గతనెల 14వ తేదీన పొలంలో తెగిపడిన వైనం
వాటికి మరమ్మతు చేయని విద్యుత్ సిబ్బంది
నీటి తడి కోసం పైపులను సరిచేస్తుండగా విద్యుదాఘాతం
మెంటాడ: పంట పొలంలో వరి ఆకుమడి తడిపేందుకు వెళ్లి తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి రైతు దంపతులు మృత్యువాత పడిన విషాద ఘటన విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని మీసాలపేటలో శుక్రవారం చోటు చేసుంది. ఉన్న కాస్త పొలాన్ని జీవనాధారంగా చేసుకున్న గ్రామానికి చెందిన రైతు దంపతులు కోరాడ ఈశ్వరరావు (54), ఆదిలక్ష్మి (48) ఒకరి వెంట ఒకరు తనువు చాలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశ్వరరావు గ్రామ సమీపంలోని పంట పొలంలో వరి ఆకుమడి తడిపేందుకు శుక్రవారం ఉదయం వెళ్లాడు.
గోపీనాథ్ పట్నాయిక్ చెరువు నుంచి ఇంజిన్‌తో నీరు తోడేందుకు పైపులు ఏర్పాటు చేసుకునే క్రమంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన భర్త ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో వెతుక్కుంటూ భార్య ఆదిలక్ష్మి వెళ్లింది. భర్త పొలంలో పడిపోయి ఉండడాన్ని చూసి లబోదిబోమంటూ లేపే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. అక్కడికి దగ్గరలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ విషయాన్ని గమనించి పరుగున వెళ్లాడు. విద్యుత్ తీగెను పరిశీలించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.
మృతుల ఇద్దరు పిల్లల్లో కుమార్తెకు వివాహం జరగగా, కుమారుడు డిగ్రీ పూర్తిచేసి ఉన్నత చదువు ప్రవేశ పరీక్షకు రాజమండ్రిలో కోచింగ్ తీసుకుంటున్నాడు. గజపతినగరం సీఐ ప్రభాకర్, ఆండ్ర ఎస్‌ఐ దేవి ఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యుత్ ఏడీ శివకుమార్, ఏఈ తిరుపతిరావుతో మాట్లాడారు. విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు.
విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం
గతనెల 14వ తేదీన వీచిన ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ తీగలను సరిచేయకపోవడం, ఆ తీగెల్లో విద్యుత్ సరఫరా కావడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. రైతు దంపతుల మృతితో విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment