ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత కనుక , ముఖ్యమంత్రిగా ఇప్పటికే పద్నాలుగు ఏళ్లు పని చేసిన వ్యక్తి కనుక ,ఈసారి ఆయన పరిపాలనపైన, రాష్ట్ర అభివృద్దిపై దృష్టి పెడతారని ఆశించినవారికి ఆయన నిరాశే మిగుల్చుతున్నారు. ఆయన ఎప్పటిమాదిరే కక్ష సాధింపు రాజకీయాలకు,అసత్య ఆరోపణలకు ప్రాధాన్యం ఇస్తూ శాసనసభ టైమ్ ను కూడా వృధా చేస్తున్నారనిపిస్తుంది. శ్వేతపత్రాల పేరుతో ఆయన చేస్తున్న రాజకీయ ప్రసంగాలు,ఏపీలో తనకు, ఆ తర్వాత తన కుమారుడి రాజకీయాలకు ఎవరూ ఎదురు రాకూడదన్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. తన ప్రత్యర్ది పార్టీగా వైఎస్సార్‌సీపీ లేకుంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను అణగదొక్కితే తమకు తిరుగు ఉండదన్నది ఆయన భావన కావచ్చు.
జగన్ పాలన ఐదేళ్లలో శాంతి భద్రతలపై చంద్రబాబు ఇచ్చిన శ్వేతపత్రం చూస్తే ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వం పత్రాలు తయారు చేస్తుందా?అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. గత ప్రభుత్వ టైమ్ లో ఆయా విషయాలలో పోలీసులు పెట్టిన కేసులు తప్పుడివి అయితే, ఇప్పుడు తాను పెట్టిస్తానని చెబుతున్న కేసులు సరైనవని ఎలా నిర్ధారిస్తారు! దేశ ఎమర్జెన్సీతో జగన్ పాలనను పోల్చే యత్నం చేశారు. నిజానికి ఎమర్జెన్సీ తర్వాత ఇందిగాందీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ (ఐ) లో చేరింది చంద్రబాబే! ఆ తర్వాత ఎమ్మెల్యే అయింది ఆమె చలవవల్లే. ఆ రోజుల్లో కాంగ్రెస్ (ఐ) ఎమ్మెల్యేలంతా ఎమర్జెన్సీ చాలా గొప్పదని ప్రచారం చేశారు.
ఇప్పుడేమో చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు. నిజంగా జగన్ పాలనలో ఎమర్జెన్సీ ఉండి ఉన్నట్లయితే చంద్రబాబు ఆ ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యటించగలిగేవారా? తనే టీడీపీ వారిని రెచ్చగొట్టి వైఎస్సార్‌సీపీ వారిని కొట్టండి.. చంపండి.. అంటూ ఇష్టం వచ్చినట్లు అనగలిగేవారా?పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చేసేవారా? అయినా ఎమర్జెన్సీ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. అదే ఆయన గొప్పదనం.ముఖ్యమంత్రి జగన్‌ను సైకో అని ,ఇతరత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగలిగేవారా?. ఆయన కుమారుడు ,మంత్రి లోకేష్ ఆ రోజుల్లో రెడ్ బుక్ అంటూ కనిపించిన అధికారినల్లా బెదిరించగలిగేవారా? రాష్ట్రంలో ఎంత వీలైతే అంత శాంతిభద్రత సమస్య సృష్టించింది తెలుగుదేశమే. చంద్రబాబు నాయుడే. మళ్లీ ఇప్పుడు ఎదురు ఆరోపణలు చేస్తున్నది ఆయనే. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని తప్పులు జరుగుతాయి. కొన్ని కేసులు వస్తుంటాయి. వాటన్నిటిని ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కు పులిమితే కొత్తగా చంద్రబాబుకు కలిసి వచ్చేదేమిటో తెలియదు!కాకపోతే ఏదో ఒక కేసులో ఇరికించి జగన్‌ను, ఆయన పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు కనిపిస్తుంది.
అప్పుడు శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని చెబుతున్న చంద్రబాబాబు ఈ ఏభై రోజుల్లో తన హయాంలో జరిగిన అరాచకాలను ఏమని అంటారో కూడా శ్వేతపత్రంలో వివరించగలిగి ఉండాలి. ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ అంత పెద్ద ధర్నా జరిగితే ఆ ఊసే లేకుండా ఎదురు ఆరోపణలు చేస్తే శ్వేతపత్రం అయిపోతుందా?జనం నమ్మేస్తారా? వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన కొన్ని అత్యాచార ఘటనలను చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఇంత సీనియర్ అయిన చంద్రబాబు వ్యక్తిగత నేరాలను ప్రభుత్వానికి పులమడమే తప్పు. అది కరెక్టు అయితే ముచ్చుమర్రి ఘటనతో సహా సుమారు ఇరవై అత్యాచార ఘటనలు ఈ ఏభైఐదు రోజుల టీడీపీ పాలనలో జరిగాయి కదా!వాటి గురించి ఏమి చెబుతారు?తాను బాధ్యత వహిస్తారా? గంజాయి గురించి ఎప్పటి మాదిరి కల్లబొల్లి కబుర్లు చెప్పడం ద్వారా వైఎస్సార్‌సీపీని బదనాం చేయాలన్న లక్ష్యం తప్ప ఇంకొకటి కనిపించదు. వైఎస్ వివేకా హత్య జరిగింది గతంలో తన ప్రభుత్వ హయాంలోనే అయినా, అదేదో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిందేమో అన్న భ్రమ కలిగించే యత్నం చేశారు.
తనపై పదిహేడు కేసులు పెట్టారని ఆయన అన్నారు. తన జీవితంలో ఏనాడు కేసులు లేవని ఆయన అన్నారు. మరి పలు కేసులలో స్టేలు తెచ్చుకున్నారన్న ప్రచారానికి ఎన్నడూ బదులు ఇవ్వలేదు.తనను అక్కడకు వెళ్లనివ్వలేదని, ఇక్కడకు వెళ్లనివ్వలేదని..ఇలా ఏవేవో చెబుతున్నారు. ప్రత్యేక హోదా అంశంపై విపక్షనేతగా జగన్ ఉన్నప్పుడు ఆయన విశాఖలో విమానం దిగగానే రన్ వే పైనే ఆపి వెనక్కి పంపించింది చంద్రబాబు ప్రభుత్వమే కదా? అది తప్పు కానప్పుడు ఆయా సందర్భాలను బట్టి పోలీసులు వ్యవహరిస్తే తప్పు ఎలా అవుతుందో చెప్పాలి. తనపై పెట్టిన కేసుల వివరాలు వెల్లడించి తన తప్పు ఉందో లేదో వివరించకుండానే అసలు తాను అన్నిటికి అతీతుడను అన్నట్లు మాట్లాడడం ప్రజాస్వామ్యబద్దమేనా?పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజులకు సంబంధించి చంద్రబాబు పాతపాటే పాడారు.సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు తప్పు చేశారో, లేదో నిర్దారించకుండా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదని చంద్రబాబు అంటున్నారు.
మరి ప్రస్తుత తన పాలనలో పలువురు ఐపిఎస్ అధికారులు తనను కలవడానికి వస్తే కనీసం వారిని దగ్గరకు కూడా ఎందుకు రానివ్వలేదు?పైగా తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్య తీసుకుంటానని ఎందుకు హెచ్చరిస్తున్నారు?అప్పట్లో పనిచేసిన అదికారులు వైఎస్సార్‌సీపీ వారైతే, ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేసే అధికారులంతా టీడీపీ వారికింద చూడాలా?జెసి ప్రభాకరరెడ్డిపై అరవైఆరు కేసులు పెట్టారని ఆయన అంటున్నారు. ఎన్ని కేసులు అన్నది కాదు.. తప్పు చేశారా?లేదా?అన్నది ముఖ్యం?తప్పుడు సర్టిఫికెట్లతో బస్ లు కొనుగోలు చేశారా?లేదా?అన్నది చెప్పకుండా ప్రతిదానిని సమర్ధించడానికి శ్వేతపత్రం ఎందుకు!అలాగే ఇతర నేతలపై వచ్చిన అభియోగాలు ఏమిటి?వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలా? వద్దా ?అన్నది ఎందుకు చెప్పరు! కేసులు పెట్టించుకోవాలని టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేది వారే.వారు అల్లర్లు చేస్తే కేసులు పెడితే అదంతా వేధింపు అని ఇప్పుడు ఆరోపణ చేసేది వారే.
చంద్రబాబు స్టైలే అంత! ఇప్పుడు ఆయన కుమారుడు కూడా తోడయ్యారు.అంతే తేడా! ఫర్నీచర్ తీసుకువెళ్లండని జగన్ తరపు పిఎస్ ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రత్యారోపణ చేయడం ఏ పాటి నీతి. శ్వేతపత్రం అంటే 2014-2019 మధ్య ఎన్ని కేసులు ,ఏ తరహావి నమోదు అయ్యాయి?2019-2024 మధ్య ఏ కేసులు వచ్చాయి? జాతీయ క్రైమ్ రికార్డు ఏమి చెబుతోంది? మొదలైనవాటి ఆధారంగా కదా ఇలాంటి పత్రాలు ఇవ్వవలసింది.మహిళల భద్రతకు తెచ్చిన దిశ యాప్ ఏ రకంగా ఉపయోగపడింది?అన్నదానిపై కదా విశ్లేషణ ఇవ్వవలసింది!వీటన్నిటిని పక్కనబెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తానేదో ఇంకా విపక్షంలో ఉన్నట్లు, జగనేదో ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నట్లు పచ్చి అబద్దాలను, అసత్యాలను,ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిలో వచ్చిన తప్పుడు కధనాలను, తాను చేసిన ప్రసంగాలను కలిపి శ్వేతపత్రం అంటే ఏపీ జనం అంతా వెర్రివాళ్లా వినడానికి!..
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment