నిందితురాలు బోగిరెడ్డి త్రిష్ణ
ఉప్పల్ (హైదరాబాద్): ఓ యువతి టీవీ యాంకర్‌ను ఇష్టపడింది. అయితే అతను నో చెప్పడంతో కిడ్నాప్‌నకు పథకరచన వేసింది. అది కాస్త ఫెయిల్ కావడంతో కటకటాలపాలైంది. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలు మల్కాజిగిరి ఏసీపీ పురుషోత్తంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. మాదాపూర్ అరుణోదయకాలనీకి చెందిన బోగిరెడ్డి త్రిష్ణ ఓ డిజిటల్ మార్కెటింగ్ సంస్థకు సీఈఓ. భారత్ మ్యాట్రిమోని పేరుతో ఇన్‌స్ర్ట్రాగాంలో చైతన్యరెడ్డి త్రిష్ణకు పరిచయమయ్యాడు. అయితే చైతన్యరెడ్డి ఉప్పల్‌కు చెందిన టీవియాంకర్ ప్రణవ్‌సిస్టా ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్ ప్రొఫైల్‌కు వాడుకున్నాడు. ప్రణవ్ ఫొటో చూసి త్రిష్ణ ఇష్టం పెంచుకుంది. వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపుతూ దగ్గరైంది.
దీనిని అదనుగా భావించిన చైతన్యరెడ్డి తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని త్రిష్ణను కోరాడు. దీంతో ఆమె పెద్ద మొత్తంలో ఫోన్‌పే ద్వారా పంపింది. తిరిగి డబ్బు చెల్లించమని అడగ్గా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన త్రిష్ణ కూపీ లాగగా, చైతన్యరెడ్డి ఫేక్ ఐడీ ద్వారా ప్రణవ్ సిస్టా ఫొటో వాడుకొని మోసం చేసినట్టు నిర్థారణకు వచి్చంది. వెంటనే ప్రణవ్‌ను మెసేజ్‌ల ద్వారా అలర్ట్ చేసింది. దీంతో ఆయన సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు. తర్వాత మెసేజ్‌ల ద్వారా పరిచయం పెంచుకొని ప్రణవ్‌ను మరింతగా ఇష్టపడింది. ఎలాగైనా అతడిని వశం చేసుకోవాలని ప్రయత్నించింది.
ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన కార్యాలయంలో పనిచేసే నలుగురి ద్వారా ప్రణవ్ వివరాలు తెలుసుకుంది. ఉప్పల్‌లో పార్కు చేసిన ప్రణవ్ కారుకు వారు జీపీఎస్(యాపిల్ ఎయిర్ ట్యాగ్) బిగించారు. దీని ద్వారా ప్రణవ్ కదలికలను గుర్తిస్తూ అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. అయినా ప్రణవ్ దారికి రాలేదు. దీంతో కిడ్నాప్‌నకు ప్లాన్ వేసింది. రూ.50,000 సుపారీ ఇచ్చింది. దీంతో కిడ్నాపర్లు రంగంలోకి దిగి ఈ నెల 11న అర్ధరాత్రి ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల వెనుక రోడ్డులో ప్రణవ్‌ను అడ్డగించారు.
తమ కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి చితకబాదుతూ త్రిష్ణ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారి నుంచి ఎలాగో అలా తప్పించుకొని వచ్చిన ప్రణవ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసులో ప్రధాన నిందితురాలైన త్రిష్ణను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మిగిలిన కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించినట్టు ఏసీపీ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు గతంలో పలు నేరాలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితురాలి సెల్‌ఫోన్, కారుకు వాడిన జీపీఎస్ ట్యాగ్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment