏర్పాటు చేసింది. ఇందులో బోథ్‌లో సొనాల, జైనథ్‌లో భోరజ్, బేల, ఆదిలాబాద్ రూరల్, జైనథ్ మండలాల్లోని పలు గ్రామాలను విభజించి కొత్తగా సాత్నాల మండల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సర్కారు ఆదేశాలకనుగుణంగా అధికారులు ఆ యా మండలాల్లో పాలన వ్యవహారాలు ప్రారంభించేలా కసరత్తు చేపట్టారు. మండల కార్యాలయాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కొత్త ఏడాదిలో ఆయా కార్యాలయాల్లో పాలన వ్యవహారాలు ప్రారంభమయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment