పేకాటస్థావరంపై దాడి
దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరంలో పేకాట స్థావరంపై ఎస్‌ఐ వెంకటప్పయ్య సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులు దొరకగా కొందరు పారిపోయారు. వారి నుంచి రూ.8,480 నగదు స్వాధీనం చేసుకున్నారు. సీఐ అశోక్ కేసు నమోదు చేశారు.
వేధింపుల కేసులో వ్యక్తి రిమాండ్
ఏన్కూరు: విడాకులు తీసుకున్నాక కూడా మహిళను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రఫీ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యాకూబ్‌పాషా, షేక్ జుబేదా 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, వివాహం జరిగాక నాలుగేళ్ల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో విడాకులు తీసుకున్నారు. ఆపై జుబేదా ఏన్కూరులో టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, తరచుగా ఆమె వద్దకు వస్తున్న యాకూబ్‌పాషా డబ్బు కావాలని, ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నావని వేధిస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన కూడా యాకూబ్‌పాషా వచ్చి జుబేదా తలపై కర్రతో కొట్టడంతో గాయాలు కాగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.
అంబేడ్కర్‌నగర్‌లో చోరీ
చండ్రుగొండ: మండల కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తంబళ్ల సీతమ్మ ఇంట్లో చోరీ జరిగిన ఉదంతం శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 31వ తేదీన తన ఇంట్లోని బీరువాలో రూ.4.500 నగదు, రూ.లక్ష విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయమని, తాను గమనించానని సీతమ్మ తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది.
మహిళ మెడలో గొలుసు..
మధిర: మధిర రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి చోరీ జరిగింది. మధిరకు చెందిన రమణ తన భర్తతో కలిసి ఖమ్మం ఆస్పత్రికి వెళ్లి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో వచ్చింది. ఆమె రైలు దిగుతుండగా హఠాత్తుగా ఓ వ్యక్తి ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో రమణ గొలుసును గట్టిగా పట్టుకోగా అది నిందితుడి చేతిలోకి సగం మేర మిగలడంతో పరారయ్యాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
కారేపల్లి మండలంలో..
కారేపల్లి: మండలంలోని మంగల్‌తండా శివారు చెరువు వద్ద పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారు కాగా, పట్టుబడిన నలుగురి నుంచి రూ.2,020 నగదుతో పాటు ఫోన్లు, బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై రాజారాం తెలిపారు.
బైక్ ఎత్తకెళ్లారు.. తెచ్చి పెట్టారు!
మధిర: మధిర రైల్వేస్టేషన్ నంబర్–2 ప్లాట్‌ఫామ్ వైపు నిలిపిన ద్విచక్రవాహనం గురువారం రాత్రి చోరీకి గురైంది. స్టేషన్‌లో క్లీనింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న జిలుగుమాడుకి చెందిన గద్దల వెంకటేశ్వర్లు తన బైక్‌పై వచ్చి పార్క్ చేశాక విధులకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బైక్ లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, సాయంత్రంకల్లా గుర్తుతెలియని వ్యక్తి బైక్‌ను అక్కడే పార్క్ చేసి వెళ్లడంతో వెంకటేశ్వర్లు ఊపిరిపీల్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment