చిత్తూరు: పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినా విచక్షణ మరిచాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై కనికరం వదిలేశాడు. గర్భిణి అనే దయాదాక్షిణ్యం కూడా లేకుండా దారుణంగా హతమార్చాడు. ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశాడు ఓ కిరాతకుడు. కట్టుకున్న భార్యని పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన వరదయ్యపాళం మండలం బత్తలవల్లం దళితవాడలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కాటయ్య సుమారు 8 ఏళ్ల క్రితం నాయుడుపేట సమీపంలోని పూనేపల్లెకు చెందిన పావనిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఇద్దరూ వేర్వేరు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. వీరికి ఐదేళ్లలోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇటీవల ఇరువురూ ఉద్యోగాలు మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమలో తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. తాజాగా సోమవారం ఉదయం 9 గంటల సమయంలో మళ్లీ ఘర్షణ పడడంతో కాటయ్య ఇంట్లోని కత్తి తీసుకుని పావని(30)పై దాడి చేశాడు. గొంతులో పొడిచి, తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని కాటయ్య బుకాయించేందుకు యత్నించినా అక్కడే ఉన్న మృతురాలి కుమార్తె అసలు విషయం చెప్పేసింది.
తండ్రే తమ తల్లిని చంపేశాడని వెల్లడించింది. దీనిపై సమాచారం అందుకున్న సీఐ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, ఏఎస్ షణ్ముగం తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. హత్యాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాటయ్య తల్లిదండ్రులను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీమ్ ద్వారా ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు.
ఉలిక్కిపడిన గ్రామం
హత్య విషయం తెలియగానే బత్తలనల్లం గ్రామం ఉలిక్కిపడింది. ప్రశాంతమైన పల్లెలో దారుణం జరగడంపై స్థానికులు ఆందోళన చెందారు. నిందితుడు కాటయ్య మానసిక పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేశారు. ఉద్యోగం మానేసినప్పటి నుంచి అదోలా ఉండేవాడని చెబుతున్నారు. పావని గర్భం దాల్చడంతో కంపెనీకి వెళ్లకుండా ఇంటికే పరిమితమైందని, అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కాటయ్య గ్రామంలో ఎవరితో మాట్లాడేవాడు కాదని వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment