20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి.. ఉసూరుమని వెనక్కి
రెండవ తేదీ దాటినా పింఛన్లకు నోచుకోని లబ్ధిదారులు
పోతంగి పంచాయతీలో జాంగుడ, బిజువారవలస గిరిజనుల అవస్థలు
ప్రతినెలా ఠంచన్‌గా పింఛను అందిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. గత ప్రభుత్వంలో ప్రతినెలా ఒకటో తేదీన పండుటాకులు పింఛను పొందేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పోతంగి పంచాయతీకి చెందిన జాంగుడ, బిజువారవలస పింఛనుదారులు ఎదుర్కొంటున్న సమస్యే ఇందుకు ఉదాహరణ. ఈనెల రెండవ తేదీ గడిచినా ఆయా గ్రామాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో పింఛన్లు అందలేదు. వలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్లే తమకు ఈ దుస్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు.
డుంబ్రిగుడ: వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో పింఛను లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతినెలా ఒకటో తేదీన ఠంచన్‌గా పింఛను అందేది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నరకం చూస్తున్నారు. ఇందుకు డుంబ్రిగుడ మండలంలోని పోతంగి పంచాయతీలో జాంగుడ, బిజువారవలస గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఈ పంచాయతీ పరిధిలో 36 గ్రామాలు ఉన్నాయి. వీటిలో జాంగుడ, బిజువారవలస గ్రామాలకు నెట్ వర్క్ అందుబాటులో లేకపోవడంతో తరచూ బయోమెట్రిక్ సమస్య తలెత్తుతోంది.
గత ప్రభుత్వంలో ఒకటో తేదీ వేకువజామునే..
గత ప్రభుత్వంలో నెట్‌వర్క్ సమస్య ఉన్నప్పటికీ గ్రామ వలంటీర్లు అధిగమించి వారికి ఒకటో తేదీన వేకువజామున పింఛను ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీరి సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆ రెండు గ్రామాల్లో సుమారు 50 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరందరికీ గతనెల 31న తేదీన పింఛను అందాల్సి ఉంది. ఈ మేరకు వారంతా ఆయా గ్రామాల్లో వేచి ఉన్నారు. సిబ్బంది వెళ్లినా నెట్‌వర్క్ సమస్య కారణంగా బయోమెట్రిక్ కాలేదు. దీంతో వారు వెనక్కి వచ్చేశారు.
రోజంతా తిండిలేక..
నూతన సంవత్సరం కావడంతో జనవరి ఒకటో తేదీన పింఛను పంపిణీ జరగలేదు. దీంతో నిరాశకు గురైన ఆయా గ్రామాలకు చెందిన పింఛను లబ్ధిదారులంతా 20 కిలోమీటర్ల దూరం నుంచి గురు వారం ఉదయం డుంబ్రిగుడలోని పోతంగి పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. రోజంతా పడిగాపులు పడ్డా రు. పింఛను లబ్ధిదారులు 50 మందిలో 20 మందికి మాత్రమే బయోమెట్రిక్ అవ్వడంతో వారు మాత్రమే పింఛను పొందగలిగారు. మిగతా వారంతా నిరాశతో వెనుదిరిగారు.
సాంకేతిక సమస్య కారణం కావొచ్చు
జాంగుడ, బిజువారవలస గ్రామాల లబ్ధిదారులకు పింఛను అందకపోవడానికి సాంకేతిక సమస్య కారణం కావొచ్చు. గిరిజనులు వ్యవసాయ పనులు చేయడంలో చేతుల వేళ్లు గట్టిపడినందున బయోమెట్రిక్ కావడం లేదు. ఇటువంటి సమస్య వచ్చే నెలలో తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
– ప్రేమ్‌సాగర్, ఎంపీడీవో, డుంబ్రిగుడ
గత నెలా ఇదే సమస్య
పింఛను పొందేందుకు గత నెలలో కూడా ఇబ్బందులు పడ్డాం. ఒకటో తేదీన కాకుండా 2, 3 తేదీల్లో పింఛన్లు తీసుకున్నాం. మూడు రోజులు గడుస్తున్నా పింఛను సొమ్ము అందలేదు. డుంబ్రిగుడ పంచాయతీ కేంద్రానికి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. రోజంతా పడిగాపులు పడ్డాం. – కిల్లో దశరథ్, జాంగుడ, పోతంగి పంచాయతీ, డుంబ్రిగుడ మండలం
వలంటీర్లులేనందునే..
గత ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థ వల్ల పింఛన్లు సక్రమంగా పంపిణీ జరిగేవి. ఇప్పుడు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పంపిణీ చేయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. వలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల మేము పడుతున్న ఇబ్బందులే ప్రత్యక్ష ఉదాహరణ. వలంటీర్ వ్యవస్థతో ఎంతో మేలు.
– కొర్రా కోములు, జాంగుడ, పోతంగి పంచాయతీ
Comments
Please login to add a commentAdd a comment