సందడికి వేళాయె
● నేటి నుంచి జేఎన్‌టీయూకేలో
క్రియ పిల్లల పండగ
● రెండురోజుల పాటు నిర్వహణ
● వివిధ ప్రాంతాల నుంచి 8,500 మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్
● లఘు నాటికలు... 29 అంశాలపై పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పిల్లల పండగ పేరుతో క్రియ స్వచ్ఛంద సంస్థ ప్రతి ఏడాది రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమానికి జేఎన్‌టీయూ కాకినాడ వేదిక కానుంది. జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం రావడంతో వివిధ ప్రాంతాల నుంచి 8,500 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రియ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన నాటి నుంచి మధ్యలో రెండేళ్లు కరోనా కారణంగా నిలిపివేసినా ఇప్పటి వరకూ పదిసార్లు ఈ కార్యక్రమం నిర్వహించారు. శనివారం నుంచి రెండు రోజులపాటు 11వ రాష్ట్ర అంతర్ పాఠశాలల సాంస్కృతిక పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజు నాటికలు, శాసీ్త్రయ నృత్యం, ఏకపాత్రాభినయం, కోలాటం, పాటల గ్రూపు, పోస్టర్ ప్రజంటేషన్, సైన్స్ ప్రయోగాలు, డిబేట్, గణితం, క్విజ్, వ్యాసరచన, కథారచన, కథా విశ్లేషణ, అంతర్జాలంలో అన్వేషణ పోటీలు నిర్వహించనున్నారు. రెండవ రోజు ఆదివారం జానపద నృత్యం, విచిత్ర వేషధారణ, బుర్రకథ, కోలాటం, ప్రాజెక్టు పని, వాద్య సంగీతం, పాటలు, కథ చెప్పడం, స్పెల్లింగ్, చిత్రలేఖనం, సృజనాత్మకత వస్తువుల తయారీ, మట్టితో బొమ్మలు తయారీ, మైమ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమ నిర్వహణకు కమిటీ సభ్యులను నియమించి ఒక్కొక్క విభాగానికి టీమ్‌లను నియమించారు. వర్సిటీ ప్రవేశ ద్వారంలో రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి పేర్లు నమోదు చేయనున్నారు. వర్సిటీ ఆడిటోరియం, బీఆర్ అంబేడ్కర్ గ్రంథాలయం, మెకానికల్ పీజీ బ్లాక్, డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ ఎడమ పక్కన, సీఎస్ విభాగం, ఈఈఈ బ్లాక్ వద్ద పోటీల ప్రదర్శనకు వేదిక ఏర్పాటు చేయగా వీసీ పరిపాలన భవనం వెనుక భోజన వసతి కల్పించనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సందర్శనకు వచ్చే వారి వాహనాలు వర్సిటీకి ఎదురుగా ఉన్న ఐటీఐ కళాశాల ప్రాంగణంలో పార్కింగ్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణ, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, హాజరవుతున్నారు. రెండు రోజుల కార్యక్రమం అనంతరం ఆదివారం సాయంత్రం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment