చట్రాపల్లి గిరిజనులకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు
సీలేరు: చట్రాపల్లి గిరిజనులకు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తామని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన గూడెంకొత్తవీధి మండలం అమ్మవారి ధారకొండ, గాలికొండ పంచాయతీల్లో ఆయన పర్యటించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. సప్పర్ల నుంచి అమ్మవారి ధారకొండ మీదుగా దుర్గం గొల్లపల్లి వరకు జరుగుతున్న రహదారి నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.సప్పర్ల, ధారకొండ, చట్రాపల్లి తదితర గ్రామాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణం పూర్తయితే మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సప్పర్లలో గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని వారు కోరారు. వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని చట్రాపల్లి గిరిజనులకు హామీ ఇచ్చారు. ఇందుకు గల అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల తుపానుకు అతలాకుతలమైన గూడెం కొత్తవీధి – సీలేరు రహదారి, వంతెనల వివరాలను పంచాయితీరాజ్ డీఈ కళ్యాణ్ కుమార్ నుంచి తెలుసుకున్నారు. అనంతరం సప్పర్ల పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై వైద్యాధికారి నుంచి తెలుసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు కూడా ఉండాలని సూచించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీరింగ్ అధికారులు, ఎస్‌ఐ అప్పలసూరి పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్
ధారకొండ, గాలికొండ పంచాయతీల్లో పర్యటన
Comments
Please login to add a commentAdd a comment