అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నూతన సంవత్సర వేడుకల్లో అల్లర్లు సృష్టించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీ రాత్రి నిర్దేశించిన సమయం వరకూ మాత్రమే హోటళ్లు, మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లకు అనుమతి ఉందన్నారు. ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈవెంట్లు నిర్వహించే చోట తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈవెంట్లలో అశ్లీలత ఉండరాదని, పరిమితికి మించి శబ్దాలు ఉండరాదని స్పష్టం చేశారు. ఈవెంట్లలో మత్తు పానీయాలు, డ్రగ్స్ వంటివి వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, కోర్టుకు తరలిస్తామన్నారు. వారికి రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సైలెన్సర్ లేకుండా పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ ద్విచక్ర వాహనాలపై తిరిగినా, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడినా వాహనాలను సీజ్ చేసి, డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం, అవసరమైతే శాశ్వతంగా రద్దు చేసేలా ఆర్‌టీఓ కార్యాలయానికి సిఫారసు చేస్తామన్నారు. ఎవరైనా మహిళలు ఇబ్బందులు పడితే వెంటనే మహిళా రక్షక్ టీములను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
నేడు యథాతథంగా
పీజీఆర్‌ఎస్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. రెవెన్యూ మంత్రి విజయవాడలో నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సుకు తాను, జాయింట్ కలెక్టర్ హాజరు కానున్నామని, ఈ దృష్ట్యా ప్రజల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment