పల్నాడు దొంగ జంట మోసం | - | Sakshi
Sakshi News home page

పల్నాడు దొంగ జంట మోసం

Published Fri, Jan 3 2025 1:17 AM | Last Updated on Fri, Jan 3 2025 1:17 AM

పల్నాడు దొంగ జంట మోసం

పల్నాడు దొంగ జంట మోసం

పరిచయం పెంచుకుని దొంగతనాలు

అచ్యుతాపురంలో రూ.2.80 లక్షల తస్కరణ

గతంలో పిఠాపురం, చోడవరంలోనూ చోరీలు

వివరాలు వెల్లడించిన డీఎస్పీ సత్యనారాయణ

అచ్యుతాపురం: బంగారు వస్తువుని చూపించి నమ్మబలుకుతారు. ముఖ్యంగా వాణిజ్య దుకాణదారుల్ని లక్ష్యంగా చేసుకుని పరిచయాలు పెంచుకుంటారు. ముందుగా దుకాణం వద్దే బంగారం వస్తువు ఉంచడంతో నమ్మకంగా భావించిన దుకాణదారులు వారితో మాట్లాడే సమయంలో దొంగ జంటలో ఒకరు నగదు తస్కరిస్తారు. ఇలా మూడు ప్రాంతాల్లో దొంగతనాలు చేసిన పల్నాడు జిల్లాకు చెందిన జంటను అచ్యుతాపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు సేకరించిన సమాచారం, డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం...

నమ్మించి మోసం చేస్తున్న దొంగ జంట...

పల్నాడు జిల్లాకు చెందిన యూ సత్యనారాయణ, కల్యాణి భార్యాభర్తలమని చెప్పి అచ్యుతాపురంలోని ఒక బట్టల దుకాణం నిర్వాహకులతో పరిచయం పెంచుకున్నారు. గత నెలలో ఒకసారి వచ్చి బంగారం బిస్కట్‌ లాంటి వస్తువుని ఇచ్చి అమ్మి పెట్టాలని, తమ కుటుంబంలో వారి వివాహానికి బట్టలు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పి వెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత (డిసెంబర్‌ 18న) దుకాణం వద్దకు వచ్చిన భార్య నిర్వాహకులను మాటల్లో పెట్టి బట్టలు చూస్తుండగా, భర్త దుకాణంలోని రూ.2.80 తస్కరించాడు. భార్య కూడా మరో రూ.80 వేలు చోరీ చేసింది. వారిద్దరూ అక్కడి నుంచి చల్లగా జారుకున్న తర్వాత మోసపోయామని గుర్తించిన యజమాని అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ గణేష్‌, ఎస్‌ఐ సుధాకర్‌, సిబ్బంది మల్లేశ్వరరావు, బంగారయ్య గురువారం అచ్యుతాపురంలో అనుమానంగా సంచిరిస్తున్న నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సొమ్మును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పల్నాడుకు చెందిన వీరిద్దరు భార్యాభర్తలు కాదని గుర్తించారు. గతంలో వీరు పిఠాపురం, చోడవరం ప్రాంతాల్లో చోరీ చేసి, అచ్యుతాపురంలోనూ తతంగం పూర్తి చేశారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఇటువంటి గుర్తు తెలియని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరినీ నమ్మవద్దని డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement