బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభం
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం గ్రామంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో జాతీయ స్థాయి బీచ్ వుమెన్ వాలీబాల్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో గోవా, పాండిచ్చేరి, గుజరాత్, తమిళనాడు, కేరళ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటనున్నాయి. తొలి రోజు జరిగిన మ్యాచ్‌లలో గోవా–ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడగా ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో చైన్నె– వెస్ట్‌బెంగాల్ జట్లు తలపడగా చైన్నె విజయం సాధించింది. మూడవ మ్యాచ్‌లో పాండిచ్చేరి–కేరళ జట్లు తలపడ్డాయి. రాత్రి వరకు సముద్ర తీరంలో కొనసాగిన బీచ్ వాలీబాల్ పోటీలు చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ పోటీలు మరో రెండు రోజుల పాటు జరగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడిన ఏడుగురికి న్యాయమూర్తి శుక్రవారం రూ.70 వేలు జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. స్థానిక సీఐ బి సూర్య అప్పారావు కథనం మేరకు ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం సేవించి, వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురిని ప్రత్తిపాడు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి కాటం భాను ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున రూ.60,000 జరిమానా విధించారు. ఒకరికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారు. రౌతులపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఒకరిని తుని కోర్డులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రూ.10,000 జరినామా విధించినట్టు సీఐ సూర్య అప్పారావు తెలిపారు.
ఇళ్లు పోతున్నాయన్న బెంగతో వ్యక్తి మృతి
మలికిపురం: మండల పరిధిలోని మేడిచర్లపాలెంకు చెందిన చింతా సుందరయ్య (55) తమకు చెందిన ఇళ్లు పోతున్నాయన్న బెంగతో శుక్రవారం మృతిచెందారు. గ్రామ శివారు పెద్దకాల్వ గట్టు చర్చి వద్ద వీరు స్థిర నివాసం ఉంటున్నారు. రెండు నెలల క్రితం చేపట్టిన రైల్వే ఎలైన్‌మెంట్‌లో తన ఇంటితో పాటు, కుమారుల ఇళ్లు కూడా పోతున్నాయని ఆయన బెంగ పెట్టుకున్నారు. అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదన్న మనో వ్యధతో బాధ పడిన ఆయనకు వైద్యం చేయించినా ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment